మంగళవారం, మార్చి 14, 2023

సీతాకోక చిలుక‌లు



(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)


         

అగ్గిపుల్ల భ‌గ్గుమంది, ఆ అమ్మాయిల గుండెల్లో మంట‌లాగే!

         ఆ అగ్గిపుల్ల ఓ కొవ్వొత్తిని వెలిగించింది. ఆ కొవ్వొత్తి నుంచి ఒక‌దాని త‌ర్వాత
ఒక‌టిగా కొవ్వొత్తులు వెలిగాయి.

         ఆ కొవ్వొత్తుల జ్వాల‌ల్లో ఓ ఉద్వేగం రెప‌రెప‌లాడింది. ఓ ఆవేద‌న జ్వ‌లించింది.
అమ్మాయిలంద‌రూ అక్క‌డ పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో అక్క‌డి చిత్ర‌ప‌టం వింత‌గా ప్ర‌కాశించింది. అంద‌రూ మౌనంగా క‌ళ్లు మూసుకున్నారు. ఆ రెండు నిమిషాల మౌనం ఓ అమానుష ఘ‌ట‌న ప‌ట్ల సంఘ‌టిత‌మైన సంక‌ల్ప‌మై ఆ చిత్ర‌ప‌టంలోని అమ్మాయి క‌ళ్ల‌లో ప్ర‌తిఫ‌లించింది.

         నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ళ‌క‌ళ‌లాడుతూ త‌మ‌తో తిరిగిన ల‌లిత, ఇలా కొవ్వొత్తుల ముందు చిత్ర‌ప‌టంగా మార‌డాన్ని ఆ అమ్మాయిలు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు.
మ‌న‌సులో సుడులు తిరుగుతున్న బాధ‌, వాళ్ల క‌ళ్ల‌లో స‌న్న‌టి నీటి పొర‌గా మారింది. ఆ
రోజు క‌ళాశాల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

         ఆ మ‌ర్నాటి నుంచీ, ల‌లిత ఇంట్లో ఘ‌ణీభ‌వించిన విషాదం మిన‌హా అంతా మామూలుగా మారింది.

         “ల‌లిత క‌ళ్ల ముందు క‌దులుతోందే… రాత్రి నిద్ద‌రప‌ట్ట‌లేదు” అంది అప‌ర్ణ‌.

         “అవునే… నాకూ అంతే…” అంది శైల‌జ‌.

         ఇద్ద‌రూ మామూలుగానే బ‌స్టాపులో నుంచున్నారు. ఇంత‌లో బ‌ర్రుమంటూ ఓ బైక్ వ‌చ్చి అక్క‌డి బ‌డ్డీకొట్టు ముందు ఆగింది.

         “వాడే…” అంది శైల‌జ గుస‌గుస‌గా.

         అప‌ర్ణ జుట్టు స‌వ‌రించుకున్న‌ట్టుగా త‌ల‌తిప్పి ఓర‌గా చూసింది. వాడు బైక్ దిగి
నిర్ల‌క్ష్యంగా క్రాఫ్ స‌వ‌రించుకుంటూ బైక్ అద్దంలో చూసుకుని బ‌స్టాపులోకి రాసాగాడు.

         అప‌ర్ణ‌, శైల‌జ ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌గా జ‌రిగారు అప్ర‌య‌త్నంగా.

         ఈలోగా శాంతి, ల‌హ‌రి వ‌చ్చి క‌లిశారు. ప్ర‌కాష్ స్నేహితులు కూడా వచ్చారు.

         “ఎవ‌ర్రా… కొత్తా?” అన్నాడు ప్ర‌కాష్‌, అప‌ర్ణ‌ని ఉద్దేశించి.

         “అవును… వార‌మే అయింది చేరి…” అంటున్నాడు వ‌చ్చిన‌వాడు.

         దూరంగానే నుంచున్నా, వాళ్ల మాట‌లు వినిపిస్తూనే ఉన్నాయి అప‌ర్ణ‌కి, ఆమె
స్నేహితురాళ్ల‌కి. ఎవ‌రూ మాట్లాడ‌లేదు. బ‌స్సు రాగానే ముందు నుంచి అమ్మాయిలు, వెన‌క‌ నుంచి అబ్బాయిలు ఎక్కారు.

         “రైట్‌… రైట్‌…” అన్నాడు కండ‌క్ట‌ర్‌. కానీ అక్క‌డ జ‌రుగుతున్న‌దంతా రైట్ కాదు,
రాంగ్‌.

***

         ప‌ట్నంలోని కాలేజీకి వెళ్లాలంటే బ‌స్సు ఎక్క‌క త‌ప్ప‌ని అనేకానేక ఊళ్ల‌లో అదికూడా ఒక‌టి. బస్సు త‌ప్ప మ‌రో సౌక‌ర్యం కుద‌ర‌ని మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయిల్లో వాళ్లు కూడా ఒక‌ళ్లు. అమ్మాయిలు క‌నిపించ‌గానే వెకిలి వేషాలేసే అబ్బాయిలు అక్క‌డా ఉన్నారు. కానీ ఆ వెకిలిత‌నం ఆక‌తాయిత‌న‌మై, అది పోకిరిత‌నంతో జ‌ట్టుక‌ట్టి ఆపై అహంకారంతో క‌లిసి అకృత్యాల‌కు సైతం వెర‌వ‌ని తెంప‌రిత‌నమ‌వ‌డ‌మే ఆ అమ్మాయిల దౌర్భాగ్యం. వెన‌క‌ నుంచి ఎక్కినా ముందుకు వ‌చ్చి నుంచోడం, కుదుపుల్లో రాసుకున్న‌ట్టు మీద‌ప‌డ‌డం, కామెంట్లు చేయ‌డం లాంటి ద‌శ‌ల‌న్నింటినీ ఎప్పుడో దాటిపోయాయి ఆ బస్సులో ప‌రిస్థితులు. పైకి అంతా రైట్‌గానే క‌నిపిస్తుంది. కానీ జ‌రిగేదంతా రాంగే. అదే ల‌లిత మ‌న‌సును అల్ల‌క‌ల్లోలం చేసింది.

         “ఆ ప్రకాష్ ఫోన్‌లోకి నా ఫొటో ఎలా వ‌చ్చిందో తెలీదే. పైగా అది… అది…
బ‌ట్ట‌ల్లేకుండా ఉందే. దాన్ని చూపించి బెదిరిస్తున్నాడు. దాన్ని నెట్‌లో పోస్ట్ చేస్తా నంటున్నాడు…” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది ల‌లిత‌.

         “ఏడిశాడు…ఏం కాదులే. భ‌య‌ప‌డ‌కు” అంటూ ఓదార్చింది భార్గ‌వి. ఆ త‌ర్వాత ల‌లిత రెండు రోజులు కాలేజీకి రాలేదు. మూడో రోజు ఇంట్లో గ‌దిలో ఫ్యాన్‌కు ఆమె నిస్స‌హాయ‌త వేలాడింది. ఆమె భ‌యం గుడ్లు తేలేసింది. పరువు పోతుంద‌నే ఆందోళ‌న‌, ఆమె బ‌తుకునే ఉరితీసింది.

         “ఎందుకింత ప‌ని చేసిందో నా చిట్టిత‌ల్లి…” అంటూ ఆమె త‌ల్లి గుండెలు బాదు కుంటూనే ఉంది. ఆమె సందేహం ఇప్ప‌టికీ తీర‌లేదు.

