గురువారం, అక్టోబర్ 25, 2012

మూగబోయిన కలం(ఎప్పుడో చిన్నప్పుడు రాసిన కవిత)


కాగితాన్ని చూడగానె రాయాలని ఉబలాటం...
మనసులోని భావాలను కక్కాలని ఆరాటం...

రాయాలని ఉత్సాహం మది నిండా ఉన్నా,
భావాలను వ్యక్తపరుచు సామర్థ్యం సున్నా

ఏదో ఒక కవిత్వాన్ని రాసేయాలి...
నాలో గల నవత్వాన్ని చూపించాలి...

ఒక్కసారి ఉరికింది నాలో గల ఆవేశం...
కళపెళమని మరిగింది నాలోపలి రక్తం

కలంపట్టి, కాగితాన్ని చేతబట్టి...
పట్టుపట్టి రాయాలని పట్టుబట్టి కూర్చున్నా...

అంతలోనె అంతరాత్మ నన్ను చూసి నవ్వింది...
అంతావేశం వద్దని నెమ్మదిగా ఇలా అంది...

నీకెందుకు బాలుడా రాయాలని ఉబలాటం?
రాయలేని నీకెందుకు లేనిపోని ఝంఝాటం?

చీకటినే చూడలేని నీకెందుకు కవిత్వం?
జీవితాన్ని వడబోయక నీకు రాదు నవత్వం...

అంతరాత్మ మాటలోని పచ్చి నిజం చూశా...
క్షణమైనా యోచించక పెన్ను క్యాప్ మూశా

శుక్రవారం, అక్టోబర్ 19, 2012

నేతలు... నీతులు!


నేతలు... నీతులు!'న...హ...మ...హ...స్కారం గురూగారూ!'
'ఏంట్రోయ్‌? అంతలా నవ్వుతా వత్తన్నావ్‌? నీమీద ఎవురైనా అవినీతి ఆరోపణలేవైనా సేసారా?'
'అదేంటండి అలాగనేశారు? అవినీతి ఆరోపణలు చేస్తే బాధపడతాం కానీ నవ్వుతామేంటండి...'

'వూరుకోరా... ఆరోపణలకి బాధపడేంత సత్తెవంతుడవుగాదని నాకు తెలుసులే. మహా అయితే, ఎలా తెల్సిపోయిందబ్బా అని ఆచ్చర్యపోతావ్‌, ఆనక ఎట్టా తిప్పికొట్టాలా అని దారులెతుకుతావ్‌ అంతేగా?'

'అయ్యా! మనిషిని కాక వాడి ఎక్స్‌రేని నేరుగా చూసే శక్తి మీ కళ్లకుందని మర్చిపోయి మాట్లాడాను. మన్నించండి. కానీ, ఆరోపణలకు, నవ్వులకు సంబంధమేమిటా అని తన్నుకు చస్తున్నా...'

'ఏముందిరా... ఇన్నేల్లుగా నాకాడ రాజకీయం నేర్సుకుంటున్నావు కాబట్టి ఇదో కొత్త పాటమనుకో. నువు సేసిన అవినీతి పన్లని పసిగట్టి ఆటినెవుడైనా బయటెడితే వూరికే మొగం కందగడ్డ లాగెట్టుకుని ఆవేశపడిపోకండా నీకు వత్తాసు పలికే వోల్లని పోగేసి, ఆల్లసేత పెత్రికలవోళ్లని పిలిపించి జోకులేయించాల. నిన్నటికి నిన్న కేంద్ర మంతిరి గోరిలాగన్నమాట...

'అంటే... కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ మీద వచ్చిన ఆరోపణల గురించే కదండీ మీరు చెబుతున్నది. ఆయనగారు నడిపే వికలాంగుల ట్రస్టు ద్వారా 71 లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగాయని విన్నానండి...'

'అదేరా మరి నీకూ నాకూ తేడా. నువ్విట్టాంటి యవ్వారాల గురించి తెలీగానే అవకాసమొత్తే ఎలా సేయాలో అంచనాకొత్తావు. నేనయితే అయి సెప్పే రాజకీయ పాటాలు ఏటాని ఆలోసిత్తాను...'

'అవున్సార్‌! అందుకే కదండీ, అడపాదడపా తమ దర్శనం చేసుకుంటుంట. మరిందులో పాఠం ఏంటండీ?'

'మరాయన్ని ఎనకేసుకొత్తా ఆయనగోరి సతీమణి, తోటి మంతిరిగోర్లు ఎట్టాంటి జోకులు పేల్చేరో కానుకోలేదా? పెల్లామంటే ఆవిడే మరి. ఆ కేజిరీవాల్‌ సెప్పేదంతా వట్టి జోకులని తేల్చేయలేదూ? ఆ మాటతో అవకతవకలన్నీ ఆసికాలైపోలేదూ? అంటే, ఎవుడైనా ఆరోపణలు సేసాడనుకో, అయ్యన్నీ కడుపుబ్బ నవ్వేసే కులాసా కబుర్లన్నట్టు సూడాలన్నమాట. కావాలంటే పెత్రికలోల్ల ముందు పగలబడి నవ్వేయాల. అప్పుడాల్లంతా బిత్తరపోయి సెప్పింది రాసుకుపోతారు. ఏటంటావ్‌?'

