గురువారం, డిసెంబర్ 30, 2021

రెండు తీర్పులు!

 న్యాయ‌స్థానం. వాతావ‌ర‌ణం గంభీరంగా ఉంది. ఆ రోజు ఇద్ద‌రు నేర‌స్థుల గురించి తుది తీర్పు వెలువ‌డాల్సి ఉంది. ఇద్ద‌రూ వేర్వేరు చోట్ల ఒకే నేరం చేశారు. ఆ నేరాలు రుజువ‌య్యాయి.  ఇక శిక్ష ప‌డ‌డ‌మే తరువాయి.  వాళ్ల నేరాల‌కి సంబంధించిన రుజువులున్న ఫైల్సు, న్యాయ‌మూర్తి బ‌ల్ల మీద ఉన్నాయి.  న్యాయ‌మూర్తి వ‌చ్చారు. అంతా లేచి నిల‌బ‌డ్డారు. న్యాయమూర్తి  కూర్చున్నాక మొద‌టి నేర‌స్థుడిని బోనులో నిల‌బెట్టారు. న్యాయ‌మూర్తి త‌న ముందున్న ఫైలు ప‌రిశీలించారు. ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

గంభీరంగా బోనులో ఉన్న నేర‌స్థుడి కేసి చూసి, "నువ్వు చెప్ప‌ద‌లుచుకున్న‌దేమైనా ఉందా?" అని అడిగారు.

"సార్‌... న‌మస్కార‌మండి. మిమ్మ‌ల్ని ఇదే మొద‌టి సారి చూడ్డ‌మండి. ఎంత బాగున్నారో?  మీ మొహం చాలా అందంగా ఉందండి. అబ్బ‌... ఆ క‌ళ్లు ఎంత పెద్ద‌గా చ‌క్క‌గా ఉన్న‌యో! మీ న‌వ్వు మ‌రింత బాగుందండి. అస‌లు మీరు వేసుకున్న దుస్తులు అద్భుతంగా ఉన్నాయండి. అన్నీ తెలిసిన మారాజండి త‌మ‌రు. కాబ‌ట్టి న‌న్ను వ‌దిలేయండి..." అన్నాడు నేర‌స్థుడు. 

న్యాయ‌స్థానంలో అంద‌రూ న‌వ్వారు. న్యాయ‌మూర్తి న‌వ్వ‌లేదు. ఓ సారి త‌ల‌పంకించి, చ‌ట్ట‌ప్ర‌కారం ఆరు నెల‌ల క‌ఠిన కారాగార శిక్ష విధించారు. ర‌క్ష‌క భ‌టులు తీసుకెళ్ల‌డానికి వ‌స్తే నేర‌స్థుడు గింజుకున్నాడు. 

"ఇది అన్యాయం. నేనెంత‌గానో న్యాయ‌మూర్త‌ని పొగిడాను. అయినా శిక్ష వేసేశారు. ఇదెక్క‌డి న్యాయం?" అని అరుస్తుండ‌గానే ర‌క్ష‌క భటులు అత‌డిని తీసుకెళ్లిపోయారు, శిక్ష అమ‌లు ప‌ర‌చ‌డానికి. 

ఆ త‌ర్వాత రెండో నిందితుడిని బోను ఎక్కించారు. న్యాయ‌మూర్తి అత‌డి ఫైలుని కూడా ప‌రిశీలించారు.  నేరానికి సంబంధించిన రుజువులు చూశారు. ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. 

గంభీరంగా బోనులో ఉన్న నేర‌స్థుడి కేసి చూసి, "నువ్వు చెప్ప‌ద‌లుచుకున్న‌దేమైనా ఉందా?" అని అడిగారు. 

"దండాలండి బాబ‌య్యా... నేను త‌ప్పు చేశానండ‌య్య‌. ఒప్పుకుంటున్నానండ‌య్య‌. ఇంకెప్పుడూ ఇలా చేయ‌నండ‌య్య‌. మంచిగా బతుకుతానండ‌య్య‌. క‌నిక‌రించండ‌య్య‌. న‌న్ను వ‌దిలేయండ‌య్య‌..." అంటూ కన్నీళ్ల‌తో వేడుకున్నాడు. 

న్యాయ‌మూర్తి త‌ల‌పంకించారు. శిక్షాస్మృతి ప్ర‌కారం ఆరు నెల‌లు క‌ఠిన కారాగార‌ శిక్ష విధించాల్సి ఉంది. కానీ నేర‌స్థుడు ప‌శ్చాత్తాప ప‌డుతున్నాడు. ప‌రివ‌ర్త‌న చెందాడు. ఆ విష‌యాన్ని న్యాయ‌మూర్తి ప‌రిగ‌ణించారు. త‌న‌కున్న విచ‌క్ష‌ణ అధికారాల‌ను ఉపయోగించారు. త‌ర్వాత తీర్పు చెప్పారు. అత‌డికి వారం రోజులు సాధార‌ణ జైలు శిక్ష విధించారు. 

*******

ఈ రెండు తీర్పుల క‌థ‌లో న్యాయ‌మూర్తి లాంటి వాడే భ‌గ‌వంతుడు కూడా. మ‌నం ఎన్నో త‌ప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల నుంచి గుణ‌పాఠం నేర్చుకోకుండా... ఊరికే భ‌గ‌వంతుడిని స్తోత్రాల‌తో పూజిస్తే ఫ‌లితం ఉండ‌దు. మ‌న‌లో ప‌రివ‌ర్త‌న రావాలి. ప‌శ్చాత్తాపం క‌ల‌గాలి. ఆ మార్పు వ‌చ్చాక భ‌గ‌వంతుడిని వేడుకుంటే ఆయ‌న విచ‌క్ష‌ణాధికారం వ‌ల్ల శిక్ష త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. లేక‌పోతే నేనెన్ని పూజ‌లు చేసినా, ఎన్ని స్తోత్రాలు చ‌దివినా భ‌గ‌వంతుడు క‌రుణించ‌లేద‌ని ఎంత గింజుకున్నా మొద‌టి నేర‌స్థుడిలాగా శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. 


బ్రోచేదెవ‌రు? కాచేదెవ‌రు?

 


హే... భ‌గ‌వాన్! అంటూ ఆక్రోశించాడు సామాన్యుడు.

అల వైకుంఠ‌పుర‌ములో, న‌గ‌రిలో, ఆమూల సౌధంబుదాప‌ల లక్ష్మీదేవితో పాచిక‌లాడుతున్న విష్ణుమూర్తి ఉలిక్కి ప‌డ్డాడు.

ల‌క్ష్మీదేవి వెంట‌నే కంగారు ప‌డి శ్రీహ‌రి చేతిలోని త‌న చీర చెంగును చ‌టుక్కున వెన‌క్కి తీసుకుంది.

ఎందుకా కంగారు దేవీ?” అని ప్ర‌శ్నించాడు విష్ణుమూర్తి.

మ‌రేంలేదు స్వామీ! అల‌నాడు మొస‌లి బారిన ప‌డిన గ‌జేంద్రుడు వేడుకోగానే మీరు నా చేలాంచ‌ల‌మైనా వీడ‌క ప‌రుగందుకున్నారు. దాంతో  మీ వెన‌క నేను, ఆ వెనుక‌నే మీ శంఖుచ‌క్రాలు, గ‌రుడుడు, ఆపై వైకుంఠ‌వాసులంతా పరిగెత్తాం, గుర్తులేదా? ఇప్పుడూ అలాగే చేస్తారేమోన‌ని ముందుగా నా కొంగు తీసుకున్నానంతే అంది ల‌క్ష్మీదేవి.

విష్ణుమూర్తి నిట్టూర్చి, అర్థ‌నిమీళిత నేత్రాల‌తో ఆలోచ‌న‌లో ప‌డ్డాడు.

అదేంటి స్వామీ! ఆ సామాన్యుడు అలా ఆక్రోశిస్తున్నా మీలో క‌ద‌లిక లేదు. క‌నీసం గ‌రుత్మంతుడికైనా క‌బురంప‌డం లేదేంటి?” అంది అయోమ‌యంగా.

విష్ణుమూర్తి కళ్లు విప్పి, “అత‌డు ఆంధ్ర దేశ‌మున, అస్త‌వ్య‌స్త‌ ప‌రిస్థితుల మ‌ధ్య, అగ‌మ్య‌గోచ‌రంగా అల్లాడుతున్న సామాన్యుడు దేవీ! వేరొకండెవ‌రైనా అయిన ఎడ‌ల ఈ పాటికే వెళ్లి అత‌డి అభీష్ట‌మును నెర‌వేర్చెడివాడ‌నే... అన్నాడు.

అత‌డు చేసుకున్న‌పాప‌మేమిటి నాథా?”

పాపం.. అత‌డికేమీ క‌ళంక‌ము లేదు దేవీ. ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర ప‌రిస్థితే అల్ల‌కల్లోల‌ముగా ఉన్న‌ది...

స‌క‌ల చ‌రాచ‌ర సృష్టికే స్థితి కార‌కులైన మీరే ఇలా త‌ట‌ప‌టాయిస్తే ఎలా స్వామీ? పాపం... ఆ సామాన్యుడి క‌ష్ట‌మేంటో కాస్త చూడండి... అంది ల‌క్ష్మి ఒకింత జాలితో.

దేవీ! ముందా సామాన్యుడి విన్న‌పాలు విన‌వ‌లెను. అవి ఎంత వింత‌వింతలో నీకే తెలియును... అన్నాడు విష్ణుమూర్తి.

ల‌క్ష్మి మేఘాల దొంత‌ర‌ల‌ను ప‌క్క‌కు దొర్లించి కిందికి దృష్టి సారించింది.

సామాన్యుడు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు.

హే... భ‌గ‌వాన్‌! కొత్త సంవ‌త్స‌రం వ‌స్తోంది. కానీ మా పాత బాధ‌లు తీరే మార్గం క‌నిపించ‌డం లేదు. ధ‌ర‌ల‌న్నీ ఆకాశంలో చుక్క‌ల ప‌క్క‌న కూర్చుని వెక్కిరిస్తున్నాయి. నిత్యావ‌స‌రాలు కొందామ‌న్నా నిట్టూర్పులు త‌ప్ప‌డం లేదు. కూర‌గాయ‌లు కూడా క‌స్సుమంటున్నాయి. ఇలాగైతే ఎలా?”

