మంగళవారం, డిసెంబర్ 24, 2013

అసలైన ఆత్మవిమర్శ


'నమస్కారం గురూగారూ!' 
'ఏంట్రోయ్‌... చాలా కాలానికి కనిపించావ్‌. ఎక్కడికి పోయావ్‌?' 
'ఇంట్లోనే తలుపులు మూసుకుని కూర్చున్నాను గురూగారూ...' 
'వార్నీ... అదేం బుద్ధి, ఒంట్లో బాగానే ఉందా?' 
'ఆరోగ్యానికేం ఢోకా లేదండి. కానీ ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండిపోయా...' 
'ఆత్మవిమర్శా!! నీకిలాంటి విద్యలు కూడా వచ్చునేంట్రా?'
'ఏముంది గురూగారూ... రాజకీయాలు నేర్చుకోవాలంటే పాఠాలు చదవడం కాదూ, సమకాలీన నేతల్ని గమనించి వాళ్ల అడుగుజాడల్లో నడవాలని చెప్పారు కదండీ మీరు? దాన్నిబట్టే అలా చేశానండి...'

'అది సరే కానీ, ఈ కాలంలో ఆత్మవిమర్శ చేసుకునేవాళ్లు ఎవరున్నార్రా?' 
'ఎందుకు లేరండీ? మొన్న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాక దేశ మహారాణమ్మ, ఆవిడగారి సుపుత్రుడు అదే అన్నారు కదండీ? ఇదేదో కొత్తగా ఉందని గది తలుపులు బిడాయించుకుని కూర్చున్నానండి. కానీ ఆత్మవిమర్శ ఎలా చేసుకోవాలో మాత్రం తెలియలేదండి...'

'నీ తెలివి తెల్లారినట్టేఉంది. వాళ్లనుంచి నువ్వు నేర్చుకోవలసింది ఆత్మవిమర్శ చేసుకుంటాననడమే. చేసుకోవడం కాదు...'

'రెండింటికీ తేడా ఏంటండీ?' 
'మైసూర్‌పాక్‌ ఫొటో చూసినదానికి, దాన్ని తినడానికి ఉన్నంత. ఫొటో నోరూరించినా తినడానికి పనికిరాదు కదా! అలాగన్నమాట...'

'అంటే వాళ్లు దేశ ప్రజలందరికీ మైసూర్‌పాక్‌ పెట్టినట్టేనంటారా?' 
'మాటల మైసూర్‌పాక్‌. వాళ్లేదో అన్నారని నువ్వు గదిలో దూరి కిందా మీదా పడ్డం చూస్తే నువ్వింకా ఏమీ ఎదగలేదని తేలిపోయిందిరా...'

'అంటే వాళ్లు సందర్భానికి తగినట్టు ఆ పదాన్ని చక్కగా ఉపయోగించుకున్నారని నాకిప్పుడు అర్థమైంది గురూగారూ...' 
'పోన్లే... ఆమాత్రం గ్రహించావ్‌ అంతేచాలు. కానీ వాళ్లు మాత్రం నీలా నీచరాజకీయ నేతగా ఎదగాలనుకునేవాళ్లకు రాచమార్గం చూపించినట్టే. సమకాలీన నేతల నుంచి నేను నిన్ను నేర్చుకోమన్నది అందుకే...'

