మంగళవారం, జూన్ 23, 2020

ఆ క‌ష్టం... ప‌డాల్సిందే!


బాబుకి స్నానం చేయించింది అమ్మ‌. మెత్త‌ని తువ్వాలుతో సుతారంగా తుడిచింది. మురిపెంగా చూస్తూ పౌడ‌ర్ పూసింది. చ‌క్క‌గా విస్త్రీ చేయించిన‌ చొక్కా తొడిగింది. ఆస‌రికి బాబుకి అర్థం అయింది. 
"తా... తా..." అన్నాడు. 
అమ్మ హాయిగా న‌వ్వేసింది. 
"అరె... బుజ్జిక‌న్న‌కి తెలిసి పోయిందీ... మ‌నం టాటా వెళుతున్నామ‌నీ..." అంటూ ముద్దుపెట్టుకుంది. 
బాబు కేరింత‌లు కొట్టాడు. ఇంత‌లో ఇంటి ముందు స్కూట‌ర్ ఆగింది. 
"నా...న‌..." అన్నాడు బాబు ఉత్సాహంగా ఊగుతూ.
బ‌య‌ట‌కు చూసిన అమ్మ‌, అప్పుడే లోప‌లికి వ‌స్తున్న నాన్న‌కి ఎదురెళ్లింది.
"మీ స్కూట‌ర్ చ‌ప్పుడు విన‌గానే వీడు గుర్తు ప‌ట్టేశాడండోయ్‌! నాన్న అంటున్నాడు" అంటూ న‌వ్వుతూ అంది. 
నాన్న హెల్మెట్ తీసి ప‌క్క‌న పెడుతూ, "అవునాలాలే... క‌న్న‌... నేనొత్తేతాన‌ని తెల్సి పోయిందాలే" అంటూ బాబును తీసుకుని బుగ్గ‌మీద ముక్కు రాశాడు.
బాబు వెన్నెల‌లా న‌వ్వుతూ నాన్న భుజం మీద వాలిపోయాడు.
"ప‌ద‌.. వెళ్దాం. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైపోయింది" అన్నాడు నాన్న‌.
అమ్మ ఓ చిన్న బుట్ట పట్టుకుని బ‌య‌ట‌కు అడుగుపెడుతూ, "పాపం... వీడి సంబ‌రం చూస్తుంటే జాలేస్తుంది. అక్క‌డ మాత్రం మీరే ఎత్తుకోవాలి. నాకు ఏడుపు వ‌చ్చేస్తుంది" అంది.
"స‌ర్లే... ప‌ద‌... త‌ప్ప‌దుగా మ‌రి? " అన్నాడు నాన్న‌.
స్కూట‌ర్ స్టార్ట్ చేశాడు నాన్న‌. అమ్మ ఒడిలో హాయిగా కూర్చుని విప్పారిన క‌ళ్ళ‌తో అన్నీ చూస్తున్నాడు బాబు. స్కూట‌ర్ వెళుతుంటే రివ్వుమని త‌గులుతున్న చ‌ల్ల‌ని గాలికి కేరింత‌లు కొడుతున్నాడు. అమ్మ వెచ్చ‌ని ఒడిలో, భ‌ద్ర‌మైన చేతుల మ‌ధ్య ఒద్దిక‌గా ఒదిగి పోయి, క‌ళ్ల ముందు క‌దిలిపోతున్న లోకాన్ని వింత‌గా చూస్తున్నాడు. ఏదో తెలియ‌ని ఆనందంతో ఉత్సాహ‌ప‌డుతున్నాడు. 
స్కూట‌ర్ ఆగింది. అమ్మ బాబును జాగ్ర‌త్త‌గా పొదివి ప‌ట్టుకుని దిగింది. అమ్మ భుజం మీద త‌ల‌పెట్టి చూస్తున్నాడు బాబు. 
లోప‌లికి వెళ్లి అమ్మ కూర్చునేస‌రికి నాన్న వ‌చ్చి, జేబులోంచి చాక్లెట్ తీసి బాబు నోట్లో పెట్టాడు. తీయ‌గా, హాయిగా చ‌ప్ప‌రిస్తూ ఆడుతున్నాడు బాబు. 
కాసేపటికి న‌ర్స్ వ‌చ్చి, "రండ‌మ్మా..." అంది.
అమ్మ చేతుల్లోంచి నాన్న భుజం మీద‌కి మారాడు బాబు. 
