మంగళవారం, జనవరి 28, 2014

ఎన్నికల సరంజామా!



'గురూగారండీ... మరేం- ఎన్నికలొస్తున్నాయ్‌ కదండీ, బజార్లో సరంజామా కొనుక్కోవడానికి జాబితా రాసుకుని బయల్దేరానండి. ఇవి సరిపోతాయో లేదో కాస్త చెప్పరూ?' అంటూ ఓ పెద్ద సంచీ వూపుకొంటూ వచ్చాడు శిష్యుడు. 
గురూగారు వాడిని ఎగాదిగా చూసి, 'ముందు నీ జాబితా ఏంటో చెప్పు. దాన్నిబట్టి నీ బుద్ధేంటో, దాని లోతేంటో చెబుతా...' అన్నారు నిదానంగా.
'ఓ... మా ఆవిడను అడిగితే బోలెడు సరకులు చెప్పిందండి. మొదటగానేమో రెండు కిలోల మైదాపిండండి. ఆ తరవాత పురికొసలండి...' 
'మైదాపిండి, పురికొసలా? అవెందుకురా?'

'బలేవారే. మైదాపిండిని ఉడకబెట్టి పార్టీ జెండాల్ని పురికొసలకు అతికించడానికండి...'

'అబ్బో... మిగతా జాబితా కూడా చదివి ఏడు...'

'వెదురు బొంగులండి. ఎక్కడ పడితే అక్కడ పాతేసి జెండాలు కట్టడానికండి. ఆ తరవాతేమో పేడముద్దలండి...'

'పేడముద్దలా... అవెందుకు?'

'ఎదర పార్టీవాళ్ల జెండాల మీదకు విసరడానికండి. ఇంకానేమో వూరి చివర ఏట్లోంచి ఓ ట్యాంకుడు బురదండి. ప్రత్యర్థులపై బురద జల్లడానికండి. ఓ బస్తాడు బొగ్గులు, డజను చాటలండి. బొగ్గులు బాగా రాజేసి, ప్రతిపక్షంపై నిప్పులు చెరగడానికండి. అలాగే రెండు బస్తాల దుమ్ము, పారలండి. ఎగస్పార్టీ వాళ్లపై దుమ్మెత్తిపోయడానికండి. రెండు డ్రమ్ముల కిరసనాయిలు, నాలుగు డజన్ల అగ్గిపెట్టెలండి... ఉపన్యాసం ఇస్తూ వేరే పార్టీలపై మండిపడ్డానికి ఉంటాయని మా ఆవిడ చెప్పిందండి. అలాగే పోటీ నేతల మీద కారాలు, మిరియాలు నూరడానికి ఎండుమిర్చి, మిరియాలు, రోలు, పొత్రం ఇంకానేమో...'

ఆ సరికి గురువుగారికి కడుపులో తిప్పింది. 'ఆపరా బడుద్ధాయ్‌...' అంటూ ఒక్క అరుపు అరిచారు. 
శిష్యుడు డంగైపోయాడు.

'ఇన్నాళ్లూ నా దగ్గర రాజకీయాల్లో నేర్చుకున్నది ఇదేనట్రా బుద్ధి లేనోడా! ఎన్నికల సరంజామా గురించి భార్యల్ని అడుగుతార్రా ఎవరైనా? ముందా జాబితా చింపెయ్‌...'

శిష్యుడు వెంటనే చింపేసి, 'బుద్ధొచ్చిందండి. మరి ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో మీరే చెప్పండి గురూగారూ...' అన్నాడు.

గురువుగారు నిట్టూర్చి మొదలెట్టారు. 'ఓరి పిచ్చోడా... నేను చెప్పడం కాదురా. సమకాలీన రాజకీయాలను గమనించి నువ్వే తెలుసుకోవాలి. మొన్నటికి మొన్న మనదేశ యువరాజావారు ఎలాంటి ఉపన్యాసం దంచారో గుర్తు తెచ్చుకో. ఉదాహరణకు ఆయనేమన్నారు? మీ గిన్నెలో అన్నాన్నవుతా, ఆదుకునే అన్ననవుతా, నడిపించే సేనానవుతా, చేతిలో పుస్తకమవుతా... అనే ధోరణిలో రెచ్చిపోలేదూ? ఆ మాటల మతలబులు నేర్చుకోవాలి. తెలిసిందా?'