         భార్గ‌వి నుంచి అంతా విన్న అప‌ర్ణ చిగురుటాకులా వ‌ణికిపోయింది. ఆమె ఆ ఊళ్లోకి, ఆ కాలేజీలోకి వ‌చ్చి వార‌మైనా కాలేదు.

         “ఇంత జ‌రిగితే కొవ్వొత్తులు వెలిగించి మౌనం వ‌హిస్తే స‌రిపోతుందా?” అంది అప‌ర్ణ ఆవేశంగా.

         “అంత‌క‌న్నా ఏం చేస్తాం. నువ్వు జాగ్ర‌త్త‌. అస‌లే కొత్త‌గా వ‌చ్చావు” అంది భార్గ‌వి. శాంతి, ల‌హ‌రి, శైల‌జ కూడా మౌనంగానే త‌లూపారు. అప‌ర్ణ నిట్టూర్చింది.

         ఇంత‌లో బ‌స్సు వ‌చ్చింది. అంద‌రూ ఎక్కారు. “రైట్ రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         “హాయ్‌… నీ పేరు అప‌ర్ణ క‌దూ…” అనే మాట‌లు గుస‌గుస‌గా వినిపిస్తే చ‌టుక్కున
వెన‌క్కి తిరిగి చూసింది అప‌ర్ణ‌. ద‌గ్గ‌ర‌గా నుంచుని ఉన్నాడు ప్ర‌కాష్‌. అప‌ర్ణ పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఏం మాట్లాడ‌లేదు. 

         “బాగున్నావ్‌… నీ ఫొటో ఇంకా బాగుంది తెలుసా?”

         అప‌ర్ణ గుండె ఝ‌ల్లుమంది.

         “లంచ్ బ్రేక్‌లో కాలేజీ వెన‌కాల మామిడి చెట్టు ద‌గ్గ‌ర‌కి వ‌స్తే చూపిస్తా…” అంటూ నెమ్మ‌దిగా అని ఆమె భుజాన్ని రాసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు ప్ర‌కాష్‌.

         కాలేజీ స్టాప్ వ‌చ్చేసింది. అప‌ర్ణ‌తో పాటు అంద‌రూ దిగారు. 

         “రైట్‌… రైట్‌… “అన్నాడు కండ‌క్ట‌ర్‌. బ‌స్సెళ్లిపోయింది.

***

         కాలేజీ వెన‌కాల మామిడి చెట్టు.

         “చెప్ప‌గానే వ‌చ్చావు… గుడ్‌… పైకొస్తావ్‌…” అన్నాడు ప్ర‌కాష్‌. అత‌డి మాట‌ల్లో వెకిలిత‌నం ప‌ళ్లికిలించింది. 

         అప‌ర్ణ నుదిటి మీద చిరు చెమ‌ట‌లు.

         “చూడు… నీ ఫొటో ఎంత బాగుందో” అంటూ ఫోన్ చూపించాడు. ఆ ఫొటో చూసి అప‌ర్ణ ముఖం జేవురించింది. బ‌స్సులోనో, కాలేజిలోనో, బ‌స్టాప్‌లోనో ఎక్క‌డ తీశాడో. మొహం త‌న‌దే. మిగ‌తా శ‌రీరం త‌న‌ది కాదు.

         “ఛీ” అనుకుంది అప‌ర్ణ‌. కంప్యూట‌ర్ మార్ఫింగ్.

         గొంతు పెగ‌ల్చుకుని చెప్పింది… “ప్లీజ్‌… దాన్ని డిలీట్ చెయ్యి” అంది భ‌యం భ‌యంగా.

         “త‌ప్ప‌కుండా చేస్తా, నేను చెప్పిన‌ట్టు చేస్తే… లేక‌పోతే ప్ర‌పంచమంతా చూస్తుంది మ‌రి…”

         “ఏం… ఏం… చేయాలి?”

         “రేపు ఆదివారం ఊళ్లో పాత‌బ‌డిన బంగ్లా వెన‌క్కిరా. స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుందాం. ఇంట్లో సంత‌కి వెళ్తాన‌ని చెప్పులే. స‌రేనా?”

         “కానీ… నేనొక్క‌ర్తినీ రాలేను. భ‌యం…”

         “పోనీ… నీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకురా… మా వాళ్ల‌ని కూడా ర‌మ్మంటా… నీ ఫ్రెండ్స్‌ ఫొటోలు కూడా వాళ్ల ద‌గ్గ‌ర ఉన్నాయిలే. అవి కూడా చూపిస్తాం. సంత‌ అయిపోగానే వెళ్లిపోవ‌చ్చు… అన్న‌ట్టు సంచులు తెచ్చుకోండి. కూర‌లు మేం తెస్తాంలే…” అంటూ అదోలా న‌వ్వాడు ప్ర‌కాష్.

         కాలేజీ బెల్ మోగింది. ప‌రుగు ప‌రుగున వెళ్లిపోయింది అప‌ర్ణ‌. వెన‌కాల నుంచి ప్ర‌కాష్
త‌న ఫ్రెండ్స్‌తో హైఫైలు కొట్టుకోవ‌డం వినిపిస్తూనే ఉంది.

***

         బ‌స్టాప్ గుబులు గుబులుగా ఉంది. అప‌ర్ణ చెప్పిందంతా విని శాంతి, భార్గ‌వి, ల‌హ‌రి,
శైల‌జ‌ తెల్ల‌బోయారు.

         “ఇదంతా ఇంట్లో చెప్పేస్తోనో?”

         “మ‌న్నే తిడ‌తారు. పైగా కాలేజీ మానిపించేస్తారు…”

         “వాళ్లంత తెలివి త‌క్కువ వాళ్లేంటి? సిమ్ములు మార్చేస్తారు. ఫోన్లు చూసుకో మంటారు”

         “పోనీ వెళ్ల‌క‌పోతే?”

         “ఏమో… ఎవ‌రి ఫొటోలైనా ఫేస్బుక్‌లోనో, ట్విట‌ర్‌లోనో వ‌చ్చేస్తే?”

         “పైగా డేటింగ్ సైట్ల‌లో కూడా అప్‌లోడ్ చేస్తార‌ట‌…”

         “అప్పుడు మ‌న ఇంట్లో వాళ్లు కూడా త‌లెత్తుకోలేరు…”

         ఆ అమ్మాయిల భ‌యాలు, సందేహాలు ఆ బస్టాప్‌లో గుస‌గుస‌లాడాయి. ఏం చేయాలో
తోచ‌క గుబులుగా మాట్లాడుకున్నాయి. ఆఖ‌ర్న అప‌ర్ణ చెప్పింది. “అందుక‌నే అంద‌రం క‌లిసి వెళ్దాం. ఒక‌రికొక‌రం తోడు. ఇంట్లో కూడా అంద‌రం క‌లిసి అడిగితే పంపిస్తారు. వెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌మ‌ని అడుగుదాం”

         “మ‌రి వాళ్లు ఏమైనా చేస్తే?”

         “మ‌నం త‌క్కువ వాళ్ల‌మా? ఆ మాత్రం ఎదుర్కోలేమా?”

         చేసేదిలేక‌… వేరే దారి లేక‌… అమ్మాయిలు అంద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.
స‌రేనంటే స‌రేన‌నుకున్నారు.

