మంగళవారం, అక్టోబర్ 26, 2021

రాజ‌కీయ తిట్ల పురాణంబెట్టిద‌నిన‌...!

 


"ఏంట్రా మొహం అలా కంద‌గ‌డ్డ‌లా ఉందేం? ఏంటి క‌త‌?" అంటూ ప‌ల‌క‌రించారు గురువుగారు, శిష్యుడు రాగానే.

"ఏం చెప్ప‌మంటారు గురూగారూ! మా అపార్ట్‌మెంట్లో పార్కింగ్ ద‌గ్గ‌ర గొడ‌వొచ్చిందండి. మా ప‌క్కింటాయ‌న నా మీద నోరు పారేసుకున్నాడండి... ఆ గొడ‌వ నుంచి నేరుగా ఇలా వ‌చ్చానండి..."

"ఏమ‌న్నాడ్రా ఆయ‌న‌?  తిట్టాడా?"

"ఆయ్‌... అవునండి... ద‌గుల్బాజీ, బోసిడీకే, ల‌మ్డిక్కే, జ‌ఫ్పా, లోఫ‌ర్‌, మాద‌చ్చోద్‌, బంఛ‌త్‌, బ‌డాచోర్‌, బ‌డుద్దాయ్‌... ఇలా ర‌క‌ర‌కాల మాట‌ల‌న్నాడండి..."

"ఇంత‌కీ ఆ గొడ‌వ‌కి కార‌ణం ఏంటి?"

"నిజం చెప్పాలంటే నాదే త‌ప్పండి. ఆయ‌న పార్కింగ్ ప్లేస్‌కి అడ్డంగా నా వెహికిల్ పెట్టానండి... అందుక‌నే నోరు మూసుకుని చ‌క్కా వ‌చ్చానండి... అయినా ఆ ద‌రిద్ర‌పు తిట్లేంటండీ బాబూ..."

గురువుగారా అంతావిని ప‌డ‌క్కుర్చీలో తాపీగా జార‌గిలప‌డి క‌ళ్లు అర‌మోడ్పుగా పెట్టుకుని, తాపీగా చెప్పారు, "ఒరేయ్‌... తిట్ల‌ని తిట్ట‌కురా... తిట్లు ఎంతో ప‌విత్ర‌మైన‌వివ‌రా..."

"ఊరుకోండి గురూగారూ! తిట్లు ప‌విత్ర‌మైన‌వేంటండీ?  మీర‌న్నీ అడ్డ‌దిడ్డంగా చెబుతారు..."

"ఓరి... నా వెర్రి శిష్యా! నా ద‌గ్గ‌ర ఇన్నాళ్ల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నావు కానీ నీకు తిట్ల ప్ర‌యోజ‌నం ఏమిటో తెలియ‌కపోతే ఎలారా?"

"తిట్ల‌కి ప్ర‌యోజ‌నం ఏంటి గురూగారూ?  నాక్కాస్త అర్థ‌మ‌య్యేలా చెప్పండి..."

గురువుగారు న‌వ్వి, "ఒరే... నీకు గానీ రాజ‌కీయ పురాణంలో తిట్ల కాండ గురించి తెలిసి ఉంటే... ఇలా మొహం కంద‌గ‌డ్డ‌లా పెట్టుకుని నా ద‌గ్గ‌ర‌కి దిగాలుగా వ‌చ్చే వాడివి కావురా... పైపెచ్చు నీ ప‌క్కింటాయ‌న్నే బెంబేలెత్తించేసే వాడివి... అర్థం అయిందా?"

"ఎలా అర్థ‌మ‌వుతుందండీ? త‌ప్పేమో నావైపు పెట్టుకుని, ఆయ‌న్ని బెంబేలెత్తించ‌డ‌మేంటండీ? అడ్డ‌గోలు వ్య‌వ‌హారం కాక‌పోతేనూ?"

"అదేరా మ‌రి, రాజ‌కీయ కిటుకు! నీ చుట్టూ జ‌రుగుతున్న రాజ‌కీయ త‌తంగాన్ని గ‌మ‌నించ‌కుండా ఒట్టి వెర్రిబాగులోడిలా వ‌చ్చేస్తే ఎలారా? ఇప్పుడు నీ ప‌ర‌గ‌ణాలో తిట్ల చుట్టూనే క‌ద‌రా రంజైన రాజ‌కీయం న‌డుస్తుంట‌?"

"స‌రే... సార్‌! నాకంత తెలివే ఉంటే, మీ ద‌గ్గ‌ర‌కి రాజ‌కీయ పాఠాల‌కి ఎందుకొస్తానండీ? మ‌రింత‌కీ నేనేం చేస్తే మా ప‌క్కింటాయ‌న బెంబేలెత్తిపోయేవాడో చెప్పండి..."

"ఏం చేయాలా?  వెంట‌నే ఆయ‌న ఇంటికి వెళ్లి అద్దాలు ప‌గ‌ల‌గొట్టాలి... ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేయాలి... నానా విధ్వంసం సృష్టించాలి...  అంతే కాదు ఆయ‌న బంధువుల ఇళ్ల‌కి నీ వాళ్ల‌ని పంపించి వాళ్ల ఇళ్లపై కూడా దాడి చేయాలి... ఆపై నీ అపార్ట్‌మెంటు వాళ్లంద‌రినీ పిలిచి ఆయ‌న తిట్ల వెనుక అంద‌రూ మ‌ర్చిపోయిన అర్థాల‌ను వెతికి, అవ‌న్నీ ఏడుపు మొహం పెట్టుకుని వివ‌రించి, సానుభూతి కూడా సంపాదించాలి... అక్క‌డితో ఆగ‌కూడ‌దొరేయ్‌... ఆయ‌న మీద కేసు పెట్టి జైలుకి కూడా పంపించాలి... అర్థ‌మైందా?"

"అయ్య‌బాబోయ్... అంత ఘోర‌మా? ఆయ‌న తిట్టడం క‌రెక్ట్ కాక‌పోవ‌చ్చు సార్‌... కానీ అస‌లు త‌ప్పు నాదే కదండి? మ‌రి ఆయ‌న ఇంటిని ధ్వంసం చేస్తే అది ఇంకా నేర‌మ‌వుతుంది క‌దండీ?  పైగా ఆయ‌న బంధువులు ఏం చేశారండీ పాపం... ఆయ‌నేదో ఆవేశంలో తిడితే, చేత‌నైతే నేనూ తిట్టాలి కానీ, ఇంత‌గా రెచ్చిపోతే అది నీచం క‌దండీ?  పైగా నేనే నేరం చేసి కేసు పెట్ట‌డం ఏంటండీ?  దారుణం కాక‌పోతేనూ?"

"ఓరోరి బుర్ర‌లేని శిష్యా! మ‌రి నీ రాష్ట్రంలో జ‌రిగింది అదే క‌ద‌రా?  మీ ముఖ్య‌మంత్రిని ఎవ‌డో ఏదో అన్నాడని తెలుసు క‌దా? అప్పుడేమైంది? ఆయ‌న అనుచ‌రులంతా వీరంగం ఆడ‌లేదూ?  ఓ ప‌థకం ప్ర‌కారం ఎగ‌స్పార్టీ ఆఫీసుల‌న్నింటిపైనా దాడులు చేయ‌లేదూ? అక్క‌డితో ఆగారా? ఆ తిట్టినాయ‌న‌పై పోలీసు కేసు పెట్టి జైల్లోకి తోయ‌లేదూ? మ‌రి ఇవ‌న్నీ తిట్లతో స‌మ‌కూరిన ప్ర‌యోజ‌నాలే క‌ద‌రా? ఇదంతా మ‌ర్చిపోయి నువ్వు మొహం ఎర్ర‌గా చేసుకుని వ‌చ్చేస్తే ఎలారా? ఇలాగైతే నువ్వు రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎదుగుతావు?  నువ్వే చెప్పు?"

శిష్యుడు బుర్ర గోక్కున్నాడు... ఆనక వెర్రిమొహం పెట్టుకుని, "అవునండోయ్‌... మీరు చెప్పిందంతా నిజ‌మే... కానీ నాదొక సందేహ‌మండి... ఎంత రాజ‌కీయాలైనా ఉచితానుచితాలు మ‌ర్చిపోయి ఇలా తిట్ట‌డం త‌ప్పు కాదంటారా?"

