ఆదివారం, ఏప్రిల్ 25, 2021

జ‌య జ‌య హ‌నుమా! తెలుగు తేజ‌మా!!


 

అధికార బ‌రితెగింపు!

 


“ఓం నీచాయ న‌మః
నికృష్టాయ‌న‌మః
అసంద‌ర్భ ప్ర‌లాపాయ‌న‌మః
అక్ర‌మ కార్య‌క‌లాపాయ‌న‌మః
అన్యాయ స్వ‌రూపాయ‌న‌మః
అడ్డ‌గోలు వ్య‌వ‌హార నిర్వ‌హ‌ణ నైపుణ్యాయ‌న‌మః
అధికార దుర్వినియోగ ప్ర‌ముఖాయ‌న‌మః
నిత్యాహంకార స్వ‌రూపాయ‌న‌మః
నిర్ల‌జ్జాక‌ర ప్ర‌ణాళికా ప్ర‌వీణాయ‌న‌మః
దుష్ట చింత‌న నిమ‌గ్నాయ‌న‌మః
దుర్మార్గ యోచ‌నా దుర్నిరీక్ష్యాయ‌న‌మః....

-గురువుగారి గొంతు గంభీరంగా మార్మోగుతోంది. శిష్యుడు నిశ్శ‌బ్దంగా వ‌చ్చి కూర్చున్నాడు. గురువుగారు చేస్తున్న పూజేంటో అర్థంకాలేదు. పూజంతా అయ్యాక గురువుగారు లేచి శిష్యుడికి ప్ర‌సాదం ఇచ్చారు. శిష్యుడు దాన్ని క‌ళ్ల‌క‌ద్దుకుని నోట్లో వేసుకున్నాడు. గురువుగారొక పువ్వు ఇచ్చి సైగ చేస్తే దాన్ని విన‌యంగా చెవులో పెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా అడిగాడు.

“గురూగారూ! ఎప్పుడూ లేంది, ఈ పూజేంటండీ?”

“ఒరే... నువ్వా నా ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు నేర్చుకోడానికి వ‌స్తున్నావు. పాఠాలు చెప్ప‌గానే స‌రా? ప్రాక్టిక‌ల్ నాలెడ్జి ఉండ‌ద్దూ? అందుకే ఈ స‌రికొత్త అష్టోత్త‌రంతో మొద‌లెట్టాన్రా. అర్థమైందా?”

“అర్థ‌మైతే ఇంకా మీ ద‌గ్గ‌ర పాఠాల కోసం ఎందుకొస్తాను సార్‌? ఏ ఉప ఎన్నిక‌లోనో నిల‌బ‌డి నా ప్ర‌య‌త్న‌మేదో నేను చేద్దును క‌దా?”

“అఘోరించావ్ కానీ, ఉప ఎన్నికంటే అంత తేలికేంట్రా? దానికెంత మందీ మార్బ‌లం కావాలీ, ఎంత ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక ఉండాలీ, ఎంత తెంప‌రిత‌నం కావాలీ, ఎంత దుర్మార్గం తెలిసుండాలీ... ఇవ‌న్నీ నీకెక్క‌డ‌లే. ఆ స్థాయికి ఎద‌గాలంటే నీకెంతో కాలం ప‌డుతుందిరా కుర్‌‌స‌న్నాసీ...”

“అర్థ‌మైంది సార్‌... ఇంత‌కీ ఈ పూజ సంగ‌తేంటో చెప్పండి, స‌స్పెన్స్ భ‌రించ‌లేక‌పోతున్నా...”

“అక్క‌డికే వ‌స్తున్నారా... మొన్నామ‌ధ్య ఓ పూజారాయ‌న ఏమ‌న్నాడో గుర్తుందా? త‌న‌కు ఓ ప‌ద‌వి ప‌డేశాడు క‌దాని సీఎంని ఏకంగా విష్ణుమూర్తిలంగారితో పోల్చేయ‌లేదూ? దాన్ని బ‌ట్టి నీకేంటి అర్థమైందో చెప్పు చూద్దాం నీకెంత అవ‌గాహ‌న ఉందో తెలుస్తుంది...”

“గుర్తొచ్చింది సార్... చాలా ఆశ్చ‌ర్య‌మేసిందండి. అఖిలాండ ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడైన విష్ణువు ఎక్క‌డ‌? ఓ చిన్న ప‌ర‌గ‌ణాకి అధినేత అయిన ఈ రాజ‌కీయ నేతెక్క‌డ‌? పోలిక చెప్పడానికైనా కాస్త ఎన‌కా ముందూ చూసుకోవ‌ద్దండీ? మ‌న‌కేదో ల‌బ్ది జ‌రిగింది క‌దాని, ఏకంగా దేవుడితో పోల్చేయ‌డం ఏంట‌ని మా చెడ్డ చికాకేసిందండి... అంతేనాండి?”