'అర్థమైందండి. కానీ వాళ్ల నుంచి ఏం నేర్చుకోవచ్చో కాస్త నా మట్టి బుర్రకు అర్థమయ్యేలా చెబుదురూ?' 
'సర్లె... కాగితం, కలం పుచ్చుకొని అఘోరించు. మనం చేసిన వెధవ పన్లేంటో, వాటి ఫలితాలెలా ఉంటాయో తెలిసినప్పుడు గబుక్కున పరిగెత్తుకుని పోయి బజార్లో నిఘంటువొకటి కొనుక్కుని అందులో పవిత్రమైన పదాలేంటో వెతుక్కోవాలి. ఆత్మవిమర్శ చేసుకుంటాం, ప్రజల తీర్పు శిరసావహిస్తాం, జనాభిప్రాయాన్ని గౌరవిస్తాం... లాంటివన్నమాట. వీలైనంత గంభీరంగా మొహం పెట్టి, మైకు ముందు నిలబడి, ఈ పదాలను పలికేశాక, ఆనక నువ్వు మనసులో కిసుక్కున నవ్వేసుకున్నా పర్వాలేదు. భర్త చిటికెన వేలుచ్చుకుని వచ్చి, చూపుడువేలుతో దేశాన్నే శాసిస్తున్న ఆ మహారాణమ్మ నుంచి, ఆవిడగారి ఏలుబడి నుంచి నీలాంటి బడుద్ధాయ్‌లు ఎంతైనా నేర్చుకోవచ్చురా. పదిమంది మోసే పల్లకిలో ఓ బొమ్మరాజును పెట్టి, తెర వెనక నుంచి అధికారం చలాయించడం మీద వఠ్ఠి పాఠమేంటి, ఓ ఉద్గ్రంథమే రాయవచ్చు. పార్టీలో అనుభవజ్ఞులైన పెద్దలందరినీ నోరెత్తనీయకుండా అడుగులకు మడుగులొత్తించుకునే విద్యల్లో కొన్ని నేర్చుకోవడానికైనా నీ జన్మ సరిపోదు. తన కొడుకు తప్ప దేశానికి కానీ, పార్టీకి కానీ వేరే దిక్కులేనంతగా రాజకీయం నడుపుతున్న తీరుతెన్నులు నీలాంటివారికి పెద్దబాలశిక్షలు కాదా చెప్పు? చేతకాని విధానాల వల్ల ధరవరలు పెరిగిపోయి సామాన్యులు అతలాకుతలమైపోతున్నా పొద్దున్నే అట్టు తినేవాడెవడూ పేదోడు కాదనే కాకిలెక్కల హయామును ఏమనాలి? మద్దతిస్తున్నవాళ్లు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయినా నిమ్మకు నీరెత్తినట్టు నిబ్బరంగా ఉండటం ఎంత గొప్ప పాఠమో అర్థం చేసుకుంటే మనలాంటివాళ్లం ఎంత వెనకబడి ఉన్నామో తెలుస్తుంది. అధికారం కోసం జైల్లో ఉండేవారినీ విడిపించి జతకట్టడం, అవినీతి అక్రమార్కులతో కుమ్మక్కైనా సరే అధికారం కోసం పాకులాడటం, గెలవలేమని తెలియగానే ప్రత్యర్థులపై కులమతాలనైనా అడ్డంపెట్టి బురదజల్లడం, అవసరమైతే ప్రజల మధ్యే చిచ్చుపెట్టడం, నియంతలకు నియంతలాగా వ్యవహరించడం... అబ్బో- ఇలా ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని ఒంటపట్టించుకోవాలి? వీటిలో లవలేశమైనా నేర్చుకుంటే నీ ఎదుగుదలకు డోకా ఉండదనుకో!'

