బుధవారం, మే 29, 2013

సానుభూతి వేషాలు!



'గుండెల్లో గునపాలు... గుచ్చారే నీ వాళ్లు...
విరిగినది నీ మనసు... అతుకుటకు లేరెవరూ...'

'ఏంట్రోయ్‌... అంత బరువైన కూనిరాగం పాడతా వత్తన్నావు? కొంపదీసి ఖూనీగానీ కానిచ్చావేటి?'

'అదేంటి గురూగారూ, అంత మాటనేశారు? ఖూనీ చేస్తే కులాసాయే కానీ, కుదేలైపోతామా చెప్పండి...'

'మరంత ఏడుపుగొట్టు పాట పాడే అవసరం ఎందుకొచ్చిందా అని?'

'ఏముంది గురూగారూ! నా దారిన నేనేదో ప్రజాసేవ చేసుకుపోతుంటే చట్టం వూరుకోడం లేదండి. కోడిగుడ్డుకు ఈకలు పీకి అవన్నీ వెధవ పన్లంటోందండి. రేప్పొద్దున ఎటు తిరిగి ఎటొచ్చినా జనం గుండెల్లో సానుభూతిని సజీవంగా ఉంచాలని తాపత్రయమండి. అందుకు మీరేమైనా ఐడియాలు ఇస్తారేమోనని ఇలా వచ్చానండి'

'ఓరెర్రోడా! లొల్లాయి రాగాలు తీత్తే సానుబూతి కురిసిపోద్దేంట్రా? దానికెంత తతంగముంటదీ? ఓ లెక్క ప్రెకారికంగా దాన్ని జమాయించుకోవాల మరి. ఎక్కడా జనం సూపు జారిపోకండా కాపు కాయాల. రాజకీయాల్లో సానుబూతనేది శానా గొప్పదొరే. ముందా సంగతి మనసులోలెట్టుకో'

'అందుకే కదండీ, చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, నేనిలా పనిగట్టుకుని మీ దగ్గరకి వచ్చింది? నాకిన్ని సూత్రాలు బోధించి మీ పని కూడా మీరు కానివ్వండి మరి...'

'సానుబూతి సునామీలో జనాన్ని నిలువునా ముంచేయాలనుకుంటే ముందుగా సేయాల్సిన పనొకటుందిరా. ఎకాఎకినెల్లి అద్దం ముందు నుంచోవాల. నీ మొగాన్ని పరీచ్చగా సూసుకోవాల. ఏ మూలనైనా సిరునవ్వు జాడలు గట్రా కనిపిత్తే ఎంటనే తుడిసేసుకోవాల. వీలయినంత దిగులుగా మొగమెట్టడం నేరుసుకోవాల. ఆనకే జనం ముందుకెల్లాల. ఎల్లాక ఆల్ల కట్టాలు ఎరికొచ్చి నువ్వు పద్దాకా కుమిలిపోతున్నట్టు సూసినోల్లంతా నమ్మేట్టు కనిపించాల. అయ్యోపాపం... బిడ్డ, మన కోసమెంత తల్లడిల్లిపోతున్నాడో, ఏలకి తిండైనా తింటన్నాడో లేదోనని పెజానీకమంతా బెంగెట్టేసుకునేలా నీ వాలకం ఉండాల. ఆల్ల అమాయకత్వం చూసి నీకో పక్కనుంచి గబుక్కున నవ్వొచ్చేత్తన్నా, తత్తరపడిపోకుండా తమాయించుకుని అది నవ్వో ఏడుపో తెలీనంతగా మొగమెట్టేయాల. ఇది తొలి మెట్టన్నమాట'

