ప్రభూ!
నా మనసొక మురుగునీటి ప్రవాహం...
ఆలోచనలన్నీ చెత్తాచెదారం...
నా తరమా దాని ప్రక్షాళనం?
నీ దయతోనే కావాలది గంగాజలం!
ప్రభూ!
నా మనసొక మురుగునీటి ప్రవాహం...
ఆలోచనలన్నీ చెత్తాచెదారం...
నా తరమా దాని ప్రక్షాళనం?
నీ దయతోనే కావాలది గంగాజలం!
"సార్... సార్... కొంప మునిగింది..."
"ఎవరిదీ?"
"మనదే సార్..."
"ఛస్... ఊరుకో... కొంపలు ముంచే వాళ్లమే
మనమైనప్పుడు మనది మునగడమేంటయ్యా?"
"మీరింత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారండీ
బాబూ... అవతల మీ అక్రమ లావాదేవీలన్నీ బట్టబయలైపోతుంటేను?"
"హ...హ్హ...హ్హా! మనవంత సులువుగా బయటపడిపోయే
యవ్వారాలు కాదు కదయ్యా... ఊరికే ఎందుకు కంగారు పడతావు కానీ, ముందు జరిగిందేంటో చెప్పు..."
"అదేనండీ... నిన్న హైకోర్టులో ఆ సీబీఐ వాదనలన్నీ
పత్రికల్లో పతాక వార్తలుగా వచ్చేశాయండీ బాబూ... మీరింకా చూడలేదా?"
"చూడు సెక్రట్రీ! మనం చేసినవిన్నీ అన్నీనా చెప్పు? ఎన్నని గుర్తు పెట్టుకుంటాను? వాటిలో కొన్ని అడపా దడపా పత్రికల్లో
వస్తుంటాయి. మరికొన్ని కోర్టుల్లో మార్మోగిపోతుంటాయి... ఇదంతా మామూలేనయ్యా. కాబట్టి
నువ్వూరికే బెంబేలు పడిపోకు..."
"అది కాదండి బాబూ... పొద్దున్న పేపరు చూసినప్పటి
నుంచి గుండె బేజారైపోయిందండి. మీరు కూడా చూసి కంగారు పడిపోయి, ఏ గుండె నొప్పయినా తెచ్చుకుని
ఉంటారని భయపడిపోయానండి. అందుకే ఉరుకూ పరుగు మీద వచ్చేశానండి... మీరు చూస్తే తాపీగా
ఉన్నారు... ఇప్పటికి నా మనసు కుదుటపడిందండి..."
"ఇంకా నయం సెక్రట్రీ... ఆ గుండెనొప్పేదో
నీకే వచ్చేసింది కాదు... మొత్తానికి భలేవాడివయ్యా... ఒట్టి కంగారు గొడ్డులా ఉన్నావ్... ఇంతకీ ఏమంటుంది
ఆ సీబీఐ?"
"ఏమండమేంటండి బాబూ... చాలా పగడ్బందీగా
వాదించిందండి. మీదంటూ ఒక్క రూపాయి కూడా లేకుండా ఏకంగా 1200 కోట్ల రూపాయలకు
పైగా మీ కంపెనీల్లోకి ఎలా రాబట్టుకున్నారో
అదంతా ఏకరవు పెట్టిందండి... పైగా ఈ మొత్తం అక్రమార్జనకు సంబంధించి అన్ని రుజువులూ
ఉన్నాయంటోందండి... అవన్నీ రేపో మాపో బయటకొచ్చేశాయనుకోండి...
తమరి పరిస్థితి ఏంటన్నది నా బెంగండి..."
"అవున్లే పాపం... ఇవన్నీ నీకు కొత్త కాబట్టి
అలాగే ఉంటుందిలే. మరి నాకలా కాదు కదా... నాకివన్నీ అలవాటే. అంచేత,
నువ్వు ముందు స్థిమితపడి, కాసిన్ని మంచినీళ్లు
తాగి అప్పుడు చెప్పు... ఆ సీబీఐ చేసిన వాదనేంటో..."
"పోన్లెండి... మీరు స్థిమితంగా ఉన్నారంతే
చాలు... మీరంటే ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కానీ, ఈ కేసు జరిగినప్పుడు మీ తండ్రిగారు సీఎంటండి...
అప్పట్లో ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరెవరికి భూములు కేటాయించారో,
అలా భూములు పొందిన వాళ్లు మీరు పెట్టిన కంపెనీల్లోకి ఎన్నేసి కోట్లు
బదలాయించారో అవన్నీ పేర్లతో సహా సీబీఐ కోర్టులో చెప్పేసిందండి. ఇదంతా ముడుపుల వ్యవహారమే
తప్ప మరేమీ కాదని గట్టి వాదించిందంటండి... పైగా ఇదంతా క్విడ్‌ప్రోకో కిందకే వస్తుందని
చెప్పిందంటండి..."
"అంతేనా? ఇంకేమన్నా ఉందా?"
"అదేనండి... అసలు ముందుగా మీ కంపెనీల్లోకి
కోట్లు వచ్చిపడ్డాయని కన్‌ఫర్మ్ అయ్యాకే, ఆయా సంస్థలకి మీ తండ్రిగారు రాష్ట్రంలో భూములు కేటాయించార్టండి...
ఆపై మరిన్ని కోట్లు ఎకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాకనే వాళ్లకి ఇంకొన్ని ఎకరాలు
కట్టబెట్టార్టండి... ఈ కేటాయింపులు, కోట్లు రావడాలు ఎప్పుడెప్పుడు
జరిగాయో తేదీలతో సహా దాఖలాలు ఉన్నాయంటండి..."
"సర్లేవయ్యా... వాళ్ల వాదన వాళ్లది.