'అనేదేముందండి, ఇంతబాగా చెప్పాక! వెధవది ఇలాంటి ఆరోపణలు రోజుకోటి వస్తున్నాయండి. ఇంకా ఎలా ఎదుర్కోవాలో చెబుదురూ...'

'ఈ యవ్వారంలోనే ఆ కేంద్రమంతిరిగోరి తోటి మంతిరి ప్రెసాదవరమగోరు ఎంత బాగా సెలవిచ్చారో సూడలేదా? అన్నన్నన్నా... ఎంత మాట? కుర్సీద్‌గోరేంటీ, ఆయన తాహతేంటీ, కేవలం ముష్టి డెబ్బయ్యొక్క లచ్చలకి కక్కుర్తి పడతారా? ఎంత నామర్దా, ఎంత సిగ్గుసేటు? అదే ఏ డెబ్బయ్యొక్క కోట్లో అయితే ఆలోసించాలిగానీ... అంటూ రెచ్చిపోలేదూ?'

'అవునండోయ్‌. స్వయానా మరో కేంద్రమంత్రి అయి ఉండీ, ఆయనిలా మాట్లాడ్డం తప్పు కదండి? కావాలంటే కాదనాలి కానీ ఇదేం వాదనండి...'

'వార్నీ! నువ్వేదో కాసింతో, కూసింతో ఎదిగుంటావులే అనే బ్రమలో ఉన్నారా ఇన్నాల్లూనూ. ఇప్పుడు తెలత్తాంది, నీకింకా రాజకీయం ఒంటబట్టలేదని. రాజకీయాల్లో సమర్దింపులు, బుకాయింపులు, తిప్పికొట్టడాలు, తిట్టడాలు, మొండికెత్తడాలే ఉంటాయి కానీ తప్పుల గురించి తల్లడిల్లడాలుండవు. ఇలా అడపాదడపా రాజకీయ ముసుగులోంచి బయటికొచ్చేసి, నికార్సయిన మనిసిలా ఆలోసించావనుకో ఎప్పుడోపాలి పెద్ద దెబ్బ తింటావు మరి...'

'బుద్ధొచ్చిందండి బాబూ తిట్టకండి. అయినా కానీ ఈ రోజుల్లో అవినీతంటే కోట్లకు కోట్లు గుర్తొస్తున్నాయికానీ వెధవది ఈ లక్షలేంటండి? అసలిలాంటి ఆరోపణల్ని ప్రజలు కూడా పట్టించుకుంటారా అని నా అనుమానమండి...'

'ఏడిశావ్‌లే! పెజానీకాన్నెప్పుడూ తేలిగ్గా సూడమాక. ఓటు ముద్దర్లప్పుడు ఓటి కుండలా మిగిలిపోతావ్‌. మన సూపంతా ఆల్ల మాటల్ని తేలికసేయడం మీదే ఉండాల. కానయితే ఇందులో అవినీతినిబట్టి కొన్ని బిరుదులు, అవార్డులు గట్రా నేతలకివ్వచ్చేమోనని తడుతోందిరా. ఉదారనకి పెద్ద పదవిలో ఉండి కేవలం లచ్చల్లో నొక్కేసాడని తెలీగానే 'వట్టి అమాయక సెక్రవర్తి' అనో, 'పిచ్చిమాలోకం' అనో పేరెట్టచ్చేమో. ఉన్న నేతల్లో అందరికన్నా తక్కువ తిన్నోడే నీతున్నోడని జనం జేజేలు పలికే రోజులొత్తాయేమో మరి. మన నాయకుల యవ్వారాలు సూత్తే అట్టాగే ఉన్నాయి మరి. ఏటంటావ్‌?'

'అద్భుతం సార్‌! మీ శిష్యుడిగా అలాంటి నేతల్లో ఒకడిగా ఎదగాలనేదే నా ఆకాంక్ష. అందుకు మీ ఆశీర్వచనం కావాలి'

'ఆటికేంలే... అయ్యెప్పుడూ ఉంటాయి కానీ, నువుసేసె యదవపన్ల ఇలువ ఇలువ కోటికి తగ్గితే మాత్రం నిన్ను గుమ్మం ఎక్కనీయన్రో... అది కానుకుని మసలుకో. ఇక పోయిరా మరి!'