'అబ్బో... కష్టమేనండి. వాళ్లని నమ్మించి, వూరించి, వూదరగొట్టి, ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక... వాళ్లకి తెలీకుండానే వాళ్ల సొమ్ముల్ని చుట్టుతిప్పుకొచ్చి మన జేబులో పడేసుకుంటున్న విషయం జనంలోకి వెళ్లగానే గుర్తొచ్చేస్తుందండి. ఆ పళంగా పెదాలపై తెగ నవ్వు, కులుకు, కులాసా, దిలాసా వచ్చేస్తుంటాయండి. లోపలినుంచి తన్నుకొచ్చే సంబరాన్ని అదిమిపట్టి పైకి అలా అయోమయం మొహం పెట్టడమంటే మరి... మహా నటుడైతేనే సాధ్యమండి. అయినా నేర్చుకుంటాలెండి, తప్పుతుందా? రాజకీయాల్లోకి దిగాక ఇలాంటి కష్టాలెన్నయినా దిగమింగుకోవాలి మరి. ఇక తతిమ్మా సూత్రాలేంటో చెప్పరూ?'

'ఇక పీటమెక్కగానే నువు సేసేవెలాగూ ఎదవ పన్లే కాబట్టి అయి ఎలాగోలా బయటపడక మానవు. ముందుగా ఎగస్పార్టీవోల్లు పత్రికలోల్లని కేకేసి ఇదిగో ఈడింత ఎదవ, అంతెదవ, మరీ ఇంతోటెదవనుకోలేదూ... ఇందులో దోసేసాడు, అందులో నొక్కేసాడు, ఆకాడ దాచేసాడు, ఈకాడ బొక్కేసాడు, ఇల్లిక్కడ గిల్లేసాడు, అల్లక్కడ నొల్లేసాడు, మాయసేసాడు, ముంచేసాడని మొదలెడతారు. అయ్యన్నింటినీ కూడా నువ్వు సానుబూతికి జమేసేసుకోవాల. ఎలాగో సెబుతానినుకో. ఇదిగో అమాయక జనాలూ... సూసారా, నేనేదో మీకింత మేలు సేద్దారని నానా పన్లూ సేత్తాంటే, ఈల్లు ఓర్వలేకపోతన్నారూ, నా మీద కుట్రలు గట్రా పన్నేత్తన్నారని సెప్పేసేసి ఆ పత్రికలోల్లనే కేకేసి కూసేయాల. ఈలుంటే నీకంటూ ఓ పేపరెట్టుకుంటే ఇంకా మంచిది. అంటే ఎవరే తప్పు సూపెట్టినా ఎదురెట్టేయడన్నమాట. ఇంకా కావలిస్తే ఆల్ల సెరిత్రలోకి పోయి అక్కడేమీ లేకపోయినా ఉన్నదాన్నే బూతద్దంలో సూపిత్తా ఈల్లేం తక్కువ కాదని వాగేయాల, అచ్చేయాల'

'మరి చట్టం సీన్లోకొస్తేనోనండీ?'

'ఏముందిరా... ఎదురెట్టేవోడికి సెట్టమైనా ఒకటే, నేయమైనా ఒకటే. ఆకరికి ఆ దేవుడే దిగొచ్చి నువ్వొట్టి దగుల్బాజీవని సెప్పినా, మొన్నోపాలి టెంకాయ కొట్టనందుకు పగబట్టేసాడని బుకాయించడమే! నీ మీద వాగినోల్లది కుట్ర, కూపీ లాగినోల్లది కుట్ర, రుజువులు సూపినోడిది కుట్ర, సివరాకరికి సిచ్చ పడినా కోర్టోల్లది కూడా కుట్రే అని గగ్గోలు పెట్టేయాల'

'ఆహా బాగుందండీ. మరి అరెస్టయిపోయి జైల్లో పడితేనోనండీ?'

