మంగళవారం, జూన్ 12, 2012

అయ్యయ్యో... ఎంత కష్టం?

అయ్యయ్యో... ఎంత కష్టం?

'ఓలమ్మో... ఓరయ్యో... ఓలక్కో... ఓరన్నో... మాకెంతకట్టమొచ్చినాదోలమ్మా... మీరంతా కలిసి ఆదుకోవాలమ్మో...'

'ఓలమ్మలమ్మ... అంత దుక్కపడకే తల్లీ! సూడ్లేక పోతన్నాం. ఇంతకీ ఏ కట్టమొచ్చినాది?'

'ఇంకా అడుగుతారేటమ్మో... నాకు మాటలు పెగల్టం లేదు. నిచ్చేపంలాటి నా కొడుకును పోలీసులు ఎత్తుకుపోనారమ్మో...'

'అయ్యో తల్లీ, ఎంత కట్టం! కొడుకునెత్తుక పోతే ఏ తల్లి తల్లడిల్లదమ్మా? ఎండనక, కొండనక తారట్టాడతా మా గుమ్మంలోకొచ్చి గింగిరాలు తిరిగిపోతన్నావు. ఇంతకూ నీ కొడుకునెందుకు ఎత్తుకెల్లారే తల్లీ!'

'ఏటి సెప్పేదమ్మో... ఏవో దొంగతనాలు, దోపిడి సేశాడంటన్నారమ్మా... ఈ రోజుల్లో ఎవులు సేత్తంలేదు సెప్పండమ్మా... ఆల్లందర్నీ ఒగ్గేసి నా కొడుకునే అన్నాయంగా ఎత్తుకపోనారమ్మో...'

'ఏటేటీ? దొంగతనాలూ దోపిడి సేసినాడా? అదేటమ్మా, ముందుగాలే కొడుకును అదుపులో ఎట్టుకోలేక పోనావా? తోటకూర నాడే మందలించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు కదమ్మా? దోచేసినోడిని మరట్టికెల్లక ముద్దెట్టుకుంటారేటి? బాధగానే ఉంటదికానీ కూసింత ఓర్సుకోమ్మా...'

'అదొక్కటే కాదమ్మా! నా కొడుకు కట్టాలకు మొదట్నుంచీ లెక్కేలేదు తల్లీ...'

'అట్టాగా తల్లీ? ఎంతెంత కట్టపడిపోనాడమ్మా నీ కొడుకు?'

'ఏం సెప్పమంటారు తల్లీ! ఆల్ల నాయన కూసున్న కుర్సీ ఎక్కాలని ముచ్చట పడ్డాడమ్మా... కానీ అందరూ కలిసి అడ్డుకుని మరొకర్ని కూసోబెట్టేరమ్మా... అందుకని అలిగి రోడ్ల మీద పడ్డాడమ్మ బిడ్డ!'

'అయ్యో... తల్లీ ఎంత కట్టం? ఆ కుర్సీ ఎప్పుడోపాలి ఎక్కుదువులేరా... తొందరపడమాకని సెప్పలేకపోనావమ్మా! నట్టింట్లో కన్నకొడుక్కు సెప్పుకోలేక, ఇప్పుడిట్టా రోడ్డుమీద పడాల్సి వచ్చింది కదమ్మా? ఇంకేటమ్మా నీ బిడ్డ కట్టం?'

'ఏం సెప్పమంటావు తల్లీ? ఆ కుర్సీ ఎక్కినాయన్ని దించేదాక నా కొడుక్కి సుకం లేదమ్మా... అందుకోసరమే ఆయనకి మద్దతిచ్చేటోల్లని తనవైపు తిప్పుకోడానికి ఎంత సతమతమైపోయాడోనమ్మ బిడ్డ! ఆయనొట్టి అసమర్దుడని లోకానికి సాటాలని తిరగని సోటు లేదమ్మ... అంతలేసి తిరుగుడు ఎవులైనా తట్టుకోగలరా సెప్పండమ్మ?'

'అబ్బో... సానా కట్టం తల్లీ! అంతులేని ఆశలెట్టుకుంటే అంతేనని ముందుగాలే సెప్పలేకపోనావామ్మా? ఇప్పుడు నువ్వు కూడా ఇట్టా తిరగాల్సి ఉండకపోను... ఇంకేటమ్మా నీ కట్టం?'

'నా బిడ్డ ఐద్రాబాద్‌లో రాజబవనం కడుతున్నాడమ్మా... దానికి ఇటుకలు, సిమెంట, కూలీల పనులన్నీ సూసుకోడానికెంత ఆయాస పడిపోయాడో. ఇప్పుడయ్యన్నీ సూసుకోడానికి లేదే కదమ్మ?'

'ఏటీ రాజబవనమే! అవున్లేమ్మా... అంతోటి పెద్దిల్లు మొదలెడితే కట్టమే! మాం పూరింట్ల తాటేకులు మార్సడానికే ఆపసోపాలు పడిపోతామే. కానీ ఏటి సేత్తం? ఎవుల్నైనా పురమాయించుకో తల్లీ...'

'అదొక్కటే కాదమ్మా... రాట్రమంతటా బూములు సుట్టబెట్టాడమ్మా... ఎవురెవరికో కట్టబెట్టాడమ్మా... ఆల్లనుంచి సొమ్ములు పట్టాడమ్మా... కంపెనీలెట్టాడమ్మా... ఆ యవ్వారాలన్నీ నాకేటి తెలస్తయి సెప్పండమ్మ... ఇప్పుడేం సేతురో తెల్టం లేదమ్మ...'

