సోమవారం, జూన్ 26, 2023

ఆటెయ్‌... పోటెయ్‌... ఏడుపొస్తే ఆపెయ్‌!


అవి నేను రెండో తరగతి చదువుతున్న రోజులు. పడవెక్కి గోదావరి దాటడం, ఏడుస్తూ ఇంటికి రావడం గుర్తొస్తోంది. 

అరవై దాటిన వయసులో అలనాటి చిన్నతనం జ్ఙాపకాలను తోడుకోవడం భలే బాగుంటుంది. ఎవరి బాల్యం వారికి తీపే. చిత్రమేమిటంటే ఇతరుల చిన్నప్పటి సంగతులు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. వాటితో తమ బాల్యాన్ని తడిమి చూసుకుంటారంతా. మేమప్పుడు కోటిపల్లిలో ఉండేవాళ్లం. నాన్నగారు అక్కడ హైస్కూల్‌ హెడ్మాస్టర్‌. మనం ఎలిమెంటరీ పిలగాడినన్నమాట. కోటిపల్లి అనగానే ఎన్ని జ్ఙాపకాలో! సంబరంలో జీళ్లు, సోమేశ్వరాలయం, ఆలయం ఎదురుగా చెరువు, ఆ చెరువులో పెద్ద పెద్ద తాబేళ్లు, నా జలగండం...అబ్బో, చాలా!

ఓసారి మా అయిదో మావయ్య మా ఇంటికొచ్చాడు. అవడానికి మావయ్యే కానీ వయసు నాకన్నా అయిదారేళ్లే ఎక్కువ. అంటే మనం పిలగాడినైతే, వాడు కుర్రగాడన్నమాట. పేరు బాబ్జీ. ఎప్పుడూ మావయ్యా అని పిలిచింది లేదు. 'ఒరేయ్‌ బాబ్జీ...' అనే. 

బాబ్జీ మావయ్య  ఇంటికొస్తే నాకెంతో సంబరం. ఎక్కడెక్కడికో తిప్పుతాడని. ఓ సాయంత్రం ఆ పనే చేశాడు. 

'ఒరేయ్‌ గోదారొడ్డుకి వెళదాంరా...' అన్నాడు. మనం కాదనేదేముంది? ఇద్దరం కలిసి పోయాం. అక్కడ జీళ్లు కొనుక్కున్నాం. కోటిపల్లి జీళ్లకి ప్రసిద్ధి. వాటి రుచే వేరు. సాగుతున్న ఆ జీళ్లను బుగ్గన పెట్టుకుని పాకం పీల్చుకుంటూ గోదారొడ్డుకి వెళ్లాం. అక్కడ అటూ ఇటూ తిరిగే పడవలు ఉన్నాయి.

'ఒరేయ్‌... పడవెక్కుదామేంట్రా?' అన్నాడు మెరుస్తున్న కళ్లతో బాబ్జీ.

నాకు ఓ పక్క హుషారు, మరో పక్క భయం. 

'అమ్మో... ఇంట్లో తెలిస్తే?' అన్నాన్నేను సంకోచంగా.

'ఏం కాదులే. అరగంటలో వచ్చేస్తాంగా...' అంటూ బాబ్జీ జేబులో డబ్బులు చూసుకున్నాడు. 

మొత్తానికి ఎక్కేశాం. అదొక నాటు పడవ. పెద్ద తెరచాప. అందరూ దానిలో అడ్డంగా వేసిక చెక్కలపై కూర్చున్నారు. మేం కూడా ఓ చెక్కపై కూర్చున్నాం. నేను కాస్త ఒంగుని చెయ్యి చాపితే అందుతున్న గోదావరి నీళ్లు. నేను ఆ కెరటాలపై  నా చిట్టి చేతులు ఆడిస్తుంటే పడవ వాడు చూశాడు. 

'ఏయ్‌... వంగకు...' అంటూ గదమాయించాడు. తర్వాత మమ్మల్ని  చెక్కల మీద నుంచి దింపేసి పడవలో కింద కూర్చోబెట్టాడు. మనం బిక్కమొహం వేశాం. 

పడవ బయల్దేరింది. బహుశా కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం అనుకుంటా. ఆ వయసులో ప్రయాణం గుర్తుంటుంది కానీ, తీరాల పేర్లేం తెలుస్తాయి? 

పడవ అంచు మీద నడుస్తూ ఒకడు పెద్ద గెడకర్రను నీళ్లలోకి దింపి తోశాడు. పడవ ముందుకు కదిలింది. కాపేపలా తోశాక గెడ తీసేశాడు. 

'ఇక గెడ వెయ్యడు...' అన్నాడు బాబ్జీ. 

'ఏం?'

'గెడకి లోతు అందదు. ఇక్కడ గోదారి ఎంత లోతుంటుందో తెలుసా?'

'ఎంత?'

'ఎంతంటే... రెండు మూడు తాటిచెట్లంత!'

'అంటే?'

'అంటే... తాటిచెట్లను ఒకదాని మీద ఒకటి పెట్టామనుకో, ఎంత ఎత్తుంటుంది? గోదారి అంత లోతుంటుందన్నమాట...'

బాబ్జీ పరజ్ఙానం నా బుల్లి మనసులో ఏదో గుబులు రేపింది.

'ఇంటికెళిపోదాం..' అన్నాన్నేను భయంగా. 

'ఇప్పుడెలా? ముందు అవతలి తీరం చేరాలి. ఆ తర్వాత మళ్లీ ఇదే పడవపై తిరిగి రావాలి'

మొత్తానికి అవతలి తీరం చేరాం. అక్కడికెళ్లేసరికి సాయంత్రం అయిపోయింది. ఏవో బిస్కట్లు కొన్నాడు బాబ్జీ. నాలో బెంగ వల్ల అవి ఆనందాన్ని ఇవ్వలేదు. మళ్లీ పడవ బయల్దేరేసరికి చీకటి చిక్కనైంది. నా గుండెల్లో గుబులు పెరిగిపోయింది. పైకి చూస్తే నల్లని ఆకాశం. మినుకుమినుకుమంటున్న నక్షత్రాలు. చుట్టూ చూస్తే గోదావరి కూడా చిక్కని చీకటిలా కనిపించింది. పడవకి ఒరుసుకుంటున్న అలల సడి తప్ప ఏమీ వినిపించని నిశ్శబ్దం. పడవలో ఓ పక్క గుడ్డి లాంతరు. ఆ గంభీరమైన వాతావరణంలో మన పసి మనసు బావురుమంది. 

ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాను. 

'ఇంటికెళిపోదాం..ఊ...ఊ....ఊ...' వెక్కిళ్లు మొదలు.

'ఉష్‌... వెళుతున్నాంగా? ఏడిస్తే పడవ వాడు ఊరుకోడు...' బాబ్జీ బెదిరింపుతో కూడిన ఓదార్పు.

నా ఏడుపు విని పడవ వాడు వచ్చాడు. 

'ఎందుకేడుస్తున్నావ్‌ బాబూ?' అన్నాడు. 

'పడవ కదలడం లేదెందుకు?'

'కదుల్తోందిగా?'

'లేదు. వచ్చేప్పుడు మీరు తెడ్లు వేశారు. మరి ఇప్పుడు వేయడం లేదేం?' 

మనం ఏడుస్తూ వెలిబుచ్చిన సందేహానికి పడవ వాడితో పాటు, అందులో ఉన్న మిగతావాళ్లు కూడా నవ్వేశారు.

'ఓ... అదా. వచ్చేటప్పుడు ఎదురు. ఇప్పుడు వాలు' అన్నాడు పడవవాడు. 

నా కన్నీళ్లు తుడుస్తూ బాబ్జీ వివరించాడు. 

'వచ్చేటప్పుడు గోదారికి ఎదురొచ్చామన్న మాట. అప్పుడు తెడ్లు వేస్తే కానీ పడవ కదలదు. ఇప్పుడు అక్కర్లే. కెరటాల వాలుకి తెరచాప సాయంతో వెళిపోతాం' అంటూ బాబ్జీతో పాటు మిగతా వాళ్లు కూడా అనునయించారు. 'ఏడుపాపెయ్‌...' అన్నారంతా. 

నా వెక్కిళ్ల మధ్య ఎలాగైతేనేం, కోటిపల్లి వచ్చేశాం. నెమ్మదిగా పడవ దిగాం. 

దూరంగా తెల్ల ప్యాంటు, తెల్ల షర్టుతో నాన్నగారు. ఆయన చేతిలో బ్యాటరీ లైటు. 

నేను ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నగారిని వాటేసుకున్నా. నా వెనక బాబ్జీ మావయ్య బితుకుబితుకుమంటూ వచ్చాడు. 

బాబ్జీ చేతికందేంత దగ్గరగా రాగానే నాన్నగారు టెంకిజెల్ల పీకారు. బాబ్జీ కూడా బేరుమన్నాడు. నాకూ పడ్డాయి నడ్డిమీద. 

ఇక ఇంటికొచ్చాక అమ్మ, నాన్న తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకొచ్చారు. ఎక్కువగా బాబ్జీ మావయ్యకే. 

వాళ్ల తిట్లలో ఇప్పుడు నాకు పెద్దవాళ్ల బెంగలూ, భయాలూ కనిపిస్తున్నాయి. వాటి వెనక కొండంత ప్రేమ, ఆప్యాయత కూడా!

బుధవారం, జూన్ 21, 2023

జనచైతన్యంబెట్టిదనిన...!

'ఏంటయ్యా సెక్రట్రీ... చెమటలు కక్కుతున్నావ్‌? ఏంటి సంగతులు?'

'నెమ్మదిగా అడుగుతారేంటండి బాబూ? అవతల కొంపలారిపోతుంటేను...'

'చూడు సెక్రట్రీ... ఈ కొంపలారిపోవడాలు, కొంపలంటుకుపోవడాలు మనకి ఆనవయ్యా. ఎందుకంటే, అంటించేదీ ఆర్పేదీ మనమే కద? ఆటికింత కంగారు పడిపోవడం దేనికి?'

'అలాగా సార్‌. మరి తమరికి ఆనే విషయాలేంటో చెప్పండి, తెలుసుకుంటాను...'

'ప్రజానీకం చైతన్యవంతులవుతున్నారను... ఉలిక్కి పడతాను. జనం నిజాలు తెలుసుకుంటున్నారను... బెంబేలు పడతాను. సామాన్యులు తెలివి మీరుతున్నారను... కంగారు పడతాను. ప్రజలు మేలుకుంటున్నారను... బేజారిపోతాను. అంతకు మించిన ఘోరాలు ఏముంటాయయ్యా? తతిమ్మావన్నీ మనం చేసేవేకద?'

'అయ్యా... అయితే ఇప్పుడు ఉలిక్కిపడి, బెంబేలు పడి, కంగారు పడిపోయి, బేజారైపోయే పరిస్థితే వచ్చిందండి మరి. అందుకే ఆదరాబాదరా మీ దగ్గరకి ఉరుక్కుంటూ వచ్చాను. తమరేమో నిదానంగా వాకబు చేస్తున్నారు...'

'అరె... అవునా? అదేంటి..  మొన్ననే కదయ్యా మన పరిపాలన గురించి నానా అబద్దాలాడతా ప్రసంగించాను? నిన్ననే కదయ్యా మన పథకాలను ఊదరగొట్టి ఉపన్యాసం దంచాను? వెళ్లిన ప్రతి చోటా మన గొప్పలు చెప్పడం, ఎగస్పార్టీవోళ్లని ఎక్కడలేని తిట్లతో ఆడిపోసుకోడం చేస్తూనే ఉన్నాను కదయ్యా. ఇంతట్లోకి ఏమైందయ్యా?'

'ఏమవుతుందండీ, ఆ సినిమాలాయన లేడండీ? సిసింద్రీ అండి బాబూ. సీమ టపాకాయ కూడానండి. ఆయన చైతన్య రథం  ఎక్కేసి మీటింగులు పెట్టేస్తున్నాడండి. జనం విరగబడిపోతన్నారటండి. అడుగడుగునా బ్రహ్మరథం పట్టేస్తున్నారటండి. ఆయనేమో తమరు చేసే ఎదవపన్లన్నీ ఏకరవు పెట్టేస్తున్నాడండి. మీ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, అవకతవకల గురించి అరటి పండు ఒలిచి నోట్లో పెట్టేస్తున్నట్టు వివరించేస్తున్నాడండి. ఇహ... జనం ఊగిపోతున్నారండి. ఒకటే ఈలలు, చప్పట్లటండి. మన ఇంటెలిజెన్స్ఏజెంట్లు ఎప్పటికప్పుడు చెబుతుంటే గుండె గుబేలు మంటోందండి. ఆయ్‌...'