"క‌చ్చితంగా త‌ప్పేరా...  నీ ప‌క్కింటాయ‌న నిన్ను తిట్టినా, నీ ముఖ్య‌మంత్రిని ఎగ‌స్పార్టీ వాడు త‌ట్టినా రెండూ త‌ప్పే. కానీ నువ్వు గ‌మ‌నించాల్సింది అది కాదురా... ఆ తిట్టుని అడ్డం పెట్టుకుని ఎంత డ్రామా జ‌రిగిందో అది చూడాలి. ఎదుటి వాడు తిడితే దాన్ని రాజ‌కీయంగా ఎంత బాగా ఉప‌యోగించుకోవ‌చ్చో గ‌మ‌నించాలి.  ఆ తిట్టుని ప‌దే ప‌దే ప‌లుకుతూ, దాని వెనుక ఉన్న అర్థాన్ని విడ‌మ‌ర్చి చెబుతూ, మొహం అమాయ‌కంగా పెట్టుక‌ని జ‌నం సానుభూతిని ఎలా పొందాలో తెలుసుకోవాలి.  అందుక‌నే తిట్లు ప‌విత్ర‌మైన‌వ‌ని నేన‌న్నాను... ఇప్ప‌టికైనా అర్థ‌మైందా?"

"అర్థ‌మైంది కానీ గురూగారూ, మీరు నన్ను మా ప‌క్కింటాయ‌న ఇల్లు, ఆయ‌న‌ బంధువుల ఇళ్లు కూడా ధ్వంసం  చేసి ఉండాల్సిందంటున్నారు క‌దా? మ‌రి అది నేరం కాదంటారా?"

"దాందేముందిరా? ఆయ‌న తిట్టిన తిట్ల‌కి నాకు బీపీ వ‌చ్చేసిందీ, ఆ బీపీ వ‌ల్ల ఏం చేస్తున్నానో తెలియ‌లేదూ అంటే స‌రి... మ‌రి మీ సీఎంగారు త‌న పార్టీ వారు చేసిన దాడుల్ని అలాగే స‌మ‌ర్థించుకోలేదూ? య‌థారాజా... త‌థాప్రజా అన్నారు క‌దా? అలాగ‌న్న‌మాట‌..."

"కానీ... రేప్పొద్దున్న ఇలా ప్ర‌జ‌లంద‌రూ మాకు బీపీ పెరిగింది కాబ‌ట్టే ఎదుటివాడిని కొట్టేశాం, వాడిల్లు కూల‌గొట్టేశామంటూ రెచ్చిపోతే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల మాటేమిటండీ?"

"ఓరే...నువ్వొక నీచ రాజ‌కీయ నేత‌గా ఎదిగాక‌, ఇక శాంతి భ‌ద్ర‌త‌ల ఊసు నీకెందుకురా?   ఈ వ్య‌వ‌హారం నుంచి నువ్వు నేర్చుకోవ‌ల‌సింది, తిట్ల కాండ‌లో తిర‌కాసు అధ్యాయం... తెలిసిందా?"

"తెలిసింది కానీండీ, ఇంత‌కీ మీరు తిట్ల‌ని స‌మ‌ర్థిస్తున్నారా?"

"అస్సలు కాదురా... కానీ నువ్వు, నీ వాళ్లు ఎప్పుడూ ఎవ‌ర్నీ తిట్ట‌లేదా? ఎవ‌ర్నీ తిట్ట‌కుండానే ఇంత వాడివైపోయావేంట్రా? మ‌ళ్లీ నీ రాష్ట్రం ద‌గ్గ‌ర‌కే వ‌ద్దాం... తాజాగా ఈ తిట్ల వ్య‌వ‌హారానికి సంబంధించిన కేసుపై హైకోర్టు ఎలాంటి ఘాటు వ్యాఖ్యానాలు చేసిందో గుర్తుకు తెచ్చుకో... గౌర‌వం, ప్ర‌తిష్ఠలు ముఖ్య‌మంత్రికే కాదు, అంద‌రికీ ఉంటాయ‌నలేదూ?  రాజ్యాంగబ‌ద్ధ వ్య‌వ‌స్థ‌లు, న్యాయ‌మూర్తులను దూషిస్తున్నవారి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకునేందుకు ఉత్సాహం చూప‌ని పోలీసులు, ఈ విష‌యంలో  ఎందుకింత అత్యుత్సాహం చూపించార‌ని చుర‌కలేయ‌లేదూ?"

"అవునండోయ్‌... కానీ గురూగారూ, ఇంత‌కీ ఇందులో నేర్చుకోవాల్సిన రాజ‌కీయ పాఠం ఏంటండీ?"

"అలారా పాయింట్లోకి... ఇప్పుడు చెబుతాను రాసుకో, రాజ‌కీయ పురాణంలో తిట్ల కాండ ప్ర‌యోజ‌నం. నువ్వు రాజ‌కీయంగా ఎదిగే వ‌ర‌కు ఎగ‌స్పార్టీ వాడిని నోటికొచ్చిన‌ట్టు తిట్టు. ఆ తిట్ల ద్వారా ప్ర‌జ‌ల మ‌న‌సును ఏమార్చ‌డానికి ప్ర‌య‌త్నించు. నీకు అధికారం అంది కుర్చీ ఎక్కాక‌, ఎవ‌రైనా నీ మీద ప‌ల్లెత్తు మాట‌న్నా స‌హించ‌కు. విరుచుకు ప‌డు.  దాడులు చేయించు. కేసులు పెట్టు. అరెస్టులు చేయించు. దెబ్బ‌కి నిన్ను మ‌రెవ‌డైనా ఏమైనా అన‌డానికి కూడా భ‌య‌ప‌డిపోయేలా, బెంబేలెత్తిపోయేలా చెయ్యి. ఇంత చేసి కూడా ఎదుటివాడు తిట్టిన తిట్ల‌ను అడ్డం పెట్టుకుని ప్ర‌జ‌ల ముందు ఏడుపు మొహం పెట్టుకుని ఆ తిట్ల అర్థాలు వివ‌రించి మ‌రీ, సానుభూతిని పొందు. ఇలా చేస్తే నీకిక తిరుగుండ‌దు. ఓ నికార్స‌యిన నీచ నేత‌గా ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిపోతావు. బుర్ర‌కెక్కిందా?"

"ఓ... భేషుగ్గా గురూగారూ! ఇక వ‌స్తానండి... అర్జెంటుగా  తెలుగు నిఘంటువు కొనుక్కోవాలి..."

"అదెందుకురా?"

"మా ప‌క్కింటాయ‌న తిట్టిన తిట్ల‌కు అంద‌రూ మ‌ర్చిపోయిన అర్థాలు వెత‌క‌డానికండి...  వాటిని తెలుసుకుని మా అపార్ట్‌మెంట్లో మీటింగెట్టి ఊద‌ర‌గొడ‌తానండి... ఆయ్‌!"

"శెభాష్‌... పోయిరా!"

-సృజ‌న‌

 PUBLISHED ON 26.10.2021 ON JANASENA WEBSITE

శనివారం, అక్టోబర్ 09, 2021

అష్ట‌క‌ష్టాల దండ‌క‌మ్!


 

అమ్మ‌ల‌గ‌న్న‌య‌మ్మ‌... ముగురమ్మ‌ల మూట‌పుట‌మ్మ‌...

క‌రుణించు కాపాడు క‌న‌క‌దుర్గ‌మ్మ‌!

ఆంధ్ర రాష్ట్రాన అల్లాడుచున్న‌ట్టి సామాన్య జ‌నుల‌ను కాన‌వ‌మ్మ‌!

అష్ట‌క‌ష్టాల కార్చిచ్చులో చిక్కి అణగారుతున్న‌ట్టి ప్ర‌జ‌ల‌మ‌మ్మ‌!

న‌మ్ముకున్న‌ట్టి మా పాల‌కులు మ‌మ్ముల‌ను న‌ట్టేట‌లో ముంచి న‌వ్వుతున్నార‌మ్మ‌!

ఓటేసి గెలిపించి అంద‌లాలెక్కించి ఆశ‌పడిన మ‌మ్ము వెక్కిరించార‌మ్మ‌!

పాద‌యాత్ర‌లు చేసి పాకులాడార‌మ్మ‌...

ఊరూరు తిరుగుతూ ఊరించినార‌మ్మ‌...

