ఆదివారం, ఆగస్టు 28, 2022

వినాయ‌కుడి మీమాంస‌!


 

కైలాసంలో వినాయ‌కుడు తొండం గుండ్రంగా చుట్టి బుంగ‌మూతి పెట్టుకుని కూర్చున్నాడు. పార్వ‌తి న‌చ్చ‌చెప్పినా విన‌డం లేదు.

"అలా కాదు విఘ్నూ! ఏటా వినాయ‌క చ‌వితికి భూలోకానికి వేంచేయ‌డం నీకు అల‌వాటే క‌దా? మ‌రీసారి ఇలా మారాం చేస్తున్నావేం?" అంది పార్వ‌తి అత‌డి బొజ్జ నిమిరి బుజ్జ‌గిస్తూ.

"నేను వెళ్ల‌నంటున్న‌ది భూలోకానికి కాదు. ఆంధ్ర‌దేశానికి..." అన్నాడు వినాయ‌కుడు విసుగ్గా.

శివుడు జోక్యం చేసుకున్నాడు.

"అదేమిటి వినాయ‌కా! ఆంధ్రదేశంలో మాత్రం భ‌క్తులు లేరా? అక్క‌డ సైతం పండుగ జర‌గ‌దా? అదీ కాక ప్ర‌త్యేకంగా ఒక ప్రాంతానికి వెళ్ల‌న‌న‌డం స‌క‌ల జ‌న హితుడ‌వు, దీన జ‌న బాంధ‌వుడ‌వు అయిన నీకు త‌గునా?" అంటూ అడిగాడు శివుడు.

"అదికాదు తండ్రీ... వెన‌కా ముందూ చూడ‌కుండా మీలా నేను వ‌రాలు గుప్పించ‌లేను. ఆన‌క చిక్కుల్లో ప‌డ‌లేను. అందుకే ఆలోచిస్తున్నాను..." అన్నాడు వినాయ‌కుడు.

శివుడు ఆశ్చ‌ర్య‌పోయి, "అదేమిటి విఘ్న‌నాయ‌కా! ఆంధ్ర ప్ర‌జ‌లు చేసుకున్న పాప‌మేమి?  వారి కోరుకునే వ‌రాలు అంత అసాధ్య‌మైన‌వా ఏమి?" అన్నాడు.

"అస్స‌లు కాదు తండ్రీ! ఆ ప్ర‌జ‌ల కోరిక‌లు అత్యంత స‌మంజ‌స‌మైన‌వే. కానీ అవి అంత తొంద‌ర‌గా తీరేవి కావు. అందుకనే ఆలోచిస్తున్నాను..." అన్నాడు వినాయ‌కుడు త‌ట‌ప‌టాయిస్తూ.

"కార‌ణం?" అన్నాడు శివుడు అయోమ‌యంగా.

"అక్క‌డి నాయ‌కుడు... అత‌డి ప‌రిపాల‌న చిత్ర‌విచిత్ర‌ముగా సాగుతున్న‌ది. అక్క‌డి జ‌నం నీరాజ‌నం ప‌ట్టి మ‌రీ అధికారం అందించిన నాయ‌కుడ‌త‌డు. కానీ అధికార పీఠం ఎక్క‌గానే అత‌డి వ్య‌వ‌హార శైలి క‌డు వింత‌గా మారిన‌ది. చెప్పేదొక‌టి, చేసేదొక‌టి. ఆత‌డి రాజ‌కీయ విన్యాసాల నేప‌థ్యంలో నా వ‌రాలు సైతం వెంట‌నే ఫ‌లించ‌ని వింత ప‌రిస్థితులు అక్క‌డ రాజ్య‌మేలుతున్న‌వి. నా మాట‌లు మీకు విచిత్ర‌ముగా తోచ‌వ‌చ్చు. కానీ మీరే ఒక్క‌సారి అక్క‌డి సామాన్యుల వెత‌లు వినుడు..." అంటూ వినాయ‌కుడు అక్క‌డ తారాడుగున్న మేఘాల దొంత‌ర‌ను ప‌క్క‌కు జ‌రిపాడు. కింద ఆంధ్ర‌దేశ‌ము స్ప‌ష్ట‌ముగా క‌నిపిస్తోంది. కైలాస వాసులంద‌రూ కింద‌కు చూశారు.

****

బ‌క్క‌చిక్కిన ఓ రైతు వినాయ‌కుడి పందిరిలోకి వ‌చ్చి కూర్చున్నాడు. అత‌డి మ‌న‌సులోని కోరిక లౌడ్‌స్పీక‌రులో వినిపించిన‌ట్టు కైలాసంలో ప్ర‌తిధ్వనించ సాగింది.

"వినాయ‌కా తండ్రీ... ఆరుగాలం శ్రమించినా ఫ‌లితం ద‌క్క‌డం లేదు. పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేదు. ద‌ళారుల గుప్పెట్లో చిక్కుకుని విల‌విల‌లాడాల్సి వ‌స్తోంది. ఆత్మ‌హ‌త్య త‌ప్ప దిక్కులేని దుస్థితిలో నాలాంటి రైత‌న్న‌లు ఎంద‌రో ఉన్నారు తండ్రీ... కాస్త మా ప‌రిస్థితి మారేట‌ట్టు క‌నిక‌రించు..."

వినాయ‌కుడు వివ‌రించాడు.

"చూశారా... ఎంత న్యాయ‌మైన కోరికో. కానీ అక్క‌డి అన్న‌దాత‌ల ప‌రిస్థితి ఒక్క వ‌రంతో  చటుక్కున తీరేది కాదు. స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో చిక్కుకుని పోయార‌క్క‌డి క‌ర్ష‌కులు. ఓ ప‌క్క సాగు ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగిపోయాయి. ఇక‌ ఎరువుల ధ‌ర‌లు ఆకాశాన్నంటున్నాయి. మ‌రో ప‌క్క వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్లో ధ‌ర‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్టు పెంచి అమ్ముతున్నారు. రైతన్న‌ల అవ‌స‌రాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అవ‌స‌రాన్ని ముందుగానే ఊహించి ఎరువుల నిల్వ‌లు స‌మృద్ధిగా ఉంచాల్సిన ప్ర‌భుత్వం చోద్యం చూస్తున్న‌ది. పైగా త‌మ‌ది రైతు బాంధ‌వ ప్ర‌భుత్వమంటూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌క్క‌డి నేతలు. ఎరువులు, విత్త‌నాలు, పురుగుమందులు ఇత్యాది స‌క‌ల సామ‌గ్రిని రైతు భ‌రోసా కేంద్రాల‌లో అందుబాటులో ఉంచుతామంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వ‌చ్చిన అక్క‌డి అధినేత దృష్టంతా ప్ర‌చారం మీద‌నే త‌ప్ప ప్ర‌జ‌ల మీద లేదు..." అంటూ నిట్టూర్చాడు వినాయ‌కుడు.

****

ఇంత‌లో వినాయ‌కుడి పందిట్లోకి ఓ మ‌హిళ వ‌చ్చింది. ఆమె కోరిక కూడా కైలాసంలో విన‌బ‌డ‌సాగింది.

"ఈ న‌వ‌రాత్రుల్లోనైనా నిషా జోలికి పోమాకురా మ‌గ‌డా అంటే మా ఆయ‌న వినడం లేదు వినాయ‌కా. రోజూ తాగొచ్చి ఇల్లు  గుల్ల సేత్త‌న్నాడు. పైగా కొత్త కొత్త బ్రాండ్లంటూ ఎగ‌బ‌డి నాసిరకం మ‌ద్యం తాగ‌తా ఆరోగ్యం పాడు చేసుకుంటన్నాడు. మ‌ద్యంలో అయ్యేవో ర‌సాయ‌నాలు తెగ క‌లిపేత్త‌న్నారంట‌. సెబితే ఇనిపించుకోడు. నా సంసారం ఎప్పటికి బాగు ప‌డుద్దో ఏంటో... నువ్వే ఓ సూపు సూడాల సామీ..."

