ఆదివారం, మార్చి 06, 2022

మూడు ముక్క‌లాట‌లో ముచ్చ‌టైన సూత్రాలు!



 “ఏంట్రా అలా ఈసురోమన్న‌ట్టున్న‌వేం?” అని అడిగారు గురువుగారు, నీర్సంగా కాళ్లీడ్చుకుంటూ వ‌చ్చి చ‌తికిల‌బ‌డిన శిష్యుడిని చూసి.

శిష్య‌డు నిట్టూర్చి, “ఏం లేదు సార్‌. చిన్న కోర్టు వ్య‌వ‌హార‌మండి. బెడిసికొట్టిందండి...” అన్నాడు.

“ఓసింతేనా? దానికే బెంబేలు ప‌డితే ఎలా? ఇంత‌కీ ఏమైంది?”

“ఏముందండీ... మ‌న‌కి వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చిందండి...”

“ఒరే... మ‌నం ఎద‌వ ప‌న్లు చేశాక తీర్పులు అలాగే ఎదురుతిరుగుతాయిరా... దానికే నీరుగారిపోతే ఎలా?”

“మీకేమండి సార్‌... ఎన్న‌యినా చెబుతారు. తీర్పు విన‌గానే ప్రాణం చ‌చ్చిపోయిన‌ట్ట‌నిపించిందండి. ప‌రువు మొత్తం ఊడ్చుకుపోయిన‌ట్టే క‌దండి మ‌రి? ఛ‌... ఇంత బ‌తుకూ బ‌తికి ఇంటెన‌కాల చ‌చ్చిన‌ట్టు అనిపించిందండి. పైగా గెలిచినోళ్లు సంబ‌రాలండి... త‌లెత్తుకోలేక‌పోతున్నానండి...”

“ఓరి నా వెర్రి శిష్యా... నువ్వు నా ద‌గ్గ‌ర‌కి ఎందుకొస్తున్నావురా, అది చెప్పు ముందు...”

“రాజ‌కీయాలు నేర్చుకుందామ‌నేక‌దండీ, అయితే ఏంటండీ?”

“ఏంటంటావేంట్రా? పోలిటికల్ లీడ‌ర్‌గా ఎద‌గాల‌నుకునేవాడివి, ఇలా సిగ్గు ప‌డితే ఎలారా? సిగ్గూ శ‌రం, మానం అభిమానం... ఇలాంటివ‌న్నీ వ‌దిలేస్తేనే క‌ద‌రా నికార్స‌యిన నీచ నేత‌గా ఎదిగేది? ఇంత చిన్న విష‌యం నీకింకా ఒంట‌బ‌ట్ట‌కపోతే ఎలారా?”

“ఊరుకోండి సార్‌... పాఠాలు వేరు, ప్ర‌తిష్ఠ వేరండి... అదే పోతే ఎంత అప్ర‌తిష్ఠండీ?”

“ఒరే... నువ్వు రాజ‌కీయ నేత‌గా ఎదిగాక చేసేవ‌న్నీ అప్ర‌తిష్ట‌క‌ర‌మైన ప‌నులే క‌ద‌రా? అప్పుడే క‌దా నువ్వు అస‌మాన అసాధార‌ణ అధ‌మాధ‌మ నాయ‌కుడిగా చ‌రిత్ర‌లో మిగిలిపోతావు? ఏదో ఒక చిన్న కేసుకే ఇలా మ‌ధ‌న ప‌డిపోతే రేప్పొద్దున్న ఏ ముఖ్య‌మంత్రో అయి, నీ నికృష్ట ఆలోచ‌న‌ల‌న్నీ అమ‌లులో పెట్టేట‌ప్పుడు ఇంకెన్ని కేసులు ఎదుర్కోవాల్సి వ‌స్తుందో, మ‌రెన్ని తీర్పులు నీకు వ్య‌తిరేకంగా వచ్చి వెక్కిరిస్తాయో అది ఆలోచించు ముందు... అర్థ‌మైందా?”

“అర్థ‌మైంది కానీ గురూగారూ, ఇప్పుడు న‌న్నేం చేయ‌మంటారండీ?”

“ఏముందిరా... ఈ కోర్టు తీర్పును స‌వాలు చేస్తూ పైకోర్టుకెళ్లు. అక్క‌డా చుక్కెదురైతే రివిజ‌న్ పిటీష‌న్ త‌గిలించు. అక్క‌డా ఓడిపోతే స్పెష‌ల్ బెంచ్‌కెళ్లు. అక్క‌డ కూడా నీ ఎద‌వ ప‌నులు బ‌య‌ట‌ప‌డిపోయాయ‌నుకో, ఏకంగా ఆ తీర్పునిచ్చిన న్యాయ‌మూర్తుల మీద‌నే పిటీష‌న్ వేసెయ్యి. వాళ్లు ఈ కేసులో తీర్పులివ్వ‌డానికి అనర్హుల‌ని ఏవేవో కార‌ణాలు చూపించు...”

“అయ్య‌బాబోయ్ గురూగారూ! మీ బుర్ర‌లో ఇన్ని నీచ ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయండీ? మీ అంత‌రంగంలో ఊరుతున్న నికృష్ట ఉపాయాలు వింటుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోందండి... ఎంత‌యినా మీకు మీరే సాటి గురూగారూ! అస‌లింత‌కీ మీరు ఇంత‌లేసి రాజ‌కీయాలు ఎక్క‌డ నేర్చుకున్నారండీ?”

“ఓరేయ్‌... నీ పొగ‌డ్త‌లు ఆపు. న‌యా నీచ రాజకీయ నేత‌ల ముందు మ‌న‌మెంత‌? మ‌న తెలివితేట‌లెంత‌రా? చుట్టూ జ‌రుగుతున్న స‌మ‌కాలీన రాజ‌కీయం గ‌మ‌నిస్తే ఇలాంటి అద్భుత అకృత్యాల‌న్నో అవ‌లీల‌గా ఔపోస‌న ప‌ట్టొచ్చురా స‌న్నాసీ... కాబ‌ట్టి ముందు నీ ప‌ర‌గ‌ణాపై ప‌రిశీల‌న పెంచుకో. ఆపై నువ్వే నాకు పాఠాలు చెప్ప‌గ‌ల‌వు...”

