బుధవారం, ఆగస్టు 21, 2024

ఓ జీవితం... ఓ పుస్తకం... ఓ సినిమా!



'ఇన్నాళ్లూ ఎందుకు చూడలేకపోయాను?'... అనిపించింది ఆ సినిమా చూశాక!

చూశాక దాని గురించి నా అభిప్రాయం రాయాలని కూడా అనిపించింది...

ఇప్పటికే చాలా మంది చూసుంటారు... మాట్లాడుకుని ఉంటారు... రాసి కూడా ఉంటారు...

అయినా నేను కూడా చెప్పాల్సిందే... చెప్పి తీరాల్సిందే!

ఆ సినిమా... ''ట్వెల్త్‌ ఫెయిల్‌''!

దేశంలోనే అతి కఠినమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ పరీక్షల్లో విజేతల జీవితాల్లోకి తొంగి చూస్తే, ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉంటాయి.  అతి సామాన్యమైన కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్లు, పేదరికం నుంచి ఎదిగిన వాళ్లు, ఎన్నో కష్టాలు పడి అనుకున్నది సాధించిన వాళ్లూ ఎంతో మంది కనిపిస్తారు. ఒకొక్కరిదీ ఒకో కథ! అందరూ హీరోలే!

'ట్వెల్త్‌ ఫెయిల్‌' కథ కూడా ఇదే. అయితే ఇది కేవలం కథ కాదు... నిజ జీవితం ఆధారంగా తీసినది.

ఆ జీవితం మనోజ్‌ కుమార్‌ శర్మది. అత్యంత పేదరికంలోంచి వచ్చి ఐపీఎస్‌ అధికారిగా ఎదిగిన వ్యక్తిది. 2005 బ్యాచ్‌కి చెందిన ఇతడి గురించి 2019లో 'ట్వెల్త్‌ ఫెయిల్‌' పేరుతో హిందీ రచయిత అనురాగ్‌ పాథక్‌ ఓ నవల రాశాడు. ఆ నవలను ఆధారం చేసుకుని తీసిందే ఈ సినిమా. 2023 అక్టోబరులో విడుదలైంది. నవలకీ, సినిమాకి మూలమైన మనోజ్‌ కుమార్‌ శర్మ ప్రస్తుతం మహారాష్ట్ర క్యాడర్‌లో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఇనస్పెక్టర్ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గా పని చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో బందిపోట్లకు పేరొందిన చంబల్‌ ప్రాంతానికి చెందిన ఇతడు, ట్వెల్త్ క్లాస్‌ ఫెయిల్‌ అయి, బీఏ అయిందనిపించుకున్న ఓ సామాన్య నిరుపేద యువకుడు. ఆ డిగ్రీతో దొరికిన ఏదో ఉద్యోగంలో ఏ గుమాస్తాగానో ఇమిడిపోయి ఉంటే, ఇతడి గురించి చెప్పుకోవలసిన పనే లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలో తెలియాలంటే అతడి ట్వెల్త్‌ క్లాస్‌ రోజుల్లోకి వెళ్లి చూడాలి.

పరీక్షకి సిద్ధం అవ్వాలంటే, జేబుల నిండా స్లిప్పులు పెట్టుకుని వెళ్లాలనుకునే స్థాయి అతడిది. గ్వాలియర్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ సాయంతో పరీక్ష రాసే ట్వెల్త్‌ క్లాస్‌ స్టూడెంట్లందరిదీ అదే స్థాయి. స్వయంగా ప్రిన్సిపాల్ బోర్డు మీద జవాబులు రాస్తుంటే, వాటిని మక్కికి మక్కీగా ఎక్కించేస్తూ కుర్రాళ్లంతా పరీక్ష రాసే సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ రూపంలో నిజాయితీ గల ఓ డీఎస్పీ వచ్చాడక్కడికి. ప్రిన్సిపాల్‌ బెదిరింపులకి గానీ, లంచానికి గానీ అతడు లొంగలేదు. ఫలితంగా ఆ ఏడాది ఆ కాలేజీలో మొత్తం స్టూడెంట్లందరూ ''ట్వెల్త్‌ ఫెయిల్‌'' అయ్యారు. ఆ బ్యాచ్‌లోని వాడే మనోజ్‌కుమార్‌ శర్మ.

ఫ్రెండ్సంతా ఆ డీఎస్పీని తిట్టుకుంటే, అతడికి మాత్రం ఆయనలోని నిజాయితీ నచ్చింది. ఆ నిజాయితీ ఇచ్చిన ధైర్యం నచ్చింది.

అప్పుడొక కల కన్నాడతడు. అది నిద్రలో వచ్చే కల కాదు. మెలకువగా ఉన్నప్పుడు తరిమే కల!

