శనివారం, ఏప్రిల్ 20, 2024

స్మరించండి! తరించండి!!


అనగనగా అయిదేళ్ల పిల్లాడు. తల్లి దాసి. ఆమె యజమాని కొందరు సన్యాసులకు నాలుగు నెలలు ఆతిథ్యమిచ్చాడు. దాసిని వారి సేవలకు నియోగించాడు. ఆ పిల్లాడు ఆ వేదపండితులకు మంచి నీళ్లు అందించడం, దర్భాసనాలు వేయడం, మడి బట్టలు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు. భగవంతుడి గురించి ఆ సన్యాసులు చేసే చర్చలను చాలా శ్రద్ధగా వినేవాడు. వాళ్లు చేసే నిత్య ఆరాధనా విధానాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాడు. ఆ పిల్లాడి వినయం, నడవడిక ఆ సన్యాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొన్నాళ్ల తర్వాత వాళ్లు వెళ్లిపోతూ, ఆ పిల్లాడిని దగ్గరకి పిలిచి భగవంతుడి తత్వం చెప్పి, ఒక మంత్రం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ పిల్లాడు ఆ మంత్రాన్నే నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. పరమాత్మను చూడాలని తపించేవాడు. కొన్ని రోజులకు ఆ పిల్లాడి తల్లి, పాము కరచి చనిపోయింది. అనాధగా మిగిలిన ఆ పిల్లాడు ఎక్కడెక్కడో తిరిగాడు. దొరికింది తినేవాడు. ఎక్కడున్నా, ఎటు పోతున్నా, రాత్రింబవళ్లు ఆ మంత్రాన్ని వదల లేదు. ఆ మంత్రమే అతడి లోకమైపోయింది. ఓ నిర్జనమైన ప్రశాంత ప్రదేశంలో అతడికి ధ్యానం కుదిరింది.  కొన్నాళ్లకు మహా విష్ణువు దర్శనమిచ్చాడు. ఆ తర్వాత అతడు పరమ భక్తుడై భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ, పాటలు పాడుతూ జీవితమంతా గడిపేశాడు. ఆ పుణ్యం ఫలితంగా ఆ తర్వాతి కల్పంలో అతడు బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించాడు. అతడే నారదుడు! తన పూర్వజన్మ గురించి వ్యాసుడికి స్వయంగా నారదుడే చెప్పాడు. దాసీ పుత్రుడిని, దేవర్షిగా మార్చిన ఆ మంత్రాన్ని వ్యాసుడు, భాగవతంలో అందించాడు.

ఆ మంత్రం తెలుసుకుందాం.

''నమో భగవతే తుభ్యం

వాసుదేవాయ ధీమహి

ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ

నమః సంకర్షణాయచ''

అద్భుతమైన ఈ మహా మంత్రాన్ని మనందరం స్మరిద్దాం. తరిద్దాం!

బుధవారం, ఏప్రిల్ 17, 2024

రామాయణం... మన జీవన పారాయణం!ఏడాదికోసారి నవమి రోజు 

తల్చుకునే దేవుడు కాడు రాముడు...

ప్రతి రోజూ నిత్యం స్మరించుకోవలసిన స్ఫూర్తిమంతుడు రాముడు!

రాముడు ఏమన్నడో గుర్తు చేసుకుంటే మనల్ని మనం సంస్కరించుకోవచ్చు!

రాముడు ఎలా ప్రవర్తించాడో జ్ఞప్తికి తెచ్చుకుంటే మన నడవడిని మనం తీర్చిదిద్దుకోవచ్చు!

రాముడి మార్గంలో నడిస్తే మన బతుకుల్ని మనం ఉద్ధరించుకోవచ్చు!

జీవితంలో ఏం జరిగినా దాన్ని తక్షణమే స్వీకరించి, ఆ తర్వాత ఏం చేయాలో దానికి సంసిద్ధమవ్వాలనే గొప్ప సందేశాన్ని రాముడు మానవాళికి అందించాడు. 

ప్రతి దశలోనూ మన కర్తవ్యమేంటో గుర్తించి దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్లాలని ఆచరించి చూపించాడు రాముడు.

ఆ కర్తవ్య నిర్వహణలో ధర్మం ఉందా లేదా అని తరచి చూసుకుంటే చాలు, ఎలాంటి పరిస్థితులలోనైనా చలించకుండా ముందుకు సాగిపోవచ్చనే ధైర్యాన్ని మనకి ఇచ్చాడు.