         బస్సొచ్చింది. అంద‌రూ బెదురుతున్న గుండెల్తో ఎక్కారు.

         “రైట్… రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         “రేపే సంత గుర్తుందా?” అన్నాడు ప్ర‌కాష్, అప‌ర్ణ కూర్చున్న సీటు వెన‌క రాడ్‌ పై
రెండు చేతులూ పెట్టి ముందుకు వంగి, ఆమె చెవిలో త‌న‌కు మాత్ర‌మే వినిపించేంత
మెల్ల‌గా. అప‌ర్ణ మెల్ల‌గా వెన‌క్కి తిరిగి న‌వ్వింది. బ‌స్సులో మిగ‌తా వాళ్ల‌కి స‌హ‌జంగా స్నేహితులు మాట్లాడుకున్న‌ట్టు క‌నిపించే ప్ర‌య‌త్నం అది. అలా న‌వ్వుతూనే, “కానీ మా అంద‌రి ఫొటోలు డిలీట్ చేసేయాలి మ‌రి…” అంది. ఆమె గొంతులో ఏదో క‌నిపించ‌ని భ‌యం.

         ప్ర‌కాష్‌కి ధైర్యం వ‌చ్చింది. ఏదో విజ‌యం సాధించిన‌ట్టు అత‌డి మొహం వెలిగింది.

         “త‌ప్ప‌కుండా… ప్రామిస్‌…”

         “కానీ ఒక్క ష‌ర‌తు. మేం వెంట‌నే వెళ్లిపోతాం”

         “ఓకే… జ‌స్ట్ టెన్ మినిట్స్ అంతే”

         “మ‌రేం భ‌యం లేదుగా?”

         “అస్స‌లు లేదు. మా ద‌గ్గ‌ర సేఫ్టీ మెజ‌ర్స్ అన్నీ ఉన్నాయి…” అప‌ర్ణ త‌లూపింది. ప్ర‌కాష్ త‌లెగ‌రేశాడు. ఇంత‌లో ఊరొచ్చేసింది. అంద‌రూ దిగిపోయారు.

         “రైట్‌…రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         అప‌ర్ణ‌, శాంతి, ల‌హ‌రి, శైల‌జ‌, భార్గ‌వి సంచుల‌తో న‌డుచుకుంటూ సంత‌కి బ‌య‌ల్దేరారు. సంత‌లోంచి అలా ముందుకు న‌డిచారు. కాస్త దూరంలో ఉన్న పాత‌ బంగ్లాలోకి ప్ర‌వేశించారు. ఆ ప‌క్క‌నే పొలంలో కొంత‌ మంది మ‌హిళ‌లు నాట్లు వేస్తున్నారు.

         “గుడ్ గాళ్స్‌…” అంటూ ప్ర‌కాష్ ఓ స్తంభం చాటు నుంచి ముందుకు వ‌చ్చాడు.
అమ్మాయిలు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా నుంచుని ఉన్నారు. మ‌రో ప‌క్క నుంచి ప్ర‌కాష్ ఫ్రెండ్స్ కూడా వ‌చ్చారు.

         “మ‌రి… ఫొటోలు డిలీట్ చేయండి…” అంది అప‌ర్ణ‌.

         ప్ర‌కాష్ గ‌ట్టిగా న‌వ్వాడు. “అప్పుడేనా… ఇప్పుడేగా వ‌చ్చారు. కూర‌లు కొనుక్కోవ‌ద్దూ…” అన్నాడు. 

         వాడి స్నేహితులు న‌వ్వారు.

         “ముందు ఫొటోలు చూపించండి” అంది అప‌ర్ణ‌.

         “ఇవిగో…” అంటూ స్నేహితులు ఫోన్లు తీశారు. అంద‌రి ఫోన్ల‌లోనూ వాళ్ల ఫొటోలు
ఉన్నాయి. జుగుప్సాక‌రంగా.

         త‌ర్వాత ఫోన్లు ఆఫ్ చేసి జేబుల్లో పెట్టుకున్నారు. అమ్మాయిల ద‌గ్గ‌ర‌గా వ‌చ్చారు. భుజాల మీద చేతులు వేశారు.

         అప్పుడు అప‌ర్ణ త‌న జాక‌ట్లోకి చెయ్యి పెట్టి తీసింది. అదొక విజిల్‌. వెంట‌నే నోట్లో పెట్టుకుని గ‌ట్టిగా ఊదింది. ఆ శ‌బ్దం ఆ బంగ్లా అంతా ప్ర‌తిధ్వ‌నించింది. పొలాల్లో నాట్లు వేస్తున్న మ‌హిళ‌లు ప‌రిగెత్తుకుని వ‌చ్చారు. బంగ్లా వెనుక ద్వారం నుంచి మ‌హిళా ఇన్‌స్పెక్ట‌ర్ వ‌చ్చింది. ఆమె చేతిలో రివాల్వ‌ర్‌. నాట్లు వేసే మ‌హిళ‌ల చేతుల్లో లాఠీలు. వాళ్లంతా షీటీమ్ స‌భ్యులు. ఈలోగా సంత‌లో మ‌ఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్‌తో పాటు, ఆ
అమ్మాయిల బంధువులు కూడా వ‌చ్చారు. 

         ప్ర‌కాష్ గ్యాంగ్ అంతా తెల్ల‌బోయారు. అంద‌రి ఫోన్లు క్ష‌ణాల్లో లాక్కున్నారు. ఫొటోలు చెక్ చేశారు. వెంట‌నే అరెస్ట్ చేశారు.

***

         అభినంద‌న స‌భ‌.

         షీటీమ్ ఇనస్పెక్ట‌ర్ మాట్లాడుతోంది.

         “ఈవ్‌టీజింగ్‌కి పాల్ప‌డే వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డం కోసం మేం బ‌స్సుల్లో అమ్మాయిల్లాగే తిరుగుతుంటాం. మ‌మ్మ‌ల్ని కూడా అల్ల‌రిపెట్టే ప్ర‌బుద్ధులు తార‌స‌ప‌డ‌తారు. అయితే అప‌ర్ణ‌లాంటి అమ్మాయిలు సాహ‌సంతో ముందుకు వచ్చిన‌ప్పుడే మేం పూర్తి స్థాయిలో ఇలాంటి వాళ్ల‌ని అరిక‌ట్ట‌గ‌లం. ఈ ఊర్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ల‌లిత వెన‌కాల కూడా ఈ గ్యాంగ్ ఉన్నార‌ని అనుమానం వ‌చ్చినా ఎవ‌రూ ముందుకు వ‌చ్చి ఫిర్యాదు  చేయ‌క‌ పోవ‌డంతో ఏమీ చేయ‌లేక‌పోయాం. ముందు అప‌ర్ణ మ‌మ్మ‌ల్ని ఎప్రోచ్ అయిన‌ప్పుడు, చివ‌రి దాకా నిల‌బ‌డుతుందో లేదోన‌ని సందేహించాం. కానీ త‌ను నిల‌బ‌డ్డ‌మే కాదు, వాళ్ల స్నేహితురాళ్ల‌ని కూడా క‌లుపుకుని ఊళ్లో ఈవ్‌టీజ‌ర్లంద‌ర‌నీ ఒకేసారి ప‌ట్టించింది. ఐ ఎప్రీష‌యేట్ హెర్ బ్రేవిటీ”

         ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మైక్ అందుకున్నాడు. “గూడును బ‌ద్ద‌లు కొట్టుకుని
బ‌య‌ట‌కి వ‌చ్చే సాహసం చేస్తేనే సీతాకోక చిలుక ఎగుర‌గ‌లుగుతుంది. ఈ అమ్మాయిలు
స‌హ‌జంగా భ‌య‌ప‌డే మ‌న‌స్త‌త్వాన్నుంచి బ‌య‌ట‌ప‌డి షీటీమ్‌ను క‌ల‌వ‌డం గొప్ప
విష‌యం. ఈ ఊళ్లో ఇంత జ‌రుగుతోంద‌ని నాకు తెలీదు. ఇక నుంచి ఇక్క‌డి అమ్మాయిల కోసం ప్ర‌త్యేక‌మైన బ‌స్ వేయిస్తాను. ఈ అమ్మాయిల సాహ‌సం నిజంగా అభినంద‌నీయం”

***

         ఊళ్లోకి బ‌స్సొచ్చి ఆగింది. అమ్మాయిలంతా సీతాకోక చిలుక‌ల్లాగా వ‌చ్చిబ‌స్సెక్కారు.

