సోమవారం, జులై 11, 2022

ఊక‌దంపుడులో... ఉద్దండుడు!

 


ఆహా... ఓహో... ఒళ్లు  గ‌గుర్పొడుస్తోంది గురూగారూ! ఏం ప్ర‌సంగం? ఏం జేజేలు? ఏం హంగామా? ఏం సంద‌డి? ఆంధ్రుడిగా పుట్టినందుకు జ‌న్మ ధ‌న్య‌మైపోయిందంటే నమ్మండి... అంటూ శిష్యుడు వ‌చ్చాడు ఒగ‌రుస్తూ.

ఒరేయ్‌... తెగ పుల‌క‌రించిపోతున్నావు కానీ, ముందు కాసిని మంచి నీళ్లు తాగి నిదానించు. లేక‌పోతే క‌ళ్లు తిరిగి ప‌డిపోగ‌ల‌వు... అంటూ గురువుగారు మంచి నీళ్ల సీసా అందించారు.

శిష్యుడు గ‌ట‌గ‌టా తాగేసి కూల‌బ‌డ్డాడు.

ఇప్పుడు చెప్పారా... ఏంటి ఇంత‌లా కిందా మీదా ప‌డిపోతున్నావు? ఎక్క‌డికెళ్లావు, ఏం చూశావు? ఏం విన్నావు? ఏం ఆక‌ళింపు చేసుకున్నావు?” అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు గురువుగారు.

మీరేక‌దండీ... రాజ‌కీయ శిక్ష‌ణలో భాగంగా ప్లీన‌రీ స‌మావేశాల‌కు వెళ్లి రమ్మ‌న్న‌రు? అక్క‌డి నుంచి నేరుగా ఇక్క‌డికే వ‌స్తున్నానండి...

అదా సంగ‌తి? మ‌రి అక్క‌డ నువ్వు గ్ర‌హించిన సూత్రాలేంటో చెప్పు... వింటాను...

అబ్బ‌బ్బ‌బ్బ‌... ఏం చెప్ప‌నండి బాబూ! అస‌లు ఒక మ‌నిషి త‌ల్చుకుంటే ఇంత‌లేసి గొప్ప గొప్ప ప‌నులు చేయ‌గ‌ల‌డా అని చెప్పేసేసి అనుమానం వ‌చ్చేసిందండి. అస‌లు హోలాంధ్రా ప్ర‌జానీకం బ‌తుకులు ఇంత బాగుప‌డిపోయాయా అనేసి ఆశ్చర్యం వేసేసిందండి... ఒక్క‌సారిగా క‌ళ్లు బైర్లు క‌మ్మేశాయండి. ఒళ్లు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయిందండి...

చాలా సంతోషంరా... ఇంత‌కీ అక్క‌డ అన్నింటిలోకీ నీకు న‌చ్చిన‌దేంటో చెప్పు?”

ప్ర‌సంగ‌మండీ బాబూ... ప్ర‌సంగం! ఎంత గొప్పగా ఉందండీ! ఆయ‌న‌గారు మెత్త‌గా న‌వ్వుతూ, చేతులూపుతూ, మాట్లాడుతుంటే మంత్ర‌ముగ్దుడినైపోయానండి...

మ‌రి ఆ ప్ర‌సంగంలో నీకు బోధ ప‌డిందేంటో చెప్పు?”

మార్పండి...  ఆయ‌నొచ్చాక స్థితిగ‌తులు ఎలా మారాయో చెప్పుకొచ్చారండి...రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మార్పు అంటే ఏంటో చూపించార్టండి... అక్క‌చెల్లెమ్మ‌లకు సాధికార‌త అంటే ఏంటో చూపించార్టండి... రైతుల‌పై మ‌మ‌కార‌మంటే ఏంటో చూపించార్టండి...  విద్యా విధానం ఎలా ఉండాలో చూపించార్టండి... అన్ని రంగాల‌పైనా త‌న‌దైన ముద్ర వేశార్టండి... ఎంత గొప్ప ప్ర‌సంగ‌మో క‌దండీ?”

అద్భుత‌మైన ప్ర‌సంగంరా... అందులో ఏమాత్రం సందేహం లేదు. మ‌రిప్పుడు చెప్పు, ఆ ప్ర‌సంగం విన‌డం ద్వారా నువ్వు నేర్చుకున్న రాజ‌కీయ పాఠం ఏమిటో?”