గ‌దిలోప‌లికి వెళ్లారు. 
"ఏమంటున్నాడు మీ వాడు?" అన్నాడు అక్క‌డున్న డాక్ట‌ర్‌. 
"ఇప్ప‌టికి దాకా హుషారుగానే ఉన్నాడు సార్‌. ఇప్పుడు చూడాలి..." అంటూ స‌న్న‌గా న‌వ్వాడు నాన్న‌. డాక్ట‌ర్ కూడా న‌వ్వేస్తూ స్టెత‌స్కోప్ బాబు గుండెల మీద పెట్టాడు. ఆ గొట్టాన్ని ప‌ట్టుకుని ఆడసాగాడు బాబు. ఆయ‌న అన్నీ ప‌రీక్షించి, "ఓకే... " అని, ఆ త‌ర్వాత న‌ర్స్‌ని పిలిచాడు. న‌ర్స్ వ‌చ్చింది. ఆమె చేతిలో ఇంజ‌క్ష‌న్‌! బాబుని భుజం మీద పెట్టుకుని త‌ల నొక్కి ప‌ట్టాడు నాన్న‌. అమ్మ ఆ ప‌క్క‌కి తిరిగిపోయింది. న‌ర్స్ బాబు లాగుని కొంచెం కిందికి లాగింది. దూదితో స్పిరిట్ రాసింది. చ‌ల్ల‌గా త‌గిలింది బాబుకి. ఆ వెంట‌నే... చురుక్కుమంటూ సూది దిగింది. ఆ బాధ ఒక్క‌సారిగా తెలిసేస‌రికి కెవ్వుమ‌న్నాడు బాబు. లేద్దామంటే న‌న్న చేయి బిగుసుకుంది. గ‌ట్టిగా త‌ల అదిమి పెట్టింది. 
బాబుకి ఏదో తెలియ‌ని బాధ‌. అంత‌కు మించి కోపం. ఏం చేయాలో తోచ‌క నాన్న మొహం మీద గుద్ద‌డం మొద‌లు పెట్టాడు. చిట్టి గోర్ల‌తో ర‌క్కేశాడు. ఇంతలో అమ్మ వ‌చ్చి బాబుని తీసుకుంది. అమ్మ చేతుల్లోనూ గింజుకున్నాడు. కాళ్ల‌తో త‌న్నాడు. చేతుల‌తో కొట్టాడు. "లేదు... నాన్నా... త‌గ్గిపోతుందిలే..." అంటూ బాబు కొడుతున్న‌కొద్దీ గుండెల‌కు హ‌త్తుకుంది అమ్మ‌. అమ్మ క‌ళ్ల‌లో క‌న్నీళ్లు. నాన్న క‌న్నుల్లో స‌న్న‌టి నీటి తెర‌. 
బాబుకి మాత్రం కోపం త‌గ్గ‌లేదు. టాటాకి బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ప్ప‌టి ఉత్సాహం ఇప్పుడు లేదు. పైగా ఎందుకో అమ్మా, నాన్న‌ల మీద  విప‌రీత‌మైన కోపం, ఉక్రోషం!!
******
మ‌న ప‌రిస్థితీ ఆ బాబులాంటిదే. మ‌న జీవితంలో కూడా ఉన్న‌ట్టుండి ఏదో తెలియ‌ని బాధ చ‌టుక్కున ఎదుర‌వుతుంది. ఉత్సాహంగా ఉన్న మ‌న‌కి చురుక్కుమ‌నిపిస్తుంది. అప్పుడు ఆ బాబులాగే మ‌నకి కూడా భ‌గ‌వంతుడి మీద కోపం వ‌స్తుంది. మ‌న న‌మ్మ‌కం అంతా ఒక్క‌సారిగా వీగిపోయిన‌ట్టు అనిపిస్తుంది. ఏదో మోసం జ‌రిగిపోయిన‌ట్టు బాధ‌ప‌డ‌తాం. కానీ ఆ అమ్మా నాన్న‌ల లాగే ఆ భ‌గ‌వంతుడు కూడా బాధ ప‌డ‌తాడు. బాబు ఆరోగ్యంగా పెర‌గాలంటే అలాంటి ఇంజెక్ష‌న్ అవ‌స‌ర‌మ‌ని అమ్మానాన్న‌ల‌కి తెలుసు. అందుకే ద‌గ్గ‌రుండి మ‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లి నెప్పి క‌లిగించారు. మ‌నం జీవితంలో మ‌రింత రాటుదేలాలంటే ఆ క‌ష్టం అనివార్య‌మ‌ని భ‌గ‌వంతుడికి తెలుసు. కానీ ఆ బాబులాగే... మ‌న‌కి మాత్రం ఆ క్ష‌ణంలో అర్థం కాదు. ఎందుకంటే మ‌నం కూడా ఆ బాబులాగే ఎదిగీఎద‌గ‌ని వాళ్లం!

