''ఘంటసాల, సుశీల ప్రేమించుకున్నారంట!'' అన్నాడు మా వాడు.
''అవునా?'' ఆశ్చర్యంగా అడిగాను నేను.
''అవును... వాళ్లిద్దరి డ్యూయెట్లు ఎన్ని లేవు?'' అంటూ సాక్ష్యం కూడా చూపించాడు వాడు.
ఇలాంటి కబుర్లు చెప్పే వాడు నా దృష్టిలో ఓ హీరో. నాకే కాదు నాతోటి కుర్రగ్యాంగ్కి కూడా.
''అరే... ఈడికి చాలా తెలుసురా!'' అనుకునేవాళ్లం మేం అప్పట్లో.
అప్పట్లో... అంటే ఎప్పట్లో తెలుసా?
ఓ అయిదు దశాబ్దాల క్రితం అన్నమాట.
ఆ అప్పట్లో నేను రెండో తరగతి. వాడు మహా అయితే మూడో, నాలుగో తరగతి. మా కుర్రగాళ్ల బ్యాచ్కి వాడే లీడర్.
కుతుకులూరులో హైస్కూలు ఎదురుగా ఉండే చెరువు మెట్ల మీదో, స్కూలు లేనప్పుడు ఖాళీగా ఉండే బెంచీల మీదో కూర్చుని వాడిలాంటి కోతలు చాలా కోసేవాడు.
వాడు చెప్పేదేదైనా నమ్మేయడమే. వాడూ అంత నమ్మకంగానే చెప్పేవాడు మరి.
సినిమా పాటలు వింటే మాకు ఆ నమ్మకం మరింత బలపడిపోయింది.
మరి అప్పట్లో అన్ని డ్యూయెట్లూ వాళ్లవేగా! ఏ పాట విన్నా మా వాడి మాటలే గుర్తొచ్చేవి.
'నిజమే... లేకపోతే అంత బాగా ఎలా పాడతారు?'అనుకునేవాళ్లం.
ఎంత అమాయకత్వం? ఎంత తెలియనితనం?
రేడియోలు, సినిమాలు తప్ప టీవీలు కానీ, సెల్ఫోన్లు కానీ మరే ఇతర వ్యాపకాలు కానీ లేని ఆ రోజుల్లో ఎవరి కబుర్లు వారివి! ఎవరి ఊహలు వారివి!
నా మటుకు నాకు మావాడి మాటలు నిజమేననిపించాక... మరి అంత మంచి వార్త ఎవరికైనా చెప్పకపోతే ఎలా? కడుపు నెప్పి రాదూ?
అందుకే తిన్నగా మా నాన్నగారి దగ్గరకి వెళ్లాను.
''నాన్నగారూ! మీకో సంగతి తెలుసా? ఘంటసాల, సుశీల ప్రేమించుకుంటున్నారంట...'' అన్నానో సెలవురోజు.
ఆయన కాస్త కోపంగా మొహం పెట్టి, ''ఏడిశావ్... అలా మాట్లాడకూడదు...'' అన్నారు.
''నిజమేటండీ... వాళ్లు పెళ్లి కూడా చేసుకుంటార్ట...'' అంటూ రెట్టించి మరింత మసాలా దట్టించాను నా వార్తకి!
ఈసారి ఆయన నవ్వేశారు. ''ఎవడు చెప్పాడు?'' అన్నారు.
ఆ తర్వాత కూర్చోబెట్టి సినిమాల గురించి, వాటి చిత్రీకరణ గురించి వివరించారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు కూడా నిజంగా ప్రేమించకోరనీ, అలా నటిస్తారని, వాళ్లందరికీ ఎవరి సంసారాలు వాళ్లకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్లేబ్యాక్ గురించి, పాటల రికార్డింగు, వాటిని పాడే గాయకుల గురించి చెప్పారు.
ఇన్నేళ్ల తర్వాత అప్పటి ఆ జ్ఞాపకాలని తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ, ఆ వయసులో ఆ నాటి ఎదిగీఎదగని మనసుకి అవే పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు మరి!