మంగళవారం, జులై 27, 2021

అధికార విశ్వ‌రూపం!


 అధినేత‌లుంగారు అద్దం ముందు నిల‌బ‌డి మెత్త‌గా న‌వ్వ‌డం ప్రాక్టీసు చేస్తున్నారు. ప‌క్క‌నే సెక్ర‌ట‌రీ నిల‌బ‌డి ఆ న‌వ్వులు చూస్తూ సూచ‌న‌లు ఇస్తున్నాడు. ఇంత‌లో అక్క‌డికొక యువ‌కుడు వ‌చ్చాడు. 

అధినేతని చూస్తూ విన‌యంగా "న‌మ‌స్కారం సార్‌..." అన్నాడు.

"ఎవ‌రు బాబూ నువ్వు? ఎవ‌రు పంపించారు? ఎందుకొచ్చావ్‌?" అన్నారు అధినేత‌లుంగారు.

"న‌న్ను మా గురువుగారు పంపించారండి. నేను ఆయ‌న ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు నేర్చుకుంటున్నానండి.  అందులో భాగంగా  నేరుగా మిమ్మ‌ల్నే క‌లిసి రాజ‌కీయ సందేహాలు అవీ నేర్చుకోమ‌న్నారండి..."

"ఓహో... 'అప్పు రెంటు షిప్ప‌'న్న‌మాట‌..." అన్నారు అధినేత‌లుంగారు.  రాజ‌కీయ శిష్యుడు తెల్ల‌మొహం వేశాడు, ఆయ‌నేమ‌న్నారో అర్థం కాక‌.

సెక్ర‌ట‌రీ శిష్యుడి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి చెవిలో నెమ్మ‌దిగా చెప్పాడు...  "అంటే అప్రెంటీస్ షిప్ అని ఆయ‌న ఉద్దేశం. ఆయ‌న భాష అలాగే ఉంటుంది. మీరు కానివ్వండి..." 

శిష్యుడు త‌లూపి, అధినేత‌లుంగారి వైపు తిరిగి, "ఆయ్‌... అదేనండి..." అన్నాడు. 

"మంచిదేన‌య్యా... కానీ మీ గురువుగారు నా ద‌గ్గ‌రికే ఎందుకు పంపించారు?" 

"అంటే... మీరు ఓ రాష్ట్రానికి తొలి సారిగా అధినేత‌య్యారు క‌దండీ... పైగా భారీ మెజార్టీతో సీట్లు గెలుచుకుని సీటెక్కారండి. ఆపై రెండేళ్ల‌లోనే దేశ రాజ‌కీయాల్లోనే ఓ స‌రికొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చారండి. మీ తెగువ‌, ధైర్యం, దూసుకుపోవ‌డం, ప‌ట్టుద‌ల ఇవన్నీ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాల‌నుకునే నా లాంటి యువ‌కుల‌కి ఆద‌ర్శం క‌దండీ... అందుక‌నండి..."

"బాగుంద‌య్యా... అంటే మీ గురువుగారు న‌న్నొక 'స‌స్క‌ర్త'ని గుర్తంచార‌న్న‌మాట‌. న‌న్ను 'విశ్మ‌సిస్తే' త‌ప్ప‌కుండా 'విన‌య‌పూర్ణం'గా చెబుతాను..."

శిష్యుడు మ‌ళ్లీ తెల్ల‌మొహం వేసి సెక్ర‌ట‌రీ కేసి చూశాడు. సెక్ర‌ట‌రీ ముందుకు వంగి, "స‌స్క‌ర్త అంటే సంస్క‌ర్త అని... విశ్మ‌సించ‌డం అంటే విశ్వ‌సించ‌డం... విన‌య‌పూర్ణం అంటే విన‌య పూర్వ‌కంగా అని..." అంటూ గుస‌గుస‌గా వివ‌రించాడు.

శిష్యుడు తెల్ల‌బోయినా, చేసేదిలేక త‌లూపాడు. "ఆపై చాలా సంతోషం సార్‌... కానీ ఒక్క మ‌న‌వి. నేనేం అడిగినా మీరు ఉన్న‌దున్న‌ట్టు నిజం చెప్పాలి..." అన్నాడు విన‌యంగా.

అధినేత‌లుంగారు మెత్త‌గా న‌వ్వి, "అలాగేన‌య్యా... నేను ప్ర‌జ‌ల‌తో మాట్లాడిన‌ట్టు మాట్లాడ‌ను, స‌రేనా?  నువ్వు రాజ‌కీయాలు నేర్చుకుంటున్నావు కాబ‌ట్టి, నా మ‌న‌సులో మాట‌లే చెబుతాన‌ని ప్ర‌తిగ్య చేస్తున్నాను. నేనిప్పుడు నీకు గురుదేవో మ‌హేశ్వ‌రం క‌దా... ఓ ప‌దిహైదు రోజుల్లో నీకు రాజ‌కీయాలు మొత్తం నేరిపించి పెత‌కం వ‌చ్చేలా చేస్తా" అన్నారు అర‌చేతిని ఖైమా కొడుతున్న‌ట్టు ఊపుతూ.

ఆ స‌రికి శిష్యుడికి అర్థ‌మైపోయింది ఆయ‌న చెప్పిన మాట‌ల్లో ప్ర‌తిజ్ఞ‌, గురుద్దేవో మ‌హేశ్వ‌రః, ప‌దిహేను, ప‌తకం ప‌దాల పరిణామ క్ర‌మం. అందుకే సెక్ర‌ట‌రీ ముందుకు వంగ‌బోయినా, న‌వ్వుతూ వారించాడు. 

శిష్యుడు గొంతు స‌వ‌రించుకుని అడిగాడు... "సార్‌... మీ మీద చాలా అక్ర‌మార్జ‌న కేసులు  ఉన్నాయి క‌దండీ? అయినా మీరు ఏమాత్రం నామ‌ర్దా కానీ, సిగ్గులాంటిది కానీ లేకుండా, హాయిగా న‌వ్వుతూ, ధైర్యంగా ఉంటారు. మీకింత జ‌గ‌మొండిత‌నం ఎలా వ‌చ్చింది సార్‌?"

అధినేత‌లుంగారు న‌వ్వేశారు... "భ‌లేవాడివ‌య్యా... సిగ్గు, శ‌రం వ‌దిలేశాకే క‌ద‌య్యా... రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది? అస‌లీ జ‌గ‌మొండిత‌నం మా వంశంలోనే ఉంద‌య్యా... నా ర‌గ‌తంలోనే క‌లిసిపోయింది.  అయినా నా మీద ఉన్న‌వి అక్ర‌మార్జ‌న కేసులేంట‌య్యా... అవ‌న్నీ నా దృష్టిలో స‌క్ర‌మార్జ‌న కేసులే. అవ‌కాశం, అధికారం ఉన్న‌ప్పుడు అందినంత‌కాడికి దోచుకోడ‌మే అస‌లైన రాజ‌కీయం. మ‌రందుకేగా ఒకానొక ద‌శ‌లో ఇల్లు తాకట్టు పెట్టే ద‌శ నుంచి మ‌రీనాడు వేర్వేరు రాష్ట్రాల్లో కూడా పెద్ద పెద్ద భ‌వంతులు అవీ క‌ట్టించుకుంట‌. నేనీ అధికారం అందుకోవ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాన‌య్యా... ప్ర‌జ‌లు బాధ‌ప‌డ‌క‌పోయినా ఓదార్చానా? ఏడ‌వ‌క‌పోయినా క‌ళ్లు తుడిచానా? ఊరూవాడా తిరిగి క‌నిపించిన వాళ్ల బుర్ర‌లు వంచి ముద్దులు పెట్టుకున్నానా?  బుగ్గ‌లు రాశానా?  చేతులూపానా?  ఓ  అమ్మా... ఓ చెల్లీ... ఓ అన్నా... ఓ త‌మ్ముడూ... ఓ అవ్వా... ఓ తాతా... అంటూ వ‌ర‌స‌లు కలిపి కిలోమీట‌ర్ల‌కు కిలోమీట‌ర్లు తిరిగానా? ఇవ‌న్నీ చేస్తూ కూడా మొహాన‌మెత్త‌ని నవ్వు చెద‌ర‌కుండా చూసుకున్న‌నా?  నా బ‌తుకే జ‌నం కోస‌మ‌న్న‌ట్టు న‌మ్మ‌బ‌లికానా? ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీలు ఊద‌ర‌గొట్టానా?  నాకు ఒక్క ఛాన్సు ఇస్తే చాల‌ని దేబిరించానా? ఒక్క‌సారి కుర్చీ ఎక్క‌నిస్తే మీ బ‌తుకుల‌న్నీ మార్చేస్తాన‌ని భ్ర‌మ క‌లిగించానా? మ‌రి అప్పుడంత క‌ష్ట ప‌డ్డాను కాబ‌ట్టే, ఇదిగో... ఇప్పుడిలా నీకు రాజ‌కీయ పాఠాలు బోధిస్తున్నా. మ‌రి ఇవ‌న్నీ నీలా రాజ‌కీయాల్లో 'మున‌గ‌డ' సాధించాల‌నుకునే కుర్ర‌కారుకి వెర్రెక్కించే సూత్రాలు కాదూ? ఏమంటావ్‌?"

"అవున్సార్‌... కానీ నాదో సందేహం సార్‌... మ‌రి అంత‌లా ప్ర‌జ‌ల్ని న‌మ్మించి ఇప్పుడు ఆ ప్ర‌జ‌ల్లో చాలా మంది విమ‌ర్శించేంత‌గా ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు సార్‌?  నోరెత్తిన వాళ్ల‌పై కేసులు బనాయిస్తున్నారు... ప్ర‌శ్నించిన వారిపై క‌క్ష క‌డుతున్నారు... మీకు ఇష్టం లేని వాళ్ల‌ను క‌లిసినా చాలు, వాళ్లని భ‌య‌భ్రాంతుల్ని చేస్తున్నారు... ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఇల్లు కూడా కూల‌గొడుతున్నారు... గృహ‌నిర్భంధాలు చేస్తున్నారు... అరెస్టులు చేయిస్తున్నారు... ఇంత తెంప‌రిత‌నం ఎలా సాధించారు సార్‌? ఇంత‌లా ఎలా తెగిస్తున్నారు సార్‌?" 