'అదింకా మంచిదొరే. సినేమావోల్లు సూడు, మా సినిమా బయటకొచ్చి ఇన్ని వారాలైంది, అన్ని వారాలైందని సెబతా సాటుకుంటారుగా? అట్టాగే నువ్వు లోపలికెల్లి ఆర్నెల్లయింది, ఏడాదైందని వాల్‌పోస్టర్లు గుద్దించి వూరూవాడా మైదా పిండెట్టి అతికించేయాల. నీ కంటూ పేపరుంటే ఇక రోజూ అదే పని మరి. అందరూ కలిసి దరమ దేవత గుడ్డలూడదీసేత్తన్నారూ, నిజాల నోరు నొక్కేత్తన్నారూ, నేయ దేవత పీక పిసికి సంపేత్తన్నారూ... అంటూ సానుబూతి పిండుకోవాల. అక్కడికి నువ్వేదో పరమ అవతార పురుసుడవన్నట్టన్న మాట. వీలుంటే సెల్లినో, తల్లినో, బామ్మర్దినో జనంలోకి పంపి మైకులిచ్చి ఎక్కడలేని ఏడుపులూ ఏడవమనాల'

'సరే కానీ గురూగారూ! చేసిన పన్లన్నీ రుజువైపోయి జనాలు మన నీచ నిజ స్వరూపాన్ని, అవినీతి విశ్వరూపాన్ని తెలుసుకుని చైతన్యవంతులేపోతేనోనండీ?'

'అప్పుడిక నిజమైన ఏడుపుగొట్టు పాటలు పాడుకుంటా, నీమీద నువ్వే సానుబూతి పడొచ్చు. రాగానే పాడావు సూడు ఆ పాట పల్లవోసారి అను'

'నీ ఆశ అడియాస... చేజారే మణిపూస... బతుకంతా అమావాస... లంబాడోళ్ల రాందాస...'

'అదీ అసల్లెక్క. ఇక పోయిరా!'


