సోమవారం, నవంబర్ 22, 2021

రాజ‌కీయ భ‌స్మాసుర పురాణంఅన‌గ‌న‌గా ఒక రాక్ష‌సుడురా... అంటూ మొద‌లు పెట్టారు గురూగారు, శిష్యుడు వ‌చ్చి కూర్చోగానే.  శిష్యుడు శ్ర‌ద్ధ‌గా విన‌సాగాడు.

ఏం? ఆ రాక్ష‌సుడు శివుడి కోసం త‌ప‌స్సు చేయ‌డం ప్రారంభించాడు. అదలాంటిలాంటి త‌ప‌స్సు కాదురోయ్‌. భ‌యంక‌ర‌మైన‌ది. శివుడిని పొగిడాడు. స్తోత్రాలు చేశాడు. కాళ్లావేళ్లా ప‌డ్డాడు. బ‌లిమాలాడు. ఒంటి కాలి మీద నుంచున్నాడు. బ‌క్క‌చిక్కిపోయాడు. ఎండ‌కు ఎండి, వాన‌కు త‌డిసి, చ‌లికి వ‌ణికినా చ‌లించ‌లేదు. ఆఖ‌రికి శివుడు జాలి ప‌డ్డాడు. చ‌టుక్కున ప్ర‌త్య‌క్ష‌మై, నీ భ‌క్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో... అన్నాడు. దానికా రాక్ష‌సుడు ఏం కోరుకున్నాడో తెలుసా? నేనెవ‌రి నెత్తి మీద చెయ్యి పెడితే వాళ్లు భ‌స్మ‌మైపోవాలి... అని! వ‌ర‌మిస్తాన‌న్నాక త‌ప్ప‌దుగా? శివుడు స‌రేన‌న్నాడు. అప్పుడా రాక్ష‌సుడేం చేశాడో తెలుసానువ్విచ్చిన వ‌రం ఎలా ఫలిస్తుందో చూస్తానంటూ శివుడి నెత్తి మీద‌నే చెయ్యి పెట్ట‌బోయాడు...

గురూగారూ! ఈ క‌థ నాకు తెలుసండి. భ‌స్మాసురుడి క‌థండి. చిన్న‌ప్పుడు మా బామ్మ చెప్పిందండి. వ‌రం పొందిన ఆ భ‌స్మాసురుడు ఎక్క‌డ త‌న నెత్తి మీద చెయ్యి పెట్టేస్తాడోన‌ని భ‌య‌ప‌డిపోయి శివుడు ప‌రుగందుకుంటాడండి. ఆ రాక్ష‌సుడు వ‌ద‌ల‌డండి బాబూ... వెంట‌బ‌డ‌తాడండి. ఆ క‌థే క‌దండీ మీరు చెబుతుంట‌?”

అవున్రా... నీకు పురాణ ప‌రిజ్ఞానం బాగానే ఉందిరోయ్‌... ఎప్ప‌టికో అప్ప‌టికి ప‌నికొస్తావులే... అంటూ పొగిడారు గురువుగారు.

శిష్య‌డు పొంగిపోయి త‌మాయించుకుని, “అవును కానీ గురూగారూ! నేనేదో కాసిన్ని రాజ‌కీయ పాఠాలు నేర్చుకుని ఎప్ప‌టికైనా నికార్స‌యిన పొలిటీషియ‌న్‌గా ఎద‌గాల‌ని మీ ద‌గ్గ‌ర‌కొస్తుంటే... మీరేంటండీ, ఇలా పురాణ క‌థ‌లు చెబుతున్నారు? కొంప‌దీసి ప్ర‌వ‌చ‌నాలు నేర్పిస్తారా ఏంటి స‌ర్‌... అన్నాడు అయోమ‌యంగా చూస్తూ.

ఒరే... పురాణాల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కురోయ్‌... రాజ‌కీయాల్లో ఎద‌గాల‌నుకునేవాడు వాటి నుంచి కూడా స్ఫూర్తి పొందాలి, తెలుసా?”

అవునండోయ్‌... నిజ‌మే. రాముడెంత చ‌క్క‌గా ప‌రిపాల‌న చేశాడు, ధ‌ర్మ‌రాజు ప్ర‌జ‌ల్ని ఎలా క‌న్న‌బిడ్డ‌ల్లాగా చూసుకున్నాడు... అలాంటి విష‌యాలే క‌దండీ?”

ఏడిశావ్‌... వాళ్లు ప్ర‌జ‌ల కోసం త‌మ కుటుంబ స‌భ్యులు క‌ష్ట‌పడినా లెక్క‌చెయ్య‌లేదురా. కానీ నేటి పొలిటీషియ‌న్లు అలా కాదుగా? త‌మ కుటుంబ స‌భ్యుల కోసం ప్ర‌జ‌లు ఎన్ని కష్టాలు ప‌డినా ప‌ట్టించుకోరు. కాబ‌ట్టి నిగ్గుతేలిన నీచ రాజ‌కీయ నేత‌లాగా ఎద‌గాల‌నుకుంటే నువ్వు వాళ్ల నుంచి కాదురా స్ఫూర్తి పొందాల్పింది...

మ‌రింకెందుకండీ ఇప్పుడు నాకీ పురాణ క‌థా శ్ర‌వ‌ణం?”

ఓరి వెర్రి నా శిష్యా! భస్మాసురుడి క‌థ నీకు స‌ర‌దాగా చెప్పాన‌నుకుంటున్నావా? న‌యా రాజ‌కీయ నీచ ప్ర‌హ‌స‌నంలో ఇదో నూత‌న ప్ర‌వ‌చ‌నం. ఈ రాజ‌కీయ పురాణంలో నీకా భ‌స్మాసురుడే స్ఫూర్తి. అర్థ‌మైందా?”

అదెలాగో కాస్త మీరే చెప్పి పుణ్యం క‌ట్టుకుందురూ...