''ఎలాగైనా డీఎస్సీ అవ్వాలి!''... అదీ ఆ కల!!

అతడి స్థాయికి అది ఎవరెస్ట్‌ శిఖరం అంత పెద్దది. అయినా ఎక్కాలనే అనుకున్నాడు.

''నేను మీలా ఓ నిజాయితీ పరుడైన పోలీసు అధికారి అవ్వాలంటే ఏంచేయాలి?'' అని ఆ డీఎస్పీనే అడిగాడు.

''ముందు నిజాయితీగా ఉండు...'' అన్నాడాయన. ఆ మాటలు అతడి మనసులో నాటుకున్నాయి.

అప్పటికి అతడికి ఐపీఎస్‌ అంటే ఏంటో కూడా తెలియదు.

మళ్లీసారి పరీక్షల సమయానికి గ్వాలియర్‌ కాలేజీ కుర్రాళ్ళంతా దర్జాగా స్లిప్పులు పెట్టి ఫస్ట్‌క్లాస్‌ తెచ్చుకుంటే... వాటి కేసి చూడనైనా చూడకుండా నిజాయితీగా తనకొచ్చిందేదో రాసి సాధారణంగా ప్యాస్‌ అవడం అతడి తొలి విజయం.

కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్‌ తెచ్చుకోవడం కంటే, నిజాయితీగా వచ్చిన థర్డ్‌ క్లాసే అతడికి ఆనందాన్ని ఇచ్చింది.

ఆ తర్వాత డీఎస్పీ అవ్వాలన్న కలే అతడిని నడిపించింది.  చేతిలో పైసా లేకపోయినా ఓ స్నేహితుడి సాయంతో దిల్లీ తీసుకెళ్లింది. పగలంతా 15 గంటలు పని చేస్తూ, రాత్రి వేళ 6 గంటలు చదువుకునేలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు మూడు సార్లు ప్రిలిమ్స్‌ ఫెయిలయినా పట్టువదలకుండా నిలబెట్టింది. చివరి ప్రయత్నంలో మెయిన్స్‌ క్లియర్‌ చేయించింది!

ఇదంతా చెప్పినంత సులువు కాదు... అనుభవించినంత కష్టం!

ఇంటికి దూరంగా... ఊరుకాని ఊర్లో... దిల్లీ మహానగరంలో... కడుపు నిండడానికి కూడా పని చేయక తప్పని పరిస్థితిలో... ఐపీఎస్‌కి సిద్ధం కావాలంటే... ఏం చేయాలో అన్నీ చేశాడతడు!

బత్రూంలు క్లీన్‌ చేశాడు!

పిండిమరలో పని చేశాడు!

మూడడుగుల స్థలంలోనే రాత్రిళ్లు గుడ్డి బల్బు వెలుగులో చదువుకున్నాడు!

ఎన్నో వెటకారాలు ఎదుర్కొన్నాడు!

అవమానాలు భరించాడు!

ఇంత కష్టపడుతున్నా... ఎక్కడా చిరునవ్వును చెరగనీయలేదు. పట్టుదల సడలనీయలేదు. నిజాయితీని వదులుకోలేదు.

కానీ... ఆ నిజాయితీకే పెద్ద గండం ఎదురైంది మెయిన్స్‌ ఇంటర్య్యూలో!

''ట్వెల్త్‌ ఎందుకు ఫెయిలయ్యావు?'' అనే ప్రశ్నే ఆ గండం!

ముందుగానే ఆ ప్రశ్నను ఊహించిన చాలా మంది అతడికి చెప్పారు... అబద్దం ఆడమని. ఎవరో చనిపోయారని చెప్పమన్నారు.

మనోజ్‌ కుమార్‌ నాలుగేళ్ల కష్టం ఆ ప్రశ్న ముందు నిలబడింది!

అబద్దం ఆడి ఇంటర్వ్యూ గెలవాలా?

నిజం చెప్పి ఓడిపోవాలా?

ఓడిపోయినా పరవాలేదు కానీ నిజమే చెప్పాలనుకున్నాడు నిజాయితీగా.

''ఆ ఏడాది ఛీటింగ్‌ జరగలేదు. అందుకే ఫెయిల్‌ అయ్యాను...'' అన్నాడు ధైర్యంగా.

ఇంటర్వ్యూ గదిలో బాంబు పేల్చిందా జవాబు. బోర్డు సభ్యులే నివ్వెరపోయారు ఆ జవాబుకి!

ఏమనాలో తెలియక, ''ఓ రెండు నిమిషాలు బయట వేచి ఉండు'' అన్నారు.

తిరిగి పిలిచాక అడిగారు... ''ఎందుకలా చెప్పావు? అబద్దం ఆడి ఉండవచ్చుగా?'' అని నేరుగా అడిగారు.