ల‌క్ష్మి రోష‌క‌షాయిత నేత్రాల‌తో క్రీగంట చూసింది. విష్ణుమూర్తి ఎలా చెప్పాలా అని ఆలోచించేంత‌లో స‌మ‌యానికి నార‌దుడు నారాయ‌ణ‌... నారాయ‌ణ అంటూ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. వ‌స్తూనే ప‌రిస్థితి గ్ర‌హించి మొద‌లు పెట్టాడు.

అమ్మా... అలా ఆగ్ర‌హించ‌కు. ఆ సామాన్యుడి కోరిక‌లో చాలా చిక్కులున్నాయ‌మ్మా. ఆ రాష్ట్ర అధినేత ప్ర‌జ‌లంద‌రికీ స్వ‌ర్ణ‌యుగం తెస్తాన‌ని న‌మ్మించి అధికారం అందుకుని కుర్చీ ఎక్కి రెండున్న‌రేళ్ల‌యింది. ఎంత‌సేపూ ఆ నేత దృష్టి అప్పుల మీదే ఉంది త‌ప్ప‌, ధ‌ర‌వ‌ర‌ల అదుపు మీద లేదు త‌ల్లీ! ఇప్ప‌టికే ఆ రాష్ట్రం ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇక కొత్త‌గా అప్పు పుట్టే దారులు కూడా క‌నిపించడం లేదు. ఉద్యోగుల‌కు నెల‌నెలా జీతాలు కూడా ఇవ్వ‌లేని దుస్థితిలో ఆ ప్ర‌భుత్వం ఉంద‌మ్మా.  ఆఖ‌రికి సామాన్యుల‌కు ఇచ్చే పింఛ‌ను డ‌బ్బులు కూడా ఎప్పుడొస్తాయో తెలియ‌ని దుర్భ‌ర ప‌రిస్థితి. ఒక‌వేళ వ‌చ్చినా అందులో కూడా చెత్త ప‌న్నుల‌వీ కోత కోసి అందిస్తున్నారు. చెయ్య‌గ‌లిగిన నేత‌లే చేతులెత్తేస్తుంటే, ఇక వైకుంఠ‌నాథుడు మాత్రం ఏమి చేయ‌గ‌ల‌డ‌మ్మా?”

లక్ష్మీ దేవి త‌ల‌పంకించి, తిరిగి సామాన్యుడి ప్రార్థ‌న కోసం చెవులు రిక్కించింది.

హే... భ‌గ‌వాన్‌! రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌డం లేదు. మా ద‌గ్గ‌ర కొన్న పంట‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి కూడా బ‌కాయిలు విడుద‌ల కావ‌డం లేదు. చేతిలో కాసులాడ‌క అప్పుల‌పాలై అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఈ ప‌రిస్థితి ఎలా మారుతుంది స్వామీ?”

ల‌క్ష్మీదేవి విష్ణుమూర్తి కేసి చూశాడు. విష్ణుమూర్తి నార‌దుడి కేసి చూశాడు. నార‌దుడు అందుకున్నాడు.

చెప్పాను క‌ద‌మ్మా... ఆ అధినేత నిర్వాకం వ‌ల్ల ఒక‌ప్పుడు అన్న‌పూర్ణ అనిపించుకున్న ఆ రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల‌కే కాద‌మ్మా, ప్ర‌భుత్వ ప‌నులు చేసిన గుత్తేదారుల‌కు కూడా కోట్లాది రూపాయ‌ల బ‌కాయిలు పేరుకుపోయాయి. ఆఖ‌రికి ఆ నేత కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న నిధుల‌ను కూడా దారిమ‌ళ్లిస్తున్నాడు. ప్ర‌జ‌ల నుంచి ప‌న్నుల రూపంలో వ‌చ్చే సొమ్ము, సంక్షేమ ప‌థ‌కాల కోసం విడుద‌ల‌య్యే సొమ్ముకు కూడా ఓ అజాప‌జా, లెక్కాజ‌మా క‌నిపించ‌డం లేద‌ని అక్క‌డి ప్ర‌తిప‌క్ష‌నేత‌లు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఈ లక్ష్మీప‌తి మాత్రం చేసేదేముంద‌మ్మా?”

లక్ష్మీదేవి నిట్టూర్చి, మ‌ళ్లీ సామాన్య‌డి కేసి చూసింది.

హే... భ‌గ‌వాన్‌! మా పిల్ల‌లు చదువుకుందామంటే పూర్వం అందే సాయం కూడా బంద‌యిపోయింది. ఇప్పుడు కొత్త‌గా ఫీజులు క‌ట్ట‌మంటున్నారు. ఎలాగోలా చదువు చెప్పించినా ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న ఆశ కూడా లేదు. ఇలాగైతే ఎలా తండ్రీ?”

నార‌దుడు మ‌ళ్లీ వివ‌రించాడు.

ఏం చెప్ప‌మంటావు త‌ల్లీ? అక్క‌డి ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌న్నీ అనాలోచితంగానే ఉన్నాయి. దాత‌ల సాయంతో న‌డిచే ఎయిడెడ్ పాఠ‌శాల‌ల ఆస్తుల మీద కూడా అక్క‌డి నేత క‌న్ను ప‌డిందటమ్మా. వాటికి ప్ర‌భుత్వ ప‌రంగా ఇచ్చే నిధుల‌ను కూడా ఆపుచేయ‌డంతో పిల్ల‌ల చ‌దువులు భార‌మ‌వుతున్నాయి.  ఇక అక్క‌డి పాల‌న తీరుతెన్నులు చూసి కొత్త ప‌రిశ్ర‌మ‌ల వారెవ‌రూ రాష్ట్రం కేసి చూడ‌డం లేదు. పైగా ఉన్న ప‌రిశ్ర‌మ‌లు కూడా త‌ర‌లిపోతున్నాయి. దాంతో అక్క‌డి యువ‌తీ యువ‌కుల‌కు ఉద్యోగాలు రావ‌డం క‌ష్ట‌మైపోతోంది. దాంతో చాలా మంది ఇత‌ర ప్రాంతాల‌కు పోవాల్సి వ‌స్తోంది. పోనీ ప్ర‌భుత్వ రంగాల్లో ఉన్న ఉద్యోగాల‌ను కూడా భ‌ర్తీ చేయడం లేద‌మ్మా. ఇక స్థితికారుడు సైతం ఈ దుస్థితిని ఎలా మార్చ‌గ‌ల‌డ‌మ్మా?”

ల‌క్ష్మీదేవి కూడా ఆలోచ‌న‌లో ప‌డింది. సామాన్యుడు మాత్రం త‌న ప్రార్థ‌న‌ను ఆప‌లేదు.

హే... భ‌గ‌వాన్‌! ఏదైనా స‌మ‌స్య‌ను ఎవ‌రితోనైనా చెప్పుకోడానికి కూడా భ‌య‌మేస్తోంది తండ్రీ. ఎప్పుడెప్పుడో మ‌మ్మ‌ల్ని క‌నిక‌రించి పాత‌ప్ర‌భుత్వాలు ఇచ్చిన స్థ‌లాలు, ఇళ్ల మీద కూడా ప‌డుతున్నారు.  ఇదెక్క‌డి విచిత్రం తండ్రీ?”

ల‌క్ష్మీదేవి అర్థం కాన‌ట్టు చూసింది. నార‌దుడు అందుకున్నాడు.

అవున‌మ్మా! అక్క‌డి సామాన్యుల స‌మ‌స్య‌ల‌ను గ్ర‌హించి వారి త‌ర‌పున నిరస‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసే మ‌న‌సున్న జ‌న‌నాయ‌కుల మీద కూడా ఆ ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తోందమ్మా. అలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు వెళ్లిన వారిపై గూండాల‌ను ఉసిగొల్పుతున్నారు. ర‌క్ష‌క భ‌టుల‌ను పంపించి అన్యాయ‌పు కేసులు కూడా పెట్టిస్తున్నార‌మ్మా. నిధులు రాబ‌ట్టుకోవ‌డం కోసం సామాన్యుల‌కు ద‌శాబ్దాల క్రితం ఇచ్చిన ఇళ్ల‌ను ఇప్పుడు కొత్తగా రిజిష్ట‌ర్ చేయించుకోమంటున్నారు. ఇలా ఒక‌టి కాదు, రెండు కాదు లోక‌మాతా! ఆ రాష్ట్రంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీభ్ర‌ష్టు ప‌ట్టిపోయాయి త‌ల్లీ! సామాజిక, ఆర్థిక, చ‌ట్ట‌, న్యాయ‌, ర‌క్ష‌ణ‌, ప‌రిపాల‌న‌, విద్య‌, వినోద రంగాల‌న్నీ కుదేలైపోయాయ‌మ్మా...

సామాన్యుడు ఇంకా ఆగ‌లేదు.

హే... భ‌గ‌వాన్‌! రాబోయే కొత్త సంవ‌త్స‌రంలోనైనా మా బాధ‌లు తీరే దారిచూపించు. మా ప‌రిస్థితులు బాగ‌య్యేలా అనుగ్ర‌హించు...

నార‌దుడు ఏదో చెప్ప‌బోయేంత‌లో ల‌క్ష్మీదేవి క‌ల్పించుకుంది.

ఆగు నార‌దా! నాకిప్పుడు అంతా అర్థ‌మైంది. ఆ సామాన్యుడి కోరిక‌ల్లో చిక్కులేమిటో తెలిశాయి. అక్క‌డి రాజ‌కీయ చ‌ద‌రంగంలో అత‌డెలా పావుగా మారాడో తెలిసింది... అంటూ వైకుంఠ‌నాధుడి కేసి తిరిగి, “స్వామీ! ఆ సామాన్యుడి స‌మ‌స్య‌లు ఇప్ప‌టికిప్పుడు చ‌టుక్కున తీర్చేవి కాక‌పోవ‌చ్చు. కానీ త‌న‌ను ఇలాంటి విష‌మ ప‌రిస్థితుల్లోకి నెడుతున్న నేతల నిజ‌స్వ‌రూపాన్ని గ్ర‌హించ‌గ‌లిగే అవ‌గాహ‌న‌ను అత‌డికి క‌లిగించండి. వాళ్ల‌కు ఎలా బుద్ధి చెప్పాలో తెలుసుకునే తెలివిని అనుగ్ర‌హించండి. అప్పుడు అత‌డు త‌న స‌మ‌స్య‌ల‌ను తానే ప‌రిష్క‌రించుకోగ‌ల‌డు... అంది.

