ఆదివారం, జనవరి 28, 2024

జన చైతన్య శంఖారావం!



''నమస్కారం గురూగారూ! ఇవాళ పాఠం పేరేంటండీ...'' అన్నాడు శిష్యుడు నోట్సు తెరచి, పెన్ను క్యాప్తీస్తూ.

''ముందా పుస్తకం మూసేసి, పెన్ను జేబులో పెట్టేసుకోరా...'' అన్నారు గురూగారు తాపీగా.

''అదేంటండీ? ఇవాళ సెలవా?''

''కాదురా... అదిగో ఆ అలమారా తెరచి పై అరలో ఉన్నది తీసుకురా...''

''ఇదేంటండీ? ఇక్కడొక శంఖం ఉందీ?''

''అదే నీకు తొలి పాఠంరా. తీసుకొచ్చి దాన్ని ఊదు...''

శిష్యుడు శంఖం నోటిలో పెట్టుకుని ఊదడానికి ప్రయత్నించాడు. దాంట్లంచి ''తుస్ స్స్స్స్‌...'' అంటూ గాలొచ్చింది కానీ శబ్దం రాలేదు.

రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆయాసం వచ్చి రొప్పసాగాడు.

''లాభం లేదు గురూగారూ! దీన్ని ఊదడం నా వల్ల కాదు...'' అన్నాడు.

''వార్నీ! దీన్నే ఊదలేనోడివి ఇక రాజకీయాలు ఏం నేర్చుకుంటావురా?'' అన్నారు గురూగారు ఎకసెక్కంగా.

''ఊరుకోండి గురూగారూ! దీన్ని ఊదలేకపోతే ఇక అంతేనేటండి? అయినా రాజకీయాలకీ, శంఖం ఊదడానికి ఏంటండి సంబంధం?''

''మరి నేనేదో కాలక్షేపానికి చెప్పాననుకుంటున్నావేంట్రా? ఇది మామూలు ఊదుడు కాదురా, ఎన్నికల శంఖారావంరా బడుద్దాయ్‌!''

''ఏమో సార్‌... అయినా శంఖం ఊదడం రాకపోయినంత మాత్రాన రాజకీయాలకు పనికి రానంటారా?''

''ఏడిశావ్‌! నువ్వు రాజకీయాల్లో ఎందుకూ పనికిరాని దద్దమ్మవైనా, శంఖం మాత్రం ఊదడం రావాలిరా. అదంతే...''

''ఏమిటో గురూగారూ! ఇవాళ పాఠం చిత్రంగా ఉంది. ఈ శంఖమేంటో, ఊదుడేంటో, దానికీ రాజకీయాలకీ సంబంధం ఏమిటో కాస్త నాకర్థం అయ్యేలా చెబుదురూ...''

''ఓరి దద్దమ్మా! నిన్న సంగివలసలో నంగినంగిగా మాట్లాడిన నీ అధినేత ఏం చేశాడో చూడలేదా?''

''... గుర్తొచ్చిందండోయ్‌! శంఖం తీసుకుని, మొహం పైకెత్తి, మెడ నరాలు ఉబ్బిపోయినట్టు ఊదాడండి. ఆ సభ పేరు 'సిద్ధం'టండి...''

''మరదేరా. అందుకే నేను నిన్ను కూడా భావి రాజకీయాలకు సిద్ధం చేస్తున్నా. అర్థమైందా?''

''ఇప్పటికి అర్థమైంది సర్‌. కానీ నాకు శంఖం ఊదడం చేతకావట్లేదండి. ఇక నేను రాజకీయాలకు పనికిరానంటారా?''

''ఒరేయ్‌... నీకు పాలన చేతకాకపోయినా పర్వాలేదు. ప్రజలకు మేలు చేయలేకపోయినా పర్వాలేదు. వ్యవస్థల్ని నడపడం రాకపోయినా పర్వాలేదు. సంపద పెంచడం నీవల్ల కాకపోయినా పర్వాలేదు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడం తెలియకపోయినా పర్వాలేదు. ఉద్యోగాలు కల్పించడం వీలు కాకపోయినా పర్వాలేదు. ఉపాధి అవకాశాలను పెంచడం కుదరకపోయినా పర్వాలేదు. మహిళలకు రక్షణ కల్పించలేకపోయినా పర్వాలేదు. అత్యాచారాలు ఆపలేకపోయినా పర్వాలేదు. బడుగుల బతుకులు బాగు చేయడం రాకపోయినా పర్వాలేదు. వ్యవసాయానికి సాయపడకపోయినా పర్వాలేదు. రోడ్లకు మరమ్మతులు సైతం చేయలేకపోయినా పర్వాలేదు. విద్యావకాశాలను పెంపొందించలేకపోయినా పర్వాలేదు. సామాన్యులను ఆదుకోలేకపోయినా పర్వాలేదు. ఆఖరికి నువ్వు ఏమీ చేయలేని చవట దద్దమ్మవైనా పర్వాలేదు. కానొరేయ్‌... శంఖం మాత్రం ఊదడం మాత్రం తెలియాలొరే! అప్పుడే నువ్వు రాజకీయాలకు పనికొస్తావ్‌. తెలిసిందా?''

