కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, డిసెంబర్ 15, 2025

పహారాలో పరమ సత్యాలు !


పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు.ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొనిపోవడానికి నిశ్చయించుకొన్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, “గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు. వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులను, “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు. అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని 'మాలవాడ' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు. ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతూన్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. 

పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూ పనికిరాని అప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతనలేక కాలం గడపసాగాడు.ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది! రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని  ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు.  రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:

“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః

జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః." 

మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.  మళ్ళా రెండవ ఝాము వచ్చింది.

 అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: 

“జన్మదుఃఖం జరాదుఃఖం -

జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”

పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:

“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః

అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”

తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు, 

“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 

ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”

అని చాటింపు వేశాడు.

ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త  జాగ్రత్త - అని చాటాడు.ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.  కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు,  “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష  విధిస్తారు?” అని అడిగాడు.  అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. “అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.  నా చేతులమీద, నా కత్తితో  వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు. “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! 

కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే: మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు. ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని  ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో  నమస్కరించాడు."వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని  అడిగాడు.

 అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు 'మాలపల్లె' అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా! కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.” అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం.


అత్తవారింట్లో అల్లుడికి శిక్ష !




పూర్వము భారవి అనే సంస్కృత  కవి వుండేవాడు. ‘కిరాతార్జునీయం’ సహా ఆరు మహాకావ్యాలను రచించిన  ఇతడు ఆరో శతాబ్దానికి చెందిన వాడు. ఇతడి గురించిన ఆసక్తికరమైన కథ  ఒకటుంది. 

భారవి చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.

భారవి తండ్రితో ‘నీకొడుకు చాలా బాగా రాస్తున్నాడయ్యా!’ అనేవారు.

ఆయన మాత్రం ‘వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో రాస్తాడులే!’ అని తేలిగ్గా అనేవాడు.

భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి ఉండేది. 

తల్లి దగ్గర ‘నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడతారు. ఊళ్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే  చులకనగా... ఆ.. ఏమున్నది, యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడతారు.’ అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు.

ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.

భారవి, అన్నం తిన్నాక పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.

అప్పుడు భారవి తల్లి భర్తతో…   ‘మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు? వాడు చాలా బాధ పడుతున్నాడు. వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!’

అప్పుడు తండ్రి నవ్వి.... ‘పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాటి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా?’ అన్నాడు.

అంతా విన్న భారవికి బుర్ర తిరిగి పోయింది.

పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి ‘నాకేదయినా శిక్ష వేయమ’ని బ్రతిమాలుకున్నాడు.

’పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు?’ అని తండ్రి చెప్తున్నా వినకుండా  తనకు ‘శిక్ష వేయమ’ని పట్టు బట్టాడు.

తండ్రి ‘సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఉండిరా. నువ్వెందుకు ఉన్నావో ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా  ఏ కారణాలు చెప్పకుండా ఉండాలి’ అన్నాడు.

‘ఇదేం శిక్ష? ’ అన్నాడు భారవి.

తండ్రి నవ్వి ‘అది చాల్లే వెళ్ళు!’ అన్నాడు.

భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు.

సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

రోజుకో పిండివంట చేసి ఆదరించారు. నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.

చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు...

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.

అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ ‘మీరు మీ ఊరు వెళ్లిపోండ’ని  యెంతో చెప్పి చూసింది.

భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు.

ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి ‘యింక నేను  మావూరికి పోయివస్తాన’ని బయల్దేరాడు.

ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.

భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి ‘నాశిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను!’ అని చెప్పాడు.

ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.

కోపంగా మాట్లాడే ప్రతివారి ని శతృత్వముతో చూడరాదు.

చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!

అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

తల్లిదండ్రులను ద్వేషించకండి!

అంతకంటే పాపం ఇంకోటి వుండదు!


మంగళవారం, ఆగస్టు 01, 2023

చిగురించిన సీత!