'ఓలోలోలి! ఇయ్యెక్కడి కట్టాలమ్మా... ఎక్కడా ఇనలేదు? ఇన్నోసి పన్లు నెత్తి మీదెట్టుకుంటే ఎట్టాగమ్మా? ఎంత కట్టబడిపోనాడమ్మ బిడ్డ... ఇంకేటి కట్టాలు తల్లీ?'

'ఏమని సెప్పనమ్మ? ఎనిమిదేళ్ల కితం సక్కంగానే ఉండేవాల్లమమ్మ... అంతా పోగుసేసి మా కాడున్నది లచ్చల్లోనేనమ్మ ఆస్తంతా... పేనం సుకంగా ఉండేది... ఈమద్దె కాలంలో నా కొడుకు కాయకట్టం వల్ల లచ్చ కోట్లకు పడగలెత్తామమ్మా... ఆ నోట్లన్నీ లెక్కబెట్టి నా కొడుకు వేళ్లన్నీ నొప్పులేనమ్మా...'

'ఓలమ్మలమ్మ! ఎంత కట్టమమ్మ... ఎదవది కూలి డబ్బులు నెక్కెట్టుకోడాకే కిందిమీదులవుతామమ్మ మేమంతా. అట్టాంటిది అంతలేసి సొమ్ములొచ్చి పడిపోతా ఉంటే ఎంత కట్టం? బిడ్డ సేతులకు నొప్పి లేపనం రాయలేక పోయావమ్మా?'

'అది కాదమ్మా... ఆ డబ్బులేంటో, కంపెనీలేటో, మనుసులేటో, మాటలేటో, నాకేటి తెలుత్తాది సెప్పండమ్మ?'

'అయ్యయ్యో! ఇంటుంటే కడుపు తరుక్కుపోతావుంది. కుసింత ఓపిక పట్టమ్మ...'

'ఎట్టా పట్టేదమ్మ? పొరుగు రాట్రంలో కూడా బవంతుల పన్లెట్టుకున్నాడు బిడ్డ! ఎన్నెన్ని కోట్లో తీస్కెల్లి ఇదేశాలు పంపేడు. ఆటిని దొడ్డిదారిని తీస్కొచ్చి సొంత కంపెనీల్లోకి తోడుకున్నాడు. ఇన్నేసి యవ్వారాలు సూసుకోవాల్సి ఉంటే కొడుకుని తీస్కెల్లి జైల్లో పెడితే ఎట్టాగమ్మా?'

'ఓలమ్మో... ఎంత కట్టం! గుండెలవిసిపోతన్నాయి తల్లీ...'

'మీకట్టా అనిపించాలనేనమ్మా... సానుబూతి కురిపించాలనేనమ్మా... నా కట్టాలు మీకాడ ఏకరువు ఎట్టుకోడానికి వచ్చాను...'

'అవునుకానీ తల్లీ... ఇంతకీ మామేటి సేయాలంటావు సెప్పమ్మా...'

'ఏం లేదమ్మా... మీరంతా కలిసి నా బిడ్డకు మద్దతియ్యాల. ఆడెనకాల జనమంతా ఉన్నారని సాటి సెప్పాల... అదేనమ్మా నా కోరిక...'

'శానా బాగుంది తల్లీ! ఆడేమో దొంగతనాలు సేసేడూ? దోపిడి సేసేడూ? ఎవుల్ల బూములో గుంజుకుని మరెవుల్లకో అప్పజెప్పి మాయజేసి కోట్లు కొల్లగొట్టేడూ? ఇయన్నీ తెలుసుకుని కూడా నీ కొడుక్కి మద్దతియ్యటానికి మాకు మనసెట్టా ఒప్పుద్దమ్మా? నీతిమాలినోడికి జేజేలు కొడితే నవ్వులపాలు కామా! పున్నామ నరకానికి పోమా తల్లీ! నీ కట్టాలన్నీ ఇని ఓదార్చగలం కానీ మామేటీ సెయ్యలేమమ్మా. అవునుగానీ తల్లీ... ఇంతలేసి కట్టాలడిపోతా నీ బిడ్డ బయటుండే బదులు జైల్లోనే ఉంటే సుకం కదా తల్లీ? నీడపట్టున పడుండి ఇంత బువ్వ తింటాడు? కాసింత ఓర్సుకో తల్లీ! పోయిరా!'

PUBLISHED IN EENADU ON 12.6.2012

శుక్రవారం, జూన్ 08, 2012

అవినీతి మాంత్రికుడుఅవినీతి మాంత్రికుడు

పట్టువదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టగానే 'సారొత్తారొత్తారే... వస్తారొత్తారొత్తారే...' అనే పాట వినిపించింది. రాజకీయ బేతాళుడు, పిశాచాలు కలిసి చెట్టుకింద స్టెప్పులేస్తూ కనిపించాయి.
అక్రమార్కుడు ఉబ్బితబ్బిబ్బైపోయి, 'ఇదేంటి బేతాళా, నువ్వు నాకు వశమైనట్టేనా?' అన్నాడు.

బేతాళుడు భళ్లున నవ్వి, 'వార్నీ, నీకు ఆశ చాలా ఎక్కువయ్యా! అందుకే రాష్ట్రాన్ని అంతలా దోచుకున్నావు! రోజూ ఒకేలా మొదలెట్టడం ఎందుకని ఇలా కొత్తగా ఆలోచించానంతే. బాగుందా?' అన్నాడు.