'వార్నీ... అయితే యవ్వారం  చాలా దూరం వచ్చిందన్నమాట. మరి మన పోలీసు కుక్కలేం చేస్తున్నట్టు?'

'అయ్యా... ఎన్నికలు రాబోతున్నాయి కదండీ? పూర్వంలాగా మరీ ఆంక్షలు అవీ పెట్టేస్తే మొదటికే మోసం వస్తుందని గమ్మునున్నారండి. ఈలోగా తమరి ప్రచారం మత్తులో ప్రగతేదో జరిగింది కాబోసనుకుని కునికిపాట్లు పడుతున్న జనం మేలుకుని నిజానిజాలేంటో కానుకుంటున్నారండి. పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోందండి మరి...'

'మరైతే మన గూండాలేం చేస్తున్నారయ్యా?'

'ఏం గూండాలండి బాబూ. ఆయన ఎక్కడ సభ పెట్టినా అక్కడ మన గూండాల చరిత్రంతా విప్పి చెప్పేస్తున్నాడండి. మన ఎమ్మెల్యేలు, ఎంపీల తాతల కాలం నాటి అకృత్యాలను కూడా బయటపెట్టేస్తున్నాడండి. మనోళ్లు ఎక్కడెక్కడ ఎలా జనం నోళ్లు కొట్టి లక్షల కోట్లు దండుకుంటున్నారో లెక్కలతో సహా సినిమా చూపించేస్తున్నాడండి. రేషన్బియ్యం మాఫియా లోతెంత, ఇసుక మాఫియా ఎత్తెంత, గంజాయి మాఫియా వెడల్పెంత, గనుల మాఫియా పొడవెంత, మద్యం మాఫియా వైశాల్యమెంత, డ్రగ్స్మాఫియా ఘనపరిమాణమెంత, మట్టి మాఫియా గుట్టెంత, ముడుపుల యవ్యారం చుట్టుకొలతెంత... ఎక్కడికక్కడ వెల్లడించేస్తున్నాడండి బాబూ...'

'పర్లేదయ్యా గాబరా పడకు. మాఫియా, అవినీతి గురించి ఎంత చెప్పినా జనానికి ఎక్కదయ్యా. ఏ రోజుకారోజు కాయకష్టం చేసుకుంటా, కాస్తో కూస్తో సంపాదించుకుంటా, పెళ్లాం బిడ్డల్ని చూసుకుంటా బతుకులీడుస్తున్న సామాన్యులకి ఎవడో ఎక్కడో ఏదో దోచుకుంటున్నాడంటే పట్టదయ్యా. అందుకేగా మనం ఏవేవో పధకాల పేరు చెప్పి ఆళ్లక్కూడా కాసిని ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నదీ?'

'అయ్యా... తమరు వాటి మీద ఎసరు పెట్టుకుని కూర్చుంటే చెల్లేలా లేదండి. పధకాల ద్వారా వేసేదెంతో అంతకు వంద రెట్లు సొమ్ములు దొడ్డిదారిన తమరు ఆళ్ల దగ్గర్నుంచి ఎలా గుంజుకుంటున్నారో, జెల్లకొట్టి మరీ లాక్కుంటున్నారో, ముందు జేబులో పది రూపాయలు పెడుతూనే, వెనక నుంచి పర్సు ఎలా కొట్టేస్తున్నారో కూడా ఆయన రథం మీద నుంచి చులాగ్గా చెప్పేస్తున్నాడండి. మరి తమరి హయాంలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో, బస్సు టికెట్ధరల్ని ఎలా ఎగసనదోసారో, అడ్డమైన చెత్త పన్నులు ఎలా విధిస్తున్నారో, నిత్యావసర సరుకుల ధరలు ఎంతలా పెంపు చేశారో, ఇల్లు కట్టుకునే ఇసుక కూడా దొరక్కుండా ఎలా చేశారో, మద్యం రేట్లు ఎలా పెంచేశారో, పెట్రోలుపై సెస్సులు అవీ ఎలా దండుకుంటున్నారో, ఎందులోంచి ఏం చేస్తామంటూ ఎలా లాక్కుంటున్నారో, అలా గుంజుకున్న సొమ్ముతో చేస్తామన్నది చేయకుండా ఎలా లెక్కా జమా లేకుండా అడ్డగోలుగా దోచుకుంటున్నారో విడమర్చి మరీ వివరించేస్తున్నాడండి. తమరు పధకాల ద్వారా వేసేదంతా కలిపినా ఏడాది పాటు కరెంటు బిల్లులకి కూడా సరిపోదని నిగ్గదీసే నిజానిజాలు వెల్లడించేస్తున్నాడండి. అంచేత తమరు జాగ్రత్త పడాలండి మరి...'

'ఈమాత్రం దానికే హడావుడెందుకయ్యా. వెర్రిజనమేమన్నా లెక్కలడగ్గల్రా? మనమేమన్నాచూపిస్తామా? విషయం అంతదాకా వస్తే మన అనుచరులు, నేరగాళ్లు, దుండగుల సైన్యం ఉంది కదయ్యా. వాళ్లని ఉస్కో అంటే సరి...'

'అయ్యా... అక్కడ జరుగుతున్న చైతన్యం తెలియక తమరిలా నింపాదిగా ఉన్నారండి. తనని చంపడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆయన పసిగట్టేశాడండి బాబూ. దాన్ని కూడా జనానికి చెప్పేస్తున్నాడండి. మరి తమరి జమానాలో నేరాలు, ఘోరాలు ఇన్నీ అన్నీనా చెప్పండి? ఓ పక్క మహిళలపై దౌర్జన్యాల్లో మనం జాతీయస్థాయిలోనే పేరు పడ్డామాండీ? మరో పక్క మన పార్టీవోళ్లంతా ఎక్కడికక్కడ రెచ్చిపోయి కబ్జాలు, దారుణాలు చక్కబెడుతున్నారాండీ? పేదోళ్లకిచ్చిన అసైన్డ్భూముల్ని కూడా ఆక్రమించేసుకుని తవ్వేసుకుంటున్నారాండీ? అదేంటని అడిగిన వాళ్ల మీద ఎదురు కేసులు పెడుతున్నారాండీ? పోలీసులకి చెప్పుకున్నా దిక్కులేని విధంగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించారాండీ? మొత్తానికి హోల్సేల్గా హోలాంధ్రా అంతా నేరాంధ్రాగా ఎలా మారిపోయిందో కూడా ఆయన నూరిపోసేస్తున్నాడండి. లా అండ్ఆర్డర్అంతా ఎలా మీ అండ్మీ గ్యాంగ్ఆర్డర్గా మారిపోయిందో ఎంచక్కగా బోధపరుస్తున్నాడండి. అవతల ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటే, ఆయన ఆవేశం ఆయుధంగా రూపుదిద్దుకుంటుంటే, ఆయన నిజాయితీ నిజాల నిగ్గు తీస్తుంటే, ఆయన చైతన్యం  జనంలోకి ప్రవహిస్తుంటే, ఆయన ఉపన్యాసాలు జనం మత్తు వదిలిస్తుంటే... మీరు మాత్రం మీ ముతక రాజకీయ, చచ్చు పుచ్చు తెలివితేటలతో ధీమాగా ఎలా ఉండగలుగుతున్నారండి బాబూ? ముందు మీరు మీ అధికార మైకంలోంచి బయటకి రండి బాబూ.. మీరిలా ఊరుకుంటే అది కూడా ఊడేట్టుంది మరి'