త‌థాస్తు! అన్నాడు విష్టుమూర్తి.                

-సృజ‌న‌

PUBLISHED ON 30.12.21 ON JANASENA WEBSITE

 

 

మంగళవారం, డిసెంబర్ 21, 2021

దొంగ‌ల్లో దొర‌!


 

"థూ... దీనెవ్వా బ‌తుకు..." అంటూ నోట్లో చుట్ట ముక్క నేల‌కేసి కొట్టాడు గంగులు. బుగ్గ‌పై పులిపిరి, గ‌ళ్ల లుంగీ, నుదిటిపై గాటు, న‌ల్ల‌బెల్టు, బొడ్డులో బాకు... చూడ‌గానే భ‌యంక‌రంగా ఉన్న గంగులు కంఠం, ఆ పాడు ప‌డిన స‌త్రంలో ఖంగున మోగింది. స‌గం ప‌డిపోయిన గోడకున్న సున్నం పెచ్చు ఊడి కింద ప‌డింది. గంగులు ఏం చెబుతాడా అని అక్క‌డ చేరిన అంద‌రూ చెవులు రిక్కించి వింటున్నారు.

"ఇంకెంత‌కాలంరా ఈ సిన్నా సిత‌కా చోరీలు? ఎంట‌నే ఆపేద్దారి... ఏటంటారు?" అంటూ చికాగ్గా అడిగాడు గంగులు. అక్క‌డ చేరిన దొంగ‌లు, రౌడీలు, పాత నేర‌స్థులు, గూండాలు అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు.

"అదేంటి గంగులూ, అట్టంటావ్‌? మ‌న‌మింత‌క‌న్నా ఏటి సేయ‌గ‌లం? త‌ర‌త‌రాలుగా చోరీల‌నే న‌మ్ముకున్నాం... నువ్వు ఉన్న‌ట్టుండి వృత్తినే వ‌ద్దంటే మా గ‌తేంటి?" అన్నాడు ర‌త్త‌య్య క‌త్తితో గెడ్డం మీద గోక్కుంటూ.

"ఔ... అన్నా! మ‌రింకేం సేద్దారే?" అన్నాడు రంగూన్ రౌడీ రంగ‌న్న‌.

గంగులు అంద‌రి కేసీ తేరిపారి చూశాడు. ఆ త‌ర్వాత తుపుక్కున ఉమ్మి, "నోర్ముయ్యండెహె. ఆ పాటి నేనాలోచించ‌లేదంటారాజాగ్ర‌త్త‌గా వినుండ్రి. మ‌నం ఈ దొంగ‌త‌నాలు, ద‌బాయింపులు, చోరీలు, హత్య‌లు అన్నీ బంద్ చేసి ఎంచ‌క్కా రాజ‌కీయాల్లో చేరిపోదారి..." అన్నాడు గంభీరంగా.

కారాకిళ్లీ కాశ‌య్య ఫెల్లున న‌వ్వి, "ఏటి గంగులూ... మ‌తేమ‌న్నా సెడిందా ఏటిరాజ‌కీయాల్లో మ‌న్నెవ‌డు సేర్చుకుంటాడు? అయినా ఉన్న‌ప‌ళాన ఈ ఆలోచ‌నేంటి నీకు?" అన్నాడు.

గంగులు క‌స్సుమంటూ, "మూసుకోరా కాశిగా! నేనేమ‌న్నా ఎర్రెద‌వ‌నా?" అంటూ క‌సిరి, ఆపై అంద‌రి కేసీ చూస్తూ, "ఒరేయ్‌... నిదానంగా వినుకోండి. బాగా ఆలోసించే సెబుతున్నా. ఇన్నేళ్లుగా దొంగ‌త‌నాలు సేత్త‌న్నా మ‌న‌కి ద‌క్కిందేటి? ఎన‌క్కి తిరిగి సూసుకుంటే ఎర్ర‌ని ఏగాని లేదు. ఎప్ప‌టికప్పుడు క‌ట్టెను కొట్ట‌, పొయ్యిలో పెట్ట‌. పైగా ఇంతోటి ప‌నుల‌కే ఉలికులికి ప‌డిపోతూ, ఎప్పుడు దొరికి పోతామో తెలీక బిక్కుబిక్కుమంటూ న‌క్కి న‌క్కి తిరుగుతున్నాం. కాలం సెడి దొరికామో, జైల్లో ఏళ్ల త‌ర‌బ‌డి మ‌గ్గిపోత‌న్నాం. కానీ ఓసారి క‌ళ్లెట్టుకుని మ‌న రాజకీయ నాయ‌కుల కేసి సూడండి. క‌ళ్లంటుకుపోతాయ్‌. ఒక‌టి కాదు, రెండు కాదొరేయ్‌! కోట్లకు కోట్లు కొల్ల‌గొట్టేత్త‌న్నారు. ఇంతా సేసి ఆళ్లు కూడా సేసేది మ‌న‌లాటి ప‌న్లే. ప్ర‌జ‌ల్ని నిలువునా దొచేసుకుంటున్నారు. మ‌న్ని మించిపోయి మ‌రీ అక్ర‌మాలు, అన్నాయాలు, దౌర్జ‌న్యాలు సేత్తా కూడా ద‌ర్జాగా కారుల్లో కాల‌రెగ‌రేసుకుని మ‌రీ తిరుగుతున్నారు..." అంటూ ఆగాడు.

ఇంత‌లో అబ్బులు లేచి, జ‌బ్బలు రాసుకుంటూ చెప్పాడు, "గంగుల‌న్న సెప్పింది ప‌ర‌మ సత్తెం. మొన్న‌టి దాకా మ‌న జ‌ట్టులో క‌లుపుకోండంటూ బ‌తిమాలుతూ నా చుట్టూ తిరిగే జ‌గ్గులుగాడు ఆంధ్రాలో అధికార పార్టీలో సేరిపోయిండు. ఎమ్మెల్యే కాడ అనుచ‌రుడిగా మారిపోయిండు. ఇప్పుడు సూడండి. ఆడు ఆడిందాట‌, పాడింది పాట‌. ఆడి నేత ఎవుడ్ని కొట్ట‌మంటే ఆడ్ని కొట్టి రావ‌డ‌మే ప‌ని. మొన్నాపాలి కొంద‌రు  ఎక్క‌డ సూసినా రోడ్లు బాగా లేవ‌ని ఫుటోలు తీసి, నినాదాలు సేత్తంటే మ‌నోడు మ‌రి కొంద‌రితో క‌లిసి ఆళ్ల‌ని సిత‌గ్గొట్టిండు. అలాగే ఎవ‌రో రైతులంట‌, పాపం అంద‌రూ క‌లిసి ఊరేగింపు సేత్తంటే ఆళ్ల‌ని కూడా ఇర‌గ‌దీసిండు. ఆ ప‌క్క‌నే పోలీసోళ్లు ఉన్నా ఆపితే ఒట్టు. ఆళ్ల ఎదురుగ్గానే ఈడు కారెక్కి చ‌క్కా పోయిండు. నేను ఆడ‌నే ఉండి ఇదంతా సూసి నోరెళ్ల‌బెట్టినా. కేసూ లేదు, గీసూ లేదు. ఇలా ఆ పార్టీలో చేరి ఆళ్ల నేత‌లు ఏం చెబితే అది చేసేవోళ్ల మీద ఈగ కూడా వాల‌దంట‌. అంతా ఆళ్ల పెద్ద‌న్న చూసుకుంట‌డంట‌. ఆయ‌నేం చెబితే పోలీసోళ్లంతా అదే సేత్తారంట‌. కాబ‌ట్టి గంగుల‌న్న క‌ర‌క్టే" అన్నాడు.

వెంట‌నే ఖూనీకోర్ కోటిగాడు లేచి అందుకున్నాడు, "నిజ‌మ‌న్నా! అబ్బులు చెప్పేది అక్ష‌రాలా నిజం. మ‌న‌మంతా వెంట‌నే ఆ పార్టీలో చేరిపోవాల‌. ఆ పార్టీ మ‌న‌లాంటోళ్ల‌కి గొప్ప ఆస‌రా. మాగొప్ప భ‌రోసా. ఇన్నాళ్లూ మ‌నం భ‌య‌ప‌డుతూ చేసే ప‌నుల‌న్నీ ఆ పార్టీలో చేరితే ప‌బ్లిగ్గా చేసేయ‌చ్చు. అంతెందుకు? మ‌నం మ‌న‌సు బాలేక‌పోతే కూసింత గంజాయి ఆకు ముట్టించుకుని పీలుస్తామా? ఇప్పుడా ఆకుని ఏజెన్సీలో ఎక‌రాల‌కెక‌రాలు సాగు చేసేత్త‌న్నారు. ఆటిని లారీల్లో లోడుకెత్తించి దేశం మొత్తం తోలేత్త‌న్నారంట‌. పోలీసోళ్లు కూడా చూసీ చూడ‌న‌ట్టు ఒగ్గేత్త‌న్నారంట‌. అప్పుడ‌ప్పుడు మాత్రం కొన్ని కేసులెట్టి హ‌డావుడి చేస్తారంటంతే. దీనికి సాయం విదేశాల నుంచి వ‌చ్చే మ‌త్తు ప‌దార్థాలు కూడా స‌ర‌ఫ‌రా అవుతున్నాయంట‌. మ‌న్లాంటి ప‌నీ పాటా లేని పోరంబోకు నాయాళ్లంతా ఈ లోడింగు, అన్‌లోడింగు ప‌నుల్లో కుదిరిపోతున్నారు. ఈళ్లంద‌రికీ ఆ పార్టీవోళ్ల అండ‌దండ‌లుంటాయంట‌. క‌ళ్ల ముందే క‌రెన్సీ నోట్ల‌తో పెళ‌పెళలాడిపోత‌న్నార‌నుకో..." అంటూ చెప్పుకొచ్చాడు.