“ఆ... అర్థ‌మైంది గురూగారూ! మీరు చెబుతున్న‌ది తాజాగా  అమ‌రావ‌తిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించే క‌దండీ?  నాకు న్యాయవ్య‌వ‌స్థ మీద గౌర‌వం అమాంతం పెరిగిపోయిందండి. ఎంత స్ప‌ష్ట‌మైన తీర్పండీ? స‌ర్కారు వారి కుయ‌త్నాల మీద ఎన్ని వ్యాఖ్యానాలండీ? అస‌లంత స్థాయిలో ఎక్క‌డికక్క‌డ ఎండ‌గట్ట‌డం ఆ నేత‌ల‌కు ఎంత నామ‌ర్దా? ఎంత సిగ్గుచేటు? ప‌రువు గోదాట్లో క‌లిసిపోయి త‌ల‌లు భూమిలోకి దిగిపోయుంటాయండి... అస‌లు మ‌ళ్లీ త‌లెత్తుకుని ప్ర‌జ‌ల ముందుకు ఎలా రాగ‌ల‌రండీ పాపం?”

“ఓరి అమాయ‌కుడా? నువ్వెక్క‌డి సత్తెకాల‌పు స‌త్తెయ్య‌విరా? వాళ్ల మొహాల్లో అలాంటి భావాలేమైనా క‌నిపించాయిరా నీకు? ఎంచ‌క్కా విలేక‌రుల మైకుల ముందు మూతులెట్టుకుని ఎదురెట్టి వాగ‌లేదూ? రాష్ట్రంలో మూడు ముక్క‌లాట ఆగేది లేద‌ని మోర‌లెత్తుకుని మ‌రీ వ‌క్కాణించ‌లేదూ? అదిగో... ఆ తెగువ, ఆ తెంప‌రిత‌నమే నేర్చుకోవాలి నువ్వు. అస‌లీ వ్య‌వ‌హారాన్ని మొద‌టి నుంచీ గ‌మ‌నించావ‌నుకో, నీకు అడుగ‌డుగునా నీచ రాజ‌కీయ పాఠాలే క‌నిపిస్తాయి. ఏ స్థాయిలో అబ‌ద్దాలు ఆడ‌వచ్చో, ఎంత నీచంగా ప్ర‌చారాలు చేయ‌వ‌చ్చో, ఎంత బ‌రితెగించి బుకాయించ‌వ‌చ్చో... అన్నీ నేర్చుకోవాలి నువ్వు. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్నారు కానీ ఏమైనా నిరూపించ‌గ‌లిగారా? అంటే నీవ‌నుకున్న‌ది సాధించేందుకు ఎలాంటి నికృష్ట ఆరోప‌ణ‌ల‌కైనా వెనుకాడ‌కూడ‌ద‌ని అర్థం కావ‌డం లేదూ? ఓ వ‌ర్గం వారికే ప్ర‌యోజ‌నం క‌లిగిందంటూ ప్ర‌చారం చేశారు కానీ, అది అవాస్తవ‌మే క‌దా? అంటే అవ‌స‌ర‌మైతే నువ్వు కుల రాజ‌కీయాల‌ను కూడా ఎగ‌స‌న దోసి స‌మాజాన్ని తప్పుదోవ ప‌ట్టించ‌వ‌చ్చ‌ని తెలియ‌డం లేదూ? అస‌లా ప్రాంతం భారీ క‌ట్ట‌డాల‌కు ప‌నికిరాద‌ని, శ్మ‌శాన‌మ‌ని బుకాయించారే, దాన్ని బ‌ట్టి దుష్ప్ర‌చారాలు ఎలా చేయాలో నేర్చ‌కోవ‌ద్దూ? భూములిచ్చిన రైతులు పిడికిలి బిగించి ఉద్య‌మిస్తే ఏం చేశారో గ‌మ‌నించావ‌నుకో, నీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించే జ‌నాన్ని ఎలా రాచి రంపాన పెట్టొచ్చో సులువుగా గ్ర‌హించలేవూ? ఉద్య‌మం సాగిన 27 నెల‌ల్లో రైతుల‌పై ఏకంగా 3853 కేసులు బ‌నాయించారంటే, అడ్డ‌గోలుగా చ‌ట్టాన్ని ఎలా వాడుకోవ‌చ్చో తెలిసిపోదూ? శాంతియుతంగా ర్యాలీలు చేసే మ‌హిళ‌ల్ని కూడా ఈడ్చిపారేశారంటే పోలీసు వ్వ‌వ‌స్థ‌ని ఎంతలా దుర్వినియోగం చేయ‌వ‌చ్చో తేట‌తెల్లం కాదూ? ఏకంగా 807 రోజుల పాటు సాగిన ఉద్య‌మంలో 189 మంది మ‌ర‌ణించినా చ‌లించ‌లేదంటే, ఎంత మొండిగా అధికారాన్ని చెలాయించ‌వ‌చ్చో అర్థం కాదూ? ఆఖ‌రికి తీర్పు చెప్ప‌బోయే న్యాయ‌మూర్తుల్ని కూడా ఈ కేసుల విచార‌ణ నుంచి తొలగించాలంటూ అడ్డ‌గోలు పిటిష‌న్ వేయించారంటే, అవ‌స‌ర‌మైతే న్యాయ‌వ్వ‌వ‌స్థ‌పై కూడా బుర‌ద జ‌ల్లే న‌య‌వంచ‌క విధానాల‌కు వెన‌కాడ‌క్క‌ర్లేద‌నే సూత్రం స్ఫురించ‌డం లేదూ? ఇలా చూస్తే ఒక‌టా, రెండా... ఈ మూడు ముక్క‌లాటలో  నువ్వు నేర్చుకోగ‌లిగే ముచ్చ‌టైన నికృష్ట‌పాఠాలెన్నో లెక్క తేల్చ‌డం సాధ్యం కాదురా... భ్ర‌ష్ట రాజ‌కీయాల‌కు నీ ప‌ర‌గ‌ణా ఓ పెదబాల‌శిక్ష‌! వికృత రాచ‌కేళికి అదొక విజ్ఙాన స‌ర్వ‌స్వం! నీచ ప‌రిపాల‌నక‌దో నిఘంటువు! అడ్డ‌గోలు విధానాల‌క‌దో అడ్డా! దుష్ట చేత‌ల‌క‌దో ద‌ర్ప‌ణం! అరాచ‌కానికదో అద్దం! కాదంటావా చెప్పు?”