ఏముందిరా...  ఆ భ‌స్మారుడేం చేశాడు? వ‌రమిచ్చిన వాడి నెత్తి మీదే చెయ్యిపెట్ట‌బోయాడ‌వునా? అదే నేర్చుకోవాలి నువ్వు. ఇప్పుడు ప్ర‌జ‌లే దేవుళ్లు. వాళ్లిచ్చే వ‌ర‌మే ఓట్లు. కానీ ఆ వ‌రం పొందాలంటే నువ్వు వాళ్ల‌ని మెప్పించాలి. అందుకోసం ఊరూ వాడా తిర‌గాలి. ఎండ‌యినా, వాన‌యినా, చ‌ల‌యినా తిరుగుతూ బ‌తిమాలాలి. బామాలాలి. కాళ్లావేళ్లా ప‌డాలి. ఏడ‌వాలి. ఓదార్చాలి. మొత్తానికి ఏమార్చాలి. అప్పుడా ఆ దేవుళ్లు వ‌రం ఇస్తారు. ఆ వ‌రం వ‌ల్ల అధికారం అందుకోగానే, నీ అస‌లు నైజం బ‌య‌ట‌పెట్టాలి. ఆఖ‌రికి వాళ్ల నెత్తినే చెయ్యి పెట్టాలి. అదీ, భస్మాసురుడి క‌థ నుంచి నువ్వు వంట‌బ‌ట్టించుకోవల‌సిన రాజ‌కీయ సూత్రం.  ఇప్ప‌టికైనా తెలిసిందా?”

భ‌లే సూత్ర‌మండి బాబూ. కానీ గురూగారూ, ఈ సూత్రాన్నిపాటిస్తున్న‌వాళ్లు ఇప్పుడెవ‌రైనా ఉన్నారాండీ?”

నీతో ఇదేరా చిక్కు. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌ని చూసి నేర్చుకోవు. ప‌రిశీల‌న శ‌క్తి త‌క్కువ‌. సాక్షాత్తూ నీ ప‌ర‌గ‌ణాలో అధికార కుర్చీ ఎక్కి తైత‌క్క‌లాడుతున్న వాళ్ల‌ని చూసి కూడా గ్ర‌హించుకోవు. ఓ సారి త‌ల తిప్పి చుట్టూ చూడు. జ‌రుగుతున్న‌దేంటో తెలుస్తుంది. మ‌రిక్క‌డి ప్ర‌జ‌ల ప‌రిస్థితి, అప్పుడు వ‌ర‌మిచ్చి ప‌రుగందుకున్న ప‌ర‌మ‌శివుడి ప‌రిస్థితిలా లేదూ? అన్న‌పూర్ణ అనిపించుకున్న‌రాష్ట్రం ఇప్పుడు అయ్య‌య్యో... అనిపించుకోవ‌డం లేదూ? ఇక్క‌డ ఏ వ్య‌వ‌స్థ‌, అవ‌స్థ‌లు లేకుండా ఉంది చెప్పు? అన్నింటి మీద భ‌స్మాసుర హ‌స్తం మోపిన‌ట్టు అయిపోలేదూ? యాష్ త‌ప్ప మ‌రింకేం మిగ‌ల‌నంత‌గా మ‌టాష్ అయిపోలేదూరాష్ట్రం పేరు చెబితే దేశం మొత్తం మీద ఎక్క‌డా అప్పు పుట్ట‌ని దుస్థితి ఇంత‌కు ముందెప్పుడైనా చూశామా, విన్నామా చెప్పుబ్యాంకులు, ప‌రిశ్ర‌మ‌లు కూడా మొహం చాటేసే విప‌త్క‌ర  ప‌రిస్థితి విచిత్రంగా లేదూ? ఆఖ‌రికి జీతాలు, పింఛ‌న్ల‌కి కూడా నెల‌నెలా క‌ట‌క‌ట‌లాడాల్సిన హీనస్థితిలో ప్ర‌భుత్వం ఉందంటే... ఆర్థిక రంగం మీద భ‌స్మాసుర హ‌స్తం ప‌డిన‌ట్టు అనిపించ‌డంలేదూమొన్న‌టికి మొన్న స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి కూడా పోలీసుల అనుమ‌తి తీసుకోవాల‌ని ఆంక్ష‌లు విధించారంటే ఏమ‌నుకోవాలివేరే పార్టీ వాళ్లు నామినేష‌న్ వేయ‌కుండా నానా అడ్డంకులూ క‌ల్పించారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆఖ‌రికి ఎన్నిక‌ల్లో ఎవ‌రైనా పోటీ చేయ‌వ‌చ్చేనే స్వేచ్ఛ‌, హ‌క్కులు నాశ‌నం అయిన‌ట్టా కాదా? అంటే ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి మీద కూడా భ‌స్మాసుర హ‌స్తం మోపిన‌ట్టా కాదా? రాష్ట్ర రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతులు దాదాపు ఏణ్ణార్థం నుంచి ఉద్య‌మిస్తున్నా ప‌ట్టించుకోకపోగా, వాళ్ల‌పై దాడుల‌కు కూడా తెగ‌బ‌డుతున్నారంటే ఏమ‌నుకోవాలి? ప‌్ర‌జాభిప్రాయాన్ని గౌర‌వించాల‌నే క‌నీస బాధ్య‌త కూడా క‌నుమ‌రుగైన‌ట్టేగా? అంటే ప్రాధ‌మిక హ‌క్కుల‌పై కూడా భ‌స్మాసుర హ‌స్తం పెట్టేసిన‌ట్టేగా? ఇక పోలీసులు సొంత విచ‌క్ష‌ణ విస్మ‌రించి, అధికార పార్టీ నేత‌ల‌కు అనుచ‌రులుగా ప్ర‌వ‌ర్తిస్తూ అడ్డ‌గోలు కేసులు పెట్ట‌డానికి కూడా వెనుకాడ‌డం లేదంటే  సామాజిక‌, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు ఏమ‌యిన‌ట్టు? భ‌స్మాసుర హ‌స్తం కింద భ‌గ‌భ‌గ‌లాడుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదూ? మ‌రి ప‌్ర‌జ‌ల ప‌క్షాన నిలిచి స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చాటే ప‌త్రికా రంగాన్ని కూడా బెదిరిస్తున్న దాఖ‌లాలు గ‌మ‌నించ‌లేదా? వ‌్య‌తిరేక వార్త‌లు రాస్తే స‌హించ‌లేక ఆయా ప‌త్రిక‌లు, మీడియా రంగాల‌పై కేసులు పెట్టడం చూడ‌లేదా? ఆఖ‌రికి ప్ర‌జా ఉద్య‌మాల క‌వ‌రేజికి వెళ్లిన విలేక‌రులపై కూడా విరుచుకుప‌డుతున్నారంటే ఏమ‌నుకోవాలి? అలాంటి వార్త‌లు రాయ‌క్క‌ర్లేద‌ని చెప్పిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ప‌త్రికా రంగం వైపు కూడా ఆ భ‌స్మాసుర హ‌స్తం దూసుకువ‌స్తున్న‌ట్టే క‌దా? ప‌్ర‌భుత్వం అసంబ‌ద్ధ నిర్ణ‌యాల‌పై పిటీష‌న్లు ప‌డితే, ఆ నిర్ణయాల‌ను త‌ప్పు ప‌ట్టిన న్యాయమూర్తుల తీర్పుల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ దిల్లీకెళ్లి ఫిర్యాదు చేయ‌డానికి కూడా వెనుకాడ‌డం లేదంటే ఏంట‌ర్థం? న్యాయ‌ వ్య‌వ‌స్థ‌పై కూడా భస్మాసుర హ‌స్తం చాస్తున్న‌ట్టేగా? ఇలా ఒక‌టా, రెండా... ఎన్న‌ని చెప్పుకోగ‌లం? రాష్ట్రంలో ఒకో రంగం, ఒకో వ్య‌వ‌స్థ అణ‌గారిపోవ‌డం లేదూ? ఇప్ప‌టికైనా నీ మ‌ట్టి బుర్ర‌కి ఎక్కిందా లేదా?”

