శుక్రవారం, జూన్ 27, 2014

పరాజయ పాఠాలు
'నమస్కారం గురూగారూ'
'రారోయ్‌ రా! ఏంటీ చాలా కాలమైంది. మొహం అలా వేలాడేసుకుని ఉన్నావేం?'

'మీకు తెలియనిదేముంది గురూగారూ! ఫలితాలు గూబ గుయ్యిమనిపించాయి. పరువు, పవరు కూడా పరారయ్యాయి. అత్త తిట్టినందుకు ఏడవాలో, ఆడపడుచు నవ్వినందుకు ఏడవాలో తెలియని పరిస్థితిలో పడ్డా. ఎవరికీ మొహం చూపించలేక యాత్రలకు పోయి వచ్చా'

'అంతేలేరా, లోకం తీరే అంత. కానీ, అలా బెంబేలు పడిపోయి మొహం దాచేసుకుంటే ఎలారా?'

'ఇంకేం చేయమంటారు చెప్పండి. సిగ్గుతో చితికిపోయాననుకోండి. పైగా ప్రచారంలో రెచ్చిపోయి మరీ, కుర్చీ నాదేనన్నట్టు ఎడాపెడా వాగేశాను కదండీ? దాంతో అద్దంలో కూడా నా మొహం నేనే చూసుకోలేకపోయానంటే నమ్మండి'

'వార్నీ, ఆత్రగాడికి బుద్ధి మట్టం అన్నట్టు, నా దగ్గర రాజకీయ పాఠాలు పూర్తిగా నేర్చుకోరా ఆ తరవాత కాస్తో కూస్తో అనుభవం ఏడిశాక బరిలోకి దిగచ్చునంటే వినకుండా, మహా నేతలాగా పోజెట్టి దూకేశావు. బొక్కబోర్లా పడ్డావు. కుర్చీ ఏక్కేద్దామన్న దురదేగానీ, ఎక్కేందుకు దమ్ముందో లేదో చూసుకోలేదు మరి. ఏం చేస్తాం...'

'ఏంటి గురూగారూ మీరు కూడానూ. చచ్చిన పామును ఇంకా ఎందుకండీ చంపడం? ఇప్పుడేం చేయాలో చెప్పుదురూ'

'సర్లేరా, నీ అరకొర బుద్ధితో వేసిన గెలుపు సూత్రాలు బెడిసికొట్టినా, పరాజయ పర్వంలో పాఠాలు బోలెడున్నాయి. అవైనా ఒంటపట్టించుకో మరి'

'పరాజయంలో పాఠాలేముంటాయండీ, మీది మరీ చోద్యం కాకపోతేనూ?'

'ఓరమాయకుడా, రాజకీయం అంటే అదేరా! సమకాలీన నేతల్ని చూసైనా నేర్చుకునే తెలివిడి ఏడ్వాలి. గెలిచినోడు ఎంత సందడిగా మీటింగులు గట్రా పెడతాడో, అంతకంటే హడావుడిగా నువ్వు మీటింగులు పెట్టుకోవాలి'

'ఓడినోడికి మీటింగులేంటండీ?'

'ఎందుకుండవురా... చతికిల పడ్డానికి కారణాలు విశ్లేషించుకుంటున్నట్టు కనబడాలి. ప్రజలు ఛీ కొట్టడమే ఏకైక కారణమని నీకు తెలిసినా, ఏవేవో కారణాలు వెతికి మైకుల ముందు పళ్లికిలిస్తూ చెప్పాలి'

'మరి ఎలాంటి కారణాలు చెప్పాలండీ?'

'ఓడిన నేతల్ని గమనించలేదురా? గెలిచినోడు ప్రజల్ని హామీల మత్తులో ముంచేశాడని వాగొచ్చు. ఆ హామీలని జనం పాపం... అమాయకంగా నమ్మడంవల్లే వాళ్ల గెలుపు సాధ్యమైందని వదరచ్చు. వాళ్లు చెప్పినవేమీ చేయలేరని, ఆ సంగతి ప్రజానీకానికి నిలకడ మీద తెలుస్తుందని బోర విరుచుకుని మరీ మాట్లాడొచ్చు. దీన్ని నిస్సిగ్గు నిబ్బరమంటారు'

'కానీ గురూగారూ, ప్రచారంలో నేను కూడా అడ్డదిడ్డమైన హామీలిచ్చా కదండీ? నా మాటలు విని జనం నవ్వుకోరాండీ?'

