మంగళవారం, మే 31, 2022

అదే అస‌లైన గుణ‌పాఠం!

 


శిష్య‌డు రాగానే గురువుగారు రెండు పుస్త‌కాలు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అవి సుమ‌తి, వేమ‌న శ‌త‌కాలు.

శిష్యుడు వాటిని తిర‌గేసి, "ఇదేంటి గురూగారూ! ఎప్పుడో చిన్న‌ప్పుడు చ‌దువుకున్న ప‌ద్యాల పుస్త‌కాలిచ్చారూ? ఇప్పుడేం ప‌నికొస్తాయి?" అన్నాడు.

"భ‌లేవాడివిరా...  ఇవి ఇప్పుడే కాదురా, ఎప్ప‌టికైనా ప‌నికొస్తాయి తెలుసా?"

"ఊరుకోండి గురూగారూ! నేనేదో నాలుగు రాజ‌కీయ పాఠాలు నేర్చుకుని నీచ నేత‌గా నిగ్గుతేలాల‌ని ఆశ‌ప‌డుతుంటే, నన్ను చిన్న‌పిల్లాడిని చేసి ఆడుకుంటున్నారా? ఇవ‌న్నీ నీతులు క‌దండీ?  వీటితో మ‌న‌కేం ప‌ని?"

"ఓరి నా వెర్రి శిష్యా! అప్పుడెప్పుడో ఆత్రేయ‌గారు ఏదో పాట‌లో ఏమ‌న్నారు? ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి... అన్నారు క‌దా? అస‌ల‌దెంత గొప్ప నీతిరా?"

"అవునండి... ప్రేమ‌న‌గ‌ర్ సినిమాలోనండి. నేను పుట్టాను... ఈ లోకం మెచ్చింది... అనే పాటండి. గొప్ప హిట్టండి బాబూ..."

"క‌దా?  కాబ‌ట్టి ఎదుటి వాడికి చెప్ప‌డానికైనా నీకు నీతులు రావాలి క‌ద‌రా? ఇలాంటి నీతులు వ‌ల్లించావనుకో, జ‌నం మాయ‌లో ప‌డి ఓట్లు గుద్దేశార‌నుకో. ఏకంగా కుర్చీ ఎక్కేయొచ్చు. ఆపై వాటితో పని ఉండ‌దు. ఆన‌క నీ నీతులే... అవినీతుల‌వుతాయి. అర్థ‌మైందా?"

"అర్థ‌మైందండి... అయితే వీటిని ఇంటికి తీసుకెళ్లి బట్టేప‌ట్టేస్తానండి. మ‌రి ఇవాల్టి పాఠం చెప్పండి..."

"ఎప్పుడో బ‌ట్టీ ప‌ట్టడం కాదురా... ఇప్పుడే చ‌దువు. వీటి ద్వారా న‌వీన రాజ‌కీయ నీతి సూత్రాలు నేర్చుకుందువుగాని... స‌రేనా?"

శిష్యుడు బుర్ర గొక్కున్నాడు. గురువుగారు ఇక వ‌దిలేలా లేర‌ని, ఓ పుస్త‌కం తెర‌చి క‌నిపించిన ప‌ద్యం చ‌దివాడు.

క‌న‌క‌పు సింహాస‌న‌మున‌

శున‌క‌ము గూర్చుండ‌బెట్టి శుభ‌ల‌గ్న‌మునన్‌

దొన‌ర‌గ బ‌ట్ట‌ము క‌ట్టిన

వెన‌క‌టి గుణ‌మేల మాను విన‌రా సుమ‌తీ!

గురువుగారు తాపీగా ప‌డ‌క్కుర్చీలో వెన‌క్కి వాలి అందుకున్నారు.