'అబ్బ... ఎంత బాగా చెప్పారండీ! ఇంగితం ఉన్నవాళ్లందరికీ ఇన్ని సంగతులు తెలిసిపోతున్నా వాళ్లు మాత్రం నిజమైన ఆత్మవిమర్శ చేసుకోలేదంటారా గురూగారూ?' 
'ఓరెర్రోడా! ఆత్మవిమర్శ చేసుకునే బుద్ధి, నిజాయతీ, చిత్తశుద్ధి ఉండుంటే అధికారంలో ఉండి ఇలాంటి అవకతవక, అయోమయ, అధ్వాన, అవినీతి, అక్రమ, అన్యాయ, అతలాకుతల, అకృత్య కార్యకలాపాలను అఘోరిస్తారా చెప్పు? సరే... ఒకవేళ నిజంగానే ఆత్మవిమర్శ చేసుకోవాలని వాళ్లు అనుకున్నారనే అనుకో. వాళ్లని వాళ్లు తిట్టుకోవడానికి ఏ భాష మాత్రం సరిపోతుందో చెప్పగలవా? మరి వాళ్ల తాజా మాటలు కూడా ఓసారి గుర్తు తెచ్చుకో. జరిగిందేదో జరిగినా ముందు జరగబోయే కార్యక్రమానికి సమాయత్తం కావాలని ఆ మహారాణమ్మగారు తమ అనుచరవర్గానికి పిలుపు ఇవ్వలేదూ. అంటే ఏంటర్థం? తిరిగి ప్రజల నెత్తిన మాటల టోపీ పెట్టడానికి ఎన్ని రకాల టక్కుటమార విద్యలున్నాయో, అన్నీ ఉపయోగించమనేగా? కాబట్టి సందేహాలు పక్కన పెట్టి ఆ మహనీయుల అడుగుజాడల్లో నడవడానికి సమకట్టు. అర్థమైందా?'

'అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అర్థమైంది గురూగారూ! ఇక చూస్కోండి. నేను చేసిన ఎన్ని పనులు బయటపడినా నిజమైన ఆత్మవిమర్శ జోలికి మాత్రం పోను. కానీ ఆ పదాన్ని మాత్రం ఎడాపెడా వాడేసుకుంటాను. వస్తానండి, అర్జంటుగా సభొకటి పెట్టాలి!'

PUBLISHED IN EENADU ON 24.12.2013

శనివారం, డిసెంబర్ 07, 2013

మహా వాడకం!
'దండాలు బాబయ్యా...' 
'ఎవర్రా నువ్వు, ఏం కావాలి?' 
'పని కోసం వచ్చానండయ్య. తమరు తలూపితే తమ కాడ పడుంటానండయ్య...' 
'నా దగ్గర పనా, ఉందని నీకెవరు చెప్పారు?' 
'నేనే గమనించానండయ్య. గోదారికి ఈ దరిని వూళ్లో సభెట్టారు కదండయ్యా, దాన్ని టీవీలో చూశానండయ్య. ఆ లెక్కన మీకాడ శానా పనుందని అనిపించి చక్కా వచ్చానండయ్య' 
'టీవీలో చూసి వచ్చావా? ఏం చూశావ్‌, ఏం చేస్తావ్‌?' 
'బలేవోరండయ్య... టీవీలో మీ యవ్వారం, ఆ తీరు, ఆ గోటు, ఆ నీటు చూసేసరికి కళ్లు తిరిగాయండయ్య. అసలొక మడిసిని ఇంతబాగా ఉపయోగించుకోవచ్చని మిమ్మల్ని చూసే తెలిసిందయ్యా. మీకెందుకు, నాకొక్క అవకాశం ఇవ్వండి. ఇంకెంత బాగా ఉపయోగపడతానో తమరికే తెలుస్తుంది' 
'వార్నీ... నువ్వెక్కడ దొరికావురా. విషయం చెప్పకుండా సతాయిస్తున్నావ్‌? గోటంటావ్‌. నీటంటావ్‌. ఇంతకూ ఏం చూశావో అది చెప్పవేం?' 
'అయ్యబాబోయ్‌... తమరికి ఎరిక లేదన్నమాట. అంతేలెండి. మీకలాంటి బుద్ధులన్నీ పుట్టుకతోనే అబ్బేసుంటాయి. అంచాత అలవోకగా చేసేత్తారు. అందుకే నాలాటోడైతే మీ మనసెరిగి మరింత బాగా నడుసుకోవచ్చని ఆశ కలిగిందండయ్య. తమరు కాదనకూడదు...'
'ఇదెక్కడి గొడవరా, ముందు కాళ్లొదులు. నన్ను కాస్త కదలనీ. ముందు నీకీ బుద్ధెందుకు పుట్టిందో చెప్పేడు. పనిదేముంది ఇస్తాలే. పడుందువుగాని...' 
'అమ్మయ్య- మనసు తేట పడిందండయ్య. ఇప్పుడు చెబుతానండయ్య. మొన్న సభలో తమరు మాట్లాడారు కదండయ్య. ఓ చేత్తో మైకట్టుకున్నారండయ్య. రెండో చెయ్యి తమరు దంచే వూకదంపుడు ఉపన్యాసానికి అనుకూలంగా మాంసాన్ని కైమా చేస్తున్నట్టు వూగుతోంది కదయ్య. అలా వూపాక ఆ చెయ్యి ఎక్కడ పెట్టారో నేను గమనించానండయ్య. ఆ చేతిని అప్పుడప్పుడు దించుకోడానికి వీలుగా మీ కాపలావోడిని వంగోమన్నారు కదయ్య. ఆడి వీపు మీద ఎంత విలాసంగా చెయ్యి ఆన్చారండయ్య. మరది గోటు కాదా, నీటు కాదా, రాజసం కాదా? అబ్బో, ఈ లెక్కలో మడిసిని వాడుకోవడంలో మీ తరహా మరెవ్వరికీ సాటి రాదండయ్య. అందుకే వచ్చానయ్య. మీ కాడ వంగున్నవాడి కన్నా నేను ఇంకా బాగా వంగోగలనయ్య. తమరు పనిచ్చారంటే చాలు... ఇక చూస్కోండి నా పనితనం ఏంటో చూపిస్తా...'

