మంగళవారం, సెప్టెంబర్ 27, 2022

ఒక మంచి ప్రార్థన


 

దగుల్బాజీ ప్రదేశ్!

 


''నమస్కారం గురూగారూ... ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు...''

''ఏం లేదురా... నిన్నెలా ముఖ్యమంత్రిని చేద్దామా అని!''

''ఆహా.. గురూగారూ... మీకు నామీద ఎంత అభిమానమండీ...''

''అభిమానం సంగతలా ఉంచరా... నువ్వు అర్జంటుగా సీఎం అయితే నాదొక ఆశరా...''

''అదేంటో చెప్పండి సార్‌... తప్పకుండా చేసేస్తాను...''

''ఓసోస్‌... అప్పుడే కుర్చీ ఎక్కేసినట్టు ఊహించేసుకుంటున్నావేంట్రా?''

''అబ్బే... అదికాదండి... మీ దగ్గర రాజకీయాలు నేర్చుకుంటున్నాను కదండీ? ఆ పాఠాల వల్ల రాటు దేలిపోయి ఎప్పటికోప్పటికి సీఎం కాకపోతానా, అప్పుడు కుర్చీ మీద బాసింపట్టు వేసుకుని కూర్చోలేకపోతానా, ఆ రోజంటూ వస్తే మీ ఆశ తీర్చలేకపోతానా అని మనసులో ఏ మూలనో మిణుకుమిణుకుమంటూ ఓ చిన్న ఆశండి...''

''అంటే... నీ ఆశ తీరితే నా ఆశ తీరినట్టేనంటావ్‌?''

''కాదుటండీ మరి? అణాకానీకి కొరగాని నాలాంటి వాడిని అధినేతను చేసెయ్యాలని మీరంతగా ఆలోచిస్తుంటే... నేనంటూ ఆ లెవెల్‌కి ఎదిగితే గిదిగితే ఆ మాత్రం చెయ్యడం  నా బాధ్యత కాదుటండీ మరి... ఇంతకీ మీ ఆశేమిటో చెప్పండి గురూగారూ...''

''అబ్బే... ఏం లేదురా... నువ్వు ఈ పరగణాకి ముఖ్యనేతవైతే... ఇదిగో మన గురుకులం ఉన్న ఈ వీధికి నా పేరు పెడతావేమోననిరా. అప్పుడు రేప్పొద్దున్న నేనున్నా లేకపోయినా భావి తరాల వాళ్లు నన్ను గుర్తుంచుకుంటారనిరా...''

''ఓస్... ఇంతేనా గురూగారూ! ఇప్పుడే చెబుతున్నాను వినండి... నేనుగానీ సీఎంగానీ అయితే ఒక్క రోడ్డుకేంటండి గురూగారూ! ఊరూ వాడా మీ పేర్లతో మర్మోగిపోయేలా చేసేస్తానండి. రోడ్లతో పాటు పెద్ద పెద్ద భవనాలకి మీ పేరేనండి. సమావేశ మందిరాలకి మీ పేరేనండి. కూరగాయల మార్కెట్లకి మీ పేరేనండి. ఆఖరికి మున్సిపాల్టీలను కూడా వదలననుకోండి. పురపాలక సంఘాలకి, పార్కులకి, కళాశాలలకి, విశ్వవిద్యాలయాలకి, రైతు బజార్లకి, కాలనీలకి... ఆఖరికి సచివాలయాలకి కూడా మీ పేరు పెట్టేస్తానండి. ఆ విధంగా మీ రుణం తీర్చుకుంటానండి...''

''మరి శౌచాలయాలు, పబ్లిక్‌ పాయఖానాలు, మురుగు కాల్వలు, శ్మశానాలు... వీటిని వదిలేశావేంట్రా?''

''సారీసార్‌... మర్చిపోయానండి... కావాలంటే వాటికి కూడా పెట్టేస్తానండి... నన్నంతటి వాడిని చేసినందుకు మీ మీద గౌరవాన్ని అలా చూపించేస్తానన్నమాటండి...''

''ఏడిశావ్‌ ఎదవన్నర ఎదవా... ఆఖరికి నాపేరుని బజారుకీడ్చి, రోడ్డున పడేలా చేస్తావన్నమాట...''

''అయ్యబాబోయ్‌ అదేంటండీ అలాగనేశారు? ఇప్పుడే కదండీ... ఆశగా ఉందన్నారూ? మరింతలోనే తిడతారేంటండీ...''

''తిట్టాలా... తొడపాశం పెట్టాలా దరిద్రుడా... నా దగ్గర ఇన్నాళ్ల నుంచీ రాజకీయాలు నేర్చుకుని అఘోరిస్తున్నావు కదా... నీక్కుంచెమైనా బుర్ర ఎదిగిందో లేదోనని చిన్న టెస్టింగు చేశానంతే... అడ్డంగా ఫెయిలయ్యావ్‌. నీ బుర్ర ఇసక పర్రని తేలిపోయింది...''