"చూశావురా... ఎప్ప‌టిదో పాత ప‌ద్యం అన్నావ్‌. కానీ ఇప్పుడు నీ ప‌ర‌గ‌ణాలో జ‌రిగింది, జ‌రుగుతున్న‌ది ఇదే క‌ద‌రా? అధికారం కోసం అంగ‌లార్చుకుపోయి... కుర్చీ కోసం క‌ల‌లు క‌నీ క‌నీ... ఊరూవాడా వెర్రెత్తిన‌ట్టు తిరుగుతూ... ఎవ‌రూ ఏడ‌వ‌క‌పోయినా ఓదార్చుతూ... బుగ్గ‌లు నిమురుతూ... ముద్దులు పెడుతూ... మీ అధినేత చెప్పిన నీతులు ఓసారి గుర్తుకుతెచ్చుకో. అబ్బో... ఎన్ని నీతులు, ఎన్ని సుద్దులు, ఎన్ని ఆశలు, ఎన్ని హామీలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ఊరింపులు! అదిగో స్వ‌ర్ణ‌యుగ‌మ‌న్నాడు. అల్ల‌దిగో ప్ర‌త్యేక హోదా అన్నాడు. జీవితాల్ని మార్చేస్తాన‌న్నాడు. బ‌తుకులు ఉద్ధ‌రిస్తాన‌న్నాడు. ఆ నీతులు విని, ఆ మాట‌లు న‌మ్మి, నిజ‌మేగామాలనుకుని, ఇన్నాళ్ల‌కి మ‌న గురించి ఆలోచించే నాయ‌కుడొచ్చాడ‌నుకుని... ఆశ‌ప‌డి, సంబ‌ర‌ప‌డి, ఆనంద‌ప‌డి, సంతోష‌ప‌డి, కిందా మీదా ప‌డి... ప‌డీ ప‌డీ మ‌రీ జ‌నం ఓటేసి గెలిపించారు క‌దా? ఏమైంది... ఇప్పుడా జ‌న‌మే ద‌గాప‌డ్డారు.  దిగాలు ప‌డ్డారు. బెంగ ప‌డ్డారు. బెంబేలు ప‌డ్డారు. క‌ల‌వ‌ర ప‌డ్డారు. బొక్క బోర్లా ప‌డ్డారు.  .

పాద‌యాత్ర‌కు ముందే పాతిక అక్ర‌మార్జ‌న కేసుల సాక్షిగా జైలుకెళ్లొచ్చిన నిందితుడైనా... అధికారం లేని రోజుల్లోనే కుర్చీ వెనుక చ‌క్రం తిప్పి ల‌క్ష‌ల కోట్లు కొల్ల‌గొట్టి, ప్యాల‌స్ లు క‌ట్టిన ఘ‌న చ‌రిత్ర ఉన్న‌వాడైనా జ‌నం తీసుకొచ్చి సింహాస‌నం మీద కూర్చోబెట్టి ప‌ట్టం గ‌ట్టారు క‌దా... మ‌రి సింహాస‌నం ఎక్కిన మీ  అధినేత త‌న వెన‌క‌టి గుణ‌మేదైనా మార్చుకున్నాడా?  లేదే! 

నాలుగు గింజ‌లు చ‌ల్లి, ఆశ ప‌డి వ‌చ్చిన‌ పావురాల్ని ప‌ట్టుకునే వేట‌గాడిలా... మీ అధినేత ఏవేవో ప‌థ‌కాలు పెట్టిన‌ట్టే పెట్టి... ఆ త‌ర్వాత ప‌న్నులు పెంచి, ధ‌ర‌లు దంచి, కొత్త కొత్త చెత్త సుంకాలు విధించి, ఛార్జీలు ఛెళ్లు మ‌నిపించి,  ఒకేసారి సెటిల్‌మెంట‌ని,  మ‌రోసారి రిజిష్ట్రేష‌న్ అని నోటీసులు ఇచ్చి, తాఖీదులు జారీ చేసి, జీవోలు మార్చి, జెల్ల‌కొట్టి జేబులు ఖాళీ చేసి గూబ గుయ్యిమ‌నిపించ‌డం లేదూ?  అదిగో ఆ అధినేత‌లాగే నువ్వు ముందు నీతులు చెప్పి, ఆన‌క అధికారం అందాక ప్ర‌జ‌ల‌కే గోతులు త‌వ్వాల‌న్నమాట. అర్థ‌మైందా?"

శిష్యుడు నోరెళ్ల‌బెట్టాడు.

"అయ్య‌బాబోయ్ గురూగారూ! భ‌లే తాత్ప‌ర్యం చెప్పారండీ. పాత ప‌ద్యం వెన‌క కొత్త రాజ‌కీయం ఇంతద‌న్న‌మాటండి... అయితే మ‌రోటి చ‌దువుతాను దాని అంత‌రార్థం కూడా చెప్పండి..." అంటూ పేజీలు తిర‌గేసి మ‌రో ప‌ద్యం చ‌దివాడు.

అల్ప‌జాతి వాని క‌ధికార‌మిచ్చిన‌

దొడ్డ‌వారినెల్ల దోలి తిరుగు

చెప్పుతినెడు కుక్క చెర‌కు తీపెరుగునా

విశ్వ‌దాభిరామ వినుర వేమ‌

గురువుగారు క‌ళ్లు మూసుకుని చెప్పారు.

