మంగళవారం, జూన్ 13, 2017

పాటలా... అవి కావు... నవ పారిజాతాలు! రసరమ్య గీతాలు!!


శివుడి శిరసు నుండి జాలువారిన గంగ...కొండకోనలదాటి... పంటసీమలు తడిపి...సామాన్యుడి కుండలో కొలువై దాహం తీర్చినట్టు...జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన సినారె కలం...సినిమా పాటలను సైతం సాహితీ సౌరభాలతో గుబాలించేట్టు చేసింది! 
సామాన్య ప్రేక్షకుడికి కూడా ఉన్నత సాహిత్య విలువలను పరిచయం చేసింది!అత్యుత్తమ భావజాలాన్ని అలతి పదాలతో అందించింది!
అందుకే సినారె...
‘సంగీత సాహిత్య సమలంకృతు’డయ్యాడు! ‘
లలిత కళారాధనలో ఒదిగే చిరుదివ్వెను నేను...’ అంటూనే వెండితెర సాహిత్యంలో సూర్యసమానుడయ్యాడు!! 
ఆయన పాటలు... నవపారిజాతాలు... రసరమ్య గీతాలు! 
సామాన్య ప్రేక్షక జన మనోరంజితాలు!!

సినిమా అంటేనే సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకునేది. ఏది రాసినా, ఏది తీసినా చదువురాని వాడికి సైతం సులువుగా అర్థమయ్యేలా ఉంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. ఇలాంటి రంగంలో కూడా డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాసిన పాటలు సాహితీ గౌరవం పొంది అలరించాయి. అదే సమయంలో సామాన్యుడిని సైతం ఆకట్టుకున్నాయి. 
‘గులేబకావళి కథ’ సినిమాలో ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని...’తో మొదలైన ఆయన సినీ సాహితీ ప్రస్థానం 3,500లకు పైగా గీతాలతో సుసంపన్నమైంది. ప్రేమగీతాలు రాసినా, జానపద గీతాలు రాసినా, భావగీతాలు రాసినా, విషాద గీతాలు రాసినా సినారె కలం తనదైన ముద్రతో ‘వెండి’తెరపై ‘బంగారు’ సంతకం చేసింది!

* అది...ప్రేయసీ ప్రియులు పాడుకునే యుగళగీతం. నటించేది ఎన్టీఆర్‌, జమున. 
తోటలో మాల కడుతూ ఎదురుచూస్తున్న ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయి? 
‘తోటలో తొంగి చూసిన’ ఆ రాజు నవ్వులు ఆమెకెలా అనిపిస్తాయి?
‘నవ్వులా? అవి కావు... నవపారిజాతాలు...
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు...’లా కనిపిస్తాయిట!

మరి అంతటి ప్రేమను ఆమెలో చూసిన ఆ రాజు ఏం చేశాడు?
‘ఎలనాగ నయనాల కమలాలలో దాగి...
ఎదలోన కదిలే తుమ్మెద పాట...’ విన్నాడు!

‘ఆ పాట నాలో తియ్యగ మోగనీ... అనురాగ మధుధారలై సాగనీ...’ అన్నాడు!
‘ఏకవీర’ చిత్రంలో ‘తోటలో నా రాజు...’ పాట 
అటు రసజ్ఞులను, ఇటు సామాన్యులను కూడా ఒకేలా ఆకట్టుకుంది.

* మరో సందర్భం... అభిమాన ధనుడైన సుయోధనుడి మయసభ మందిర ప్రవేశం. 
దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ ధీరగంభీరంగా నడుస్తూ వస్తుంటే ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో సినారె కలం కూడా అంతే గంభీరంగా ముందుకు ఉరికింది.

‘శత సోదర సంసేవిత సదనా... అభిమానధనా... సుయోధనా...’ అంటూ స్వాగతం పలికింది. అంతటితో ఆగలేదు. సుదీర్ఘ సంస్కృత సమాసాలతో ఆ సందర్భాన్ని సుసంపన్నం చేసింది.

‘ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా...’ అని సంబోధించింది.
‘కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు  సౌర్యాభరణా...’ అని మెచ్చుకుంది. 

‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలో ఇలాంటి పదాలతో సాగిన ఈ పాట కూడా నేల ప్రేక్షకుడి చేత ఈలలు వేయించింది.

* హీరో హీరోయన్‌తో కలసి విహార యాత్రకు వెళ్లే సందర్భంలో పాట రాయాల్సి వస్తే ఇంకెవరైనా అయితే శృంగార పరంగా రాస్తారు. కానీ సినారె ఆ సందర్భానికి తెలుగు సంస్కృతి వైభవానికి అద్దం పట్టేలా పాటను మలిచి అందరినీ ఆకట్టుకున్నారు. 

శోభన్‌బాబు నటించిన ‘విచిత్ర కుటుంబం’లోని 
‘ఆడవే జలకమ్ములాడవే... కలహంస లాగ... జలకన్య లాగ...’ అంటూ మొదలు పెట్టి...

‘ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు గోదావరి తరంగాల...’లోను, 
‘కృష్ణవేణీ తరంగిణి జాలిగుండెయే సాగరమ్మై రూపు సవరించుకొను నీట...’
‘నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రానదీ తోయ మాలికలందు...’ 

-సాహిత్యాన్ని జలకాలాడించారు! 
సినిమా పాట చేత పుణ్యస్నానాలు చేయించారు!!

* ఇలా ఎన్నెన్నో పాటలు ఆయన కవితాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. 
‘కంచుకోట’లో ‘సరిలేరు నీకెవ్వరూ...’ పాట విన్నా, 
‘స్వాతి కిరణం’లో ‘శృతి నీవు, గతి నీవు, శరణాగతి నీవు భారతీ...’ పాటను తల్చుకున్నా, 
‘కళ్యాణి’ సినిమాలో ‘లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను... మధుర భారతి పదసన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను...’ పాట చూసినా... 
ఇలా ఒకటా రెండా ఏ పాటను గమనించినా... అవన్నీ 
చిత్రసీమలో ‘చిత్రం... భళారే విచిత్రం...’ అనిపించేవే. 
‘ఛాంగురే... భళారే... సినారె’ అనిపించేవే!!