''ఊరుకోండి గురూగారూ! మీరు నన్ను మరీ చిన్నపిల్లాడిని చేసి ఆడిస్తున్నారు. ఓ పక్క మీరే సమకాలీన పరిస్థితులను చూసి నేర్చుకోవాలంటారు... మరో పక్క అలా ఉండకూడదంటారు... మీతో పెద్ద చిక్కొచ్చిపడిందండి... మరి మన పరగణలో జరుగుతున్నదదే కదండీ... మనం వేసి గెలిపించిన ఓట్లతో కుర్చీ ఎక్కి అధికారం చెలాయిస్తూ ఎక్కడ చూసినా వాళ్ల నాన్న పేరే  వినిపించేటట్టు, కనిపించేటట్టు పాత పేర్లు మార్చేసి కొత్త పేర్లు తగిలిస్తున్న మన అధినేత ఏం చేస్తున్నాడో గమనించలేదా? ఇందాకా నేను అన్నట్టు ఒక్క శౌచాలయాలు, పబ్లిక్‌ టాయ్‌లెట్లు, చెత్త డంపింగ్‌ యార్డులు, మురుగు కాల్వలు, శ్మశానాల్లాంటివి తప్ప మిగతా అన్నింటికీ తన తండ్రి పేరు తగిలించలేదండీ? అలా పేర్లు మార్చినందుకు విమర్శలు, ఆరోపణలు, ఆందోళనలు, ప్రదర్శనలు ఎన్ని జరుగుతున్నా ఆయన చలిస్తున్నాడా చెప్పండి? మరి అధికారంలో ఉన్న అలాంటి అసమాన, అసాధారణ, అద్వితీయ నేతల నేర్చుకోకుండా  రాజకీయాల్లో రాణించడం ఎలా చెప్పండి?''

''ఓరెర్రోడా... కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కొందర్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. అది కూడా నీ లక్ష్యాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు నువ్వొక నీచ రాజకీయ నేతగా మారాలనుకుంటున్నావనుకో... అప్పుడు నీ అధినేత అడుగుజాడల్నే  వెనకా ముందూ చూడకుండా అనుసరించాలి. అలా కాక నువ్వొక ఆదర్శవంతమైన, నికార్సయిన, నిజాయితీ పరుడైన నేతగా ఎదగాలనుకుంటున్నావనుకో అప్పుడు ఆయన్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ముందు నీ లక్ష్యమేంటో నిర్ణయించుకో... తెలిసిందా?''

''తెలిసింది గురూగారూ! కానీ నాదో చిన్న సందేహమండి.  అనేకమంది విమర్శిస్తున్నా, చీదరించుకుంటున్నా, ఆందోళనలు చేస్తున్నా, జనమంతా బాహాటంగానే నవ్వుకుంటున్నా.... ఇవేమీ పట్టించుకోకుండా తన తండ్రి పేరు ఊరూవాడా తగిలించేసి ఆయనలా దూసుకుపోడానికి కారణం ఏమిటంటారు?''

''ఏముందిరా... ఇందాకా నువ్వు అన్నావే... నువ్వంటూ సీఎం అయితే నిన్నింతవాడిని చేసిన నా రుణం తీర్చుకుంటానని. అలాంటిదేరా మరి.  దారుణమైన రుణమొరేయ్‌. రాజకీయ పునాదులు వేసిన రుణం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఎలా రెచ్చిపోవచ్చో ఓనమాలు దిద్దించినట్టు నేర్పించిన రుణం. ఒక నాడు సొంత ఇల్లు కూడా లేని స్థితి నుంచి పొరుగు రాష్ట్రాల్లో సైతం కోటల్లాంటి విలాస భవనాలు నిర్మించుకునేలా చేసిన రుణం. తనకున్న చిన్న కంపెనీల షేర్లను రాత్రికి రాత్రి లక్షల రూపాయల్లోకి మార్చేలా చేసిన రుణం. కోరిన వారికి రాష్ట్రంలోని సెజ్‌లు, భూములు, గనులు, వనరులు సొంత జాగీరులా అప్పచెప్పేసి, అందుకు ప్రతిఫలంగా వారి నుంచి తన కంపెనీల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు ప్రవహించేలా చేసిన రుణం. ప్రజలను ఆశపెట్టి, మభ్యపెట్టి, భ్రమపెట్టి ఎలా పీఠం ఎక్కవచ్చో చూపించిన రుణం. అధికారం అందాక ప్రజాధనాన్ని, వనరుల్ని ఎలా పిండుకోవచ్చో బోధపడేలా చేసిన రుణం. మరిలాంటలాంటి రుణమేంట్రా అది? దానితో పోల్చుకుంటే మీ అధినేత చేస్తున్నది చాలా తక్కువేరా. రాష్ట్రంలో ఉన్న నదులు, కొండలు, చెట్లు, చేమలు, ఇసుక రేణువులకు సైతం ఆ తండ్రి పేరు పెట్టేసినా తీరదనుకో...''

''అబ్బో...మీరు చెబుతుంటే నిజమేననిపిస్తోందండి. కానీ గురూగారూ... నాదో సందేహమండి. ఉదాహరణకి నేనే సీఎం అయిపోయాననుకోండి. ఏదో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుంటే తప్పేంటండీ? దానికింత గొడవెందుకండీ?''

''బాగా అడిగావురా. నీ తల్లిదండ్రుల పేర్లు పెట్టడంకాదురా, రుణం తీర్చుకోవడమంటే. ఉదాహరణకి రోడ్లనే తీసుకో. కనీస మరమ్మతులైనా చేయించకుండా గోతులు, గొప్పులతో, వానొస్తే బురదమైపోయి జారిపడే స్థితిలో ఉంచుతూ వాటికి తండ్రి పేరు పెడితే ఏమవుతుంది? ఆ రోడ్డు మీద ప్రయాణించి ఒళ్లు హూనమయ్యే ప్రతి వాడూ నీ తండ్రి పేరు తల్చుకుని మరీ ఆ రోడ్డును బండబూతులు తిడతాడా? అప్పుడేమవుతుంది? కూరగాయలు, నిత్యావసరాల సరుకుల ధరలు అదుపులో ఉంచే ప్రయత్నం చేయకుండా... కేవలం మార్కెట్‌ యార్డులకి మీ నాన్న పేరు పెడితే ప్రయోజనం ఉంటుందా? పథకాల అమలు వల్ల నిజమైన పేదలు, అర్హులకు ప్రయోజనం జరుగుతోందో లేదో చూసుకోకుండా... కేవలం వాటికి నీ పేరో, నీ వాళ్ల పేరో తోకలా జోడిస్తే ప్రజలను మెప్పించగలవా? స్థానిక సంస్థలకు సరైన నిధులు అందించి, వాటి ద్వారా సామాన్యులకు మేలు జరిగేలా చూసుకోకుండా... కేవలం పేర్లు మార్చి జనాలను ఏమార్చగలవా? కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు మరింత బాగా  రాణించేలా చేయూతనివ్వకుండా వాటి పేర్లు మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? ఇవన్నీ సరిగా చేస్తే ప్రజలు నిన్ను, నీ తల్లిదండ్రులను తరతరాలకు మర్చిపోగలరా? ఆ ఇంగితం లేకుండా అధికారం ఉంది కదాని పేర్లు మార్చావనుకో... నువ్వు నీ తల్లిదండ్రుల పేర్ల విలువను పెంచుతున్నట్టా? దిగజారుస్తున్నట్టా?''

