మంగళవారం, మార్చి 29, 2022

అప్పుడే అస‌లైన ఉగాది!


 

ఉగాది మాట వినేస‌రికి సామాన్యుడికి సంబ‌రమొచ్చింది. బ‌జార్లో దొరికిన ర‌క‌ర‌కాల గంట‌ల పంచాంగాల‌న్నీ కొనుక్కుని ఇంటికొచ్చి చాపేసుకుని కూర్చుని హుషారుగా భార్య‌ను పిలిచాడు.

"ఇయ్యాల పండ‌గే. రాశుల గురించి రాసే పుస్త‌కాల‌న్నీ కొనుక్కొచ్చినాను. బేగిరా. మ‌న జాత‌కాలెలా ఉన్నాయో సూద్దారి..." అన్నాడు.

లోప‌లి నుంచి భార్య వ‌చ్చి, "నీ పిచ్చిగానీ మావా! మ‌న జాత‌కాలేమ‌న్నా మారేవా, స‌చ్చేవా?  మూడేళ్ల నుంచీ ఉగాదొచ్చిందంటే చాలు, ఆ పుస్త‌కాల‌న్నీముందేసుకుని కూసుంటావు. నీద‌ని, నాద‌ని, సుట్టాల‌ద‌ని, ప‌క్కాల‌ద‌ని రాశుల‌న్నీ ఈ మూల్నుంచి ఆ మూల‌దాకా స‌దివేత్తావ్‌. రేప‌ట్నుంచి అన్నీ మంచి రోజులేనంటావ్‌. ఏదీ? మ‌న బ‌తుకులేవైనా బాగుప‌డ్డాయా అని! ఏర్ర‌ని ఏగాణీకి దిక్కులేదు. పైగా ఏ ఏటికాయేడు ఉన్న‌ది ఊడుతోంది... ఏంటో నీ చాద‌స్తం..." అంటూ చ‌తికిల‌బ‌డింది నీర‌సంగా.

"ఓలొల్లకోయే... ఎప్పుడు సూసినా ఈసురోమంటూ వాగుతావు... కొత్తేడాది ఎలాగుంట‌దో సూసుకోవ‌ద్దూ. నిన్న‌టి క‌ట్టాలియ్యాలుంటాయా, ఇయ్యాల్టి బాధ‌లు రేపుంటాయా? అస‌లీటిలో ఏం రాశారో సూడ‌నీ, ఊరికే న‌స పెట్ట‌క‌..."

"స‌ర్లె స‌దువు... నేనొద్దంటే మాత్రం నువ్వింటావుగ‌న‌క‌నా?"

"ఈ ఏడాది పేరేంటో తెలుసా?  శుభ‌కృతంట‌. పేర్లోనే శుభముంది క‌దే..."

"దాని పేరేదైనా ఒక‌టే మావా. మ‌న‌కొరిగేదేదీ ఉండ‌దు. మ‌న‌లాంటి సామాన్యుల‌కు శుభ‌క్రుతైనా అశుభ‌క్రుతే అవుతది..."

"నోర్ముయ్య‌హె... తెర్ర వాగుడూ నువ్వూను. అట్లా ఎందుక‌వుద్దే?  శుభం ప‌ల‌క‌వే అంటే అభాసు మాట‌లాడ‌తావు... పండ‌గ పూట‌నైనా సూడ‌వు..."

"మ‌రిట్టా కాక‌పోతే మ‌రెట్టా అనాలి మావా... మ‌నమున్నది ఆంధ్రాలోన‌న్న మాట మ‌రవ‌మాక‌.  ఇక్క‌డేం జ‌రుగుతోందో నీకేమైనా ఎరికుందా అని?  రోజూ పేప‌రు స‌ద‌వ్వుకానీ, ఏడాదికోసారి పంచాంగం స‌దువుతానంటావు. అందులో ఏం రాసినా, మ‌న త‌ల‌రాత మార‌దు..."

"ఏడిశావ్‌... ఎందుకు మార‌దే?"

"ఎందుకు మార‌దా? మ‌న త‌ల‌రాత మ‌న‌మే రాసుకున్నాం కాబ‌ట్టి. మాయ మాట‌లిని భ్ర‌మ‌ల్లో ప‌డి మ‌న‌కి మ‌న‌మే మ‌న‌ల్నేలే వాళ్ల‌ని నెత్తి మీద‌కి తెచ్చి కూకోబెట్టుకున్నాం కాబ‌ట్టి... అది సేత్తాం, ఇది సేత్తామంటూ ఊరూవాడా తిరిగి సేతులూపి, ముద్దులెట్టి, త‌ల‌లు రాసి, బుగ్గ‌లు పిసికి కుర్సీ ఎక్కినోల్లు అన్న‌వ‌న్నీ మ‌ర్చిపోయి అయిన‌కాడికి దోచుకుంటున్నారు కాబ‌ట్టి..."

"వాసినీ... మొద‌లెట్టావా, రాజ‌కీయ పంచాంగం? ఎప్పుడు సూడు, ఆడిపోసుకోడ‌మే... నిన్న‌గాక మొన్నే గ‌దే, నీలాంటి ఆడోళ్ల కోసం అదేంట‌మ్మా... ఆ... దిశ అని సెప్పేసేసి కొత్త వాహ‌నాల‌కు జెండా ఊపారు? మ‌రది మంచి ప‌ని కాదేటి?"

"ఓరి నా వెర్రి మావా... న‌ట్టింట్లో అగ్గెట్టి, ఇంటి ముందు ముగ్గేస్తే సంబ‌ర‌ప‌డ‌తావు నువ్వు. ఆడాళ్ల‌కి ఎక్క‌డా భ‌ద్ర‌త లేని ప‌రిస్థితులు తీసుకొచ్చిన సంగ‌తి మ‌రిచిపోయి, పైపై మెరుగులకు మురిసిపోతావు... పైగా నేనేమైనా అంటే రాజ‌కీయ పంచాంగ‌మంటూ ఎకసెక్కాలోటి... సిగ్గులేక‌పోతే స‌రి... మంచి ప‌నంట మంచి ప‌ని!"

"ఏంటే... ఊరికే రెచ్చిపోత‌న్నావు? ఏమైందే మీ ఆడాళ్ల‌కి?  ఇవ‌రంగా సెప్పు సూద్దారి..."

"స‌ర్లే... సెప్ప‌క సెప్ప‌క నీకే సెప్పాలా? ఒల్ల‌కో... సీక‌టి ప‌డితే సాలు, ప‌గ‌లంతా ఒళ్లు హూనం సేసుకుని సంపాదించిందంతా పెట్టి సుక్కేసుకుని ఇంటికొత్తావ్‌. మారు మాటాడ‌నిత్తావా అని! ఏదేదో వాగుతావ్‌... అడిగితే సావ‌గొడ‌తావ్‌... ఇంటింటా ఇట్టాంటి ప‌రిస్థితి తెచ్చిందెవ‌రు మ‌రి? అంత‌క్రితం ఇంత‌గా తాగేవాడివా? ఇంత‌లేసి త‌గ‌లేసేవాడివా? అప్ప‌టి మందు ఖ‌రీదెంత‌? ఇప్పుడెంత‌?  నీకేమైనా అజా ప‌జా ఉందా అని! త‌గ‌లేసేవాడికి నీకేం తెలుస్తుందిలే, త‌ట్టుకునే ఆడోళ్ల‌కి తెలుస్తుందికానీ. నిన్న‌గాక మొన్న ఎప్పుడూ ఎర‌గ‌ని కిక్కొస్తోందే అంటూ నాటు సారా ఏసుకొచ్చావ్‌. అది తాగొద్దురా మావా, అందులో ఏవేవో ర‌సాయినాలూ గ‌ట్రా క‌లుపుతున్నారంటా... అని సెబితే ఇన్నావుగావు. ఏమైంది?  నీ ప్రాణం మీద‌కొచ్చింది. పుస్తెలు అమ్మి నిన్ను ద‌క్కించుకున్నాను. మ‌డిసివి ద‌క్కావంతే సాల‌నుకున్నా. అస‌లు నీకో సంగ‌తి తెల్సునా అంట‌? ఊరూ వాడా నాటు సారా బ‌ట్టీలేనంట‌. అది కాసేవోల్లంతా క‌లిసి మామూళ్లిత్తారంట‌... మ‌న ప‌క్క‌నున్న టేసన్లో పోలీసోళ్ల నుంచి, మ‌న ముందు నుంచి తిరిగే నేత‌ల కాన్నుంచి, కుర్సీలెక్కి కులాసాగా కూసున్న పెద్దోళ్లదాకా వాటాలుంటాయంట‌. ఒక్క నాటు సారాతో పోయిందా అంట‌! ఏవేవో కొత్త కొత్త పేర్ల‌తో బ్రాండులెట్టి సీసాలు పెట్టార‌ని నువ్వే సెబుతావు క‌దా?  వాటిలో కొన్న‌యితే దేశంలో మ‌రెక్క‌డా దొర‌క‌వంట‌... అంత స్పెష‌లు మ‌రి మ‌న ఆంధ్రా అంటేని. నీ తాగుడుతో ప‌డ‌లేక... మ‌ద్య‌పానం ఆపేత్తాన‌ని నంగ‌నాచి క‌బుర్లు  సెబితే నిజ‌మేగామోస‌నుకుని ఓటేసేశాం మా ఆడోళ్లంతాని. ఏమైంది?  కొరివితో త‌ల‌గోక్కున్న‌ట్ట‌యింది మాప‌ని. మూడేళ్ల నుంచి ఒక‌టే మ‌ద్యం మోత‌. ఏడాదికి ఇర‌వై వేల కోట్ల రూపాయలంట‌, నీలాంటోల్లంతా తాగి త‌గ‌లేత్తంది తెలుసా?  మీ క‌ట్టార్జితం పోసి తాగి మ‌త్తెక్కిపోతంటే, ఆ కాసులెట్టి సంబ‌రాలు సేసుకుంటున్నారాళ్లంతా.  నీకింకో సంగ‌తి తెలుసా?  మీరంతా తాగి కురిపించే సొమ్ముల్ని ముందే తాక‌ట్టు పెట్టి కోట్ల‌కు కోట్లు అప్పులు సేత్త‌న్నారంట. ఇక మ‌ద్య నిషేధం ఏం సేత్తారీల్లు?  మాయ‌దారి మాట‌లు కాబోతేని! అంటే అన్నానంటావు కానీ, రాష్ట్రం మొత్తానికిలా మ‌త్తు అల‌వాటు సేయ‌డం బ‌ట్టే... నేరాలు పెరిగిపోత‌న్నాయని ఎరికేనా నీకు?  అస‌లు జ‌రిగే నేరాల్లో స‌గానికి స‌గం తాగిన మ‌త్తులో సేత్త‌న్న‌వేనంట‌. ఆడాళ్ల మీద అత్యాచారాలు అందుకే జ‌రుగుతున్నాయి మ‌రి. ఆడ పోలీసుల‌కే దిక్కులేని దిక్కుమాలిన పాల‌న జ‌రుగుతోందిక్క‌డ‌... నీ సుట్టూతా ఇంత జ‌ర‌గుతాంటే, ఇంకా నీకు ఇవ‌రంగా సెప్పాలా?"