“ఏడిశావ్‌. నువ్వు తెలుసుకోవాల్సింది అది కాదురా. ఆ పూజారాయ‌న పోలిక‌లో ప‌స సంగ‌తి ప‌క్క‌నెట్రా... అది ఆయ‌న భ‌క్తి భావం. ఆ భ‌క్తిలో త‌డిసిముద్ద‌యిపోయి, నీరుగారిపోయి, జ‌లుబులూ జ్వ‌రాలూ తెచ్చుకోనీ... మ‌న‌కేం అభ్యంత‌రం? నువ్విక్క‌డ కానుకోవ‌ల‌సింది అది కాదురా. ఆయ‌న మాట‌ల్లో ఉన్న పొగ‌డ్త‌ని. ఈ పొగ‌డ్త ఉంది చూశావూ? ఇది మాచెడ్డ కంత్రీదిరోయ్‌. పొగ‌డ్డం ఎలాగో తెలిస్తే చాలురా. నువ్వు రాజ‌కీయ సోపానాలు చ‌క‌చ‌కా ఎక్కేసిన‌ట్టే. ముందు అది గ్రహించు. ఆ పూజారాయ‌నకి ఓ మెట్టు పైకి ఆలోచించావ‌నుకో. ఏకంగా పూజ‌లు మొద‌లెట్టేయ‌వ‌చ్చు. మ‌రి పూజ‌లు చేయాలంటే అష్టోత్త‌రాలు అవీ కావాలి క‌దా? అందుక‌నే నీకు కాస్త శాంపిల్ చూపించాన‌న్న‌మాట‌. బుర్ర‌కెక్కిందా?”

“అమోఘం సార్‌. ఇప్ప‌టికి అర్థ‌మైంది. ఇహ చూస్కోండి. పొగ‌డ్డంలో పీహెచ్‌డీ చేసేవ‌ర‌కూ నిద్ర‌పోను. కానీ నాదొక సందేహం గురూగారూ. మీరు చ‌దివిన అష్టోత్త‌రం చూస్తే అది అర్చ‌నా, లేక అడ్డ‌మైన తిట్ల‌కీ అంద‌మైన రూప‌మా అనేది అర్థం కావ‌డం లేదు సార్‌. కాస్త ఈ మ‌ట్టి బుర్ర‌కి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌రూ? “

“చెబుతానురా బ‌డుద్దాయ్‌! అందుకేగా ఇవాళ పాఠం ఇలా మొద‌లు పెడ‌త‌? ఇందాకా రాగానే నువ్వు ఉప ఎన్నిక ఊసెత్తావా లేదా? ఎందుకూ, ఈ మ‌ధ్య‌న ఆ ఏడుకొండ‌ల‌వాడి స‌మ‌క్షంలో జ‌రిగిన ఉప ఎన్నిక హ‌డావుడి అదీ చూశావు కాబ‌ట్టే క‌దా? మ‌రి ఆ ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగింది? అధికారం చేతుల్లోఉంటే ఎంత నీచానికి బ‌రితెగించ‌వ‌చ్చో అర్థం కాలే? అడ్డ‌గోలుగా వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఆ ర్యాలీలేంటీ? ఎవరెవ‌ర్నో తీసుకొచ్చి అలా దొంగ ఓట్లు గుద్దించేయ‌డ‌మేంటీ? ప్ర‌జాస్వామ్యాన్ని ఎంత చ‌క్క‌గా న‌వ్వుల పాలు చేశారో గ‌మ‌నించావా? ‌పోలీసులు, ఉన్న‌తాధికారులు, పోలింగ్ సిబ్బందిని కూడా ఎంత దుర్మార్గంగా, అడ్డ‌గోలుగా వాడేసుకున్నారో అర్థం చేసుకున్నావా? నిజ‌మైన ఓట‌ర్ల ముందే దొంగ ఓట‌ర్లు ఓటేసేలా చేశారంటే ఎంత తెంప‌రిత‌నం ఉండాలో, ఎంత నీచానికి తెగ‌బ‌డాలో నేర్చుకున్నావా? ఇవ‌న్నీ నీలాంటి వాడికి నాణ్య‌మైన పాఠాలే క‌ద‌రా? నువ్వు కూడా అంత‌టి నీచ రాజ‌కీయ నేత‌గా ఎదగాలంటే ఇలాంటి పాఠాలు ఎన్ని పాటించాలిరా? మ‌రి అంత‌టి గొప్ప రాజ‌కీయ నాయ‌కుడికి మామూలు అష్టోత్త‌రాలు ఎలా స‌రిపోతాయిరా? అందుకే నిజాల్ని, పొడ‌గ్త‌ల్నీ క‌ల‌గ‌లిపి ఇలా వినూత్న‌మైన పూజా విధానం రూపొందించానురా. అలాంటి నీచ‌, నికృష్ట‌, నిర్ల‌జ్జాక‌ర‌, దుష్ట‌, దుర్మార్గ‌, దౌర్జ‌న్య, దారుణ, దురహంకార, అన్యాయ‌, అకృత్య, అడ్డ‌గోలు నేత‌కి ఇలాంటి అర్చ‌నలు ఎన్ని చేస్తే స‌రిపోతాయిరా? ఏమంటావ్‌?”

