బుధవారం, ఫిబ్రవరి 22, 2017

రాజకీయ మహేంద్రజాలం


‘మన ఇంద్రజాలికులకు గొప్ప శుభసమయమిది. ఇంద్రజాలం అనే కళలో మనమెంత ఆరితేరిపోయామో తలచుకుని మురిసిపోయే సందర్భం’ అంటూ వేదిక మీద నుంచి మహేంద్రజిత్‌ ఉపన్యాసం ఇవ్వగానే హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో మహేంద్రజిత్‌ మరింత ఉత్సాహంగా మాట్లాడసాగాడు. ‘ఇంద్రజాలం అనేది ప్రాచీన భారతీయ కళ. మనం మాత్రమే చేయగలిగే గొప్ప మ్యాజిక్‌లను చాలామంది చేయలేరనడంలో అతిశయోక్తి లేదు...’ అన్నాడు కొంచెం గర్వంగా!
‘అలా ఎందుకనుకోవాలి?’ అనే గొంతు సభలోంచి వినిపించింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. సామాన్య దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి సభలో లేచి నిలబడి ఉన్నాడు.
మహేంద్రజిత్‌కు కోపంగా ‘ఎవరు మీరు, ఏమిటి మీ అభ్యంతరం?’ అన్నాడు.
‘నేనొక మామూలు భారతీయుణ్ని. మీరు చేయగలిగే మాయలను మరెవరూ చేయలేరని గప్పాలు కొట్టుకుంటుంటే ఉండలేకపోయా’ అన్నాడు భారతీయుడు నిబ్బరంగా.
‘అంటే మాకంటే గొప్ప ఇంద్రజాలికులు ఉన్నారంటారా?’ అన్నాడు మహేంద్రజిత్‌.
‘ఉన్నారు...’
‘ఎవరు వారు?’
‘రాజకీయ నాయకులు’
సభంతా గొల్లుమంది.
‘నేనేమీ మీ సభకు అడ్డు తగలడంలేదు. మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పడానికే లేచాను. కావాలంటే మీరు చేసే ఏ మ్యాజిక్‌నైనా మా నాయకులు చేస్తారని నిరూపించగలను...’
సభలో కలకలం మొదలైంది. చాలామంది అతడేం చెబుతాడో వినాల్సిందేనని పట్టుబట్టారు.
చేసేది లేక మహేంద్రజిత్‌ ఆ వ్యక్తిని వేదికపైకి ఆహ్వానించాడు. వెంటనే మ్యాజిక్‌ ప్రదర్శన మొదలైంది. మహేంద్రజిత్‌ ఓ పెద్దతాడు తెప్పించి పైకి విసిరాడు. ఆశ్చర్యం... అది నిటారుగా కర్రలా నిలబడిపోయింది. దాన్ని పట్టుకుని మహేంద్రజిత్‌ పైకి ఎక్కి దిగాడు. హాలంతా కేరింతలు!
‘ఇది గ్రేట్‌ ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ తెలుసా?’ అన్నాడు మహేంద్రజిత్‌ గొప్పగా.
భారతీయుడు నవ్వి, ‘మా రాజకీయ నాయకులకు సాధ్యం కానిదేదీ ఉండదు. ఎలాంటి అర్హతలూ లేకపోయినా వారసత్వమనే తాడును పట్టుకుని ఎగబాకగలరు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా, కేవలం అత్తింటివారి పేరు చెప్పుకొని అధికారాన్ని తాడులా నిలబెట్టి పైకెక్కి కూర్చుని అందరినీ తైతక్కలాడించిన ఓ నాయకురాలి విన్యాసాల ముందు మీరు చేసిన మాయాజాలం నాకేమీ ‘కిక్‌’ ఇవ్వడం లేదు. ఇప్పుడామె తనకు బదులుగా తన కుమారుణ్ని పైకెక్కించడానికి తాడు పేనుతోంది. కేవలం పనిమనిషిగా మరో నాయకురాలి చెంత చేరి, కోట్లకు పడగెత్తి, ఓ రాష్ట్రాన్నే శాసించడానికి రంగం సిద్ధం చేసుకున్న మరో నేతమ్మని ఈమధ్యనే చూశాం’ అన్నాడు.