ఆ పాటికి శిష్య‌డు క‌ళ్లు తేలేశాడు.

“ఆపండి గురూగారూ... ఆపండి. ఇన్నేసి పాఠాలు ఒకేసారి చెప్పేస్తే నా బుర్ర తట్టుకోలేదండి. అస‌లింత‌టి అస‌మాన అద్వితీయ అకృత్యాల నేత‌గా ఎద‌గాలంటే నాకు ఎన్ని జ‌న్మ‌లు ప‌డుతుందో అర్థం కావ‌డం లేదండి. కానీ నాదొక సందేహం గురూగారూ! ఇలాంటి రాజ‌కీయాలన్నీ నేర్చుకుని అధికార పీఠం ఎక్కానే అనుకోండి, ఇన్నేసి ఎద‌వ‌ప‌నులు చేశానే అనుకోండి... మ‌రి ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌రంటారా? న‌న్నొక ద‌గుల్బాజీగా గుర్తు ప‌ట్టేసి సీటు దించేయ‌రంటారా?”

“అస్స‌లు అన‌నురా... ప్ర‌జ‌లు చాలా తెలివైన వారు. వాళ్లు నీ నిజ‌స్వ‌రూపం ప‌సిగ‌ట్టి త‌మ వ‌ద్ద‌నున్న ఓట‌నే వ‌జ్రాయుధంతో చీల్చి చెండాడుతారు. ప‌ర‌గ‌ణా ప‌రిధిలోంచి త‌రిమి త‌రిమి కొడ‌తారు. కానీ ఈలోగా నువ్వీ దారుణ రాజ‌కీయ పాఠాల సాయంతో త‌రాత‌రాలు త‌ర‌గ‌ని ప్ర‌జాధ‌నాన్ని దోచుకుంటావు క‌దా? అదే క‌దా నీకు కావ‌ల‌సింది?”

“అవునండోయ్‌... మీరు చెప్పిన‌ట్టు ఈ మూడు ముక్క‌లాట‌లో ముచ్చ‌టైన సూత్రాల‌న్నీ నేర్చేసుకుని నీచ రాజ‌కీయ ప‌ర‌మ‌ప‌ద సోపాన ప‌టంలో పాము తోక‌ప‌ట్టుకుని పైకి ఎగ‌బాకుతా! నిచ్చెన‌ల మీంచి నీతి నిజాయితీల‌ను తోసేస్తా!!”

“శెభాష్‌...ఇక పోయిరా!”

-సృజ‌న‌

PUBLISHED ON 5.6.2022 ON JANASENA WEBSITE

బుధవారం, మార్చి 02, 2022

దండాలు మ‌హాప్ర‌భో...దండాలు!


 

“ధిక్కార‌మును సైతునా...

అధికార ధిక్కార‌మును సైతునా...

ఎవ‌ర‌నుకుంటివి... ఏమ‌నుకుంటివి...

ఎంత‌టి వాడ‌ను నేన‌నుకుంటివి...

ఊరుకుందునా... ఊర‌క‌నుందునా...

ఊపిరి ఆపి ఊప‌కుందునా?

ఉక్కిరిబిక్కిరి సేయ‌కుందునా?

ధిక్కార‌మును సేతువా?

నా అధికార ధిక్కార‌మ‌నును సేతువా?

హ‌...హ్హ‌...హ్హ‌...హ్హా!”

-అంటూ రాజుగారు అంతఃపురంలో గెంతులు వేస్తున్నారు. అధికారులు, అమాత్యులు, సేవ‌కులు, ప‌రిచారిక‌లు బిక్క‌చ‌చ్చిపోయి నోరెళ్ల‌బెట్టి చూస్తున్నారు.

ఇంత‌లో వార్తాహ‌రుడు విన‌యంగా వంగి వంగి వ‌చ్చాడు.

“జ‌య‌ము జ‌య‌ము మ‌హారాజా...” అన్నాడు, వంచిన త‌లెత్త‌కుండా.

రాజుగారు పిచ్చి గెంతులు ఆపి, “ఆ... ఏమిటి విశేషాలు వార్తాహ‌రా? మ‌న పాల‌న గురించి ప్ర‌జలు ఏమ‌నుకుంటున్నారు?”

“కిక్కురుమ‌న‌డం లేదు మ‌హారాజా! కుక్కిన పేనుల మ‌ల్లే ప‌డి ఉన్నారు...”

“హ‌...హ్హ‌...హ్హ‌... బాగు బాగు... జ‌నుల జీవ‌నమెట్లు సాగుతున్న‌ది?”

“బెరుకుగా... బెంగ‌గా... భేషుగ్గా ఉంది ప్ర‌భూ...”

“బ‌హు బాగు... అట్లే ఉండ‌వ‌లె... ఎవ‌రూ త‌ల‌లెగ‌రేయ‌డం లేదు క‌ద‌?”

“ఎంత‌మాట ప్ర‌భూ! జ‌నం ఆకాశంలో మేఘాల‌ను, ప‌క్షుల‌ను కూడా చూడ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. కిమ్మ‌న‌కుండా వంచిన త‌ల ఎత్త‌కుండా త‌మ ప‌నులు తాము చేసుకుంటున్నారు... త‌ల ఎత్తిన‌చో ఎక్క‌డ శ్రీవారు ధిక్కార‌మ‌ని భావింతురోన‌ని వారి భ‌య‌ము... న‌డుము నెప్పి లేకున్న‌నూ వంగి వంగి న‌డుచుచున్నారు. లేనిచో త‌మ‌రు అవిధేయుల‌ని త‌ల‌చెద‌ర‌ని బెదురుచున్నారు...”