తాగుడు మాటెత్తేస‌రికి సామాన్యుడు మారు మాటాడ‌లేదు. కానీ ఎలాగోలా భార్య‌ను దారికి తెచ్చుకుందామ‌ని నెమ్మ‌దిగా న‌సిగాడు...

"అదికాదే... మావంతా ఏదో తాగేమే అనుకో. మా సొమ్మంతా స‌ర్కారోళ్ల‌కే దార‌పోశామే అనుకో. కానీ అలా వ‌చ్చిన డ‌బ్బుల్తో మ‌న‌కే మంచి సేత్త‌న్నారంట క‌దా? అయ్యేవో ప‌థ‌కాల‌కే ఇస్త‌న్నారంట క‌దా?  టీవీలో స‌మావేశాల్లో సెబుతాంటే సూశాన్లే..."

"ఛీ... ఆడు సెప్ప‌డం, నువ్వు విన‌డం, పైగా న‌మ్మ‌డం! ఇల్లు, ఒళ్లు గుల్ల సేసి పేద‌ల్ని పిండుకుని  ఆ సొమ్ముల‌తోనే ఆడ‌ప‌డుచుల‌కు మంచి సేత్తాడంట, మంచి! థూ...! వింటుంటేనే కంప‌ర‌మెత్తుకొత్తాంది. ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం నాలుగు డ‌బ్బులు ప‌డేస్తే కుక్క‌ల్లాగా ప‌డుంటామ‌నుకుంటున్నాడు కామోసు. బ‌డుగులంటే అంత సుల‌క‌న‌గా ఉంది ఆడికి. ఎక్క‌డికక్క‌డ ధ‌ర‌లు పెరిగిపోయాయి, ఎరిక‌లేదా నీకు? ప‌ప్పులు, ఉప్పులు, నూన్లు, కూర‌గాయ‌లు ఇలా ఏది కొందామ‌న్నా సుక్క‌లు క‌నిబ‌డుతున్నాయ‌ని తెలుసా?  కార‌ణం ఏంట‌నుకుంటున్నావ్‌? ప‌్ర‌తి దాని మీద ప‌న్నులు వేయ‌డ‌మే మ‌రి. ఆఖ‌రికి చెత్త మీద కూడా ప‌న్నులేసి మ‌రీ వ‌సూలు సేత్త‌న్నారు క‌ద మావా? ఈ గుడిసె తీసేసి సిమెంటు గోడ‌లేసుకుందామ‌ని మూడేళ్లుగా అనుకుంటున్నాం. కుదురుతోందా? మ‌నం ఓటేసి నెత్తినెట్టుకున్న మారాజు కంపెనీ సిమెంటు ధ‌ర కూడా మ‌న‌కాడ ఎక్కువేనంట తెలుసా నీకు? ఇసుక ధ‌ర ఎంతుండేది, ఎంత‌కు ఎగ‌బాకింది? మ‌న‌మ‌స‌లు కొన‌గ‌ల‌మా అని! ఎక్క‌డిక‌క్క‌డ బంగారం లాంటి ఇసుక‌ను త‌వ్వేసి అక్ర‌మంగా యాపారాలు సేత్తా, దాన్ని బంగారంతో స‌మానం సూసేత్త‌న్నారు. ఎలాగో తెలుసా? ఇసుక మీద పెత్త‌నమంతా పైవోల్ల‌కి ముడుపులిచ్చిన వాళ్ల‌కి క‌ట్ట‌బెట్టారంట‌ మ‌రి. ఇలా ఒక ఇసుకేంటి మావా... గ‌నులు, భూములు, కొండ‌లు అన్నీ త‌వ్వేసుకుంటున్నారు, త‌ర‌లించేసుకుంటున్నారు, దోచేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు... ఇయ్య‌న్నీ ప‌ట్ట‌వు నీకు. మెర‌మెచ్చు మాట‌లు సెప్పేటోల్ల‌ మోసాలు తెలుసుకోలేక‌పోతున్నావు..."

ఆ స‌రికి సామాన్యుడి క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. త‌ల తిరిగిపోయింది. నిజ‌మేంటో క‌ళ్ల ముందు క‌నబ‌డింది. భార్య కోపానికి కార‌ణ‌మేంటో అర్థ‌మైంది.

"స‌రేలేవే... బాగా సెప్పావులే. నువ్వు సెప్పిన‌వ‌న్నీ నిజ‌మేలే కానీ... ఇయ్యాల ఉగాది క‌దా, ఏం రాశారో చూద్దార‌ని..." అంటూ సామాన్యుడు గొణిగాడు.

భార్య ప‌క‌ప‌కా న‌వ్వింది. "ఆ పుస్త‌కాల్లో రాసింది కాదు మావా, నేను చెబుతా ఇనుకో అస‌లు పంచాంగం. ఆంధ్రాలో మ‌న‌లాంటి సామాన్యుల‌కు ఆదాయం సున్నా,  వ్య‌యం మ‌న సంపాద‌న‌. రాజ‌పూజ్యం సున్నా, అవ‌మానం అడుగ‌డుగునా. రాజ్యాధిప‌తి శ‌ని. భోజ్యం అయ్యేది మ‌న‌మే. ర‌సాధిప‌తి రాహువు. నీర‌సాధిప‌తులం న‌వ్వూ, నేనే. బుధుడు న‌ట్టింట వ‌క్రించాడు. అందుకే ఇట్టాంటోళ్ల‌కు ఓటేశాం. కేతువు కుర్సీలో కేరింత‌లు కొడుతున్నాడు. కాబ‌ట్టే మ‌నం కునారిల్లుతున్నాం. మ‌న‌లాంటి వాళ్ల‌లో ఎవ‌రే రాశివార‌మ‌యినా, ఏదీ క‌లిసిరాదు. ఆదాయానికి అంత‌రాయాలు ఏర్ప‌డుతాయి. దాచుకున్న‌ది కాస్తా దారి మ‌ళ్లి, దోచుకునే వారి జేబుల్లోకి పోతుంది. భ్ర‌మ‌లు, భ్రాంతులు త‌ప్ప బ‌తుకులు బాగుప‌డ‌వు. అణ‌గారిపోవ‌డం త‌ప్ప ఆశ‌లు నెర‌వేరవు... అర్థ‌మైందా?"

సామాన్యుడు బుర్ర గోక్కున్నాడు.

"ఒసే...నువ్వు సెప్పేదంతా స‌రేలేగానీ, మ‌రి ఈ పంచాంగాల్లో మ‌న జాత‌కాలు మారేదెప్పుడే?"

"అది మ‌న సేతుల్లోనే ఉంది మావా. ఈ సారి ఓట్ల పండ‌గ వ‌చ్చిన‌ప్పుడు నువ్వు నీ సేతిలో సారా పేక‌ట్టు పెట్టే వాడిని సాచిపెట్టి కొట్టు.  జేబులో ఎర్ర నోటు పెట్టేవాడిని ఎగిరిత‌న్ను. మెత్త‌గా న‌వ్వుతా మెర‌మెచ్చు మాట‌లాడేవాళ్ల‌ని మెడ‌ప‌ట్టుకుని గెంటెయ్యి. నువ్వు ఓటేయ‌క‌పోయినా, మొహం సాటేయ‌కుండా నీ స‌మ‌స్య‌ల్ని త‌న స‌మ‌స్య‌లుగా భావించి వాటి కోసం పోరాడుతున్న నిజ‌మైన జ‌న నాయ‌కుడెవ‌రో తెలుసుకో. అదిగో అప్పుడొస్తుంది నిజ‌మైన ఉగాది. అదే అస‌లైన పండ‌గ‌!"