ఒక కొడుకుగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, ఒక రాజుగా, ఒక వ్యక్తిగా తన పాత్రను తాను అత్యున్నతంగా నిర్వహించాడు. పరబ్రహ్మమైనప్పటికీ, మానవుడిగా అవతారం దాల్చిన తర్వాత ఆ పాత్రలోనే ఒదిగిపోయాడు. ఆఖరికి బ్రహ్మాది దేవతలు కూడా ''సాక్షాత్తు దేవాధిదేవుడవు నీవు'' అని చెప్పినా ఒప్పుకోలేదు. ''నేను దశరథుడి పుత్రుడిని. మానవుడిని'' అని వినయంగా చెప్పి అవతార ధర్మాన్ని పాటించాడు. తద్వారా మానవులు మినహా ఎవరి చేతనైనా చావు లేకుండా వరమిచ్చిన బ్రహ్మ మాటను గౌరవించాడు. ఆ మాట కోసం మానవమాత్రుడిగా అష్టకష్టాలు పడ్డాడు. 

తండ్రి మాట కోసం అడవులకు వెళ్లిన రాముడు గురించి అందరికీ తెలుసు...

కానీ... ఆ తండ్రి మాటనే తిరస్కరించిన రాముడు కూడా రామాయణంలోనే కనిపిస్తాడు!

అవును... 

''రామా! నా మీద తిరుగుబాటు చెయ్యి. నన్ను ఖైదు చేసి రాజ్యాన్ని ఏలుకో'' అని దశరథుడే స్వయంగా రాముడికి చెప్పాడు. నారచీరలు కట్టుకుని వనవాసానికి బయల్దేరిన రాముడు ఆ మాటను వినమ్రంగా తిరస్కరించాడు.

''తండ్రి కాముకుడు. భార్య కోసం నిన్ను అడవులకు పంపుతానంటాడా? ఆ తండ్రిని ఎదిరించి నీకు రాజ్యం ఇస్తాను'' అంటూ రగిలిపోయిన లక్ష్మణుడి మాటను కాదని, అతడిని నిదానంగా నచ్చ చెప్పాడు.

''తండ్రి మాటే కాదు. తల్లి మాట వినడం కూడా ధర్మమే కదా? నన్ను కూడా నీతో పాటు అడవులకు తీసుకుపో. నువ్వు లేని చోట నేను ఉండలేను'' అని కౌసల్య అన్నప్పుడు ఆ తల్లి మాటను కూడా కాదన్నాడు.

అప్పుడు రాముడికి దారి చూపించింది ధర్మం. రాముడికి కర్తవ్యాన్ని బోధించింది ధర్మం. ఆ ధర్మాన్నే రాముడు ఆచరించాడు. దాన్ని ఆలంబనగా చేసుకునే అందరికీ జవాబు చెప్పగలిగాడు. 

''నేను రాజ్యాన్ని స్వీకరిస్తే తండ్రి అసత్యం పలికినట్టవుతుంది. ఆ దోషం వల్ల ఆయన నరకానికి వెళతాడు. తండ్రి నరకంలో ఉన్నప్పుడు నేను రాజ్యాన్ని అనుభవించగలనా?'' అని రాముడు అడిగితే లక్ష్మణుడి దగ్గర సమాధానం లేదు.

''నేను వనవాసాలకు వెళ్లానని కుమిలిపోతున్న నాన్నగారిని ఎవరు ఓదారుస్తారు? ఆయనకు ఈ సమయంలో తోడుగా ఉండే ధర్మం భార్యగా నీది కాదా?'' అని రాముడు చెబితే, తల్లి కౌసల్య ఇంకేం చెప్పగలుగుతుంది?

ఆఖరికి దశరథుడు, ''అయితే నీతో పాటు వనవాసానికి చతురంగ బలాల్ని కూడా తీసుకు వెళ్లు. సేవకులు, కళాకారులు కూడా నీతో పాటు వస్తారు'' అన్నాడు. ఆ మాటను సైతం సున్నితంగా తిరస్కరించాడు రాముడు.

''చతురంగ బలాలు, సైనికులు నా వెంట నడిస్తే అది భరతుడికి రాజ్యం ఇచ్చినట్టు కాదు కదా? అప్పుడు పినతల్లికి మీరు ఇచ్చిన మాట ఏమైనట్టు?'' అని ప్రశ్నించాడు. దశరథుడు మారు మాట్లాడలేకపోయాడు. 

అంతకు ముందు రోజు దశరథుడు పిలిపించి ''రేపే నీకు పట్టాభిషేకం'' అంటే, రాజధర్మం తెలిసిన పెద్ద కొడుకుగా అందుకు సిద్ధమయ్యాడు.

మర్నాడు మంగళ స్నానాలు చేసే వేళకి పరిస్థితి మొత్తం మారిపోయింది. 

పట్టు పీతాంబరాలు ధరించి, కిరీట ధారణ చేసి, బంగారు సింహాసనంపై కూర్చోవలసిన రాముడు, అప్పటికప్పుడు నార దుస్తులు ధరించి, అడవులకు వెళ్లాల్సి వచ్చింది. 

అంతవరకు యువరాజు. పాలరాతి భవంతుల్లో విహరిస్తూ, చుట్టూ సేవకులు అప్రమత్తమై సేవిస్తుండగా, పంచభక్ష్య పరమాన్నాలు ఆరగిస్తూ, హంస తూలికా తల్పాలపై పవళించిన సుకుమారుడు రాముడు.

