శనివారం, జూన్ 15, 2013

భ్రష్టయోగానందంశిష్యుడు వచ్చేసరికి గురువుగారింట్లో హడావుడిగా ఉంది. చాలామంది నేలమీద చాపలు పరచుకుని కూర్చుని ఉన్నారు. గోడ మీద కట్టిన పెద్ద ప్రకటనపై 'రాజకీయ యోగా తరగతులు' అని రాసి ఉంది. దాని కింద 'భ్రష్టయోగి' అని ఉంది.
శిష్యుడు నేరుగా ఇంట్లోకి వెళ్లి గురువుగారిని చూసి, 'ఇదేం సందడి గురూగారూ?' అని అడిగాడు.

'అహ... ఏం లేదురా! అమెరికా, చైనాల్లో రకరకాల యోగ విధానాల గురించి పత్రికలో చదివా. ఆ పళంగా ఆలోచనొచ్చి బోర్డెట్టేశా. ఇంతమంది వస్తారనుకోలేదు' అన్నారు.

'ఎందుకు రారండి? కుంభకోణాల గురించి చదువుతున్నారు కద? కళ్లు మూసి తెరిచేంతలో కోట్లకు కోట్లు వచ్చే అవకాశం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? ఎలాగోలా ప్రజల్ని నమ్మించి ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలిక జీవితంలో స్థిరపడిపోవచ్చు' అంటూ శిష్యుడు నవ్వాడు. ఆపై ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు.

గురువుగారు ఉపోద్ఘాతం మొదలుపెట్టి, 'ఈ సరికొత్త యోగా నేర్చుకుంటే రాజకీయాల్లో సునాయాసంగా దూసుకుపోవచ్చు. శ్రద్ధగా నేర్చుకుంటే మనసా, వాచా, కర్మణా దిగజారిపోవచ్చు' అన్నారు. అందరూ ఆనందంగా సర్దుకుని కూర్చున్నారు.

'ముందుగా ధ్యానమార్గం చెబుతాను. దీని పేరు 'కాసు మీద ధ్యాస'. అందరూ కళ్లు మూసుకుని భృకుటి మధ్యలో నోట్లకట్టలను ఊహించుకోండి. మీకెంతగా ఏకాగ్రత కుదిరితే అంతగా నీచోపాయాలు తడతాయి. మనిషిగా దిగజారి, నీచ నేతగా విశ్వరూపం దాలుస్తారు' అంటూ గురువుగారు ఉపోద్ఘాతం దంచారు.

ఇంతలో ఒకడు 'ఈ ధ్యానమార్గంలో ఆదర్శప్రాయంగా ఎదిగిన మహానుభావులెవరైనా ఉన్నారాండీ?' అని అడిగాడు.

గురువుగారి పక్కనే కూర్చున్న శిష్యుడు అందుకుని, 'ఉన్నారున్నారు. వారే జగన్నాటక సూత్రధారులు. వారెంతగా ఎదిగారంటే నిఘా, దర్యాప్తు, రక్షక దళాలు మొత్తం నివ్వెరపోయి నేరుగా వారిని కారాగారంలోకి పంపించారు. వారి గురించి పేపర్లలో రోజుకో పతాకవార్త రాసినా ఏళ్లకేళ్లు గడిచిపోతాయి. తరచు వారి ముఖారవిందాన్ని పత్రికలు ప్రచురించక తప్పడంలేదు' అన్నాడు.

వచ్చినవారంతా తన్మయులైపోయి, 'ఆహా... ఎంత ప్రచారం! ఎంత ప్రాచుర్యం! జన్మంటే అదీ. మేమూ ఉన్నాం ఎందుకూ? ఇన్నాళ్లు బతికినా ఒక్క చెడ్డ పని చేయలేకపోయాం. కనీసం చుట్టుపక్కలవారి చేతనైనా ఛీకొట్టించుకోలేకపోయాం' అంటూ తెగ బాధ పడిపోయారు.

గురువుగారు వారిని ఓదార్చి, 'నీచ రాజకీయాల్లో నిస్పృహ కూడదు నాయనలారా! మీలాంటి ఉత్తములను చెడగొట్టడానికే నేను భ్రష్టయోగిగా మారాను. ఇప్పుడు ఆసనాలు సాధన చేద్దాం. ముందుగా 'విచిత్ర ముఖాసనం' నేర్పుతాను. అందరూ సాధ్యమైనంత ఏడుపు మొహం పెట్టండి. మీరు కావాలని నవ్వినా అది ఏడ్చినట్టుండాలి' అన్నారు. అందరూ ముఖాల్ని అష్టవంకర్లు తిప్పుతూ సాధన చేశారు.