'......హ్హా సెక్రట్రీ... నిన్ను, నీ కంగారునీ నేనర్థం చేసుకోగలనయ్యా. కానీ నువ్వే నా నిజ స్వరూపాన్ని గ్రహించలేకపోతున్నావు. నేనేమన్నా వెర్రిబాగులోడిననుకుంటున్నావా? అధికార పీఠంపై అడ్డంగా బాసింపట్టు వేసుకుని కూర్చున్నవాడిని. అడ్డగోలుగా వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని తోలుబొమ్మలాట ఆడిస్తున్న వాడిని. ఇంత చేసినోడిని ఎన్నికల్లో కకావికలు చేయకుండా వదుల్తానా? ఇంటికో గూఢచారిలాగా మన ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేయలేదంటావా? ఆళ్లని ప్రజాధనంతోనే పెంచి పోషించలేదంటావా? ఆళ్ల సాయంతో ఎవరెవరు మనకి అనుకూలంగా ఉన్నారో, ఎవరెవరు ఎగస్పార్టీ వైపు చేస్తున్నారో గ్రహించలేననుకున్నావా? ఓటర్ల జాబితా సవరణ పేరు చెప్పి లక్షలాది ఓట్లను గల్లంతు చేయలేదనుకుంటున్నావా? కొత్త జాబితాలో దొంగ ఓటర్లను చొప్పించలేదంటావా? మన మాటలకి తలూపని ప్రతి వాడినీ ఎలాగోలా వేధించలేననుకుంటున్నావా? మనమేంటో, మనకి ఎదురు తిరిగితే ఏమవుతుందో ఈ పాటికి జనానికి అర్థం కాలేదనుకుంటున్నావా? ఎన్నికల్లో ఓటుకి నోటు చూపించి వెర్రి జనాన్ని ఊరించలేననుకుంటున్నావా? మందు ప్యాకెట్ చూపించి చేపకి ఎరవేసినట్టు ఆకర్షించలేననుకుంటున్నావా? పోలింగ్ బూత్లను ఆక్రమించుకుని ఎన్నికల అధికారులను పక్కన కూర్చోబెట్టి మనోళ్ల చేత మనకే ఓట్లు వేయించి రిగ్గింగ్చేయించలేనుకుంటున్నావా? అవసరమైతే ఓటింగ్యంత్రాలనే ఏమార్చలేననుకుంటున్నావా? ఎలాగోలా చెలరేగిపోయి తిరిగి నేనే అధికారంలోకి రాలేననుకుంటున్నావా? అమాయకుడా... కాబట్టి ఊరికే బెంబేలు పడకుండా నిబ్బరంగా ఉండు. తెలిసిందా?'

'అయ్యా... మీ నీచ, నికృష్ట, అధికార దురంహంకార, దారుణ, దౌర్జన్య, దుండగ, దుర్జన, దురిత, దుష్ట విధానాలు తెలియని వాడిని కాననుకోండి. కానీ జన చైతన్యాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయకండి. అది కానీ జాగృతమైతే కార్చిచ్చు అడవుల్ని కాల్చేసినట్టు, సునామీ తీరాల్ని ముంచెత్తినట్టు, భీకర తుపాను వేళ్లూనుకున్న చెట్లను సైతం పెకలించినట్టు, భయంకర సుడిగాలి సర్వాన్నీఊడ్చేసినట్టు,  చలి చీమల శక్తి  మహా సర్పాన్ని కూడా మట్టుబెట్టినట్టు... మీ అధికార అతివిశ్వాసాన్ని ఎండుటాకులా ఎగరగొట్టవచ్చు. మీ సెక్రటరీగా మీకు నేనిచ్చే ఆఖరి సలహా ఇదే. ఇక వస్తా'

-సృజన

PUBLISHED ON 21.6.2023 ON JANASENA WEBSITE

ఆదివారం, జూన్ 18, 2023

జై జగదేక వీరా!

ఓ ఆదివారం మా నాన్నగారు నన్ను పిలిచి ''ఒరేయ్‌! జగదేక వీరుడు సినిమా బాగుంటుందిరా. పోయి చూసిరా'' అని మూడు రూపాయలు చేతిలో పెట్టారు. ఇంకేముంది? ఆనందమే ఆనందం. అప్పుడు నేను బహుశా ఆరో తరగతో, ఏడో తరగతో వెలగబెడుతున్నా. ఇది డెభ్బైల నాటి మాట.  విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఉండేవారం. నాన్నగారు అక్కడి జూనియర్‌ కాలేజీలో ఇంగ్లిష్‌ లెక్చరర్‌. మంచి సినిమాలు వస్తే తీసుకెళ్లడమో, లేదో నన్ను పంపించడమో చేసేవారు. అప్పటికే గోడల మీద పోస్టర్లు చూశాను. ఎన్టీఆర్‌ రాకుమారుడిలా భలే ఉన్నాడనుకున్నా. సైకిల్‌ మీద పోస్టర్లు అతికించే వాడొస్తే వాడెనకాల మా పిల్లకాయలం పరిగెత్తేవాళ్లం. వాడు పోస్టర్‌ తీయడం, దాని వెనక్కి తిప్పి జిగురు రాయడం, దాన్ని గోడ మీద అతికించడం ఆసక్తిగా చూసేవాళ్లం. కాసేపు ఆ పోస్టర్‌ని, దాని మీద హీరో హీరోయిన్లనీ చూసి మురిసిపోతూ ఉండేవాళ్లం. 'జగదేక వీరుడు' సినిమా గురించి నాన్నగారిని అడగాలనుకుంటుంటేనే, ఆయనే లెక్కలతో కుస్తీ పడుతున్నట్లు నటిస్తున్న