PUBLISHED IN EENADU ON 19.10.2012

శుక్రవారం, అక్టోబర్ 12, 2012


పెద్దింటి అల్లుళ్లు 

'అల్లుడెందుకొచ్చాడు? 
అప్పాలు తినడానికొచ్చాడు! 
కూతురెందుకొచ్చింది? 
కుడుములు తినడానికొచ్చింది!'

 అనే పాట దసరా రోజుల్లోనే పాడుకోనక్కర్లేదు. సరదాగా ఉన్నా పాడుకోవచ్చు. పాట పాడినంత మాత్రాన అందరికీ ఇలాంటి సరదాలూ తీరవు. ఏ పాటలూ పాడకపోయినా కొందరికి ఈ సరదాలొచ్చి ఒళ్లో వాలతాయి. పెట్టి పుట్టడమంటే అదే. పెట్టి పుట్టకపోయినా, పుట్టి సాధిస్తున్నవారి గురించి పాడుకుంటే అదో సరదా. వూరికే బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం?

అప్పాలు తిన్న అల్లుడుగారు అరుగుమీద పడక్కుర్చీలో కూర్చుని పండగ చేసుకుంటుంటే చూసి ఉడుక్కోవడంలో అర్థం లేదు. ఆయనగారి అదృష్టానికి జోహార్లర్పించే విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అత్తగారి సొత్తుమీద అల్లుడికి కాక ఇంకెవరికి హక్కుంటుంది? అసలామాటకొస్తే, పాపం పండక్కొచ్చి అప్పాలు తినే అల్లుళ్లంతా వట్టి అమాయకుల కిందే లెక్క. ఒకటికి రెండు వడ్డిస్తేనే ఆనందపడి ఆరగించి ఆపై ఆయాసపడి అరాయించుకోలేక ఆపసోపాలు పడతారు. ఇలాంటి అల్లాటప్పా అల్లుళ్లను మించిపోయే గొప్ప గొప్ప అల్లుళ్లు చాలామంది ఉన్నారు. అదృష్టమంటే వాళ్లదీ!

సోదాహరణంగా చెప్పాలంటే ఢిల్లీ అల్లుడి హరికథ, ఆంధ్రా అల్లుడి బుర్రకథ వినాలి. ఒక్కసారి వాళ్లకేసి చూస్తే అటు అత్తగారి గొప్పదనం, ఇటు మామగారి ఘరానాతనం అర్థమవుతాయి. అత్తసొత్తు అల్లుడి దానమంటూ సామెతలు చెబుతారు కానీ, అల్లుడికి తన సొత్తే కాకుండా ప్రజల సొత్తునూ దానంచేసే అత్త చరిత్ర తెలుసుకుంటే జన్మ తరిస్తుంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అల్లుడిగారికి గనులూ గట్రా కట్టబెట్టిన మామ పురాణం పారాయణచేస్తే పురుషార్థమంటే ఏమిటో తేటతెల్లమవుతుంది.

కాబట్టి, అల్లుళ్లందరూ ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని వచ్చే జన్మలోనైనా రాజకీయాల్లో చక్రం తిప్పే అత్తమామలు దొరకాలని వ్రతాలేమైనా ఉన్నాయేమో వాకబు చేసుకుని, చేసుకుంటే మంచింది.

'ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా...

సేవలంది మాకు వరములీయవమ్మ...' - అంటూ పాటలు గట్రా ఇప్పటి నుంచే కంఠతా పట్టుకోవడం మేలు. పదిమంది అల్లుళ్లను పేరంటానికి పిలిచి యథాశక్తి వాయినాలిచ్చుకుంటే ఢిల్లీలో అధికార పీఠాన్ని అదృశ్యంగా అజమాయిషీచేసే ఘరానా అత్తగారు దొరికే అవకాశాలు మెరుగుపడతాయి. అప్పుడు ఎంచక్కా దేశంలోని భూముల్నే అప్పాల్లాగా అప్పనంగా ఆరగించవచ్చు. ఆరోపణలు వెల్లువెత్తినా అమాయకంగా అరాయించుకోనూ వచ్చు. నోరు విప్పాల్సిన పని కూడా లేదు. అవసరమైతే అల్లుడిగారిని వేలెత్తి చూపే దుస్సాహసగాళ్లపై దుమ్మెత్తి పోయడానికి అత్తగారి హయాములో అమాత్యులంతా మూకుమ్మడిగా సిద్ధంగా ఉంటారు. ఈలోగా ప్రజాశ్రేయం కోసం కేటాయించిన భూముల్ని ఎకరాలకు ఎకరాలు కొనడం, ఆనక అమ్మినవాళ్లకే అమ్మడం, వడ్డీలేని రుణాలు పొందడం, ఆస్తులు పెంచుకోవడం, పెంచుకున్నవి లెక్కెట్టుకోవడం, లెక్కెట్టుకున్నవి దాచుకోవడం, దాచుకున్నవి దక్కించుకోవడం లాంటి పనులు తిరగామరగా చేస్తూ 'తార్‌మార్‌ తక్కిడమార్‌... ఎక్కడి దొంగలు అక్కడేే గప్‌చిప్‌' అంటూ ఆటలాడుకోవచ్చు.