'ఓ... తెలిసిందండి. ఇంతకంటే బాగా చెబుతా వినండి. మీ టిఫిన్‌ తినే చెంచానవుతా. మీ ఇడ్లీలోకి చెట్నీనవుతా. మీ రోట్లో రోకలవుతా. మీ బకెట్లో చెంబునవుతా. మీ చొక్కాకు గుండీనవుతా. ఇలాగే కదండి...'

గురువుగారు పకపకా నవ్వారు. 'బాగా చెప్పావురా. ఆయన ఉపన్యాసం కంటే నీదే బాగుంది. ఆయన ఇంకా ఏమన్నారు? ప్రత్యర్థి పార్టీలు బట్టతలవాళ్లకు క్షవరం చేయించే బాపతని, మాటలు అమ్మేసే రకమని అన్నారు చూశావా? ఆ చాతుర్యం ఒంటపట్టించుకోవాలి...'

'చాలండి గురూగారూ! ఈ మాత్రం చెబితే రెచ్చిపోనూ. ఎగస్పార్టీవాళ్లు గుడ్డివాళ్లకు కళ్లజోళ్లు అమ్మే రకమని అనొచ్చండి. చెవిటివాళ్లకు రేడియోలు, మూగవాళ్లకు మైకులు, పొలాలు లేనివాళ్లకు నాగళ్లు, చొక్కాల్లేనోళ్లకు గుండీలు ఇస్తారని చెప్పేసేసి చాలా చెప్పొచ్చండి. అనడానికేముందండి... అయినా నాకు తెలియక అడుగుతానండీ, ఎగస్పార్టీవాళ్లు క్షవరం చేస్తారనడానికి ఇంకా ఏం మిగిల్చారండి వీళ్లు?'

'అబ్బో... అదరగొట్టావురా. నిజమే. మొత్తం క్షవరమంతా వాళ్లే చేశాక ఇంకేం మిగిలిందని? ఇక రాజమాత ఉపన్యాసం కూడా చదువుకో. అవినీతి మీద యుద్ధం చేయాలంటున్నారు. అసలు జరిగిన అవినీతంతా వాళ్ల హయాములోదే కద? లక్షల కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన విషయాలేవీ గుర్తేలేనట్టు మాట్లాడారు చూశావా? అలాగే మనరాష్ట్రంలో యువనేత ఉపన్యాసాలు వింటున్నావుగా? స్వర్ణయుగం తెచ్చేస్తానంటున్నాడు... తండ్రిని అడ్డంపెట్టుకుని బంగారం లాంటి రాష్ట్రాన్ని దోచిన సంగతి దాచేసి! నువ్వు కూడా ఆ తెలివి కనబరచాలి...'

'అవునండి. మనం చేసిన అవకతవక, అక్రమాల పనుల గురించి ఎత్తకుండా, మళ్ళీ అధికారమిస్తే వాటినే తుదముట్టించేస్తామనొచ్చండి. అంతేకదండి'

'అద్గది. దార్లోకొచ్చావు. ఇప్పుడు రాసుకో, ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో. ఏమాత్రం సంకోచించకుండా ఎడాపెడా వాడేసుకోడానికి బోలెడన్ని అబద్ధాలు సిద్ధం చేసుకో. ఓడిపోతామనే భయం మనసులో ఉన్నా దాన్ని కప్పిపుచ్చుకొని మాట్లాడే నిబ్బరాన్ని, సిగ్గులేనితనాన్ని ఒంటపట్టించుకో. ప్రత్యర్థుల మీద రువ్వడానికి బోలెడు జోకులు, ఛలోక్తులు రాసుకుని ఉంచుకో. ఎగస్పార్టీవాళ్లకు అంటగట్టడానికి కులతత్వం, మతతత్వం, వేర్పాటువాదం, అవసరమైతే ప్రజల మధ్యే చిచ్చుపెట్టే నైపుణ్యం, అవినీతిపరులు జైల్లో ఉన్నా వారిని విడిపించి మరీ నాటకాలాడించే నేర్పరితనం, దొంగలతోనైనా దోస్తీకట్టే చాతుర్యం, అమలు చేసే ఉద్దేశం లేకపోయినా ఏకబిగిన చదవడానికి అర్థంపర్థం లేనివైనా సరే బోలెడు హామీలు రాసుకుని ఉంచుకో. ఇవన్నీ బజార్లో దొరికేవి కాదు కాబట్టి, ఆ సంచి అవతల పడేసి నీ బుర్రకు పదునుపెట్టుకో. అప్పుడిక నీదే గెలుపు. ఇక పోయిరా!'

PUBLISHED IN EENADU ON 28/01/2014

బుధవారం, జనవరి 15, 2014

నిజమైన పండగ!