గురువారం, జూన్ 18, 2020

దాన‌శీలి క‌ల‌!పూర్వం అవంతీ రాజ్యంలో, మ‌హారాజు ఆంత‌రంగిక సలహాదారు ప‌ద‌వికి ఖాళీ ఏర్ప‌డింది. అంత‌వ‌ర‌కు ఆ ప‌ద‌విలో ఉన్న జ‌యానందుడు వార్థ‌క్య భారానికి తోడు, అనారోగ్యానికి గురి కావ‌డంతో, ఆ స్థానానికి మ‌రొక‌రిని ఎంపిక చేయ‌వ‌ల‌సి వ‌చ్చింది. ఈ విషయం రాజు వీర‌వ‌ర్మ‌కొక  స‌మ‌స్య‌గా మారింది. కార‌ణం, ఎంతో సూక్ష్మ బుద్ధిగ‌ల జ‌యానందుడు, ఇంత‌వ‌ర‌కు ఆ ప‌ద‌విని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాడు. 
    ఒక‌నాడు రాజు ఈ విష‌యం గురించి త‌న మంత్రి సుబుద్ధితో ప్ర‌స్థావించ‌గా, ఆయ‌న, "మ‌హారాజా! ముందు దేశంలో రాజ‌నీతి, ఆర్థిక, న్యాయ శాస్త్రాల‌ను అభ్య‌సించిన వారినంద‌రినీ ఆహ్వానిద్దాం. వారికి శాస్త్ర విష‌య‌మై ప‌రీక్ష నిర్వ‌హించి, అందులో ప్ర‌తిభ చూపిన వారిని గుర్తిద్దాం. ఆ త‌ర్వాత జ‌యానందుడి స‌ల‌హాపై, వారిలో ఒక‌రిని త‌మ ఆంత‌రంగిక స‌ల‌హాదారుగా నియ‌మించ‌వ‌చ్చు" అని స‌ల‌హా ఇచ్చాడు. 
     రాజు ఇందుకు స‌మ్మ‌తించ‌గానే, మంత్రి వెంట‌నే దేశ‌మంత‌టా చాటింపు వేయించాడు.
   ఈ చాటింపు విని దేశం న‌లుమూల‌ల నుంచి అనేక‌మంది యువ‌కులు వ‌చ్చారు. వారందరికీ శాస్త్ర‌ప‌ర‌మైన ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, జ‌యుడు, విజ‌యుడు అనేవాళ్లు ప్ర‌థ‌ములుగా నిలిచారు. వాళ్లిద్ద‌రూ స‌మ ఉజ్జీలు కావ‌డంతో మంత్రి సుబుద్ధి, జ‌యానందుడిని కలుసుకుని సంగ‌తి వివ‌రించాడు.
    జ‌యానందుడు అంతా విని, "ఆంత‌రంగిక స‌ల‌హాదారుడ‌న్న‌వాడు శాస్త్రాల‌లో పండితుడైనంత మాత్రాన స‌రిపోదు. క్లిష్ట మైన స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు, వాటిని ప‌రిష్క‌రించ‌గ‌ల యుక్తి కూడా అత‌నికి కావాలి. శాస్త్ర‌ప‌రంగా ఉద్దండులైన ఆ యువ‌కులిద్ద‌రిలో ప‌ద‌వికి ఎవ‌రు అర్హులో ఈ ఆఖ‌రు ప‌రీక్ష నిర్ణ‌యిస్తుంది అని, ఏం చేయాలో మంత్రి సుబుద్ధికి వివ‌రించాడు.
