శనివారం, జనవరి 21, 2017

బీద అరుపులు‘శిష్యా... చిరుగు అనగానేమి?’
‘చిల్లి, ఖాళీ ప్రదేశం లేదా రంధ్రం గురూ’
‘అనగా?’
‘శూన్యం అనీ అనవచ్చు గురూ!’
‘లెస్స పలికితివి. మరి చిల్లులు దేనికి ఉపయోగపడును?’
‘అది మాత్రం తెలియదు గురూ’
‘నేర్చుకోరా బడుద్ధాయ్‌! చిల్లులు... ప్రచారానికి ఉపయోగపడును. విమర్శకు ఆలంబనమగును. రాజకీయానికి పనికివచ్చును. నవ్వుల జల్లుల్నీ కురిపించును’
‘వావ్‌ గురూ! చూడగా చిల్లులు బహుళ ప్రయోజనకారులని అర్థమవుతున్నది’
‘చురుకైనవాడివే. మరి ఈ చిల్లులతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నదెవరో చెప్పగలవా శిష్యా?’
‘బహు కష్టం గురూ! నాకంతటి పరిజ్ఞానమున్న, మీ దగ్గర ఎందుకు పడివుంటాను? వేరొక ఆశ్రమం స్థాపించి గురుస్థానంలో కూర్చుండేవాడిని కదా గురూ’
‘నీ బుర్ర అనే ఇసుకపర్రలో ఇలాంటి చెడు తలంపుల బెడ్డముక్కలు ఉన్నవని నాకు తెలుసుకానీ శిష్యా, ఆ మహానుభావుడి గురించి తెలిపెదను వినుము’
‘ధన్మోస్మి గురూ, సెలవిండు’
‘ఆతండు ఒక యువకుండు. తల్లి చాటునుండు. అధికారానికై ఆశపడుచుండు. అడపాదడపా విలేకరులను పిలిచి ఏదేదియో మాట్లాడుచుండు. సభలలో రెచ్చిపోయి ప్రసంగించుచుండు. అర్థమైందా శిష్యా?’
‘కాలేదు గురూ! ఈమధ్య అతడు మాట్లాడిన విషయాలేమైనా చెప్పినచో పోల్చుకొనగలను’
‘అట్లయిన అఘోరించు. మొన్నటికి మొన్న ఇతగాడు ఓ కుర్తా వేసుకుని ఉత్తరాఖండ్‌లో ఓ సభకు వచ్చెను’
‘వచ్చి ఏం చెప్పాడు గురూ’
‘ముందుగా జేబులో చెయ్యి పెట్టినాడు. ఆ జేబులో చిరుగు ఉన్నదన్నమాట. ఆ చిరుగు చిల్లులోంచి చెయ్యి బయటికి పెట్టి చూపించినాడు. అందరూ నవ్వసాగిరి’
‘అప్పుడేమైంది గురూ’
‘ఆ యువకుడు నోరు విప్పినాడు. ఇదిగో నా కుర్తా చిరిగింది. ఇది నాకు పెద్ద విషయం కాదు. ఇలాంటి చిల్లుల చొక్కాను మన ప్రధానమంత్రి ఎప్పుడైనా వేసుకున్నారా? వేసుకోరు. అయినా, తానొక పేదల ప్రతినిధి అని చెబుతూ ఉంటారు. పేదలపై రాజకీయం చేస్తూ ఉంటారు... అంటూ ప్రసంగించినాడు’
‘ప్రజాసభకు చిరిగిన కుర్తా వేసుకుని రావడమేంటి గురూ?’
‘మరి అదేరా శిష్యా... అతి తెలివి. కావాలని కుర్తాకు చిరుగు పెట్టి, అది వేసుకుని సభకు వచ్చి, ఆ చిల్లిలో చెయ్యిపెట్టి, దాన్ని బయటకు చూపించి మరీ దేశ ప్రధానిపై విమర్శలు కురిపించాడు చూశావా?’