"పాపం... చూశావా అమ్మా. నాన్న‌గారు లోకోప‌కారం కోసం కాల‌కూట విషాన్ని కంఠంలో పెట్టుకున్నారు కానీ, ఆంధ్ర దేశంలో నాసిర‌కం మ‌ద్యం, నాటు సారాల‌నే గ‌ర‌ళాన్ని సామాన్యులు తాగ‌కుండా మాత్రం నివారించ‌లేరు. ఎందుకంటే... ఎక్క‌డ ప‌డితే అక్కడ ఆ మ‌ద్యం, సారాలు దొరికేలా అక్క‌డి ప్ర‌భుత్వమే చేస్తున్న‌ది. ఆఖ‌రికి ఫోన్ కొడితే సీసాల్ని హోమ్ డెలివ‌రీ చేసేంత‌గా అక్క‌డి వ్య‌వ‌హారం మితిపోయింది.  ఎందుకంటే మ‌ద్యం అమ్మ‌కాల మీద వ‌చ్చే ల‌క్ష‌లాది కోట్ల రూపాయలే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా అక్క‌డి ప్ర‌భుత్వానికి మారింది. మీకో దారుణ‌మైన సంగ‌తి చెప్ప‌నా? అక్కడి అధినేత సంపూర్ణ మ‌ద్య నిషేధం చేస్తానంటూ ఊరూవాడా వాగ్దానాలు గుప్పించి, ఆడ‌ప‌డుచుల‌ను న‌మ్మించి మ‌రీ అధికారంలోకి వ‌చ్చాడు. కానీ సింహాసనం ఎక్కాక అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అక్క‌డి నేత‌ల అస్మ‌దీయుల‌కే మ‌ద్యం కాంట్రాక్టులు, ఫ్యాక్ట‌రీలు క‌ట్ట‌బెట్టారు. పైగా మ‌ద్యం అమ్మ‌కాల‌పై రాబోయే ఆదాయాన్ని కూడా అక్క‌డి నాయ‌కుడు త‌న‌ఖా పెట్టి మ‌రీ అప్పులు చేశాడు. ఈ దారుణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అక్క‌డి ఆడ‌ప‌డుచుల బాధ త‌ల్చుకుంటేనే బాధ క‌లుగుతోంది..." అంటూ వివ‌రించాడు వినాయ‌కుడు.

****

ఈసారి వినాయ‌కుడి ముందుకి ఓ కుటుంబం వ‌చ్చింది. అమ్మా, నాన్న, బాబు, పాప‌. వాళ్లు వినాయ‌కుడి ముందు ఓ పుష్పం పెట్టి విన‌యంగా న‌మ‌స్క‌రిస్తూ క‌ళ్లు మూసుకున్నారు.

"ఏం చెయ్యం స్వామీ?  నీకు దండిగా పిండివంట‌లు, కానుక‌లు స‌మ‌ర్పించుకుందామ‌నుకున్నా వీలు కుద‌ర‌లేదు. అన్ని స‌రుకుల ధ‌ర‌లు పెరిగిపోయాయి. నిత్యావ‌స‌రాలు కూడా కొనుక్కోలేక నిట్టూరుస్తున్నాము. పైగా ర‌క‌ర‌కాల ప‌న్నులు విధిస్తూ పీల్చిపిప్పి చేస్తున్నారు. ఈ ఏడాదైనా ఓ ఇల్లు క‌ట్టుకుందామ‌నుకుంటే ఎక్క‌డా సాధ్య‌మ‌య్యేలా లేదు స్వామీ. నెల నెలా వ‌చ్చే జీత‌మే ఎప్పుడొస్తుందో తెలియ‌కుండా ఉంది..."  అంటూ ఆ ఇంటాయిన గోస‌కి కైలాసం ఖంగుమంది.

"వినాయ‌కా! మా కుటుంబాన్ని చ‌ల్ల‌గా చూడు తండ్రీ. ఎక్కడ చూసినా దౌర్జ‌న్యం పెరిగిపోయింది. మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు మితిమీరి పోతున్నాయి. మా బాబుని, పాప‌ని చ‌ల్ల‌గా చూడు..."

వినాయ‌కుడు నిట్టూర్చి చెప్ప‌సాగాడు.

"అమ్మా, నాన్నా విన్నారా?  కైలాసంలో మ‌న కుటుంబం మంచుకొండ‌ల మ‌ధ్య చ‌ల్ల‌గానే ఉంది. కానీ అక్క‌డ ఆ కుటుంబం మాత్రం అలా లేదు. ఆయ‌న‌కి ఇల్లు క‌ట్టుకోవాల‌నే కోరిక పాపం. కానీ ఇసుక సైతం స‌క్ర‌మంగా దొర‌క‌ని ప‌రిస్థితి అక్క‌డ తాండ‌విస్తోంది. చ‌ల్ల‌ని గోదావ‌రి పారుతున్నా, తీర‌ప్రాంత‌మంతా ఇసుక ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఉన్నా, ఇసుక ధ‌ర మాత్రం ఆకాశంలోకి చేరింది. అది కూడా బ్లాకులో అధిక ధ‌ర పెట్టుకుని కొనుక్కుంటే త‌ప్ప దొర‌క‌ని దుస్థితి. ఇక సిమెంటు, ఇనుము ఇలా ప్ర‌తి స‌రుకు ధ‌ర‌లు పెరిగిపోయి సొంతింటి కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న ఇలాంటి కుటుంబాలెన్నో అక్క‌డ క‌నిపిస్తున్నాయి. ఆ మ‌హిళ ఆక్రోశం విన్నారా? ఆడ‌వాళ్ల‌పై అత్యాచారాలు, దౌర్జ‌న్యాలు ఎక్కువ జ‌రిగే ప్రాంతం దేశం మొత్తం మీద అక్క‌డిదేన‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. నేరాల‌ను అరిక‌ట్టాల్సిన ర‌క్ష‌క భ‌ట వ్య‌వ‌స్థ అధినేత‌కు గులామైపోయింది. గిట్ట‌ని వాళ్ల‌పై అన్యాయ‌పు కేసులు పెట్ట‌డానికే వాళ్ల‌ని ఉప‌యోగించుకుంటున్నార‌క్క‌ని నేత‌లు. ఆఖ‌రికి ఛోటా నాయ‌కుడి మాట విన‌క‌పోయినా ఎక్క‌డ చిక్కుల్లో ప‌డాల్సి వ‌స్తుందోన‌నే భ‌యంతో చేష్ట‌లుడిగిపోయారు అక్క‌డి ర‌క్ష‌క వ్య‌వస్థ ప్రతినిధులు. ఓ ప‌క్క మాద‌క ద్ర‌వ్యాలు విచ్చ‌ల‌విడిగా దొరుకుతుంటే త‌న కొడుకు ఎక్క‌డ వాటి బారిన ప‌డ‌తాడోన‌ని భ‌య‌ప‌డుతోంది ఆ త‌ల్లి. మ‌రో ప‌క్క త‌న కూతురు ఎక్క‌డ అధికార పార్టీ అనుచ‌రుల దౌర్జ‌న్యాల‌కు గుర‌వుతుందోన‌ని త‌ల్ల‌డిల్లుతోంది. ఇలాంటి దారుణ ప‌రిస్థితులు అక్క‌డ క‌నిపిస్తున్నాయి..." అంటూ ఏక‌రువు పెట్టాడు ఏక‌దంతుడు.

*****

ఇంత‌లో ఓ యువ‌కుడు వినాయ‌కుడి గుడి ముందుకు వ‌చ్చాడు. అత‌డి మ‌న‌సులో మాట కైలాసంలో మార్మోగింది.

"నీకేం వినాయ‌కా! హాయిగా ఉన్నావు. భ‌క్తులు స‌మ‌ర్పించే కుడుములు, ఉండ్రాళ్లు బొజ్జ‌నిండా తిని చిద్విలాసంగా న‌వ్వుతున్నావు. కానీ నా ప‌రిస్థితి చూడ‌వు. డిగ్రీ ప్యాస‌యి కొన్నేళ్ల‌యింది. ఉద్యోగం రాలేదు. ఇంటికెళ్లి కంచం ముందు కూర్చోవాల‌న్నా సిగ్గుగా ఉంది. వ‌చ్చే ఏడాదికైనా నా సంగ‌తి కాస్త చూడు మ‌రి..."

వినాయ‌కుడు ఇబ్బందిగా మొహం పెట్టి చెప్ప‌సాగాడు...