PUBLISHED IN EENADU ON 13/06/2017


మంగళవారం, ఏప్రిల్ 25, 2017

కళా తపస్వి! అసమాన యశస్వి!!


ఆయన సినిమాల్లో...గజ్జెలు ఘల్లుమంటే... ప్రేక్షకుల గుండెలు ఝల్లుమంటాయి...అందెల రవళి వింటుంటే... అభిమానుల హృదయాలు అంబరాన్ని తాకుతాయి...అమృతగానాలు చెవినపడి.... అమితానందపు యెదసడిని కలిగిస్తాయి...సంగీత, నృత్యాలు కలగలిసి... సాగరసంగమాన్ని తలపిస్తాయి...ఈ గాలి, ఈ నేల, ఈ సినిమా తమదనిపిస్తాయి...ఆయన సినిమాలు చూస్తుంటే...సరస స్వర సుర ఝరీ గమనం గుర్తొస్తుంది...నాద వినోద నాట్య విలాసాలు మురిపిస్తాయి... సత్సంప్రదాయ సంగీత జ్యోతులు వెలుగులీనుతాయి...సుమధుర సాహితీ సౌరభాలు మైమరపిస్తాయి...ఆయన కె. విశ్వనాథ్‌. కళాతపస్వి విశ్వనాథ్‌! ఇప్పుడు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ అవార్డు గ్రహీతగా ఆయన వెండితెర కృషి తెలుగు చిత్రసీమకే ఓ తీపి గుర్తు! 
ఏ ఖజురహోలోనో, హాళీబేడులోనో, అజంతా ఎల్లోరా గుహల్లోనో శ్రద్ధగా చెక్కిన శిల్పాల్లాగా ఆయన సినిమాలు సినీ ప్రేక్షకుల కళ్లముందు కొలువుదీరాయి. విశ్వనాథ్‌ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో శంకరాభరణం గురించి మొదటగా చెప్పుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి, గర్వం పెల్లుబుకుతుంది.
విశ్వనాథ్‌ అభిమానిగా తనను తాను చెప్పుకునే దర్శకుడు బాపు ఓ సందర్భంలో చెప్పిన ముచ్చట ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
శంకరాభరణాన్ని చూడ్డానికి బాపు ఓ థియేటర్‌కి వెళ్లార్ట. విరామ సమయంలో ఇద్దరు స్కూలు పిల్లలు పరుగున వచ్చి ఆటోగ్రాఫ్‌ అడిగార్ట. పెన్ను లేదమ్మా అంటే ఓ అమ్మాయి కంపాస్‌ బాక్స్‌ తెరిచి అందులోని పెన్సిల్‌ ఇచ్చిందిట. బాపు సంతకాన్ని చూశాక ఓ అమ్మాయి ‘మీరు విశ్వనాథ్‌ కారా?’ అని అడిగింది. కాదని బాపు చెబితే, ఆ పిల్ల రెండో పిల్లతో, ‘ఆ కంపాస్‌ బాక్స్‌లో లబ్బర్‌ ఇలా ఇవ్వవే’ అంటూ వెళ్లిపోయిందట.
అదీ... అప్పట్లో శంకరాభరణం పిల్లలపై సైతం కలిగించిన ప్రభావం!
ఆ సినిమా వచ్చినప్పుడు అప్పటి యువతీ యువకులు ఆ సినిమాను పదే పదే చూడ్డం ఉత్తమాభిరుచికి నిదర్శనంగా భావించారు. హాలు నుంచి బయటకి వస్తూ ‘దీన్ని నేను చూడ్డం తొమ్మిదో సారి’ అనో పదో సారి అనో చెప్పడాన్ని గర్వంగా అనుకున్నారు. ఇక పెద్దలైతే ఆ సినిమా ఆడినంత కాలం వీలున్నప్పుడల్లా ఏదో గుడికి వెళ్లినంత పవిత్రంగా థియేటర్స్‌కి వెళ్లి పదేపదే చూశారు.
వ్యాపారాత్మక సూత్రాలను పట్టుకుని వేలాడే చాలా సినిమాల్లో ఉండే అంశాలు ఏమున్నాయని శంకరాభరణంలో?
హీరో స్టారా... కాదు!
హీరోయిన్‌ అందాల తారా... కాదు!
ఫైటింగులు అదిరిపోయాయా... అసలు లేనేలేవు!
ఓ వయసు మళ్లిన సంగీత కళాకారుడికి, ఓ నృత్య కళాకారిణికి ఏర్పడిన అనుబంధంతో అల్లుకున్న కథ...
పాటలు చూస్తే సంగీత కచేరీకి వెళ్లినట్టు ఉంటాయి...
నృత్యాలన్నీ ఏ కళాక్షేత్రంలోనో సంప్రదాయ ప్రదర్శనకు వెళ్లినట్టు అనిపిస్తాయి...
మరేముంది ఆ సినిమాలో?
ప్రేక్షకులను కట్టిపడేసే కథనం ఉంది!
కళాభిరుచిని తట్టిలేపే మాయాజాలం ఉంది!
పాశ్చాత్య సంగీత పెనుతుపాను తాకిడికి రెపరెపలాడిపోతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని చేతులడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే అద్భుతమైన దృశ్య పరంపర ఉంది.