PUBLISHED IN EENADU ON 28.05.2013

బుధవారం, మే 08, 2013

అన్నగారి ఆత్మఘోష




అయ్యారే... ఇదేమి సభామంటపము? సర్వాంగ సుందరముగా, శోభాయమానంబుగా వెలుగొందుచున్నదే! మహామహుల మూర్తిమత్వ ధీరగంభీర ప్రతిమా స్వరూపములకు ఆలవాలమై అలరారుచున్నదే!
ఓహో... అవగతమైనది! ఇయ్యది... అఖిల భారతావని అప్రమేయ అధికార విలాసములకు ఆటపట్టు! సకల జనాభీష్టములకు అనుగుణముగా సాకారమైన సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పట్టుగొమ్మ! ఇంద్రప్రస్థ మహానగరాన వెలసిన అత్యద్భుత, అద్వితీయ, అనుపమాన, అపురూప సభామంటపము! పార్లమెంటు పరిపాలనా ప్రాంగణము!
ఎవరది? ఆ చెంతన విగ్రహ రూపమెవరిది? నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమై, నిజాయతీకి నిత్య దర్పణమై నిలుచుండిన ఆ స్వరూపము టంగుటూరి ప్రకాశం పంతులుగారిదేనా! కాక మరెవ్వరు? బ్రిటిష్‌వారి తుపాకి గుండుకు ఎదురుగా గుండెనిలిపి నిలిచిన అసమాన ధైర్యసాహసాలకు ప్రతిరూపమైన తెలుగుతేజం అదే! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నత హోదానందుకుని కూడా, నిరుపేదవలె నిత్యజీవనము సాగించిన నిరుపమాన రాజకీయ దురంధరా, మీకిదే నా వందనము! కానీ పంతులుగారూ! గమనించితిరా? నేటి రాజకీయ దౌర్జన్య, దురాగత, దుర్నిరీతి, దుర్విధానములను? పదవి పొందిన మర్నాటి నుంచి ప్రజా ప్రయోజనములను పక్కనపెట్టి, స్వీయ కుటుంబ సంక్షేమమే పరమావధిగా... ఆంధ్ర రాష్ట్రమున సస్యశ్యామలమైన వ్యవసాయ సుక్షేత్రములను, అంతులేని ఖనిజ సంపదలకు ఆలవాలమైన సువిశాల గనులను, అస్మదీయులకు అడ్డగోలుగా కట్టబెట్టి... అందుకు ప్రతిఫలంబుగా తన కుపుత్రుని సంస్థల్లోకి పెట్టుబడులను ఆకర్షించి అచిరకాలముననే లక్షలాది కోట్ల రూపాయల అక్రమార్జనకు తెరతీసిన నేటి మనరాష్ట్ర పాలకుల నీచ నికృష్ట రాజకీయ తెంపరితనమును చూచితిరా? సామాన్య జన జీవనాల్లో ఇసుమంతైననూ మార్పు తీసుకురావాలనే తపనతో నిరంతరము పరితపించిన మీ విధానములెక్కడా? అధికారము కోసమే కలవరిస్తూ, అందుకోసం అమాయక ప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి, భ్రమలు కల్పించి, భ్రాంతుల్లో ముంచి, మాయ చేసి, అబద్ధపు వాగ్దానాల వలలో పడేసి, అసంబద్ధ పథకాల అనుచిత విధానాలతో ఆకర్షించి... అధికారం అందగానే దురహంకారులై, దుర్య్యాపార కార్యకలాపములకు ద్వారాలు తెరచి... ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న నేటి ప్రభువుల నిర్లజ్జాకర పరిపాలనా ప్రాధాన్యములెక్కడ? అహో... తలచుకుంటున్న కొద్దీ మనసు వికలమైపోవుచున్నదే!
ఆ పక్కన ఎవరు? ఓ... ఎన్‌జీ రంగా గారా? అయిదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయవేత్తగా రికార్డును నెలకొల్పి, పద్మవిభూషణ్‌ అందుకుని, తెలుగువారి తెగువను జాతి మరువలేని రీతిలో తేటతెల్లం చేసిన మీకిదే అభివందనం! అన్నదాతల సంక్షేమం కోసం అకుంఠిత దీక్షతో పోరాడి, రైతు ఉద్యమానికి ఆద్యులైన మీ కృషి సదా, సర్వదా సంస్మరణీయం! కానీ... నేడు మన తెలుగు రాష్ట్రమున... అధికారమును అధిరోహించిన అవినీతి పాలకుల పాలబడిన కర్షకుల కన్నీటి గాథలు మీ చెవిని తాకలేదా రంగాజీ? రైతులే తమకు దేవుళ్లంటూ, కర్షకులే తమ కళ్లంటూ కల్ల మాటలాడి, కపట ప్రేమలొలకబోసిన మాయదారి నేతల మోసపూరిత విధానాలతో అన్నదాతలు నిలువునా నీరుగారిపోతున్నారు! ఇది మనలాంటి కర్షకమిత్రులకెంత మనోక్లేశము! ఎంత దుర్భరము!

అటు పక్క ఆ తెలుగు తేజమెవరిది? ఓహో... భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిదా? స్వాతంత్య్ర సమర యోధునిగా, ఉత్తమ రాజకీయ నేతగా తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మీకిదే అభివందనము. దేశాభివృద్ధికి బ్యాంకుల వ్యవస్థ ఎంతగానో దోహద పరుస్తుందని నమ్మి, ఆంధ్రా బ్యాంకు సంస్థాపకునిగా వినుతికెక్కిన మీ దూరదృష్టికి జోహార్లు! కానీ... ఈనాటి బ్యాంకుల వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అవాంఛిత విధానములను గమనించితిరా పట్టాభిగారూ? స్వార్థపరులైన వాణిజ్యవేత్తలతో, అవినీతి రాజకీయ నేతలతో జట్టుకట్టి, నల్ల ధనమును తెల్లగా మార్చడంలో అనుచిత విధానాలకు అవి ఆటపట్టుగా మారుతున్నవని వినికిడి! ఎంతటి దర్వ్యవస్థ ఇది?