"చూశారా... పాపం ఇలాంటి యువ‌తీ యువ‌కులు ల‌క్ష‌లాది మంది ఇలాగే కునారిల్లుతున్నార‌క్క‌డ‌. అధికారంలోకి రాగానే జాబుల మేళా చేస్తాన‌ని ఆశ పెట్టాడక్క‌డి  అధినేత‌. కుర్చీలో కూర్చుని మూడేళ్ల‌యినా ఉద్యోగాల భ‌ర్తీ సంగ‌తి ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఓ ప‌క్క ల‌క్ష‌లాది ప్ర‌భుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటి కోసం నోటిఫికేష‌న్లు జారీ చేయ‌డు. ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌డు. ఓ ప‌క్క కోచింగుల కోసం ఇలాంటి యువతీ యువ‌కులు ఇంటి ద‌గ్గ‌ర అమ్మానాన్న‌ల‌ను ఫీజుల‌ను అడ‌గ‌లేక అడుగుతూ ప‌ట్టుద‌ల‌తో శిక్ష‌ణ పొందుతూ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. వీళ్లంతా నా పందిళ్ల‌లో న‌వ‌రాత్రుల‌కు ఉత్సాహంగా చిందులేస్తుంటే నాకే ఎంతో జాలి క‌లుగుతోంది. ఇలా వీళ్లే కాదు... అక్క‌డ ఆ ప్రాంతంలో ఎవ‌రిని చూసినా ఎవ‌రూ స్తిమితంగా లేరు. అక్క‌డి వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నాశ‌న‌మైపోయాయి. ఏ రంగం చూసినా ప‌ట్టుద‌ప్పింది. స్వ‌ప్ర‌యోజ‌నాలే త‌ప్ప‌ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు అక్క‌డి నేత‌లు. పైగా ప్ర‌శ్నిస్తే చాలు ప‌గ‌బ‌ట్టి వేధిస్తున్నారు. అధికార మ‌దోన్మ‌త్తులై, అహంకార పూరితులై, అబ‌ద్ధ‌పు ప్ర‌చారంతో కాలం గడుపుతున్నారు. చ‌ట్టంలోని లొసుగుల‌ను అడ్డం పెట్టుకుని అన్యాయంగా పంచ‌భూతాల‌ను సైతం క‌బ‌ళిస్తున్నారు. ప్ర‌జా ధ‌నాన్ని అడ్డ‌గోలుగా దోచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో నేన‌క్క‌డికి వెళ్లి అక్క‌డి అమాయ‌క‌పు సామాన్య జ‌నం భ‌క్తితో స‌మ‌ర్పించే కుడుములు తిని ర‌మ్మంటారా? అందుకే వెళ్ల‌నంటున్నాను..." అంటూ భీష్మించాడు వినాయ‌కుడు.

శివుడు, పార్వ‌తి మొహమొహాలు చూసుకున్నారు. కైలాస గ‌ణాల‌న్నీ తెల్ల‌బోయాయి.

స‌రిగ్గా స‌మ‌యానికి అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు నార‌దుడు.

"నారాయ‌ణ‌... నారాయ‌ణ" అంటూ ఓ సారి మ‌హతి మీటి అందుకున్నాడు.

"అంతా అవ‌గ‌త‌మైన‌ది కైలాస నాథా! వినాయ‌కుడి మీమాంస స‌మంజ‌స‌మైన‌దే. పూర్వంలోలాగా ఏ ఒక్క‌డో కంట‌కుడైతే ఏదో అవ‌తార‌మెత్తి వాడిని ప‌రిమార్చిన స‌రిపోయేది. ఇప్పుడ‌లా కాదే? ప్ర‌జ‌లే ఏరి కోరి నెత్తిన పెట్ట‌కున్న అధినేత‌ల‌ను వారే ఐదేళ్ల పాటు భ‌రించాల్సిందే. అయితే ఈ మాత్రం దానికి అక్క‌డికి వెళ్ల‌కుండా ఉండ‌క్క‌ర‌లేద‌య్యా వినాయ‌కా! దానికో ఉపాయం ఉంది..." అన్నాడు నార‌దుడు.

"ఏమిట‌ది నార‌దా?" అన్నాడు వినాయ‌కుడు. శివ‌పార్వ‌తులు ఆస‌క్తిగా చూశారు.

"ఏమీ లేదు వినాయ‌కా! నీవు నిశ్చింత‌గా అక్క‌డికి వెళ్లి రా. అక్క‌డి భక్తులు స‌మ‌ర్పించే ఉండ్రాళ్లు, కుడుములు ఆనందంగా స్వీక‌రించు. ఆపై అక్క‌డి ప్ర‌జ‌లకు తాము ఎన్నుకున్న నాయ‌కుల నిజ‌స్వ‌రూపాల‌ను గ్ర‌హించ‌గ‌లిగే చైత‌న్యాన్ని ప్రసాదించు. మెర‌మెచ్చు మాట‌ల‌కు, అబ‌ద్ధ‌పు వాగ్దానాల‌కు లొంగిపోకుండా ఆలోచించ‌గ‌లిగే తెలివి తేట‌ల‌ను అందించు. త‌మ‌ను స‌క్ర‌మంగా ప‌రిపాలించ‌గ‌లిగే స‌రైన జ‌న‌సేనానాయకుడిని ఎన్నుకోగ‌లిగే విచ‌క్ష‌ణ‌ను అనుగ్ర‌హించు, చాలు. ఆపై అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌న్నీ వాటంత‌ట అవే ప‌రిష్కార‌మ‌వుతాయి..." అంటూ నార‌దుడు ముగించాడు.

వినాయ‌కుడు మొహం విక‌సించింది. వెంట‌నే మూషికాన్ని పిలిచి భూలోక యాత్ర‌కు బ‌య‌ల్దేరాడు.

-సృజ‌న‌

PUBLISHED ON 28.8.2022 ON JANASENA WEBSITE

శనివారం, ఆగస్టు 13, 2022

హిర‌ణ్యాక్షుడు బ‌లాదూర్‌!

 


గురూగారూ... కొంప మునిగింది. ఇక నా బొచ్చెలో రాయి ప‌డిన‌ట్టే... అంటూ వ‌గ‌రుస్తూ వచ్చాడు శిష్యుడు.

గురువుగారు నిదానంగా చూసి, “కొంప‌లు ముంచే రాజ‌కీయాలు నేర్చుకుంటూ ఈ గ‌గ్గోలేంట్రా బ‌డుద్ధాయ్‌! ముందు సంగ‌తేంటో చెప్పేడు... అన్నారు.

శిష్యుడు కాసేపు ఆయాస‌ప‌డి తేరుకుని, “ఇంకా ఏం చెప్ప‌మంటారు గురూగారూ! ఈడీ స్పీడు పెంచిందండి. ఒకొక్క‌ళ్ల‌నీ మూసేస్తోందండి. మొన్న ప‌శ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని అరెస్టు చేసిందాండీ? ఇప్పుడు మ‌హారాష్ట్ర రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ వంతండి... ఓ ప‌క్క జాతీయ పార్టీ అధినేత్రిని, ఆమెగారు కొడుకుని కూడా కూర్చోబెట్టి ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధిస్తోందాండీ? మ‌రో ప‌క్క మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాసినో దందాలో హ‌వాలా లావాదేవీల‌పై ఆరా తీస్తోందాండీ? ఇక ఇలాగైతే ఎలాగండీ?” అన్నాడు.

ఒరే... ఆ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ దాని ప‌ని అది చేసుకుంటుంటే మధ్య‌లో నీ వ‌గర్పేంట్రా స‌న్నాసీ? కొంప‌దీసి ఆ పార్థా చ‌ట‌ర్జీ త‌న స్నేహితురాలు అప‌ర్ణా బెన‌ర్జీతో పాటు నీ ఇంట్లో కూడా కొన్ని కోట్లేమైనా దాచాడేంట్రా? లేక‌పోతే ఆ సంజ‌య్ నీక్కూడా ఏమైనా ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడా?” అన్నారు తాపీగా గురువుగారు.