ఏముందండీ? అధికారంలోకి వ‌స్తే ఎలా ప్రజాసేవ చేయాలో తెలిసిందండి... అంతేనాండీ?”

ఏడిశావ్‌... ఏదో నా ద‌గ్గ‌ర ఇన్నాళ్లూ  కాస్తో కూస్తో రాజ‌కీయాలు నేర్చుకుని ఉంటావ‌నుకుని ప్రాక్టిక‌ల్ నాలెడ్జి కోసం నిన్ను గుంటూరు పోయిర‌మ్మంటే, గుడ్డెద్దు చేలో ప‌డ్డ‌డ్డు వినేసి వ‌చ్చేశావ‌న్న‌మాట‌... నీ మాట‌లు వింటుంటే నాకే సిగ్గుగా ఉందిరా...

అందేంటి గురూగారూ... అలా తీసి పడేశారు? నేనన్న‌దాంట్లో ఏదైనా పొర‌పాటు ఉందాండీ?”

మ‌రి కాద‌ట్రా... నువ్వు నేర్చుకోవ‌ల‌సింది ఏం చేయాలో కాదురా, ఎలా చెప్పుకోవాలో తెలుసుకోవాలి. అర్థ‌మైందా?”

ఆ రెండింటికీ ఏంటండి తేడా? చేస్తేనే క‌దా చెప్పుకోగ‌లుగుతాం? చెప్పిందే క‌దా చేస్తాం? చేసిందే క‌దా చెబుతాం?”

ఓరి స‌న్నాసీ... చేయ‌డం వేరు, చెప్పడం వేరు. చెప్పింది చేయాల‌ని లేదు. చేసేది చెప్పాల‌ని లేదు. చేసింది చెప్పుకునేంత లేక‌పోయినా, చేసేసిన‌ట్టు చెప్పుకోగ‌ల‌గాలి. చెప్పిందంతా చేయ‌క‌పోయినా, చేసిన‌దెంతో ఉంద‌నే చెప్పాలి. అంటే చేయ‌డం క‌న్నా చెప్పుకోవ‌డం నేర్చుకోవాలి. ఇదే రాజ‌కీయాల్లో ప్ర‌ధాన సూత్రం. తెలిసిందా?”

ఏమో గురూగారూ! మీ మాట‌లెప్పుడూ మ‌త‌ల‌బుగానే ఉంటాయి. ఇంత‌కీ ఆయ‌న చేసేసిన‌ట్టు చెప్పుకున్న మార్పు అబ‌ద్ధ‌మంటారా?”

అమ్మ‌మ్మ ఎంత మాట‌! అది అబ‌ద్ధం కాదురా... ప‌చ్చి నిజం. ఆయ‌నొచ్చాక  మార్పు జ‌రిగింద‌న్న‌ది నిజం. అయితే ఆ మార్పు ఆయ‌న‌చెప్పిన‌ట్టు ఉందా, లేదా అనేదే కీల‌కం...

అదిగో మ‌ళ్లీ మ‌డ‌త పేచీ పెడుతున్నారు... మార్పుకి, మార‌డానికి ఏంటండి తేడా?”

చెప్ప‌డానికి, చేయ‌డానికి ఉన్నంత తేడారా...

అయ్య‌బాబోయ్‌... గురూగారూ! ఈ మార్పేంటో, మార‌కపోవ‌డ‌మేంటో, చెయ్య‌క‌పోవ‌డ‌మేంటో, చెప్పుకోవ‌డ‌మేంటో,  నిజ‌మేంటో, అబ‌ద్ధ‌మేంటో కాస్త‌నా మ‌ట్టి బుర్ర‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పండి బాబూ...

