శుక్రవారం, ఏప్రిల్ 29, 2022

విల‌క్ష‌ణ ప‌రిపాల‌న దురంధ‌రుడు!


 శిష్యుడు రాగానే గురువుగారు త‌న చెయ్యిని ముందుకు చాచారు. శిష్యుడు అయోమ‌యంగా చూశాడు.

"ఏరా... అర్థం కాలేదా?" అన్నారు గురువుగారు.
"లేదండీ..." అన్నాడు శిష్యుడు బుర్రగోక్కుంటూ.
"నా చెయ్యి ప‌ట్టుకుని సుతారంగా ముద్దు పెట్టుకోరా..." అన్నారు గురువుగారు న‌వ్వుతూ.
శిష్యుడు సిగ్గు ప‌డిపోయాడు.
"ఊరుకోండి సార్‌... ఇదేం కొత్త పోక‌డ‌? నేన‌లాంటి వాడిని కానండి..." అన్నాడు మెలిక‌లు తిరిగిపోతూ.
"ఓరెర్రోడా... నేనూ అలాంటి వాడిని కాదురా. ముందు నేను చెప్పిన‌ట్టు చెయ్యి..." అన్నారు గురువుగారు.
"అదీ లెక్క‌..." అంటూ గురువుగారు ఈసారి కాళ్లు ముందుకు చాచారు.
శిష్యుడు కాసేపు ఆలోంచించి, చ‌టుక్కున ఏదో అర్థ‌మైన‌వాడిలా ఒంగుని ఆయ‌న కాళ్ల‌కు దండం పెట్టాడు.
"సెభాష్‌..." అంటూ గురువుగారు ప‌క్క‌నున్న టేబుల్ మీద నుంచి త‌న ఫొటో తీసి ఇచ్చారు.
శిష్యుడు మ‌ళ్లీ బుర్ర‌గోక్కున్నాడు.
"ఆ ఫొటో ఇంటికి ప‌ట్టుకెళ్లి రోజూ పూజ చేసుకోరా..." అన్నారు గురువుగారు.
"ఏంటో గురూగారూ! ఇవాళ మీరు వింత‌గా క‌నిపిస్తున్నారు. గౌర‌వ‌మ‌నేది మ‌న‌సులో ఉండాలి కానీ, ఇలాంటి ప‌న్లేంటండీ ఎబ్బెట్టుగా..." అన్నాడు.
గురువుగారు తాపీగా ప‌డ‌క్కుర్చీలో వాలి, "ఒరే... నువ్వు నా ద‌గ్గ‌ర‌కి ఎందుకు వ‌స్తున్నావురా?" అనడిగారు.
"రాజ‌కీయాలు నేర్చుకోడానికండి..."
"మ‌రి అందుకే క‌ద‌రా... ఇవ‌న్నీ నీ చేత చేయిస్తున్న‌ది? ఎప్పుడూ థియ‌రీలే అయిపోతున్నాయ‌ని ఇవాళ ఇదిగో ఇలా నీచేత ప్రాక్టిక‌ల్స్ చేయించాన‌న్న‌మాట‌... అర్థ‌మైందా?"
"అంత తొంద‌ర‌గా అర్థ‌మైపోతే ఇంకా మీ ద‌గ్గ‌ర‌కి ఎందుకు వ‌స్తాను సార్‌... నేరుగా రంగంలోకి దిగిపోనూ! కాబ‌ట్టి ఈ పాఠ‌మేంటో, దీని ప్ర‌యోజ‌న‌మేంటో కాస్త చెప్పండి గురూగారూ..."
"ఇది న‌యా రాజ‌కీయ ప్ర‌హ‌స‌నంలో నంగ‌నాచి అధ్యాయంరా. దీని పేరు పాదాక్రాంత విన్యాస విచిత్రం. స్వామిభ‌క్తి ప‌రాయ‌ణ శాస్త్రంలో ప‌ర‌మార్థ యోగ విభాగంలో ప‌ర‌మ ప్ర‌యోజ‌న అభ్యాసం. ఇందులోగానీ నువ్వు ఆరితేరావంటే ఎలాంటి ప‌ద‌వులైనా నీ సొంతం. అధినేత క‌నుస‌న్న‌ల్లో నిత్యం త‌రించిపోతావు. నీ నేత మ‌న‌సులో బాసింప‌ట్టు వేసుకుని కూర్చోగ‌లుగుతావు. నాయ‌కుని ద‌యాపూరిత దృక్కుల్లో త‌డిసి ముద్ద‌యిపోతావు. అధినాయ‌కుడి అండ‌తో అంద‌లాలు అందుకోగ‌లుగుతావు. ఆయ‌న గుండెల్లో దీప‌మై కొడిగ‌ట్ట‌కుండా వెలిగిపోతావు. తెలిసిందా?"
"అయ్య‌బాబోయ్‌... ఇన్ని ప్ర‌యోజ‌నాలా? మ‌రి దీన్ని ఎలా చ‌ద‌వాలో, ఎలా పాటించాలో కూడా కాస్త చెబుదురూ..."
"అన్నీ నేను చెప్ప‌డం కాదురా... న‌వ్వు కూడా నీ స‌మ‌కాలీన రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తూ దూసుకుపోగ‌ల‌గాలి... ఇందాకా నేను చెయ్యి చాచిన‌ప్పుడు తెల్లమొహం వేసిన‌ప్పుడే అర్థ‌మైంది, నీకు ప‌రిశీల‌నా శ‌క్తి శూన్య‌మ‌ని. నిన్న‌టికి నిన్న నీ ప‌ర‌గ‌ణాలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగిందా? వాళ్ల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం చూశావు క‌దా? ఆపై ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తంతు కూడా గ‌మ‌నించావుగా? మ‌రేం గ్ర‌హించావు?"
"అవునండోయ్‌... మీరు చెబుతుంటే గుర్తొస్తోంది. కొత్తగా మంత్రి ప‌ద‌వులు వ‌చ్చిన వారు ర‌క‌ర‌కాలుగా త‌మ అధినేత ప‌ట్ల విధేయ‌త చూపించారండి. ఒక మంత్రి ఆయ‌న చెయ్యి పుచ్చుకుని ముద్దు పెట్టుకున్నారండి. మ‌రో మంత్రి వ‌య‌సులో పెద్ద‌వాడ‌యినా కూడా ఆయ‌న కాళ్ల‌కు మొక్కాడండి. ఇంకొకాయ‌న అయితే ఏకంగా అధినేత చిత్ర‌ప‌టం చేత్తో ప‌ట్టుకుని మ‌రీ బాధ్య‌త‌లు స్వీక‌రించారండి. పైగా నా దేవుడు ఈయ‌నేన‌న్నాడండి... ఆహా... నేను రాగానే మీరు చేసిన విచిత్ర విన్యాసాల‌కు అర్థ‌మేంటో నాకిప్పుడు బోధ‌ప‌డిందండి. మొత్తానికి భ‌లే పాఠ‌మండి. కానీ గురూగారూ, నాదో సందేహ‌మండి. అతి విన‌యం ధూర్త ల‌క్ష‌ణం అంటారు క‌దండీ? అదిక్క‌డ వ‌ర్తించ‌దాండీ?"
"ఎందుకు వ‌ర్తించ‌దురా... నువ్వు అలాంటివాడివ‌య్యాక‌నే క‌ద‌రా, నీచ రాజ‌కీయాల్లో నెగ్గుకొచ్చేది? కాబ‌ట్టి నువ్వు సిగ్గు ప‌డాల్సిన ప‌నేమీ లేదు. చుట్టూ కెమేరాలు ఉన్నా, ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు జ‌రుగుతున్నా, మీడియా చూస్తున్నా, ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నా, కొంద‌రు బుగ్గ‌లు నొక్కుకున్నా, మ‌రి కొంద‌రు న‌వ్వుకున్నా, ఎంద‌రో ఆశ్చ‌ర్య‌పోయినా...నీకు అన‌వ‌స‌రం. నీ ప‌ద్ధ‌తిలో నువ్వు దూసుకుపోవ‌డ‌మే. అధినేత అంత‌రంగాన్ని మురిపించ‌మే నీ ల‌క్ష్యం. ఆయ‌న మ‌న‌సు రంజింప‌జేయ‌డ‌మే నీ ధ్యేయం..."
"ఏమిటో గురూగారూ! రాజ‌కీయాలు మ‌రీ వ్య‌క్తి పూజ‌కి దాసోహమైపోతున్నాయండి... నేత మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా, ఎంత గౌర‌వం ఉన్నా అవ‌న్నీ మ‌న‌సులో దాచుకోవాలి కానీ, మ‌రీ ఇంత‌లా... నీ బాంఛ‌న్ కాల్మొక్తా... అన్నంత స్థాయిలో దిగ‌జారిపోవాలా చెప్పండి..."
"నీ మొహం... ఇలాంటి సున్నిత‌మైన భావాలు నీలో ఉంటే వాటిని వెంట‌నే తుడిచెయ్యి. లేక‌పోతే న‌వ రాజ‌కీయ రంగంలో రంగువెలిసిపోతావు. తెలిసిందా?"
"తెలిసింది సార్‌... ఏదో గ‌బుక్కున ఉన్న‌మాట‌గా అన్నానండి. మ‌రైతే గురూగారూ, ఇలాంటి వేషాలు వేస్తే ఎలాంటి నేత‌యినా బోల్తా ప‌డిపోయినట్టేనాండీ? ఏ నాయ‌కుడైనా స‌రే ఐసైపోతాడంటారా?"
"కాదురోయ్‌... అదే ఈ అధ్యాయంలో ముఖ్య‌మైన అంశం. నీ అధినేత నెత్తి మీద అహంకారం స్వారీ చేస్తున్నప్పుడు, నీ నాయ‌కుడి మ‌న‌సు నిండా గ‌ర్వం నిండిపోయిన‌ప్పుడు, నీ నేత నీ ప‌ని క‌న్నా నీ విధేయ‌త‌నే కోరుకుంటున్న‌ప్పుడు, నువ్వు ప్ర‌జ‌ల క‌న్నా ఆయ‌న ప్ర‌యోజ‌నాల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావించిన‌ప్పుడు, ఆయ‌న త‌న‌కు తాను దేవుడిన‌ని అనుకుంటున్న‌ప్పుడు, తానే గొప్ప తెలివైన‌వాడిన‌న‌ని మిడిసిప‌డుతున్న‌ప్పుడు, తానొక్క‌డే అధికారాన్ని న‌డిపిస్తున్న భ్ర‌మ‌లో తేలిపోతున్న‌ప్పుడు... అద‌ను చూసి, అవ‌కాశం గ్ర‌హించి మ‌రీ దూసుకుపోవాలిరా. లేక‌పోతే దెబ్బ తింటావు. అది గుర్తు పెట్టుకో..."
"బాగుంది సార్‌... మ‌రి ఇంకా ఈ అధ్యాయంలో ఎలాంటి వింత విధానాలు ఉన్నాయండీ?"
"చాలా ఉన్నాయిరా... అధినేత అలాంటి వాడ‌ని ఓసారి తేలిపోయాక‌, ఇక నువ్వు ప్ర‌జ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌క్క‌ర‌లేదు. ఆయ‌న భావాలు గ్ర‌హించి రెచ్చిపోతే చాలు. ఆయ‌న‌కి ఇష్టం లేని వాళ్ల‌ని నువ్వు బూతులు నేర్చుకుని మ‌రీ తిట్టాలి. ఆయ‌న పాల‌న‌లో ఎవ‌రు నోరెత్తినా వాళ్ల‌ని వేధించాలి. నీ అధినేత తీరు మీద ఎలాంటి వ్య‌తిరేక వార్త‌లు వ‌చ్చినా ఆ మీడియా ప్ర‌తినిధుల‌ను విలేక‌రుల స‌మావేశంలో అంద‌రి ముందూ అవ‌మానించ‌డానికి కూడా వెనుకాడ‌కూడ‌దు. ఎక్కడ ఎలాంటి నిర‌స‌న ప్ర‌దర్శ‌న‌లు జ‌రిగినా... అధినేత అహంకార పూరిత, విద్వేష విధానాల‌ను బ‌ట్టి ఉక్కు పాదంతో అణ‌చివేయ‌డానికి ముందుకుర‌కాలి. జ‌నం గ‌గ్గోలు పెడుతున్నా ప‌ట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. ఇక నీ నాయ‌కుడి నాయ‌క‌త్వంలో ఎలాంటి ప్ర‌గ‌తి జ‌ర‌గ‌క‌పోయినా... బోలెడు అభివృద్ధి జ‌రిగిపోతున్న‌ట్టు త‌ర‌చు ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండాలి. జ‌నం నీ నేత పాల‌న‌కు ఉబ్బిత‌బ్బిబ్బైపోతున్న‌ట్టు వాగుతుండాలి. ఇక మీ అధినాయ‌కుడు త‌ప్ప ప్ర‌జానీకానికి వేరే దిక్కు, దివాణం లేనంత‌గా మాట్లాడుతుండాలి. నీ క‌ళ్ళ ముందు రాష్ట్రం అప్పుల పాల‌వుతున్నా, భ్ర‌ష్టు ప‌డుతున్నా ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాలి. ఇక అప్పుడు నీ వృద్ధికి ఢోకా ఉండ‌దు. నీ ప‌ద‌వుల‌కు గండం ఉండ‌దు. అర్థ‌మైందా?"
"అద్భుతం సార్‌... ఇవ‌న్నీ గ‌బ‌గ‌బా నేర్చేసుకుని, వంట బ‌ట్టించుకుని, ఔపోస‌న ప‌ట్టేసి, మ‌న‌నం చేసుకుని రాణిస్తాను స‌ర్‌... స‌రేనా?"
"అబ్బే కాదురా... నువ్వు నీ నేత‌ను మెప్పించే స్థాయిలో ఉండాల‌నుకోవ‌డం లేదురా. నువ్వే ఆ నేతంత‌టి వాడివి కావాల‌ని కోరుకుంటున్నాను... కానీ..."
"కానీ ఎందుకుసార్‌... అందుకు ఏం చేయాలో కూడా చెప్పండి, చేసేస్తాను..."
"అదంత సులువు కాదురా... నీ ప‌ర‌గ‌ణాలో వెలిగిపోతున్న నీచ నికృష్ట న‌య‌వంచ‌క నంగ‌నాచి నాయ‌కుడిలా ఎద‌గాలంటే నీ జ‌న్మ స‌రిపోదు. ఎందుకంటే... ప్ర‌భుత్వ‌విధానాల‌ను పాదాక్రాంతం చేసుకున్న ఆ మ‌హాధినేత విల‌క్ష‌ణ ప‌రిపాల‌నా దురంధ‌రుడు! విచిత్ర విన్యాసాల దురంహంకారుడు!!"
                                                                                                                              -సృజ‌న‌
PUBLISHED ON 29.4.2022 ON JANASENA WEBSITE