‘అవును గురూ! చిరుగు ప్రచారానికి, రాజకీయానికి పనికివచ్చునని నిరూపించినాడు. మరి అతగాడి మాటల ప్రయోజనం నెరవేరిందా గురూ?’
‘ఓరి వెర్రి శిష్యా! మన ప్రజలు అంతకంటే అధికులు. చిల్లుల కుర్తా వేసుకొని వచ్చినా... అతడు మాత్రం పేదల ప్రతినిధి కాడని ఇట్టే గ్రహించినారు. ఆ పట్టున విరగబడి నవ్వి ఆతడినే వెర్రివాడిని చేసినారు’
‘ఎలా గురూ?’
‘ఆ యువకుండు ఈ మధ్యనే విదేశీయానం చేసి వచ్చాడు కదా. సామాజిక మాధ్యమాల్లో ఆ సంగతి గుర్తు చేసి మరీ ఎద్దేవా చేసినారు. కొందరు రూపాయి విరాళాలు ప్రకటించి వెక్కిరించినారు. ఇంకొందరు ఈ వికృత రాజకీయం ఏమిటని ఏకినారు. పాలకపక్ష యువనేతలైతే ఆతడికి కొత్త కుర్తాలు కొని పంపించెదమని ఉడికించినారు’
‘అనగా... చిల్లులతో జాగ్రత్తగా లేకున్నచో అది మన ఉద్దేశాన్నే అమాంతం హరించే పెనురంధ్రమగునని తేలినట్టే కదా గురూ?’
‘రాటుతేలివితిరా శిష్యా! చిల్లుల సాయంతో రంధ్రాన్వేషణ చేయాలనే అతగాడి ప్రయత్నం విఫలమైందన్న మాట’
‘లెస్స గురూ... ఆతడి వెటకారపు వెక్కిరింతలు, మాటలు, కూతలు, ఎక్కసెక్కపు కబుర్లు మరికొన్ని చెప్పినచో ఆతడిని పోల్చుకోవడానికి ప్రయత్నించగలను’
‘ఏమని చెప్పుదు శిష్యా! తానుగానీ నోరు విప్పినచో భూకంపాలే వచ్చునని చెప్పును. తానుగానీ నిజాలు చెబితే సునామీలు వచ్చునని బెదిరించును. కానీ నోరు విప్పలేడు... నిజాలు చెప్పలేడు’
‘చిత్రవిచిత్రంగా ఉంది గురూ... ఇంకా?’
‘ఓసారి విధాన సభలో రాసుకొచ్చిన ప్రసంగం చదువుతూ స్పీకర్‌ స్థానంలో మగవారు ఉండగా మేడమ్‌ అని సంబోధించి నాలుక కరుచుకొనును. మరియొకసారి గంభీరంగా మొహం పెట్టి మాట్లాడుతూ, రాజకీయం ఎక్కడ పడితే అక్కడ ఉంది... నీ జేబులో రాజకీయం ఉంది, నీ ప్యాంటులో రాజకీయం ఉంది అనెను. దేశమంతా ఘొల్లుమనెను. మరియొకమారు గుజరాత్‌తో పాల ఉత్పత్తి అంతా మహిళల వల్లే సాధ్యమైనదనును... ఇట్లు ఎన్నని చెప్పను శిష్యా ఆ యువకుడి మాటల మెరుపులు?’
‘ఆ... అతగాడు ఎవరో పోల్చుకున్నాను గురూ! ఇంతకుముందు యువరాజుగా పేరొందిన సుపుత్రుండు. ఆతడి గురించి మరియొక సంగతి గ్రహించాను గురూ! ఆ చిరుగు లేదా చిల్లి లేదా రంధ్రం లేదా శూన్యం అతడి జేబులో కాదు- నిజానికి అతడి ఆలోచనల్లో ఉందని! నిజమేనా గురూ?’