అలారా దారికి! ఇది అర్థం చేసుకోవాలంటే అస‌లు మార్పంటే ఏంటో తెలుసుకోవాలిరా. అంత‌కు ముందున్న ప‌రిస్థితి నువ్వొచ్చాక మారితే  దాన్నే మార్పు అంటారు. కానీ  ఆ మార్పు వ‌ల్ల ప‌రిస్థితి దిగ‌జారిందా, మెరుగ‌య్యిందా అనేది నిశితంగా ప‌రిశీలిస్తేనే కానీ అర్థం కాదు. అది అర్థం కావాలంటే నువ్వు పుల‌క‌రించిపోయేలా  ప్ర‌సంగం చేసినాయ‌న కుర్చీ ఎక్కా జ‌రిగిన నిజ‌మైన మార్పు ఏంటో తెలుసుకోవాలి. ఆయ‌నేమన్నాడూ? రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మార్పు ఏంటో చూపించాన‌న్నాడు. అది నిజ‌మే క‌దా? ఆయ‌నొచ్చాక రాజ‌కీయాల‌కు అర్థ‌మే మారిపోలేదూ? అధికారంలోకి రాగానే చేయాల్సింది ప్ర‌జాసేవ కాదూ, దానిక‌న్నా ముఖ్యం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై క‌క్ష క‌ట్ట‌డ‌మ‌ని కాదూ చూపించింది? ఎప్ప‌టెప్ప‌టి కేసులో తిర‌గ‌దోడి, వెంటాడి వేధించ‌డం ద్వారా రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో క‌నీవినీ ఎరుగ‌ని మార్పు చూపించ‌లేదూ? అదేమిట‌ని ప్ర‌శ్నించిన వారిపై అడ్డ‌గోలు కేసులు పెట్ట‌డం ద్వారా వ్య‌వ‌స్థ‌ను ఎలా ఉప‌యోగించుకోవ‌చ్చో చూపించ‌లేదూ? స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోక‌పోగా, వాటి ప‌రిష్కారం కోసం శాంతియుతంగా నిర‌స‌న‌లు చేసే ప్ర‌జానీకం మీద‌కి రౌడీల‌ను, పోలీసుల‌ను సైతం ఉసిగొల్పిన అరాచ‌క  రాజ‌కీయాన్ని ఎప్పుడైనా చూశామా? అది మార్పు కాదూ?  అక్క‌చెల్లెమ్మ‌ల‌కు సాధికార‌మంటే ఏంటో చూపించాన‌న్నాడా? అంటే ఏంటి... అధికార పార్టీ నేత‌లు, అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లు ఎక్కడ ప‌డితే అక్క‌డ ఆడ‌వాళ్ల‌పై సాధికారికంగా అత్యాచారాలు, దౌర్జ‌న్యాలు చేయ‌డ‌మ‌న్న‌మాట‌. మ‌రి మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల విష‌యంలో మ‌న రాష్ట్రం టాప్ టెన్‌లో ఉండడం మార్పు కాదూ మ‌రి? ఆడ‌వాళ్ల‌పై అత్యాచారాలు పెర‌గ‌డానికి దోహ‌దం చేసే మ‌ద్యాన్ని క‌నుమ‌రుగ‌య్యేలా చేస్తానంటూ న‌మ్మించి, అధికారంలోకి వ‌చ్చాక మ‌ద్యం, సారా ఏరులై పారేలా చేస్తున్న విధానాలు ఎలాంటి మార్పు తీసుకొచ్చాయో తెలుసుకోవ‌ద్దూ? ఇక రైతులపై మ‌మ‌కార‌మంటే ఏంటో చూపించారని చెప్పుకోవ‌డం ద్వారా ఎంత గొప్ప ప్ర‌సంగం చేయ‌వ‌చ్చో నేర్చుకోవ‌ద్దూ?  మూడేళ్ల‌లో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకునే ప‌రిస్థితులు క‌ళ్లెదుట క‌నిపిస్తున్నా, ఆ విష‌యం చెప్ప‌లేక‌పోవ‌డం ఎంత నైపుణ్యం? రైతు భ‌రోసా ప‌థ‌కం ద్వారా సాయం అందుకున్న వారి సంఖ్య‌కి, ఆయ‌న చెప్పుకుంటున్న సంఖ్య‌కి ల‌క్ష‌ల్లో తేడా ఉందంటే... ప్ర‌జా వేదిక‌పై ఎంత నిబ్బ‌రంగా బొంక‌వ‌చ్చో ఢంకా బ‌జాయించి చెప్ప‌డం కాదా? జ‌నాలు అప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లేసుకోలేర‌నేగా ధీమా? మ‌రి ఆ నిస్సిగ్గు నిబ్బ‌రం, ఆ దుందుడుకు ధీమా నీలాంటి వాళ్ల‌కి నికార్స‌యిన నీచ పాఠం కాదూ? మ‌రి ఆర్థిక రంగంలో జ‌రిగిన మార్పును మ‌ర్చిపోగ‌ల‌మా?  మూడేళ్ల‌లో అయిదు ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగిన అప్పుల‌కు లెక్కా, జ‌మా ఎక్క‌డైనా క‌నిపిస్తున్నాయా? ఇహ‌...విద్యా విధానం ఎలా  ఉండాలో చూపించామ‌న్నాడు క‌దా, అదేదో బ‌డులు ర‌ద్ద‌యి బెంబేలు ప‌డుతూ రోడ్ల మీద బైఠాయిస్తున్న విద్యార్థుల‌ను చూస్తుంటే తెలియడం లేదూ? పాఠ‌శాల‌ల‌కు తాళాలు వేసి మ‌రీ  ఆందోళ‌నలు చేస్తున్న త‌ల్లిదండ్రులను అడిగితే తెలియ‌దూ ఆ మార్పేదో? విద్యావ్య‌వ‌స్థను విఛిన్నం చేస్తున్నారంటూ బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు సంధిస్తున్న టీచ‌ర్లు చెప్ప‌రూ అస‌లు మార్పంటే ఏంటో? ఉన్న‌ట్టుండి 8 వేల బ‌డుల్ని మూసేసిన విద్యా విధానం మునుపెప్పుడైనా చూశామా మ‌రి? ఇహ‌... అవ్వా, తాత‌ల‌కు డ‌బ్బులిస్తున్నామ‌ని చెప్పుకుంటున్నాడే... మ‌రి అదే చేత్తో ధ‌ర‌లు పెంచి, ప‌న్నులు విధించి వాళ్ల బిడ్డ‌ల జేబుల్నుంచి ఊడ‌బెరుక్కుంటున్న దుడ్ల సంగ‌తేంట్రా? ఏకంగా 5 ల‌క్ష‌ల పింఛ‌న్ల‌ను ర‌ద్దు చేసిన లెక్క‌లు ఎక్క‌డా చెప్ప‌లేదు క‌ద‌రా! కాబ‌ట్టొరే... ఇప్ప‌టికైనా నీకు అర్థ‌మైందా...  చెప్ప‌డానికి, చెయ్య‌డానికి,  చెయ్య‌క‌పోయినా చేసిన‌ట్లు చెప్పుకోడానికి ఉన్న తేడా?”