ఊరుకోండి  గురూగారూ! మ‌న‌కంత సీనెక్క‌డిదండీ? నేనింకా మీద‌గ్గ‌ర రాజ‌కీయాలు నేర్చుకునే ద‌శ‌లోనే ఉన్నాను క‌దండీ... ఆ కుంభ‌కోణాల్లో ఒక్క కోణంలో కూడా మ‌న‌ముండ‌మండి...

మ‌రెందుకురా నీకు ఆదుర్దా?”

అదికాదండి గురూగారూ... నా ఆశ‌యం మీకు తెలుసుగా. ఎలాగోలా మీ ద‌గ్గ‌ర నాలుగు నీచ రాజ‌కీయాలు నేర్చుకుని ఎప్ప‌టికోప్పుడు ఓ నేత‌నై... ఇలాంటి ద‌గుల్బాజీ నాయ‌కుల అడుగుజాడ‌ల్లో న‌డిచి, నాలుగు త‌రాల పాటు త‌ర‌గ‌ని ఆస్తులు కూడ‌బెట్టుకోవాల‌నేదే కదండీ నా ఆశ? మ‌రిలాంట‌ప్పుడు ఓ ఈడీ కానీండి, ఓ సీబీఐ కానీండి, మ‌రో దర్యాప్తు సంస్థ కానీండి... ఇలా చ‌ట్టాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతే ఎలాగండీ? ఇలా అన్ని వైపుల నుంచి బిగించేస్తుంటే రేప్పొద్దున్న నేనింకేం కూడ‌బెట్టుకోగ‌ల‌నండీ? పొద్దున్నే పేప‌ర్లు చ‌దివిన ద‌గ్గ‌ర్నుంచి మ‌న‌సు మ‌న‌సులో లేదండి. గుండెల్లోంచి ఒక‌టే బెంగ త‌న్నుకొచ్చేసి మీ ద‌గ్గ‌ర‌కి ప‌రిగెత్తుకుని వ‌చ్చేశానండి... ఆయ్‌!

గురువుగారు చిలిపిగా న‌వ్వి ఒరేయ్‌... ఈ సంగ‌తలా ఉంచుగానీ నీగ్గానీ కొడుకు పుడితే సోమ‌లింగం అని పేరు పెట్ట‌రా... బాగుంటుంది... అన్నారు.

అదేంటి గురూగారూ! నేనోటి మాట్లాడుతుంటే మీరోటి చెబుతున్నారు. మ‌ధ్య‌లో నా కొడుకు సంగ‌తెందుకండీ?  నాకింకా పెళ్లే కాలేద‌ని తెలుసుగా?” అన్నాడు ఉక్రోషంగా.

మ‌రేంలేదురా, నీ ఆత్రం చూస్తుంటే...  ఆలు లేదు  చూలు లేదు... కొడుకు పేరు సోమ‌లింగం అంటారే,   సామెత గుర్తొచ్చిందిరా. నువ్వింకా రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నేలేదు, అప్పుడే అరెస్టుల గురించి బెంబేలు ప‌డ‌తావేంట్రా?”

శిష్యుడు బుంగ‌మూతి పెట్టి, “నా ఆవేద‌న అర్థం చేసుకోకుండా జోకులేస్తారేంటండీ... మీకు నేను బొత్తిగా అలుసైపోయానండి...అన్నాడు.

అలుసూ లేదు, న‌లుసూ లేదురా... ఆత్ర‌గాడికి బుద్ధి మ‌ట్టం అన్న‌ట్టు... ఓన‌మాలు వంట‌బ‌ట్ట‌లేదు కానీ, గుణింతాల గుట్టు చెప్ప‌మ‌న్నాట్ట నీలాంటోడే  వెన‌క‌టికెవ‌డో. అట్టాగుంది నీ కంగారు...

అది కాదు గురూగారూ! నా బాధ‌లో అర్థం లేదంటారా?”

ఆవ‌గింజలో అర‌భాగం లేక‌పోలేద‌నుకో... కానీ ఒరే... ఆ బెంగాల్ ఛ‌టర్జీ, ఈ ముంబై రౌతుజీల అవినీతి ఎంతరా? స‌ముద్రంలో కాకిరెట్టంత‌! ఉద్యోగాల వ్య‌వ‌హారంలో ఆ ఛ‌ట‌ర్జీ ద‌గ్గ‌ర దొరికిన కూసిన్ని కోట్లు, పాత్రాచాల్ ఇళ్ల కేసులో ఈ సంజ‌య్ నొక్కేసిన కాసిన్ని కోట్లు ఏ మూల‌కిరా? నువ్వంటూ నీచ రాజకీయ నేత‌గా ఎదిగావే అనుకో... ఈ చిల్ల‌ర పైస‌ల‌కంట్రా క‌క్కుర్తి ప‌డేది? ఓ ప‌క్క ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు దోచేసి, పొరుగు రాష్ట్రాల్లో సైతం కోట‌ల్లాంటి భ‌వనాలు క‌ట్టుకుంటూ ద‌ర్జాగా, ధిలాసాగా, కులాసాగా, విలాసంగా, విచిత్ర విన్యాసాలు చేస్తూ అధికారం చెలాయిస్తున్న నేతాశ్రీల‌ను నువ్వు ఆద‌ర్శంగా పెట్టుకోవాలి కానీ... అబ్బే... ఇలా భ‌య‌ప‌డితే ఎలారా?”

అయ్య‌బాబోయ్‌... ల‌క్ష‌ల కోట్లాండీ? అది కూడా అధికారంలో ఉండ‌గానాండీ? అదెలా సాధ్య‌మండీ? చ‌ట్టం ఊరుకుంటుందేంటండి...

ఒరే... తెలివితేట‌లు ఉండాలే కానీ చ‌ట్టం నీ చుట్టంరా... ఇంకా మాట్టాడితే నీ పెంపుడు కుక్క‌నుకో... దాన్ని దువ్వుతూ పెంచుకోవ‌చ్చు...  కావాలంటే కిట్ట‌ని వాళ్ల‌పైకి ఉసిగొల్ప‌వ‌చ్చు...

అదెలాగండీ... మీరు మ‌రీ అడ్డ‌గోలుగా చెబుతున్నారూ?”

నువ్వు చేసేవే అడ్డ‌గోలు ప‌నులైన‌ప్పుడు చ‌ట్టాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా ఏమార్చాలో, ఎలా అడ్డం పెట్టుకోవాలో తెలిసుండాలి క‌ద‌రా... ముందా తెలివి అల‌వ‌ర్చుకో...

ఆహా... ఇదేదో బాగుంది సార్‌... మ‌రైతే ఆ సూత్రాలేంటో, చిట్కాలేంటో, కిటుకులేంటో కాస్త చెబుదురూ...

అన్నీ చెప్ప‌డం కాదురా బ‌డుద్ధాయ్‌... కాస్త నీ చుట్టూ ప‌రికించి చూసుకుని, అలాంటి వాళ్లని గ‌మ‌నించి, వాళ్ల‌ని ఆద‌ర్శంగా పెట్టుకుని, వాళ్లు చేసే అడ్డ‌గోలు ప‌నుల అడుగుజాడ‌ల్లో దూసుకుపోవాలి...

అంతటి అవ‌గాహ‌న‌, తెలివి ఉంటే... ఇలా మీ ద‌గ్గ‌రే ఎందుకు ప‌డి ఉంటాను సార్‌... ఈ పాటికి ఓ చిన్న‌పాటి నీచుడినై నిగ్గుతేలేవాడిని క‌దా? కాబ‌ట్టి మీరే ఆ మ‌హానుభావులెవ‌రో, వాళ్ల ప‌నులేంటో... కాస్త అర‌టి పండు ఒలిచిన‌ట్టు చెబుదురూ పుణ్య‌ముంటుంది...