-సృజ‌న‌

PUBLISHED ON 29.3.2022 ON JANASENA WEBSITE

సోమవారం, మార్చి 21, 2022

నా ప్రియ‌మైన నీకు... నీ ప్రియ‌మైన నేను!

 


ర‌మకి న‌వ్వొచ్చేసింది. త‌ల వెన‌క్కి వాల్చి గ‌ట్టిగా న‌వ్వేసింది. ఇంకా ఆగ‌ని న‌వ్వును కొన‌సాగిస్తూనే, “అరె... ఇదేం వెరైటీ?” అంది. ఆ న‌వ్వు నానీకి ఎంతో ఇష్టం. న‌వ్వేప్పుడు సొట్టలు ప‌డే ఆమె బుగ్గ‌లంటే ఇంకా ఇష్టం.  అప్పుడు ఆమె క‌ళ్ల‌ల్లో త‌ళుక్కుమ‌నే వెలుగు మ‌రీ ఇష్టం.  త‌ను కూడా న‌వ్వుతూనే ర‌మ కేసి అపురూపంగా చూస్తున్నాడు.

ర‌మ న‌వ్వాపుకుని, “ఇంకా నువ్వెక్క‌డున్నావ్ నానీ? వాట్సాప్‌లు, ఫేస్బుక్కులు, ఈమెయిళ్లు ఇవ‌న్నీ కాద‌ని... ఉత్త‌రాలా? అస‌లంత తీరికేదీ?” అంది.

అది కాదు ర‌మా! ఆలోచించు. ఇద్ద‌రం ఒకే ఇంట్లో ఉంటున్నాం. అన్ని ప‌నులూ క‌లిసే చేసుకుంటున్నాం. హ‌డావుడిగా మాట్లాడేసుకుంటున్నాం.  ఎవ‌రి ఆఫీస్‌కి వాళ్లు వెళ్లిపోతున్నాం. మ‌ధ్య‌లో మెసేజింగ్ చేసుకుంటున్నాం. కానీ...  మ‌నసులో భావాలు చెప్పుకుంటున్నామా? అందుకే ఇది వెరైటీగా ఉంటుంది. ఏమంటావ్‌?” అన్నాడు ఒప్పించే ధోర‌ణిలో.

వాళ్ల పెళ్ల‌యి ఏడాదైంది. మ్యారేజ్ డే రాబోతోంది. దాన్ని వెరైటీగా జ‌రుపుకోవాల‌నుకున్నారు. ర‌క‌ర‌కాలుగా ఆలోచించారు. అప్పుడే నానీ ఈ కొత్త ఆలోచ‌న చెప్పాడు. చెప్ప‌గానే ఫ‌క్కుమంటూ న‌వ్వేసింది ర‌మ‌.

ఆ మాత్రం దానికి ఉత్త‌రాలు దేనికి? డైరెక్ట్‌గా మాట్లాడేసుకోవ‌చ్చుగా?” అంది ర‌మ‌.

ఏం మాట్లాడుకుంటున్నాం మ‌నం? వీకెండ్స్ ఎక్క‌డికి వెళ్లాలి? రేప్పొద్దున్న కూరేం చేసుకోవాలి? నీ ప్రాజెక్ట్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది? నీ ఈఎమ్మైలు ఎంత‌? నా ఎమ్మెఫ్‌లు ఎంత‌? ఇలాంటివేగా? నేనంటున్న‌వి అవి కావు...” అన్నాడు నానీ, మంచం మీద  బాసింప‌ట్టు వేసుకుని ఉత్సాహంగా ముందుకు కూర్చుని.

మ‌రింకేం ఉంటాయి, మాట‌లు?” అంది ర‌మ ఒళ్లు విరుచుకుని వెన‌క్కి త‌ల‌గ‌డ మీద‌కి వాలుతూ. ఆరోజు ఆదివారం. ఇద్ద‌రూ తీరిగ్గా ఉన్నారు. పొద్దున్నే అన్నం, పప్పు వండేసుకుని తినేసి మంచం మీద‌కి చేరారు. ఇద్ద‌రి సెల్లులు తీసేసి దూరంగా టేబుల్ మీద పెట్టి వ‌చ్చి, అప్పుడు మొద‌లు పెట్టాడు నానీ పెళ్లి రోజు ప్ర‌ణాళిక‌లు.

ఇంకేమీ ఉండ‌వా? ఇవి త‌ప్ప మ‌నం షేర్ చేసుకోవ‌ల‌సినవేవీ లేవా?

ఏమో... నానీ! మ‌నం పెళ్ల‌యిన కొత్త‌లోనే చాలా చెప్పేసుకున్నాం క‌దా, నీ ఫ్యామిలీ గురించి నువ్వు, నా పేరెంట్స్ గురించి నేనూ. ఏం? నువ్వు చెప్పాల్సిన‌వేమైనా ఇంకా ఉన్నాయా? లేక‌పోతే...నేనేమైనా నీ ద‌గ్గ‌ర దా..స్తు..న్నా...న‌ని అనుమాన‌మా?” అంది ర‌మ ఆఖ‌రి మాట‌లు సాగ‌దీస్తూ సాలోచ‌న‌గా.

అదిగో... అలా టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌కు. నా ఉద్దేశం అర్థం చేసుకో. మ‌న మ్యారేజ్ డే ఇంకా టూ వీక్స్ ఉంది కదా? ఇది కేవ‌లం మ‌న పెర్స‌న‌ల్ అన్న‌మాట‌. ఈ ఏడాది కాలంలో నాలో నీకు న‌చ్చ‌నివి, న‌చ్చిన‌వి ఉంటాయి క‌దా? అలాగే ఇంత‌వ‌ర‌కు మ‌నకి మ‌నం చెప్పుకోని చిన్న‌నాటి  మ‌ధురమైన జ్ఙాప‌కాలు... అంటే అదే... ఫ‌స్ట్‌క్ర‌ష్ అంటారే... అలాంటివ‌న్న మాట‌...  అవ‌న్నీ కూడా సిన్సియ‌ర్‌గా ఓ ఉత్త‌రంలాగా రాయాలి.  నాకు నీవు, నీకు నేను. స‌రేనా? జ‌స్ట్... థింక్ ఎ వైల్‌... యూ విల్ ఫైండ్ ఎ థ్రిల్ ఇనిట్‌...” అన్నాడు నానీ.  

ర‌మకి కూడా ఆస‌క్తిగానే అనిపించింది.

కానీ... నీ గురించి నాకు న‌చ్చ‌నివి, ఫ‌స్ట్‌క్ర‌ష్‌లు అవీ లేక‌పోతే?” అంది.

అదిగో... అలా చెప్ప‌డ‌మే హిపోక్ర‌సీ. ఇద్ద‌రు క‌లిసి ఒక చోట ఉన్న‌ప్పుడు ఒక‌రికి న‌చ్చ‌నివి ఒక‌రికి డెఫినిట్‌గా ఉంటాయి. కానీ మ‌నం జ‌న‌ర‌ల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోం. ఎడ్జెస్ట్ అయిపోతూ, కంఫ‌ర్ట‌బుల్‌గా మూవ్ అయిపోతాం. అలా మ‌నం ఎవాయిడ్ చేసిన ఎలిమెంట్సే ఆ త‌ర్వాత అసంతృప్తిగా మారి ఓ గ్యాప్‌ను ఏర్ప‌రుస్తాయి. ఆపై లైఫ్ మెకానిక‌ల్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలనే నా త‌ప‌నంతా... ఇక చిన్న‌నాటి అనుభూతులంటావా? అలాంటివి షేర్ చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న బంధం మ‌రింత గ‌ట్టిప‌డుతుంద‌ని నా న‌మ్మ‌కం...” అంటూ ఓపిగ్గా వివ‌రించాడు నానీ.

ఏమో బాబూ... నాక‌స‌లు రాయ‌డం స‌రిగా రాదే.. "

రాక‌పోవ‌డం కాదు... అల‌వాటు లేక‌, అవ‌స‌రం రాక‌. కానీ రాయ‌డం మొద‌లు పెట్టి చూడు ఎంత స‌ర‌దాగా ఉంటుందో?  నా ఉత్త‌రం నువ్వు, నీ ఉత్త‌రం నేను చదువుకుంటుంటే ఇంకెత థ్రిల్లింగ్‌గా ఉంటుందో?

ర‌మ‌కి కూడా ఇదేదో బాగానే ఉంద‌నిపించింది. “ఊ...” అంటూ కాసేపు ఆలోచించి, “మ‌రైతే ఎప్పుడు రాయాలి?” అంది.

నానీకి హుషారొచ్చింది. “నీకెప్పుడు  వీలైతే అప్పుడు నాకు నువ్వు రాయి. నాకెప్పుడు వీలైతే నీకు నేను రాస్తాను. ఇద్దరం మ‌న ఉత్త‌రాల‌ని మ్యారేజ్ డే  ముందు రోజు ఒక‌రికొక‌రు ఇచ్చుకుందాం. వేర్వేరు గదుల్లో చదువుకుందాం. ఆ త‌ర్వాత హాయిగా న‌వ్వుకుందాం” అన్నాడు.