అప్పుడు గంగులు లేచాడు. అంద‌రికేసీ ఓసారి చూసి, "చూశారా? ఇప్పుడు రోజులు సానా మారిపోనాయి. మ‌నమంతా వెన‌క‌బ‌డిపోయాం. మ‌న‌కెన్ని క‌ట్టాలో ఓ సారి గుర్తు తెచ్చుకోండి. ఒంటి నిండా నూని రాసుకోవాల. మ‌సి పూసుకోవాల‌. సీక‌ట్లో త‌క్కుతూ, తారుతూ, బెదురుతూ ప‌ని సేయాల‌. పోలీసోడి విజిల్ ఇనిపిస్తే సాలు, పై ప్రాణం పైనే పోద్ది. కానీ మ‌న క‌ళ్ల ముందు వెలిగిపోతున్న కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల్ని చూడండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌మైన ప‌న్లు సేత్త‌న్నారు. ఏ వ్యాపారానికైనా పెట్టుబ‌డి పెట్టాల‌. కానీ న‌యాపైన జేబులోంచి పెట్ట‌కుండా, కోట్ల‌కు కోట్లు వేరే వాళ్ల చేత పెట్టించి, ఆళ్ల‌కి అప్ప‌నంగా భూములు, సెజ్‌లు, గ‌నులు పంచిపెట్టేసి లావాదేవీలు న‌డిపే నేత గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆ నేతే మ‌న‌కి దిక్కు. ఆయన దొర‌. దొంగ‌ల్లో దొర‌. అస‌లు ఆయ‌న మీద కూడా బోలెడ‌న్ని కేసులు ఉన్నాయి. అయ్య‌న్నీ కోర‌టుల్లో న‌డుస్తున్నాయి. ఆయ‌నోసారి జైలుక్కూడా వెళ్లొచ్చాడు. అయితేనేంప్ర‌జ‌ల్ని న‌మ్మించి, ఊరించి, బులిపించి గెలిచాడంతే. ఇక చూసుకోండి. ఆయ‌న‌కి కానీ, ఆయ‌న్ని న‌మ్ముకున్న వారికి కానీ  జాత‌రే జాత‌ర‌. మ‌నం ఒక‌సారి ఒక‌రి జేబే కొట్ట‌గ‌లం. మ‌రి ఆళ్లుఒకేసారి ప్ర‌జ‌ల జేబుల‌న్నీ కొట్టేస్తున్నారు. ఇసుక క్వారీలు, గ‌నులు, పోర్టులు, భూములు ఇలా అన్నీ అయిన‌వాళ్ల‌కి ఎంచ‌క్కా క‌ట్ట‌బెట్టేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులుకాంట్రాక్టుల‌న్నీ ఊరికే ఇత్తారేంటి? అందుకు భారీగా సొమ్ములు సేతులు మారే ఉంటాయి. అంటే పైకి ప్ర‌జ‌ల ప‌నులు, లోప‌ల సొంత కాతాకి సొమ్ముల జ‌మ‌లు. అందుక‌ని నేనింత‌కీ సెప్పొచ్చేదేటంటే, మ‌నకిక రెండేళ్లే టైముంది. మ‌నమంతా గ‌ళ్ల‌లుంగీలు విప్పేసి, గెడ్డాలు అవీ గీసేసుకుని నెమ్మ‌దిగా ఆ పార్టీ నేత‌ల అనుచరుల్లో సేరిపోవాల‌. అప్పుడిక మ‌నం ఏ కేసుల‌కీ భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు. ఇప్పుడు మ‌నం సేసే ప‌నులే ద‌ర్జాగా, ప‌బ్లిగ్గా సేసుకోవ‌చ్చు. ఆ నేత‌లు ఎవ‌రిని కొట్ట‌మంటే ఆళ్ల‌ని కొట్ట‌డం, ఎవ‌రికి జైకొట్ట‌మంటే వాళ్ల‌కి జైకొట్ట‌డం, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసేవాళ్ల‌ని తుక్కురేగ్గొట్ట‌డం, ప్రభుత్వానికి అనుకూలంగా దొంగ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌డం, ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఎగ‌స్పార్టీ వాళ్ల‌ని బెదిరించి అడ్డుకోవ‌డం, దొంగ ఓట్లు గుద్ద‌డం... ఇలా  దొంగ ప‌నుల‌న్నీ దొరల్లా సేయొచ్చు. ఏటంటారు?" అంటూ వివ‌రించాడు గంగులు.

అక్క‌డ చేరిన దొంగ‌లంతా "సై" అంటూ గెడ్డాలు గీసుకోవ‌డం మొద‌లు పెట్టారు.

-సృజ‌న‌

UPLOADED ON 21.12.2021 ON JANA SENA WEBSITE

సోమవారం, డిసెంబర్ 13, 2021

అమారా రాజ్యంలో అరాచ‌క పాల‌న క‌థ‌!



"గురూగారూ! న‌మ‌స్కారం..."

"ఏంట్రోయ్... చాలా కాలానికి క‌నిపించావ్‌. నా ద‌గ్గ‌ర ఇక రాజ‌కీయ పాఠాలు చాల‌నుకున్నావా?"

"అమ్మ‌మ్మ‌... ఎంత మాట‌. చాల‌నుకుంటే మళ్లీ ఎందుకు క‌నిపిస్తాను సార్‌. మీమీద ఏదో కేసు బ‌నాయించి మీ స్థానంలో గురువునైపోనూ?"

"వార్నీ! నా మీదే సెటైర్లు వేసేంత‌టివాడ‌వ‌య్యావ‌న్న‌మాట‌. మొత్తానికి నేను చెబుతున్న పాఠాలు కాస్తో కూస్తో వంట‌బ‌ట్టిన‌ట్టే ఉన్నాయ్‌. ఇంత‌కీ ఏంటిస‌యం?"

"ఏంలేదు గురూగారూ! మీ పాఠాలు వ‌ల్లె వేస్తుంటే ఓ సందేహం వ‌చ్చిందండి. ఉన్న‌ప‌ళాన లేచి చ‌క్కా వ‌చ్చేశా..."

"సందేహం వ‌చ్చిందంటే బుర్ర‌కెక్కుతున్నాయ‌న్న‌మాటే. అదేంటో అడుగు..."

"ఎలాగోలా మ‌సి పూసి మారేడుకాయ చేసో, బ‌తిమాలో, బామాలో, ఏడ్చో, ఓదార్చో, వాగ్దానాలు చేసో, హామీలిచ్చో, నమ్మించో, క‌న్నీళ్లు కార్చో, లేని క‌న్నీళ్లు తుడిచో, బుగ్గ‌లు త‌డిమో, బుర్ర‌లు రాసో, కాళ్లావేళ్లా ప‌డో... మొత్తానికి అధికారం సంపాదించాన‌నుకోండి... ఆ త‌ర్వాత చెప్పిన‌వ‌న్నీ ఎలా చేయాలివాగ్దానాల‌న్నీ ఎలా పూర్తి చేయాలి? ఇచ్చిన హామీలు ఎలా నెర‌వేర్చుకోవాలిముందు దేనికి ప్రాధాన్య‌త ఇవ్వాలిప్ర‌జాభిమానాన్ని ఎలా నిల‌ట్టుకోవాలి? ఇలాంటి సందేహాల‌తో బుర్ర తిరిగిపోయిందండి..."

"ఒరే... రాజ‌కీయాలు పూర్తిగా నేర్చుకోకుండానే ఏకంగా అధికారం గురించి ఆలోచిస్తే ఇలాగే అవుతుందిరా. నువ్వు అధికారంలోకి వ‌స్తే నీ బుర్ర తిర‌గ‌కూడ‌దురా... నిన్ను గెలిపించిన ప్ర‌జానీకం బుర్ర తిర‌గాలి. అదీ అస‌లు సిస‌లు పాల‌నంటే. నువ్వ‌డిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా నీకొక క‌థ చెబుతా. మ‌ధ్య‌లో ప్ర‌శ్న‌ల‌డుగుతా. వాటికి నువ్వు ఎలాంటి స‌మాధానాలు చెబుతావో, వాటిని బ‌ట్టి నీక‌స‌లు అధికార యోగం ఉందో లేదో చెబుతా. స‌రేనా?"

"మీరిలాంటి లింకులెట్ట‌డంలో ఘ‌టికులు క‌దండీ... మ‌ర‌యితే చెప్పండి ఆ క‌థేంటో..."

"అన‌గ‌న‌గా అమారా దేశంలో కొమారా రాజుగారురా. గొప్ప తెలివైన వాడు. ఆయ‌న‌కొక రాకుమారుడు. వీడు ఆ తండ్రిని మించిన వాడు. తండ్రి పాల‌న‌ను అడ్డం పెట్టుకుని కొడుకు చ‌క్రం తిప్ప‌డం మొద‌లుపెట్టాడు. తండ్రి కోసం వ‌చ్చే వాళ్ల‌ని మ‌ధ్య‌లో అడ్డంకొట్టి వాళ్లతో ఏదో మాట్లాడేవాడు. త‌ర్వాత వాళ్ల ద‌గ్గ‌ర దండిగా దుడ్లు వ‌సూలు చేసేవాడు. అలా ఖ‌జానాకి చేరాల్సిన ప్ర‌జ‌ల సొమ్ముని దారి మ‌ళ్లించి త‌న సొంత బొక్క‌సం నింపుకునేవాడు. మ‌రి... అస‌లిదంతా ఎలా సాధ్య‌మైందిరాకుమారుడు వాళ్ల‌కేం చెప్పేవాడువాళ్లంతా అత‌డికి ఎందుకు దుడ్లు ఇచ్చేవారు?"

"చిక్కు ప్ర‌శ్నే గురూగారూ! కానీ ఆలోచిస్తే స‌మాధానం దొరికేసిందండి. తండ్రి ద‌గ్గ‌ర అధికారం ఉంది కాబ‌ట్టి ఆయ‌న ద‌గ్గ‌ర‌కి ర‌క‌ర‌కాల ప‌నుల కోసం వ‌చ్చేవారుంటారండి. ఆ ప‌నేంటో కొడుకు ముందుగా తెలుసుకునేవాడన్న‌మాటండి. ఆ ప‌నిని బ‌ట్టి ఇంత ధ‌ర‌ని తేల్చేవాడండి. ఆ సొమ్ము ముట్ట‌ చెప్ప‌గానే కొడుకు ఆ తండ్రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేవాడండి. వెంట‌నే ఆ రాజుగారు వాళ్ల ప‌ని చేయించేసేవార‌న్న‌మాటండి"

"బాగానే చెప్పావురా. కానీ ప్ర‌జ‌ల ఖ‌జానాకి చేరాల్సిన సొమ్ము ఎలా దారి మ‌ళ్లిన‌ట్టు?"