అడవుల్లో అవేమీ ఉండవు. క్రూరమృగాల భయం. రాత్రి పడితే చీకటి. పురుగు, పుట్రా చూసుకోవాలి. తినడానికి కంద మూలాలు తవ్వుకోవాలి. కటిక నేలపై పడుకోవాలి. 

అయినా... చలించాడా రాముడు? 

మందహాసంతో ముందుకు సాగాడు. 

''అన్నా! నాన్నగారు చనిపోయారు. ఆయన మాట ఇంకా పాటించడం ఎందుకు? ఈ రాజ్యం నీది. వచ్చి పాలించు'' అంటూ వాదించిన భరతుడి మాటకు కూడా అంగీకరించలేదు. దశరథుడి నుంచి వరాలు పొందిన పినతల్లి కైకేయి స్వయంగా రమ్మని అడిగినా వినలేదు. 

తండ్రికి అసత్య దోషం కలుగకుండా చేయాలనే దృఢ సంకల్పం, ఆయన మరణంతో పాటు ఎలా సడలిపోతుంది? అందుకే పద్నాలుగేళ్ల సుదీర్ఘ వనవాసానికి రాముడు ముందడుగు వేశాడు. 

అడవుల్లో మాత్రం ఏం సుఖపడ్డాడని? అడుగడుగునా రాక్షసుల దాడులు. విరాధుడు సీతను ఎత్తుకుపోతే పోరాడి వధించాడు. శూర్పణఖ కామరూపం ధరించి వరించమని కోరితే, అలా చేయడం ధర్మం కాదన్నాడు. హద్దు మీరిన ఆ రక్కసిని లక్ష్మణుడు శిక్షించినందుకు ఖరదూషణాదులైన పద్నాలుగు వేల మంది రాక్షసులు వచ్చి చుట్టు ముట్టారు. వీరధర్మాన్ని ఆచరించి, రాముడొక్కడే అంతమందినీ నేలకూల్చాడు. 

చివరికి రావణాసురుడు మాయోపాయం పన్ని సీతకు అపహరించాడు.  భార్యా వియోగానికి రాముడు విలపించాడు కానీ, వెనుకడుగు వేయలేదు.

రావణాసురుడిని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన జటాయువును గుండెలకు హత్తుకుని కన్నీరు కార్చాడు. ఆ పక్షికి స్వయంగా అంత్యక్రియలు జరిపాడు. 

సీత కోసం అడవుల్లో అన్వేషిస్తుంటే కబంధుడు కబళించబోయాడు. ధీరోదాత్తుడై కత్తి దూసి, ఆ గండం నుంచి కూడా గట్టెక్కాడు.

భార్యను ఎవరెత్తుకెళ్లారో తెలియదు. ఎక్కడ దాచారో తెలియదు. ఎక్కడ వెతకాలో తెలియదు. కేవలం జటాయువు, శబరి చేసిన సూచనలను అనుసరించి ముందుకు సాగాడు. కిష్కింధ చేరాడు.

సుగ్రీవుడికి రాజ్యం లేదు.  అన్న వాలికి భయపడి ఎక్కడో తలదాచుకున్నాడు. ఈ దశలో రాముడు, కిష్కింధ రాజైన వాలితో స్నేహం చేస్తే సీతను వెతకడం సులవవుతుంది. కానీ రాముడు ఆ పని చేయలేదు. 

కారణం... ధర్మం!

తమ్ముడి భార్యను చెరబట్టిన వాలి, ఎంత బలవంతుడైనా తన స్నేహానికి తగడనుకున్నాడు. వాలిని చెట్టు చాటు నుంచి దండించి, అలా ఎందుకు చేశావని వాదించిన అతడికి ధర్మసూక్ష్మం తెలియజేశాడు. 

సముద్రంపై వారధి నిర్మించి వానర సైన్యంతో లంకను ముట్టడించాక కూడా శాంతి కోసమే ఆలోచించాడు. రావణుడి దగ్గరకు అంగదుడిని రాయబారిగా పంపుదామన్నాడు.

''ఇప్పుడు రాయబారమా?'' అని అడిగిన విభీషణుడికి, సుగ్రీవుడికి కూడా ధర్మం ఆధారంగానే సమాధానం చెప్పాడు. 

''మనకి వైరం రావణుడితోనే. యుద్ధం వస్తే రాక్షసులందరూ మరణిస్తారు. శత్రువుకి కూడా ఆఖరి అవకాశం ఇవ్వాలి'' అని రాముడు కాక ఇంకెవరు అనగలరు?

రావణాసురుడు చనిపోయాక విభీషణుడితో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాడు.

''అతడి మరణంతోనే శత్రుత్వం కూడా పోయింది'' అన్న రాముడి పలుకులు ఆనాటికే కాదు, ఈనాటికి కూడా ఆచరణీయాలు కాదా?