వార్నీ ఆ ప‌ని కూడా నా నెత్తి మీదే పెట్టావ్‌? స‌రే... శిష్యుడిగా చేర్చుకున్నాక త‌ప్పుతుందా? చెవులు రిక్కించుకుని శ్ర‌ద్ధ‌గా విను.  నీ ప‌రిస‌రాల్లో ఏం జ‌రుగుతోందో ఓసారి తేరిపారి చూస్తే  ప్ర‌కృతి సంప‌ద‌ను సైతం పిండుకుంటున్న ప్ర‌బుద్ధుడు క‌నిపిస్తాడు. ఇసుక రేణువుల్ని కాసులుగా మ‌లుచుకుంటున్న మాయ‌ల మ‌రాఠీ క‌నిపిస్తాడు.  కొండ‌ల్ని కొల్ల‌గొడుతున్న కిలాడీ క‌నిపిస్తాడు. నీటి వ‌న‌రుల నుంచి నిధులు నింపుకుంటున్న నీచుడు క‌నిపిస్తాడు. ప్ర‌జాధ‌నాన్ని పీల్చేస్తున్న ప్ర‌ముఖుడు క‌నిపిస్తాడు...

ఆహా... ఓహో... ఆ మ‌హానుభావుడెవ‌రో అర్థ‌మైందండి. కానీ గురూగారూ, కుర్చీలో కులాసాగా కూర్చుని కొబ్బ‌రిబొండంలో నీళ్ల‌ని స్ట్రా పెట్టుకుని పీల్చేస్తున్నంత చులాగ్గా ఖ‌జానా కొల్ల‌గొడుతుంటే చ‌ట్టం ఎందుక‌ని చూస్తూ ఊరుకుందంటారు?”

ఎందుకంటే... చ‌ట్టం చ‌ట్రంలోనే చ‌క్క‌బెడుతున్నాడు కాబ‌ట్టి. పైకి అంతా చ‌ట్ట‌బ‌ద్ధంగా సాగుతున్న‌ట్టు క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు కాబ‌ట్టి. చ‌ట్టానికి అతీత‌మైన, అద్వితీయ‌మైన‌, అమోఘ‌మైన‌, అసాధార‌ణ‌మైన‌, అద్భుత‌మైన తెలివితేట‌ల‌తో అధికారాన్ని ఉప‌యోగించుకుంటున్నాడు కాబ‌ట్టి. అర్థ‌మైందా?”

అబ్బే... కాలేదండి. మీరు నా మ‌ట్టి బుర్ర‌ని దృష్టిలో పెట్టుకుని కాస్త విడ‌మ‌రిచి చెప్పాల్సిందే...

అయితే శ్ర‌ద్ధ‌గా విని అఘోరించు. నీ ప‌ర‌గ‌ణాలో అంత‌కు ముందు కూడా ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కానీ అది ల‌భించే విధానాలు మారిపోయాయి క‌దా? రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని త‌వ్వుకునే కాంట్రాక్టుకు టెండ‌ర్లు పిలిచారు. అది చ‌ట్టబ‌ద్ధ‌మే క‌దా? అందులో ఒక‌రిని ఎంచుకుని వారికి ఆ ప‌ని అప్ప‌గించారు. అదీ అధికారికంగానే క‌దా? కానీ వాళ్లు మ‌రొక‌రికి స‌బ్ కాంట్రాక్టు ఇచ్చారు. ఇది కూడా కాద‌న‌డానికి లేనిదే కదా? కానీ ఆ స‌బ్ కాంట్రాక్టు ద్వారా సీన్‌లోకి వ‌చ్చిందెవ‌రు? అంత‌వ‌ర‌కు అయిపూ అజా లేని ఓ అస్మ‌దీయ కంపెనీ వారు.  టెండ‌ర్లు పిల‌వ‌డానికి ముందే పుట్టుకొచ్చిన పుట్టగొడుగు కంపెనీ వారు. మ‌రిప్పుడు వాళ్లు చేస్తున్న‌దేమిటి? అడ్డ‌గోలు దోపిడీ. అంతా ఆన్‌లైన్లోనే పార‌ద‌ర్శ‌కంగా ఇసుక‌ను బుక్ చేసుకుని పొంద‌వ‌చ్చంటూ  ఊద‌రగొడుతూ ఓ ప‌క్క ప్రచారం చేసుకుంటుంటే, వాస్త‌వానికి ఏం జ‌రుగుతోంది? ఎప్పుడు చూసినా స‌ర్వ‌ర్ బిజీనే. కానీ ఇసుక ర‌వాణా ఆగుతోందా? య‌ధావిధిగా జ‌రుగుతోంది. అంటే అర్జంటుగా ఇసుక కావ‌ల‌సిన వాళ్లు అధికంగా చెల్లిస్తే హాయిగా లోడ్ ఇంటికొస్తోంద‌న్న‌మాట‌. పోనీ బిల్లులు స‌రిగా ఉన్నాయా అంటే అదీ అరకొర‌గానే. చిత్తు కాగితాల మీద గీకేసి చేతిలో పెడుతుంటే... ఇసుక దొరికింద‌దే చాల‌నుకుంటూ కొన్న‌వాళ్లు కిమ్మ‌న‌కుండా ఊరుకుంటున్నారు. అంటే ఏంటి దాన‌ర్థం? ఇలా అన‌ధికారికంగా, అధికంగా వ‌సూల‌వుతున్న కోట్లాది రూపాయ‌ల సొమ్ము ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేర‌న‌ట్టే క‌దా? మ‌రి ఇలా స‌మ‌కూరుతున్న ప్ర‌జాధ‌నం ఎక్క‌డికి పోతోంది? మొద‌ట అస్మ‌దీయుల జేబుల్లోకి చేరి, ఆపై వాటాలుగా మారి అధికారం వెల‌గ‌బెడుతున్న వారి ద‌గ్గ‌ర‌కే చుట్టుతిరిగి వ‌స్తోంద‌ని ఎవ‌రికైనా అర్థం అవుతోంది క‌దా? అదిగో... ఇలాంటి అడ్డ‌గోలు తెలివితేట‌ల్నే నువ్వు పెంచుకోవాలి. తెలిసిందా?”

వార్నాయ‌నో... ఇసుక నుంచి కాసులు రాల్చుకోవ‌డ‌మంటే  ఇద‌న్న‌మాట‌...

ఆగు అప్పుడే గుడ్లు తేలేయ‌కు. ఇప్పుడు గ‌నుల ద‌గ్గ‌ర‌కి వ‌ద్దాం. నీ ప‌ర‌గ‌ణాలో ఉన్న కొండ‌ల్లో, గ‌నుల్లో అమూల్య‌మైన ఖ‌నిజాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ‌నులు త‌వ్వుకోడానికి, ఖ‌నిజాలు వెలికి తీయ‌డానికి చ‌ట్టబ‌ద్దంగానే అనుమ‌తులు ఉంటాయి. అయితే పైకి ఇచ్చే అనుమ‌తి వేర‌యితే, లోప‌ల త‌వ్వుకునే ఖ‌నిజం వేరు. ఏ సున్న‌పురాయి త‌వ్వ‌కానికో ఇచ్చిన అనుమ‌తిని అడ్డం పెట్టుకుని ప‌ని మొద‌లు పెట్టి అతి విలువైన ఖ‌నిజాల‌ను వెలికితీసి హాయిగా ర‌వాణా చేసుకుంటారు. మ‌రి ఇదంతా చ‌ట్ట‌బ‌ద్ధ‌మే క‌దా? కానీ అధికార పీఠం మీద నువ్వు బాసింప‌ట్టు వేసుకుని కూర్చున్నాక నువ్వు అనుకున్న వాడికే అనుమ‌తులు వ‌స్తాయి క‌దా? ఆ అనుమ‌తి పొందిన వాడు నీకు ఇవ్వాల్సింది స‌మ‌ర్పించుకుంటాడు క‌దా? మరి ఇలాంటి అసాధార‌ణ‌మైన కిటుకుల్నే నువ్వు నేర్చుకోవాలి అర్థ‌మైందా?”

అయ్య‌బాబోయ్‌... కొండ‌ల్ని కొల్ల‌గొట్ట‌డ‌మంటే ఇద‌న్న‌మాట‌...

