మంగళవారం, జనవరి 06, 2026

వెంకన్నతో... ఏకాంతంలో...



 

స్వామి--నేను

స్వామి: 
--------------
ఏంటయ్యా ఇలా వచ్చావ్, అది కూడా ఇంత చలిలో

నేను: 
------------
నిన్ను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామీ

స్వామి:
-------------
ఐతే నా దర్శనం కోసం నువ్వేమైనా చేస్తావా

నేను:
------------
అవును స్వామి, అలిపిరి మెట్లు ఎక్కమన్నా ఎక్కుతా గంటల తరబడి waiting hall లో ఉండమన్నా ఉంటా చలి చూడను, ఎండను పట్టించుకోను మంచుందని భయపడను

స్వామి:
--------------
 నా దర్శనం ఎందుకు నీకు

నేను:
-----------
 అదేంటి స్వామీ అలా అంటారు. నిన్ను చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అంతా ఇంత కాదు

స్వామి:
---------------
నన్ను చూస్తే నీకు ఇవన్నీ కలుగుతాయంటావు, అవునా,

నేను:
------------
అవును స్వామి

స్వామి:
--------------
దేవుడు అంటే ఏమిటి నీ దృష్టిలో

నేను:
-------------
 దేవుడు అంటే మనల్ని నడిపించే నమ్మకం కాపాడే శక్తి, కాసే కాపు.

స్వామి:
--------------

ఇవన్నీ నేను చేస్తానా

నేను:
------------
చేస్తున్నావు కాబట్టే కదా స్వామీ ఇంతమంది నిన్ను ఇలా కొలుస్తున్నది.

స్వామి:
---------------
నీ దృష్టిలో ఇలాంటివి చేసేవాళ్లే దేవుళ్లు అంటావు, అంతేనా

నేను:
------------
అవును స్వామీ

స్వామి:
--------------
ఇంత కన్నా ఎక్కువ చేస్తే

నేను:
-----------
అసంభవం స్వామీ, ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయరు, చేయలేరు నిన్ను మించిన majesty ఎవరూ లేరు,ఉండరు.

స్వామి: 
-------------
అదేంటయ్యా, ఉంటే ఏం చేస్తావ్

నేను: 
------------
ఉండనే ఉండరు.స్వామి
 ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఉంటే నా ఊపిరి ఆగే వరకూ వాళ్లకు సేవ చేస్తా

స్వామి: 
---------------

సరే, ready ఐపో

నేను:
------------
 ఏంటి స్వామి, నిజంగా నీకన్నా నాకోసం ఎక్కువ కష్టపడే వాళ్లు ఉన్నారా

స్వామి: ఉన్నారు
-------------
నేను:
----------
 ఎవరు స్వామి, వాళ్లు ఎక్కడ ఉంటారు

స్వామి: ఉన్నారు
------------

నేను: 
-----------
ఎవరు స్వామి, వాళ్లు ఎక్కడ ఉంటారు.

స్వామి:
------------
నీ కోసం నీకంటే ముందు మేల్కొన్న వాళ్లు నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్లు నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్లు నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్లు.

నేను:
------------
స్వామీ, అలా మాట్లాడొద్దు, అర్థమవుతోంది.

స్వామి: 
--------------
నీవు అలిపిరి మెట్లు ఎక్కుతావన్నావు కదా వాళ్లు నీ పుట్టుక నుంచే జీవితమంతా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు నీవు గంటల తరబడి waiting hall లో ఉంటావన్నావు. వాళ్లు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు

నేను:
------------
స్వామీ, ఆపండి, నా గుండె తట్టుకోలేకపోతోంది

స్వామి:
-------------
నీవు చలిని పట్టించుకోనన్నావు వాళ్లు వర్షాన్ని, ఎండను, ఆకలిని కూడా పట్టించుకోలేదు నీవు మంచుకి భయపడనన్నావు వాళ్లు అప్పుల్ని, అవమానాల్ని, ఒంటరితనాన్ని భయపడలేదు

నేను:
-----------
స్వామీ, వాళ్లేనా

స్వామి: 
--------------

అవును నిన్ను భవిష్యత్తులా చూసిన వాళ్లు నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్లు
నీ ఓటమిలో కూడా నిన్ను వదలని వాళ్లు