పుష్పక విమానంపై అయోధ్య సమీపానికి వచ్చిన రాముడు, హనుమంతుడికి ఒక పని అప్పగించాడు.

''వెళ్లు. భరతుడిని గమనించు. పద్నలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత, అతడిలో ఏమాత్రమైనా రాజ్యకాంక్ష కనిపిస్తే నాకు చెప్పు. నేను మళ్లీ అడవులకి వెళ్లిపోతాను''. 

వనవాసంలో అనేక కష్టాలు పడ్డాక, రావణాది రాక్షసులతో పోరాడి విజయం సాధించాక కూడా ఇలా అనగలిగాడంటే, ఆ రాముడికి మించిన ఆదర్శమూర్తి ఎవరుంటారు? 

అందుకే ఈనాటికీ మనం రాముడిని తల్చుకోవాలి!

ఏదైనా కష్టం వస్తే రాముడిని తల్చుకుని ధైర్యంగా నిలబడాలి. తర్వాతి కర్తవ్యమేంటో నిర్ణయించుకుని ముందడుగు వేయాలి.

ఈ పరమ సత్యం యుగాలు మారినంత మాత్రాన మాసిపోతుందా?

ఈ మహోన్నత వ్యక్తిత్వ లక్షణం ఎంతటి ఆధునిక కాలమైనా, ఆదరణకు నోచుకోకుండా ఉంటుందా?

అందుకే సృష్టికర్త బ్రహ్మ చెప్పినట్టు ''భూమి, పర్వతాలు, నక్షత్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది''!

రామాయణం, కేవలం ఒక గ్రంథం కాదు. 

మన బతుకు మార్గాన్ని సుగమం చేసే జీవన పారాయణం!
ఆదివారం, ఏప్రిల్ 14, 2024

దారుణాసురుడు!

''ఏంట్రోయ్‌... చెవిలో పువ్వెట్టావ్‌. నుదిటి మీద బొట్టెట్టావ్‌. కొత్త వేషమా?''

 ''అబ్బే... అదేం కాదండి. శ్రీరామ నవమి ఉత్సవాలు కదండీ? దార్లో గుడికెళ్లానండి. అదీ సంగతి...''

''పోన్లేరా... రామ దర్శనం చేసుకున్నావన్నమాట. మరేమని దండం పెట్టుకున్నావ్?''

''రాముడిని చూడగానే ఏం గుర్తొస్తుందండీ? రామరాజ్యమే కదా? మళ్లీ అదొచ్చేలా చూడు సామీ అనండి...''

''మరి ఆయనేమన్నాడు? అలాగేలే... ఇంటికి పోయి పడుకో. తెల్లారి లేచేసరికి రామరాజ్యం వచ్చేస్తది... అన్నాడా?''

''మీకు మరీ వెటకారమండి బాబూ! ఆఖరికి రాముడిని కూడా వదలరేంటండి? ఆయనెందుకలాగంటాడండి?''

''అనడ్రా... ఆ సంగతి నాకూ తెలుసు. అందుకనే అలాగన్నాను. అది వెటకారం కాదొరేయ్‌. నువ్వు కోరుకున్న రామ రాజ్యం రావాలంటే దానికి ఆయనేం చేస్తాడు? నువ్వే చేయాలి... అర్థమైందా?''

''ఊరుకోండి గురూగారూ! నేనేదో మీ దగ్గర రాజకీయాలు నేర్చుకుందామని తాపత్రయ పడుతున్నాను. ఇంకా ఓనమాలైనా ఒంటబట్టలేదు. ఇక నేనేంటండీ బాబూ చేసేది?''

''ఓరెర్రెదవా! ప్రతి వాడూ ఇలా అనుకోబట్టే రాజ్యం ఇలా తగలడింది. గుడి కనిపిస్తే చాలు, లోపలకి చక్కాబోయి, గంట కొట్టేసి, దండమోటి పెట్టేసి చక్కా వచ్చేస్తే సరిపోద్డేంట్రా? నీ వంతు ప్రయత్నం ఏంటో తెలుసుకుని అది చేయాలా వద్దా?''

''సరే సార్‌! అదేంటో మీరే చెబుదురూ? రామరాజ్యం రావాలంటే నేనేమి చేయాలో చెప్పండి...''

''ఏముందిరా? నీ చుట్టూ నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్న రాజ్యంలో పాలకుడు ఎవరు? వాడెలాంటి వాడు? రాముడా? రావణుడా? ఆడు చేసే పనులేంటి? ఆటి పర్యవసరానాలేంటి? ఇవన్నీ గమనించాలి కదా?''

''అయ్యా... మీరు పాఠం మొదలెట్టేశారని అర్థమైందండి. అయినా నేనొట్టి సామాన్యుడిని సర్‌. నేనేంటో, నా బతుకేంటో చూసుకుంటానా? ఇవన్నీ పట్టించుకుంటానా? తెల్లారి లేస్తే నా కుటుంబం, నా సంపాదన గురించి ఆలోచించడానికే తీరిక లేదు. ఇక తతిమ్మావన్నీ ఎలా నెత్తికెక్కించుకుంటాను చెప్పండి?''

