గురువారం, సెప్టెంబర్ 12, 2013

బాధ్యతల మర్మం


'ఏంటో గురూగారూ! బతుకు దుర్భరమైపోయిందంటే నమ్మండి...'
'వూరుకోరా! భలే జోకేశావు. మనవల్ల ప్రజానీకం బతుకులు దుర్భరమవుతాయి కానీ, మనవి కావడం ఏమిటిరా?'

'అబ్బే... జనఘోష కాదండీ. మా ఇంటి ఘోష. మొన్న మా ఆవిడ ఉంగరం పోగొట్టింది. అదేమిటంటే నాదా బాధ్యత అని ఎదురు ప్రశ్నించింది. పైగా నా జీవితం తెరిచిన పుస్తకం, కావాలంటే పేజీలన్నీ చదువుకొమ్మంటోంది. ఈ ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు'

'బాగుంది. మీ టీవీలో ఎక్కువగా ఏ కార్యక్రమాలు చూస్తారు?'

'వార్తలండి...'

'మరదీ సంగతి! రాజకీయాలన్నీ మీ ఇంట్లోకి ప్రవహించేస్తున్నాయని తెలుసుకో. మొన్న ప్రధాని ప్రసంగాన్ని మీ ఆవిడ విని బాగా ఒంటపట్టించుకుందన్నమాట. అర్థమైందా?'

'అర్థమైంది కానీండి... మరి ఆయన దగ్గర్నుంచి మా ఆవిడ వరకు ఎవరైనా సరే- ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలాగండీ?'

'సర్లే... ఈ సంగతి అర్థం కావాలంటే అసలు బాధ్యతంటే ఏమిటో, దాని అర్థాలు సమయాన్నిబట్టి ఎలా మారిపోతాయో తెలుసుకోవాలి'

'అదేంటండీ? పదానికి అర్థం ఎప్పుడైనా ఒకటేగా?'

'ఆత్రగాడికి బుద్ధి మట్టు అని ఓ సామెత ఉందిరా. అది నీకు సరిగ్గా సరిపోతుంది. తెలుగు నిఘంటువులో అర్థం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. రాజకీయ నిఘంటువులో మాత్రం సమయాన్నిబట్టే కాదు, నీ స్థానాన్నిబట్టి కూడా అర్థాలు మారిపోతాయి'

'భలే ఆశ్చర్యంగా ఉందే! ఎప్పుడెప్పుడు ఎలా మారతాయో కాస్త చెప్పరూ?'

'మరైతే రాసుకో. బాధ్యత అనే పదం చాలా బరువైనది. అది ఒక వ్యక్తి నిజాయతీకి, నిబద్ధతకి సంబంధించినది. కానీ, నువ్వు నేర్చుకుంటున్నది రాజకీయ పాఠాలు. అందుచేత దీనికి ఎప్పుడూ ఒకే అర్థం తీసుకోకూడదు. ఉదాహరణకి, నువ్వు అధికార పీఠం మీద ఉన్నావనుకో. బాధ్యతనే పదం ఉన్నట్టుండి తేలికైపోతుంది. ఇక్కడే మన ప్రధానిగారిని చూసి, చాలా నేర్చుకోవాలి. లక్షల కోట్ల రూపాయల బొగ్గు గనుల కేటాయింపులో కుంభకోణాలు బయటపడి, చెరగని మసిలాగా, వదిలించుకోని నుసిలాగా మారి కేంద్రప్రభుత్వం ఒంటినిండా, ముఖంనిండా అంటుకుపోయిందా? కానీ, ఆయన బాధ్యత వహించారా? లేదే. ఆనక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాక కీలకమైన దస్త్రాలు రాత్రికి రాత్రి హుష్‌కాకీ అయిపోయాయా... అప్పుడు కూడా ఆయన అవి మాయం కావడానికి నేనెలా బాధ్యత వహిస్తానని ఎదురు ప్రశ్నించారు కదా? కాబట్టి నువ్వు కుర్చీలో ఉంటే బాధ్యతాయుతంగా ఉండక్కర్లేదు. ఏమంటావు?'

'అనడానికేముందండి బాబూ, అదరగొట్టేశాక. మరైతే కుర్చీ ఎక్కినవాళ్లు బాధ్యత వహించే విషయాలే ఉండవంటారా?'

'ఎందుకుండవురా. బోలెడు ఉంటాయి. కానీ అవేమిటో నువ్వే వూహించు చూద్దాం...'