“ఏమంటాను గురూగారూ! ఒళ్లు గ‌గుర్పొడుస్తోందండి. క‌ళ్ల నుంచి ఆనంద‌భాష్పాలు రాలుతున్నాయి. మీరివాళ చెప్పిన పాఠం నాలాంటి వాడికి ఓ భ‌గ‌వ‌ద్గీత లాంటిది సార్‌. ఇక మీరు స్వ‌యానా ఆ గీతాకారుడి అప‌ర అవ‌తారం అంటే న‌మ్మండి...”

“ఆప‌రా గాడిదా! నేను చెప్పిన పాఠం నా మీదే ప్ర‌యోగిస్తావా? కోపం వ‌చ్చిందంటే ఆ అష్టోత్త‌రం నీమీదే చ‌దివేస్తా. ఏమ‌నుకున్నావో? ఒళ్లు జాగ్ర‌త్త పెట్టుకుని పోయిరా!”

“మ‌న్నించండి గురూగారూ! శాంతించండి! ఇక వ‌స్తా!”

                                                                                                                              -సృజ‌న

Published in Janasenanewsletter.com on 24.4.21




శనివారం, ఏప్రిల్ 17, 2021

పార్టీ పెట్టి చూడు!




‘న‌మ‌స్కారం గురూగారూ! బావున్నారా?’

‘వార్నీ నువ్వా? ఎంత‌కాల‌మైందిరా, చూసి... ఈమ‌ధ్య క‌న‌బ‌డ‌క‌పోతే, పార్టీ ఏదైనా పెట్టావేమో అనుకుంటున్నా...’
‘ప‌ల‌క‌రిస్తూనే పొల‌మారేలా చేసే వాక్చాతుర్యం సార్ మీది... ఎంత‌మాట‌... మీ ద‌గ్గ‌ర రాజ‌కీయాలు ఇంకా పూర్తిగా నేర్చుకోనేలేదు, అప్పుడే పార్టీ పెట్టేంత‌గా ఎలా ఎదిగిపోతాను గురూజీ, మీరే చెప్పండి...’

‘అంత‌లా ఉలిక్కి ప‌డిపోకురా... ఈమ‌ధ్య ఆడ‌ప‌డుచులు కూడా పార్టీలు పెట్టి అద‌ర‌గొట్టేస్తున్నారు క‌దా,  అందుక‌ని అలా అన్నా... చెల్లెమ్మ చ‌లాకీత‌నం పేప‌ర్ల‌లో చూసి, నువ్వు కూడా స్ఫూర్తి కానీ పొందావేమో అనుకున్నా... అయినా అన్నంత‌టివాడివి నువ్వు ఎందుకు పెట్ట‌లేవు చెప్పు పార్టీ?’