''సరేలేరా... నువ్వేమీ చేయక్కర్లేదులే. నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. వాటికి సమాధానాలు చెప్పు చాలు...''

''అమ్మయ్య... అలాగన్నారు, బాగుందండి. అడగండి సర్, నాకు తోచిన జవాబులు చెబుతా...''

''ఐదేళ్ల క్రితం ఓటేశావా?''

''వేశానండి...''

''మరి ఈ ఐదేళ్లలో నీ బతుకు ఏమైనా మారిందా?''

''ఎక్కడండీ? ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుందండి...''

''పోనీ నీ వీధిలో, నీ ఊరిలో వాళ్ల పరిస్థితి ఏంటి?''

''ఏముందండీ? తెల్లారి లేచి పని మీద బయటకొస్తే వీధి చెండాలమండి. గుంతలూ గోతులూనండి. ఊరంతా అంతేనండి బాబూ. అంతే కాదండి. ఊరు దాటి ఎటెళ్లినా, ఎక్కడికెళ్లినా ఇంతేనండి. నా వీధిలో నాలుగు రకాల వాళ్లూ ఉన్నారండి. ఆరందరి పరిస్థితి కూడా ఎదుగూ బొదుగూ లేదండి. చదువుకున్నోళ్లకి ఉద్యోగాల్లేవండి. పనికెళ్దారంటే అవకాశాల్లేవండి. అందరం ఉసూరుమంటూనే ఉన్నామండి...''

''బాగా చెప్పావురా. ఇదే నీ చుట్టూ నువ్వు గమనించడమంటే. మరి కొంచెం లోతుగా ఆలోచించి చెప్పు. నువ్వు చూస్తుండగానే, నీ కళ్ల ముందు  ఇస్త్రీ చేసిన కొత్త నోటుగా కళకళలాడిపోయినోళ్లు ఎవరూ లేరంటావా?''

''ఎందుకంటానండీ? ఉన్నారండి. కానీ వాళ్లంతా బతకనేర్చిన వాళ్లండి బాబూ. ఒకడేమో మా ఎమ్మెల్యే అనుచరుడండి. అంతక్రితం స్కూటీ వేసుకు తిరిగేవోడల్లా ఇప్పుడు కారేసుకు తిరుగుతున్నాడండి. కొత్తిల్లు కట్టుకుని పిలిస్తే గృహప్రవేశానికి వెళ్లి భోంచేసి వచ్చానండి.  పలకరిస్తే ప్రభుత్వం పనులు చేస్తున్నానన్నాడండి. మరొకడున్నాడండి. మన అధికార పార్టీ లేందండీ? ఆళ్లతో ఊరేగుతుంటాడండి. అంతక్రితం సిసింద్రీలా ఉన్నచోటే తిరిగేటోండండి. ఇప్పుడు తారాజువ్వలా ఎగిరిపోయాడండి. అడిగితే, అస్సలు తీరిక లేదురా... ప్రాజెక్టులు, టెండర్లు చేస్తున్నానన్నాడండి.  మరి జనం కోసం పనులు చేసేప్పుడు ఆ మాత్రం ఎదగడంలో ఆశ్చర్యమేముందండీ?''

''సరేరా... మరి ఈళ్లంతగా జనం కోసం పనులు చేసేస్తే, మీ ఊరేంట్రా అలాగే ఉంది? కనీసం రోడ్లు కూడా లేవన్నావుగా? ఇక ఆళ్లు చేసేదేంటని ఎప్పుడైనా ఆలోచించావా?''

''పాయంటేనండి. కానీ ఇవన్నీ ఆలోచించే బతుకేంటండి నాది? మీరే కాస్త విడమర్చి చెబితే అర్థం చేసుకుంటానండి...''

''ఇంకా చెప్పేదేముందిరా. నువ్వు కానీ, నీ ఊర్లో సామాన్యులు కానీ ఎలాగున్న వాళ్లు అలాగే ఉన్నారు. కానీ అధికార పార్టీ నాయకులు, ఆళ్లతో రాసుకుపూసుకు తిరిగేటోళ్లు, అంటకాగేటోళ్లు, అనుచురులు, అనుయాయులు మాత్రం నీ కళ్ల ముందే ఎదిగిపోయి మేడలు, మిద్దెలు కట్టుకున్నారు. పోనీ వాళ్లు చేసే పనుల వల్ల ఊరేమైనా బాగుపడిందా అంటే అదీ లేదు. దీనిబట్టి ప్రజా పనుల పేరు చెప్పి వీళ్లంతా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారనే కదా అర్థం?''

''అవునండోయ్‌! అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారండి. మరైతే దానికీ, నేను రాములోరిని కోరుకున్న రామరాజ్యానికి సంబంధం ఏంటండి?''