అక్రమార్కుడు డీలా పడిపోయి సమాధి మీద నీరసంగా కూలబడ్డాడు. బేతాళుడు దగ్గరకొచ్చి, 'ఏమయ్యా, జైల్లో ఆహారం సరిపోవడం లేదా? రోజూ నువ్వు తినేలా అక్రమాల సన్నబియ్యంతో అన్నం వండటం లేదా? అందులోకి కమ్మని కాసుల కలగలుపు పప్పు వడ్డించడం లేదా? గనులు కూరిన గుత్తొంకాయ కూర చేయించలేదా? ఖనిజాల ఖైమా సంగతేంటి? సెజ్‌ల పులుసైనా పెట్టారా లేదా? పెట్టుబడుల పచ్చడి వేశారా? రాకరాక వచ్చిన అతిథివి కదా, భూముల బొబ్బట్లు చేయించొద్దూ? ఆశలు తోడెట్టిన గడ్డపెరుగుతోపాటు జుర్రుకోవడానికి మారిషస్‌ నుంచి మాయాజాలం మామిడిపళ్లు తెప్పించొద్దూ? కనీసం నంజుకోవడానికి నల్లడబ్బైనా వేయాలి కదా? అవినీతి అప్పడాలు, వక్రబుద్ధి వడియాలు కూడా లేవా? ఎంత దారుణం... ఎంత దారుణం!' అంటూ వగలుపోయాడు. పిశాచాలన్నీ ముసిముసిగా నవ్వసాగాయి.

అక్రమార్కుడు దీనంగా మొహం పెట్టి, 'బేతాళా! నీకిది భావ్యమా? వశం చేసుకుందామని వచ్చానుకదాని ఇలా ఎగతాళి చేస్తావా? నాకు తెలిసి అలనాటి విక్రమార్కుడి కథలో బేతాళుడు కథలు చెబుతాడు కానీ, నీలా కబుర్లు చెప్పడు...' అన్నాడు ఉక్రోషంగా.

బేతాళుడు నవ్వుతూనే దగ్గరకు వచ్చి, 'భలేవాడివయ్యా అక్రమార్కా! అలనాటి ఆయనకు, ఇలనాటి నీకు పోలికెక్కడుంది చెప్పు? ఆ విక్రమార్కుడు అవక్రమ పరాక్రమవంతుడు. మరి నువ్వో? అక్రమ వక్రబుద్ధుడివి. ఆయన ప్రజారంజకుడు. నువ్వు ప్రజావంచకుడివి. ఆయన జనాన్ని రంజింపజేసి ఆనందపరిస్తే, నవ్వు ఏడిపించి ఓదారుస్తున్నావు. ఆయన బేతాళుణ్ని వశం చేసుకోవాలనుకున్నది పరోపకారం కోసం, ప్రజాహితం కోసం! నువ్వు నన్ను వశం చేసుకోవాలనుకుంటున్నది అధికారం కోసం, ప్రజాధనాన్ని మరింత దోచుకోవడం కోసం! చెప్పిన తేడాలు చాలా, ఇంకా చెప్పాలా?' అన్నాడు.

విసిగిపోయిన అక్రమార్కుడి మొహం కోపంతో ఎర్రబడిండి. చర్రుమంటూ లేచి, 'బేతాళా, వూరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. చూస్తూ ఉండు. త్వరలోనే నీకు బుద్ధిచెప్పే రోజు వస్తుంది. నీకు తెలియదేమో, నీకన్నాముందే నాకు ప్రజలంతా వశమయ్యారు, తెలుసా?' అన్నాడు ఆవేశంతో వూగిపోతూ!

ఆ మాటకు పిశాచాలన్నీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ కిందపడి దొర్లసాగాయి. బేతాళుడు కూడా శ్మశానం దద్దరిల్లేలా నవ్వి, 'అక్రమార్కా, నీకు చాలా తిక్కుందయ్యా! కానీ, దానికి ఓ లెక్క మాత్రం లేదు. అందుకే చట్టమన్నా, న్యాయమన్నా, నీతన్నా, నిజాయతీ అన్నా, ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా అస్సలు లెక్కలేకుండా అడ్డమైన అక్రమాలు చేశావు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నావు. అయినా నీ నోట ప్రజలనే మాట వచ్చింది కాబట్టి, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు? ప్రజలు నిన్ను నమ్ముతున్నారని నువ్వెలా అనుకొంటున్నావు? నీకింత భరోసా ఎక్కడిది? జనాన్ని ఏ విధంగా ఆకట్టుకున్నావని భావిస్తున్నావు? అందుకు నువ్వు పాటించిన నయవంచక పద్ధతులు ఏంటి? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సరైన సమాధానాలు చెప్పకపోయావో... ప్రజల మనసు నువ్వంటే విరిగిపోయినంత ఒట్టు' అన్నాడు.