'ఒరే జనానికన్నీ తెలుసురా. కానీ, వాళ్లు నవ్వుకుంటారని, ఏదేదో అనుకుంటారనీ నువ్వనుకుంటే ఎలారా? నీకేదో గొప్ప చిత్తశుద్ధి గట్రా ఉన్నట్టు బిల్డప్పులివ్వద్దూ? అంచేత నువ్విచ్చిన హామీలే నికార్సయినవన్నట్టు, అవతలివాళ్లవి వట్టి డొల్ల మాటలన్నట్టు నోటికొచ్చినట్టు పేలడమే. ఈ విద్యను ఒంటపట్టించుకోడానికి కావలసిన అర్హతలన్నీ ఇప్పుడు నీలో ఉన్నాయి మరి'

'ఆహా... ఓడినవాడిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు గురూగారూ మీరు'

'ఏడిశావ్‌లే... ఆత్మవిశ్వాసం లాంటి మంచి పదాలెందుకు? మనలో మాటగా అనుకోవాలంటే ఇది ఆత్మవంచననుకోవాలి'

'అర్థమైంది గురూగారూ! మనం ఓడించినా ఇతడు పాపం మన గురించే ఆలోచిస్తున్నాడని ప్రజలు జాలిపడేలా మాట్లాడాలన్నమాట'

'జనం అలా జాలి పడతారనేది వట్టి భ్రమేనని నీకు తెలిసినా, నువ్వు మాత్రం గెలిచినా ఓడినా నీ మనసంతా ప్రజల కోసమే దిగులు పడుతున్నట్టు పైకి కనిపించాలి. కాబట్టి లోలోపల నీ మనసు భగభగలాడిపోతున్నా, పైకి మాత్రం వినయంగా మొహంపెట్టి ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు సెలవీయాలి. అసలింతగా జనం నువ్వంటే కుతకుతలాడిపోతున్నట్టు ఫలితాలనుబట్టి తెలిసినా, నువ్వు మాత్రం మెత్తగా మాట్లాడుతూ ప్రజల వ్యతిరేకతను ముందుగా గమనించలేకపోయామని నమ్రత చూపించాలి. నిజానికి వినయం, నమ్రత నీ ఒంటికి సరిపడవనుకో... కానీ అవన్నీ నీలో ఉన్నట్టు సాధ్యమైనంత భ్రమ కల్పించడానికి ఎక్కడలేని కృషీ చేయాలి. అర్థమైందా?'

'బాగా తెలిసిందండి. ఇక మీదట నేనేం చేయాలో కూడా సెలవిద్దురూ'

'ఇక నీకెలాగూ చేయడానికి ఏమీ లేదు కాబట్టి, గెలిచినోడు ఏం చేసినా అందులో తప్పు పట్టాలి. మంచి చేసినా అందులో చెడు వెతకాలి. ఆడు ఏం మాట్లాడినా దానికి లేనిపోని దురుద్దేశాలు అంటగట్టాలి. ఏ పథకం పెట్టినా బొక్కలెతకాలి. లేనిపోని లెక్కలు, నిజాలు తీసి మసి పూసి మారేడుకాయ చేసి ఏకడానికి ఎలాంటి వీలు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నట్టు రెచ్చిపోవాలి... తెలిసిందా?'

'బ్రహ్మాండంగానండి. కానీ గురూగారూ, జనం నమ్ముతారంటారా?'

'ఓరెర్రోడా... నిన్ను జనం నమ్మితే ఓడేవోడివే కాదు కదరా, ఆ సంగతి నీకేల? ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఇంతకు మించి చేయడానికేం లేదు మరి'

'అర్థమైంది గురూగారూ! ఇక రెచ్చిపోతా చూడండి'

PUBLISHED IN EENADU ON 27/06/2014

మంగళవారం, జూన్ 17, 2014

ఇలాగైతే కష్టమే!'ఎంత దారుణం?'
'వట్టి దారుణమా, మహా ఘోరం!'

'ఎన్నడైనా కనీవినీ ఎరుగుదుమా?'

'పిదప కాలం... పిదప బుద్ధులూను'

'అసలివన్నీ బాగుపడే లక్షణాలేనా అని!'

'ఒంటిమీద స్పృహ ఉండే మాట్లాడుతున్నారా?'