అందుకే అది జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు, ఫ్రాన్స్‌లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది! అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది!
కె. విశ్వనాథ్‌ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన ‘ఆత్మగౌరవం’ సినిమాలోనే ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. తొలి చిత్రంతోనే నంది అవార్డును అందుకున్న ఆ సినిమాను అక్కినేని, కాంచన, రాజశ్రీలతో రైతుకుటుంబం నేపథ్యంలో తీశారు. అందులో ‘అందెను నేడే అందని జాబిల్లి... నా అందాలన్నీ ఆతని వెన్నెలలే...’ అన్న పాటని, ‘రానని రాలేనని వూరక అంటావు... రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు?’ పాటని చూస్తే రొమాంటిజమ్‌ అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఆ పాటల చిత్రీకరణ తీరు ఈనాటి యువతరానికి కూడా గిలిగింతలు పెడుతుంది.
ప్రేమికుల మధ్య ఉండే సున్నితమైన భావజాలాన్ని ప్రేక్షకుల హృదయాలకు చక్కిలిగింతలు పెట్టే రీతిలో చిత్రీకరించే ఒరవడి ఆయన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. సంగీత నృత్య భరితమైన శంకరాభరణంలో కూడా మరచెంబుతో ఆయన నడిపిన ప్రేమ రాయబారాలను ఎవరు మాత్రం మరిచిపోగలరు? ‘ఓ సీత కథ’లో ‘మల్లె కన్న తీయన మా సీత మనసు...’ పాటను గుర్తుకు తెచ్చుకోండి. బావామరదళ్ల మమకారం ఎంత సహజంగా తెరమీద ఒదిగిందో తెలుస్తుంది. ఒకరి మీద ఒకరికి కలిగీకలగని ఇష్టాన్ని, ఆ ఇష్టత వ్యక్తమయ్యే సున్నితమైన తీరుని అర్థం చేసుకోవాలనుకుంటే ‘సాగరసంగమం’లో ‘మౌనమేలనోయి... ఈ మరపురాని రేయి’ పాటను ఓసారి చూడండి. సరిగమలతో సైతం ప్రేమలేఖను పంపవచ్చనే సంగతిని ‘సప్తపది’ చెబుతుంది. ‘నగుమోము కనలేని నా బాధ తెలిసి... నను బ్రోవ రారాదా?’ అనే సంగీత కృతి స్వరకల్పనను కాగితంపై రాసి పంపితే ఏ ప్రేయసి పరిగెత్తుకుని సంకేత స్థలానికి రాకుండా ఉండగలుగుతుంది? ఇద్దరు కళాకారుల మధ్య అల్లుకున్న అనుబంధాన్ని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాత్తమైన సన్నివేశం ఏముంటుంది? ఇంత చక్కని ఆలోచన ఎవరికి కలుగుతుంది, కళాతపస్వికి తప్ప! ఇలా చూస్తే ‘శుభలేఖ’లో ‘రాగాల పల్లికిలో కోయిలమ్మ...’ పాటను తల్చుకున్నా, ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా.. అమ్మకచెల్ల.. ఆలకించి నమ్మడమెల్ల..’ పాటను చూసినా, ఇలా ఒకటేమిటి, విశ్వనాథ్‌ సినిమాల్లో సున్నితమైన భావజాలాన్ని, ప్రేమ చేసే ఇంద్రజాలాన్ని మనసుకు హత్తుకుపోయే రీతిలో చిత్రీకరించే తీరుకు మెచ్చుతునకలు అనేకం కనిపిస్తాయి.
ఇక ఆయన వెండితెరపై మలిచిన పాత్రల్ని చూస్తే, కళాతపస్వి మహా సాహసి అని కూడా అనిపిస్తాయి. హీరో అంధుడు... హీరోయిన్‌ మూగది... ఇక వాళ్ల మధ్య సంబంధం కళానుబంధం! సినిమా రంగంలో వ్యాపారాత్మక సూత్రాలు, ఫార్ములాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఈ కథను వూహించడానికి ఎంత ధైర్యం కావాలి? నిర్మాతకి చెప్పాలంటే తన ఆలోచనలపైన ఎంత స్పష్టత ఉండాలి? కానీ ఆ సినిమా వెండితెరపై ‘సిరివెన్నెల’ కురిపించింది. చూడలేనివారికి సైతం బృందావనాన్ని కళ్ల ముందు నిలిపింది. మరో సినిమాలో కథానాయిక పలుకే బంగారమైన మూగది. నాట్యమంటే మక్కువ. మరి కథానాయకుడు? డప్పు కళాకారుడు. ఆ కుటుంబంపై ఆధారపడే అతడే ఆమెకు రక్షకుడిగా మారతాడు. అతడి నిజాయితీ, అభిమానం ఆమెలో ప్రేమను రగిలిస్తే ఆ మూగ ఇష్టాన్ని తెరపై ఎలా చూపించాలి? ఎవరికైనా కష్టమేమో కానీ విశ్వనాథ్‌కేం? ఆమె కాలికి కట్టుకునే ‘సిరిసిరి మువ్వ’లు గాలికి అల్లాడి, అల్లాడి... కిందనే ఉన్న డప్పుపై పడి చప్పుడు చేస్తాయి. ఆ చప్పుడులో ఆమె గుండె చప్పుడు వినిపిస్తుంది ప్రేక్షకులకు. ఎంత చక్కని వ్యక్తీకరణ? ఎంత సున్నితమైన చిత్రీకరణ? ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులు తొలి రేయిని చూసి ఉంటారు. ఆ సన్నివేశంలో పాటల్ని కూడా ఆస్వాదించి ఉంటారు. కానీ తొలిరాతిరి భార్యను చూస్తూనే ఆమె చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ‘అయిగిరి నందిని... నందిత మోహిని... విశ్వవినోదిని నందినుతే...’ అంటూ పాడుతూ పూజ చేసే భర్తను చూశారా? ఆ సన్నివేశంలో భార్య తెల్లబోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ, ఆలయంలో అమ్మవారు తప్ప మరో స్త్రీమూర్తిని వేరే దృష్టిలో చూడని ఆ యువ పూజారికి, మనసు అన్యాక్రాంతమైన భార్య జగన్మాతగా కనిపించడంలో వింత లేదని అర్థం చేసుకునే ప్రేక్షకుడు మాత్రం తెల్లబోడు. పైగా ఆ అద్భుత వైవిధ్య చిత్రీకరణకు జోహార్లు అర్పిస్తాడు. అందుకే ‘సప్తపది’, పది కాలాల పాటు చెప్పుకునే సినిమాగా మిగిలింది. ఇవన్నీ పక్కన పెడితే హీరో ఒట్టి వెర్రిబాగులవాడు. వయసు ఎదిగినా బుద్ధి మందగించిన వాడు. అమ్మాయి వీపు తోముతున్నా, గుడి మెట్లు కడుగుతున్నా పని మీద శ్రద్ధ తప్ప, మరే ధ్యాసలూ ఉండనంత అమాయకుడు. అలాంటి హీరోతో ‘స్వాతిముత్యం’లాంటి సినిమా తీశారు విశ్వనాథ్‌. అలా ఆయన ఓ చెప్పులు కుట్టేవాడితో స్ఫూర్తిని పంచగలరు. ఓ ఆవులు కాసేవాడితో మంచితనానికి అర్థం చెప్పించగలరు. ఓ జాలరితో బంధమంటే ఏంటో చూపించగలరు. బాధ్యతను తప్పించుకోడానికి సన్యాసులలోనైనా చేరడానికి సిద్ధపడే ఓ బద్ధకస్తుడితో పని విలువేంటో తెలియజెప్పగలరు.
సమాజంలో వేళ్లూనుకు పోయిన సమస్యలను కూడా విశ్వనాథ్‌ చిత్రాలు కట్టెదుట నిలిపి, నిలదీసి మరీ పరిష్కారాలు సూచిస్తాయి. ఆచార వ్యవహారాల కన్నా మానవత్వం గొప్పదని శంకరాభరణం చాటి చెప్పడాన్ని ఎలా మర్చిపోగలం? మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని ‘సప్తపది’ స్పష్టం చేస్తే ఎలా కాదనగలం? చేసే పని తపస్సయితే అదే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని ‘స్వయంకృషి’ చెబితే ఒప్పుకోకుండా ఎలా ఉండగలం? అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే ఉత్తమమని ‘సూత్రధారులు’ బోధిస్తే అంగీకరించకుండా ఎలా ఉండగలం? వరకట్నం సమస్యని సునిశిత హాస్యంతో మేళవించి ‘శుభలేఖ’ చూపిస్తే ఆలోచించకుండా ఎవరుండగలం? ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా అసూయాద్వేషాలు అధఃపాతాళానికి దిగజారుస్తాయని ‘స్వాతికిరణం’ కళ్లు తెరిపిస్తే కాదనగలమా?
కె. విశ్వనాథ్‌, సమాజాన్ని సినిమా జాగృతం చేయగలదని మనసా, వాచా, కర్మణా నమ్మారు. ఆ నమ్మకానికి వూహను జోడించి, అందమైన కథను అల్లి ప్రేక్షకుల మనస్సులలో చెరిగిపోని ముద్ర వేసే అరుదైన, అద్భుత చిత్రాలను వెండితెరపై కమనీయంగా మలిచారు. అందుకే ఆయన కళాతపస్వి మాత్రమే కాదు, చిరకాలం తల్చుకోగలిగే అసమాన యశస్వి!!
published in EENADU on 24.04.2017