''ఎందుకు లేదురా. అసలు రామరాజ్యం ఎప్పుడొచ్చింది?''

''ఇంకెప్పుడండీ? రావణాసురుడు పోయినప్పుడండి...''

''మరిప్పుడు కూడా అదే రావాలంటే ఏం జరగాలి?''

''ఇప్పుడున్న.... అయ్యబాబోయ్‌! మీరేంటండి బాబూ? నన్ను మాటల్లో పెట్టి వాగించేస్తన్నారు. గోడలకు చెవులుంటాయండి. ఎవరైనా విన్నారంటే కేసులెట్టి ఇద్దర్నీ బొక్కలిరగదన్ని, బొక్కలో తోస్తారండి. ఇక ఊచల్లెక్కబెడుతూ చెప్పుకోవాలండి రాజకీయాలు. ఊరుకోండి బాబూ...''

''వార్నీ... అంతలా భయపడుతున్నావంటే ఏంట్రా దానర్థం? సామాన్య జనానికెక్కడా శాంతి భద్రతలు లేవన్నమాటేగా? మరలాంటప్పుడు ఇప్పుడున్నది ఏ రాజ్యమంటావురా?''

''నేను చెప్పనండి బాబూ. మీరే చెప్పండి...''

''ఓరి పిరికిసన్నాసీ! నేనే చెబుతాను వినుకోరా. ఐదేళ్ల క్రితం జనవాసంలోకి ఓ రాక్షసుడు వచ్చాడు. మాయలు పన్నాడు. బంగారు మాయ లేడిని చూపించి ఆశపెట్టాడు. వంచించి ప్రజల సుఖశాంతులు అపహరించాడు. ఇప్పుడు జరుగుతున్నది దారుణ రాజ్యం. దీని పాలకుడు దారుణాసురుడు. ఆనాటి రావణాసురుడికి పదే తలకాయలు. వీడికి మాత్రం వంద తలకాయలు. ఒక తల నవ్వుతూ నయవంచన చేస్తుంది. రెండో తల వికటాట్టహాసం చేస్తూ దౌర్జన్యాలు చేయిస్తుంది. ఇంకో తల నోరు తెరిచి ప్రజాధనాన్ని స్వాహా చేస్తుంది.  మరో తల కోరలు సాచి కబళిస్తుంది. ఒక తల గనులు భోంచేస్తే, మరో తల కొండలు ఆరగిస్తుంది. ఆ పక్కది ప్రజా భూముల్ని నమిలేస్తుంది. మరొకటి ఖజానా సొమ్మును భోంచేస్తుంది. ఓ తల మంటలు కక్కుతుంటే, మరొకటి విషజ్వాలలు వెలిగక్కుతుంది. ఒక వదనంలో దౌర్జన్యం తాండవిస్తుంది. మరో ముఖంలో కర్కశత్వం ఉట్టిపడుతుంది. ఒక తల పగపడుతుంది. ఇంకోటి కక్షకడుతుంది. ఒకటి కావేషం. మరొకటి కాఠిన్యం. ఆ పక్కది కుటిలత్వం. దాని పక్కది కర్కశత్వం. అన్నీ నోళ్లు తెరుచుకుని ఉండగా, వాటి కోరల్లో సామాన్యుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. శాంతి భద్రతలు చితికి పోతున్నాయి...''

''మహాప్రభో! ఇక ఆపండి. మీరు చెబుతుంటే ఆ దారుణాసురుడి విశ్వరూపం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నా కళ్లు తిరుగుతున్నాయి. కాళ్లు వణుకుతున్నాయి. నోరెండిపోతోంది. స్పృహ తప్పుతోంది...''

''ఇంత చెబితే కానీ నీకర్థం కాలేదురా మరి. ఇక తెప్పరిల్లు. తెలివి తెచ్చుకో. ఇంద... ఈ మంచి నీళ్లు తాగు...''

''అమ్మయ్య. కాస్త కుదుట పడ్డానండి. మరిప్పుడు ఈ దారుణ రాజ్యం పోవాలంటే ఎలాగండీ? ఆ రాముడు మరో అవతారం ఎత్తాలంటారా?''

''అక్కర్లేదురా. తల్చుకుంటే నువ్వే రాముడివి. నీ చేతిలో ఉన్న ఓటే రామబాణం. వివేకమనే విల్లు ఎక్కుపెట్టి, ఆ రామబాణాన్ని సంధించు. గురి చూసి వదులు. దారుణాసురుడు పోతాడు. రామరాజ్యం వస్తుంది. ఇక పోయిరా!''