''అమ్మబాబోయ్‌! శంఖం ఊదడం అంత ముఖ్యమాండీ?''

''కాదట్రా మరి! నీ అధినేత చేసిందదే కదరా. చూశావా? ఎంత బాగా ఊదాడో!''

''అవునండి! ఊపిరి బిగబట్టి మరీ ఊదాడండి. సభలో జనం చెవులు గింగిర్లెత్తిపోయాయంటే నమ్మండి. మరయితే ఆ శంఖనాదం ఫలించినట్టేనాండీ?''

''శంఖనాదమో, సింగినాదమో? పాపం నాకు మాత్రం చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్టే అనిపించిరా...''

''అదేంటండీ, అంతమాటనేశారూ? జనం చెవిటివాళ్లంటారా?''

''జనం చెవిటివాళ్లు కాదురా. తెలివైన వాళ్లు. మీ వాడు ఊదిన శంఖనాదాన్నీ వింటారు, ఆయన మాట్లాడిన మాటల్నీ వింటారు. ఏది బాగా మోగిందో, ఏది తుస్సుమందో ఇట్టే పసిగడతారు. నువ్వు మాత్రం ఆయనలా ఊదడమూ నేర్చుకోవాలి, ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ఆయన చూడు, ఉత్తరాంధ్రలో సభ పెట్టి ఉత్తుత్తి మాటలు మాట్లాడాడా లేదా? అసలాయన అక్కడి వాళ్లకు ఏం ఊడబొడిచాడో చెప్పలేకపోయినా, ఏం ప్రాజెక్టలు తెచ్చాడో చూపలేకపోయినా బోర విరుచుకుని మరీ మాట్లాడలేదూ? అదిగో... ఆ సిగ్గుమాలిన తనాన్ని నువ్వు ఒంటపట్టించుకోవాలి. అప్పటివరకు అదిగో, ఇదిగో అంటూ కాలక్షేపం చేసి, ఆఖర్లో ఈ పార్టీ మీదేనన్నాడు చూడు, ఆ తెంపరితనం తెలుసుకోవాలి. ఆయనలా అన్నంత మాత్రాన సంబరపడ్డానికి జనమేమైనా ఎర్రిబాగులోళ్లా చెప్పు? అయినా కానీ, ఎన్నికలొచ్చేసరికి అలా జనానికి మస్కా కొట్టే చిట్కాలు అలవరచుకోవాలి. సభలో అలంకరణ చూశావా? ఎగస్పార్టీవోళ్ల బొమ్మలు పెట్టి, కుట్రదారులంటూ నినాదాలు పెట్టించాడు చూడు, అలాంటి కుయత్నాలు చేయడమెలాగో నువ్వు అర్థం చేసుకోవాలి. అయిదేళ్లు పరిపాలించినా, ఎంపీలందరూ నీ వాళ్లయినా దిల్లీలో ప్రత్యేక హోదా కూడా సాధించుకోలేకపోయిన నిర్వాకాన్ని కప్పెట్టి, తప్పంతా ఎగస్పార్టీ వాళ్లదేనంటూ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించాడు చూడు, అదిగో... ఆ నయవంచక విధానాలను ఔపోసన పట్టాలి. అర్థమైందా?''

''అర్థమైందండి. మీరు చెబుతుంటే అసలు శంఖం ఊదడం కన్నా, ఇలా ఊకదంపుడుగా మాట్లాడ్డమే ముందు రావాలనిపిస్తోందండి...''

''బాగా చెప్పావు. అయితే ఇప్పుడు ఆ శంఖాన్ని పక్కన పెట్టేసి, అలమార పైన ఒకటి పెట్టాను. దాన్ని తీసుకురా...''

''గురువుగారూ! ఇదొక డప్పండి. దాన్ని బాదడానికి పుల్ల కూడా ఉందండి...''

''రెండూ తీసుకొచ్చావుగా? ఇప్పుడు దాన్ని కొట్టడం నేర్చుకో. ఇది నీకివాళ రెండో పాఠం...''

''లాభంలేదు గురూగారూ! ఇది కూడా నాకు రాదండి...''

''ఇంక నువ్వేం రాజకీయాలకు పనికొస్తావురా? నీ అధినేత ఏం చేశాడో చూడలేదా?''

''అవునండి. డప్పు తీసుకుని డమడమా మోగించాడండి. రాజకీయాల్లో రాణించాలంటే ఇది కూడా నేర్చుకోవలసిందేనా సర్?''