అర్థం కావ‌డ‌మేంటండి బాబూ... దిమ్మదిరిగిపోతేను. చెప్పింది చేయ‌క్క‌ర‌లేద‌ని, చేసేది చెప్ప‌క్క‌ర్లేద‌ని, చెయ్య‌క‌పోయినా చేసేసిన‌ట్టు చెప్పుకోవ‌చ్చ‌ని, చెప్పుకున్నంత మాత్రాన చేసిన‌ట్టు కాద‌ని, చేయ‌నంత మాత్రాన చెప్పుకోకుండా ఉండ‌క్క‌ర్లేదని, చెప్పుకోడానికి చేయ‌క్క‌ర‌లేదని... బాగా అర్థ‌మైంది గురూగారూ!

శెభాష్‌రా... నేను చెప్ప‌క‌పోయినా చెప్పిన‌ట్టు గ్ర‌హించావు. నువ్వు చెప్పిన‌ట్టు చేసుకుపోయావ‌నుకో, జ‌నాల్ని మ‌భ్య పెట్ట‌డంలో చెయ్యితిరిగిపోతావు. ప్ర‌జ‌ల్ని ఏమార్చ‌డంలో చెల‌రేగిపోతావు. ఊక‌దంపుడు ప్ర‌సంగాల్లో ఉద్ధండుడివి అవుతావు. ఇక పోయిరా!

-సృజ‌న‌

PUBLISHED ON 10.07.2022 ON JANASENA WEBSITE    

సోమవారం, జులై 04, 2022

సైతాను పాల‌న‌లో భలే సూత్రాలు!

 శిష్యుడు వ‌చ్చేస‌రికి గురువుగారు ప‌డ‌క్కుర్చీలో వెన‌క్కి వాలి కూర్చుని సెల్‌ఫోన్‌లో పాట‌లు వింటున్నారు.

రా.. రా... మంచి పాట‌పెట్టాను విందువుగాని... అన్నారు గురువుగారు.

సెల్‌ఫోన్‌లోంచి పాట వ‌స్తోంది...

 

అప్పులు గొప్ప‌గ‌చేయొచ్చండీ...

అస‌లుకు ఎస‌రే పెట్టొచ్చండీ...

పీపాలెన్నో తాగొచ్చండీ...

పాపాలెన్నో చేయొచ్చండీ...