అయితే... స‌రే” అంది ర‌మ కూడా అంతే ఉత్సాహంగా.

అయితే ఒక్క ష‌ర‌తు. ఇద్ద‌రం ఉన్న‌దున్నట్టు... నిజాల‌ను నిజాయితీగా రాస్తామ‌ని ఒట్టేసుకోవాలి మ‌రి...” అన్నాడు నానీ.

ఓహో...ఓథ్ ఆఫ్ సిన్సియారిటీ అన్న‌మాట. అలాగే... నువ్వు కూడా ఒట్టేయి మ‌రి...” అంది ర‌మ‌.

ఇద్ద‌రూ స‌ర‌దాగా ఒక‌రి చేతిలో ఒక‌రు చెయ్యి వేసుకున్నారు. త‌ర్వాత ఆ చేతులు పెన‌వేసుకున్నాయి.

*****************

వాళ్లు అనుకున్న రోజు రానే వ‌చ్చింది.  సాయంత్రానికి ఇద్ద‌రూ ఇంటికి చేరారు.  స్నానాలు చేసి, నైట్ డ్ర‌సెస్‌లోకి మారిపోయి హాళ్లో టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు.

నానీ న‌వ్వుతూ ర‌మ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి “పోస్ట్‌...” అంటూ జేబులోంచి ఓ క‌వ‌ర్ తీసి అందించాడు. దాని మీద ‘నా ప్రియ‌మైన నీకు...’ అంది ఉంది.

ర‌మ “అబ్బో...” అని న‌వ్వుతూ అందుకుని, త‌న హ్యాండ్‌బ్యాగ్‌లోంచి క‌వ‌ర్ తీసి నానీకి అందించింది.

నానీ ఆ క‌వ‌ర్ తీసుకుని, “స‌రే అయితే... నేను గెస్ట్ రూమ్‌లోకి వెళ్లి చ‌దువుకుంటా. నువ్విక్క‌డే చ‌దువుకో. చ‌దివాక బెడ్ రూమ్ లోకి వ‌చ్చేయ్” అంటూ వెళ్లిపోయాడు.

ర‌మ తీరిగ్గా సోఫా మీద వాలి, నానీ ఇచ్చిన క‌వ‌ర్ విప్పింది.

మైడియ‌ర్ ర‌మా!

ఐ లవ్యూ. నీతో ఏదో అన్నానే కానీ, నాక్కూడా ఉత్త‌రం ఎలా రాయాలో తెలియ‌దు. ఎప్పుడైనా రాస్తేగా? ఛాటింగ్‌లు, వీడియో కాల్సూ వ‌చ్చేశాక అవ‌స‌రం ఏదీ? అందుకే ఈ ఆలోచ‌న వ‌చ్చింది.

ఇంత‌కీ ఏం చెప్పాలి? నువ్వు వ‌చ్చాక ఎన్ని మార్పులో నా జీవితంలో! అప్పుడంతా పైలా ప‌చ్చీస్ అంటారే... అలా ఉండేది. ఇప్పుడు ఏదో రెస్పాన్స్‌బులిటీ ఉన్న‌ట్టుంది. ఎప్పుడో అర్థ‌రాత్రి ఇంటికి వ‌చ్చేవాడిని. స్నాన‌మైనా చేయ‌కుండా అలా ప‌డుకుండిపోయే వాడిని. ఇప్పుడు అదేంటో ఆఫీస్ అయిపోగానే తిన్న‌గా ఇంటికి వ‌చ్చేయాల‌నిపిస్తోంది. నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావ‌నే ఆలోచ‌నే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నేను ఇంటికి వ‌చ్చేలోపు నీ నుంచి నాలుగైదు మెస్సేజ్‌లు వ‌స్తాయి, ఎక్క‌డున్న‌వంటూ. ఆ కేరింగ్‌... నాకెంతో హాయిగా అనిపిస్తుంది. అఫ్‌కోర్స్‌... నేనూ నీకు అలాగే మెసేజింగ్ చేస్తాన‌నుకో. ఇంత‌వ‌ర‌కు ఇంత క‌న్స‌ర్న్ నాకు ఎవ‌రి మీదా లేదు. ఇదేనేమో క‌దా, బంధమంటే? నా ఫ్రెండ్స్ ఆట‌ప‌ట్టిస్తున్నారు. వీడింక పంజ‌రంలో చిలకైపోయాడ్రా... అని! నిజ‌మేనేమో అంత‌క్రితం ఎంతో స్వేచ్చ‌గా ఉన్న‌ట్టుండేది. కానీ ఆ స్వేచ్ఛకో తీరూతెన్నూ ఉండేది కాదు. ఇప్పుడు అంత ఫ్రీగా ఉండ‌లేను... కానీ ఈ బంధంలో ఏదో తృప్తి ఉంది. బాధ్య‌త ఉంది. లైఫ్‌కి ఓ లక్ష్యం ఉన్న‌ట్టు అనిపిస్తోంది. నీకూ అలాగే ఉందా?

ఇక నీలో నాకు నచ్చ‌నివా? అస్సలు లేవు. న‌చ్చిన వాటినే ఇంకా పూర్తిగా చూసుకోలేదూ. ఏమంటావ్‌? ఇక న‌చ్చిన‌వంటావా? అన్నీ! నీ న‌వ్వు నా కోసమే అనిపిస్తుంది, నువ్వు ఎవ‌రితో క‌లిసి న‌వ్వుతున్నా స‌రే. నీ మాట‌ల‌న్నీ నావే అనిపిస్తుంది, నువ్వు ఎవ‌రితో మాట్లాడుతున్నా స‌రే. నీ చూపులన్నీ నావే అనిపిస్తుంది, నువ్వు ఎటు కేసి చూస్తున్నా స‌రే. ఇవి చ‌దువుతుంటే నీ మొహంలో ముసిముసి న‌వ్వు వ‌చ్చే ఉంటుంది క‌దా, అది కూడా నాదేన‌నిపిస్తుంది. క‌విత్వం రాస్తున్నాన‌నుకుంటున్నావా? అవునేమో... ఎందుకంటే నీ గురించి వాస్త‌వాలు కూడా క‌విత్వంలాగే ఉంటాయి నాకు.

నీ గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే, నాకు ఎప్పుడో హైస్కూల్ రోజుల్లో ఓ అమ్మాయి గుర్తొస్తోంది. ఎందుకో ఆ అమ్మాయిని కూడా ప‌దే ప‌దే చూడాల‌నిపించేది. అప్ప‌ట్లో దాన్ని నేను ప్రేమే అనుకున్నాను. ఇన్నేళ్ల త‌ర్వాత, నువ్వు నా లైఫ్‌లోకి వ‌చ్చాక వెనుతిరిగి ఆలోచిస్తే నీతో ఉన్న‌దే నిజ‌మైన ప్రేమ అనిపిస్తోంది.

అయితే ఆ అమ్మాయి గురించి ఎందుకు రాస్తున్నాన‌నుకుంటున్నావా? మ‌రి అనుకున్నాం క‌దా, చిన్న‌నాటి క్ర‌ష్‌ల గురించి చెప్పుకోవాల‌ని. అందుకే అప్ప‌టి నా జ్ఞాప‌కాల‌ని నీ కోసం గుర్తు చేసుకుంటున్నాను. నిజాయితీగా నిజాలు చెప్పుకోవాల‌ని ఒట్టేసుకున్నాం కాబట్టి... నీకు మ‌రో విష‌యం కూడా చెప్పాలి. ఆ అమ్మాయి కూడా నాతో  చాలా స్పెష‌ల్ గా ఉండేది. ఎలా అంటే నేనంటే త‌న‌కిష్ట‌మ‌ని నాకు అనిపించేలా. ఎన్నేసి క‌బుర్లో. అప్ప‌ట్లో సెల్‌ఫోన్లు అవీ లేవుగా? ఆ అమ్మాయి నోట్స్ పుస్త‌కంలో ఆఖ‌రి పేజీలో పెన్సిల్ తో  రాసి, నాకు అందించేది... రేపు గుడికి వెళుతున్నాన‌నో, మార్కెట్‌కి వ‌స్తున్నాన‌నో. నేను అది చ‌దువుకుని అక్క‌డికి సిద్ధం. కుదిర్తే నాలుగు న‌వ్వులు, వీలుంటే నాలుగు మాట‌లు. ఆ నోట్స్‌లో త‌ను రాసింది చెరిపేసి, నేనేదో రాసేవాడిని. అది త‌ను చ‌దువుకునేది. ఓ సారి నేను ఆదివారం మ‌ధ్యాహ్నం మా స్కూల్ వెన‌క ఉన్న మామిడి తోట‌లోకి ర‌మ్మ‌ని రాశా. త‌ను వ‌చ్చింది. కాసేపు మామూలు క‌బుర్లే. కానీ నేనే కొంచెం చొరవ తీసుకున్నా, దాంతో పాటు త‌న చెయ్యి కూడా. త‌ను ఏమీ అన‌లేదు. దాంతో చొర‌వ‌ని దాటి చ‌నువు తీసుకున్నా, ఆమె భుజం మీద చెయ్యి వేసి. త‌ను కాద‌న‌లేదు. అప్పుడు నేను... చ‌నువుతో పాటు సాహ‌సం కూడా చేశా. త‌న మొహం నా చేతుల్లోకి తీసుకుని, ద‌గ్గ‌ర‌గా నా మొహం పెట్టి... ఆమె పెదాల‌పై ముద్దు పెట్టుకున్నా. త‌ను అక‌స్మాత్తుగా న‌న్ను తోసేసి ప‌రిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. నాకొక‌టే భ‌యం. త‌ను ఇంట్లో చెప్పేస్తుందా? రేపు న‌న్ను చిత‌గ్గొట్టేస్తారా? స్కూల్‌లోంచి డిబార్ చేస్తారా? ఇలా... ఏవేవో ఆలోచ‌న‌లు. మ‌ర్న‌డు భ‌యం భ‌యంగానే స్కూల్‌కి వెళ్లా. నేన‌నుకున్న‌ట్టు ఏమీ జ‌ర‌గ‌లేదు.  నా దిగాలు మొహం చూసి త‌ను న‌వ్వింది. ఆ త‌ర్వాత మామిడి తోట‌, పార్క్‌లో మూల బెంచి, గుడి వెనుక నిద్ర‌గ‌న్నేరు చెట్టు... ఇలా ఎన్నో స్థ‌లాల‌ను నా పెన్సిల్ రాసింది. త‌న ర‌బ్బ‌ర్ చెరిపేసింది.  అవ‌న్నీ ఇప్పుడు త‌ల్చుకుంటే అదొక మైకం అనిపిస్తుంది. కేవ‌లం ఓ ఆక‌ర్ష‌ణ అనిపిస్తుంది. ఆ త‌ర్వాత ఇంట‌ర్, ఇంజినీరింగ్‌, చ‌దువు, ఉద్యోగం... నీతో పెళ్లి. ఇంతే,ఇక చెప్పాల్సింది ఏమీ లేదు. నీ ద‌గ్గ‌ర దాచాల్సింది కూడా ఏమీ లేదు.