‘సార్‌... ఇలా ఎత్తి పొడిచి ఏడిపిస్తే పారిపోతాన్సార్‌... అయినా నాకు తెలియ‌క అడుగుతాను, పార్టీ పెట్ట‌డం అంత సులువాండీ?’
‘ఎందుకు సులువు కాదురా... చులాగ్గా పెట్టేయ‌చ్చు.  కానీ కూసింత ఎన‌కా ముందూ చూసుకోవాలి. రంగంలోకి దిగేముందు దాని పొడ‌వెంత‌, వెడ‌ల్పెంత‌, దాన్సిగ‌ద‌ర‌గ లోతెంత అని లెక్క‌లూ గ‌ట్రా వేసుకోవాలి, అంతే!’
‘ఆహా... మీ మాట‌లు వింటుంటే ఉత్సాహం త‌న్నుకొచ్చేస్తోందండి, ఇప్ప‌టికిప్ప‌డు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి పార్టీ పెట్టేయాల‌ని ఉందండి... కానైతే తొలి స‌భ‌లో మీరే న‌న్ను జాతికి ప‌రిచ‌యం చేయాలండి, స‌రేనా?’
‘అద్గ‌దీ సంగ‌తి... ఇప్ప‌టికి పైకి తేలావురా. నీ ఎద‌వాలోచ‌న నీచేత క‌క్కిద్దామ‌నే అలా మాట్లాడా... అయితే నీ మ‌న‌సు లోతుల్లో అంత‌లేసి ఆశ‌లు ఉన్నాయ‌న్నమాట‌. అంతేనా?’
‘అంతేనా అని సూటిగా అడిగేస్తే చెప్ప‌క త‌ప్ప‌దండి మ‌రి. మీ ద‌గ్గ‌ర అబ‌ద్ద‌మాడలేను. మొన్న చెల్లెమ్మ హడావుడీ అదీ చూశాక అనిపించిన మాట వాస్త‌వ‌మేనండి. ఇది ప్ర‌జాస్వామ్యం  క‌దా, ఎవ‌రైనా పార్టీ పెట్ట‌చ్చని, లోప‌ల ఓ గొలిగేస్తోందండి. నిజం చెప్పాలంటే, అందుకే మీ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చానండి... ఇన్నాళ్లుగా మీ ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు నేర్చుకుంటున్నాను క‌దా, ఆమాత్రం ప‌నికిరానంటారా?’
‘మొత్తానికి లైన్లోకి వ‌చ్చావురా శిష్యా! ముందుగా నేను కొన్ని కొశ్చ‌న్లు అడుగుతాను. ఆటికి నీ జ‌వాబుల్ని బ‌ట్టి, నువ్వు నేటి రాజ‌కీయాల‌కి ప‌నికొస్తావో లేదో తేల్చుకోవ‌చ్చు. ఏమంటావ్‌?’
‘అడగండి సార్‌... భ‌లే హుషారుగా ఉంది...’
‘నువ్వు పార్టీ ఎందుకు పెడ‌దామ‌నుకుంటున్నావ్‌?’
‘ప్ర‌జాసేవ చేద్దామ‌నండి…’
‘ఎలా చేస్తావ్‌?’
‘ఏముందండీ, చిన్న‌ప్పుడు మ‌హాత్మాగాంధీ, టంగుటూరి ప్ర‌కాశం, లాల్ బ‌హ‌దూర్ జీవితాల గురించి పాఠాలు నేర్చుకున్నాం క‌దండీ, అవ‌న్నీ త‌ల్చుకుని తాడిత‌, పీడిత‌, సామాన్య‌, బ‌డుగు, నిరుపేద, అభాగ్య జ‌నుల జీవితాల్లో వెలుగు నింప‌డానికి ప్ర‌య‌త్నిస్తానండి...’
‘ఆప‌రా శిష్యా ఆపు. నువ్వోప‌ని చెయ్‌. నీ సందు మొగ‌లో ఓ కిళ్లీ కొట్టో, కిరాణా కొట్టో పెట్టుకో. దాని ప్రారంభోత్స‌వానికి నేనొచ్చి రిబ్బ‌న్ క‌ట్ చేసి చ‌క్కా పోతా...’
‘అయ్‌బాబోయ్‌!అదేంటండీ, అంత‌మాట‌నేశారు?’
‘అంతేరా... నువ్వు ప‌ప్పులు, ఉప్పులు అమ్ముకోడానికి త‌ప్ప ఎందుకూ కొర‌గావ‌ని అర్థ‌మైపోయింది.. నేటి రాజ‌కీయాల‌కి నువ్వు ప‌నికిరావ‌ని తేలిపోయింది...’
‘ఎందుక‌నండీ?’
‘కాక‌పోతే ఏంట్రా? ఓ ప‌క్క చెల్లెమ్మ‌ను చూసి బ‌రిలోకి దూకుతానంటావ్‌? మ‌రో ప‌క్క స‌త్తెకాల‌పు ఆద‌ర్శాలు వ‌ల్లిస్తావ్‌? ఈ రెంటికీ మ‌ద్దెన పొంత‌న ఎలా కుదురుతుందిరా? గురువు ద‌గ్గ‌ర కూడా అబ‌ద్దాలాడావ‌నుకో, గురివింద పూస‌కి కూడా కొర‌గాకుండా పోతావ్‌. ఇప్పుడు నీ మ‌న‌సులో అస‌లు ఉద్దేశం ఉన్న‌దున్నట్టు సెప్పు. పార్టీ ఎందుకు పెట్టాల‌నుకుంటున్నావ్‌?’