'వార్నీ అదా, బాగానే గమనించావ్‌? ఇంతకూ ఏం చేస్తావో, ఏం చేయగలవో చెప్పు చూద్దాం...' 
'అయితే చెబుతా వినుకోండయ్య. తమరికి పొద్దున్నే మెలకువ రాగానే తమరి కనురెప్పల్ని విప్పదీస్తానండయ్య. కళ్లు తెరిచాక ఆవులిస్తే చిటికేస్తానండయ్య. ఒళ్లు విరుచుకున్నాక లేచి కూచోబెడతానండయ్య. మంచం దిగ్గానే కాళ్లకు చెప్పులు తొడుగుతానండయ్య. బ్రెష్షు మీద పేస్ట్‌ వేస్తానండయ్య. తమరు దయతలచి నోరు తెరిస్తే పళ్లు తోముతానండయ్య. ఆపై నాలుక గీస్తానయ్య. మొహం తొలుస్తానయ్య. తడి మొహాన్ని తువ్వాలుతో తుడుస్తానయ్య. తమర్ని కూచోబెట్టి కాఫీ తాగిస్తానయ్య. స్నానం చేసేప్పుడు వీపు రుద్దుతానయ్య. అలా మీకాడే పడుండి కనిపెట్టుకుని చూస్తానండయ్య. దగ్గితే తలమీద తడతానయ్య. తుమ్మితే చిరంజీవ అంటానయ్య. జలుబొస్తే చీదిస్తానయ్య, తమరు సభల్లో మాట్లాడేప్పుడు మైకు నేనే పట్టుకుంటానయ్య. కావాలంటే మీ బదులు అచ్చం మీలాగ నేనే నా చెయ్యి వూపుతానయ్య. ఇంకిన్ని మాటలెందుకయ్య, తమరి అడుగులకు మడుగులొత్తుతానండయ్య...'

'వహార్నీ... గట్టి పిండానివే. కానీ మరి ఇంత ఇదిగా నిన్ను వాడుకున్నాననుకో, చాలా విమర్శలు వస్తాయిరా...' 
'భలేవోరండీ బాబూ... ఈ పన్లన్నీ చాలా చిన్నచిన్నవే... అసలు తమరు మనరాష్ట్రంలో మడుసుల్ని, వస్తువుల్ని వాడుకోవడం ముందు ఇవన్నీ ఎంతనీ?' 
'ఏంటేంటీ, ఏమన్నావ్‌? నేనేమేమి వాడుకున్నానో కూడా తెలుసా నీకు, ఏంటో చెప్పు?'

