సోమవారం, జనవరి 31, 2022

జ‌నాన్ని మ‌ర‌చి జాత‌ర చెయ్యి... ఢాంఢాంఢాం!






 


"ఏంట్రా అలా మొహం వేలాడేసుకుని ఉన్నావేం?"

"ఏముంది గురూగారూ! ఇంట్లో స‌మ‌స్య‌ల‌న్నీ ఒకేసారి చుట్టుముట్టేసిన‌ట్టుందండి..."

"మ‌ర‌యితే... ఓ కొత్త స‌మ‌స్య సృష్టించ‌లేక‌పోయావా?"

"ఇదేం ప‌రిష్కారం గురూగారూ! ఉన్న‌వాటితోనే వేగ‌లేక‌పోతుంటే కొత్త‌ది పుట్టించ‌మంటారు?"

"ఒరే... నీకిలా చెబితే అర్థం కాదు కానీ, నీకో కోతి క‌థ చెబుతాను. ఆ కోతిలాగా నువ్వు ఉన్న‌దొదిలేసి కొత్త‌ది పుచ్చుకున్నావ‌నుకో. నీకెప్ప‌టికీ ఢోకా ఉండ‌దు. ఈ క‌థ చిన్న‌ప్పుడు విన్న‌దేలేరా.  అన‌గ‌న‌గా ఒక కోతి. దానికోసారి కాల్లో ముల్లు గుచ్చుకుంది. తిన్న‌గా ఓ క్షుర‌కుడి ద‌గ్గ‌ర‌కు వ‌స్తే, అత‌డు త‌న క‌త్తితో ఆ ముల్లు తీసేశాడు. అప్పుడాకోతి ఆ క‌త్తి పుచ్చుకుని, 'ముల్లు పోయి క‌త్తి వ‌చ్చె, ఢాంఢాంఢాం...' అంటూ పారిపోయింది. ఆ క‌త్తిని కొబ్బ‌రి మ‌ట్ట‌లు కొట్టేవాడికిచ్చి, ఈ సారి ఆ  మ‌ట్ట పుచ్చుకుని ఉడాయించింది. 'ముల్లుపోయి క‌త్తి వ‌చ్చె ఢాంఢాంఢాం... క‌త్తిపోయి మ‌ట్ట వచ్చె ఢాంఢాంఢాం...' అనుకుంటూ పాడుకుంది. ఆ మ‌ట్ట‌ని బెల్లం త‌యారు చేసే వాడికిచ్చి, వాడిచ్చిన బెల్లం అచ్చు తీసుకుని మ‌ళ్లీ పాట అందుకుంది.

'ముల్లు పోయి క‌త్తి వ‌చ్చె ఢాంఢాంఢాం...

క‌త్తిపోయి మ‌ట్ట వ‌చ్చె ఢాంఢాంఢాం...

మ‌ట్ట‌పోయి అచ్చు వ‌చ్చె ఢాంఢాంఢాం..."

"ఆపండి గురూగారూ! ఆపండి. ఆ క‌థ గుర్తొచ్చిందండి. ఇలా ఆ కోతి ఆ అచ్చు ఇచ్చి బూరె, బూరె ఇచ్చి గోవు దొర‌క‌బుచ్చుకుని పారిపోతుందండి. అది పాడుకునే పాట కూడా పెరిగిపోతుందండి.  ఆ కోతి ప‌నుల వ‌ల్ల ఊరంతా గ‌గ్గోలు పెడితీ, ఆ కోతికి మాత్రం భ‌లేగా కాల‌క్షేపం అవుతుందండి. ఈ క‌థని చిన్న‌ప్పుడు మా అమ్మ‌మ్మ చెప్పిందండి. కానీ దానికీ నా స‌మ‌స్య‌కి ఏంటండి లింకునా ప‌రిస్థితి చూస్తే మీకంత న‌వ్వులాట‌గా ఉంద‌న్న‌మాటండి... "

"ఊరికే అలా ఉడుక్కోకురా... నేనేమీ న‌వ్వులాట‌కి అన్లేదు... సీరియ‌స్‌గానే చెప్పాను... ఓ స‌మ‌స్య‌ను ఎదుర్కోవాలంటే ప‌నిగ‌ట్టుకుని కొత్త దాన్ని తీసుకురావాలి... రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ది చూస్తూ కూడా తెలుసుకోలేక‌పోతే ఎలారా?"

"సార్‌... నాది కుటుంబ స‌మ‌స్య. దానికి మీరేమో రాజ‌కీయ ప‌రిష్కారం చెబుతున్నారు..."

"ఓరెర్రోడా... తెలివంటూ ఉండాలే కానీ కుటుంబ‌మైనా, రాజ‌కీయ‌మైనా ఒక‌టేరా... నెగ్గుకు రావాలంటే ఇలాంటి ట‌క్కుట‌మార విద్య‌లు తెలుసుకోవాలి మ‌రి..."

"స‌రే... గురూగారూ! మీరు రాజ‌కీయ పాఠంలోకి వ‌చ్చేశార‌ని అర్థమైపోయింది. కానీ మీ ఉదాహ‌ర‌ణే అర్థం కాలేదు. ఓ స‌మ‌స్య‌కి మ‌రో స‌మ‌స్య ఎలా విరుగుడో చెప్పండి..."

"అలారా దారికి. ఏముందిరాకాసేపు నీ కుటుంబం స‌మ‌స్య సంగ‌తి మ‌ర్చిపో. రాష్ట్రం కేసి చూడు. మొన్న‌మొన్న‌టి దాకా ఏంటి స‌మ‌స్య‌కాస్త ఆలోచించి చెప్పు..."

"చెప్ప‌డానికేముందండీఆర్థిక సమ‌స్యండి. మొన్న‌యినా, నిన్న‌యినా, రేప‌యినా అదే క‌దండి మ‌రి. అవ‌త‌ల ల‌క్ష‌ల కోట్ల అప్పులండి. తీర్చే దారి లేదండి. కొత్త అప్పులు తెస్తే కానీ బండి న‌డ‌వ‌ని దుస్థితండి. జీతాలు, పింఛ‌న్ల‌కి కూడా క‌ట‌క‌టేనండి... అంతేనాండీ?"