'భగభగా మండేను భోగి మంటల్లు...
భోగి మంటల్లోన కాలేను కష్టాలు'

- చప్పట్లుకొడుతూ చుట్టూ తిరుగుతోంది ఎంకి. తిరుగుతున్నదల్లా చటుక్కున ఆగి, 'బావా... బావా... ఒక్కసారి ఎవరెవరు ఎలాంటి మంటలేత్తన్నారో చూసొద్దామా?' అంది సరదాగా. బావ నవ్వుకుని, 'సరే... పద' అన్నాడు.

ఇద్దరూ కలిసి ఓ వీధిలోకి వెళ్లారు. అక్కడొక నాయకుడి ఇల్లు ఉంది. ఆయన అనుచరులతో వచ్చి భోగి మంటల్లో ఏవేవో పడేస్తున్నాడు.

'ఏంటి బావా ఏత్తన్నాడు?' అడిగింది ఎంకి.

బావ పరిశీలనగా చూసి, 'ప్రజలకిచ్చిన వాగ్దానాలు' అన్నాడు.

'అదేంటి? ఎవురైనా భోగి మంటల్లో పిడకలేత్తారు, కట్టెలేత్తారు కానీ ఇలాంటియ్యి కూడా ఏత్తారేటి?' అంది ఎంకి.

'ఆయనెవరనుకున్నావు? అధికార పార్టీ నేత. మొన్నటి ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యేనా, చచ్చేనా? ఆయన దగ్గర తగలబెట్టడానికి ఇంకేముంటాయి మరి?' అన్నాడు.

'అదేటి బావా అలాగంటావు? 'జనానికిచ్చిన మాటలన్నీ నిలబెట్టేసుకున్నాం... సెప్పినవన్నీ సేసేశాం... అసలిన్నేసి మంచి పనులు సేసిన పార్టీ మరోటి లేదు' అని వూదరగొడతారు కదా? నువ్వేటి అట్టా తీసి పారేత్తన్నావు?'

'వూరుకోయే! ఇన్నాల్లూ ఆల్ల పాలన ఎలాంటిదో సూసినా బుద్ధి రాలేదేంటి నీకు? తొమ్మిదేళ్లక్రితం నేనొక్కడినీ పనిసేసి తెచ్చిన రూకల్తో ఇల్లంతా గడిచేది. పైగా పదో పరకో... ఎదర కర్సులకి డిబ్బీలో ఏసేటోల్లం. గుర్తులే? అప్పుడు బియ్యం ధరకి, ఇప్పటి ధరకి పొంతన ఉందాని? పోపులోకి సిటికెడు నూని కోసం గిజగిజలాడిపోతన్నావు. వారానికోపాలైనా పట్టెడు కూరన్నం తినగలుతున్నామా సెప్పు? మనమెవ్వరం పేదోల్లం కాదంట. ఈల్లందరూ కలిసి కాకి లెక్కలన్నీ ఏసి 'అబ్బెబ్బెబ్బెబ్బే... మనదేశంలో పేదోల్లు అంతకంతకు తగ్గిపోతన్నా'రని ప్రెచారాలు కూడాను' అన్నాడు బావ కోపంగా.

ఇంతలో ఆ నేత అనుచరుడు మరిన్ని కట్టలేవో తెచ్చి మంటల్లో పడేశాడు. మంటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

'ఓలబ్బో... పెద్ద భోగిమంటే. ఇప్పుడేటి తెచ్చి పడేశాడు బావా?' అంది ఎంకి.

'ఇప్పుడేసినవి ప్రజలకోసం ఆల్లు పెట్టిన పదకాలే! ఆటి అమలులాగే ఇయ్యీ తగలడుతున్నాయి సూడు'

'బావా? ఈల్లు మనకోసం పెట్టిన పథకాలూ సరిగా లేవంటావా?'

'నువ్వు మనిషివి ఎదిగావు కానీ బుద్దిలో సిన్నతనం ఇంకా పోలేదే? ఓ... భోగిమంటలు సూద్దారన్న సరదాయే కానీ, మన సుట్టూ ఉన్న కష్టాల మంటల సెగ ఏంటో కానుకున్నట్టు లేవు...'

'అట్టా కోప్పడకు బావా... కూసింత ఇవరంగా సెప్పొచ్చుగా?'