బుధవారం, ఏప్రిల్ 20, 2022

అదే అస‌లైన దౌర్భాగ్యం!

 


కాశీ మ‌జిలీ యాత్ర‌లు చేస్తున్న గురువుగారు శిష్యుడితో స‌హా ఆంధ్ర రాజ్యంలోకి ప్ర‌వేశించారు. గురువుగారు గుడి అరుగు మీద సేద తీరుతుంటే శిష్యుడు ఊళ్లోకి బ‌య‌ల్దేరాడు. ఎన్నోవిచిత్రాలు క‌నిపించాయి. మ‌రెన్నో వింత‌లు వినిపించాయి. తిరిగి వ‌చ్చి అవ‌న్నీ గురువుగారికి నివేదించాడు.

******

ప‌నిమ‌నిషి రాగానే ఇంటామె నెమ్మ‌దిగా చెప్పింది.

"నీ ప‌ని అస్స‌లు బాగుండ‌డం లేదమ్మా... అంట్లు చూస్తే ఒక్క‌టి వ‌ద‌ల‌దు. గిన్నెల‌న్నీ జిడ్డు ముద్ద‌లే. మ‌ళ్లీ నేను తోముకోవ‌ల‌సి వ‌స్తోంది. గ‌దులు ఊడిస్తే ఎక్క‌డి దుమ్ము అక్క‌డే. ఎక్క‌డా చీపురు క‌ల‌వదు. ఇదేం ప‌ని?"

ప‌నిమ‌నిషి ఊరుకోలేదు.

"ఎంత చేసినా మీరిలాగే అంటారు. నేను చేసిన ప‌ని మీకు క‌నిపించ‌డం లేదు. దౌర్భాగ్య‌పు గిన్నెలు. దౌర్భాగ్య‌పు గ‌దులు. మీకిక్క‌డ మ‌రో ప‌నిమ‌నిషి దొర‌క‌దు. చచ్చిన‌ట్టు న‌న్ను భ‌రించాల్సిందే. ఇదిగో...మీకిదే చెబుతున్నా. మీరు నా వెంట్రుకను కూడా పీక‌లేరు..."