‘చక్కగా చెప్పి, నీ బుర్రలో చిల్లి లేదని నిరూపించుకున్నావురా శిష్యా! మరొక సంగతి చెప్పెదను వినుము. ఆతడు యువరాజుగా వెలుగొందిన కాలంలో సాగిన అవకతవక, అవినీతి, అస్తవ్యస్త రాజకీయ పరిపాలనా విన్యాసాల వల్లనే దేశ ఆర్థిక పరిస్థితి కుర్తాలో చిరుగు లాగా మిగిలినది. ప్రజాధనాన్ని ఆనాటి పాలకులు జేబుల్లో నింపుకొని, చివరికి అతడిలానే చిరుగు చిల్లుల్లో చెయ్యి చూపించి... చక్కాపోయినారు శిష్యా’
‘ఆహా గురూ... ఆఖరికి చిల్లి సైతం సుపరిపాలకులను ఎన్నుకోవాలని ప్రబోధిస్తోంది గురూ!’
PUBLISHED IN EENADU ON 21.01.2017

సోమవారం, జనవరి 16, 2017

రాజకీయ రంగవల్లులు‘హరిలోరంగ హరి... మన కష్టాలన్నీ హరీ... 
సుఖాలదిగో మరి... ఇక సంబరాలు చేద్దారి!’ 
- అంటూ హరిదాసు కొత్తపాట పాడుతూ బయల్దేరాడు. ముగ్గులు దాటుకుంటూ, గొబ్బెమ్మలు చూసుకుంటూ ఓ ఇంటి దగ్గర ఆగాడు. 
‘ఏందయ్యోయ్‌! పాట కొత్తగా ఉంది. ఓ పక్క జనం నానా బాధలూ పడుతుంటే, పండగ సాకు చూపించి నీ పబ్బం గడుపుకొందామని చూస్తున్నావా?’ అన్నాడు ఆ ఇంటి గుమ్మం ముందు నుంచున్న ఆసామి. 
‘ఎవరు స్వామీ తమరు?’ అన్నాడు హరిదాసు. 
‘నన్నే గుర్తు పట్టలేదా? కేజ్రీవాల్‌ని. మాయమాటలకీ గాలి పాటలకీ మైమరచిపోయేవాణ్నికాదు. తెలుసా?’ 
‘అయ్యో... మిమ్మల్ని గుర్తుపట్టలేకేమండీ. ముందు మీరు జనం కష్టాలేంటో చెప్పండి మరి...’ 
‘నువ్వొచ్చేదారిలో జనం క్యూలో నుంచున్నారు కనిపించలేదా? బ్యాంకులు కూడా డబ్బుల్లేవనే బోర్డులు పెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అల్లాడిపోతోంది. ఇంకా పండగ సంబరమేంటయ్యా...’ 
‘అయ్యా... మీరు క్యూలో ఉన్న జనాన్నే చూస్తున్నారు. కానీ నేను ఆ జనం మొహాల్లో ఉన్న నమ్మకాన్ని చూస్తున్నా. మీరు బ్యాంకుల ముందు బోర్డుల్నే చూస్తున్నారు. నేను దేశం మొత్తం మీద పోగవుతున్న లక్షల కోట్ల సంపదను చూస్తున్నా. ఇన్నాళ్లూ ఎక్కడికి పోయిందండీ ఈ సొమ్మంతా? కేవలం పది శాతం కూడా లేని బడా బాబుల భోషాణాల్లో, ఇంటి గోడల్లో, బాత్రూముల్లో దాచిన రహస్య అరల్లో మూలుగుతున్న మహాలక్ష్మి ఇప్పుడు వెలుగు చూస్తోంది. అది నాకు సంక్రాంతి లక్ష్మిలా కళకళలాడుతూ కనిపిస్తోంది. బినామీ పేర్లతో, మాయ డిపాజిట్లతో సామాన్యులకు అందాల్సిన ఫలాల్ని అక్రమంగా దోచుకుని దాచుకున్న అవినీతిపరుల బందిఖానాల్లోంచి బయటకు వస్తున్న సిరుల కుప్పలు నాకు శోభస్కరమైన గొబ్బెమ్మల్లా కనిపిస్తున్నాయి. ఇది పండగ సంబరం కాదంటారా? దేశ సరిహద్దుల అవతలకి ఓసారి మీ సంకుచితమైన చూపును సారించండి. ఉగ్రవాదులకు వూతమివ్వడానికి పోగేసిన వేలాది కోట్ల పెద్ద నోట్లన్నీ చెల్లని చిత్తు కాగితాలైపోవడంతో ఏం చేయాలో తోచక నిప్పుపెట్టిన మంటలు కనిపిస్తాయి. అవండీ... నిజమైన భోగి మంటలు! ఇవన్నీ రాజకీయ చట్రంలో చిక్కుకుపోయిన మీకు అర్థం కావేమో కానీ, నా దేశంలోని సామాన్య ప్రజానీకానికి ఎప్పుడో తెలుసు. అందుకే సహనంతో ఉన్నారు...’ అన్నాడు హరిదాసు ఆవేశంగా. 