బుధవారం, ఫిబ్రవరి 22, 2017

రాజకీయ మహేంద్రజాలం


‘మన ఇంద్రజాలికులకు గొప్ప శుభసమయమిది. ఇంద్రజాలం అనే కళలో మనమెంత ఆరితేరిపోయామో తలచుకుని మురిసిపోయే సందర్భం’ అంటూ వేదిక మీద నుంచి మహేంద్రజిత్‌ ఉపన్యాసం ఇవ్వగానే హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో మహేంద్రజిత్‌ మరింత ఉత్సాహంగా మాట్లాడసాగాడు. ‘ఇంద్రజాలం అనేది ప్రాచీన భారతీయ కళ. మనం మాత్రమే చేయగలిగే గొప్ప మ్యాజిక్‌లను చాలామంది చేయలేరనడంలో అతిశయోక్తి లేదు...’ అన్నాడు కొంచెం గర్వంగా!
‘అలా ఎందుకనుకోవాలి?’ అనే గొంతు సభలోంచి వినిపించింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. సామాన్య దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి సభలో లేచి నిలబడి ఉన్నాడు.
మహేంద్రజిత్‌కు కోపంగా ‘ఎవరు మీరు, ఏమిటి మీ అభ్యంతరం?’ అన్నాడు.
‘నేనొక మామూలు భారతీయుణ్ని. మీరు చేయగలిగే మాయలను మరెవరూ చేయలేరని గప్పాలు కొట్టుకుంటుంటే ఉండలేకపోయా’ అన్నాడు భారతీయుడు నిబ్బరంగా.
‘అంటే మాకంటే గొప్ప ఇంద్రజాలికులు ఉన్నారంటారా?’ అన్నాడు మహేంద్రజిత్‌.
‘ఉన్నారు...’
‘ఎవరు వారు?’
‘రాజకీయ నాయకులు’
సభంతా గొల్లుమంది.
‘నేనేమీ మీ సభకు అడ్డు తగలడంలేదు. మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పడానికే లేచాను. కావాలంటే మీరు చేసే ఏ మ్యాజిక్‌నైనా మా నాయకులు చేస్తారని నిరూపించగలను...’
సభలో కలకలం మొదలైంది. చాలామంది అతడేం చెబుతాడో వినాల్సిందేనని పట్టుబట్టారు.
చేసేది లేక మహేంద్రజిత్‌ ఆ వ్యక్తిని వేదికపైకి ఆహ్వానించాడు. వెంటనే మ్యాజిక్‌ ప్రదర్శన మొదలైంది. మహేంద్రజిత్‌ ఓ పెద్దతాడు తెప్పించి పైకి విసిరాడు. ఆశ్చర్యం... అది నిటారుగా కర్రలా నిలబడిపోయింది. దాన్ని పట్టుకుని మహేంద్రజిత్‌ పైకి ఎక్కి దిగాడు. హాలంతా కేరింతలు!
‘ఇది గ్రేట్‌ ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ తెలుసా?’ అన్నాడు మహేంద్రజిత్‌ గొప్పగా.
భారతీయుడు నవ్వి, ‘మా రాజకీయ నాయకులకు సాధ్యం కానిదేదీ ఉండదు. ఎలాంటి అర్హతలూ లేకపోయినా వారసత్వమనే తాడును పట్టుకుని ఎగబాకగలరు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా, కేవలం అత్తింటివారి పేరు చెప్పుకొని అధికారాన్ని తాడులా నిలబెట్టి పైకెక్కి కూర్చుని అందరినీ తైతక్కలాడించిన ఓ నాయకురాలి విన్యాసాల ముందు మీరు చేసిన మాయాజాలం నాకేమీ ‘కిక్‌’ ఇవ్వడం లేదు. ఇప్పుడామె తనకు బదులుగా తన కుమారుణ్ని పైకెక్కించడానికి తాడు పేనుతోంది. కేవలం పనిమనిషిగా మరో నాయకురాలి చెంత చేరి, కోట్లకు పడగెత్తి, ఓ రాష్ట్రాన్నే శాసించడానికి రంగం సిద్ధం చేసుకున్న మరో నేతమ్మని ఈమధ్యనే చూశాం’ అన్నాడు.
మహేంద్రజిత్‌ మొహం జేవురించింది. మరో మ్యాజిక్‌ మొదలుపెట్టాడు.
‘ఇదిగో... ఇక్కడున్న ఈ పెద్దకారు నీకు కనిపిస్తోందా? దాన్ని మీరు చూస్తుండగానే మాయం చేసేస్తా’ అంటూ చేతులూపేసరికి అది కాస్తా మాయమైపోయింది.
భారతీయుడు ఓ నవ్వు నవ్వాడు. ‘మాలో కొందరు రాజకీయ నాయకులు లేనివి కూడా ఉన్నట్లు చూపించగలరు. వంతెనలు, రోడ్లు, కల్వర్టులు, ఆనకట్టలు కూడా లేకుండానే కట్టినట్టు భ్రమ కలిగిస్తారు. వాటికి బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని కోట్లకు కోట్లు మాయం చేయగలరు. అలాంటిది మీరు ఓ చిన్నకారును మాయం చేసి గొప్పలు పోతున్నారు...’
సభంతా నవ్వులు మిన్నంటాయి. ఈసారి మహేంద్రజిత్‌ ఓ పేకముక్క తీసుకుని దాని నుంచి వందలాది పేకముక్కల్ని విరజిమ్మాడు.
భారతీయుడు నవ్వి, ‘ఇలాంటివాటిని మా వీధి నాయకులు సైతం అవలీలగా చేసేస్తారు. ఒకే పనిని కాగితం మీద చూపించి విడతలు విడతలుగా ప్రభుత్వ ధనాన్ని వసూలు చేసుకుంటారు. దాని ముందు ఇదెంత?’ అన్నాడు.
ఈసారి మహేంద్రజిత్‌ ఓ అమ్మాయిని పెట్టెలో పడుకోబెట్టి రంపంతో కోసేసి, మళ్ళీ బతికించినట్టు చూపించాడు.
‘ఓసోస్‌... చచ్చిపోయిన మనుషుల పేరిట పింఛన్లను అనుచరులకు అనుమతిగా మంజూరు చేయించే అవినీతి నేతల గురించి మీరు వినలేదనుకుంటా. బతికున్నవాళ్లను చచ్చినట్టు చూపి, వారి పేరిట ప్రభుత్వ లబ్ధి ఆరగించే ఉదంతాలు కోకొల్లలు. చనిపోయిన సైనికుల పేరిట ఇళ్లను మంజూరు చేస్తే, వాటిని దొడ్డిదారిన అందుకున్న మహానేతలు, అనుచరులు, అధికారుల గురించి పత్రికల్లో చదివాం. ఇప్పుడేమంటారు?’ అన్నాడు భారతీయుడు.
మహేంద్రజిత్‌ ఓ ఖాళీ బిందె చూపించి ‘వాటర్‌ ఆఫ్‌ ఇండియా’ అంటూ దాన్ని బోర్లించి నీళ్లు రప్పించాడు.
భారతీయుడు పగలబడి నవ్వాడు. ‘మా రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి నిధులు పారించిన మాయ ముందు ఇదెంత? అలా లక్ష కోట్లు ఆర్జించిన నాయకులను మా కళ్ల ముందే చూశాం. మా నేతలు రాజకీయ టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల అవినీతి విన్యాసాల ముందు మీవన్నీ చిన్న చిన్న ట్రిక్కుల కిందే లెక్క. ఏమంటారు?’ అన్నాడు.
సభలోని వారంతా లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టసాగారు.
మహేంద్రజిత్‌ ఓ దండను గాలిలో సృష్టించి, భారతీయుడి మెడలో వేసి సత్కరించాడు!
- ఎ.వి.ఎన్‌.హెచ్‌.ఎస్‌.శర్మ
PUBLISHED IN EENADU ON 22/2/2017