అక్రమార్కుడు దిగాలుపడిపోయాడు. బేలగా మొహం పెట్టి, 'నీ శాపంతో చెడ్డ చిక్కొచ్చింది బేతాళా! నువ్వంత మాటన్నాక చెప్పక తప్పుతుందా? రాక రాక మాకు అధికారం అంది వచ్చింది. దాని ఆధారంగా ఎదగాలంటే అమాయకమైన ప్రజానీకానికి మత్తు చవి చూపించాలి. వాళ్లకేదో మేలు చేస్తున్నట్టు ప్రచారం చేయాలి. అందుకే కొత్తకొత్త పథకాలు రచించాం. వాటి అమలు పేరిట వారికి కొంచెం విదిల్చి మేము, మా అనుయాయులు కోట్లకు పడగలెత్తాం. సోదాహరణంగా చెబుతాను, విను. జలపథకాల పేరిట ప్రాజెక్టులు మొదలుపెట్టాం. కానీ కాంట్రాక్టులన్నీ మా అనుచరులకే ఇచ్చాం. వాళ్లు పనులు చేసినా, చేయకపోయినా కోట్ల కొద్దీ రూపాయల బిల్లులు చెల్లించాం. అదీ చాలకపోతే అంచనాలు సవరించి మరీ సొమ్ములు విడుదల చేశాం. ఆ ధనమంతా ఎవరిది? ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూలు చేసినదే. ఫలితంగా ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నా మేమంతా కోట్లు వెనకేసుకున్నాం. ఉపాధి పనుల పేరిట పేదలకు కొంత సొమ్ము పంచినట్టే పంచి, వాటి కోసం పెట్టే బిల్లుల పేరిట కిందిస్థాయి అధికారి నుంచి పైస్థాయి నాయకుల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పారేలా ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఫీజులు ఇప్పించినట్టే విదిల్చి, ఆ నెపంతో మా వారిచేత వందలకొద్దీ కాలేజీలు పెట్టించి గ్రాంటులు మంజూరు చేశాం. ఇప్పుడా కాలేజీలన్నీ అరకొర వసతులతో మూతపడ్డాయి. విద్యా ప్రమాణాలు కూడా దిగజారాయి. రోగాలకు చికిత్స పేరిట అస్మదీయ వైద్యులకు కోట్లు పంపిణీ చేశాం. ఇలా ఏం చేసినా ప్రజలకు గోరంత, మేం మెక్కేది కొండంత ఉండేలా చూసుకున్నాం. కానీ పాపం... ప్రజలు అమాయకులు. మా వల్ల అవినీతి వ్యవస్థాగతమైందని, అందువల్ల అడుగడుగునా అణగారిపోక తప్పదని తెలుసుకోలేరు. వాళ్ల అజ్ఞానం మీదనే నాకు అనంతమైన నమ్మకం. వాళ్ల అమాయకత్వమే నాకు రక్ష' అంటూ మనసులోని మాయనంతా వెల్లగక్కాడు.

బేతాళుడు నిట్టూర్చి, 'ఎంతగా దిగజారిపోయావు అక్రమార్కా! అవినీతి మాంత్రికుడిలా కనిపిస్తున్నావు. ఇంత పచ్చిగా నిజాలు చెప్పాక ఇక నాకిక్కడేం పని?' అంటూ శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు!PUBLISHED IN EENADU ON 8.6.12

బుధవారం, జూన్ 06, 2012

నోరున్న నేరగాడి కథ


నోరున్న నేరగాడి కథ!


తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే- 'దూడ గడ్డి కోసం' అన్నాడట వెనకటికో దొంగవెధవ! వాడెక్కింది కల్లుకోసమని తెలిసిపోతూనే ఉంది. అయినా నిజమేదో వాడిచేతే చెప్పిద్దామంటే అదీ అడ్డగోలు సమాధానం. 'చెట్టు మీద గడ్డి ఉంటుందా?' అని అడిగితే, పైనుంచి చూస్తే కింద గడ్డి కనబడదా అని జవాబు వచ్చే ప్రమాదముంది. బుకాయించేవారికి నోరే ఆధారం. వక్రమైన తెలివితేటలకు, మడత నాలుక కూడా తోడైతే అడ్డగోలు పనులెన్ని చేసినా- ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా వాగుతూ విషయాన్ని దారి మళ్లించవచ్చు.
'నోరుంటే బుర్ర కాస్తుంది' అని బోధించాడో గజదొంగ తన కొడుక్కి. వాడోసారి రాజుగారి ఉద్యానవనంలో గులాబీలు కోసి, అడ్డంగా దొరికిపోయాడు. భటులు తనిఖీ చేస్తే వాడి జేబుల నిండా బోలెడు పూలు. 'పద... రాజుగారి దగ్గరకి' అని తీసుకుపోసాగారు. వాడికి తండ్రి బోధ గుర్తొచ్చింది. అది తలచుకుని ఆలోచించేసరికి కర్తవ్యం బోధపడింది. భటుల వెంట నడుస్తూనే ఒకో గులాబీనీ నోట్లో వేసుకుని నమిలేశాడు. తీరా రాజుగారి దగ్గరకి వెళ్లేసరికి సాక్ష్యం లేకుండా పోయింది. నోరుంటే బుర్రెలా కాస్తుందో ఒంటపట్టినవాడు పెద్దయ్యాక తండ్రిని మించిన ఘరానా దొంగ అవుతాడని వేరే చెప్పాలా?