         కండ‌క్ట‌ర్ “రైట్‌…రైట్‌…” అన్నాడు ఇప్పుడు అది నిజంగా రైటే!

PUBLISHED ON 'NECHELI' WEB MAGAZINE


అండ్‌ ద 'మస్కార్‌' గోస్‌ టూ...

 


వేదిక మిరుమిట్లు గొలుపుతోంది. దేశవిదేశీ ప్రముఖులంతా ఆసీనులై ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది టీవీలకు కళ్లప్పగించి చూస్తున్నారు. అందరిలోనూ ఉత్కంఠ. రాజకీయాల్లోనే ప్రఖ్యాతిగాంచిన 'మస్కార్‌' అవార్డులను ప్రకటించే వేదిక అది. ప్రజలను నమ్మించి, రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాధనాన్ని మస్కా కొట్టి దోచుకునే నేతలకు ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే ఆ అవార్డు అందుకోవడం అంత సులవైన పని కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో రాజకీయ ప్రముఖులు పోటీ పడుతుంటారు. తాము చేసిన వెధవ పన్లను వీడియోలుగా తీసి పోటీ న్యాయ నిర్ణేతలకు పంపుతారు. తాము అధికారంలో ఉండగా చేసిన నీచ, నికృష్ట పనులను కళాత్మకంగా చూపిస్తూ తగిన సన్నివేశాలతో, పాటలతో, డైలాగ్స్‌ తో సహా ఎంట్రీలను పంపుతారు. దేశదేశాల నుంచి అలా అందిన ఎంట్రీలను వందలాది మంది న్యాయనిర్ణేతలతో కూడిన కమిటీ చూస్తుంది. ఎవరెవరు ఎంతెంత దుండగాలకు పాల్పడ్డారో, ఎంతెంత దగుల్బాజీ పనులను చేశారో, ఎంతెంత స్థాయిలో ప్రజాధనాన్ని, వనరులని అడ్డగోలుగా దోచుకున్నారో పరిశీలించి, ఆ దారుణాల స్థాయిని అంచనా వేసి నిర్ణేతలు వేర్వేరు విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. ఆ అవార్డుల వివరాలను సీల్డు కవర్లలో భద్ర పరుస్తారు. అవార్డులు ఎవరెవరికి వచ్చాయో చివరి క్షణం వరకు ఎవరికీ తెలియదు. 'మస్కార్‌' వేదిక మీద వ్యాఖ్యాతలు ఆ కవర్లను విప్పి పేర్లు చదివినప్పుడు మాత్రమే ఫలితాలు వెల్లడవుతాయి. అంతటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల వేడుకను ప్రత్యక్షంగా, పరోక్షంగా చూడడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తుంటారు.

''ఒరే... ఈరిగా... మస్కార్‌ అవార్డులంట... టీవీలో చూపిస్తున్నారు. లెగెహే...'' అంటూ లేపాడు సూరిగాడు.

''ఏ అవార్డులెవరకి వస్తే మనకేంట్రా?'' అంటూనే కళ్లు నులుముకుంటూ వచ్చి కూర్చున్నాడు ఈరిగాడు.

''భలేవోడివిరా బాబూ... ఈసారి మనోళ్లు కూడా పోటీ పడుతున్నారు తెలుసా? అందుకే మరి ఈ సందడి'' అన్నాడు సూరిగాడు.

వేదిక మీద అందాల వయ్యారి యాంకర్‌ వంకర్లు తిరిగిపోతూ మాట్లాడుతోంది.

''రాజకీయాలు కూడా ఒక కళే. అందులో రాణించాలంటే సినిమాల్లోలాగే కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం, నటన, మ్యూజిక్‌, ఎడిటింగ్‌, డైలాగ్స్‌ లాంటి ఎన్నో విభాగాల్లో ఆరితేరిపోవాలి. ఈ కళలో ఎవరెవరు ఏఏ కేటగిరీల్లో చెలరేగిపోయారో కొద్ది సేపట్లో మనందరికీ తెలిసిపోతుంది'' అంటూ వివరించింది.

ఇంతలో వేదిక పైకి ఓ ప్రముఖ వ్యక్తి వచ్చాడు. మైకు పుచ్చుకుని గొంతు సవరించుకుని చెప్పసాగాడు.

''ఇప్పుడు ఉత్తమ చెత్త రాజకీయ చిత్రం అవార్డును ప్రకటించనున్నాం. రాజకీయం అంటేనే నమ్మించడం, వంచించడం. ఈ కేటగిరీలో మాకు అందిన ఎన్నో ఎంట్రీలను వడబోశాం. చివరికి అవార్డు ఎవరికి వచ్చిందో ప్రకటించబోతున్నాం'' అన్నాడు. అందరూ ఉత్కంఠతో చూడసాగారు. యాంకర్‌ ఇచ్చిన సీల్డు కవరును విప్పి చెప్పాడు.

''... అండ్‌ ద మస్కార్‌ గోస్‌ టూ... 'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ మటాష్‌' ఫ్రమ్‌ ఆంధ్రప్రదేశ్‌...'' అంటూ ప్రకటించగానే చప్పట్లు మార్మోగాయి.  అవార్డు అందుకోడానికి ఆ రాజకీయ చిత్రం దర్శకుడు గజన్‌ ద్రోహన్‌ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వేదిక పైకి నడిచి వచ్చాడు.

''వార్నీ ఈడు మన గజన్‌ గాడ్రా... ఈడింత గొప్ప సినిమా చూపించాడ్రా?'' అంటూ ఈరిగాడు ఆశ్చర్యపోయాడు.

''కాదేంట్రా మరి? ఈడు మామూలోడా చెప్పు. ఈడు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జనానికి చూపిస్తున్న నీచ రాజకీయ చిత్రం ఇదే కదరా? ఈడి పాలనలో 'ఎవ్రీథింగ్‌' అంటే ఏది పడితే అది.... 'ఎవ్రీవేర్‌' అంటే ఎక్కడబడితే అక్కడ... 'ఆల్ ఎట్‌ మటాష్‌' అంటే అంతా మటాష్‌ అయిపోయింది కదరా? ఏ రంగాన్ని కానీ, ఏ వ్యవస్థని కానీ తీసుకో... మరి ఇంత దారుణమై మార్పు చూపించినందుకు అవార్డు రాకుండా ఎలా ఉంటుందిరా?'' అంటూ చెప్పుకొచ్చాడు సూరిగాడు.