"ఇది కూడా నీ ప‌ర‌గ‌ణా క‌థేరా శిష్యా! స‌రైన గుణ‌ము లేని వారికి అధికార‌మిస్తే ఏమువుతుందో చూస్తున్నావు క‌దా? త‌న మాట విన‌ని అధికారులంద‌ర్నీ వేధిస్తున్నాడు మీ అధినేత‌. త‌న‌కు దాసోహ‌మ‌న‌ని వారిని త‌రిమి కొడుతున్నాడు. ఆఖ‌రికి త‌న పార్టీ వాడైనా స‌రే, ఎదురు మాట్లాడాడా, త‌ప్పుడు కేసులు పెడుతున్నాడు. ఇక దానికి రాజ‌కీయ తాత్ప‌ర్యం చెప్పుకోవాలంటే, అధికారం చేజిక్కిన త‌ర్వాత నీ మాటే శాస‌నంగా మారిపోవాలి. అప్పుడే ఎవ‌రూ కిక్కురుమ‌న‌కుండా ఉంటారు. కాబట్టి నువ్వు కూడా నేర్చుకోవ‌ల‌సింది ఆ పాఠ‌మే. ఇప్పుడు మ‌రో ప‌ద్యం చ‌దువు"

శిష్యుడు మ‌రో పద్యం ఎంచుకుని చ‌దివాడు.

వేరు పురుగు చేరి వృక్షంబు జెర‌చును

చీడ‌పురుగు చేరి చెట్టు చెర‌చు

కుత్సితుండు చేరి గుణ‌వంతు చెర‌చురా

విశ్వ‌దాభిరామ వినుర వేమ‌

ప‌ద్యం విన‌గానే గురువుగారు మొదలుపెట్టారు.

"ఒరేయ్‌... ఒక విధంగా ఇది కూడా నీ ప్రాంతం గురించేరా. వేరు పురుగు, చీడ పురుగులు ఆశిస్తే ఎంత పెద్ద చెట్ల‌యినా నాశ‌నం అవ్వాల్సిందేరా. ఇప్పుడ‌దేగా జ‌రుగుతోంది? ఒక‌ప్పుడు అంద‌రికీ అన్నం పెట్టిన అన్న‌పూర్ణ‌లాంటి ప్ర‌దేశం ఇప్పుడు అప్పుల కుప్ప‌గా మారిపోయింది. ఏకంగా ఏడు ల‌క్ష‌ల కోట్ల రుణ భారం ప్ర‌జ‌ల మీద ప‌డింది. జీతాలు, పింఛ‌న్లు చెల్లించ‌డానికి కూడా కిందామీదా ప‌డుతోంది ప్ర‌భుత్వం. ప‌చ్చ‌ని చెట్టులాంటి రాజ్యం ఇలా పీల్చిపిప్పి చేసిన‌ట్టు ఎండిపోయింది. అస‌లు అర్థం ఇదే అయినా... నువ్వు నేర్చుకోవ‌ల‌సిన రాజకీయ అంత‌రార్థం మాత్రం వేరేరోయ్‌! నీకు ఎప్పుడైనా అధికారం చేజిక్కింద‌నుకో. అచ్చం ఆ చీడ‌పురుగులాగే చెట్టు మొత్తం సారాన్ని పీల్చుకోవాలని తెలుసుకో. రాష్ట్రం ఏమైతే నీకేం? జ‌నం ఏమైపోతే నీకేం? అనుకున్న‌ట్టు ముందుకు సాగిపోయే ఆ వేరుపురుగే నీకు ఆద‌ర్శం"

"భ‌లే బాగున్నాయ్ గురూగారూ! నీతి ప‌ద్యాలకు మీరు చెప్పే విప‌రీత వ్యాఖ్యానాలు. మ‌రైతే దీనికేం అర్థం చెబుతారో చెప్పండి..." అంటూ శిష్యుడు మ‌రో ప‌ద్యం చ‌దివాడు.

మేడి పండు చూడ మేలిమై ఉండును

పొట్ట‌విచ్చి చూడ పురుగులుండు...

గురువుగారు న‌వ్వి చెప్పారు, "మీ అధినేత హామీలు కూడా ఇలాగే మేడి పండులాంటివేరా. తీరా చేసి అమ‌లు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి అనేక లోపాలు. ఇక రాజ‌కీయ తాత్ప‌ర్యం ఏంటంటే... నువ్వు కూడా అలాంటి మేడిపండులాంటి వాగ్దానాలు చేయడం నేర్చుకోవాలి. తెలిసిందా?"

శిష్యుడు మ‌రో ప‌ద్యం చ‌దివాడు...

ఎప్పుడు ద‌ప్పులు వెద‌కెడు

న‌ప్పురుషుని గొల్వ‌గూడ‌ద‌ది యెట్ల‌న్న‌న్‌

స‌ర్పంబు ప‌డ‌గ‌నీడ‌ను

గ‌ప్ప వ‌సించిన విధంబు గ‌ద‌రా సుమ‌తీ!