ఛీ... ఛీ... వింటుంటేనే ఒళ్లు మండిపోతోందండి... ఇది నిజంగా భ‌స్మాసుర పాల‌నేనండి బాబూ... వింటుంటే నేనే భ‌స్మాసుర హ‌స్తం కింద ఉన్న‌ట్టు ఒళ్లంతా భ‌గ‌భ‌గా మండిపోతోందండి...

కాబ‌ట్టి అదేరా నువ్వు నేర్చుకోవ‌ల‌సిన నీచ రాజ‌కీయ పురాణం. అధికారం అందేవ‌ర‌కు ఎలా దేవుళ్లాడాలో, అధికారం అందాక ఎలా బ‌రితెగించాలో నేర్చుకున్నావంటే నువ్వు మ‌నిషిగా పూర్తిగా దిగ‌జారిన‌ట్టు. అంటే రాజ‌కీయంగా అంత బాగా ఎదిగిన‌ట్టు. తెలిసిందా?”

తెలిసింది కానీ గురూగారూ! నాదో సందేహ‌మండి. ఆ భ‌స్మాసురుడి క‌థ‌లో శివుడిని విష్ణుమూర్తి ర‌క్షించాడు క‌దండీ? మ‌రి ఇప్పుడు ఇలాంటి నేత‌ల నుంచి ప్ర‌జ‌ల్ని ఎవ‌రు ర‌క్షిస్తారండీ?”

విష్ణుముర్తి అంటే విచ‌క్ష‌ణ‌రా. ప్ర‌జ‌ల్లో ఆ విచ‌క్ష‌ణ మేలుకోవాలి. అందుకు నీతి, నిజాయితీలే ఆలంబ‌న‌గా, నిస్వార్థంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తున్న జ‌న‌నాయ‌కులు ఎవ‌రో ప్ర‌జ‌లే గుర్తించాలి.  చ‌టుక్కున  వ‌రమిచ్చేసిన‌ట్టు కాకుండా వాస్త‌వాలు గ్ర‌హించి ఓటేసే చైత‌న్యాన్ని అల‌వ‌రుచు కోవాలి. అప్పుడే ఇలాంటి భ‌స్మాసుర నేత‌లు త‌మ నెత్తి మీద తామే చెయ్యి పెట్టుకున్న‌ట్టు నాశ‌న‌మ‌వుతారు. ఇదే నేను నీకు చెప్పాల‌నుకున్న రాజ‌కీయ భ‌స్మాసుర పురాణం. ఇక పోయిరా!

-సృజ‌న‌ 

PUBLISHED ON 22.11.21 ON JANASENA WEB SITE

మంగళవారం, నవంబర్ 16, 2021

క‌రుణించు... క‌నిక‌రించు!


 

ప్ర‌భూ!

నా మ‌న‌సొక మురుగునీటి ప్ర‌వాహం...

ఆలోచ‌న‌ల‌న్నీ చెత్తాచెదారం...

నా త‌ర‌మా దాని ప్ర‌క్షాళ‌నం?

నీ ద‌య‌తోనే కావాల‌ది గంగాజ‌లం!


బుధవారం, నవంబర్ 10, 2021

జ‌గ‌న్నాట‌క సూత్ర‌ధారి!


 

"సార్‌... సార్‌... కొంప మునిగింది..."

"ఎవ‌రిదీ?"

"మ‌న‌దే సార్‌..."

"ఛ‌స్‌... ఊరుకో... కొంప‌లు ముంచే వాళ్ల‌మే మ‌న‌మైన‌ప్పుడు మ‌న‌ది మున‌గ‌డ‌మేంట‌య్యా?"

"మీరింత నిబ్బ‌రంగా ఎలా ఉండగ‌లుగుతున్నారండీ బాబూ... అవ‌త‌ల మీ అక్ర‌మ లావాదేవీల‌న్నీ బ‌ట్ట‌బ‌య‌లైపోతుంటేను?"

"హ‌...హ్హ‌...హ్హా! మ‌న‌వంత సులువుగా బ‌య‌ట‌ప‌డిపోయే య‌వ్వారాలు కాదు క‌దయ్యా... ఊరికే ఎందుకు కంగారు ప‌డ‌తావు కానీ, ముందు జ‌రిగిందేంటో చెప్పు..."