‘క్ష‌మించండి గురూగారూ! మీ ద‌గ్గ‌ర కూడా రాజ‌కీయం ఉప‌యోగించాను. నిజానికి పార్టీ పెట్టి, ఒకేల కాలం గ‌ట్రా క‌లిసొచ్చేసి అధికారంలోకి వ‌స్తే ఏదో ఓ యాభై త‌రాల వ‌ర‌కు స‌రిప‌డినంత సంపాదించుకుని ఏ సిట్జ‌ర్లాండో చెక్కేసి శేష‌జీవితం గ‌డిపేద్దామ‌నండి. ఆవ‌లిస్తే పేగులు లెక్కెట్టే త‌మ‌రి కాడ దొంగ క‌బుర్లు చెప్పాను. కోప‌గించ‌కండి...’
‘అదీ... అలా రా దారికి! ఇప్పుడు ఆ చెల్లెమ్మ‌ను చూసి పార్టీ పెడ‌తాన‌ని సెప్పు... కాస్త ప‌ద్ధ‌తిగా ఉంట‌ది. అయినా నీకు, ఆ చెల్లెమ్మ‌కీ సాపెత్త‌మెక్క‌డిదిరా? న‌క్క‌కీ నాక‌లోకానికీ ఉన్నంత తేడా ఉంది...’
‘అదేంటండీ... అలాగ‌నేశారు? ఆడ‌కూతురు పెట్ట‌గాలేంది, వెధ‌వ మ‌గ‌పుట‌క పుట్టి ఆమాత్రం పార్టీ పెట్ట‌లేనంటారా?’
‘ఒరేయ్‌... ఆత్ర‌గాడికి బుద్ధి మ‌ట్టం అని ఊరికే అన్నారా? ఓ ఎగేసుకునొచ్చేయ‌డ‌మే కానీ, కాస్త ఎన‌కా ముందూ చూసుకోవ‌ద్దూ? ఇడ‌మ‌రిచి సెబుతా, సెవులొగ్గి ఇనుకో. ఆ చెల్ల‌మ్మ‌కి ఓ అన్న‌య్య ఉన్నాడు. ఆడో ప‌ర‌గ‌ణాని ఏలేత్త‌న్నాడు. అక్క‌డ జ‌గ‌న్‌నాట‌కాలాడేస్తా, అయిన వాళ్లంద‌రికీ సెజ్‌లు, పోర్టులు, భూములు, గ‌నులు, ర్యాంపులు, ఫ్యాక్ట‌రీలు గ‌ట్రా క‌ట్ట‌బెట్టేస్తూ, పైకి మాత్రం ప్ర‌జాసేవ‌ని అడ్డ‌మెట్టుకుని అడ్డ‌మైన ప‌న్లూ చేసేత్త‌న్నాడు. ఆ అన్నా సెల్లెల్లిద్ద‌రికీ ఓ నాన్న ఉండేవాడు. ఆయ‌న‌గారైతే ఏకంగా హోలాంధ్రాని హోల్సేలుగా ఏలేసినోడే! కావ‌స్తే కూసింత సెరిత్ర పాఠాలు స‌దువుకుని జ్ఞానం పెంచుకో. అప్ప‌ట్లో ఆయ‌న అధికారంతో క‌థాక‌ళి, కూచిపూడి లాంటి డ్యాన్సులాడేసి ఏకంగా... ఒక‌టా రెండా ల‌క్ష కోట్ల అవినీతికి పాల్ప‌డిన‌ట్టు దాఖ‌లాలున్నాయి. ఆ తండ్రిగారి హ‌యాంలో ఈ చెల్లెమ్మ అన్న‌లుంగారు డొల్ల కంపెనీల సాయంతో నొక్కేసిన ప్ర‌జాధ‌నం మీద బోలెడ‌న్ని కేసులు అవీ సాచ్చికంగా ఉన్నాయ్ మ‌రి. మ‌రా నొల్లేసిన సొమ్మంతా అధికారానికి సోపానాలుగా ఉప‌యోగ‌ప‌డుతున్న దాఖ‌లాలున్నాయి. పైకి విభేదాలు అవీ ఉన్న‌ట్టు క‌న‌బ‌డినా, ఈ చెల్లెమ్‌ాకి, ఆ అన్న‌య్య అండ‌దండ‌లు ఉండ‌వ‌ని కూడా గ‌బుక్కుమ‌ని అనుకోడానికి లేదు. ఇప్ప‌డు ఆస‌లు సంగ‌తేంటంటే అన్న‌య్య అక్క‌డేలితే, చెల్లెమ్మ ఇక్క‌డ పాగా వేద్దార‌ని సూత్తోంద‌ని ఊరంతా కోడై కూస్తోంది మ‌రి. ఆ కోడి కూత‌లు నీకు ఇన‌బ‌డ‌లేదు కామోసు. దానాదీనా సెప్పొచ్చేదేమంటే, ఈ చెల్లెమ్మ‌కి అటు క‌ట్ల క‌ట్ల కొద్దీ కాసుల ద‌న్ను, ఆ వైపు అధికారం ఊతం, ఇటేపు కుటుంబం నుంచి అండ‌దండ‌లు, మ‌రోవైపు అవ‌కాశం వ‌స్తే చ‌క్రం తిప్పేసే చొర‌వ‌, సాహ‌సం లాంటివి సానా ఉన్నాయిరా కుంకా! మ‌రిప్పుడు చెప్పు. నీ కాడ ఏముందీ? ఈడ్చి తంతే ఆశ‌, ఆవేశం త‌ప్ప ఏమున్నాయీ అంట‌?’
‘అయ్య‌బాబోయ్‌! ఇంత లెక్క ఉందా? బుద్దొచ్చింది గురూగారూ! ఇక పార్టీ మాట ఎత్తితే ఒట్టు! న‌న్ను మ‌న్నించండి...’
‘అదీ... అలా రా దారికి! వారం వారం వ‌చ్చి ముందు నా ద‌గ్గ‌ర నీచ రాజ‌కీయ పాఠాలు నేర్చుకో. అవి ఒంట‌బ‌ట్టాక అప్పుడాలోచిద్దాం నువ్వు పార్టీ పెట్ట‌డానికి ప‌నికొత్తావో, కిరాణా కొట్టు పెట్టుకోడాని ప‌నికొత్తావో! ప్ర‌స్తుతానికి పోయిరా!’
                                                                                                                              -సృజ‌న
published on 16.4.21 in Janasena website