వేదిక మీద యాంకర్‌ చెబుతోంది.

''ఇప్పుడు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించనున్నాం'' అంటూ సీల్డు  కవర్‌ అందించింది.

వేదిక మీద ప్రముఖుడు దాన్ని అందుకుని, ''... అండ్‌ ద మస్కార్‌ గోస్‌ టూ...'' అంటూ ఒక్క క్షణం ఆగి, పేరు ప్రకటించాడు.

''అరె... ఇది కూడా ఈడికే వచ్చిందేంట్రా?'' అంటూ అరిచాడు ఈరిగాడు.

''మరి కాదేంటెహె. ఈడిని మించిన నటుడు ఎవడుంటాడ్రా, ఈ ప్రపంచంలోనీ. పైకి మెత్తగా నవ్వుతాడు. లోపల నీచ పథకాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పైకి సామాన్యుల కోసమే తన బతుకంటాడు. ఆ తర్వాత వాళ్ల మీదనే చెత్త పన్నులన్నీ వేసి భారం మోపుతాడు. నీ అన్ననంటాడు. బిడ్డనంటాడు. మామనంటాడు. తలలు నిమురుతాడు. బుగ్గలు పుణుకుతాడు. ఓ తాతా... ఓ అవ్వా... ఓ అమ్మా... ఓ చెల్లీ... అంటూ వరసలు కలిపి వినయం అభినయిస్తాడు. ఆపై అందరి జేబులకీ చిల్లులు పెడతాడు. నా బతుకంతా మీ కోసమేనంటాడు... అలా అంటూనే బడుగు జీవుల బతుకులతో ఆడుకుంటాడు. అంతా అండర్‌ యాక్షన్‌ అనుకో...'' అంటూ సూరిగాడు చెప్పాడు.

వేదిక మీద మరో అవార్డు గురించి యాంకర్‌ చెప్పసాగింది.

''ఇది ఉత్తమ చెత్త రాజకీయ స్క్రీన్‌ ప్లే అవార్డు...'' అంటూ సీల్డు కవర్‌ అందించింది.

''... అండ్‌ ద అవార్డు గోస్‌ టూ... 'బేరారార్‌'...'' అంటూ ప్రముఖుడు ప్రకటించగానే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.

''ఇదేంట్రా సూరిగా? ఈ సినిమాకి కూడా ఈడే నవ్వుకుంటూ వెళుతున్నాడు?'' అంటూ ఆశ్చర్యపోయాడు.

''నువ్వు భలే అమాయకుడివిరా బాబూ. ఈ రాజకీయక చిత్రం కూడా ఆడు చూపిస్తున్నదే మరి. 'బేరారార్‌' అంటూ ఏంటో తెలుసా? ఈడి పొలిటికల్‌ స్క్రీన్‌ ప్లే వల్ల సామాన్యులంతా 'బేర్‌'మంటూ ఏడుస్తున్నారు కదరా? పైగా ఈడు, ఈడి మనుషులు కలిసి రాష్ట్రం మొత్తాన్ని బేరం పెట్టేశారు కదా? అందుకే మరి ఆ పేరు. ఏవేవో పథకాలంటాడు. ఆటి ద్వారా మీట నొక్కితే డబ్బులొచ్చి కాతాలో పడతాయంటాడు. కానీ సెస్సులనీ, టాక్సులనీ, ధరలనీ, ఛార్జీలనీ అన్నింటినీ పెంచేసి వెనక నుంచి అంతకు పదింతలు వాళ్ల దగ్గరి నుంచే లాగేస్తున్నాడు. మరి ఇలాంటి కథనం ఎక్కడైనా ఉందా చెప్పు?'' అంటూ వివరించాడు సూరిగాడు. ...

వేదిక మీద యాంకర్‌ మళ్లీ మెలికలు తిరిగిపోతూ వచ్చి, ''ఇప్పుడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీ...'' అంటూ సీల్డు కవర్‌ అందించింది.

''... అండ్‌ ద మస్కార్‌ గోస్‌ టూ... 'ఘోరావతార్‌ 2'...'' అంటూ ప్రకటించాడు.

ఈసారి ఈరిగాడు నోరెళ్లబెట్టాడు. ''ఇదేంట్రా ఇది కూడా ఈడికేనేంట్రా?'' అన్నాడు.

సూరిగాడు నవ్వి, ''ఓరెర్రెదవా. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అంటూ ఏంటో తెలుసా? లేనిది ఉన్నట్టు చూపించడం. ఇందులో ఈడు పండిపోయాడు మరి. పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలిస్తాడు. అందులో పెద్ద పెద్ద సంఖ్యలు వేస్తాడు. అన్నేసి కోట్లు జనం కోసం ఖర్చు పెట్టేశానంటూ గొప్పగా చెప్పుకుంటాడు. తీరా చేసి ఆరా తీస్తే... అవన్నీడొల్ల లెక్కలే మరి. ఇలా లేనిది ఉన్నట్టు చూపించడంలో ఈళ్ల నాన్న 'ఘోరావతార్‌' అయితే ఈడు ఘోరావతార్‌ నెంబర్‌ టూగాడన్నమాట'' అంటూ బోధించాడు.

వేదిక మీద  అవార్డులు ప్రకటిస్తూనే ఉన్నారు. 'వరస్ట్‌ సౌండ్‌' విభాగం. ''... అండ్‌ ద మస్కార్‌ గోస్‌ టూ... 'టాప్‌ టెన్‌' అని ప్రకటించారు.

ఈరిగాడు కెవ్వుమని కేకేశాడు. ''అరె... ఇదేంట్రా మన నేతలందరూ నవ్వుకుంటూ వేదిక ఎక్కుతున్నారూ?'' అన్నాడు.

''మరి వీళ్లంతా రోజూ చేస్తున్నది వరస్ట్‌ సౌండ్సే కదరా పిచ్చినాయాలా? తెల్లారి లేస్తే చాలు మైకుల ముందు మూతులెట్టుకుని ప్రతిపక్ష నేతల్ని నానా బూతులూ తిడతారు. వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటే మాటలతో వాగుతారు. ఈళ్ల గొప్పలూ వినలేం. ఈళ్ల తిట్లూ వినలేం. ఏమంటావ్‌?'' అన్నాడు సూరిగాడు.

వేదిక మీద యాంకర్‌ మరో సారి వయ్యారంగా వచ్చింది. ఇప్పుడు ''ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీ...'' అంటూ సీల్డు కవర్‌ అందించింది.

''... అండ్‌ ద మస్కార్‌ గోస్‌ టూ... 'బేరారార్‌'...'' అంటూ ప్రకటించారు.

''వార్నాయనో...  ఈళ్లు పాటలు కూడా పాడారేంట్రా?'' అన్నాడు ఈరిగాడు.

''ఒరే... నీ చుట్టూ ఏం జరుగుతోందో నీకు పట్టదురా. ఈ పాట భలే హిట్టయిందిలే...'' అన్నాడు సూరిగాడు.

వేదిక పైకి ఆంధ్రా టీమ్‌ అంతా ఉత్సాహంగా చేరుకున్నారు. నేపథ్యంలో పాట వినిపించసాగింది.

''చేటు చేటు చేటు చేటు చేటు... వీర చేటు...''