"ఇది అర్థం కావాలంటే కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకోవాలండి. రాజ్యంలో చాలా కీల‌క‌మైన ప్ర‌దేశంలో ఎవ‌రికైనా ఎక‌రాల‌కెకరాలు భూమి కావాల‌నుకోండి. వాళ్లు నేరుగా కొడుకును క‌లుసుకుని దుడ్లు స‌మ‌ర్పించుకునేవారండి. ఆ త‌ర్వాత రాజుగారు ఆ భూమిని వాళ్ల‌కి ద‌ఖ‌లు ప‌రిచేవార‌న్న‌మాటండి. అంతేనాండీ?"

"అదంత సులువేంట్రా? ఎంత రాజుగారైనా విలువైన భూమిని ఇచ్చేస్తే ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెట్ట‌రూ? చ‌ట్టం ఊరుకుంటుందా? అది చెప్పు చూద్దాం..."

"గురూగారూ! మీరు మ‌రీ న‌న్ను చిన్న పిల్లాడిని అడిగిన‌ట్టు అడుగుతున్నారండి. రాజుగారు రాజ్య‌మేలుతుంటే చ‌ట్టానికి గంత‌లు క‌ట్ట‌డం పెద్ద ప‌నా చెప్పండి? అది కూడా చెబుతాను వినండి. కొడుక్కి దుడ్లు ముట్ట చెప్పిన వాళ్లు రాజుగార్ని నేరుగా స‌భ‌లోనే క‌లిసేవారండి. ఫ‌లానా చోట ఫ‌లానా భూమి కావాల‌ని స‌భాముఖంగా  కోరుకునేవారండి. రాజుగారు 'ఎందుకు' అని గంభీరంగా అడిగేవారండి. దానికి వాళ్లు ఆ భూమిలో పెద్ద క‌ర్మాగారం క‌డ‌తాం, చుట్టు ప‌క్క‌ల జ‌నానికి ఉద్యోగాలు అవీ క‌ల్పిస్తామ‌నో... లేక‌పోతే అనాధ ఆశ్ర‌మాలు నిర్మించి ప్ర‌జా సేవ చేస్తామ‌నో విన్న‌వించుకునేవారండి. అప్పుడు రాజుగారు ఆ విన్న‌పాన్ని ప‌రిశీలించిన‌ట్టు న‌టించి, వీళ్లు ప్ర‌జల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌ని చేస్తున్నారు కాబ‌ట్టి, అక్క‌డి భూమిని వీళ్ల‌కి చాలా త‌క్కువ ధ‌ర‌కి ద‌ఖ‌లు ప‌రిచేలా మాట ఇస్తున్నాను... నా మాటే శాస‌నం... అని చెప్పేసి డైలాగొక‌టి కొట్టి  ద‌స్క‌తు మీద రాజ‌ముద్ర వేయించేసేవారండి. అంటే చాలా విలువైన భూమి అతి చ‌వ‌గ్గా వ‌చ్చేసిన‌ట్టే క‌దండీ? మ‌ర‌లా చేసినందుకు కొడుక్కి అందులో వాటా ఇచ్చినా లాభ‌మే క‌దండీ? మామూలుగా అయితే  ఆ భూమికి  భారీ కిమ్మ‌త్తు చెల్లించి ద‌క్కించుకోవాలండి. అప్పుడా సొమ్ము నేరుగా ఖ‌జానాకి జ‌మ అవుతుందండి. ఇప్పుడు ఆ రాజు, కొడుకులు ఇలా చేయ‌డం వ‌ల్ల ఖ‌జానాని చెందాల్సిన సొమ్ముకి గండి ప‌డిన‌ట్టే క‌దండీ?"

"బాగానే చెప్పావురా. అధికారంలో కిటుకేంటో సులువుగానే అర్థం చేసుకున్నావ్‌. ఇప్పుడు మ‌ళ్లీ క‌థ‌లోకి వ‌ద్దాం. ఇలా ఆ రాకుమారుడు కోట్ల‌కి ప‌డ‌గ‌లెత్తాడు. ఇంత‌లో పాపం ఆ రాజుగారు కాలం చేశారు. వెంట‌నే ఆ రాకుమారుడు  సింహాసనం ఎక్కాల‌ని తెగ ఉబ‌లాటప‌డ్డాడు.  వాళ్ల ద‌గ్గ‌ర వీళ్ల ద‌గ్గ‌రా ద‌స్క‌తులు అవీ సేక‌రించి, అప్ప‌ట్లో సామంత రాజ్య‌మైన అమారా దేశం వ్య‌వ‌హారాల‌న్నీ చూస్తున్న సామ్రాజ్ఙి రాజ‌మాత‌కు నివేదించాడు. కానీ అప్పటికి ఈ రాకుమారుడికి  ప‌రిపాల‌న అనుభ‌వం లేక‌పోవ‌డంతో వేరే వృద్ధ మంత్రిని రాజుని చేసింది. అప్పుడు రాకుమారుడు గుర్ర‌మెక్కి దేశాట‌నం మొద‌లు పెట్టాడు. ఎందుక‌లా చేశాడుదేశాట‌నం వ‌ల్ల అత‌డికి ఏమిటి ఉప‌యోగం?" 

"గురూగారూ! క‌థ మీరు చెబుతూ ఆ క‌థ‌లో పాత్ర‌ల గురించి న‌న్ను అడిగితే ఎలాగండీ? స‌రే... రాజ‌కీయంగా ఆలోచించి చెబుతాను, వినండి. అప్ప‌టికీ ఆ రాకుమారుడికి అధికారంలో ఉన్న మ‌జా ఏంతో తెలిసిందండి. అదంటూ ఉంటే ఎంత‌లేసి సంపాదించ‌వ‌చ్చో రుచి తెలిసిందండి. అందుకు ప్ర‌జాబ‌లం ముఖ్య‌మ‌ని గ్ర‌హించాడండి. అయితే అధికారంలో ఉండాలి, లేక‌పోతే ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాలని అనుకుని దేశాట‌నం బ‌య‌ల్దేరాడండి. ఆ దేశాట‌న‌లో ఊరూవాడా తిరుగుతూ ప్ర‌జ‌ల్ని క‌లుసుకుని త‌న తండ్రి పాల‌న గురించి ఏక‌రువు పెట్ట‌డం మొద‌లు పెట్టాడండి. ఎందుకంటే త‌న తండ్రిని ప్ర‌జ‌లు మ‌ర్చిపోతే త‌న‌కిక రాజ‌య్యే అవ‌కాశాలుండ‌వు క‌దండీ? ప్ర‌జ‌లంతా రాజుగారు పోయిన దుఃఖంలో ఉన్నార‌నే వంక పెట్టుకుని వాళ్ల‌ని ఓదార్చే నెపంతో సానుభూతి పొందుతూ ఉండాల‌నేది అత‌డి ఆలోచ‌నండి. ప‌నిలో ప‌నిగా తాను గ‌నుక రాజ‌యితే త‌న తండ్రిని మించి, ఇంత చేస్తాను, అంత చేస్తానూ అంటూ భ్ర‌మ‌లు క‌ల్పించి ఉంటాడండి. అంతేనాండీ?"

"సెభాష్‌రా... క‌థ‌లో ఆంత‌ర్యాన్ని బాగానే గ్ర‌హించావు. ఇప్పుడు మ‌ళ్లీ క‌థ‌లోకి వ‌ద్దాం. అలా ఆ రాకుమారుడు తాను రాజైతే స్వ‌ర్ణ‌యుగం తెస్తాన‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌బ‌లికాడు. ప్ర‌జలు పాపం... న‌మ్మారు.  దాంతో ప్ర‌జ‌లంతా క‌లిసి మూకుమ్మ‌డిగా రాకుమారుడిని తీసుకెళ్లి క‌న‌క‌పు సింహాస‌నంపై కూర్చోబెట్టారు. ఇక నువ్వే మా రాజువ‌న్నారు. ఆపై ఆ స్వ‌ర్ణ‌యుగం ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూడ్డం మొద‌లు పెట్టారు. కానీ పాపం... ఆ స్వ‌ర్ణ‌యుగం రాలేదు స‌రిక‌దా, దేశం మొత్తం భ్ర‌ష్టుప‌ట్టింది. అధికారం కోసం ఎదురు చూస్తూ దేశాటనం చేసి, ఊరూరూ తిరిగిన ఆ రాకుమారుడు, సింహాస‌నం ఎక్కాక అస‌లు ఏ ప‌నీ చేయలేదు. పైగా దేశాన్ని అప్పుల కుప్ప‌లా మార్చేశాడు. ప్ర‌జ‌ల నుంచి ప‌న్నుల రూపంలో వ‌స్తున్న డ‌బ్బంతా ఏమ‌వుతోందో ఏమో కానీ, ప్ర‌తి నెలా రాజోద్యోగుల‌కు జీతభ‌త్యాలు ఇవ్వడానికి కూడా క‌ట‌క‌ట‌లాడాల్సిన దుస్థితి ఆ రాజ్యంలో దాపురించింది. జీతాలు ఎప్పుడొస్తాయో తెలియ‌ని ద‌య‌నీయ స్థితిలో ఉద్యోగులు ప‌డిపోయారు. దాంతో వాళ్లు బాహాటంగానే రాకుమారుడిని దూషించ‌డం మొద‌లు పెట్టారు. ఆఖ‌రికి స‌మ్మెలు కూడా చేస్తామ‌నే స్థితికి  వ‌చ్చారు. రాకుమారుడు దేశంలో ఏ ప‌నికీ నిధులు విడుద‌ల చేయ‌డం మానేశాడు. దాంతో ఎక్క‌డి ప‌నులు అక్క‌డే ఆగిపోయాయి. రాజ్యానికి సంబంధించిన ప‌నులు చేసే గుత్తేదారులకు కోట్లాది రూపాయ‌లు బ‌కాయిలు రాలేదు. దాంతో వాళ్లు మ‌రే కొత్త ప‌నులూ చేసేదిలేద‌ని భీష్మించుకుని కూర్చున్నారు.  దేశంలో ర‌హ‌దారుల‌న్నీ గోతులు గొప్పుల‌తో నిండిపోయాయి.  వాటిపై ప్ర‌యాణించే ప్ర‌జ‌ల‌కు ఒళ్లునొప్పులు రాసాగాయి. వృద్ధుల‌కు అందే పింఛ‌ను డ‌బ్బులు కూడా ఎప్పుడొస్తాయో తెలియ‌దు. ప్ర‌జ‌లు ఇళ్లు నిర్మించుకుందామంటే ఇసుక అందుబాటులో లేకుండా పోయింది.  సామాన్యుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు కూడా ఆకాశాన్నిఅంటాయి. ఆరుగాలం శ్ర‌మించి పంట‌లు పండించే రైతులు, స‌రైన ఆదాయం లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌డం మొద‌లు పెట్టారు. ఇలా ఏ వ‌ర్గం ప్ర‌జ‌ల్ని తీసుకున్నా ఏవేవో స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వసాగారు. ఎవ‌రైనా ఇదేం అరాచ‌కం అని ప్ర‌శ్నించ‌డానికి కూడా భ‌య‌ప‌డేలా ర‌క్ష‌క భటుల‌ను వాళ్ల‌పై దాడుల‌కు ఉసిగొల్ప‌సాగాడా రాకుమారుడు. ఎదురుతిరిగిన వాళ్ల‌పై ఏవో సాకులు పెట్టి అర‌దండాలు వేసి కారాగారాల్లో ప‌డేసి చిత‌గొట్ట‌డం ఆ రాజ్యంలో స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. ఇదిరా ఆ అమారా దేశంలో అరాచ‌క పాల‌న క‌థ‌. ఇంత‌కీ ఆ రాకుమారుడు ఎందుక‌లా చేశాడుఅనుభ‌వ రాహిత్యం వ‌ల్ల‌నాబాధ్య‌తా రాహిత్యం వ‌ల్ల‌నాతెలివి త‌క్కువ‌త‌నం వ‌ల్ల‌నా? అహంకారం వ‌ల్ల‌నావీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌వేమో ప్ర‌య‌త్నించు..."