శనివారం, జనవరి 21, 2017

బీద అరుపులు



‘శిష్యా... చిరుగు అనగానేమి?’
‘చిల్లి, ఖాళీ ప్రదేశం లేదా రంధ్రం గురూ’
‘అనగా?’
‘శూన్యం అనీ అనవచ్చు గురూ!’
‘లెస్స పలికితివి. మరి చిల్లులు దేనికి ఉపయోగపడును?’
‘అది మాత్రం తెలియదు గురూ’
‘నేర్చుకోరా బడుద్ధాయ్‌! చిల్లులు... ప్రచారానికి ఉపయోగపడును. విమర్శకు ఆలంబనమగును. రాజకీయానికి పనికివచ్చును. నవ్వుల జల్లుల్నీ కురిపించును’
‘వావ్‌ గురూ! చూడగా చిల్లులు బహుళ ప్రయోజనకారులని అర్థమవుతున్నది’
‘చురుకైనవాడివే. మరి ఈ చిల్లులతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నదెవరో చెప్పగలవా శిష్యా?’
‘బహు కష్టం గురూ! నాకంతటి పరిజ్ఞానమున్న, మీ దగ్గర ఎందుకు పడివుంటాను? వేరొక ఆశ్రమం స్థాపించి గురుస్థానంలో కూర్చుండేవాడిని కదా గురూ’
‘నీ బుర్ర అనే ఇసుకపర్రలో ఇలాంటి చెడు తలంపుల బెడ్డముక్కలు ఉన్నవని నాకు తెలుసుకానీ శిష్యా, ఆ మహానుభావుడి గురించి తెలిపెదను వినుము’
‘ధన్మోస్మి గురూ, సెలవిండు’
‘ఆతండు ఒక యువకుండు. తల్లి చాటునుండు. అధికారానికై ఆశపడుచుండు. అడపాదడపా విలేకరులను పిలిచి ఏదేదియో మాట్లాడుచుండు. సభలలో రెచ్చిపోయి ప్రసంగించుచుండు. అర్థమైందా శిష్యా?’
‘కాలేదు గురూ! ఈమధ్య అతడు మాట్లాడిన విషయాలేమైనా చెప్పినచో పోల్చుకొనగలను’
‘అట్లయిన అఘోరించు. మొన్నటికి మొన్న ఇతగాడు ఓ కుర్తా వేసుకుని ఉత్తరాఖండ్‌లో ఓ సభకు వచ్చెను’
‘వచ్చి ఏం చెప్పాడు గురూ’
‘ముందుగా జేబులో చెయ్యి పెట్టినాడు. ఆ జేబులో చిరుగు ఉన్నదన్నమాట. ఆ చిరుగు చిల్లులోంచి చెయ్యి బయటికి పెట్టి చూపించినాడు. అందరూ నవ్వసాగిరి’
‘అప్పుడేమైంది గురూ’
‘ఆ యువకుడు నోరు విప్పినాడు. ఇదిగో నా కుర్తా చిరిగింది. ఇది నాకు పెద్ద విషయం కాదు. ఇలాంటి చిల్లుల చొక్కాను మన ప్రధానమంత్రి ఎప్పుడైనా వేసుకున్నారా? వేసుకోరు. అయినా, తానొక పేదల ప్రతినిధి అని చెబుతూ ఉంటారు. పేదలపై రాజకీయం చేస్తూ ఉంటారు... అంటూ ప్రసంగించినాడు’
‘ప్రజాసభకు చిరిగిన కుర్తా వేసుకుని రావడమేంటి గురూ?’
‘మరి అదేరా శిష్యా... అతి తెలివి. కావాలని కుర్తాకు చిరుగు పెట్టి, అది వేసుకుని సభకు వచ్చి, ఆ చిల్లిలో చెయ్యిపెట్టి, దాన్ని బయటకు చూపించి మరీ దేశ ప్రధానిపై విమర్శలు కురిపించాడు చూశావా?’
‘అవును గురూ! చిరుగు ప్రచారానికి, రాజకీయానికి పనికివచ్చునని నిరూపించినాడు. మరి అతగాడి మాటల ప్రయోజనం నెరవేరిందా గురూ?’
‘ఓరి వెర్రి శిష్యా! మన ప్రజలు అంతకంటే అధికులు. చిల్లుల కుర్తా వేసుకొని వచ్చినా... అతడు మాత్రం పేదల ప్రతినిధి కాడని ఇట్టే గ్రహించినారు. ఆ పట్టున విరగబడి నవ్వి ఆతడినే వెర్రివాడిని చేసినారు’
‘ఎలా గురూ?’
‘ఆ యువకుండు ఈ మధ్యనే విదేశీయానం చేసి వచ్చాడు కదా. సామాజిక మాధ్యమాల్లో ఆ సంగతి గుర్తు చేసి మరీ ఎద్దేవా చేసినారు. కొందరు రూపాయి విరాళాలు ప్రకటించి వెక్కిరించినారు. ఇంకొందరు ఈ వికృత రాజకీయం ఏమిటని ఏకినారు. పాలకపక్ష యువనేతలైతే ఆతడికి కొత్త కుర్తాలు కొని పంపించెదమని ఉడికించినారు’
‘అనగా... చిల్లులతో జాగ్రత్తగా లేకున్నచో అది మన ఉద్దేశాన్నే అమాంతం హరించే పెనురంధ్రమగునని తేలినట్టే కదా గురూ?’
‘రాటుతేలివితిరా శిష్యా! చిల్లుల సాయంతో రంధ్రాన్వేషణ చేయాలనే అతగాడి ప్రయత్నం విఫలమైందన్న మాట’
‘లెస్స గురూ... ఆతడి వెటకారపు వెక్కిరింతలు, మాటలు, కూతలు, ఎక్కసెక్కపు కబుర్లు మరికొన్ని చెప్పినచో ఆతడిని పోల్చుకోవడానికి ప్రయత్నించగలను’
‘ఏమని చెప్పుదు శిష్యా! తానుగానీ నోరు విప్పినచో భూకంపాలే వచ్చునని చెప్పును. తానుగానీ నిజాలు చెబితే సునామీలు వచ్చునని బెదిరించును. కానీ నోరు విప్పలేడు... నిజాలు చెప్పలేడు’
‘చిత్రవిచిత్రంగా ఉంది గురూ... ఇంకా?’
‘ఓసారి విధాన సభలో రాసుకొచ్చిన ప్రసంగం చదువుతూ స్పీకర్‌ స్థానంలో మగవారు ఉండగా మేడమ్‌ అని సంబోధించి నాలుక కరుచుకొనును. మరియొకసారి గంభీరంగా మొహం పెట్టి మాట్లాడుతూ, రాజకీయం ఎక్కడ పడితే అక్కడ ఉంది... నీ జేబులో రాజకీయం ఉంది, నీ ప్యాంటులో రాజకీయం ఉంది అనెను. దేశమంతా ఘొల్లుమనెను. మరియొకమారు గుజరాత్‌తో పాల ఉత్పత్తి అంతా మహిళల వల్లే సాధ్యమైనదనును... ఇట్లు ఎన్నని చెప్పను శిష్యా ఆ యువకుడి మాటల మెరుపులు?’
‘ఆ... అతగాడు ఎవరో పోల్చుకున్నాను గురూ! ఇంతకుముందు యువరాజుగా పేరొందిన సుపుత్రుండు. ఆతడి గురించి మరియొక సంగతి గ్రహించాను గురూ! ఆ చిరుగు లేదా చిల్లి లేదా రంధ్రం లేదా శూన్యం అతడి జేబులో కాదు- నిజానికి అతడి ఆలోచనల్లో ఉందని! నిజమేనా గురూ?’
‘చక్కగా చెప్పి, నీ బుర్రలో చిల్లి లేదని నిరూపించుకున్నావురా శిష్యా! మరొక సంగతి చెప్పెదను వినుము. ఆతడు యువరాజుగా వెలుగొందిన కాలంలో సాగిన అవకతవక, అవినీతి, అస్తవ్యస్త రాజకీయ పరిపాలనా విన్యాసాల వల్లనే దేశ ఆర్థిక పరిస్థితి కుర్తాలో చిరుగు లాగా మిగిలినది. ప్రజాధనాన్ని ఆనాటి పాలకులు జేబుల్లో నింపుకొని, చివరికి అతడిలానే చిరుగు చిల్లుల్లో చెయ్యి చూపించి... చక్కాపోయినారు శిష్యా’
‘ఆహా గురూ... ఆఖరికి చిల్లి సైతం సుపరిపాలకులను ఎన్నుకోవాలని ప్రబోధిస్తోంది గురూ!’
PUBLISHED IN EENADU ON 21.01.2017