-సృజన

PUBLISHED ON 14.4.24 ON JANASENA WEBSITE

శుక్రవారం, ఏప్రిల్ 12, 2024

శ్రీరామ జననం... సకల జన రంజనం! (పిల్లల కోసం రాముడి కథ-6)

 

దశరథుడు అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలను శోభాయమానంగా పూర్తి చేశాడు. దేవతలందరూ హవిస్సులు స్వీకరించి సంతోషంతో తమ స్థానాలకు వెళ్లారు. దశరథుడు తన రాణులతో కలిసి యాగశాల నుంచి అయోధ్య నగరానికి చేరుకున్నాడు. యాగానికి వచ్చిన రాజులను, అతిథులను దశరథుడు తగిన రీతిలో సన్మానించాడు. వారందరూ సంతృప్తిగా తమ తమ నగరాలకు ప్రయాణమై వెళ్లిపోయారు. యాగ నిర్వహణ చేసిన రుష్యశృంగుడిని దశరథుడు సాదరంగా పూజించాడు. ఆ మహర్షి, తన భార్య అయిత శాంతతోను, అంగరాజైన రోమపాదుడుతోను కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. 

పుత్రకామేష్టి యాగం తర్వాత 12 నెలలు గడిచాయి. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్య శ్రీరాముడిని ప్రసవించింది. మహా విష్ణువు అంశతో లోకోద్ధారకుడైన శ్రీరాముడు అవతరించే సమయానికి సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అనే అయిదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఆ మరునాడు, అంటే చైత్రశుద్ధ దశమి నాడు పుష్యమి నక్షత్రంలో భరతుడికి కైకేయి జన్మనిచ్చింది. అదే రోజు అంటే చైత్రశుద్ధ దశమినాడు ఆశ్లేషా నక్షత్రంలో సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. 

దశరథుడికి నలుగురు పుత్రులు పుట్టిన వేళ గంధర్వులు మధురంగా గానం చేశారు. అస్సరసలు నాట్యం చేశారు. దేవ దుందుభులు మ్రోగాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఇక కోసల రాజ్య పౌరుల ఆనందానికి అంతే లేకపోయింది. రాజవీధులన్నీ ప్రజల కోలాహలంతో మారుమోగిపోయాయి. నృత్య గాన వినోదాలతో అయోధ్య వాసులు ఆనంద పరవశులయ్యారు. వందిమాగధులు స్తోత్రాలు పఠించారు.  పరమానంద భరితుడైన దశరథుడు గొప్పగా దాన ధర్మాలు చేశాడు. బ్రాహ్మణులకు వేలాది గోవులను, పౌరాణికులకు ధన కనక వస్తు వాహనాలను దానం చేశాడు. 

పుత్రులు పుట్టిన పదకొండు రోజులకు కులగురవైన వశిష్ణుడు, పిల్లలకు జాత కర్మ, నామకరణ  ఉత్సవాలు ఘనంగా  జరిపించాడు. 

తన గుణాలతో అందరినీ ఆనందింప జేసేవాడు కాబట్టి పెద్ద కుమారుడికి రాముడు అని పేరు పెట్టాడు. రాజ్య భారాన్ని భరించగలవాడు కాబట్టి కైకేయి కుమారుడికి భరతుడని నామకరణం చేశాడు. సర్వ సంపదలతో శోభిల్లేవాడనే ఉద్దేశంతో లక్ష్మణుడని, శత్రువులను తుద ముట్టిస్తాడు కనుక శత్రుఘ్నుడని సుమిత్ర పుత్రులకు పేర్లు పెట్టాడు. 

రాముడు లక్ష్మణుడు ఎప్పుడూ కలిసి ఉండేవారు. అలాగే భరతుడు, శత్రుఘ్నుడు జంటగా ఉండేవారు. లక్ష్మణుడు లేకపోతే రాముడు నిద్ర కూడా పోయేవాడు కాడు. కంటి ముందు మధుర పదార్థాలు ఉన్నా, లక్ష్మణుడు లేనిదే తినేవాడు కాడు. నలుగురు పిల్లలూ  పెరిగి పెద్దవారవసాగారు.  పుత్రులను చూసుకుంటూ దశరథుడు పరమానందాన్ని పొందుతూ ఉండేవాడు. 

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు క్రమంగా వేద శాస్త్రాలు అభ్యసించారు. విలువిద్యలో ఆరితేరారు. మంచి గుణాలతో, చక్కని నడవడికతో, వినయ విధేయతలతో అందరినీ ఆకట్టుకునే ఈ నలుగురూ యుక్తవయస్కులు అయ్యారు. దశరథుడు తన పుత్రుల వివాహాల గురించి ఆలోచనలు కూడా చేయసాగాడు. 

రామ కల్యాణానికే కాదు, లోక కల్యాణానికి కూడా సమయం ఆసన్నమైంది. అందుకే విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరానికి వేంచేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

తరలి వచ్చిన రామదండు! (పిల్లల కోసం రాముడి కథ-5)


 

సోమవారం, ఏప్రిల్ 01, 2024

తరలి వచ్చిన రామదండు!