''కాదట్రా మరి? అది మామూలు డప్పా? ప్రచారం డప్పు. నీ పాలన వల్ల వీసమెత్తు ప్రయోజనం లేకపోయినా, ఏదో ఊడబొడిచేసినట్టు హడావుడి చేయాలంటే సొంత డప్పు మోగించడం నేర్చుకోవాలి.  ప్రజల పేరిట పెట్టిన నవరాళ్ల పథకాల వల్ల జనానికి ఒరిగిన దాని కన్నా, వాటి పేరుతో నీ అధినేత గణాలు గడించిందే అధికమయినా... పదే పదే పథకాల గురించే డప్పు కోవడం చూశావుగా? ఆ మాటకారి మాయలను నువ్వు నేర్చుకోవద్దూ? పథాకాల పేరుతో ప్రజలకు ఇచ్చిన  దాని కన్నా,  అంతకు వంద రెట్లుగా వాళ్ల నుంచి పన్నులనీ, ఛార్జీలనీ వసూలు చేసినా, ఆ సంగతి మరపించి మురిపించడానికి ప్రయత్నించాడు చూడు... ఆ నంగనాచితనాన్ని నువ్వు ఔపోసన పట్టాలి. రైతుల అత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నా, మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం ముందున్నా... అదేమీ పట్టనట్టు నటిస్తూ, రాష్ట్ర ప్రజలకి బంగారు బాటలు పరిచానంటూ బీరాలు చెప్పాడు చూడు... అలా సొంత డబ్బా మోగించడంలో మెళకువలు మెరుగుపర్చుకోవాలి. అర్థమైందా?''

''ఆహా గురూగారూ! శంఖం ఊదడం, డప్పు కొట్టడం రాజకీయాల్లో ఎంత కీలకమో ఇప్పుడర్థం అయిందండి. మరి ఆయనగారి ఊదుడుకీ, బాదుడికీ ఫలితం ఉంటుందంటారా?''

ఒరేయ్‌... ప్రజలు నీ కన్నా, నాకన్నా, నీ అధినేత కన్నా తెలివైన వాళ్లురా. ఒక్క 75 రోజులు ఓపిక పట్టు. అప్పుడు జనచైతన్య శంఖారావం ఎలా ఉంటుందో, తెలివైన ఓటర్ల దండోరా ఎంత బాగుంటుందో నీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ శంఖం, డప్పు ఇంటికి పట్టుకెళ్లి  నీకు చేతనయింత నేర్చుకో. ఇక పోయిరా''

-సృజన

PUBLISHED ON 28.1.2024 ON JANASENA WEBSITE

శుక్రవారం, జనవరి 26, 2024

రామాయణాన్ని తొలిసారిగా పాడింది కుశలవులే!

 


రామాయణాన్ని తొలిసారిగా పాడింది కుశలవులే!

 

పిల్లల కోసం రాముడి కథ-2

వాల్మీకి మహర్షి ఆశ్రమానికి దేవర్షి నారదుడు వచ్చి రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పాడు. రాముడి గుణగణాలను కూడా వర్ణించి చెప్పాడు. నారదుడు అలా చెప్పే సమయానికి రాముడు రాజ్యపాలన చేస్తున్నాడు. అంటే అప్పటికే వనవాసం, రావణాసురుడి వధ పూర్తయ్యాయి. రాముడు అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషేకం కూడా చేసుకున్నాడు. అంతేకాదు, నారదుడు చెప్పిన రాముడి కథను వాల్మీకి రచించే సమయంలోనే మరో ముఖ్యమైన అంశం జరిగింది. గర్భవతి అయిన సీతను రాముడు అడవుల్లో వదిలేయాల్సి వచ్చింది. సీతను వాల్మీకి తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. అక్కడే లవకుశలు పుట్టారు. వాళ్లు వాల్మీకి ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని మొదటగా లవకుశలే గానం చేశారు. అంటే వాళ్ల ద్వారానే రామాయణం అందరికీ తెలిసిందన్నమాట.

ఇప్పుడు మనం, నారదుడు చెప్పిన రామకథను వాల్మీకి రామాయణంగా రచించడానికి ప్రేరణ ఎలా కలిగిందో తెలుసుకుందాం. అంటే ఇది రామాయణ కావ్యానికి ప్రారంభమన్నమాట.