“ఆహా... ఆనంద‌మానంద‌ము... ప్ర‌జ‌ల‌ట్టే భ‌య‌భ‌క్తుల‌తో ఉండ‌వ‌లె... ఏమందువు?”

“ఏమందును ప్ర‌భూ... త‌మ‌రంటే భ‌య‌మున్న‌ది కాని భ‌క్తి సంగ‌తి సందేహ‌మే ప్ర‌భూ...”

“ఆ... ప‌నికి మాలిన భక్తి మ‌న‌కెందుల‌కు? ఇంత‌కూ నీవొచ్చిన కార‌ణంబేమి? ఏకాంత ఆనంద నృత్య విన్యాస‌మున‌కు అంత‌రాయ‌ము క‌లిగించిన‌దెందుల‌కు?”

“కార‌ణ‌మున్న‌ది ప్ర‌భూ... రాజ్య‌మున ఒక క‌ళాకారుడు క‌ల‌డు. ఆతండ‌న్న జ‌న సామాన్య‌ములో ఎన‌లేని అభిమాన‌ములున్న‌వి... ఆత‌డి క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ములున్న ఎడ‌ల జ‌నం ఒడ‌లు మ‌రిచి పోటెత్తుదురు ప్రభూ...”

“అటుల‌నా? ఆ క‌ళాకారుడెటువంటి వాడు?”

“ఝంఝూమారుత‌ములాంటి వాడు ప్ర‌భూ... ఆత‌డి మాట‌ల‌న్న జ‌నం చెవి కోసుకుందురు... ఆత‌డి ఆవేశ‌ము చూసి ఉప్పొంగిపోదురు...”

“అట్ల‌యిన ఆత‌డి ధ్యేయంబేమి?”

“జ‌న‌చైత‌న్య‌మే ప్ర‌భూ... రాజ్య‌మున జ‌రుగు అవ‌క‌త‌వ‌క‌ల‌ను అత‌డు ప్ర‌శ్నించును... స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చాటును... అరాచ‌క‌ముల ప‌ట్ల అప్ర‌మ‌త్తుల‌ను చేయును... పిడికిలి బిగించి పోరాడ‌మ‌ని పిలుపునిచ్చును... స్వ‌య‌ముగా స‌భ‌ల‌ను నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను ఉత్తేజితుల‌ను చేయును... వారి వెంట ఉండెద‌నంటూ తాను ముందుండి వారిని నడిపించును...”

“అంత‌టి ఘ‌నుడా? అట్ల‌యిన ప్ర‌మాద‌కారివ‌లె క‌నిపించుచున్నాడే? ఆత‌డి మాట‌లు ఆల‌కించి జ‌నం చైత‌న్య‌పూరితులైన‌చో మ‌న ఉనికికే భంగ‌ము వాటిల్లు అవ‌కాశ‌ము లేదందువా?”

“త‌ప్ప‌క ఉన్న‌ట్లే ప్ర‌భూ... మ‌న రాజ్య‌మున ప‌లు స‌మ‌స్య‌ల‌ను అత‌డు ఇప్ప‌టికే ఎత్తి చూపినాడు... ప్ర‌జ‌ల‌కు కార్యాచ‌ర‌ణ‌మును కూడా సూచించినాడు...”

“ఏమా స‌మ‌స్య‌లు? ఏమా కార్యాచ‌ర‌ణ‌ములు?”

“మ‌న రాజ్య‌మున గుర్ర‌ములు ప‌రెగెత్తుట‌కు సైత‌ము భ‌య‌ప‌డున‌టుల త‌యార‌యిన ర‌హదారుల గురించి జ‌న‌మును జాగృతుల‌ను చేసినాడు... ఆత‌డి సూచ‌న‌ల‌ను అనుస‌రించి జ‌నం ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌దారుల చిత్ర‌ముల‌ను ల‌క్ష‌ల కొల‌ది సేక‌రించి, వాటి దుస్థితి గురించి అనిత‌ర సాధ్య‌మైన ప్ర‌చార‌మును చేసినారు... వ‌లలు ప‌ట్టుకుని చేప‌ల వేట‌కు పోవుట‌యే కానీ తామే స‌మ‌స్య‌ల వ‌ల‌లో విల‌విల‌లాడుతున్నామ‌నే సంగ‌తి ప‌ట్ట‌ని మ‌త్స్య‌కారులను ఏకం చేసి వారిని సంఘ‌టిత‌ము చేసినాడు... వారి ఉపాధికి గండి కొట్టు త‌మ‌రి శాస‌న‌ము ప‌ట్ల విముఖ‌త‌ను ప్రోది చేసినాడు... వారిని పోరాట బాట ప‌ట్టించినాడు. శ్రీవారి నిష్క్రియాప‌రత్వ‌మును అడుగడుగునా ఎండ‌గ‌డుతున్నాడు... త‌మ‌రి పాల‌నా విధాన‌ముల‌లో లోప‌ముల‌ను వెలుగులోకి ఈడ్చుచున్నాడు... ప్ర‌భువుల అనిత‌ర సాధ్య‌మైన ప‌రిపాల‌న‌లో క‌ర్ష‌కులు, కార్మికులు, బ‌డుగులు, సామాన్యులు ఆఖ‌రికి ఉద్యోగులు సైతం ఎలా కునారిల్లుతున్నారో, ఎలా అణ‌గారిపోతున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తున్నాడు మ‌హ‌ప్ర‌భో! త‌మ‌రి హ‌యాములో దొంగ‌లు, దోపిడీదారులు, దుండ‌గులు, దౌర్జ‌న్య‌కారులు ఎలా ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను భంగ ప‌రుస్తున్నారో ఎప్ప‌టిక‌ప్పుడు తేట‌తెల్ల‌ము చేయుచున్నాడు ప్ర‌భూ. మీ చ‌ల్ల‌ని నీడ‌న‌, మీ అండ‌న ప్ర‌జావ్య‌తిరేక శ‌క్తులు ఎలా ఏక‌మై, అనేక‌మై పెచ్చ‌రిల్లుచున్న‌వో విశ‌దీక‌రించుచున్నాడు. ఇటుల చెప్పుకుంటూ పోయిన ఆ క‌ళాకారుడి చేత‌ల జాబితా చేంతాడు క‌ట్టంతగా మారుతుంది మ‌హారాజా!”