 

గురువుగారు సెల్‌ఫోన్‌లో పాజ్ పెట్టి శిష్యుడి కేసి చూసి అడిగారు.

ఏరా... ఈ పాట గుర్తుందిరా?”

లేకేమండీ... పాత పాటండి. రాజాధిరాజు సినిమాలోదండి. బాపూగారు ద‌ర్శ‌కుడండి... అన్నాడు శిష్యుడు ముక్త‌స‌రిగా.

నీకు సినిమా నాలెడ్జి బాగానే ఉందిరా... అన్నారు గురువుగారు మెచ్చుకోలుగా.

శిష్యుడు ఆ మాట‌లు విని పొంగిపోలేదు స‌రిక‌దా, విసుగ్గా మొహం పెట్టాడు.

ఊరుకోండి గురూగారూ! నేనేదో మీ ద‌గ్గ‌ర నాలుగు రాజ‌కీయ పాఠాలు నేర్చుకోవాల‌ని వ‌స్తుంటే మీరేమో సినిమా పాట‌లు పెడ‌తారు... ఇలాగైతే నేనెప్పుడు నేర్చుకుంటాను? ఎప్పుడు ఎదుగుతాను? ఎప్పుడు కుర్చీ ఎక్కుతాను? ఎప్పుడు పాలిస్తాను? ఎప్పుడు వెన‌కేస్తాను?” అన్నాడు ఉక్రోషంగా.

గురువుగారు అదేం ప‌ట్టించుకోలేదు.

స‌రేలేరా... నీ గోల ఎప్పుడూ ఉండేదే. ఇంత‌కీ ఈ  పాట వింటుంటే నీకేం గుర్తొస్తోందో చెప్పు?”

శిష్యుడు త‌ల‌గోక్కుని, “ఏముందండీ... హీరో విజ‌య‌చంద‌రు, హీరోయిన్ సుమ‌ల‌త‌, విల‌న్ నూత‌న్‌ప్ర‌సాద్ వీళ్లంతా గుర్తొస్తారండి. సినిమా అప్ప‌ట్లో బాగానే ఆడిందండి. నేను రెండు మూడు సార్లు చూశానండి... అన్నాడు త‌ప్ప‌ద‌న్న‌ట్టు మొహం పెట్టి.

వెరీగుడ్... నువ్వు సినిమాల్లోకి వెళ్లొచ్చురా... బాగా ప‌నికొస్తావ్‌... అన్నారు గురువుగారు.

ఆ స‌రికి శిష్యుడికి ఒళ్లు మండిపోయింది.

అదేంటి గురూగారూ! పాఠాల కోసం నేనొస్తే పాట‌లు పెడ‌తారు. పైగా సినిమాల్లోకి పొమ్మంటారు. ఇందుకోస‌మేనాండీ మిమ్మ‌ల్ని న‌మ్ముకుంట‌?” అన్నాడు చిరుకోపంతో.

ఓరి స‌న్నాసీ... మ‌రింకేమంటానురా... పాట వింటే ఏం గుర్తొస్తోందో చెప్ప‌మంటే యాక్ట‌ర్ల గురించి చెబుతావ్‌. నీక‌స‌లు బుద్ధుందిరా... ఈ పాట పాత‌ది కాదురా... స‌రికొత్త‌ది. ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు స‌రిగ్గా స‌రిపోయేదే. నేను ఊరికే ఊసుపోక ఈ పాట పెట్టాననుకుంటున్నావురా... అంటూ గురువుగారు గ‌దిమారు.

అప్ప‌టికి శిష్యుడికి త‌న త‌ప్పేంటో తెలిసొచ్చింది.

క్ష‌మించండి గురూగారూ! నేను రాగానే మీరు పాఠం మొద‌లు పెట్టేశార‌ని తెలుసుకోలేక‌పోయాను. చెప్పండి సార్ రాసుకుంటాను... అంటూ పుస్త‌కం తెరిచి పెన్ను తీశాడు.

ఓరెర్రెద‌వా... తెర‌వాల్సింది పుస్త‌కం కాదురా. నీ మ‌స్త‌కం! చెప్పింది రాసుకోవ‌డం కాదురా, చుట్టూ జ‌రుగుతున్న‌ది చూసుకో... ఆ పాట వింటే నీకు ఇప్ప‌టి స‌మ‌కాలీన రాజ‌కీయం గుర్తుకు రావాలి. నీ ప‌ర‌గ‌ణా గుర్తుకురావాలి. దానిని ఏలుతున్న అధినేత గుర్తుకు రావాలి. ఆయ‌న ప‌రిపాల‌న తీరు గుర్తుకు రావాలి. ఇవ‌న్నీ కాకుండా హీరోహీరోయిన్లంట్రా నీకు గుర్తొచ్చేది?” అంటూ గురువుగారు గ‌ద్దించారు.