 నా దగ్గరకి వచ్చి మూడు రూపాయలిచ్చి సినిమాకి పోయిరా అంటే ఎలా ఉంటుందో ఊహించండి. మనసులో కెవ్వుకేక కదూ! వెంటనే మనం పుస్తకాలు పక్కకి తోసేసి పరుగో పరుగు. మా ఇంటి వీధి చివరే శ్రీనివాస్‌ థియేటర్‌. అప్పట్లో రిజర్వుడు టికెట్‌ మూడు రూపాయలు ఉండేది. అంటే బాల్కనీ అన్నమాట. నేల టికెట్‌ అర్థరూపాయి. 

చోడవరంలో రెండు థియేటర్లు మా ఇంటికి బాగా దగ్గర్లో ఉండేవి. ఒకటి శ్రీనివాస్‌ అయితే, రెండోది పూర్ణా థియేటర్‌. రెండు థియేటర్ల ఓనర్ల కొడుకులు నానాజీ, రాజాజీ. ఇద్దరూ మా నాన్నగారి స్టూడెంట్లే. పొద్దున్నే మా ఇంటికి ట్యూషన్‌కి కూడా వచ్చేవాళ్లు. వాళ్లు ఇంటర్మీడియట్‌ అన్నమాట. 

మనం ఆయాసపడుతూ థియేటర్లో టికెట్‌ కౌంటర్ దగ్గరకి నడుస్తుంటే, ''ఏం బాబూ? సినిమాకొచ్చావా?'' అంటూ వెనక నుంచి నానాజీ పలకరించాడు. 

''అవును''

''పోయి కూర్చో. టికెట్‌ అక్కర్లేదులే'' 

''మా నాన్నగారు డబ్బులిచ్చారు''. మనం కొంచెం టెక్కు చూపించామన్నమాట. నానాజీ నవ్వి అక్కడున్న ఓ థియేటర్‌ పనోడిని పిలిచి, ''ఇదిగో. ఈ కుర్రాడిని రిజర్వ్‌డులో కూర్చోబెట్టు'' అన్నాడు. వాడు నన్ను తీసుకుని అంత పనీ చేశాడు. 

ఎప్పుడైనా నాన్నగారు, అమ్మ, నేను ఈ రెండు థియేటర్లలో దేనికైనా వెళితే నానాజీ, రాజాజీ ఆ సమయానికి అక్కడ లేకపోయినా, థియేటర్‌ ఓనర్లు కానీ, మేనేజర్లు కానీ చూస్తే గుర్తు పట్టి టికెట్‌ తీయనిచ్చే వాళ్లు కాదు. ఒకవేళ ఎవరూ గమనించనప్పుడు నాన్నగారు టికెట్లు కొన్నా మేం థియేటర్లో కూర్చున్న కాసేపటికి ఏ మేనేజరో వచ్చి నాన్నగారికి టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేసే వాడు. అంతే కాదు, ఇంటర్లెల్లో కూల్‌డ్రింకులు, సమోసాలు వచ్చేసేవి. అదంతా నాకెంతో గొప్పగా ఉండేదన్నమాట. 

నేను వెళ్లి రిజర్వ్‌డ్‌ క్లాసులో కూర్చున్న కాసేపటికి సినిమా మొదలైంది. ఇక మనం ఆ జానపద కథా లోకంలోకి వెళ్లిపోయాం. చిలిపి దెయ్యాలు, అప్సరసలు, జలకాలాటలు, ఎన్టీఆర్‌ సాహసాలు... ఏమని చెప్పాలి? ఓ అద్భుత ప్రభావం. 'హళా... వారుణీ', 'హళా... సఖీ' అనే పిలుపులకి, ఆ  మాటలకి మనం ఫ్లాట్‌. ఆ వయసుకి నాకు హీరోయిన్ల పేర్లు తెలియవు. దేవకన్యలంతే. అందులో రాజనాల అన్నట్టు... 'నా తెలివి పనిచేయడం మానేసింద'న్నమాట. 'ఒసే.. ఏమే... ఏమిటే...' అంటూ పలికే ఇంద్రకుమారి ముద్దు మాటలకి ముచ్చట పడిపోయా. నాగకుమారి నృత్యానికి మైమరచిపోయా. 'ఓం ఏకోనేకోహమస్మి' మంత్రం ఆ తర్వాత చాలా కాలం నన్ను వదలనే లేదు. 

ఇక పాటలు? 

'అయినదేమో అయినది ఇక గానమేలే ప్రేయసీ...'

'ఇది మోహన రాగమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే...'

'ఓ చెలీ ఓ సఖీ ఒహో మదీయ మోహినీ...' 

ఆ పాటలు చూస్తూ  ఆ నటీనటుల భావాలతో మమేకమైపోయా. 

'రారా కనరారా... కరుణ మానినారా... ప్రియతమలారా...' అంటూ ఎన్నీఆర్‌ పాడుతుంటే మన గుండె కూడా బరువెక్కిపోయింది. 

ఒకడు ఐదుగురై, ఏక కాలంలో వాయిద్యాలన్నీ వాయిస్తూ ఎన్టీఆర్‌ పాడే 'శివశంకరీ... శివానంద లహరి...' పాటకి పులకించిపోయా. 

మొత్తానికి సినిమా అయిపోయినా ఆ మత్తులోనే తేలియాడుతూ, కాళ్లీడ్చుకుంటూ చెల్లా శీనుగాడి ఇంటి అరుగు మీద కూలబడ్డా. 

ఫ్రెండ్స్‌ చేరారు. మనం మొదలెట్టాం. ''ఒరేయ్‌. జగదేకవీరుడు మ్యాట్నీకెళ్లారా. సినిమా ఉందిరా...'' అంటూ కబుర్లు మొదలు. 

''భలే వెళ్లావురా, మొదటి రోజే' అంటూ వాళ్లు చుట్టూ మూగారు.

అప్పుడే... మనకొక ఐడియా తళుక్కుమంది. 

''ఒరేయ్‌. ఫస్ట్‌ షోకి పోదామా'' అన్నా హుషారుగా. 