"అదేనండీ... నిన్న హైకోర్టులో ఆ సీబీఐ వాద‌న‌ల‌న్నీ ప‌త్రిక‌ల్లో ప‌తాక వార్త‌లుగా వ‌చ్చేశాయండీ బాబూ... మీరింకా చూడ‌లేదా?"

"చూడు సెక్ర‌ట్రీ! మ‌నం  చేసిన‌విన్నీ అన్నీనా చెప్పు? ఎన్న‌ని గుర్తు పెట్టుకుంటానువాటిలో కొన్ని అడ‌పా ద‌డ‌పా ప‌త్రిక‌ల్లో వ‌స్తుంటాయి. మ‌రికొన్ని కోర్టుల్లో మార్మోగిపోతుంటాయి... ఇదంతా మామూలేన‌య్యా. కాబ‌ట్టి నువ్వూరికే బెంబేలు ప‌డిపోకు..."

"అది కాదండి బాబూ... పొద్దున్న పేప‌రు చూసిన‌ప్ప‌టి నుంచి గుండె బేజారైపోయిందండి. మీరు కూడా చూసి కంగారు ప‌డిపోయి, ఏ గుండె నొప్ప‌యినా తెచ్చుకుని ఉంటార‌ని భ‌య‌ప‌డిపోయానండి. అందుకే ఉరుకూ ప‌రుగు మీద వ‌చ్చేశానండి... మీరు చూస్తే తాపీగా ఉన్నారు... ఇప్ప‌టికి నా మ‌న‌సు కుదుటప‌డిందండి..."

"ఇంకా న‌యం సెక్ర‌ట్రీ... ఆ గుండెనొప్పేదో నీకే వ‌చ్చేసింది కాదు... మొత్తానికి భ‌లేవాడివ‌య్యా...  ఒట్టి కంగారు గొడ్డులా ఉన్నావ్‌... ఇంత‌కీ ఏమంటుంది ఆ సీబీఐ?"

"ఏమండ‌మేంటండి బాబూ... చాలా ప‌గ‌డ్బందీగా వాదించిందండి. మీదంటూ ఒక్క రూపాయి కూడా లేకుండా ఏకంగా 1200 కోట్ల రూపాయ‌లకు పైగా  మీ కంపెనీల్లోకి ఎలా రాబ‌ట్టుకున్నారో అదంతా ఏక‌ర‌వు పెట్టిందండి... పైగా ఈ మొత్తం అక్ర‌మార్జ‌న‌కు సంబంధించి అన్ని రుజువులూ ఉన్నాయంటోందండి...  అవ‌న్నీ రేపో మాపో బ‌య‌ట‌కొచ్చేశాయ‌నుకోండి... త‌మ‌రి ప‌రిస్థితి ఏంట‌న్న‌ది నా బెంగండి..."

"అవున్లే పాపం... ఇవ‌న్నీ నీకు కొత్త కాబ‌ట్టి అలాగే ఉంటుందిలే. మ‌రి నాక‌లా కాదు క‌దా... నాకివ‌న్నీ అల‌వాటే.  అంచేత‌, నువ్వు ముందు స్థిమితప‌డి, కాసిన్ని మంచినీళ్లు తాగి అప్పుడు చెప్పు... ఆ సీబీఐ చేసిన వాద‌నేంటో..."

"పోన్లెండి... మీరు స్థిమితంగా ఉన్నారంతే చాలు... మీరంటే ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కానీ, ఈ కేసు జ‌రిగిన‌ప్పుడు మీ తండ్రిగారు సీఎంటండి... అప్ప‌ట్లో ఆయ‌న త‌న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవ‌రెవ‌రికి భూములు కేటాయించారో, అలా భూములు పొందిన వాళ్లు మీరు పెట్టిన కంపెనీల్లోకి ఎన్నేసి కోట్లు బ‌ద‌లాయించారో అవ‌న్నీ పేర్లతో స‌హా సీబీఐ కోర్టులో చెప్పేసిందండి. ఇదంతా ముడుపుల వ్య‌వ‌హార‌మే త‌ప్ప మ‌రేమీ కాదని గ‌ట్టి వాదించిందంటండి... పైగా ఇదంతా క్విడ్‌ప్రోకో కింద‌కే వ‌స్తుందని చెప్పిందంటండి..."

"అంతేనా? ఇంకేమ‌న్నా ఉందా?"

"అదేనండి... అస‌లు ముందుగా మీ కంపెనీల్లోకి కోట్లు వ‌చ్చిప‌డ్డాయ‌ని క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాకే, ఆయా సంస్థ‌ల‌కి మీ తండ్రిగారు రాష్ట్రంలో భూములు కేటాయించార్టండి... ఆపై మ‌రిన్ని కోట్లు ఎకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాక‌నే వాళ్ల‌కి ఇంకొన్ని ఎక‌రాలు క‌ట్ట‌బెట్టార్టండి... ఈ కేటాయింపులు, కోట్లు రావ‌డాలు ఎప్పుడెప్పుడు జ‌రిగాయో తేదీల‌తో స‌హా దాఖ‌లాలు ఉన్నాయంటండి..."

"స‌ర్లేవ‌య్యా... వాళ్ల వాద‌న వాళ్ల‌ది. వాళ్ల ప‌ని వాళ్లు చేయాలి క‌దా..."

"అయ్యా... మీ నిబ్బ‌రం, నిశ్చింత చూస్తుంటే ఆశ్చ‌ర్యమేస్తోందండి... ఎంతో రాటుదేలిన ఘ‌ట‌నాఘ‌ట‌న స‌మ‌ర్థులైతే త‌ప్ప ఇంత థిలాసా ఉండ‌దండి... కానీ మీ సెక్ర‌ట్రీగా నా కంగారు నాదండి. మ‌రి ఈ కేసులు రుజువైపోతే కోర్టు గ‌బుక్కున అరెస్టు వారెంటు ఇస్తే ఎలాగా అని ఆలోచిస్తున్నానండి..."