వాళ్ల పని వాళ్లు చేయాలి కదా..."
"అయ్యా... మీ నిబ్బరం, నిశ్చింత చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందండి...
ఎంతో రాటుదేలిన ఘటనాఘటన సమర్థులైతే తప్ప ఇంత థిలాసా ఉండదండి... కానీ మీ సెక్రట్రీగా
నా కంగారు నాదండి. మరి ఈ కేసులు రుజువైపోతే కోర్టు గబుక్కున అరెస్టు వారెంటు ఇస్తే
ఎలాగా అని ఆలోచిస్తున్నానండి..."
"ఓరోరి వెర్రి సెక్రట్రీ! నీ స్వామి భక్తి, విశ్వాసం చూస్తుంటే ముచ్చటగా
ఉందయ్యా... కానీ నీకో సంగతి చెబుతా విను. నాకు మన చట్టాల మీద, న్యాయవ్యవస్థ మీద, మన ప్రజాస్వామ్యం మీద మాచెడ్డ
నమ్మకమయ్యా... ఇవన్నీ అంత తొందరగా తేలవు. వాయిదాల మీద వాయిదాలు పడతాయి. పైగా
మనోళ్లు చూస్తా ఊరుకుంటారా చెప్పు? మధ్యలో ఏదో సెక్షన్ అడ్డమెట్టుకుని
పిటీషను తగిలిస్తారు. దాన్ని శ్రీకోర్టువారు స్వీకరించక తప్పదు. తిరిగి దాని
మీద వాదోపవాదాలు... వాయిదాలు... ఆ... అంచేత నాకెప్పుడూ నిబ్బరమే... అర్థమైందా?"
"అర్థమైంది సార్... కాస్త చనువు తీసుకుని
అడుగుతున్నాను, ఏమీ
అనుకోకండి... ఇంతకీ అప్పట్లో జరిగిన క్విడ్‌ప్రోకోలు, ముడుపులు,
భూమి బదలాయింపులు ఇవన్నీ నిజమేనాండీ?"
"చూడు సెక్రట్రీ... అధికారం అనేది కరెంటులాంటిదయ్యా...
ఒక స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరిగి గాలొస్తుంది. మరో స్విచ్ నొక్కితే బల్బు వెలిగి
కాంతి పరుచుకుంటుంది. ఓ స్విచ్ ఏసీ ఆన్ చేస్తే, మరో స్విచ్ వంటింట్లో పచ్చడి చేసి పెడుతుంది. మనకి
తెలియాల్సిందల్లా ఎప్పుడు ఏ స్విచ్ నొక్కలనేదే. అంచాత అప్పట్లో మనకి డైరెక్ట్‌గా
అధికారం లేకపోయినా, స్విచ్‌లు మాత్రం బాగా తెలిసుండేవి... అదన్నమాట..."
"ఆహా... మీ తెలివితేటలు అవీ చూస్తే అబ్బురంగా
ఉందండి... తండ్రిగారిది అధికారం అయితే,
తైతక్కలు తమవన్నమాట. కానీ ఓ చిన్న సందేహం సార్... ఇప్పుడీ కేసులో
మీ క్విడ్‌ప్రోకోలు నిజమని తేలిపోయిందనుకోండి, అప్పుడిక మీ
చాప కిందకి నీళ్లొచ్చినట్టే కదండీ?"
"హ...హ్హ... హ్హా! సెక్రట్రీ తెగ నవ్వించేస్తున్నావయ్యా...
చాప కిందకి కొత్తగా నీళ్లు రావడమేంటయ్యా? అసలు మన
చాపే సముద్రం మీద తేలుతుంటేనూ? అదే అవినీతి సముద్రం. దాని మీద
తేలిపోతూ సాగిపోయే నాలాంటి వాడికి ఇలాంటి చిన్న చిన్న కేసులు పెద్ద లెక్కలోకి రావయ్యా...
అప్పట్లో అధికారం నాది కాదు కాబట్టి కొంత వరకే సాధ్యమైంది. మరిప్పుడో?
మనమే స్వయంగా అధికార పీఠం మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్నాం కదా.
మరి ఇప్పుడు జరుగుతున్నవి ఎప్పటికి తేలుతాయి చెప్పు? ఇప్పటికే
వందలాది, వేలాది ఎకరాలు మనకి బాగా అయినవాళ్లకి కేటాయింపులు
చేస్తున్నామా? రాష్ట్రంలో
ఉన్న గనులని, సెజ్‌లని కట్టబెట్టేస్తున్నామా? ఇసుక ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు, సారా గుత్తాధిపత్యాలు, భూముల అమ్మకాలు, పోర్టులు ఫ్యాక్టరీల ప్రైవేటీకరణలు...
ఇలా ఎన్నింటికని లెక్కలు తేల్చగలరు చెప్పు? ప్రజా సంక్షేమం పేరు చెప్పి అధికారికంగా
ఇచ్చే అనుమతులు, ఆ అనుమతుల వెనకాల అనధికారికంగా జరిగే లావాదేవీలు,
బదలాయింపులు, కేటాయింపులు... వీటన్నింటి విలువ
ఎవడు చెప్పగలడు? ఎవడు తేల్చగలడు? నువ్వు కేవలం ఓ 1200 కోట్లకే బెంబేలు
పడిపోతున్నావ్. వీటన్నింటి ముందు అదెంత?
సముద్రంలో కాకిరెట్ట! ఏమంటావ్?"
"ఇంకేమంటాను సార్... కళ్లు బైర్లు కమ్ముతున్నాయి...
ఒళ్లు గగుర్పొడుస్తోంది... నా భయాలన్నీ తీరిపోయాయి సార్... మీ బరితెగింపు అనితర
సాధ్యం! మీ అధికార లీలలు అమోఘం! మీరు... మీరు... జగన్నాటక సూత్రధారులు!"