ఏడ‌వ‌క‌పోయినా ఓదార్చినార‌మ్మ‌...

త‌లలు నిమిరి మ‌మ్ము ముద్దాడినారమ్మ‌...

బుగ్గ‌ల‌ను త‌డుముతూ బులిపించినార‌మ్మ‌...

మెత్త‌గా న‌వ్వుతూ మోసగించార‌మ్మ‌...

ఒక్క ఛాన్స్ ఇమ్మంటు వేడుకున్నార‌మ్మ‌...

గెలిపించితే చాలు స్వ‌ర్ణ‌యుగ‌మును తెచ్చి న‌ట్టింట‌ నిలుపుదుమ‌ని న‌మ్మించినారమ్మ‌!

ఆ మాట‌ల‌ను న‌మ్మి అధికార‌మందించి నిలువునా న‌ట్టేట మునిగిపోయితిమమ్మ‌!

ఎక్క‌డికి పోదుము, ఏమి చేయుద‌మ‌మ్మ‌... ఇక్క‌ట్ల ఊబిలో చిక్కుకున్నామ‌మ్మ‌!

ఎటు చూసినా బ‌తుకు బ‌స్టాండుగా మారి... బితుకు బితుకుమంటు మిగిలినామ‌మ్మ‌!

పింఛ‌న్ల‌లో కోత‌... జీతాల‌కే వాత‌... ఎవ్వ‌రిని చూసినా న‌వ్వు లేద‌మ్మ‌!

చెప్పుకుందామంటె దిక్కులేద‌మ్మ‌...నోరెత్తితే చాలు దాడి చేస్తార‌మ్మ‌!

గూండాలు, రౌడీలు పెచ్చరిల్లార‌మ్మ‌!

కండ‌బ‌ల‌మును చూపి క‌సురుతున్నార‌మ్మ‌!

స‌ర్కారు కొలువుల‌ని బిడ్డ‌ల‌ను ఊరించి... ఉత్త చేతులు చూపి ఊరుకున్నార‌మ్మ‌!

ఫ్యాక్ట‌రీల‌ను తెచ్చి ప్ర‌గ‌తి తెచ్చెద‌మంటు కోత‌లెన్నో కోసి ఆశ‌పెట్టార‌మ్మ‌!

వాస్త‌వానికి చూడ ఉట్టి మాట‌ల‌మ్మ‌... ఉన్న‌వన్నీ కూడ ఊడిపోయాయమ్మ‌!

అభివృద్ధి బాట‌ల‌ను అడుగునా ప‌రిచి అద‌ర‌గొడ‌తామంటు ఊరించినార‌మ్మ‌...

క‌ళ్లు తెరిచి చూడ ఉన్న దారులు కూడ గోతుల‌మ‌య‌మై గొల్లుమ‌న్నాయ‌మ్మ‌!

అడుగుపెడితే చాలు క‌స్సుమ‌ని గాయాలు... వాహ‌నాల‌ను న‌డ‌ప వీలులేద‌మ్మ‌!

రోడ్ల దుస్థితి చూసి బాగుచేయాలంటు అడిగినా చాల‌మ్మ‌... అగ‌చాట్లు మొద‌ల‌మ్మ‌!

రౌడీల‌తో కొట్టి, గూండాల‌తో బాది... అక్ర‌మంగా కేసులు అంట‌గ‌డ‌తార‌మ్మ‌!!

ఏవేవొ ప‌థ‌కాలు ర‌చియించి వంచించి... అడ్డదారిన దుడ్లు దుళ్ల‌గొట్టార‌మ్మ‌...

ఇచ్చినట్టే ఇచ్చి ప‌న్నులెన్నో పెంచి... జేబులో డ‌బ్బుల‌ను గుంజుతున్నార‌మ్మ‌!!

అప్పులెన్నో చేసి ప‌ద్దుల‌ను మ‌ళ్ళించి... రాష్ట్రాన్ని దివాళా తీయించినార‌మ్మ‌!

అగ‌చాట్ల సాగులో అన్న‌దాతలు చూడ‌... అణ‌గారి దిగ‌జారి జావ‌గారార‌మ్మ‌...

కోట్లాది సొమ్ముల‌ను బ‌కాయి పడిపోయి... రైత‌న్న‌ల‌కు మొండి చెయ్యి చూపార‌మ్మ‌!

ప్ర‌త్యేక హోదాను ప‌ట్టి తెచ్చెద‌మంటు... ప్ర‌గల్భాల‌నెన్నొ ప‌లికినార‌మ్మ‌...

చీటికిని మాటికిని దిల్లీకి వెళ్లొచ్చి... వ‌ట్టి చేతులు చూపి వెక్కిరించార‌మ్మ‌!

రాజ‌ధానిని మార్చి రాజిల్లుతామంటు... మూడు ముక్క‌ల ఆట‌ ఆడుతున్నార‌మ్మ‌...

భూములిచ్చిన రైతు సోద‌రుల‌ను వంచించి... మొండిచెయ్యిని చూపి ముంచినారమ్మ‌!

పాల‌కుల‌ను చూడ ఆడింది ఆట‌గా పాడింది పాట‌గా గ‌డుపుతున్నార‌మ్మ‌...

అయిన‌వారికి ఆస్తిపాస్తుల‌ను అందించి... అవినీతి మ‌డుగులో ఈదుతున్నార‌మ్మ‌!

భూముల‌ను సెజ్‌ల‌ను బ‌డాబాబుల‌కు పంచుతూ... వ్యాపార వాటాలు మ‌రిగినార‌మ్మ‌!

మాఫియా గ్యాంగుతో మాటు చాటున చేరి... మ‌త్తులో యువ‌త‌ను ముంచుతున్నార‌మ్మ‌!

ఓ త‌ల్లి మా త‌ల్లి మా క‌ల్ప‌వ‌ల్లి... మా అగ‌చాట్ల జాబితా అంతుప‌ట్ట‌నిద‌మ్మ‌...

మా కష్టాల లిస్టంత మొర‌పెట్ట‌లేమ‌మ్మ‌... మ‌ముగాచి మా బాధ తీర్చు పెద్ద‌మ్మ‌!

మన‌సున్న‌ నేత‌ల‌ను గుర్తించి ఎన్నుకొను ఇంగిత‌ము మాకిచ్చి ఈడేర్చుమ‌మ్మ‌!

ఒక్కొక్క ఓట‌రూ జ‌న‌సైనికుల రీతిలో చెల‌రేగు జాగృతిని అందీయ‌వ‌మ్మ‌!

అవినీతి పాల‌కుల మ‌హిషారులను త‌రుము... ధైర్యమ్ము మాకిచ్చి కావుమ‌మ్మ‌!

అప్పుడే నిజ‌మైన విజ‌య‌ద‌శ‌మి క‌ద‌మ్మ‌... ఆనాడు ద‌స‌రాను జ‌రుపుకుంటామ‌మ్మ‌!!

 

-సృజ‌న‌

PUBLISHED ON 09.10.2021 ON JANASENA WEBSITE


ఆదివారం, సెప్టెంబర్ 26, 2021

గెలిచిన‌ట్టా? ఓడిన‌ట్టా?

 


“గురూగారూ! నాకో సందేహం వ‌చ్చిందండి... అడ‌గ‌మంటారా?”

“అడ‌గ‌రా శిష్యా! సందేహాల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌కూడ‌దు. పైగా నువ్వు అడిగే ప్ర‌శ్న‌ని బ‌ట్టే నీ స్థాయి ఏంటో కూడా తెలుస్తుంది. అడుగు..”

“ఏం లేదు గురూగారూ! గెలిస్తే అధికారం వ‌చ్చిన‌ట్టా? లేక అధికారం వ‌చ్చాక గెలిచిన‌ట్టా?”

“వార్నీ... భ‌లే చిక్కు ప్ర‌శ్నే వేశావురా! పైకి అర్థం కాన‌ట్టు క‌నిపిస్తుంది కానీ, నీ ప్ర‌శ్న ఆవులిస్తే పేగులు లెక్క‌పెట్ట‌గ‌లిగేలా ఉందిరా. ప‌ర్వాలేదు. ఇన్నాళ్లూ నా ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు నేర్చ‌కుంటున్నందుకు కాస్తో కూస్తో ఇంగితం ఉన్న ప్న‌శ్నే వేశావు. అయితే చెబుతాను విను. గెలుపు, అధికారం ఒక‌దానితో ఒక‌టి పెన‌వేసుకుని ఉంటాయిరా. వీటిలో ఏ ఒక‌టి సాధించినా, రెండోది ద‌క్కుతుంది. ఏ ఒక‌టి దూర‌మైనా, రెండోది కూడా దూర‌మవుతుంది...”