''నిజమేనండి... కానీ గురూగారూ! నేను రాగానే నన్ను సీఎం చేయాలని ఆలోచిస్తున్నట్టు మీరు చెప్పారు కదండీ... నేనింకా ఆ మత్తులోంచి దిగలేదండి. మీరెన్ని చెప్పినా... నేనుగానీ ముఖ్యమంత్రినైతే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవాలని మహా సరదాగా ఉందండి... ఆయ్‌...''

''వారి బడుద్దాయ్‌! నీ తండ్రి పేరేంటో చెప్పు?''

''దప్పళం గుర్నాథం అండి...'

''మరి తల్లి పేరు?''

''అంబాజీ అండి...''

''మరింకేంరా... ఈ ఇద్దరి పేర్లు కలిపేసి, కలగాపులగం చేసి, నువ్వుగానీ ముఖ్యమంత్రివైతే... వాటికీ వీటికీ ఎందుకురా... ఏకంగా రాష్ట్రానికే పేరు మర్చేయరా...''

''ఏమనండీ?''

''దగుల్బాజీ ప్రదేశ్‌ అని!''

-సృజన

PUBLISHED ON 27.9.2022 ON JANASENA WEBSITE

మంగళవారం, సెప్టెంబర్ 20, 2022

ఏడ‌వలేక‌...న‌వ్వాలిక‌!

 


అదేంటే... డ‌బ్బులు అయిపోయాయంటావేంటీ?  మొన్న‌నేగా జీతం తెచ్చిచ్చానూ?” అన్నాడు అప్పారావు అయోమ‌యంగా.

భార్య పంకజం క‌ళ్లెగ‌రేసి, “అయితే ఏంట‌ట‌? అయిపోయాయంతే. ఇంకా కిరాణా స‌రుకులు వేయించుకోవాలి. బియ్యం కొనాలి.  అద్దె ఇవ్వ‌నే లేదు. ప‌నిమ‌నిషి కూడా జీతం అడుగుతోంది. మీరేం చేస్తారో తెలియ‌దు. డ‌బ్బులు తెచ్చివ్వండి... అంది విసుగ్గా.

అప్పారావు బుర్ర‌గోక్కున్నాడు. ఆ త‌ర్వాత నెల‌వారీ ఖ‌ర్చులు రాసే పుస్త‌కం తీసుకొచ్చి చూశాడు.

ఏమేవ్ ఇలా రా ఓసారి... అంటూ కేకేశాడు. 

అట్ల‌కాడ చేత్తో పట్టుకుని ఆద‌రాబాద‌రా వ‌చ్చింది పంక‌జం.

అవ‌త‌ల కూర మాడిపోతుంటే ఏంటా గావుకేక‌లు?”  అంటూ రుస‌రుస‌లాడింది.

ఏంటా? ఇలా చూడు ప‌ద్దు. అద్దె ఇచ్చేశాం. కిరాణా స‌రుకులు కూడా వేయించేసుకున్నాం. మ‌రి ఇంకా ఇవ్వాలంటావేంటి?”

పంకజం ఓ సారి పుస్త‌కం తీసుకుని చూసి, “ఏంటో వెధ‌వ లెక్క‌లు. నాకు ఈ అంకెలు, ప‌ద్దులు అంటే మ‌హా బోరు. ఏదో మీకు లెక్క చెప్పాలి క‌దాని ఏదేదో రాసుంటాను. అయితే ఏంట‌ట‌?” అంది.

నీ త‌లకాయ్‌! ఖ‌ర్చులు త‌ప్పు రాస్తే ఎలా?  నీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఏదేదో చెప్పేసి, ఇంకా తే... ఇంకా తే అంటే ఎలా కుదురుతుంది?  ఖ‌ర్చులు అదుపు త‌ప్పుతాయి. బ‌డ్జెట్ త‌ల‌కిందుల‌వుతుంది. సంసారం గుల్ల‌వుతుంది...  పైగా అబ‌ద్దాలోటా?” అంటూ కేక‌లేశాడు అప్పారావు.

పంక‌జం ఊరుకోలేదు. పైగా గ‌య్యిమంది.

అస‌లేమిటి మీ ఉద్దేశం?  తెల్లారి లేస్తే వెయ్యి ప‌నులు నాకు. ఆ హ‌డావుడిలో ఏదో రాసేసి ఉంటాను. మ‌హా మ‌హా ముఖ్య‌మంత్రే అసెంబ్లీలో అబ‌ద్దాలు చెబుతుంటే మీరు న‌న్ను నిల‌దీస్తారేంటి?”