ప‌నిమనిషి జ‌వాబుకి ఇంటామె బిక్క‌చచ్చిపోయింది. ఏం చేయాలో తోచ‌క అవాక్క‌యి అలా నుంచుండి పోయింది!

****

హోంవ‌ర్క్ చేసిన స్టూడెంట్‌ను ద‌గ్గ‌ర‌కు పిలిచారు టీచ‌ర్‌. పుస్త‌కం చూపిస్తూ చెప్పారు.

"ఏంట్రా ఈ లెక్క‌లు చేయ‌డం? అన్నీ త‌ప్పులు త‌డ‌క‌లే. కూడ‌మంటే తీసేశావు. తీసేయ‌మంటే క‌లిపేశావు. గుణించ‌మంటే భాగించావు. భాగించ‌మంటే గుణించావు. ఎందుకిలా చేశావు?"

ఆ విద్యార్థి త‌లెగ‌రేశాడు. ఆపై నెత్తి మీద చెయ్యి పెట్టుకుని త‌ల‌లోంచి ఓ వెంట్రుక‌ను తీసి చూపించాడు.

టీచ‌ర్ తెల్ల‌బోయి, "ఇదేంటి?" అన్నాడు.

"నా వెంట్రుక‌. మీరు నా వెంట్రుక‌ను కూడా పీక‌లేరు. నాకిలాగే లెక్క‌లు వ‌చ్చు. కూడితేనేం?  తీసేస్తేనేం?  గుణిస్తేనేం?  భాగిస్తేనేం? అన్నీ అంకెలే క‌దా, ఏమైంది? స‌్కూలుకి ఫీజు క‌ట్టేశాక ఇక న‌న్ను మీరేం చేయ‌లేరు. కావాలంటే మీరు ఆ గుర్తులేవో మార్చుకోండి. మార్కులేసుకోండి. దౌర్భాగ్య‌పు త‌ర‌గ‌తులు. దౌర్భాగ్య‌పు చ‌దువులు..." అంటూ ఆ విద్యార్థి వెళ్లిపోయాడు.

టీచ‌ర్ నోట మాట లేదు!

******

భోజ‌న‌మ‌య్యాక భ‌ర్త భార్య‌ను ద‌గ్గ‌ర‌కు పిలిచాడు.

"ఇదిగో చూడు.  నీ వంటేమీ బాగుండ‌డం లేదోయ్‌! కూర మాడిపోయింది. చారులో ఉప్పులేదు. ప‌ప్పు ఉడక‌లేదు. అన్నం చిమిడిపోయింది. మ‌జ్జిగ పులిసిపోయింది. ఇలా ఉంటే ఎలా తిన‌గ‌లం చెప్పు?  వ‌ంట ఎప్పుడు నేర్చుకుంటావ్?"

అంటూ చెప్పుకొచ్చాడు.

భార్య ఏమాత్రం ప‌శ్చాత్తాప‌ప‌డ‌లేదు స‌రిక‌దా, భ‌ర్త మీద విరుచుకుప‌డింది.

"ఎప్పుడు చూడండి. నాకు వంక‌లు పెట్ట‌డమే మీకు స‌రిపోతుంది. రోజూ ఎంత క‌ష్ట‌ప‌డుతున్నానో మీకేం ప‌ట్ట‌దు. దౌర్భాగ్య‌పు కూర‌లు. దౌర్భాగ్య‌పు స‌రుకులు. నేనేం చేసేది? ఒక్క రోజైనా వంట బాగుంద‌ని చెప్పారా?  మీరెన్ని అనండి, నాకేం బాధ లేదు. నేనేం ప‌ట్టించుకోను. మీరు నా జ‌డ‌లో ఒక్క వెంట్రుక‌ను కూడా పీక‌లేరు..." అంటూ జ‌డ విప్పి ఓ వెంట్రుక‌ను ఊడ‌బెరికి భ‌ర్త చేతిలో పెట్టి విస‌విసా వెళ్లిపోయింది.

భ‌ర్త అవాక్కైపోయాడు.

****

ఆఫీసర్ వ‌స్తూనే గుమాస్తాను పిలిపించాడు.

"ఏంటయ్యా... ఈ ఫైల్ ఇలా టైప్ చేశావు? అన్నీ స్పెల్లింగ్ మిస్టేకులే. పైవాళ్లు చూస్తే ఏమ‌నుకుంటారు? వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చూస్తున్నాను. నీ ప‌ని తీరు ఏమీ బాగోలేదు. ఓ డిక్టేష‌న్ స‌రిగా తీసుకోలేవు. ఓ నోట్ స‌రిగా రాయ‌లేవు. ఓ ఫైలింగ్ స‌రిగా చేయ‌లేవు. కాస్త జాగ్ర‌త్తగా చేయాల‌య్యా..." అన్నాడు. 

గుమాస్తా అదోలా మొహం పెట్టి నిర్ల‌క్ష్యంగా చెప్పాడు.

"ఏంటండీ మీరు నాకు చెప్పేది? అన్ని అక్ష‌రాలు టైప్ చేసేప్పుడు కొన్ని అక్ష‌రాలు త‌ప్పు ప‌డ‌వ‌చ్చు. దానికే ఇంత గోలా?  వైట్న‌ర్‌తో అద్దేస్తే స‌రి. దానికి ఓ ఆయాస ప‌డ‌తారెందుకు?  దౌర్భాగ్య‌పు ఆఫీసు. దౌర్భాగ్య‌పు ప‌ని. మీరు న‌న్నేం చేయ‌లేర‌ని గుర్తు  పెట్టుకోండి. ఆఖ‌రికి నా వెంట్రుక‌ను కూడా పీక‌లేర‌ని తెలుసుకోండి..." అంటూ త‌ల‌లోంచి ఓ వెంట్రుక‌ను తీసి బాస్ టేబుల్ మీద పెట్టి విసురుగా వెళ్లిపోయాడు.

****

ఊర్లోని వింత‌ల‌న్నీ చూసి వ‌చ్చిన‌ శిష్యుడు గురువుగారు లేచాక  తాను చూసిన సంగ‌తుల‌న్నీ చెప్పి, "ఇదేం వింత గురువుగారూ! నేనే రాజ్యంలోను ఇలాంటి వింత స‌న్నివేశాలు చూడ‌లేదు. చేసిన త‌ప్పులు ఒప్పుకోక‌పోగా ఈ ద‌బాయింపులేంటండీ?  సిగ్గుప‌డి త‌లొంచుకోక‌పోగా ఎదురెట్టి బుకాయింపులేంటండీ?" అని అడిగాడు.

గురువుగారు ఓసారి క‌ళ్లు మూసుకున్నారు. దివ్య‌దృష్టితో అంతా గ్ర‌హించారు. ఆపై గాల్లోకి చెయ్యి చాచి గుప్పెట మూశారు. ఏదో మంత్రం చ‌దివి గుప్పెట విప్పారు.

శిష్యుడు ఆత్రంగా తొంగి చూశాడు.

వెంట్రుక‌!

"ఈ వెంట్రుకేంటి గురూగారూ?"

గుర‌వుగారు చిరున‌వ్వు న‌వ్వి చెప్పారు.

"ఈ వెంట్రుక అలాంటిలాంటిది కాదు నాయ‌నా! చాలా బిరుసైన‌ది. ఇది మొలిచిన త‌ల ఉంది చూశావూ? అది అంత‌క‌న్నా రాటు దేలిన‌ది. ఈ వెంట్రుక ఈ రాజ్యాన్ని పాలించే అధినేత‌ది నాయ‌నా! ఆయ‌న మొన్న‌క‌సారి ఒక‌ స‌భ‌లో దీన్ని అంద‌రి ముందూ పీకి చూపించాడు. అదే ఇది. అత్యున్న‌త స్థాయిలో ఉన్న‌వాళ్లు, పాల‌నాధికారంలో ఉన్న‌వాళ్లు ఎలా ఉండ‌కూడ‌దో అలా ఆ అధినేత ఉంటాడు నాయ‌నా! త‌న‌కు తాను త‌న ప‌రిపాల‌న చాలా గొప్ప‌ద‌నుకుంటాడు. త‌న‌కు తాను  దిగివ‌చ్చిన నేత‌న‌నుకుంటాడు. ఎవ‌రైనా విమ‌ర్శ చేస్తే త‌ట్టుకోలేడు. ప్ర‌శ్నిస్తే భ‌రించ‌లేడు. ఆరోపిస్తే స‌హించ‌లేడు. ఆఖ‌రికి ఓ చిన్న పొర‌పాటును చూపించినా నిగ్ర‌హించుకోలేడు. అంత‌టి అహంకారం త‌ల‌కెక్కిన ఆ అధినేత బుర్ర‌పై అధికార తైల మ‌ర్ద‌నలో నిగ్గుదేలి నిగ‌నిగ‌లాడుతున్న వెంట్రుక నాయ‌నా ఇది! ఎదుటి వారిని వెంట్రుక ముక్క‌లా తీసిపారేయ‌గ‌లిగే ఆ వింత విచిత్ర పాల‌కుడు త‌లెగ‌రేసిన‌ప్పుడ‌ల్లా ఎగిరిప‌డిన వెంట్రుక నాయ‌నా ఇది! య‌థా రాజా, త‌థా ప్ర‌జా అన్న‌ట్టు ఆ అధినేత మాట‌లు విని, ఆ పాల‌కుని ప్ర‌సంగాలు చూసిన ప్ర‌జ‌లు ఆయ‌న్నే అనుక‌రిస్తే ఏం జ‌రుగుతుందో చ‌వి చూపించే స‌న్నివేశాలే నీ క‌ళ్ల ప‌డ్డాయి శిష్యా!