'దీనివల్ల లాభమేమిటండీ?' అన్నాడొక సాధకుడు.

'నీ ఏడుపంతా ప్రజల కోసమేనని సభల్లో నమ్మించవచ్చు. నిజానికి నీ ఏడుపు అధికారం కోసమని వేరే చెప్పక్కర్లేదు కదా?' అంటూ వివరించాడు శిష్యుడు, గురువుగారి సైగనందుకుని.

'ఇప్పుడు 'చంచల హస్త నిమురాసనం'. మీరు జనంలోకి వెళ్లగానే ముసిలమ్మనో, చిన్నపిల్లనో చటుక్కున దొరకబుచ్చుకోవాలి. చేతులు సాధ్యమైనంత వణికిస్తూ వాళ్ల తలవంచి నిమరాలి. మొహమంతా తడమాలి. వీలుంటే నూనె వాసనని చూడకుండా నడినెత్తి మీద ముద్దు పెట్టేయాలి' అన్నారు గురువుగారు.

శిష్యుడు అందుకుని 'దీని వల్ల ఈయనకు మనమంటే ఎంతో ప్రేమనుకుని జనం కళ్లకు బైర్లు కమ్మేస్తాయి' అంటూ వివరించాడు. సాధకులందరూ ఒకరి తలలు ఒకరు నిమురుకోసాగారు.

'ఇప్పుడు 'ఇచ్చిపుచ్చుకాసనం'. ఎడమ చేతిని వీపు వెనక నుంచి తీసుకొచ్చి ఎదుటివారి చేయి పట్టుకోవాలి. అదే సమయంలో కుడిచేత్తో కరచాలనం చేయాలి' అంటూ గురువుగారు చెప్పేసరికి అందరూ ఆపసోపాలు పడసాగారు.

'దీని వల్ల రక్తప్రసరణలో అవినీతి కణాలు పెరిగి ఎదుటివారికి కొద్దిగా లాభం చూపించి, దొడ్డిదారిన దోచేసే లాఘవం ఒంటపడుతుంది. నీకది, నాకిది లాంటి పథకాలను సులువుగా అమలు చేసే తెలివి పెరుగుతుంది' అని వివరించాడు శిష్యుడు.

'ఆ తరవాత 'అధికార వక్రాసనం' నేర్చుకుందాం. ఏదైనా ఒక కుర్చీ మీద కూర్చుని చేతులతో కుర్చీ వెనక భాగాన్ని, కాళ్లతో కుర్చీ కాళ్లను పెనవేయాలి' అని గురువుగారు చెప్పారు. ఆయనలా అనగానే 'దీనివల్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేసే ఆలోచనలు పెల్లుబుకుతాయి. పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలని పట్టు చిక్కుతుంది' అంటూ శిష్యుడు విప్పి చెప్పాడు.

'తరవాతది 'జనవంచక జెల్లాసనం'. పైకి మెత్తగా నవ్వుతూ ఎదుటివారు చూడకుండా వారి నెత్తిమీద జెల్ల కొట్టాలి. ఇందువల్ల జనాన్ని నమ్మించి రకరకాల పథకాల ఆశ చూపిస్తూ వారి సొమ్మునే కొల్లగొట్టే నయవంచక నైపుణ్యం అలవడుతుంది' అని గురువుగారు చెప్పగానే సాధకులంతా ఒకరికొకరు జెల్లలు కొట్టుకున్నారు.

'అన్నింటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు చెబుతాను. ఇది 'నిర్లజ్జాకర నవ్వాసనం'. ఎన్ని వెధవ పనులు బయటపడినా, ఆఖరికి జైల్లో కూర్చున్నా, ఎలాంటి సిగ్గూశరం లేకుండా, పెద్ద ఘనకార్యం చేసినట్టు నవ్వేసే లౌక్యం వస్తుంది. ఇవన్నీ సాధన చేస్తే మీరొక నీచ రాజకీయ నేతగా ఎదుగుతారనడంలో సందేహం లేదు' అంటూ ముగించారు గురువుగారు.
సాధకులంతా ఉత్సాహంతో 'ఛీఛీ'లు కొట్టారు!

PUBLISHED IN EENADU DAILY ON 15.06.2013