మంగళవారం, అక్టోబర్ 25, 2016

జ్వరం మంచిదే!పాపకి జ్వరంగా ఉంది. మూసిన కన్ను తెరవడం లేదు. 
ఏవేవో పనుల మీద ఇల్లంతా తిరుగుతున్న అమ్మ చేతి మునివేళ్ళు ఆ చిన్నారి నుదిటి మీద, మెడ మీద 
ఎన్ని సార్లు సుతారంగా తాకి చూశాయో.  
ఎక్కడో ఆఫీస్ లో ఉన్న నాన్న ఎన్నిసార్లు ఇంటికి ఫోన్ చేసాడో, పాపకి ఎలా ఉంది అని. 
చివరకి నాన్న మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాడు. 
అమ్మా నాన్నా పాపకి చెరో పక్కనా కూర్చున్నారు. 'ఎలా ఉంది బంగారూ' అని అడుగుతూనే ఉన్నారు. 
'బాధగా ఉందమ్మా' అని పాప అంటే, 'తగ్గిపోతుందమ్మా, కొంచెం ఓపిక పట్టు' అంటూ అమ్మ, పాప తల మీద రాస్తూ కూర్చుంది. పాపని మరిపించడానికి నాన్న ఏవో కథలు చెబుతూ పక్కనే పడుకున్నాడు. 
'నాన్నా! ఈ జ్వరం నాకొద్దు. తీసేయ్' అంది పాప నీరసంగా.  నాన్న, అమ్మ కేసి చూసి సన్నగా నవ్వాడు. 
తర్వాత పాపతో అన్నాడు, 'ఎలా నాన్నా! అలా అనకూడదు. నిన్న ఐస్క్రీమ్ తినొద్దంటే విన్నావా? చూడు ఇప్పుడెలా బాధ పడుతున్నావో.  అయినా తగ్గిపోతుందిలే సరేనా?' అంటూ ధైర్యం చెప్పాడు.
అంత జ్వరంలో ఉన్నా, ఆ పాపకి ఎంతో హాయిగా అనిపిస్తోంది. 
అమ్మా నాన్నా దగ్గరే ఉండి, ప్రేమ చూపించడం బాగుంది. 
'ఆమ్మా! నాకు బెండ కాయ వేపుడు తినాలని ఉంది' అని ఈ పాప అంటే, 
'ఇప్పుడు కాదమ్మా! నీకు జ్వరం తగ్గిపోగానే చేసి పెడతానే' అని అమ్మ భరోసా ఇచ్చింది. 
'నాన్నా! నాకేం బార్బీ బొమ్మ కావలి' అంది గోముగా. 
'తప్పకుండా తల్లీ' అన్నాడు నాన్న వెంటనే. అమ్మా నాన్నా చేతులు పట్టుకుని ఆ పాప నిద్రలోకి జారుకుంది. 
మర్నాడు లేచేసరికల్లా జ్వరం తగ్గింది. రెండు రోజుల్లో మామూలుగా అయింది. అమ్మ బెండ కాయ వేపుడు చేసింది. నాన్న బార్బీ బొమ్మ తెచ్సి ఇచ్చాడు. ఎందుకో తెలియదు కానీ జ్వరం రావడం ఆ పాపకి నచ్చింది.
********
దాదాపు ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. కానీ ఒక విషయం గ్రహించాలి. అమ్మా నాన్నా ఆ పాపకి ఎన్నో సపర్యలు చేశారు, కానీ జ్వరాన్ని మాత్రం ఆమె నుంచి తీసేయలేక పోయారు. ఆ బాధను పాపే భరించింది. కానీ అమ్మా నాన్నా మాత్రం పక్కనే ఉండి ప్రేమ చూపించారు. 
భగవంతుడు కూడా అంతే. మన కష్టాన్ని తీసేయలేడు . కానీ ఆ బాధని తట్టుకొనే ధైర్యాన్ని ఇస్తాడు. 
భరోసా కల్పిస్తాడు. 
ఎందుకంటే ఆ బాధ ఎప్పుడో మనం చేసిన పనుల ప్రభావమే! 
ఆ బాధ తగ్గిపోగానే మనం కోరినవి అన్నీ ఇస్తాడు!


బుధవారం, మే 04, 2016

జీవిత సత్యం

(ఎప్పుడో చిన్నపుడు రాసుకున్న కవిత)

 

వెలుగుతున్న ప్రమిద కింద... 

పొంచి ఉంది చీకటి!

వికసించే పువ్వు చూడు... 

వాడిపోవు గంటకి!

ఉదయించే సూర్యుడైన... 

అస్తమించు రాత్రికి!

పున్నమి చంద్రుడు సైతం... 

వన్నె తగ్గు మర్నాటికి!

జీవితాన సుఖముందని విర్రవీగి పొంగి పోకు... 