ప‌ని స‌రిగా చేయ‌క‌పోగా ఆ సంగ‌తి చెబితే క‌స్సుమ‌నే ప‌నిమ‌నిష‌ని భ‌రించ‌గ‌ల‌మా చెప్పు?  లెక్క‌లు త‌ప్పు చేసి ఆ సంగ‌తి టీచ‌ర్ చెబితే ధిక్క‌రించే విద్యార్థినిని ఏం చేయ‌గ‌లం?  పెళ్ల‌యిన ద‌గ్గ‌ర్నుంచి వంట త‌గ‌లేస్తూ ఆ విష‌యం చెప్పిన భ‌ర్త‌నే తీసి పారేసే భార్య‌తో ఎలా వేగ‌గ‌లం?  చేసే ప‌ని స‌రిగ్గా చేయ‌క‌పోగా బాస్‌నే ఎదిరించే గుమాస్తాల‌తో ప‌నులెలా జ‌రుగాతాయో ఆలోచించు? అచ్చం వీరిలాగే ఉంటుంది నాయ‌నా,  ఈ రాజ్యాన్ని పాలించే అధినేత తీరు. ఇత‌డు సింహాస‌నం ఎక్కినది మొద‌లు ఒక్క ప‌ని స‌రిగా చేసింది లేదు. అన్నీ అవ‌క‌త‌వ‌క ప‌నులే. అన్నీ అర‌కొర విధానాలే. ఇత‌డి ప‌నుల ముందు నువ్వు ఇందాకా చూసిన ప‌నిమ‌నిషే న‌య‌మ‌నుకోవాలి నాయ‌నా! ఇత‌డి పాల‌న‌లో నిధుల‌న్నీ అణ‌గారి పోగా అన్నీ అప్పులే మిగిలాయి! ఈ అధినేత చూపించే అంకెలు,  ఇందాకా నువ్వు చూసిన విద్యార్థి చేసిన లెక్క‌ల క‌న్నా అధ్వానం నాయ‌నా! ఏవేవో ప‌థ‌కాలంటాడు. వాటి ద్వారా డ‌బ్బులు ప్ర‌జ‌ల‌కు పంచుతున్నానంటాడు. కానీ ప‌న్నుల రూపేణా అంత‌కు మించి వారి నుంచి లాక్కుంటాడు. ఏది కూడికో, ఏది తీసివేతో తెలియ‌క ప్ర‌జ‌లంతా తిక‌మ‌క ప‌డుతున్నారు. అధినేత మాట‌ల్లో గుణ‌కారాలు క‌నిపిస్తుంటే, ప్ర‌జ‌ల జీవితాల్లో అన్నీ భాగ‌హారాలే ఉంటున్నాయి. ఇహ ఇత‌డి ప‌రిపాల‌న ముందు నువ్వు ఇందాకా చూసిన భార్య వంటే న‌యం నాయ‌నా! వండి వార్చేశాం రండ‌ని పిలుస్తాడు. తీరా వ‌చ్చి కూర్చుంటే వ‌డ్డించేది ఏదీ ఉండ‌దు. ఏ ప‌థ‌కాన్ని న‌మ్ముకున్నా ఇదే తీరు. ఏది మొద‌లెట్టినా ఇదే తంతు. ఇక ఇత‌డి వ్య‌వ‌హార శైలి క‌న్నా, ఇందాకా నువ్వు చూసిన గుమాస్తా తీరే న‌య‌మనిపిస్తుంది నాయ‌నా! ఈ అధినేత ఏం  మాట్లాడినా అన్నీ స్పెల్లింగ్ మిస్టేకులే. అన్నీ అతిశ‌యోక్తులే. ఎవ‌రైనా త‌న పాల‌న‌లో లోటుపాట్లు చెబితే

స‌మీక్షించుకుని, స‌రిదిద్దుకోవ‌ల‌సిందిపోయి అలా చెప్పిన వారి పైనే ప‌గ‌బ‌ట్టే నేత నాయ‌నా ఇతగాడు. వాస్త‌వాలు రాసే ప‌త్రిక‌ల‌న్నీ దౌర్భాగ్య‌పువంటాడు. ప్ర‌శ్నించేవారంద‌రూ దౌర్భాగ్యులంటాడు. అడిగే వాళ్లంద‌రూ అడ్డ‌మైన‌వాళ్లంటాడు. విమ‌ర్శించేవారిని వెంటాడుతాడు. అది నాయ‌నా ఈ రాజ్యం అస‌లైన దౌర్భాగ్యం!"

అంతా విని శిష్యుడు నోరెళ్ల బెట్టాడు.

"మ‌రి గురూగారూ! పాపం... ఈ రాజ్య ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు ఎప్పుడు వ‌స్తుందండీ?"

"అది వాళ్ల చేతుల్లోనే ఉంది నాయ‌నా! జ‌న చైతన్య‌మే వారికి ర‌క్ష‌. వెంట్రుక‌లు చూపించే వాడి అధికారాన్ని ఊడ‌బీకే వివేచ‌న ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో వ‌స్తుంది నాయ‌నా! అప్పుడు ఆ అధినేత అత‌డి జుట్టు అత‌డే పీక్కుంటాడు! ఇక మ‌నం ఇక్క‌డ ఉంటే ప్ర‌మాదం నాయ‌నా. ప‌ద మ‌జిలీ ఎత్తేద్దాం" అంటూ గురువుగారు బ‌య‌ల్దేరారు. శిష్యుడు అనుస‌రించాడు.

-సృజ‌న‌

PUBLISHED ON 17.4.2022 ON JANASENA WEBSITE

మంగళవారం, ఏప్రిల్ 19, 2022

అప్పారావూ... అంత‌రిక్ష సుంద‌రి!


 

డాబా మీద మ‌డ‌త మంచం వేసుకుని వెల్ల‌కిలా ప‌డుకుని, రెండు చేతులూ త‌ల‌కింద పెట్టుకుని, ఆకాశంలోని న‌క్ష‌త్రాల కేసి చూస్తూ ప‌డుకుంటే ఆ ఆనంద‌మే వేరు. అప్పారావు ఇప్పుడు అదే అనుభ‌విస్తున్నాడు. చంద‌మామ ఉండీ లేన‌ట్టుగా స‌న్న‌గా ఉన్నాడు. తార‌లు త‌ళుకు త‌ళుకుమంటున్నాయి.. ఎక్క‌డో కీచురాళ్ల చప్పుడు త‌ప్ప అంతా నిశ్శ‌బ్దం. అప్పుడ‌ప్పుడు ఆకాశం మీద నుంచి వెలుగుతూ రాలే ఉల్క‌లు. అవ‌న్నీ చూస్తుంటే అప్పారావుకి చిన్న‌ప్పుడు చ‌దువుకున్న చంద‌మామ క‌థ‌లు, తాతయ్య చెప్పిన జాన‌ప‌ద క‌థ‌లు గుర్తొస్తాయి. ‘ఏమిటో ఈ న‌క్ష‌త్రాలు!’ అనుకున్నాడు. ‘అస‌లెన్ని ఉంటాయి’ అని కూడా అనుకున్నాడు. పోనీ లెక్క‌పెడితేనో అనిపించి మొద‌లెట్టాడు కానీ ఓ ప‌దో, ప‌దిహేనో అయ్యాక ఏ చుక్క ద‌గ్గ‌ర ప్రారంభించాడో గుర్తులేక విర‌మించుకున్నాడు.

