బుధవారం, జులై 25, 2018

రాజకీయ పరిష్వంగనం!

‘నమస్కారం గురూగారూ! ఉన్నపళంగా రమ్మని కబురంపించారు, ఏమైనా అర్జంటు పనాండీ?’


‘రారా... నువ్వొచ్చేలోగా హాలంతా పచార్లు చేస్తూనే ఉన్నాన్రా. మొత్తానికి వచ్చావ్‌...’
‘అయ్‌బాబోయ్‌! మీరు పచార్లు చేస్తూ మరీ ఎదురు చూశారంటే అదేదో గొప్ప పనే అయ్యుంటుందండి. చెప్పండి..’
‘అదేరా... ·ôÙడు కళ్లూ తెరిచి ఉండగా, ఓ కన్నును మాత్రమే నెమ్మదిగా మూసి తెరవడం నీకు వచ్చా రాదా అని కనుక్కుందామనీ...’
‘అదేంటి గురూగారూ! ఏదో కొంపలారిపోయే పననుకుంటే, ఇలా కన్నుకొట్టడం వచ్చా అని అడుగుతున్నారు?’
‘భలేవాడివిరా! ఇప్పుడదే సంచలనం అయిపోయిందిరా బాబూ... అదెంత గొప్ప విద్యో ఇప్పుడే టీవీ చూస్తుంటే అర్థమైంది. అందుకే మరి ఆదరాబాదరా కబురంపించాను. కాబట్టి నే చెప్పేదేంటంటే, నీకు కన్ను కొట్టడం వస్తే ఫర్వాలేదు. లేకపోతే ఎవర్నైనా కుర్రవెధవల దగ్గరకి పోయి ఎలా కన్నుకొట్టాలో నేర్చుకో...’
‘ఇప్పుడంత హడావుడిగా నేర్చుకోవడం ఎందుకండీ? కాస్త వివరంగా చెబుదూ?’
‘ఒరే... నువ్వు నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి చేరావ్‌. నిన్ను సాధ్యమైనంత నీచ రాజకీయ వేత్తగా మార్చాలనేదే నా ధ్యేయం. ఆ ప్రయత్నంలో నువ్వు కూడా ఎంతో కొంత ఎదిగావు, కాదనను. కానీ ఇంకా రాటుదేలలేదురా. చుట్టూ జరుగుతున్న రాజకీయ తతంగాన్ని చూసుకోకుండా, నీ దారిన నువ్వు పోతున్నావు. అదే నా బాధ...’
‘అయ్యో బాధ పడకండి గురూగారూ! నన్నీ మాత్రమైనా మార్చింది మీరే. ఏదో కాలం కలిసిరాక ప్రతిపక్షంలో పడిపోయి, పక్షవాతం వచ్చినట్టు అయిపోయి, దిక్కుతోచక తిరుగుతున్నాను కానీ... మీ శిష్యుడిగా నా బాధ్యత మరువలేదండి. ఇంతకీ ఇప్పుడింత కంగారు ఎందుకు పడ్డారో తెలియజేయండి...’
‘అక్కడికే వస్తున్నానురా. మొన్న లోక్‌సభ ప్రత్యక్షప్రసారాలు టీవీలో వచ్చాయి చూశావా? అప్పుడు తెలిసిందిరా మనమెంత వెనకపడిపోయి ఉన్నామో. ఆ ప్రసారాల్లో కాంగ్రెస్ యువ‌నేత రాహుల్‌గాంధీ చేసింది చూశాక ఇక ఆగలేకపోయారా. ఇక నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ, వెంటనే కన్నుగీటడం నేర్చుకోవాల్సిందే...’