ఏమైననూ మీవంటి తెలుగు తేజముల సరసన పార్లమెంటు భవనమున సముచిత స్థానమును పొందుట నాకెంతో ముదావహము! ఏమంటిరి? తెలుగువారి ఆత్మగౌరవమును, దేశవిదేశాలలో సైతము చాటి చెప్పిన ఘనత నాదేనందురా? అదియంతయూ మీ అభిమానము! తెలుగు ప్రజల అద్వితీయ ఆదరణ ఫలితము!!

ఒక్కసారి... ఈ మహోన్నత సభాభవన ప్రాంగణమును పరికించి చూసెద! అయ్యదే... అది ఏమి? శోభాయమానమైన ఈ సభామండపమున గోడలకు ఆ మసి ఏమి? అసీ! బొగ్గు నుసి! దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అపార బొగ్గు నిక్షేపాలను వెలికి తీసి, జాతి ఉద్ధరణకు దోహద పడవలసిన దేశాధినేతలు, నిర్లజ్జగా వాటిని అవినీతిపరులకు అప్పగించిన విధము ఎంతటి దుర్భరము? ఎంతటి దుస్సహము? ప్రతిపక్షములన్నియూ కోడై కూస్తున్ననూ, నిఘా సంస్థలు నిజాలు వెల్లడిస్తున్ననూ చలించక, నైతిక బాధ్యతగానైనను వ్యవహరించక, మొండికెత్తి వ్యవహరిస్తున్న ఈనాటి నేతల కార్యకలాపములకు నేనిక మౌనసాక్షిగా నిలబడవలసిందేనా?

అరెరె... అక్కడదేమి? ఏదో మడుగు వలె గోచరించుచున్నదే! అఘో... అవినీతి మడుగు! అడుగడుగునా అవినీతి కుంభకోణాలతో కునారిల్లుతున్న ఇప్పటి పాలకుల అనుచిత విధానములన్నియు ఇక్కడ బురద మడుగుగా నా కళ్లకు కన్పట్టుచున్నది! దూరశ్రవణ పరికరములలో అదనపు సౌకర్యములను కల్పించు నెపముతో కుంభకోణము... అంతర్జాతీయ ఆటగాళ్లు అరుదెంచే అరుదైన సందర్భమున వసతి కల్పించు పనిలో సైతము కుంభకోణము... ప్రభుత్వ యంత్రాంగములో భాగమయ్యే అత్యున్నత పదవుల కోసము సైతము అవినీతికి పాల్పడు కుంభకోణము... ఎటు చూసినా అవినీతి, అక్రమములే! హతవిధీ!

ఆ... అదేమి ఆక్రందనము? ఎవరది... అక్కడ ఎవరో స్త్రీ రోదించుచున్నదే? అరెరే... ప్రజాస్వామ్య ప్రతిరూపమా? ఎంతటి ఘోరము! నిండు సభలో ఆమె విలువల వలువలను వలచుచున్నారే! ఎంతటి దురహంకారము! ఇటువంటి దృశ్యములను చూచుటకా నేనిట కొలువైనది?

నేనిదే ఎలుగెత్తి చాటుచున్నాను. దేశ ప్రజల మనసులలో నిత్య చైతన్య విస్ఫులింగాలను పుట్టించే స్ఫూర్తికి, నా ప్రతిమ నిలువెత్తు నిదర్శనమై నిలుచుగాక! అవినీతిని దునుమాడి, అక్రమార్కులను తరిమికొట్టే జనజాగృతి దావానల సదృశమై రగులుగాక!

PUBLISHED IN EENADU ON 08.05.2013

శనివారం, మే 04, 2013

పథకాల పరమార్థం!




శిష్యుడు రాగానే గురువుగారు ప్రసాదం పెట్టారు. శిష్యుడు దాన్ని కళ్లకద్దుకుని నోట్లో వేసుకుని, 'ఇదేంటి గురూగారూ! కొత్తగా?' అన్నాడు.
'అహ... ఏం లేదురా! ఇవాళే కొత్తగా 'శిష్యప్రసాదం' అనే పథకాన్ని ప్రవేశపెట్టా. ఇన్నాళ్లుగా నా దగ్గరకు రాజకీయాలు నేర్చుకోడానికి వస్తున్నా ఏమీ పెట్టలేదుగా? అందుకని!'