''అబద్దం చెప్పి ఐపీఎస్‌ ఆఫీసర్‌ని అవడం కంటే... నిజం చెప్పి ఇంటర్వ్యూలో ఫెయిల్‌ అవడమే నయమనుకున్నాను...'' అన్నాడతను చిరునవ్వుతో ధైర్యంగా, నిజాయితీగా.

ఆ తర్వాత ప్రశ్నలకు... అతడు ఆ ఛీటింగ్‌ వ్యవహారం గురించి చెప్పాడు. ఆ ఛీటింగ్‌ వెనకాల ఉండే స్థానిక నాయకుల ప్రాబల్యం గురించి చెప్పాడు. సమాజంలో అధికారం చేసే ఆగడాల గురించి చెప్పాడు. ఓ నిజాయితీ పరుడి చేతిలో అదే అధికారం ఉంటే వ్యవస్థలో మార్పు వస్తుందనే అతడి నమ్మకం గురించి చెప్పాడు.

అప్పుడు దూసుకొచ్చింది ఆఖరి ప్రశ్న, ఇంటర్వ్యూ ఛీఫ్‌ మెంబర్‌ నుంచి...

''ఈ ఇంటర్వ్యూలో ఫెయిలైతే ఏం చేస్తావ్‌?''.

నిజాయితీనే నమ్ముకున్న అతడు స్థిరంగా చెప్పాడు...

''సూర్యుడినై వెలుగు పంచాలనుకున్నాను. ఓడిపోయినా పరవాలేదు. ఇంటికెళ్లిపోయి ఓ దీపాన్నై మా వీధికి వెలుగునిస్తా. ఓ టీచరునై చిన్నపిల్లలకి నిజాయితీని పరిచయం చేసి భావి తరాన్ని తయారు చేస్తా...''

ఆ ఛీఫ్‌ మెంబర్‌ ఊరుకోలేదు...

''ఓకే... యూకెన్‌ గో అండ్‌ బికమ్‌ ఏ స్ట్రీట్‌ ల్యాంప్‌...'' అన్నాడు వెటకారంగా.

అతడు గదిలోంచి బయటకి వచ్చేస్తుంటే... ''వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌...'' అనే ఆ బోర్డు మెంబర్‌ కామెంట్‌ వినిపించింది.

ఆ కామెంట్‌ విన్నాక... అతడికి అర్థం అయింది. ఇన్నాళ్ల తన ప్రయత్నమంతా వృధా!

ఇదేనా నిజాయితీకి దక్కిన ఫలితం? అనుకున్నాడు దిగులుగా.

కానీ... అతడు నమ్మిన నిజాయితీ అతడిని ఓడిపోనివ్వలేదు....

ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లలో చర్చ జరిగింది.

''ఇతడిని సెలెక్ట్‌ చేయకపోతే ఈ ఇంటర్వ్యూలన్నీ వేస్ట్‌...'' అన్నారు మెజర్టీ సభ్యులు!

అలా నిజాయితీ గెలిచింది! ఓ నిరుపేద పల్లెటూరి కుర్రాడిని ఐపీఎస్‌ అధికారిగా యూనిఫాం వేసి కుర్చీలో కూర్చోబెట్టింది!!

................

ఇదంతా... కేవలం 2005 బ్యాచ్‌లో దేశం మొత్తం మీద 121 ర్యాంకుతో సివిల్స్‌ విజేతగా నిలిచిన మనోజ్‌ కుమార్‌ శర్మ కథ కాదు. ఏటా సివిల్స్‌కి సిద్ధమయ్యే లక్షలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే యదార్థం. నిజం చెప్పాలంటే... ఒక్క సివిల్స్‌ విద్యార్థులకే కాదు. ప్రతీ విద్యార్థికీ స్ఫూర్తి దాయకమే. ఇంకా చెప్పాలంటే... ప్రతి ఒక్కరికీ కూడా. ఎందుకంటే, ఓ విద్యార్థి అయినా,  ఉద్యోగి అయినా... ఎవరైనా ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ పోరాటంలో ఓడిపోతూ ఉంటారు. అలా ఓడిపోయిన ప్రతీసారీ తిరిగి తేరుకుని ఎలా పోరాడాలో చెప్పే కథ ఇది. ఓటమిని ఒప్పుకోకుండా మళ్లీ ప్రయత్నించి ఎలా గెలవాలో చెప్పే కథ ఇది. అందుకే ఈ కథ హిందీ రచయిత అనురాగ్‌ పాఠక్‌ని ఆకర్షించింది. ఆయన రాసిన రెండో నవలే 'ట్వెల్త్ ఫెయిల్‌'. ఆయన మొదటి పుస్తకం 'వాట్సాప్‌ పార్‌ క్రాంతి' అనే కథల సంపుటి. ఆ కథలన్నీ సోషల్‌ మీడియా ప్రభావం మీద రాసినవి.  పరీక్షలంటే భయపడే విద్యార్థులందరికీ సాయపడాలనే ఉద్దేశంతో మనోజ్‌కుమార్‌ జీవితాన్ని 'ట్వెల్త్‌ ఫెయిల్‌' నవలగా రాశారీయన. ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ నవల బాలీవుడ్‌ దర్శక నిర్మాత విధు వినోద్‌ చోప్రా దృష్టిలో పడింది. ఆయన సామాన్యుడా? 'మున్నాభాయ్‌', 'త్రీ ఇడియట్స్‌', 'పీకే', 'సంజు' లాంటి మంచి చిత్రాలను అందించిన నిర్మాత. 'పరిందా', '1942-ఎ లవ్‌ స్టోరీ', 'మిషన్‌ కాశ్మీర్‌' లాంటి సినిమాలతో అలరించిన దర్శకుడు. జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి. అలాంటి అతడి చేతిలో పడిన 'ట్వెల్త్‌ ఫెయిల్‌' నవల, ఓ మరపురాని చిత్రంగా తెరకెక్కింది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీస్తే దాదాపు రూ. 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాసుల కంటే అధికంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