అత‌డ‌లా చూస్తుంటే ఆ న‌ల్ల‌టి ఆకాశంలో మెరుస్తున్న న‌క్ష‌త్రాల మ‌ధ్య ఓ న‌క్ష‌త్రం క‌దుతున్న‌ట్టు అనిపించింది. దాని కేసే దృష్టి పెట్టి చూశాడు. అరె... చిత్రం... అది రంగులు కూడా మారుస్తోంది!

గ‌బ‌గ‌బా త‌ల‌గ‌డ కింద త‌డుముకుని క‌ళ్ల‌జోడు పెట్టుకుని మ‌రీ చూశాడు. అవును నిజ‌మే... అది క‌ద‌ల‌డ‌మే కాదు, నెమ్మ‌దిగా పెద్ద‌ద‌వుతోంది కూడా!

వాటే... వండ‌ర్!

అప్పారావు చూస్తుండ‌గానే అది కిందికి వ‌స్తున్న‌ట్టు అనిపించింది. అరె... అది ఇంకా పెద్దద‌వుతోందే? వార్నీ... ఏంటిది చెప్మా? అనుకుంటూ చ‌టుక్కున లేచి కూర్చున్నాడు. త‌ల మాత్రం పైకే ఉంది. క‌ళ్లు పెద్ద‌వ‌య్యాయి. ఆ క‌ళ్ల‌లో వెలుగులు చిమ్ముతూ ఏదో పెద్ద ఆకారం. అది గుండ్రంగా ఉంది. దాని చుట్టూ రంగురంగుల లైట్లు వెలిగి ఆరుతున్నాయి. అది ఇంకా... ఇంకా... కిందికి వ‌చ్చింది.

అప్పారావు నోరు దానంత‌ట అదే తెరుచుకుంది.

ఇదేంటి? ఫ‌్ల‌యింగ్‌సాస‌రా? అంటే... గ్ర‌హాంత‌ర వాసులెవ‌రో వ‌చ్చారా?

చిన్న‌ప్పుడు చ‌దువుకున్న‌ది గుర్తొచ్చింది. యూఎఫ్ఓ! అంటే అన్ ఐడెంటిఫైడ్ ఫ్ల‌యింగ్ ఆబ్జెక్ట్‌. అన‌గా గుర్తు తెలియ‌ని ఎగిరే వ‌స్తువు. అప్పారావు ఆలోచ‌న‌లు శ‌రవేగంగా ప‌రిగెడుతుండ‌గానే, ఆ గుండ్ర‌ని వింత అంత‌రిక్ష వాహ‌నం అత‌డు ప‌డుకున్న డాబా మీద‌కి వ‌చ్చి ఆగింది. దాని నుంచి ఓ ఫోక‌స్ లాంటి వెలుగు  డాబా మీద గుండ్రంగా ప‌డింది. అప్పారావు ఆ వెలుగు చూడ‌లేక క‌ళ్ల‌కు చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. ఆ వెలుగులో ఆ వాహ‌నం కింద త‌లుపు తెరుచుకుంది. అందులోంచి ఓ నిచ్చెన లాంటిది కిందికి వాలింది. అప్పారావు క‌ళ్లు పెద్ద‌వి చేసుకుని, నోరు వెళ్ల‌బెట్టి చూస్తూనే ఉన్నాడు. ఆ మెట్ల మీద‌ స‌న్న‌టి జ‌ల‌తారు కుచ్చిళ్లు జీరాడాయి. ఆ కుచ్చిళ్ల లోంచి సొగ‌సైన ఓ తెల్ల‌ని పాదాలు క‌నిపించాయి. వాటిపై త‌ళుక్కుమంటున్న వెండి మువ్వ‌ల ప‌ట్టీలు. ఆ పాదాలు  మెట్ల మీద సుతారంగా దిగుతూ ఉంటే, జ‌ల‌తారు కుచ్చిళ్లు చంద్ర‌కాంతి ప‌డి వింత‌గా మెరుస్తున్నాయి.  ఆ కుచ్చిళ్లపై గాలికి ఎగురుతున్న ప‌ట్టు పావ‌డా, ఆ త‌ర్వాత పారద‌ర్శ‌కంగా ఉన్న ఓ అద్భుతమైన నీలి వ‌స్త్రం, దానిపై ధ‌గ‌ధ‌గలాడుతున్న ఆభ‌ర‌ణాలు, వాటిపై ర‌క‌ర‌కాల రంగుల‌తో మెరుస్తున్న మ‌ణిమాణిక్యాలు, వాటితో పాటు సుతారంగా క‌దులుతున్న ముత్యాల స‌రాలు, ల‌య‌బ‌ద్ధంగా క‌దులుతున్న వజ్ర‌పు లోలాకులు, వైఢూర్య‌లు పొదిగిన పాపిట‌పిందులు, ఉంగరాలు తిరిగిన న‌ల్ల‌ని ముంగురుల మీద అల‌వోక‌గా అమ‌రిన స్వ‌ర్ణ కిరీటం... వీట‌న్నిటినీ మించిన సొగ‌సుతో వెలిగిపోతున్న ఓ అంద‌మైన యువ‌తి అప్పారావు  క‌ళ్ల ముందు క‌నిక‌ట్టులాగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.

దే..వ‌..క‌..న్య‌!

అప్పారావు మ‌న‌సులో ఆశ్చ‌ర్యంగా అనుకున్నాడు.

ఏడిశావ్...  అంది అంత‌రాత్మ అంత‌లోనే.

ఏం ఎందుకు కాకూడదు? ఎన్ని సినిమాల్లో చూడ‌లేదూ? జ‌గ‌దేక వీరుడైన ఎన్టీఆర్ కోసం ఇంద్రుడి కూతురు బి. స‌రోజ దిగి రాలేదా? అంద‌గాడైన అక్కినేని కోసం సువ‌ర్ణ‌సుంద‌రి లెవెల్లో అంజ‌లీదేవి రాలేదా? అంతెందుకోయ్‌... మెగాస్టార్ చిరంజీవి కోసం అతిలోక  సుంద‌రి శ్రీదేవి వ‌చ్చి మాన‌వా... అంటూ వెంట‌ప‌డ‌లేదా? మూసుకో!” అంటూ అంత‌రాత్మ గొంతు నొక్కేశాడు అప్పారావు .

ఇలా అప్పారావు అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతుండ‌గానే ఆ అంత‌రిక్ష యువ‌తి ర్యాంపులో క్యాట్‌వాక్ చేసే అంద‌మైన మోడ‌ల్‌లాగా వ‌య్యారంగా ఆ డాబాపై న‌డుస్తూ రామారావు ద‌గ్గ‌రకి వ‌చ్చింది.

హాయ్... అప్పారావ్‌! ఎలా ఉన్నావ్‌?” అంది చిరున‌వ్వులు ఒలికిస్తూ.

అవి... న‌వ్వులా? కాదు...న‌వ పారిజాతాలు!

ర‌వ్వంత స‌డిలేని ర‌స‌ర‌మ్య గీతాలు! అనుకున్నాడు అప్పారావు.

సిగ్గులేక‌పోతే స‌రి... అది సినారే పాట‌... దాన్నే వాడుకోవాలా ఇక్క‌డ‌?’ అంది అప్పారావు అంత‌రాత్మ‌.

ష‌ట‌ప్‌... అంత గొప్ప పాట కాక‌పోతే ఈ సంద‌ర్భంలో మ‌రోటి ఎలా గుర్తొస్తుంది? నేనేమైనా గీత ర‌చ‌యిత‌నా? కొత్త‌గా అనుకోడానికి. పైగా ఇప్పుడు కాగితం, క‌లం తీసుకుని రాస్తూ కూర్చుంటే ఈ దేవ‌క‌న్య చూస్తూ ఉంటుందేంటి? ఫ్ల‌యింగ్ సాస‌ర్ ఎక్కేసి జంప్ జిలానీ అయిపోతుంది. కాబ‌ట్టి ఆట్టే వాక్కు!’ అంటూ మ‌న‌సులోనే నోరు నొక్కేశాడు.

నా... నా... పేరు నీకెలా తెలుసు?” అన్నాడు ఎలాగోలా గొంతు పెగ‌ల్చుకుని.

ఆ యువ‌తి జిగేల్మని మ‌రోసారి న‌వ్వేసి, “దిగంతాల నుంచి వ‌చ్చి నీ డాబా మీద దిగిన‌దాన్ని. నీ పేరు తెలీకుండా ఉంటుందా?” అంది.