"గురూగారూ! బాగా ఆలోచించి చూస్తే... ఆ రాకుమారుడు అంద‌రూ అనుకుంటున్న‌ట్టు తెలివిత‌క్కువ వాడు కాడండి. అపార‌మైన అతి తెలివి మీరిన‌వాడు. అస‌లు అత‌డు తండ్రి పాల‌న‌లోనే చ‌క్రం తిప్పిన వాడు కాబ‌ట్టి, తానే రాజ‌య్యాక ఏం చేయాలో తెలియ‌ని వాడ‌ని అస్స‌లు అనుకోలేం. దేనికైనా డ‌బ్బే ప్ర‌ధానం అని అత‌డికి తెలుసు. అధికారం చేతిలో ఉంటే దాన్ని ఎంత భారీగా సంపాదించ‌వ‌చ్చో గ్ర‌హించాడు. మీరు క‌థ‌లో చెప్ప‌క‌పోయినా అత‌డు ఈ పాటికే త‌నకి ఎంతో ద‌గ్గ‌ర‌వాళ్ల‌యిన వారికి, త‌న మాట వినే వారికి దేశంలోని  భూములు, ఓడ‌రేవులు, గ‌నులు లాంటి విలువైన వ‌న‌రుల‌ని లోపాయికారీగా దాఖ‌లు చేసేసి ఉంటాడు. ఆ విధంగా వారి నుంచి దండిగా దుడ్లు త‌న సొంత బొక్క‌సానికి మ‌ళ్లించి ఉంటాడు. ప్రభుత్వ‌ ఆస్తులు, భ‌వ‌నాల‌ను కూడా తాక‌ట్టు పెట్టి ఉంటాడు.  దేశ ఖ‌జానాకి రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు చేసి ఉంటాడు. ఆ సొమ్మంత‌టినీ దారి మ‌ళ్లించే ఉంటాడు. ఇక ప్ర‌జ‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికే వారెవ‌రో ప‌సిగ‌ట్టి ఏవేవో ప‌థ‌కాల పేరు చెప్పి వారికి నేరుగా దుడ్లు అందే ఏర్పాటు చేసి ఉంటాడు. తానే ఎప్ప‌టికీ రాజుగా ఉండిపోయేలా స‌క‌ల మార్గాలూ నిర్మించుకుని ఉంటాడు. మీరు క‌థ‌లో స్వ‌ర్ణ‌యుగం రాలేద‌ని చెప్పారు. అది త‌ప్పు.  నిజానికి స్వ‌ర్ణ‌యుగం వ‌చ్చింది. అయితే అది ప్ర‌జ‌ల‌కు కాదు, ఆ రాకుమారుడికే. ఏమంటారు?"

"అద్బుతంరా. చాలా బాగా చెప్పావు. అయితే మ‌రి ప్ర‌జ‌లు ఇవ‌న్నీ ప‌సిగ‌ట్ట‌లేరంటావారాకుమారుడు చేసే ప‌నుల ప్ర‌భావం చివ‌ర‌కి త‌మ మీద‌నే ప‌న్నుల రూపంలో ప‌డుతుంద‌ని, తామే  ఆఖ‌రికి బాధితులుగా మిగిలిపోతామ‌ని గ్ర‌హించ‌రంటావాదీనికి కూడా నీ స‌మాధానం ఏంటో చెప్పు?"

"గురూగారూ! ప్ర‌జ‌లు మీక‌న్నా, నాక‌న్నా, ఆ రాకుమారుడి క‌న్నా తెలివైన వారండి. ఎప్పుడు ఎవ‌రికి ఎలా వాత పెట్టాలో తెలుసు. అయితే ఈ ఒక్క సంగ‌తి మాత్రం ఆ రాకుమారుడు గ‌మ‌నించిన‌ట్టు లేదు. జ‌నం ఒట్టి అమాయ‌కుల‌ని అనుకుంటున్న‌ట్టున్నాడు. జ‌న చైతన్యం పెల్లుబికిన నాడు ఇలాంటి భ్ర‌ష్ట రాజ‌కీయ నాయకులంతా ఆ ప్ర‌భంజ‌నంలో కొట్టుకుపోతార‌ని తెలుసుకోలేక‌పోతున్నాడు. అంతేనంటారా?"

"ఒరే... నువ్వు రాజ‌కీయాల్లో నిజంగానే రాటు దేలావురా. ఇక పోయిరా!"

-సృజ‌న‌

PUBLISHED ON 11/12/2021 ON JANASENA WEBSITE 

 

 

గురువారం, డిసెంబర్ 09, 2021

పాజిటివ్!