నేను:
------------
వాళ్లు ఎవరో కాదు, మా అమ్మా, నాన్నా కదా స్వామీ

స్వామి:
--------------
నువ్వు నా కోసం వచ్చావ్ కానీ నిన్ను నా దగ్గరకు నడిపించింది వాళ్లే నన్ను చూసి ధైర్యం వస్తుందన్నావు నీకు ధైర్యం నేర్పింది వాళ్లే

నేను:
-----------
స్వామీ, నేను ఇంతకాలం దర్శనాల వెంటే పరిగెత్తాను కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్లను చూడలేకపోయాను

స్వామి:
--------------
అందుకే చెప్పాను నా దగ్గరకు రావడం పుణ్యం కానీ వాళ్ల దగ్గర ఉండటం మోక్షం

నేను:
-----------
స్వామీ, ఇక నా సేవ అక్కడే నా ఊపిరి ఆగే వరకూ ఆ ఇద్దరికీ

స్వామి:
-------------
ఎప్పుడైతే నీ తల్లితండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావోఅప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు.
అంతవరకూ నువ్వెన్ని సార్లు మెట్లెక్కినా ఎన్ని ముడుపులు కట్టినా నా హుండీలోకి ఎన్ని డబ్బులేసినా నాకోసం నీ తలనీలాలిచ్చినా నా తలకు బంగారు కిరీటం పెట్టినా అవన్నీ వేస్ట్.

వచ్చి నా దర్శనం చేసుకుని రెండు reels చేసి అవి social media లో post చేసి  వైరల్ అవుతావు తప్ప లైఫ్ లో సక్సెస్ అవ్వవు.

నీ తల్లితండ్రుల కళ్లలో హాయిగా నిద్ర వస్తే అదే నీ first success వాళ్ల ఒంటికి, మెదడుకి రోగాలు లేకుండా వాళ్ల ముఖంలో భయం తగ్గితే అదే నీ real ప్రమోషన్.

వాళ్ల బాధ్యతలు కొన్ని నీ భుజాన వేసుకో నన్ను పూజించడమంటే పూలు, కొబ్బరికాయలు కాదు
మీ అమ్మ అలసినప్పుడు ఒక్క గ్లాస్ నీళ్లు ఇవ్వడం
నీ నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కన కూర్చోవడం.

నువ్వు నాకోసం వ్రతాలు చేస్తే ఆకాశం నుంచి నేను చూడగలను.
కానీ వాళ్ల కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు
నేనే నీ ఇంటికొచ్చి కూర్చుంటాను.

నా గుడిలో నువ్వు భక్తుడిగా కాదు  మీ ఇంట్లో 
మీ అమ్మానాన్నలకు సేవ చేసే
అర్చకుడిగా ఉండిపో

అందుకే గుర్తుంచుకో

నా కాళ్ల దగ్గర పువ్వులు కాదు.
మీ తల్లితండ్రుల చేతుల్లో నేనున్నానే భరోసా పెట్టు
నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే
మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే.

24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్లు అలాంటి వాళ్లకోసం నువ్వెంత చేసినా తక్కువే.

అందుకే గుర్తుంచుకో
నా కాళ్ల దగ్గర పువ్వులు కాదు
మీ తల్లితండ్రుల చేతుల్లో నేనున్నానే భరోసా పెట్టు

నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే
24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్లు అలాంటి వాళ్లకోసం నువ్వెంత చేసినా తక్కువే

మా అమ్మ వకుళ మాత ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది బిడ్డ ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అని
అలాంటి తల్లితండ్రులను మించిన దేవుళ్లు ఉండరు.

చివరగా ఒక్క మాట

దేవుళ్లకు, అమ్మానాన్నలకు ఉండే చిన్న తేడా ఏంటో చెప్తా విను పడిపోయాక పట్టుకునే వాళ్లు దేవుళ్లు.

పడిపోకుండా పట్టుకునే వాళ్లు మీ తల్లితండ్రులు
వాళ్లను మించిన దేవుళ్లు లేరు.

(ఎవరు రాశారో కానీ... బాగుందని...) 

(బొమ్మ వాడకం... బాపుగారిపై వెలకట్టలేని అభిమానంతో చనువుగా...) 

సోమవారం, జనవరి 05, 2026

ఓ నాన్నా... నీ మనసే వెన్న!




 బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.

“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.

“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.

దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.

“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా.

“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.

మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన సత్యలోకం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.

అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.

బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.

“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.

“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.

“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామీ” అని సమాధానం చెప్పాను.

ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.

ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.

ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.

మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.

కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.

నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండె చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.

నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.

“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.

నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.

ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.

“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.

“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.

“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.

“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.

ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.

అమ్మ దేవుడి అంశ అయితే, 
నాన్న సాక్ష్యాత్ దేవుడే

ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు అంకితం

(ఎవరో రాశారు.. మరెవరో ఫార్వర్ఢ్ చేశారు...) 

ఆదివారం, జనవరి 04, 2026

రమణుల జీవితం... అజరామరం

 

 


రమణ మహర్షి జయంతి.
మార్గశిర మాసం, అనురాధ నక్షత్రం.

ఒకసారి గతంలోకి తొంగి చూస్తే డిసెంబరు 30 , 1879 వ సంవత్సరంలో  తమిళనాడు రాష్ట్రం తిరుచ్చుళి లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో రమణ మహర్షి జన్మించారు. ఇతనికి తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. ఇతనిని భక్తులు భగవాన్ అని కూడా సంభోదిస్తారు. 

16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నారు.

రమణ మహర్షి బాల్యం

పూర్వాశ్రమంలో రమణ మహర్షి అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవారు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవారు. బాల్యంలో చదువు మీద ఆసక్తి లేదు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవారు. ఎలాంటి నిద్ర అంటే ఇతను నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా తెలిసేదికాదు.  

రమణ మహర్షి  తండ్రి చనిపోవడం వల్ల చిన్నాన్న సుబ్బయ్యర్ రమణ అన్నయ్య నాగస్వామిని , రమణను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే అతను అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగారు. అతను అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా , ఆమాట విన్న తరువాత అతనిలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయడం , రుచుల కోసం ప్రాకులాడటం మానేశారు. తన గమ్యం తిరువణ్ణామలై(అరుణాచలం) అని తెలుసుకున్నారు. తన కోసం వెతకవద్దని తన తండ్రి(పరమేశ్వరుడు)ని వెతుక్కుంటూ వెళ్తున్నానని ఓ ఉత్తరం వ్రాసి అన్నయ్య నాగస్వామి పుస్తకంలో ఉంచి మధురై నుంచి అంచెలంచెలుగా ప్రయాణం చేసి అరుణాచలేశ్వరుని చెంతకు రమణ మహర్షి చేరుకున్నారు. వారి వంశంలో ఒకరు సన్యాసి అవుతారనే శాపం నిజమైంది. 

ఇంటి నుంచి వెళ్లిపోయిన రమణ మహర్షి గురించి ఎంత వెతికినా ఆ కుటుంబ సభ్యులకు ఆచూకీ తెలియలేదు. కొంత కాలం తర్వాత బాబాయి సుబ్బయ్యరు మృతిచెందారు. ఆ క్రతువు నిర్వహణ సమయంలో అరుణాచలంలో రమణులు ఉన్నారనే సమాచారం తెలియడంతో వెనక్కి తీసుకువచ్చేందుకు తల్లి అళగమ్మాళ్ , అన్న నాగస్వామి , మరో బాబాయి నెల్లియప్పయ్యరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కాలగమనంలో తల్లి అళగమ్మాళ్ , తమ్ముడు నాగసుందరం (నిరంజనానందస్వామి) , చెల్లి అలమేలు రమణ మహర్షి వద్దకే చేరుకున్నారు. 1922లో తల్లి అళగమ్మాళ్ మృతిచెందిన తర్వాత 1949 నాటికి ఆమె పేరిట మాతృభూతేశ్వర దేవాలయం నిర్మించారు. ఇప్పటికీ నిత్యపూజలు జరగటం విశేషం. మహర్షి కుటుంబ సభ్యుల జీవితాలు ధన్యమయ్యాయి. 

1950 జనవరి 1న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రమణ మహర్షి భక్తుల , శిష్యుల దర్శన మంటపానికి వెళ్ళలేదు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 14 ఏప్రిల్ 1950 సంవత్సరం రాత్రి 8.47 గంటలకు రమణ మహర్షి తుదిశ్వాస విడిచారు.

అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ మహర్షి వ్రాసిన "అరుణాచల శివ ! అరుణాచల శివ ! అరుణాచల శివ !" అనే స్తోత్రాన్ని భక్తులు పాడటం పూర్తయ్యాక మహర్షి చివరి శ్వాస ‌నిలిచిపోయింది.