సోమవారం, జనవరి 16, 2017

రాజకీయ రంగవల్లులు



‘హరిలోరంగ హరి... మన కష్టాలన్నీ హరీ... 
సుఖాలదిగో మరి... ఇక సంబరాలు చేద్దారి!’ 
- అంటూ హరిదాసు కొత్తపాట పాడుతూ బయల్దేరాడు. ముగ్గులు దాటుకుంటూ, గొబ్బెమ్మలు చూసుకుంటూ ఓ ఇంటి దగ్గర ఆగాడు. 
‘ఏందయ్యోయ్‌! పాట కొత్తగా ఉంది. ఓ పక్క జనం నానా బాధలూ పడుతుంటే, పండగ సాకు చూపించి నీ పబ్బం గడుపుకొందామని చూస్తున్నావా?’ అన్నాడు ఆ ఇంటి గుమ్మం ముందు నుంచున్న ఆసామి. 
‘ఎవరు స్వామీ తమరు?’ అన్నాడు హరిదాసు. 
‘నన్నే గుర్తు పట్టలేదా? కేజ్రీవాల్‌ని. మాయమాటలకీ గాలి పాటలకీ మైమరచిపోయేవాణ్నికాదు. తెలుసా?’ 
‘అయ్యో... మిమ్మల్ని గుర్తుపట్టలేకేమండీ. ముందు మీరు జనం కష్టాలేంటో చెప్పండి మరి...’ 
‘నువ్వొచ్చేదారిలో జనం క్యూలో నుంచున్నారు కనిపించలేదా? బ్యాంకులు కూడా డబ్బుల్లేవనే బోర్డులు పెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అల్లాడిపోతోంది. ఇంకా పండగ సంబరమేంటయ్యా...’ 
‘అయ్యా... మీరు క్యూలో ఉన్న జనాన్నే చూస్తున్నారు. కానీ నేను ఆ జనం మొహాల్లో ఉన్న నమ్మకాన్ని చూస్తున్నా. మీరు బ్యాంకుల ముందు బోర్డుల్నే చూస్తున్నారు. నేను దేశం మొత్తం మీద పోగవుతున్న లక్షల కోట్ల సంపదను చూస్తున్నా. ఇన్నాళ్లూ ఎక్కడికి పోయిందండీ ఈ సొమ్మంతా? కేవలం పది శాతం కూడా లేని బడా బాబుల భోషాణాల్లో, ఇంటి గోడల్లో, బాత్రూముల్లో దాచిన రహస్య అరల్లో మూలుగుతున్న మహాలక్ష్మి ఇప్పుడు వెలుగు చూస్తోంది. అది నాకు సంక్రాంతి లక్ష్మిలా కళకళలాడుతూ కనిపిస్తోంది. బినామీ పేర్లతో, మాయ డిపాజిట్లతో సామాన్యులకు అందాల్సిన ఫలాల్ని అక్రమంగా దోచుకుని దాచుకున్న అవినీతిపరుల బందిఖానాల్లోంచి బయటకు వస్తున్న సిరుల కుప్పలు నాకు శోభస్కరమైన గొబ్బెమ్మల్లా కనిపిస్తున్నాయి. ఇది పండగ సంబరం కాదంటారా? దేశ సరిహద్దుల అవతలకి ఓసారి మీ సంకుచితమైన చూపును సారించండి. ఉగ్రవాదులకు వూతమివ్వడానికి పోగేసిన వేలాది కోట్ల పెద్ద నోట్లన్నీ చెల్లని చిత్తు కాగితాలైపోవడంతో ఏం చేయాలో తోచక నిప్పుపెట్టిన మంటలు కనిపిస్తాయి. అవండీ... నిజమైన భోగి మంటలు! ఇవన్నీ రాజకీయ చట్రంలో చిక్కుకుపోయిన మీకు అర్థం కావేమో కానీ, నా దేశంలోని సామాన్య ప్రజానీకానికి ఎప్పుడో తెలుసు. అందుకే సహనంతో ఉన్నారు...’ అన్నాడు హరిదాసు ఆవేశంగా. 
కేజ్రీవాల్‌ తెల్లమొహమేసినా, తేరుకుని ‘అంటే ఆ కాషాయ పార్టీ వాళ్లు హరిదాసులకి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి పంపించారన్నమాట. ఆగాగు... ఇప్పుడే ప్రెస్‌మీట్‌ పెడతా...’ అన్నాడు. 
‘అయ్యా... ముందు మీ పార్టీని చీపురు పెట్టి దులుపుకోండి. ఆ తరవాత ఎదురింటి ముంగిటిని విమర్శిద్దురుగాని. పొరిగింటాయన అమ్మ కాళ్లకి దణ్నం పెట్టినా, అందులో కూడా రాజకీయమే కనిపిస్తుంది మీకు...’ అంటూ వెళ్లబోయాడు హరిదాసు. 
కేజ్రీవాల్‌ సర్దుకుని, ‘పోనీలే హరిదాసూ! పండగ పూట గుమ్మంలోకి వచ్చావని ఏమైనా ఇద్దామన్నా చిల్లర లేదోయ్‌. ఏం చేయను?’ అన్నాడు. 
హరిదాసు నవ్వి సంచిలోంచి స్వైపింగ్‌ యంత్రం తీశాడు. ‘మీకంతగా మనసుంటే ఇందులో కార్డు గీకండి. నగదు రహిత దేశం కోసం నావంతుగా ఇది సమకూర్చుకున్నాను’ అన్నాడు.