అంతే మస్కార్‌ వేదికంతా దద్దరిల్లిపోయింది. ఆంధ్రాటీమ్‌ అంతా ఆ పాటకు జట్టు కట్టి స్టెప్పులేయసాగారు.

''పోలిటిక్స్‌ దుమ్ములోన

చెత్తగిత్త దూకినట్టు

రాజకీయ జాతరలో

మేతరాజు ఊగినట్టు

వెర్రి చూపులేసుకుని

జనం బేర్‌మన్నట్టు

భూములన్ని బేరమెట్టి

అమ్ముకుని దోచినట్టు

నా ఆట చూడు... నా పాట చూడు...

చేటు చేటు చేటు

చేటు చేటు చేటు వీర చేటు

మోటు మోటు మోటు

మోటు మోటు మోటు వీర మోటు''

వేదిక మీద నీచ రాజకీయ నేతలంతా కలిసి చెట్టాపట్టాలేసుకుని గెంతసాగారు.

''గుండెలదిరిపోయేలా

ధరల దెబ్బ తగిలినట్టు

సెవులు సిల్లు పడేలా

పిచ్చి భాష వాగినట్టు

వెర్రి జనం జెల్ల కొట్టి

ధనం పోగు చేసినట్టు

కొండలన్ని కొల్లగొట్టి

కాసులు వెనకేసినట్టు

వొంటి లోని రగతమంతా

సలసలసలమని మరిగినట్టు

ప్రశ్నిస్తే పగపట్టి

పిచ్చి కేసులెట్టినట్టు

నమ్మించి ఆశపెట్టి

నానా బాధలెట్టినట్టు

చేటు చేటు చేటు వీర చేటు''

టీవీలో మస్కార్‌ అవార్డులు చూస్టున్న ఈరిగాడు, సూరిగాడు కూడా లేచి గెంతులేయసాగారు.

++++++++

ఇంతలో ఈరిగాడికి, సూరిగాడికి వీపులు చుర్రుమన్నాయి.

''ఎదవల్లారా... ఎదవల్లారాని... సిగ్గు లేదంట్రా? బారెడు పొద్దెక్కినా పక్క మీంచి లేవరు. పైగా నాటు నాటు చేటు చేటంటూ పలవరింతలొకటా'' అంటూ అమ్మ చీపురు తిరగేసింది. ఆసరికి వాళ్లకి పూర్తిగా మెలకువ వచ్చింది.

''ఇకనైనా మనం మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకుని ఈ 'చేటు'కి ముగింపు పలకాల్రా...'' అనుకుంటూ ఇద్దరూ వీపులు తడుముకుంటూ బయటకొచ్చారు.

-సృజన

PUBLISHED ON 14.3.2023 ON JANASENA WEBSITE

మంగళవారం, మార్చి 07, 2023

ఆమె రుణం!

ఒక్కరోజు జైకొడితే తీరేనా ఆమె రుణం?

అనునిత్యం తలవకుంటే అదే కదా దారుణం?

ఎముకలు విరిగే బాధను అమ్మ ఓర్చుకోకుంటే...

అవని మీద నీ జననం కాదా ప్రశ్నార్థకం?

ఇంటిపేరు మార్చుకుని నీ ఇంటికి చేరుకునే...

జంట తోడు లేకుంటే నిలిచేనా నీ వంశం?

తోడబుట్టి నీడలాగ నీ క్షేమం కోరుకునే...

సోదరి ఉనికే కదా నీ బతుకుకు నిండుదనం?

చిరునవ్వులు చిందిస్తూ పలకరించు అతివ లేక...

అడుగడుగున నీ పయనం అవుతుందా పరిపుష్టం?

అవునో కాదో తెలియదు ఆకశాన 'ఆమె' సగం...

అయినా కాకున్నా 'అతడు' తీర్చలేడు ఆమె రుణం!

(on the occation of womens day)


శుక్రవారం, మార్చి 03, 2023

అరాచక అతి విశ్వాసం!

 


''ఏందయ్యా సెక్రట్రీ... ఇవాళ మన ప్రోగ్రామ్స్‌ఏంటి?''

''బహిరంగ సభ ఉందండయ్య...''

''ఎంత దూరంలో?''

''రెండు కిలోమీటర్ల దూరంలోనేనండయ్య...''

''మరి ఏర్పాట్లు చేశావా?''

''సిద్ధమండయ్య. కారు రెడీ చేశానండయ్య...''

''ఏం సెక్రట్రీవయ్యా నువ్వు? కారేంటయ్యా కారు? హెలీకాప్టర్‌పెట్టలేకపోయావా?''

''సార్‌... మరీ రెండు కిలోమీటర్ల దూరానికి హెలీకాప్టర్‌పెడితే బాగుండదేమోనండయ్య. ఆనక విమర్శలొస్తే చెప్పలేదంటారని...''

''ఏడిశావ్‌. కారు మీద వెళితే ఒళ్లు హూనం అయిపోతుంది కదయ్యా?''

''అవునండయ్య. మర్చిపోయాను. అసలే మన పాలనలో రోడ్లు దరిద్రంగా ఉన్నాయండి. గర్భిణీని తీసుకెళ్తుంటే ఆసుపత్రికి వెళ్లేలోగానే డెలివరీ అయిపోతుందయ్య. ఎక్కడ ఏ వాహనం గోతిలో పడి యాక్సెస్‌రాడ్డు విరిగిపోయి ఆగిపోయిందో తెలియదండయ్య. ఎప్పుడేం ప్రమాదం జరిగిందో కూడా చెప్పలేమండయ్య... అలాంటప్పుడు తమరు సామాన్యులను కలవడానికి ఆలస్యమైపోతుందయ్య. ఇహ తమరి మనసు కలవరపడిపోతుందయ్య. ఆ దిగులుతో ఈ రాత్రికి పాపం... మీకు నిద్ర కూడా పట్టదేమోనండి...''

''మరి ఇన్ని తెలిసిన వాడివి కారు పెట్టడమేంటయ్యా. ఏ విమానమో, హెలీకాప్టరో ఏర్పాటు చెయ్యి...''

''అలాగే సార్‌. కానీ చిన్న సందేహం సార్‌. ఇలా చిన్న చిన్న దూరాలకి కూడా హెలీకప్టర్లు అవీ పెట్టుకుంటే ప్రజాధనం వృధా అయిపోతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తాయేమోనండయ్య...''

''హ...హ్హ...హ్హ! నీ అమాయికత్వం చూస్తే జాలేస్తోందోయ్‌. ఇంకా మన పాలనలో ప్రతిపక్షం అంటూ ఉందంటావా?''

''అబ్బే... ఎక్కడండీ? మనం పగ, కక్ష, కార్పణ్యాలతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసేశామనుకోండి. కానీ... ఎన్నికలు దగ్గర్లోకి వచ్చేశాయి కదా అనండయ్య...''

''అందకనే కదయ్యా... ఇలాంటి సభలకు బయల్దేరుతుంట. లేకపోతే మన క్యాంపు ఆఫీసు నుంచే యవ్వారాలన్నీ నడిపించేస్తున్నాం కదా?''

''అవునండి... మీటలు నొక్కడాలూ, రిబ్బన్‌కత్తిరించడాలూ, ప్రారంభోత్సవాలు చేయడాలూ... అన్నీ వర్చువల్‌గా జరిగిపోతున్నాయి కదండీ... కానీ అయ్యా... ఒకప్పుడు పాదయాత్ర చేస్తూ ఊరూవాడా తిరిగిన వారేనా తమరు అని ఆశ్చర్యమేస్తోందండయ్య...''