రమణ మహర్షి బోధనలు

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది "మౌనం" లేదా "మౌనముద్ర". ఇతను చాలా తక్కువగా మాట్లాడేవారు.తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. 

వీరి బోధనలలో ఆత్మజ్ఞానం ప్రధానాంశం. ఎవరైనా ఉపదేశించమని కోరితే , "స్వీయ శోధన" ఉత్తమమని , ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని స్పష్టం చేసేవారు. వీరి అనుభవం అద్వైతం , జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నప్పటికీ ఎదుటి
వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు.

స్వీయ - శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గం". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు , అద్వైత వేదాంతంలనే కాకుండా , అనేక మత సారాంశాల మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

ఏ స్థితిలో ఐతే ప్రశాంతమైన మనసు నిలకడగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటుందో అదే సమాధి. ఆ నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనసే దేవుడి నిజరూపాన్ని దర్శించగల్గుతుంది. అదే సహజమైన సమాధి. ఇక్కడ బాహ్యప్రపంచంలో పని చేస్తున్నా కూడా మనసు నిలకడగా , ప్రశాంతంగా ఉంటుంది. అంతరాంతరాలలో నిన్ను ఏదో సత్యం కదిలిస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు ఏ బాధ , కోరిక , ఆవేదన ఉండవు. ఏది నీది కాదని తెలుసుకుంటావో ఎవరైతే ఈ సమస్తాన్ని తానై నడిపిస్తున్నారో ఆ సత్యాన్ని తెలుసుకున్న నువ్వు వారితో ఎప్పుడూ అంతర్లీనమయ్యే ఉంటావు. ఈ సమాధి మాత్రమే శాశ్వతమైన ప్రశాంతం. ఈ సమాధి స్థితిలో అంత్య దశలో పరమానందాన్ని పొందుతావు. భక్తిలో పరమానందం ముందుగా వస్తుంది. ఇది అశ్రుధారలాగా , రోమాలు నిక్కబొడుచుకుని , గొంతు తడబడుతూ బయటకు ప్రజ్వలిస్తుంది. అహం నశించాక , ఈ సమాధి స్థితి చేరుకున్నాక ముందు చెప్పిన లక్షణాలు అవే నశిస్తాయి.

వారు సజీవంగా లేనప్పటికీ మహర్షి బోధనలు భక్తులకు సరైన మార్గం చూపటం విశేషం. అరుణాచలం అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది ఆత్మసాక్షాత్కారం పొందిన , అందరికీ సులువైన మార్గం చూపిన రమణ మహర్షి ఆశ్రమం.

(హిందూ ధర్మ చక్రం) 

శుక్రవారం, డిసెంబర్ 26, 2025

పగ కోసమే బతికిన కుర్రాడు



అది 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ ..... అక్కడ ఓ చిన్నతోటలో  .... రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు.

> ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది.  
దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..

ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక 
* అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. 

నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు.. శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు. 

దీనికి కారకుడైన  జనరల్ ఓ డయ్యర్ ను వెతుకుంటూ బయలు దేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. 
* కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నాడు..

జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయన మవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేశారు. తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..

1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయన మైనాడు. పేరు మార్చుకుంటూ 
జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడ సాగాడు.. 
దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.

ఆరోజు 1940 జూలై 13....
ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. 
ఆ సమాచారం  ఆయువకునికి అందింది...  వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్  సంపాదించాడు ..  

ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో  ఫిస్టల్  దాచాడు.. అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు... 

సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు, 
ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు...

> అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలాబాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..

రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు.. కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించ నీయకుండా గంభీరంగా ఉన్నాడు...

ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది...
ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. 

ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు...

నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ  అప్రమత్తమయ్యేందుకు లేచాడు. 

* అంతే ఆయువకుడు  పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు.. 

భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు....

వేలమందిని చంపి భారతీయులు  నా బానిసలు.. వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో... 
ఆతను జనరల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు. 

ఓ డయ్యర్ ను చంపిన తరువాత 
ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను. ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగి పోయాడాయువకుడు...

ఆ విప్లవవీరుడి జయంతి నేడు.

ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా???? 
షంషేర్ ఉద్దామ్ సింగ్ ....డిసెంబర్ 26 స్వాతంత్ర్య సమరయెాధుడు జయంతి...

"జోహార్ ఉద్దాం సింగ్ ... జోహార్ "

బుధవారం, డిసెంబర్ 24, 2025

ముచ్చెమటలు పట్టించిన ముసలి రైతు

 

 


1979... ఉత్తరప్రదేశ్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్సైతో పోటు పోలీసు సిబ్బంది మొత్తం పిచ్చాపాటి  మాట్లాడుకుంటున్నారు...

. ఇంతలో తలపాగ, దుస్తులంతా బురద కొట్టుకొని వున్న ఒక ముసలిరైతు స్టేషన్ లోనికి వచ్చాడు. అతని వైపు ఎగాదిగా చూసిన సిబ్బంది ఏం కావాలంటూ నిర్లక్ష్యంగా అడిగారు. తన పశువులు కనిపించడం లేదనీ, వాటిని వెతికిపెట్టమనీ అడిగాడా ముసలిరైతు.అతని వంక అసహ్యంగా చూస్తూ..వచ్చేస్తాయిలే పో అని అన్నారు వాళ్ళు. అయినా రిపోర్టు రాసుకోండని రైటర్ ను అడిగాడా రైతు. నిర్లక్ష్యంగా చూస్తూ తెల్లకాగితం అతని వైపు తోచాడు రైటర్. మళ్ళీ ఓహో నీకు రాయడం రాదుకదా! అంటూ హేళనగా మాట్లాడుతూ ఏదో రిపోర్టు రాసి, ఈక్రింద వేలిముద్రవేయమని స్టాంప్ పాడ్ ఇచ్చాడు రైతుకు. అందుకు రైతు నేను సంతకం చేయగలను.పెన్ ఇవ్వండి అన్నాడు. అది విని రైటర్ బిగ్గరగా నవ్వుతూ "నువ్వు పెన్ ఎప్పుడైనా చూసావా? ఇదిగో సంతకంపెట్టు అన్నాడు. పెన్ తీసుకొని రైటర్ చెప్పిన చోట సంతకంచేసి ఇచ్చాడు రైతు.

ఆ సంతకం చూసిన ఆ రైటర్ దిగ్గునలేచి ఆ ముసలి రైతుకు సల్యూట్ కొట్టాడు. అది చూసిన మిగతావారు కంగారుగా వచ్చి సంతకం ను పరిశీలించి సల్యూట్ చేసి వినయంగా నిలబడ్డారు. ఇంతకీ ఆ సంతకం లో ఏమివుందో తెలుసా?? "చౌదరీ చరణ్ సింగ్ .పియం ఆఫ్ ఇండియా" అని.

పోలీసుల నిర్లక్ష్యానికి ప్రతిగా పోలీసుస్టేషన్ లోని సిబ్బందినంతా సస్పెండ్ చేశారు చరణ్ సింగ్ గారు. అలా చేసిన మొదటి ప్రధాని ఆయనే!!!ఆయన పోరాటం వల్లే జమీందారీ వ్యవస్థ రద్దు అయింది, రైతులకు సబ్సడీ రుణాలు వచ్చాయి.. కౌలు రైతు చట్టం వచ్చింది.

చౌదరి #చరణ్_సింగ్ గారు (1902 డిసెంబరు 23 - 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించారు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తించారు.

చరణ్ సింగ్ సోవియట్-శైలి ఆర్థిక సంస్కరణల పై జవహర్ లాల్ నెహ్రూను వ్యతిరేకించారు. అతను 1947 తరువాత ఉత్తర భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సహాయం చేశారు. భారతదేశంలో సహకార సేద్యం విజయవంతం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక రైతు కుమారునిగా, ఒక రైతుకు సరైన యాజమాన్య హక్కు అతను వ్యవసాయదారునిగా ఉండడమేనని అభిప్రాయపడ్డారు. అతను రైతు యాజమాన్య వ్యవస్థను సంరక్షించి స్థిరీకరించాలని కోరుకున్నారు.  నెహ్రూ ఆర్థిక విధానం గురించి బహిరంగ విమర్శలు చేసిన కారణంగా చరణ్ సింగ్ రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారింది.

రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని జన్మదినం డిసెంబరు 23 న కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం) గా జరుపుకుంటారు.

- (హిందూ ధర్మచక్రం)