మనోజ్‌ కుమార్‌ శర్మ పాత్రలో నటుడు విక్రాంత్‌ మాసీ చాలా చక్కగా కుదిరాడు. టీవీ, సినిమాల నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న ఇతడు మనోజ్‌ పాత్రలో ఒదిగిపోడానికి ఎంతో కష్టపడ్డాడు. మనోజ్‌కుమార్‌ ఐపీఎస్‌ కోసం దిల్లీలో చదువుకునే సమయంలో అతడికి పరిచయమై, ఆ తర్వాత అతడి జీవిత భాగస్వామిగా మారిన శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్‌ అద్భుతంగా నటించింది. అంతక్రితం 'బీచమ్‌ హౌస్‌', 'షాదిస్తాన్‌' 'దిల్‌ బేకరార్‌' చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకి, శ్రద్ధా జోషి పాత్ర పెద్ద బ్రేక్‌గా మారింది. అయిదు ఫిలింఫేర్‌ అవార్డులను అందుకున్న 'ట్వల్త్‌ ఫెయిల్‌' సినిమా, తొలి ఫ్రేమ్‌ నుంచి చివరి వరకు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వదు.

ప్రేక్షకులు మనోజ్‌ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తారు. అతడి కష్టాలు చూసి నిట్టూరుస్తారు. అతడి పట్టుదల చూసి ఆశ్చర్యపోతారు. అతడి పరిస్థితికి కన్నీరుమున్నీరవుతారు.  అతడి అవమానాలకు బాధ పడిపోతారు. ఆఖరికి అతడు గెలిస్తే, తామే గెలిచినంతగా కేరింతలు కొడతారు. అలా అడుగడుగునా ప్రేక్షకులు మమేకమయిపోయేంత గొప్పగా వినోద్‌ చోప్రా సినిమాను మలిచాడు. సినిమాలో చాలా మంది నిజ జీవిత పాత్రలనే పోషించారు. యూపీఎస్సీ కోచ్‌ వికాస్‌ దివ్యకీర్తి అదే పాత్రలో నటించాడు. సివిల్స్‌కి సిద్ధమవుతున్న విద్యార్థులే వేర్వేరు పాత్రల్లో కనిపించారు. ఇది సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది.

ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పడం కన్నా, చూడ్డమే మంచింది. ఈ సినిమాను చూడకపోతే ఏదో మిస్సయ్యేవాళ్లమనే సంగతి... ఆ సినిమాను చూసిన వాళ్లందరికీ అర్థం అవుతుంది. మొత్తం మీద అందరూ 'వితౌట్‌ ఫెయిల్‌' తప్పకుండా చూడాల్సిన సినిమా 'ట్వెల్త్‌ ఫెయిల్‌''.

+ ఈ సినిమాలో నటులను ఎంపిక చేసుకోడానికి పెద్ద ప్రక్రియే జరిగింది. ముఖ్యమైన ఒకో  పాత్రకి 35 మంది కంటే ఎక్కువ మందిని పరీక్షించి మరీ ఎంపిక చేశారు. కానీ మనోజ్‌ కుమార్‌ పాత్రకి మాత్రం విక్రాంత్‌ని ఒక్కరినే పరీక్షించి వెంటనే తీసుకున్నారు.