గురువుగారు నిట్టూర్చారు.

"ఈ ప‌ద్యం వింటే పాపం నీ దేశంలో ప్ర‌జ‌ల దుస్థితి గుర్తొస్తోందిరా. ప్ర‌శ్నిస్తే త‌ప్పు... అడిగితే త‌ప్పు... ఎదిరిస్తే త‌ప్పు... అన్యాయం జ‌రిగితే చెప్పుకోడానికి కూడా భ‌య‌ప‌డుతున్నార్రా. ఇదెలా ఉందంటే పాము ప‌డ‌గ నీడ‌లో క‌ప్ప ఉన్న‌ట్టుగానే ఉంది. అధికార పార్టీ నేత‌ల అహంకారం వ‌ల్ల సామాన్యులు నానా పాట్లూ ప‌డుతున్నారు. నేత‌లను ప్ర‌శ్నించిన నేరానికి త‌ప్పుడు కేసుల్లో చిక్కుకుని అల్లాడిపోతూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న వార్త‌లు వింటున్నావు క‌దా? అధికారం అందాక ఎలా బ‌రితెగించాలో, ఎలా చ‌ట్టాన్ని నీ గుప్పెట్లో పెట్టుకోవాలో, ఎలా భ‌య‌భ్రాంతులు సృష్టించాలో అనేది నువ్వు నేర్చుకోవ‌ల‌సిన పాఠ‌మ‌నుకో..."

"ఆహా... ఎంత గొప్ప నీచ రాజ‌కీయ పాఠాలు చెప్పారు గురూగారూ! ఇవ‌న్నీ వంట ప‌ట్టించుకుని మా అధినేత అడుగుజాడ‌ల్లో దూసుకుపోతాను చూస్తుండండి..." అంటూ శిష్యుడు సంబ‌ర‌ప‌డ్డాడు.

అప్పుడు గురువుగారు నిదానంగా చెప్పారు.

"ఒరేయ్‌... నీచ రాజ‌కీయ సూత్రాలు స‌రే. కానీ నువ్వు గుర్తుంచుకోవ‌ల‌సిన అస‌లైన ప‌ద్యం ఒక‌టుందిరోయ్‌. అది కూడా నేర్చుకున్న‌ప్పుడే నీ పాఠం సంపూర్ణ‌మ‌వుతుంది..."

"అదేంటండి గురూగారూ?"

బ‌ల‌వంతుడ నాకేమ‌ని

ప‌లువురితో నిగ్ర‌హించి ప‌లుకుట మేలా

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము

చ‌లిచీమ‌ల చేత జిక్కి చావ‌దె సుమ‌తీ!

"దీన‌ర్థం ఏమిటి, అంత‌రార్థం ఏమిటి గురూగారూ?"

"ఇందులో అంత‌రార్థం లేదురా. ఒక‌టే అర్ధం. నువ్వెంత నీచంగా ఎదిగినా, ఎంత నికృష్టంగా అధికారం చెలాయించినా, ఎన్ని వెధ‌వ్వేషాలు వేసినా, ఎన్ని దారుణాలు చేసినా, రాష్ట్రాన్ని దోచుకుని  ఎన్ని ఆస్తులు వెన‌కేసినా... అది కొంత కాల‌మే అని గుర్తుంచుకో. ప్ర‌జ‌లు చ‌లిచీమ‌ల లాంటి వాళ్లు. ఎంత పెద్ద విష స‌ర్ప‌మైనా చ‌లిచీమ‌ల‌న్నీ క‌లిసి దాడి చేస్తే చ‌చ్చిఊరుకున్న‌ట్టు... జ‌నంలో చైత‌న్యం పెరిగి నీ నీచ స్వ‌రూపాన్ని గ్ర‌హిస్తే త‌మ ఓటు హ‌క్కుతో నిన్ను త‌రిమి త‌రిమి కొడ‌తారు. ఇది రాజ‌కీయ పాఠం కాదురోయ్‌... అస‌లైన గుణ‌పాఠం!"

-సృజ‌న‌

PUBLISHED ON 31.5.2022 ON JANASENA WEBSITE

బుధవారం, మే 18, 2022

భ్ర‌ష్ట రాజ‌కీయ ప్ర‌హ‌స‌నం!

 


శిష్యుడు నీర్సంగా వ‌చ్చి కూర్చున్నాడు. మొహం క‌ళ త‌ప్పింది.

గురువుగారు గ‌మ‌నించి, "ఎప్పుడూ ఇస్త్రీ చేసి కొత్త నోటులా క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండేవాడివి, ఇవళేంట్రా మాసిపోయిన జేబురుమాలులా మొహం పెట్టుకున్నావ్‌. ఏమైందేంటి?" అన‌డిగారు.