అమారా దేశంలో ఇలాగే ఓ కొరగాని కొడుకు ఉండేవాడు. వాడు చేయని దోపిడి లేదు. దోచని ఇల్లు లేదు. అడ్డమైన పనులూ చేసి అనుకోకుండా దొరికిపోయాడు. వాడిని విచారణాధికారి దగ్గరకు తీసుకుపోయారు. ఆయన అడిగే ప్రశ్నలకు వాడెలా వాగుతున్నాడో ఓసారి చూద్దాం.
'ఏరా? ఎందుకు దొంగతనం చేశావు?'
'నేనే కాదు, చాలామంది దొంగతనాలు చేశారు...'
'వాళ్ల సంగతి సరే, నీ సంగతి చెప్పు?'
'ముందు వాళ్ల సంగతి తేల్చి, నా సంగతి అడగండి...'
'నీ ఇంట్లో సోదాచేస్తే భారీగా దొంగ సొత్తు దొరికింది...'
'నాకన్నా ముందు చోరీలు చేసినవారందరి ఇళ్లూ సోదా చెయ్యండి...'
'వాళ్లనెందుకు సోదా చేయడం?'
'నన్ను సోదా చేశారు కాబట్టి...'
'నిన్ను సోదాచేస్తే ఏంటి తప్పు?'
'వాళ్లందరినీ సోదా చేయకపోతే తప్పు...'
'నువ్వు దొంగతనం చేస్తుండగా భటులు పట్టుకున్నారు...'
'ఇదంతా పెద్ద కుట్ర...'
'దొంగ వెధవను పట్టుకుంటే కుట్ర ఎందుకవుతుంది?'
'నేను దొంగతనం చేస్తున్నచోటికే భటులు ఎందుకు రావాలి? వేరేవాళ్లున్న చోటుకూ వెళ్లాలి కదా? నన్నే పట్టుకున్నారంటే అది కుట్రే కదా?'
'ఆ సంగతి సరే... నీ ఇంట్లో అంతంత డబ్బులెక్కడివి?'
'వ్యాపారాలు చేసి సంపాదించా...'
'ఏమిటా వ్యాపారాలు...'
'నా తెలివితేటలతో చేసినవి...'
'ఏమిటా తెలివితేటలు?'
'వ్యాపార రహస్యాలు చెప్పకూడదు...'
'సరే... నిద్రపోతున్న ప్రజల ఇళ్లలోకి ఎందుకు దూరావు?'
'వాళ్లకు మేలు చేద్దామని...'
'ఏమిటా మేలు?'
'మిమ్మల్ని దోచుకునే దొంగలుంటారు, అప్రమత్తంగా ఉండండీ అని చెప్పి లేపుదామని...'
'ఆ సంగతి పగలు చెప్పొచ్చుగా?'
'పగలు పడుకుని ఉండరుగా?'
'మరి వెళ్లినవాడివి వాళ్లనెందుకు లేపలేదు?'
'వాళ్లు మంచి నిద్రలో ఉన్నారని జాలేసి లేపలేదు...'
'మరైతే రాత్రుళ్లు పడుకుని ఉంటారని తెలిసి కూడా ఇళ్లలోకి ఎందుకు దూరడం?'
'పగలు దూరితే వూరుకోరు కాబట్టి...'
'అందుకే... వాళ్లు మత్తులో ఉండగా వాళ్ల సొత్తంతా దోచుకున్నావని నీ మీద ఆరోపణ ఉంది...'
'ప్రజల్ని దోచుకున్నారన్న ఆరోపణలు చాలామంది మీద ఉన్నాయి...'
'వార్నాయనో... నువ్వెక్కడ దొరికావురో!'
'దొరకలేదు... మీరే పట్టుకున్నారు'
విచారణాధికారి తల పట్టుకుని, 'ఒరే, దయచేసి నిజం చెప్పరా...'
'ఏది నిజం?'
'నువ్వు అబద్దాలాడుతున్నావన్నది నిజం...'
'కానీ అది అబద్ధం కదా?'
'మరి నిజమేంటి?'
'అయితే అబద్ధమేంటి?'
విచారణాధికారికి కడుపులో తిప్పింది. రాజుగారి దగ్గరకు వెళ్లి, 'ప్రభూ! వీడు చాలా ప్రమాదకారి. బయటకు వదిలితే అపాయం. వీడి చేత ఎప్పటికైనా నిజం చెప్పిస్తా, నాక్కొంచెం సమయం ఇవ్వండి' అని కోరాడు.
రాజుగారు సరేనన్నారు.

* * *
కొసమెరుపు: కరడు కట్టిన కరకువాడు... తేనె పూసిన కత్తి... గోముఖ వ్యాఘ్రం... పయోముఖ విషకుంభం... కపటి... కఠినుడు... మోసగాడై, వక్రమైన అపార తెలివితేటలున్న ఎలాంటి నేరస్తుణ్ని ప్రశ్నించినా జవాబులు ఇలాగే ఉంటాయనేది నిజం. అది అలనాటి విచారణాధికారి కథైనా, ఈనాటి సీబీఐ ముందున్న వాస్తవమైనా!


PUBLISHED IN EENADU ON 07.06.2012

నిలదీసే నిజాలు!

నిలదీసే నిజాలు!


ఉదయించిన సూర్యుడి వెలుగుకి గదిలోకి సన్నగా పొడుగ్గా విస్తరించాయి నీడలు. అవి ఆ గది తలుపు వూసలవి. వూసల నీడలు తన మీద పడేసరికి ఖైదీ ఉలిక్కిపడ్డాడు. మంచి నీళ్లు తాగాలనిపించింది.
'బాబూ, దాహం...' అన్నాడు వూసల వెనకనుంచి చూస్తున్న సెంట్రీతో.

'ధన దాహమా, అధికార దాహమా?' ప్రశ్నించాడా సెంట్రీ.

ఖైదీ కళ్లెర్రజేసి కోపంగా- 'ఏం, వేళాకోళంగా ఉందా?' అన్నాడు గట్టిగా.

సెంట్రీ నవ్వి 'ఇందులో వేళాకోళానికేముంది? నీ దాహాలు ఎలాంటివో నాకు తెలియనిదా? భూదాహం, గని దాహం, కీర్తి దాహం, కరెంట్‌ దాహం, కంపెనీల దాహం... లాంటివెన్నో ఉన్నాయి కాబట్టి ఏ దాహమో తెలుసుకుందామని అడిగాను, తప్పా?' అన్నాడు.

ఖైదీ ఇక భరించలేక 'ఏయ్‌, నేనెవరో తెలుసా?' అంటూ గద్దించాడు.
సెంట్రీ ఏమాత్రం తగ్గకుండా, 'ఆపవోయ్‌, పెద్ద అరుస్తున్నావ్‌... అసలు నేనెవరో తెలుసా?' అంటూ టోపీ తీశాడు.