+ పల్లెటూరి కుర్రాడిగా కనిపించడం కోసం విక్రాంత్‌ ఈ సినిమాలో ఎలాంటి మేకప్‌ వేసుకోలేదు. పైగా సహజత్వం కోసం పల్లెటూర్లో ఎండలో గంటల తరబడి గడిపి, చర్మం రంగును ఛామనఛాయగా మార్చుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతడి చర్మం కొన్ని చోట్ల బాగా కమిలిపోయింది కూడా. ఇది కొన్ని సీన్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

+ మూడేళ్ల కాలంలో ఈ సినిమా స్క్రీన్‌ ప్లేను వినోద్‌ చోప్రా 200 సార్లకు పైగా మార్చి రాసుకున్నాడు.

+ సినిమాలో ట్రూత్‌ అండ్‌ డేర్‌ ఆట సన్నివేశంలో నటి  మేధా శంకర్‌  తనే స్వయంగా లైవ్‌ షూటింగ్‌ లో పాట పాడింది.

+ యూపీఎస్సీ ఇంటర్వ్యూ సన్నివేశాన్ని ఆ భవనంలో చిత్రీకరించడానికి అనుమతించకపోవడంతో అచ్చం అలాగే సెట్ ని వేశారు. సినిమా చూసిన యూపీఎస్సీ ఉద్యోగులు అది సెట్‌ అని గ్రహించలేనంత సహజంగా దాన్ని సృష్టించారు.

+ సినిమాలో చూపించిన గ్రామం సెట్టింగును నిజానికి ముంబై దగ్గర్లో ఎక్కడైనా వేయవచ్చు. కానీ వినోద్‌ చోప్రా అందుకు ఒప్పుకోకుండా చంబల్‌ నది దగ్గర సహజమైన ఓ గ్రామాన్నే ఎంచుకున్నాడు. రోజూ షూటింగ్‌ సిబ్బంది అందరూ మూడు గంటలు ప్రయాణించి ఆ గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది.

+ బాక్సాఫీస్‌ ప్రకారం, 18 ఏళ్ల తర్వాత 25 వారాలు ఆడిన సినిమాగా ఇది నిలిచింది. 

సోమవారం, ఆగస్టు 19, 2024

ఘంటసాల గొంతుకు అడ్డం పడిన చెవి!

ఒక గాయకుడు పాడలేదంటే గొంతు సమస్య కారణం కావచ్చు. కానీ చెవి సమస్య కారణమవుతుందా? ఘంటసాల విషయంలో అదే జరగడం విచిత్రం. సాధారణంగా కొందరు గాయనీ,గాయకుల అలవాట్లు చిత్రంగా ఉంటాయి.  ఘంటసాలకి  రికార్డింగ్ సమయంలో చేతిలో కర్చీఫ్ ఉండాల్సిందే. పొరబాటున మరచిపోతే –‘కర్చీఫ్ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. ఆయనకున్న ఇంకో అలవాటు ఏంటంటే... పాడేటప్పుడు కుడిచెవిని కుడి చేత్తో మూసుకునేవారు. అలా అయితేనే  తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని అయన అభిప్రాయం.  ఒకసారి ఏదో సమస్య వచ్చి  తన పాట తన చెవికి వినిపించనట్లు అనిపించింది ఆయనకు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెవి చూపించుకున్నారు.  డాక్టర్‌ పరీక్షించి ‘ఇదేమంత ఇబ్బంది కాదు. సర్దుకుంటుంది. పాడేందుకు గొంతు అవసరం. మీ గొంతు బాగానే ఉందిగా?’ అన్నారట. అయితే అందుకు ఘంటసాల అంగీకరించలేదు. తన పాట తన చెవికి తన చెవికి వినిపించే దాకా పది రోజులపాటు  రికార్డింగ్ లకు  వెళ్ళలేదు. కొన్నాళ్లకు డాక్టర్‌ చెప్పినట్టుగానే చెవి సమస్య దానంతట అదే సర్డుకొంది. అప్పుడాయన రికార్డింగ్‌కి హాజరయ్యారు. అప్పుడు ఆయన పాడిన పాట ఏంటో తెలుసా? ‘బుద్ధిమంతుడు’ (1969)లో ని ‘వేయి వేణువులు మ్రోగే వేళా... నను పాలింపగ నడచి వచ్చితివా...’ పాట! 


బుధవారం, ఆగస్టు 14, 2024

గోదాట్లో సావిత్రి... అక్కినేని తెలివి!

మూగమనసులు షూటింగ్ గోదావరి మీద జరుగుతున్న సమయంలో ఓ చిన్న ప్రమాదం జరిగింది. పడవ మీద నుంచి సావిత్రి నీటిలో పడిపోయింది. యూనిట్లో ఒక్కసారిగా కలకలం. ఇదంతా ఎలా జరిగిందో చూద్దాం.