బై... నీ నానీ!"

****

గెస్ట్ రూమ్ లో నానీ కూడా ర‌మ ఇచ్చిన క‌వ‌ర్ విప్పాడు.

"మైడియ‌ర్ నానీ!

నువ్వు చెప్పాక ఎలా రాయాలో తెలియ‌లేదు కానీ, నీ ఆలోచ‌న మాత్రం భ‌లేగా ఉంద‌నిపించింది. ఈ వారం రోజులూ ఏం రాయాలో అనే ఆలోచ‌న‌లే.

నాకు చిన్న‌ప్ప‌టి నుంచి పూజ‌లు అవీ పెద్ద‌గా అల‌వాటు లేదు. కానీ ఆ దేవుడు మాత్రం నాకొక గొప్ప వ‌రం ఇచ్చాడు. అది నువ్వే.

ఏమిటో... నా ఆలోచ‌న‌లు నేను చెప్ప‌కుండానే నీకు తెలిసిపోతాయ‌నిపిస్తుంది ఎప్పుడూ నాకు. నేనేది చెప్పాల‌నుకుంటానో అదే నీ నోటి వెంట వ‌చ్చేస్తూ ఉంటుంది. నాకు అమ్మా నాన్నా గుర్తొచ్చి డ‌ల్‌గా అనిపించ‌గానే నువ్వు వీడియో కాల్‌తో వాళ్ల‌తో మాట్లాడతావు. నాక‌న్నా ఎక్కువ‌గా, ప్రేమ‌గా వాళ్ల‌ని ప‌ల‌క‌రించి  నాతో మాట్లాడిస్తావు. అల‌సిపోయిన‌ట్టు ఎలా గ‌మ‌నిస్తావో ఏమో, వేడి కాఫీ చేసి నేను బాత్రూమ్ లోంచి రాగానే అందిస్తావు. చ‌లికి ఎప్పుడైనా లేవ‌లేక‌పోతే, నాకేమాత్రం మెల‌కువ రాకుండా స్నానం చేసి కిచెన్‌లోకి వెళ్లి లంచ్ బాక్స్‌ల ప్రిప‌రేష‌న్‌లో ప‌డిపోతావు. లేచాక నాకు గిల్టీగా అనిపించినా అదేం ప‌ట్టించుకోకుండా చాలా మామూలుగా ప‌ల‌క‌రిస్తావు.  నీకేమ‌న్నా ఫేస్ రీడింగ్ ఉందా? ఏమో మ‌రి!

 ఇంత బాగా న‌న్ను చూసుకుంటుంటే... ఇక నీలో న‌చ్చ‌నివి ఏముంటాయి నాకు?

ఒకోసారి అనిపిస్తూ ఉంటుంది... నేను నిజంగా నీకు త‌గిన దాన్నేనా అని.

కాదేమో...నానీ! రేపు మ‌న మొద‌టి పెళ్లి రోజు. ఈ ఏడాదిగా నీతో చాలా చెప్పాల‌నుకున్నా కానీ... చెప్ప‌లేక‌పోయాను. నువ్వ‌న్నావుగా... నిజంగా, నిజాయితీగా అన్నీ షేర్ చేసుకోవాల‌ని?

ఆడ‌పిల్ల‌ని. పూర్తి పేరెంటింగ్‌లో, ఎక్స్ ట్రా కేరింగ్‌లో పెరిగాను నేను. చిన్న‌త‌నంలో నువ్వ‌న్న‌ట్టు క్రష్‌లేవీ లేవు నాకు.

కానీ... నానీ... నీకో సంగ‌తి చెప్పాలి. అది చెబితే... రేప‌టి నుంచి నీ క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూడ‌లేను.

కానీ... చెప్ప‌క‌పోతే... అద్దంలో నా మొహం నేనే చూసుకోలేను. అందుకే చెప్పాల‌నే నిర్ణ‌యించుకున్నా. ఇది ఇప్ప‌టివ‌ర‌కు నా పేరెంట్స్‌కి కూడా తెలియదు.

ఎమ్మెస్ చేయ‌డానికి అమెరికా వెళ్లాల్సి వ‌చ్చింది. అక్క‌డ న‌న్ను రిసీవ్ చేసుకోడానికి మా రెలిటివ్స్ అబ్బాయితో మాట్లాడారు నాన్న‌. అత‌డు ఎయిర్‌పోర్ట్‌కి వ‌చ్చాడు. త‌ను ఉండే ఇంటికే తీసుకెళ్లాడు. త‌న ఆఫీస్‌కి సెల‌వు పెట్టి మ‌రీ ద‌గ్గ‌రుండి నా యూనివ‌ర్శిటీకి తీసుకెళ్ల‌డం, ప్రొఫెస‌ర్స్‌తో మాట్లాడ‌డం అన్నీ చూసుకున్నాడు. నాలో ఉన్న భయాల‌న్నీ పోగొట్టాడు. అమెరికాలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్ర‌వ‌ర్తించాలో అన్నీ ఓ ఫ్రెండ్‌లాగా చెప్పాడు. అత‌డితో నా వీకెండ్స్ అన్నీ పిచ్చి హ్యాపీగా మారిపోయాయి. ఎన్నెన్ని చోట్ల‌కి తిప్పాడో! ఏన్ని చూపించాడో! అత‌ని హాస్పిటాలిటీ, మెంటాలిటీ, బిహేవియ‌ర్‌, మేన‌ర్స్ అన్నీ నాకెంతో న‌చ్చేశాయి. అలాగే మా మ‌ధ్య చ‌నువు కూడా బాగా పెరిగింది. ఎంత‌గా అంటే... ఎంత ద‌గ్గ‌ర‌గా ఉన్నా ఎబ్బెట్టుగా అనిపించ‌నంత‌.

నానీ... అంత‌వ‌ర‌కు స్ట్రిక్ట్ కేరింగ్‌లో పెరిగిన నాకు ఒక్క‌సారిగా రెక్క‌లు వ‌చ్చిన‌ట్టు అనిపించింది.

ఏదో తెలియ‌ని స్వేచ్ఛగా అనిపించింది. అమెరికా వాతావ‌ర‌ణ‌మో, ఇక్క‌డి క‌ల్చ‌ర్ ప్ర‌భావ‌మో తెలియ‌దు కానీ... అత‌డెంత చ‌నువు తీసుకుంటున్నాడో, నేను అంత‌కు రెట్టింపు చొర‌వ చూపించేదాన్ని. అలా మామ‌ధ్య  డేటింగ్ కూడా  చాలా స‌హ‌జంగా జ‌రిగిపోయింది నానీ!

ఆ త‌ర్వాత అనుకోకుండా నా పేరెంట్స్ నీతో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు. ఆ త‌ర్వాత అంతా నీకు తెలిసిందే. ఇలా రాయ‌డానికి నీ మాట‌లే నాకు ధైర్యాన్నిచ్చాయి నానీ. నువ్వంటావుగా... పెళ్లికి ముందు నా జీవితం అంతా నా వ్య‌క్తిగ‌త‌మ‌ని. దానిపై కామెంట్ చేయ‌డానికి కానీ, జడ్జిమెంట్ ఇవ్వ‌డానికి కానీ ఎవ‌రికీ హ‌క్కు లేద‌ని! ఇక పెళ్లి త‌ర్వాత నువ్వే నా లోకం! నీకు త‌ప్ప ఎవ‌రికీ నాలో చోటు లేదు నానీ! ఇది న‌మ్ముతావా?

నీ ర‌మ‌."