"అంతేరా... కానీ ప్ర‌భుత్వం నీలాగా బెంబేలెత్తిందాలేదే... నిమ్మ‌కు నీరెత్తినట్టు ఉందా లేదా? ఈలోగా ఆర్థిక దుస్థితి గురించి ఎవ‌రూ మాట్లాడుకోకుండా మ‌రో స‌మ‌స్య తెర మీద‌కి రాలేదూ?"

"ఏంటండీ అది?"

"ఏముందిరా... ఉన్న‌ట్టుండి సినిమా హాళ్ల మీద త‌నిఖీలు జ‌రిగాయా లేదా? అలాగే సినిమా టిక్కెట్ల రేట్లు త‌గ్గించేసేస‌రికి అంద‌రి క‌ళ్లూ దాని మీద ప‌డ్డాయాలేదా?"

"అవునండోయ్‌... జ‌నం అడ‌గ‌నూ లేదు, పెట్ట‌నూ లేదు కానీ ఉన్న‌ట్టుండి టికెట్ల ధ‌రని టీ, కాఫీల కంటే చ‌వ‌గ్గా త‌గ్గించేసేస‌రికి ఆ  య‌వ్వారం భ‌లే హిట్ట‌యిందండి. ఎక్క‌డ చూసినా దాని మీదే చ‌ర్చ‌లండి. సినిమా వాళ్లు ట్వీట్లండి. ఆ ట్వీట్ల మీద రాజ‌కీయ నేత‌ల రీట్వీట్లండి. హీరోల ప్ర‌క‌ట‌న‌లండి. దాని మీద మంత్రుల వ్యాఖ్య‌లండి. డైలాగుల మీద డైలాగులు తెగ పేలాయండి. స‌వాళ్ల మీద స‌వాళ్లండి. ఆఖ‌రికి ఓ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడికి మంత్రిగారి అపాయింట్‌మెంట్ దొరికండి. ఇద్ద‌రూ క‌లిసి చ‌ర్చ‌లండి. ఆ త‌ర్వాత ఓ పెద్ద హీరోగారే ఏకంగా వ‌చ్చేసి ముఖ్య‌మంత్రిగారితో విందార‌గించారండి. ఏం తిన్నారో,ఏం మాట్లాడుకున్నారో తెలీలేదండి కానీ, ఓ స‌స్సెన్స్ సినిమా క్లైమాక్సంత బాగా న‌డించిందండి సీను. ఆఖ‌రికి విలేక‌రుల స‌మావేశం పెట్టి ఆ పెద్ద హీరోగారు త్వ‌ర‌లోనే సానుకూల‌మైన పరిష్కారం దొరుకుతుంద‌ని చెప్పారండి. ఇంత వ‌ర‌కు అతీగ‌తీ లేదండి..."

"బాగా చెప్పావురా... స‌రే, ఆ స‌మ‌స్య అలాగే ఉంది. ఆ త‌ర్వాత ఏ స‌మ‌స్య వ‌చ్చిప‌డింది?"

"ఏముందండీ సంక్రాంతి వ‌చ్చిందండి. జ‌నం కాసేపు పండ‌గ చేసుకున్నారండి. ఈలోగా మంత్రిగారి కేసినో మీద మొద‌ల‌య్యిందండి గోల‌. అబ్బో... అది కూడా ఓ పెద్ద సంచ‌ల‌న‌మేనండి. పండ‌గ పేరు చెప్పి అమ్మాయిల డ్యాన్స‌లు, మ‌ధ్య‌లో పెద్ద పెద్దోళ్ల చిందులు వీడియోల్లో క‌నువిందు చేశాయండి. ఆ వీడియోలు ప‌ట్టుకుని ప్ర‌తిప‌క్షాలు దుమ్మూ గ‌ట్రా ఎత్తిపోశాయండి. మీడియాలో తెగ వార్త‌లొచ్చాయండి. స‌ద‌రు మంత్రిగారు అడ్డంగా బుకాయించారండి. జ‌నం ఓ ప‌క్క సెల్‌ఫోన్ల‌లో ఆ వీడియోలు చూస్తూనే, మ‌రోప‌క్క మంత్రిగారి మాట‌లు విని ఎంచ‌క్కా న‌వ్వుకున్నారండి... అంతేక‌దండీ..."

"అంతేరా అంతే. కానీ ప్ర‌భుత్వం ఏమైనా నీలాగా కంగారు ప‌డిందాలేదే... బాధ్య‌తాయుత‌మైన మంత్రిగారి ఆట‌ల గురించి కానీ, మాట‌ల గురించి కానీ పోలీసులు కూడా ప‌ట్టించుకోలేదు. అవునా? మ‌రి ఈ మొత్తం వ్య‌వ‌హారం మీద నుంచి జ‌నం దృష్టి మ‌ళ్లిస్తూ మ‌రో కొత్త సంగ‌తి బ‌య‌ట‌కొచ్చింది గ‌మ‌నించావా? అదేంటో చెప్పు?"

"ఆ... పీఆర్సీ గోలండి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు గ‌గ్గోలు పెట్టారండి. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా జీతాలు పెంచ‌మంటే, ఉన్న‌వి త‌గ్గించార‌ని ఊరూ వాడా యాగీ చేశారండి. ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు జ‌రిగాయండి. జ‌నం నోరెళ్ల‌బెట్టి చూశారండి. ఆఖ‌రికి ఈ య‌వ్వారం స‌మ్మె దాకా చేరిందండి... అంతేనాండీ?"

"బాగానే చెప్పావురా. మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఏమైనా నీలాగా బెంబేలెత్తిపోయిందాలేదే.... కానీ ఉద్యోగుల స‌మ‌స్య తీర‌నేలేదు, మ‌రో సంచ‌ల‌నం బ‌య‌ట‌కొచ్చింది గ‌మ‌నించావా?"

"అవునండి... జిల్లాల వ్య‌వ‌హారమండి. ఉన్న 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా ఉన్న‌ట్టుండి మార్చారండి. దాంతో జ‌నం దృష్టి కొత్త జిల్లాలు, వాటి స‌రిహ‌ద్దులు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ కేంద్రాలు... వీటి మీద ప‌డిందండి. చాలా చోట్ల మ‌ళ్లీ కొత్త జిల్లాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌ల‌ను మొద‌ల‌య్యాయండి. అస‌లు నాకు తెలీక‌డుగుతాను గురూగారూ, ఓ చ‌ర్చ కానీ, ఓ ప్ర‌తిపాద‌న‌కానీ, ఓ హేతుబ‌ద్ధ‌త కానీ, ఓ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ కానీ లేకుండా ఉన్న‌ట్టుండి జిల్లాల జీవో తేవ‌డ‌మేంటండీ?"