అధినేత‌లుంగారు కుర్చీలో తాపీగా వెన‌క్కి జార‌గిల ప‌డి, క‌ళ్లు అర‌మోడ్పుగా పెట్టి న‌వ్వారు. ఆపై సెక్ర‌ట‌రీని పిలిచి, "ఏమ‌య్యా... ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసేవారిని మ‌నం మామూలుగా ఏం చేస్తామ‌య్యా?" అని అడిగారు. 

"ఏముందండీ? రాజ‌ద్రోహం కేసు పెట్టంచేవాళ్ల‌మండి. ఈపాటికి ఏ చీక‌టి గ‌దిలోనో చిత‌క‌ద‌న్నించి కాళ్లూ చేతులూ విర‌గ్గొట్టించేవాళ్ల‌మండి... పోలీసుల‌కో ఫోన్ కొట్ట‌మంటారా?" అన్నాడు సెక్ర‌ట‌రీ.

"వ‌ద్దులే కుర్రాడు  భ‌య‌ప‌డ‌తాడు. పైగా పాపం పాఠాల కోసం వ‌చ్చానంటున్నాడు..." అని మెత్త‌గా న‌వ్వి, ఆపై శిష్యుడికేసి తిరిగి చెప్ప‌డం మొద‌లు పెట్టారు. 

"చూడు బాబూ... నువ్వు అడ‌గ‌డం నేను చెప్ప‌డం మొద‌లు పెడితే నా వ్య‌వ‌హారాలు ఓ ప‌ట్టాన తేలేవి కావు. ఏళ్ల‌కేళ్లు ప‌ట్టేస్తుంది.  అంచేత, ఓ ప‌దిహైదు నిమిషాల్లో మొత్తం నేనంటే ఏంటో, నా నిజ‌స్వ‌రూపం ఏంటో నీకు అర్థ‌మ‌య్యేలా చెప్పేస్తా.  అన్నీ రికార్డు చేసుకుని వీలున్న‌ప్పుడ‌ల్లా వింటూ పాఠాలు రాసుకుని చ‌దువుకో. నువ్వు ప్ర‌జ‌ల మాట ఎత్తావు కాబ‌ట్టి ఆళ్ల ద‌గ్గ‌ర నుంచే మొద‌లెడ‌దాం. నా దృష్టిలో ప్ర‌జ‌లంటే ఓట్లు.  ఓట్లే ప్ర‌జ‌లు. నా ప్ర‌జ‌ల్లో 'నిరార‌క్ష‌త' ఎక్కువ‌. 'నిర‌క్ష‌సిత లేటు' ఎక్కువ‌. అంచేత‌, ఆలోచించేవాళ్లెవ‌రూ నాకు ఓటేయ‌రు. నాకు ఓటేసే వాళ్లెవ‌రూ ఆలోచించ‌రు. ఆళ్లంతా పాపం వెర్రిబాగులోళ్లు. ఆళ్ల చేతిలో ఓ రూపాయి పెట్టి, ఆళ్ల క‌ళ్ల ముందే నేను కోట్లు నొక్కేసినా పట్టించుకోరు.  నా కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టే బ‌డాబాబుల‌కి  పోర్టులు, భూములు, ఫ్యాక్ట‌రీలు క‌ట్ట‌బెట్టేసినా కానుకోలేరు. అందుక‌నే క‌దా ఆళ్లని ఆక‌ర్షించే ర‌క‌ర‌కాల పధ‌కాలు రచించి, వాటి కోసం ఎక్క‌డ లేని నిధుల్నీ దారిమ‌ళ్లిస్తుంట‌? అందిన చోటల్లా అప్పులు తెచ్చి దార‌పోస్తుంట‌? ఇక కేసుల సంగ‌తి చెబుతాను వినుకో. నువ్వు ఎవ‌రికైనా భ‌య‌ప‌డ‌క్క‌ర‌లేదు కానీ, నిజాయితీప‌రుడితో మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎప్ప‌టికైనా అలాంటి వాళ్లే నీ కుర్చీ కింద‌కి నీళ్లు తెస్తారు. అందుకే అలాంటోళ్లు ఓ చోట గుమి గూడ‌కుండా చూసుకో. ఆళ్ల‌ని చెద‌ర‌గొట్ట‌డానికి, బెద‌ర‌గొట్ట‌డానికి చ‌ట్టంలో లొసుగులు అడ్డం పెట్టుకుని కాలం చెల్లిన సెక్ష‌న్లు, ఎవ‌రికీ తెలియ‌ని కేసులు బ‌నాయించు. ఆటి పేరు చెప్పి అరెస్టులు చేయించు. ఆన‌క నువ్వు పెట్టిన కేసులు నిల‌బ‌డ‌క‌పోయినా ప‌ర్వాలేదు. ముందు నోరెత్తితే నాశ‌న‌మే అనే భ‌యం క‌లిగేలా చేసుకో. అధికారం అంద‌గానే ముందుగా చేయాల్సిన ప‌ని... అధికారుల్ని, పోలీసుల్ని గుప్పెట్లో  పెట్టుకోవ‌డం.  కొంద‌రికి ప్ర‌లోభాలు చూపించు. మ‌రికొంద‌రిని బెదిరించు. అలా మొత్తం వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ కాలికింద తేలులా తొక్కిపెట్టు. పోలీసుల్ని నీ గూండాలుగా మార్చుకో. అధికారుల్ని నీ తొత్తులుగా చేసుకో. ఆపై నువ్వు ఆడింది ఆట‌, పాడింది పాట‌. ఆఖ‌రికి న్యాయ వ్య‌వ‌స్థ‌ని కూడా బెదిరించేంత‌గా బ‌రితెగించు.  నీ మీద ఉన్న కేసుల‌కు ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కు. అలాంటి కేసులు ఎన్ని ఉంటే అంత పబ్లిసిటీ అని గ‌ర్వించు. ఆ కేసులు ఓ ప‌ట్టాన తేల‌కుండా ప‌నికిమాలిన పిటీష‌న్లు  పెట్టించు. కాల‌యాప‌న చేయించు. ఒక‌వేళ నీ కేసులు నిరూప‌ణ అయి జైలుకెళ్లినా ప‌ర్వాలేదు. ఇదంతా ప్ర‌తిప‌క్షాల కుట్ర‌ని, రాష్ట్రాన్ని స్వ‌ర్ణ‌యుగం కేసి న‌డిపిస్తుంటే ఓర్వ‌లేక క‌క్ష‌క‌ట్టార‌ని ఎదురెట్టి, నీ ప్ర‌జ‌ల్లో సానుభూతిని సంపాదించు. నువ్వు లోపాయికారీగా న‌డిపిస్తున్న వ్య‌వహారాల గురించి ప‌రిశోధించి, విశ్లేషించి ఎవ‌రైనా వార్త‌లు రాశార‌నుకో, అక్ర‌మ కేసుల ఆధారంగా ఆ మీడియాను గ‌డ‌గ‌డ‌లాడించు. రాష్ట్రం దివాళా తీసే ప‌రిస్థితిలో ప‌డినా, సంక్షేమం అడుగంటిపోయినా, ప్ర‌జ‌లు నానా క‌ష్టాలు ప‌డుతున్నా, నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండు. నీకు ఓటేసే వాళ్లు మాత్రం జారిపోకుండా చూసుకో. వాళ్ల‌ని న‌మ్మించ‌డానికి ఎలాంటి భారీ ప‌ధ‌కాలైనా ప్ర‌క‌టించు. ఆశ‌లు క‌ల్పించు. భ్ర‌మ‌ల‌కి గురి చెయ్యి. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా?"

అప్ప‌టికి రాజ‌కీయ శిష్యుడు గుడ్లు తేలేశాడు. క‌ళ్ల వెంట నీరు కారుతుండ‌గా లేచి అధినేత‌లుంగారి ద‌గ్గ‌ర మోకాళ్ల ముందు కూల‌బ‌డి, "ప్ర‌భూ! శాంతించండి. మీ అవినీతి, అధికార‌, అప్ర‌హ‌తిగ‌త‌, అద్బుత‌, అనూహ్య‌, అస‌మాన‌, అక్ర‌మ విశ్వ‌రూపం చూసి క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి.  మీరు ఒక వ్య‌క్తి కాదు. ఒక శ‌క్తి.  మీ మొహం చుట్టూ వేలాది శిర‌స్సులు క‌నిపిస్తున్నాయి. అవ‌న్నీ కోర‌లు చాచి, నోటి వెంట నిప్పులు కురిపిస్తూ భ‌య‌పెడుతున్నాయి. ఆకాశ‌మంతా వ్యాపించిన‌ట్లు క‌నిపిస్తున్న మీ చుట్టూ వేలాది చేతులు క‌న‌పిస్తున్నాయి. ఆ చేతుల్లో భ‌యంక‌ర‌మైన ఆయుధాలు త‌ళ‌త‌ళ మెరుస్తూ భీతి క‌లిగిస్తున్నాయి. మీ చుట్టూ  చ‌ట్ట‌వ్య‌తిరేక శక్తులు జుట్టు విర‌బోసుకుని క‌రాళ నృత్యం చేస్తున్నాయి. మిమ్మ‌ల్ని ప్ర‌శ్నించే వాళ్లంతా నిస్స‌హాయంగా చూస్తూ మీరు తెరిచిన నోళ్ల‌లో కోర‌ల మ‌ధ్య న‌లిగిపోతూ క‌నిపిస్తున్నారు. గూండాలు, విద్రోహులు, ద‌గాకోరులూ  మీ అధికార విశ్వ‌రూపాన్నిచూస్తూ ప‌ర‌వ‌శిస్తూ స్తోత్రాలు చేస్తున్నారు.  సామాన్య ప్ర‌జ‌లు భ‌య‌విహ్వ‌లులై నలుదిశ‌ల‌కు ప‌రుగులు తీస్తున్నారు. నేను మీ విరాట్ స్వ‌రూపాన్ని చూడ‌లేక‌పోతున్నాను. ద‌య‌చేసి శాంతించండి" అంటూ చ‌తికిల‌ప‌డిపోయాడు. 