శిష్యుడు బిక్క మొహం పెట్టి, “త‌ప్ప‌యిపోయిందండి... కాస్త వివ‌రంగా చెబుదురూ... అన్నాడు.

గురువుగారు నవ్వి, “అలా రా దారికి! ఆ పాట చ‌ర‌ణం ఓసారి చెప్పు... అన్నారు.

అప్పులు గొప్ప‌గ చేయొచ్చండి... అస‌లుకు ఎస‌రే పెట్టొచ్చండి... అని వేటూరి గారు రాశారండి...

మ‌రిప్పుడు జ‌రుగుతున్న‌ద‌దే క‌ద‌రా... ఎంత గొప్ప‌గా అప్పులు చేస్తున్నారో గ‌మ‌నించావా? ఒక‌టి కాదు, రెండు కాదు...  ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల అప్పులు చేశారా లేదా నీ పాల‌కులు? అందుకోసం కొత్త జీవోలు జారీ చేశారు. చ‌ట్టాన్ని ఏమార్చారు. రుణ సంస్థ‌ల్ని సైతం బురిడీ కొట్టించారు. ఆఖ‌రికి రాబోయే ఏళ్ల‌లో ఆదాయాన్ని కూడా త‌న‌ఖా పెట్టి ఎక్క‌డ దొరికితే అక్క‌డ తెచ్చేశారు. అన్నేళ్లు వాళ్ల ప్ర‌భుత్వం ఉంటుందో లేదో తెలియ‌దు. ఒక వేళ కుర్చీ దిగార‌నుకో. అస‌లుకు ఎస‌రే క‌దా? అప్పుడు తీర్చాల్సింది ఎవ‌రు? ప‌న్నుల రూపంలో ప్ర‌జ‌లే క‌దా? అప్పుల ఊబిలో ప్ర‌జ‌ల్ని నిలువునా దించేసి అధికారంతో మ‌జా చేస్తున్న‌ట్టే క‌దా? ఆ అప్పుల‌కు వ‌డ్డీలేమైనీ నీ అధినేత త‌న జేబులోంచి క‌డ‌తాడా? అంచేత‌... నువ్వు రేప్పొద్దున్న ప్ర‌జ‌ల ఖ‌ర్మ కాలి కుర్చీ ఏక్కావే అనుకో... ఈ దారుణ రుణ నైపుణ్యాన్ని వంట ప‌ట్టించుకోవాలి క‌దా? మ‌రి ఇంత‌క‌న్నా గొప్ప పాఠం ఏముంటుంది చెప్పు?”

అవునండి... నిజ‌మేనండి... అంటూ శిష్యుడు తలూపాడు.

త‌లూప‌డం కాదు... ఆ త‌ర్వాతి లైన్లు చెప్పు?”

పీపాలెన్నో తాగొచ్చండి...పాపాలెన్నో చేయొచ్చండి...