   మ‌ర్నాడు మంత్రి జ‌యుణ్ణీ, విజ‌యుణ్ణీ పిలిపించి, కొద్దిసేపు వాళ్ల‌తో, ఆ మాటా, ఈమాటా మాట్లాడిన త‌ర్వాత ముఖం విచారంగా పెట్టి, "ఈమ‌ధ్య నా మిత్రుడొక‌డు చాలా విషాద ప‌రిణామానికి గురి అయ్యాడు. అది మీరిద్ద‌రూ విన‌ద‌గిన సంగ‌తి!" అన్నాడు. 
    త‌ర్వాత మంత్రి సుబుద్ది, త‌న మిత్రుడి గురించి చెప్పిన వివ‌ర‌రాలిలా ఉన్నాయి.

   మంత్రి సుబుద్ధి మిత్రుడైన దాన‌శీలి వ‌యోవృద్ధుడు; ఆయ‌న‌కు కొంత‌కాలంగా గుండె జ‌బ్బులాంటిది కూడా ఉన్న‌ది. ఒక‌నాటి రాత్రి దాన‌శీలికి ఒక భ‌యంక‌ర‌మైన క‌ల వ‌చ్చింది. ఆ క‌ల‌లో ఆయ‌న, ఒక కార‌డ‌విలో దారి త‌ప్పిపోయాడు. ఆయ‌న చెట్ల మ‌ధ్య ప‌డుతూ లేస్తూ అతి క‌ష్టం మీద ప్ర‌యాణం సాగించి, చివ‌ర‌కు ఒక మైదాన ప్ర‌దేశాన్ని చేరాడు. పైన న‌క్ష‌త్రాలు మిణుకు మిణుకుమంటున్న‌వి. ఆ గుడ్డి వెలుగులో ఆయ‌న‌కు నాలుగు దారులు గ‌ల, ఒక కూడ‌లి ప్ర‌దేశం క‌నిపించింది. ఆయ‌న ఆ దారుల‌లో ఒక‌దాని వెంట న‌డ‌వ‌సాగాడు. కొంత‌దూరం వెళ్లేస‌రికి, దారే క‌నిపించ‌నంత‌గా పొద‌లూ, చెట్ల గుబుళ్ల‌తో నిండిన ప్ర‌దేశం వ‌చ్చింది. అక్క‌డ కొన్ని సింహాలు తిరుగుతున్నవి. వాటిలో ఒక సింహం దాన‌శీలిని చూసి భ‌యంక‌రంగా గ‌ర్జిస్తూ‌, ఆయ‌న కేసి రాసాగింది. 
    దానశీలి ప్రాణ‌భ‌యంతో వెనుదిరిగి ప‌రిగెత్తి, కొంత సేప‌టికి కాలిదారుల కూడ‌లికి చేరాడు. సింహం జాడ‌లేదు. ఆయ‌న అల‌స‌ట తీర్చుకున్నాక‌, రెండో దారి వెంట న‌డ‌వ‌సాగాడు. కొంత‌దూరం వెళ్లాక ఆయ‌న‌కు పెద్ద వెలుగు క‌నిపించింది. దాన‌శీలి ఒక పొదచాటుకు చేరి, ఆ వెలుగు వ‌స్తున్న వైపు చూశాడు. ఆ ప్ర‌దేశంలో అనేక‌మైన పెద్ద పెద్ద పుట్ట‌లున్న‌వి. వాటిపై కాల‌స‌ర్పాలు ప‌డ‌గ‌లు విప్పి ఆడుతున్న‌వి. ఆ ప‌డ‌గ‌ల‌పై ఉన్న మ‌ణులు, కాంతులు విర‌జిమ్ముతూ ప్ర‌కాశిస్తున్న‌వి. 

   ఆశ్చ‌ర్యంతో, ఆ దృశ్యాన్ని చూస్తున్న దాన‌శీలిని, పుట్ట‌ల మ‌ధ్య ఆడుతున్న ఐదు త‌ల‌ల మ‌హాస‌ర్పం ఒక‌టి చూసి, బుస‌లు కొడుతూ అమిత‌వేగంతో ఆయ‌న‌కేసి రాసాగింది. ఆయ‌న గిరుక్కున వెనుదిరిగి, శ‌క్తికొల‌దీ ప‌రిగెత్తి, తిరిగి నాలుగు దారుల కూడ‌లిని చేరాడు. మ‌హాస‌ర్పం జాడ‌లేదు. 