కేజ్రీవాల్‌ తెల్లమొహమేసినా, తేరుకుని ‘అంటే ఆ కాషాయ పార్టీ వాళ్లు హరిదాసులకి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి పంపించారన్నమాట. ఆగాగు... ఇప్పుడే ప్రెస్‌మీట్‌ పెడతా...’ అన్నాడు. 
‘అయ్యా... ముందు మీ పార్టీని చీపురు పెట్టి దులుపుకోండి. ఆ తరవాత ఎదురింటి ముంగిటిని విమర్శిద్దురుగాని. పొరిగింటాయన అమ్మ కాళ్లకి దణ్నం పెట్టినా, అందులో కూడా రాజకీయమే కనిపిస్తుంది మీకు...’ అంటూ వెళ్లబోయాడు హరిదాసు. 
కేజ్రీవాల్‌ సర్దుకుని, ‘పోనీలే హరిదాసూ! పండగ పూట గుమ్మంలోకి వచ్చావని ఏమైనా ఇద్దామన్నా చిల్లర లేదోయ్‌. ఏం చేయను?’ అన్నాడు. 
హరిదాసు నవ్వి సంచిలోంచి స్వైపింగ్‌ యంత్రం తీశాడు. ‘మీకంతగా మనసుంటే ఇందులో కార్డు గీకండి. నగదు రహిత దేశం కోసం నావంతుగా ఇది సమకూర్చుకున్నాను’ అన్నాడు.
* * *
‘రావమ్మా...మహాలక్ష్మీ రావమ్మా... 
మా దేశమే నీ ఇల్లు... కొలువై ఉందువుగాని...’ 
-అంటూ హరిదాసు మరో ఇంటి ముంగిట్లోకి వెళ్లి నుంచున్నాడు. ఆ ఇంటి తలుపు భళ్లున తెరుచుకుంది. కళ్లెర్రజేస్తూ మమతాబెనర్జీ బయటకు వచ్చి రుసరుసలాడుతూ, ‘శుభమా అని విలేకరుల సమావేశానికి వెళుతుంటే నువ్వొచ్చావా? ఇంకెక్కడి మహాలక్ష్మయ్యా? పెద్దాయన అనాలోచిత పనులతో పండగ వెలవెలబోతోంది. అందుకే జనం కళ్లు తెరిపిద్దామని బయల్దేరా...’ అంది కోపంగా. 
‘అమ్మా... ఇది నీ ఇల్లా? తెలియక వచ్చాను. ఇంతకీ ఏమని కళ్లు తెరిపిస్తారో తెలుసుకోవచ్చా తల్లీ?’ అన్నాడు హరిదాసు. 
‘ఓ దానికేం? ఇదంతా పెద్ద అవినీతి. కుంభకోణం. కుట్ర. బడా పారిశ్రామిక వేత్తల గుప్పెట్లో ఉందీ ప్రభుత్వం. నీకు నీ చిడతలు, ఇత్తడి పాత్ర తప్పితే మరింకేమీ తెలియదు పాపం... ఎలా బాగుపడతావో ఏంటో?’ 