“అయితే గురూగారూ! ఈ రెండింటిలో ఏది ముఖ్యమండీ? దేని కోసం ముందుగా ప్ర‌య‌త్నించాలి?”

“చంద‌మామలో బేతాళ క‌థ‌లు చ‌దువుకుని చ‌క్కా వ‌చ్చావేంట్రా? ఇలా ప్ర‌శ్న మీద ప్ర‌శ్న సంధిస్తున్నావ్‌? నీ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలియాలంటే ముందు గెలుపంటే ఏంటో, అధికారం అంటే ఏంటో అర్థం కావాలిరా. ఇప్పుడు ఈ రెండింటిమీదా నీ అభిప్రాయ‌మేంటో చెప్పు. దాన్ని బ‌ట్టే నా స‌మాధానం ఉంటుంది...”

“స‌రే గురూగారూ! నా దృష్టిలో గెలుపంటే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మేనండి. ఇక అధికారం అంటే కుర్చీ ఎక్క‌డమేనండి..  అంతేనంటారా?”

“సాధార‌ణంగా అంతేరా కానీ, ఒకోసారి గెలిచినా ఓడిపోయిన‌ట్టే... ఓడిపోయినా గెలిచిన‌ట్టే. అలాగే ఒకోసారి అధికారం చేజిక్కినా గెల‌వ‌న‌ట్టే. కుర్చీ మీదే ఉన్నా ఓడిన‌ట్టే... అర్థమైందా?”

“అయ్‌బాబోయ్‌! ఇదేంటండి బాబూ, ఇలా చెబుతున్నారు? మీ మాట‌ల్లో మ‌త‌ల‌బులు నా మ‌ట్టి బుర్ర‌కు అర్థం కావండి... కాస్త మీరే వివ‌రించి పుణ్యం క‌ట్టుకోండి...”

“అలారా దారికి! లేక‌పోతే అడిగేవాడికి చెప్పేవాడు లోకువైన‌ట్టు అడిగితే ఎలారా? ఇంత‌కీ నీ బుర్ర‌లోకి ఈ సందేహం ఎందుకొచ్చిందో ముందు చెప్పు...”

“ఏం లేదు గురూగారూ! మొన్న స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి క‌దండీ? ఆ హ‌డావుడి అదీ చూస్తే అలా అడ‌గాల‌నిపించిందండి అంతే... ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో భారీగా గెలిచామంటూ అధికార ప‌క్షం జ‌బ్బ‌లు చ‌రుచుకుంటోంది క‌దండీ... మ‌రి అది గెలుపు కాదంటారా?”

“ఆ సంగ‌తి కాసేపు అలా ఉంచ‌రా.  అల‌నాటి మ‌హాభార‌తంలో జూదంలో కౌర‌వులు గెలిచారు క‌దా, మ‌రి అది గెలుపు కాదంటావా? అది చెప్పు ముందు...”

“ఛ‌... ఛ‌... అదీ ఓ గెలుపేనండీ... మాయా జూదం కాదుటండీ? చెప్పిన‌ట్టు వినే పాచిక‌లతో మోసం చేసి గెలిస్తే దాన్ని గెలుప‌ని ఎలాగంటాం?”

“అంటే దాన‌ర్థం ఏమిటి? నైతికంగా కౌర‌వులు ఓడిపోయిన‌ట్టేగా? అందుకే గెలుపు, ఓట‌మి, అధికారాల‌ను పైకి క‌నిపించే అంకెల్ని బ‌ట్టి అర్థం చేసుకోకూడ‌దురా. లోప‌లి అంత‌రార్థం ఏంటో చూడాలి. అర్థ‌మైందా?”

“అయిన‌ట్టే ఉంది కానండీ, ఇంత‌కీ మ‌న ఆంధ్ర రాజ‌కీయ భారతంలో మొన్న‌టి స్థానిక ఎన్నిక‌ల‌సంగ‌తి కూడా ఇలాంటిదేనంటారా?”

“నేన‌డం కాదురా శిష్యా! నామినేష‌న్ల ప్ర‌క్రియ నుంచి కౌంటింగ్ వ‌ర‌కు అత్య‌ధిక చోట్ల ఏం జ‌రిగిందో ఓ సారి గుర్తు చేసుకో.  అటు కీలుబొమ్మలుగా మారి చెప్పిన‌ట్టు వినే పోలీసు యంత్రాంగంతోను, ఇటు విర్ర‌వీగి చెల‌రేగే అనుచ‌ర గ‌ణంతోను అడుగ‌డుగునా ఎన్ని బెదిరింపులు, దాడులు, దౌర్జ‌న్యాలు జ‌రిగాయో లెక్క పెట్టుకో. స్వ‌యానా మంత్రులు కూడా రంగంలోకి దిగి, స‌ర్వ శ‌క్తులు మోహ‌రించి బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాలు ఎన్నెన్ని చోట్ల చేయించారో లిస్టు రాసుకో. ప్ర‌తిప‌క్షం నుంచి ఎవ‌రినీ నామినేష‌న్ వేయించ‌కుండా ఎక్క‌డెక్క‌డ ఎలా అడ్డుకున్నారో జ్ఞాప‌కం చేసుకో. వేరే వాళ్ల‌కి ఓటేస్తే పింఛ‌న్లు ఆపేస్తాం, రేష‌న్ క‌ట్ చేస్తాం, ఇళ్ల స్థ‌లాలు నిలిపేస్తాం అంటూ ఎలా రెచ్చిపోయి ఎక్క‌డిక‌క్క‌డ జ‌నాన్ని ఎలా హ‌డ‌లుగొట్టారో అర్థం చేసుకో. ఆ త‌ర్వాత చెప్పు అది గెలుపో, ఓట‌మో?”

“ఆ... ఇప్పుడు మీరిందాకా అన్న మ‌త‌లబు మాట‌లు అర్థ‌మ‌వుతున్నాయండి. ఇలాంటి వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాక గెలిచినా ఓడిన‌ట్టేనండి. అలాగే అధికారం చేతిలో ఉంటే ఇలాంటి అడ్డ‌గోలు గెలుపులెన్నో కాతాలో వేసుకోవ‌చ్చ‌ని కూడా అర్థ‌మైందండి. అధికారం, గెలుపు ఎలా పెన‌వేసుకుని ఉంటాయో తెలిసిందండి...”

“మ‌రింత‌కి మించిన నీచ రాజ‌కీయ పాఠం నీకింకేముంటుందిరా? బాగా ఒంట‌బ‌ట్టించుకో...”

“బాగుంది గురూగారూ! అంటే అధికారమ‌నే కుర్చీ ఎక్కాక ఇక ఏం చేసినా చెల్లుతుంద‌న్న‌మాటండి... మ‌రి ఇందాకా మీరు కుర్చీ మీద ఉన్నా ఓడిన‌ట్టే అన్నారు క‌దా, అదెలాగండీ?”

“అది అర్థం కావాల‌న్నా నువ్వు ఆంధ్ర రాజ‌కీయ మ‌హా భార‌తం క్షుణ్ణంగా అవ‌గ‌తం చేసుకోవాలిరా... నువ్వే గ‌మ‌నించు... భారీ అంకెల‌తో గెలిచి అధికారం చేజిక్కించుకున్నా, ఏం జ‌రుగుతోంది?  పైకి ప్ర‌జాస్వామ్యం క‌బుర్లు, చేసేది నియంత నిర్వాకం. జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల‌తో రూపాయి ఆశ చూపించి, కోట్ల‌కు కోట్లు దోచుకునే వ్య‌వ‌హారం. అడ్డ‌గోలు ప‌న్నుల‌తో ప్ర‌జ‌ల న‌డ్డి విర‌గ్గొట్టే దాష్టీకం. రాష్ట్రాన్ని దివాళా అంచుకు తీసుకుపోతున్న అవ‌క‌త‌వ‌క‌ల విధానం. ఒక్క ప‌రిశ్ర‌మ‌నైనా తీసుకురాలేని దౌర్భాగ్యం. పైగా ఉన్న ఫ్యాక్ట‌రీలు, పోర్టులు, భూములు అయిన వారికి దోచి పెట్టే తెంప‌రిత‌నం. అటు వైద్య ప‌రంగా కానీ, ఇటు చ‌ట్ట ప‌రంగా కానీ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ, భ‌ద్ర‌త క‌ల్పించ‌లేని నిర్ల‌క్ష్యం. నోరెత్తిన వాడిపై దాడులు చేసే నికృష్టం. అడిగిన వాడిపై అడ్డ‌మైన కేసులు బ‌నాయించే బ‌రితెగింపుత‌నం. స‌మ‌స్య‌ల మాటెత్తితే గూండాగిరీ చేసి నోరు మూయించాల‌ని చూసే నైచ్యం. ఇలా ఎటు చూసినా అగ‌మ్య‌గోచ‌రంగా ఉన్న పాల‌న సాగుతున్న‌ప్పుడు కుర్చీ మీద బాసింప‌ట్టు వేసుకుని కుర్చున్నా దాన్ని గెలుప‌నాలా? ఓట‌మ‌నాలా?”