మంగళవారం, ఏప్రిల్ 13, 2021

కిరాత‌కుడిపై వ‌రాల జ‌ల్లు

తెలియ‌కుండా చేసినా ఒక  మంచి ప‌ని ఎంత‌టి ఫ‌లితాన్ని ఇస్తుందో చెప్పే క‌థ‌...‌


 

జ‌యం కోసం రాముడు ఏం చేశాడు?‌


అవ‌తార పురుషుడికైనా అవాంత‌రాలు త‌ప్ప‌వు. మ‌రి అలాంటి అవాంత‌రం ఎదురైన‌ప్పుడు రాముడు  ఏం చేశాడో చెప్పే విశేషం!‌ 

 


అస‌లు ర‌హ‌స్యం

ఓ మంచి చంద‌మామ క‌థ‌

సోమవారం, ఏప్రిల్ 12, 2021

ఉందిలే మంచి కాలం... ముందుముందున‌!‌



"అంతా అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది... భ‌విష్య‌త్తు అంధ‌కార బంధురంగా ఉంది... మీరే త‌రుణోపాయం చూపించాలి సిద్ధాంతి గారూ... కొత్త ఉగాది రాబోతున్న వేళ గంపెడాశ‌తో మీ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చా. కాస్త గ్ర‌హ‌చారం చూసి ఉప‌చారం ఏదైనా చెప్పాలి..."

