ఆదివారం, అక్టోబర్ 12, 2025

ఎలక్ట్రాన్ గారూ... మీ వయసెంత సారూ?

 









ఒకసారి మీ శరీరం కేసి చూసుకోండి... ఇప్పుడు ఓసారి తలెత్తి ఆకాశం కేసి చూడండి... మీ శరీరమైనా, ఆకాశంలో కనిపించే తారలైనా అన్నింటిలోనూ కనిపించే అతి సాధారణ, ప్రాథమిక కణం ఏంటి? ఎలక్ట్రాన్. మీ లోను, ఈ సమస్త విశ్వంలోనూ కూడా ఉండే ఈ ఎలక్ట్రాన్లు సామాన్యమైనవి కావు. ఇవి లేందే ఈ విశ్వమే లేదు. వీటితోనే పరమాణువులు, వాటితోనే మన కంటికి కనిపించే జగత్తంతా తయారైంది. వీటి గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇవి ఈ విశ్వం కన్నా ఎక్కువ కాలం ఉండగలవని. ఎప్పటికో అప్పటికి ఈ సమస్త విశ్వం నశిస్తుందనే చెబుతారు కదా, కానీ ఎలక్ట్రాన్లు మాత్రం విశ్వం వయసుకి మించి బిలియన్ ట్రిలియన్ రెట్లు అధికంగానే మనగలుగుతాయట. తాజా అంచనాల ప్రకారం ఒక ఎలక్ట్రాన్ జీవిత కాలం 66,000 యోట్టా ఏళ్లు. అంటే ‘6.6 ఇంటూ 10 టుది పవర్ ఆఫ్ 28’ ఏళ్లు. ఇది విశ్వం వయసుతో పోలిస్తే బిలియన్ ట్రిలియన్ రెట్లు అధికం. పోలిక కోసం చూడాలంటే... ఈ విశ్వం పుట్టి ఇప్పటికి 13.8 బిలియన్ సంవత్సరాలు అయింది. అంటే ఎలక్ట్రాన్లు అంత స్థిరమైన ప్రాథమిక కణాలన్నమాట. ఇవంటూ ఉన్నయి కాబట్టే అణువులు ఏర్పడుతున్నాయి. వాటితోనే మనం, సకల జీవ రాశులు, ఈ విశ్వం అన్నీ ఉనికిలోకి వచ్చాయి. గ్రాండ్ యూనిఫైడ్ థీరీస్ లాంటి సిద్ధాంతాల ప్రకారం ఎలక్ట్రాన్లు అనూహ్య కాలం తర్వాతనైనా నశిస్తాయని అంటున్నారు కానీ, దానికి ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు కనిపించలేదు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే విశ్వంలో అమరత్వం ఉన్న కణాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎలక్ట్రాన్లే అనుకోవాలి.

శుక్రవారం, అక్టోబర్ 03, 2025

మెదడా? మజాకా

    ‘అరె... ఏం మెదడురా నీది?’అంటూ ఎవరినైనా ఆట పట్టిస్తాం కానీ, నిజానికి మనందరి మెదళ్లూ అంతే. 
    విశ్వం మొత్తం మీద అత్యంత సంక్లిష్టమైన అంశాల్లో మనిషి మెదడు ఒకటి. ఎవరిదైనా సరే, మెదడులో 86 బిలయన్ న్యూరాన్లు ఉంటాయి. అంటే 8600 కోట్లన్నమాట. ఇవన్నీ కలిసి ఒకదానితో ఒకటి వేలాది రకాలుగా అనుసంధానం అవుతూ ఉంటాయి. సినాప్సెస్ అనే ఈ కలయికలన్నీ కలిసి మొత్తం 100 ట్రిలియన్లు ఉంటాయి. అంటే కోటి కోట్లు అన్నమాట. 
    ఇప్పుడొక పోలిక చూద్దాం. మన భూమి, సూర్యకుటుంబం ఉండే మన పాలపుంత నక్షత్ర మండలంలో దాదాపు 100 నుంచి 400 బిలియన్ల తారలు ఉంటాయని అంచనా. అంటే అత్యధికంగా 40 వేల కోట్లన్న మాట. 
    దీన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది? 
    మన మెదడులో న్యూరాన్ల కలయికల సంఖ్య పాలపుంతలోని నక్షత్రాల సంఖ్య కన్నా ఎన్నో రెట్లు ఎక్కువనే కదా. 
    ఇలా మన మెదడులో ఉండే న్యూరాన్ల కలయికల వల్ల మన ఆలోచనలు, గురుతులు, భావోద్వేగాలు కలుగుతూ మన ప్రవర్తనను నిర్దేశిస్తూ ఉంటాయి. 
    చూశారా, మన మెదడు శక్తి ఎంత గొప్పదో. మరి మెదడా? మజాకా? 