“అవునండోయ్‌... అస‌లైన గెలుపంటే ఏంటో బాగా అర్థ‌మైందండి. నిజ‌మైన ఓట‌మంటే ఏంటో తెలిసిందండి. మొత్త‌మ్మీద ఇవాల్టి పాఠం భ‌లేగా ఉంది గురూగారూ!”

“పాఠం ఇంకా అయిపోలేదురా బ‌డుద్దాయ్‌. ఇంత‌కీ నువ్వు గెల‌వాల‌నుకుంటున్నావా? ఓడాల‌నుకుంటున్నావా? అది చెప్పు ముందు...”

“ప్ర‌జ‌ల మ‌న‌సులు గెల‌వాల‌నుకుంటున్నానండి... అంతేనాండీ?”

“ఏడిశావ్‌... న‌వ భార‌త నీచ రాజ‌కీయాల్లో నువ్వు గెల‌వాలంటే ముందు మ‌నిషిగా ఓడిపోవాలి. అధికారం అందుకోవాలంటే నైతికంగా ప‌రాజ‌యం పొందాలి. ఆ అధికారాన్ని కొన‌సాగించుకోవాలంటే నీతిగా ఓట‌మి పాల‌వ్వాలి. నిజాయితీ ప‌రంగా ఓడిపోవాలి. ఇన్ని ర‌కాలుగా ఓడిపోయినా అదే గెలుప‌నుకోవాలి. ఆ గెలుపుతోనే విర్ర‌వీగాలి. ఇదే అస‌లు సిస‌లు పాఠం. ఇది నీకంత తేలిగ్గా అర్థం కాదులే కానీ, ఇవాల్టికి ఇంటికి పోయి ప‌డుకో”

-సృజ‌న‌

 PUBLISHED ON 26.09.2021 ON JANASENA WEBSITE

బుధవారం, సెప్టెంబర్ 22, 2021

నేరం, రాజ‌కీయం... చెట్టాప‌ట్టాల్‌!


 

“ఏంటో గురూగారూ! పొద్దున్నే పేప‌ర్ చ‌ద‌వ‌గానే మ‌న‌సంతా విక‌ల‌మైపోయిందండి... ఇక నాకు రాజ‌కీయ భవిష్య‌త్తు లేదేమోన‌ని దిగులేస్తోందండి... మీరేదైనా కాస్త ధైర్యం చెబుతారేమోన‌ని ఇలా వ‌చ్చానండి...” అంటూ నిరాశ‌గా చ‌తికిలబ‌డ్డాడు శిష్యుడు వ‌స్తూనే.

“ఏంట్రోయ్ అంత నిర్వేదం? నీకొచ్చిన క‌ష్టం ఏంటి?” అన్నారు గురువుగారు పడ‌క్కుర్చీలో కూర్చుంటూ.

“ఏం చెప్ప‌మంటారండీ... నేనేదో మీ ద‌గ్గ‌ర కాసిని నీచ రాజ‌కీయ పాఠాలు నేర్చుకుని, ఓ బ‌రితెగించిన నేత‌గా ఎదిగి, ఓ నాలుగు త‌రాల పాటు కూర్చుని తిన్నా త‌ర‌గ‌నంత సంప‌ద పోగేసుకుందామ‌ని  ఓ... తెగ ఆశ ప‌డిపోయానండి ఇన్నాళ్లూనూ. కానీ ఇప్పుడు  ఏం చేయాలో అర్థం కావ‌డం లేదండి... ప్చ్‌!”

“ఇంత‌కీ ఏం వార్త‌లు చ‌దివావురా... అదేడు ముందు...”

“ఏముందండీ... ఆ సుప్రీం కోర్టు కొత్త న్యాయ‌మూర్తి ఏమ‌న్నారో తెలుసాండీ? రాజ‌కీయాల్లో నేర చ‌రితులపై కేసులు దాఖ‌లు చేయ‌డానికే ఏళ్లూ పూళ్లూ ప‌డుతోంద‌ని గుర్తించేశారండి.  పైగా అలాంటి ప‌రిస్థితులు మార్చ‌డానికి చ‌ర్య‌లు మొద‌లెట్టారండి. న్యాయ విచార‌ణ సంస్థ‌ల్లో సిబ్బంది ఖాళీలు వెంట‌నే పూరించాలన్నారండి. న్యాయ‌మూర్తులను కూడా స‌రిప‌డా నియ‌మించాల‌న్నారండి. రాజ‌కీయ నేరాల‌పై విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టులు కూడా పెట్టేస్తార‌టండి... ఆయ్‌!”

“పోనీలేరా... ఆయ‌న బాధేంటో ఆయ‌న‌ది. ఆయ‌న‌కు ప‌నులు ఆయ‌న్ని చేసుకోనీ. మ‌ధ్య‌లో నీకెందుకు ఉలుకు?”

“అదేంటండీ అలాగంటారు? నేనింకా మీ ద‌గ్గ‌ర స‌రిగ్గా రాజ‌కీయ పాఠాలే నేర్చుకోలేదు. ఎప్పుడు ఆరితేరుతాను? ఎప్పుడు నీచ నేత‌గా ఎదుగుతాను? పోనీ ఎలాగోలా ఎదిగేస‌రికి ఇలా ప్ర‌త్యేక కోర్టులు గ‌ట్రా వ‌చ్చేస్తే నా గ‌తేంటండీ? నేనింక ఏం వెన‌కేసుకోగ‌ల‌నండీ? ఏం కుంభ‌కోణాలు చేయ‌గ‌ల‌నండీ? ఇలా గ‌తిలేక ప్ర‌జాసేవ చేయ‌డానికా చెప్పండి, నేను రాజ‌కీయాలు నేర్చుకుంటుంట‌? ఏంటోనండి బాబూ... దేశ‌మేదో బాగుప‌డిపోతున్నట్టు పీడ‌క‌ల‌లు వ‌చ్చేస్తున్నాయండి...”

శిష్యుడి మాట‌ల‌కి గురువుగారు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.

“వ‌హార్నీ... అద‌ట్రా నీ భ‌యం? ఒరే వాళ్లు ఇప్పుడే ఇల్లు అల‌క‌డం ప్రారంభించార్రా... అప్పుడే వాళ్ల పండ‌గ రాదులే. నువ్వు నిశ్చింత‌గా ఉండు...”

“ఏంటో సార్ మీ నిబ్బరం? నాకు మాత్రం నీచ నేత‌లంద‌రూ ఊచ‌లు లెక్క‌బెడుతున్న‌ట్టు భ్ర‌మ క‌లుగుతోందండి...”