ఇంత‌కీ నువ్వెవ‌రు? జ‌యంతివా? సువ‌ర్ణ సుంద‌రివా? అతిలోక సుంద‌రివా? బి. స‌రోజ‌వా? అంజ‌లీదేవివా? శ్రీదేవివా?” అనేశాడు అప్పారావు గ‌బ‌గ‌బా.

వాళ్లంతా ఎవ‌రు?” అంది ఆ అందాల అంత‌రిక్ష యువ‌తి చ‌నువుగా మ‌డ‌త మంచం మీద  కూర్చుని త‌ల‌గ‌డ ఒళ్లో పెట్టుకుంటూ.

వాళ్లు... వాళ్లు... మా ఊహా సుంద‌రీమ‌ణులు...వెండితెర వేలుపులు... “ అన్నాడు అప్పారావు, కాస్త‌కుదుట ప‌డి.

స‌రేలే... ఇంత‌కీ మ‌రి మీ ఊహా సుంద‌రీ మ‌ణులు బావున్నారా? నేను బావున్నానా?” అంది చుబుకం కింద చెయ్యి పెట్టుకుని.

ఆహా... ఏమందమెంత సౌంద‌ర్యమెంత సొగ‌సెంత వ‌య్య‌ర‌మెంత వ‌గ‌లు?’ అనుకున్నాడు అప్పారావు మ‌న‌సులో.

ఎద‌వ క‌విత్వం క‌ట్టిపెట్టి ఆవిడ అడిగిన కొళ్చ‌నుకి యాన్స‌రియ్యి...’ అంది అంత‌రాత్మ విసుగ్గా.

ఛ‌స్‌...నువ్ నోర్ముయ్యి...’ అంటూ దాన్ని క‌సిరి, ఆ యువ‌తిని అబ్బురంగా చూస్తూ అప్పారావు జ‌వాబు చెప్పాడు, “వాళ్లెవ‌రూ నీ కాలి గోటికి కూడా స‌రిపోరు...” అన్నాడు త‌మ‌కంగా.

ఓ...నువ్వు నా కాలిగోరెప్పుడు చూశావు?” అంది ఆ యువ‌తి అప్పారావు చేయి ప‌ట్టుకుని మ‌డ‌త మంచం మీద త‌న ప‌క్క‌నే కూర్చోబెట్టుకుంటూ.

అబ్బ‌... ఏమి స్ప‌ర్శ‌? ఏమి మేని సొగ‌సు?... త‌నువా? ఊహు... హ‌రిచంద‌న‌మే! ప‌లుకా? ఊహూ... అది మ‌క‌రంద‌మే! కుసుమాలు తాక‌గ‌నే న‌లిగేను కాదా ఈ మేను?’ అనుకుంటూ ఏదో మైకంలో ఉండిపోయాడు అప్పారావు .

ఓరి స‌న్నాసీ...ముందు నోరు విప్ప‌రా... ద‌రిద్రుడా...’ అంటూ గ‌య్యిమంది అంత‌రాత్మ‌.

దాన్ని ప‌ట్టించుకోకుండా అప్పారావు మ‌త్తుగా చెప్పాడు, “ఇందాకా... నువ్వు దిగుతున్న‌ప్పుడు చూశాను. దాన్ని వ‌ర్ణించ‌డానికి మా శృంగార క‌వుల ప్ర‌బంధాలు కూడా స‌రిపోవు...” అన్నాడు.

అమ్యయ్య‌... పోన్లే... మ‌రి నేను నీకు న‌చ్చానా?” అంది ఆ యువ‌తి రామారావు క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూస్తూ.

ఆహా...ఏమి క‌ళ్లు? ఒక్క క్ష‌ణం... ఒక్క క్ష‌ణం... ఆ రెప్ప‌లు వాల్చ‌కు... అటూ ఇటూ క‌ద‌ల‌కు... ఒక్క క్ష‌ణం... మోయ‌లేని ఈ హాయిని మోయ‌నీ...’ అనుకున్నాడు అప్పారావు .

ఒరే...దిక్కుమాలినోడా! ఆ పిల్ల ఏంటో అడుగుతోంది... ముంద‌ది చెప్ప‌రా?’ అంది అంత‌రాత్మ దాని త‌ల అది ప‌ట్టుకుని.

అప్పారావు తేరుకుని, “అస‌లు ఆ అడ‌గ‌డ‌మేంటి? ఎందుకు? ఆకాశం మీద నుంచి రావ‌డ‌మేంటి? నా డాబా మీద దిగ‌డ‌మేంటి? న‌చ్చానా అని అడ‌గ‌డ‌మేంటి?” అంటూ ప్ర‌శ్న‌లు కురిపించాడు.

ఆ యువ‌తి హాయిగా న‌వ్వేసింది. ఆ త‌ర్వాత చెప్పింది, “అది కాదు అప్పారావ్‌... నువ్విక్క‌డ డాబా మీద చేతులు త‌ల కింద పెట్టుకుని ఆకాశం కేసి చూస్తున్నావా? స‌రిగ్గా అదే స‌మ‌యానికి నేను మా మందిరం మీద లేటెస్ట్ వెర్ష‌న్ టెలిస్కోపు ఓపెన్‌చేసి ఫోక‌ల్ లెంగ్త్ సెట్ చేసి ఇటు కేసి చూశాను. మీ పాలపుంత క‌నిపించింది. మ‌రింత ఫోక‌స్ చేస్తే మీ భూమి క‌నిపించింది. దాన్ని క్లోజ‌ప్ చేసే స‌రికి నువ్వు సీన్‌లోకి వ‌చ్చావు. చూడ‌గానే న‌చ్చావు. వెంట‌నే మా నాన్న నా బ‌ర్త్‌డేకి ఇచ్చిన స్పేస్ వెహికిల్ ఎక్కేసి చ‌క్కా వ‌చ్చేశా...” అంది అది చాలా తేలికైన విష‌య‌మ‌న్న‌ట్టు.

అప్పారావు కేమీ అర్థం కాలేదు. ఆ యువ‌తి చెబుతున్న‌ది అసంభ‌వం అనిపిస్తోంది.  ఆమె చెప్పిన దాని ప్ర‌కారం ఆమె మ‌న సూర్య‌కుటుంబం ఉండే మిల్కీవే పాల‌పుంతకి అవ‌త‌ల ఎక్క‌డో మ‌రో గెలాక్సీలో ఏదో న‌క్ష‌త్రం చుట్టూ తిరుగుతున్న ఒకానొక ఎక్సోప్లానెట్‌కి చెందిన‌దై ఉంటుంది. అక్క‌డి నుంచి ఇన్ని కాంతి సంవత్స‌రాల దూరం దాటి క్లోజ‌ప్‌లో చూడ‌గ‌లిగే టెలిస్కోపులు ఉండడం ఊహ‌కి అంద‌ని విష‌యం. పైగా ఉన్నాయే అనుకున్నా, కొన్ని క్ష‌ణాల్లోనే ఇన్నేసి కోటానుకోట్ల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించే స్పేస్ వెహికిల్స్ ఉండ‌డం మ‌రింత అసాధ్యం... కాంతిని మించి ఎన్నో రెట్లు వేగంగా వ‌స్తే కూడా ఇది జ‌ర‌గ‌దు... అనుకున్నాడు అప్పారావు .

ఓరి నీ సైన్స్ గోల త‌గ‌ల‌డా? ఓ అంద‌మైన అమ్మాయి వ‌చ్చి నీ మ‌డ‌త మంచం మీద కూర్చుని నువ్వు నచ్చి వచ్చాన్రా నాయ‌నా అంటుంటే... వెంట‌నే ప్రొసీడైపోక...  గెలాక్సీలు, కాంతి సంవ‌త్సరాలు, దూరాలు, వేగాలంటావేంట్రా ద‌గుల్బాజీ...’ అంటూ అంత‌రాత్మ కోపంతో చిందులు తొక్క‌సాగింది.

అప్పారావు మొద‌టి సారిగా అంత‌రాత్మ‌తో ఏకీభ‌వించాడు.

నిజ‌మే... నేను ద‌రిద్రుడినే, ద‌గుల్బాజీనే, దిక్కుమాలినోడినే, స‌న్నాసినే... కాసేపు న‌న్ను క‌న్‌ఫ్యూజ్ చేయ‌కు. నువ్వు చెప్పిన‌ట్టే ప్రొసీడైపోతాన్లే...’ అనుకున్నాడు.