"నీలాగే చాలా మంది విమ‌ర్శించారురా... కానీ ప్ర‌భుత్వం ఏమైనా స్పందించిందాలేదే... కాబ‌ట్టి ఇన్నేసి స‌మ‌స్య‌లు, సంచ‌ల‌నాలు ఉన్న ప్ర‌భుత్వ‌మే నిదానంగా ఉంటే నీకెందుకురా దిగులు? అర్థ‌మైందా?"

"అమ్మ గురూగారూ! ఇప్పుడివ‌న్నీ నా చేత ఎందుకు చెప్పించారో అర్థ‌మైందండి. మీరు మొద‌ట్లో ఇచ్చిన స‌ల‌హాలో లోతు కూడా తెలిసిందండి. అంటే గురూగారూ... ఒక స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోడానికి మ‌రో స‌మ‌స్య‌ను తీసుకురావాల‌న్న‌మాట‌. అంటే కావాల‌నే ఇలా ఒక దాని త‌ర్వాత మ‌రో దానిని తెరమీద‌కి తీసుకొచ్చి తైత‌క్క‌లాడిస్తున్నారంటారా?"

"నోర్ముయ్‌రా బ‌డుద్ధాయ్‌. గూడార్థాలు తెలుసుకోరా అంటే, గూడుపుఠానీలు వెతుకుతావేంటి? ఎవ‌రేం చేశార‌న్న‌ది కాదురా కొశ్చ‌ను. ఇలాంటి ప‌రిస్థితులు వ‌చ్చిన‌ప్పుడు ఎలా సంబాళించుకోవాల‌నేదే పాయింటు. కుదురుగా పాఠాలు నేర్చుకో. లోతుల్లోకి వెళ్ల‌కు. మొద‌ట్లో అధికార‌మే ఓ స‌మ‌స్య‌. దానికి పాద‌యాత్ర‌లే జ‌వాబు. అధికారం అందాక రాజ‌కీయ క‌క్ష‌లెలా తీర్చుకోవ‌డ‌మ‌నేదే స‌మ‌స్య‌. దానికి అమ‌రావ‌తే స‌మాధానం. దాన్ని అట‌కెక్కించాక రైతుల ఆందోళ‌న‌, ఆపై ఇసుక త‌వ్వ‌కాల య‌వ్వారం, ఆపై మ‌ద్యం పాల‌సీ, ఆపై మూడు రాజ‌ధానుల సంచ‌ల‌నం, ఆపై గంజాయి, డ్ర‌గ్స్ గొడ‌వ‌, అది తెర‌మ‌రుగ‌య్యేలా ఎయిడెడ్ పాఠ‌శాల‌ల నిర్ణ‌యం, ఈలోగా పేద‌ల ఇళ్ల రిజిష్ట్రేష‌న్ ప‌థ‌కం, ఆపై స్థ‌లాల రిగ్యుల‌రైజేషన్ వ్య‌వ‌హారం, సినిమా టికెట్లు, కేసినో, పీఆర్సీ, జిల్లాలు... ఇలా ఒక దాని త‌ర్వాత మ‌రొక‌టి స‌మ‌స్య‌లు పుచ్చుకుని కోతికొమ్మ‌చ్చి ఆటలాడ్డం నేర్చుకున్నావ‌నుకో. ప‌రిష్కారాల సంగ‌త‌లా ఉంచి నీకిక కాల‌క్షేప‌మే కాల‌క్షేపం. అర్థ‌మైందా?"

"నిక్షేపంలా అర్థ‌మైంది గురూగారూ! మీరింత చెప్పాక నావేవీ స‌మ‌స్య‌లే కాద‌నిపిస్తోందండి. పైగా హుషారుగా పాట కూడా పాడుకోవాల‌నిపిస్తోందండి..."

"ఏం పాట‌రా అది?"

"పాత‌ది వ‌దిలి  కొత్త‌ది ప‌ట్టుకో... ఢాంఢాంఢాం!

స‌మ‌స్య వ‌దిలి సంచ‌ల‌నం చెయ్యి...  ఢాంఢాంఢాం!

సిగ్గును వ‌దిలి మొగ్గ‌లు వెయ్యి... ఢాంఢాంఢాం!

పాల‌న వ‌దిలి గోల‌ను చెయ్యి... ఢాంఢాంఢాం!

కుర్చీ ఎక్కి కాల‌క్షేపం చెయ్యి... ఢాంఢాంఢాం!

జ‌నాన్ని మ‌ర‌చి జాత‌ర చెయ్యి... ఢాంఢాంఢాం!"

"శెభాష్‌రా... మొత్తానికి నీకు రాజ‌కీయం వంట‌బ‌ట్టింది. ఇక ఇవాల్టికి పోయిరా"

-సృజ‌న‌

PUBLISHED ON 1.2.2022 ON JANASENA WEBSITE

ఆదివారం, జనవరి 23, 2022

అక‌టా ఈ శ‌క‌ట‌ములు... ఘ‌న “తంత్ర”ములు!

 


గ‌ణ‌తంత్ర దినోత్స‌వం. వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్య‌మంత్రి, మంత్రులు, అధికారులు ఆశీనుల‌య్యారు. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన గ్యాల‌రీలో సామాన్యుడు ఒదిగి కూర్చున్నాడు. ముఖ్యుల ప్ర‌సంగాల‌య్యాక ఓ అధికారి లేచి, “ఇప్పుడు శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌. మ‌న ప్రభుత్వం సాధించిన ప్ర‌గ‌తిని ప్ర‌తిబింబించే శ‌క‌టాలివి. అంద‌రూ తిల‌కించి పుల‌కించాలి అంటూ ప్ర‌క‌టించారు. వ‌ర‌స‌గా శ‌క‌టాలు రాసాగాయి. వాటిని చూస్తున్న సామాన్యుడు ప‌కాల్మ‌ని న‌వ్వాడు.

ఎందుకు న‌వ్వుతున్నావ్‌?” అని అడిగాడు ప‌క్క‌నున్న‌వాడు.

నా క‌ళ్ల‌తో చూస్తే తెలుస్తుంది...

అయితే ఆ దృశ్యాలేంటో నాకూ చూపించు...

స‌రే చూడు మ‌రి...