-సృజన
PUBLISHED ON 9.11.2021 ON JANASENA WEBSITE
దీపావళి కదా... పిల్లలకి బాణసంచా
కొందామని బజారుకెళ్లిన సామాన్యుడికి అక్కడి ధరలు చూసి కళ్లు భూచక్రాల్లా గిర్రున
తిరిగాయి. గుండె నారబాంబులాగా ధడేలుమని పేలింది. కుదురులేని సిసింద్రీలాగా మనసు
పరిపరివిధాల పోయింది. దాంతో అతడి నోటమ్మట తిట్లు సీమటపాకాయల్లాగా టపటపలాడాయి.
"థూ... దీనెవ్వా సర్కారు. సీటికీ మాటికీ గొప్పలు సెప్పుకోడమే కానీ
సేసిందేటీ నేదు. పిల్లకాయలకి టపాకాయలు కొందారంటే జేబులోని కూసిని సొమ్ములు ఎందుకూ
రావు. ఊరూవాడా తిరిగి ఓదార్చుకుంటూ ఏడిస్తే ఓటేసాం. కుర్సీ ఎక్కి రెండేళ్లు గిర్రున
తిరిగినా నాబోటి సామాన్యల బతుకులు బాగుపడింది లేదు. పైగా నవ రత్నాలంట... అదంట...
ఇదంట... సెప్పుకోడానికైనా సిగ్గుండాల..." అంటూ గొణుక్కున్నాడు. తొందరగా వెళ్తే
పిల్లలు టపాకాయలు అడుగుతారని,
పొద్దు పోయేదాకా అక్కడాఇక్కడా
తిరిగి పిల్లలు నిద్రపోయాక ఇంటికెళ్లి అరుగు మీద తుండు పరుచుకుని పడుకున్నాడు సామాన్యుడు.
* * *
"లెగు మావా... మంచి ఊసుంది లెగు..." అంటూ భార్య
లేపుతుంటే కళ్లు నులుముకుంటూ లేచాడు సామాన్యుడు.
"ఏటే దిక్కుమాలిన గోల? కాసేపు నిద్రయినా పోనివ్వవు..." అంటూ అరిచాడు.
"ఎహే... లెగు మావా. మన జగనన్న సర్కారు
బాణసంచా పథకం పెట్టింది మావా! మన సామాన్యుల బతుకుల్లో దీపావళి జరిపించడానికంట..."
"బాణసంచా పథకం ఏంటే? నీకేమన్నా మతిపోయిందా?"
"ఔ... మావా... బాణసంచా భరోసా అంట! నిన్నగాక
మొన్న సినేమా టిక్కెట్లు కూడా అమ్ముతామందిగా?
అలా టపాసుల అమ్మకాలు కూడా సేపట్టిందంట. నేనెళ్లి పిలగాళ్ల కోసం
ఓ సంచీ బాణసంచా తెచ్చా..."
ఇంతలో పిల్లలు చుట్టూ మూగి "భలే... భలే..." అంటూ గెంతసాగారు.
సామాన్యుడికి అంతా కలలాగా ఉంది. లేచి కూర్చుని
"సరే... ఎలిగించండి. ఎలా కాల్తాయో సూద్దారి..." అన్నాడు.
పిల్లలు సంచీలోంచి మతాబులు తీశారు. సంబంరంగా
వాటిని ముట్టించారు. వాటిలోంచి ఒకట్రెండు ముత్యాలు రాలి... అపై అంతా పొగ రావడం మొదలెట్టింది. ఆ పొగకి పిల్లలకి ఊపిరాడలేదు.
"ఇయ్యేంటి మావా? ఇలా కాల్తన్నాయి?" అంది భార్య.
సామాన్యుడు ఆ మతాబులు తీసుకుని ఆ గొట్టాల మీది
కాగితాలు చూసి పగలబడి నవ్వాడు.
"ఓర్నీయవ్వా... ఈ మతాబులు సుట్టిన కాగితాలేంటో తెలుసా? ఎన్నికల నాటి వాగ్దానాలు. మేం
గెలిస్తే ఇంత సేత్తాం... అంత సేసేత్తాం అంటూ పత్రికల్లో అచ్చెత్తించారు సూడు. అయ్యన్నమాట.
ఆటిని అదేంటబ్బా... ఆ... మానిఫెస్టో అంటార్లే. అందులో రాసిన వాగ్దానాలు సిట్లం కట్టేసాయన్నమాట.
అందుకే ముత్యాలు లేవు... అంతా పొగే" అన్నాడు.
ఇంతలో పిల్లలు "నానోయ్...
కాకరపూవొత్తులు" అంటూ సంచీలోంచి పెట్లు తీశారు. గబగబా దీపం
దగ్గరకి వెళ్లి ముట్టించారు. అవి కాసేపు వెలిగి ఆరిపోయాయి. తర్వాత ఉన్నట్టుండి
వాటంతట అవే అంటుకుని చిటపటలాడాయి. కాసేపు ఎర్రగా, కాసేపు ఆకుపచ్చగా రంగులు మారి
మధ్యలోనే ఆరిపోయాయి.
"ఇయ్యెక్కడి కాకరపువ్వొత్తులు మావా?" అంది భార్య.
"సర్లెయ్యే... సర్కారు పథకం అనగానే
అనుకున్నాను, ఇట్టాంటిదేదో
జరుగుతాదని. కొలువు దీరి రెండేళ్లు దాటాయి. ఓ పద్ధతి లేదు పాడూ లేదు. రోజుకో రంగు
మారుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రంగులు మారుత్తారో. ఆళ్లు సేసిన కాకరపువ్వొత్తు
అలా కాక ఇంకెలా వెలుగుద్ది సెప్పు?" అన్నాడు.