'మరదే... ఏమన్నా అంటే బుంగమూతెడతావు. కాస్త చుట్టూ జరుగుతున్నది సూస్తూ ఎరిక పెంచుకోవాలని ఎన్నిసార్లు సెప్పినా బుర్రకెక్కించుకోవు. ఈల్లు, ఈల్ల మనుషులు వూరూవాడా నానా కంగాళీచేసి బోలెడేసి పథకాలు పెట్టేశారా? తామసలు పుట్టిందే ప్రెజానీకం కోసమన్నట్టు, వాళ్లని ఉద్దరించడానికన్నట్టు మాట్లాడారా? తొమ్మిదేళ్లలో మనం కానీ, మన సుట్టూ ఉన్న మన్లాంటి బడుగు బతుకులోల్లు కానీ ఎదిగామా? కానీ ఈ నేతలు, ఆల్ల అనుచరులు, ఆల్ల బంధువులు, తోకగాళ్లకేసి సూడు. నడుచుకుంటా పోయేటోడు ఇవాల స్కూటరెక్కాడు. సైకిల్‌బెల్లు కొట్టేవోడల్లా కారు హారను మోగిత్తన్నాడు. అద్దె ఇంట్లో కాలక్షేపం సేసేటోడు సొంతింట్లోకి మారాడు. తెలుత్తోందా?'

'పోన్లే బావా... పాపం ఆల్లు ఎదిగితే మనకెందుకు బాద? మనం ఎదగలేదని ఏడవాలి కానీ...'

'సాల్లే... మా బాగా సెప్పావు, ఏదాంతం. ఆల్లంతా నిజమైన అర్హతలుండి ఎదిగితే నాకెందుకు ఉలుకు? ఆ పార్టీ పేరుమీద ఎదిగినోల్లంతా మనలాంటి పేదోల్ల పేరు సెప్పుకొని ఎదిగినోల్లే మరి. పేదలకి ఇల్లిత్తామన్నారా? ఏదీ మనగ్గాని, మన పక్కోడిగ్గాని వచ్చిందా... లేదే? ఆడెవడో ఆ పార్టీ నేత కండువా మోసేటోడు దొంగ పత్రాలు సూపించి ఆ ఇల్లు కొట్టేశాడు. ఒక్క మనూళ్లోనే కాదే, అంతా ఇదే తంతు. ఆ నేతలు సెప్పినోల్లందరికీ ముందిచ్చాకే, ఒకటో అరో పేదోల్లకిచ్చి మా గొప్ప పన్లు సేసుకుంటున్నట్టు టీవీల్లో, సబల్లోను వూదరగొడుతున్నారు. పేదలకి వైద్దె పదకమన్నారు... ఏదీ?అంతకన్నా సిత్రం, మన సుట్టూతా ఉండే పొలాలన్నింటికీ నీళ్లొచ్చేత్తాయని కాలవల పని మొదలెట్టారా? వాటిలో ఎన్నింట్లో పన్లు పూర్తయ్యాయి? ఎన్నింట్లో నీళ్లొచ్చాయి... సూసుకో. సెప్పేది కొండంత, జరిగింది పిసరంత. కానీ ఆ పనుల పేరు సెప్పి కోటానుకోట్ల సొమ్ము ఆ పార్టీవోళ్ల జేబుల్లోకే పోయిందంట. ఎందుకంటే ఆల్లే ఆ పన్లు సేసేత్తామని కాంటరాక్టర్ల అవతారమెత్తారు మరి'

'పోన్లెద్దూ బావా... కోట్లకు కోట్లు ఎవురో ఎవురికో ఇత్తే మనకేంటంట?'

'ఏడిశావ్‌, ఎర్రిమొగవా? ఆ డబ్బంతా ఏంటనుకున్నావు? మనం, మన్లాంటి ప్రెజలంతా పన్నుల రూపంలో కట్టిందే మరి. ఇలా పోగడిన సొమ్మునంతా సక్రమంగా పేదోల్లకే కర్సు సేసుంటే నువ్వూ నేను, ఇయ్యాల ఇలాగుండకపోదుం'

'ఎరికైంది బావా? ఈల్ల పాలన కంటే పెద్ద భోగిమంట ఏటుంటాది? ప్రతీదీ తగలెట్టాశారన్నమాట. పోన్లే. మరో ఇంటికి పోదాం పద'

ఎంకి, బావ కలిసి ఇంకోచోటకి వెళ్లారు. అక్కడొక యువనేత ఇంటి ముందు భోగి మంట మరింతగా భగభగలాడుతోంది.

'ఓలబ్బోలబ్బో... ఎంతలేసి మంటలు బావా? ఈయనేంటి పడేత్తన్నాడో?'