''ఎలారా. డబ్బుల్లేవుగా'' అన్నారు వాళ్లు దిగులాగా.

''నా దగ్గర ఉన్నాయిగా'' అంటూ జేబులోంచి మూడు రూపాయలు చూపించా. నాన్నగారు డబ్బులివ్వడం, నానాజీ లోపలికి పంపిచేయడం అంతా చెప్పా. చుట్టూ జట్టుగాళ్లు నాతో కలిపి ఆరుగురు. 

''ఒరేయ్‌. నేలకి పోదాంరా'' అంటూ నేను మళ్లీ పరుగు. నా వెనకాలే వాళ్లూనూ. అందరం కలిసి అర్థరూపాయి వంతున ఆరు టిక్కెట్లు కొనుక్కుని నేలలోకి దూరిపోయాం. అంటే నేను ఒకే రోజు మ్యాట్నీ, ఫస్ట్‌ షో చూసేశానన్నమాట. 

రాత్రి తొమ్మిదిన్నరకి ఇంటికి చేరేసరికి, ''ఏరా, మ్యాట్నీ అయిదున్నరకే అయిపోతుందిగా? ఇంత సేపు ఏం చేశావ్‌?'' అనడిగితే, 

''ఆడుకొని వచ్చా'' అని చెప్పేశా! ఆ తర్వాత ఆ సినిమా వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ టీవీల్లో వస్తే చూడడమే. 

బుధవారం, జూన్ 14, 2023

సునసూయలు అంటే?

ఓసారి నేను నాన్నగారి దగ్గరకి వెళ్లి, ''సునసూయలు అంటే ఏంటండీ?' అని అడిగాను.

ఏదో పని చేసుకుంటున్న ఆయన ప్రశ్నార్థకంగా మొహం పెట్టి, ''సునసూయలు ఏంట్రా?'' అని అడిగారు.

''అవును నాన్నగారూ, పాటలో కూడా ఉంది'' అన్నాన్నేను.

''ఏదీ ఆ పాటేంటో చెప్పు?'' అన్నారాయన.

నేను హుషారుగా పాడాను కూడా. ''బృందావనమిది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే. ఎందుకె రాధా ఈ సునసూయలు? అందములందరి ఆనందములే...'' అని నేను పాడగానే ఆయన నవ్వేశారు.

''అది ఈ సునసూయలు కాదురా, ఈసునసూయలు...'' అన్నారు.

నాకేమీ అర్థం కాలేదు, నేను చెప్పిందే చెబుతారేంటని.

అప్పుడు వివరించారు, ''ఈసు అంటే ఈర్ష్య. అసూయ అంటే తెలుసుగా? రెండింటినీ కలిపి 'ఈసునసూయలు' అని పాడారు. నువ్వేమో ఆ పదాన్ని విడదీసి, 'ఈ... సునసూయలు' అంటే నాకే అర్థం కాలేదు. రాముడి తోక పివరుండు ఇట్లనియే... లాగా...'' అన్నారు తేలిగ్గా నవ్వేస్తూ.

అన్నట్టు 'రాముడి తోక పివరుండు ఇట్లనియే' తెలుసుగా? 

'రాముడితో కపివరుండు ఇట్లనియే...' అని చదువుకోవాలన్నమాట. 

మీ చిన్నప్పుడు కూడా ఇలాటి అర్థంకాని... అర్థం లేని సందేహాలు కలిగి ఉంటే సరదాగా కామెంట్‌ రూపంలో పంచుకోండి. సరేనా?


గురువారం, జూన్ 01, 2023

రక్షక భట వికాస మంత్రం!పోలీసులా? పాలకుల తొత్తులా? నేతలు ఉసికొల్పితే ఉరికి, కసితీరా కరిచే శునక జాతి ప్రతినిధులా? శాంతియుత ప్రదర్శనలు చేసుకునేవారిపై విరుచుకుపడతారా? హత్యానేరం అభియోగంపై అరెస్టు కాకుండా ప్రయత్నించే నేతలను కంటికి రెప్పలా కాపాడుతారా? పాలక పార్టీవారిపై ఈగ వాలనివ్వరా? అన్యాయమని అడిగినవారిపై దౌర్జన్యాలకు తెగబడతారా? ఇదెక్కడి చోద్యం?...

ఇలాంటి విమర్శలన్నీ పోలీసు శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. అందరూ తర్జనభర్జనలు పడి చివరికి రాష్ట్రంలో పోలీసులకి  వ్యక్తిత్వ వికాస నిపుణుడితో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.

+++++++

వివిధ స్థాయుల్లోని పోలీసులను  పెద్ద మందిరంలో సమావేశపరిచారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు గొంతు సవరించుకున్నాడు.

''మిత్రులారా! ఇది ఆంతరంగిక సమావేశం. ముందుగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. స్వేచ్ఛగా సమాధానం చెప్పండి'' అన్నాడు.

''అడుక్కో...''  గొంతుక బొంగురుగా వినిపించింది వెనక కుర్చీల నుంచి.

నిపుణుడు గతుక్కుమన్నా తేరుకుని, ''మీరంతా సమాజానికి రక్షణ కల్పించే ఆదర్శవంతమైన ఉద్యోగంలో ఉన్నారు కదా? మరి శాంతిని పరిరక్షించాలంటే ఏం చేయాలి?'' అని ప్రశ్నించాడు.

''ఇరగదీయాలి!'' బుల్లెట్లా వచ్చిదొక సమాధానం.

''కుళ్లబొడవాలి!'' మరో కరకు గొంతు గట్టిగా అరిచింది.

''బూతులు తిడుతూ రెచ్చిపోవాలి'' ఇంకొ గళం గరగరలాడింది.

నిపుణుడు తెల్లబోయినా తేరుకుని, ''అదేంటి? అలా చేయడం తప్పు అనిపించడం లేదా?'' అన్నాడు.

''తప్పా? తొక్కా? అలా చేస్తేనే దార్లోకి వస్తారు ఎదవలు...'' అన్నాడో పోలీసు.

''అలా చేస్తే మీ మీద ప్రజల నుంచి విమర్శలు వస్తాయి కదా? అప్పుడు సిగ్గుగా ఉండదా?''

''సిగ్గా? ఎగ్గా? ప్రజలేమంటే మాకేటి? అధికారంలో ఉన్న నేతలు ముఖ్యం కాని...'' అన్నాడింకో ఖాకీ నిర్లక్ష్యంగా.