 


         

 “నౌ యువార్ ప్రెగ్నెంట్…” అని డాక్టర్ వసుంధర చెప్పగానే చెప్పలేని అనుభూతికి లోనయింది సీత.

          సంతోషించాలా?  బాధపడాలా?

          రెండూ కలిసిన భావాల ఉధృతిని నిభాయించుకోవడం మూడు పదులు చూడని సీతకి కష్టమైంది.

          వెంటనే ఆమె కళ్లల్లో ఓ పొరలాగా చెమ్మ అల్లుకుంది. ఆ చెమ్మ చెలియలి కట్ట దాటబోతుంటే చూపుడు వేలితో అద్దుకుంది. మనసులో ఏదో ఉద్వేగం.

          ఆపుకుందామనుకున్నా ఆగని కన్నీటి ధారను ఇక ఆపలేకపోయింది.

          తల వంచుకుని కూర్చుండిపోయింది.

          డాక్టర్ వసుంధర తన కుర్చీలోంచి లేచి వచ్చి సీత భుజం మీద చెయ్యి వేసి నొక్కింది.

          “కంట్రోల్ యువర్ సెల్ఫ్‌ సీతా! నువ్వీ క్షణం కోసం ఎంత ఎదురు చూశావో గుర్తు చేసుకో. ఇప్పుడు నువ్విలాంటి ఎమోషన్స్ రానివ్వకూడదు. అది బిడ్డ ఎదుగుదల పై ప్రభావం చూపిస్తుంది…”

          ఆమె ఏవేవో జాగ్రత్తలు చెప్పుకుపోతోంది.

          సీత హ్యాండ్ బ్యాగ్ లోంచి కర్చీఫ్ తీసుకుని మొహమంతా తుడుచుకుంది.

          ఓసారి దీర్ఘంగా ఊపిరి తీసుకుంది. క్షణాల్లో మామూలు మనిషైంది.

          ‘తనిలా బేలగా ఉండకూడదు. ఈ క్షణం నుంచి ఎన్నో తట్టుకోవాలి…’ అనుకుంది నిశ్చలంగా.

          అలనాటి సీతకి రాముడే అగ్నిపరీక్ష పెట్టాడు.

          ఈనాటి సీతకి అడుగడుగునా అగ్నిపరీక్షలే.

          ఎందుకంటే… సీత భర్త రామ్మోహన్ చనిపోయి రెండేళ్లయింది!

***

          ఫొటోలో రామ్మోహన్ నవ్వుతున్నాడు. ఆ నవ్వు సీత కళ్లలో అలుక్కుపోయింది. కారణం కన్నీళ్లు.

          “రామ్మోహన్… నన్ను క్షమించగలవా? నేను చేసింది తప్పా?” అని మూగగా అను కుంది. ముద్ద మందారాన్ని ఆ ఫొటో ముందు పెట్టింది. భర్తను ఏకాంతంలో రామ్మోహన్ అనే పిలిచేది. ఇప్పుడు కూడా ఏకాంతమే. గదిలో టేబుల్ మీద రామ్మోహన్ ఫొటో. దాని ఎదురుగా కుర్చీలో సీత.

          “నువ్వేమన్నావ్ రామ్మోహన్? ఆఖరి రోజుల్లో నీ మాటలు మర్చిపోగలనా? నేను మోడులా మిగిలిపోకూడదన్నావ్. చిగురించాలన్నావ్. అదే జరిగిందిప్పుడు. కానీ… ఇది కాదు కదా నువ్వు కోరుకున్నది? నీ ఉద్దేశం వేరు కదా? అందుకే నన్ను క్షమించు…” అనుకుంటూ ఆ ఫొటో తీసుకుని కొంగుతో తుడిచి పెట్టింది.

          టేబుల్ సొరుగు లాగింది. అందులో పైకి కనిపిస్తూనే ఉంది అయిదేళ్ల నాటి పెళ్లి శుభలేఖ.

          ‘సీతా వెడ్స్ రామ్మోహన్!’ ఇటు పక్క ఇంగ్లిషులో. అటు పక్క తెలుగులో.