'అబ్బే, ఏదో సంధికాలం మాటల్లా ఉన్నాయి'

- ఆ హాలులో సమావేశమైన అందరూ తలో మాటా అంటున్నారు. అందరి ముఖాల్లోనూ విషాదం తాండవిస్తోంది. ఒకడు నెత్తిన చెంగేసుకుని కూర్చుంటే, మరొకడు ముక్కుకు తువ్వాలు అడ్డుపెట్టుకుని విచారంగా ఉన్నాడు. వాళ్లందరి నిట్టూర్పులతో గది నిండిపోయింది. ఇంతలో ఒకడు కిటికీ తలుపు తీశాడు. బయట పచ్చని మొక్కల నుంచి రివ్వుమంటూ చల్లని గాలి చొచ్చుకొచ్చింది. నులివెచ్చని సూర్యకిరణాలతో గది నిండిపోయింది.

'ఆ తలుపేసేయవయ్యా. తాజా గాలి వచ్చేస్తుంది. కాలుష్యం తప్ప పీల్చుకోగలమా మనం?' అని ఓ పెద్దాయన కేకలేశాడు.

'మరే... మరే... మర్చిపోయాస్మండీ. సువాసనలు, తూరుపు వెలుతురు మన ఒంటికి సరిపోవు కదా?' అని నాలుక్కరుచుకుంటూ వాడు తలుపు మూసేశాడు.

'ఛ...ఛ... అలగా జనాన్ని అందలం ఎక్కిస్తే ఇదిగో... ఇలాగే ఏడుస్తుంది. ఎక్కడో టీ అమ్ముకునేవాణ్ని, రైలు బోగీలు తుడుచుకునేవాణ్ని, దేశదిమ్మరిని తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెడితే ఇదే ప్రమాదం'

'కాదా మరి? ఆ పాటికి ఆయనొక్కడే రాజకీయాల్ని ప్రక్షాళన చేసెయ్యడానికి వచ్చినట్టు ఏమిటండీ ఆ మాటలు? వింటుంటే ఒళ్లంతా కంపరం ఎక్కిపోతోంది. మంత్రులందరూ ఏటా ఆస్తుల్ని ప్రకటించాలట? మంత్రుల బంధువులెవరికీ వ్యాపారాలు ఉండకూడదట. అయినవాళ్లెవరూ ప్రభుత్వ ఆస్తులు పొందకూడదట. ఏమిటండీ ఈ నిబంధనలు? ఇహ... ఆ పాటికి మంత్రి పదవులెందుకంట? నాలుక గీసుకోవడానికి కూడా పనికొస్తాయా అని? ఇలాటి పద్ధతులతో రాజకీయాల్ని భ్రష్టుపట్టిస్తే రాబోయే కాలంలో మనలాంటి నీచ నేతలు ఎలా బతకాలి చెప్పండి?'

'ఏమండీ మీరు చెప్పండి! ఇలాంటి సూత్రాలు కానీ పాటించి ఉంటే మీరు ఇన్నేసి కోట్లు సంపాదించేవారా అని? మూడు నాలుగేళ్లలో మీ బంధుజనమంతా ప్రభుత్వ భూముల్ని ఎకరాలకు ఎకరాలు గుత్తకు తీసుకోలేదాండీ? అహ... మీ చుట్టాల్లో, అయినవారిలో, దూరపు బంధువుల్లో ఒక్కరంటే ఒక్కరు అణగారి ఉన్నారా? అసలు మీరెంత దోచారో తేల్చుకోవడానికి ఈ దర్యాప్తు సంఘాలకు ఎన్ని ఏళ్లు పడుతుందో ఎవరైనా లెక్క చెప్పగలరాంట? ఇప్పుడు వీరొచ్చి పెడ పాలనకు పగ్గాలు వేస్తానంటారా? ఈయన తినడు... మరొకర్ని తిననివ్వడు. ఇదేం సిద్ధాంతమంట?'

'బాగా చెప్పారు. అధికారం అంటే ఏంటండీ అసలు? మన చుట్టూ ఉన్నవాళ్లకు ఇంత తినిపించి, మనం అంతకంత భోంచేయాలి కానీ- నోరు కట్టేసుకోండంటే ఎలా? ఈ లెక్కన మనం తిండి, తిప్పలు లేకుండా ప్రజాసేవ చేయాలన్నమాట. పోనీ చేసినా మాత్రం పదవులు శాశ్వతం అంటారా? ఇవాళ పవర్‌లో ఉంటే, రేపు పవర్‌కట్‌లో పడతాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఇంగితమైనా ఏడ్చిందా అని!'