-ఆద‌రాబాద‌రా వ‌చ్చి చాప మీద కూల‌బ‌డ్డాడు సామాన్యుడు.
సిద్ధాంతిగారు సావ‌ధానంగా చూసి, పంచాంగం తెరిచి అడిగారు, "చెప్పు నాయ‌నా. నీ జాత‌క చ‌క్రం ఏదైనా ఉందా?"
"కాల‌చ‌క్రం ఇరుసుల్లో న‌లిగిపోతున్న వాడిని. క‌ష్టాల కాష్ఠంలో కాలిపోతున్న‌వాడిని. నాకు జాత‌క చ‌క్రం ఏముంటుంది స్వామీ..."
"పోనీ... నీ పేరైనా చెప్పు..."
"జ‌న సామాన్యుల‌లో ఒక‌డిని. సాధార‌ణ స‌గ‌టు జీవుడిని. నా పేరుతో ప‌నేముంది స్వామీ..."
"స‌రే నాయ‌నా... వ‌చ్చిన కాలాన్ని బ‌ట్టి, అడిగిన స‌మ‌యాన్ని బ‌ట్టి ఫ‌లితం చెబుతా. నీకేం కావాలి?"
"అస‌లు ఈ ఆంధ్ర‌ దేశంలో నాలాంటి సామాన్యుల గ‌తి ఎలా ఉంటుంది సారూ... ఇంత‌కాలం ఇలా వ‌ర్త‌మానం వంక‌ర‌టింక‌ర‌గా మారిపోడానికి కార‌ణం ఏమిటంటారు?"
సిద్ధాంతి గారు వేళ్ల‌ మీద గ‌ణ‌న చేశారు. కాగితం మీద గ‌ళ్లు గీశారు. వాటిని నిశితంగా ప‌రిశీలించారు. ఆన‌క నిట్టూర్చారు. ఆపై చెప్ప‌సాగారు...
"శ‌ని వ‌క్‌ మార్గంలో ఉచ్ఛ‌స్థానానికి చేరుకున్నాడు నాయ‌నా. రాహువు అత‌డికి అధికార‌మై తోడు ప‌డుతున్నాడు. కేతువు కేరింత‌లు కొడుతూ కులుకుతున్నాడు. అందుకే ఈ విప‌రిణామాలు. నీ స‌మ‌స్య ఏంటో చెబితే, శాస్త్ర‌ప‌రంగా వివ‌ర‌ణ ఇస్తూ, భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తా..."
"ఏముంది సామీ... రాష్ట్రంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అస్త‌వ్య‌స్త‌మై పోయాయి... ఆఖ‌రికి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా చెప్పుకునే ఆంధ్రులకు అది కూడా మిగిలేలా లేదు. దేశంలోనే ఆంధ్రులంటేనే చుల‌క‌న‌గా చెప్పుకునే ప‌రిస్థితులు అఘోరించాయి... మాకున్న ప‌రువు ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారే దారుణ వ్య‌వ‌హారాలు జ‌రుగుతున్నాయి సామీ... అందుకే ఏం చేయాలో తోచ‌క మీ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చా...''
సామాన్యుడు చెబుతున్న‌ది విని సిద్ధాంతిగారు నోరెళ్ల‌బెట్టారు. ఆపై పంచాంగాన్ని ప‌క్క‌న బెట్టి, "ఆశ్చ‌ర్యంగా ఉంది నాయ‌నా నువ్వు చెబుతున్న వివ‌రాలు వింటుంటే. రాష్ట్రం గ్ర‌హ‌చారం మొత్త‌మే భ్ర‌ష్టు ప‌ట్టిన‌ట్టుందే? కాస్త వివ‌రంగా చెప్పు నాయ‌నా. రాష్ట్రంలో న‌డుస్తున్న రాజకీయ పంచాగం విన్నాక అస‌లు పంచాంగం తెరుద్దాం. ఇంత‌కీ... మీ రాష్ట్ర అధినేత ఎవ‌రు నాయ‌నా?"
"ఏమ‌ని చెప్ప‌ను స్వామీ? ఆయ‌నో జ‌గ‌న్‌ నాట‌క సూత్ర‌ధారి. అధికారంలోకి రాగానే ఆయ‌న చెప్పిన మాట‌లు వింటే, ఆహా... ఇన్నాళ్ల‌కి ఓ ఆద‌ర్శ నాయ‌కుడు దొరికాడ‌ని తెగ సంబ‌ర ప‌డిపోయామండి అంద‌రం. తీరా చేత‌లు చూసేస‌రికి చెప్పేదొక‌టీ, చేసేదొక‌టీ అన్న‌ట్టుగా త‌యారైందండి ప‌రిస్థితి... "
సిద్ధాంతిగారికి సందేహం త‌లెత్తింది. సామాన్యుడి మాట‌ల‌కి మ‌ధ్య‌లోనే అడ్డొచ్చి, "నాయ‌నా ఇది ప్ర‌జాస్వామ్యం క‌దా? అధినేత అంత అడ్డగోలుగా ప్ర‌వ‌ర్తిస్తుంటే ఆపే వ్య‌వ‌స్థ‌లే లేక‌పోయాయా?"
"అయ్యో సిద్ధాంతిగారూ! మీకు గ్ర‌హాలు, వాటి స్థితిగ‌తులు త‌ప్ప , నేటి రాజకీయ గ్రహాల చిత్ర విచిత్ర విన్యాసాలు ప‌ట్టిన‌ట్టు లేదండి... ఆకాశంలో గ్ర‌హాల‌కు శాంతులు ఉంటాయోమో కానీ, మా రాష్ట్రానికి ప‌ట్టిన గ్ర‌హాల‌కు అశాంతులు త‌ప్ప మ‌రింకేమీ ఉండ‌వండి... ఉదాహ‌ర‌ణ‌కి న్యాయ వ్య‌వ‌స్థ ఉంది క‌దండీ... దానికి ప‌ట్టుగొమ్మ‌లైన హైకోర్టు, సుప్రీం కోర్టులు ఎన్నోసార్లు మొట్టికాయ‌లు వేశాయండి. ఎన్నో విష‌యాల‌ను త‌ప్పు ప‌ట్టాయండి. అబ్బే... అవ‌న్నీ దున్న‌పోతు మీద వ‌ర్షం కురిసిన‌ట్టే అయిందండి. పైగా ఆ తీర్పుల పైనా, న్యాయమూర్తుల పైనా కూడా ఫిర్యాదు చేసే తెంప‌రిత‌నం మా అడ్డ‌గోలు అధినేత‌కు ఉందండి మ‌రి. ఆ ఫిర్యాదు కూడా ప‌స‌లేనిద‌ని సుప్రీం కోర్టు కొట్టేసిందండి. ఇప్పుడు చెప్పండి... ఇది రాష్ట్రంలోని ప్ర‌జానీకానికి ఎంత అప్రతిష్ఠండీ... దేశంలో మేమంద‌రం చుల‌క‌నైపోయిన‌ట్టే క‌దండీ?" అంటూ సామాన్యుడు ఆవేశ‌ప‌డిపోయాడు.