ఇలాంటి చిత్రవిచిత్ర లీలావిన్యాసాలతో సాగిపోయే ఢిల్లీ అల్లుడి హరికథ వింటుంటే ఎవరికైనా సరే ఒళ్లు పులకించి, రోమాంచితమై 'అత్తగారూ మీరు వాసిగలవారు... అల్లుడింట్లో సిరుల రాసిపోశారు...' అని పాడుకోకుండా ఉండగలరా? కొండొకచో ఒకరిద్దరు కళ్లెర్రజేసి 'అల్లుడు చేసిన గిల్లుడి పనులకు అత్తగారిని ఆడిపోసుకుంటారేం?' అని కోప్పడినా దేశవాసులందరూ కితకితలు పెట్టినట్టు నవ్వుకుంటారు. ఎందుకంటే ఆవిడగారి అధికార ఛత్రం నీడంటూ లేకపోతే అంత అడ్డగోలుగా ఆస్తుల అప్పాలు అల్లుడిగారి విస్తట్లో వడ్డిస్తారా అనే ఇంగితజ్ఞానం అంతో ఇంతో అందరికీ ఉంది మరి!

కాబట్టి, ఇలాంటి అత్తా అల్లుళ్ల గురించి పాటలు పాడుకుంటూ ముందు ముందు ఆడవాళ్లంతా 'అల్లుడు లేని అత్త ఉత్తమురాలూ ఓయమ్మా... అత్తలేని అల్లుడు వట్టి వాజమ్మా... ఆహుం... ఆహుం...' అంటూ కారాలూ అవీ దంచుకోవచ్చు!

ఢిల్లీ హరికథనుంచి ఆంధ్రా బుర్రకథ దగ్గరకి వస్తే మామగారి జమానా జబర్దస్తీ జమాయింపు కళ్లముందు కదలాడుతుంది. తవ్వినకొద్దీ గనుల కథలు జ్ఞాపకాల్లో ఊరుతూ కంచికి చేరకుండా కవ్విస్తూనే ఉంటాయి. 'మామగారి మనసు బంగారం...

ఆయన చేతిలో అధికారం...

అల్లుడిగారి కొంగుబంగారం...' లాంటి పాటలు పాడుకోవాలనిపిస్తుంది.

ఏతావతా చెప్పుకోవాలంటే ఏడిస్తే ఇలాంటి అల్లుళ్ల అదృష్టానికి ఏడవాలి కానీ, పాపం అప్పాలు తినే అమాయకపు అల్లుళ్ల మీద పాటలు పాడ్డం మహా ఘోరం. అయినా అధికారంతో ఆటలాడగలిగే నాయకమ్మన్యులుండాలే కానీ ఒక్క అల్లుళ్లేం ఖర్మ- కొడుకులు, కూతుళ్లు, అయినవాళ్లు అందరూ తరించిపోరూ!

రాష్ట్రంలో రంగేళీ రాజాగారి కంగాళీ కథాకళిని మరిచిపోగలమా? ఆయనగారి కొడుకులుంగారి పనులింకా ఎవరికీ కొరుకుడు పడ్డమే లేదు. 'ఓ నాన్నా... నీ మనసే వెన్న...' అంటూ అతగాడు అలుపెరగకుండా పాడుకునేంతగా ప్రజల భూములు ఎవరెవరికో ధారాదత్తమై, వాళ్లనుంచి పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా ఇంట్లోకొచ్చి వాలలేదూ?

దానాదీనా ఒక్క విషయం అర్థం చేసుకుంటే మంచిది. రాజకీయ రాబందుల బంధుజనుల విందువినోద వికృత కృత్యాల గురించి తలచుకుంటే మనసు వికలం కావడం తథ్యం. అందువల్ల ఆ మాటెత్తకుండా, నోరెత్తకుండా పడి ఉంటే అందరికీ ఆరోగ్యం!