ఇంతలో గురువుగారి సతీమణి వచ్చి దానిమ్మ గింజలు ఇచ్చారు. శిష్యుడు నోరెళ్లబెట్టగానే గురువుగారు వివరించారు...

'ఇది ఆవిడ ప్రవేశ పెట్టిన 'దానిమ్మహస్తం' పథకం... ఇవాళ నీ పంట పండిందిలే. నోట్లో వేసుకో'

'ఆహా... ఎంతదృష్టం. ఇలా పథకం మీద పథకం ప్రవేశపెట్టడానికి కారణమేంటి గురూగారూ?'

'ఒరే... నువ్వు నా దగ్గర శిష్యరికం చేసి ఎంతోకొంత ఎదిగావనుకున్నా కానీ, లేదని తేలిపోయిందిరా. పథకాలకు కారణాలడుగుతావేంటి... అడిగితే మాత్రం చెబుతానా, చెప్పినా నిజం చెబుతానా? కాబట్టి, నోరు మూసుకుని ఇచ్చింది పుచ్చుకోవడమే...'

'బుద్ధొచ్చిందండి. కానీ గురూగారూ... ఈ పథకాలనేవి ఎన్ని రకాలు, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో చెబుతారా?'

'అది చెప్పాలనే కదరా ఇలా మొదలెట్టింది? రాసుకో. పథకాలు ప్రధానంగా రెండు రకాలు. బయటికి కనిపించేవి, పైకి కనిపించనివి. కనిపించేవాటి పేరెలాగూ తెలుస్తుంది. కనిపించని వాటి పేర్లు మాత్రం నువ్వే కనిపెట్టాలి. అది నీ రాజకీయ చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇటీవల మన సీఎం ప్రవేశపెట్టిన పథకాల గురించి చెప్పు చూద్దాం...'

'ఓ... పేపర్లలో చదివానండి. ఆడపిల్లల కోసం 'బంగారు తల్లి', పేదవారి కోసం 'అమ్మహస్తం', బడుగుల కోసం 'పచ్చతోరణం' పెట్టారండి. ఉద్దేశాలు మంచివే కదండి...'

'అవి మంచివో కావో ప్రజలు తేలుస్తారు... మనం చదువుకుంటున్నది రాజకీయ పాఠాలు కాబట్టి వాటి అంతరార్థాలు తెలుసుకోవాలి. వాటిలో ఒకటి 'కంగారు తల్లి'. ఎందుకంటే ఓ పక్కన కాలం గడిచిపోతోంది. మరో పక్క ఈ సీఎం సామర్థ్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఆయన కంగారుగా పథకం ప్రకటించేశాడు. దీని గురించి తమకేమీ తెలీదని ఆ పార్టీలోనే సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి... గమనించావా? అంటే ఎవరితోనూ చర్చించకుండా, ఎలా అమలు జరపాలో కూడా ఆలోచించకుండా ప్రకటించాడనే కదా? దీనివల్ల జరిగే మేలు పక్కన పెడితే, ఇది ప్రచారానికి మాత్రం బంగారు తల్లే! ఇక రెండోది, మన భాషలో 'అమ్మో...హస్తం'. అధికారంలో ఇన్నాళ్లు ఉండి ఏమీ చేయలేకపోయేసరికి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి తలచుకుని 'అమ్మో...' అనుకుని- పెట్టారన్నమాట! ఇక ఆ పచ్చతోరణం 'మెరమెచ్చు తోరణం' అన్నమాట. తొమ్మిదేళ్ల క్రితం కట్టిన అధికార పచ్చతోరణం వాడిపోయేసరికి సవాలక్ష తోరణాలు వెదికి ఇది కనిపెట్టారన్నమాట...'

'బాగుంది కానీండీ, మరి కనిపించని పథకాలన్నారు... అవేంటండీ?'