బుధవారం, అక్టోబర్ 01, 2025

నిరంతర ప్రయాణికులం మనం


 

మనం కదలకుండా కూర్చునే ఉండవచ్చు. కానీ మన భూమి మాత్రం అలా కాదు. నిరంతరం గంటకు 1000 మైళ్ల వేగంతో కదులుతూనే ఉంది. తన చుట్టూ తాను అంత వేగంతో కదులుతూ మనకి పగలు, రాత్రి ఇస్తోంది. అలాగే సూర్యుని చుట్టూ గంటకు 67,000 మైళ్ల వేగంతో తిరుగుతోంది. ఇలా ఏడాదికి 584 మిలియన్‌ మైళ్ల దూరం ప్రయాణిస్తోంది. ఇంత ప్రచండ వేగంతో తిరుగుతూ ఉన్నా మనకేమీ అనిపించదు. ఎందుకంటే భ్యూమ్యాకర్షణ శక్తి మనలందరినీ మన చుట్టూ ఉన్న వాతావరణంతో సహా బలంగా పట్టి ఉంచుతుంది కాబట్టి. మనకి మనం స్థిరంగానే ఉన్నట్టు ఉంటుంది కానీ, మనందరం ఈ భూమి మీద అనూహ్యమైన వేగంతో అంతుతెలియని అంతరిక్షంలో కదిలిపోతున్న ప్రయాణికులమే.

గురువారం, సెప్టెంబర్ 18, 2025

ఉపవాసం కొత్త ఉపయోగం!


 ఉపవాసం ఎంత మంచిదో ఇప్పటికే సైన్స్‌ పరిశోధనలు ఎన్నో నిరూపించాయి కదా! ఉపవాసం  ఉపయోగాల గురించి రెండు నోబెల్‌ బహుమతులు కూడా వచ్చినట్టు చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు మరో శాస్త్రీయ పరిశీలన తిరిగి ఉపవాసం సత్ఫలితాల గురించి కొత్తగా బయటపెట్టింది. చాలా మంది బరువును నియంత్రించుకోడానికి ఉపవాసాలు చేస్తుంటారు కదా. కానీ దాన్ని మించిన ప్రయోజనం ఉందని తాజాగా తేలింది. సరైన పద్దతిలో నియంత్రణతో చేసే ఉపవాసాలు హార్ట్‌ ఎటాక్‌ల ప్రమాదాన్ని కూడా చాలా తగ్గిస్తుందని నిరూపణ అయింది. గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే బ్లడ్‌ క్లాట్స్‌ను ఉపవాసాలు నివారిస్తాయని తేలింది. ఉపవాసాల సమయంలో శరీరం తనను తాను బాగు చేసుకుంటుంది. రక్తంలో హాని కరమైన ఫ్యాట్స్‌, ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను ఉపవాసం తగ్గిస్తుంది. ఇందువల్ల రక్తంలో ప్లేట్‌ లెట్లు ఒక చోట పోగుపడి క్లాట్స్‌ గా మారే ప్రమాదం తగ్గిపోతుంది. రక్తం సులువుగా ప్రవహించడంతో అకస్మాత్తుగా హార్ట్‌ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇలా గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా శరీరంలో ఇన్సులిన్‌ సక్రమంగా ఉత్పత్తి అవడానికి, కొవ్వు నియంత్రణకి కూడా ఉపవాసాలు ఉపయోగపడతాయి. మొత్తానికి వైద్య పరిభాషలో చెప్పే ఓవరాల్‌ మెటాబాలిక్‌ హెల్త్‌ కూడా బాగుపడుతుంది. అయితే ఉపవాసాలను సరైన పద్ధతిలో, నియంత్రణతో చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద సరైన ఆహార అలవాట్లు ఆరోగ్యకరమైన గుండెకు దోహదపడతాయని తేలిందన్నమాటే. అంటే మంచి న్యూట్రిషన్స్‌తో కూడిన ఆహారం, తగిన వ్యాయామం హృద్రోగాల నుంచి సురక్షితంగా ఉంచుతాయని మరోసారి తేటతెల్లమైంది. 