అధినేత‌లుంగారు మెత్త‌గాన‌వ్వి సెక్ర‌ట‌రీకేసి చూసి "కుర్రాడు జ‌డుసుకున్న‌ట్టున్నాడు. తీసుకెళ్లి ఆడి గురువుగారి ద‌గ్గ‌ర దించేసిరా" అన్నారు. 

-సృజ‌న‌

PUBLISHED ON 27.7.21 ON JANASENA WEBSITE

శనివారం, జులై 24, 2021

అవ‌క‌త‌వ‌క‌డు!"ఏంట్రా... అలా మొహం వేలాడేసుకొచ్చావేం? ఒంట్లో బాలేదా?" అంటూ ప‌ల‌క‌రించారు గురువుగారు, నీర్సంగా వ‌చ్చి చ‌తికిల ప‌డిన శిష్యుడిని చూసి.

"ఒంట్లో బానే ఉందండి... కానీ ఇంట్లోనే బాలేదండి" అన్నాడు శిష్యుడు దిగులుగా. 

"ఏమైందో స‌రిగా చెప్ప‌రా... "

"ఏముందండీ? ఈ నెల నా జీతం ఒక రూపాయే చేతికొచ్చిందండి..."

"వార్నీ... ఒక రూపాయి రావ‌డ‌మేంట్రా?  నీది మంచి జీత‌మేగా?"

"అవునండి... కానీ అన్నీ క‌టింగ్‌లు అయిపోయాయండి... ఈఎమ్మైలు పోగా చేతికొచ్చింది అంతేనండి..."

"మ‌రి అన్ని ఈఎమ్మైలు ఎందుకు పెట్టుకున్నావ్‌?"

"ఏముందండీ?  మా పెద్ద‌బ్బాయికి కారు కొనిచ్చానండి. పెద్ద‌మ్మాయికి బైక్ తీశానండి. చిన్నోడికి లాప్‌టాప్‌, చిన్న‌దానికి సెల్లు ఇచ్చానండి... "

"ఓహో... అయితే బాధ్య‌త లేని తండ్రిగా ఇవ‌న్నీ చేశావ‌న్న‌మాట‌..."

"బాధ్య‌త లేని తండ్రేమిటిసార్‌?  నా పిల్ల‌ల‌కి కావ‌ల‌సిన‌వి వాళ్లు అడ‌గ‌క‌పోయినా కొనివ్వడం నా బాధ్య‌త క‌దండీ?  కాదంటారా?"

గురువుగారు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఆపై "నీలా వెన‌కా ముందూ చూసుకోకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఖ‌ర్చు పెట్టేవాడిని అవ‌క‌త‌వ‌క‌డు అంటార్రా... నీది బాధ్య‌త కాదు. బాధ్య‌తా రాహిత్యం. ఇలాగైతే నీ కుటుంబం మొత్తం వీధిన ప‌డ్డానికి ఎంతో కాలం ప‌ట్ట‌దు..." 

"అదేంటి సార్... అలా తిడ‌తారు?  నేను చేసిందాంట్లో అవ‌క‌త‌వ‌క‌లు ఏమున్నాయో చెప్పండి..."

"ఒరే... అంటే అలుగుతావు కానీ... ఖ‌ర్చు చేసేప్పుడు ఆదాయం సంగ‌తి చూసుకోవ‌ద్దూ? ఇన్నేసి వ‌స్తువులు ఇలా ఎడాపెడా కొనేసేప్పుడు ఈఎమ్మైలెంత అవుతాయో ఆలోచించుకోవ‌ద్దూ? మొత్తానికి నీ య‌వ్వారం ఆంధ్రా అధినేత ప‌నుల్లాగే ఏడిసింది..."

శిష్యుడి మొహం ఎర్ర‌గా అయిపోయింది. ఉక్రోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, "గురూగారూ! మీరు ఎన్ని చండాల‌మైన తిట్ల‌యినా తిట్టండి కానీ, ఆ అధినేత‌తో మాత్రం పోల్చ‌కండి... అంత‌కంటే అవ‌మానం మ‌రోటుండ‌దు..." అన్నాడు.

గురువుగారు శిష్యుడు భుజం త‌ట్టి, "ఉక్రోషం వ‌స్తే వ‌చ్చింది కానీ ఉన్న‌మాట‌న్నావురా... ఆయ‌న‌తో పోల్చ‌డం త‌ప్పే... ఎందుకంటే ఆయ‌న చేసే అవ‌క‌త‌వ‌క ప‌నుల‌తో పోలిస్తే నీ దెంత‌?  నువ్వు చేసిన అనాలోచిత ప‌నుల నుంచి  నీ ఇల్ల‌యినా తేరుకుంటుందేమో కానీ, ఆ నేత నిర్వాకం నుంచి  ఆ రాష్ట్రం బ‌య‌ట ప‌డడం మాత్రం క‌ష్ట‌మేరా..." అన్నారు.

శిష్యుడు కాస్త తేరుకున్నాడు. "అయితే ముందు ఆయ‌న చేసిన అవ‌క‌త‌వ‌క‌ల గురించి చెప్పండి సార్‌... కాస్త నా క‌ష్టాలు మ‌ర్చిపోతాను... రాష్ట్ర‌మే క‌ట‌క‌ట‌లాడిపోతుందంటే దాని ముందు నా ఇల్లెంత‌?" అన్నాడు. 

"ఒరే నీకు ఆదాయం నీ జీతం. మ‌రి రాష్ట్రానికి ప్ర‌ధాన ఆదాయం ఏమిటో చెప్పు..."

"కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అందే నిధులు, వాటాలే క‌దండీ?"

"ఇప్పుడు ఆ నిధులను ముందు రిజ‌ర్వు బ్యాంకు జ‌మ చేసుకోవ‌ల‌సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయిరా. ఇంత‌కంటే దారుణం ఏముంటుంది చెప్పు?" 

"అంటే... నా జీతం నుంచి ఈఎమ్మైలు క‌టింగ‌యిపోయినట్ట‌న్న‌మాట‌. ఇంత‌కీ ఈ ప‌రిస్థితి ఎందుకొచ్చిందండీ?"

"మ‌రాయిన కేవ‌లం ఓట్ల మీద దృష్టి పెట్టుకుని ప్ర‌జ‌ల సంక్షేమం ప‌ట్టించుకోకుండా ఏవేవో ప్ర‌జాక‌ర్ష‌క ప‌థకాలు ప్ర‌క‌టించి, వాటి కోసం అప్ప‌నంగా ప్ర‌జాధ‌నాన్ని వాటికి మళ్లించేస్తుంటే ఇంత‌కంటే ఏం జ‌రుగుతుంది?  ఇంకా వాటి కోసం ఎడాపెడా అప్పులు చేస్తుంటే ఏమ‌వుతుంది? ప‌రిమితులు మ‌రిచి, ఎక్క‌డ వీలుంటే అక్కడ ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌లు రుణాలు తీసేసుకుంటూ ఉంటే కొన్నాళ్ల‌కి ఎలాంటి ప‌రిస్థితి ఎదురౌతుంది? అంటే... కేవ‌లం త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం, ఏకంగా రాష్ట్రాన్నే తాక‌ట్టు పెట్టేస్తున్నాడ‌న్న‌మాట‌. ఇప్పుడు మ‌రో ప్ర‌శ్న అడుగుతాను చెప్పు. రాష్ట్రానికి అధికంగా దేని వ‌ల్ల ఆదాయం వ‌స్తుంది?"

"ఆ... తెలుసండి. మ‌ద్యం అమ్మ‌కాల వ‌ల్లండి..."

"కానీ ఇప్పుడు నీకో సంగ‌తి తెలుసా?  రాబోయే ప‌దిహేనేళ్ల పాటు ఆ మ‌ద్యం పై వ‌చ్చే ఆదాయాన్ని చూపించి  వేల కోట్ల అప్పు చేశాడా మ‌హానుభావుడు. దాన‌ర్థం ఏంటి?  రాబోయే ఆదాయాన్ని కూడా తాక‌ట్టు పెట్టిన‌ట్టేగా? ఎప్పుడో రెండేళ్ల క్రితం చేసిన ప‌నుల‌కు కూడా బిల్లులు చెల్లించ‌డం లేదు. జీతాలు, పెన్ష‌న్ల‌కు కూడా క‌ట‌క‌ట‌లాడ‌క త‌ప్ప‌డం లేదు. కాంట్రాక్టుల‌కు, క‌ర్ష‌కుల‌కు వేల కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు పెరిగిపోయి, వాళ్లంతా కోర్టుల‌కు ఎక్క‌క త‌ప్ప‌ని దుస్థితి ఉంది. ఓ ప‌క్క ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పులు... మ‌రో ప‌క్క కొండ‌లా పెరిగిపోతున్న బకాయిలు...  ఇంత‌టి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ప‌డిపోయింది..."

"అయ్య‌బాబోయ్‌! త‌ల్చుకుంటేనే భ‌య‌మేస్తోందండి... మ‌రి ఈ సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఏం చేస్తారండీ?" 

"ఏం చేస్తారు? ఎడాపెడా ప‌న్నులు పెంచుతారు. ఈయ‌నైనా, మ‌రొక‌రైనా అప్పులు, బకాయిలు, వ‌డ్డీలు చెల్లించాలంటే అదేగా మార్గం? అప్పుడేమ‌వుతంది?  ప్ర‌జ‌ల మీదే భారం ప‌డుతుంది. ఇప్పుడ‌ర్థ‌మైందా?  నీ ఇంటి ప‌రిస్థితి క‌న్నా, రాష్ట్రం దుస్థితి ఘోరంగా ఉంద‌ని?" 