అప్పారావు తెల్లమొహం వేశాడు.

మ‌ధ్య‌లో ముఖ్య‌మంత్రి సంగ‌తేంటే? అసెంబ్లీ గొడ‌వ మ‌న‌కెందుకు?”

ఎందుకా?  పేప‌ర్లు చ‌ద‌వ‌లేదా?  టీవీలో చ‌ర్చ‌లు చూడ‌లేదా?  రాష్ట్రం ఆర్థిక ప‌రిస్థితి గురించి చెబుతూ ఆయ‌న‌గారు అంతా భేషుగ్గా ఉంద‌ని చెప్పార్ట‌. ఏకంగా అసెంబ్లీలో ఆయ‌న చెప్పిన లెక్క‌ల‌న్నీత‌ప్పులేనంటూ ఎక్క‌డ చూసినా అవే వార్త‌లు. ఆయ‌నే అలా చెప్ప‌గాలేంది?  మీరేంటి న‌న్ను నిల‌దీసేది?”

అప్పారావు ఇక మాట్లాడ‌లేక‌పోయాడు. అయినా త‌మాయించుకుని, “ఏడిసిన‌ట్టుంది... ఆయ‌న‌కీ నీకూ పోలికేంటి?” అన్నాడు.

ఎందుకు లేదు? ఆయ‌న రాష్ట్రానికెంతో, నేను ఈ ఇంటికంత‌. అర్థ‌మైందా?”

ఆ పాటికి అప్పారావు పూర్తిగా చ‌ల్లారిపోయాడు.

స‌ర్లె... స‌ర్లె... అయినా పంక‌జం... ఇవ‌న్నీ నీకెలా తెలుసు?  నువ్వీ మ‌ధ్య టీవీ సీరియ‌ల్స్ మానేసి న్యూస్ ఛానెళ్లు చూస్తున్నావా?” అంటూ ఆరా తీశాడు.

ఎందుకంటే పంకజానికి ఇంత‌కు ముందు ఇంత లోక‌జ్ఞానం లేనేలేదు. భోజనం పెడుతూ కూడా పాపం...ఇవాళ ఎపిసోడ్ లోనైనా ల‌క్ష్మిని వాళ్లాయ‌న అర్థం చేసుకుంటాడో లేదో? ఆ నాగ‌దేవ‌త ఈసారైనా త‌న భ‌క్తురాలిని కాపాడుతుందో లేదో? అంటూ వాపోతూ ఉండేది. టీవీ సీరియ‌ళ్ల‌లోని పాత్ర‌ల బాధ‌ల‌న్నీ త‌న‌వే అయిన‌ట్టు బాధ‌ప‌డుతూ ఉండేది.

ఏముందా టీవీ సీరియ‌ల్స్‌లో. వాటిక‌న్నా న్యూస్ ఛాన‌ల్సే బాగున్నాయి. వీటిలో ఉన్న థ్రిల్లు వాటిలో ఏదీ? ఇందులో ఉన్న డ్రామా అక్క‌డేదీ? ఎన్ని హావ‌భావాలూ... ఎన్ని అబ‌ద్దాలూ... ఎన్ని తిట్లు...ఎన్ని విమ‌ర్శ‌లూ... ఎన్ని మ‌లుపులూ... ఎంత స‌స్సెన్సూ... అంటూ పంక‌జం త‌న్మ‌యంలో మునిగిపోయింది.

అంతేకానీ... లెక్క‌లు త‌ప్పాయ‌ని మాత్రం ఒప్పుకోవ‌న్న‌మాట... అన్నాడు అప్పారావు ఇంకేమ‌నాలో తెలియ‌క‌.

ఎందుకొప్పుకోవాలిట‌? ఇంత పెద్ద సంసారం ఈడ్చుకురావ‌డంలో ఏవో అక్క‌డా ఇక్క‌డా పొర‌పాట్లు జ‌రుగుతాయి. అంత మాత్రం దానికే ఇలా నిల‌దీసేస్తే ఎలా?  రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల విష‌యంలోనే అంకెలు మారుతున్నాయి. రాత్రికి రాత్రి అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. మంత్రులే విలేక‌రుల స‌మావేశాల్లో ఓసారి ఓలా, మ‌రోసారి ఇంకోలా చెబుతున్నారు. మీరేదో పెద్ద మ‌న ఇంటి ప‌ద్దు చూసి న‌న్న‌డుగుతున్నారు... అంటూ అట్ల‌కాడ ఊపుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది పంకజం.

అప్పారావు త‌ల‌ప‌ట్టుకున్నాడు. నోరెత్త‌కుండా పంకజం పెట్టింది తిని ఆఫీసుకెళ్లిపోయాడు.

****

ఏం ఎక్కౌంటెంటువ‌య్యా నువ్వు? ఏంటీ ఈ ఫైల్ ప్రిపేర్ చేయ‌డం? అన్నీ త‌ప్పులే. గ‌బుక్కున సంత‌కం పెట్టేసి ఉంటే ఏమ‌య్యేది?” అంటూ అరిచాడు అప్పారావు.

ఏమైంది సార్?” అంటూ వచ్చాడు అకౌంటెంట్‌.

ఏమైందా?  చూడు. నువ్వు పుట‌ప్ చేసిన లెక్క‌ల‌న్నీ త‌ప్పులే. డెబిట్ తీసుకెళ్లి క్రెడిట్‌లో వేశావు.  క్రెడిట్‌లో వేయాల్సింది డెబిట్లో ఎంట‌ర్ చేశావ్‌.  దాంతో టోట‌ల్ మొత్తం త‌ప్ప‌యింది...} అంటూ అప్పారావు విరుచుకుప‌డ్డాడు.

అకౌంటెంట్ ఏమీ చ‌లించ‌లేదు. దాందేముంది సార్‌... ఏదో పొర‌పాటు జ‌రిగి ఉంటుంది. స‌రిచేస్తా లెండి అన్నాడు తాపీగా. అతడి నిదానం చూసి అప్పారావుకి మండిపోయింది.

త‌ప్పుల త‌డ‌క‌ల‌తో ఫైలు నా టేబుల్ మీద పెట్టిందే కాకుండా, దాందేముందంటావా?  నీకెంత ధైర్యం?  నువ్వు చేసిన ప‌నికి ఎంత న‌ష్టం వ‌చ్చేదో తెలుసా?” అంటూ హుంక‌రించాడు.

అకౌంటెంట్ బిత్త‌ర‌పోలేదు స‌రిక‌దా, “ఊరుకోండి సార్‌... మీరు మ‌రీనూ. సీఎంగారు రాష్ట్రం గురించి చెప్పిన లెక్క‌ల్లోనే ఎన్నో త‌ప్పులు ఉన్నాయి. అస‌లు బ‌డ్జెట్ పుస్త‌కంలోని లెక్క‌ల్నే ఆయ‌న ప‌రిగ‌నణించ‌లేదుట‌. కొన్ని లెక్క‌ల్ని దాచేశారుట కూడానూ. రాష్ట్రం అప్పుల కుప్ప‌లా ఉంటే అంతా బాగానే ఉంద‌ని చెప్పేశారాయ‌న‌. అలాంటిది ఈ చిన్న కంపెనీలో ఓ పొర‌పాటుకి అంత కంగారు ప‌డిపోతున్నారు మీరు. అంత అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం గురించే ఆయ‌న‌గారు భేషుగ్గా ఉంద‌ని తేల్చేస్తే... మీ కంపెనీ గురించి ఎందుకండీ అంత హైరానా? త‌ప్పులుంటే స‌రి చేసుకుందాం లెండి. ఇప్పుడేం కొంప‌లు మునిగిపోయాయ‌ని?” అంటూ ఫైలు పుచ్చుకుని నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వెళ్లి పోయాడు అకౌంటెంటు.

అప్పారావు జుట్టు పీక్కున్నాడు.

****

హ‌లో... అప్పారావు గారాండీ?”

అవును...

నేను మీ అబ్బాయి చ‌దివే స్కూళ్లో లెక్క‌ల టీచ‌ర్నండీ. మీ వాడికి క్వార్ట‌ర్లీలో నూటికి 9 మార్కులు వ‌చ్చాయి. అది చెబుదామ‌నే చేశాను...

అబ్బే... మీరు పొర‌బ‌డుతున్నారు. మా వాడికి నూటికి 90 మార్కులు వ‌చ్చాయండీ. నిన్న‌నేగా ప్రోగెస్ రిపోర్టు మీద సంత‌కం పెట్టాను?”

లేదండీ... మీరే పొర‌బ‌డుతున్నారు. మీరు సంత‌కం పెట్టిన ప్రోగ్రెస్ రిపోర్టు మీవాడు తెచ్చిస్తే అనుమానం వ‌చ్చి ఆన్స‌ర్ పేప‌ర్లు తెప్పించి వెరిఫై చేశాను. మీ వాడు 9 ప‌క్క‌న సున్నా వేశాడు. మీరు భేషుగ్గా చ‌దువుతున్నాడ‌నుకుని పొంగిపోయి సంతకం పెట్టేసుంటారు...

అప్పారావుకి కోపం న‌షాళానికెక్కింది.

ఇంటికి వ‌చ్చాక కొడుకుని పిలిచి నిల‌దీశాడు. వాడు బెదిరిపోలేదు స‌రికదా, “అవును డాడీ! నేనే అంకెలు మార్చాను. మిమ్మ‌ల్నెందుకు కంగారు పెట్ట‌డం అని. అస‌లు నాక‌న్నా త‌క్కువ మార్కులు వ‌చ్చిన వాళ్లు కూడా ఉన్నారు తెలుసా?  వాళ్ల క‌న్నా నేను చాలా న‌యం. అస‌లు లెక్క‌ల‌న్నా, అంకెల‌న్నా నాకు చాలా బోరు.  కానీ మీరు స్కూల్లో వేశారు కాబ‌ట్టి చ‌దువుతున్నానంతే. వ‌చ్చే ప‌రీక్ష‌ల‌కి బాగా చ‌దువుతాలే డాడీ...

అప్పారావు మొహం కంద‌గ‌డ్డ‌లా మారిపోయింది.

ఈలోగా పంక‌జం వ‌చ్చి స‌ర్లె...నువ్వెళ్లి ఆడుకోరా.  మీ నాన్న‌కి నేను అర్థ‌మ‌య్యేలా చెబుతాలే... అంటూ పంపేసింది.

ఏమిటే నువ్వు చెప్పేది?  వాడిన‌లా వెన‌కేసుకు వ‌స్తావేంటి?” అన్నాడు అప్పారావు కోపంగా.

ఊరుకోండి మీరు మ‌రీనూ... ఏదో పిచ్చి స‌న్నాసి. ఆ వెధ‌వ లెక్క‌ల‌తో వేగ‌లేక ఏదో రాసేసి ఉంటాడు. దానికే ఇంత ఆవేశ ప‌డతారేంటి? అవ‌త‌ల రాష్ట్రంలో ఆదాయ వ్య‌యాల లెక్క‌లు ఘోరంగా ఉన్నా మ‌న ముఖ్య‌మంత్రి ఏమైనా కంగారు ప‌డుతున్నారా?  నిదానంగా త‌ప్పుడు అంకెలు చూపించ‌డం లేదూ?”

అప్పారావుకి ఏం జ‌రుగుతోందో అర్థం కాలేదు. ఏమిటిదంతా? ఏమైంది వీళ్లంద‌రికీ? జ‌రిగిన త‌ప్పుల‌కి చింతించ‌డం మాని అంద‌రూ ఇంత నిబ్బ‌రంగా  ఎలా ఉండ‌గలుగుతున్నారు?

ఆలోచించ‌గా... ఆలోచించ‌గా... అప్పారావుకి అస‌లు విష‌యం అర్థ‌మైంది.

అంతే... ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌సాగాడు. ప‌క‌ప‌కా న‌వ్వాడు. పొట్ట ప‌ట్టుకుని కింద ప‌డి దొర్లుతూ మ‌రీ న‌వ్వ‌సాగాడు. పంకజం కంగారు ప‌డి ఏమైందండీ? ఎందుక‌లా ఉన్న‌ట్టుండి న‌వ్వుతున్నారు?” అంది.

అప్పారావు న‌వ్వుతూనే చెప్ప‌సాగాడు... ఎ...హేం...లె..హే..దే! హ‌...హ్హ‌... అర్థ‌మైంది. అంతా అర్థ‌మైంది. త‌ప్పులు ఒప్పుల‌ని తె... హె...లిసింది. త‌ప్పులు దొర్లినా త‌ప్పేది లేద‌ని బొ...హో...ద పడింది. ఒ...హో...టేసి గె...హెలిపించుకున్నాక‌.... భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని తె...హెలిసిలి... పొ... హోయింది. ఎ... హేడ‌వ‌డం క‌న్నా... న‌...హ‌వ్వుకోవ‌డం న‌య‌మ‌ని జ్ఞానోద‌య‌మైంది... హ‌... హ్హ‌...హా! అంటూ న‌వ్వ‌సాగాడు. పంక‌జం కూడా ప‌డీ ప‌డీ న‌వ్వ‌సాగింది.

-సృజ‌న‌

PUBLISHED ON 18.9.2022 ON JANASENA WEBSITE

శనివారం, సెప్టెంబర్ 17, 2022


 

భూతాల రారాజు

 


స‌ముద్ర‌తీరంలో సామాన్యుడు స‌ణుక్కుంటూ న‌డుస్తున్నాడు. మొహంలో నిర్వేదం. ఆ నిర్వేదంలోంచి కోపం త‌న్నుకొచ్చేస‌రికి కాలితో కసిగా ఇసుక‌ను త‌న్నాడు. ఆ ఇసుక‌లో క‌ప్ప‌బ‌డి ఉన్న బ‌రువైన వ‌స్తువేదో గాలిలోచి లేచి ముంద‌ర ప‌డింది.  అది ఎప్ప‌టిదో పాత కాలం నాటి దీపం. సామాన్యుడు ఆస‌క్తిగా దాన్ని తీసుకుని భుజం మీది పాత తువ్వాలుతో రుద్దుతూ తుడిచాడు. అంతే... ఆశ్చ‌ర్యం!

ఆ దీపం మూతిలోంచి ద‌ట్ట‌మైన పొగ పైకి లేచింది. సామాన్యుడు క‌ళ్లు పెద్ద‌వి చేసుకుని చూస్తుండ‌గానే ఆ పొగ ఓ పెద్ద భూతంగా మారిపోయింది.

హ‌...హ్హ‌...హ్హ‌...హ్హా... అంటూ ఒళ్లు విరుచుకుని న‌వ్వింది భూతం.

సామాన్యుడు దానికేసి ఓసారి విసుగ్గా చూసి ప‌క్క నుంచి వెళ్లిపోసాగాడు.

భూతం కంగుతింది. గిర్రుమ‌ని తిరిగి సామాన్యుడి ముందుకు వచ్చి, “వార్నీ! భ‌య‌మేయ‌లే? ఈమ‌ధ్య మ‌నుషుల్లో ధైర్యం బాగా పెరిగిపోయింద‌న్న‌మాట‌... అంది.

ఏడిశావ్‌. నువ్వేదో పాతకాలం నాటి పురాత‌న వెర్రిబాగుల భూతంలా ఉన్నావు. మా పాల‌కులు పెడుతున్న బాధ‌ల‌తో వేశారిపోతున్న మ‌మ్మ‌ల్ని నువ్వేం భ‌య‌పెట్ట‌గ‌ల‌వ్‌?” అన్నాడు సామాన్యుడు.

ఏం? వాళ్లు మాక‌న్నా పెద్ద దీపాన్ని రుద్దితే వ‌చ్చారా?”

దీపాలు లేవు, ఉంగ‌రాలూ లేవు కానీ న‌న్నొదిలేయ్‌. స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ ఏదో కాస్త చ‌ల్ల‌గాలికి ఇలా వ‌చ్చా... అంటూ సామాన్యుడు భూతాన్ని ప‌ట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు.

భూతం రెండోసారి కంగుతింది.

చ‌టుక్కున ముందుకు వ‌చ్చి, “చూడు బాబూ! చాలా కాలంగా దీపంలో నిద్ర‌పోతున్న న‌న్ను లేపావు. చిన్న‌ప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం క‌థ చ‌దువుకోలేదా? ఆ బాప‌తే నేను. నీకు తెలుసో తెలియ‌దో కానీ నేను ఏ ప‌న‌యినా ఇట్టే చేసేయ‌గ‌ల‌ను తెలుసా?” అంది భూతం.

మ‌ళ్లీ ఏడిశావ్‌. నీ కాలం నాటి మాయ‌లు వేరు. ఇప్ప‌టి మా పాల‌కులు చేసే మాయాజాలం వేరు. ఇవేమీ నీ వ‌ల్ల కావులే కానీ ద‌య‌చేయ్‌…

భూతానికి కోపం న‌షాళానికి అంటింది. కోర‌లు సాచి, “ఓరీ సామాన్య మాన‌వా? నీ అప‌హాస్యం మాన‌వా? నువ్వ‌న్న‌ది నిరూపించ‌క‌పోతే నిన్ను న‌మిలి మింగేస్తా... అంది.

హ‌...హ్హ‌... హ్హ‌... హ్హా! అంటూ సామాన్యుడు భూతం క‌న్న గ‌ట్టిగా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాడు. పొట్ట ప‌ట్టుకుని ఇసుక మీద దొర్లాడు. ఆ త‌ర్వాత తాపీగా ఇసుక తిన్నె మీద చ‌తికిలబ‌డి కూర్చుని, “ఓసి నా వెర్రిబాగుల భూత‌మా. ఎప్పుడో అరేబియ‌న్ క‌థ‌ల కాలం నుంచి దీపంలో ప‌డి ఉన్న‌ట్టున్నావు. నీకిప్ప‌టి సంగ‌తులేమీ తెలిసిన‌ట్టు లేదు. నీకు లోక‌జ్ఞానం క‌లిగించాలి కానీ, నీ కోర‌లు మూసుకుని నా ముందుకొచ్చి కూర్చో. చాలా చెప్పాలి... అన్నాడు.

భూతం మూడోసారి కూడా కంగుతింది. ఇక లాభం లేద‌నుకుని, సంగ‌తేంటో తేల్చుకోవాల‌ని సామాన్యుడి ముందు చేతులు క‌ట్టుకుని కూర్చుని ఇప్పుడు చెప్పు నాయ‌నా...నేను చేయ‌లేనివేంటో, నీ పాల‌కులు చేసేవేంటో అంది విన‌యంగా.

సామాన్యుడు గొంతు స‌వ‌రించుకున్నాడు. వ‌ర‌స‌పెట్టి ప్ర‌శ్న‌లు సంధించాడు.

ఇదిగో... ఈ ఇసుక లోంచి వేలాది కోట్ల రూపాయ‌లను అక్ర‌మంగా పిండి, అయిన వారి జేబులతో పాటు నీ సొంత ఆస్తుల‌ను కూడా పెంచుకోగ‌ల‌వా? నీ అనుచ‌రులు, స‌హ‌చ‌రుల చేత ఎక్క‌డిక‌క్క‌డ ఇసుక‌ను అక్ర‌మ ర‌వాణా చేయిస్తూ ఖ‌జానాకు చేరాల్సిన సొమ్ముకు గండి కొట్టించ‌గ‌ల‌వా?”

భూతం బుర్ర‌గోక్కుంది.

నీకు నిధులు స‌మ‌ర్పించుకున్న అస్మ‌దీయుల‌కు అప్ప‌నంగా సెజ్‌లు, కోట్లాది రూపాయ‌ల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను క‌ట్ట‌బెట్టి  అధికార పీఠాన్ని అప‌హాస్యం చేయ‌గ‌ల‌వా?”

భూతం కంగారు ప‌డింది.

రైత‌న్నల స్వేదంతో బంగారం పండే వేలాది ఎక‌రాల ప‌చ్చ‌ని పంట భూముల్ని అభివృద్ధి పేరు చెప్పి...ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని ఊరించి... పిల్ల‌ల‌కు ఉద్యోగాలు క‌లుగుతాయ‌ని న‌మ్మించి... మాయ మాట‌లు చెప్పి నామ మాత్ర‌మైన ప‌రిహారంతో వ‌శం చేసుకుని, చెప్పిన‌వ‌న్నీ చేయ‌క‌పోగా  ఆ భూముల్ని అయినవారి సంస్థ‌లకు ధారాద‌త్తం చేయ‌గ‌ల‌వా?”

అప్ప‌టికే భూతానికి చెమ‌ట‌లు ప‌ట్టాయి. సామాన్యుడి భుజం మీద పాత తువ్వాలు తీసుకుని మొహం తుడుచుకుంది. సామాన్యుడిలో ఆవేశం పెల్లుబికింది.

పోనీ... సాధ్యంకాని అనేక హామీల్ని ఎడాపెడా గుప్పించి ల‌క్ష‌లాది సామాన్యుల‌ను భ్ర‌మ‌ల్లో ముంచి వాళ్ల సాయంతోనే అధికార పీఠం అధిరోహించి, ఆపై ఆ హామీల‌కే మంగళం పాడుతూ కూడా... సిగ్గులేకుండా, బెరుకు లేకుండా, నీ పాల‌నా విధాన‌మే అత్యుత్త‌మంటూ బోర విరుచుకుని దొంగ ప్రచారం చేసుకోగ‌ల‌వా?”

ఇంకా... ర‌క‌ర‌కాల ప‌న్నులు విధించి ప్ర‌జ‌ల జేబులకు చిల్లు పెట్ట‌గ‌ల‌వా?”

త‌రాల క్రితం పేద‌ల‌కు ఇచ్చిన ప్ర‌భుత్వ భూముల్ని ఇప్పుడు మ‌ళ్లీ రిజిస్ట‌ర్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేస్తూ... చెమ‌టోడ్చి అర‌కొర సంపాద‌న‌తో బ‌తుకులీడ్చే బ‌డుగు జీవుల నుంచి సైతం వంద‌ల కోట్ల రూపాయ‌లు అన్యాయంగా పిండుకోగ‌ల‌వా?”