“ఔరా... ఎంతటి ధిక్కార‌మెంత‌టి కండ‌కావ‌ర‌మెంత‌టి తెంప‌రితన‌మెంత‌టి తెగువ‌? అయిన అత‌డి మూల‌ముల‌ను దెబ్బ‌తీయ‌వ‌లె. ఆత‌డి క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అడ్డుకొన‌వ‌లె. ఎవ‌రెక్క‌డ‌? ఆ కళాకారుడి చిత్ర‌విచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగు ప్ర‌దేశ‌ముల‌నెల్ల ఆక్ర‌మించుకొనుడు. ఆయా ప్ర‌దేశాల‌లో అప‌రిమిత ఆంక్ష‌ల‌ను విధించుడు. అందుకొర‌కు మ‌న యంత్రాంగ‌మంత‌టినీ మోహ‌రించుడు. ఆత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు జ‌నం రాకుండ చేయుడు. అవ‌స‌ర‌మైతే మొత్తం క‌ళా ప‌రిశ్ర‌మ‌నే చిత్ర‌హింస‌ల‌కు గురిచేయుడు. క‌ళాకారుల సంఘ‌మునే క‌కావిక‌లు చేయుడు. హ‌...హ్హ‌...హ్హ‌... విజృంభించుడు!”

“మ‌న్నించండి ప్ర‌భూ! నాదొక విన్న‌పం. అట్లు చేసిన ఎడ‌ల ప్ర‌జ‌ల‌వినోద‌మున‌కు విఘ్న‌ము క‌లిగించిన‌వార‌గుదురేమో ఒక‌ప‌రి ఆలోచించ‌మ‌ని మ‌న‌వి...”

ఆ మాట‌కి మ‌హారాజులో ఆవేశ‌ము పెల్లుబికింది. ఒక్కసారి విక‌టాట్ట‌హాస‌ము చేసి విరుచుకుప‌డ్డారు.

“ఏమిటి ఆలోచించేది? నా పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు వినోద‌ము లేక‌పోయిన‌నూ ప‌ర‌వాలేదు. నా పాల‌నే ఆ వినోద‌మును అందించును. వినోద‌మున‌కు దూర‌మై ప్ర‌జ‌లు విషాద‌భ‌రితులైన‌ను నాకు స‌మ్మ‌త‌మే. నేనేంటో, నా అప్ర‌తిహ‌త అప‌రిమిత అరాచ‌క పాల‌నా తీరుతెన్నులు ఎలాంటివో ఇంకా తెలియ‌లేదా? నా ప‌రిపాల‌న తీరుతెన్నుల‌లో ఎన్ని అవ‌క‌త‌వ‌కలున్న‌నూ స‌రే... వాటిని ప్ర‌శ్నించే సాహ‌స‌ము ఎవ‌రూ చేయ‌రాదని క‌దా, నా అభిమ‌త‌ము. అట్లు చేసిన సొంత ప్ర‌జాప్ర‌తినిధినే బంధించి, చీక‌టి కొట్లో ప‌డేసి మక్కెలిర‌గ‌ద‌న్నిన వైన‌ము మ‌రచితిరా? నా ముందు రాజ్య‌మును వెల‌గ‌బెట్టిన వాడు నిర్మించిన ఖ‌రీదైన భ‌వ‌న స‌ముదాయ‌ముల‌ను సైత‌ము ప‌డ‌గొట్టి ధ్వంస‌ము చేసిన దురాగ‌త‌ముల‌ను విస్మ‌రించితిరా? ఆనాటి రాజ‌ధానినే నాశ‌న‌ము చేసిన సంగ‌తి గుర్తులేదా? ఆ రాజ‌ధానికి భూములిచ్చిన క‌ర్ష‌కుల త్యాగాన్నే కాల‌రాచిన నా అధికార క‌రాళ నృత్య విన్యాస‌మును తిల‌కించ‌లేదా? అదేమిట‌ని అడిగినంత‌మాత్రాన అమాయ‌కులపైన‌నూ చ‌ట్ట‌ములో ఏమూల‌నో దాగిన ఎక్కడెక్క‌డి కేసుల‌నో బ‌నాయించలేదా? ప‌్ర‌శ్నించిన వారిని త‌రిమిత‌రిమి కొట్టుటలేదా? వెంట‌ప‌డి వేటాడి వేధించుట లేదా? ఇదియే క‌దా నా పాల‌న తీరు? ఇదియే క‌దా నా అధికార వైచిత్రి? ఇంకా అర్థం కాలేదా? నా ముందు స‌ర్వులూ వంగి ఉండ‌వ‌లె. అణిగి ప్ర‌వ‌ర్తించ‌వ‌లె. అర్థ‌మైన‌దా? ఎనీ డౌట్స్‌?”

రాజుగారి అరివీర విజృంభ‌ణ‌కు అధికార గ‌ణం, ప‌రివార గ‌ణం గ‌డ‌గ‌డ వ‌ణికారు. అంద‌రూ క‌లిసి రాజుగారిని శాంతింపజేయ‌డానికి స్తోత్ర‌పాఠాలు అందుకున్నారు...

“మ‌హాప్ర‌భో! శాంతించండి. మీ ఆగ్ర‌హావేశ కోప‌తాప విన్యాసాన్ని త‌ట్టుకోలేం.

క‌క్ష‌, కార్ప‌ణ్యాలు మీ ఉచ్చ్వాస‌నిశ్వాసాలు!

ప‌గ, ప్ర‌తీకారాలు మీ గుండె ల‌య విన్యాసాలు!

మీ సిర‌ల్లో అధికారం, మీ ధ‌మ‌నుల్లో అహంకారం ప్ర‌వ‌హిస్తున్నాయి!

మీ న‌ర‌న‌రాల్లో న‌య‌వంచ‌న‌బుస‌లుకొడుతోంది!