ఎంచి చూడ సుఖమంతా క్షణంలోన సగం సేపు!

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

రాద్ధాంత సిద్ధాంతం


‘నీచాయ నమః
నికృష్టాయ నమః
తుచ్ఛ రాజకీయ ప్రలోభాయ నమః
అసత్య ప్రలాపాయ నమః
అడ్డగోలు వాగ్వివాద ప్రకాశాయ నమః’
- గురువుగారి అష్టోత్తరం పూర్తయ్యే వరకు శిష్యుడు వినమ్రంగా కూర్చున్నాడు. గురువుగారు గంట కొట్టి ప్రసాదం ఇవ్వగానే కళ్లకద్దుకుని నోట్లో వేసుకుని- ‘ఎన్ని పూజలు చేసినా మన జాతకాలు మారతాయంటారా గురూగారూ?’ అన్నాడు.

‘భలేవాడివిరా! నమ్మకమే అన్నింటికీ పునాది. ఆ నమ్మకమే నిన్ను, నన్ను, ప్రజానీకాన్ని నడిపిస్తోంది. ఈ పాతకాల స్వామి ఆరాధనా ఆ నమ్మకం మీదే ఆధారపడి ఉంది నాయనా. ముందు లెంపలేసుకుని ఆ తరవాత సందేహాలు ఏమైనా ఉంటే అడుగు’

‘ఇంతకూ ఈ పాతకాల స్వామి ఎవరండీ?’

‘రాజకీయాల్లో ఈ మధ్య నీతి నిజాయతీ పెరిగిపోతున్నాయిరా. ప్రజల కోసం పని చేసే నికార్సయిన నేతలు అధికారం చలాయిస్తూ చెలరేగిపోతున్నారు. మనలాంటి నీచ నేతల భవితవ్యం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. అందుకే ఈయనను ప్రతిష్ఠించాను. కోల్పోయిన వైభవాన్ని ఏ నాటికైనా తిరిగి సాధించడానికి ప్రస్తుతానికి ఇదొక్క మార్గమే కనిపిస్తోంది నాయనా’

‘ఆహా, మీ చెత్తశుద్ధికి జోహార్లండీ. కానీ, ఏమిటో గురూగారూ... రోజురోజుకూ నిరాశ నిస్పృహలు తుపాను మేఘాల్లాగా కమ్మేస్తున్నాయి. ఏనాటికైనా మూడు కుంభకోణాలు, ఆరు అవినీతి పథకాలతో కళకళలాడే రోజులు మళ్ళీ వస్తాయంటారా?’

‘అందుకే కదరా నా తపన, తపస్సూనూ! రాత్రి పాతకాల స్వామిని ధ్యానిస్తూ మగత నిద్రలో జారుకున్నానా... ఓ రాత్రివేళ ఆయన కనిపించాడు. నీచా... నివ్వెరపోకు! లంచాల నైవేద్యాలు, అక్రమ ధన నివేదనలు, అవినీతి వాటాల ఆమ్యామ్యాలు, కమిషన్ల కైంకర్యాలు, ముడుపుల ఆరగింపులు లేక నాకు కూడా శోష వచ్చేట్టుంది. ఓపికతో నిరీక్షిస్తే గెలుపు నీదేనంటూ వూరడించాడు’

‘మరి అందుకు ఏం చేయాలో ఉపదేశించాడా గురూగారూ!’

‘ఆహా... వాటిని బోధిద్దామనే నిన్ను ఉన్నపళాన పిలిపించా. బుర్ర దగ్గర పెట్టుకుని విను. మనలాగా కుర్చీకి దూరమై కునారిల్లుతున్న నేతల్ని పోగుచెయ్యాలి. పాలకులు ఏం చేసినా అందులో తప్పులు వెతకాలి. వూరూవాడా గోలగోల చేస్తూ ఆరోపణలు, నిందలు, విమర్శలతో వూదరగొట్టాలి. చట్టసభల్ని సైతం సాగనీయకుండా మంకుపట్టు పట్టాలని పాతకాల స్వామి ఆన’

‘కానీ, పాలకుల పనులు ప్రజలకు నచ్చుతున్న వేళ, మన గోలను ఎవరైనా పట్టించుకుంటారా... అని!’

‘ఓరి పిచ్చి సన్నాసీ, నిన్ను జనం పట్టించుకోలేదు కాబట్టే ఇవాళ నువ్వీ స్థితిలో అఘోరిస్తున్నావ్‌. కాబట్టి, సిగ్గు లజ్జ ఉచ్చం నీచం వదిలేసి మరీ- ఈ పాలకుల వల్ల మహా ఘోరాలు జరిగిపోతున్నట్లు హడావుడి చేయాలి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి రాజకీయ రంగు పులిమేయాలి. దాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా పాలకుల మీద బురద చల్లేయాలి. దీన్నే రాద్ధాంత సిద్ధాంతం అంటారు’

‘భలే బాగుంది గురూగారూ! కానీ నాలాంటి మట్టిబుర్ర కోసం ఆచరణ కూడా కాస్త చెప్పరూ?’