ఆ సినిమాలో "ఈనాటి ఈ బంధమేనాటిదో .." పాట చిత్రీకరణ సమయంలో జరిగిందీ సంచలన సంఘటన. పాట షూటింగ్‌ లాంచీపై జరుగుతోంది. హీరో అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్‌ సావిత్రిల మీద చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు . పి . ఎల్ . రాయ్ కెమెరా .  పాటలో భాగంగా "ఎవరు పిలిచారనో... ఏమి చూడాలనో... ఉప్పొంగి ఉరికింది గోదావరీ...." అనే చరణం తీస్తున్నారు. సావిత్రి పడవ మీద నుంచి గోదావరి వైపు ఓ పక్కకు బాగా వంగి అభినయం చేస్తున్నారు. అందరూ ఎవరి హడావుడిలో వాళ్లున్నారు. ఇంతలో లాంచి కింద ఉండే ప్రోపెల్లర్‌ కు సావిత్రి చీర కొంగు తగులుకుంది. ఇంకేముంది? ప్రొపెల్లర్‌ పళ్ళ చక్రం గిర్రున తిరిగేసరికి చీర మరింత చిక్కుకుపోవడంతో సావిత్రి, ఎవరో బలంగా గుంజిలాగినట్టుగా హఠాత్తుగా ఆ లాంచీ మీంచి గోదావరిలో పడిపోయారు. అనుకోని ఉపద్రవమే అయినా చటుక్కున తేరుకున్న సావిత్రి వెంటనే సమయస్ఫూర్తితో  లాంచి అంచును పట్టుకోగలిగారు. ఆమె అలా లాంచీ పట్టుకుని  వేలాడుతుంటే... యూనిట్టంతా హాహాకారాలు. లాంచీ ఆగిపోయింది. మరో పడవలోనున్న యూనిట్ సభ్యులు సావిత్రికి చేయూతనిచ్చేందుకు హడావుడిగా లాంచీలోకి దూకారు. గబగబా ఆమెకు తాడును అందించారు. సావిత్రి తాడు అందుకున్నారు కానీ పైకి రావటం లేదు. ప్రమాదం లేదని తెలుసుకున్న యూనిట్‌ సభ్యులు ఊపిరి పీల్చుకుని ''రండమ్మా... అంటూ అరుస్తున్నారు . అయినా ఆవిడ నీట్లోంచి పైకి రావటం లేదు. పరిస్థితిని ఏయన్నార్ గ్రహించారు. వెంటనే లాంచీలో ఓ మూల ఉన్న కేన్వాస్ పట్టాను సావిత్రికి అందించారు. సాసేపటికి ఆ కాన్వాస్ పట్టాను చుట్టుకుని సావిత్రి బయటకు వచ్చారు. ఆవిడ చీర మొత్తం లాంచీ ప్రోపెలర్ కు చుట్టుకుపోయి ఉంది. అప్పుడుగానీ, సావిత్రి నీటిలోంచి బయటకు రావడానికి ఎందుకు తటపటాయించారో అక్కడివారికి తెలియలేదు. చీర మొత్తం చుట్టుకుపోయి ఉంటుందని ఏయన్నార్ తెలివిగా ఊహించి కాన్వాస్ పట్టాను ఇవ్వడంతో సావిత్రి సమస్య తీరింది.  



మంగళవారం, ఆగస్టు 13, 2024

ఎన్టీఆర్‌ అభిప్రాయం అలా మారింది!

ఇది1965 నాటి మాట.  మద్రాసులో రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ ‘వీరాభిమన్యు’ షూటింగ్ జరుగుతోంది. బ్రేక్ లో నటీనటులంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు.  వారి మాటలు ఉన్నట్టుండి రాజకీయాల వైపు మళ్ళాయి. చర్చ ఆసక్తి కరంగా జరుగుతోంది. ఆ సమయంలో  అక్కడికి శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్‌ వచ్చారు. రసవత్తరంగా సాగుతున్న రాజకీయ చర్చ విని పెదవి, మొహం చిట్లించి, “మనకెందుకు బ్రదర్ ఈ రాజకీయాలు? కూడు పెడతాయా? గుడ్డనిస్తాయా? మన పని సినిమాల్లో నటించడం, మన కుటుంబాల్ని పోషించుకోడం!” అంటూ తన పని లో తాను మునిగిపోయారు.

కట్ చేస్తే... అప్పటికి పదిహేడేళ్ళ తర్వాత 1982 లో ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టడం, ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే! ఎవరికైనా కాలాన్ని బట్టి అభిప్రాయాలు, ఇష్టానిష్టాలు మారుతుంటాయనడానికి ఇదో ఉదాహరణ.  

సోమవారం, ఆగస్టు 12, 2024

అరుదైన యోగం... అద్భుత ప్రయాణం!

నదుల్లో పుణ్య స్నానాలు అందరం చేస్తాం... 

ఓ దణ్ణం పెట్టుకుని, మూడు మునకలు వేసి చక్కా వస్తాం... 