మీ క‌ణ‌క‌ణంలో కార్ప‌ణ్యం క‌ణ‌క‌ణ‌లాడుతోంది!

మీ వ్య‌వ‌హారాల్లో ద‌ర్పం దారుణంగా ప్ర‌స్ఫుట‌మ‌వుతోంది!

మీ తీరు అనిత‌ర సాధ్యం! మీ శైలి అన‌నుస‌ర‌ణీయం!

దండాలు మ‌హ‌ప్ర‌భో... దండాలు!”

అంటూ అంద‌రూ సాగిల‌ప‌డ్డారు.

-సృజ‌న‌

PUBLISHED ON 26.2.2022 ON JANASENA WEBSITE

మంగళవారం, ఫిబ్రవరి 15, 2022

కంగాళీ రాజుగారి హంగామా!

 


"అన‌గ‌న‌గా ఒక రాజుగారు..." అంటూ మొద‌లు పెట్టారు గురువుగారు.

"ఓహో... ఇవాళ పాఠం క‌థ‌తో మొద‌లు పెట్టార‌న్న‌మాట‌... చెప్పండి గురూగారూ!" అన్నాడు శిష్యుడు ఉత్సాహంగా.

"ఒరే ఇది క‌థే కాదురా...ఇందులో ఓ ప‌జిల్ కూడా ఉంది. దానికి నువ్వు స‌మాధానం చెప్పాలి..."

"ఏదో తిర‌కాసు పెట్టార‌న్న‌మాటే. స‌రే చెప్పండి సార్‌..."

 "ఆ అన‌గ‌న‌గా రాజుగారు స‌భ తీర్చి కూర్చునే వారు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌జ‌లంతా స‌భ‌కున్న ఎత్త‌యిన ప్ర‌ధాన ద్వారం నుంచి లోప‌లికి ప్ర‌వేశించి స‌మ‌స్య‌లు విన్న‌వించుకునేవారు. ఏ స‌మ‌స్య విన్నా రాజుగారు వినేవారు కానీ ఆయ‌న మొహంలో అసంతృప్తి క‌నిపిస్తూ ఉండేది. వినే స‌మ‌స్య గురించి కాకుండా రాజుగారు దేని గురించో ఆలోచిస్తున్నార‌ని ఆయ‌న ఆంత‌రంగిన ప్ర‌ధాన స‌ల‌హాదారుడికి అర్థం అయింది. రాజుగారి మ‌న‌స్త‌త్వం బాగా తెలిసిన ఆ స‌ల‌హాదారుడు ఓసారి రాజుగారు ఏకాంతంగా ఉండ‌గా చూసి... 'అయ్యా... స‌భ‌లో త‌మ‌రి మ‌న‌సు మ‌న‌సులో ఉండ‌డం లేద‌ని గ‌మ‌నించానండి. త‌మ‌రి చింతేమిటో చెబితే దాన్ని తీర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తానండి...' అని అడిగాడు.

అప్పుడు రాజుగారు, 'స‌భ‌లోకి వ‌చ్చే ఆ ప్ర‌ధాన ద్వారాన్ని ఎవ‌రు నిర్మించార‌య్యా? అది స‌రిగ్గా లేదు...' అన్నారు.

అర్థం ప‌ర్థం, సంద‌ర్భం లేని ఆ మాట‌కు స‌ల‌హాదారుడు ముందు తెల్ల‌బోయినా, ఆ త‌ర్వాత ఆలోచించి అస‌లు కిటుకు గ్ర‌హించాడు.

'చిత్తం మ‌హారాజా... ఆ సంగ‌తి నాకు వ‌దిలిపెట్టండి' అంటూ వంగి వంగి దండం పెట్టి వెళ్లిపోయాడు.

అంతే. మ‌ర్నాడు రాజుగారు స‌భ తీర్చేస‌మ‌యానికి ప్ర‌ధాన ద్వారం కొత్త‌ది ఉంది. అయితే ఈ ద్వారం అంత‌కు ముందు దాని కంటే స‌గానికి మాత్ర‌మే ఉంది. కొత్త ద్వారంలోంచి ప్ర‌జ‌లు రావ‌డం మొద‌లైంది.

ఈ సారి రాజుగారి మొహంలో చిరున‌వ్వు వెలిగింది. ఏంతో సంబ‌ర ప‌డుతూ, న‌వ్వుకుంటూ స‌మ‌స్య‌లు విన‌డం మొద‌లైంది... అదిరా క‌థ‌!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి కంటే ద్వార బంధం గురించి ఎందుకు రాజుగారు ఆలోచించారు?  కొత్త ద్వారం పెట్ట‌గానే ఎందుకు సంబ‌ర‌ప‌డ్డారు?  చెప్పు చూద్దాం..." అంటూ ముగించారు గురువుగారు!

శిష్యుడు త‌లగొక్కున్నాడు. ఏమీ అర్థం కాలేదు. అయినా ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు.

"ఆ... బ‌హుళా ఆ ద్వారబంధం పాత‌దైపోయి ఉంటుంది. అది ఎప్పుడైనా కూలిపోతే ప్ర‌జ‌ల మీద ప‌డుతుండేమోన‌ని రాజుగారు క‌ల‌వ‌ర‌ప‌డిపోయి ఉంటారు. అంతేనా గురూగారూ?"

"ఏడిశావ్‌! ఇన్నాళ్లూ నా ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు నేర్చుకుంటూ కూడా ఈ చిన్న విష‌యాన్ని గ్ర‌హించ‌క‌పోతే ఎలారా?"

"సార్‌... తిట్ట‌కండి. ఆ రాజుగారి వ్య‌వ‌హారం నాకేమీ  అర్థం కాలేదు. మీరే చెప్పి పుణ్యం క‌ట్టుకోండి..."