ఫ్యాన్  తిరుగుతోంది. ఆనంద‌రావు చూస్తున్నాడు. అంటే దాన‌ర్థం ఫ్యాన్ కిందే ఉన్న మంచం మీద ఆనంద‌రావు ప‌డుకుని ఉన్నాడ‌ని. ఫ్యాన్‌నే చూస్తున్నాడంటే ఆ గ‌దిలో చూడ‌డానికి ఇంకెవ‌రూ లేర‌ని. అలా చూస్తూనే ఉంటే క‌థ ముందుకు సాగ‌ద‌ని అనుకున్నాడో ఏమోకానీ, ఆనంద‌రావు త‌ల‌గ‌డ మీద త‌ల‌ని ప‌క్క‌కి తిప్పి చూశాడు. ప‌క్క‌నే సెలైన్ స్టాండ్ క‌నిపించింది. దానికో సీసా, దానికి గుచ్చి ఉన్న గొట్టం, ఆ గొట్టంలోంచి కిందికి చుక్క చ‌క్క‌గా ప‌డుతున్న సెలైన్ 
క‌నిపించాయి. ఈ గొట్టం మీంచే అత‌డి చూపులు జారాయి. అవి త‌న మ‌ణిక‌ట్టు సూది ద‌గ్గ‌ర ఆగాయి. ఇలా ప‌ది నిమిషాల్లో ఓ పాతిక సార్లు చూసుంటాడు ఆనంద‌రావు. అలాంటి ప‌ది నిమిషాలు గంట‌న్న‌ర‌గా తొమ్మిది సార్లు జ‌రిగాయి.  
ఉండుండీ వ‌రండాలో ఎవ‌రివో అడుగుల చ‌ప్పుడు, బ‌య‌ట చెట్టు మీద కాకి అరుపు త‌ప్ప మ‌రేమీ వినిపించ‌ని నిశ్శ‌బ్దం. ఇంతలో డోర్ తీసిన చ‌ప్పుడు. ఆనంద‌రావు అటు కేసి చూశాడు. ఆడో, మ‌గో తెలియ‌ని విధంగా ఒళ్లంతా క‌ప్పేసిన ప్లాస్టిక్ ముసుగు. ముఖం మీద షీల్డ్‌. పైగా మూతికి మాస్క్‌. గుచ్చి గుచ్చి చూస్తే క‌ళ్లు ఒక‌టే క‌నిపిస్తాయి. ఆ క‌ళ్ళ‌లోకి తొంగి చూసినా ఏ భావ‌మూ క‌నిపించ‌దు. అదో ర‌కం నిర్లిప్త‌త‌. వ‌చ్చిన ముసుగు మ‌నిషి సిరెంజ్ తీసేస‌రికి ఆనంద‌రావు లేచి కూర్చుని జ‌బ్బ పైకి లేపాడు. ఇంజెక్ష‌న్ చివుక్కుమంది. 
“న‌న్నెప్ప‌డు డిశ్చార్జి చేస్తారు?” అన‌డిగాడు ఆనంద‌రావు. చాలా సేపు నుంచి మౌనంగా ఉండ‌డం వ‌ల్ల త‌న గొంతు త‌న‌కే వింత‌గా వినిపించింది. ముసుగు మ‌నిషి మాట్లాడ‌కుండా థ‌ర్మామీట‌ర్ తీసేస‌రికి, చేసేది లేక నోరు తెరిచాడు. ఇంకేమీ మాట్లాడ‌డానికి లేకుండా నాలిక కింద‌ థ‌ర్మామీట‌ర్ దూరింది. ముసుగు మ‌నిషి టైం చూసుకుని ఆన‌క థ‌ర్మామీట‌ర్ తీసి చూసి వెళ్లిపోయాడు. మ‌ళ్లీ ఆనంద‌రావు, ఫ్యాను, సెలైన్ సీసా మిగిలారు. 
ఇంత‌లో సెల్‌ఫోన్ ఓ ఈల లాంటిది వేసింది. అంటే ఏదో మెస్సేజ్ వ‌చ్చింద‌న్న‌మాట‌. ఆనంద‌రావు చూశాడు. 
“గెట్ వెల్ సూన్ సార్‌. డోన్ట్ హెసిటేట్ ఫ‌ర్ ఏనీ హెల్ప్‌. ఐ ప్రే గాడ్ ఫ‌ర్ యువ‌ర్ స్పీడీ రిక‌వ‌రీ”...
రాకేష్ క‌ళ్ల ముందు క‌దిలాడు ఆనంద‌రావుకి. 
“హు... నిజంగానే త‌న గురించి దేవుడ్ని ప్రార్థిస్తాడా రాకేష్‌?” నిట్టూర్చాడు ఆనంద‌రావు. స‌రిగ్గా వారం క్రితం ఆఫీసులో 
జ‌రిగిన సంఘ‌ట‌న గుర్తొచ్చింది. 
“సార్‌... ఒళ్లంతా నొప్పులు. ఆఫ్ డే సెల‌వు పెడ‌దామ‌నుకుంటున్నాను” అన్నాడు రాకేష్‌.
“ప్ర‌తి వాడూ ఏదో ఒక వంక పెట్టండ‌య్యా. పెండింగ్ ప‌ని ఎవ‌డు చేస్తాడు? అడ‌గడానికైనా సిగ్గుండాలి”…
 ఎంత క‌ఠినంగా ప‌లికింది త‌న గొంతు?  రాకేష్ మొహం చిన్న‌బోయింది. ఆ మొహం ఇప్ప‌డు గుర్తొచ్చింది ఆనంద‌రావుకి. ఆ రోజు ప‌నంతా చేశాకే ఇంటికెళ్లాడు రాకేష్‌. వెళ్తున్నాన‌ని చెబుతున్న‌ప్ప‌డు రాకేష్ మొహంలో అల‌స‌ట చూసి అప్పు‌డెంతో ఆనందం క‌లిగింది త‌న‌కి. 
ఇప్ప‌డెందుకో త‌న‌కే సిగ్గుగా అనిపిస్తోంది. అస‌లు త‌నేనాడైనా స‌రిగా మాట్లాడాడా స్టాఫ్‌తో? అనుకున్నాడు.  
నిజ‌మే... ఆనంద‌రావు నోరు తెరిస్తే చాలు, అధికారం ఖంగుమ‌నేది. ద‌ర్పం నొస‌లు చిట్టించేది. గ‌ర్వం రుస‌రుస‌లాడేది. వెట‌కార‌మో, వంక‌ర‌త‌న‌మో మాట‌ల్లో ముళ్లు దింపేది. అవ‌త‌లి వారి మొహం ఎర్ర‌బ‌డినా, చిన్న‌బోయినా  ఆనంద‌రావుకి  ఆనందం క‌లిగేది. ఆఫీసంతా త‌న ఒక్క‌డి వ‌ల్ల‌నే న‌డుస్తున్న‌ట్టు, అంద‌రూ ప‌ని దొంగ‌లైన‌ట్టు, త‌నొక్క‌డే నిజాయితీతో 
ప‌నిచేస్తున్న‌ట్టు అనుకునేవాడు.
రాకేష్ పెళ్లికి సెల‌వ‌డిన‌ప్పుడూ అంతే. 
“ప‌ది రోజులా?  పెళ్లికి ఇన్నాళ్లెందుక‌య్యా. నాలుగు రోజులు తీసుకో చాలు. నేను పెళ్లి చేసుకున్న రెండో రోజు డ్యూటీకి 
వ‌చ్చేశాను తెలుసా?  నీకు ఇన్ని రోజులు సెల‌విస్తే నాకు శోభ‌నం జ‌రిపిస్తారు పైవాళ్లు” అంటూ విర‌గ‌బ‌డి న‌వ్వాడు . పాపం రాకేష్‌. మొహం వేలాడేసుకుని వెళ్లిపోయాడు. 
“ఛ‌... త‌ను మ‌రీ అంత దారుణంగా బిహేవ్ చేయ‌కుండా ఉండాల్సింది” అనుకున్నాడు ఆనంద‌రావు. ఆలోచించిన కొద్దీ త‌న ప్ర‌వ‌ర్త‌న త‌న‌కే వెగ‌టుగా, పొగ‌రుగా అనిపించింది. 
ఎవ‌రైనా ఏదో ప‌ని మీదో, ఏదైనా అడ‌గ‌డానికి త‌న గ‌దిలోకి వ‌స్తే చాలు. బిగుసుకుపోయేవాడు. వ‌చ్చిన‌ట్టు తెలిసినా, గ‌మ‌నించ‌న‌ట్టు న‌టించేవాడు.  వ‌చ్చిన‌వాళ్లు కాసేపాగి చూసి గొంతు పెగ‌ల్చుకుని భ‌యంగా ‘సార్‌...’ అంటే అప్ప‌డు కూడా 
త‌లెత్త‌కుండా ‘ఊ..’ అనేవాడు గంభీరంగా. వాళ్లు ఏదో అడిగేవారు. ఆనంద‌రావు వాళ్ల కేసి నొస‌లు చిట్టించి, సాధ్య‌మైనంత చికాగ్గా చూసేవాడు.  క‌నీసం చిరున‌వ్వు కూడా లేకుండా జాగ్ర‌త్త ప‌డేవాడు. ఇక ఎవ‌ర్నీ కూర్చోమ‌న్న‌దే లేదు.  
ఆనంద‌రావు గ‌దిలోకి ఎవ‌రు వెళ్లినా వ‌చ్చేట‌ప్పుడు గంటు మొహం పెట్టుకు రావ‌ల్సిందే. వెళ్లేప్పుడు న‌వ్వుతూ వెళ్లినా 
వ‌చ్చేప్పుడు ఏడుపు మొహం త‌ప్ప‌దు. అలాంటి వాడు ఆనంద‌రావు. మాట‌ల‌తో కించ ప‌ర‌చ‌డంలో మాస్ట‌ర్  డిగ్రీ అందుకున్నాడు. వెటకారం చేయ‌డంలో డాక్ట‌రేట్ చేశాడు. నోర‌ట్టుకుని ప‌డ‌డంలో నోబెల్ ప్రైజ్ పొందాడు. తిట్ట‌డంలో అత‌డి 
ప‌రిశోధ‌న తిరుగులేనిది. అస‌లా మాట‌కొస్తే వాళ్ల‌మ్మ‌కి ముందు అహంకారం పుట్టి, ఆ త‌ర్వాతే ఆనంద‌రావు పుట్టాట్ట‌. అంటే అహంకారం అత‌డికి అన్న‌గార‌న్న‌మాట‌.  అలా క‌వ‌ల పిల్ల‌ల్లా పుట్టిన వాళ్లిద్ద‌రూ క‌లిసే పెరిగారు. 
ఆనంద‌రావు గురించి మాట్లాడుకున్న‌ప్పుడ‌ల్లా వాళ్ల ఆఫీస్ స్టాఫ్ అత‌డి భార్య‌ను త‌ల్చుకుంటారు. 
“వీడితో వేగుతున్నందుకు ఆవిడ‌కి స‌న్మానం చేయాలి” అంటూ జోక్ చేసుకునేవారు. “లోకంలో స‌హ‌నానికి ఎవ‌రైనా ప‌రీక్ష పెడితే ఆవిడ‌దే ఫ‌స్ట్ ర్యాంక్” అనుకుని న‌వ్వుకునేవారు. ఆ నవ్వుల‌న్నీ వాళ్ల బాధ‌లోంచి పుట్టిన‌వే. వాళ్ల నిస్స‌హాయ‌త‌కి నిద‌ర్శ‌నాలే. త‌న గురించి ఆఫీస్ స్టాఫ్ మాట్టాడుకునే విష‌యాల‌న్నీ ఆనంద‌రావుకి చేరేవి. అవ‌న్నీ ఆనంద‌రావుకి కోపం తెప్పించేవి కావు స‌రిక‌దా, బోలెడంత ఆనందాన్ని క‌లిగించేవి. అంత‌టి శాడిజానికి శాంపిల్ పీస్ ఆనంద‌రావు. 
కానీ ఇప్పుడు అవే జ్ఙాప‌కాలు ఆనంద‌రావుకి భ‌యం క‌లిగిస్తున్నాయి. మ‌రో విధంగా బాధ క‌లుగుతోంది కూడా. 