“ఒరే... నీ భ్రమే క‌నుక నిజమైతే, నాకు తెలిసి ప్ర‌త్యేక కోర్టులు కాదురా, ప్ర‌త్యేక జైళ్లు క‌ట్టించాలి... అంత‌లా రాజ‌కీయాలు, నేరాలు జ‌ట్టాప‌ట్టాలేసుకుని చేతులు ప‌ట్టుకుని ఒప్పుల‌కుప్ప తిరిగేస్తున్నాయి...  ఏ పార్టీని తీసుకో, అందులో నేరాల‌తో సంబంధం ఉన్న నేత‌లు పుష్క‌లంగా క‌నిపిస్తారు. ఇంట్లోకి బుర‌ద కాళ్ల‌తో వ‌స్తే క‌డిగేస్తే పోతుంది. కానీ బుర‌ద‌లోనే ఇల్లు క‌ట్టుకున్నామ‌నుకో. ఇక  క‌డిగేదేముంటుంది? అయినా నువ్వు హ‌డ‌లిపోయి ఏడుస్తున్నావు కాబ‌ట్టి, నీకు ధైర్యం చెప్ప‌డానికి కొన్ని ప‌చ్చి నిజాలు చెబుతాను. చెవులు రిక్కించి విను. దేశ‌మ్మొత్తం మీద 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మేల్యేల‌పై ఆర్థిక నేరారోప‌ణ‌లు ఉన్నాయి. పైగా ఈ లెక్క‌లు ఏడెనిమిదేళ్ల క్రితంవి.  ఈ పాటికి వాళ్ల‌కి మ‌రి కొంద‌రు కూడా జ‌తప‌డి ఉండొచ్చు. అంతే కాదు వాళ్లంద‌రినీ మించి పోయి ఆర్థిక  నేరాల్ని నిర్భయంగా, నిస్సిగ్గుగా చేస్తూ కూడా నిక్షేపంగా అధికార పీఠంపై బాసింప‌ట్టు వేసుకుని క‌థ న‌డిపించేస్తున్న నేత‌లు కూడా ఉంటారు. అందుకు నీ ప‌ర‌గ‌ణా అధినేతే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. కాద‌న‌గ‌ల‌వా? అంతెందుకురా సీబీఐ కోర్టుల్లో ఎంపీ, ఎమ్మెల్యేల‌పై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉన్న కేసులే 121. వాటిలో 58 కేసులైతే జీవిత ఖైదు విధించాల్సినంత పెద్ద పెద్ద నేరాలే మ‌రి...”

“అయ్‌బాబోయ్‌... అవునాండీ? అయితే రేపో మాపో ఇవ‌న్నీ తేలిపోయి, రుజువైపోయి, నిందితులు కాస్తా నేర‌స్థుల‌గా మారిపోతే వాళ్ల‌ని ఎంచుకున్న జనం ఏమ‌నుకుంటారండీ? ఇలాంటి నీచుల్నా మ‌నం ఎన్నుకున్నామ‌ని తెల్ల‌బోరండీ పాపం...”

“జ‌నానిదేముందిరా పాపం... ఇద్ద‌రి వెధ‌వ‌లో ఒక‌డిని ఎంచుకోక త‌ప్ప‌ద‌నుకున్న‌ప్పుడు ఎవ‌రో ఒక‌రికి ఓటేయ‌క త‌ప్ప‌దు క‌దా? అలాంటి ప‌రిస్థితిలో ప‌డిపోయారా వాళ్లు... అస‌లు జైలు నుంచి బెయిలు మీద వ‌స్తూనే ఊరేగింపుగా బ‌య‌ల్దేరి, దండ‌ల‌తో, డ‌ప్పుల‌తో హంగామా చేస్తూ నామినేష‌న్ వేసి, ఆ త‌ర్వాత గెలిచి మ‌రీ మీసం మెలేస్తున్న నాయ‌కులు ఎంత మంది లేరురా మ‌న  క‌ళ్ల ముందు? నీకింకో సంగ‌తి చెబుతాను వినుకో.  తాజా నాయకులో, మాజీ నేత‌లో ఎవ‌రి మీద అయితేనేం, ప్ర‌స్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులెన్నో తెలుసా? ఏకంగా 4800. వీటిలో కొన్ని కేసులైతే ఏళ్లకేళ్ల త‌ర‌బ‌డి సాగుతూనే ఉన్నాయి. ఇవ‌న్నీ తేలేదెప్పుడు?  వాయిదాల వాయుగుండాల నుంచి తేరుకుని రుజువ‌య్యేదెప్పుడు? ఆ నేర‌నేత‌ల‌కు శిక్ష ప‌డేదెప్పుడు, నువ్వే చెప్పు?”

“అవునండోయ్‌... ఈలోగా ఆ నాయ‌కులంద‌రూ ఎంచ‌క్కా రెండు మూడు ఎన్నిక‌ల‌ను చూసి గెలుపు సంబరాలు చేసుకోవ‌చ్చు కూడానూ. అయినా గురూగారూ, నాదో సందేహమండి. మ‌రి తెలిసి తెలిసి ఇలాంటి నీచ‌, నికృష్ట‌, న‌య‌వంచ‌క అభ్య‌ర్థుల‌కు టిక్కెట్లు ఎలా ఇస్తున్నాయండీ రాజ‌కీయ పార్టీలు?”

“ఎందుకివ్వ‌వురా? ఈ రోజుల్లో గెల‌వాలంటే డ‌బ్బు వెద‌జ‌ల్లాలి, ఖ‌ర్చు చేయ‌గ‌లిగి ఉండాలి, కింద నుంచి పైదాకా ప్ర‌లోభ పెట్ట‌గ‌లిగి ఉండాలి. మ‌రి బ‌రిలోకి  దిగిన నేత వీధిలోకి వ‌స్తే హార‌తివ్వ‌డానికి ఓ రేటు, బొట్టు పెట్ట‌డానికి ఓ రేటు, దిష్టి తీయ‌డానికో రేటు, ఆయ‌న‌గారు మీటింగ్ పెడితే లారీల్లో త‌ర‌లి రావ‌డానికో రేటు, ఆ స‌భ‌లో చ‌ప్ప‌ట్లు కొట్ట‌డానికో రేటు, నినాదాలు చేయ‌డానికో రేటు, జేజేలు ప‌ల‌క‌డానికో రేటు... ఇలా అడుగ‌డుగునా ల‌క్ష‌లు, కోట్లు విరిజిమ్మాల్సి ఉంటే... నీతులు చెబుతూ, నిరాడంబ‌రంగా, విన‌యంగా, న‌మ‌స్కారం పెట్టి ఓట‌డిగే స్వ‌చ్ఛ‌మైన అమాయ‌క అభ్యర్థికి  ఏ పార్టీ టికెట్ ఇస్తుందిరా?”

“మ‌రైతే గురూగారూ, న్యాయ వ్య‌వ‌స్థ కానీ, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కానీ ఏమీ చేయలేవాండీ? ఓ ప‌ద్ధ‌తి, ఓ నిబంధ‌న‌, ఓ రూలు ఇలాంటివేమీ లేవంటారా?”

“ఎందుకుండ‌వురా అన్నీ ఉంటాయి. కానీ ప‌ట్టించుకునే నాథుడెవ‌డు చెప్పు? అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసిన రెండు రోజుల్లోగా వారి నేర చ‌రిత్ర‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలే ఉన్నాయి.  కానీ మొన్న‌టికి మొన్న జ‌రిగిన బీహార్ ఎన్నిక‌ల‌నే చూసుకో. ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా ప‌ది పార్టీలు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల్లో 469 మంది నేర చ‌రితులే. ఇక చెప్పేదేముంది? కాబ‌ట్టి నువ్వింక  నిశ్చింత‌గా ఉండు. నిబ్బ‌రంగా నీచ రాజ‌కీయ పాఠాలు నేర్చుకో. నీ ద‌శ బాగుండి, జ‌నం ఖ‌ర్మ కాలితే నేత‌గా ఎదుగుతావు...”

“అమ్మ‌య్య... ఇప్ప‌టికి ధైర్యం వ‌చ్చిందండి. కానీ గురూగారూ, దేశంలో ఈ ప‌రిస్థితి ఇక బాగుప‌డ‌దంటారా?”

“ఎందుకంటానురా? జ‌నం చైతన్య వంతులై, జ‌న సైనికులై, నికృష్ట అభ్య‌ర్థుల‌ను నిర్ద్వందంగా తిర‌స్క‌రించే స‌త్సంక‌ల్పం చేసుకుంటే ఇక నీలాంటి వాళ్ల‌కి రూక‌లు చెల్లిన‌ట్టే.  అంత‌వ‌ర‌కు నువ్వు ఆడింది ఆట‌, పాడింది పాట‌...”

“చివ‌రాక‌రిగా మ‌రో సందేహం గురూగారూ! ఒక వేళ జ‌నం సైనికులై స్వ‌చ్ఛ రాజ‌కీయ స‌మ‌రానికి పూనుకున్నారనుకోండి, మ‌రి మీ గురుకులం ఏమవుతుందండీ? ఇక మీరెవ‌రికి పాఠాలు చెబుతారండీ పాపం?”