ఏ సంకల్పమో చెప్పుకున్నా సాధారణంగా అది రెండు మూడు నిమిషాల వ్యవహారం... 

కానీ దాదాపు గంట సేపు చేసే పుణ్యస్నానం అనుభవంలోకి రావడం అరుదైన విషయం... 

శాస్త్ర నిర్దేశితంగా, సంప్రదాయబద్దంగా, విపులంగా, అనేక అంశాలను స్పృశిస్తూ... దేవ, రుషి తర్పణాలను, అర్ఘ్యాలను, పితృదేవతలకు జలతర్పణాలను అర్పిస్తూ, జన్మజన్మల పరంపరలో చేసే అనేకానేక పాతకాలను, పాపాలను ఉటంకిస్తూ వాటి నుంచి ప్రక్షాళన కోరుతూ, ప్రార్థన చేస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో తలమునకలవుతూ పునీతలమయ్యేలా చేసే పవిత్ర స్నానం ఎంతటి సంతృప్తిని కలిగిస్తుందో తొలిసారి అనుభవంలోకి వచ్చింది ఆదివారం నాడు.

ఈ ఆదివారం సామాన్యమైనది కాదు. పుష్యమీ నక్షత్రం, అమావాస్యలతో కూడి అరుదుగా వచ్చే భానువారం. ఈ రోజున గోదావరి స్నానం అత్యంత పుణ్యప్రదమైనదని శాస్త్రం చెబుతోంది. 'పుష్యార్క యోగం' అనే ఈ పుణ్యస్నానాన్ని ఆగస్టు 4 ఆదివారం నాడు సరస్వతి కొలువైన బాసర క్షేత్రంలో ఆచరించగలిగాం. 

ఈ యాత్ర చేయాలనే సంకల్పం, అందుకు తగిన ఏర్పాట్లు చేయడం, ఇందులో పాల్గొన్న అందరి చేతా సంపూర్ణ శాస్త్రీయ సంకల్ప సహితంగా పవిత్ర స్నానాలు చేయించడం వెనుక ఘనతంతా హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులైన మద్దికుంట శ్రీకాంత్‌ శర్మ గారికే చెందుతుంది. 

హైదరాబాద్‌ నుంచి శ్రీకాంత్‌ శర్మగారితో పాటు, నేను, శ్రీనివాసన్‌గారు, రమణరావుగారు, గోపాల కృష్ణగారు కలిసి కారులో బాసర యాత్రకు బయల్దేరాం. ఉదయం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఎన్నో చక్కని అనుభూతులు. ప్రయాణమంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఇదొక చక్కని సత్సంగ యాత్రగా మంచి జ్క్షాపకాలను మిగిల్చింది. దారి పొడవునా ధర్మపరమైన ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. మా అందరి సందేహాలకు శ్రీకాంత్‌ శర్మ గారు ధర్మపరమైన సమాధానాలు అందించారు. అందరి కబుర్లలో ఎన్నో మంచి విషయాలు చోటు చేసుకున్నాయి. 

ఎల్‌ అండ్‌ టీ సంస్థతో పెద్ద హోదాలో ఉన్న శ్రీనివాసన్‌ గారు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి రిటైరయిన గోపాల కృష్ణగారు పంచుకున్న అంశాల ద్వారా అన్ని ధర్మాల కన్నా మానవత్వమే సాటిలేనిదని అర్థమైంది. ఓ కుగ్రామంలో తన మేనత్త చనిపోతే, పాడె మోయడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో శ్రీనివాసన్‌ గారు చొరవ తీసుకుని మరో వ్యక్తి సాయంతో కేవలం ఇద్దరే కలిసి పాడె మోసి, ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపించడం... ఆఫీసు పని మీద, ఆఫీసు కారులో, బాస్‌తో కలిసి ప్రయాణిస్తూ, దారిలో ఎవరో యాక్సిడెంటుకు గురైన విషయాన్ని గుర్తించి కారు ఆపించి, ఆ ప్రమాదంలో కాలు విరిగి బాధపడుతున్న మహిళను దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించడం...   గోపాలకృష్ణగారు కూడా తన బంధువొకరు చనిపోయినప్పుడు అనవసర భయాలను, సందేహాలను పక్కన పెట్టి, సొంతవారు సైతం వారిస్తున్నా వినకుండా అంత్యక్రియలు జరిపించడం... లాంటి విషయాలు వింటుంటే అందరూ వీరిలాగా స్పందించగలిగితే సమాజం ఎంత బాగుంటుందో కదా అనిపించింది. 