"ఓరోరి వెర్రి సెక్ర‌ట్రీ! నీ స్వామి భ‌క్తి, విశ్వాసం చూస్తుంటే ముచ్చ‌ట‌గా ఉంద‌య్యా... కానీ నీకో సంగ‌తి చెబుతా విను. నాకు మ‌న చ‌ట్టాల మీద‌, న్యాయ‌వ్య‌వ‌స్థ మీద‌, మ‌న ప్ర‌జాస్వామ్యం మీద మాచెడ్డ న‌మ్మ‌కమ‌య్యా... ఇవ‌న్నీ అంత తొంద‌ర‌గా తేల‌వు. వాయిదాల మీద వాయిదాలు ప‌డ‌తాయి. పైగా మ‌నోళ్లు చూస్తా ఊరుకుంటారా చెప్పు? మ‌ధ్య‌లో ఏదో సెక్ష‌న్ అడ్డ‌మెట్టుకుని పిటీష‌ను త‌గిలిస్తారు. దాన్ని శ్రీకోర్టువారు స్వీక‌రించ‌క త‌ప్ప‌దు. తిరిగి దాని మీద వాదోప‌వాదాలు... వాయిదాలు... ఆ... అంచేత నాకెప్పుడూ నిబ్బ‌ర‌మే... అర్థ‌మైందా?"

"అర్థ‌మైంది సార్‌... కాస్త చ‌నువు తీసుకుని అడుగుతున్నాను, ఏమీ అనుకోకండి... ఇంత‌కీ అప్ప‌ట్లో జ‌రిగిన క్విడ్‌ప్రోకోలు, ముడుపులు, భూమి బ‌ద‌లాయింపులు ఇవ‌న్నీ నిజ‌మేనాండీ?"

"చూడు సెక్ర‌ట్రీ... అధికారం అనేది క‌రెంటులాంటిద‌య్యా... ఒక స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరిగి గాలొస్తుంది. మ‌రో స్విచ్ నొక్కితే బ‌ల్బు వెలిగి కాంతి ప‌రుచుకుంటుంది. ఓ స్విచ్ ఏసీ ఆన్ చేస్తే, మ‌రో స్విచ్ వంటింట్లో ప‌చ్చ‌డి చేసి పెడుతుంది. మ‌న‌కి తెలియాల్సింద‌ల్లా ఎప్పుడు ఏ స్విచ్ నొక్క‌ల‌నేదే. అంచాత అప్ప‌ట్లో మ‌న‌కి డైరెక్ట్‌గా అధికారం లేక‌పోయినా, స్విచ్‌లు మాత్రం బాగా తెలిసుండేవి... అద‌న్న‌మాట‌..."

"ఆహా... మీ తెలివితేట‌లు అవీ చూస్తే అబ్బురంగా ఉందండి... తండ్రిగారిది అధికారం అయితే, తైత‌క్క‌లు త‌మ‌వ‌న్న‌మాట‌. కానీ ఓ చిన్న సందేహం సార్‌... ఇప్పుడీ కేసులో మీ క్విడ్‌ప్రోకోలు నిజ‌మ‌ని తేలిపోయింద‌నుకోండి, అప్పుడిక మీ చాప కింద‌కి నీళ్లొచ్చినట్టే క‌దండీ?"

"హ‌...హ్హ‌... హ్హా! సెక్ర‌ట్రీ తెగ న‌వ్వించేస్తున్నావ‌య్యా... చాప కింద‌కి కొత్త‌గా నీళ్లు రావ‌డ‌మేంట‌య్యాఅస‌లు మ‌న చాపే స‌ముద్రం మీద తేలుతుంటేనూ? అదే అవినీతి స‌ముద్రం. దాని మీద తేలిపోతూ సాగిపోయే నాలాంటి వాడికి ఇలాంటి చిన్న చిన్న కేసులు పెద్ద లెక్క‌లోకి రావయ్యా... అప్ప‌ట్లో అధికారం నాది కాదు కాబ‌ట్టి కొంత వ‌ర‌కే సాధ్య‌మైంది. మ‌రిప్పుడో? మ‌న‌మే స్వ‌యంగా అధికార పీఠం మీద బాసింప‌ట్టు వేసుకుని కూర్చున్నాం క‌దా. మ‌రి ఇప్పుడు జ‌రుగుతున్న‌వి ఎప్ప‌టికి తేలుతాయి చెప్పు? ఇప్ప‌టికే వంద‌లాది, వేలాది ఎక‌రాలు మ‌న‌కి బాగా అయిన‌వాళ్ల‌కి కేటాయింపులు చేస్తున్నామారాష్ట్రంలో ఉన్న గ‌నుల‌ని, సెజ్‌ల‌ని క‌ట్ట‌బెట్టేస్తున్నామాఇసుక ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు, సారా గుత్తాధిప‌త్యాలు, భూముల అమ్మ‌కాలు, పోర్టులు ఫ్యాక్ట‌రీల ప్రైవేటీక‌రణ‌లు... ఇలా ఎన్నింటిక‌ని లెక్క‌లు తేల్చ‌గ‌ల‌రు చెప్పుప్ర‌జా సంక్షేమం పేరు చెప్పి అధికారికంగా ఇచ్చే అనుమ‌తులు, ఆ అనుమ‌తుల వెన‌కాల అన‌ధికారికంగా జ‌రిగే లావాదేవీలు, బ‌ద‌లాయింపులు, కేటాయింపులు... వీట‌న్నింటి విలువ ఎవ‌డు చెప్ప‌గ‌ల‌డు? ఎవ‌డు తేల్చ‌గ‌ల‌డునువ్వు కేవ‌లం ఓ 1200 కోట్ల‌కే బెంబేలు ప‌డిపోతున్నావ్‌. వీట‌న్నింటి ముందు అదెంత? స‌ముద్రంలో కాకిరెట్ట! ఏమంటావ్‌?"

"ఇంకేమంటాను సార్‌... క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి... ఒళ్లు గ‌గుర్పొడుస్తోంది... నా భ‌యాల‌న్నీ తీరిపోయాయి సార్‌... మీ బ‌రితెగింపు అనిత‌ర సాధ్యం! మీ అధికార లీల‌లు అమోఘం! మీరు... మీరు... జ‌గ‌న్నాట‌క సూత్ర‌ధారులు!"