‘ఆ.. నేనూ చూశానండోయ్‌. ఆయనగారు ప్రధానమంత్రిని విమర్శిస్తూ ప్రసంగించి, ఆనక అకస్మాత్తుగా వెళ్లి ఆయన్ని అనూహ్యంగా కౌగలించేసుకున్నారండి. ఇదేంట్రా బాబూ... ఇలా చేశాడని నేను నోరెళ్ల‌బెట్టి చూసేంతలోగానే, చేతులూపుకుంటూ నడుచుకొచ్చేసి తన సీట్లో చతికిలబడ్డారండి. తర్వాత మొహం పక్కకు పెట్టి అదోరకంగా కన్నుగిలిగారండి. కానీ నాకు తెలియక అడుగుతాను గురూగారూ, కన్నుకొట్టడం అంత గొప్ప విద్యాండీ?’
‘ఓరి సన్నాసీ! అదే కదురా చెబుతుంట? కన్నుగీటడం పలురకములు. రోడ్డు మీద ఓ కుర్రాడు, ఓ అమ్మాయిని చూసి కన్నుగీటాడనుకో. వాడిని ఆకతాయంటాం. ఆ అమ్మాయి చెప్పు తీసి కొట్టచ్చు, లేదా పోలీసులకు చెబితే ఈవ్‌టీజింగ్ కింద‌ అరెస్టు కూడా చేయించొచ్చు. అది తుంటరి కన్నుగీత. మామూలుగా పనీపాటా లేని పోరంబోకులు, దగుల్బాజీలు చేసే పని అది. ఇక నువ్వు నీ స్నేహితుడి కేసి చూసి కన్ను కొట్టావనుకో. అది సరదా కన్నుగీత. నువ్వు ఎదుటివాడిని బుట్టలో వేయడానికో, లేదా ఉబ్బేయడానికో ఓ అబద్ధం ఆడి, ఆనక మరొకరి కేసి చూసి కన్ను చికిలించావనుకో. అది అతితెలివి కన్నుగీత...’
‘అబ్బో... కంటికొట్టుడులో ఇన్ని రకాలున్నాయా?’
‘ఇంకా ఉన్నాయిరా బడుద్దాయ్‌! ఒకోసారి ఈ కన్నుగీత నిన్ను రాత్రికి రాత్రి పెద్ద ప్రముఖుడిని చేసేయవచ్చు కూడా. ఆమధ్య ఓ మలయాళ నటి ఎవరో ఇలాగే చేసి, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించలేదూ?’
‘అవునండి. ప్రియావారియర్‌ అంటారండి. ఏదో సినిమా కోసం కన్నుగీకిందండి. నేను కూడా చూశానండి. కానీ అది నటనలో భాగం కదా గురూగారూ? మరి మన యువనేత కన్నుగీకుడేంటండి?’
‘ఒరే... అది నటనైతే, ఇది మహా రాజకీయ నేత్ర విన్యాసంరా బాబూ. ఆయన కన్నార్పడం తన పక్కన కూర్చున్న వాడికే అయినా, నిజానికి అది దేశ ప్రజలందరికీ కొట్టినట్టేరా నాయనా. అంతకు ముందు ఆయనేం చేశాడో గుర్తుందా?’