హరిదాసు ఓసారి చిడతలు వాయించి, ‘తల్లీ తెలియకేమమ్మా... కొందరు విలేకరులు రహస్య కెమేరాలు పెట్టి మరీ మీ హయాములో ఉన్న మంత్రులు, అధికారుల అవినీతి ఎంత గొప్పగా ఉందో బయటపెట్టారు కదమ్మా! ఇలా అడుగడుగునా పేరుకుపోయిన అవినీతి బకాసురుల ఆట కట్టించేందుకు ఇంతవరకు ఎవరైనా కనీస ప్రయత్నమైనా చేశారా తల్లీ? ఇన్నాళ్లకు ఓ పెద్దాయన వచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే కంటగింపుగా ఉందామ్మా?’ అంటూ హరిదాసు ముందడుగు వేశాడు.
* * *
‘కడివెడు నీళ్లు కలాపి జల్లి గొబ్బిల్లో గొబ్బిళ్లు...’ 
-అంటూ హరిదాసు మరో ఇంటి ముందుకు వచ్చాడు. అందులోంచి ఓ యువకుడు పాలపీక నోట్లో పెట్టుకుని చీకుతూ బయటకు వచ్చాడు. 
‘ఇంకేం గొబ్బిళ్లయ్యా... ఇదిగో నేను నోరిప్పడానికి వెళుతున్నా. ఇక భూకంపాలు వచ్చేస్తాయి. త్వరగా ఇంటికి వెళ్లిపో’ అన్నాడు ఆ యువకుడు పాలపీక తీసి చేత్తో పట్టుకుని. 
హరిదాసు అతడికేసి తేరిపారి చూసి, ‘ఓ రాహుల్‌బాబా? ఈ దేశంలో ఇప్పటికే చాలా భూకంపాలు వచ్చాయి. తెలుసా బాబూ?’ అన్నాడు. 
రాహుల్‌ వెనక్కి తిరిగి ఇంట్లోకి చూస్తూ, ‘అమ్మా... చూడవే. నేను మాట్లాడకుండా భూకంపాలు ఎలా వస్తాయమ్మా... చెప్పు?’ అన్నాడు. 
లోపలినుంచి వాళ్లమ్మ కంఠం వినిపించింది, ‘అరె బచ్చా... బయటకి వెళ్లి విలేకరుల సమావేశం పెట్టి ఆడుకోమన్నానా? నన్ను విసిగించకు, నీ కోసం కుర్చీ చేసే పనిలో ఉన్నాను...’ అని. 
రాహుల్‌ బిక్కమొహం వేసుకుని, ‘ఏంటి హరిదాసూ... నాకు అర్థమయ్యేలా చెప్పు..’ అన్నాడు. 
‘చరిత్ర తెలుసుకో బాబూ! ఇంతకు ముందు వాళ్ల పాలనలో అవినీతి సునామీ దేశాన్ని ముంచెత్తింది. అక్రమాల భూకంపాలు అతలాకుతలం చేశాయి. భూమిని, గాలిని, నీటిని, నిప్పును కూడా అమ్ముకున్నారు నాయనా. ఇన్నాళ్లకి దేశం ముంగిట్లోకి కొత్త రంగవల్లులు వచ్చాయి. పేపర్లలో రోజుకో కుంభకోణం వార్తలు చూడటానికి అలవాటు పడిన ప్రజల కళ్లకిప్పుడు, అవినీతి పరులను పట్టుకున్న వార్తలు కనులవిందుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నీకు అర్థం కావులే కానీ, వెళ్లి ఆడుకో నాయనా!’ అంటూ హరిదాసు సాగిపోయాడు... 
‘హరిలో రంగహరి... మన బాధలన్నీ తీరి... 
బంగరు భవితకు దారి... అదిగదిగో మరి!’
- ఎ.వి.ఎన్‌.హెచ్‌.ఎస్‌.శర్మ

PUBLISHED IN EENADU ON 14.01.2017