''భలేవాడివయ్యా... మరి అప్పటికీ ఇప్పటికీ తేడాలేదూ? అప్పుడు మనకి అధికారం ఏక్కడేడిసిందీ? దాని కోసం మరి ఎంతయినా కష్టపడాలయ్యా. నడవడమే కాదు... అవసరమైతే డేకాలి కూడాను. మరప్పుడలా చేశాం కాబట్టే...ఆ... ఇప్పుడిలా ఊరేగుతున్నాం. ఏమంటావ్‌?''

''అనడానికేముందండయ్య... తమరి చరిత్ర సమసిపోయేదా? మాసిపోయేదా? అబ్బో... అప్పట్లో తమరి ఉపన్యాసాలు తల్చుకుంటే ఇప్పటికీ పొలమారుతుందయ్య. ఎన్ని కల్లబొల్లి కబుర్లు, ఎన్ని మాయ మాటలు? అరచేతిలో సొరగం చూపించేశారు కదండయ్య? జనం భలే బోల్తా పడ్డారు లెండి...''

''జాగర్తయ్యోయ్‌... ఉన్నమాటగా ఎక్కడా అనకు. గోడలకు చెవులుంటాయి. ఏదో నువ్వు నా ఉప్పు తిని ఎన్నాళ్ల నుంచో నా దగ్గర పడున్నావని కాస్త మనసు విప్పి మాటాడుతున్నానంతే...''

''అయ్యయ్యో... తమరు ప్రత్యేకంగా చెప్పాలిటండీ... మనలో మన మాటంతే. అసలు తమర్ని చూస్తే నాకు మాచెడ్డ ఆశ్చర్యమనిపిస్తుందయ్య. ఎలాగుండే వారు? ఎలా ఎదిగిపోయారు? ఒకప్పుడు చిన్న స్విచ్చుల కంపెనీ తప్ప ఏముండేదండీ తమ దగ్గర? అసలామాటకొస్తే ఒకానొక సమయంలో ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సిన స్థితి కదండీ?  అలాంటిది ఆ పళంగా తమరి తండ్రిగారు కుర్చీ ఎక్కాక  తమరు ఏం జమాయించారయ్యా? ఎంత తెలివి? ఎంత తెగింపు? ఎంత బరితెగింపు? ఎంత నిబ్బరం? అబ్బో... చక్రం తిప్పేశారు కదండయ్య? తమరు పెద్ద పెద్ద కంపెనీలోళ్లతో బేరాలెట్టడం, అప్పటికప్పుడు తమరు సృష్టించిన సూట్‌కేసు కంపెనీల్లోకి ఆళ్లంతా కాసులు జమ చేయడం, ఆనక తమరి తండ్రిగోరు ఆళ్లందరికీ ఏం కావాలంటే అవి... భూములనీ, ఫ్యాక్టరీలనీ, సెజ్‌లనీ, పోర్టులనీ, గనులనీ... అన్నీ శాంక్షనింగ్‌చేయించేయడం... అదంతా ఓ మహా మాయండి... తల్చుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుందండి... ఒకటా రెండా చెప్పండి... లక్ష కోట్లని ఆ ఎర్రిబాగుల నిఘా సంస్థలు అంటున్నాయి గానీ... నన్నడిగితే అంతకు పదింతలు ఉండదండీ? ఆ... ఏది ఏమైనా... తమరి దగ్గర ఉంటూ ఇంతప్పటి నుంచి ఇప్పుడింత వరకు తమరు ఎదిగిన తీరు చూస్తేనండయ్యా... తస్పదియ్యా... పిచ్చెక్కిపోతుందండయ్య...''

''ఇక చాల్లేవయ్యా... అక్కడితో ఆగు. లేకపోతే తమకంతో కళ్లు తిరిగి కింద పడేలా ఉన్నావ్‌. ఇదంతా చెయ్యడానికి  ఎన్ని పాట్లు పడ్డానయ్యా... అదేమీ గుర్తులేదా నీకు?''

''లేకేమండయ్య...కళ్లారా చూసినోడిని. కాలం కలిసి రాకపోయినా, దాన్ని దార్లోకి తెచ్చుకున్నారండయ్య. అవకాశాలు రాకపోయినా వాటినీ తమరే సృష్టించుకున్నారండయ్య... మరి అప్పట్లో నాన్నగారు ఉన్నట్టుండి కనుమరుగైపోతే ఎంత తల్లడిల్లిపోయారో నాకు తెలియదా చెప్పండయ్య. ఆపళంగా ఆ సానుభూతిని సాకు చేసుకుని సీటు భర్తీ చేద్దామనుకున్నారు కదయ్యా తమరు? అంత్యక్రియల కన్నా ముందే సంతకాల ప్రక్రియ చేపట్టడం కళ్లారా చూశాను కదయ్యా? ఎందుకో అధిష్ఠానం బిగుసుకుపోయింది కానీ, అప్పట్లోనే తమరు కుర్చీ ఎక్కవలసిన వారేకదయ్యా? అయినా ఊరుకున్నారేంటండి? ఆ సానుభూతి చల్లారిపోకుండా... మనసులో ఏడుపును దిగమింగుకుని, జనాన్ని ఓదారుస్తానంటూ బయల్దేరినప్పుడే అనుకున్నానండయ్య... తమరు అలాంటిలాంటి మనిషి కాదని! అధిష్ఠానం వద్దన్నా... విన్నారేంటండి? జనంలోకి దిగిపోయారు. ఆ పట్టు పట్టు పెట్టిన కాలు పెట్టినచోట పెట్టుకుండా తిరిగారయ్య. మధ్యలో ప్రతిపక్షం బెంచీల మీద కొన్నాళ్లు కూర్చున్నా, మీ కలలు వదలేదండయ్య. ఇహ... ఆపై తమరి పాదయాత్ర చరిత్ర, ఆ తర్వాత తమరి పరిపాలన చరిత్ర... అంతా నాకు తెలిసిందే కదండయ్యా?''

''చరిత్ర సరేనయ్యా... వర్తమానం సంగతి చెప్పవేం? ఇప్పుడేమీ కష్టపడడం లేదంటావా?''