శిష్యుడు నిట్టూర్చి, "ఇంట్లో చిన్న గొడ‌వండి..." అన్నాడు.

"చిన్న గొడ‌వ‌కే దిగాలు పడితే ఇంక నువ్వు రాజ‌కీయాల‌కు ఏం ప‌నికొస్తావురా... ఇంత‌కీ ఏమందేమిటి మీ ఆవిడ‌?"

"మా ఆవిడ ఏదో అంద‌ని మీకెట్లా తెలుసండీ?"

"ఒరే... రాజ‌కీయాల్లో ఎగస్పార్టీల‌నైనా నోరెత్త‌కుండా చేయొచ్చేమోగానీ, ఇంట్లో ఇల్లాలినేం చేయ‌లేం గ‌ద‌రా... అందుకే అనుభ‌వం మీద చెప్పా. అస‌లు నువ్వు ఆవిడ జోలికెందుకెళ్లావ్‌, అది చెప్పు ముందు..."

"అయ్‌బాబోయ్‌... నేనే ఆవిడ జోలికెల్లాన‌ని ఎలా క‌నిపెట్టారండీ?"

"ఓరెర్రోడా... అవినీతి లేందే ఆరోప‌ణ‌లు రావు, వెధ‌వ ప‌న్లు చేయందే విమ‌ర్శ‌లు రావు... నువ్వు నోరు జారందే మీ ఆవిడ దుల‌ప‌రించ‌దు... కాబ‌ట్టి సంగ‌తేంటో చెప్పు..."

"ఏంలేదు గురూగారూ! వంకాయ కూర మాడిపోయిందీ... స‌రిగ్గా చేయొచ్చ‌క‌దా అన్నానండంతే..."

"మ‌రి మీ ఆవిడేమంది?"

"నువ్వు తెచ్చిన వంకాయ‌లు గిజ‌ర‌వీ, ముదిరిపోయాయీ... అలాంటి వంకాయ‌లు తెస్తే  కూరిట్టాగే ఏడుస్తుందీ... ముందు నువ్వు వంకాయ‌లు ఏర‌డం నేర్చుకో... ఆన‌క న‌న్నందువుగానందండి..."

"సెభాష్‌... మా గొప్ప‌గా చెప్పిందిరా... ఒరే నువ్వు నా ద‌గ్గ‌ర ఇన్న‌ళ్లుగా రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నా, ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న‌ట్టున్నావురా... అదే మీ ఆవిడైతేనా  ఈ పాటికి న‌న్నే మించిపోయేది... అంతే కాదు ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్య‌మంత్రి కూడా అయిపోయుండేది..."

"ఊరుకోండి గురూగారూ! కూర త‌గ‌లెట్టింది కాక‌, అదేమ‌ని అడిగినందుకు అడ్డ‌దిడ్డంగా  వాదిస్తే మెచ్చుకుంటారు?  పైగా కాసింతైనా బాధప‌డ‌క‌పోగా, న‌న్నే త‌ప్పుప‌డుతుంటే వెన‌కేసుకొస్తారు? అయ్యో పాపం... కూర పాడైందా? ఈసారి బాగా చేస్తాలెండి అంటే నేనెంతో సంతోషించేవాడినండి. అలాంటి ప‌శ్చాత్తాపం లేదు స‌రిక‌దా...  రైతుకు పండించ‌డం చేత‌కాదు, ఎరువులు స‌రిగా చ‌ల్ల‌లేదు, పంట‌కి స‌రిగా నీరెట్ట‌లేదు, స‌రైన స‌మ‌యంలో కోయ‌లేదు... అని కూడా ఏదేదో వాగేసిందండి..."

"అబ్బో... వ్య‌వ‌హారం చాలా దూరం వెళ్లిందే? మ‌రి న‌వ్వేమ‌న్నావు?"

"నేనేమంటానండీ... అదేంటలాగంటావూ?  అంద‌రి మీదా విరుచుకుప‌డ‌తావు త‌ప్ప‌, నీ త‌ప్పు నువ్వు ఒప్పుకోవన్న‌మాట‌... ఇదేం బుకాయింపు అన‌డిగానండి..."

ఇక నువ్వేం చెప్ప‌క్క‌ర్లేదురా... మీ ఆవిడేమందో  ఊహించ‌గ‌ల‌ను. నీకు కుళ్లు, కుత్సితం అని ఉంటుంద‌వునా?  కావాల‌నే అభాండాలు వేస్తున్నావ‌ని కూడా అనే ఉంటుంది. పైగా నువ్వు, మీ అమ్మ‌గారు, నీ చెల్లెళ్లు క‌లిసి కుట్ర ప‌న్నుతున్నార‌ని కూడా అందా?"