వాల్మీకి ఆశ్రమం తమసా నది తీరంలో ఉండేది. ఇది గంగానదికి ఉపనది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్రాష్ట్రాలలో ప్రవహిస్తోంది. నారదుడు వెళ్లిపోయాక వాల్మీకి తన శిష్యుడు భరధ్వాజుడుతో కలిసి తమసా నది దగ్గరకు వెళ్లాడు. నదిలో స్నానం చేస్తూ ప్రకృతి దృశ్యాలను గమనించసాగాడు. అక్కడ ఆనందంగా కేరింతలు కొడుతున్న రెండు క్రౌంచ పక్షులను చూశాడు. వాటిని చూస్తుండగానే ఓ వేటగాడు వాటిలో మగపక్షిని బాణంతో కొట్టాడు. బాణం గుచ్చుకుని రక్తం కారుతూ గిలగిల కొట్టుకుంటున్న దాని దగ్గరకు ఆడపక్షి చేరి దీనంగా అరుస్తూ ఏడవసాగింది. అది చూసిన వాల్మీకి ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడింది. దాని అర్థం ఏమిటంటే... ''ఓ వేటగాడా! అనురాగంతో ఉన్న పక్షుల జంటలో ఒక దాన్ని చంపేశావు. నీవెంతో కాలం జీవించవు సుమా'' అని! సంస్కృత భాషలో ఆయన అనుకోకుండా పలికిన ఆ శ్లోకమే రామాయణ కావ్య రచనకు నాంది పలికింది. ఆ శ్లోకం ఓ ప్రత్యేకమైన ఛందస్సుతో ఉంది. లయబద్ధంగా ఉంది. సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో ఉన్న ఆ శ్లోకం వాయిద్యాల సాయంతో పాడడానికి కూడా అనువుగా ఉంది. వాల్మీకి నోటి వెంట వచ్చిన ఈ శ్లోకాన్ని ఆయన పక్కనే ఉన్న శిష్యుడు భరధ్వాజుడు విని గుర్తు పెట్టుకున్నాడు. వెంటనే కంఠస్థం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. వాల్మీకి మహర్షి తన నోటి వెంట వెలువడిన ఆ శ్లోకం గురించే ఆలోచిస్తుండగా అక్కడ బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యానికి గురైన వాల్మీకి ఆయనకు నమస్కరించాడు. అప్పుడు బ్రహ్మ, ''వాల్మీకీ! నువ్వు పలికినది ఛందోబద్ధమైన శ్లోకం. నా సంకల్పం వల్లనే అది నీ నోట పలికింది. ఈ ఛందస్సులోనే నువ్వు రాముడి కథను రచించు. నారదుడు నీకు చెప్పిన అంశాలతో పాటు మరిన్ని వివరాలు కూడా నీ కళ్ల ముందు కదలాడుతాయి. వాటి ఆధారంగా నువ్వు రాసే రామాయణంలో అన్నీ సత్యాలే ఉంటాయి. అందులోని పదాలలోకానీ, వాక్యాలలో కానీ, అర్థాలలో కానీ ఎలాంటి దోషాలూ ఉండవు. ఆ రామకథ పాపాలను పోగొడుతుంది. విన్నమాత్రం చేతనే పరమానందాన్ని కలిగిస్తుంది. ఈ భూమి మీద పర్వతాలూ, నదులు ఉన్నంత కాలం రామాయణం నిలిచి ఉంటుంది. నీ కీర్తి ప్రతిష్ఠలు ముల్లోకాల్లోనూ వ్యాపిస్తాయి'' అని చెప్పి అదృశ్యమయ్యాడు. వాల్మీకి ఎంతో ఆనందించి బ్రహ్మ చెప్పినట్టుగానే రామాయణ కావ్య రచనకు పూనుకున్నాడు.

వెంటనే రాముడి కథంతా వాల్మీకి యోగదృష్టికి యథాతథంగా, కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఆ కథకు సంబంధించిన సన్నివేశాలు, అందరి మాటలు, మనోభావాలు సైతం ఆయనకు పూర్తిగా, వివరంగా అవగతమయ్యాయి. అలా వాల్మీకి రాముడు పుట్టడం దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు రామాయణాన్ని ఆరుకాండలుగా, 500 సర్గలుగా, 24 వేల శ్లోకాలతో పూర్తి చేశాడు. రాముడి పట్టాభిషేకం తర్వాత ఏం జరిగిందో, జరుగుతోందో, జరుగబోతోందో కూడా ఆయన దివ్యదృష్టికి గోచరమైంది.

రమణీయమైన రామాయణాన్ని పూర్తి చేశాక, దాన్ని గానం చేయడానికి తన ఆశ్రమంలోనే పుట్టి పెరిగి, తన వద్దనే సకల విద్యలూ నేర్చుకున్న కుశలవులే తగిన వారని వాల్మీకి మహర్షి భావించాడు. వాళ్లకి దాన్ని నేర్పించాడు. ముని బాలుర వేషంలో ఉన్న కుశలవులు రామాయణాన్ని చక్కగా నేర్చుకుని, శ్రావ్యంగా పాడడంలో ఆరితేరారు. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన అనేక మంది రుషులు, మునులు కుశలవుల నోటి వెంట రామాయణాన్ని విని పరమానంద భరితులై ఆశీర్వదించారు. అలా కుశలవులు రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్య  చేరి శ్రీరాముడి దృష్టిని కూడా ఆకర్షించారు. రాముడి సభలో ప్రజలందరి సమక్షంలో కూడా అద్భుతంగా రామాయణాన్ని ఆలపించారు. వారి ద్వారా లోక ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని తిరిగి మనం కూడా మొదటి నుంచీ తెలుసుకుందాం.