ఇది కూడా ఇప్పుడు జ‌రుగుతున్న‌దే క‌ద‌రా... ప్ర‌జ‌ల చేత పీపాల‌కు పీపాలు తాగిస్తున్నారు. అలా తాగుతూ వాళ్ల క‌ట్టే సొమ్ముతోనే క‌దా, ప్ర‌భుత్వం న‌డుస్తుంట‌? అందుకోసం మ‌ద్యం పాల‌సీ మార్చారు. కొత్త కొత్త బ్రాండ్లు అల‌వాటు చేశారు. వాటి పేరుతో నాసి ర‌కం మ‌ద్యం అంట‌గ‌డుతున్నారు. ఆ మ‌ద్యం శాంపిళ్ల‌లో విష‌పూరిత ర‌సాయ‌నాలు ఉన్నాయ‌ని తేలినా, బుకాయించి ఎదురెడుతున్నారు. అలా అన్న వాళ్ల‌ని తిట్టి పోస్తున్నారు. పైగా మ‌ద్యం సొమ్ముతో అక్క‌చెల్లెమ్మ‌ల‌కు మేలు చేద్దామ‌ని చూస్తుంటే, గిట్ట‌క ఆడిపోసుకుంటున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఓటేసి గెలిపిస్తే మ‌ద్యం క‌నిపించ‌కుండా చేస్తామ‌ని ప్ర‌జ‌ల్ని న‌మ్మించి, అధికారం చేతిలోకి వ‌చ్చాక ఆ మాటే మ‌రిచారు. కొత్త షాపులు పెట్టిస్తున్నారు. బార్ల‌కు త‌లుపులు బార్లా తెరిచారు. చివ‌రికి రాష్ట్రాన్నే మ‌ద్యంలో ముంచి తెలుస్తున్నారు. ఇక నీ పాల‌కుల పాపాల గురించి వేరే చెప్పాలా చెప్పు? చ‌ట్టాల్ని తుంగ‌లో తొక్కి మ‌రీ విజృంభిస్తున్నారు. గ‌నులు, సెజ్‌లు, భూములు, పోర్టులు, ఫ్యాక్ట‌రీలు, కాంట్రాక్టులు... అన్నీ అయిన వాళ్ల‌కి క‌ట్ట‌బెడుతున్నారు. వాళ్ల నుంచి ముడుపులు అందుకుని ప్యాల‌స్‌లు క‌డుతున్నారు. గంజాయి, మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ వ్యాపారాల‌కు అండ‌దండ‌లు అందిస్తున్నారు. మ‌రిలాంటి పాపాల‌న్నీ నీకు పాఠాలే క‌ద‌రా...

శిష్యుడు తెల్ల‌బోయాడు. అయ్య‌బాబోయ్... ఆ పాట‌లో ఇన్నేసి పాఠాలున్నాయాండీ... ఆ పాట పూర్తిగా వినిపిద్దురూ...అన్నాడు.

గురువుగారు సెల్‌ఫోన్ ఆన్ చేశారు. పాట మొద‌లైంది...

 

నేల‌కు సొర‌గం దించాడండీ...

దించిన సొర‌గం పంచాడండీ...

నెత్తిన చేతులు పెడ‌తాడండీ...

నెత్తినెత్తుకుని ఊరేగండి...

 

గురువుగారు పాట పాజ్ చేసి చెప్ప‌సాగారు.

చూశావురా... అచ్చం నీ పాల‌కులు చేసుకుంటున్న ప్ర‌చారంలాగే లేదూ ఈ చ‌ర‌ణం? త‌మ పాల‌న‌లో స్వ‌ర్గాన్ని కిందికి దించేసిన లెవెల్లో ఆర్భాటం చేస్తున్నారు క‌దా? ఆ స్వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు ఏవేవో పంచేస్తున్న‌ట్టు గ‌ప్పాలు కొట్టుకోవ‌డం లేదూ?  ఆ ప‌థ‌కం అన్నారు, ఈ ప‌థ‌కం అన్నారు. చివ‌రికి ఏం జ‌రుగుతోంది? అన్ని ప‌థ‌కాల్లోనూ ఏవో కొర్రీలు పెట్టి ల‌బ్దిదారుల‌ను త‌గ్గించ‌డం లేదూ? అధికారానికి ముందు ఇచ్చిన చాలా హామీల‌కు మంగ‌ళం పాడుతున్నారంటే నెత్తిన చేతులు పెడుతున్న‌ట్టే క‌దా? అటు ప‌థ‌కాల పేరుతో ప్ర‌చారం చేసుకుంటూనే ఇటు కొత్త కొత్త ప‌న్నులు, సుంకాలు, ఛార్జీలు విధించి వేధిస్తున్నారు క‌దా? ఇక జ‌నం మాత్రం ఏం చేస్తారు, నెత్తినెత్తుకుని ఊరేగ‌క? ఏమంటావు?”

ఏమంటానండీ... మీరింత బాగా చెబుతుంటే? పాట బాగుంది ఇంకా వినిపించండి గురూగారూ...

 

ఇత‌డే దిక్క‌ని మొక్క‌ని వాళ్ల‌కి

దిక్కూమొక్కూ లేదండండి...

దుష్ట ర‌క్ష‌ణం... శిష్ట శిక్ష‌ణం...

చేసెయ్ చేసెయ్ మోసెయ్ మోసెయ్‌...