''అయ్యబాబోయ్‌... ఎంతమాటండి? కుర్చీ ఎక్కిన కాణ్ణుంచి తమరు పడుతున్న కష్టం అంతా ఇంతానా చెప్పండి. ఏం చేసినా ప్రజల పేరు మీదనే చేయాలా? ప్రజల కోసమేనని నమ్మించాలా? అది మామూలు కష్టమా చెప్పండయ్య? ఒకేపు మీ మీద ఆశలెట్టుకున్న అస్మదీయులను సముదాయించాలి కదయ్య? ఏ పథకం పెట్టినా అందులో వాళ్లకి ప్రయోజనం చూపించొద్దయ్యా? ఓ పక్క ఏం చేస్తున్నా జనం కోసమేనని నమ్మస్తూ, మరో పక్క స్వజనానికి మేలు చేకూర్చాలంటే మాటలేంటండయ్య? అటు చూస్తే మీడియా, ఇటు చూస్తే ప్రతిపక్షాలు, ఆ పక్కన చట్టం, ఈ పక్కన న్యాయం... ఇన్ని ప్రతిబంధకాల మధ్యన కూడా మనోళ్లకి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, వ్యాపారాలు, పదవులు, హోదాలు పందేరం చేయడమంటే కత్తి మీద సామే కదండయ్య? సాకు చిక్కితే చాలు సాక్ష్యాలతో సహా నిజాలు రాసే పత్రికలను కాసుకోవద్దయ్య? ఆళ్లు రాసేవన్నీ అబద్దాలంటూ ప్రజలు భ్రమించేలా సొంత పత్రికలో కథనాలు వండి వార్చొద్దయ్య? వీలు దొరికితే విమర్శలు గుప్పిస్తూ జనాన్ని మేలుకొలిపే నికార్సయిన నేతల దిమ్మదిరిగేలా ఆంక్షలు పెట్టొద్దయ్యా? అందుకోసం చట్టాన్ని, రాజ్యాంగాన్ని అడ్డగోలుగా తిరగరాసి కాలం చెల్లిన కేసులు సైతం బనాయించాలంటే... ఎంత కష్టమో, ఎంత శ్రమో నాకు తెలియదేంటయ్య? సమస్యల మీద శాంతియుతంగానైనా పోరాడ్డానికి ఎవరైనా బయల్దేరుతున్నారని తెలిస్తే,  తెల్లారకుండానే ఆళ్లని ఇళ్లలోనే నిర్భంధం చేయడానికి ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా పావులు కదపాలో నాకెరికే కదండయ్య? నిరసన ప్రదర్శనలను ఉక్కుపాదాలతో అణచివేయాలంటే తమరి పాదాలెంత కందిపోతాయో, ఉద్యమాలను కాలరాయాలంటే తమరి కాళ్లెంత నొప్పి పుడతాయో అర్థం చేసుకోగలనండయ్య. బదిలీలనో, కేసులనో సాకులెట్టి పోలీసులను, అధికారులను, ఉద్యోగులను తమ దారికి తెచ్చుకోవాలంటే తమరెంత ఒత్తిడికి గురై ఉంటారో ఊహించగలనయ్య. ఎక్కడెక్కడ అప్పులు చేసినా, ఏ కేంద్ర పథకాల నిధులు మళ్లించినా ఆ సొమ్మును సంక్షేమం పేరు చెప్పి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం అప్పనంగా పంచేయడానికి మీటలు నొక్కి నొక్కి మీ చేతి వేళ్లు తీపులొచ్చేసి ఉంటాయండయ్య. ఓ పక్క జనానికి సొమ్ములు పంచుతున్నట్టు ప్రచారం చేసుకుంటూనే, మరో పక్క ఆళ్ల దగ్గర నుంచే పన్నులని, ధరలని, ఛార్జీలని, సెస్సులని అంతకు పదింతలు గుంజుకోడానికి తెగ ఆలోచించి మీ బుర్ర వేడెక్కిపోతుందయ్య. ఇలా ఈ మూడున్నరేళ్లలోనూ తమరు మానసికంగా, శారీరకంగా ఎంత నలిగిపోతున్నారో నేను దగ్గరుండి గమనిస్తున్నాను కదండయ్య? అసలన్నింటికన్నా పెద్ద కష్టం మరోటుందయ్య... ఓ పక్క ఇంత శ్రమ పడిపోతూ కూడా ఎక్కడా పైకి తేలకుండా తేలిగ్గా నవ్వుతుంటారే... అది మరొకళ్లని సాధ్యమయ్యే పనేనా చెప్పండయ్య?''

''వార్నీ...భలే చెప్పావయ్యా. నా కష్టాలేంటో నువ్వు చెబుతుంటే నా మీద నాకే జాలేస్తోందనుకో...''

''కానీ... ఒక్క మాటండయ్య. ఇంత వరకు తమరు పడిన కష్టం ఒక ఎత్తయ్య, ఇక మీదట పడేది మరో ఎత్తయ్య...''

''అవునా? మరైతే ఆ కష్టమేంటో కూడా నువ్వే చెప్పు...''

''ఏముందండయ్య? ఎన్నికలు తరుముకొస్తున్నాయండయ్య. రాదారి నుంచి గోదారి వరకు తమరి పాలన తీరేంటో జనం గమనిస్తున్నారండయ్య. పాదయాత్ర నాటికీ, పాలించిన నాటికీ పొంతనలేంటో తెలుసుకుంటున్నారండయ్య. పుచ్చుకునేదానికి, ఇచ్చేదానికి తేడాపాడాలేంటో లెక్కలేసుకుంటున్నారండయ్య. చెబుతున్న దానికి, చేస్తున్నదానికి జరిగిందేంటో చూస్తున్నరండయ్య. ఇప్పుడాళ్లని నమ్మించడం చాలా కష్టమండయ్య. భ్రమల్లో ముంచి తేల్చడం మరీ కష్టమనిపిస్తోందండయ్య. అది మాత్రం కాస్త గుర్చుంచుకోండయ్య...''

''హ...హ్హ...హ్హ...హ్హా! సెక్రట్రీ... నువ్వెంత అమాయకుడివో మరోసారి రుజువైందయ్యా. దగ్గరగా ఉండి నా చరిత్రంతా కాచి వడబోశావు కానీ, నా నిజ స్వరూపం కానుకోలేకపోయావు. ఓసారి మనిషి మాంసం రుచి చూసిన పులి పస్తులైనా ఉంటుంది కానీ, ఇక మామూలు తిండి తినదని వినే ఉంటావు. అలాగే ఓ సారి అధికారం అందుకున్నాక నేనూరుకుంటానా? దాన్ని పదే పదే అందుకోడానికి ఎంతకైనా తెగిస్తానని తెలుసుకోలేకపోతున్నావు.  చేతిలో పవరుంది. దాంతో వ్యవస్థలన్నింటినీ, సర్కసులో రింగు మాస్టరు కొరడా ఝళిపించి పులుల్ని ఆడించినట్టు ఆడిస్తా. ఈ మూడున్నరేళ్లలో నేను చేసింది పాలన కాదయ్యా... సమాంతర పరిపాలన. సర్పంచుల నుంచి మంత్రుల వరకు అందరినీ డమ్మీల్ని చేశా. నేననుకున్నదే అందరి నోటా పలికించా. అరాచక శక్తుల్ని అడుగడుగునా మోహరించా. నోరెత్తేవాడు లేకుండా అందరినీ భయభ్రాంతుల్ని చేశా. ప్రతిపక్షానికి పక్షవాతం వచ్చేలా చేశా. ప్రశ్నించే వాడిని పత్తా లేకుండా చేశా. అడిగేవాడిని అయిపూ అజా లేకుండా చేశా. నిలదీసే వాడికి నీళ్లు పుట్టకుండా చేశా. కాదనే వాడికి కళ్లు తిరిగేలా చేశా. ఎదురుతిరగేవాడంటూ ఎక్కడా లేకుండా చేశా. ఇక ప్రజలంటావా? ఆళ్లొట్టి వెర్రిబాగులోళ్లయ్యా. అదే నా విశ్వాసం. అదే నా నమ్మకం. అర్థమైందా... హహ్హహ్హా!''

''ఆహా... అద్భుతం సార్‌! మీ అతి విశ్వాసానికి జోహార్‌! మీ అపనమ్మకానికి జోహార్‌!!''

-సృజన

PUBLISHED ON 4.3.2023 ON JANASENA WEBSITE