సోమవారం, జనవరి 22, 2024

ఏడుపుగొట్టు రాజకీయం!



''నమస్కారం గురూగారూ! రాజకీయాల్లో నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఏమిటండీ?''

''ఏడవడం''

''...హ్హ...హ్హా! మీరు భలే జోకులేస్తారండీ...''

''ఇది జోకు కాదురా...''

''ఊరుకోండి సార్‌. మీరు నన్ను ఏడిపించడానికి అలాగంటున్నారు. అవునా?''

''అవున్రా! నిన్ను బాగా ఏడిపించడమే ఇప్పుడు నా లక్ష్యం...''

''అదేంటి సర్‌? నేనేం చేశానని అంతమాటనేశారు? మీ దగ్గర వినయంగానే ఉన్నానే? బుద్ధిగానే పాఠాలు బట్టీ పట్టానే? మీరెలా చెబితే అలా నడుచుకున్నానే? మిమ్మల్నే నా రాజకీయ గురువుగా భావించానే? మరేంటండి నాలో లోపం?''

''ఒరేయ్‌... ముందు  ఏడుపు ఆపేయ్‌...''

''ఏడుపంటారేంటి సార్‌, నేను బాధ పడుతుంటే? మీ మాట వల్ల నా మనసు నొచ్చుకుంటే అది చెప్పడం కూడా తప్పేనాండీ?''

''ఏడుపు ఆపరా బాబూ అంటుంటే, వెక్కిళ్లు కూడా పెడతావేంట్రా?''

''మళ్లీ ఇదొకటా? ఇవాళ ఇలా మాట్లాడుతున్నారేంటి సర్‌? నేనంటే ఇష్టం లేకపోతే  మాట చెప్పండి, నా పొరపాటుంటే సరిదిద్దండి. కానీ ఇలా తిడితే ఎలాగండీ?''

''వార్నీ! అన్నకొద్దీ రెచ్చిపోతున్నావే? ఏడుపు, వెక్కిళ్లతో పాటు కుళ్లి కుళ్లి మరీ కన్నీళ్లు కారుస్తున్నావేంట్రా?''

''ఇది మరీ అన్యాయం గురూగారూ! మీరే నన్నని, అదేంటని అడిగిన పాపానికి నన్నింతలా మాటలనాలా సార్‌?''

''నేను నిన్నేమీ అనలేదురా. నువ్వే నేనన్నాననుకుని ఏడుస్తున్నావ్‌. ఏడిస్తే ఏడిశావ్కానీ మొత్తానికి బాగానే ఏడిశావులేరా...''

''ఏమో సార్‌... నాకివాళ మీ ధోరణేం అర్థం కావడం లేదు. మీరే ఏడిపించి, పైగా బాగా ఏడిశానంటారేంటి సర్‌. మళ్లీ పొగడ్త ఒకటా?''

''ఓరి బడుద్దాయ్‌! కళ్లు తుడుచుకుని నేను చెప్పింది పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. నువ్వు రాగానే రాజకీయాల్లో ముఖ్యమైన పాఠం ఏమిటని అడిగావవునా? దానికి నేను ఏడవడం అని జవాబిస్తే, నువ్వు అదేదో జోకనుకుని నవ్వేశావ్‌. అది జోకు కాదని ఇప్పటికైనా అర్థమైందా?''

''అంటే ఏడవడం కూడా రాజకీయమేనాండీ?''

''కచ్చితంగారా. దీన్నే ఏడుపుగొట్టు అధ్యాయమంటారు. కీలక సమయాల్లో ఇది భలే ఉపయోగపడుతుందిరోయ్‌...''

''మరయితే... ఇందాకా నన్ను ఏడిపించడమే మీ లక్ష్యమన్నారేంటి సర్‌?''

''కాదేంట్రా మరి! ఇదొక ముఖ్యమైన పాఠమైనప్పుడు దాన్ని నీకు నేర్పించవద్దూ? అది గురువుగా నా లక్ష్యమే కదరా...''

''చంపేశారండీ బాబూ. నేనింకా మీరు నన్నేదో అనేస్తున్నారనుకుని భయపడ్డాను. అయితే ఇప్పుడు పాఠం చెప్పండి సార్‌...''

''ఇంకా చెప్పడమేంట్రా? నువ్వు ఆల్రెడీ నేర్చేసుకున్నావ్‌...''

''అదెలా సర్‌?''

''నేనేదో నిన్ను అన్నాననుకుని నువ్వు నా మీద అభాండాలు వేశావు చూడు, అదంతా అసలు సిసలు ఏడుపు కిందే వస్తుంది. నేను తిట్టానన్నావ్‌, ఏడిపించానన్నావ్‌, బాధ పెట్టానన్నావ్‌, అది కూడా చెప్పుకోడానికి లేదా అంటూ నిలదీశావ్‌. ఏడుపులో దశలన్నీ బాగానే దాటావు కాబట్టే, బాగా ఏడిశావులే అన్నాను. తెలిసిందా?''