‘ఏముందిరా, ఉదాహరణకు ఎక్కడో ఏ రైతో, విద్యార్థో ఆత్మహత్య చేసుకున్నాడనుకో... వాళ్లను ప్రభుత్వమే హత్య చేసిందని ఓ ప్రకటన చేసేయాలి’

‘ప్రభుత్వం హత్య ఎలా చేస్తుంది గురూగారూ... అదేమన్నా మనిషా?’

‘అలాంటివేమీ నువ్వు ఆలోచించకూడదురా. విమర్శే నీ పరమావధి!’

‘ఓ... అర్థమైందండి. ఆఖరికి నిద్దట్లో దోమ కుట్టినా, ఉలిక్కిపడి లేచి ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వమే దోమల్ని పెంచి పోషిస్తోందని అనాలన్న మాట’

‘పర్వాలేదు, కొంచెం దారిలో పడ్డావ్‌. ఇలాంటి చెత్త ప్రకటనలు చేసేటప్పుడు పనిలో పనిగా నీ గురించీ గొప్పలు చెప్పేసుకోవాలి. ఉదాహరణకు దేశభక్తి నా రక్తంలోనే ఉంది లాంటి స్వోత్కర్షలు చేసినా నష్టమేమీ ఉండదు’

‘ఆహా... దేశభక్తి రక్తంలో ఉందనా? భలేగా ఉందండీ. కానీ, గబుక్కున ఎవరైనా మనకు రక్తపరీక్ష చేస్తే, మరి అందులో కుయుక్తుల క్రోమోజోములు, అక్రమార్జనల డీఎన్‌ఏలు, కంత్రీ పనుల కణాలు, అవినీతి కొలస్ట్రాళ్లు... లాంటి వంశపారంపర్య అవలక్షణాలన్నీ బయటపడతాయేమోనండీ?’

‘ఓరి నీ భయసందేహాలు బద్దలైపోనూ! ఇలాంటి పిరికి సన్నాసివి నీచరాజకీయాల్లో ఎలా ఎదుగుతావురా? ముందు చెప్పేది విను. ఇలా ప్రతిదానికీ ప్రభుత్వాన్ని తిట్టడమే నీ దినచర్యన్నమాట. కావాలంటే దేశాన్నే నాశనం చేసేస్తున్నారని గగ్గోలు పెట్టాలి. ఇంకా అవసరమైతే కులాన్ని, మతాన్ని కూడా ఎగదోయాలి’

‘నేనేదో మీ దగ్గర నీచ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నవాణ్ని. ఇలాంటి బృహత్కార్యాలు చేయగలనా అని...’

‘ఆ మాట అన్నావంటే ఇంకా నీలో కాస్తోకూస్తో సిగ్గూ అభిమానం ఏడిశాయన్నమాటే! ఇలాంటి లక్షణాలు నీచనేతగా ఎదగడానికి ఎందుకూ పనికిరావు. కాబట్టి వదిలించుకో! నా పాఠాలు వినడంతోపాటు, సమకాలీన సిగ్గుమాలిన రాజకీయాల్నీ గమనిస్తూ ఉండాలి. నీ చుట్టూ చూస్తే ఇలాంటి దురంధరులు అనేకమంది కనిపిస్తారు. వారి దారిలో సాగిపో. మరోపక్క తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి పనులపై విచారణ జరుగుతుంటే అదంతా కక్షసాధింపు చర్యలంటూ యాగీ చేస్తున్న నాయకమ్మన్యుల్ని కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నావుగా? దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల అంతిమయాత్రలకైనా రానివారు, దిల్లీ నడిబొడ్డులో ఓ అతివ మీద అత్యాచారం జరిగినప్పుడు యువజనమంతా రగిలిపోయినా నోరు మెదపనివారు- ఇప్పుడు కంగారుగా ఎలా తల్లడిల్లిపోతున్నారో చూడలేదా? ఇవన్నీ ఒంటపట్టించుకుని ఎదగాలి మరి... తెలిసిందా?’

‘గురూగారూ! ఇది ఎదగడం అంటారా, దిగజారడం అంటారా?’

‘పిచ్చోడా! నీచ నేతగా ఎదగాలంటే మంచి మనిషిగా దిగజారాల్రా! అర్థమైందా? ఓసారి పాతకాల స్వామికి సాష్టాంగపడి రేపట్నుంచి రెచ్చిపో మరి! ఎప్పటికోప్పటికి అవకాశం రాకపోదు. ఇక పోయిరా!’
- ఎ.వి.ఎన్‌.హెచ్‌.ఎస్‌.శర్మ
Published in EENADU on 23.02.2016