'ఈయన ఎవరనుకుంటున్నావు? ఒకప్పటి నేత కొడుకే. ఆ తండ్రి అండతో ఇతడు మొత్తాన్నీ సుట్టబెట్టేశాడు. పచ్చటి పొలాల్ని, గనుల్ని ఏవేవో పరిశ్రమల పేరు సెప్పి పెద్దోల్లకి ఆ తండ్రి రాసిచ్చేత్తే... ఇతగాడు అలా బూములు దండుకున్నోల్ల దగ్గర్నుంచి డబ్బులు నొల్లుకునేవాడు. అలా ఒకటా, రెండా... లక్ష కోట్లు బొక్కేశాడంట. అందుకే ఆ మధ్యన ఇతడిని కటకటాల ఎనకేశారు. ఇప్పుడు బెయిలుమీద బయటకొచ్చాడులే'

'మరంత బొక్కేసినోడిని ఎలా వదిలేశారు బావా?'

'అదో పెద్ద రాజకీయంలే! ఎన్నికలొత్తన్నాయి గందా? ఎట్టాగొట్టా మాయమాటలు సెప్పి మనకాడ ఓట్లు పొందేద్దారని వదిలేశారంట'

'మరీయన ఏటేత్తన్నాడు మంటల్లో?'

'తను సేసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అవకతవకల తాలూకు సాచ్చికాలన్నీ పడేత్తన్నట్టున్నాడు...'

'వార్నాయనో... అయితే మన బతుకుల్లో మంటలెట్టి ఆల్లు భోగమనుభవిత్తన్నారన్నమాట. సాల్లే మావా... ఇంకే భోగి మంటలు సూడక్కర్లేదు. అసలీల్లందరినీ మనవెయ్యాలి భోగిమంటల్లో. పద... ఉన్నదేదో వండుకుని తిని తొంగుందారి. మన్లాంటోల్లకి పండగైనా ఒకటే, పబ్బమైనా ఒకటే. ఇలాంటి తప్పుడు సాముల్ని రేపొచ్చే ఎన్నికల్లో ఇంటికి అంపించాకే మనకి నిజమైన సంక్రాంతి!'

'నీకూ బుద్దొచ్చిందిగా? ఇక మనకంతా పండగేలే!'

PUBLISHED IN EENADU ON 13.01.2014

శనివారం, జనవరి 11, 2014

ఇప్పటికీ ఆకట్టుకునే 'ఆత్మబలం' ... యాభై ఏళ్ల నాటి మేటి చిత్రం!


గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి... 
బుల్లి కారున్న షోకిల అబ్బాయి... 
ప్రేమలో పడితే? 
మొదట కళ్లతోటి మొదలు పెట్టిన లడాయి... 
హృదయమంత పాకే హుషారైన హాయిగా మారుతుంది! 
యువ గుండెల కువకువలంటే అంతే... 
అది ఆండ్రాయిడ్‌ అప్లికేషన్ల నేటి కాలమైనా... 
యాభై ఏళ్ల 'ఆత్మబలం' నాటి కాలమైనా... 
అందుకే ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనం! 
అందువల్లనే అది వి.బి. రాజేంద్రప్రసాద్‌ స్థాపించిన 'జగపతి' ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థకి ఓ ప్రతిష్ఠాత్మక చిత్రమైంది! 
విక్టరీ మధుసూదన రావు దర్శకత్వ ప్రతిభకు ఓ గీటురాయిగా నిలిచింది! 
హీరోగా అక్కినేని నాగేశ్వరరావుకి ఓ తీపి జ్ఞాపకమైంది! 
హీరోయిన్‌ బి. సరోజకి మరిచిపోలేని విజయమైంది! వెరశి ఎప్పుడో 1964లో ఇదే రోజున విడుదలైనా ఇప్పుడు కూడా చెప్పుకోదగిన సినిమాగా మిగిలింది.
'ఆత్మబలం' సినిమా కథ ఓ పదేళ్ల పిల్లాడి మానసిక వైద్యంతో మొదలవుతుంది. ఎందుకంటే, తండ్రి చనిపోవడాన్ని కళ్లారా చూసిన అతడిలోని మానసిక వైకల్యమే కథని మలుపు తిప్పేది కాబట్టి. ఆ పిల్లాడే పెరిగి పెద్దవాడై జగ్గయ్యగా మారి, హీరోహీరోయిన్లనీ వాళ్ల ప్రేమనీ ముప్పుతిప్పలు పెడతాడు. హీరో ఉరికంబం ఎక్కడానికి కారకుడవుతాడు. అటు హీరో ఉరిశిక్షకి వెళుతున్న దృశ్యాలు, ఇటు అతడిని కాపాడే ప్రయత్నాల మధ్య సినిమా క్త్లెమాక్స్‌ రక్తికట్టడానికి దోహద పడతాడు. టైటిల్స్‌లోనే మానసిక వైద్యశాలకి వెళ్లిపోయిన ఆ కుర్రాడు, తిరిగి హీరోహీరోయిన్ల ప్రేమ రసకందాయంలో పడ్డాక వూడిపడతాడు. ఆ కుర్రాడి తల్లి కన్నాంబలా గంభీరంగా తెరపై కనిపించేనాటికి ఆమెకో మిల్లు ఉంటుంది. ఆ మిల్లుకో మేనేజర్‌ ఉంటాడు. వాడు సన్నగా రివటలా రవణారెడ్డిలాగా ఉన్నా, దుర్మార్గంలో మాత్రం గట్టిపిండమే. అందులో ఇంజినీరే హీరోగారు. అతడు కారు మీద ఉద్యోగానికి వెళుతుంటే హీరోయిన్‌ లిఫ్ట్‌కోసం కారాపి మరీ పరిచయమై ప్రేమకు నాంది పలుకుతుంది. ఆపై ఆత్రేయగారి కలం పాటలతో పరుగులు పెడితే, హీరోహీరోయిన్లు పార్కుల్లో పరుగులు పెడతారు. 'గిల్లికజ్జాలు తెచ్చుకునే...' ఆ అమ్మాయి కళ్లల్లో బలే బడాయిని అతడు చూస్తే, 'బుల్లికారున్న షోకిల...' అయిన ఆ ఆబ్బాయి పోజుల్లో బడాయిని ఆమె గుర్తిస్తుంది. ఆపై అతడు 'పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు...' అని గొప్పలు పోతాడు. మళ్లీ వెంటనే 'ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు...' అని ఒప్పేసుకుంటాడు.


 ఆ తర్వాత ఇద్దరూ 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...' 'చెట్టాపట్టగ చేతులు కలిపి చెట్టునీడకై...' పరుగులు పెడుతూ, 'చెప్పలేని ఆ హాయి...' ఎంత వెచ్చగా ఉంటుందో తెలుసుకుంటారు. ఆ సరికి ఇద్దరూ ప్రేమలో తడిసి ముద్దయిపోతారు. ఇలా వీళ్లు డ్యూయట్ల మీద డ్యూయట్లు పాడుకుని ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటే, మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న జగ్గయ్య కథను మలుపు తిప్పడానికి పారిపోతాడు. మిల్లు యజమానురాలి కోరికపై హీరో అతడిని ఇంటికి తీసుకొచ్చినా, ఒక్క రోజే ఉండి వెళ్లిపోతాననే అతడిని ఆపడానికి పాటే మార్గమవుతుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా?' అని హీరోయిన్‌ పాడేసరికి, వెళ్లేవాడు కాస్తా ఆగిపోయి 'ఎక్కడికీ పోలేను చిన్నదానా, నీ చూపుల్లో చిక్కుకుంటి కుర్రదానా' అని ఆగిపోతాడు. అమ్మతో చెప్పి జయను పెళ్లాడతాననేసరికి ప్రేమికులతో పాటు ప్రేక్షకుల మనసులూ కలుక్కుమంటాయి. చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన కన్నాంబ కోసం అవసరమైతే ఎంతటి త్యాగమైనా చేయాలని చెప్పి చనిపోయిన తన తల్లి మాటలు హీరోయిన్‌ను కట్టిపడేస్తాయి. హీరో కూడా త్యాగాన్నే బోధించి వెళ్లిపోవడంతో ఆమె విషాదంలో మునిగిపోయి 'కనులకు కలలే బరువైనాయి... కన్నీళ్త్లెనా కరువైనాయి...' అని పాడుకుంటూ ఉండిపోతుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి ప్రేమ గురించి రవణారెడ్డి చెప్పడం, జగ్గయ్య అనుమానపడడం, దేనికైనా తెగించే మనస్తత్వం ఉన్న అతడి బారి నుంచి ప్రాణాలు కాపాడుకోడానికి హీరోయిన్‌ ఇంట్లోంచి పారిపోయి హీరోను చేరుకోవడం లాంటి సంఘటనలతో కథ చిక్కనై పాకాన పడుతుంది. హీరోహీరోయిన్లు ఒకటై 'తెల్లవారనీకు ఈ రేయిని... తీరిపోనీకు ఈ తీయనీ హాయినీ...' అని పాడుకునేసరికి, జగ్గయ్య పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరుకుంటుంది. దాంతో తాను ఆత్మహత్య చేసుకుంటూ, తనను హీరోనే హత్య చేసినట్టు కనిపించే పరిస్థితులు కల్పించి చనిపోతాడు. సాక్ష్యాలన్నీ కలిసి హీరోను ఉరికంబానికి, సినిమాని క్త్లెమాక్స్‌కి తీసుకువెళతాయి. హీరోకి ఉరితాడు తగిలించేలోగా ఆగమేఘాల మీద (నిజానికి కారు మీద) హీరోయిన్‌, రేలంగిలు జగ్గయ్య డైరీని తీసుకొచ్చేసరికి అందులోని అంశాలను బట్టి చిట్టచివరి నిమిషంలో న్యాయమూర్తి ఉరిశిక్షను ఆపుచేయడంతో ప్రేక్షకులు వూపిరిపీల్చుకుంటారు.
'అగ్నిసంస్కార్‌' అనే బెంగాలీ నవల ఆధారంగా అల్లుకున్న ఈ చక్కని కథకి ఆత్రేయ మాటలు, పాటలు అద్భుతంగా అమరాయి. కె.వి. మహదేవన్‌ సంగీతం సమకూర్చిన పాటలన్నీ హాయిగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికీ ఈ సినిమాను ఏ సీడీలోనో చూస్తే కథ, కథనాలు కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదు.