*********

ర‌మ నిశ్శ‌బ్దంగా బెడ్రూమ్‌లోకి న‌డిచింది. అప్పటికే నానీ అక్క‌డ ఉన్నాడు, ఏదో మ్యాగ‌జీన్ చ‌దువుతూ. ర‌మ నెమ్మ‌దిగా వెళ్లి బెడ్ మీద కూర్చుంది.  ఓసారి భుజాలెగ‌రేసి నెమ్మ‌దిగా ద‌గ్గింది. నానీలో క‌ద‌లిక లేదు.

"నానీ..."

"ఊ..."

"ఉత్త‌రం చ‌దివావా?"

"ఊ..."

"నేనూ నీ ఉత్త‌రం చ‌దివాను. చాలా బాగా రాశావు"

"ఊ..."

"నేనొక‌టి అడుగుతాను చెబుతావా?"

"ఊ..."

"ఎవ‌రా అమ్మాయి?"

"ముందు నువ్వే చెప్పు. ఎవ‌రా అబ్బాయి?"

"అది ఇప్పుడు అవ‌స‌ర‌మా?"

"పోనీ... అత‌డు ఇక్క‌డే… ఐమీన్‌... అమెరికాలోనే ఉన్నాడా?"

"ఉన్నాడు..."

"అయితే ఎవ‌ర‌త‌ను?"

"ఏం? నీకు తెలీదా?"

"నీ నోటి వెంట విందామ‌ని!"

"అయితే ముందు ఆ అమ్మాయి ఎవ‌రో చెప్పు?"

"ఏం? నీకు తెలియ‌దా?"

"నీ నోటి వెంట విందామ‌ని!"

అంతే... ఆపై ర‌మా, నానీ ఇద్ద‌రూ ఫ‌క్కున న‌వ్వేసుకున్నారు. నానీ త‌ల‌గ‌డ తీసి ర‌మ‌ని కొట్ట‌డానికి ఎత్తాడు. ర‌మ మ‌రో త‌ల‌గ‌డ‌తో త‌ల‌బ‌డింది.

అప్పుడు నానీ అన్నాడు, "ఏంట‌మ్మా... నీ పేరెంట్స్‌కి కూడా తెలియ‌ని ర‌హ‌స్యం నాకు చెప్పావా?"

"కాదా మ‌రి? చిన్న‌ప్ప‌టి నుంచి ఇద్ద‌రం ఒకే స్కూలు, ఒకే కాలేజీ.  మామిడి తోట‌, పార్క్ బెంచీ, నిద్ర‌గ‌న్నేరు చెట్టు... పెన్సిల్ రాత‌లు, ర‌బ్బ‌ర్ కబుర్లు అంటూ నువ్వే క‌థంతా నడిపేశావు. నాకంటే ముందు న‌వ్వు అమెరికా వ‌చ్చి ఉద్యోగంలో చేరావు. నాకు ఎమ్మెస్ సీటొస్తే రిసీవ్ చేసుకుని ఇంకా ముందుకి దూసుకుపోయావ్‌. ఆపై మ‌న పేరెంట్స్‌తో నువ్వే మాట్లాడి పెళ్లికి ఒప్పించావు. త‌ర్వాత  లాక్‌డౌన్‌లో ఇక్క‌డే ఆన్‌లైన్ పెళ్లి చేసేసుకున్నావ్‌. పాపం... ఇండియాలో మ‌న పేరెంట్స్ జూమ్‌లో మ‌న పెళ్లి చూసి అక్క‌డి ల్యాప్‌టాప్‌పై అక్షింత‌లు వేసేశారు. ఇక ఇక్క‌డి ర‌హ‌స్యాల‌న్నీ ఎలాగ‌మ్మా చెప్పేది?" అంటూ ర‌మ త‌ల వెన‌క్కి వాల్చి ప‌క‌ప‌కా న‌వ్వేసింది.

నానీకి ఆ న‌వ్వంటే చాలా ఇష్టం. న‌వ్వేట‌ప్పుడు సొట్ట‌లు ప‌డే ఆ బుగ్గ‌లంటే మ‌రీ ఇష్టం. అప్పుడామె క‌ళ్ల‌లో మెరిసే వెలుగు ఇంకా ఇష్టం.

ఇంత‌లో గ‌డియారం ప‌న్నెండు గంటలు కొట్టింది.

"హ్యాపీ మేరేజ్ డే" అంటూ ఇద్ద‌రూ ఒకేసారి అరిచారు. ఆనందంగా హ‌త్తుకున్నారు.

ఆపై వాళ్ల ముచ్చ‌ట్లేంటో చూడాల‌ని చంద్రుడు చాలా ప్ర‌య‌త్నించాడు.  కానీ ఇంత‌లోనే సూర్యుడొచ్చేశాడు.

GOT PRIZE IN COMPITITION CONDUCTED BY 'MANATELUGUKATHALU.COM' 

https://youtu.be/2G4a0qYVAao 

https://www.manatelugukathalu.com/post/na-priyamaina-niku-ni-priyamaina-nenu-telugu-story-871

అప్ర‌యోజ‌కుల అంత‌ర్మ‌థ‌నం!

 


అధినేత పొద్దున్నే క‌ళ్లు తెరిచి చూసేస‌రికి మంచం ప‌క్క‌న నీడ‌లో ఒక‌ వ్య‌క్తి క‌నిపించాడు. ఉలిక్కిప‌డిన అధినేత అదాటున లేచి కూర్చుని "ఎవ‌ర‌య్యా నువ్వు?" అన‌డిగాడు.

అప్పుడా వ్య‌క్తి లైటులోకి వ‌చ్చి, "సార్‌... నేనండి. మీ ప‌ర‌గ‌ణాలో ఓ నియోజ‌క వ‌ర్గానికి అప్ర‌యోజ‌కుణ్ణండి..." అన్నాడు విన‌యంగా చేతులు క‌ట్టుకుని.

అధినేత గుర్తుప‌ట్టి, "వార్నీ నువ్వా? అదేంట‌య్యా ఇలా ఏకంగా గ‌దిలోకే జొర‌ప‌డ్డావ్‌? ఏదైనా ఎమ‌ర్జ‌న్సీయా?  నీ ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కేమైనా క‌ష్టం వ‌చ్చిందా?" అన్నాడు.

"అబ్బే... ప్ర‌జ‌ల‌కి క‌ష్టం వ‌స్తే ఇంత హ‌డావుడి ఎందుకండీ?  కానీ మీర‌న్న‌ట్టు ఎమ‌ర్జెన్సీయేనండి..." అన్నాడు వంచిన త‌ల ఎత్త‌కుండా.

"ఏంట‌య్యా అంత అర్జంటు ఎమ‌ర్జంటు వ్య‌వ‌హారం?"

"ఏముందండీ... త‌మ‌రి మ‌న‌సులో ఏవేవో మార్పుల ఊహ‌లు మెదులుతున్నాయ‌ని తెలిసిందండి. రేపొచ్చే ఉగాది క‌ల్లా కొత్త దినుసుల‌తో పచ్చ‌డి చేయ‌బోతున్నార‌ని విన్నానండి..."

"ఉగాదేంటి? ప‌చ్చ‌డేంట‌య్యా? ఇక్క‌డెవ‌రూ ఉండ‌ర్లే కానీ, డైరెక్ట్‌గా విష‌యానికొచ్చెయ్‌. సంకేత‌ భాష‌లో అక్క‌ర్లేదులే..."

"అదేనండి... త‌మ‌రు అమాత్య‌వ‌ర్యుల వ‌ర్గాన్ని తార్‌మార్ త‌క్కిడ‌మార్ చేయ‌బోతున్న‌ట్టు ప‌త్రిక‌లు కోడై కూస్తున్నాయండి. ఆ కూత‌లేమైనా నిజ‌మ‌వుతాయేమ‌న‌ని ఇలా చ‌క్కా వ‌చ్చానండి..."

అధినేత ముసిముసిగా న‌వ్వేశాడు.

"వార్నీ... మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ సంగ‌తా? అయినా ఇదేం ప‌ద్ధ‌త‌య్యా... ప‌ద‌వి కోసం ఆశ ప‌డితే ప‌డ్డావు కానీ, ఇలా నేరుగా బెడ్రూంలోకి దొంగ‌లాగా వ‌చ్చేస్తే ఎలా?"

"ఆయ్‌... అక్క‌డే ఉందండి మ‌రి కీల‌కం. ఇంత సెక్యూరిటీ క‌ళ్లుగ‌ప్పి రాగ‌లిగానంటే నేనెంత‌టి వాడినో తెలుస్తుందండి. మీరు గ‌న‌క నాకో అవ‌కాశం ఇస్తే మ‌న‌కిలాంటి దొంగ ప‌నులు వెన్న‌తో పెట్టిన విద్యండి. మ‌న‌క‌దే క‌దండి మ‌రి కావ‌ల‌సింది? అలాగే ఇలా త‌మ‌రి ప‌డ‌గ్గ‌దిలోకి వ‌చ్చేయ‌డానికి ఇంకో కార‌ణం కూడా ఉందండి..." అన్నాడు అప్ర‌యోజ‌కుడు.

"ఏమిటో అది?"