మహేంద్రజిత్‌ మొహం జేవురించింది. మరో మ్యాజిక్‌ మొదలుపెట్టాడు.
‘ఇదిగో... ఇక్కడున్న ఈ పెద్దకారు నీకు కనిపిస్తోందా? దాన్ని మీరు చూస్తుండగానే మాయం చేసేస్తా’ అంటూ చేతులూపేసరికి అది కాస్తా మాయమైపోయింది.
భారతీయుడు ఓ నవ్వు నవ్వాడు. ‘మాలో కొందరు రాజకీయ నాయకులు లేనివి కూడా ఉన్నట్లు చూపించగలరు. వంతెనలు, రోడ్లు, కల్వర్టులు, ఆనకట్టలు కూడా లేకుండానే కట్టినట్టు భ్రమ కలిగిస్తారు. వాటికి బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని కోట్లకు కోట్లు మాయం చేయగలరు. అలాంటిది మీరు ఓ చిన్నకారును మాయం చేసి గొప్పలు పోతున్నారు...’
సభంతా నవ్వులు మిన్నంటాయి. ఈసారి మహేంద్రజిత్‌ ఓ పేకముక్క తీసుకుని దాని నుంచి వందలాది పేకముక్కల్ని విరజిమ్మాడు.
భారతీయుడు నవ్వి, ‘ఇలాంటివాటిని మా వీధి నాయకులు సైతం అవలీలగా చేసేస్తారు. ఒకే పనిని కాగితం మీద చూపించి విడతలు విడతలుగా ప్రభుత్వ ధనాన్ని వసూలు చేసుకుంటారు. దాని ముందు ఇదెంత?’ అన్నాడు.
ఈసారి మహేంద్రజిత్‌ ఓ అమ్మాయిని పెట్టెలో పడుకోబెట్టి రంపంతో కోసేసి, మళ్ళీ బతికించినట్టు చూపించాడు.
‘ఓసోస్‌... చచ్చిపోయిన మనుషుల పేరిట పింఛన్లను అనుచరులకు అనుమతిగా మంజూరు చేయించే అవినీతి నేతల గురించి మీరు వినలేదనుకుంటా. బతికున్నవాళ్లను చచ్చినట్టు చూపి, వారి పేరిట ప్రభుత్వ లబ్ధి ఆరగించే ఉదంతాలు కోకొల్లలు. చనిపోయిన సైనికుల పేరిట ఇళ్లను మంజూరు చేస్తే, వాటిని దొడ్డిదారిన అందుకున్న మహానేతలు, అనుచరులు, అధికారుల గురించి పత్రికల్లో చదివాం. ఇప్పుడేమంటారు?’ అన్నాడు భారతీయుడు.
మహేంద్రజిత్‌ ఓ ఖాళీ బిందె చూపించి ‘వాటర్‌ ఆఫ్‌ ఇండియా’ అంటూ దాన్ని బోర్లించి నీళ్లు రప్పించాడు.
భారతీయుడు పగలబడి నవ్వాడు. ‘మా రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి నిధులు పారించిన మాయ ముందు ఇదెంత? అలా లక్ష కోట్లు ఆర్జించిన నాయకులను మా కళ్ల ముందే చూశాం. మా నేతలు రాజకీయ టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల అవినీతి విన్యాసాల ముందు మీవన్నీ చిన్న చిన్న ట్రిక్కుల కిందే లెక్క. ఏమంటారు?’ అన్నాడు.
సభలోని వారంతా లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టసాగారు.
మహేంద్రజిత్‌ ఓ దండను గాలిలో సృష్టించి, భారతీయుడి మెడలో వేసి సత్కరించాడు!
- ఎ.వి.ఎన్‌.హెచ్‌.ఎస్‌.శర్మ
PUBLISHED IN EENADU ON 22/2/2017