'పైకి బంగారు తల్లి కనిపిస్తోందా, మరి కనిపించకుండా అమలు చేస్తున్నది 'దొంగారు తండ్రి' పథకం. మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్లను కాపాడ్డానికి చేసే కృషి అంతా దీని కిందకే వస్తుంది. అలాగే అనుకోకుండా దొరికిన కుర్చీని కాపాడుకోవడానికి చీటికీ మాటికీ ఢిల్లీ పరిగెత్తడం 'అధిష్ఠాన అనుగ్రహ' పథకమన్నమాట. ఇలా 'తాత్సార పథకం', 'ఉదాసీన పథకం' లాంటివెన్నో కనిపిస్తాయి...'

'సరే గురూగారూ! కనిపించేవో, కనిపించనివో అసలీ పథకాల ప్రయోజనమేంటండీ?'

'పథకాలనేవి అధికారానికి పట్టుకొమ్మలురా! సాధ్యమో, అసాధ్యమో నీకిష్టం వచ్చినన్ని పథకాలు జనంలోకి విసిరిపారెయ్యాలి. తొమ్మిదేళ్ల క్రితం వైఎస్‌ చేసిందిదే కద? అవన్నీ మేడిపండులాగా నిగనిగలాడినా, విప్పి చూస్తే అన్నింట్లోను అవినీతి పురుగులే కదా? ఉచిత విద్యుత్‌- అనుచిత విద్యుత్‌ అయిపోయిందా? జలయజ్ఞం- అక్రమార్కుల ధనయజ్ఞం అయిపోయిందా? ఆరోగ్యశ్రీ- అనారోగ్యశ్రీ అయిపోయిందా? ఇలా చెబితే చాంతాడంత! ఇక ఆయన కనిపించకుండా అమలు జరిపిన పథకాలకు మనం 'పుత్రశ్రీ', 'జామాత మజా', 'గని గజినీ', 'హవాలా వల', 'బంధోద్ధరణ', 'గాలి గిలి', 'భూ భోజన', 'అక్రమ జీవో భవ', 'అవినీతి వాడి', 'కరెన్సీ కరకర' లాంటి బోలెడు పేర్లు పెట్టుకోవచ్చు... ఏమంటావు?'

'అద్భుతం గురూగారూ! ఇక ఇలాంటి పథకాలను భవిష్యత్తులో ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెబుదురూ...'

'చెప్పడానికేముందిరా! సమకాలీన రాజకీయాలు చూసి అల్లుకుపోవాలి. అవతల కర్ణాటక ఎన్నికల్లో పార్టీలన్నీ ఆడుతున్న 'జజ్జనకరి జనారే...' చూస్తున్నావుగా? రూపాయి బియ్యాలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఉచిత అంతర్జాలాలు, రుణాల మాఫీలు, రోగులకు పింఛన్లు అంటూ చేస్తున్న వాగ్దాన పథక వీరంగాలు గమనించు. అంతక్రితం తమిళ మహారాణి టీవీలు, గ్రైండర్లు, తాళిబొట్లు, పురిటినొప్పుల బిల్లుల్లాంటి పథకాలను దృష్టిలో పెట్టుకో. ఇక నువ్వు బియ్యం ఇవ్వడమే కాదు, 'వండి వార్చే' పథకం పెట్టు. నంచుకోవడానికి 'ఆవకాయ బద్ద' పథకం పెట్టు. దురదేస్తే 'ఉచిత గోకుడు' పథకమను, స్నానం చేసేప్పుడు 'వీపు రుద్దుడు' పథకమను... ఒకటేంటి? నీ నోటికొచ్చినట్టు వాగు. ఆనక అధికారంలోకి వచ్చాక వాటి అమలు పేరుతో కనిపించని 'నిలువు దోపిడి' పథకం అమలు చెయ్యి!'

'ధన్యోస్మి గురూగారూ... ధన్యోస్మి!'

PUBLISHED IN EENADU ON 04.05.2013