 

చూశావురా... ఎంత చ‌క్క‌గా ఇప్ప‌టి ప‌రిస్థితికి స‌రిగ్గా స‌రిపోయిందో. నీ పాల‌కుడి తీరిదే క‌ద‌రా? త‌నే దిక్క‌ని న‌మ్మిన వాళ్ల‌కి రక్ష‌ణ క‌ల్పిస్తాడు. కాద‌ని ప్ర‌శ్నించే వాడికి దిక్కూ మొక్కూ లేద‌న్న‌ట్టుగా న‌ర‌కం చూపిస్తాడు. అంద‌రినీ త‌న పాదాక్రాంతం చేసుకోడానికి స‌జావుగా సాగిపోతున్న వ్య‌వ‌స్థ‌ల్ని కూడా కెలుకుతాడు. పైకి మాత్రం కొత్త విధానం తీసుకొస్తానంటాడు. ఆయా వ్య‌వ‌స్థ‌లకు చెందిన వ్య‌క్తుల్ని కాళ్ల ద‌గ్గ‌ర‌కు తెప్పించుకుంటాడు. పైకి మెత్త‌గా న‌వ్వుతూ, వాళ్ల విన్న‌పాలన్నీ విని ఆనందిస్తాడు. వాళ్లు విన‌యంగా న‌మ‌స్కారాలు గ‌ట్రా చేసి, ధ‌ర్మ‌ప్ర‌భువులు క‌నిక‌రించాల‌నే లెవెల్లో ప్రాధేయ‌ప‌డితే తెగ న‌వ్వుకుంటాడు. ఆన‌క అవే వ్య‌వ‌స్థ‌ల్ని ఏవో చిన్న చిన్న మార్పుల‌తో వ‌దిలేస్తాడు. ప్ర‌భుత్వ ఉద్యోగులైనా, సినిమా సెల‌బ్రిటీలైనా, ఎంత పెద్ద‌వాళ్ల‌యినా అత‌డికి ఒక‌టే. అత‌డి అనుచ‌రులు ఎంత‌లేసి నేరాలు చేసినా కాస్తాడు. వాళ్ల చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జ‌న్యాలు చేసినా ప‌ట్టించుకోడు. అంటే దుష్ట‌ర‌క్ష‌ణ‌మ‌న్న‌మాటే క‌దా. ఇక త‌న తీరులో లోపాలు ఎవ‌రైనా చెబితే చాలు స‌హించ‌లేడు. వాళ్లెవ‌రైనా స‌రే త‌ప్పుడు కేసుల్లో పెట్టి ఆడించాల‌ని చూస్తాడు. మ‌ర‌దేక‌దా శిష్టశిక్ష‌ణ‌మంటే. మ‌రి నువ్వు రేప్పొద్దున్న అధికారం అందుకుంటే అక్ష‌రాలా పాటించాల్సిన అస‌లు సిస‌లు  అవ‌క‌త‌వ‌క‌, అన‌ర్థ‌క‌ర‌, అన్యాయ‌, అక్ర‌మ‌, అధ‌మాధ‌మ విధానాలివే క‌ద‌రా... అర్థ‌మైందా?”

అర్థ‌మ‌వ‌డ‌మేంటండి బాబూ... క‌ళ్ల పొర‌ల‌న్నీ విచ్చుకుపోతేను. మొత్తానికి ఈ పాట మా గొప్ప సూత్రాలు చెప్పిందండీ...

ఆ పాటే కాదురా... ఆ సినిమాలో ఈ పాట వ‌చ్చే సంద‌ర్భం కూడా నీ ప‌ర‌గ‌ణాకి అచ్చం స‌రిపోతుంది తెలుసా?”

ఆ... గుర్తొస్తోందండి గురూగారూ! ఆ సినిమాలో ఈ పాట పాడేది నూత‌న్ ప్రసాదండి. అంటే క‌థ ప్ర‌కారం సైతానండి. ఆడు జ‌నాలంద‌రినీ ర‌క‌ర‌కాలుగా ప్ర‌లోభ పెట్టి వ‌శ‌ప‌రుచుకుంటూ ఉంటాడండి...

మ‌రిప్పుడు జ‌రుగుతున్న పాల‌న కూడా అదే క‌ద‌రా...

బాగా చెప్పారండి బాబూ... సైతాను పాల‌న‌లో భ‌లే సూత్రాల‌న్న‌మాట ఇవి!

చ‌క్క‌గా గ్ర‌హించావురా... ఇక పోయిరా!

-సృజ‌న‌

PUBLISHED ON 1.7.2022 ON JANASENA WEBSITE