PUBLISHED IN EENADU ON 12.10.2012

మంగళవారం, అక్టోబర్ 02, 2012

అప్పారావూ... అతడి భాష!అప్పారావు కరడు కట్టిన పాత్రికేయుడు. పాత్రికేయం అతడి నరనరానా వంటబట్టేసింది. అసలు పుడుతూనే కలం పట్టుకుని పుట్టేడేమో తెలియదు. మంత్రసానిని కనుక్కోవాలి. బుల్లి గుప్పెట్లో గట్టిగా పట్టుకున్న సదరు కలం పదును చూసి ఆవిడ ముచ్చటపడి బొడ్డు కోసేముందే తన బొడ్లో దోపేసి ఉంటే ఆ నిజం బయటకు రాకపోవచ్చు. మొత్తం మీద చిన్నప్పటి నుంచీ అప్పారావు అలాంటి బుద్ధులే చూపించాడు. దినపత్రిక చూపిస్తే కానీ గోరుముద్దకు నోరు జాపేవాడు కాదు. టీవీలో వార్తలు పెడితే కానీ అన్నం తినేవాడు కాదు. పైగా బాల్యం నుంచీ సామాజిక స్పృహ ఎక్కువేనేమో కూడా. ఎందుకంటే మనవాడు మారాం లేకుండా తినాలంటే ఆరోజు వార్తల్లో దారుణాలు జరిగి ఉండాలి. భూకంపాలో, వరదలో, సునామీలో వస్తే గుటుకూ గుటుకూ ముద్దలు మింగేసేవాడు. వాళ్లమ్మ రోజూ దినపత్రిక తిరగేస్తూ, టీవీ మీట నొక్కుతూ, 'భగవంతుడా! ఏదైనా ఉత్పాతం జరిగేలా చూడు తండ్రీ!' అని కోరుకునేది.

బడిలో కూడా అంతే. పలక మీద అక్షరాలు ఇష్టం వచ్చినట్టు రాశేసేవాడు. మాస్టారు గతుక్కుమన్నారు. ఆనక ఆరా తీస్తే తెలిసింది. అప్పారావు అమ్మ రచయిత్రి. నాన్న విలేకరి. ఇద్దరూ ఇష్టం వచ్చిన రాతలు రాసేవారే. మరి ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? దరిమిలా అప్పారావు చాలా చురుగ్గా ఎదిగాడు. పత్రికలన్నీ చదివేసేవాడు. వార్తలే వల్లెవేసేవాడు. వార్తా ప్రసారాలే చూసేవాడు.

ఓసారి పరీక్షలో న్యూటన్ గమన సూత్రాలను రాయమన్నారు. విశ్వంలో ఏదైనా స్థితిని మార్చుకోవాలంటే బాహ్యబలం పనిచేయాలని న్యూటన్ చెబితే, మనవాడు ఈ విశ్వంలో ఏ వార్త పుట్టాలన్నా కలం బలం ఉండాల్సిందేనన్నాడు. దేని త్వరణమైనా బలానికి అనులోమానుపాతంలోను, ద్రవ్యరాశికి విలోమానుపాతంలోను ఉంటుందని ఆయన చెబితే, మనవాడు ఏ వార్త వేగమైనా పత్రిక సిద్ధాంతానికి అనులోమానుపాతంగాను, రాద్ధాంతానికి విలోమానుపాతంలోను ఉంటుందని నిర్వచించాడు. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందని ఆయన చెబితే, మనవాడు ప్రతి వార్తకు ఖండన ఉంటుందని రాశాడు. మాస్టారు మొదట తెల్లబోయారు. తర్వాత తేరుకుని అడ్డంగా కొట్టేస్తే అప్పారావు తరగతిలోనే బైఠాయించాడు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. విద్యాధికారికి వినతి పత్రం సమర్పించాడు.

'నేను సమాధానాన్ని సృజనాత్మకంగా రాయడం జరిగింది. దాన్ని మాస్టారు గ్రహించక పోవడం జరిగింది. కాబట్టి నాకు అన్యాయం జరిగింది. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం జరిగితే, నాకు న్యాయం జరిగి, నేను ఆనందించడం జరుగుతుంది. ఇవన్నీ జరిగే వరకు తరగతి నుంచి జరగనని నేను శపథం చేయడం జరిగిందని మీరు గ్రహించడం జరగకపోతే నాకు మార్కులు రావడం జరగదు' అని రాశాడు.

ఆ భాషాప్రయోగానికి ప్రధానోపాధ్యాయుడి కళ్లు తిరిగాయి. విద్యాధికారికి కడుపులో తిప్పింది. తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడారు. వాళ్లు అంతావిని 'వీడు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో ఏంటో?' అన్నారు అయోమయంగా. పక్కనే ఉన్న అప్పారావు విసురుగా కుర్చీలోంచి లేచి, 'మీ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. వాటిని వెంటనే ఉపసంహరించుకోండి' అన్నాడు. అందరూ తలలు పట్టుకున్నారు.

ఆపై అమ్మానాన్నా ఎంత చెప్పినా అప్పారావు వినలేదు. చక్కని తెలుగు చదివి వినిపిస్తే చెవులు మూసుకునేవాడు. దినపత్రికల్లోనే తేట తెలుగు వాక్యాలతో ఉన్న వార్తల్ని, భాష మీద మంచి ప్రయోగాలు చేసే పత్రికల్ని ఇచ్చినా కన్నెత్తి చూసేవాడు కాదు. తనకు నచ్చిన పత్రికాభాషలోనే మాట్లాడేవాడు. నచ్చచెప్పాలని చూస్తే, 'నాకు తోచినట్టు మాట్లాడ్డం నా ప్రాథమిక హక్కు. దాన్ని కాలరాయాలని చూస్తే సహించేది లేదని మిమ్మల్ని చివరిసారిగా హెచ్చరిస్తున్నాను' అనేశాడు. ఆపై అమ్మానాన్నా నోరెత్తితే ఒట్టు.