అతడికేసి తేరిపారి చూసిన ఖైదీ ఉలిక్కిపడ్డాడు. అచ్చం అది తన రూపే.'ఏమిటిది?' అనుకున్నాడు.
సెంట్రీ వూసల్లోంచి జైలుగదిలోకి నడిచి వచ్చేసి పక్కనే కూర్చున్నాడు. చిత్రంగా చూస్తున్న ఖైదీతో, 'ఇంకా గుర్తు పట్టలేదా? నేనే, నీ అంతరాత్మను!' అన్నాడు.

ఖైదీ నిట్టూర్చి, 'ఆఖరికి నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా?' అన్నాడు దీనంగా.
'అంతరాత్మ దగ్గర కూడా అంతరాలు దేనికి? ఈ గదిలో నువ్వు ఒంటరివి. నీ మదిలో నేను తుంటరిని. కాదంటావా?'
'సరే... చెప్పు! ఇంతకూ నేను చేసిన తప్పేంటి?'

'చేయనిదేంటని అడగరాదూ! అహ... మనలో మాటలే. గొంతులో దాహం ఇన్ని నీళ్లు గుటకేస్తే తగ్గుతుంది. నీ దాహాలు ఎప్పటికి తీరేను? ధన దాహంతోనే కదా అడ్డగోలుగా దోచుకున్నావ్‌? అధికార దాహంతోనే కదా ఇన్ని ఆపసోపాలు పడుతున్నావ్‌? ఇప్పుడు చూడు, ఎలాంటి స్థితికి దిగజారావో! అందర్నీ ఓదారుస్తానంటూ బయల్దేరి, ఆఖరికి నిన్నెవరూ ఓదార్చడానికి లేని స్థితిని, ఎవరూ ఓదార్చలేని పరిస్థితిని తెచ్చుకున్నావు. తొలినుంచి చూస్తే నీ అడుగులన్నీ తప్పుల మడుగులే కదా?'

'అంటే... దుఃఖంలో ఉన్న ప్రజల్ని ఓదార్చాలనుకోవడం తప్పంటావా?'

'నా దగ్గర కూడా వాదనలెందుకు చెప్పు? దుఃఖంలో నువ్వున్నావా, ప్రజలున్నారా? అధికార పీఠం మీద పట్టు అనూహ్యంగా దూరమైన ఏడుపు నీది. వారసత్వ ఆశల్ని సంతకాలుగా మార్చినా- ఫలితం దక్కని ఏడుపు నీది. మహానేత కొడుకన్న ఏకైక అర్హత ఉన్నా అందలం ఎక్కించలేదన్న ఏడుపు నీది. ఎదిగిన ఒడినే కాలదన్ని వీధులకెక్కిన ఏడుపు నీది. చేసిన పనులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ప్రజల మనోభావాలు మారిపోతాయన్న ఏడుపు నీది. ఇన్ని ఏడుపులు నీకు ఉండగా ఎడతెగని ఓదార్పులంటూ ఓర్పు లేకుండా ఒగరుస్తున్న నీ ప్రయత్నాలేంటో నేను గ్రహించలేననుకున్నావా?'

'నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఇంతకూ నువ్వు నాకు మిత్రుడివా, శత్రువ్వా?'

'ఆఖరికి ఈ స్థాయికొచ్చేశావన్నమాట. నీలో అనుమానం బాగా పెరిగిపోయింది. నీ చుట్టూ జరిగేదంతా కుట్రంటున్నావు. ఆ కుట్రకథతో జనాల్ని నమ్మించాలనుకుంటున్నావు. ఆఖరికి నీ అంతరాత్మనే శత్రువనుకుంటున్నావు. ఇక నువ్వు చేసేదేం లేదు. నీలో నువ్వే వగర్చుకో... ఓర్చుకో... ఓదార్చుకో...!'

ఖైదీ కళ్లెర్రబడ్డాయి.

'ఛ... నోర్ముయ్‌! వూరుకున్నకొద్దీ రెచ్చిపోతున్నావు. ఈ ప్రజాస్వామ్య సమాజంలో ఏ వ్యక్తయినా అనుకున్నది చేసే హక్కు లేదా? యాత్రలు చేసుకునే వీలు లేదా? ఏంటి పెద్ద చెప్పొచ్చావ్‌?' అంటూ అరిచాడు.

అంతరాత్మ పకపకమంటూ నవ్వింది. చూస్తుండగానే పెద్దగా ఎదిగిపోయింది.