నిపుణుడికి ఏమనాలో అర్థం కాలేదు. అయినా చిరునవ్వు చెరగనీయకుండా, ''ఉదాహరణకు కొందరు నిరసన ప్రదర్శన జరపాలనుకున్నారనుకోండి. అది శాంతియుతంగా జరగడానికి మీరేం చేస్తారు?'' అని అడిగాడు.

''అసలా ప్రదర్శనే కదలకుండా కాళ్లిరగదీసి ఆపేస్తే పోద్ది. అప్పుడంతా శాంతియుతమే కద?'' అన్నడొక పోలీసు.

''మరి అలా ప్రదర్శన జరిపే వారు రైతన్నలో, మహిళలో అయితే వాళ్లతో సున్నితంగా వ్యవహరించాలి కదా?''

''సున్నితమా గుడ్డా? ఇయ్యన్నీ చూసుకుంటే డ్యూటీ చేయలేం. ఆడోళ్లయితే ఏంటంట? కొంగులుచ్చుకుని, జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చేయడమే. ఒసేయ్‌... ఎంటే వాగుతున్నావంటూ బూతులు లంకించుకుంటే సిగ్గుపడిపోయి ఆళ్లే పోతారు. ఇక రైతులైనా, ముసిలోళ్లయినా మాకొకటే... ఊరేగింపు సాగకూడదంతే...''

''అప్పుడు ఉద్రేకాలు మరింత చెలరేగుతాయి కదా?''

''ఆళ్ల ఉద్రేకాలు రేక్కుండానే కదా మేం చెలరేగేది? ఇక ఆళ్లంతా చెల్లాచెదురే...''

నిపుణుడు గొంతు పెగల్చుకుని, ''మిత్రులారా! కానీ అలా చేస్తే మీకే నష్టం కదా? బాధితులు మీమీదే కేసులు పెడితే?''

''ఏడిశారు. మామీద కేసు పెట్టడానికి వస్తే ఎవడు రాసుకుంటాడు? ఆళ్లు కేసు పెట్టడానికి బయల్దేరాని తెలియగానే స్టేషన్లో ఎవరూ లేకుండా చూసుకుంటాం. అందరూ ఏవేవో డ్యూటీల మీద బయటకెళ్లినట్టు చెప్పిస్తాం. ఒకేల ఆళ్లు అక్కడే బైఠాయిస్తే అర్థరాత్రి వరకూ అందుబాటులోకి రాం.  పాటికి విసుగొచ్చి పోతారు. అయినా కూర్చున్నారనుకో, ఏదో మొక్కుబడికి కాగితం ముక్క రాసుకుంటాం. ఆనక దాన్ని చించి అవతల పారేస్తాం'' అన్నాడొక చురుకైన పోలీసు.

''అరె... చిత్రంగా ఉందే. ఎఫ్ఐఆర్ఫైల్చేస్తే దాని మీద ఏం యాక్షన్తీసుకున్నారో, ఏమైందో రికార్డు చేయాలి కదా?''

''......హా... నువ్వేదో ఎర్రోడివయ్యా. మా ఇలాకాలో ఎలా చేసినా అడిగే వారుండరు. దర్యాప్తు తూతూ మంత్రమే. రిపోర్టూ అంతే. ఆనక విషయం సద్దుమణిగాక ఫైల్క్లోజ్చేసేయడమే...'' అన్నాడో ముతక ఖాకీ.

నిపుణుడికి గొంతు తడారిపోయింది. కాసిని మంచినీళ్లు తాగి, ''మరి మీరిలా మీ ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు చేస్తే పైనుంచి మీకు ఒత్తిడి ఉండదా?''

''పైనుంచి అంటే...?''

''అంటే... అదే... మీ ఉన్నతాధికారుల నుంచో, లేదా మంత్రులు, ముఖ్యమంత్రి, హోం మంత్రి లాంటి వాళ్ల నుంచో...''

ఒక్కసారిగా హాలంతా నవ్వులతో దద్దరిల్లింది. కొందరు పోలీసులు బాన పొట్టలు పట్టుకుని మరీ నవ్వసాగారు. కొందరు కింద పడి దొర్లసాగారు.

''......ది...కా........య్యా! అసలు పైవాళ్లు చెప్ప బట్టే కదా, మేం ఇలాంటి ఎదవ పనులు చే...హే..సే..హే...ది?'' అంటూ పోలీసులు నవ్వుతూనే సమాధానం చెప్పారు.

నిపుణుడిలో పట్టుదల పెరిగింది. ''అది కాదండీ...  సంఘటన జరిగినా మీడియా అదీ ఉంటుంది కదా? వాళ్లు మీ దౌర్జన్యాన్ని ఫొటోలు, వీడియోలు తీస్తే ప్రజల ముందు పరువు పోదూ?'' అన్నాడు.

మరోసారి హాలంతా నవ్వులతో నిండిపోయింది.  పోలీసు లేచి, ''నిరసన చేసేటోళ్లను తుక్కురేగ్గొట్టేప్పుడు మీడియో వాళ్లని కూడా చితగ్గొట్టి తరిమేస్తాంగా? ఆళ్ల కెమేరాలు పగలగొట్టేస్తాంగా?'' అన్నాడు వెకిలిగా నవ్వుతూనే.

''ఫొటోలు, వీడియోలు లేకపోయినా ప్రింట్మీడియాలో వార్తలొస్తాయి కదా? అప్పుడు న్యాయస్థానాలు కూడా సూమోటో కేసు తీసుకోవచ్చుగా?'' అన్నాడు నిపుణుడు.

''ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే రాసుకుంటారు, మాకేంటి? మా పాలకుడి సొంత పేపరుందిగా? అందులో పెద్ద పెద్ద అక్షరాలతో వేరే విధంగా వార్తలొస్తాయి. ఇతర పత్రికలు రాసిదంతా అబద్దమని కథనాలుంటాయి. దాంతో ప్రజలు గందరగోళంలో పడిపోతారు. అంతే...'' అన్నాడొక పోలీసు ముసిముసిగా నవ్వుతూ.

''ఇక  కోర్టయినా సూమోటో కేసందనుకో.  జడ్జిల మీదనే మా అధినేతలు సుప్రీం కోర్టులో కేసెట్టగలరు. అంతటి ఘనుల పాలనలో మాకేటి ఢోకా?''అన్నడింకో పోలీసు నిర్లక్ష్యంగా.  