'అయ్యబాబోయ్‌... తమరు నాచేత వాగిద్దామని అంటున్నారు కానీ, ఒక్క నాకే ఏంటి, తమరి గురించి ప్రపంచికమంతా ఎరికేనయ్య. తమరు వాడుకోనివాళ్లంటూ మనకాడ ఉన్నారేంటయ్య? ఈ ఇలాకాలోనే కాదు... రాట్రంలో, దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచకంలో కూడాను లేరు. తమరు సొంతంగా అధికారంలో లేకపోయినా తండ్రిగారి అధికారాన్ని వాడుకున్నారు కదయ్యా? దాన్ని అడ్డం పెట్టుకుని అధికారుల్ని వాడుకున్నారాండయ్య? ఆళ్లతోపాటు మంత్రుల్ని, నాయకుల్ని ఎడాపెడా వాడేసుకోలేదయ్యా? ఆ తరవాత తమరి నాయనగారి దగ్గరకు పనులమీదొచ్చే వారందర్నీ మీ ఇంటికి దారి మళ్లించి, బేరాలెట్టి, రేటు ఫిక్సింగులు చేసి ఆళ్లందరి డబ్బును వాడుకోలేదాండయ్య? అందుకోసం మన రాట్రంలోని భూముల్ని గనుల్ని వాడుకోలేదా చెప్పండయ్య? అక్కడితో ఆగారాయ్యా? మడుసుల్ని, వనరుల్ని అడ్డగోలుగా వాడేసుకుని సంపాదించిన సొమ్ముల్తో ఆ మూల కోల్‌కత నుంచి ఈ మూల మలేసియా దాకా ఎక్కడెక్కడో దొంగ కంపెనీలెట్టడానికి అవకాశాలన్నీ వాడుకోలేదా చెప్పండయ్య? వట్టి అవకాశాలేనా... అడ్డదారి పన్లూ సేయడానికి చట్టాల్ని వాడుకున్నారు, అయ్యి అడ్డొస్తాయంటే ఆ చట్టాల్లో సవరణలు చేయడానికీ చట్టసభను వాడుకున్నారు. ఇన్నీ చేసినా ఇంతా చేసినా- మెత్తగా మాట్లాడతా... అమాయకులైన జనాన్ని వాడుకున్నారు. అబ్బో... ఎన్నని చెప్పగలనండయ్య, ఒకటా రెండా? ఇక్కడికిక్కడ చెప్పగలనా? చివరాకరికి తమరు చేసిన అడ్డదిడ్డమైన పన్లన్నీ బయటపడిపోయి జైల్లోకెల్లాక కూడా ఏకంగా ఢిల్లీలోని పెద్ద తలకాయల్నీ వాడేసుకున్నారని అంతా అంటున్నారయ్య. అందుకే ఇంతలేసి ఎదవ పన్లు సేసినా సటుక్కున జైల్లోంచి బెయిలుచ్చుకుని వచ్చేశారని సెబుతున్నారయ్య. మరి ఇంతలా ఏది పడితే దాన్ని, ఎవర్ని పడితే వాళ్లని వాడుకోవడం ముందు నేను చేసే పనులెంతయ్య? పని ఇచ్చినప్పుడు ఎలా పడితే అలా వాడుకోవచ్చయ్య. మరి రేప్పొద్దున్న మీరు కలలు కంటున్నట్టు కుర్చీలో కూర్చోగలిగితే అప్పుడింకెంత వాడేసుకుని ఎంత సంపాదిత్తారో చెప్పడానికి నా బతుకు సరిపోదయ్య...!'

PUBLISHED IN EENADU ON 07.12.2013