అలాంటి అప్పారావు ఎదుగుతున్న కొద్దీ మరింత కరడుకట్టేశాడు. తెలుగు ఇలా కూడా మాట్లాడవచ్చా అనే సందేహం కలిగేలా మాట్లాడేవాడు. పాపం... అతనికి స్నేహితులు కూడా లేరు. కారణం అతడి భాషే. ఓసారి ఓ స్నేహతుడు అప్పారావుని సినిమాకి తీసుకెళ్లాడు. చివర్లో 'ఎలా ఉందిరా?' అని అడిగితే, 'ఇలాంటి సినిమా నాకు నచ్చుతుందని నువ్వు భావిస్తే, నువ్వెంత హీన స్థితిలో ఉన్నావో అని నేను అనుకుంటాననే విషయం నీకు తోచనందుకు నేను ఆశ్చర్యపోతానని నువ్వెందుకు గ్రహించడం లేదు?' అన్నాడు. ఆ స్నేహితుడు రోడ్డు మీదే కళ్లు తిరిగి పడిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు మొహం మీద సోడానీళ్లు కొట్టి సేదతీర్చి ఇంటికి పంపారు. ఆపై అతడు అప్పారావు ఇంటి ఛాయలకు కూడా రావడం మానేశాడు. అతడే అప్పారావు చిట్టచివరి స్నేహితుడు.

చదువైపోపోగానే ఇక అప్పారావు సమయాన్ని వృథా చేయదలుచుకోలేదు. వెంటనే బజార్లోకెళ్లి ఓ పెద్ద కంకణం కొనుక్కుని ఇంటికి వచ్చాడు. అమ్మ అదేంట్రా అని అడిగితే, 'పాత్రికేయ వృత్తిలో ప్రవేశించి సమాజాన్ని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నానమ్మా! అదే ఇది. నను కన్న మాతృమూర్తిగా ఆశీర్వదించి పంపితే, పీడిత తాడిత ప్రజలకు చేయూతనై, అణచివేత వల్ల అణగారిన బతుకులకు ఆశాదీపాన్నై వెలుగొందుతా' అన్నాడు ఆవేశంగా. అమ్మ నీరసంగా చెయ్యెత్తగానే బయటకి పరిగెత్తాడు. ఓ దినపత్రిక కార్యాలయానికి వెళ్లి సంపాదకుడిని కలిశాడు.

'నాలో రక్తం లేదు. పాత్రికేయమే ప్రవహిస్తోంది. నరనరానా అక్షర కణాలు అగ్ని విస్ఫోటనాలై ప్రజ్వరిల్లుతున్నాయి' అన్నాడు.

ఆయన ఎగాదిగా చూసి, 'కణాలు విస్ఫోటనాలవుతున్నాయా? క్యాన్సరేమో చూపించుకో నాయనా!' అని పంపేశాడు.

ఇది కాదు పనని దస్తాడు కాగితాలు తెచ్చుకుని దినపత్రికలకు ధరకాస్తులు పంపాడు. చాలా మంది చురుకైన సంపాదకులు చటుక్కున ప్రమాదాన్ని శంకించి, ఉండ చుట్టి చెత్త బుట్టలో పడేయడం వల్ల బతికిపోయారు. కొంత మంది పాపం పూర్తిగా చదివి అస్వస్థతకు గురయ్యారు. అనుకున్నది అందక తిక్కరేగిన అప్పారావు, ఇంట్లో దినపత్రికలన్నీ చింపి పడవలు చేస్తుండడంతో నాన్న భరించలేక తనకు తెలిసున్న సంపాదకుడికి సిఫార్సులేఖ రాశాడు. 'వాడిని ఎక్కడో అక్కడ కూర్చోబెట్టండి. ఏదో ఒకటి రాయనివ్వండి. వేస్తే వేయండి, లేకపోతే లేదు. నేను నెలనెలా కొంత మొత్తం పంపుతాను. దాన్నే జీతంగా ఇవ్వండి' అంటూ ఏకరువు పెట్టుకున్నాడు. మర్నాడు ఆ పత్రిక కార్యాలయం నుంచి ఉత్తరం వస్తే అప్పారావు అశ్వనీ నాచప్పలా పరుగెత్తుకుంటూ వెళ్లి సంపాదకుడితో, 'నాలోని ప్రతిభను చూసి ఉద్యోగం ఇచ్చారని భావిస్తున్నాను. మీరు ఏకీభవిస్తున్నారా?' అని అడిగాడు. ఆయన మౌనంగా తలూపి ఓ కుర్చీ చూపించాడు. వారం రోజులైనా ఏ పనీ చెప్పకపోయేసరికి అప్పారావుకి విసుగొచ్చింది. 'మీరు నాలోని విలేకరిని చంపేస్తున్నారు. తృష్ణని చిదిమేస్తున్నారు. ఆకాంక్షను అదిమేస్తున్నారు. ఎక్కడికైనా పంపండి' అన్నాడు.