******

అలంక‌రించి ఓ శ‌క‌టంపై పెద్ద పెద్ద పీపాలున్నాయి. వాటిలో ఉన్న ద్ర‌వాన్ని కొంద‌రు మ‌గ్గుల‌తో తీసి మ‌రికొంద‌రి నోళ్ల‌లో పోస్తున్నారు. వాళ్లంతా జోగుతున్నారు. ఆ ప‌క్క‌నే మ‌రి కొంద‌రు నోట్ల క‌ట్ట‌లు లెక్క‌పెడుతున్నారు.

ఆ పీపాలేంటి? ఆ పోసేదేంటి?”

మ‌ద్యం. మ‌రి అదే క‌దా మ‌న ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన ఆదాయాన్ని అందించేది. మ‌ద్య పాన నిషేధాన్ని అంచెలంచెలుగా సాధిస్తాన‌ని వాగ్దానాలు గుప్పించిన ముఖ్య‌మంత్రి, కుర్చీ ఎక్కగానే ఏం చేశాడు? అస్మ‌దీయుల‌కు మ‌ద్యం కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టాడు. వాళ్లేమో ర‌క‌ర‌కాల కొత్త కొత్త బ్రాండ్ల‌ను తీసుకొచ్చారు. వాటి ఖ‌రీదు ఎక్కువైనా జ‌నానికి తాగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అలా కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్న డ‌బ్బుని కాంట్రాక్ట‌ర్లు లెక్క పెట్టుకుంటున్నారు చూశావుగా? ఇది మ‌న రాష్ట్రంలో మ‌ద్య‌పాన విధానం మ‌రి...

ఇంత‌లో ఆ శ‌కటం మీద కొంద‌రు నృత్యం చేస్తూ పాటందుకున్నారు...

తాగ‌వోయి భార‌తీయుడా... తాగి సాగ‌వోయి మ‌త్తు దారులా....

ఎంత‌యినా తాగ‌వ‌యా... తాగి జోగ‌వ‌యా...

నీ జేబుకి చిల్లులే... మా పాలిట కాసుల‌యా!

అంటూ పాట సాగుతుండ‌గా ఆ శ‌క‌టం వెళ్లిపోయింది.

నోరెళ్ల బెట్టిన పక్కోడితో సామాన్య‌డు చెప్ప‌సాగాడు...

కింద‌టేడు మ‌ద్యం ద్వారా వ‌చ్చిన ఆదాయం ఎంతో తెలుసా? 17,600 కోట్లు! మ‌ద్యం రేట్ల‌ను ఏకంగా 125 శాతం పెంచేశారు. ఓ ప‌క్క‌న ముఖ్య‌మంత్రి మ‌ద్యం వాడ‌కాన్ని నియంత్రిస్తామ‌ని చెబుతుంటే మ‌ర ప‌క్క బెల్టు షాపుల్లో య‌ధేచ్చ‌గా దొరుకుతోంది. మ‌రి ఇలాంటి క‌బుర్లు వింటుంటే న‌వ్వు రాదా మ‌రి అన్నాడు సామాన్య‌డు.

నిజ‌మే అంటూ ప‌క్క‌వాడు కూడా న‌వ్వేశాడు.

****

ఇంత‌లో మ‌రో శ‌క‌టం వ‌చ్చింది. దాని మీద పోలీసులు లాఠీల‌తో హ‌డావుడి చేస్తున్నారు. శ‌క‌టం మీద అటూ ఇటూ పారిపోతున్న వారిని వెంట ప‌డి మ‌రీ కొడుతున్నారు. మ‌రో ప‌క్క రౌడీలు కొంద‌ర్ని  వేధిస్తుంటే పోలీసులు చ‌ప్ప‌ట్లు కొట్టి ప్రోత్స‌హిస్తున్నారు.

మ‌రో ప‌క్క నుంచి మైకులో పాట వినిపిస్తోంది.

చ‌ట్టాల్ని తిర‌గ‌రాయి... కేసుల్ని మోప‌వోయి...

అడిగితే విర‌గ‌దీయి... నీదేను పైచేయి!

ప‌క్కోడు తెల్ల‌బోయి ఇదేం విచిత్రం?” అన్నాడు.

ఆ పారిపోతున్న వారంతా ప్ర‌భుత్వ విధానాల‌లో లోపాలను ప్ర‌శ్నించిన వాళ్లు. వాళ్లు లేవ‌నెత్తిన విష‌యాల‌పై నిజానిజాలు తేల్చుకుని స‌రిదిద్దుకోవాల్సిన ప్ర‌భుత్వం ఏం చేస్తోంది? అడిగిన వాడిపైనే కేసులు పెట్టిస్తోంది. విమ‌ర్శించిన వాడిని తీసుకొచ్చి కుళ్ల‌బొడుస్తున్నారు. ప్ర‌శ్నించిన వాడిని నేత‌ల అనుచ‌రులు రౌడీల్లా వేధిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలాటి చిత్ర‌మైన పాల‌న చూస్తుంటే న‌వ్వు రాదంటావా?” అంటూ న‌వ్వేశాడు సామాన్యుడు.

******

ఈలోగా మ‌రో శ‌క‌టం వ‌స్తుంటే పాట గ‌ట్టిగా వినిపించ‌సాగింది.

గ‌నులు క‌నుల‌లో క‌న‌బ‌డితే ఆ క‌ల‌యిక‌ఫ‌ల‌మేమి?

ప‌నులే...

ఆ ప‌నిలో నీవే జొర‌బ‌డితే ఆ చొర‌వ‌కు బ‌ల‌మేమి?

కాసులే...

ఆ కాసులు నీవే కొల్ల‌గొడితే ఆపై జ‌రిగేదేమి?

దోపిడీ... దోపిడీ...

ఆ దోపిడికి అంద‌రు జ‌త‌గ‌డితే అందుకు కార‌ణ‌మేమి?

అధికారం!

ఆ శ‌క‌టంపై ఉన్న వారి చేతిలో గున‌పాలు ఉన్నాయి. వాళ్లు ఆ శ‌కటం మీద ఉన్న కొండ‌ల‌ను త‌వ్వుతున్నారు. అలా  తవ్వుతున్న కొద్దీ నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట ప‌డుతున్నాయి. వాటిని విర‌గ‌బ‌డి న‌వ్వుతూ జేబుల్లో కుక్కుకుంటున్నారు కొంద‌రు.