 

లోక కంటకుడైన రావణ సంహారం కోసం, దశరథుడి కుమారుడిగా అవతరించడానికి మహావిష్ణువు సంకల్పించిన తర్వాత బ్రహ్మదేవుడు భవిష్యత్తు పరిమాణాలను అవలోకించాడు. రాముడిగా జన్మించనున్న విష్ణువుకి సహాయపడడానికి రామదండును సిద్ధం చేయదలిచాడు. ఆ ఉద్దేశంతో దేవతలందరికీ ఆదేశాలు జారీ చేశాడు.

''దేవతలారా! ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగినా అప్పుడల్లా విష్ణు భగవానుడు అవతరించి దుష్టులను శిక్షించి, సమస్త ప్రాణకోటికీ సుఖసంతోషాలు కలిగిస్తాడు. ఇప్పుడాయన దశరథుడికి కుమారుడిగా పుట్టనున్నాడు. రావణాది రాక్షసుల సంహారంలో ఆయనకు సహాయపడడానికి మీరంతా కూడా భూలోకంలో మీ అంశలతో మహా వీరులను సృష్టించండి. వారంతా అమిత బలశాలురై వాయువేగంతో చరించగలగాలి. కోరిన రూపాన్ని పొందగలిగే కామరూపులై ఉండాలి. అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో నిపుణులై ఉండాలి. అప్సరసలు, గంధర్వ స్త్రీలు, యక్షవనితలు, నాగకన్యలు, విద్యాధర యువతులు, కిన్నెర మహిళలు, వానర స్త్రీలలో మీ అంశలను ప్రవేశపెట్టి యోధానుయోధులైన వానర సైన్యాన్ని సృష్టించండి'' అంటూ అనుజ్ఙ ఇచ్చాడు.

ఈ సందర్భంలోనే బ్రహ్మదేవుడు జాంబవంతుడి జన్మ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

దాని ప్రకారం, ఒకసారి బ్రహ్మ ఆవులించినప్పుడు ఆయన నోటి నుంచి మహావీరుడు పుట్టుకొచ్చాడు. అతడే భల్లూక రాజైన జాంబవంతుడు.  ''రాముడికి సహయపడడానికి మీరు సృష్టించే వానర యోధులందరికీ జాంబవంతుడు అండగా ఉంటాడు'' అంటూ బ్రహ్మ దేవుడు ముగించాడు.

వెంటనే దేవతలందరూ రుషి, సిద్ధ, విద్యాధర, నాగ, చారణ, గంధర్వ, అప్సరసలైన వేర్వేరు స్త్రీల ద్వారా వానర, భల్లూక వీరులను పుత్రులుగా ప్రభవింపజేశారు. దేవేంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి ప్రభావంతో సుగ్రీవుడు పుట్టాడు. వాయుదేవుని అంశతో హనుమంతుడు అవతరించాడు. ఇలా... దేవగురువు బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకు నలుడు, అగ్నికి నీలుడు, అశ్వనీదేవతల  వల్ల మైంద ద్వివిదులూ, వరుణుడికి సుషేణుడు, పర్జన్యుడికి శరభుడు జన్మించారు. వీరంతా మహా పరాక్రమవంతులైన వానర యోధులు. ఇతర దేవతల వల్ల లక్షల సంఖ్యలో రామదండు పుట్టింది. వీరంతా వానర, భల్లూక, గోపుచ్ఛ జాతులలో బలపరాక్రమాలతో పుట్టారు. అందరూ వజ్రకాయులు, మహాకాయులు, కామరూపులు, అమిత బల పరాక్రమ వంతులు. పర్వతాలను సైతం చలింపజేయగలరు. సముద్రాన్ని కల్లోల పరచగలరు. పెను వృక్షాలను సైతం పెకలించగలరు. పెద్ద పెద్ద బండరాళ్లను   బంతుల్లా పట్టుకుని విసరగలవారు. ఆకాశంలో ఎగరగలరు. సింహాల్లాంటి క్రూర మృగాలను కూడా బెదరగొట్టగలరు. మదపుటేనుగులను సైతం అదుపు చేయగలవారు. రుక్షరజుని కుమారులుగా పుట్టిన వాలి సుగ్రీవులిద్దరూ నలుడు, నీలుడు, హనుమంతుడు తదితరులను మంత్రులుగా చేసుకుని రుష్యమూకమనే పర్వతం దగ్గర రాజ్యాన్నిఏర్పరుచుకుని వానర, భల్లూక సైన్యానికి నాయకులుగా ఉండసాగారు.

అలా రాముడికి సాయపడడానికి పుట్టిన వానరులంతా భూమండలమంతా వ్యాపించి వర్థిల్లారు. రావణ సంహారానికి సైన్యం సిద్ధమైంది. ఇక వారిని నడిపించే ప్రభువైన రామచంద్రుడు అవతరించడానికి సమయం ఆసన్నమైంది. వచ్చే భాగంలో రామజననం గురించి తెలుసుకుందాం! జై శ్రీరామ్‌!!