"అయ్య‌బాబోయ్‌...గురూగారూ! అంతా చూసిన‌ట్టు ఎలా చెబుతున్నారండీ? మ‌మ్మ‌ల్నంద‌రినీ క‌లిపి ఓ మాట కూడా అందండి...  అదేంట‌బ్బా...ఏమిటో స‌మ‌యానికి గుర్తు రావ‌ట్లేదండి..."

"దుష్టచ‌తుష్ట‌యం అనేనా?"

"అరె... గురూగారూ! స‌రిగ్గా అదే మాటందండి బాబూ! మీకెలా తెలిసిపోయిందండీ?"

"దాందేముందిరా... ఇప్పుడు వ్య‌వ‌హారమంతా ఈ మాట‌మీదే న‌డుస్తోందిలేరా... ఇంత‌కీ మీ ఆవిడ టీవీలో ఎక్కువ‌గా ఏం చూస్తుంటుంది?"

"అదేంటోనండీ... ఆడాళ్లంతా సీరియ‌ల్స్ చూస్తే మా ఆవిడ మాత్రం న్యూస్ ఛానెల్స్ చూస్తుందండి... అందులోనూ పొలిటిక‌ల్ న్యూస్ అంటే ప‌డి చ‌చ్చిపోతుందండి... ఓసారి ఉండ‌బ‌ట్ట‌లేక ఆమాటే అడిగానండి... దానికావిడ అంటుంది కదా...  ఏడిశాయ్ ఎద‌వ సీరియ‌ల్సూ.. చ‌ప్ప‌గా ఏడుస్తున్నాయీ... అదే పొలిటిక‌ల్ న్యూస్ చూస్తే ఆ మ‌జాయే వేరు... ఎన్ని మ‌లుపులో? ఎన్ని ఎత్తులో? ఎన్ని పైఎత్తులో? ఎన్ని గొప్ప డైలాగులో... అందండి..."

"అదీ లెక్క‌. బ‌హుశా ఆవిడ చూసేవ‌న్నీ ఏపీ న్యూస్ ఛానెళ్లే అయి ఉంటాయి, అవునా?"

"క‌రెక్ట్‌గా చెప్పేశారండి బాబూ! మీకెలా తెలిసిందండీ?"

"మ‌రంతే క‌ద‌రా... ఆ వార్త‌లు చూసి చూసి... ఆ వార్త‌ల్లో త‌ర‌చు క‌నిపించే  ఆ అధినేత మాట‌ల‌న్నీ వినీ వినీ... అవ‌న్నీ మీ ఆవిడ మ‌న‌సుకి ప‌ట్టేశాయిరా... అందుక‌నే త‌న‌కు  తెలియ‌కుండానే ఆయ‌న్ని అనుక‌రిస్తోంది... ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఆయ‌న‌లాగే మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నిస్తోందన్న‌మాట‌... అర్థ‌మైందా?"

"ఏం అర్థ‌మ‌వ‌డ‌మో... అంతా అయోమ‌యంగా ఉందండి. ఇంత‌కీ ఆయ‌న కూడా అంతేనాండీ? ఇలాగే అడ్డ‌గోలుగా బుకాయిస్తాడాండీ? అడిగిన వాడిదే త‌ప్పంటాడాండీ? ఎదురెట్టి ఏకేస్తుంటాడాండీ?"

స‌రిగ్గా అదే బాప‌తురా. అబ్బో... ఆయ‌న గురించి చెప్పాలంటే అదో పెద్ద ఉద్గ్రంథం అవుతుందనుకో. ఆయ‌న నోట వ‌చ్చే ప్ర‌తి మాటా, నీచ రాజ‌కీయాల్లో రాణించాల‌నుకునే నీలాంటి వారికి ఓ సుభాషిత‌మ‌నుకో. మీ ఆవిడ ప్ర‌యోగించిన దుష్ట‌చ‌తుష్ట‌యం మాట ఆయ‌న త‌ర‌చు ఉప‌యోగించేదే మ‌రి... న‌న్న‌డిగితే నువ్వు కూడా మీ ఆవిడ‌తో క‌లిసి ఆయ‌న ప్ర‌సంగాలు విన్నావ‌నుకో... ఇక ప్ర‌త్యేకంగా నా ద‌గ్గ‌ర‌కి రాజకీయ పాఠాల‌కు రాన‌క్క‌ర‌లేదు..."