"నిజ‌మేనండి... ఘోరాతిఘోర‌మండి..." 

"స‌రేరా... కాసేపు నీ ఇంటి సంగ‌తి, ఆ రాష్ట్రం గురించి ప‌క్క‌న బెట్టు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో నువ్వు నేర్చుకోవాల్సిన  పాఠం ఏమిటో చెప్పు?  నువ్వేగ‌న‌క ఓ ప‌ర‌గ‌ణాకి నేత‌వైపోతే ఏం చేస్తావో అదీ చెప్పు?"

"ఆయ‌న‌లాగా ఉండ‌కూడ‌దండి. ముందు ఆదాయ వ‌న‌రులు ఏంటో ఓ అవ‌గాహ‌న‌కు రావాలండి. ఆ త‌ర్వాత ఆ ఆదాయాన్ని క్ర‌మంగా పెంచుకోడానికి ప్ర‌య‌త్నించాలండి. అలాగ‌ని ప్ర‌జ‌ల మీద భారం ప‌డ‌కుండా చూసుకోవాలండి. ఆర్థిక స్వావ‌లంబ‌న సాధిస్తూనే ప్ర‌గ‌తి బాట‌లు వేయాలండి. ప‌రిశ్ర‌మ‌లు, ఉద్యోగాలు, అవ‌కాశాలు పెరిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలండి. ప్ర‌జ‌ల ఆర్థిక స్థితిగ‌తులు మెర‌గ‌య్యేలా ప‌రిపాలించాలండి. రాష్ట్రం సుదీర్ఘ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం సాధించాలండి. అంతే క‌దండీ?"

"ఏడిశావ్‌. నీకింత‌కాలం బోధించిన‌దంతా బూడిద‌లో పోశేశావ్ క‌ద‌రా బ‌డుద్దాయ్‌! నువ్వు నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేది రాజ‌కీయ పాఠాలు నేర్చుకోడానికి అనే సంగ‌తి మ‌ర్చిపోకు. గుణ‌పాఠాలు వేరు, రాజ‌కీయ పాఠాలు వేరు. శిష్యుడిగా ఉన్న‌ప్పుడు నీతి సూత్రాలు నేర్చ‌కో, త‌ప్పులేదు. కానీ అధికారం అందాక ఆ నీతి సూత్రాల‌నే అవినీతి మార్గాలుగా మార్చుకో.  ప్ర‌జాస్వామ్యంలో అధికారం అప్ర‌తిహ‌తం కాద‌ని తెలుసుకో. కాబ‌ట్టి దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకున్న‌ట్టు నీ స్వీయ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే నిరంత‌రం పాటుప‌డు.  రాష్ట్రం ఏమ‌యిపోతే నీకెందుకు?  ప్ర‌జ‌లు కునారిల్లితే నీకెందుకు? ఇదే అస‌లైన పాఠం, అర్థ‌మైందా?"

"అర్థ‌మైంది సార్‌... అర్థ‌మైంది. ఇక నాకు ఒకే ఒక వ్య‌క్తి ఆద‌ర్శ‌మండి..."

"ఎవ‌ర‌ది?" 

"ఇంకెవ‌రండి? ఆ అవ‌క‌త‌వ‌క‌డే!" 

"సెభాష్‌!"

-సృజ‌న‌

PUBLISHED ON 25.7.21 ON JANASENA WEBSITE


 

శుక్రవారం, జులై 16, 2021

రాజ‌కీయ ర‌హ‌స్యం!

 


.

"ఓరి నీచుడా... నికృష్టుడా... క‌నిష్టుడా... క‌నాక‌ష్టుడా... అష్టద‌రిద్రుడా... అయోగ్యుడా... అధముడా... అధ‌మాధ‌ముడా... అహంకారుడా... అప్రాచ్యుడా... ద‌గుల్బాజీ... ద‌గాకోరుడా... దౌర్భాగ్యుడా... దుష్టుడా... దుర్మార్గుడా...దుర్జ‌నుడా... దౌర్జ‌న్య కార్య‌క‌లాపా... అసంద‌ర్బ ప్ర‌లాపీ... అస‌త్య స్వ‌రూపా... అన్యాయ వ‌ర్త‌నుడా... అక్ర‌మార్కుడా... అధ‌ర్ముడా... అడ్డ‌గోలుడా... అవ‌క‌త‌వ‌క‌డా... నిత్య నిందుడా... సత్య దూరుడా... "

-గురువుగారి ఇంటి గుమ్మం లోకి అడుగుపెట్ట‌గానే శిష్యుడు ఈ తిట్ల పురాణం విని మాన్ప్ర‌డిపోయాడు. తిడుతున్న‌ది ఎవ‌రో తెలియని పిల్లాడు. నానా ర‌కాలుగా తిట్టిపోసిన ఆ కుర్రాడు ఆ త‌ర్వాత వీధిలోకి తుర్రుమ‌న్నాడు. శిష్యుడి బుర్ర తిరిగిపోయింది. మెద‌డు వాచిపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ కుర్రాడెవ‌డో, ఎందుకు తిట్టాడో బోధ‌ప‌డ‌లేదు. మొహం మాడ్చుకుని, మెడ వేలాడేసుకుని నీర్సంగా ఇంట్లోకి అడుగుపెట్టేస‌రికి, గురువుగారు ప‌డ‌క్కుర్చీలో కూర్చుని ఉన్నారు. శిష్యుడిని చూడ‌గానే న‌వ్వుతూ, "రా.. రా.. ఎలా ఉన్నావ్‌?" అని అడిగారు.

శిష్యుడు అయోమ‌యంగా చూస్తూ, "ఆ పిల్లాడెవ‌డండీ, అలా తిట్టేశాడూ?  నేనేం చేశాన‌ని?" అన్నాడు ఉక్రోషంగా. 

గురువుగారు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేసి, "అలా ఉడుక్కోకురా... కాస్త స్థిమిత ప‌డు. ఇంద‌... ఈ నీళ్లు తాగు. ఏం లేదురా, నేనే ఆ కుర్రాడికి ఓ చాక్లెట్ ఇచ్చి, ఈ తిట్ల‌న్నీ నేర్పి నువ్వు రాగానే అప్ప‌జెప్ప‌మ‌న్నానంతే..." అన్నారు న‌వ్వుతూనే.

శిష్యుడు తెల్ల‌మొహం వేశాడు. ఆన‌క తేరుకుని,  "కానీ... గురూగారూ? ఇలా ఎందుకు తిట్టించారండీ?" అంటూ అడిగాడు వ‌చ్చే ఏడుపు ఆపుకుంటూ.

"ఒరేయ్‌... నువ్వు నా ద‌గ్గ‌ర‌కి రాజ‌కీయ పాఠాలు నేర్చుకోడానికి వ‌స్తున్నావు క‌దా? అలాగ‌ని ప్ర‌తిసారీ నువ్వ‌డ‌గ‌డం, నేను చెప్ప‌డం బోర్ కొడుతుంద‌ని... ఏదో కాస్త వెరైటీగా ఇలా నీకు వినూత్నంగా స్వాగ‌తం ప‌లికించానురా... అంతే!"

"ఇదేం వెరైటీ సార్‌? ఈ తిట్ల‌న్నీ నిజ‌మేన‌నుకుని ఎంత బాధ ప‌డిపోయానోనండి... సిగ్గుతో చితికి చ‌చ్చినంత ప‌నయింద‌నుకోండి..."

"ఓరి నా వెర్రిశిష్యా! ఇలా తిట్లు తిని సిగ్గుప‌డిపోయేవాడివి, రేప్పొద్దున్న రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తావురా? ఎవ‌రైనా నిన్ను తిడితే, ఏమాత్రం కంగారు ప‌డ‌కుండా, అది కూడా ఓ ప‌బ్లిసిటీ అనుకోవాల్రా... ఆన‌క తాపీగా ఓ ప్రెస్మీటెట్టి నిన్న‌న్న‌వాళ్ల‌ని అంత‌కి ప‌దింత‌లు తిట్టి ప‌త్రిక‌ల‌కెక్కాలి. అర్థ‌మైందా? ఇది రాజ‌కీయాల్లో త‌ప్ప‌ని స‌రిగా నేర్చుకోవాల్సిన నిందారోప‌ణ అధ్యాయంరా బ‌డుద్దాయ్‌!"

"ఏం పాఠ‌మో గురూగారూ! బుర్ర వేడెక్కేలా చేశారు. ఇంతా చేసి ఈ తిట్ల‌న్నీ ఉత్తుత్తి తిట్ల‌న్న‌మాట‌. కానీ గురూగారూ.. నాదొక సందేహ‌మండి. నిజం రాజ‌కీయాల్లో ఇలా ఉత్తుత్తిగా తిట్టుకోవడం ఉండ‌దు క‌దండీ? అంద‌రూ బ‌హిరంగంగా, బాహాటంగా తిట్టేసుకుంటారు క‌దండీ?"

"అందుకేరా నిన్ను నిజంగా తిట్టాల‌నిపిస్తుంది... కాస్త క‌ళ్లెట్టుకుని చుట్టూ చూడ‌రా... ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నెన్నో క‌నిపిస్తాయి. రాజ‌కీయాల్లో నిజ‌మైన విమ‌ర్శ‌లు ఏమిటో, నికార్స‌యిన ఆరోప‌ణ‌లు ఏమిటో తెలుసుకోవ‌డం అంత సులువేమీ కాదురా స‌న్నాసీ!"

"తిడితే తిట్టారు కానీ గురూగారూ, అలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ఏంటో  కాస్త నా మ‌ట్టి బుర్ర‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పండి సార్‌..."

"నేను చెప్పడం కాదురా... నువ్వే చెప్పు... ఈ మ‌ధ్య ఎవ‌రెవ‌రి మధ్య తిట్ల పురాణం జ‌రిగిందో?"