'హ...హ...హ్హ...హ్హ...! ఇంకా నువ్వేంటో, నీ గతేంటో నీకు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు. ఆత్మస్తుతీ, పరనిందా నీకెంతగా అలవాటయిపోయాయంటే, చివరికి నీలో ఉండే నామీద కూడా వాటినే ప్రయోగిస్తున్నావు. నా దగ్గరా నటనలా? నీలోకి నువ్వు తరచి చూసుకో. మొదట్నుంచీ నీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు. నీ మనసులో ఉన్నదొకటి. పైకి మెత్తగా మాట్లాడుతున్నదొకటి. నన్ను నీ మది గదిలో ఖైదుచేసి నీ బుద్ధికి తోచినట్టు అడ్డమైన పనులన్నీ చేశావ్‌. ఫలితంగా ఇప్పుడు నువ్వే చంచల్‌గూడా జైల్లో ఓ ఖైదీగా మారావు. అధికార పీఠం అందుబాటులోకి వచ్చింది మొదలు నువ్వెన్ని పన్నాగాలు పన్నావో, ఎంతగా దోచుకున్నావో తెలియనట్టు అమాయక మొహం పెడతావేం? ఒకప్పుడు కేవలం మూడు లక్షల లోపు ఆదాయపు పన్ను కట్టిన నువ్వు, నాలుగైదు ఏళ్లలో ఏడు కోట్లకు పైగా ఎలా కట్టావంటే జవాబు చెప్పగలవా? మరో రెండేళ్లకల్లా ఏకంగా 84కోట్లు ముందస్తు పన్ను కట్టడం వెనక బాగోతాలు ఎప్పటికీ బయటకు రావనే అనుకున్నావా? ఒకటా రెండా... లక్ష కోట్లకు పడగలెత్తిన నీ సిరుల వెనక ఎన్నెన్ని విష పథకాలున్నాయో నాకు తెలియదనుకుంటున్నావా? భూములు, గనులు, ప్రాజెక్టులు, ఓడరేవులంటూ అభివృద్ధి పనుల మిషమీద అయినవారికి అడ్డగోలుగా కట్టబెట్టి, వాటికి ప్రతిగా కోట్లు కొల్లగొట్టి, నిజాలు బయటకొచ్చే సరికి అంతా కుట్రంటావా? ఇంతచేసీ ప్రజల్ని మభ్యపెట్టినట్టు, నీ అంతరాత్మనైన నన్నూ ఏమార్చాలని చూస్తున్నావంటే- నువ్వెంత కరడుగట్టిపోయావో తెలుస్తోందా? సీబీఐ ప్రశ్నలకైనా అడ్డదిడ్డంగా జవాబివ్వగలవేమో కానీ, నా ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలవా?' అంటూ గద్దించింది.

ఖైదీ కళ్లు గిర్రున తిరిగాయి. సూర్య కిరణాలు నిజాల బాణాల్లా చురుక్కుమనిపించడంతో జైలుగదిలో కళ్లు మూసుకున్నాడు ఆ కొత్త ఖైదీ!

Published in Eenadu on 06-06-2012.

సోమవారం, జూన్ 04, 2012

ఆటాడు కుందాం రా


ఆటాడు కుందాం రాపట్టువదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టగానే చెట్టు చాటు నుంచి 'యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌' అని వినిపించింది. అక్రమార్కుడు దడుసుకుని చుట్టూ చూసేసరికి రాజకీయ బేతాళుడు చాటు నుంచి వచ్చి, 'భయపడ్డావా అక్రమార్కా? నేనేలే. నువ్వొచ్చి ఎలాగూ నన్ను చెట్టు మీంచి దించి భుజాన వేసుకుంటావు కాబట్టి, కాలయాపనెందుకని నేనే దిగిపోయా. నిన్ను చూడగానే సరదాగా దొంగాపోలీస్‌ ఆట ఆడాలనిపించింది. అలా సమాధుల వెనక దాక్కుంటూ ఆడుకుందామా?' అన్నాడు భుజం మీదకి దూకుతూ!
అక్రమార్కుడు బేతాళుడిని మోస్తూ ఎప్పటిలాగే నవ్వో ఏడుపో తెలియని తన మార్కు మొహం పెట్టి, 'నేనంటే నీక్కూడా ఆటలుగా ఉందా బేతాళా! మౌనం అక్కర్లేదని చెప్పి మాట్లాడమంటావు. మాటల్లో పెట్టి మనసులోది కక్కిస్తావు. ఏం చేస్తాం? ఎలాగోలా నిన్ను శ్మశానం దాటించి వశం చేసుకోవాలనే ఇదంతా భరిస్తున్నాను' అన్నాడు.

'అబ్బ! ఆశ... దోశ... అధికారం... అప్పడం!' అంటూ బేతాళుడు వికవికా నవ్వాడు. పిశాచాలు కూడా గొంతు కలిపాయి.

అక్రమార్కుడు తలపట్టుకున్నాడు. బేతాళుడు అది చూసి, 'పోన్లే. దొంగాపోలీస్‌ ఆట వద్దు. 'నాకది...నీకిది' ఆట ఆడుకుందామా? ఇందులో నువ్వు ఛాంపియనంటగా? సరేనా?' అన్నాడు.

'ఇదెక్కడి ఆట? దీన్ని నేనెపుడూ వినలేదే...' అన్నాడు అక్రమార్కుడు.

'అబ్బ... ఎంత అమాయకంగా మొహం పెట్టావయ్యా! ప్రజల ముందు ఉన్నావనుకున్నావా? వాళ్లయితే నమ్ముతారేమో కానీ నా దగ్గరెందుకయ్యా ఆ మొహం? నాకు తెలియదనుకోకులే. దీన్నే 'క్విడ్‌ ప్రొ కో' అని కూడా అంటారటగా? నువ్వు, నీ అనుచరులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ఆర్జించింది దీంతోనేటగా? ఈ ఆటలో మెలకువలేంటో మాకూ నేర్పించవూ?' అన్నాడు బేతాళుడు, వచ్చే నవ్వు ఆపుకొంటూ.

ఏమనాలో తెలియని అక్రమార్కుడు వెంటనే బేతాళుణ్ణి భుజం మీద నుంచి దించి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూడసాగాడు.

బేతాళుడు పకపకమని, 'ఇదేంటయ్యా అక్రమార్కా! నేనేమైనా అమాయక ఓటర్ననుకున్నావా? కొంపదీసి చెంపలు నిమరవు కద? తల మీద ముద్దు పెట్టవు కద?' అన్నాడు.