          ‘జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మరాగాయితాః’

          రోజుకోసారైనా ఆ శుఖలేఖ చదువుకోవడం అలవాటు సీతకి.

          రామ్మోహన్ నవ్వంటే సీతకిష్టం. సీత కళ్లంటే రామ్మోహన్‌ కి ఇష్టం.

          ఆ నవ్వు కోసమే అతడి కేసి చూసేది. ఆ చూపు కోసమే అతడు నవ్వేవాడు.

          ఒకే ఆఫీసులో ఉద్యోగాలు ఆ నవ్వుల్ని, ఆ చూపుల్ని దగ్గర చేశాయి.వాళ్ల మనసుల్ని ఒక్కటి చేశాయి. ఆఖరికి ఇద్దరికీ పెళ్లి చేశాయి.

          కానీ… ఆ పెళ్లి ముచ్చట మూడేళ్లకే ముగిసిపోయింది.

          తల్చుకుంటే ఇప్పటికీ కలలాగా అనిపిస్తుంది సీతకి!

          రామ్మోహన్‌ కి పిల్లలంటే ఇష్టం.

          “ఇదిగో సీతా… ఇప్పుడే చెబుతున్నాను. నో మెజర్స్. ఆరు నెలలు తిరక్కుండా ప్రెగ్నెన్సీ రావాలి. తెలుసా?” ఫస్ట్ నైట్ రామ్మోహన్ చిలిపిగా చెప్పిన మాటలు గింగురు మంటూనే ఉంటాయి సీత చెవుల్లో. ఆ రాత్రి ఆ మాటలు విని సిగ్గుల మొగ్గయింది తను.

          ఆ పై రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలయ్యాయి. అవన్నీ ఎలా గడిచాయో తెలియలేదు ఇద్దరికీ.

          ప్రపంచంలో ఆనందం మాత్రమే ఉందేమో అనేంత హాయిగా గడిపారు ఇద్దరూ.

          ఆ తర్వాత నుంచి మొదలైంది నిరీక్షణ.

          సీతకి ప్రతి నెలా బెంగే. నెలసరి రెండు రోజులు ఆగితే ఏదో ఆశ. నాలుగు రోజులు ఆగితే  తెలియని ఆనందం. కానీ… వచ్చేస్తే ఏదో తెలియని ఆవేదన. ఆ ఆవేదన దుఃఖమ య్యేది. ఆ దుఃఖం నిరాశగా మారేది.

          ఇద్దరూ తిరగని ఆసుపత్రి లేదు. చేయించుకోని పరీక్షలు లేవు. ఏవేవో రిపోర్టులు. ఏవేవో కారణాలు. ఎన్నెన్నో జాగ్రత్తలు. అన్నీ పాటించేది సీత.

          అల్లోపతి, ఆయుర్వేదం, హోమియో, యునానీ… అందరు స్పెషలిస్టుల్నీ కలిసే వారు ఇద్దరూ.

          ఏ మందులో ఏముందో? ఏది ఎలా పనిచేస్తుందో? అన్నీ వాడేవారు.

          గుళ్లు, గోపురాలు, క్షేత్రాలు, వ్రతాలు, పూజలు… అన్నీ అయ్యాయి.

        ‘రామ్మోహన్‌ కి శుభవార్త చెప్పే క్షణాలు తన జీవితంలో అసలు ఉన్నాయా?’ అనిపిం చేది. ఆ ఊహకి ఏడుపొచ్చేది.

          “ఏంటే… ఇన్నాళ్లయింది? ఇప్పుడే వద్దనుకున్నారా?” అంటూ అడిగేవారు స్నేహితురాళ్లు.

          “దేవుడిస్తే దెయ్యం కంటుంది… నువ్వేం బెంగ పడకమ్మా…” అనేది అత్తగారు. 

          ఆ నిరీక్షణలోనే రెండేళ్లు గడిచిపోయాయి.

          “నాకు చచ్చిపోవాలని ఉంది…” అంది సీత ఓ రాత్రి రామ్మోహన్‌ తో. అలా అంటుండగానే ఏడుపొచ్చేసింది. రామ్మోహన్ చటుక్కున లేచి ఆమె కన్నీళ్లు తుడిచాడు.