* * *
‘రావమ్మా...మహాలక్ష్మీ రావమ్మా... 
మా దేశమే నీ ఇల్లు... కొలువై ఉందువుగాని...’ 
-అంటూ హరిదాసు మరో ఇంటి ముంగిట్లోకి వెళ్లి నుంచున్నాడు. ఆ ఇంటి తలుపు భళ్లున తెరుచుకుంది. కళ్లెర్రజేస్తూ మమతాబెనర్జీ బయటకు వచ్చి రుసరుసలాడుతూ, ‘శుభమా అని విలేకరుల సమావేశానికి వెళుతుంటే నువ్వొచ్చావా? ఇంకెక్కడి మహాలక్ష్మయ్యా? పెద్దాయన అనాలోచిత పనులతో పండగ వెలవెలబోతోంది. అందుకే జనం కళ్లు తెరిపిద్దామని బయల్దేరా...’ అంది కోపంగా. 
‘అమ్మా... ఇది నీ ఇల్లా? తెలియక వచ్చాను. ఇంతకీ ఏమని కళ్లు తెరిపిస్తారో తెలుసుకోవచ్చా తల్లీ?’ అన్నాడు హరిదాసు. 
‘ఓ దానికేం? ఇదంతా పెద్ద అవినీతి. కుంభకోణం. కుట్ర. బడా పారిశ్రామిక వేత్తల గుప్పెట్లో ఉందీ ప్రభుత్వం. నీకు నీ చిడతలు, ఇత్తడి పాత్ర తప్పితే మరింకేమీ తెలియదు పాపం... ఎలా బాగుపడతావో ఏంటో?’ 
హరిదాసు ఓసారి చిడతలు వాయించి, ‘తల్లీ తెలియకేమమ్మా... కొందరు విలేకరులు రహస్య కెమేరాలు పెట్టి మరీ మీ హయాములో ఉన్న మంత్రులు, అధికారుల అవినీతి ఎంత గొప్పగా ఉందో బయటపెట్టారు కదమ్మా! ఇలా అడుగడుగునా పేరుకుపోయిన అవినీతి బకాసురుల ఆట కట్టించేందుకు ఇంతవరకు ఎవరైనా కనీస ప్రయత్నమైనా చేశారా తల్లీ? ఇన్నాళ్లకు ఓ పెద్దాయన వచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే కంటగింపుగా ఉందామ్మా?’ అంటూ హరిదాసు ముందడుగు వేశాడు.
* * *
‘కడివెడు నీళ్లు కలాపి జల్లి గొబ్బిల్లో గొబ్బిళ్లు...’ 
-అంటూ హరిదాసు మరో ఇంటి ముందుకు వచ్చాడు. అందులోంచి ఓ యువకుడు పాలపీక నోట్లో పెట్టుకుని చీకుతూ బయటకు వచ్చాడు. 
‘ఇంకేం గొబ్బిళ్లయ్యా... ఇదిగో నేను నోరిప్పడానికి వెళుతున్నా. ఇక భూకంపాలు వచ్చేస్తాయి. త్వరగా ఇంటికి వెళ్లిపో’ అన్నాడు ఆ యువకుడు పాలపీక తీసి చేత్తో పట్టుకుని. 
హరిదాసు అతడికేసి తేరిపారి చూసి, ‘ఓ రాహుల్‌బాబా? ఈ దేశంలో ఇప్పటికే చాలా భూకంపాలు వచ్చాయి. తెలుసా బాబూ?’ అన్నాడు. 
రాహుల్‌ వెనక్కి తిరిగి ఇంట్లోకి చూస్తూ, ‘అమ్మా... చూడవే. నేను మాట్లాడకుండా భూకంపాలు ఎలా వస్తాయమ్మా... చెప్పు?’ అన్నాడు. 
లోపలినుంచి వాళ్లమ్మ కంఠం వినిపించింది, ‘అరె బచ్చా... బయటకి వెళ్లి విలేకరుల సమావేశం పెట్టి ఆడుకోమన్నానా? నన్ను విసిగించకు, నీ కోసం కుర్చీ చేసే పనిలో ఉన్నాను...’ అని. 
రాహుల్‌ బిక్కమొహం వేసుకుని, ‘ఏంటి హరిదాసూ... నాకు అర్థమయ్యేలా చెప్పు..’ అన్నాడు. 
‘చరిత్ర తెలుసుకో బాబూ! ఇంతకు ముందు వాళ్ల పాలనలో అవినీతి సునామీ దేశాన్ని ముంచెత్తింది. అక్రమాల భూకంపాలు అతలాకుతలం చేశాయి. భూమిని, గాలిని, నీటిని, నిప్పును కూడా అమ్ముకున్నారు నాయనా. ఇన్నాళ్లకి దేశం ముంగిట్లోకి కొత్త రంగవల్లులు వచ్చాయి. పేపర్లలో రోజుకో కుంభకోణం వార్తలు చూడటానికి అలవాటు పడిన ప్రజల కళ్లకిప్పుడు, అవినీతి పరులను పట్టుకున్న వార్తలు కనులవిందుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నీకు అర్థం కావులే కానీ, వెళ్లి ఆడుకో నాయనా!’ అంటూ హరిదాసు సాగిపోయాడు... 
‘హరిలో రంగహరి... మన బాధలన్నీ తీరి... 
బంగరు భవితకు దారి... అదిగదిగో మరి!’
- ఎ.వి.ఎన్‌.హెచ్‌.ఎస్‌.శర్మ

PUBLISHED IN EENADU ON 14.01.2017