ఆ త‌ర్వాత దేవానంద్‌లాగా త‌లెగ‌రేశాడు. రాజేష్‌ఖ‌న్నాలాగా క‌న్నింగ్‌గా న‌వ్వాడు. ష‌మీ క‌పూర్‌లాగా వంక‌ర‌గా మొహం పెట్టి చూశాడు. రాజ్‌క‌పూర్‌లాగా రొమాంటిక్‌గా ఫీలింగ్ ఇచ్చాడు. చిరంజీవిలా స్టైల్‌గా ఆమె చెయ్యి ప‌ట్టుకున్నాడు. మ‌హేష్‌బాబులాగా లుక్కిచ్చాడు. ఆఖ‌రికి దేవ‌ర‌కొండ‌లాగా ధైర్యంగా, యూత్‌ఫుల్‌గా ఫేస్ పెట్టి, “ఇంత‌కీ నాలో ఏం చూసి మెచ్చావు? ఏం న‌చ్చి ఇంత దూరం వ‌చ్చావు?” అన్నాడు పెద్ద హీరోలా ఫోజ్ పెట్టి.

అంత‌రాత్మ ప‌క‌ప‌కా న‌వ్వింది. ‘ఒరే... ఇందాకా నువ్వు అనుకున్న‌వ‌న్నీ కాదురా అసాధ్యాలు... ఈమెకు నువ్వు న‌చ్చ‌డ‌మే అసాధ్యాల్లోకెల్లా అసాధ్యం...’ అంది.

మంచి మూడ్‌లో ఉన్న అప్పారావు , దాన్ని ప‌ట్టించుకోలేదు.

ఏదో ఒక‌టి చూశాన్లే అప్పారావూ? నువ్వు నాతో రావూ?” అంది ఆ అంత‌రిక్ష సుంద‌రి అత‌డి చెయ్యి ప‌ట్టుకుని లాగుతూ.

ఎ... ఎక్క‌డికి?” అన్నాడు అప్పారావు ఆశ్చ‌ర్యంగా.

అలా మా లోకానికి పోదాం ప‌ద‌వయ్యా అంటుంటే, అలా మాలోకంలా చూస్తావేంట‌య్యా.. అంటూ ఆ అంత‌రిక్ష సుంద‌రి అత‌డి చేయి పుచ్చుకుని దాదాపు బ‌ర‌బ‌రా లాక్కుపోయి ఆ వింత వాహ‌నం ఎక్కించేసింది.

అప్పారావుకి ఇక నోరెత్తే అవ‌కాశం రాలేదు. ఆ అంత‌రిక్ష నౌక‌లో ఆమె లాంటి వాళ్లే ఓ అర‌డ‌జ‌ను సుంద‌రీమ‌ణులు ఉన్నారు. వాళ్లంతా న‌వ్వుతూ చేతులూపుతుంటే లుంగీ, టీష‌ర్టుతో ఉన్న అప్పారావు, చేసేదేంలేక... అది ఆనంద‌మో, భ‌య‌మో, మైమ‌ర‌పో, అయోమ‌య‌మో, ఆశ్చ‌ర్య‌మో, ప‌ర‌శ‌వ‌మో తెలియ‌ని ఒకానొక వింత, విచిత్ర, విభిన్న‌, వినూత్న, అనూహ్య‌, అవ్య‌క్త భావానికి లోన‌య్యాడు. అత‌డే కాదు, అత‌డి అంత‌రాత్మ కూడా మూగ‌బోయింది.

ఆ అంత‌రిక్ష నౌక రివ్వుమంటూ ఆకాశంలోకి లేచింది. కిటికీలోంచి చూసిన అప్పారావుకి అత‌డి మ‌డ‌త‌మంచం, డాబా, ఊరు అన్నీ చూస్తుండ‌గానే చిన్న‌వైపోయి, ఆపై గూగుల్ ఎర్త్ లో లాగా నీలి రంగులో భూగోళం క‌నిపించి, అంత‌లోనే అది కూడా చుక్కైపోయి, న‌క్ష‌త్రాల గుంపులోంచి దూసుకుపోతున్న అనుభూతి క‌లిగింది.

అప్పారావు క‌ళ్లు విప్పార్చి కిటికీలోంచి త‌ల‌తిప్పి త‌న‌కేసి చూసుకునేస‌రికి... ఆశ్చ‌ర్యం!

త‌న దుస్తుల‌న్నీ మారిపోయి ఉన్నాయి. జ‌గ‌దేక‌వీరుడు సినిమాలో ఎన్టీఆర్ క‌ట్టుకున్న ధ‌గ‌ధ‌గ‌లాడే వ‌స్త్రాల‌వి. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కి న‌లుగురే. త‌న‌కి మాత్రం ఎంత‌మందో!

అప్పారావుకి లోప‌లి నుంచి ఉత్సాహం త‌న్నుకొచ్చింది. అది నోట్లోంచి ఈల పాట‌లా బ‌య‌ట‌కొచ్చింది.

ఆకాశంలో హంస‌ల‌మై... హాయిగ ఎగిరే గువ్వ‌ల‌పై... అలా అలా కులాసాల తేలిపోదామా?” అనే పాట అది.

ఒరే... ఇది ఈల వేసే సంద‌ర్భంరా... వీళ్లెవ‌రో, నిన్నెక్క‌డి లాక్కుపోతున్నారో, అక్క‌డ‌కి వెళ్లాక  ఏం చేస్తారో అని నేను హ‌డ‌లి చ‌స్తుంటే నీకు కులాసాగా ఉందా?’ అంటూ అంత‌రాత్మ తిట్టిపోసింది.

నిజ‌మే... ఎర‌క్క‌పోయి డాబా మీద ప‌డుకున్నాను. అప్ప‌టికీ పంక‌జం చెబుతూనే ఉంది, ఒక్క‌రూ ప‌డుకోలేరండీ ద‌డుసుకుంటార‌ని... అనుకున్నాడు అప్పారావు. భార్య‌ను త‌ల్చుకోగానే అప్పారావుకి జాలేసింది. రేప్పొద్దున్న నేను క‌న‌బ‌డ‌క‌పోతే ఏం కంగారు ప‌డుతుందో?’ అనుకున్నాడు.

ఆవిడ సంగ‌తి కాదురా... ముందు నీ సంగ‌తి ఆలోచించు... అంది అంత‌రాత్మ‌.

ఈలోగా ఏదో కుదుపు. అంత‌రిక్ష నౌక ఆగింద‌న్న‌మాట‌. అప్పారావు కిటికీలోంచి చూసేస‌రికి అద్భుత లోకం! వింత విచిత్ర భ‌వంతులు. పెద్ద పెద్ద మందిరాలు!

రా... సుంద‌రా... అంది అంత‌రిక్ష సుంద‌రి.

అప్పారావు వెన‌క్కి చూశాడు త‌న వెన‌క ఎవ‌రైనా ఉన్న‌రేమోన‌ని.

నిన్నే అప్పారావ్...ప‌ద అంది ఆ సుంద‌రి.

అప్పారావు ఛాతీ పోలీస్  ఉద్యోగానికి వెళ్లిన అభ్య‌ర్థి ఛాతీలాగా ఉబ్బెత్తున్న పొంగిపోయింది. ఆ సుంద‌రి అప్పారావుని ఓ అందాల సౌధంలోకి తీసుకెళ్లింది. అక్క‌డెవ‌రూ లేరు, త‌ను...ఆ సుంద‌రి... అంతే! ప‌క్క‌నే అద్భుత‌మైన హంస‌తూలికా త‌ల్పం!

ఇదేం గ్ర‌హ‌మో... ఇదేం లోక‌మో అనుకున్నాడు అప్పారావు.

ఇదెక్క‌డి గ్ర‌హ‌చారంరా నాయ‌నా... ఇంత మంచి అవ‌కాశం నీ ఎదుట ఉంటే, ఇదే గ్ర‌హ‌మైతే నీకెందుకురా... ఆ సుంద‌రి చేయి ప‌ట్టుకుని ప్రొసీడైపో అంటూ విసుక్కుంది అంత‌రాత్మ‌.

ఇక అప్పారావు ఆగ‌లేదు. ఒక్క ఉదుట‌న ఆ సుంద‌రి చేయి ప‌ట్టుకుని త‌న మీద‌కి లాక్కున్నాడు.