-సృజ‌న‌

PUBLISHED ON 9.11.2021 ON JANASENA WEBSITE

 

సోమవారం, నవంబర్ 01, 2021

స‌ర్కారు వారి బాణ‌సంచా... తుస్‌!


 

దీపావ‌ళి క‌దా... పిల్ల‌ల‌కి బాణ‌సంచా కొందామ‌ని బ‌జారుకెళ్లిన సామాన్యుడికి అక్క‌డి ధ‌ర‌లు చూసి క‌ళ్లు భూచ‌క్రాల్లా గిర్రున తిరిగాయి. గుండె నార‌బాంబులాగా ధ‌డేలుమ‌ని పేలింది. కుదురులేని సిసింద్రీలాగా మ‌న‌సు ప‌రిప‌రివిధాల పోయింది. దాంతో అత‌డి నోటమ్మ‌ట తిట్లు సీమ‌టపాకాయ‌ల్లాగా ట‌ప‌ట‌ప‌లాడాయి. "థూ... దీనెవ్వా స‌ర్కారు. సీటికీ మాటికీ గొప్ప‌లు సెప్పుకోడ‌మే కానీ సేసిందేటీ నేదు. పిల్ల‌కాయ‌ల‌కి ట‌పాకాయ‌లు కొందారంటే జేబులోని కూసిని సొమ్ములు ఎందుకూ రావు. ఊరూవాడా తిరిగి ఓదార్చుకుంటూ ఏడిస్తే ఓటేసాం. కుర్సీ ఎక్కి రెండేళ్లు గిర్రున తిరిగినా నాబోటి సామాన్య‌ల బ‌తుకులు బాగుప‌డింది లేదు. పైగా న‌వ ర‌త్నాలంట‌... అదంట‌... ఇదంట‌... సెప్పుకోడానికైనా సిగ్గుండాల‌..." అంటూ గొణుక్కున్నాడు. తొంద‌ర‌గా వెళ్తే పిల్ల‌లు ట‌పాకాయ‌లు అడుగుతారని, పొద్దు పోయేదాకా  అక్క‌డాఇక్క‌డా తిరిగి పిల్ల‌లు నిద్ర‌పోయాక ఇంటికెళ్లి అరుగు మీద తుండు ప‌రుచుకుని ప‌డుకున్నాడు సామాన్యుడు.

* * *

"లెగు మావా... మంచి ఊసుంది లెగు..." అంటూ భార్య లేపుతుంటే క‌ళ్లు నులుముకుంటూ లేచాడు సామాన్యుడు.

"ఏటే దిక్కుమాలిన గోల‌కాసేపు నిద్ర‌యినా పోనివ్వ‌వు..." అంటూ అరిచాడు.

"ఎహే... లెగు మావా. మ‌న జ‌గ‌న‌న్న స‌ర్కారు బాణ‌సంచా ప‌థ‌కం పెట్టింది మావా! మ‌న సామాన్యుల బ‌తుకుల్లో దీపావ‌ళి జ‌రిపించ‌డానికంట‌..."

"బాణ‌సంచా ప‌థ‌కం ఏంటేనీకేమ‌న్నా మ‌తిపోయిందా?"

"ఔ... మావా... బాణ‌సంచా భ‌రోసా అంట‌! నిన్న‌గాక మొన్న సినేమా టిక్కెట్లు కూడా అమ్ముతామందిగా? అలా ట‌పాసుల‌ అమ్మ‌కాలు కూడా సేప‌ట్టిందంట‌. నేనెళ్లి పిల‌గాళ్ల కోసం ఓ సంచీ బాణ‌సంచా తెచ్చా..."

ఇంత‌లో పిల్ల‌లు చుట్టూ మూగి "భ‌లే... భ‌లే..." అంటూ గెంత‌సాగారు.

సామాన్యుడికి అంతా క‌ల‌లాగా ఉంది. లేచి కూర్చుని "స‌రే... ఎలిగించండి. ఎలా కాల్తాయో సూద్దారి..." అన్నాడు.

పిల్ల‌లు సంచీలోంచి మ‌తాబులు తీశారు. సంబంరంగా వాటిని ముట్టించారు. వాటిలోంచి ఒక‌ట్రెండు ముత్యాలు రాలి... అపై అంతా పొగ రావ‌డం మొద‌లెట్టింది.  ఆ పొగ‌కి పిల్ల‌ల‌కి ఊపిరాడ‌లేదు.

"ఇయ్యేంటి మావా? ఇలా కాల్త‌న్నాయి?" అంది భార్య‌.

సామాన్యుడు ఆ మ‌తాబులు తీసుకుని ఆ గొట్టాల మీది కాగితాలు చూసి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాడు.

"ఓర్నీయ‌వ్వా... ఈ మ‌తాబులు సుట్టిన‌  కాగితాలేంటో తెలుసా? ఎన్నిక‌ల నాటి వాగ్దానాలు. మేం గెలిస్తే ఇంత సేత్తాం... అంత సేసేత్తాం అంటూ ప‌త్రిక‌ల్లో అచ్చెత్తించారు సూడు. అయ్య‌న్నమాట‌. ఆటిని అదేంట‌బ్బా... ఆ... మానిఫెస్టో అంటార్లే. అందులో రాసిన వాగ్దానాలు సిట్లం క‌ట్టేసాయ‌న్న‌మాట‌. అందుకే ముత్యాలు లేవు... అంతా పొగే" అన్నాడు.

ఇంత‌లో పిల్ల‌లు "నానోయ్‌... కాక‌ర‌పూవొత్తులు" అంటూ సంచీలోంచి పెట్లు తీశారు. గ‌బ‌గ‌బా దీపం ద‌గ్గ‌ర‌కి వెళ్లి ముట్టించారు. అవి కాసేపు వెలిగి ఆరిపోయాయి. త‌ర్వాత ఉన్న‌ట్టుండి వాటంత‌ట అవే అంటుకుని చిట‌ప‌ట‌లాడాయి. కాసేపు ఎర్ర‌గా, కాసేపు ఆకుప‌చ్చ‌గా రంగులు మారి మ‌ధ్య‌లోనే ఆరిపోయాయి.