"ఆ... గుర్తొచ్చిందండి... నీళ్ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నేత‌లూ ఒక‌రినొక‌రు తిట్టుకుంటూనే ఉన్నారు క‌దండీ?  మాకు తిక్క‌రేగితే మ‌నుషులం కాద‌నీ, త‌ల్చుకుంటే దిమ్మ తిరుగుతుంద‌నీ... ఇంకా ర‌క‌ర‌కాలుగా క‌వ్వించుకుంటూ, విలేక‌ర్ల ముందు మైకుల మీద  మూతి పెట్టుకుని ఓ... తెగ రెచ్చిపోతున్నారు క‌దండీ? అయితే గురూగారూ, ఇవ‌న్నీ కూడా ఉత్తుత్తి తిట్లేనంటారా?" 

"ఓరేయ్‌... ఏవి నిజ‌మైన తిట్లో, ఏవి న‌కిలీ తిట్లో తేల్చడం కాదురా, మన ప‌ని. జ‌రుగుతున్న వ్య‌వ‌హారంలో అస‌లు స‌మ‌స్య మీద దృష్టి పెడుతున్నారా, లేదా అనేదే పాయింటు. మంత్రులు, నేత‌లు రెచ్చిపోతున్నారు స‌రే, మ‌రి అస‌లైన అధినేత‌లు నిజంగా ఈ వివాదం ముగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారా, లేదా అనేది గ్ర‌హించాలి. ఆంధ్రాలో ఈ అధినేత గెలుపుకోసం, అప్పట్లో ఆ తెలంగాణా అధినేత త‌న మంత్రుల్ని, అనుచ‌రుల్ని మొహ‌రించాడా లేదా? ఆయ‌న జ‌ల ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వాల‌కు పిలిస్తే ఈయ‌న‌గారు వెళ్ల‌డం, ముసిముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ ఆతిథ్యాలు స్వీక‌రించ‌డం జ‌నం మ‌రిచిపోతార్రా...  మ‌రి అంత స‌ఖ్య‌త ఉన్నప్పుడు ఈయ‌న‌గారు నేరుగా ఆయ‌న‌కి ఫోన్ చేసి మాట్లాడితే స‌రిపోతుందిగా?  అనుచ‌రులు వాగుతున్నారు స‌రే... మ‌రి అధినేత నోరు విప్ప‌డేం? ఎందుకంటే... ఈయ‌న‌గారి ప‌రిపాల‌న ఇక్క‌డ‌... ఆస్తులన్నీ అక్క‌డ‌... తేడా వ‌స్తే లోట‌స్ పాండ్‌, మ‌డ్ పాండ్ అయిపోతుందేమోన‌ని భ‌యమ‌ని జనం గుస‌గుస‌లాడుకుంటే త‌ప్పేముంటుంది? అంతేనా... అటు బెంగ‌ళూరు, ఇటు చెన్న‌య్‌లో కూడా ఈయ‌న‌కు ఆస్తులు, స్థ‌లాలు లేవూ? అందుక‌నే త‌న అనుచ‌రులు, మంత్రులు నోరు పారేసుకుంటున్నా... అధినేత‌లుంగారు మాత్రం నాకు ఇత‌ర రాష్ట్రాల రాజ‌కీయాల్లో వేలు పెట్ట‌డం ఇష్టం లేద‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్న‌ది ఎందుకో అర్థం చేసుకుంటే, అంత‌కు మించిన రాజ‌కీయ పాఠం ఇంకేముంటుందో ఆలోచించు" 

"అవునండోయ్‌... ఈ సంగ‌తి గురించి ఈయ‌న‌గారి చెల్లెమ్మ‌గారు, ఆ ప‌ర‌గ‌ణాలో పార్టీ పెట్టిన‌ప్పుడు అన్నారు కూడానూ. ఇద్ద‌రు నేత‌లూ క‌లిసి భోజ‌నాలు చేస్తారూ, మిఠాయిలు పంచుకుంటారూ, ఉమ్మడి శ‌త్రువు మీద యుద్ధం కోసం చేతులు క‌లుపుతారూ... కానీ జ‌ల వివాదం గురించి రెండు నిమిషాల సేపు మాట్లాడుకోలేరా... అని చెప్పేసేసి దులిపేశారండి... అన్న‌ట్టు గురూగారూ, ఈ అన్నా చెల్లెళ్ల లొల్లి, ఆ అమ్మా కొడుకుల య‌వ్వారం... వీటి సంగ‌తేంటండీ? ఇవి కూడా ఉత్తుత్తివేనా?  నిజ‌మైన‌వేనా?  లేక సొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఆడుతున్న డ్ర‌మానా... ఏమంటారు?"

"ఓరి అమాయకుడా! కొన్ని విష‌యాలు నేరుగా అడ‌గ‌కూడ‌దురా, అర్థం చేసుకోవాలంతే! ముందు ఈ పాఠం నేర్చుకో. కొత్త‌గా పార్టీ పెట్టిన ఆ చెల్లి, ఆ చెల్లికి తోడుగా వేదిక‌లెక్కే ఆ త‌ల్లి, ఆ త‌ల్లీ చెల్లెళ్ల వ్య‌వ‌హారం చూస్తూ కూడా ఏమాత్రం నోరు విప్ప‌కుండా, ఎక్క‌డా బ‌హిరంగంగా ఎదురు ప‌డ‌కుండా త‌ప్పించుకుపోతున్న ఈ అన్న‌... అంద‌రూ కూడా ఉండేది ఆ తెలంగాణా ప‌ర‌గ‌ణాలో ఒకే ఇంట్లో క‌ద‌రా.  అలాగ‌ని ఒకే ఇంట్లో ఉన్న వాళ్ల మ‌ధ్య తేడాపాడాలు ఉండ‌వా, అంటే దానికీ స‌మాధానం ఉండ‌దు. అర్థ‌మైందా?"

"అర్థ‌మైంది సార్‌. కానీ పాపం ప్ర‌జ‌ల్ని చూస్తే మాత్రం చాలా జాలేస్తోంది సార్‌. వాళ్లు త‌మ‌ని ప‌రిపాలించే అధినేత‌ల మాట‌లు న‌మ్మి ఆవేశ‌ప‌డిపోతూ ఉంటారు. అక్క‌డ ఆయ‌న క‌రెంటు ఉత్ప‌త్తి కోసం ప్రాజెక్టులో నీళ్లు వాడేస్తే, రేపు వేస‌విలో క‌ట‌క‌ట‌లాడేది ప్ర‌జ‌లే. నోరెత్తాల్సిన ఈయ‌న అస‌లు స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నించ‌క‌పోతే న‌ష్ట‌పోయేది కూడా ప్ర‌జ‌లే. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో నాకు అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి సార్‌. నేను మీ శిష్యుడిని కాబ‌ట్టి, నేరుగా నాకు మీరు నిజం చెప్పాలంతే. స‌రేనా?"

"స‌రే... అడ‌గ‌రా... "

"చెల్లెమ్మ‌ పార్టీ పెట్ట‌డానికి కార‌ణం ఏమిటి?  నిజంగా అన్న మీద కినుకేనా?  లేక అన్నొక రాష్ట్రాన్ని ఏలితే, తానొక రాష్ట్రంలో ప‌గ్గాలు ప‌ట్టుకుందామ‌నా? క‌న్న కొడుకుకి, కూతురికి ఆ త‌ల్లి న‌చ్చ‌చెప్ప‌లేక పోతున్న‌ది నిజ‌మేనా?  కూతురికి తోడుగా వేదిక ఎక్కిన ఆ త‌ల్లి, త‌న కూతురికి మ‌ద్ద‌తు ప‌లుకుతోంద‌ని అనుకోవ‌చ్చా? అంటే ఇదంతా ఆ కొడుకు మీద అలకేనా? మ‌రయితే ఆ కుటుంబంలో తేడాపాడాలు వేదికల సాక్షిగా బ‌య‌ట‌ప‌డిన‌ట్టేనా? ఇంత‌వ‌ర‌కు నీటి గోల ప‌ట్ట‌ని ఆ తెలంగాణా నేత ఇప్ప‌టికిప్పుడు  పేచీ పెట్ట‌డానికి కార‌ణం ఏమిటి?  రాబోతున్న ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ట్టుకోడానికా?  లేక చెల్లెమ్మ పార్టీ పెడుతున్నా నివారించ‌లేక పోయిన ఆ అన్న మీద కోప‌మా?  త‌న ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని తెలిసినా, ఈ నీటి  పేచీ గురించి ఈ అన్న నోరెత్త‌కుండా ఉండ‌డానికి కార‌ణ‌మేంటి? త‌న సొంత ఆస్తుల మీద భ‌య‌మా?  లేక చెల్లెలికి కూడా న‌చ్చ‌చెప్పుకోలేని అస‌హాయ‌తా?  చెప్పండి సార్‌!"

శిష్యుడి ప్ర‌శ్న‌లు విని, గురువుగారు తాపీగా ప‌డ‌క్కుర్చీలో జార‌గిల ప‌డి, క‌ళ్లు అర‌మోడ్పుగా పెట్టుకుని, నిదానంగా అన్నారు.

"బాగున్నాయిరా నీ ప్ర‌శ్న‌లు. కానీ ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ ఒకే ఒక స‌మాధానంరా. అది విని ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లి పోతానంటే చెబుతాను. స‌రేనా?"

"స‌రే.. చెప్పండి గురూగారూ!"

"రాజ‌కీయ ర‌హ‌స్యం!" 

-సృజ‌న‌

PUBLISHED ON 17.7.21 ON JANASEN WEBSITE

ఆదివారం, జులై 11, 2021

ఈనాటి ఈ బంధం... ఆనాటిదే!"ఈ నాటి ఈ బంధ‌మేనాటిదో... ఏనాడు ముడివేసి పెన‌వేసెనో... " అంటూ హుషారుగా పాట పాడుకుంటూ వ‌చ్చాడు శిష్యుడు, గురువుగారి ద‌గ్గ‌రకి. 