          “ఛ…ఛ… అవేం మాటలు? ఇలా ఎప్పుడూ మాట్లాడకు. ఇప్పుడేం కొంప మునిగిం దని? అయినా మన పెళ్లయి ఏమంత కాలం గడించిందని?” అంటూ ఓదార్చాడు.

          కానీ… సీతకు తెలుసు, రామ్మోహన్ పిల్లల కోసం ఎంత ఎదురుచూస్తున్నాడో! అతడికి పిల్లలంటే ఎంత ఇష్టమో!

          “అసలు మనకి పిల్లలు పుడతారా?” అని బేలగా అడుగుతూ అతడి గుండెల పై వాలిపోయింది.

          ఆ ప్రశ్నకు రామ్మోహన్ వద్ద కూడా జవాబు లేదు. 

          ఇలాంటి రాత్రులు ఏన్నో గంభీరంగా గడిచాయి వాళ్లకి.

***

          సీతకి ఊహ తెలిసే సరికే  నాన్న లేడు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ తనను పెంచుకొచ్చిన అమ్మంటే ప్రాణం సీతకి. చదువయ్యి, తను కూడా ఉద్యోగంలో చేరాక, అమ్మని అపురూపంగా చూసుకోవాలనుకుంది. కానీ ఆ అవకాశం రాలేదు. సీత ఉద్యోగం లో చేరిన కొన్నాళ్లకే అమ్మ ఓ రాత్రి గుండెపోటుతో నిద్రలోనే చనిపోయింది.

          నాన్న లేని బాల్యం ఓ అగ్ని పరీక్ష.

          అమ్మ లేని జీవితం ఓ అగ్ని పరీక్ష.

          అప్పుడే రామ్మోహన్ తోడుగా నిలిచాడు. భరోసానిచ్చాడు. ధైర్యాన్నిచ్చాడు. ప్రేమని చ్చాడు. జీవితాన్ని కూడా ఇచ్చాడు.

          అలాంటి రామ్మోహన్‌ కి తనేం ఇవ్వగలిగింది?

          ఈ ఆలోచన అనుక్షణం ఎదురయ్యే అగ్నిపరీక్షే సీతకి.

          కానీ… అంతకు మించిన అగ్నిపరీక్ష విధి ఆమెకు విధించింది.

***

          ఓ రోజు ఆఫీసులో క్యాంటిన్‌ కి వెళుతూ కళ్లు తిరిగి పడిపోయాడు రామ్మోహన్. ఆఫీసులో అందరూ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ రొటీన్ పరీక్షలు చేశాడు. ఏవో మందులు ఇచ్చాడు. ఇద్దరూ వారం రోజులు సెలవు పెట్టేశారు. చిత్రంగా చాలా నీరస పడిపోయాడు రామ్మోహన్.

          అత్తయ్య, మావయ్య బెంగపడిపోయారు. ఇద్దరూ వృద్ధులే. రామ్మోహన్ ఒక్కడే కొడుకు. అతడి మీదే కళ్లు పెట్టుకుని పెంచుకొచ్చారు. ఓ పక్క వాళ్లకి ధైర్యం చెబుతూ రామ్మోహన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లేది సీత. ఓ డాక్టర్ కొన్ని టెస్టులు చేయించి ఆ రిపోర్టులు పుచ్చుకుని మరో డాక్టర్ దగ్గరకి వెళ్ల మనేవాడు. ఆ డాక్టర్ మళ్లీ టెస్టులు చేయించేవాడు. ఇలా కొన్ని వారాలు గడిచాయి.

          ఆఖరికి విషయం తేల్చారు. స్టొమక్‌ లో మాలిగ్నెంట్ ట్యూమర్!

          అది తట్టుకోలేని అగ్ని పరీక్ష సీతకి.

          స్కానింగులు… బయాప్సీలు… ట్యూమర్ మార్కర్స్ టెస్టులు… అన్నీ అయ్యాక క్యాన్సర్ అని తేల్చారు.