''తెలిసినట్టే ఉందండి. మరైతే  ఏడుపుగొట్టు పాఠం ఏఏ పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుందో కూడా చెప్పండి...''

''ఏడవడం తెలిసుండాలి కానీ, దాన్ని ఒడుపుగా ఉపయోగించుకుంటే నిన్ను మించిన నీచ రాజకీయ నేత మరొకరుండరురా. ఉదాహరణకి నువ్వొక నేతగా రాణించాలనుకున్నావుకో. ముందు ప్రజల దగ్గర ఏడవడం నేర్చుకోవాలి. అయితే అది ఏడుపులా ఉండకూడదు. పైపెచ్చు ఓదార్పులా ఉండాలి. నిజానికి నీ ఏడుపంతా అధికారం కోసమే. కానీ  ఏడుపును కడుపులో దాచేసుకోవాలి. నీ అసలేడుపేంటో ప్రజలు పసిగట్టారనుకో. నువ్వెంత ఏడ్చినా లాభం ఉండదు. కాబట్టి పైకి మాత్రం మెత్తగా నవ్వుతూ కనిపించాలి. అంటే ఏడుపుగొట్టు నవ్వన్నమాట. నీకసలు నవ్వు రాకపోయినా, దాన్ని ముఖమంతా పులుముకుని జనం దగ్గరకి బయల్దేరాలి. అలాగని గబుక్కున నవ్వేయకూడదొరేయ్‌. నీది నవ్వో, ఏడుపో తెలియనంతగా జాగ్రత్త పడాలి. అంటే నువ్వు నవ్వుతున్నా అది ఏడ్చినట్టుండాలన్నమాట. అలా ఏడవలేక నవ్వుతూ ప్రజల దగ్గరకి వెళ్లాలి. వెళ్లి నీ ఏడుపంతా ప్రజల కోసమేనన్నట్టు నమ్మించాలి. అందుకని ప్రజలే ఏడుస్తున్నట్టు,  వాళ్ల ఏడుపు చూడలేకే నువ్వు రాజకీయాల్లోకి వచ్చినట్టు నమ్మించాలి. ఊరూవాడా ఇలా నవ్వలేక ఏడుస్తూ, ఏడవలేక నవ్వుతూ తిరగాలి. నిన్ను చూడ్డానికి పోగయిన జనం ఏడవకపోయినా నువ్వు వాళ్లని పనిగట్టుకుని ఓదార్చాలి. అప్పటికి అధికారంలో ఉన్నప్రభుత్వం వల్ల ప్రజలంతా నవ్వడమే మర్చిపోయినట్టు నూరిపోయాలి.  ప్రభుత్వం అసలు ప్రజల ఏడుపులేవీ పట్టించుకోవడం లేదని ప్రచారం చేయాలి. నీకే గనుక ఓటేస్తే జనం బతుకంతా నవ్వులేనని కోతలు కోయాలి. నువ్వు అధికారంలోకి వస్తే ప్రజలంతా, అసలు ఏడవడమంటే ఏంటో కూడా మర్చిపోతారని భ్రమలు కల్పించాలి. అందుకోసం అడ్డమైన హామీలివ్వాలి. అసాధ్యమైన వాగ్దానాలు చేయాలి.  అవ్వా,  తాతా,  అమ్మా,  అక్కా,  చెల్లీ... అంటూ నానా ఏడుపులూ ఏడ్వాలి. నీ మనవడిననాలి. నీ బిడ్డననాలి. నీ మావయ్యననాలి. నీ అన్నననాలి. ఎదురుపడ్డ వాళ్ల బుర్రలు నిమరాలి. బుగ్గలు పుణకాలి. బులిపించాలి. మొత్తానికి బోల్తా కొట్టించాలి. అర్థమైందా?''

''భలేగా అర్థమైంది సార్‌. మరయితే ఇలాంటి ఏడుపులు ఏడ్చి అనుకున్నది సాధించిన నేతలెవరైనా ఉన్నారాండీ?''

''స్వయానా  నేత పాలనలో  పౌరుడిగా ఉంటూ కూడా ఇంకా ఇదేం ప్రశ్నరా దరిద్రుడా...''

''అమ్మబాబోయ్‌! తిట్టకండి. ఇప్పటికి అర్థమైందండి. మరయితే గురూగారూ, ఇలా నానా ఏడుపులూ ఏడ్చి ప్రజల్ని నమ్మంచి అధికారంలోకి వచ్చామనుకోండి. ఇక అప్పుడు ఏడుపెందుకండీ? ఏడిచే అవకాశమే ఉండదుగా?''