"ఏంట్రోయ్ మంచి ఉత్సాహంగా ఉన్నావ్‌? ఏంటి క‌త‌?" అని అడిగారు గురువుగారు. 

"ఏంలేదు గురూగారూ! ఇవాళ మా పెళ్లిరోజండి. అంచేత మా ఆవిడ కోరిక మీద యూట్యూబ్‌లో మూగ‌మ‌న‌సులు సినిమా చూశామండి. అందుక‌నే మీ ద‌గ్గ‌రకి రావ‌డానికి ఆల‌స్య‌మైందండి. ఆ సినిమాలో పాట పాడుతున్నానంతేండి..."

"వార్నీ... అయితే నీకు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు. ఇంత‌కీ పెళ్లంటే నీ అభిప్రాయం చెప్ప‌రా..."

"ఏముందండీ... అదొక తీపి బంధ‌మండి. ఏడేడు జ‌న్మ‌ల నుంచి ముడిప‌డిపోతుంద‌ని మా ఆవిడ చెప్పిందండి. ఆయ్‌..."

"బాగా చెప్పావురా. పెళ్లిరోజు కూడా నా ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు నేర్చుకోడానికి వ‌చ్చావంటే నీ చిత్త‌శుద్ధి ఏంటో అర్థమౌతోంది...  స‌రే కానీ బంధాల‌న్నింటిలోకీ బ‌ల‌మైన బంధం ఏంటో తెలుసురా?"

"ఇంకేముంటుందండీ... పెళ్లి బంధ‌మే క‌దండీ..."

"ఓరి స‌న్నాసీ... ఇక నీ పెళ్లిరోజు సంబరం నుంచి బ‌య‌ట‌కి రా.  కాస్త ఆలోచించి స‌మాధానం చెప్పు..."

"ఓహో... అయితే పాఠం మొద‌లెట్టేశార‌న్న‌మాట‌. బ‌ల‌మైన బంధం ఏంటంటే... ఆ... త‌ల్లిదండ్రుల‌కి, పిల్ల‌ల‌కి మ‌ధ్య ఉండేదాండీ? పోనీ ప్రేయ‌సీ ప్రియుల బంధం, స్నేహ‌బంధం ఇలాంటివాండీ?"

"అబ్బే.... అవ‌న్నీ మాన‌వ సంబంధాలురా... స‌హ‌జంగా ఉండేవేగా?"

 శిష్యుడు బుర్ర గోక్కున్నాడు... "మ‌రైతే చిన్న‌ప్పుడు పాఠాల్లో చ‌దువుకున్నట్టు గుర్తండి... అయ‌స్కాంత బంధం... గురుత్వాక‌ర్ష‌ణ బంధం... అణుబంధం...  ఇవాండీ?"

"ఏడిశావ్‌... అవ‌న్నీ సైన్సు బంధాలురా... నేన‌డిగానంటే అది నీ చిన్న‌ప్పుడు పాఠాల్లో ఉంటుందేంట్రా బ‌డుద్దాయ్‌..."

శిష్యుడుతెల్లమొహం వేసి, కాసేపు ఆలోచించి, "ఆ... ఇప్పుడు చెబుతాను సార్‌... రాజ‌కీయ బంధం క‌దండీ?" 

"ఓరి అమాయ‌కపు శిష్యా! ఈ రోజుల్లో రాజ‌కీయ బంధాలు కూడా బ‌ల‌హీన‌మైన‌వే క‌ద‌రా... గెలిచిన పార్టీని వ‌దిలి అంత‌వ‌ర‌కు తిట్టిన పార్టీలోకి దూకేసే మ‌హానుభావులు ఎంత‌మంది లేరు చెప్పు..."

"అదీ నిజ‌మేనండి... మ‌ర‌యితే మీర‌డిన ప్ర‌శ్న‌కి స‌మాధానం ఏంటో నా మ‌ట్టి బుర్ర‌కి అంద‌డం లేదండి... కాస్త మీరే చెబుదురూ... " అంటూ శిష్యుడు కాళ్ల‌బేరానికి వ‌చ్చేశాడు.

గురువుగారు తాపీగా ప‌డ‌క్కుర్చీలో వెన‌క్కి వాలి చెప్పారు... "అవినీతి బంధంరా.  ఇది అన్నిబంధాల‌కన్నా 

బ‌లమైంది. రాజ‌కీయాల‌కి అతీత‌మైంది. మాన‌వ సంబంధాల క‌న్నా ముఖ్య‌మైన‌ది. నువ్వు ఇందాకా చెప్పావే... గురుత్వాకర్ష‌ణ బంధం... అణుబంధం అని! అవి కూడా ఈ అవినీతి బంధం ముందు బ‌లాదూర్‌రా. న‌యా నీచ రాజ‌కీయ అధ్యాయంలో ఇదొక నికార్స‌యిన బంధం..."

"ఓహో... ఇంత‌కీ అవినీతి బంధం అంటే ఏంటి గురూగారూ?"

"ఏముందిరా... అవినీతి ప‌నుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ, ప్ర‌జాధ‌నాన్ని క‌లిసి కొల్ల‌గొట్టిన అధ‌మాధ‌ముల  మ‌ధ్య బ‌లంగా పెన‌వేసుకుపోయే అపూర్వ‌మైన‌, అద్వితీయ‌మైన, అనిర్వ‌చ‌నీయ‌మైన‌, అన్యాయ‌మైన‌, అధ‌ర్మ‌మైన‌, అసహ్య‌మైన‌, అనుచిత‌మైన‌, అడ్డ‌గోలు బంధంరా ఇది. ఒక‌సారి ఈ బంధం ఏర్ప‌డిందంటే అది ఇనుముని, కంక‌ర‌ని క‌లిపేసే సిమెంటులాగా గ‌ట్టిప‌డి పోతుందిరా... ఇక దాన్ని పునాదిగా చేసుకుని అక్ర‌మాల‌, అకృత్యాల భవంతులెన్నో క‌ట్టేసుకోవ‌చ్చు..."

"అంటే... దొంగ‌లు దొంగ‌లు క‌లిసి ఊళ్లు పంచుకున్న‌ట్ట‌న్న‌మాటండి... మ‌రైతే గురూగారూ! ఇలాంటి అవినీతి బంధంలో పెన‌వేసుకు పోయి, అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నవాళ్లు మ‌న మ‌ధ్య ఉన్నారాండీ?" 

"ఓరి నా వెర్రి శిష్యా! ఇంకా అర్థం కాలేదా?  సాక్షాత్తూ ప‌ర‌గ‌ణాని ఏలుతున్న అధినేతనే మ‌రిస్తే ఎలారా? ఆయ‌న మీద ఉన్న అక్ర‌మాస్తుల కేసులు ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని మ‌ర్చిపోయావంట్రా? అస‌ల‌వో ప‌ట్టాన తేలేవేనా? ఈ నేత కుర్చీ ఎక్క‌క ముందు నుంచీ కోర్టుకెక్కిన‌వే క‌ద‌రా?  వాటి అంతూ పొంతూ, లోతూ, పొడ‌వు, వెడ‌ల్పు తేల్చ‌లేక కోర్టుల‌న్నీ అత‌లాకుత‌లం అయిపోతున్నాయి. ఈ కేసుల వెనుక ఒట్టి అవినీతి బంధ‌మే కాదురోయ్‌... తండ్రీ కొడుకుల బంధం, భార్యాభ‌ర్త‌ల బంధం, అన్నాచెల్లెళ్ల బంధం, అధికార బంధం, స్నేహ‌బంధం... ఇలా ఎన్నో బంధాలు క‌ల‌గ‌లిసిపోయాయిరా... అప్ప‌ట్లో తండ్రి అధికార పీఠం ఎక్క‌గానే ఈ  అపురూప‌మైన బంధాల‌న్నీ క‌ల‌గ‌లిసి, చేతులు క‌లిపి... అక్ర‌మాల కోలాటం ఆడాయి. అకృత్యాల చెమ్మ‌చెక్కలాడాయి.  కాని ప‌నుల‌తో కాళ్లాగ‌జ్జా ఆడేసుకున్నాయి. త‌ప్పుడు ప‌నుల‌తో ఒప్పుల‌కుప్ప తిరిగాయి.  అడ్డ‌గోలు వ్య‌వ‌హారాల‌ అష్టాచెమ్మా, వికృత కృత్యాల‌ వైకుంఠ‌పాళీ, చెడ్డ‌ప‌నుల చెడుగుడు... ఇలా ఒక‌టా రెండా అడ్డ‌మైన ఆట‌లూ ఆడేశాయి. అధికార వేదిక‌పై, ప్ర‌జాస్వామ్య రంగ‌స్థ‌లంపై అవినీతి క‌రాళ నృత్యం చేశాయి. ఈ కొడుకు కంపెనీలు పెట్ట‌డం, ఆ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టిన వారికి ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ‌నులు, భూములు, సెజ్‌లు, పోర్టులు శాంక్ష‌న్ చేసేయ‌డం, అందుకోసం అవ‌స‌ర‌మైతే రాత్రికి రాత్రి జీవోలు జారీ చేయ‌డం, అయిన‌వారికి కాంట్రాక్టులు అప్ప‌గించ‌డం, ఆ ప‌నులు స‌రిగా జ‌ర‌గ‌కపోయినా బిల్లులు చెల్లించేయ‌డం, ప్రాజెక్టుల పేరు చెప్పి ప్ర‌జాధ‌నాన్ని పంచేయ‌డం,  అంచ‌నాలు పెంచేసి ప్ర‌జ‌ల క‌ష్టార్జితాన్ని ఇష్టారాజ్యంగా పంచుకు తిన‌డం... ఇలా ఒక‌టా రెండా, ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టిన ఆ కేసుల ఊసులు ఎన్ని చెప్పుకుంటే త‌నివితీరుతుందిరా?  నీకేమీ గుర్తులేదేంట్రా?" 

