శుక్రవారం, ఏప్రిల్ 18, 2014

ప్రచారంలో పదనిసలు!


'నమస్కారం సార్‌...' 
'రావయ్యా సెక్రట్రీ... రా! అరెరె, అదేంటయ్యా... వస్తూనే అలా నా ముందుకొచ్చి ఒంగున్నావేంటి?'
'తమరు పొడుగు చేతుల చొక్కా వేసుకుంటున్నారు కదండీ, నా వీపు మీద చేతులుంచి మడత పెట్టుకుంటారేమోననండయ్య'
'వార్నీ- చురుకైన వాడివేనయ్యా... పైకొస్తావు. అది సర్లేకానీ... ప్రచారం కోసం పాటలు రికార్డు చేయించమని చెప్పాను కదా, చేశావా?'
'ఓ చేశాను సార్‌. మంచి రచయితల చేత పాటలు రాయించి, గాయకుల చేత పాడించి తీసుకొచ్చానండి. వీటిని తమ ప్రచార సభల్లో మైకు సౌండ్‌ పెంచేసి వినిపిస్తేనండీ, జనం ఉబ్బితబ్బిబ్బయిపోతారంటే నమ్మండి'
'సెబాసయ్యా! కొత్తగా చేరినా దూసుకుపోతున్నావు. ఏదీ వినిపించు విందాం'
'తమరు స్వర్ణయుగం తెస్తానంటున్నారు కదండీ. దాని మీద పాటండి, వినండి...'
***
'బంగారం... బంగారం...
బతుకంతా ఇక బంగారం!
ఇచ్చారంటే నాకధికారం...
మార్చి పడేస్తా మీ గ్రహచారం!'
***
'పల్లవి బాగుందయ్యా... ఏదీ చరణం కూడా వినిపించు'
'చరణం ఇంకా బాగా కుదిరిందండి. ఇదిగో వినిపిస్తా వినండి...'
***
'బడుగు జీవుల పచ్చని పొలాలు...
బడా బాబులకు బంగారం!
మీ పేరిట చేసే పనులన్నీ...
మా కాంట్రాక్టర్లకు ఫలహారం!
ప్రజలకు చాటే పథకాలన్నీ...
నా అనుచరులకిక ఆహారం!
బంగారం... బంగారం...
బతుకంతా ఇక బంగారం!'
***
'ఆపెయ్‌ ఆపెయ్‌! ఏం సెక్రట్రీవయ్యా నువ్వు, ఇదేం పాట, నీకసలు బుద్ధుందా?'
'స...స... సార్‌! నన్ను క్షమించండయ్య. అధికారంలోకి వచ్చాక తమరేం చేస్తారో అదే చెప్పించమన్నారు కదండయ్య. అందుకే ఇలా రాయించానండయ్య. మరి ఇదే కదండీ చేసేది?'
'నీ తలకాయ్‌! అధికారంలోకి వచ్చాక మనమేం చేస్తామో కాదయ్యా... ఏం చేస్తామని ప్రజలకు చెప్పామో, అది రాయాలి'
'సార్‌... మన్నించాలి! కొత్తవాడిని కాబట్టి తెలీక అడుగుతున్నానండి. చెప్పడానికి, చేయడానికి మధ్య తేడా ఏంటండీ?'
'ఓరి వెర్రోడా! చెప్పడం వేరు, చేయడం వేరని తెలుసుకో. సర్లే, ఆ పాట పక్కన పెట్టెయ్‌... మిగతా పాటలేంటో వినిపించు చూద్దాం'
'అలాగే సార్‌, జనం తరచూ పాడుకునే ఒక కీర్తన ఆధారంగా రాయించానండి... వినండి'
***
'ఆతడొక్కడే...
మన నేత ఒక్కడే...
ఘన నేత ఒక్కడే...
మహా నేత ఒక్కడే... భళా నేత ఒక్కడే...'
'నిండార రాజు నంజుకునే భూమొకటే...
అండనే అనుచరులు ఆక్రమించు భూమొకటే...
గూండాల నేత గుంజుకునే భూమొకటే...
తొండైన పనులకు తగిలించే భూమొకటే...
ఆతడొక్కడే, మన నేత ఒక్కడే, ఘన నేత ఒక్కడే, భళా నేత ఒక్కడే...'
***
'ఆపరొరేయ్‌... ఇదేం పాటరా?'
'క్ష...క్ష... క్షమించండి సార్‌. ఏదో కీర్తన బాగుంది కదాని, వరస కట్టించానండి'
'అఘోరించావ్‌! ఇంకా నయం... నీ మీద నమ్మకంతో ఈ పాటలన్నీ ప్రచారానికి పంపించేశాను కాదు. ఇది కూడా పక్కన పడెయ్‌'
'అయ్యా, ఇవాళ లేచిన వేళేంటో బాగోలేదయ్యా. తమరి మూడ్‌ బాగోలేక నాకు మూడేలా ఉందండి. ఇక వస్తానండయ్య'
'సర్లే, కంగారుపడకు. నీ అమాయకత్వం చూస్తే జాలేస్తోందయ్యా. అందుకే క్షమించేస్తున్నాను. ఈ పాటలు బయటికి బాగోవు కానీ, మనలో మనకి కులాసాగా నవ్వుకునేలా ఉన్నాయిలే. ఇంకా ఏమున్నాయి?'
'అమ్మయ్య, ఎలాగైనా తమది జాలి గుండేనండయ్య. రాష్ట్రమంతా ఓదారుస్తూ నన్నెక్కడ ఏడిపిస్తారో అనుకున్నానండయ్య. ఈ పాట ఓ మంచి బుర్రకథండి. వినండి మరి...'
***
'వినరా ఓటరు వీరకుమారా... విజయగాథ నేడు...
తందాన తాన!
ప్రజాసేవకని పాలనకొచ్చిన పరమ నేత గాథ...
తందాన తాన!'
***
'అబ్బో... అబ్బో... చాలా బాగుందయ్యా. పూర్తిగా వినిపించు'
'అయితే వినండి మరి'
***
'పచ్చని సీమల నడిచాడా... నచ్చిన భూముల చూశాడా...
భళా మేలు భాయి తమ్మూడా... మేలు భళారో రాజానా!
గనులను చూసి మురిశాడా... గల్లా పెట్టెలు నింపాడా...
భళా మేలు భాయి తమ్మూడా... మేలు భళారో రాజానా!
ప్రాజెక్టులు మొదలెట్టాడా... పచ్చనోట్లను పట్టాడా...
కష్టాల కబుర్లు చెప్పాడా... ఖజానా కొల్లగొట్టాడా...
మత్తున ముంచీ తేల్చాడా... మహమ్మారిగా మారాడా...
నీరు పారునని పలికాడా... నిధులన్నీ మళ్లించాడా...
తరికిట తరికిట తా!'
***
'హ హ్హ హ్హా! తెగ నవ్వొస్తోందయ్యా. ఇవి జనానికి వద్దులే కానీ, నా సెల్‌ఫోన్లో వేయించు. ఇయర్‌ ఫోన్స్‌లో వినసొంపుగా ఉంటాయి!

PUBLISHED IN EENADU ON 18.04.1014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి