బుధవారం, డిసెంబర్ 28, 2022

దేవుడా? దెయ్యమా?


 

''ఏరా... పది రోజులుగా అయిపూ అజా లేవు. ఎక్కడికి పోయావ్‌?''

''అదేంటి గురూగారూ! మీరే కదా అసైన్‌మెంట్‌ఇచ్చారు? ఆ పని మీదే తిరిగానండి...''

''ఒరే... నా దగ్గర రాజకీయాలు నేర్చుకుంటున్న శతకోటి శిష్యుల్లో నువ్వో బోడి శిష్యుడివి. కాబట్టి నీకిచ్చిన అసైన్‌మెంటేంటో కూడా చెప్పి ఏడు. అప్పుడుగానీ గుర్తు రాదు నాకు...''

''అదేనండి. మన పరగణా పాలకుడు చేసే పనులేంటో, ఆయన మాటలేంటో, వాటిని బట్టి ఆయన మీద నా అభిప్రాయమేంటో క్షేత్ర పరిశీలన చేసి మరీ రాసుకుని రమ్మన్నారు కదండీ. తీసుకొచ్చానండి...''

''ఓ... అదా... మరయితే చెప్పు. ఆయన ఎలాంటి వాడని నీ అభిప్రాయం?''

''అబ్బబ్బ... ఏం చెప్పను గురూగారూ! ఆయన దేవుడండీ బాబూ దేవుడు. ఆయన మనసంతా పేదలేనండి. ఆయన బతుకంతా బడుగుల కోసమేనండి. ఇక ఆయన గుండెకాయ లబ్‌డబ్‌మని కాదండీ బాబూ... సామాన్యుల కోసం లబోదిబో అని కొట్టుకుంటుందండి. ఇహ ఆయన తపనంతా తాడిత పీడిత ప్రజల కోసమేనండి. ఎంత వినయం? ఏం ఒద్దిక? అసలా నవ్వుంది చూశారూ... అబ్బో... మహా ముసిముసిగా ఉంటుదండి...ఆయ్‌!''

''సరే... నీ దృష్టిలో ఆయన దేవుడంటున్నావు కదా? మరి నీకు అలా ఎందుకనిపించిందో చెప్పు చూద్దాం...''

''ఎందుకేంటండి బాబూ... నిన్నటికి నిన్న ఏమన్నాడండాయన? అవినీతి అనేది ఎక్కడా కనిపించకూడదన్నాడండి. మంత్రులందరూ అవినీతికి దూరంగా ఉండాలని వార్నింగ్‌ఇచ్చేశారండి. ఎంత మంచి పిలుపండి అది?''

''ఒరే ఆయన కొలువుదీర్చి మూడున్నరేళ్లు అయింది కదా? ఇప్పుడు అవినీతికి దూరంగా ఉండమన్నాడంటే... మరి ఇంత వరకు వాళ్లు  దగ్గరగా ఉన్నట్టేనని నీకు అనిపించలేదా?''

''ఊరుకోండి సార్‌... మీరన్నీ తిరకాసుగా చెబుతారు. మీరు చెప్పేది పాఠమో, పరాచికమో ఓ పట్టాన బోధపడదండి. నిజానిజాలేంటో సరిగ్గా చెబుదురూ...''

''చెప్పడానికేముందిరా కళ్ల ముందు కనిపిస్తుంటేనూ? ఓ మంత్రి మీద ఫోర్జరీ పత్రాల కేసుంది. ఈయనగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎగస్పార్టీ మంత్రి మీద తప్పుడు ఆరోపణలతో తప్పుడు పత్రాలు దాఖలు చేసిన ఘనుడు. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళితే, చిత్రాతిచిత్రంగా ఏం జరిగిందో తెలుసా? రాత్రికి రాత్రి ఓ దొంగ కోర్టులో ప్రవేశించి ఈయన ఫోర్జరీ పత్రాలు పట్టుకుపోయాడు. దీనిపై ఏకంగా హైకోర్టు స్పందించి కేసును సీబీఐకి అప్పగించింది. మరలాంటి ఫోర్జరీ ఫోర్ట్వంటీ అమాత్యులుంగారు హాయిగా అధికారంతో అష్టాచెమ్మా ఆడుకుంటున్నారని నువ్వు గమనించలేదా?''

''లేదు గురూగారూ! మీరు చెబుతుంటే సిగ్గేస్తందండి. ఛీ... ఇలాంటాయన ఇంకా పదవి పట్టుకుని వేలాడ్డం ఏంటండీ కంపరం కాపోతేనీ?''

''అంతేకాదురా... భూముల్ని రక్షించే మరో మంత్రివర్యులు కోట్ల రూపాయల విలువ చేసే భూమికి నిరభ్యంతర పత్రాలు ఇప్పించుకుని బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట రాయించుకుని భోంచేశారన్న సంగతి నీ క్షేత్ర పరిశీలనకు తగల్లేదేంట్రా? పేరులొనే ధర్మం ఉన్న ఆయనగారు అలా అధర్మంగా భూముల్ని ప్రసాదంగా అరచేతిలో వేసుకుని నాకేసిన సంగతి తెలీలేదంట్రా నీకు? ఆయన మీద విచారణ సైతం జరిగి తప్పు వెలికి వచ్చినా, బర్తరఫ్‌చేయకపోగా నివేదికను కూడా పైకి రాకుండా కాపాడుతున్న అధినేత మాటల్లో లొసుగుల లోతెంతో తెలుసుకోవద్దురా నువ్వు?''

''అవునండోయ్‌... మీరు చెబుతుంటే ఇట్టాంటోళ్లా మన ఏలికలని అసహ్యమేస్తోందండి...''

''కంత్రీ మంత్రుల కహానీలు ఇక్కడితో అయిపోలేదొరేయ్‌. పురపాలనలో రెపరెపలాడుతున్న మరో సచివుడు, ఆయన సతీమణి కలిసి ఆదిలో చేసిన ఉద్యోగంలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసు సంగతి మర్చిపోగలమంట్రా? పరిశోధన చేసిన సీబీఐ మీదనే ఎదురు కేసు పెట్టి కాలయాపన చేశాక, విషయం సుప్రీం కోర్టు దాకా డేకి కేసు సరైనదేనని తేలినా... మరి ఆ మంత్రివర్యులపై చర్యలు లేవు సరికదా, ఆయనకు మరింత మంచి శాఖ కట్టబెట్టిన నీ పాలకుడి నాలిక పెట్టే మెలికలెలాంటివో గ్రహించొద్దురా నువ్వు?''

''నాకంత తెలివేడిస్తే ఇంకేమండీ? ఇన్ని కథలున్నాయన్నమాట మన నెత్తిన కూర్చున్న నేతల గురించి?''

''కథలు కాదురా పురాణాలు. అవినీతి  ఇతిహాసాలు. ఇంకా చెప్పాలంటే పౌరులకు సరఫరాల సంగతి చూసుకునే మరో మంత్రిగారు కారెక్కి కోట్ల విలువైన భూములను చుట్టబెట్టి బుసలు కొట్టి కాటేసి కాజేశారని బయటకు పొక్కినా మరి, నువ్వంటున్న దేవుడిలాంటి నీ నాయకుడు కిమ్మనలేదేమని నీకు అనిపించకపోతే ఎలారా? ఇహ కార్మికుల బాగోగులు చేసే శాఖలో గుమ్మటంగా కూర్చున్న మరో అమాత్యుడి భార్య అక్రమ ఆదాయం పైనా, ఆమె ఆధ్వర్యంలో జరిగిన భూ కొనుగోళ్ల అవకతవకలపైనా నోటీసులు జారీ అయినా ఆ మంత్రివర్యులు నైతిక బాధ్యత మాటే మరిచి పదవిలో ఊరేగుతున్నారంటే దానర్థం ఏంటో తెలుసుకోవద్దురా నువ్వు?''

''ఛీ... నా మీద నాకే కంపరమెత్తుతోందండి. నేను నా ఎదవ పరిశీలనాను...''

''ఒరెర్రోడా... నిన్ను నువ్వు తిట్టుకుందువుగాని కానీ, కాస్తాగు. ఇప్పుడు జల వనరుల్లో జలకాలాడుతున్న మరో మంత్రిగారి లేకి బుద్ధులెలాంటివో చెబితే నీ తల తిరిగిపోతుంది. ఓ యువకుడు చనిపోయినందుకు ప్రభుత్వం నుంచి అందిన అయిదు లక్షల సాయంలో సగానికి సగం తనకివ్వాలని ఆ పేదోళ్లను దేబిరించిన బాబు ఆయన. ఆ బాధితులు ఏకంగా  మీడియాతోనే మొరపెట్టుకున్న విషయం  బాహాటంగానే బయటకి వచ్చినా ఏమాత్రం తొణక్కుండా అంబరమెక్కి సంబరపడుతున్న ఘనుడాయన. మంత్రులే కాదురోయ్‌మీ పరగణా పాలకుడి బాబాయి హత్య కేసులో తీవ్రమైన నేరారోపణలు ఉన్న మరో ఎంపీ సంగతి కూడా కాలరెగరేసుకుని దర్జాగా ఊరేగుతున్నాడన్న సంగతి నువ్వు గుర్తించలేదట్రా? ఇంకా మాట్టాడితే నిన్ను, నీ రాష్ట్రాన్ని ఏలుతున్న నేతల కతలు కంపరం పుట్టిస్తాయి. ఇసుక ర్యాంపుల్లో కులాసాగా కుర్చీ వేసుకుని కూర్చుని అనధికార లావాదేవీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకి చేరాల్సిన సొమ్ము దండుకునే వాళ్లు... ఏ సున్నపురాయికో అనుమతి తీసుకుని దాన్నడ్డం పెట్టుకుని గనుల్లో విలువైన ఖనిజాలు కొల్లగొడుతున్న కరోడాగాళ్లు... మద్యం సారా కాంట్రాక్టులు దక్కించుకుని నకిలీలు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఘరానాగాళ్లు... అమాయకులైన గిరిజనుల చేత నయానా భయానా గంజాయి పంటలు వేయించి ఆ సరుకుని లోపాయికారీగా సరిహద్దులు దాటించి కోట్లకు పడగలెత్తుతున్న కలేజాగాళ్లు... పేదలకిచ్చే బియ్యాన్ని అదిలించి విదిలించి సేకరించి ఓడలకెత్తించి విదేశాలకు రవాణా చేస్తూ కాసులు పోగేసుకుంటున్న కక్కుర్తిగాళ్లు... ఇలా నిన్నేలుతున్న ఏలికల అవినీతి అక్రమ అన్యాయ దౌర్జన్య దురంతాల గురించి చెప్పుకుంటూ పోతే ఏళ్లకేళ్లు పడుతుందొరేయ్‌. నేతలే కాదురా... ఆళ్ల అధినేత అయిన నీ పరగణా పరిపాలకుడి మీదనే ఏకంగా ఉన్న 38 కేసుల నిగ్గు తేల్చడానికి కోర్టులు కిందా మీదా పడుతున్నాయని తెలుసా నీకు?''

''వార్నాయనో బుర్రలో భూకంపం వచ్చినట్టుందండి మీరు చెబుతున్న నిజాలు వింటుంటే. మరి ఇలాంటి మంత్రుల్ని, నేతల్ని చుట్టూతా ఉంచుకుని మా పాలకుడు అవినీతికి దూరంగా ఉండాలంటూ సిగ్గూ ఎగ్గూలేని చిలుక పలుకులు పలుకుతున్నాడని ఇప్పటికి అర్థమైంది గురూగారూ...''

''మరి ఇందాకా ఏమన్నావ్‌?''

''మా పాలకుడు దేవుడన్నానండి...''

''మరి ఇప్పుడేమంటావ్‌?''

''ఛీ... ఛీ... ఆడు దేవుడేంటండీ దరిద్రం. ప్రజల్ని పట్టి పీడిస్తున్న దెయ్యమండి. పరగణాను పీల్చి పిప్పి చేస్తున్న రాక్షసగణ నాయకుడండి. జనాన్నినమ్మించి నట్టేట ముంచుతున్న ఈయన మనసంతా అక్రమాల సంతేనండి. ఆయన గుండె లబ్ డబ్‌మని కాకుండా డబ్ డబ్ డబ్బుమనే కొట్టుకుంటోందండి. ఆడి తపనంతా తాడిత పీడిత ప్రజల్ని మరింతగా పీడించడమేనండి. పైకి కనిపించే వినయం నిజానికి పరిణతి చెందిన అరాచకానికి అద్దమండి. ఇహ... ఆ నవ్వుంది చూశారూ... ముసిముసిగా కాదండి, తేనె పూసిన కత్తిలాగా కసికసిగా ఉంటుందండి. ఇలా నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానండి. ఆయ్‌!''

''సంతోషంరా. నీకొచ్చిన ఇంగితం నీ పరగణా ప్రజలకి కూడా వస్తే అదే చాలు. స్వర్ణయుగం వచ్చినట్టే. ఇక పోయిరా''

-సృజన

PUBLISHED ON 26.12.2022 JANASENA WEBSITE

ఆదివారం, డిసెంబర్ 11, 2022

అరాచక అస్త్ర నైపుణ్యం

 


''ఏంటయ్యా సెక్రట్రీ... అంత హడావుడిగా అటూ ఇటూ తిరిగేస్తున్నావ్‌? ఏంటి సంగతి?''

''అదే సార్‌... యుద్ధానికి సిద్ధం చేస్తున్నానండి...''

''యుద్ధమేంటయ్యా?''

''నిన్న బహిరంగ సభలో తమరు వక్కాణించారు కదండీ, పదహారు నెలల్లో యుద్ధం రాబోతోందని? మరి సెక్రట్రీగా నా బాధ్యతలు నాకుంటాయి కదండీ... అందుకే నా ఏర్పాట్లలో నేనున్నానండి...''

''వార్నీ... అదా? నువ్వు చురుకైనవాడివే కానీ, ఒఠ్ఠి అమాయకుడివయ్యా... బయట సభల్లో జనాన్ని సందడి చేయడానికి ఏదేదో చెబుతుంటాం. అవన్నీ నిజమనుకోకూడదు...''

''అయ్యా... తమరి మాటల్లో బయటికి కనిపించే అర్థాలేంటో, లోపలి నిగూఢార్థాలేంటో నాకేం తెలుస్తుందండి... నేను కూడా జనం లాగే మీరు చెప్పేదంతా నిజమని వెర్రిబాగులోడిలా నమ్మేశానండి... అందుకే నాకు తోచిన సన్నాహాలు చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఉన్నట్టుండి మీరు ఏం చేశావని అడిగితే సిద్ధంగా ఉండాలి కదండీ...''

''బాగుందయ్యా నీ ముందు చూపు... అసలింతకీ ఏమేం చేస్తున్నావో చెప్పు, దాన్ని బట్టి నీ తెలివేంటో, సంగతేంటో చూద్దాం...''

''ఏముందండీ... యుద్ధమంటే మరి కవచం, శిరస్త్రాణం, కత్తులు, డాళ్లు, కటార్లు, ఈటెలు, గుర్రాలు, విల్లంబులు, బాణాలు, అస్త్రాలు లాంటి సరంజామా అవసరం కదండీ... వాటినే సిద్ధం చేస్తున్నానండి...''

''ఓరోరి నా వెర్రి సెక్రట్రీ... ఇదేమన్నా చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్న రాజుల కథలో యుద్ధమనుకుంటున్నావేంటయ్యా... ఇలాంటివన్నీ వాడుకోడానికి? అసలింతకీ యుద్ధమంటే నీకేం అర్థమైందో అది చెప్పు ముందు?''

''అమ్మమ్మ... నన్నంత తేలిగ్గా అంచనా వేయకండి. తమరు సభలో వక్కాణించిన యుద్ధమంటే... రాబోయే ఎన్నికలని నాకూ తెలసండి.  కానీ తమరే నా ఏర్పాట్లేంటో పూర్తిగా వినకుండానే నన్ను చులకన చేస్తున్నారండి...''

''మరి ఎన్నికల యుద్ధానికి కవచాలు, కత్తులు, డాళ్లు, బాణాలు ఇవెందుకయ్యా?''

''సార్‌... సార్‌... తమరు కాస్త నిదానించాలి. నేను సిద్ధం చేస్తున్నవేంటో సరిగ్గా వింటే తమకే తెలుస్తుందండి...''

''సర్లె... సర్లె... నీ గొడవేంటో కాస్త అర్థమయ్యేలా చెప్పు...''

''ఏంలేదండి... తమరు ఎన్నికలను యుద్ధమన్నట్టే... నేను ఏర్పాట్లకు ఆ పేర్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు అవేంటో చెబుతానండి. రాజ్యంగాన్ని, చట్టాన్ని క్షుణ్ణంగా చదివి వాటిలో లొసుగులేంటో, లోపాలేంటో కనిపెట్టానండి.  వాటన్నింటినీ గ్రైండర్లో వేసి బాగా రుబ్బి దాంతో మీకొక కోటు కుట్టించానండి. అదే మీ కవచమన్నమాటండి. ఈ మూడున్నరేళ్ల పాలనలో తమరు జరిపించిన మనీల్యాండరింగు పనులు, క్విడ్‌ ప్రో కో వ్యవహారాలు వీటన్నింటి మీదా ఎవరైనా ప్రజా ప్రయోజన కేసులు వేసినా... నిఘా సంస్థలు నిద్రలేచి నోటీసులు ఇచ్చినా అవేమీ మిమ్మల్ని తాకకుండా కాపాడే కవచమదే కదండి మరి. ఆ కేసులు ముందుకు సాగకుండా చట్టంలో లొసుగుల ఆధారంగా పిటీషన్లు తగిలించి అడ్డుకునే ఇలాంటి కవచాలను మీతో పాటు, మీ మంత్రి వర్గ సహచరులకి, నేతలకి కూడా వారి వారి కొలతల ప్రకారం తయారు చేయిస్తున్నానండి...''

''ఆహా... సెక్రట్రీ... అదరగొట్టావయ్యా... ఏదో అమాయకుడివనుకున్నాను కానీ ఇంత జగత్‌ కిలాడీవనుకోలేదు... చాలా ఆసక్తిగా ఉంది. నీ మిగతా ఏర్పాట్ల గురించి కూడా చెప్పు...''

''ఐపీసీలోని సెక్షన్లంటినీ పరిశీలించి వాటిలో మనకి ఉపయోగపడేవేంటో ఓ పక్కన పెట్టానండి. వాటిలో ఎవరూ వాడనివి, ఎప్పుడో కాలదోషం పట్టినవి కూడా వెలికి తీసి పదును పెట్టించానండి. అవన్నీ కత్తుల్లా ఉపయోగపడతాయండి. మరి ఎవరైనా తమర్ని కానీ, తమ విధానాలను కానీ విమర్శించినా, వ్యతిరేకించినా ఎడా పెడా ఈ కత్తులు వాడేయొచ్చండి. వీటిలో రాజద్రోహం కత్తి, శాంతి భద్రతల కత్తి, నిరసన ప్రదర్శనల కత్తి, ఊరేగింపు కత్తి, ప్రతిపక్ష నేతల సభల కత్తి... ఇలా రకరకాలండి. వీటన్నింటినీ మీరు ఉసిగొల్పగానే ఉరుక్కుంటూ జనం మీద పడే పోలీసులకు సమకూరిస్తే... ఎవరెక్కడ ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక సమావేశాలు పెట్టినా ఈ కత్తులు దూసి, కేసులు పెట్టి, మక్కెలిరగదన్ని, బొక్కలో తోసి అణిచేయచ్చండి. అప్పుడిక తమరి శాంతి భద్రతలు కుక్కిన పేనుల్లా పడుంటాయండి...''

''సూపరయ్యా... మనసెరిగిన నీలాంటి సెక్రట్రీ ఒక్కడుంటే చాలయ్యా... అడ్డగోలు పాలనలో అడ్డు లేకుండా దూసుకుపోవచ్చు... ఇక మిగతా సన్నాహాలేంటో కూడా చెప్పు...''

''ఏముందండీ... మూడున్నరేళ్ల క్రితం తమరు అధికారం కోసం అంగలార్చిపోతూ, ఊరూవాడా పాదయాత్ర చేస్తూ నానా హామీలు ఇచ్చారు కదండీ? కానీ వాటిలో వేటినీ కూడా నెరవేర్చలేకపోయారు కదా? మరి రాబోయే యుద్ధానికి ఏ మొహం పెట్టుకుని వెళతారండీ? అందుకని... తమరు తరచు సభల్లోను, విలేకరుల సమావేశాల్లోనూ... ఇంత చేసేశాం, అంత చేసేశాం... అంటూ చెబుతూ ఉంటారే... అవిగో అలాంటి అడ్డగోలు అబద్ధాలన్నింటినీ పోగు చేసి, వాటికి మరిన్ని బుకాయింపు మసాలాలు, దబాయింపు దినుసులు కలిపి నూరించి ముద్ద చేసి దాంతో మీ మొహానికి అడ్డంగా ఓ శిరస్త్రాణం చేయించానండి. అది పెట్టుకుని మొహం చెల్లకపోయినా యుద్ధరంగంలోకి దూకేయొచ్చండి...''

''బ్రహ్మాండమయ్యా... ప్రజల ముందుకు ఎలా వెళ్లాలా అనే అనుమానం మనసులో పీకుతూ ఉండేది. ఆ బాధ లేకుండా చేశావు... ఇంకా చెప్పు...''

''ఇంతకాలం తమరు రకరకాల పథకాల పేర్లు చెబుతూ, వాటికి ఇన్నేసి వేల కోట్లు, అన్నేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టానంటూ పత్రికల్లో ఫుల్‌ పేజీ యాడ్లు అచ్చేయించారు కదండీ. మరి ఎన్నికల యుద్ధ సమయంలో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వస్తే అలాంటివి కుదరవు కదండీ. అందుకని ఆ అంకెలన్నీ తీసుకొచ్చి, వాటికి మరిన్ని అంకెలు, పెద్ద పెద్ద సంఖ్యలు కలిపి, బాణలిలో  బాగా వేయించి, ఎండబెట్టి పొడి చేసి, దాంతో డాళ్లు చేయిస్తున్నానండి. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు పచ్చి నిజాలనే కత్తులు దూసినా వాటి వల్ల గాయపడకుండా ఈ డాళ్లను అడ్డం పెట్టుకోవచ్చండి. ఇలాంటివి మీకు, మీ సైన్యానికి కూడా విడివిడిగా తయారు చేయిస్తున్నానండి...''

''తెలివైన వాడివేనయ్యా... తక్కినవి కూడా చెప్పు...''

''ఇప్పుడు అస్త్రాల గురించి చెబుతానండి. ప్రతి పక్షాలపై మీరు చేసే అన్యాయపు వ్యాఖ్యానాలను శాన పెట్టించానండి. అవన్నీ అడ్డగోలు విమర్శనాస్త్రాలండి. తమరి మంత్రి వర్యులు వాడే బూతులు, తిట్లు పదును పెట్టించానండి... అవన్నీ అసభ్యాస్త్రాలండి. ప్రతి మండలంలోను తమరి అనుచరులు, తమరి అండ చూసుకుని రెచ్చిపోయే గూండాలు రౌడీల కార్యక్రమాలను బాగా చెక్కించానండి. అవన్నీ విద్రోహాస్త్రాలండి. జనం మనసు దోచుకునే ప్రతిపక్ష నాయకులు సభలకు వచ్చేప్పుడు కరెంటు కట్‌ చేయించడం లాంటి పనుల్ని పోగు చేసి ఉంచానండి. ఇవన్నీ అంధకారాస్త్రాలు, ఆంక్షలాస్త్రాలు, నికృష్ట నిబంధనాస్త్రాలు గట్రానండి. ఇంకా పీపాల నిండా బురద సిద్ధం చేస్తున్నానండి. తమరు సభల్లో ఎగస్సార్టీల వాళ్లమీద బురదజల్లడానికండి. రాక్షసి బొగ్గుల బస్తాలు నిల్వ చేస్తున్నానండి. ఎన్నికల సమయంలో వాటిని రాజేసి మీరు ప్రతిపక్షాల మీద నిప్పులు చెరగొచ్చండి. డబ్బాల నిండా దుమ్ము పోగు చేశానండి. ఎన్నికల సభల్లో తమరు, తమ అనుచురులు అవతలివాళ్ల మీద దుమ్మెత్తి పోయొచ్చండి. ఇంకా ఆర్భాట అశ్వాలు, ప్రచార గుర్రాలు, అసంబద్ధ వాగ్దాన రథాలు, అసాధ్య హామీల గజాలు... ఇంకా ఇలా చాలా సిద్ధం చేస్తున్నానండి... యుద్ధానికి!''

''సెభాషయ్యా సెక్రట్రీ... నీ యుద్ధ సన్నాహాలు భేష్‌...''

''కానీ సార్‌... చిన్న సందేహం మాత్ర మనసులో పీకుతోందండి...''

''ఏంటయ్యా అది?''

''ఈ అస్త్రాలు, కవచాలు, కత్తులు ఎలాగూ ఏర్పాటు చేస్తామండి కానీ... తమరి పాలనని, ఏలుబడిని, హయాన్ని, అధికారాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రజలు తమరి నిజస్వరూపాన్ని గ్రహించేస్తే... ఏమవుతుందా అనండి...''

''చూడు సెక్రట్రీ... నీ ఏర్పాట్లు సరేకానీ... నువ్వు నా దగ్గరున్న అసలుసిసలైన అస్త్రశస్త్రాలను గమనించినట్టు లేదయ్యా. అవి అధికారంతో రాటుదేలినవి. పరిపాలనతో పదునుతేలినవి. ప్రతిపక్షాలెన్ని ఆయుధాలతో రానీయవయ్యా, మనకి మాత్రం దిగులు లేదనుకో. ప్రజలకి లేనిపోని ఆశలు పెట్టి, తాయిలాల పంచి ఏమార్చి నమ్మించే సమ్మోహనాస్త్రం నా సొంతమయ్యా. గూండాలని మోహరించి ప్రయోగించే బూత్‌క్యాప్చరింగ్ బ్రహ్మాస్త్రం నా దగ్గరుందయ్యా. అనుచరులతో వీరంగం ఆడించి ఎక్కుపెట్టే దొంగ ఓట్ల దారుణాస్త్రం నా అమ్ముల పొదిలో సిద్దమయ్యా.  అవసరమైతే ఎలక్ట్రానిక్‌ యంత్రాలను సైతం మాయ చేసే ట్యాంపరింగ్‌ పాశుపతాస్త్రం మనదేనయ్యా. ఇంకా చెప్పాలంటే... నామినేషన్లు వేసే వారిపై ప్రయోగించే భయానకాస్త్రం, పోలింగ్‌ కేంద్రాల వద్ద గందరగోళం సృష్టించే బీభత్సాస్త్రం, అధికారులను సైతం బెంబెలెత్తించే బెదిరింపాస్త్రం, పోలీసుల అండతో వేసే దమనాస్త్రం, సామాన్యులకు నోట్లు పంచిపెట్టి  ప్రలోభపెట్టే ఆర్థికాస్త్రం, మద్యం పారించి మత్తులో ముంచే వ్యసనాస్త్రం... అబ్బో... ఇలాంటివి చాలా మన ఆయుధ భాండాగారంలో ఉన్నాయయ్యా... కాబట్టి నువ్వూరికే అనుమానాలతో బుర్ర పాడు చేసుకోక... నీ ఏర్పాట్లలో నువ్వుండు... సరేనా?''

''మహాప్రభో! నన్ను, నా అమాయకత్వాన్ని మన్నించండి. మీ దగ్గరున్న అస్త్రాల ముందు నేనెంత? నా ఏర్పాట్లెంత? ఇంతకాలం తమ దగ్గర సెక్రట్రీగా పనిచేసినా... తమరి అసలుసిసలు నీచ నైజ, నిజ నికృష్ట స్వరూపాన్ని అవగతం చేసుకోలేకపోయాను. మూర్తీభవించిన  అరాకత్వానికి అవతార రూపం మీరు. అధికార విశృంఖలత్వానికి నిలువెత్తు నిదర్శనం మీరు.  మితిమీరిన అతి విశ్వాసానికి పరిమితి లేని ప్రతిరూపం మీరు. ప్రజలు నిద్రలో జోగినంతకాలం మీకు జయహో!''

-సృజన

PUBLISHED ON 8.12.2022 ON JENASENA WEBSITE

శుక్రవారం, నవంబర్ 25, 2022

రాజూ వెడలే... రభసకు!


 

''అనగనగా ఒక రాజుగార్రా...'' అన్నారు గురువుగారు, శిష్యుడు వచ్చి కూర్చోగానే.

''ఓహో... ఇవాళ కథతో మొదలు పెట్టారన్నమాట...'' అంటూ  ఉత్సాహంగా పుస్తకం తెరిచాడు శిష్యుడు.

''తెరవాల్సింది పుస్తకం కాదురా... మస్తకం. ముందు విను. ఆ తర్వాత రాసుకుందువుగాని...'' అన్నారు గురువుగారు.

''సరే సార్‌... చెప్పండి'' అంటూ పెన్ను జేబులో పెట్టుకుని పుస్తకం మూసేశాడు శిష్యుడు.

''ఏం?... ఆ రాజుగారికి ఓ విచిత్రమైన కోరిక కలిగింది. తన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నారు. ఆ పళంగా మంత్రితో సహా మారువేషం వేసుకుని దేశాటనకి బయల్దేరారు. సామాన్యుల్లా సత్రాల్లో బస చేశారు. బాటసారుల్లాగా నలుగురితో కలిసి నడిచారు. చెట్ల కింద, వంతెనల దగ్గర, కూడళ్లలోను ప్రజలతో కలిసిపోయి, వాళ్లంతా ఏం చెప్పుకుంటున్నారో విన్నారు. తాము పొరుగు రాజ్యం పౌరులమనీ, యాత్రలకి వచ్చామనీ మాట కలిపారు. మీ దేశంలో పాలనెలా ఉందని అడుగుతూ వాకబు చేశారు. 'రహదారులు బాలేవండీ... అబ్బే...' అన్నారు కొందరు. 'పన్నులు ఎక్కువండిక్కడ...' అంటూ నిట్టూర్చారు కొందరు. 'రైతుల సంగతి పట్టదండి బాబూ మా రాజుగారికి...' అంటూ ఏకరువు పెట్టారు ఇంకొందరు. 'రాజాధికారులతో చస్తన్నామంటే నమ్మండి... ప్రతి పనికీ లంచమే. చేయి తడపందే కాలు కదపరు..' అంటూ గుసగుసలాడారు చాలా మంది. 'ఇక అమాత్యుల సంగతి చెప్పక్కర్లేదండి... ఒక్కడికి తీరూతెన్నూ లేదండి...' అన్నారు చాలామంది. ఇలా రాజుగారు, మంత్రి గారు కలిసి తమ పరిపాలనలో జరుగుతున్న లోటుపాట్లేంటో తెలుసుకోగలిగారు. తర్వాత దేశాటన ముగించి రాజధాని చేరుకున్నారు...'' అంటూ ఆగారు గురువుగారు.

''అప్పుడేమైందండీ?'' అన్నాడు శిష్యుడు ఉత్సాహంగా.

''తాత పక్కలో పడుకుని కథ వింటున్న మనవడిలా అడిగితే ఎలారా? నా దగ్గర ఇన్నాళ్ల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నావు కదా? మరి ఆ రాజుగారు ఏం చేయాలో, ఏం చేసి ఉంటారో నువ్వు ఊహించు...'' అనడిగారు గురువుగారు పడక్కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంటూ.

''ఓహో... ఇది కూడా ఓ రకమైన పాఠమేనన్నమాట. ఇవాళ సరదాగా కథ చెప్పి పంపేస్తారనుకున్నాను. మధ్యలో ఇలా పరీక్ష పెడతారనుకోలేదండి...''

''ఏడిశావ్‌గానీ... ముందు సమాధానం చెప్పు...''

శిష్యుడు బుర్రగోక్కున్నాడు. కాసేపు ఆలోచించి చెప్పాడు.

''ఏముందండీ? మారు వేషంలో దేశాటన చేసిన రాజుగారికి తన పరిపాలన అస్సలు బాగా లేదని అర్థమైపోయి ఉంటుందండి.  వెంటనే ఆ లోపాలన్నీ సరిదిద్దుకుని ఉంటారండి. విన్న సమస్యలన్నీ పరిష్కరించేసి ఉంటారండి. లంచగొండి అధికారుల భరతం పట్టి ఉంటారండి. ప్రజల చేత  మామంచి మారాజు అనిపించుకుని ఉంటారండి. అంతేనాండీ?''

''అంతే...అంతే... ఇంకేముందీ? కథ కంచికి. నువ్వు ఇంటికి. ఇక పోయిరా... నువ్వు చందమామ కథలు చదువుకోడానికి తప్ప ఎందుకూ పనికిరావని తేలిపోయిందిరా బడుద్ధాయ్‌.  బయల్దేరు...'' అన్నారు గురువుగారు కోపంగా.

శిష్యుడు తెల్ల మొహం వేశాడు.

''అయ్యబాబోయ్‌ గురూగారూ... నేనేమన్నా తప్పు చెప్పానాండీ, అంత మాటనేశారు? పోనీ మీరే చెప్పండి. ఆ రాజుగారు ఏం చేశారు?''

గురువుగారు కథ కొనసాగించారు.

''వెంటనే ఆ రాజుగారు సైన్యాధ్యక్షుడిని పిలిపించారు. రక్షకభట ఉన్నతాధికారులను సమావేశ పరిచారు. ఆపై తన దేశాటనలో ఎక్కడెక్కడ, ఎవరెవరు తన పరిపాలనలో లోపాలు చెప్పారో, విమర్శించారో, సమస్యలు ఎత్తి చూపించారో వాళ్లందరి ఆచూకీ బయటపెట్టారు. దాంతో ఆ రక్షక భటులు, సైనికులు ఊళ్ల మీద పడ్డారు. వాళ్లందరినీ పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. తీసుకొచ్చి ఖైదు చేయించారు. కొరడాలతో కొట్టించారు. అదేమని అడిగిన వారి మక్కెలిరగదన్నించారు. సమస్యలు పరిష్కరించలేదు సరికదా, వాటి పేరెత్తిన వారిని కొరతవేయించారు. బాగుందా ?''

''చెత్తలా ఉందండి. ఇదేం కథండీ? అసలా రాజెవడండీ బాబూ? ఆడికసలు బుద్ధుందా అని? అయినా ఈ కథ నుంచి నేర్చుకోవలసిన నీతి ఏముందండీ?'' అన్నాడు శిష్యుడు ఆవేశంగా.

''కథలో నీతి వెతుక్కునే స్థితిలో ఉంటే, ఇక నువ్వు రాజకీయాలకి ఏం పనికొస్తావురా? నువ్వు వెతుక్కోవలసింది అవినీతిని. అసలా మాటకొస్తే ఇది కథని నీకెవడు చెప్పాడు?''

''కథ కాదాండీ? మరైతే వాస్తవమాండీ? అయితే ఎవడా పిచ్చిమారాజు గురూగారూ?'' 

''కాస్త కళ్లెట్టుకుని చుట్టూ ఓసారి చూడరా. ఆ రాజుగారి ప్రతినిధి నీ పరగణాలోనే లేడూ? మరిక్కడ జరుగుతున్నది కూడా ఇదే కాదూ? చుట్టూ చూస్తే అన్నీ సమస్యలేనా? పరిష్కరించే నాధుడున్నాడా? అసలు వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైపోలేదూ? అరాచకం రాజ్యమేలడం లేదూ? విసిగిపోయి ఎవడైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం లేదూ? జనం తరఫున మాట్లాడడానికి ఏ మనసున్న నాయకుడో బయల్దేరితే ఏం జరుగుతోంది? ఆ నాయకుడికి అడుగడుగునా ఆటంకాలు కల్పించే కఠోర వాస్తవం కనిపించడంలేదూ? లేనిపోని నిబంధనలు, ఆంక్షలు పెట్టడం లేదూ? అంతేనా... ఆ నాయకుడి సభ జరిగిన ఊళ్లపై కక్ష కట్టడం లేదూ? అప్పటికప్పుడు అభివృద్ధి పేరు చెప్పి ఇళ్లకు ఇళ్లు కూలగొట్టడం లేదూ? మరి ఈ రాజునేమంటావురా?''

''ఇంకేమంటానండీ... రాజాధముడు. రాజదరిద్రుడు. అస్తవ్యస్త అరాచక పరిపాలనా దురంధర దౌర్భాగ్యుడు. నాకు కోపం కట్టలు తెంచుకుంటోందండి... ఇంతకీ ఈ కథకాని కథ నాకెందుకు  చెప్పారో కాస్త చెప్పండి...''

''ఎందుకేంట్రా... రాజకీయ సూత్రాలు నేర్చుకోడానికే....'

''ఇవేం సూత్రాలు గురూగారూ? నాకేం అర్థం కావడం లేదు, మీరే చెప్పండి...''

''అధికారం చేతికందాక, దాన్ని చెలాయించడం కాదురా... దాన్ని సుస్థిరం చేసుకోడానికి, ఎలాంటి అస్థిర పరిస్థితులనైనా కల్పించడానికి వెనకాడకూడదని నేర్చుకోవాలి. ఎలాంటి అసంతృప్తి ఉన్నా నోరెత్తడానికి కూడా జనం భయపడే వాతావరణం సృష్టించాలి. ఎవరూ ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకోడానికి జంకేలా చేయడానికి ఎంతకైనా తెగించాలి... ఏమాత్రం వ్యతిరేకత తలెత్తినా దాన్ని చెప్పుతో నలిపేసేంతలా దౌర్జన్యకాండకు దిగగలిగే తెంపరితనం అలవర్చుకోవాలి. ఇవిగో... ఇవన్నీ చెప్పడానికే నీకివాళ పాఠం 'అనగనగా ఒక రాజుగారితో' మొదలెట్టానన్నమాట... అర్థమైందా?''

''అర్థమైంది గురూగారూ. కానీ మీరు చెప్పిన రాజుగారు మారువేషంలో దేశాటన చేశారండి. మరీ రాజుగారు అలా చేయడం లేదు కదండీ?''

''ఈయనకి మారువేషాలు ఎందుకురా, అన్నీ తారుమారు వేషాలే అయినప్పుడు? అసలు వేషంతోనే అరాచక దేశాటనలు చేయగలడు. మొన్నటికి మొన్న ఈయనగారు చేసిన పర్యటన సందర్భంగా ఎంత గందరగోళం జరిగిందో గమనించలేదా?''

''అవునండోయ్‌... గుర్తొచ్చింది. అసలీయన పర్యటనలంటేనే జనం గగ్గోలు పెడుతున్నారండి. ఈయన సభకు బయల్దేరితే అంతా రభసేనండి. ఆయనగారి దృష్టిలో పడడానికి అధికారులు మితిమీరి, మతిమాలి మరీ 'అతి' చేస్తున్నారండి. అసలే అసమ్మతితో ఉన్న జనం ఈయనగారొస్తున్నారంటే ఆవులిస్తూ...  'వస్తే ఏంటంట?' అనుకుంటారనుకున్నారో ఏంటో కానీ... ఇంటింటికీ తిరిగి మరీ ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారండి. ఆయన సభకు రాకపోతే ఏం జరుగుతుందో ఏందో అనుకునేంతగా జనాల్లో భయం పెంచుతున్నారండి. దారిలో ఆయనగారి వాహనాలకు అడ్డొచ్చినా రాకపోయినా పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను నరికేసి హంగామా చేస్తున్నారండి. నీడనిచ్చే పచ్చని చెట్లను కూడా  కొట్టేస్తున్నారండి. దారి పొడుగూతా ఏ గోడల్నీ వదలలేదండి. ఆటన్నింటి మీదా రంగులేసేసి, బొమ్మలు గట్రా వేసేసి, ఈయనగారి గొప్పలన్నీ రాసేస్తున్నారండి. అంతేకాదండి బాబూ... కాలేజీలు, విద్యాసంస్థలను కూడా మూయించేత్తన్నారండి. స్కూళ్ల పిల్లల్ని తీసుకొచ్చే వాహనాలన్నింటినీ స్వాధీనం చేసుకుని ఆటిలో జనాన్ని బలవంతగా తరలిస్తున్నారండి. మార్గమధ్యంలో ఉండే షాపులు, వ్యాపార సంస్థల షన్‌షేడ్లు గట్రా పీకి పారేస్తున్నారండి. రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్ల వాళ్లని కూడా తరిమి కొట్టేస్తున్నారండి. దాంతో పాపం వాళ్ల ఉపాధికి, వ్యాపారాలకి గండి పడి నష్టాల పాలవుతున్నారండి. అయ్యబాబోయ్‌ ఇదెక్కడి పర్యటనరా బాబూ అనుకునేంతగా అతలాకుతలం చేసేస్తున్నారండి బాబూ...''

''మరి చూశావురా... నేను చెప్పిన రాజుగారి దేశాటనకి, ఈయనగారి పర్యటనకి ఎంత పోలిక ఉందో? ఇంతకీ ఈ సమకాలీన, సమస్యాత్మక, సర్వసత్తాక, సర్వోత్కృష్ట, సర్వ నికృష్ట, సాహసోపేత, భయభ్రాంత సహిత, బీభత్స భయానక పర్యటనలు చేసే ఈ రాజులుంగారిని తల్చుకుంటే నీకేమనిపిస్తోందో చెప్పు మరి...''

''రాజూ... వెడలే... రభసకు... టడట్టడాయ్‌! ప్రజలూ... బెదిరే... గొడవకు... టడట్టడాయ్‌!... అనిపిస్తోందండి. ఆయ్‌!''

''సెభాష్‌ సరిగ్గా చెప్పావు. పోయిరా''

-సృజన

PUBLISHED ON 25.11.2022 on JANASENA WEBSITE

శుక్రవారం, నవంబర్ 11, 2022

'క్విడ్‌ ప్రో కో'... ఆట ఎట్టిదనిన...!


 

''న...న... నమస్కారం సార్‌...''

''ఏందయ్యా సెక్రట్రీ... ఇంత పొద్దుటేలే వచ్చావేంటి?''

''స...స.. సార్‌...  మీరేం కంగారు పడకండి... నిబ్బరంగా ఉండండి... ఇక్కడికి బయల్దేరే ముందే అంబులెన్స్‌కి కూడా ఫోన్‌ చేశానండి... కాసేపట్లో డాక్టర్‌ గారు కూడా వచ్చేస్తారండి...''

''అంబులెన్సేంటి? డాక్టరేంటయ్యా? ఇంతకీ నీ మొహం నిండా ఆ చెమట్లేంటి? ఆరోగ్యం బానే ఉందా?''

''అదేంటి సార్‌? మీరీపాటికి ఏ గుండె దడో వచ్చి కుప్పకూలిపోయుంటారని ఆదరా బాదరా నేను పరిగెత్తుకొస్తే మీరు నన్ను పరామర్శిస్తున్నారు?''

''నాకు గుండె దడ రావడమేంటయ్యా? నీ గొడవేంటసలు?''

''అది కాద్సార్‌... పేపర్లింకా చూడలేదాండీ?''

''చూశానే? పొద్దున్నే మొత్తం చదివేశాను... ఏం?''

''మరి హెడ్‌లైన్స్‌ చదివారాండీ?''

''హెడ్‌లైన్‌ న్యూస్‌ కాకపోతే, హెడ్‌ లెస్‌ న్యూసెన్స్‌ చదువుతానేంటయ్యా? ముందు సంగతేంటో చెప్పేడు, ఊరికే నస పెట్టక...''

''అదే సార్‌... ఆ ఈడీ గాళ్లు మన కూపీ మొత్తం లాగినట్టున్నారు కదండీ? అరెస్టులు కూడా మొదలెట్టారు. మన పార్టీ ఎంపీ అల్లుడి

 సోదరుడిని అరెస్టు చేసి రిమాండ్‌ కి కూడా పంపారని పేపర్లలో చదివి ఉన్నపళంగా ఆదరాబాదరా పరిగెట్టుకు వచ్చానండి. మన ఎంపీ అల్లుడుంగారి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది కదండీ?''

''ఓ... అదా... అయితే ఏంటయ్యా?''

''అయ్యబాబోయ్‌... అంత నిదానంగా ఎలా ఉన్నారండీ బాబూ? తీగ లాగితే మరి డొంకంతా కదిలినట్టే కదండీ? మన రాష్ట్రంలోనే కాదు, ఆఖరికి దేశం మొత్తం మీద కూడా మద్యం వ్యాపారాన్ని మనమూ, మన మనుషులూ ఎలా గుప్పెట్లో పెట్టేసుకున్నామో బయట పడిపోయింది కదండీ? ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయో లెక్కలు చెబుతోందండి ఈడీ. మరా లెక్కన మన పరువేంగాను? ప్రజల్లో మన ఇమేంజేంగాను? జనంగానీ తమరి అసలు స్వరూపం పసిగడితే మన అధికారం ఏంగాను? అసలే ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి కదండీ? అందుకే తెగ బెంగొచ్చేసిందండి బాబూ. ఇప్పటికింకా నా గుండె దడదడా కొట్టుకుంటూనే ఉందండి...''

''హ...హ్హ...హ...హ్హా! అదా సంగతి? వార్నీ... ఒట్టి కంగారు గొడ్డులాగున్నావయ్యా. మనమేంటి, మన యవ్వారమేంటి, మన జమానా ఇజ్జతేంటి, మనవాడే పవర్‌ గేమ్‌ పసేంటి... ఇయ్యన్నీ తెలిసి కూడా ఇలా అయినదానికీ, కానిదానికీ బెంబేలెత్తితే ఎలాగయ్యా?''

''సార్‌... మీరెన్నిచెప్పండి. మీకున్న ధిలాసా నాకుండదండి. మీ సెక్రటరీగా నేను చాలా దూరం ఆలోచించాలి కదండీ? ఎప్పటికప్పుడు మీకు నిజాలు చెప్పి, అవసరమైతే హెచ్చరించి మరీ పరిస్థితిని విడమర్చాల్సిన బాధ్యత నాదే కదండీ? అందుచేతనే ఇంత కంగారండి...''

''సర్లేవయ్యా... నువ్వు బాధ్యతలు గట్రా తెలిసిన నమ్మకస్తుడవని గుర్తించాన్లేవయ్యా... ఇంతకీ ఏంటంటావిప్పుడు?''

''ఏం లేద్సార్‌... దేశం మొత్తం మీద జరిగే మద్యం వ్యాపారాన్ని సగానికి సగం మనవే చేజిక్కించుకున్నామని ఈడీ వాసన పట్టేసిందండి. ఇదిక్కడితో ఆగేలా లేదండి. అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను మన లోపాయికారీ వ్యవహారాల గుట్టు మొత్తం బట్టబయలయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అరెస్టయినోడు, లోగడ తమరి మీదున్న కేసుల్లో కూడా నిందితుడే కదండి మరి? ఆ దిశగా మీరు కూడా ఆలోచించాలని చెప్పడానికే వచ్చానండి...''

''బాగుందయ్యా సెక్రట్రీ... నీ అంకిత భావం చూస్తుంటే తెగ ముచ్చటేస్తోందయ్యా... వీలుంటే నిన్ను కూడా ప్రభుత్వానికి నూట యాభయ్యారో  ఏంటో... ఆ లెక్క గుర్తులేదు కానీ... మరో సలహాదారుగా ఆర్డరిచ్చేసి, క్యాబినెట్‌ హోదా గట్రా కల్పించేయాలనుందయ్యా... ఏమంటావ్‌?''