PUBLISHED IN EENADU ON 09.01.2014

గురువారం, జనవరి 02, 2014

సామాన్యుడి సంకల్పం


'కుర్రో కుర్రు... ఏంది బిడ్డా, మొగం దిగాలు సేసుకుని కూకున్నవ్‌?' అన్నాడు కోయదొర సామాన్యుడితో. 
సామాన్యుడు నిట్టూర్చాడు. 'ఏం చెప్పమంటావు దొరా! మనసేం బాలేదు' అన్నాడు. 
'అదేంటి అట్లంటవ్‌? కొత్త ఏడాది గునగునా నడిసొచ్చింది. దిగులంతా పక్కనెట్టి దిలాసుగుండాల. అసలు నీ గోసకి మూలమేందో సెప్పరాదూ? నాకాడ బోలెడు తాయెత్తులున్నాయి...'
సామాన్యుడు నిర్వేదంగా నవ్వాడు. 'తాయెత్తులతో తీరేది కాదులే నా బాధ. కొత్త ఏడాది వచ్చిందన్నమాటే కానీ నా సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఏది కొనాలన్నా ఆకాశంలోకి చూడాల్సి వస్తోంది. ఎందుకంటే ధరలన్నీ అక్కడే తిష్ఠ వేసుకుని కూర్చున్నాయి. నూకలు కొందామన్నా రూకలు మాయమైపోతున్నాయి. గంజిలోకి నంజుకుందామన్నా ఉల్లిపాయ గిల్లి మరీ ఏడిపిస్తోంది. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలే... అది కాదు నా బాధ. ఎన్నికలు వస్తున్నాయి. కొత్త నాయకులని ఎన్నుకోవాలి. ఎవరిని చూసినా తీయగా మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ వూరిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరు ఎలాంటివారో తెలియడం లేదు. దాని గురించే ఆలోచిస్తున్నా'

'కుర్రో కుర్రు... మరి చెప్పవేం? దానికి నాకాడ ఓ మంత్రముంది. నీ చెయ్యి నాకిచ్చి మనసులో ఓ నాయకుడిని తలుసుకో. ఆడెలాంటోడో, ఆడి మనసులో ఎలాటి తైతక్కలున్నాయో సెబుతా. కొండదేవర ఆన!' 
సామాన్యుడికి ఇదేదో సరదాగా తోచింది. ఉత్సాహంగా చెయ్యి చాపి, మనసులో ఒకర్ని తలుచుకున్నాడు. 
కోయదొర ఆ చేతిని పట్టుకుని అటూ ఇటూ వూపుతూ తనదైన ధోరణిలో పాటలాగా సాగదీస్తూ మొదలు పెట్టాడు.