"ఓరెర్రోడా... ఆ రాజుగారి దృష్టి ఎప్పుడూ ప్ర‌జ‌ల మీద కానీ, వాళ్లు చెప్పే స‌మ‌స్య‌ల మీద కానీ లేదురా. ఎత్తుగా ఉన్న ద్వారం నుంచి నేరుగా వ‌చ్చి మాట్లాడుతుంటే ఆయ‌నకి న‌చ్చేది కాదు. ఎందుకంటే ఆయ‌న‌కి ఎక్క‌డ‌లేని అహంకారం. దానికి సాయం సింహాస‌నం మీద కూర్చునే స‌రికి అది మ‌రింత పేట్రేగి పోయేది. ఈ ప‌నికి మాలిన ప్ర‌జ‌లంతా ద‌ర్జాగా న‌డుచుకుంటూ నా ద‌గ్గ‌ర‌కి వ‌స్తారా అని ఆలోచించేవాడు. అందుకే ఆయ‌న‌కా ద్వార‌బంధం నచ్చ‌లేదు. ఆ సంగ‌తే చెప్పేస‌రికి స‌ల‌హాదారుడు ఇట్టే కిటుకు ప‌ట్టేశాడు. ద్వారబంధం ఎత్తుని స‌గానికి త‌గ్గించాడు. దాంతో ఏమ‌యింది? వ‌చ్చేదెవ‌రైనా త‌ల దించి, న‌డుము వంచి రావ‌ల‌సి వ‌చ్చేది. దాంతో ఆ రాజుగారికి అమందానంద మ‌దానందం క‌లిగేది...అర్థ‌మైందా?"

"వీడెక్క‌డి రాజండీ బాబూ... అంద‌రూ త‌న ముందు అణిగిమ‌ణిగి ఉండాల‌నే వింత, విచిత్ర, అహంకార పూరిత మ‌న‌స్త‌త్వ‌మ‌న్న‌మాట‌... అస‌లిలాంటి దిక్కుమాలిన‌, ద‌గుల్బాజీ రాజులెక్క‌డైనా ఉంటారాండీ?"

"ఎందుకుండ‌ర్రా... అల‌నాటి రాజులైనా, ఈనాటి పాల‌కులైనా అహంకారం త‌ల‌కెక్కిన వాళ్లు, అధికార ద‌ర్పంతో క‌ళ్లు నెత్తికెక్కిన వాళ్లు ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తారు..."

"అయితే గురూగారూ! ఇంత‌కీ ఈ క‌థ నాకెందుకు చెప్పిన‌ట్టు సార్‌... ఇందులో నేర్చుకోవ‌ల‌సిన పాఠం ఏంటండీ?"

"ఏరా... అన్నీ అర‌టి పండు వ‌లిచి పెట్టిన‌ట్టు నేనే చెప్పాలా?  పాఠం సంగ‌తి ప‌క్క‌నబెట్టు. నువ్వే గ‌న‌క ఓ ప‌ర‌గ‌ణానికి రాజ‌య్యేవ‌నుకో, ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ఎలా ప‌రిష్క‌రిస్తావో అది చెప్పు ముందు..."

"ఆహా... ఆ ఊహే భ‌లేగా ఉంది గురూగారూ! ఏముందండీ... స‌మ‌స్య గురించి విన‌గానే దాన్ని మూలాలేంటో ఆరా తీసి వెంట‌నే దాన్ని ప‌రిష్క‌రించేస్తానండి. అలా కొన్నాళ్ల‌లో అస‌లు స‌మస్య‌లే లేకుండా చేసేస్తానండి..."

గురువుగారికి చిర్రెత్తుకొచ్చింది. కోపంతో క‌ళ్లు ఎర్ర‌బ‌డ్డాయి.

"ఓరి ద‌రిద్రుడా! ఇదా ఇన్నాళ్లూ నా ద‌గ్గ‌ర పాఠాలు నేర్చుకున్న ఫ‌లితం? ఇక నువ్వు రాజ‌కీయాల‌కు ప‌నికిరావ‌ని తేలిపోయింది కానీ, ఇంటికి పోయి దుప్ప‌టి ముసుగెట్టుకుని నీ ఊహా రాజ్యంలో స‌మ‌స్య‌ల్ని ప‌రిష్కరించుకో... పోయిరా..."

దాంతో శిష్యుడు డంగైపోయాడు.

"బాబ్బాబు గురూగారూ! కోప్ప‌డ‌కండి. ఇంత‌కీ ఏం చేయాలో కాస్త చెప్పండి..."

గురువుగారు త‌మాయించుకుని చెప్పారు...  "ఓర‌మాయ‌కుడా! స‌మ‌స్య‌ల‌న్నీ ఇట్టే తీర్చేస్తే  మళ్లీ ఎల‌క్ష‌న్ల నాటికి హామీలెక్క‌డుంటాయిరా స‌న్నాసీ... ఆ సంగ‌తి ఆలోచించ‌వేం?"

"మ‌రేం చేయాలి సార్‌?"

"నువ్వే ప‌నిగ‌ట్టుకుని కొత్త స‌మ‌స్య‌ల్ని సృష్టించాలి..."

"అయ్య‌బాబోయ్‌... ఇదేం ప‌ద్ధ‌తి సార్‌... మ‌న‌మే స‌మ‌స్య‌ల్ని సృష్టించాలా?"

"అవున్రా పిచ్చి స‌న్నాసీ!  నీకు ఆ త‌ల‌తిక్క రాజుగారి క‌థ ఎందుకు చెప్పాన‌నుకున్నావ్‌. అంద‌రూ నీ ద‌గ్గ‌ర అణిగిమ‌ణిగి ఉండాల‌న్నా, నీకు వంగి వంగి న‌మ‌స్కారాలు పెట్టాల‌న్నా, అభం శుభం తెలియ‌ని ప్ర‌జ‌ల్లో నీ ప్ర‌భ వెలిగిపోవాల‌న్నా, నువ్వేదో తెగ క‌ష్ట‌ప‌డిపోయి ప‌ని చేస్తున్నావ‌న్న భ్ర‌మ జ‌నాల్లో క‌లిగించాల‌న్నా ఇలాగే చేయాలి. ఉన్న స‌మ‌స్య‌ల్ని కూడా తెగ నాన‌బెట్టాలి. చెప్పుకింద తేలుని తొక్కిపెట్టిన‌ట్టు ఉంచాలి. కానీ వాటిని ప‌రిష్క‌రించేస్తున్న‌ట్టు నానా హ‌డావుడీ, హంగామా చేయాలి. అలా ప‌బ్లిసిటీ చేసుకోవాలి. ఇదే ఇప్ప‌టి ప్ర‌జాస్వామ్య పాల‌నా ప‌ర్వంలో న‌యా న‌య‌వంచ‌క సూత్రం. అర్థ‌మైందా?"