పైగా నీవేనా న‌ను వ‌ల‌చిన‌ది? నీవేనా న‌ను పిలిచిన‌ది? నీవేనా నా డాబాకొచ్చి న‌న్నిక్క‌డికి లాక్కొచ్చిన‌ది?” అంటూ పాటందుకున్నాడు మొహం సాధ్య‌మైనంత రొమాంటిక్‌గా పెట్టాన‌నుకుని!

నేను కాదు... అంది ఆ అంత‌రిక్ష సుంద‌రి అప్పారావు చెయ్యి విడిపించుకుని.

తెల్ల‌బోయిన  అప్పారావుతో చెప్పింది, “నేను కాదు అప్పారావ్. నిన్నిక్క‌డికి తీసుకురావ‌డానికి అలా చెప్పానంతే. నిన్ను చూసింది, వ‌ల‌చింది మా యువ‌రాణి! నేను ఆమె చెలిక‌త్తెని. ఆమె ఆజ్ఙ మేర‌కే నేనిలా చేశాను. అదిగో మా యువ‌రాణి నీకోసం ఎదురు చూస్తోంది. వెళ్లిరా. అమ‌ర సుఖాలు అనుభ‌వించు.. అంటూ ఆ అంత‌రిక్ష సుంద‌రి వ‌డివ‌డిగా వెళ్లిపోయింది.

అప్పారావు మ‌ళ్లీ ఇందాక‌టి అవ్య‌క్త భావానికి లోన‌య్యాడు.

ఈమె... కేవ‌లం చెలిక‌త్తా? చెలిక‌త్తే ఇంత మ‌నోహ‌రంగా  ఉంటే... ఆ యువ‌రాణి ఇంకెంత బావుంటుందో? అనుకున్నాడు అప్పారావు.

ఆహా...అప్పారావ్‌! మొద‌టి సారి నిన్ను చూస్తే ఈర్ష్య క‌లుగుతోందిరా. వెళ్లు ఆ యువ‌రాణిని మురిపించి, బులిపించి, మైమ‌ర‌పించు... అంటూ అంత‌రాత్మ తొంద‌ర‌పెట్టింది. 

ఇక అప్పారావు ఆగ‌లేదు. ఆ అంతఃపురంలో జ‌ల‌తారు ప‌ర‌దాల‌ను తొల‌గించుకుని ముందుకు న‌డిచాడు.

అక్క‌డ‌... ఆకాశంలో బంగారు రంగులో వెలిగిపోతున్న‌పెద్ద చంద‌మామ కురిపిస్తున్న ప‌సిడి వెన్నెల కాంతిలో వెన‌క్కి తిరిగి ఒయ్యారంగా నిల‌బ‌డి ఉంది అంత‌రిక్ష యువ‌రాణి!

అప్పారావులో భావ‌కుడు నిద్రలేచి పాటందుకున్నాడు.

రంభా ఊర్వ‌శి త‌ల‌ద‌న్నే ర‌మ‌ణీ ల‌లామ ఎవ‌రీమె? న‌న్నే వెద‌కుచు ఇట ర‌ప్పంచిన క‌న్యక ర‌తియే కాబోలు... అన్నాడు ఘంట‌సాల‌లా పాడుతున్నాన‌నుకుని.

ఆ అంత‌రిక్ష యువ‌రాణి కూడా ఆగ‌లేదు...

రారా... నా అంద‌గాడ‌! రాతిరంత జాత‌రేరా... అహా రాతిరంత జాత‌రేరా... అంటూ వెన‌క్కి తిరిగింది. అలా తిర‌గ‌డంలో ఆమె మేలి ముసుగు చిరుగాలికి జారువాలి తొల‌గిపోయింది.

అప్పారావు చూశాడు. అత‌డి క‌ళ్లు విప్పారాయి. నోరు త‌నంత‌ట తానే తెరుచుకుంది.

ఆ అంత‌రిక్ష యువ‌రాణి పూర్తి స్వ‌రూపం కంట‌బ‌డింది.

ఆమె నెత్తిమీద ... రెండు యాంటెన్నాల్లాంటి అవ‌య‌వాలు!

ఆమె క‌ళ్లు...ఆకుప‌చ్చ రంగులో వెలుగుతున్న పెద్ద పెద్ద గుంట‌లు!

ఆమె ముక్కు... లేదు స‌రిక‌దా, దాని స్థానంలో రెండు రంధ్రాలు!

ఆమె పెద‌వులు... ఎగుడుదిగుడు కోర‌ల‌తో మూసుకున్న నోరు!

ఆమె భుజాల నుంచి... వంక‌ర‌గా పీల‌గా వేలాడుతున్న రెండు చేతులు!

వెన‌క్కి తిరుగుతూనే ఆ యువ‌రాణి పాటందుకుంది...

సుంద‌రాంగా... అందుకోరా... సౌంద‌ర్య మాధుర్య మందార‌ము...

అంద‌లేని... పొంద‌లేని... ఆనంద లోకాలు చూపింతురా... అంటూ ముందుకు రాసాగింది.

కెవ్వు... కెవ్వు... కెవ్వుమంటూ అప్పారావు నోట్లోంచి అప్ర‌య‌త్నంగా అరుపులు వెలువ‌డ్డాయ్‌!

మోసం... ద‌గా... కుట్ర‌... అని అరుస్తూ అప్పారావు వెన‌క్కి తిరిగి ప‌రుగందుకున్నాడు.

మార్స్ ఎటాక్‌, ‘ద ఎన్‌కౌంట‌ర్స్ ఆఫ్ ద థ‌ర్డ్‌కైండ్ లాంటి హాలీవుడ్ సినిమాల్లోలాగా వికృతంగా ఉన్న ఆ వింత‌లోక ర‌క్ష‌క భ‌టులు గోల‌గోల‌గా అరుస్తూ అప్పారావు వెంట‌ప‌డ్డారు. బ‌య‌ట‌కొచ్చిన అప్పారావుకి త‌న‌ను తీసుకొచ్చిన అంత‌రిక్ష నౌక  క‌నిపించింది. చ‌టుక్కున దాంట్లోకి ఎక్కేశాడు. అక్క‌డ క‌నిపించిన ఏవేవో మీట‌లు నొక్కేశాడు.

అదృష్టం... ఆ నౌక రివ్వుమంటూ పైకి లేచింది. చూస్తుండ‌గానే దూరంగా భూమి, త‌న రాష్ట్రం, త‌న ఊరు, త‌న డాబా, త‌న మ‌డ‌త మంచం క‌నిపించాయి. ఈలోగా ఆ అంత‌రిక్ష నౌకలో ఓ బ‌ట‌న్ ఎర్ర‌గా వెలిగి ఆర‌డం మొద‌లెట్టింది.

మైగాడ్‌... ఫ్యూయ‌ల్ అయిపోయింద‌న్న‌మాట‌. వెన‌కా ముందూ ఆలోచించ‌కుండా అప్పారావు చ‌టుక్కున ఆ నౌక త‌లుపు తీసి కింద‌కి దూకేశాడు!

అంతే... ఆ అంత‌రిక్ష నౌక పేలిపోయింది!

అప్పారావు మాత్రం వ‌చ్చి వ‌చ్చి మ‌డ‌త‌మంచం మీద ధ‌ఢేళ్‌...మ‌ని ప‌డ్డాడు!

ఆపై మంచం మీద నుంచి కింద‌కి ప‌డ్డాడు.

అప్పుడు మెల‌కువ వ‌చ్చింది అప్పారావుకి! అత‌డి గుండె చ‌ప్పుడు అత‌డికే వినిపిస్తోంది!

వార్నీ... ఇదంతా క‌లా?’ అనుకున్నాడు అప్పారావు.

అవును... అంద‌మైన పీడ‌క‌ల‌! అంది అంత‌రాత్మ‌.

అప్ప‌టికే ఎండ చుర్రుమంటోంది. తెల్లారిపోయింద‌న్న‌మాట అనుకున్నాడు అప్పారావు.

గ‌బ‌గ‌బా దుప్ప‌టి మ‌డ‌త పెట్టేసి, మంచం ఎత్తేశాడు.

అప్పుడు క‌నిపించింది, మంచం కింద‌! మెరుస్తున్న వెండి మువ్వ‌ల ప‌ట్టీ!

వార్నాయ‌నో...అనుకున్నాడు అప్పారావు. దాన్ని తీసుకుని బ‌లంగా ఎటో విసిరేశాడు.

ఆరోజు నుంచి అప్పారావు డాబా మీద ప‌డుకుంటే ఒట్టు!!

GOT PRIZE IN 'UGADI KATHALA POTI' CONDUCTED BY "SANCHIKA" WEB-MAGAZINE ON 17.4.2022