అక్రమార్కుడు కనుబొమ్మలు ముడిచి, 'నువ్వు నిజంగానే బేతాళుడివా లేక సీబీఐ పంపిన విచారణాధికారివా?' అన్నాడు కోపంగా.

బేతాళుడు మళ్లీ భుజమెక్కి కూర్చుని, 'మొత్తానికి నీ అనుమానం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదయ్యా! ఆఖరికి శవం కాలుతున్న వెలుగులో నీ వెనక పడే నీడను చూసి కూడా సీబీఐ అనుకునేలా ఉన్నావు... హ...హ్హ...హ్హ!' అంటూ నవ్వాడు.

అక్రమార్కుడి మొహం జేవురించింది. కోపంతో కళ్లెర్రజేసి, 'మీరంతా ఇంతే. భూత ప్రేత పిశాచ గణాలు! రాష్ట్రంలో పార్టీలు, అధికారులు, పోలీసులు అందరూ మీలాగే ఏకమయ్యారు. ప్రజలకు మేలు చేయడం కోసం మేమింత కష్టపడితే దానికి లేనిపోని అర్థాలు తీస్తారా? ఎవరూ చేయని పనులు చేస్తే లోటుపాట్లు వెతుకుతారా? మంచి చూడకుండా, చెడు చూస్తారా? కానీ గుర్తుంచుకోండి. ప్రజలంతా గమనిస్తున్నారు. తెలిసిందా?' అన్నాడు ఆవేశంగా.

శ్మశానంలో పిశాచాలన్నీ భళ్లున నవ్వాయి. బేతాళుడు పగలబడి నవ్వి, 'సర్లేవయ్యా! అలాగే కానీ! నీ నమ్మకం నేనెందుకు కాదనాలి? మరైతే ఇప్పుడీ శ్మశానంలో ప్రజలెవరూ లేరు కదా? కాబట్టి నిజాలు చెప్పు. నువ్వాడించిన భూదారుణాల గుట్టు విప్పు. ఏ ధైర్యంతో ఇన్ని అకృత్యాలకు ఒడిగట్టావు? ఎలా ఇందుకు పథక రచన చేశావు? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సరైన సమాధానాలు చెప్పకపోయావో... అధికార పీఠం ఎప్పటికీ అందనంత ఒట్టు!' అన్నాడు.

అక్రమార్కుడు కాసేపు నిరుత్తరుడయ్యాడు. తరవాత నెమ్మదిగా గొంతు పెగల్చుకుని, 'ఎంత మాటన్నావు బేతాళా! నేను కలలో కూడా ఊహించలేని విషయమిది. ఇక తప్పుతుందా? విను. అధికారం అందుబాటులోకి వచ్చేసరికి నేనొక చిన్న కంపెనీకి అధిపతిని మాత్రమే. రాకరాక వచ్చిన అధికారం అండతో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలని భావించాను. అందుకు అనుగుణంగా అనుచర వర్గంతో కలసి పావులు కదిపాను. రాజధాని శివార్లలోని భూముల ధరల్ని రంకె వేయించడంతో మా పని మొదలు పెట్టాం. ముందుగానే అయినవారు, అనుంగు అధికారులు, ప్రముఖుల చేత భూములు కొనిపించి, అక్కడికి విదేశీ కంపెనీలు, రింగురోడ్లు, అంతర్జాతీయ ప్రాజెక్టులు రాబోతున్నట్లు ప్రచారం చేయించాం. అలా భూముల ధరలు పెరగడంతోనే అమ్మించి, సంపద సృష్టించడం ఎంత సులువో అస్మదీయులకు అర్థమయ్యేలా చేశాం. ఆపై అధికారులను ప్రలోభపెట్టి పనులు జరిపించాం. నా వ్యాపారాలలో పెట్టుబడి పెట్టిన వాళ్లకి కావలసిన భూముల్ని ధారాదత్తం చేయడానికి తెర తీశాం. ఏ పరిశ్రమకైనా, ప్రాజెక్టుకైనా రాష్ట్రంలోని బంజరు భూముల్నే ఇవ్వాలి. కానీ వాటికి ధర ఉండదు కాబట్టి పచ్చని పంట పొలాల్ని సైతం ఇవ్వడానికి సమకట్టాం. సెజ్‌లను సృష్టించి రైతుల భూముల్ని వశపరుచుకున్నాం. ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి మా పనులకు అభివృద్ధి ముసుగు వేశాం. ప్రాజెక్టులొస్తే పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఊదరగొట్టాం. గ్రామాల రూపురేఖలే మారిపోతాయని ఊరించాం. ఇలా గనులు, కొండలు, అరణ్యాలు సైతం తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చేశాం. ఇదే నువ్వంటున్న క్విడ్‌ ప్రొ కో కార్యక్రమం. ఇక చాలా?' అన్నాడు నీరసంగా.

అంతా విని పిశాచాలు సైతం బాధగా నిట్టూర్చాయి. బేతాళుడు బాధగా మొహం పెట్టి, 'ఎంత పని చేశావు అక్రమార్కా! మీ మాయాజాలం వల్ల ప్రాజెక్టులు, పరిశ్రమలేవీ రాకపోగా వేలాది మంది అమాయక ప్రజలు భూములు కోల్పోయారు. ఉపాధి కోల్పోయి కూలీలుగా మారారు. సర్లె... శ్మశానంలోనైనా నిజం చెప్పావు. సంతోషం. సరైన సమాధానం చెప్పాక ఇంకా నేనెందుకు నీ భుజం మీద వూరేగుతాను? వస్తా' అంటూ బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు!

PUBLISHED IN EENADU ON 4.6.2012