"నానోయ్! చూడు ఎంత పెద్ద భూచక్రమో..." అంటూ పిల్లలు
సంబరంగా తెచ్చారు. సామాన్యుడు దాన్ని తీసుకుని చూస్తే దాని మీద అదానీ గ్రూప్ తయారీ
అని ఉంది.
"ఒరే... ఇది మాత్రం భలే తిరుగుద్దిరా.
గేరంట్రీ..." అన్నాడు. పిల్లలు వెలిగించగానే అది నిప్పులు
చిమ్ముకుంటూ గిరగిరా తిరుగుతూ అక్కడ భూమంతా తిరుగుతూ సందడి చేసింది.
"ఇదేటి మావా! ముందే ఎలా సెప్పేశావ్...
ఇది బాగా తిరుగుద్దని?" అంది భార్య.
సామాన్యుడు నిట్టూర్చి చెప్పాడు... "మరి కాదంటే? దాని మీద రాసుంది గందా అదానీ అని?
నిన్నటికి నిన్న విశాఖ పట్నంలో 130 ఎకరాలు రాసిచ్చేసారు
మన సర్కారోళ్లు. మొన్నటికి మొన్న గంగవరం ఓడరేవులో పాగా వేసిందీళ్లే గదా. మరాళ్ల
పేరుతో సేసిన భూసెక్రం ఊరుకుంటదేటి?
ఎక్కెడెక్కడి భూములూ సుట్టబెట్టేయదూ? అందుకనే
సెప్పగలిగా".
"కానీ మావా! అలా ఆళ్లు భూములు తీసుకుని
ఏవో అభివృద్ధి సేశారనుకో. మంచిదేగందా మరి?"
"సూద్దారే ఏం జరుగుద్దో? ఆళ్లు ఏం సేత్తారనేది తర్వాతి
ఇసయం. ముందయితే కోట్లకు కోట్లు ఖరీదు సేసే ఎకరాలకెకరాలు పట్టేశారనేదే గందా
పాయింటు? ఏంటతావ్?"
"నానేటంటాను... నువ్వేటంటే నానూ అదే అంటాను"
ఇంతలో పిల్లలు పరిగెత్తుకు వచ్చారు... "అమ్మోయ్...
నానోయ్... తారాజువ్వలు కూడా ఉన్నయే" అంటూ తెచ్చారు.
సామాన్యడు వాటిని తీసుకుని చూస్తే వాటి మీద నవరత్న
బ్రాండ్ అని ఉంది.
పిల్లలు ఓ జువ్వ తీసి వెలిగించారు. అది ఆకాశంలోకి
ఎగిరినట్టే ఎగిరి మళ్లీ కిందకి దూసుకొచ్చి సామాన్యుడి జేబులోకి దూరిపోయింది.
"ఓర్దీనెవ్వ..." అంటూ సామాన్యుడు కంగారు పడి, దులుపుకునే సరికి జేబంతా చిల్లులు.
"ఇయ్యేం జువ్వలు మావా? పైకెళ్లడం మానేసి మనమీదకొచ్చి పడతన్నయేంటి?" అంది భార్య.
"అదంతేలేయే.. మన సర్కారోళ్లు ప్రవేశ
పెట్టిన నవరత్న పథకాల్లాగే మరి! ఎక్కడెక్కడ లేని అప్పులూ సేత్తా, ఆ సొమ్మంతా మళ్లిస్తా,
కొందరికి సొమ్ములు పంచినట్టే పంచుతున్నారా? ఆ
వంకెట్టుకుని గొప్పగా జబ్బలు కొట్టుకుంటున్నరా? కానీ నిజానికి జరుగుతున్నదేంటి?
ఆ పథకాల వల్ల మన జేబుకే సిల్లలు పడుతున్నాయి. ఓట్ల కోసం పందేరం
సేసే సొమ్ముల్ని రాబట్టుకోడం కోసరం,
ధరలు, పన్నులు పెంచేత్తన్నారా లేదా? చివరాకరికి చెత్త మీద కూడా పన్నులేసేత్తన్నారు
కదే? మద్యం మావే అమ్ముతామంటా మొదలెట్టి నాసిరకం మందు పోత్తన్నారు.
ఇక ఇసక సంగతి సెప్పాలా? ఓల్సేలుగా ఆళ్లకి కావలసినోళ్లకి
అప్పజెప్పేశారు. ఇప్పుడది దొరకడమూ గగనమే, ధరా గగనమే.
ఇలా ఒకటా రెండా... అన్నీ మన జేబులకి సిల్లులే గదే? మరా తారుజువ్వ
కూడా అదే సేసింది సూడు..." "అబ్బ... ఎంత పెద్ద చిచ్చుబుడ్డో చూడు
నాన్నా..." అంటూ పిల్లలు తెచ్చి నేల మీద పెట్టి వెలిగించారు.
అది మొదట బుస్సుమంటూ వెలిగి ఆనక వెనక నుండి
చీదేసింది.
"ఇదేంటి మావా? బజార్లోంచి తెస్తే ఎంత చిన్న
చిచ్చుబుడ్డయినా అంతెత్తున వెలుగులు సిమ్ముతాది. మరిందింత పెద్దగా ఉన్నా సీదేసిందేటి?" అంది భార్య.
"మరేదేనే... సూడ్డానికి మన సర్కారోళ్ల
ప్రచారంలాగా పెద్దగా, మెరుపు కాగితంతో సుట్టబెట్టి ఉందా? తీరా చేసి ముట్టించాక ఏమైందో సూశావుగా?
ఈ రెండేళ్లలో ఏం జరిగిందో, అదే మరి! సభల్లో,
సొంత పత్రికల్లో సెప్పేదీ, రాసేదీ బాగానే ఉంటది.