''నీకుండదురా. ప్రజలకుంటుంది. అసలు నీ ఏడుపంతా అధికారం కోసమేనని వాళ్లకి తెలిసిపోతుంది. ఇహ... అప్పటి నుంచి వాళ్ల ఏడుపులు మొదలవుతాయి. అచ్చం నీ పరగణాలో జరుగుతున్నట్టే. రైతులు గిట్టుబాటు లేక ఏడుస్తారు. కూలీలు పనులు లేక ఏడుస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాల్లేక ఏడుస్తారు. విద్యార్థులు చదువులు సాగక ఏడుస్తారు. సామాన్యులు సంపాదన చాలక ఏడుస్తారు. గృహిణులు ధరలు పెరిగిపోయి ఏడుస్తారు. ఉద్యోగులు జీతాలు సరిగా రాక ఏడుస్తారు. మొత్తానికి నిన్ను గెలిపించిన వాళ్లు, నిన్ను నమ్మినందుకు ఏడుస్తారు... ''

''సర్‌... ఆగండాగండి. నాకు అధికారం అందాక ప్రజలు ఎలా ఏడిస్తే నాకెందుకండీ? నా మటుకు నేను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా వాటాలు, కమిషన్లు సంపాదిస్తాను కదా? అంటే మీ ఏడుపుగొట్టు పాఠం నేను గెలిచాక ఉపయోగపడదన్నమాటేగా?''

''ఏడిశావ్‌! అప్పుడు కూడా ఎలా ఏడవాలో నేర్చుకోవాలిరా వెధవాయ్‌! నిజానికి అప్పుడే ఒడుపుగా ఏడవాలి. ఎలాగో చెబుతాను విను. నువ్వు కుర్చీ ఎక్కాక రాష్ట్రాన్ని కొల్లగొట్టడం మొదలెడతావా? మరి ప్రతిపక్షం వాళ్లు ఊరుకుంటారేంటి? నీ ఎదవేషాలన్నీ జనం ముందు బట్టబయలు చేస్తుంటారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పాటు పడే నిజాయితీ నేతలయితే, నీ నిజస్వరూపాన్ని అద్దంలో ప్రతిబింబాన్ని చూపించినట్టు చూపిస్తుంటారు. నిజాలు రాసే ప్రతికలు నీ ప్రతి అడుగులోనూ అవినీతి మడుగులెలా ఏర్పడుతున్నాయో ఎప్పటికప్పుడు అచ్చెత్తిస్తుంటారు.  అప్పుడిక నీకు నవ్వు రమ్మన్నా రాదు. కానీ ఏడ్వలేక నవ్వాల్సిందే. అప్పుడెలా ఏడవాలో చెబుతాను విను. జనానికి  పాటికి ఎంతో చేసేద్దునూ, కానీ  ఓర్వలేని వాళ్లు అడుగడుగునా అడ్డం పడిపోతున్నారని కొత్త ఏడుపు మొదలెట్టాలి. నీ పాలనలో బడుగుల బతుకులు బాగు పడిపోతుంటే చూడలేక ఏడుస్తున్నారని అభాండాలు వేస్తూ ఆరున్నొక్క రాగంలో ఏడవాలి. అర్థమైందా?''

''బాగుంది కానీ గురూగారూ, నాదొక సందేహమండి. ఎలాగోలా అధికారంలోకి వచ్చేశాక, ఇక ఎందుకండీ  ఏడుపులన్నీ? నేననుకున్నది సాధించాగా? ఇక ఎవరేమనుకుంటే నాకేం? నా నిజ స్వరూపం బయటపడితే మాత్రం నాకేం?''

''మళ్లీ ఏడిశావ్రా బుద్ధిహీనుడా! అధికారం అంటే ఏదో ఒకసారి కుర్చీ ఏక్కితే సరిపోతుందేంట్రా? మళ్లీ  కుర్చీని కొనసాగించుకోవద్దూ? అది కాస్తా చేజారిందనుకో నీ దోపిడీ ఎలా సాగుతుంది?  పైగా నువ్వుగానీ కుర్చీ దిగావనుకో, ఇక నీ మీద ఉన్న కేసులు జూలు విదుల్చుకుంటాయి. నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు కొత్త కేసులై నీ మెడకు చుట్టుకుంటాయి. అప్పుడైనా ఏడ్వాల్సిందేననుకో. కానీ అంతకన్నా అధికారంలో ఉంటూ దాన్ని నిలబెట్టుకోడం కోసం ఏడ్వడం నయం కదూ? కాబట్టి నీకెలా చూసినా ఏడుపు తప్పదు...''

''అవునండోయ్‌. మొత్తానికి రాజకీయమంతా ఏడుపు చుట్టూనే అల్లుకుపోయిందని అర్థమవుతోంది. మరయితే ఇలా అధికారంలో ఉంటూ దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏడుస్తూ నాలాంటి వాళ్లకి స్ఫూర్తిగా నిలిచే నేత ఎవరైనా ఉన్నారాండీ?''