“ఓరెర్రి నా శిష్యా! నేను చెప్పే నీచ రాజ‌కీయ పాఠాలు నీ లాంటి వాళ్ల‌కు ఎలా ఉండాలో చెబితే, నీతి ప‌రుల‌కు ఎలా ఉండ‌కూడ‌దో చెబుతాయి. కాబ‌ట్టి నా గురుకులానికేం ఢోకా లేదు. నువ్విక పోయిరా!”

-సృజ‌న‌

PUBLISHED ON 23.9.2021 ON JANASENA WEBSITE

శనివారం, సెప్టెంబర్ 18, 2021

తితిదే ప్ర‌తిష్ఠ గోవిందా గోవింద‌!



* కేవ‌లం ఒక్క క్ష‌ణం... తేరిపారి ఆ తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడి దివ్య సుంద‌ర‌ విగ్ర‌హాన్ని క‌నులారా వీక్షించుకోవాల‌ని, ఆ రూపాన్ని మ‌నసునిండా నింపుకుని త‌రించాల‌ని  సుదూర తీరాల నుంచి పిల్లాపాప‌ల‌తో, వృద్ధుల‌తో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి, ఆప‌సోపాలు ప‌డుతూ త‌ర‌లి వ‌చ్చే ల‌క్ష‌లాది మంది భ‌క్త జ‌నానికి మ‌రింత నిరీక్ష‌ణ త‌ప్ప‌ని ప‌రిస్థితి ఇప్పుడు దాపురించిన‌ట్టే!

* ఇంట్లో వెంక‌న్న ప‌టం ముందు ఏ ఇత్త‌డి చెంబులోనే హుండీ ఏర్పాటు చేసుకుని, మొక్కులు మొక్కుకున్న‌ప్పుడ‌ల్లా అందులో నోట్లు, నాణాలు వేసుకుంటూ, ఆ డ‌బ్బుల మూట‌ను భ‌క్తితో నెత్తి మీద పెట్టుకుని తిరుమ‌ల చేరుకుని ఆ సొమ్మును వెంక‌న్న హుండీలో స‌మ‌ర్పించ‌డం ద్వారా ఏటా ఏకంగా 12 వేల కోట్ల‌కు పైగా ఆదాయాన్ని అందిస్తున్న కోట్లాది మంది సామాన్య  భ‌క్త జ‌నుల‌కు ఇప్పుడు తిరుమ‌ల‌లో మ‌రిన్ని వెత‌లు, యాత‌న‌లు, కాల‌యాప‌న ఎదుర‌య్యే దుస్థితి  ఏర్ప‌డిన‌ట్టే!!

* మ‌రో ప‌క్క‌ ప్ర‌త్యేక దర్శ‌నాలు, ప్ర‌ముఖులు, విఐపీల‌కు బ్రేక్ ద‌ర్శ‌నాలు, ప్ర‌త్యేక స‌దుపాయాలు, సౌక‌ర్యాలు ఇక‌పై ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగిపోయే ప‌రిస్థితి కూడా ఇక‌పై క‌లిగిన‌ట్టే!!!

--- అవును! గ‌తంలో ఏ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ లేని విధంగా, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు స‌భ్యుల సంఖ్యను  ఇష్టానుసారం పెంచేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా నిర్వాకం వ‌ల్ల, ప్ర‌పంచ వ్యాప్తంగా దివ్య‌క్షేత్రంగా పేరొందిన తిరుమ‌ల యాత్ర మ‌రింత క‌ష్ట‌సాధ్యం కానుంద‌న‌డంలో అతిశ‌యోక్తి ఏమీ లేదు.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌తిష్ఠ దిగ‌జారిపోయేలా, ఆ ఏడుకొండ‌ల వాడి దివ్యథామం ప‌విత్ర‌త అణ‌గారిపోయేలా కొంద‌రు నేర‌స్థులు, నిందితులు కూడా బోర్డు స‌భ్య‌ల హోదాలో స‌క‌ల మ‌ర్యాద‌లు అందుకునే క‌నీవినీ ఎరుగ‌ని విడ్డూరం అక్క‌డ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. జ‌గ‌న్ ప్రభుత్వం తాజాగా నియామ‌కాలు చేసిన బోర్డు స‌భ్యుల్లో కొంద‌రి పూర్వాప‌రాలు ప‌రిశీలించిన‌ప్పుడు ఈ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఇప్పుడు సర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

ఒక ఛైర్మ‌న్, న‌లుగురు ఎక్స్ అఫీషియో స‌భ్యులు, 24 మంది స‌భ్య‌లు, ఇద్ద‌రు ప్ర‌త్యేక ఆహ్వానితులు... వీరు కాకుండా అద‌నంగా మ‌రో 50 మంది ప్ర‌త్యేక ఆహ్వానితులు... వెర‌శి అందరూ క‌లిస్తే మొత్తం 81 మంది! ఇదీ ఇప్పుడు తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి విరాట్ స్వ‌రూపం!

ఎవ‌రికి ప్ర‌యోజ‌నం?

గ‌తంలో ఎవ‌రి హయాంలోనూ లేనంత మంది స‌భ్యుల‌తో ఏర్ప‌డిన ఈ మండ‌లి వ‌ల్ల అటు భ‌క్తుల‌కు కానీ, ఇటు తిరుమ‌ల క్షేత్రానికి కానీ ఏం ప్ర‌యోజ‌నం ఏర్ప‌డుతుంద‌న్న‌ది అనుమాన‌మేన‌న‌డంలో సందేహం ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే గ‌త ప్రభుత్వ హ‌యాంలో బోర్డు స‌భ్య‌ల సంఖ్య కేవ‌లం 18 మంది.  జ‌గ‌నం ప్ర‌భుత్వం కొలువు తీర‌గానే ఆ సంఖ్య 37కి  పెరిగింది. ఇప్పుడు ఏకంగా 81 మందితో కిట‌కిట‌లాడుతోంది. వీరిలో 50 మంది ప్ర‌త్యేక ఆహ్వానితుల‌కు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకునే శ‌క్తి ఉండ‌దు. స‌మావేశాల్లో కూడా వీళ్లు పాల్గొన‌లేరు. అయినా స‌రే.... వీళ్లు బోర్డు స‌భ్యుల‌తో పాటు స‌మాన హోదాను అనుభ‌విస్తారు. అంటే బోర్డు స‌భ్యుల‌కు ప్రోటోకాల్ ప్ర‌కారం కేటాయించే వ‌స‌తి, వాహ‌న‌, ద‌ర్శ‌న స‌దుపాయాలు, సౌక‌ర్యాలు వీరు హాయిగా పొంద‌గ‌లుగుతారు. మ‌రి ఇలాంటి ప్ర‌త్యేక ఆహ్వానితులు ఇంత‌మంది ఎందుకు? అనేదే ఇప్పుడు భ‌క్తులను క‌ల‌వ‌ర ప‌రుస్తున్న ప్ర‌శ్న‌!

 ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే ఈ బోర్డు స‌భ్యుల పూర్వాప‌రాలు ఒక‌సారి ప‌రిశీలించాలి. అలా ప‌రిశీలించిన‌ప్పుడు వీరిలో అత్య‌ధికులకు శ్రీవారి సేవ‌తో కానీ, ఆధ్యాత్మిక నేప‌థ్యంతో కానీ సంబంధం లేక‌పోవ‌డ‌మే కాదు, వారికి ఎలాంటి ప్ర‌త్యేక  అర్హ‌త‌లు కూడా లేవ‌ని తేట‌తెల్ల‌మ‌వుతుంది. పైగా వీరిలో 70 శాతం మంది ఇత‌ర రాష్ట్రాలకు చెందిన‌వారే. అంతేకాదు, వీరిలో కొంద‌రు కొన్ని కేసుల్లో నిందితులు కూడా. ఇంకా ఘోర‌మేమిటంటే ఓ కేసులో అరెస్ట‌యిన వ్య‌క్తికి కూడా ఈ బోర్డులో స్థానం ల‌భించ‌డం! ఇంకా కొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు, అవినీతి ఆరోప‌ణ‌లకు గురైన‌వారు, సీబీఐ కేసుల్లో నిందితులుగా  ఉన్న‌వారు కూడా ఉండ‌డమే ఇప్పుడు భ‌క్త జ‌నుల మ‌నోభావాల‌ను క‌ల‌చివేస్తోంది.