కానీ సుట్టూ సూత్తే అంతా గందరగోళం. ఇంటి నుంచి బయటకెళితే రోడ్లు కూడా బాగోవు.
సెప్పేది కొడంత...సేసేది గోరంత. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడతాయో తెల్దు. పెద్దోళ్లకి
పింఛన్లు ఎప్పుడొస్తాయో తెల్దు. ఇక రైతన్నల సంగతి మరీ దారుణం. గిట్టుబాటు ధరల్లేవ్.
ధాన్యం కొన్న డబ్బుల బకాయిలు రావు. దేశం మొత్తం మీద ఆత్మహత్యలు సేసుకుంటున్న రైతన్నల
ఇసయంలో మన రాట్రం మూడో స్థానంలో ఉందంట. ఇలా ఎవుళ్ల జీవితాలు బాగుపడ్డాయి సెప్పు?
ఆఖరికి ఓ రాజధాని కూడా లేకుండా బతుకులు ఈడుస్తున్నాం. అమరావతి కోసం
భూములిచ్చిన రైతు బాబాయ్‌లంతా అలో లచ్చనా అంటా ఏడత్తన్నారు. పిలగాళ్లకి ఉద్యోగాలు
లేవు. కొలువులిచ్చే పరిశ్రమలు లేవు. రావు. ఆఖరికి సాయం మీద సదూకునే పిలగాళ్లకి
కూడా జెల్లకొడుతోందీ సర్కారు. మరలాంటోళ్లు పంచిపెట్టి సిచ్చుబుడ్లు సీదేయకేంజేస్తాయే?"
"నాన్నా... బాణసంచా అయిపోయింది. కానీ సీమటపాకాయలు, బాంబులు ఇవ్వలేదేంటి నాన్నా?" అంటూ వచ్చారు
పిల్లలు.
"అవన్నీ పేలేవి కదరా అందుకని ఇచ్చుండరు
పొండి" అంటూ పిల్లల్ని పంపేసిన సామాన్యడు భార్య కేసి
తిరిగి, "ఈ సర్కారోళ్ల
బాణసంచాలో వేరే పేలేవెందుకులే. ఎగస్పార్టీవోళ్ల మీద ఎమ్మెల్యేలు, మంత్రులు విరుచుకుపడుతూ తిట్టే
తిట్లే సీమటపాకాయలు. సమస్యల మీద నోరెత్తిన వాళ్ల మీద అన్నాయంగా బనాయించే కేసులే
బాంబులు. ప్రశ్నించే వాళ్ల మీద అనుచరులతోను, పోలీసులతోను
చేయించే దాడులే థౌజండువాలాలు... ఏమంటావే?" అన్నాడు.
"బాగానే ఉంది సంబడం... ఇక మన బతుకుల్లో
దీపావళి ఎప్పుడు మావా?" అంది భార్య.
"వస్తుందే... అసలైన దీపావళి వస్తుంది.
మనలాంటి సామాన్యులంతా సుట్టూ ఏం జరుగుతోందో గమనించి, బాగా ఆలోసించుకుని ఓటేసే రోజులొత్తాయి
సూడు అప్పుడొస్తాది నిజమైన దీపావళి..."
****
"ఏటి మావా? నిజమైన దీపావళి అంటూ కలవరిత్తన్నావు? వెళ్లి పిల్లలకి కూసిన్ని కాకరపువ్వొత్తులు
తే" అంటూ భార్య లేపుతుంటే మెలకువ వచ్చింది సామాన్యుడికి.
"ఓస్దీనెవ్వ... ఇదంతా కలన్నమాట" అనుకుని
నిట్టూరుస్తూ బజారు కేసి నడిచాడు సామాన్యడు!
-సృజన
PUBLISHED ON 31.10.2021 ON JANASENA WEBSITE
"ఏం చెప్పమంటారు గురూగారూ! మా అపార్ట్‌మెంట్లో
పార్కింగ్ దగ్గర గొడవొచ్చిందండి. మా పక్కింటాయన నా మీద నోరు పారేసుకున్నాడండి...
ఆ గొడవ నుంచి నేరుగా ఇలా వచ్చానండి..."
"ఏమన్నాడ్రా ఆయన? తిట్టాడా?"
"ఆయ్... అవునండి... దగుల్బాజీ, బోసిడీకే, లమ్డిక్కే, జఫ్పా, లోఫర్,
మాదచ్చోద్, బంఛత్, బడాచోర్,
బడుద్దాయ్... ఇలా రకరకాల మాటలన్నాడండి..."
"ఇంతకీ ఆ గొడవకి కారణం ఏంటి?"
"నిజం చెప్పాలంటే నాదే తప్పండి. ఆయన పార్కింగ్
ప్లేస్‌కి అడ్డంగా నా వెహికిల్ పెట్టానండి... అందుకనే నోరు మూసుకుని చక్కా వచ్చానండి...
అయినా ఆ దరిద్రపు తిట్లేంటండీ బాబూ..."
గురువుగారా అంతావిని పడక్కుర్చీలో తాపీగా జారగిలపడి
కళ్లు అరమోడ్పుగా పెట్టుకుని, తాపీగా చెప్పారు, "ఒరేయ్... తిట్లని తిట్టకురా... తిట్లు
ఎంతో పవిత్రమైనవివరా..."
"ఊరుకోండి గురూగారూ! తిట్లు పవిత్రమైనవేంటండీ? మీరన్నీ అడ్డదిడ్డంగా చెబుతారు..."
"ఓరి... నా వెర్రి శిష్యా! నా దగ్గర ఇన్నాళ్ల
నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నావు కానీ నీకు తిట్ల ప్రయోజనం ఏమిటో తెలియకపోతే
ఎలారా?"