''అయ్యా... ఆ సంగతి తర్వాత ఆలోచిద్దామండి. అదెలాగూ తమరి చేతిలో పనే కదండీ... మరింతకీ ఈ వ్యవహారంలో ఏం చేద్దామని సెలవు?''

''చూడు సెక్రట్రీ... నీకో సంగతి చెబుతాను బాగా గుర్తెట్టుకో. మనం చేసేవన్నీ యదవ పన్లయినప్పుడు, అడపాదడపా ఒకటో రెండో బయటపడకుంటా ఎట్టా ఉంటాయి చెప్పు? పడనీ... దాందేముంది? నువ్వన్నట్టు తీగ లాగితే డొంక కదులుతుందన్నది నిజమే కానీ, మనది వట్టి డొంక కాదయ్యా... అడుగడుగునా అల్లుకుపోయిన అవినీతి అడవి. అక్రమాల అరణ్యం. ఇట్టాంటి చిన్న చిన్న తీగలట్టుకుని లాగితే అవే పుటుక్కున తెగుతాయి కానీ... మనకి మాత్రం ఢోకా లేదయ్యా... అర్థమైందా?''

''ఆహా... ఎంత నిబ్బరం? ఎంత భరోసా? ఇన్నేసి అడ్డగోలు పనులు చేస్తూ కూడా అంత కులాసాగా ఎలా ఉంటారో అంతుపట్టడం లేదండి...''

''చాలా సింపులయ్యా... నీ సంగతేమో కానీ, నాకు మాత్రం మన చట్టం మీద, దాని పనితీరు మీద వల్లమాలిన అపనమ్మకమయ్యా... ఈ కేసులోపట్టాన తెమిలేవి కావు, ఏడ్చేవీ కావు. ఊరికే హడావుడి చేస్తారంతే...''

''సార్‌... అలా మరీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎలా ఉంటారండీ? ఈడీ కావచ్చు, సీబీఐ కావచ్చు, మరో యాంటీ కరెప్షన్‌ బ్యూరో కావచ్చు, మనీ ల్యాండరింగ్‌ మోనటరింగ్‌ బాడీ కావచ్చు... ఎవరైనా ఎక్కడైనా ఏ కొంచెం ఆధారాలు సేకరించగలిగినా... తమరి అక్రమ లావాదేవీలన్నీ నడిరోడ్డున పడతాయి కదండీ... అదే నా బెంగ...''

''ఓరెర్రి సెక్రట్రీ... నిన్ను చూస్తుంటే జాలేస్తోందయ్యా... పొద్దున్నే కాఫీ కూడా తాగావో లేదో, నా గురించే ఆదుర్దా పడుతూ, కంగారు పడుతూ, బెంబేలు పడుతూ, కలవర పడుతూ, పరిగెట్టుకుని పడుతూ లేస్తూ వచ్చావు కాబట్టి...  నాకు బాగా నమ్మకస్తుడివి కాబట్టి... అన్నింటినీ మించి నా సెక్రట్రీవి కాబట్టి... ఇక ముందు ఇలా చీటికీ మాటికీ ఉరుక్కుంటూ వచ్చి నన్ను ఊదరగొట్టకుండా ఉండడానికి నీకు మొదటి నుంచీ మొత్తం విడమరిచి చెబుతానయ్యా... అలా స్థిమితంగా కూర్చుని, చెవులు రిక్కించి వినుకో... సరేనా?''

''ఆనందంగా సార్‌! తమరంతట తమరు... తమరు రచించి, సాగించి, నడిపించి, సాధించి, తరించిన అవినీతి పురాణాన్ని చెబుతానంటే అంతకన్నా అదృష్టమేముంటుందండీ? అదంతా నా సుకృతమనుకుంటాను. నా జన్మ ధన్యమైందనుకుంటాను. చెప్పండి సార్‌...''

''ఏం లేదయ్యా... ఇదంతా ఒక ఆట... నిజం చెప్పాలంటే తొండాట. అవినీతి అడ్డాట. అక్రమాట దొడ్డాట. దీనికి ఈ పత్రికల వాళ్లు లేరూ? వాళ్లొక మంచి పేరు కూడా పెట్టారయ్యా. దాన్ని 'క్విడ్‌ ప్రో కో' అంటారు. అంటే తెలుగులో 'నీకిది... నాకిది' అంటారంట. అదీ ఆళ్లే చెప్పార్లే. ఇంతకీ ఇది ఆడాలంటే నీ దగ్గర అధికారం ఉండాలయ్యా. అంటే... పేకాట ఆడాలంటే ముందు డబ్బులుండాలి చూడు, అట్టాగన్నమాట. అధికారం కానీ చేతిలో ఉండి, నీ మనసులో నీతి, నిజాయితీ అనేవి మచ్చుకి కూడా లేవనుకో... ఈ ఆట భలే రక్తి కడుతుందయ్యా.  ఇప్పుడంటే మనకి అధికారం ఉంది కానీ... ఒకప్పుడు మనకి అది అందని ద్రాక్ష పండేలే. నాకో సొంత ఇల్లంటూ కూడా ఉండేది కాదు. ఏదో ఓ చిన్న కరెంటు కంపెనీతో కాలక్షేపం చేస్తుండేవాడిని. మా నాన్న కూడా పాపం... ఇంచుమించు అంతేలే. ఏదో అసెంబ్లీలోకి కాలు మోపే వీలు చిక్కింది కాబట్టి... అప్పట్లో ప్రతిపక్షంలో ఉంటూ చీటికీ మాటికీ గొంతు చించుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఆయనో ఉపాయం కనిపెట్టాడు. అధికారం కావాలంటే ఏం కావాలి? ప్రజల మద్దతు కావాలవునా? దాని కోసం ఆయన ఊరూ వాడా చెప్పులరిగేలా తిరిగాడనుకో. ఎన్ని చెప్పులు అరిగిపోయాయో తెలీదు కానీ... చెప్పిన మాట చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ చెప్పులేసుకుని తిరిగాడు. మొత్తం మీద జనం ఆయన చెప్పులు చూసో, ఆయన చెప్పినవి నమ్మో... ఓట్లు గుద్దేశారు. ఇంకేముందీ? ఆయన అధికార సింహాసనం మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు. దాంతో...మనం యువరాజులమైపోయాం. అప్పుడు మొదలెట్టానయ్యా... ఈ 'క్విడ్‌ ప్రో కో' ఆట. అర్థమవుతోందా?''

''మహా రంజుగా సార్‌... ఇంతకీ ఈ ఆట ఎలా ఆడార్సార్‌?''

''ఏముందయ్యా... అధికారం నాన్నది. ఆటంతా మనది. రాష్ట్రంలో ఉండే భూములు, గనులు, సెజ్‌లు పెద్ద పెద్ద కంపెనీలకి రాసిచ్చేట్టూ... అలా రాసివ్వాలంటే ఆళ్లు నా కంపెనీలోకి నిధులు బదలాయించేట్టూ... ఆట మొదలైందయ్యా...''

''అయ్యా... మాటకడ్డొచ్చాననుకోనంటే, ఓ చిన్న సందేహం...''

''అడగవయ్యా... పురాణం వినేప్పుడు చిన్నదైనా పెద్దదైనా అడిగే తీరాల... తెలుసుకోవాల..''

''అహ... ఏంలేద్సార్‌. ఎంత అధికారం చేతిలో ఉన్నా వందలాది, వేలాది ఎకరాలు రాసిచ్చేయడం ఎలా కుదురుతుందా అని...?''