సంపాదకుడు కాసేపు ఆలోచించి, 'సరే. సినిమా తార నగల దుకాణం ప్రారంభోత్సవానికి వస్తోంది. వెళ్లిరా' అన్నాడు.

అప్పారావు దూసుకుపోయాడు. అభిమానుల మధ్య నుంచి తోసుకుంటూ సినీతారను సమీపించి 'ఇంకా చేయడం లేదేం? గబగబా చేయండి' అన్నాడు.

ఆ తార తెల్లబోయి, 'ఏంటి చేసేది?' అంది.

'అదే... సందడి!'

'అంటే?'

'అంటే ఏంటేంటి? మీరు వచ్చి సందడి చేశారని పత్రికల్లో రాస్తుంటారు. నాకు తెలియదనుకున్నారా? ఆ సందడేదో చేయండి. మీరు ఎలా సందడి చేశారో చూసి చక్కగా రాస్తా. ఇంతకీ మీరు అందరి తారలు చేసే సందడే చేస్తారా? లేక కొత్త సందడేమైనా చేస్తారా?' అన్నాడు అప్పారావు.

ఆ తారకు తారలు కనిపించాయి.

తిరిగొచ్చిన అప్పారావు, 'ఆ తార నగల దుకాణంలో ఎలాంటి సందడీ చేయలేదు. కేవలం ప్రారంభోత్సవం చేసింది' అని రాశాడు. కానీ మర్నాడు పత్రికలో ఆ వార్త రాలేదు. మరో విలేకరి రాసిన వార్తలో సందడి చేసినట్టు వచ్చింది.

'ఇది అన్యాయం. అబద్ధపు పాత్రికేయం. అసలామె సందడి చేయందే?' అంటూ అప్పారావు ఎంత వాదించినా అందరూ నవ్వారే తప్ప జవాబివ్వలేదు.

మరోసారి అప్పారావు ఓ రాజకీయ నాయకుడు పెట్టిన విలేకరుల సమావేశానికి వెళ్లాడు. ఆరోజే జరిగిన అగ్నిప్రమాదం గురించి ఆయన మాట్లాడాడు. తిరిగొచ్చాక అప్పారావు, 'అగ్నిప్రమాదానికి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అయితే దిగ్భ్రాంతికి గురైన వారెవరూ కారులో విలేకరుల సమావేశానికి వచ్చి మాట్లాడలేరు. అలాగే జరిగిన దానికి ఎంతో విచారిస్తున్నానన్నారు. కానీ ఏడ్చిన దాఖలాలేవీ కనిపించలేదు. ఇదిలా ఉండగా, ఆయన బుగ్గలపై కన్నీటి చారికలు లేవు సరికదా, మధ్యలో నవ్వారు కూడా' అని రాశాడు. సంపాదకుడు పిలిచి ఇదేమిటని అడిగాడు.

'వాస్తవ పాత్రికేయం' అన్నాడు అప్పారావు. వెంటనే ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు.


ఓసారి అప్పారావు టీవీలో వార్తలు చదువుతున్న మెరుపుతీగలాంటి అమ్మాయిని చూశాడు. చూస్తూనే ప్రేమలో పడిపోయాడు. వెంటనే కాగితం అందుకుని ఉత్తరం రాశాడు.

'తొలి చూపులోనే నాకు నీ మీద ప్రేమ కలిగిందని నేను భావిస్తున్నానంటే నువ్వు ఆనందిస్తావని నొక్కివక్కాణిస్తున్నాను. అందుకే నా ప్రేమను పునరుద్ఘాటిస్తున్నాను. కాగా, ఇది కేవలం కాలక్షేపం ప్రేమ కాదని, ప్రత్యక్షర సత్యమని నిండు మనసుతో ప్రకటిస్తున్నాను. ఇదిలా ఉండగా, మనం పెళ్లి చేసుకుంటే పాత్రికేయంలో రెండు పార్శ్వాలు ఏకమవుతాయని మనవి చేసుకుంటున్నాను. ఆ విధంగా ముద్రణ మాధ్యమం, దృశ్య మాధ్యమం మమేకమై పరిఢవిల్లుతాయని నేనంటే నువ్వు కాదనవనే నమ్మకం నాకు ఉందని నీకు మరోసారి ధ్రువీకరించనక్కర్లేదని అనుకుంటున్నాను. నీ అంగీకారాన్ని స్వయంగా కానీ, పత్రికాముఖంగా కానీ, తెలియజేస్తే నా అంత అదృష్టవంతుడు మరెవరూ ఉండరని భావిస్తాను'.