"నాకంటూ అవ‌కాశం వ‌స్తే మీకెంత బాగా చేరువ‌వుతానో, ఎంత చేదోడువాదోడుగా ఉంటానో, న‌న్నెంత బాగా వాడుకోవ‌చ్చో చూపించ‌డానికండి..." అంటూ అప్ర‌యోజ‌కుడు చ‌నువుగా అధినేత బ్రెష్ తీసుకుని దాని మీద పేస్ట్ పిండి చేతికిచ్చాడు.

అధినేత తెల్ల‌బోయాడు.

"ఇదే కాదండి... త‌మ‌రు కానీ అనుమ‌తిస్తే మీరు స్నానం చేస్తున్న‌ప్పుడు  బాత్రూంలోకి వ‌చ్చేసి మీ వీపు రుద్ద‌మ‌న్నా సిద్ధ‌మేనండి... ఇంకా మీరు ఆవులిస్తే చిటికేస్తానండి. తుమ్మితే చిరంజీవ అంటానండి. ద‌గ్గొస్తే నా గుప్పిడి అడ్డెడ‌తానండి.  మీకు జ‌లుబు చేస్తే జేబురుమాలు ప‌ట్టుకుని మీ వెన‌కే తిరుగుతానండి. అలాగే అక‌స్మాత్తుగా మీకేదైనా కొత్త జీవో జారీ చేయాల‌నే ఆలోచ‌న వచ్చింద‌నుకోండి, అప్ప‌టిక‌ప్పుడు చేతికి పెన్ను, కాగితం ఇచ్చి మీ ముందుకొచ్చి వంగుంటానండి. మీరు ఎంచ‌క్కా నా వీపు మీద ఆ కాగితం పెట్టుకుని పెన్నుతో ఆ  జీవో ఏదో బ‌రికేయొచ్చండి. అంత‌లా  ఉప‌యోగ‌ప‌డ‌తానండి..."

అప్ర‌యోజ‌కుడి చొర‌వ చూసి అధినేత‌కి ఏమ‌నాలో తెలియ‌లేదు. అయినా కాస్త గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ, "అదికాద‌య్యా... నీకు అవకాశం వ‌స్తే సేవ చేయాల్సింది ప్ర‌జ‌ల‌కి. నాకు కాదు..." అన్నాడు గుంభ‌నంగా.

"అమ్మ‌మ్మ‌... ఎంత మాట‌. త‌మ‌కి సేవ చేస్తే జ‌నానికి చేసిన‌ట్టేనండి. ఆ మాట‌కొస్తే త‌మ‌రి సేవే ముఖ్య‌మండి. మ‌రి త‌మ‌రు ఎవ‌ర్నైనా ఎంత బాగా వాడుకుంటారో తెలుసుకందండి. మీ అనుచ‌రుల్ని చేరువ చేసుకుని రౌడీలుగాను, గూండాలుగాను చులాగ్గా వాడేసుకుంటారండి. అధికారంలోకి రాగానే పోలీసుల్ని మీ సొంత మ‌నుషుల్లాగా వాడేసుకోడం గ‌మ‌నించానండి. ఇక ప్ర‌జ‌ల్ని కూడా ఎన్నిక‌ల్లో ఓటేసే దాకా బాగా వాడుకున్నారండి. ఆపై అధికారుల్ని మీ మాట విన‌క త‌ప్ప‌నంత‌గా ఉప‌యోగించుకుంటున్నారండి. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోన‌ట్టుగా అనిపిస్తే త‌మ‌రేం చేస్తారో కూడా బాగా పసిగ‌ట్టానండి. ఉన్న‌ట్టుండి అవ‌స‌రం లేని జీవోలేవో జారీ చేయించి, వాళ్ల‌కి లేని స‌మ‌స్య‌లు సృష్టించి, గిజ‌గిజ‌లాడిపోయేలా చేస్తారండి.  ఇహ త‌మ‌రి స‌మ‌క్షానికి రాక త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌ల్పిస్తారండి.  వాళ్లొచ్చి వొంగి వొంగి దండాలెట్టాక‌, ఇచ్చిన జీవోలు మార్చేసి కొత్త‌విస్తారండి. పైగా ఇదంతా  ప్ర‌జ‌ల కోస‌మేన‌నే భ్ర‌మ క‌లిగిస్తారండి. ఇలాంటి త‌మరి ద‌ర్పం, ఠీవి, రాచ‌కారిత‌నం, అరాచ‌కత‌త్వం... ఇవ‌న్నీ ఆక‌ళింపు చేసుకున్నానండి. అందుక‌ని న‌న్నెంతగా వాడుకోవ‌చ్చో మీకు అర్థం కావ‌డానికి ఇలా పొద్దున్నే వ‌చ్చేశానండి..." అంటూ అప్రయోజ‌కుడు తువ్వాలు తీసుకొచ్చి అధినేత భుజం మీద వేశాడు.

అప్ర‌యోజ‌కుడి సేవ, చొర‌వ అధినేత‌కి బాగా న‌చ్చాయి.

ముసిముసిగా న‌వ్వుకుంటూ, "స‌ర్లేవ‌య్యా... చూద్దాం. నీ పేరు త‌ప్ప‌క ప‌రిశీలిస్తాలే..." అంటూ అధినేత బాత్రూంలోకి వెళ్లి చ‌టుక్కున త‌లుపేసుకున్నాడు. అప్ర‌యోజ‌కుడు సంతృప్తిగా వెళ్లిపోయాడు.

****

అధినేత త‌యారై చేతులు మ‌డ‌త పెట్టుకుంటూ హాల్లోకి వ‌చ్చేస‌రికి అక్క‌డ మంత్రులు వెన‌క కుర్చీల్లో కూర్చుని క‌నిపించారు.

"ఓ... మంత్రులా?  మీరేంటి అక్క‌డ కూర్చున్నారు?" అని అడిగాడు అధినేత‌.

"వెనక కూర్చోడం అల‌వాటు చేసుకుంటున్నామండి" అన్నాడో మంత్రి.

అధినేత ముసిముసిగా న‌వ్వుకుని, "స‌ర్లేవోయ్‌ సెటైర్లు. ఇంత‌కీ మీరెందుకు వ‌చ్చారు?  నేనేమీ మంత్రివ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేయ‌లేదే?" అన్నాడు.

:మీరు ఏర్పాటు చేస్తే అదే మా ఆఖ‌రి మంత్రివ‌ర్గ స‌మావేశం అవుతుందేమోన‌నే భ‌యంతో ముందుగానే త‌మ‌రి ద‌ర్శ‌నం చేసుకుందామ‌ని వ‌చ్చామండి" అన్నాడింకో మంత్రి.

అధినేత డైరెక్ట్‌గా విష‌యానికి వ‌చ్చేశాడు.

"చూడండి... నేను ముందే చెప్పాను క‌దా, రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గంలో మార్పులుంటాయ‌ని?  బాగా ప‌నిచేసే వాళ్ల‌ని నేనెప్పుడూ మ‌ర్చిపోను. వాళ్ల ప‌ద‌వులు ఎక్క‌డికీ పోవు. మ‌రి కొత్త వాళ్ల‌కి కూడా అవ‌కాశాలు ఇవ్వాలి క‌దా, ప్ర‌జాసేవ చేసుకోడానికి?" అన్నాడు అదోలా న‌వ్వుతూ.

"అదే సార్‌... ఆ ప్ర‌జాసేవ మేమెలా చేశామో మీకు ఓసారి గుర్తు చేయాల‌ని ఇలా ప్రైవేటుగా వ‌చ్చేశామండి. మీరు అనుమ‌తిస్తే మ‌న‌వి చేసుకుంటామండి" అన్న‌డో మంత్రి విన‌యంగా వంగి నిల‌బ‌డి.

"ఏమిటో ఆ ప్ర‌జాసేవ‌?  చెప్పండి..." అన్నాడు అధినేత.

"స‌ర్‌... త‌మ‌రికి తెలియ‌నిదేముంది?  మీ మ‌న‌సు తెలిసి మ‌సులుకున్న చ‌రిత్ర నాది. మీకు వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా, నానా బూతులూ తిట్టాను. ఆ విష‌యంలో నా కృషి  అనిత‌ర సాధ్యం. కొత్త కొత్త తిట్లు క‌నిపెట్టాను. ఎవ‌రూ ఎర‌గ‌నంత‌ అహంకారంతో, త‌ల‌పొగ‌రుతో వ్య‌వ‌హ‌రించాను. అస‌లు విలేక‌రుల స‌మావేశంలో ఇంత బ‌రితెగించి వాగొచ్చా అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేట‌ట్లు మీ వ్య‌తిరేకుల‌పై దుమ్మెత్తి పోశాను. స‌భ్య‌త‌, సంస్కారాల‌నే బూజుపట్టిన పాత కాల‌పు ధోర‌ణుల‌ను చెరిపి పారేసి దూసుకుపోయాను. సాక్షాత్తు శాస‌న స‌భ‌లో కూడా, చుట్టూ కెమేరాలు ఉన్నాయ‌ని తెలిసినా కూ డా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ మీద ఏక‌వ‌చ‌న ప్ర‌యోగంతో పాటు అడ్డ‌మైన  అస‌భ్య ప‌ద‌జాలం ఉప‌యోగించాను. ఆఖ‌రికి వాళ్లింట్లో ఆడ‌వాళ్ల‌ని కూడా కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేసి బ‌రితెగించాను. అలాంటి  న‌న్నుమార్చేస్తే మ‌ళ్లీ త‌మ‌కు నా అంత‌టి దిగ‌జారిన‌వాడు దొర‌క‌డం క‌ష్ట‌మ‌నే నా అభిప్రాయం..." అన్నాడొక మంత్రి.