"అయ్య‌బాబోయ్! మీరు చెబుతుంటే చ‌రిత్రంతా క‌ళ్ల ముందు ఆడుతోందండి... మ‌రైతే గురూగారూ, అల‌నాటి ఆ అనుబంధాలు ఇప్పుడు కూడా కొన‌సాగుతున్నాయంటారా?"

"ఎందుకు కొన‌సాగ‌డం లేదురా పిచ్చి స‌న్నాసీ! అప్ప‌టి అడ్డ‌గోలు ప‌నుల్లో చేదోడు వాదోడుగా వ్య‌వ‌హ‌రించి   జైలుకు కూడా వెళ్లొచ్చిన  ఐఏఎస్ అధికారుల‌కు ఇప్ప‌టి జ‌మానాలో మంచి హోదాలు ద‌క్క‌లేదూ? అల‌నాడు స‌హ‌క‌రించిన స‌న్నిహితుల‌కు ఈనాడు ప్ర‌త్యేక ప‌ద‌వులు ల‌భించ‌లేదూ? అప్ప‌టి అకృత్యాల‌కు సాక్షులుగా ఉన్న‌వారికి ఇప్పుడు అనేక ప్ర‌లోభాలు అంద‌డం లేదూ? మ‌రి ఇలా బ‌ల‌మైన అవినీతి బంధంలో బ‌లంగా అతుక్కుపోయిన వాళ్లంతా ఆ అక్ర‌మాస్తుల  కేసుల్నిన‌డ‌వ‌కుండా అడుగ‌డుగునా  అడ్డు ప‌డడం లేదూ?  ఒక ప‌థ‌కం ప్ర‌కారం, ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం ఒకొక్క‌రుగా హైకోర్టులో విడివిడిగా పిటీష‌న్లు వేస్తూ, విచార‌ణ ముందుకు సాగ‌కుండా కాల‌యాప‌న చేయ‌డం లేదూ? ఆ నాటి తండ్రీకొడుకుల కేసుల్లో ఒక‌రా... ఇద్ద‌రా... ఏకంగా వంద‌కు పైగా ఉన్న నిందితులంద‌రూ ఇలా న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో నిబంధ‌న‌ల‌ను అడ్డం పెట్టుకుని, అద‌ను చూసి పిటీష‌న్లు వేస్తూ పోతుంటే ఆ కేసుల నిగ్గు తేలేదెప్పుడురా?  నిరూప‌ణ‌లు జ‌రిగేదెప్పుడురా?  నిందితులు నేర‌స్థులుగా బ‌య‌ట‌ప‌డేదెప్పుడురా? ఈలోగా మ‌రిన్ని ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం అప్ప‌నంగా చేతులు మారద‌నే గ్యారంటీ  ఏంట్రా? మ‌రిదంతా విన్నాక కూడా అవినీతి బంధం ఎంత గొప్ప‌దో నీకు అర్థం కాక‌పోతే, ఇక నిన్ను ఆ దేవుడు కూడా ర‌క్షించ‌లేడురా... అర్థ‌మైందా?"

"అర్థం కావ‌డం కాదు గురూగారూ! బుర్ర తిరిగిపోయిందండి. అన్ని బంధాల‌క‌న్నా బ‌ల‌మైన బంధ‌మేంటో అర‌టిపండు ఒలిచిపెట్టినంత సులువుగా చెప్పారండి. ఇందాకా నేను పాడుకుంటూ వ‌చ్చిన పాట‌ని ఇప్పుడు మ‌రోలా పాడుతాను వినండి.  ఈనాటి ఈబంధ‌మానాటిదే! ఆనాడు ముడివేసి పెన‌వేసిన‌దే!!"

"సెభాష్ రా శిష్యా! పైకొస్తావు. పోయిరా" 

-సృజ‌న‌

PUBLISHED ON 10.7.2021 ON JANASENA WEBSITE

 

శనివారం, జులై 03, 2021

కోర్‌...కోర్‌... అబ‌ద్దాల కోర్‌!

 


"ఒరే... నిజానికి, అబద్దానికి తేడా ఏంట్రా?" అంటూ అడిగారు గురువుగారు శిష్యుడు రాగానే. 

శిష్యుడు బుర్ర గోక్కుని, "మ‌రండీ... నిజం నిజ‌మేనండి... అబ‌ద్దం అబ‌ద్ద‌మేనండి...  అలాగే, నిజం అబద్దం కాదండి... అబ‌ద్దం నిజం కాదండి..." అన్నాడు అయోమ‌యంగా, ఏం చెప్పాలో తెలియ‌క‌. 

"ఏడిశావ్‌. ఇన్నాళ్లు నా ద‌గ్గ‌ర  రాజ‌కీయ పాఠాలు నేర్చుకుంటున్నావు క‌దా, ఏమాత్ర‌మైనా నీ బుర్ర ఎదిగిందో లేదో చూద్దామ‌ని ఈ ప్ర‌శ్న అడిగాన్రా...  అబ్బే... నీ బుర్ర ఇసుక ప‌ర్ర‌ని తేలిపోయింది..."

"అదేంటి గురూగారూ! అంత మాట‌నేశారూ? ఇలాంటివేమీ తెలియ‌క‌నే క‌దండీ, మీ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేస్తుంట‌... కాబ‌ట్టి కోప‌గించుకోకుండా చెప్పండి. ఏంటి తేడా?"

"స‌రే... రాసుకో. నిజం కాక‌పోయినా, అచ్చం నికార్స‌యిన నిజంలాగా చెలామ‌ణీ అయిపోతూ, జ‌నం ముందు ధ‌గ‌ధ‌గ‌లాడిపోయేదే అబ‌ద్ధంరా. అలాగే శుద్ధ అబ‌ద్ద‌మైనా, రాజ‌కీయ అవ‌స‌రాల‌కి ఆస‌రా ఇస్తూ, ప్ర‌జానీకాన్ని భ్ర‌మ‌లో ప‌డేస్తూ, నిదానంగా అబ‌ద్ధ‌మ‌ని అర్ధ‌మ‌య్యేదే అస‌లైన నిజంరా. అర్ధ‌మైందా?"

శిష్యుడు క‌ళ్లు తేలేశాడు. రెండు చేతుల్తో జుట్టు పీక్కుని, "బాబోయ్‌... ఒక్క ముక్క బోధ‌ప‌డ‌లేదండీ... కాస్త నా స్థాయి తెలుసుకుని చెప్పండి గురూగారూ! ఎల్కేజీలో ఎమ్మే పాఠం చెబితే ఎలాగండీ?" అన్నాడు బేలగా. 

గురువుగారు న‌వ్వి, "ఒరే... కంగారు ప‌డ‌కు. నీకు అర్థ‌మ‌య్యేలా చెబుతాలే. చూడూ... నువ్వొక ముఖ్య‌మంత్రివ‌నుకో. నువ్వు ఓ పెద్ద స‌భ‌లో ప్ర‌సంగిస్తున్నావ‌నుకో. అహ‌... నువ్వు ముఖ్య‌మంత్రివి కాలేవులే, అది నిజం. కానీ... జ‌స్టు ఊరికే అనుకో. అది అబ‌ద్ద‌మైనా స‌రే... ఏం? ఇప్పుడు నీ మ‌న‌సులో ఉన్న‌ది నిజమన్న‌మాట‌... కానీ నువ్వు మైకు  పుచ్చుకుని జ‌నానికి చెప్పేది అబ‌ద్దం అన్న‌మాట‌... ఇప్పుడైనా అర్థ‌మైందా?" అన్నారు న‌వ్వుతూనే. 

శిష్యుడు త‌లూపి, "నాకు అర్థం కాలేద‌న్న‌ది నిజం సార్‌... కానీ అర్థ‌మైన‌ట్టు తలూపింది అబ‌ద్దం సార్‌... అయితే మీరేదో కొత్త పాఠం మొద‌లెట్టార‌ని అర్ధ‌మైంది మాత్రం నిజ‌మే సార్‌. దాన్ని కాస్త సూటిగా చెప్పి పుణ్యం క‌ట్టుకోక‌పోతే, నాకు అస్స‌లు అర్థం కాద‌నేది అబ‌ద్దం కాదు సార్‌..." అన్నాడు ఏమంటున్నాడో కూడా తెలియ‌నంత అయోమ‌య స్థితిలో. 

గురువుగారు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు. "బాగా చెప్పావురా స‌న్నాసీ... స‌ర్లే... నిన్నింక ఏడిపించ‌ను కానీ, నీకో ప‌రీక్ష పెడ‌తా. స‌రేనా?"

"అమ్మ‌య్య‌. బ‌తికించారు సార్‌. ఆ ప‌రీక్షేంటో చెప్పండి..."

"ఏం లేదురా...ఇందాకా నువ్వొక ముఖ్య‌మంత్రివ‌నుకోమ‌న్నాను క‌దా. నిజంగానే అనుకో. ఇప్పుడు నువ్వు ఏమాత్రం సంకోచం లేకుండా నికార్స‌యిన నిజంలాంటి అబ‌ద్దాలు చెప్పాలి. చెప్పు చూద్దాం..."

"ఆ... తెలిసింది సార్‌... ఇక చూస్కోండి నా త‌డాఖా... ప్రియ‌మైన నా ప్ర‌జ‌లారా... నా బ‌తుకు మీ కోస‌మే. నా త‌పన మీ కోస‌మే. అతి త్వ‌ర‌లోనే మీ బ‌తుకుల్ని అద్భుతంగా మార్చేస్తా... భూమి మీద‌కు స్వ‌ర్గం దించేస్తా... స్వ‌ర్ణ యుగం అంటే ఏమిటో చూపిస్తా... ఇలాగే కదండీ?" 