'అది సరేనండీ బాబూ... సంపన్నుల కోసం కాకుండా పేదల కోసం నేతలంతా పనిచేయాలట! పేదల్ని, పేదరికాన్ని నిర్మూలించేస్తే ఇక ఎవరికి చేస్తాడట ఈయన సేవ? పేదల కోసం పని చేయాలంటున్నాడు కదా, మరి అలా చేయడానికైనా పేదలు మిగిలి ఉండాలా అక్కర్లేదా చెప్పమనండి. పేదజనాన్ని అలా చెప్పుకింద తేలులా తొక్కిపెట్టి ఉంచకపోతే- రేప్పొద్దున్న ఎవరి కోసం పథకాలు పెడతాం? ప్రజాధనాన్ని దోచుకోవాలంటే పథకాలు ఉండాలా అక్కర్లేదా? మరి ఆ పథకాలు పెట్టాలంటే పేదలు లేకపోతే ఎలా? ఇలా అధికారాన్నంతా ఉపయోగించేసి ఈయనగారు దేశంలో పేదలనేవాళ్లు లేకుండా చేసేస్తాడేమోనని తెగ భయంగా ఉంది... ఓ రాత్రి వేళ దేశమంతా అభివృద్ధి సాధించేసినట్టు, పేదలు రైతులు సామాన్యులు కళకళలాడుతూ తిరుగుతున్నట్టు పీడకలలు వచ్చేస్తున్నాయండీ బాబూ. ఇక నిద్రపడితే ఒట్టు!'

'అసలు దేశంలోనే కుంభకోణాలు లేకుండా చేద్దామంటాడే. ఇదెక్కడి కోణమండీ? అసలు ఏ కోణంలో ఆలోచిస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. అవినీతికి ఆస్కారం లేకపోతే, సంపాదనకు వీలు కాకపోతే, బంధుజనాన్ని ఉద్ధరించలేకపోతే, మన భావి తరాలను తిని కూర్చోగలిగేలా చేయలేకపోతే, నల్లధనాన్ని విదేశాలు దాటించలేకపోతే, చట్టాలతో ఆడుకుని చుట్టాలకు మేలు చేయలేకపోతే... ఇక ఈ రాజకీయాలెందుకంట, అధికారం ఎందుకంట? హాయిగా ఏ హిమాలయాల్లోకో పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే సరి!'

-ఇలా అందరూ తలో రకంగా తమ కసిని, ద్వేషాన్ని, కోపాన్ని వెలిగక్కుతుంటే ఓ పెద్దాయన లేచాడు.

'ఒరేయ్‌... ఆగండ్రా. మనలో మనం మనసు విప్పి మాట్లాడుకోవాలంటే- మనమంతా నీచాతి నీచులం! ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి దాన్ని అడ్డంపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడినవాళ్లం. కానీ, మనందరం ఒక విషయంలో మాత్రం ఉమ్మడిగా విఫలమయ్యాం. ఇంతమందిమి ఉన్నాం, ఎందుకు? ఒక్కరంటే ఒక్కరం ప్రజాచైతన్యాన్ని గమనించలేకపోయాం. అదేగనుక సకాలంలో తెలుసుకుని ఉంటే కొన్నాళ్లు మేత మానేసైనా జాతి సంగతి ఆలోచించి తిరిగి మభ్యపెట్టే ప్రయత్నాలు చేసేవాళ్లం. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? ప్రజల చేతిలో ఓడిపోయి దిగాలు పడ్డాం. ఇక జరగాల్సింది ఏమిటో గ్రహించండి. మనం చేసిన నికృష్ట పనులే అవినీతి కేసులై మనల్ని చుట్టుకోబోతున్నాయి. అవి మనల్ని కాటేయకముందే మనం దోచుకున్నదంతా ఏం చేయాలో ఆలోచించండి. అది మానేసి మోడీనో, బాబునో తిట్టుకుంటూ కూర్చుంటే ఒరిగేదేముంటుంది? కాబట్టి ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి. ఇక పొండి!'

PUBLISHED IN EENADU ON 17/06/2014