కొండ‌లు త‌వ్వుతుంటే మ‌ట్టి రావాలి కానీ నోట్లు రావ‌డ‌మేంటి గురూ?” అని అడిగాడు ప‌క్క‌నోడు.

అదే మ‌రి చిత్రం. రాష్ట్రంలో అధికారికంగా 44 గ‌నులు ఉన్నాయి. వాటికి ఇచ్చిన అనుమ‌తుల‌ను అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా ప‌రిమితికి మించి త‌వ్వేసుకుంటున్నారు కాంట్రాక్ట‌ర్లు. వాళ్లంతా అధికార పార్టీకి కావ‌ల‌సిన వాళ్లే. ఇలా ఇసుక‌, కంక‌ర‌, తెల్ల‌రాయి, గ్రానైట్‌, గ్రాఫైట్‌... ఇలా ఒక‌టేమిటి, ప్ర‌కృతి సంప‌ద‌నంతా ఇష్టారాజ్యంగా త‌వ్వేసుకుని మార్కెట్లో అక్ర‌మంగా అమ్మేసుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారంలో కింది నుంచి పై వ‌ర‌కు మామూళ్లు అందుతాయి. పైకి మాత్రం తూతూ మంత్రంగా అప్పుడ‌ప్పుడు కొన్ని లారీలు ప‌ట్టుకుని గొప్ప‌గా చెప్పుకుంటుంటే న‌వ్వు రాదా చెప్పు?”

**************

ఈలోగా ఇంకో శ‌కటం రాసాగింది. అందులో బ‌క్క‌డిక్కిన కొంద‌ర్ని కొర‌డాల‌తో బాదుతున్నారు రౌడీలు. దెబ్బ‌లు తింటున్న వాళ్లంతా లబోదిబో అంటున్నారు.

ప‌క్క‌నుంచి పాట బిగ్గ‌ర‌గా వినిపించ సాగింది.

దుల‌ప‌ర బుల్లోడా దుడ్లు దుల‌ప‌ర బుల్లోడా...

దొరికిన వారిని దొర‌క‌బుచ్చ‌కుని...

దౌర్జ‌న్యంగా పీక ప‌ట్టుకుని...

అయ్యో పాపం ఎందుక‌లా కొడుతున్నారు?  వాళ్లేం చేశారు పాపం... అన్నాడు ప‌క్కోడు.

సామాన్య‌డు గట్టిగా న‌వ్వి, “వాళ్ల చేసిన పాపం ఒక్క‌టే... అది పాద‌యాత్ర‌లు చేసిన అధినేత‌ను న‌మ్మ‌డం. ఆ పాప‌మే వాళ్ల పాలిట శాపమైంది. అందుకే అనుభ‌విస్తున్నారు. వాళ్లంతా నేర‌స్థులు కాదు. అతి సామాన్యులు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని వాళ్లు. వాళ్ల‌కి గ‌త ప్రభుత్వాలు కేటాయించిన ఇళ్ల‌ని ఇప్ప‌టికిప్పుడు కొత్త‌గా రిజిష్ట‌ర్ చేయించుకోవాల‌ని ఇంటింటికీ వెళ్లి బెదిరిస్తున్నారు పాల‌కుల అనుయాయులు. అలాగే ఆక్ర‌మిత ప్ర‌భుత్వ స్థ‌లాల్లో చిన్న చిన్న గూళ్లు క‌ట్టుకున్న వారిని క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌పేరుతో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు క‌ట్టాల‌ని నోటీసులు ఇస్తున్నారు. అలా క‌ట్ట‌క పోతే ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేస్తామ‌ని, చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బెంబేలెత్తిస్తున్నారు. స్వ‌ర్ణ‌యుగం తెస్తానంటూ సింహాస‌నం మీద కూర్చుని బ‌డుగు ప్ర‌జ‌ల‌ను పీడించుకు తింటూ కూడా  అదేదో పేద‌ల కోస‌మే అన్న‌ట్టు ప్ర‌చారాలు చేసుకుంటుంటే తెగ న‌వ్వొస్తోంది అన్నాడు సామాన్యుడు.

******

ఇంత‌లో మ‌రో శ‌క‌టం మీద ముఖ్య‌మంత్రి, మంత్రులు కూడా నుంచుని క‌నిపించారు. వాళ్లంద‌రి చేతుల్లో బొచ్చెలున్నాయి. వాటిని కిందికీ మీద‌కీ ఊపుతూ వాళ్లంతా ముక్త‌కంఠంతో పాడ‌సాగారు.

ధ‌ర్మం చెయ్ బాబూ...

పైసా ధ‌ర్మం చెయ్ బాబూ...

ధ‌ర్మం చేస్తే వ‌డ్డీ వ‌స్త‌ది...

కాసులు దొరుకును బాబూ!

ప‌క్కోడు ఆశ్చ‌ర్య‌పోతూ, “ఇదెక్క‌డి ముష్టిరా నాయ‌నా... అన్నాడు.

ఇది మా ప్ర‌భుత్వం దుస్థితి మ‌రి... తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది  మా స‌ర్కారు. అందుకోస‌మే అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. ఆ అప్పుల కోసం తిప్ప‌లే ఇవ‌న్న‌మాట. స‌రైన స‌మ‌యానికి జీతాలు, పింఛ‌న్లు ఇవ్వ‌డానికి కూడా  కిందా మీదా ప‌డాల్సి వ‌స్తోంది. అంతెందుకు మొన్న సంక్రాంతి పండ‌క్కి కూడా జీతాలు వేయ‌లేక ఎంద‌రినో ఉసురు పెట్టారు. వాస్త‌వం ఇలా ఉంటే రాష్ట్ర ఆదాయం పెరిగిందంటూ ప్ర‌చారాలు చేస్తుంటే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాల‌నిపించ‌దా?” అన్నాడు సామాన్యుడు.

ఆస‌రికి ప‌క్కోడికి చిర్రెత్తుకొచ్చింది. అయినా నాకు తెలియ‌క అడుగుతాను... క‌ళ్ల ముందు ఇన్ని దారుణాలు జ‌రుగుతుంటే నీకు న‌వ్వెలా వ‌స్తోంది?” అని అడిగాడు.

ఏడ‌వ‌లేక‌! అంటూ తువ్వాళు దులుపుకుని చ‌క్కాపోయాడు సామాన్యుడు.