‘ఎందుకు లేదండి? ప్రధానమంత్రిని నానా మాటలూ అని, ఎంచక్కా వెళ్లి కౌగలించుకున్నారండి. మరి పనిలో పనిగా ఆ కన్నుగీటడంతో పాటు, ఆ కౌగిలింతలు కూడా నేర్చుకోమంటారా?’ 
‘కొంచెం ఎదుగుతున్నావురా..సంతోషం. ఈ కౌగిలింతలు కూడా పలు రకములు. విదేశాల్లో పరిచయం అవ్వగానే కౌగలించుకుంటారు చూడు. అది మర్యాద కౌగిలింత. నువ్వేదయినా గొప్ప పని సాధించినప్పుడు... అహ... నువ్వేమీ సాధించలేదనుకో, కానీ అలాంటి సందర్భంలో నీ సన్నిహితులు కౌగలించుకుంటారు చూడు, అది ఆత్మీయ కౌగిలింత. ఇద్దరు కలిసి ఏ బ్యాడ్మింటనో లాంటి ఓ ఆట ఆడేశాక, ఎవరు •Þలిచినా సరే, మరొకర్ని కౌగలించుకుంటారే, అది క్రీడాస్ఫూర్తి కౌగిలింత. ఇక మనకిష్టం ఉన్న వాళ్లను వాటేసుకున్నామనుకో, అది అభిమాన కౌగిలింత. అర్థమవుతోందా?’
‘ఆహా.. గురూగారూ! ఏది ఏమైనా మీతో మాట్లాడ్డమే ఓ ఎడ్యుకేషనండీ... కౌగిలింతల్లో మర్మాలు ఎంతబాగా చెబుతున్నారండీ!’
‘ఓరే.. గిరీశంలాగా నన్ను ఉబ్బేయాలనుకోకు. నా దగ్గర నేర్చుకున్న పాఠాలు నా మీదే ప్రయోగించాలనుకోకు. ఇంకా చెబుతాను విను. ఆమధ్య ఓ హిందీ సినిమా వచ్చింది చూశావా? అందులో సంజయ్‌దత్‌ అనే కథానాయకుడు అందరికీ కౌగలించుకుంటూ ఉంటాడు, గుర్తొచ్చిందా?’
‘వచ్చిందండీ. మున్నాభాయ్‌ సినిమా అండి. అందులో నేల తుడిచే ముసిలాడిని, కోపంతో బాధ పడుతున్నవారిని వెళ్లి వాటేసుకుంటాండండి. ఆ సినిమాలో అది బాగా హిట్టయిందండి.. కానీ నాకు అర్థం కాక అడుగుతానండీ, ఆ మున్నాభాయ్‌ కౌగిలింతకి, ఈ పొలిటికల్‌ భాయ్‌ కౌగిలింతకి తేడా ఏంటండీ?’
‘ఆ సినిమాలోది మానవత్వాన్ని చూపించే చర్యరా బాబూ. ఇది అలాకాదు, మన యువనేత నేర్పుతున్న ఓ వింత, విచిత్ర విన్యాసం. నీ కొడుకును కౌగలించుకుని ఆనందించడాన్ని పుత్రగాఢ పరిష్వంగనం అంటారు. కానీ ఇలా ప్రతిపక్ష నాయకుడిని ముందు విమర్శించి, ఆనక తీరిగ్గా వెళ్లి వాటేసుకోడాన్ని రాజకీయ అతి చాతుర్య గాఢపరిష్వంగనం అనుకోవచ్చు...’
‘వార్నాయనో! పైకి ఏమీ తెలియని అమాయకుడిలాగా కనిపిస్తాడు కానీ ఈ యువనేత మహా గడుగ్గాయిలా ఉన్నాడండోయ్‌. ప్రియావారియర్‌ నుంచి, మున్నాభాయ్‌ నుంచీ ఈ విద్యలు నేర్చుకున్నాడంటారా?’
‘ఇది నేర్చుకుంటే వచ్చేది కాదురా. స్వయంగా, స్వభావ సిద్ధంగా పెరిగిపోయే లక్షణం. Ëదాన్నుంచి మనం ఏం నేర్చుకోవాలనేదే ముఖ్యం’
‘ఏం నేర్చుకోవచ్చంటారు గురూగారూ!’
‘ప్రజల్ని ఏమార్చే గొప్ప కనికట్టురా ఇది. అనేసిన మాటలు అనేసి, తర్వాత వెళ్లి మీద పడి పట్టేసుకున్నామనుకో, ఆహా.. ఎంతటి మంచి మనసు, ఎంతటి గొప్ప విశాల హృదయం, అనిపించదూ? అదన్నమాట కిటుకు. ఇక ఆ కన్నుగీకుడుంది చూశావూ? తన వాళ్లకి తానెందుకు అలా చేశానో చెప్పే నేత్రావధానం అన్నమాట. .తెలిసిందా?’
‘కానీ గురూగారూ! నాదో చిన్న సందేహం. ప్రజలు ఇలాంటి కిటుకుల్ని గమనించరంటారా?’
‘ఓరి పిచ్చి సన్నాసీ.ప్రజానీకం నాకన్నా, నీకన్నా, ఆ యువనేత కన్నా తెలివైన వాళ్లురా. వాళ్లు అందరినీ గమనిస్తూ ఉంటారు. అలా గమనించబట్టే మనం ఇలా వెనక బెంచీల్లో ఉన్నామన్న సంగతి తెలుసుకో ముందు. ప్రజలకి ఎప్పుడు ఎవరిని కౌగలించుకోవాలో, ఎవరికి కన్నుకొట్టాలో బాగా తెలుసు. అది మనకి అనవసరం. కొత్త విద్యలు ఎవరిలో కనిపించినా, ముందు నేర్చుకోవడమే మన పని. కాబట్టి వెళ్లి కన్నుకొట్టడం, కౌగిలించడం నేర్చుకుని వచ్చి కనబడు’.
-ఎ.వి.ఎన్‌.హెచ్‌.ఎస్‌.శర్మ