"తిట్లకి ప్రయోజనం ఏంటి గురూగారూ? నాక్కాస్త అర్థమయ్యేలా చెప్పండి..."
గురువుగారు నవ్వి, "ఒరే... నీకు గానీ రాజకీయ పురాణంలో తిట్ల
కాండ గురించి తెలిసి ఉంటే... ఇలా మొహం కందగడ్డలా పెట్టుకుని నా దగ్గరకి దిగాలుగా
వచ్చే వాడివి కావురా... పైపెచ్చు నీ పక్కింటాయన్నే బెంబేలెత్తించేసే వాడివి... అర్థం
అయిందా?"
"ఎలా అర్థమవుతుందండీ? తప్పేమో నావైపు పెట్టుకుని,
ఆయన్ని బెంబేలెత్తించడమేంటండీ? అడ్డగోలు వ్యవహారం
కాకపోతేనూ?"
"అదేరా మరి, రాజకీయ కిటుకు! నీ చుట్టూ జరుగుతున్న
రాజకీయ తతంగాన్ని గమనించకుండా ఒట్టి వెర్రిబాగులోడిలా వచ్చేస్తే ఎలారా?
ఇప్పుడు నీ పరగణాలో తిట్ల చుట్టూనే కదరా రంజైన రాజకీయం నడుస్తుంట?"
"సరే... సార్! నాకంత తెలివే ఉంటే, మీ దగ్గరకి రాజకీయ పాఠాలకి
ఎందుకొస్తానండీ? మరింతకీ నేనేం చేస్తే మా పక్కింటాయన బెంబేలెత్తిపోయేవాడో
చెప్పండి..."
"ఏం చేయాలా? వెంటనే ఆయన ఇంటికి వెళ్లి అద్దాలు పగలగొట్టాలి... ఫర్నిచర్ ధ్వంసం చేయాలి...
నానా విధ్వంసం సృష్టించాలి... అంతే కాదు ఆయన
బంధువుల ఇళ్లకి నీ వాళ్లని పంపించి వాళ్ల ఇళ్లపై కూడా దాడి చేయాలి... ఆపై నీ అపార్ట్‌మెంటు
వాళ్లందరినీ పిలిచి ఆయన తిట్ల వెనుక అందరూ మర్చిపోయిన అర్థాలను వెతికి,
అవన్నీ ఏడుపు మొహం పెట్టుకుని వివరించి, సానుభూతి
కూడా సంపాదించాలి... అక్కడితో ఆగకూడదొరేయ్... ఆయన మీద కేసు పెట్టి జైలుకి కూడా
పంపించాలి... అర్థమైందా?"
"అయ్యబాబోయ్... అంత ఘోరమా? ఆయన తిట్టడం కరెక్ట్ కాకపోవచ్చు
సార్... కానీ అసలు తప్పు నాదే కదండి? మరి ఆయన ఇంటిని ధ్వంసం
చేస్తే అది ఇంకా నేరమవుతుంది కదండీ?
పైగా ఆయన బంధువులు ఏం చేశారండీ పాపం... ఆయనేదో ఆవేశంలో తిడితే,
చేతనైతే నేనూ తిట్టాలి కానీ, ఇంతగా రెచ్చిపోతే
అది నీచం కదండీ? పైగా
నేనే నేరం చేసి కేసు పెట్టడం ఏంటండీ?
దారుణం కాకపోతేనూ?"
"ఓరోరి బుర్రలేని శిష్యా! మరి నీ రాష్ట్రంలో
జరిగింది అదే కదరా? మీ ముఖ్యమంత్రిని ఎవడో ఏదో అన్నాడని
తెలుసు కదా? అప్పుడేమైంది? ఆయన అనుచరులంతా
వీరంగం ఆడలేదూ? ఓ పథకం
ప్రకారం ఎగస్పార్టీ ఆఫీసులన్నింటిపైనా దాడులు చేయలేదూ? అక్కడితో
ఆగారా? ఆ తిట్టినాయనపై పోలీసు కేసు పెట్టి జైల్లోకి తోయలేదూ?
మరి ఇవన్నీ తిట్లతో సమకూరిన ప్రయోజనాలే కదరా? ఇదంతా మర్చిపోయి నువ్వు మొహం ఎర్రగా చేసుకుని వచ్చేస్తే ఎలారా? ఇలాగైతే నువ్వు రాజకీయాల్లో ఎప్పుడు ఎదుగుతావు? నువ్వే చెప్పు?"
శిష్యుడు బుర్ర గోక్కున్నాడు... ఆనక వెర్రిమొహం
పెట్టుకుని, "అవునండోయ్...
మీరు చెప్పిందంతా నిజమే... కానీ నాదొక సందేహమండి... ఎంత రాజకీయాలైనా ఉచితానుచితాలు
మర్చిపోయి ఇలా తిట్టడం తప్పు కాదంటారా?"
"కచ్చితంగా తప్పేరా... నీ పక్కింటాయన నిన్ను తిట్టినా, నీ ముఖ్యమంత్రిని ఎగస్పార్టీ
వాడు తట్టినా రెండూ తప్పే. కానీ నువ్వు గమనించాల్సింది అది కాదురా... ఆ తిట్టుని
అడ్డం పెట్టుకుని ఎంత డ్రామా జరిగిందో అది చూడాలి. ఎదుటి వాడు తిడితే దాన్ని రాజకీయంగా
ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో గమనించాలి.
ఆ తిట్టుని పదే పదే పలుకుతూ, దాని వెనుక ఉన్న అర్థాన్ని
విడమర్చి చెబుతూ, మొహం అమాయకంగా పెట్టుకని జనం సానుభూతిని
ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకనే తిట్లు
పవిత్రమైనవని నేనన్నాను... ఇప్పటికైనా అర్థమైందా?"