-సృజ‌న‌

PUBLISHED ON 22.1.2022 ON JANASENA WEBSITE

 

సోమవారం, జనవరి 17, 2022

వ‌ద్దు త‌ల్లీ!



అమ్మా... మ‌హాలక్ష్మీ!

బంగారు ఉసిరికాయ‌ల‌ను...

నా న‌ట్టింట్లో కురిపించ‌న‌క్క‌ర‌లేదు!

అఖండైశ్వ‌ర్యాల‌ను...

నాకు అనుగ్ర‌హించ‌న‌క్క‌ర‌లేదు!

ధ‌న‌క‌న‌క వ‌స్తు వాహ‌నాల‌ను...

నాకు ఇవ్వ‌క్క‌ర‌లేదు!

కానీ...

ల‌క్ష్మీప్ర‌ద‌మైన గుణ‌గణాల‌ను నాకు క‌ల్పించు!

నీకు న‌చ్చే అల‌వాట్ల‌ను నాలో పెంపొందించు!

ఎందుకంటే...

వాటి వెన‌కే నీవు ఎల్ల‌ప్పుడూ ఉంటావు క‌దా త‌ల్లీ!

నీ వెనుక‌నే అన్నీవ‌స్తాయి క‌దా త‌ల్లీ!!


మంగళవారం, జనవరి 11, 2022

అప్పుడే... అస‌లైన పండుగ‌!



 

"భ‌గ‌భ‌గా మండాలి భోగి మంట‌ల్లు...

భోగి మంట‌ల్లోన కాలాలి క‌ట్టాలు..."

సంబ‌రంగా భోగి మంట చుట్టూ తిరుగింది ఎంకి. చ‌టుక్కున ఇంట్లోకి వెళ్లి కొన్ని ఆవుపిడ‌క‌లు తెచ్చి మంట ద‌గ్గ‌ర కూర్చున్న మావ చేతికిచ్చి, "మావా... ఇవి మంట‌ల్లో ప‌డేత్తే  ఈటితో పాటు మ‌న క‌ట్టాలు కూడా కాలిపోతాయంట‌..." అంది.

మావ వాటిని అందుకుని మంట‌ల్లో వేసి, "ఇలాంటివి ఎన్నేసినా మ‌న బాధ‌లోప‌ట్టాన‌ తీరేవి కాదే ఎంకీ..." అంటూ చ‌లి కాచుకోసాగాడు.

"ఊరుకో మావా...  పండ‌గ రోజుల్లో కూడా ఉసూరుమంటే ఎలా? ప‌ద‌... అలా వెళ్లి ఎవ‌రెలాంటి మంట‌లేత్త‌న్నారో చూసొద్దాం... " అంటూ చెయ్యి ప‌ట్టుకుని లాక్కెళ్లింది.

ఇద్ద‌రూ క‌లిసి ఓ ఇంటికెళ్లారు. అది ఓ ముఖ్య నాయ‌కుడి ఇల్లు. ఆయ‌న అనుచ‌రులంతా క‌లిసి మంట‌ల్లో ఏవేవో వేస్తున్నారు. మంట‌లు ఉవ్వెత్తున లేస్తున్నాయి.

"ఏంటి మావా ఏత్త‌న్నారు?" అంది ఎంకి.

మావ ప‌రిశీల‌న‌గా చూసి, "ప్ర‌జల‌కిచ్చిన వాగ్దానాలు" అన్నాడు.

"అదేటి మావా? ఎవరైనా భోగి మంట‌ల్లో పుడ‌క‌లేత్తారు, పిడ‌క‌లేత్తారు కానీ ఇయేంటీ?" అంది.

"స‌ర్లేవే... ఈ ఇల్లు ఎవ‌రిద‌నుకున్నావు? మ‌న ముఖ్య‌నేతలుంగారి ఇల్లు. ఎన్నిక‌ల‌ప్పుడు ఈయ‌న ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమ‌ల‌య్యేనా, చచ్చేనా? ఆయ‌న ద‌గ్గ‌ర త‌గ‌లెట్ట‌డానికి ఇంకేం మిగిలాయి సెప్పు?" అన్నాడు.

"అదేంటి మావా? జ‌నాల‌కిచ్చిన మాట‌ల‌న్నీ నిల‌బెట్టేసుకున్నాం... సెప్పిన‌వ‌న్నీ సేసేత్త‌న్నాం... అస‌లిన్నేసి మంచి ప‌నులు చేసే పార్టీ మాదే కానీ మ‌రోటి దేశంలోనే లేద‌ని సెబ‌తా... ఓ ఊద‌రగొట్టేత్త‌న్నారు గందా? మ‌రి నువ్వేటి అలా తీసి పారేత్త‌న్నావు?"

"ఊరుకోయే... ఇన్నాళ్లూ ఆల్ల పాల‌న సూసి కూడా బుద్ది రాలేదేటే?  మూడేళ్ల నాడు నేను సంపాదించే రూక‌ల్తో ఇల్లంతా గ‌డిచేది. పైగా ప‌దో ప‌ర‌కో ఎద‌ర క‌ర్సుల క‌ని ముంత‌లో వేసేటోల్లం. మ‌రియ్యాల అలా వ‌చ్చేదిలా ఎలిపోతాంది. బియ్యం ధ‌ర సూత్తే కొనేలా ఉందా అని?  కంచం నిండా ప‌ప్పు క‌లుపుకుని తిని ఎన్న‌ళ్ల‌యిందో సెప్పు?  సూసి సూసి కొన‌గ‌లుగుతున్నామా అంట‌?  పోపులోకి నూని కోసం గిజ‌గిజ‌లాడిపోత‌న్నావు. కూర‌గాయ‌లు ధ‌ర‌ల‌కి పొంత‌నంటూ ఉందంటే?"

ఎంకి ఏదో అనేంత‌లో మ‌రి కొంద‌రు అనుచ‌రులు మ‌రిన్ని క‌ట్ట‌లేవో తెచ్చి మంట‌లో ప‌డేశాడు. మంట‌లు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి.

"ఓయ‌బ్బో... పెద్ద భోగిమంటే. ఇప్పుడేటి తెచ్చి ప‌డేశాడు మావా?" అంది ఎంకి.

"ఇయ్యా... ఆళ్లు ప్ర‌జ‌ల కోసం పెట్టిన ప‌థ‌కాలే. ఆటి అమ‌లు లాగే ఇయ్యీ త‌గ‌ల‌డుతున్నాయి సూడు..."