''మళ్లీ నీ ఏలికను మర్చిపోతున్నావురా.  నీచ రాజకీయాల్లో ఎదగాలని కలలు కనే నీలాంటి ఛోటా బేటాలకు నీ నేతని మించిన స్ఫూర్తిప్రదాత ఎవర్రా?''

''సర్‌... అడిగానని అనుకోవద్దు కానీ, ఆయన  మధ్య ఏడ్చిన ఏడుపులు ఎలాంటివండీ?''

''ఒరేయ్‌... నువ్వు సమకాలీన రాజకీయాలను సరిగ్గా గమనించడం లేదురా. అందుకే నీ బతుకు ఇంకా ఇలా ఏడ్చింది.  మధ్య ఆయనేం రాగం అందుకున్నాడా వినలేదా? ప్రతిపక్ష పార్టీలు, నేతలు, కిట్టని వాళ్లు కలిసి తన కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని సప్తమ స్వరంలో ఏడుపు రాగం అందుకోలేదూ? అసలా ఏడుపుకి అర్థం ఉందా అంట? స్వయానా అమ్మని పార్టీ నుంచి బయటకి పంపిందెవరు? తన గెలుపు కోసం రోడ్డెక్కి చెమటోడ్చి కష్టపడిన చెల్లెలికి కనీస గౌరవమైనా ఇచ్చాడట్రా? ఇక సొంత బాబాయి విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియని విషయమా? ఇలా తన కుటుంబానికి తానే కనిపించని విలన్లాగా మారిన నైజాన్ని జనం గమనించడం లేదంటావా? ఇవన్నీ కప్పి పుచ్చుకుని వేరే వాళ్లెవరో కుటుంబాన్ని విడదీస్తున్నారంటూ నిస్సిగ్గుగా మాట్లాడడం, నికార్సయిన రాజకీయ రోదనకి నిలువెత్తు సాక్ష్యం కాదురా? ఇప్పుడిక తన చెల్లే ఎగస్పార్టీ అధ్యక్షురాలై, ఏడ్చినట్టున్న తన పాలనపై విమర్శలతో విరుచుకుపడడం ఆయన అసలు ఏడుపు.  ఏడుపునే ఇలా వెళ్లగక్కుతున్నాడన్నమాట. అందుకనే రేపు ఎన్నికల్లో ఎగస్పార్టీ వాళ్లంతా ఇంటికో కిలో బంగారం కూడా పంచిపెడతామంటూ రకరకాల ప్రలోభాలు పెడతారు జాగ్రత్త అంటూ... తానేదే జనాన్ని మేలుకొలుపుతున్నట్టు కొత్త ఏడుపు మొదలెట్టాడు గురుడు. అసలు ఈయన గెలిచింది అన్నింటికన్నా ఘోరమైన అసంబద్ధమైన, అసాధ్యమైన, అబద్ధపు వాగ్దానాలతోనేనన్నవిషయం మర్చిపోయి మరీ ఇతరుల పడి ఏడవడం విచిత్రంగా లేదూ?''

''అవునండోయ్‌! ఇంతకీ ఆయన ఇంతగా వెక్కివెక్కి మరీ రకరకాలుగా ఎందుకేడుస్తున్నట్టండీ?''

''ఎందుకేంట్రా... ఎన్నికలు ముంగిట్లోంచి నట్టింటిలోకి వచ్చేశాయి. కుర్చీ కోసం తానిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా సరిగా నెరవేర్చని నిజం నిప్పులాగా రాజుకుంటోంది. ప్రజల్లో  వర్గం వారిని కదిపినా వ్యతిరేకత కస్సుమంటోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఓట్లు చీలకుండా పకడ్బందీ ఏర్పాట్లతో దూసుకుపోతున్నారు. ప్రజల చూపుడు వేళ్లన్నీ తను చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాయి.  చూపుడు వేళ్లే ఇప్పుడు కొత్త మీటలు నొక్కేస్తాయేమోననేదే ఆయనగారి అసలు ఏడుపు. అర్థమైందా?''

''ఆహా...  ఏడుపుగొట్టు రాజకీయ పాఠం అన్నింటికన్నా అద్భుతంగా ఉందండీ. కానీ గురువుగారూ, ఆయన ఏడుపులు ఫలిస్తాయంటారా?''

''ఏడ్చినట్టుందిరా నీ సందేహం. తామంతా ఏడవకపోయినా ఓదార్చి మరీ కుర్చీ ఎక్కి తమనే ఏడిపించిన నేతని జనం ఏడిపించకుండా వదులుతారంట్రా? నువ్వు మాత్రం అనవసరపు సందేహాలు పెట్టుకోక నీ పాఠం నువ్వు నేర్చుకుని ఏడు!''

-సృజన

PUBLISHED ON 23.1.2024 ON JANASENA WEBSITE