గురువారం, జనవరి 25, 2018

వైవిధ్యమైన నటనకు గీటురాళ్లెన్నో!దర్పం, రాజసం ఉట్టిపడే 
ఓ అందాల రాజకుమారి... 
అందం, అమాయకత్వం ప్రతిబింబించే 
ఓ ప్రేయసి... 
చిలిపిదనం, చలాకీదనం కలగలిసిన 
ఓ పడుచుపిల్ల... 
హుందాతనం, గాంభీర్యం కనబరిచే ఓ ప్రౌఢ... 
నటి కృష్ణకుమారి నటజీవన ప్రస్థానంలో గుర్తుండిపోయే పాత్రలెన్నో! 
ఆమె అభినయ వైవిధ్యానికి గీటురాళ్లెన్నో!! 
పాత్ర ధరించినా ఆ పాత్రలో ఒదిగిపోవడం కృష్ణకుమారి నైపుణ్యం. ఎలాంటి నటనైనా అది ఆమెకే సాధ్యమనేలా మెప్పించడం ఆమెకు సుసాధ్యం. 
* తెలుగు చిత్రసీమకు రెండు కళ్లయిన   ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సరసన అసమాన అభినయాన్ని పండించి రాణిస్తూనే... కాంతారావుతో కలసి 28జానపద చిత్రాల్లో అభిమానులను అలరించారు. ఎన్టీఆర్‌తో దాదాపు 25 సినిమాలు, అక్కినేనితో సుమారు 18 చిత్రాలు చేసిన కృష్ణకుమారి వారితో దీటైన నటనతో ఆకట్టుకున్నారు. కాంతారావుతో ఎన్నో జానపద చిత్రాల్లో నటించారు. ‘బందిపోటు’, ‘అగ్గి   పిడుగు’, ‘లక్షాధికారి’, ‘నిండు సంసారం’, ‘వరకట్నం’, ‘కులగోత్రాలు’, ‘భార్యాభర్తలు’, ‘జ్వాలాద్వీప రహస్యం’, ‘గురువును మించిన శిష్యుడు’, ‘చిక్కడు దొరకడు’, ‘చదువుకున్న అమ్మాయిలు’ లాంటి సినిమాల్లో ఆమె నటన గుర్తుండిపోతుంది. ఆమె వైవిధ్యభరితమైన అభినయానికి వెండితెర ఆనవాళ్లు ఎన్నో... 

* అమ్మాయిల వెంటపడి తిరిగే ఓ సంపన్నుడు (అక్కినేని) తనను చులకనగా చూస్తే చెంప దెబ్బకొట్టిన ఆభిజాత్యం... అతడే పట్టుదల పట్టి తనను పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయత... భర్తననే అధికారంతో అతడు తనను వశపరుచుకోవాలని చూసినప్పుడు నిబ్బరంగా తన అయిష్టతను వెలిబుచ్చే ధైర్యం... ఇవన్నీ ఒకే పాత్రలో ఆమె అభినయించిన తీరు ‘భార్యాభర్తలు’ సినిమాలో చిరస్మరణీయం. తనకిష్టంలేని వాడే పెళ్లిచూపులకు వచ్చినప్పుడు ‘ఏమని పాడెదనో ఈ వేళ... మానస వీణ మౌనముగా నిదురించిన  వేళ...’ పాటలో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. సినిమాలో ఒక సన్నివేశంలో  అక్కినేనితో ఆమె, ‘‘మనసు ప్రమేయం లేని ఈ దేహమేగా మీకు కావలసింది... అనుభవించండి’’ అంటూ శరీరాన్ని అప్పగిస్తున్నట్టుగా ముందుకొచ్చి నిలబడుతుంది. నటన మోతాదులో ఏ మాత్రం తేడా వచ్చినా  కరుణరసభరితమైన ఆ సన్నివేశం అభాసుపాలవుతుంది. అయితే కృష్ణకుమారి ఆ సన్నివేశాన్ని అద్వితీయంగా పండించారు. 