"అంటే మావా? ఈల్లు పెట్టి ప‌థ‌కాలు స‌రిగా లేవంటావా?"

"నువ్వు మ‌డిసివైతే ఎదిగావు కానీ, బుర్ర ఇస‌క ప‌ర్రే. భోగి మంట‌లు సూద్దార‌నే స‌ర‌దానే కానీ, మ‌న సుట్టూ ఉన్న క‌ట్టాల మంట‌ల సెగని కానుకున్న‌ట్టు లేదు..."

"అట్టా కోప్ప‌డ‌కు మావా... కూసింత తెలిసేట్టు సెప్పొచ్చు క‌దా?"

"మ‌ర‌దే... ఏమ‌న్నా అంటే బుంగ‌మూతెడ‌తావు. కాస్త నీ సుట్టూతా ఏం జ‌రుగుతాందో సూత్తా ఎరిక పెంచుకోవాల‌ని ఎంత సెప్పినా బుర్ర‌కెక్కించుకోవు. ఈల్లంతా క‌లిసి ఊరూవాడా నానా కంగాలీ సేసి బోలెడ‌న్ని ప‌ధ‌కాలెట్టేశారా?  తామ‌స‌లు పుట్టిందే పెజానీకం కోస‌మ‌న్న‌ట్టు పోజులు కొడ‌త‌న్నారా?  మ‌రి ఈ మూడేళ్ల‌లో మ‌నకి కానీ, మ‌న సుట్టూతా ఉన్న మ‌న‌లాంటి బ‌డుగులకి కానీ కూసింతైనా ఎదుగుద‌ల ఉందా సెప్పు?  కానీ ఓపాలి ఈ నేత‌లు, ఈల్ల అనుచ‌రులు, ఆల్ల బంధువులు, సుట్టాలు, తోక‌గాళ్ల కేసి సూడు. మొన్న‌టిదాకా న‌డుచుకుంటా పోయేటోడు ఇయాల స్కూట‌రెక్కి బ‌ర్రున పోత‌న్నాడు. సైకిల్ బెల్లు కొట్టేటోడ‌ల్లా కారు హార‌ను మోగిత్త‌న్నాడు. కిరాయింట్లో ఉండేటోడు సొంతింట్లోకి మారాడు. గ‌మ‌నించావా?"

"అవ్‌... మావా! నువు సెబ‌తాంటే తెలుస్తాంది. మ‌న‌వేంటో మ‌న బ‌తుకులేంటో, ఎక్క‌డ వేసి గొంగ‌డి అక్క‌డే అన్న‌ట్టున్నాం..."

"మ‌ర‌దేనే సెబుతాంట‌... ఈల్లంతా మ‌న పేదోల్ల పేరు జెప్పి అయిన‌కాడికి నొల్లు కుంటున్నారు. పేదోళ్ల‌కి ఇల్లిత్తామ‌ని ఊరూవాడా ఊరేగుతూ హామీలిచ్చి చేతులూపారా? మ‌న‌మంతా కామోస‌నుకున్నాం. ఇప్పుడేమైంది? మ‌న‌గ్గానీ, మ‌న ప‌క్కోడికి కానీ వ‌చ్చిందా?  పైగా ఎప్పుడో ముప్పై ఏళ్ల నాడు వేరే పార్టీలోళ్లు ఇచ్చిన ఇల్ల మీద కూడా ఇప్పుడు డ‌బ్బులు క‌ట్టాల‌ని బెదిరిత్త‌న్నారు. ఎప్ప‌టి నుంచో ఉంటున్న ఇల్ల‌ని, సోట్ల‌ని ఇప్పుడు కొత్త‌గా రిజిట్రేష‌న్ సేయించుకోవాలంట‌. పైగా ఎంత క‌ట్టాలో కూడా ఆల్లే సెబ‌త‌న్నారు. ఉన్న‌ట్టుండి అంత‌లేసి సొమ్ములు తెచ్చి పోయాలంటే మ‌న‌లాగా రెక్క‌డితే కానీ డొక్కాడ‌ని వోల్ల‌కి ఎంత క‌ట్ట‌మో ఆలోసించు. పైగా అలా సెయ్య‌క‌పోతే రేష‌నాగిపోద్ది, పించ‌నాగిపోద్ది అంటూ ఇల్ల‌కాడ‌కొచ్చి జ‌మాయిత్త‌న్నారంట‌. ఇదెక్క‌డి దిక్కుమాలిన సిత్ర‌మో నువ్వే సెప్పు?"

"అవ్‌... మావా! మొన్న ఊర్నుంచి మా అన్నయ్యొచ్చాడు క‌దా, ఆడు కూడా ఇలాగే సెబుతుంటాడు.  ఆడికి గ‌వ‌ర్నమెంటు నుంచి రావ‌ల‌సిన సొమ్ముకి అతీగ‌తీ లేదంట‌. అంత పెద్ద ప్రెబుత్వం ఈడికి బాకీ ప‌డ్డ‌మేంటో?"

"మీ అన్న‌య్యే కాదే... ఆడిలాంటి ఎంద‌రో రైతుల గోసేనే అది. ఆళ్ల కాడ నుంచి సేక‌రించిన ధాన్యం తాలూకు డ‌బ్బులు సానా మందికి అంద‌నేదంట‌. అలా రాట్ర‌మంతా సూత్తే కొన్ని కోట్ల‌కి కోట్లు బ‌కాయిలంట‌. ఆ డ‌బ్బులెప్పుడొత్తాయోన‌ని సానా మంది సిన్న‌కారు రైత‌న్న‌లు ఆశ‌లెట్టుకు సూత్త‌న్నారు. అట్టాగే పొలాల్లో బోర్లు వేయిత్తామ‌ని హ‌డావుడి సేశారా? ఏదీ, ఒక్క బోరు బిగించారేమో సూపించు. ఒక‌టో అరో సోట బోర్లేసినా ఆటికి క‌రెంటు క‌నెక్ష‌న్ లేదు. ఇలా సెప్పుకుంటాపోతే రైత‌న్నల క‌ట్టాలు మ‌రీ ఎక్కువే. అన్న‌ట్టు నీకో  సిత్ర‌మైన సంగ‌తి తెలుసా? ఈ గ‌వ‌ర్న‌మెంటు సేతిలో డ‌బ్బులాడ్డం లేదంట‌. ప్ర‌తి నెల మ‌నం అక్క‌డా ఇక్క‌డా త‌డుముకుంటాం సూడు... అట్టాగే ఈ గ‌వ‌ర్న‌మెంటు కూడా జీత‌గాళ్ల‌కి జీతాలివ్వ‌డానికి కూడా క‌ట‌క‌ట‌లాడిపోతోందంట‌. మ‌నం సేబ‌దుళ్లు తీసుకున్న‌ట్టే ఈల్లు కూడా అయిన సోట‌ల్లా అప్పులు సేసేత్త‌న్నారంట‌. ఇలా అప్పులు సేయ‌డంలో దేశం మొత్తంమీద ఈల్లే గొప్పోళ్లంట‌..."