"ఇదెక్క‌డి రాజ‌కీయం గురూగారూ! ఎవ‌రైనా లోపాలు చెబితే వాటిని స‌రిదిద్దుకోవాలిగానీ ఇదేం దిక్కుమాలిన గ‌య్యాళి వ్య‌వ‌హార‌మండీ అస‌హ్యంగా..."

"అమ్మ‌మ్మ‌... అలా కొట్టిపారేయ‌కురోయ్‌! ఇదే ఇప్పుడు సాగుతున్న స‌రికొత్త రాజ‌కీయ రంగేళీ ప్ర‌హ‌సనం. ఈయ‌న ద‌గ్గ‌ర నేర్చ‌కోవ‌లసిన దివ్య‌మైన పాఠాలు అనేకం ఉన్నాయి. మొన్న‌టికి మొన్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో రోజుకో పేపరు లీకైందా? రాష్ట్ర‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విద్యార్థులు గ‌గ్గోలు పెట్టారా? వాళ్ల  త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లి పోయారా? విద్యార్థులు  ఏడాదంతా క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటుంటే ఆ శ్ర‌మ‌నంతా బూడిద‌లో పోసేసిన‌ట్టు ఆ ప్ర‌శ్న‌ప‌త్రాలు వాట్సాప్‌ల్లో ప్ర‌త్య‌క్ష‌మైతే అవి చూసి కాపీ కొట్టిన వాడు ర్యాంకులు తెచ్చుకుని కాల‌రెగ‌రేస్తే... మొత్తం విద్యా వ్య‌వ‌స్థ ఎంత‌గా నాశ‌న‌మైపోయిన‌ట్టు? ఆ కొశ్చ‌న్ పేప‌ర్లు అధికార పార్టీ ప్ర‌తినిధుల సెల్‌ఫోన్ల‌లోంచే షికారు చేశాయ‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలితే, అస‌లు లీకే అవ్వ‌లేద‌ని బాధ్య‌త క‌లిగిన మంత్రి అడ్డ‌గోలుగా బుకాయిస్తే ఏమ‌నుకోవాలి? విష‌య‌మంతా బ‌య‌ట‌కొచ్చి ప‌త్రిక‌ల్లో ప‌తాక శీర్షిక‌ల‌కెక్కితే అత్యున్న‌త పీఠం మీద కూర్చున్న నికార్స‌యిన అధినేత‌యితే ఏంచేయాలి?  ఇక‌పై ఇలాంటివి జ‌ర‌గ‌కుండా యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేయాలా అక్క‌ర్లేదా?  ముందుగా విద్యార్థుల‌కు, త‌ల్లిదండ్రుల‌కు న‌మ్మ‌కం, భ‌రోసా క‌ల్పించాలా లేదా? స‌రే... ఆ సంగ‌త‌లా ఉంచు. ఎక్క‌డప‌డితే అక్క‌డ ఆడ‌వాళ్ల మీద దౌర్జ‌న్యాలు జ‌రుగుతున్నాయి క‌దా? అస‌లు దేశంలో ఇంత‌లేసి దారుణాలు ఇక్క‌డే జ‌రుగుతున్నాయ‌ని రిపోర్టులు వ‌స్తున్నాయి క‌దా? మ‌రి బాధ్య‌త క‌లిగిన మ‌రో మంత్రి మాట‌లు విన్నావా? త‌ల్లుల పెంప‌కం స‌రిగా ఉంటే ఇలాంటివి జ‌ర‌గ‌వ‌న‌లేదూ? ఆ మంత్రి మ‌హిళ అయి కూడా ఇలా విచిత్రంగా మాట్లాడితే ఏమ‌నుకోవాలి? మంత్రులైన వారు ప్ర‌భుత్వం ప‌రువు తీసేలా ఇలా మాట్లాడుతుంటే అధికార పీఠం మీద బాసింప‌ట్టు వేసుకుని కూర్చున్న ఆ  అధినేత ఏం చేయాలి?  వాళ్లంద‌రినీ మంద‌లించి దారిలో పెట్టాల్సింది పోయి... ఆయ‌నే రెండాకులు ఎక్కువేసి ఈ ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు త‌నంటే గిట్ట‌ని వాళ్లు కుళ్లుతో ప్ర‌చారం చేస్తున్న అబ‌ద్దాల‌ని బూక‌రించ‌డం లేదూ? మ‌రి ఇంత‌టి తెంప‌రిత‌నం, ఇంత‌టి దురంహంకారం, ఇంత‌టి తెగింపు... వీటికి మించిన నీచ రాజ‌కీయ పాఠాలు నీకెక్క‌డ దొరుకుతాయి చెప్పు? అంచేత‌, ఆ అధినేత అడుగుజాడ‌లే నీలాంటి ఔత్సాహిక నికృష్ట రాజ‌కీయ ప్ర‌వేశాభిలాషుల‌కు అనుస‌ర‌ణీయ మార్గాలని తెలుసుకో.