ఇక్క‌డితో అయిపోలేదురా... నీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇవ్వడం చ‌ట్ట బ‌ద్ద‌మే క‌దా? కానీ ఆ కాంట్రాక్టులు ఎవ‌రికి ద‌క్కుతున్నాయి? అయిన‌వారికే. మ‌రి ఆపై ఆ ప్రాజెక్టుల అంచ‌నాలు సంత‌కాల నాటి క‌న్నా అంత‌కంత‌కు పెరుగుతాయి.  అలా పెరిగిన అంచ‌నాలు అధికారికంగానే శాంక్ష‌న్ అయిపోతాయి. కానీ జ‌రిగిన ప‌నికీ, పెరిగిన అంచ‌నాకీ మ‌ధ్య వ్య‌త్యాసంగా నిలిచే కోటానుకోట్ల రూపాయ‌లు ఎక్క‌డికి వెళ‌తాయో అర్థం చేసుకుంటే అస‌లు కిటుకేంటో తేలిగ్గానే తెలుస్తుంది. ఇలా ఒక‌టా రెండా... అభివృద్ధి పేరుతో నువ్వు ఏ ప‌ని చేపట్టినా, దానికి న‌వ్వు కేటాయించే ప్రజాధ‌నం చుట్టు తిరిగి నీ ద‌గ్గ‌రికే వ‌స్తుందన్న మాటే కదా? ఇప్ప‌టికైనా బోధ‌ప‌డిందా?”

బోధ‌ప‌డ్డ‌మేంటండి బాబూ... క‌ళ్లు గిర్రున  తిరిగిపోతుంటేను. అప్పుడెప్పుడో ఓ రాక్ష‌సుడు ఏకంగా భూమిని చుట్ట‌బెట్టేసి, చంక‌లో పెట్ట‌కుని చ‌క్క‌పోయాడ‌ని మా బామ్మ పురాణం చెప్పేదండి. ఇప్పుడు చ‌ట్టాన్ని చుట్టంగా చేసుకుని, లొసుగుల్ని ఒడుపుగా తెలుసుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, హోల్సేలుగా హోలాంధ్రానే  అడ్డ‌గోలుగా అయిన‌కాడికి దుళ్ల‌గొడుతున్న ఈ అధినేత ముందు, అల‌నాటి హిర‌ణ్యాక్షుడు కూడా బలాదూర్ అనిపిస్తోందండి!

బాగా చెప్పావురా... ఇక పోయిరా!

-సృజ‌న‌

PUBLISHED ON 10.8.22 ON JANASENA WEBSITE

మంగళవారం, ఆగస్టు 02, 2022

భ‌జ‌న చేసే విధ‌ము తెలియండీ..!


 "దారా... నీలాంటి శిష్యుడిని పొంద‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతంరా. పీడిత తాడిత దుర్బ‌ల ద‌య‌నీయ దారుణ నిరుపేద నిర్బ‌ల నీర‌స సామాన్య జ‌నులను ఉద్ధ‌రించ‌డానికి రాజ‌కీయాలు నేర్చుకుంటున్న ద‌యామ‌యుడివి. ప్ర‌జల శ్రేయ‌స్సునే మ‌న‌సా వాచా క‌ర్మ‌ణా వంట‌బట్టించుకుని, వారి అభ్యున్న‌తి కోస‌మే క‌ల‌లు కంటూ, క‌ల‌వ‌రిస్తూ, క‌ల‌వ‌రప‌డుతూ, క‌కావిక‌ల‌వుతూ, కాల‌క్షేపం చేస్తున్న కార‌ణ‌జ‌న్ముడివి. నీకిదే నా స్వాగ‌తం..." అంటూ ఆహ్వానించారు గురువుగారు.

రోజూలాగే చేతిలో పుస్త‌కాల‌తో, బుర్ర‌నిండా ప్ర‌శ్న‌ల‌తో, మ‌న‌సంతా సందేహాలతో, రాజ‌కీయ‌ పాఠాలు నేర్చుకోడానికి వ‌చ్చిన శిష్యుడు, గురువుగారి స్వాగ‌త వ‌చనాలు విని ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోయాడు. ఒళ్లంతా పుల‌క‌రించింది. రోమాలు  నిక్క‌బొడుచుకున్నాయి. మొహం చేటంత‌యింది. ఓసారి త‌లెగ‌రేసి గ‌ర్వంగా ద‌ర్పంగా విలాసంగా లోపలికి వ‌చ్చి కూర్చున్నాడు.

ఆపై లేని వినయం నటిస్తూ, "అయితే ఇన్నాళ్ల‌కి నా విలువేంటో మీకు తెలిసింద‌న్న‌మాట గురూగారూ! అంతేనాండీ?" అన్నాడు పెదాలు చెవుల‌కంటుకునేంత విశాలంగా న‌వ్వుతూ.

గురువుగారు వాడి పోక‌డ‌ల‌న్నీ చూసి, "ఏడిశావ్ వెధ‌వా! సిగ్గుమాలిన ద‌రిద్రుడా! నీచుడా! నికృష్టుడా! ద‌గుల్బాజీ! నీ బ‌తుక్కి రాజ‌కీయాలు కావ‌ల్సి వ‌చ్చాయంట్రా, నీతిమాలినోడా! ని ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చి పాఠాలు చెప్ప‌మన‌డానికి నేనంత అలుసైపోయాన్రా అప్రాచ్యుడా!  నువ్వెంత‌నీ బ‌తుకెంత‌నిన్ను క‌న్నందుకు నీ క‌న్న‌త‌ల్లి కూడా లోలోప‌ల కుమిలి కుమిలి ఏడుస్తుందిరా మూర్ఖుడా! తోడ బుట్టిన వాళ్లు కూడా నీ క‌పట బుద్ధులు చూసి అసహ్యించుకుంటార్రా బాడ్‌కోవ్‌! పుండాకోర్, అక్కుప‌క్షీ! నిర‌క్ష‌ర కుక్షీ!"  అంటూ తిట్టి పోశారు.

కులాసాగా వ‌చ్చి కూర్చున్న శిష్యుడు బిత్త‌ర‌పోయాడు. క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. చెవులు ఆవిర్లు చిమ్మాయి. మొహం వెల‌వెలబోయింది. నిలువునా కుంగిపోయాడు.

ఎలాగో మాట పెగ‌ల్చుకుని, "ఇదేంటి గురూగారూ! రాగానే పొగ‌డ్త‌ల‌తో హోరెత్తించేశారు. ఇప్పుడేమో కాస్త ఆల‌స్యంగా వ‌చ్చినందుకు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదెక్క‌డి న్యాయ‌మండీ..." అన్నాడు ఏడుపుమొహం పెట్టుకుని.

గురువుగారు తాపీగా ప‌డ‌క్కుర్చీలో వెన‌క్కి జార‌గిలబ‌డి కూర్చుని చిద్విలాసంగా న‌వ్వారు.

"ఓరెర్రోడా... ఇది కూడా పాఠ‌మేరా స‌న్నాసీ! ఆ పొగ‌డ్త‌లూ నిజం కాదు, ఈ తిట్లూ నిజ‌మైన‌వి కావు. కానీ రాజ‌కీయాల్లో ఈ రెండూ కూడా క‌చ్చితంగా నేర్చుకోవాల్సిన అంశాలురా. అందుకే రాగానే సింపుల్‌గా శాంపిల్ చూపించానంతే. అర్థ‌మైందా?"

శిష్యుడు తేరుకుని, "చంపేశారండి బాబూ! రాగానే పాఠం మొద‌లెట్టేశార‌న్న‌మాట‌. మీ పొగ‌డ్త‌లు వింటే నేనంత గొప్ప‌వాడినా అనిపించి క‌ళ్లు నెత్తికెక్కాయండి.  కానీ మీ తిట్లు వినగానే  బుర్ర తిరిగిపోయిందండి. మొత్తానికి భ‌లేవారండీ బాబూ మీరు..." అన్నాడు.

"ఆ... ఇదింకో పాఠంరోయ్‌! రాజకీయాల్లో రాటుదేలాలంటే, పొగ‌డ్త‌లు విని పొంగిపోకూడ‌దు, తిట్లు విని కుంగిపోకూడ‌దు. ఎవ‌రైనా నిన్ను పొగిడితే గుంభ‌నంగా ఆనందించినా, పైకి మాత్రం విన‌యం నటించాలి. ఇక ఎవ‌రైనా నిన్ను తిట్టార‌నుకో, అంత‌కు మించి రెచ్చిపోయి, ఛండాల‌మైన భాష‌తో వీరంగం ఆడేయాలి. స‌మ‌యానికి త‌గిన‌ట్టు ఈ రెండు విద్య‌లూ నేర్చుకున్నావ‌నుకో, ఇక నీకు ఢోకా ఉండ‌దు. తెలిసిందా?"