'ఆ... అంబ పలుకు. జగదంబ పలుకు. కోనలమ్మ తల్లి కులుకు పలుకు. కొండదేవర పలుకు. నిండు నిజము పలుకు...' అంటూ కొనసాగించాడు. సామాన్యుడు వింటున్నాడు. 
'ఎరిక పడిందిలే ఎవరిదో రూపమ్ము. బిడ్డ సక్కనివాడు... బిరుసు వయసువాడు. నిగనిగల రంగుతో నిగ్గుతేలినవాడు. గరుకు గెడ్డమువాడు... సరుకు లేనివాడు... తెలిసిందా బిడ్డా?' అన్నాడు కోయదొర. 
సామాన్యుడు ఆశ్చర్యపోయి 'సరిగ్గా అతడినే తలుచుకున్నా. చెప్పు... చెప్పు' అన్నాడు.

కోయదొర కొనసాగించాడు. 'పుట్టిన వంశమ్ము గొప్ప వంశమ్ము... కానీ ఏం లాభం? అమ్మ కొంగుసాటు... అతడి గ్రహపాటు. మాట తొందరపాటు... చేత తత్తరపాటు. రాచకుర్చీపై ఆశపడుతున్నాడు... పరుగుపెట్టిన కొద్దీ వెనక పడుతున్నాడు. అరచెయ్యి నీడలో, అమ్మ హయాములో... దేశమ్ము జారిపడె పాతాళ గొయ్యిలో. సేసిన కార్యాలు మా సెడ్డ కార్యాలు. చివరికవి అవుతాయి ఆ బిడ్డ శాపాలు. నమ్మి సేరావంటే... నట్టేట మునిగేవు'

సామాన్యుడి ముఖం వికసించింది. 'నిజమే, అర్థమైంది. ఇప్పుడు ఇంకో నాయకుడిని తలుచుకుంటా. అతడి సంగతేంటో చెప్పు' అన్నాడు. 
'ఆ... కరకు చూపులవాడు. మెత్తగా నవ్వుతాడు. జెల్ల కొడతాడు. తీయగా మాటాడి, తీట తీసేస్తాడు. తండ్రి సాటున ఎదిగి... తంత్రాలు మరిగాడు. జనము సొమ్ములు దోచి, జాతరలు సేశాడు. బడుగు బతుకులతోటి జూదమాడాడు. భూమి సుట్టేశాడు. గనులు కుమ్మేశాడు. నీరు పేరు చెప్పి నిధులు నొక్కేశాడు. పేదవారి కోసమే బతుకంటు సెబుతాడు. పెద్ద మూటలుకట్టి కోటలో దాస్తాడు. ఓదార్చ వస్తాడు... వూడ్చుకుని పోతాడు. తెలుసుకున్నావా బిడ్డా?'

'అయ్యబాబోయ్‌... సరిగ్గా చెప్పావు. ఎవరెలాంటివారో చక్కగా చెప్పావు. వీళ్లను దగ్గరకి రానిస్తే దేశం, రాష్ట్రం ఏమవుతాయో తెలియజేశావు. నా మనసులో సందేహాలు తీర్చావు. ఇంతకీ నేనేం చేయాలో అది కూడా కొండదేవరనడిగి చెప్పరాదూ?' అన్నాడు సామాన్యుడు ఆశగా.

'ఆ... పంచప్రాణాలాన. పంచభూతాలాన. పసిడి పలుకులు పలుకు దేవతల ఆన. నిజము సెబుతానయ్య... నిక్కముగ వినవయ్య. బడుగుజీవిని నేనంటు దిగులు పడమాకయ్య. నీ సేతిలో ఓటు వజ్రాయుధమ్మయ్య. దాని శక్తిని జూసి నిబ్బరపడవయ్య. మెరమెచ్చు మాటలు విని మోసపోకయ్య. నోటు రెపరెపలకు తొట్రుపడకయ్య. అవినీతి నాయకుల అంతు సూడవయ్య. అక్రమార్జన పరుల పీచమణచవయ్య. ఈ కొత్త ఏడాది, నీకొక్క వరమయ్య. ఎన్నికలవేళలో ఎరికతో నిలువయ్య. నీతిగల నేతలను ఎన్నుకోవయ్య. నీ శక్తి తెలుసుకుని, నీ బతుకు దిద్దుకుని, దేశానికే నీవు దిక్కు చూపాలయ్య. కుర్రో కుర్రు!' అన్నాడు కోయదొర.
కొత్త సంవత్సరం ఏం చేయాలో నిర్ణయించుకున్న సామాన్యుడు నూతనోత్సాహంతో ముందుకు నడిచాడు.

PUBLISHED IN EENADU ON 02.01.2014