ఆ ఉత్తరానికి ఆ అమ్మాయి నుంచి జవాబు వచ్చింది. 'మీకు నామీద ఉన్న ప్రేమను నేను పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతకు పదింతల ప్రేమ నాకూ మీ మీద కలిగిందని చెప్పడానికి ఏమాత్రం సంశయించనవసరం లేదని నేను భావిస్తున్నానంటే మీరెంత ఆనందిస్తారో నాకు తెలియనిది కాదు. మీరు చెప్పినట్టు మనిద్దరం ఏకమైతే, రెండు మాధ్యమాల మధ్య ప్రేమ బంధం, మూడు ముళ్లతో ముడిపడి, నాలుగు కాలాల పాటు చల్లగా, పంచభూతాల సాక్షిగా, ఆరు రుతువుల్లోనూ పచ్చగా ఉండేలా, మీతో ఏడడుగులు నడవడానికి అష్టకష్టాలైనా పడతానని, నవగ్రహాలను ఎదిరించైనా, పదిమంది ముందు పెళ్లి చేసుకోడానికి వెంటనే నడిచి వస్తానని చెప్పకనే చెబుతున్నాను'

అప్పారావు ఉత్తరాన్ని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు, ఆ అమ్మాయి ఉత్తరాన్ని అప్పారావు తన తల్లిదండ్రులకు చూపించారు. ఇరువైపుల పెద్దలు కలుసుకున్నారు.

అమ్మాయి తండ్రి గద్గద స్వరంతో, 'అసలు మా అమ్మాయికి పెళ్లవుతుందని మేం అనుకోలేదండి. ఆ టీవీ యజమాని నా స్నేహితుడే కావడంతో రాసిచ్చినవి మాత్రమే చదవాలనే షరతు మీద ఉద్యోగమిచ్చాడు' అన్నాడు.

అప్పారావు తండ్రి ఆయన్ని ఓదార్చి, 'అసలు వీళ్లకి ఈ తెలుగెలా వంటబట్టిందో తెలియడం లేదండి. వీడికెలా పెళ్లవుతుందని మేమూ బెంగ పెట్టుకుంటే మీ అమ్మాయి తారసపడింది' అన్నాడు.

'పోన్లెండి. దొందు దొందే. పెళ్లయ్యాక ఇద్దరూ మారతారేమో. ఒకవేళ మారకపోయినా వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటారు కాబట్టి మనకిక చింతలేదు' అని ఇద్దరి తరపున పెద్దలు నవ్వుకుని తాంబూలాలు పుచ్చేసుకున్నారు.

పెళ్లయ్యాక అప్పారావు దంపతుల చేత వేరు కాపురం పెట్టించారు. ఆరునెలలకి అప్పారావు మామగారికి ఉత్తరం రాశాడు.

'దైవ స్వరూపులైన మామగారి సముఖానికి! అల్లుడు అప్పారావు వ్రాయునది. నా భార్య అయిన మీ అమ్మాయి నెలతప్పిందని అభిజ్ఞవర్గాల భోగట్టా. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆమెకు రెండో నెలని తెలియవచ్చింది. అయితే ఈ విషయం ఇంకా నిర్ధరణ కావలసి ఉంది. వాస్తవాలు వెలికి వచ్చేంత వరకు ఎవరికీ చెప్పవద్దని వైద్యులు హెచ్చరించినా, మీ అమ్మాయి పట్టుబట్టడం వల్ల మీకు ఉత్తరం రాస్తున్నాను. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదని తెలుసుకోగలరు'

ఆయన ఆదరాబాదరా వియ్యంకుడి దగ్గరకి పరిగెత్తుకుని వచ్చి ఆ ఉత్తరంలో ఆఖరి వాక్యం చూపించి లబోదిబోమన్నాడు.

'మీరేం కంగారు పడకండి. అంటే మా వాడి ఉద్దేశం ఈ శుభవార్తను ముందుగానే చెప్పడంలో తన ప్రమేయం లేదని మాత్రమే. వాడి తెలుగు వాడిది. మనమేం చేస్తాం' అని సముదాయించాడు.

తేరుకున్నాక వియ్యంకులిద్దరూ ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. పుట్టిన మనవడిని కానీ, మనవరాలిని కానీ టీవీ లేని ఇంట్లో పెంచాలనీ! వార్తల ప్రపంచానికి దూరంగా ఉంచాలనీ!

                                                                       -ఎ.వి.ఎన్.హెచ్.ఎస్. శర్మ
PUBLISHED IN EENADU 'TELUGU VELUGU' MONTHLY MAGAZINE OCTOBER 2012 ISSUE.