"ప‌ర్వాలేదురా... కాస్తో కూస్తో ప‌నికొచ్చేలాగే ఉన్నావు. కానీ ఇవ‌న్నీ సాదాసీదా అబ‌ద్దాలురా. విన‌డానికి బాగానే ఉంటాయి కానీ, వింటూనే జ‌నానికి అర్థ‌మైపోతాయి, ఇవ‌న్నీ ప్ర‌సంగం కోసం చెప్పే అబ‌ద్దాల‌ని. ప్ర‌జ‌లు కూడా తెలివిమీరి పోయార్రోయ్‌. కాబ‌ట్టి వాళ్ల‌కి ఏమాత్రం అనుమానం క‌ల‌గ‌కుండా... నిజంగానే నిజం కాబోలనుకునే అబ‌ద్దాలు చెప్పాల్రా.  విన్న జ‌నం నిజంగానే ఆ అబ‌ద్దాల్ని న‌మ్మేయాలి. అలాంటివేమైనా చెప్పు..."

శిష్యుడు ఇక కాళ్ల‌బేరానికి వ‌చ్చేశాడు. "నా వ‌ల్ల కాదు సార్‌. నేనీ ప‌రీక్ష‌లో ఓడిపోయాన‌ని ఒప్పుకుంటున్నాను. ఇది నిజం. కానీ... ఇంత గొప్ప‌గా అబ‌ద్దాల‌ని, నిజాలుగా చెలామ‌ణీ చేసే నేత ఏవ‌డైనా ఉన్నాడాండీ?  జ‌నానికి ఏమాత్రం అనుమానం రాకుండా అత‌డు చెప్పే అబ‌ద్దాలు ఎలాంటివండీ?  కాస్త చెబుదురూ... ముందు రాసేసుకుని ఆనక ఇంటికెళ్లి బ‌ట్టీ ప‌ట్టేస్తాను..." అంటూ బుద్దిగా నోట్సు పుస్త‌కం తెరిచి, పెన్ను ప‌ట్టుకుని కూర్చున్నాడు. 

"ఒరే... ఎంతసేపూ థియ‌రీ రాసుకుంటానంటే ఎలారా?  ప్రాక్టిక‌ల్ నాలెడ్జి పెంచుకోవాలికానీ. అలా పెంచుకోవాలంటే నీలో ప‌రిశీల‌న పెర‌గాలి. అలాంటి నేత ఎవ‌డైనా ఉన్నాడాండీ, అంటూ అడ‌గ‌డ‌మేంట్రా... ఈ పాటికి గుర్తు ప‌ట్టేయొద్దూ. స‌రేలే... ఆ నేత చెప్పిన అబ‌ద్దాలేంటో నేను చెబుతాను. ఆ నేత ఎవ‌రో నువ్వు గుర్తు ప‌ట్టు స‌రేనా?" 

"స‌రే గురూగారూ! చెప్పండి..."

"నిజానికి ఆ నేత నోటంట వ‌చ్చేవ‌న్నీ ఇలాంటివేరా. కానీ అన్నీ ఒకేసారి చెప్పుకుంటే నీకు ఎన్ని నోట్సు పుస్త‌కాలైనా స‌రిపోవు. సిల‌బ‌స్ పెరిగిపోతుంది. కాబ‌ట్టి శాంపిల్‌గా కొన్ని చెబుతాను. రాసుకో. ఉదాహ‌ర‌ణ‌కు ఉద్యోగాలు.  ఈ అబ‌ద్ధ‌పు వ్య‌వ‌హారం  ఉంది చూశావూ... ఇది రెండు మూడేళ్లుగా నికార్స‌యిన నిజంలాగా చెలామ‌ణీ అయిపోయిందిరా. పాపం... వెర్రి జ‌నం నిజంగానే న‌మ్మేశారు. ఎన్నిక‌లకు ముందు నుంచీ ఆ నేత దీన్ని ఊద‌ర‌గొడుతూనే ఉన్నాడు. ఏకంగా రెండు ల‌క్ష‌ల ముప్పై వేల ఉద్యోగాలు క‌ల్పిస్తానంటే ఆశే క‌ద‌రా? అబ్బో అనేసుకున్నారు పాపం. ఈ అబ‌ద్దాన్ని నిజంలాగా చెలామ‌ణీ చేయ‌డానికి జాబ్ కేలండ‌ర్ ప్ర‌క‌టిస్తామ‌న్నాడా నేత‌. ఒహో... ఏదో కేలండ‌రంట కూడానూ అని సంబ‌ర ప‌డి నిరుద్యోగులు ఎదురు చూడ్డం మొద‌లెట్టారు. నిజం కేలండ‌ర్లో పేజీలు మారాయి కానీ, జాబ్ కేలండ‌ర్ బ‌య‌ట‌కి రాలేదు. అలా రెండేళ్లు గ‌డిచిపోయాయి. చివ‌రాఖ‌రికి ఇక త‌ప్ప‌ద‌నుకున్న‌ట్టు మా గొప్ప‌గా జాబ్ కేలండ‌ర్ ప్ర‌క‌టించారు.  అందులో చూపించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా?  ముప్పై ఆరు! మ‌రీ ఉద్యోగాల అబ‌ద్దం రెండేళ్ల‌పాటు నికార్స‌యిన నిజంలాగా జ‌నం ముందు ధ‌గ‌ధ‌గ‌లాడిపోలేదూ? అదీ తెలివంటే! ఇంత‌కీ ఈ అబ‌ద్దాల లెక్క‌లు ఆగాయా, అంటే అదీ లేదు. గ్రామ వాలంటీర్లంటూ ప‌నికిరాని పోస్టులు కొన్ని ఏర్పాటు చేశారు చూడూ... అదిగో వాటిని కూడా తాను ఆడిన అబ‌ద్దానికి కిరీటంలాగా మేక‌ప్పు చేస్తున్నాడా నేత‌. పోనీ చిన్న‌వో, పెద్ద‌వో  అవీ ఏర్పాట‌య్యాయి క‌దా అనుకుంటే, వాళ్లీ మ‌ధ్య జీతాలు పెంచాల‌ని అడిగితే... ఈ నేత ఏమ‌న్నాడో తెలుసా? అబ్బే... మీవి ఉద్యోగాలు కావూ... స్వ‌చ్చంద సేవేన‌ని. మ‌రైతే ఏది నిజం? ఏది అబ‌ద్దం?  ఓ ప‌క్క వేలాది టీచ‌ర్ల పోస్టులు ఖాళీగా ప‌డి ఉన్నాయి. మ‌రో ప‌క్క ప్ర‌భుత్వోద్యోగాలు కూడా వంద‌లాదిగా ఖాళీల‌వుతున్నాయి. వాటిని నింపే ఉద్దేశం ఏదీ ఆ నేత‌కు ప‌ట్ట‌దు. ఎందుకంటే వాటిని నింపాల‌నుకున్న‌ది అబ‌ద్దం క‌దా? అద‌న్న‌మాట‌. అర్ధ‌మైందా?"

"అయ్య‌బాబోయ్‌... ఎంత దారుణం సార్‌?  వింటుంటే నాకు క‌ళ్లు తిరిగిపోతున్నాయండి..."

"ఆగ‌రా... బ‌డుద్దాయ్‌. ఇంకా అయిపోలేదు. మ‌రో నికార్స‌యిన అబ‌ద్దం ఇంకోటుంది. అదే రైతుల నుంచి ధాన్యం కొన‌డం. హామీ ఇచ్చింది ల‌క్ష‌లాది మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొంటామ‌ని. అయితే  నిజంగా కొన్న‌దానికి, అన్న‌దానికి ఎక్క‌డా పొంత‌న లేదు. పోనీ కొన్న‌దానికైనా పాపం ఆ రైతుల‌కు డ‌బ్బు విదిల్చారా అంటే అదీ లేదు. మూడు రోజుల్లో చెల్లిస్తామ‌ని ఆ నేత ప్ర‌తి ప్ర‌సంగంలోనూ చెబుతున్న‌ది నిజ‌మైన అబ‌ద్దం. ఇంకా రైత‌న్న‌ల‌కు ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయ‌ల బకాయి ఉంద‌న్న‌ది చేదు నిజం. న‌మ్ముకున్న రైతులు నిండా మునిగార‌నేది నిజ‌మైతే, త‌మ‌ది రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వమంటూ ఆ నేత చెబుతున్న‌ది నికార్స‌యిన అబ‌ద్దం. ఇప్ప‌టికైనా, నిజ‌మైన నిజానికి, నిజంలాగా క‌నిపించే అబ‌ద్దానికి తేడా తెలిసిందా? అబ‌ద్దాల‌ని అచ్చమైన‌ నిజాల్లాగా న‌మ్మించే ఆ నేత ఎవ‌రో గుర్తు ప‌ట్టావా?" 

శిష్య‌డు కాసేపు ఆలోచించి, "ఆ...గురూగారూ! గుర్తు ప‌ట్టేశా.  ఆ నేత‌, దేశం మొత్తం మీద నీచ‌రాజ‌కీయాల‌కు నిజ‌మైన అడ్డాలాగా మారిపోయిన ఆంధ్ర ప‌ర‌గ‌ణాలో అప్ర‌తిహ‌తంగా అధికారం చెలాయిస్తున్న అబ‌ద్దాల‌కోరండి... ఆయ‌నంత బాగా అబ‌ద్దాల‌కి మారువేషం వేయించి, నిజాలుగా జ‌నంముందు నిల‌బెట్టి తైత‌క్క‌లాడించే నేత ఇంకెక్క‌డా క‌నిపించడండి. ఇది మాత్రం అబ‌ద్దం కాదండి... నిగ్గుతేలిన నిజ‌మండి. ఆయ్‌..." అన్నాడు. 

గురువుగారు తృప్తిగా త‌లాడించి, "నువ్వు కొంచెం రాటుదేలావ‌నేది నిజంరా. కానీ అంత‌టి నేత‌వి కాగ‌ల‌న‌నుకుంటే అది మాత్రం అబ‌ద్దం. ఇవాల్టికి ఇక చాల్లే. వెళ్లిరా" అంటూ పాఠం ముగించారు.

-సృజ‌న‌

PUBLISHED ON 3.7.21 ON JANASENA WEBSITE