"అర్థమైంది కానీ గురూగారూ, మీరు నన్ను మా పక్కింటాయన ఇల్లు,
ఆయన బంధువుల ఇళ్లు కూడా ధ్వంసం
చేసి ఉండాల్సిందంటున్నారు కదా? మరి అది నేరం కాదంటారా?"
"దాందేముందిరా? ఆయన తిట్టిన తిట్లకి నాకు బీపీ
వచ్చేసిందీ, ఆ బీపీ వల్ల ఏం చేస్తున్నానో తెలియలేదూ అంటే సరి...
మరి మీ సీఎంగారు తన పార్టీ వారు చేసిన దాడుల్ని అలాగే సమర్థించుకోలేదూ?
యథారాజా... తథాప్రజా అన్నారు కదా? అలాగన్నమాట..."
"కానీ... రేప్పొద్దున్న ఇలా ప్రజలందరూ
మాకు బీపీ పెరిగింది కాబట్టే ఎదుటివాడిని కొట్టేశాం, వాడిల్లు కూలగొట్టేశామంటూ రెచ్చిపోతే
రాష్ట్రంలో శాంతిభద్రతల మాటేమిటండీ?"
"ఓరే...నువ్వొక నీచ రాజకీయ నేతగా ఎదిగాక, ఇక శాంతి భద్రతల ఊసు నీకెందుకురా? ఈ వ్యవహారం నుంచి నువ్వు నేర్చుకోవలసింది,
తిట్ల కాండలో తిరకాసు అధ్యాయం... తెలిసిందా?"
"తెలిసింది కానీండీ, ఇంతకీ మీరు తిట్లని సమర్థిస్తున్నారా?"
"అస్సలు కాదురా... కానీ నువ్వు, నీ వాళ్లు ఎప్పుడూ ఎవర్నీ తిట్టలేదా?
ఎవర్నీ తిట్టకుండానే ఇంత వాడివైపోయావేంట్రా? మళ్లీ నీ రాష్ట్రం దగ్గరకే వద్దాం... తాజాగా ఈ తిట్ల వ్యవహారానికి సంబంధించిన
కేసుపై హైకోర్టు ఎలాంటి ఘాటు వ్యాఖ్యానాలు చేసిందో గుర్తుకు తెచ్చుకో... గౌరవం,
ప్రతిష్ఠలు ముఖ్యమంత్రికే కాదు, అందరికీ ఉంటాయనలేదూ? రాజ్యాంగబద్ధ వ్యవస్థలు,
న్యాయమూర్తులను దూషిస్తున్నవారి విషయంలో చర్యలు తీసుకునేందుకు ఉత్సాహం
చూపని పోలీసులు, ఈ విషయంలో ఎందుకింత అత్యుత్సాహం చూపించారని చురకలేయలేదూ?"
"అవునండోయ్... కానీ గురూగారూ, ఇంతకీ ఇందులో నేర్చుకోవాల్సిన
రాజకీయ పాఠం ఏంటండీ?"
"అలారా పాయింట్లోకి... ఇప్పుడు చెబుతాను
రాసుకో, రాజకీయ పురాణంలో
తిట్ల కాండ ప్రయోజనం. నువ్వు రాజకీయంగా ఎదిగే వరకు ఎగస్పార్టీ వాడిని నోటికొచ్చినట్టు
తిట్టు. ఆ తిట్ల ద్వారా ప్రజల మనసును ఏమార్చడానికి ప్రయత్నించు. నీకు అధికారం
అంది కుర్చీ ఎక్కాక, ఎవరైనా నీ మీద పల్లెత్తు మాటన్నా సహించకు.
విరుచుకు పడు. దాడులు చేయించు. కేసులు పెట్టు.
అరెస్టులు చేయించు. దెబ్బకి నిన్ను మరెవడైనా ఏమైనా అనడానికి కూడా భయపడిపోయేలా,
బెంబేలెత్తిపోయేలా చెయ్యి. ఇంత చేసి కూడా ఎదుటివాడు తిట్టిన తిట్లను
అడ్డం పెట్టుకుని ప్రజల ముందు ఏడుపు మొహం పెట్టుకుని ఆ తిట్ల అర్థాలు వివరించి మరీ,
సానుభూతిని పొందు. ఇలా చేస్తే నీకిక తిరుగుండదు. ఓ నికార్సయిన నీచ
నేతగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతావు. బుర్రకెక్కిందా?"
"ఓ... భేషుగ్గా గురూగారూ! ఇక వస్తానండి...
అర్జెంటుగా తెలుగు నిఘంటువు కొనుక్కోవాలి..."
"అదెందుకురా?"
"మా పక్కింటాయన తిట్టిన తిట్లకు అందరూ
మర్చిపోయిన అర్థాలు వెతకడానికండి... వాటిని
తెలుసుకుని మా అపార్ట్‌మెంట్లో మీటింగెట్టి ఊదరగొడతానండి... ఆయ్!"
"శెభాష్... పోయిరా!"
-సృజన
అమ్మలగన్నయమ్మ... ముగురమ్మల మూటపుటమ్మ...
కరుణించు కాపాడు కనకదుర్గమ్మ!
ఆంధ్ర రాష్ట్రాన అల్లాడుచున్నట్టి సామాన్య జనులను
కానవమ్మ!
అష్టకష్టాల కార్చిచ్చులో చిక్కి అణగారుతున్నట్టి
ప్రజలమమ్మ!
నమ్ముకున్నట్టి మా పాలకులు మమ్ములను నట్టేటలో
ముంచి నవ్వుతున్నారమ్మ!