ఇలాంటి వారినా నియ‌మించేది?

దేశ దేశాల్లో అత్యంత ప‌విత్ర‌మైన యాత్రా స్థ‌లంగా పేరొందిన తిరుమ‌ల క్షేత్రానికి సంబంధించిన పాల‌క మండ‌లి విష‌యంలో ప్ర‌భుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించింది? అనే ప్ర‌శ్న‌కు ఎలా చూసినా ఒకే స‌మాధానం క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అదేంటంటే... ఇది ఓ క్షేత్రం ప‌విత్ర‌త‌ను కానీ, దాని ప్రాచుర్యాన్ని కానీ, ప్రాధాన్య‌త‌ను కానీ దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు... కేవ‌లం రాజ‌కీయ కోణంలో, వ్యాపార కోణంలో స్వ‌ప్ర‌యోజ‌నాల‌న‌కు మ‌త్ర‌మే ప‌రిగ‌ణిస్తూ చేసిన నిర్వాక‌మేన‌నే విమ‌ర్శ‌లు అంత‌టా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై  ఉన్న అక్ర‌మార్జ‌న కేసుల్లో స‌హ‌నిందితుల‌కు కూడా ఇందులో చోటు ద‌క్క‌డ‌మే ఇందుకు తార్కాణ‌మ‌ని విశ్లేష‌కులు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఢంకాప‌ధంగా చెబుతున్నారు.  త‌న‌కు గ‌తంలో స‌హ‌క‌రించిన పారిశ్రామిక వేత్త‌లు, వ్యాపారులకు కూడా జ‌గ‌న్ స్థానం క‌ల్పించ‌డాన్ని ఇప్పుడు అంద‌రూ వేలెత్తి చూపుతున్నారు. ప్ర‌భుత్వంలోను, పార్టీలోను ఉన్న అసంతృప్తి వాదుల‌ను బుజ్జ‌గించ‌డానికి, మ‌రి కొంద‌రిని ప్ర‌లోభ పెట్ట‌డానికి ఇలా తిరుమ‌ల బోర్డును ఉపయోగించుకున్నార‌నే నిర‌స‌న‌లను వినిపిస్తున్నారు.

సామాన్య‌లకు వెత‌లేనా?

దేవ‌స్థానం స‌భ్య‌ల నియామ‌కాల్లో రాజ‌కీయ‌, వ్యాపార‌, ప్ర‌లోభ కార‌ణాల‌ను ప‌క్క‌న పెట్టి ఈ భారీ ప‌ద‌వుల పందేరం వ‌ల్ల  సామాన్య‌ భ‌క్తుల‌కు ఒరిగేదేంట‌ని ఆలోచిస్తే... శూన్య‌మ‌నే చెప్ప‌క‌త‌ప్ప‌దు. పైగా తిరుమ‌ల యాత్ర మ‌రింత‌గా వెత‌ల పాలు కాక త‌ప్ప‌ద‌నే విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. తిరుమ‌ల అన‌గానే ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు, బ్రేక్ ద‌ర్శ‌నాలు త‌ప్ప‌వు. కొంద‌రు ప్ర‌ముఖుల‌కు ఇలాంటి ద‌ర్శ‌నాలు ఏర్పాటు చేయ‌డంలో ఎవ‌రికీ అభ్యంత‌రాలు కూడా పెద్ద‌గా ఉండ‌వు. గ‌తంలో బ్రేక్ ద‌ర్శ‌నాల సంఖ్య 2500కి మించేది కాదు. ప్ర‌త్యేక సందర్భాల‌లో కూడా ఈ సంఖ్య‌ను మూడు వేల లోపే ఉండేలా చూసేవారు. వీరి కోసం ప్ర‌త్యేక స‌మ‌యాన్ని కేటాయించి సామాన్య భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌లుగ‌కుండా చ‌క‌చ‌కా ద‌ర్శ‌నం జ‌రిగేలా చూసేవారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఈ సంఖ్య 4000 దాటి పోయింది. వీరి ద‌ర్శ‌నానికే 4 గంట‌ల స‌మ‌యం ప‌ట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక ఇప్పుడు ఈ భారీ నియామ‌కాల వ‌ల్ల ప్ర‌త్యేక‌, బ్రేక్ ద‌ర్శ‌నాల సంఖ్య అయిదు వేల‌కు మించిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎందుకంటే... బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మితులైన  వారంద‌రికీ సిఫార్సు లేఖ‌లు జారీ చేసే అధికారం ఉండ‌డ‌మే. మామూలుగానే బోర్డు స‌భ్యులు ఒకొక్క‌రు 20 మందికి బ్రేక్ దర్శ‌నాల‌కు సిఫార్సు చేసే అవ‌కాశం ఉంటుంది. అలాగే సుప‌థం ద్వారా కూడా 20 మందికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు క‌ల్పించే వీలు ఉంది. ఇలా చూస్తే ఇప్పుడు కొలువైన 81 మంది ద్వారా వ‌చ్చే వారి కోసం దాదాపు 3200 టికెట్ల‌ను కేటాయించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని అంచ‌నా. వీరు కాక ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఇతర ప్ర‌ముఖుల ద్వ‌రా వ‌చ్చే సిఫార్సుల‌ను కూడా లెక్క‌లోకి తీసుకుంటే వీరంద‌రి ద‌ర్శ‌నాల‌కు ప‌ట్టే స‌మ‌యం మ‌రిన్ని గంట‌లు ప‌ట్ట‌క త‌ప్ప‌దు. అంటే... అంత‌సేపూ సామాన్య భ‌క్తులు క్యూలైన్ల‌లో పిల్లా పాప‌ల‌తో నిరీక్షించి చూస్తూ ఆప‌సోపాలు ప‌డ‌క త‌ప్ప‌ద‌ని ఇట్టే అర్థ‌మవుతుంది.

అడుగ‌డుగునా అవ‌క‌త‌వ‌క‌లే! 

అత్యంత ప‌విత్ర క్షేత్రంగా ప్ర‌పంచవ్యాప్తంగా భ‌క్తుల‌ను ఆకర్షించే తిరుమ‌ల ప‌ట్ల  ప్ర‌భుత్వం మొద‌టి నుంచీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న‌డానికి ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్లులుగా ఉన్నాయ‌ని సామాన్య‌ల నుంచి విశ్లేష‌కుల వ‌ర‌కు అనేక  ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు. దేవ‌స్థానం ఆస్తుల వేలానికి తెగ‌బ‌డ‌డం, తిరుమ‌ల బ‌స్ టికెట్ల వెనుక అన్య‌మ‌త ప్ర‌చారం సాగ‌డం, తిరుమ‌ల అధికారిక వెబ్‌సైట్లో అన్య మ‌త గేయాలు క‌నిపించ‌డం, ఎస్వీబీసీ చైర్మన్ గా నియామ‌కుడైన వ్యక్తి రాస‌లీల‌లు వెల్ల‌డి కావ‌డం, త‌ల‌నీలాలను స్మ‌గ్లింగ్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు, దేవ‌స్థానం మాస ప‌త్రిక‌లో రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రించే వ్యాసాలు రావ‌డం, ల‌డ్డూ ప్ర‌సాదం ధ‌ర‌లు పెండ‌డం, శ్రీవారి ప్ర‌సాదాన్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పంపిణీ చేయ‌డం, తిరుమ‌ల‌లో రోడ్డు డివైడ‌ర్ల‌కు వైకాపా రంగులు వేయ‌డం, తితిదే క‌ళ్యాణ మండ‌పాల లీజు వ్య‌వ‌హారం, తిరుమ‌ల‌లో అన్య‌మ‌తస్థుల నియామ‌కాలు జ‌ర‌గ‌డం లాంటి ఎన్నో అవ‌క‌త‌వ‌ల‌క‌ల గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇవ‌న్నీ భ‌క్తుల మ‌నోభావాల‌ను తీవ్రంగా  దెబ్బ‌తీసేవే. ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను ప‌రికించి చూసినప్పుడు ఒకే విష‌యం ప్ర‌శ్నార్ధ‌క‌మవుతోంది.... అదే ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధి! 

PUBLISHED ON 18.09.2021 ON JANASENA WEBSITE