''ఓ అదా నీ అనుమానం? పేకాట్లో జోకరు తెలుసుగా? అందులో ఒకటో, రెండో జోకర్లుంటే... ఈ అధికారం అడ్డాటలో ప్రజలే జోకర్లయ్యా... ఆళ్ల పేరు చెప్పి ఏదైనా చేసేయొచ్చు... పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు గట్రా కడతారని, విదేశాల్నుంచి బడా కంపెనీలొచ్చేసి ఆఫీసులెట్టేస్తారని... ఆ ఆఫీసుల్లో బిడ్డలకి ఎడా పెడా ఉద్యోగాలు వచ్చేస్తాయని చెబుతామన్నమాట. దాంతో ఎవరూ నోరెత్తరు... తెలిసిందా?''

''అయ్యా... మళ్లీ మరో ప్రశ్న... ఓ పక్క మీ కంపెనీల్లోకి కోట్లకు కోట్లు మళ్లించి, మళ్లీ ఆ భూముల్లో ఇన్నేసి అభివృద్ధి పనులు అవీ చేసేస్తే ఇక ఆ కంపెనీల వాళ్లకి ఏం మిగుల్తుందా అని... ఏం గిట్టుబాటవుతుందా అని...''

''వ... హా... ర్నీ... సెక్రట్రీ... నువ్వు నేననుకున్నదానికన్నా వెర్రిబాగులోడివయ్యా! ఆ పేరు చెప్పి భూములు కేటాయిస్తామంతే. ఆనక ఆళ్లు అయ్యన్నీ చేస్తారా, ఏమన్నానా? ఆర్భాటంగా ఓ బోర్డెట్టి, దానికి రంగు రంగుల కరెంటు దీపాలెట్టి, పెద్ద పెద్దాళ్లతో ప్రారంభోత్సవాలు చేయించి... ఊరుకుంటారంతే. అనంతపురం లేపాక్షి హబ్‌లో ఏం జరిగిందో గుర్తులేదా? అలాగన్నమాట. కొన్నాళ్లకి జనం మర్చిపోతారు. విషయం బాగా సద్దుమణిగాక ఆ భూముల్ని కైవసం చేసుకున్నోళ్లు అందులో రియల్‌ ఎస్టేటు వ్యాపారం చేసుకుని అంతకంత సంపాదించుకుంటారు. లేదా మరో కంపెనీల వాళ్లకి టోకున సబ్‌ కాంట్రాక్టులిచ్చేసినట్టు కాగితాలు గీకేసి, ఆళ్ల దగ్గర్నుంచి కోట్లు రాబట్టుకుంటారు...''

''ఆహా... అద్భుతం సార్‌! పైకి ప్రజా సేవ పేరు చెప్పి లోపల లోపాయికారీగా కోట్లకు కోట్లు దుళ్లగొట్టుకోవడమన్నమాట... ఆ తర్వాత కథ చెప్పండి సార్‌...''

''ఆ తర్వాతేముందయ్యా... నేనూ మానాన్న బాటలోనే నడిచా. మా నాన్న పేరు చెప్పి నానా ఏడుపులూ ఏడిచా. జనం ఏడవకపోయినా ఓదార్చా. బుగ్గలు పుణికా. ముద్దులు పెట్టా. అమ్మా, అయ్యా, అక్కా, అన్నా, చెల్లీ, అవ్వా, తాతా... అంటూ మెత్తగా నవ్వుతూ పలకరించా. లేనిపోని మాటలు చెప్పి నమ్మించా. మొత్తం మీద అధికారం అందుకున్నా. ఇప్పుడు నాకు నేనే, నా వాళ్లతో కలిసి 'నీకిది నాకది' ఆట ఆడేసుకుంటున్నా. అదిగో  ఆ ఆటలో భాగమేనయ్యా... ఇప్పుడు ఈడీగాళ్లు గోల చేస్తున్న మద్యం యవ్వారం. ఇంతా చేసి ఈళ్లు చెబుతున్నది వంద కోట్ల సంగతవునా? దానికే పత్రికలోల్లు పెద్ద పెద్ద అక్షరాలు అచ్చెత్తించి యాగీ చేస్తున్నారు. అవి చూసి నువ్వు దుడుసుకున్నావు. కానీ నీకో అసలు సంగతి చెప్పనా? ఒక్క ఈ మద్యం సంగతే తీసుకుంటే మనం ఆడిన ఆట మొత్తంలో ఫుల్‌కౌంట్‌ ఎంతో నిజానికి నేనే చెప్పలేననుకో. కానీ నీకంటూ ఓ అంచనా రావడానికి ఉజ్జాయింపుగా ఓ లెక్క చెబుతాలే. దరిదాపుగా ఓ డెబ్బై అయిదు  వేల కోట్లుంటుదయ్యా. ఇదంతా మనం కుర్చీ ఎక్కాక రాష్ట్రంలో పారించిన మద్యం విలువన్నమాట. మరి డిస్టిలరీలు, డీలరు షిప్పులు, తయారీ సంస్థలు, సరఫరా కంపెనీలు... అన్నీ మన కనుసన్నల్లోనే కదా నడిచేది? నడిపించేది కూడా మన మనుషులే కదయ్యా? సీసాలెంత ఘనంగా ఉన్నా అందులో ఉన్న సరుకులో అసలెంతో, నకలెంతో తెలియనంతగా అమ్ముకోమని మనం గ్రీన్‌ సిగ్నలివ్వాలంటే మరి మనకెంత ఆళ్లు ముట్టజెప్పి ఉంటారో... నువ్వు తీరిగ్గా ఇంటికెల్లి లెక్కలేసుకో. ఇక ఇప్పుడు పేపర్లలో పేర్లు బయటకొచ్చిన వారికి మనం ఎకరాలకెకరాల సర్కారు భూములు బదలాయించామన్న సంగతి కూడా మరవమాక. అలా భూములిచ్చినందుకు కూడా మన సొంత కంపెనీల్లోకి కోట్లొచ్చి పడ్డాయిలే. అయ్యన్నీ లెక్కలేసుకోవాలంటే... నాకే తల ప్రాణం తోక్కొస్తుంది. నీకయితే జీవితం కూడా సరిపోదనుకో. ఇక ఈ ఈడీగాళ్లు చెప్పేదెంత? చూపించేదెంత? నిరూపించేదెంత? ఏమంటావ్‌?

''ఇంకేమంటానండీ బాబూ... కళ్లు గిరగిరా తిరిగిపోతుంటేనూ. కానీ సార్‌... మరి అప్పట్లో తమరు ఊరూవాడా తిరిగేప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని ఎందుకు చెప్పారండీ బాబూ....?''

''అదంతా ప్రజల్ని నమ్మించడానికయ్యా. ఏదేదో చెప్పి, మన మనసంతా ప్రజలేనన్నట్టు...  రాత్రిళ్లు నిద్రలో కూడా ప్రజా సంక్షేమం కోసమే కలవరిస్తున్నట్టూ... అసలు మన జీవితమే ప్రజల కోసమన్నట్టూ... మాయమాటలు చెప్పి నమ్మించకపోతే... ఇప్పుడీ కుర్చీ మీద ఉండేవాళ్లమా చెప్పు? మరీ ఆట ఆడగలిగేవాళ్లమా చెప్పు?''

''ఆహా... తమరు చెప్పిన అధికారంతో తొండాట కథ చాలా బాగుంది కానీండీ, మరి ప్రజలు ఇవన్నీ గమనించేసి, తమరి అసలు నిజరూపం పసిగట్టేస్తేనోనండీ?''

''ప్రజలొట్టి వెర్రిబాగులోళ్లనేది నా ప్రగాఢ నమ్మకమయ్యా. ఆళ్ల కళ్ల ముందే మనం లక్షలాది కోట్లు దోచేసుకున్నా కానుకోలేరు. అలా మనం దోచినదాంట్లో కాసింత తృణమో, పణమో వాళ్లకి పడేస్తే... పాపం... జేజేలు కొడుతూ పడుంటారు. కాబట్టి నువ్వూరికే కంగారు పడ్డం మానెయ్యి. నీకింకా గుండె దడ తగ్గలేదనుకో. ఇందాకా అంబులెన్స్‌ పిలిచానన్నావుగా, దాంట్లో పడుకుని ఇంటికెళ్లి ముసుగుదన్ను. పోయిరా!''

- సృజన

PUBLISHED ON 11.11.2022 ON JANASENA WEBSITE