* తాను ప్రేమించింది ఓ సామాన్యమైన యువకుడిని (జగ్గయ్య)... కానీ అతడి స్నేహితుడు (ఎన్టీఆర్‌) తనను ఇష్టపడతాడు.ప్రియుడి త్యాగంతో అతడి స్నేహితుడికే ఇల్లాలవుతుంది... పెళ్లయ్యాక భర్తకు   అనుమానం మొదలవుతుంది... ఇలాంటి కథతో నడిచే ‘గుడిగంటలు’ సినిమాలో కత్తిమీద సాములాంటి పాత్రను కృష్ణకుమారి అలవోకగా మెప్పించారు. ఓ కన్నెపిల్లగా చలాకీతనాన్ని చూపినా... ప్రేమించినవాడితో పెళ్లికాని పరిస్థితుల్లో బేలతనాన్ని కనబరచినా... పెళ్లయ్యాక భర్త అనుమానిస్తున్నా నిశ్చలంగా తన పవిత్రతను నిరూపించుకునే హుందాతనాన్ని ప్రదర్శించినా కృష్ణకుమారికే చెల్లింది. 
* దేశాన్ని గడగడలాడిస్తున్న బందిపోటును పట్టుకోడానికి వెళ్లే ఓ ధీరోదాత్తురాలైన రాజకుమారిగా... ఆ బందిపోటే ప్రజారంజకుడని తెలిసి మనసిచ్చిన అమ్మాయిగా... ఆకట్టుకునే కృష్ణకుమారిని ‘బందిపోటు’ సినిమాలో చూస్తాం. 

* ఇంకా... కులం గోత్రం లేని పిల్లను పెళ్లాడావంటూ అత్తింటి వారు వెలివేస్తే వారి కోసమే పాటుపడుతూ... కులం కన్నా గుణం మిన్న అని నిరూపించి కుటుంబాన్ని కలిపే కోడలిగా ‘కులగోత్రాలు’ సినిమాలో ఆమె నటన మరుపురానిదే. అలాగే... పేదింటి పిల్లగా ఒకరిని ప్రేమించినా,   సంపన్నురాలైన తన స్నేహితురాలు కూడా అతడినే ప్రేమిస్తోందని తెలిసి మానసికంగా నలిగిపోయే పాత్రలో ‘చదువుకున్న అమ్మాయిలు’లో చక్కని నటన చూపించింది. అన్ని వ్యసనాలు ఉండి కూడా కపట వేషాలతో తనను ప్రేమించిన వాడిని తన అమాయకత్వంతో ఆకట్టుకుని అతడిని మంచి మార్గంలోకి మార్చిన అమ్మాయిగా ‘అంతస్తులు’ సినిమాలో అలరించింది. ఇక జానపద, పౌరాణిక చిత్రాల్లో కూడా పాత్రకు తగినట్టు ఒదిగిపోయి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కృష్ణకుమారి.
PUBLISHED IN EENADU ON 25.01.2018

అందంగా... అమాయకంగా... అభినయంలో అపురూపంగా


‘‘చెడిపోవడమనేది మనిషి  మనసును బట్టి ఉంటుంది. నీ వ్యక్తిత్వం, నీ మనోబలం స్థిరంగా ఉంటే ఎక్కడున్నా చెడు జరగదు. నువ్వు సినిమాల్లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.  మిగతాది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా’’
- ఇది ప్రముఖ నటి కృష్ణకుమారికి వాళ్ల నాన్నగారు రాసిన ఉత్తరం. సినిమాల్లో అవకాశాల గురించి ఆయనకు తెలియజేస్తూ కృష్ణ కుమారి 70 ఏళ్ల క్రితం రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరమిది. మంచి చెడుల వ్యత్యాసం గురించి చెబుతూనే తాను ఎంచుకున్న రంగంలో ప్రవేశానికి అనుమతిస్తూ ఆయనిచ్చిన ప్రోత్సాహం తెలుగు చలన చిత్రసీమకు ఓ అందాల తారను పరిచయం చేసింది. ఓ అసమాన నటి ముందడుగు వేయడానికి దోహదపడింది. అలా కృష్ణకుమారి 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ సినిమాతో వెండితెరపై తొలి అవకాశాన్ని అందుకున్నారు. అయితే ఆ సినిమా కన్నా ముందు ‘మంత్రదండం’ విడుదలవడం విశేషం. అందంతో, అందుకు తగిన నాజూకు తనంతో, అమాయకత్వాన్ని ప్రతిబింబించే ముఖంతో వెండితెరపైకి అడుగుపెట్టిన కృష్ణకుమారి అలనాటి చిత్రాల్లో అప్పటి  యువకుల హృదయాలను కొల్లగొడుతూనే సహజమైన అభినయంతో ఆకట్టుకుంటూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. 
చిన్నతనంలోనే వేదాంతం జగన్నాథశర్మ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న కృష్ణకుమారి, సినిమాల్లో ఎలాంటి పాటల్లోనైనా ఉత్సాహంగా నర్తిస్తూ ఆకట్టుకునేవారు. రెండున్నర దశాబ్దాల పాటు దాదాపు 150 చిత్రాల్లో నటించి వైవిధ్యమైన పాత్రలు పోషించిన కృష్ణకుమారి మూడుసార్లు జాతీయ అవార్డులను, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు, కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్‌ అవార్డులు, బ్రిటన్‌లోని బర్మింగ్‌హాం సంస్థ వారి జీవన సాఫల్య  అవార్డును... అన్నింటినీ మించి ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని అభిమానాన్ని ఆర్జించుకున్నారు. అలనాటి అగ్రతారలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో పాటు కాంతారావు, హరనాథ్‌, జగ్గయ్య లాంటి మేటి నాయకుల సరసన నటించి ప్రేక్షకాదరణ పొందారు. 