ఓటేసి గెలిపించి అందలాలెక్కించి ఆశపడిన మమ్ము
వెక్కిరించారమ్మ!
పాదయాత్రలు చేసి పాకులాడారమ్మ...
ఊరూరు తిరుగుతూ ఊరించినారమ్మ...
ఏడవకపోయినా ఓదార్చినారమ్మ...
తలలు నిమిరి మమ్ము ముద్దాడినారమ్మ...
బుగ్గలను తడుముతూ బులిపించినారమ్మ...
మెత్తగా నవ్వుతూ మోసగించారమ్మ...
ఒక్క ఛాన్స్ ఇమ్మంటు వేడుకున్నారమ్మ...
గెలిపించితే చాలు స్వర్ణయుగమును తెచ్చి నట్టింట
నిలుపుదుమని నమ్మించినారమ్మ!
ఆ మాటలను నమ్మి అధికారమందించి నిలువునా నట్టేట
మునిగిపోయితిమమ్మ!
ఎక్కడికి పోదుము, ఏమి చేయుదమమ్మ... ఇక్కట్ల
ఊబిలో చిక్కుకున్నామమ్మ!
ఎటు చూసినా బతుకు బస్టాండుగా మారి... బితుకు
బితుకుమంటు మిగిలినామమ్మ!
పింఛన్లలో కోత... జీతాలకే వాత... ఎవ్వరిని
చూసినా నవ్వు లేదమ్మ!
చెప్పుకుందామంటె దిక్కులేదమ్మ...నోరెత్తితే చాలు
దాడి చేస్తారమ్మ!
గూండాలు,
రౌడీలు పెచ్చరిల్లారమ్మ!
కండబలమును చూపి కసురుతున్నారమ్మ!
సర్కారు కొలువులని బిడ్డలను ఊరించి... ఉత్త
చేతులు చూపి ఊరుకున్నారమ్మ!
ఫ్యాక్టరీలను తెచ్చి ప్రగతి తెచ్చెదమంటు కోతలెన్నో
కోసి ఆశపెట్టారమ్మ!
వాస్తవానికి చూడ ఉట్టి మాటలమ్మ... ఉన్నవన్నీ
కూడ ఊడిపోయాయమ్మ!
అభివృద్ధి బాటలను అడుగునా పరిచి అదరగొడతామంటు
ఊరించినారమ్మ...
కళ్లు తెరిచి చూడ ఉన్న దారులు కూడ గోతులమయమై
గొల్లుమన్నాయమ్మ!
అడుగుపెడితే చాలు కస్సుమని గాయాలు... వాహనాలను
నడప వీలులేదమ్మ!
రోడ్ల దుస్థితి చూసి బాగుచేయాలంటు అడిగినా చాలమ్మ...
అగచాట్లు మొదలమ్మ!
రౌడీలతో కొట్టి, గూండాలతో బాది... అక్రమంగా కేసులు
అంటగడతారమ్మ!!
ఏవేవొ పథకాలు రచియించి వంచించి... అడ్డదారిన
దుడ్లు దుళ్లగొట్టారమ్మ...
ఇచ్చినట్టే ఇచ్చి పన్నులెన్నో పెంచి... జేబులో
డబ్బులను గుంజుతున్నారమ్మ!!
అప్పులెన్నో చేసి పద్దులను మళ్ళించి... రాష్ట్రాన్ని
దివాళా తీయించినారమ్మ!
అగచాట్ల సాగులో అన్నదాతలు చూడ... అణగారి దిగజారి
జావగారారమ్మ...
కోట్లాది సొమ్ములను బకాయి పడిపోయి... రైతన్నలకు
మొండి చెయ్యి చూపారమ్మ!
ప్రత్యేక హోదాను పట్టి తెచ్చెదమంటు... ప్రగల్భాలనెన్నొ
పలికినారమ్మ...
చీటికిని మాటికిని దిల్లీకి వెళ్లొచ్చి... వట్టి
చేతులు చూపి వెక్కిరించారమ్మ!
రాజధానిని మార్చి రాజిల్లుతామంటు... మూడు ముక్కల
ఆట ఆడుతున్నారమ్మ...
భూములిచ్చిన రైతు సోదరులను వంచించి... మొండిచెయ్యిని
చూపి ముంచినారమ్మ!
పాలకులను చూడ ఆడింది ఆటగా పాడింది పాటగా గడుపుతున్నారమ్మ...
అయినవారికి ఆస్తిపాస్తులను అందించి... అవినీతి
మడుగులో ఈదుతున్నారమ్మ!
భూములను సెజ్‌లను బడాబాబులకు పంచుతూ... వ్యాపార
వాటాలు మరిగినారమ్మ!
మాఫియా గ్యాంగుతో మాటు చాటున చేరి... మత్తులో
యువతను ముంచుతున్నారమ్మ!
ఓ తల్లి మా తల్లి మా కల్పవల్లి... మా అగచాట్ల
జాబితా అంతుపట్టనిదమ్మ...
మా కష్టాల లిస్టంత మొరపెట్టలేమమ్మ... మముగాచి
మా బాధ తీర్చు పెద్దమ్మ!
మనసున్న నేతలను గుర్తించి ఎన్నుకొను ఇంగితము
మాకిచ్చి ఈడేర్చుమమ్మ!
ఒక్కొక్క ఓటరూ జనసైనికుల రీతిలో చెలరేగు జాగృతిని
అందీయవమ్మ!
అవినీతి పాలకుల మహిషారులను తరుము... ధైర్యమ్ము
మాకిచ్చి కావుమమ్మ!
అప్పుడే నిజమైన విజయదశమి కదమ్మ... ఆనాడు
దసరాను జరుపుకుంటామమ్మ!!
-సృజన
PUBLISHED ON 09.10.2021 ON JANASENA WEBSITE