అధినేత త‌ల‌పంకించాడు.

వెంట‌నే మ‌రో మంత్రి అందుకున్నాడు.

"అస‌లా మాట‌కొస్తే, తిట్ల విష‌యంలో... స‌భ్య‌త మ‌ర‌చి వాగ‌డం విష‌యంలో ఒక‌రు కాదండి... మేమంతా స‌మాన‌మైన కృషి చేశాం. నా విష‌యానికొస్తే, నా ప‌రిధిలో ప్ర‌జ‌ల మొహంలో ఆనందం కోసం కాదు, మీ పెద‌వుల‌పై చిరునవ్వు కోస‌మే ప‌ని చేశాను. అడుగ‌డుగునా గూండాలు, రౌడీల‌తో మ‌న‌కంటూ ఓ ప్రైవేటు సైన్యాన్నే ఏర్పాటు చేశాను. ఆఖ‌రికి రోడ్లు బాగా లేవ‌ని శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న వారిని కూడా స‌హించ‌లేదు. చిన్న పామైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌న్న‌ట్టు పోలీసుల ఎదురుగుండానే వాళ్ల‌పై దాడులు చేయించాను. చిత‌గ్గొట్టించాను. బాధితులు కేసులు పెట్ట‌కుండా పోలీసుల‌ను భ‌య‌పెట్టాను. రైతుల‌ని, మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా లాఠీల‌తో చిత‌గ్గొట్టించేలా చేశాను.  ఒకవేళ త‌ప్ప‌ని స‌రై కేసు న‌మోదు చేసినా అది ముందుకు సాగ‌కుండా చూశాను. మీకు ఎక్క‌డా అశాంతి, అభ‌ద్ర‌త క‌ల‌గ‌కుండా శాంతిభ‌ద్ర‌త‌ల‌ను అదుపు చేశాను... నా కృషి మీరు దృష్టిలో పెట్టుకోవాలి..."

ఇంకో మంత్రి విన‌యంగా చెప్పుకొచ్చాడు.

"అయ్యా... త‌మ‌కు తెలియంది కాదు. నా హ‌యాంలో ప్ర‌జానీకానికి కొత్త కొత్త రుచులు అల‌వాటు చేశాను. అంత‌క్రితం మామూలు మ‌ద్యం, సారా తాగుతుండేవారు. కానీ మ‌న పాల‌న‌లో ఎప్పుడూ ఎర‌గ‌ని కిక్కు వ‌చ్చేలా నాటు సారా, స‌రికొత్త మ‌ద్యం త‌యార‌య్యేలా చేశాను. ప్ర‌తి ఊరిలోను కుటీర ప‌రిశ్ర‌మ‌లాగా ఈ మ‌హ‌త్త‌ర పానీయాల త‌యారీని ప్రోత్స‌హించాను. గిరిజ‌న గ్రామాల్లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా గంజాయి సాగుతో ప‌చ్చ‌ద‌నం ప‌రిఢ‌విల్లేలా చేశాను. ఆ గంజాయి దేశంలోని న‌లుమూల‌ల‌కు ర‌వాణా అయ్యేలా చ‌క్రం తిప్పాను. దీని వ‌ల్ల జులాయిలుగా తిరిగే యువ‌త నాలుగు డ‌బ్బులు అక్ర‌మంగా వెన‌కేసుకునేలా చేశాన‌నే తృప్తి నాకుంది. ఆఖ‌రికి ఈ విష‌యంలో కాలేజీ కుర్ర‌కారుని కూడా వాడుకుని ప‌గ‌డ్బందీ నెట్‌వ‌ర్క్ త‌యారు చేశాను. ఓడ‌ల ద్వారా మాద‌క ద్ర‌వ్యాల ఎగుమ‌తి దిగుమ‌తులు పెంచాను. రైతుల, పేద‌ల నోళ్లు కొట్టి బియ్యం చ‌వ‌గ్గా సేక‌రించి, దాన్ని పాలిష్ ప‌ట్టించి, విదేశాల‌కు రవాణా చేసి కోట్ల వ్యాపారం జ‌రిగేలా చేశాను. మ‌రి ఇన్ని చేయాలంటే కింద నుంచి పైనుండే త‌మ‌రి వ‌ర‌కు ఎవ‌రికెంత వాటా రావాలో అంతా వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌ను ర‌చించాను... కాబట్టి మీరు నాలాంటి ప్ర‌తిభావంతుడిని వ‌దులుకోర‌నే భావిస్తున్నాను".

మ‌రో అమాత్యుడు గొంతు స‌వ‌రించుకుని ఏక‌రువు పెట్టాడు. "అయ్యా... మీ క‌నుస‌న్న‌ల్లో క‌ద‌లాడే భావాలు గ్ర‌హించి త‌ద‌నుగుణంగా న‌డుచుకున్నాను. ప్ర‌జ‌ల్లో కులాల చిచ్చు పెట్టాను. మ‌త ప‌ర‌మైన క‌ల్లోలాలు సృష్టించాను. గ‌నులు, సెజ్‌లు, భూములు, కాంట్రాక్టులు అన్నీ మ‌నకి వాటాలిచ్చిన వారికే అందేలా చేశాను. ప్ర‌జా ప్ర‌యోజ‌నం క‌న్నా మ‌న స్వ‌ప్ర‌యోజ‌నానికే ప్రాధాన్య‌తనిచ్చాను. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తుల్లోనే అప్ర‌జాస్వామ్య వ్య‌వ‌హారాలు జ‌రిగేలా చూశాను. చ‌ట్టాల‌కు దొర‌క్కుండా చ‌ట్ట వ్య‌తిరేక విధానాలు అభివృద్ధి చేశాను. పైకి ఏమాత్రం అనుమానం రాకుండా ముడుపుల వ్య‌వ‌హారాలు లోపాయికారీగా న‌డిపించాను. ఇవ‌న్నీ త‌మ‌కు తెలియ‌నివి కావు..." అంటూ వంచిన త‌ల ఎత్త‌కుండానే విన్న‌వించుకున్నాడు.

అన్నీవిన్న అధినేత ముసిముసిగా న‌వ్వాడు. ఆపై నిదానంగా చెప్పుకొచ్చాడు.

"మీరెంత‌టి ఘ‌టికులో, ఘ‌నులో నాకు తెలుస‌య్యా.  కానీ మీరు తెలుసుకోవ‌ల‌సింది ఇంకోటుంది. మీరు ఇంత వ‌ర‌కు చేసిన బాధ్య‌త‌ల‌ను మించిన అతి ముఖ్య‌మైన ప‌ని ఒక‌టుంది. అందుక‌ని మీలో కొంద‌రికి అది అప్ప‌గించాల‌ని చూసున్నాను..." అన్నాడు అధినేత‌.

"ఏంటి స‌ర్ అది?" అన్నారు మంత్రులు ముక్త‌కంఠంతో.

"ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డం... మీరు కేవ‌లం మీ ప‌ద‌వుల కోస‌మే ఆలోచిస్తున్నారు. నేను మ‌నంద‌రి ప‌ద‌వుల కోసం ఆలోచిస్తున్నాను. ఇక ఎన్నిక‌లు రెండేళ్లే ఉన్నాయి. మ‌ళ్లీ మ‌నంద‌రం క‌లిసి అధికారాన్ని అందుకోవ‌ల‌సి ఉంది. అందుకు అతి ముఖ్య‌మైన ప‌నే ప్ర‌జ‌ల‌ను మ‌రో సారి మ‌భ్య‌పెట్ట‌డం. కాబ‌ట్టి మీలో కొంద‌రికి నియోజ‌క వ‌ర్గాల వారీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాను. మీరంతా మీ మీ ప‌రిధుల్లో ప్ర‌జ‌ల‌ను, ఓట‌ర్ల‌ను మ‌రోసారి హామీల మ‌త్తులో ముంచాలి. మాట‌ల మైకంలో తేల్చాలి. మ‌న హయాంలో అభివృద్ది జ‌రగ‌క‌పోయినా ఎంతో జ‌రిగిన‌ట్టు భ్రాంతి క‌లిగించాలి. మ‌నం త‌ప్ప ఈ రాష్ట్రానికి ఇంకెవ్వ‌రూ దిక్కు లేనంత‌గా ప్ర‌జ‌ల‌ను ఏమార్చాలి. ఈ రెండేళ్లూ మ‌నం చేసే శ్ర‌మ ఫ‌లించి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చామా, మ‌న‌కిక తిరుగుండ‌దు. తిరిగి మ‌రో ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవ‌చ్చు. పంచుకోవ‌చ్చు. నంచుకోవ‌చ్చు... అర్థ‌మైందా?" అన్నాడు అధినేత‌.

అధినేత అంత‌రంగ‌ విశ్వ‌రూపం చూసిన అమాత్యులు అప్ర‌తిభులైపోయారు. మోకాళ్ల‌పై కూర్చుని విన‌యంగా త‌ల‌లు వంచి న‌మ‌స్క‌రించి, మారు మాట్లాడ‌కుండా నిష్క్ర‌మించారు.

-సృజ‌న‌

PUBLISHED ON 21.3.2022 ON JANASENA WEBSITE