పాల‌నలో అవ‌క‌త‌వ‌క‌లు, అస్త‌వ్య‌స్త విధానాలు, వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలుతున్న నిజాలు బ‌య‌ట ప‌డుతుంటే వాటిని స‌రిదిద్దుకోకుండా... ఇవ‌న్నీ దుష్ట‌చ‌తుష్ట‌యం ప‌న్నుతున్న కుట్ర‌లంటూ, ప్ర‌తి స‌మావేశంలోనూ మూతి ముందు మైకెట్టుకుని ప‌దే ప‌దే వ‌ల్లించ‌డముంది చూశావూ, దానికి మించిన అధికార విశృంఖ‌ల విచిత్ర వికృత‌వైఖ‌రికి ఉదాహ‌ర‌ణ ఏముంటుందో గ్ర‌హించావా? ఆ అధినేత అవ‌ల‌క్ష‌ణాల‌నే ఒంట ప‌ట్టించుకోవాలి నువ్వు. ఓ ప‌క్క రాష్ట్రాన్ని అప్పుల‌కుప్ప‌లా మారుస్తూ, జీతాల‌కు సైతం కొట్టుమిట్టులాడే ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టుకుని, ప‌న్నుల మీద ప‌న్నులు వేస్తూ, జ‌నం న‌డ్డివిరుస్తూ, కూటికి క‌ట‌క‌ట‌లాడే సామాన్యుడి నుంచి సైతం ఏదో మిష‌మీద డ‌బ్బులు గుంజుతూ, ఆకాశాన్నంటిన ధ‌ర‌వ‌ర‌ల‌తో జ‌నం అత‌లాకుత‌ల‌మైపోతూ ఉంటే... ఆ విష‌యాల‌ను ప్ర‌శ్నించే వాళ్ల‌నంద‌రికీ... త‌నంటే కుళ్ల‌ని, తాను ప్ర‌వేశ‌పెట్టిన  గొప్ప గొప్ప‌ప‌థ‌కాలు చూసి ఓర్వ‌లేక‌పోతున్నార‌నీ, జ‌నం గుండెల్లో తాను తిష్ఠ‌వేసుకుని కూర్చుంటే త‌ట్టుకోలేక కుత్సితాలు చేస్తున్నార‌నీ, కుతంత్రాలు ప‌న్నుతున్నార‌ని... ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న ఆ అధినేత న‌య‌వంచ‌క విధానాలున్నాయే, అవే నీకు స‌దా స్మ‌ర‌ణీయాలు, అనుస‌ర‌ణీయ సూత్రాలు. బుర్ర‌కెక్కిందా?"

"ఏం బుర్ర‌కెక్క‌డ‌మండీ బాబూ! ఆయ‌న అంద‌రినీ 'దుష్ట‌చ‌తుష్టయం' అంటున్నాడు కానీ, అస‌లాయ‌నే అష్ట‌క‌ష్ట దుష్ట దుర‌దృష్ట నికృష్ట క‌నిష్ట క‌నాక‌ష్ట భ్ర‌ష్ట నాయ‌కుడిలా ఉన్నాడుక‌దండీ...

బాగా చెప్పావురా... కాబ‌ట్టి మ‌న‌ల్ని పాలిస్తున్న ఇలాంటి నాయ‌క‌మ్మ‌న్యుల అడ్డ‌దిడ్డ‌, అవ‌క‌త‌వ‌క‌, అనాలోచిత‌, అహంకార పూరిత‌, అధ‌మాధ‌మ‌, అన్యాయ‌పు మాట‌ల ముందు మీ ఆవిడ మాట‌లు ఏపాటివిరా? అంచేత ఆవిడ మాట‌ల‌కు మ‌న‌సు పాడు చేసుకోకు...

నిజ‌మే గురూగారూ!  కానీ మా ఆవిడ వీళ్ల‌లా మ‌రింత బ‌రితెగించి వాక్కుండా ఉండాలంటే ఏంచేయాలండీ?"

"ఏం లేదురా... కేబుల్ వాడితో లోపాయికారిగా మాట్లాడి నీ టీవీలో ఆంధ్రా పొలిటిక‌ల్ న్యూస్ ఛానెల్స్ రాకుండా చూసుకో చాలు. అంతా సెట్ట‌యిపోద్ది. కానీ... కూర బాలేద‌ని మాత్రం ఎప్పుడూ మీ ఆవిడ‌తో అన‌కు స‌రేనా? ఇక పోయిరా!"

-సృజ‌న‌

PUBLISHED ON 12.05.2022 ON JANASENA WEBSITE