సంప్రదాయ కుటుంబానికి చెందిన కృష్ణ    కుమారి, పశ్చిమ బెంగాల్‌లోని నౌహతిలో 1935లో పుట్టారు. ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఆమె చిన్నవారు. ప్రముఖ నటి ‘షావుకారు జానకి’ ఆమె అక్కే. మరొక అక్క దేవకి కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆ తర్వాత చిన్నవయసులోనే చనిపోయారు. తండ్రి ఉద్యోగరీత్యా కృష్ణకుమారి పలు ప్రాంతాల్లో చదువుకున్నారు. రాజమండ్రి, చెన్నై, అస్సాం, కోల్‌కతాల్లో చదువుకుని మెట్రిక్‌ పూర్తయ్యేనాటికి చెన్నైకి చేరారు. అదే ఆమె నట జీవితానికి మలుపుగా మారింది. ఇంటర్‌లో చేరేలోగానే ఆమెను వెండితెర  అవకాశం ఆహ్వానించింది. ఓసారి ‘స్వప్న సుందరి’ సినిమాకు వెళ్లిన కృష్ణకుమారి,  తమిళనాడు టాకీస్‌ సౌందరరాజన్‌ కుమార్తె భూమాదేవి కంటపడ్డారు. సౌందరరాజన్‌ తీయాలని తలపెట్టిన ఓ సినిమాలో కథా  నాయికగా అమాయకంగా కనిపించే అమ్మాయి కోసం వెతుకుతున్న ఆమెకు కృష్ణకుమారిలో ఆ లక్షణాలన్నీ కనిపించాయి. అలా వచ్చిన అవకాశం గురించి చెబుతూనే కృష్ణకుమారి అప్పటికి కోల్‌కతాలో ఉంటున్న తండ్రికి ఉత్తరం రాయడం, ఆయన వెంటనే సరేననడం జరిగిపోయాయి. ఆ సినిమానే ‘నవ్వితే నవరత్నాలు’. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఏకంగా 14 సినిమాల్లో అవకాశాలు వచ్చి   పడ్డాయి. అప్పటికి ఆమె వయసెంతనీ? కేవలం పదహారేళ్లు! 
సినిమాల్లో చురుగ్గా ఉన్న సమయంలోనే కృష్ణకుమారి, స్నేహితుల ద్వారా పరిచయమైన వ్యాపారవేత్త అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వారి కుమార్తె దీపిక. పెళ్లయ్యేనాటికి కృష్ణకుమారి నటించిన ‘నిండు సంసారం’, ‘వరకట్నం’ సినిమాలు విజయవంతంగా ఆడుతున్నాయి. అవకాశాలు చేతినిండా ఉన్నా ఆమె గృహిణిగానే ఉండడానికి ఇష్టపడ్డారు. అయితే పెళ్లయిన రెండేళ్లకు భర్త ప్రోత్సాహంతో నటించడం మొదలు పెట్టి దాదాపు 50 సినిమాలు చేశారు.
PUBLISHED IN EENADU ON 25.01.2018