బుధవారం, జులై 30, 2025

మాస్‌ సినిమాలకు తగ్గని 'మహావతార్‌'!


చప్పట్లు...

ఈలలు...

కేకలు...

ఇవన్నీ థియేటర్లో వినిపిస్తున్నాయంటే ఏంటి దానర్థం?

అది మాస్‌ సినిమా అయ్యుండాలి...

హీరో ఇమేజ్‌ అదిరిపోయి ఉండాలి...

పాటలు ఉర్రూతలూగిస్తూ ఉండాలి...

ఫైట్లు, డ్యాన్సులు ఆకట్టుకుని ఉండాలి...

కానీ ఇవేమీ లేకుండాలనే థియేటర్‌ చప్పట్లు, ఈలలు, కేకలతో సందడిగా మారితే?

అది చాలా అరుదైన విషయమే!

అదే జరుగుతోంది ఇప్పుడు చాలా థియేటర్లలో...

అయితే అది మాస్‌ సినిమానా? కాదు!

అగ్ర కథానాయకుడి సినిమానా? కాదు!

హీరో హీరోయిన్ల డ్యాన్సులు అదిరాయా?

అబ్బే... అసలు డ్యూయెట్లే లేవు!

పోనీ హాలీవుడ్ యాక్షన్‌ సినిమానా? కానే కాదు!

చిత్రంగా ఉందే... ఇంతకీ ఏంటా సినిమా?

సాదాసీదా భక్తి సినిమా!

అందరికీ తెలిసిన కథతో తీసిన సినిమా!

మామూలు యానిమేషన్‌ సినిమా!

అదే... ''మహావతార్‌ నరసింహ'' సినిమా!

పెద్దగా ప్రచారం లేకుండానే థియేటర్లలోకి వచ్చిన  ఈ యానిమేషన్‌ సినిమాకు తల్లిదండ్రులు పనిగట్టుకుని పిల్లలతో కలసి వస్తున్నారు. ఒకరికొకరు చెప్పుకుని మరీ చూస్తున్నారు. సినిమాలో చాలా చోట్ల ఈతరం పిల్లలు, నవతరం యువతీ యువకులు చప్పట్లు, ఈలలు, కేకలతో థియేటర్లను ఊదరగొడుగున్నారు.

అవడానికి ప్రహ్లాదుడి కథే! హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోతే వరాహస్వామి అవతరించడం, హిరణ్యకశిపుడు గొంతెమ్మ కోరికలు కోరుతూ తపస్సు చేస్తే బ్రహ్మ వరాలివ్వడం, ఆ వరగర్వంతో విష్ణు ద్వేషిగా మారి అకృత్యాలు చేయడం, తన కొడుకు ప్రహ్లాదుడే హరి భక్తుడవడంతో

నానా కష్టాలూ పెట్టడం, ఆఖరికి విష్ణువు నరసింహ స్వామిగా అవతరించి, బ్రహ్మ వరాలకు అనుగుణంగానే హిరణ్యకశిపుడిని సంహరించడం!

ఈ కథతో గతంలో దాదాపు అన్ని భాషల్లో పూర్తి స్థాయి ఫీచర్‌ ఫిల్ములు వచ్చాయి. తెలుగులోనే రెండు మూడు సినిమాలు వచ్చాయి.

అయినా ఇది ఈతరం వాళ్లని బాగా ఆకట్టుకుంటోందనడానికి థియేటర్లలో సందడే కాదు, వసూళ్లు కూడా ప్రత్యక్ష సాక్ష్యాలే.

రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ 141 నిమిషాల యానిమేషన్‌ సినిమా జులై 25న విడుదలై ఆరు రోజుల్లోనే దాదాపు రూ. 38 కోట్లు వసూలు చేసిందంటే చెప్పుకోదగ్గ విషయమే.

సినిమా దర్శుకుడు అశ్విన్‌ కుమార్‌. ఎడిటింగ్‌ కూడా అతడే. రచనలో కూడా భాగస్వామ్యం ఉంది.

బాగా తెలిసిన పురాణ కథే అయినా, అందులోనూ యానిమేషన్‌ సినిమానే అయినా ఓ కమర్షియల్‌, మాస్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ''మహావతార్‌ నరసింహ'' సినిమాను తెరకెక్కించిన అతడిని అభినందించాల్సిందే.

అందులోనూ... సినిమాకు వచ్చినా వెండితెర మీద కన్నా చేతిలోని సెల్‌ ఫోన్‌ తెరమీదే దృష్టి నిలిపే ఈతరం వాళ్లని కూడా ఆకట్టుకునేలా తీసినందుకు మెచ్చుకోవలసిందే.

పౌరాణిక సినిమాలనగానే పురాణాల్లోని మూల కథకి సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు కల్పనలు జోడించి ప్రేక్షకుల మీదకు వదిలేసిన అనేక సినిమాల్లాంటిది కాదిది.

సినిమా మొదట్లోనే చెప్పినట్టు.... పురాణాలను గౌరవిస్తూ, మూలకథకి ఎక్కడా భంగం కలగకుండా తీయడం ఓ మంచి విషయం. ఇందులోనూ కల్పనలు ఉన్నా, కొంత డ్రామాను జోడించినా, నేటి తరానికి తగ్గట్టుగా తీసినా... ఎక్కడా మితి మీరకుండా, పాత్రల ఔచిత్యానికి అనుగుణంగా తీయడం మరో గొప్ప విషయం. 

తీసేలా తీస్తే, భావోద్వేగాలను చక్కగా వ్యక్తీకరించగలిగితే, తగిన సన్నివేశాలతో కథను మలచగలిగితే అది పురాణ కథ అయినా, భక్తి కథ అయినా, మరే కథ లయినా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సినిమా చర్చల దగ్గర నుంచి తెరకెక్కేవరకు చూసుకుంటే దాదాపు నాలుగున్నరేళ్లు  పట్టింది. 

ఈ చిత్ర నిర్మాణ సమయంలో చిత్రం యూనిట్‌ వాళ్లెవరూ మాంసాహారాన్ని ముట్టుకోలేదు. కొందరైతే ఏకాదశి ఉపవాసాలు సైతం చేశారు. 

అంతటి భక్తి శ్రద్ధలతో తీశారు కాబట్టే... ఓ యానిమేషన్‌ అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించిన సినిమాగా ఇది అందరినీ అలరిస్తోంది. 

'మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌'లో భాగంగా తలపెట్టిన ఏడు సినిమాల్లో ఇది కూడా ఒకటి. విష్ణుమూర్తి పది అవతారాలపై తీయనున్న సినిమాల్లో మొదటిది ఇది. ఈ సినిమాలన్నీ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రానున్నాయి.

ఈ సినిమా తర్వాత 'మహావతార్‌ పరశురామ్‌' (2027), 'మహావతార్‌ రఘునందన్‌' (2029), 'మహావతార్‌ ద్వారకాధీశ్‌' (2031), 'మహావతార్‌ గోకులనంద' (2033), 'మహావతార్‌ కల్కి'-1 (2035), 'మహావతార్‌ కల్కి-2' (2037) సినిమాలను రూపొందించే పనిలో దర్శక నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు లక్ష్యాలు పెట్టుకున్నారు. హోంబాలే ఫిలింస్‌, క్లీం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రానున్న ఈ సినిమాలన్నీ విజయవంతం కావడంతో పాటు నవతరం ప్రేక్షకులకు హిందూ పురాణ కథలను మరోసారి అద్భుతంగా పరిచయం చేస్తాయని ఆశిద్దాం.