"ఆహా... అద్భ‌తం సార్‌! ప‌ని చేయ‌క‌పోయినా, చేసిన‌ట్టు క‌నిపించాల‌న్న‌మాట‌... కానీ గురూగారూ, ఇలా చేసే  నంగ‌నాచి నేత‌లు ఎక్క‌డైనా ఉన్నారంటారా?"

"నీ క‌ళ్ల ముందే ఉన్న‌రు క‌ద‌రా. స‌మ‌కాలీన ప‌రిశీల‌న లేక‌పోతే ఎలా?  నీ ప‌ర‌గ‌ణాలో జ‌రుగుతున్న తంతునోసారి కళ్లెట్టుకు చూడు. కొత్త సినిమా ఆడ్డంలేదూ? ఈ సినిమా క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం, చిత్రానువాదం, సంగీతం, ఎడిటింగ్‌, క‌టింగ్‌... ఎవ‌రు?  పెద్ద పెద్ద హీరోలంద‌రూ వ‌ర‌స క‌ట్టి వ‌చ్చి మొర‌పెట్టుకునే ప‌రిస్థితిని క‌ల్పించినదెవ‌రు? ఇది ప‌నిగ‌ట్టుకుని సృష్టించిన స‌మ‌స్యే క‌దా? మ‌రి ఈ స‌మ‌స్య ప‌రిష్కారం వ‌ల్ల ఎంత ప్ర‌చారం జ‌రిగింది? ఎంత హంగామా న‌డించింది?  పోనీ విష‌యం ఓ కొలిక్కి వ‌చ్చిందా అంటే అదీ లేదు. ఎప్పుడొస్తుందో, ఎలా తేల్తుందో తెలీదు. ముందు  సినిమా హిట్ట‌యిందా లేదా? అదీ నువ్వు నేర్చుకోవ‌ల‌సిన నంగ‌నాచి త‌నం. ఇక ఉద్యోగుల సంగ‌తి చూడు. ల‌క్ష‌లాది మంది ఉద్య‌మించారు. రోడ్ల మీద ప‌డి ధ‌ర్నాలు చేశారు. వాళ్ల మీద ఆంక్ష‌లు పెట్టారు. నిర్బంధం చేశారు. ఉద్య‌మాన్ని  అణ‌గ‌దొక్క‌డానికి నానా మార్గాలూ వెతికారు. ఇంత‌కీ వాళ్ల‌ని ఆ స్థాయికి  తెచ్చిందెవ‌రు?  వాళ్ల డిమాండ్ల మీద నెల‌ల త‌ర‌బ‌డి సాగిన చ‌ర్చ‌లు స‌ర‌గా జ‌ర‌గ‌లేద‌నేగా అర్థం?  తీరా చేసి జీవోలో మ‌రో లెక్క‌లు  ఉండేలా చేసి గ‌గ్గోలు పెట్టించిందెవ‌రు?  తిరిగి వాళ్ల‌ని త‌న ద‌గ్గ‌ర‌కి ర‌ప్పించుకుని ఉదారంగా వ‌రాలిచ్చిన‌ట్టు పోజుకొట్టిందెవ‌రు?  పోనీ ఆ స‌మ‌స్య‌యినా పూర్తిగా తీరిందా అంటే అదీ అనుమాన‌మే. కానీ ఎంత ప్ర‌చారం? ఎంత హ‌డావుడి? ఇది క‌ద‌రా నువ్వు న‌డ‌వాల్సిన న‌క్క‌జిత్తుల మార్గం?  పోనీ ప్ర‌జ‌ల్ని వేధిస్తున్న స‌మ‌స్య‌లేమైనా ప‌రిష్కార‌మ‌య్యాయా అంటే ఏవీ చూపించు? ర‌హ‌దారుల స‌మ‌స్య అలాగే ఉంది. నిరుద్యోగ స‌మ‌స్యకి అతీగ‌తీ లేదు. చదువుకుని కొలువులు వ‌చ్చే దారిలేక రోడ్ల మీద‌కి వ‌స్తున్న వారిని కూడా పిలిపించుకుని చ‌ర్చ‌లు జ‌ర‌ప‌చ్చు క‌దా?  రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల‌ను కూడా ర‌ప్పించుకుని వ‌రాలివ్వ వ‌చ్చు క‌దా?  ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించిన విష‌యాలకి కూడా సినీ హీరోల‌కి ఇచ్చిన‌ట్టు స‌మ‌యం కేటాయించి ప‌రిష్క‌రించ‌వ‌చ్చు క‌దా?  కానీ అలా చేస్తే ప్ర‌చారం, హంగూ, ఆర్భాటం ఎలా క‌లుగుతాయి. త‌ల్చుకుంటే ప్ర‌తి స‌మ‌స్య‌నీ ఓ కొలిక్కి తీసుకురావ‌చ్చు క‌దా? మ‌రి అలా జ‌రుగుతోందా?  లేదే?  కాబ‌ట్టి  నువ్వు ఇవ‌న్నీ ఆక‌ళింపు చేసుకుని, అర్థం చేసుకుని, వంట‌ప‌ట్టించుకుని, నేర్చుకుని... ఇలాంటి క‌ప‌ట‌, క‌నాక‌ష్ట‌, క‌కావిక‌ల‌, కంగాళీ పాల‌నా విధానాల‌ను న‌ర‌న‌రానా ఎక్కించుకోవాలి. అప్పుడే నువ్వొక నికార్స‌యిన నేత‌గా ఎదుగుతావు. తెలిసిందా? ఇక పోయిరా!"

-సృజ‌న‌

PUBLISHED ON 13.2.2022 ON JANASENA WEBSITE