'ప్రజల కష్టనష్టాలను పట్టించుకోవడమేనాండీ?'

'లాభం లేదురా. నువ్వింకా చాలా ఎదగాలి. అదే ప్రజల కష్టనష్టాలు పట్టించుకున్నట్టు కనిపించాలని నువ్వు అని ఉంటే సంతోషించేవాడిని...'

'దానికీ దీనికీ ఏంటండీ తేడా?'

'నక్కకి, నాకలోకానికి ఉన్నంత ఉందిరా. పట్టించుకోవడం వేరు, అలా కనిపించడం వేరు. ప్రజల కోసమే నీ యావ, నీ ఆశ, నీ జీవితం, నీ జన్మ అన్నంత బాధ్యతగా పైకి కనిపించాలి. వాళ్ల సంక్షేమం కోసం అంతకంటే బాధ్యతగా పథకాలను ప్రవేశపెట్టాలి. అయితే ఈ బాధ్యత మాత్రం వేరు. ఎందుకంటే ఆ పథకాలు నిజానికి నీ కోసమే కదా? అంటే వాటిని అడ్డం పెట్టుకుని ఖజానా సొమ్మును దారి మళ్ళించడానికి, నీ కుటుంబానికి, నీ అనుచరవర్గానికి ఉపయోగపడేలా అమలు చేస్తావు కదా? మరి అది ఎలాంటి బాధ్యతో అర్థం చేసుకో...'

'అవునండోయ్‌! ఈ బాధ్యతకు మాత్రం నిఘంటువులో అర్థమే వర్తిస్తుందన్న మాట. మరి ఇలా, బాధ్యతాయుతంగా మసలినవారు, మెలిగినవారు, వినుతికెక్కినవారు, విఖ్యాతి గాంచినవారు, విరాజిల్లినవారు, విజయం సాధించినవారు ఎవరైనా ఉన్నారాండీ?'

'ఎందుకు లేరురా సన్నాసీ! మనరాష్ట్రం నడిబొడ్డున ఉదాహరణలు పెట్టుకుని ఎక్కడో వెతుకుతావేంటి? సీఎం కుర్చీ ఎక్కగానే ఎంతో బాధ్యతగా రోజుకో రకం పథకాలు పెట్టిన వైఎస్‌ని మరిచిపోతే ఎలా? మరాయన మనం చెప్పుకొన్న బాధ్యతతో పథకరచన చేయబట్టే కదా, ఆయన కుటుంబం లక్షకోట్లకు పడగలెత్తింది? ఆయన అనుచర వర్గమంతా అంతస్తులు పెంచుకున్నది? ఇక ఆయనగారి సుపుత్రుడు అంతకంటే బాధ్యతగా మసులుకోబట్టే కదా, అనేకానేక కంపెనీలు రాష్ట్రం పరిధులు దాటి మరీ విస్తరించినది? ఆ పథకాల వెనక ఉన్న బాధ్యతకు అర్థం నిజంగా నిఘంటువులోనిదే అయితే, ఈ పాటికి ఎక్కడా పేదవాళ్లనేవాళ్లు ఉండనే కూడదుగా? ఇలాంటి బాధ్యతనెరిగి మసలుకునేవారు ఢిల్లీ కుర్చీ నీడలో కావలసినంత మంది కనిపిస్తారు. దేశంలో జరిగిన లక్షల కోట్ల కుంభకోణాలకు వాళ్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనే కారణమని వేరే చెప్పాలా?'

'ఆహా... చక్కగా బోధపడిందండి. ప్రజలను నమ్మించేప్పుడు ఒకరకం బాధ్యత, పథకాలు రచించేప్పుడు ఒకరకం బాధ్యత, అమలు చేసేటప్పుడు మరోరకం బాధ్యత, అవకతవకలు బయటపడినప్పుడు ఇంకో రకం బాధ్యత వహించాలని తెలిసిందండి. మొత్తానికి ఎంతో బాధ్యతాయుతంగా నాకీ సంగతులు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పడం నా కనీస బాధ్యతని అనిపిస్తోందండి...'

'ఏడిశావ్‌లే! నేను చెప్పినవన్నీ పాటించి నికార్సయిన నీచనేతగా ఎదిగి చూపించడమే నీ అసలైన బాధ్యతని మరిచిపోకు. ఇలా హెచ్చరించడం కూడా నా బాధ్యతేరోయ్‌! ఇక వెళ్లిరా!'

PUBLISHED IN EENADU ON 12.09.2013