"నిజ‌మే నాయ‌నా! నీ ఆవేద‌న‌లో అర్థం ఉంది. మ‌రి చ‌ట్టం, చ‌ట్టానికి ర‌క్ష‌కులు వాళ్లూ ఏం చేయ‌లేక‌పోతున్నారా?"
"అధికారం అడ్డ‌దిడ్డంగా క‌థాక‌ళి ఆడుతుంటే, చ‌ట్టం చుట్టం కాక ఏమౌతుందండీ? చ‌ట్టాన్ని కాపాడే పోలీసు అధికారులు, ర‌క్ష‌క భ‌ట వ్య‌వ‌స్థ కూడా నీరుగారి పోయాయండి. అధినేత‌లుంగారి పార్టీ నాయ‌కుల్లో అర్హ‌త లేని స్థాయి వాళ్లు కూడా పోలీసుల్ని అదిలించే ఘోర‌మైన ప‌రిస్థితులు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయండి. కింది స్థాయి పోలీసు అధికారులంద‌రూ, తమ ఉన్న‌తాధికారుల ఆదేశాల కంటే, స్థానిక నాయ‌కుల క‌నుస‌న్న‌ల్లో మెల‌గాల్సిన నికృష్ట ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయండి. అందుకే క‌దండి దిక్కు తోచ‌కుండా ఉంది?"
సిద్ధాంతి గారు ఆశ్చ‌ర్య‌పోయారు. త‌ర్వాత గొంతు పెగ‌ల్చుకుని, "నేనెన్నో దేశ‌, కాల, మాన ప‌రిస్థితులను లెక్క గ‌ట్టాను నాయ‌నా! కానీ నువ్వు చెబుతున్న లాంటి దుస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పోనీ... రాష్ట్రంలో నిత్య జీవ‌న స్థితిగతులైనా స‌జావుగా సాగుతున్నాయా?"
"అయిన‌దానికి అడ్డ‌విస్త‌రి లేదు కానీ, కానిదానికి కంచం ఎక్క‌డుంటుంది సామీ? నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకుని, దొరికిన దగ్గ‌ర అప్పు చేసి ఏదో కాస్త గూడు ఏర్పాటు చేసుకోవాల‌నే క‌దండీ, ప్ర‌తి వాడూ క‌ల‌లు క‌నేది? అలాంటిది ఇల్లు క‌ట్టుకుందామంటే ఇసుక‌, సిమెంటు కూడా స‌రిగా దొరికే ఆశ లేకుండా పోయిందండి. వాటి ధ‌ర‌లు పెరిగిపోవ‌డం సంగ‌త‌లా ఉంచండి, వాటి మీద గుత్తాధిప‌త్యాన్ని అధినేత‌లుంగారి అస్మ‌దీయుల‌కు అప్ప‌గించేస్తున్నారండి. అందుకు ప్ర‌తిగా ప్ర‌యోజ‌నాలు ముడుతున్నాయ‌నే విష‌యం నాలాంటి సామాన్యుల‌కు కూడా అర్థం అవుతోందండి. అంతేకాదండి సెజ్‌లు, పోర్టులులాంటి జాతి సంప‌దల్ని కూడా ధారాద‌త్తం చేసేస్తున్నారండి. మొత్తానికి ఇప్పుడు క‌రెన్సీ క‌ట్టలే రాజ్య‌మేలుతున్నాయంటే న‌మ్మండి. అదేమ‌ని ఎవ‌డైనా నోరెత్తితే వాడి మీద లేనిపోని కేసులు బ‌నాయించే గూండా రాజ‌కీయం పెచ్చుపెరిగి పోయిందండి. ఏ అధికారైనా న‌చ్చ‌క‌పోతే వాడిని త‌ప్పించ‌డానికి తొక్క‌ని అడ్డ‌దారి లేదంటే న‌మ్మండి. స్వ‌తంత్ర సంస్థ అయిన ఎన్నిక‌ల క‌మీష‌న్‌కే త‌ప్ప‌లేదండి త‌ల‌నొప్పులు. ఇలా చెప్పుకుంటూ పోతే, అంతూ ద‌రీ క‌నిపించ‌డం లేదండి, మా రాష్ట్ర నీచ‌, నికృష్ట, నిస్సిగ్గు, నిర్ల‌జ్జాక‌ర రాజ‌కీయాల గురించి ఏక‌రువు పెట్ట‌డానికి! అంచేత మీ పంచాంగం ప్ర‌కారం రాబోయే కాలంలో మా గ్ర‌హ‌చారం ఎలా ఉంటుందో చెబుతార‌ని వ‌చ్చానండి..."
సిద్ధాంతి గారు నిట్టూర్చి పంచాంగం తెరిచారు. ఏవేవో లెక్క‌లు వేశారు. ఆన‌క చెప్పారు.
"త‌ప్ప‌దు నాయ‌నా! కొన్నాళ్లు ఈ గ్ర‌హ‌చారం కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ర‌సాధిప‌తి శ‌ని. అందువ‌ల్ల అధికారంలో ఉన్న‌వారికి కొంత‌కాలం అడ్డూ ఆపూ ఉండ‌దు. ఇక నీర‌సాధిప‌తి గురుడు. కాబ‌ట్టి ప్ర‌జ‌ల‌కు నీర‌సం త‌ప్ప‌దు. పైగా పాప గ్ర‌హాలు ఉచ్ఛ‌స్థితిలో ఉన్నాయి. శుభ గ్ర‌హాలు నీచ‌ప‌డ్డాయి. అందుకే ఇలాంటి అస్త‌వ్య‌స్త ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అయితే కాలం ఎల్లకాల‌మూ ఇలా ఉండ‌దు నాయ‌నా. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం పెల్లుబుకుతుంది. జ‌నం సైనికులై పిడికిలి బిగిస్తారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్ర‌చండ ప‌వ‌నాలై క‌ళ్యాణం జ‌రుగుతుంది నాయ‌నా! అప్పుడు అన్నీ మంచి రోజులే".
సామాన్యుడు సంబ‌ర‌ప‌డిపోయాడు. ఉగాది సంద‌ర్భంగా కొత్త యుగాది కోసం క‌ల‌లు కంటూ ఇంటి దారి ప‌ట్టాడు.
                                                                                                                              -సృజ‌న

PUBLISHED IN JANASENA WEBSITE ON 9.4.21