వ్యక్తిత్వ నిపుణుడు బుర్రగోక్కున్నాడు. ఆపై టాపిక్మార్చాలనుకుని, ''ఇదంతా సరే. ఇప్పుడు మీరెలా ప్రవర్తిస్తే ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారో చెబుతాను. ఉదాహరణకి ఒక హత్యో, మానభంగమోలాంటి తీవ్రమైన నేరం జరిగిందనుకోండి. అప్పుడు ముందుగా మీరేం చేస్తారు?'' అనడిగాడు.

''ముందు  నేరం చేసినోడు ఎవరో కనిపెడతాం.  తర్వాత ఆడెవరి తాలూకానో తెలుసుకుంటాం...''

''నేరస్థుడు ఎవరైనా ముందుగా అరెస్టు చేయాలి కదా?''

''అబ్బే... ఆడు  ఎమ్మెల్యే తాలూకానో, మంత్రిగారి అనుచరుడో, పాలక పార్టీ నేతల చుట్టమో అయితేనో? ఆనక ఎక్కడ లేని తలనొప్పులు. మమ్మల్ని బదిలీ చేయడమో, వీఆర్లో పడేయడమో చేస్తారు. అంచేత ఆడి జోలికెళ్లం. పైగా పైవాళ్లు చెబితే ఆడికే రక్షణ కల్పిస్తాం. మరెవర్నో కేసులో ఇరికిస్తామంతే...''

''అయ్యో... అలా అయితే బాధితులకి న్యాయం జరగదుగా?''

''పోతే పోద్ది. మాకు అన్యాయం జరగదుగా?''

నిపుణుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రూటు మార్చాలనుకుని, ''సరే... ఫ్రెండ్స్‌! మీరంతా సమాజంలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు ఇప్పుడు మానవహక్కులు ఎంత బలమైనవో చెబుతాను...'' అన్నాడు.

''మానవ హక్కులు బలమైనవా? ఆటి కన్నా బలమైనవి మా దగ్గరున్నాయిగా?'' అన్నాడొక పోలీసు లేచి నుంచుని.

''ఏంటవి?''

''మా లాఠీలు! బూట్లు!!''

 సమాధానానికి మరోసారి నవ్వులు చెలరేగాయి. వ్యక్తిత్వ నిపుణుడు చిన్నబోయాడు. అయినా తేరుకుని, ''మీ పరిధిలో మీరు ఇలా చేసినా చెల్లిపోతుందేమో. కానీ మీ కంటే పెద్దవైన కేంద్ర దర్యాప్తు సంస్థలు అవీ ఉన్నాయిగా? వాళ్లు జోక్యం చేసుకుంటేనో?'' అన్నాడు.

''ఆళ్లు అడుగు ముందుకేయగలరేంటి?  హత్య కేసులో నిందితుడినో అరెస్టు చేయడానికి  సీబీఐ వాళ్లో వచ్చారనుకోండి. ఆళ్లకి ముందుగా మేమే ఉప్పందిస్తాం. దాంతో ఆడి అనుచరులంతా ఆడింటి చుట్టూ బైఠాయిస్తారు. సీబీఐ వాళ్లు అరెస్టు చేయడానికి వచ్చినా ఎక్కడా దారీ తెన్నూ ఉండదు. మేం శాంతిభద్రతల పేరు చెప్పి ఆడి అనుచరుల మానవ హక్కులు పరిరక్షిస్తాం. అవసరమైతే ఆళ్లకి టిఫిన్లు, కాఫీలు అందిస్తాం. కళ్ల ముందు ఏం జరుగుతున్నా బొమ్మల్లాగా చూస్తూ ఉండిపోతాం. అంతే...'' అన్నాడొక పోలీసు చాలా చులాగ్గా.

నిపుణుడు ఈసారి మరో మార్గంలో ముందుకెళ్లడానికి ప్రయత్నించాడు.

''ఫ్రెండ్స్‌! మీ చర్యల వల్ల, మీ ప్రవర్తన వల్ల మీ రాష్ట్రాన్ని పాలించే అధినేతకి ఎంత అప్రతిష్ట వస్తుందో గ్రహించారా? అది ఆయనకి నామర్దా కాదా? అందువల్ల మీరు మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని మీకు అనిపించడం లేదా?'' అనడిగాడు.

అప్పుడు తల పండిపోయిన  పెద్ద వయసు పోలీసు లేచి ఘాటుగా మొదలెట్టాడు.

''ఊరుకోవయ్యా బాబూ. నువ్వెక్కడి పెర్సనాలిటీ డెవలపర్వయ్యా? అసలు  అధినేత మీదే సవాలక్ష కేసులున్నాయని తెలియదా? లక్షల కోట్ల రూపాయల మేరకు అక్రమాస్తులకు సంబంధించిన నేరారోపణలు ఉన్నాయని తెలుసుకోలేదా?  కేసులన్నింటికీ  కొలిక్కి తేడానికి కోర్టులే కిందా మీదా పడుతున్నాయని చదవడం లేదా? ఇక ఇక్కడి అమాత్యుల మీద కూడా బోలెడన్ని కేసులు అతీగతీ లేకుండా పడున్నాయని అర్థం చేసుకోలేవా? అధినేత మనుషులు, అమాత్యులు అనుచరులు ఎక్కడికక్కడ అవినీతిని అందలం ఎక్కిస్తున్నారని గ్రహించలేవా? అన్నింటిలోనూ వాటాల రాజకీయం రాజ్యమేలుతోందని తెలియలేదా? నువ్వు చెప్పదలుచుకున్న వ్యక్తిత్వ వికాస పాఠాలు ఏమైనా ఉంటే వాళ్లకి చెప్పుకోవయ్యా. ఆళ్ల పాలనలో కిక్కురుమనకుండా మా ఉద్యోగాలు మేం బిక్కుబిక్కుమంటూ చేసుకునే మా మీద పడతావేంటి?'' అంటూ సమావేశంలోంచి వెళ్లిపోయాడు. ఆయన వెనకు అందరూ ఒకొక్కరుగా జారిపోయారు.

ఆఖరికి వ్యక్తిత్వ వికాస నిపుణుడు మాత్రమే మిగిలాడు. అతడు డైరీ తెరిచి  కొత్త సూత్రం రాసుకున్నాడు.

''పాలకులు మారనంత వరకు  రాష్ట్రం గతి ఇంతే!'' అని!

-సృజన

PUBLISHED ON 30.5.2023 ON JANASENA WEBSITE