సామాన్యుల‌ను వ్య‌స‌నాల పాలు చేసి... నాసిరకం మ‌ద్యం, నాటు సారాల‌ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఏరుల్లాగా పారేలా చేయ‌గ‌ల‌వా? ఆ సారా, మ‌ద్యం వ్యాపారాల‌ను కూడా నీ అనుచ‌రుల‌కే అప్ప‌గించ‌గ‌లవా?”

నీ అనుచ‌రులు భూత‌గ‌ణాల్లా రెచ్చిపోతూ చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అకృత్యాలు సాగిస్తుంటే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను నీ గుప్పిట్లో పెట్టుకుని ఎవ‌రి మీద ఎలాటి కేసులూ లేకుండా చేయ‌గ‌ల‌వా?”

రైత‌న్న‌లు గిట్టుబాటు ధ‌ర‌లు లేక ఆత్మహ‌త్య‌లు చేసుకుంటుంటే అదేమీ ప‌ట్టించుకోకుండా... నీకు నువ్వు రైతు బాంధ‌వుడినంటూ ప్ర‌చారం చేసుకుంటూ స‌భ‌ల్లో మాట్లాడ‌గ‌ల‌వా?”

ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అప్పులు చేసి, భవిష్య‌త్తు ఆదాయాన్ని కూడా తాక‌ట్టు పెట్టి వేలాది కోట్ల రుణాలు పుట్టించి, ఆ ఆదాయ‌మంతా ఏమ‌వుతోందో తెలియ‌నంత‌గా రాజ్యాన్ని భ్ర‌ష్టుప‌ట్టించ‌గ‌ల‌వా?”

స‌మ‌స్య‌లు తీర్చ‌మ‌ని అడిగిన‌వారిపై క‌క్ష క‌ట్ట‌గ‌ల‌వా? త‌ప్పుడు కేసులు బ‌నాయించ‌గ‌ల‌వా? ప్ర‌జ‌ల‌ను కులం పేరుతో మ‌తం పేరుతో విడ‌దీసే కుయ‌త్నాలు చేయ‌గ‌ల‌వా? పాల‌నా వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ గుప్పెట్టో పెట్టుకుని ఆడించ‌గ‌ల‌వా? అక్ర‌మ విధానాల‌తో విలువైన గ‌నుల‌ను కొల్ల‌గొట్ట‌గ‌ల‌వా?”….

ఇలా సామాన్యుడు గుప్పించిన ప్ర‌శ్న‌లు వినేస‌రికి భూతం కడుపులో వికారం బ‌య‌ల్దేరింది. క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. త‌ల వాచిపోయింది. దాంతో అది ఇసుక మీద ప‌డుకుని దొర్లుతూ మూల‌గ‌సాగింది.

సామాన్యుడికి భూతం ప‌రిస్థితి చూస్తే జాలేసి, “పోనీ ఇవ‌న్నీ కాదులే కానీ, ఆఖ‌రుగా ఓ చిన్న ప‌ని చెబుతా. అదైనా చేయ‌గ‌ల‌వా?” అన్నాడు.

భూతానికి హుషారొచ్చింది. ఇదైనా చేసి అవ‌మాన భారం నుంచి త‌ప్పించుకోవాల‌నుకుని ఆశ పుట్టి, “అయితే చెప్పు. ప్ర‌య‌త్నిస్తా... అంది.

ఇన్ని అవ‌క‌త‌వ‌క‌లు, అక్ర‌మాలు, అన్యాయాలు, అకృత్యాలు, అడ్డ‌గోలు ప‌నులు చేస్తూ కూడా... ఏమాత్రం జంకూగొంకూ లేకుండా మెత్త‌గా న‌వ్వుతూ, పెడ‌స‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ, నీ పుట్టుకే ప్ర‌జ‌ల కోస‌మ‌న్న‌ట్టు, నువ్వొక అవ‌తార పురుషుడివ‌న్నంత స్థాయిలో పోజు కొడుతూ, నువ్వు త‌ప్ప ఇక జ‌నానికి దిక్కే లేన‌ట్టు ద‌ర్జాగా, ధీమాగా, దిలాసాగా, కులాసాగా మైకుల ముందు, టీవీ కెమేరాల ముందు ప‌ళ్లికిలించ‌గ‌ల‌వా?”

భూతం తెల్ల‌మొహం వేసి సామాన్యుడి కాళ్ల ముందు కూల‌బ‌డింది. వ‌ణుకుతున్న చేతులెత్తి న‌మ‌స్క‌రించి, “ఓరి నాయ‌నా! నా గ‌ర్వ‌మంతా తుస్సుమంది. నీ అధినేత ఇంద్రజాల‌, మ‌హేంద్రజాల‌, గ‌జ‌క‌ర్ణ, గోక‌ర్ణ, ట‌క్కుట‌మార, మాయా మ‌శ్చీంద్ర‌, మ‌హా విన్యాసాల ముందు నేనెంత‌? నా మాయెంత‌? నీ నేత‌ మా భూతాల‌కే రారాజు. భూత భ‌విష్య‌త్ వ‌ర్త‌మాన కాలాల్లో ఎక్క‌డా క‌నిపించ‌ని భూతేశ్వ‌రుడు. భూత సామ్రాట్‌. భూత చ‌క్ర‌వ‌ర్తి. అత‌డి మాయాజాలం చూశాక నేనింక ఈ లోకంలో ఉండ‌లేను... అంటూ భూతం మ‌ళ్లీ పొగ‌గా మారి పురాత‌న దీపంలోకి దూరిపోయింది. సామాన్యుడు ఆ దీపాన్ని తీసుకుని గిర‌గిరా తిప్పి స‌ముద్రంలోకి విసిరేశాడు.

-సృజ‌న‌

PUBLISHED ON 15.9.2022 ON JANASENA WEBSITE