    ఈసారి దాన‌శీలి మూడ‌వ దారిగుండా న‌డ‌వ‌సాగాడు. కొంత‌దూరం వెళ్లాక, ఆ దారి ఓ కొండ ద‌గ్గ‌ర ఆగిపోయింది. ఆ ప్ర‌దేశాన ఆయ‌న‌కు, కొన్ని మాన‌వ కంకాళాలు క‌నిపించాయి. కీడు శంకించిన దాన‌శీలి, వెనుదిరిగేలోప‌లే, దాపుల వున్న గుహలోంచి భ‌యంక‌రాకారుడైన రాక్ష‌సుడొక‌డు ముక్కు పుటాలు ఎగ‌ర‌వేస్తూ బ‌య‌ట‌కి వ‌చ్చాడు. వాణ్ణి చూస్తూనే దాన‌శీలి కెవ్వుమంటూ అరిచి, ప‌రిగెత్తి నాలుగు దారుల కూడ‌లిని చేరాడు.
    అయితే, రాక్ష‌సుడు పెద్ద‌గా హుంక‌రిస్తూ, త‌న‌కేసి రావ‌డం చూసిన వెంట‌నే అక్క‌డున్న నాలుగ‌వ దారి వెంట ప‌రిగెత్తాడు. ఆ దారి అత‌ణ్ణి కొండ అంచుకు చేర్చింది. దానికి దిగువ‌న పెద్ద అగాధ‌మున్న‌ది. వెనుక రాక్ష‌సుడు; ముందు అగాధం! ప్రాణాల మీద ఆశ కోల్పోయిన దాన‌శీలి నిలువెల్లా గ‌జ‌గ‌జ వ‌ణికిపోతూ అగాధంలోకి తొంగి చూసేంత‌లో, కాళ్ల కింద ఉన్న రాయి జారింది. ఆయ‌న కెవ్వుమ‌ని అరుస్తూ అగాధంలోకి ప‌డిపోయాడు.
    మంత్రి ఇలా చెప్పి, ఒక క్ష‌ణం ఆగి జ‌య‌, విజ‌యుల‌తో, "చూశారా, ఎంత భ‌యంక‌ర‌మైన క‌లో! అస‌లే గుండెజ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న‌, నా మిత్రుడు దాన‌శీలి, క‌ల నుంచి మెల‌కువ వ‌స్తూనే, గుండెపోటుకు గురి అయి మ‌ర‌ణించాడు" అన్నాడు.

    అప్పుడు జ‌యుడు ఎంతో విచారంగా, "స్వ‌ప్నంలో క‌లిగే అనుభూతుల‌కు శ‌రీరం కూడా లోన‌వుతుంద‌ని, మ‌న‌స్తత్వ శాస్త్రం చెబుతున్న‌ది. త‌మ మిత్రుడు క‌ల‌లో నాలుగుసార్లు ప్రాణ భ‌యానికి లోన‌య్యాడు. అస‌లే గుండెజ‌బ్బు మ‌నిషి క‌నుక‌, ఆ వ‌త్తిడికి త‌ట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది. మీ మిత్రుడి మ‌ర‌ణానికి, నా ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నాను" అన్నాడు.
    మంత్రి త‌ల‌పంకించి, విజ‌యుడికేసి చూశాడు.
   విజ‌యుడు చిరున‌వ్వు న‌వ్వుతూ "క్ష‌మించాలి, మ‌హామంత్రీ! మీరు చెప్పిన‌దంతా ఒక క‌ట్టుక‌థ‌అన్నాడు.
    మంత్రి కోపంగా, "అదెలా క‌ట్టుక‌థో నిరూపించ‌గ‌ల‌వా? "అన్నాడు. 
    దానికి విజ‌యుడు విన‌యంగా, "మీ మిత్రుడు మెల‌కువ వ‌స్తూనే, గుండెపోటుకు గురై వెంట‌నే చ‌నిపోయిన‌ప్పుడు, ఆయ‌న‌కు క‌ల వ‌చ్చిన విష‌యం మీకు తెలిసే అవ‌కాశం లేదు క‌దా!" అన్నాడు.
    మంత్రి సుబుద్ధి, విజ‌యుణ్ణి అభినందించి, అప్ప‌టిక‌ప్పుడే అత‌ణ్ని రాజు వీర‌వ‌ర్మ‌కు ఆంత‌రంగి స‌ల‌హాదారుగా నియ‌మించాడు. 
Published in "CHANDAMAMA" children's Magazine in April, 1992.