"ఇయ్యెక్క‌డి కాక‌ర‌పువ్వొత్తులు మావా?" అంది భార్య‌.

"స‌ర్లెయ్యే... స‌ర్కారు ప‌థ‌కం అన‌గానే అనుకున్నాను, ఇట్టాంటిదేదో జ‌రుగుతాద‌ని. కొలువు దీరి రెండేళ్లు దాటాయి. ఓ ప‌ద్ధ‌తి లేదు పాడూ లేదు. రోజుకో రంగు మారుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రంగులు మారుత్తారో. ఆళ్లు సేసిన కాక‌ర‌పువ్వొత్తు అలా కాక ఇంకెలా వెలుగుద్ది సెప్పు?" అన్నాడు.

"నానోయ్! చూడు ఎంత పెద్ద భూచ‌క్ర‌మో..." అంటూ పిల్ల‌లు సంబ‌రంగా తెచ్చారు. సామాన్యుడు దాన్ని తీసుకుని చూస్తే దాని మీద అదానీ గ్రూప్ త‌యారీ అని ఉంది.

"ఒరే... ఇది మాత్రం భ‌లే తిరుగుద్దిరా. గేరంట్రీ..." అన్నాడు. పిల్ల‌లు వెలిగించ‌గానే అది నిప్పులు చిమ్ముకుంటూ గిర‌గిరా తిరుగుతూ అక్క‌డ భూమంతా తిరుగుతూ సంద‌డి చేసింది.

"ఇదేటి మావా! ముందే ఎలా సెప్పేశావ్‌... ఇది బాగా తిరుగుద్ద‌ని?" అంది భార్య‌.

సామాన్యుడు నిట్టూర్చి చెప్పాడు... "మ‌రి కాదంటేదాని మీద రాసుంది గందా అదానీ అనినిన్న‌టికి నిన్న విశాఖ ప‌ట్నంలో 130 ఎక‌రాలు రాసిచ్చేసారు మ‌న స‌ర్కారోళ్లు. మొన్న‌టికి మొన్న గంగ‌వ‌రం ఓడ‌రేవులో పాగా వేసిందీళ్లే గ‌దా. మ‌రాళ్ల పేరుతో సేసిన భూసెక్రం ఊరుకుంట‌దేటి? ఎక్కెడెక్క‌డి భూములూ సుట్ట‌బెట్టేయ‌దూ? అందుక‌నే సెప్ప‌గ‌లిగా".

"కానీ మావా! అలా ఆళ్లు భూములు తీసుకుని ఏవో అభివృద్ధి సేశార‌నుకో. మంచిదేగందా మ‌రి?"

"సూద్దారే ఏం జ‌రుగుద్దో? ఆళ్లు ఏం సేత్తార‌నేది త‌ర్వాతి ఇస‌యం. ముంద‌యితే కోట్ల‌కు కోట్లు ఖ‌రీదు సేసే ఎక‌రాల‌కెక‌రాలు ప‌ట్టేశార‌నేదే గందా పాయింటు? ఏంట‌తావ్‌?"

"నానేటంటాను... నువ్వేటంటే నానూ అదే అంటాను"

ఇంత‌లో పిల్ల‌లు ప‌రిగెత్తుకు వ‌చ్చారు... "అమ్మోయ్‌... నానోయ్‌... తారాజువ్వ‌లు కూడా ఉన్న‌యే" అంటూ తెచ్చారు.

సామాన్య‌డు వాటిని తీసుకుని చూస్తే వాటి మీద న‌వ‌ర‌త్న బ్రాండ్ అని ఉంది.

పిల్ల‌లు ఓ జువ్వ తీసి వెలిగించారు. అది ఆకాశంలోకి ఎగిరిన‌ట్టే ఎగిరి మళ్లీ కింద‌కి దూసుకొచ్చి సామాన్యుడి జేబులోకి దూరిపోయింది.

"ఓర్దీనెవ్వ‌..." అంటూ  సామాన్యుడు కంగారు ప‌డి, దులుపుకునే స‌రికి జేబంతా చిల్లులు.

"ఇయ్యేం జువ్వ‌లు మావాపైకెళ్ల‌డం మానేసి మ‌న‌మీద‌కొచ్చి ప‌డ‌త‌న్న‌యేంటి?" అంది భార్య‌.

"అదంతేలేయే.. మ‌న స‌ర్కారోళ్లు ప్ర‌వేశ పెట్టిన న‌వ‌ర‌త్న ప‌థ‌కాల్లాగే మ‌రి! ఎక్క‌డెక్క‌డ లేని అప్పులూ సేత్తా, ఆ సొమ్మంతా మ‌ళ్లిస్తా, కొంద‌రికి సొమ్ములు పంచిన‌ట్టే పంచుతున్నారా? ఆ వంకెట్టుకుని గొప్ప‌గా జ‌బ్బ‌లు కొట్టుకుంటున్న‌రాకానీ నిజానికి జ‌రుగుతున్న‌దేంటి? ఆ ప‌థ‌కాల వ‌ల్ల మ‌న జేబుకే సిల్ల‌లు ప‌డుతున్నాయి. ఓట్ల కోసం పందేరం సేసే సొమ్ముల్ని రాబట్టుకోడం కోస‌రంధ‌ర‌లు, ప‌న్నులు పెంచేత్త‌న్నారా లేదాచివ‌రాక‌రికి చెత్త మీద కూడా ప‌న్నులేసేత్త‌న్నారు క‌దే? మ‌ద్యం మావే అమ్ముతామంటా మొద‌లెట్టి నాసిర‌కం మందు పోత్త‌న్నారు. ఇక ఇస‌క సంగ‌తి సెప్పాలా? ఓల్సేలుగా ఆళ్ల‌కి కావ‌ల‌సినోళ్ల‌కి అప్పజెప్పేశారు. ఇప్పుడ‌ది దొర‌క‌డ‌మూ గ‌గ‌న‌మే, ధ‌రా గ‌గ‌న‌మే. ఇలా ఒక‌టా రెండా... అన్నీ మ‌న జేబుల‌కి సిల్లులే గ‌దే? మ‌రా తారుజువ్వ కూడా అదే సేసింది సూడు..." "అబ్బ‌... ఎంత పెద్ద చిచ్చుబుడ్డో చూడు నాన్నా..." అంటూ పిల్లలు తెచ్చి నేల మీద పెట్టి వెలిగించారు. అది  మొద‌ట బుస్సుమంటూ వెలిగి ఆన‌క వెన‌క నుండి చీదేసింది.