"అయ్యో పాపం... ఈ   గ‌వ‌ర్న‌మెంటు కూడా పేదైపోయింద‌న్న‌మాట‌... అంతేనా మావా?"

"ఏడిశావే... గ‌వ‌ర్నమెంటు కాడ డ‌బ్బులాడ్డంలేదు కానీ, దాన్ని న‌డుపుతున్న నేత‌లు, నాయ‌కులు మాత్రం కోట్ల‌కు కోట్లు వెన‌కేత్త‌న్నారంట‌, తెలుసా?"

"అదెట్టా మావా?"

"అధికార‌మే... అధికారం. మ‌న రాట్రంలో ఎన్నో విలువైన బూములు, గ‌నులు ఉంటాయా? ఆటిని ఈ నేత‌లు ఎవురెవురికో అప్ప‌జెప్పుతారంట‌. అలా అప్ప‌జెప్ప‌డానికి కోట్ల‌కు కోట్లు దండుకుంటారంట‌..."

"కానీ మావా! నాకు తెలీక అడుగుతానూ, మ‌రీళ్లంతా ఇలా అడ్డ‌గోలుగా సేత్తా ఉంటే ఆపే వాళ్లుండ‌రా? మ‌రి సెట్టాలు గ‌ట్రా ఉంటాయి క‌దా?"

"ఓసెర్రి మొగ‌వా! ఇదంతా పైకి సెట్ట ప్ర‌కార‌మే జ‌రుగుతుందే.  ప్ర‌జ‌ల పేరు సెప్పి, అభివృద్ధి పేరు సెప్పి సేత్తార‌న్న‌మాట‌. లోపాయికారీగా మాత్రం సొమ్ములు సేతులు మారిపోతాయి. తెలిసిందా?"

మావ చెప్పిందంతా విని ఎంకి నోరెళ్లబెట్టింది. ఈలోగా ముఖ్య‌నేత మ‌రి కొంద‌రు  అనుచ‌రుల‌తో వ‌చ్చి మంట‌ల్లో ఇంకేవో ప‌డేశాడు. దాంతో భోగిమంట ఆకాశానికెక్కింది.

"ఓల‌బ్బోల‌బ్బో... ఎంత‌లేసి మంట‌లు మావా? ఈయ‌నేంటి ప‌డేశాడో?" అంది ఆశ్చ‌ర్యంగా.

"ఈయ‌నెవ‌రుకున్నావే? అంద‌రికంటే పెద్ద నేత‌. ఈయ‌న‌గారి మీద బోలెడ‌న్ని కేసులు కూడా ఉన్నాయి. అయ్య‌న్నీ ఓ కొలిక్కి తేడానికి కోర్టుల్లో కిందా మీదా ప‌డుతున్నారంట‌. బ‌హుళా ఈయ‌న సేసిన అవ‌క‌త‌వ‌క‌లు, మోసాలు, కుట్ర‌ల‌కు సంబంధించిన సాచ్చికాలు, రుజువులు ప‌డేసుంటాడు. అందుకే అంత‌లేసి మంట‌లు..."

ఎంకి ఏదో అన‌బోయేంత‌లో ఆ నేత‌, ఆయ‌న అనుచ‌రులు అంద‌రూ క‌లిసి భోగి మంట చుట్టూ పాట‌లు పాడుతూ డ్యాన్స్ చేయ‌సాగారు.

"గొబ్బీయ‌లో... గొబ్బీయ‌లో...

జ‌నం సొమ్ము జెల్ల కొట్టి దొబ్బేయాలో!

గ‌నుల‌న్నీ కొల్ల‌గొట్టి దోచేయాలో!

భూముల‌న్ని చుట్ట‌బెట్టి నొక్కేయాలో!

ప‌థ‌కాల పేరు చెప్పి గొబ్బీయ‌లో...

ప్ర‌జ‌ల‌ను ఏమార్చాలో గొబ్బీయలో!

ఖ‌జానా సొమ్ముల‌న్ని గొబ్బీయలో...

ఖ‌ర్చు రాసి లాగాలో గొబ్బీయలో!

ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే గొబ్బీయ‌లో...

ఎదురెట్టి ఏకాలో గొబ్బీయ‌లో!

కేసులెట్టి కుళ్ల‌బొడిచి గొబ్బీయ‌లో...

నోరెత్త‌కుండ చేయాలో గొబ్బీయ‌లో!

గొబ్బీయ‌లో...గొబ్బీయ‌లో!

పాట వింటుంటే ఎంకికి చిర్రెత్తుకొచ్చింది.

"సాల్లే మావా! ఇక భోగి మంట‌లేం సూడ‌క్క‌ర్లేదు. ఈల్ల పాల‌న కంటె పెద్ద మంట ఇంకేముంట‌ది? అస‌లు ఈల్లంద‌ర్నీ వేయాలి భోగిమంట‌ల్లో. ప‌ద ఇంటికి పోయి ఉన్న‌దేదో తిని తొంగుందాం. మ‌న‌లాంటోల్ల‌కి పండ‌గైనా ఒక‌టే, ప‌బ్బ‌మైనా ఒక‌టే. ఇలాంటి నేత‌లంద‌ర్నీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇంటికి పంపించాకే మ‌నంద‌రికీ నిజ‌మైన సంక్రాంతి!" అంది ఎంకి కోపంగా.

"నీకు బుద్దొచ్చిందిగా... ఇక మ‌న‌క‌న్నీ పండ‌గ రోజులే. ప‌ద‌..." అన్నాడు మావ హుషారుగా.

-సృజ‌న‌

PUBLISHED ON 11.1.2022 ON JANASENA WEBSITE