“త‌నిప్పుడు పోతాడా?” ఆనంద‌రావు గ‌దిలో తిరుగుతున్న ఫ్యాన్‌తో పాటు బుర్ర‌లో గిర‌గిరా తిరుగుతున్న ఆలోచ‌న ఇదే. ‘అవును... క‌రోనా వార్త‌లు ఎన్ని చూడ‌లేదు?
దిక్కులేని చావు చ‌స్తున్నారు చాలామంది. భార్యా బిడ్డ‌లు కూడా చూడ్డానికి లేకుండా, ఆసుప‌త్రి నుంచే శ‌వాన్ని ఎవ‌రో 
శ్మ‌శానానికి తీసుకుపోతే, ఎవ‌రో త‌గ‌లేసే కేసులు ఎన్ని చ‌ద‌వ‌లేదు?’ 
ఆనంద‌రావుకి  భార్య జానకి గుర్తొచ్చింది. త‌ను చ‌నిపోతే జాన‌కి చూడ్డానికి కూడా రాలేక‌పోవ‌చ్చు.  ఒక వేళ వ‌చ్చినా, దూరం నుంచే చూపిస్తారు. ‘అవునూ... అప్పుడు జాన‌కి నిజంగానే ఏడుస్తుందా?  పైకి ఏడ్చినా లోలోప‌ల సంతోషిస్తుందేమో!’ 
ఆనంద‌రావుకి ఉన్న‌ట్ట్టుండి గుండె పట్టేసిన‌ట్టు అనిపించింది. ఊపిరి పీల్చుకోవ‌డం క‌ష్టంగా అనిపించింది. ఆయాస 
ప‌డుతూనే ఆసుప‌త్రి బెడ్ ప‌క్క‌నే ఉన్న స్విచ్‌ను నొక్కాడు. కాసేప‌ట్లో నిండా పీపీఈ ముసుగేసుకున్న న‌ర్స్ వ‌చ్చింది. 
వ‌స్తూనే ఆనంద‌రావు ప‌రిస్థితి అర్థ‌మైంది. గ‌బ‌గ‌బా బ‌య‌ట‌కి ప‌రిగెత్తింది. ఆ పై స్ట్రెచ‌ర్ తీసుకొచ్చారు. ఐసీయూలోకి చేర్చారు. 
‘అయిపోయింది... ‘ అనుకున్నాడు ఆనంద‌రావు. ర‌క్తంతో ఆక్సిజ‌న్ త‌గ్గిపోయిన‌ట్టుంది. పైగా ఎప్పుడూ ఎర‌గ‌ని ఆయాసం. స‌హ‌జంగా తీసుకునే ఊపిరికి కూడా ఆప‌సోపాలు ప‌డాల్సి వ‌స్తోంది. బ‌హుశా... ఇవే త‌న ఆఖ‌రి క్ష‌ణాలేమో. 
ఆనంద‌రావుకి జాన‌కి గుర్తొచ్చింది. క‌ళ్ల కొలుకుల నుంచి తెలియ‌కుండానే నీళ్లు జారాయి. 
త‌న క‌ళ్లలోంచి నీళ్లా? ఆశ్చ‌ర్య‌పోయాడు ఆనంద‌రావు. ఎప్పుడూ అంద‌రినీ ఏడిపించి ఆనందించే ఆనంద‌రావుకిది కొత్త అనుభ‌వ‌మే. 
ఇంట్లో ఆనంద‌రావు భోగమే భోగం. అత‌డి పైశాచిక ఆనందానికి ఓ ఔట్‌లెట్ అత‌డి భార్యే. ఇత‌రుల‌ని బాధ‌పెట్టి అదే విజ‌య‌మ‌నుకునే ఆనంద‌రావు జీవితంలో స‌గానికి స‌గం విజ‌యాల‌కు చిరునామా ఆమె. 
పొద్దున్నే లేవ‌గానే అత‌డితో పాటే అత‌డి అహంకారం ఒళ్లు విరుచుకునేది. పొగ‌రు లేచి కూర్చునేది. శాడిజం గొంతు 
స‌వ‌రించుకుని హుంక‌రించేది. 
“ఏయ్‌... ఎక్క‌డ చ‌చ్చావ్‌?”  తో మొద‌లయ్యేది ఆనంద‌రావు వికృత ఆనంద కేళి.  ఏ గ‌రిట‌తోనే ప‌రిగెత్తుకు వ‌చ్చిన జాన‌కి 
క‌ళ్ల‌లో భ‌యం అత‌డి మొద‌టి విజ‌యం. ఆ విజ‌యం ఇచ్చిన కిక్కు రోజంతా కొన‌సాగేది. ఆపై అడుగ‌డుగునా విజ‌యాలే. అత‌డి భాష‌, ఆమె మ‌న‌సుపై చేసే గాయాల‌కి ఆమె క‌ళ్ల‌లో నిర్లిప్త‌తే మౌన సాక్షి. 
అలాంటి నిస్తేజ‌మైన ఆ క‌ళ్ల‌ల్లో త‌న‌కి క‌రోనా పాజిటివ్ అని తెలిసిన‌ప్పుడు క‌లిగిన బెంగ ఆనంద‌రావుకి గుర్తొచ్చింది. ఆమె 
క‌ళ్లల్లో స‌న్న‌టి క‌న్నీటి పొర అప్ప‌ట్లో త‌న‌కి న‌ట‌న‌గా అనిపించింది. 
“ఏడిశావ్‌లే. వెధ‌వ‌ది త‌ప్పుడు  రిపోర్ట్ ఏడిసిన‌ట్టుంది. మ‌రోసారి చేయిస్తా” అన్నాడు త‌ను. రెండోసారీ పాజిటివ్ రావ‌డ‌మే కాదు, రాత్రికి జ్వ‌రం, ఎడ‌తెగ‌ని ద‌గ్గు. అప్పుడు జాన‌కి ప‌డిన కంగారులో త‌న‌కి వెర్రిబాగులద‌న‌మే క‌నిపించింది. 
“ప్ర‌తిదానికి వెధ‌వ నెగిటివ్ ఆలోచ‌న‌లు. ఇప్పుడు నాకేమైంద‌ని?” అని తిట్టాడు. 
ఇప్ప‌డునిపిస్తోంది ఆనంద‌రావుకి. జాన‌కివా నెగిటివ్ ఆలోచ‌న‌లు? త‌న‌వే. 
“ఛీ... నేనే పెద్ద నెగిటివ్‌! నా ఆలోచ‌న‌లు నెగిటివ్‌. నా వ్య‌క్తిత్వం నెగిటివ్‌. నా మాట‌లు నెగిటివ్‌. నెగిటివ్‌నెస్ నా న‌ర‌న‌రానా 
ర‌క్తంతో బాటు ప్ర‌వ‌హిస్తోంది....”
ఆక్సిజ‌న్ మాస్క్‌, ఆసుప‌త్రి గొట్టాలు, మోనిట‌ర్లో ప‌రిగెడుతున్న‌ గీత‌లు, ఒంట్లోకి దిగుతున్న ఇంజ‌క్ష‌న్లు, చుట్టూ న‌ర్స్‌లూ, డాక్ట‌ర్లూ ఉన్నా…ఆనంద‌రావు ఆలోచ‌న‌లు ఎడ‌తెగ‌క కుండా సాగుతున్నాయి. 
“అస‌లు ప్ర‌పంచంలో నా అంత నెగిటివ్ మ‌నిషంటూ ఎవ‌రూ ఉండ‌రేమో. ప్రపంచంలోని వారంద‌రూ పాజిటివ్‌. నేనొక్క‌డినే నెగిటివ్” …
ఆనంద‌రావుకి మొద‌టి సారిగా ఏడుపొస్తోంది.  
ఆయాస‌ప‌డుతూ, ఎప్పుడూ లేనంత నీర్సంగా ఉండేస‌రికి ఆనంద‌రావుకి అర్థ‌మైపోతోంది, ఇవే త‌న ఆఖ‌రి రోజుల‌ని.
“భ‌గ‌వాన్‌! న‌న్ను బ‌త‌క‌నీ. నా భార్య‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పుకోవాలి. నా స‌హోద్యోగుల‌కు సారీ చెప్పాలి. నేను బాధ పెట్టిన వారంద‌రినీ నేను సంతోష‌ప‌రిచే అవ‌కాశం ఒక్క‌టి ఇవ్వు. ప్లీజ్‌...”
ఎన్న‌డూ లేని కొత్త ఆలోచ‌న‌లు క‌లుగుతుంటే మ‌గ‌త‌లోకి జారిపోయాడు ఆనంద‌రావు. ఆనంద‌రావు ప‌రిస్థితి అత్యంత 
విష‌మం అనే విష‌యం విన్న జాన‌కి వెక్కి వెక్కి ఏడ్చింది. పూజ గ‌దిలోకి వెళ్లి నిశ్శ‌బ్దంగా కూర్చుంది. 
“దేవుడా! ఆయ‌న పాపం... అమాయ‌కుడు. మ‌న‌సులో భావాల‌ను దాచుకోలేని చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం. ఆయ‌న్ని 
క్ష‌మించు”  అంటూ ప్రార్థించింది.
ఎవ‌రి ప్రార్థ‌న ఫ‌లించిందో తెలీదు కానీ, ఆనంద‌రావు కోలుకున్నాడు. ఆసుప‌త్రిలో కొన్నాళ్లు ఉన్నాక డాక్ట‌ర్ వ‌చ్చి చెప్పాడు.
“కంగ్రాట్యులేష‌న్స్ ఆనంద‌రావుగారూ! మీకు నెగిటివ్ వ‌చ్చింది. మీరిక ఇంటికి వెళ్లొచ్చు”
ఆనంద‌రావు ఇంటికి వ‌చ్చాడు. భార్య క‌ళ‌క‌ళ‌లాడుతూ న‌వ్వుతూ ఎదురొచ్చింది. ఆపై క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకుని స‌ప‌ర్య‌లు చేసింది. ఆనంద‌రావుకి ఆమె క‌ళ్ల‌ల్లో ఇప్పుడు న‌ట‌న క‌నిపించ‌డం లేదు. ప్రేమ క‌నిపించింది. ఆఫీస్ స్టాఫ్ చూడ్డానికి 
వ‌చ్చారు. అంద‌రితో స‌ర‌దాగా మాట్లాడాడు ఆనంద‌రావు. ఆప్యాయంగా ప‌ల‌క‌రించాడు. హాయిగా న‌వ్వాడు.
స్టాఫ్ తిరిగి వెళుతుంటే దారిలో రాకేష్ అన్నాడు... “బాస్ నెగిటివ్ అయిన‌ప్పుడు ఆయ‌నకి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. 
క‌రోనా నెగిటివ్ వ‌చ్చేస‌రికి బాస్ నిజంగా పాజిటివ్ అయిపోయాడు”...
అంద‌రూ న‌వ్వుకున్నారు.
*****
నెల‌ రోజుల త‌ర్వాత‌...
ఆనంద‌రావు పొద్దున్నే లేచాడు. అత‌డి గొంతు ఖంగుమంది... “ఏయ్‌! ఎక్క‌డ చ‌చ్చావ్‌!”...
 ఇప్పుడు క‌రోనాతో పాటు ఆనంద‌రావు కూడా నెగిటివే. 
క‌రోనా వ‌స్తే మ‌నుషులు మారిపోతే ఇక క‌థేం ఉంటుంది? అందుకే క‌రోనా కంచికి! కథ మొద‌టికి!!

PUBLISHED IN VISALAKSHI DEEPAVALI SANCHIKA AS A PRIZED STORY IN NOV'21