"ఇదేంటి మావా? బ‌జార్లోంచి తెస్తే ఎంత చిన్న చిచ్చుబుడ్డ‌యినా అంతెత్తున వెలుగులు సిమ్ముతాది. మ‌రిందింత  పెద్ద‌గా ఉన్నా సీదేసిందేటి?" అంది భార్య‌.

"మ‌రేదేనే... సూడ్డానికి మ‌న స‌ర్కారోళ్ల ప్ర‌చారంలాగా పెద్ద‌గా, మెరుపు కాగితంతో సుట్ట‌బెట్టి ఉందాతీరా చేసి ముట్టించాక ఏమైందో సూశావుగా? ఈ రెండేళ్ల‌లో ఏం జ‌రిగిందో, అదే మ‌రి! స‌భ‌ల్లో, సొంత ప‌త్రిక‌ల్లో సెప్పేదీ, రాసేదీ బాగానే ఉంట‌ది. కానీ సుట్టూ సూత్తే అంతా గంద‌ర‌గోళం. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళితే రోడ్లు కూడా బాగోవు. సెప్పేది కొడంత‌...సేసేది గోరంత‌. ఉద్యోగుల‌కు జీతాలు ఎప్పుడు ప‌డ‌తాయో తెల్దు. పెద్దోళ్ల‌కి పింఛ‌న్లు ఎప్పుడొస్తాయో తెల్దు. ఇక రైత‌న్న‌ల సంగ‌తి మ‌రీ దారుణం. గిట్టుబాటు ధ‌ర‌ల్లేవ్‌. ధాన్యం కొన్న డబ్బుల బ‌కాయిలు రావు. దేశం మొత్తం మీద ఆత్మ‌హ‌త్య‌లు సేసుకుంటున్న రైత‌న్న‌ల ఇస‌యంలో మ‌న రాట్రం మూడో స్థానంలో ఉందంట‌. ఇలా ఎవుళ్ల జీవితాలు బాగుప‌డ్డాయి సెప్పు? ఆఖ‌రికి ఓ రాజ‌ధాని కూడా లేకుండా బ‌తుకులు ఈడుస్తున్నాం. అమ‌రావ‌తి కోసం భూములిచ్చిన‌ రైతు బాబాయ్‌లంతా అలో ల‌చ్చ‌నా అంటా ఏడత్త‌న్నారు. పిల‌గాళ్ల‌కి ఉద్యోగాలు లేవు. కొలువులిచ్చే ప‌రిశ్ర‌మ‌లు లేవు. రావు. ఆఖ‌రికి సాయం మీద స‌దూకునే పిల‌గాళ్ల‌కి కూడా జెల్ల‌కొడుతోందీ స‌ర్కారు. మ‌ర‌లాంటోళ్లు పంచిపెట్టి సిచ్చుబుడ్లు సీదేయ‌కేంజేస్తాయే?"

"నాన్నా... బాణ‌సంచా అయిపోయింది. కానీ సీమ‌ట‌పాకాయ‌లు, బాంబులు ఇవ్వ‌లేదేంటి నాన్నా?" అంటూ వ‌చ్చారు పిల్ల‌లు.

"అవ‌న్నీ పేలేవి క‌ద‌రా అందుక‌ని ఇచ్చుండ‌రు పొండి" అంటూ పిల్ల‌ల్ని పంపేసిన సామాన్య‌డు భార్య కేసి తిరిగి, "ఈ స‌ర్కారోళ్ల బాణ‌సంచాలో వేరే పేలేవెందుకులే. ఎగ‌స్పార్టీవోళ్ల మీద ఎమ్మెల్యేలు, మంత్రులు విరుచుకుపడుతూ తిట్టే తిట్లే సీమ‌ట‌పాకాయ‌లు. స‌మ‌స్య‌ల మీద నోరెత్తిన వాళ్ల మీద అన్నాయంగా బ‌నాయించే కేసులే బాంబులు. ప్ర‌శ్నించే వాళ్ల మీద అనుచ‌రుల‌తోను, పోలీసుల‌తోను చేయించే దాడులే థౌజండువాలాలు... ఏమంటావే?" అన్నాడు.

"బాగానే ఉంది సంబ‌డం... ఇక మ‌న బ‌తుకుల్లో దీపావ‌ళి ఎప్పుడు మావా?" అంది భార్య‌.

"వ‌స్తుందే... అస‌లైన దీపావ‌ళి వస్తుంది. మ‌న‌లాంటి సామాన్యులంతా సుట్టూ ఏం జ‌రుగుతోందో గ‌మ‌నించి, బాగా ఆలోసించుకుని ఓటేసే రోజులొత్తాయి సూడు అప్పుడొస్తాది నిజ‌మైన దీపావ‌ళి..."

****

"ఏటి మావానిజ‌మైన దీపావ‌ళి అంటూ క‌ల‌వ‌రిత్త‌న్నావువెళ్లి పిల్ల‌ల‌కి కూసిన్ని కాక‌ర‌పువ్వొత్తులు తే" అంటూ భార్య లేపుతుంటే మెల‌కువ వ‌చ్చింది సామాన్యుడికి.

"ఓస్దీనెవ్వ‌... ఇదంతా క‌ల‌న్నమాట" అనుకుని నిట్టూరుస్తూ బ‌జారు కేసి న‌డిచాడు సామాన్య‌డు!

-సృజ‌న‌

PUBLISHED ON 31.10.2021 ON JANASENA WEBSITE