"భేషుగ్గానండి. మ‌రి గురూగారూ! ఈ రెండు విద్య‌ల్లోనూ ఆరితేరిన‌వారు ఎవ‌రైనా ఉన్నారాండీ?"

"ఎందుకు లేర్రా... నీ ప‌ర‌గ‌ణా కేసి ఓసారి క‌ళ్లెట్టుకు చూడు. ఛోటా నేత‌ల ద‌గ్గ‌ర్నుండి, బ‌డా నాయ‌కుల వ‌ర‌కు నోరెత్తితే ఈ రెండే క‌ద‌రా వినిపించేది. అధినేత‌ను పొగ‌డ్డం, అవ‌త‌లి వాడిని తిట్టిపోయ‌డం. ఇంత‌కు మించి పాల‌న ఏముందిరామొన్న‌టికి మొన్న ప్లీన‌రీ స‌మావేశంలో కూడా జ‌రిగిందిదేగా?"

"అవునండోయ్‌... మీరు చెబితే గుర్తొస్తోంది. మొత్తం ఆ స‌మావేశాలు ఆశాంతం ఈ రెండేనండి. ఓ చ‌ర్చ‌లేదు. ఓ ప్ర‌ణాళిక లేదు. ఓ ప‌రిశీల‌న లేదు. ఓ విజ‌న్ లేదండి. విసుగొచ్చేసిందండి..."

"మ‌రందుకే క‌ద‌రా నిన్ను పంపించిందినీలాంటి ఔత్సాహిక రాజ‌కీయాభిలాషుల‌కి నీ ప‌ర‌గ‌ణా ఓ పెద్ద బాల‌శిక్షరా. ఇక్క‌డ నువ్వు నేర్చుకునే పాఠాలు చాలా విలువైన‌వి. మంచి నేత‌గా ఎద‌గ‌ద‌లుచుకుంటే రాజ‌కీయాల్లో ఎలా ఉండ‌కూడ‌దో ఇక్క‌డే తెలుసుకోవ‌చ్చు, అదే నీచాతినీచ‌మైన నాయ‌కుడిగా రాటు దేలాలంటే ఎంత‌లా దిగ‌జార‌వ‌చ్చో కూడా ఇక్క‌డే అర్థం చేసుకోవ‌చ్చు. ఏమంటావ్‌?"

"అక్ష‌రాలా నిజ‌మేనండి. మ‌రైతే ఈ రెండు విద్య‌ల గురించి కాస్త విపులంగా చెబుదురూ, రాసుకుంటాను..."

"ముందుగా పొగ‌డ్త‌ల‌నేవి ఎన్ని ర‌కాలో తెలుసుకోవాలిరా. అది 'స్వ‌... ప‌ర‌... ప‌ర‌స్ప‌ర' అని ముఖ్యంగా మూడు ర‌కాలు. 'స్వ‌...' అంటే మ‌న‌కి మ‌న‌మే పొగుడుకోవ‌డం. ఎవ‌రూ పొగిడేవారు లేన‌ప్పుడు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి మీ అధినేత నుంచి అమాత్యుల వ‌ర‌కు పాటించేది ఇదే క‌దాకుర్చీ ఎక్కిన ద‌గ్గ‌ర్నుంచి ఇంత చేసేశాం, అంత చేసేశాం అని ఊద‌ర‌గొట్ట‌డ‌మేగా ఎక్క‌డ చూసినా. రాజ‌కీయాలంటే ఎలా ఉండాలో చూపించాన‌ని మీ అధినేత చెబుతున్నాడు. అస‌లు మార్పు అంటే ఏంటో చూపించామంటున్నాడు. ఆడ‌బిడ్డ‌ల బ‌తుకులు మార్చేశానంటున్నాడు. అవ్వ, తాత‌ల రుణం తీర్చుకుంటున్నాన‌న్నాడు. మ‌హిళ‌ల జీవితాల్లో వెలుగులు విర‌జిమ్మేశానంటున్నాడు. విద్యా రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చేశానంటున్నాడు. మ‌రివ‌న్నీ నిజాలా చెప్పు?"

"ఛీ...ఛీ...నిజాలేంటండీ బాబూ! ప‌చ్చి అబ‌ద్దాలు. అధికారంలోకి వ‌చ్చాక అన్ని రంగాల్నీఅత‌లాకుత‌లం చేసేసి వ‌దిలిపెట్టాడు. అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ నాశ‌నం చేసి పెట్టాడు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ప‌డేశాడు. మ‌హిళ‌లకు ఎక్క‌డా ర‌క్ష‌ణ లేకుండా చేసేశాడు. విద్యార్థుల‌ను వీధుల్లోకి నెట్టాడు. త‌ల్లిదండ్రుల్ని అయోమ‌యంలో ప‌డేశాడు. సామాన్యుడు గ‌గ్గోలు పెట్టేలా ప‌న్నులు పెంచేశాడు. పేద‌ల న‌డ్డి విరిగేలా ధ‌ర‌లు పెంచేశాడు. పాత‌ ప్ర‌భుత్వాలు జాలి ప‌డి మంజూరు చేసిన స్థ‌లాలు, ఇళ్లలో త‌ర‌త‌రాలుగా హాయిగా ఉన్న నిరుపేద‌ల నుంచి కూడా డ‌బ్బులు పిండుకుందామ‌ని చూస్తున్నాడు. రైతుల‌కు ఆత్మ‌హ‌త్య‌లు త‌ప్ప దారి లేని ప‌రిస్థితులు తీసుకొచ్చాడు. న‌కిలీ మ‌ద్యం, నాటు సారాలను జీవ‌న‌దుల్లా పారిస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌తో, ప్రాణాల‌తో ఆడుకుంటున్నాడు. అస‌లీయ‌న వెల‌గ‌బెడుతున్న ప‌రిపాల‌న‌లో సుఖంగా ఉన్న‌దెవ‌రండీ?"

"అమ్మ‌మ్మ‌... అంతమాట‌నకురోయ్‌! ఆయ‌న పాల‌న‌లో దిలాసాగా, కులాసాగా ఉన్న‌వాళ్లు ఎంద‌రు లేరు? అక్ర‌మంగా గ‌నులు త‌వ్వుకుంటున్న వాళ్లు కోట్ల‌కి కోట్లు వెన‌కేసుకోవ‌డం లేదూరాష్ట్రం మొత్తం మీద ఉన్న ఇసుక త‌వ్వ‌కాల‌ని లోపాయికారీగా స‌బ్ కాంట్రాక్టుకిచ్చి ఖ‌జానాకి ప‌న్నులు ఎగ్గొడుతూ, ధ‌ర‌లు పెంచేసి దండుకుంటున్న ద‌గాకోరు త‌మ్ముళ్లు కోట్ల‌కి ప‌డ‌గ‌లెత్త‌డం లేదూ? మ‌న్యంలోని మండ‌లాల‌న్నింటినీ గంజాయి సాగుకి గుత్తాధిప‌త్యం చేసేసి, పోలీసుల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి, దేశ విదేశాల‌కు య‌ధేచ్చ‌గా  స‌ర‌ఫ‌రా చేస్తూ సంపాదిస్తున్న స్మ‌గ్ల‌ర్లు స్వేచ్చ‌గా సుఖంగా లేరూపేద‌లకిచ్చే రేష‌ను బియ్యాన్ని కూడా బెదిరించి సేక‌రించి, పోర్టుల ద్వారా నౌక‌ల‌కెత్తించి విదేశాల‌కు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న ద‌గుల్బాజీలు లేరూదేశం మొత్తం మీద ఎక్క‌డా క‌నిపించ‌ని వింత వింత బ్రాండ్ల మ‌ద్యం ర‌కాల్ని మార్కెట్లోకి దించి జ‌నం గొంతులోకి పంపుతూ జేబులు నింపుకుంటున్న జ‌గ‌త్ కిలాడీలు  ఆనందంగా లేరూప్ర‌జా ప‌థ‌కాల పేరిట పంపిణీ చేసే సామ‌గ్రి స‌ర‌ఫ‌రాకి ఘ‌రానాగా కాంట్రాక్టులు ద‌క్కించుకుని నాణ్య‌త‌లేని నాసిరకం స‌రుకును అంట‌గ‌డుతూ ఆర్జిస్తున్న అక్ర‌మ వ్యాపారులు హాయిగా లేరూ? ఏమాట‌కామాటే చెప్పుకోవాలి, నిజాలు విస్మ‌రించ‌కురోయ్‌..."