బాసరలో కన్నా నిజామాబాద్‌ జిల్లాలోని పుష్కర ఘాట్‌లో గోదావరి జలాలు నిర్మలంగా ఉంటాయనుకుని బినోలా గ్రామానికి ముందుగా వెళ్లాం. అక్కడ మేం ఊహించిట్టుగా స్నానం చేయడానికి అనువైన పరిస్థితులు లేకపోయినా, ఆ తీరంలోని ఓ పురాతనమైన ఆలయంలో కొలువైన గౌతమేశ్వరుడిని దర్శించుకున్నాం. గర్భగుడిలోకి వెళ్లి శివాభిషేకం చేసుకుని, లేత మారేడు దళాలతో అర్చించుకుని ఓ మంచి అనుభూతిని పొందాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వృద్ధుడైన ఆ గుడి అర్చకుడు మా అందరినీ భోజనాని ఆహ్వానించడం. స్నానాలకు వచ్చిన వారందరికీ ఆ అర్చకుడు, ఆయన కుటుంబీకులు కలిసి స్వయంగా వండి అన్నదానం చేస్తారట. 

ఎక్కడో మారుమూల గ్రామంలో, ప్రధాన రహదారికి దూరంగా పంట పొలాల మధ్యగా సాగే మట్టి దారిలో, ఆ స్నానాలరేవుకి వచ్చే వారందరికీ వాళ్లు ఇలా ప్రతి రోజూ చేస్తారని తెలిసి ఎంతో ఆశ్చర్యమనిపించింది. ఆ గుడి ఆవరణలో అప్పటికే వంట కార్యక్రమాలు సాగుతున్నాయి. 

ఇదే కదా అసలైన ఆధ్యాత్మికత అంటే? అనిపించింది వారిని చూస్తే. పోనీ ఆ గుడికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు సైతం ఏమీ అందుతున్నట్టు కనిపించలేదు. అయినా ఆ బడుగు వృద్ధుడి ప్రయత్నం చూస్తే అన్నదాన సంకల్పానికి పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని అర్థమైంది. అక్కడికి అరుదుగా వచ్చే యాత్రికుల మీదనే వారు ఆధారపడి ఉండొచ్చు. కానీ వచ్చిన వారందరికీ వండి వార్చి వడ్డించాలని ఎక్కడుంది? ఆ వృద్ధుడికి తోచిన ఆర్థిక సాయం తలా కాస్తా అందించి తిరిగి బాసరకు బయల్దేరి మధ్యాహ్నానికల్లా బాసర చేరుకున్నాం. 

అక్కడ ఓ ఘాట్‌లో ఉరవడిగా ప్రవహిస్తున్న గోదావరిలో తనివితీరా, సంతృప్తికరంగా, ఆధ్యాత్మికంగా పవిత్ర స్నానాలను ఆచరించాం. ఆ తీరంలోనే సిమెంటు చప్టా మీద శ్రీకాంత్‌ శర్మగారి మార్గదర్శకత్వంలో అపరాహ్నం వేళ అమావాస్య తిల తర్పణాలను పితృదేవతలకు సమర్పించుకున్నాం. ఆ తర్వాత అందరం బాసరలోని బ్రాహ్మణ అన్నదాన ఆశ్రమానికి వెళ్లాం. అక్కడ భోజనం నిజంగా అమృతప్రాయంగా ఉంది. కలగలుపు పప్పు,రెండు కూరలు, రసం, స్వీటు, అప్పడం లాంటి పదార్థాలను హాయిగా ఆరగించి, ఆ సత్రానికి ఇతోధికంగా ఆర్థిక విరాళాలు అందించి, బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లాం. 

మాతో వచ్చిన రమణరావుగారు ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి. ఆయన ఆలయ ఈవోకి ఫోన్‌ చేయడంతో ఒక వ్యక్తి ప్రత్యేకంగా మా కూడా వచ్చి దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించాడు. వ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠించి పూజించి జ్ఞాన సరస్వతిని ప్రత్యక్షం చేసుకున్న ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని తనివి తీరా దర్శించకుని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాం. ఈ మొత్తం ప్రయాణమంతా రమణరావుగారే కారు డ్రైవ్‌ చేశారు. మేం యాత్ర చేసిన ఎర్టిగా కారు కూడా ఆయనదే. రానూ పోనూ దాదాపు 9 గంటల పాటు సాగిన యాత్రలో రమణరావు గారు ఎక్కడా ఎలాంటి అలసటకు కానీ, విసుగుదలకు కానీ గురి కాకుండా సురక్షితంగా హాయిగా మా ప్రయాణం సాగేలా చేశారు. అందరం కలిగి  హైదరాబాద్‌కి రాత్రి పదిన్నర కల్లా చేరుకోవడంతో మా బాసర యాత్ర ముగిసింది. నిజంగా ఇదొక అరుదైన యోగం... అద్భుత ప్రయాణం!