"అవునండోయ్‌... మ‌రింత‌కీ ఈ వ్య‌వ‌హారంలో నేను నేర్చుకునే సూత్ర‌మేమిటండీ?"

"అదేరా... ఎటు చూసినా విమ‌ర్శ‌లే త‌ప్ప పొగ‌డ్త‌లు లేక‌పోయినా, ఎవ‌రూ పొగిడే వాళ్లు లేక‌పోయినా త‌న‌ను తాను పొగుడుకోవ‌డ‌మెలాగో తెలుసుకోవాలంటే నీ అధినేత మాట‌ల్నే మ‌న‌నం చేసుకోవాలి. స్వీయ పొగ‌డ్త‌ల్లో ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్ ఈ పాటికే ఇచ్చేయాలి. ఇక పొగ‌డ్త‌లో రెండో ర‌క‌మైన 'ప‌ర...' అంటే అవ‌స‌రాన్ని బ‌ట్టి ఇత‌రుల‌ను పొగ‌డ్డమ‌న్న‌మాట‌. ఇందులో నీ ప్రాంతంలోని ప్ర‌జాప్ర‌తినిధులు, అమాత్యుల త‌ర్వాతే ఎవ‌రైనా.  ఒక‌డు నీ అధినేత కార‌ణ‌జ‌న్ముడంటాడు. మ‌రొక‌డు ప్ర‌జ‌ల కోస‌మే ఆయ‌న పుట్టాడంటాడు. ఒకరు ఈయ‌న్ని అర్జ‌నుడితో పోలిస్తే, మ‌రో ఘ‌నురాలు ఏకంగా  రాముడితోనే ముడిపెట్టింది. ఒక‌రు ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేసి త‌రిస్తే, మ‌రొక‌రు ఆయ‌న చేతిని ముద్దు పెట్టుకుని జ‌న్మ ధ‌న్యం చేసుకుంటారు. అధినేత‌ను మెప్పించి ప‌దవులు, హోదాలు పొంద‌డానికి ఈ ర‌క‌మైన పొగ‌డ్త‌ను మించిన సాధ‌నం మ‌రొక‌టి లేదురా"

"మ‌రి గురూగారూ! పొగ‌డ్త‌లో మూడో ర‌కం 'ప‌ర‌స్ప‌ర...' సంగ‌తేంటండీ?"

"ఏముందిరా. ఒక‌రినొక‌రు పొగుడుకోవ‌డం. ఎక్క‌డ దురద పుట్టినా నీకు నువ్వు గోక్కోగ‌ల‌వు. కానీ వీపు మీద అయితే ఎలా? మ‌రొక‌రి సాయం కావల్సిందే. అందుక‌నే 'నా వీపు నువ్వు గోకు... నీ వీపు నేను గోకుతా...' అనే అంత‌ర్గ‌త ఒప్పందంలాంటిద‌న్న మాట‌. ఇందులో కూడా మీ నేత‌లు పండిపోయారురా. ఒక‌రినొక‌రు పొగుడుకోవ‌డమే కాదు, త‌మ‌కు ద‌న్నుగా నిలిచే వాళ్ల‌ని కూడా వెన‌కా ముందూ చూడ‌కుండా పొగ‌డ‌గ‌ల‌రు"

"మ‌రి ఈ పొగ‌డ్త‌ల‌తో ఏమేమి ప్ర‌యోజ‌నాలు సాధించ‌వ‌చ్చు గురూగారూ?"

"చాలా ఉంటాయిరా. పొగడ్త‌లో హెచ్చ‌రిక‌ల్ని కూడా క‌ల‌గ‌ల‌పి ర‌ఫ్ఫాడించ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీ అధినేత ప్ర‌సంగాలు విన్నావుగాప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డంలో  తానెవ‌రి ప్ర‌య‌త్నాల‌నీ స‌హించ‌న‌నీ, త‌న‌ను విమ‌ర్శించే వాళ్లంద‌రూ క‌ల‌సినా త‌న వెంట్రుక ముక్క‌ను కూడా పీక‌లేర‌నీ చెప్ప‌లేదూ? అంటే స్వీయ పొగ‌డ్త‌లో విమ‌ర్శ‌ని పోపెట్టాడ‌న్న‌మాట‌. ఇలా స్వ‌, ప‌ర‌, ప‌ర‌స్ప‌ర ర‌కాల‌తో తారంగ‌మాడుతున్న వాళ్ల‌ని చూస్తూ కూడా నువ్వు నేర్చుకోకపోతే ఎలారా?" 

"అవునండీ... చాలా విలువైన పాఠం. కానీ గురూగారూ... రాజ‌కీయాల్లో తిట్లు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయండీ?"

"ఇది తెలుసుకోడానికి కూడా నువ్వు ఎక్క‌డికీ పోన‌క్క‌ర్లేదురా. నీ నేత‌లు, నాయ‌కులు పెట్టే ప్రెస్ మీట్ల‌కు వెళితే స‌రిపోతుంది. త‌మ పాల‌న‌పై ఏపాటి చిన్న విమ‌ర్శ వ‌చ్చినా, దాని వెనుక ఉన్న నిజానిజాలేంటో తెలుసుకుని, అవ‌స‌ర‌మైతే స‌రిదిద్దుకుని, లేక‌పోతే నిజాలు వెల్ల‌డించాల్సింది పోయి... అన్న‌వాడిని అమ్మ‌నా బూతులు తిడుతూ అస‌లు విష‌యాన్ని ప‌క్క‌దారి పట్టించ‌డం లేదూప్ర‌శ్నించిన వాడికి లేనిపోని కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు కూడా అంట‌గ‌డుతూ నానా మాట‌లూ పేల‌డం లేదూఅలా త‌మ‌ను  ధిక్క‌రించిన వారిని బెంబేలెత్తించేలా కుయ‌త్నాలు  చేయ‌డం లేదూమొన్న‌టి స‌మావేశాల్లో జ‌రిగిందంతా ఆత్మ‌స్తుతి, ప‌ర‌నింద‌లే క‌ద‌రాప్ర‌త్య‌ర్థి త‌మ‌ను విమ‌ర్శించేప్పుడు ఉప‌యోగించిన భాష బాగాలేదని ఓ ప‌క్క చెబుతూనేమ‌రోప‌క్క అంత‌కుమించిన నికృష్ట‌మైన ప‌ద‌జాలం ప్ర‌యోగిస్తూ మొరెత్తుకుని విరచుకుపడ‌లేదూ? ఇలా ఎదురెట్టి ఏకేయ‌డానికి, విష‌యాన్ని విమ‌ర్శ‌ల నుంచి ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికి తిట్ల‌ని మించిన అస్త్రం ఏముంటుంది చెప్పుకాబ‌ట్టి ఎప్పుడెవ‌ర్ని ఎలా పొగ‌డాలో, ఎవ‌ర్నెలా ఉబ్బేయాలో, పొగుడుతూనే ఎలా పొగ‌పెట్టాలో, ఎవ‌ర్ని తిట్టి బెదిరించాలో, బూతులు ఉప‌యోగించి ఎలా రెచ్చిపోవాలో ఇవ‌న్నీ నేర్చుకుని రెచ్చిపోరా మ‌రి..."

"ఆహా...గురూగారూ! అద్భుతంగా చెప్పార్సార్‌... రాజ‌కీయ పాఠాలు చెప్ప‌డంలో మీకు మీరే సాటి..."

"ఏంట్రోయ్‌. న‌న్నే పొగుడుతున్నావు?"

"అబ్బే... ఇది పొగ‌డ్త కాదండీ... ప‌చ్చి నిజం..."

"అది కూడా పొగ‌డ్తేరా బ‌డుద్ధాయ్‌! ఇక పో..."

"ఇది కూడా తిట్టు కాద‌ని తెలిసింది సార్‌... ఇక వ‌స్తా!"

-సృజ‌న‌

PUBLISHED ON 30.7.22 ON JANASENA WEBSITE