          ఓ పక్క ఉద్యోగం… మరో పక్క వృద్ధులైన అత్తమామలు… మరో పక్క రామ్మోహన్ పరిస్థితి.

          అన్నీ ఒక్కతే అయి ఎదుర్కొంది సీత.

          రామ్మోహన్‌ కి కీమో థెరపీ మొదలు పెట్టారు. అతడి రూపం పూర్తిగా మారిపోయింది.

          ఇప్పుడిక సీతకి ఏ ఆశా లేదు. రామ్మోహన్‌ కి నయమైతే చాలు.

          ‘దేవుడా… నాకు పిల్లలు అక్కర్లేదు. ఆయన్ని దక్కించు…’ అంటూ మూగగా ప్రార్థిం చేది.

          బయటకి మాత్రం చిరునవ్వుతో అత్తయ్యకి, మావయ్యకి ధైర్యం చెప్పేది.

          “తల్లిలా చూస్తున్నావ్… నేనే నీ బిడ్డనయ్యానా సీతా?” అనేవాడు రామ్మోహన్.

          తనకు దుఃఖం తన్నుకొచ్చేది. అయినా మొహంలో బెంగ కనిపించకుండా మాట్లాడాల్సి వచ్చేది.

          “సీతా! నాదో కోరిక. నాకేదేనా అయితే… నువ్వు మోడులాగా మిగిలిపోకూడదు. మళ్లీ పెళ్లి చేసుకుని చిగురించాలి… సరేనా?” అన్నాడు రామ్మోహన్ రెండో రౌండ్ కీమో థెరపీకి ఆసుపత్రిలో జాయినయ్యాక.

          ఆ తర్వాత అతడు మాట్లాడే అవకాశం రాలేదు.

          అతడి శరీరం ఇక తట్టుకోలేకపోయింది.

          కానీ… ఆ అగ్ని పరీక్షను సీత తట్టుకుంది. నిలదొక్కుకుంది. అత్తమామల్ని ఓదార్చే బాధ్యత ఆమెను ఆరిందాగా మార్చింది. వాళ్లకి ధైర్యం చెప్పింది.

          “ఇక మీరే నాకు పిల్లలు, పెద్దలు కూడా…” అంది. తిరిగి ఉద్యోగంలో చేరింది. జీవితాన్ని ఎదుర్కొంది సీత.

***

          “అమ్మా సీతా! నువ్విలా మిగిలిపోకు. నీకంటూ జీవితాన్ని ఏర్పరుచుకో. వాడి చివరి కోరిక కూడా అదేగా?” అంటూ నచ్చచెప్పబోయింది ఓసారి ఆమె అత్తగారు.

          సీతకి గుండెల్లో గుబులుగా అనిపించింది. ఏమీ మాట్లాడలేదు.

          మావయ్యగారు అందుకున్నారు…

          “సీతా! మా గురించి ఆలోచించకమ్మా… మేం ఏదైనా వృద్ధాశ్రమంలో చేరుతాం. నువ్వు అప్పుడప్పుడొచ్చి చూస్తూ ఉందుగానిలే…” అంటూ వివరించారు.

          కళ్లలో నీళ్లు చిప్పిళ్లాయి సీతకి.

          వాళ్లేం చెప్పబోతున్నారో అర్థమైంది.

          ‘ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు? కన్న కొడుకు కళ్ల ముందే వెళ్లిపోయినా, ఆ దుఃఖాన్ని తట్టుకుని నా గురించి దిగులు పడుతున్నారు. చూసే దిక్కులేని వృద్ధాప్యం. మావగారు ప్రైవేటు ఉద్యోగి కావడంతో పెన్షన్ సదుపాయం కూడా లేదు. ఏవో కొన్ని డిపాజిట్లు తప్ప ఎలాంటి ధైర్యం లేదు. నేనే వాళ్లకి ఆధారం. కానీ… వాళ్లు మాత్రం అవేమీ కాకుండా, కేవలం నా జీవితం చిగురించాలని కోరుకుంటున్నారు…’

          అలా అనుకోగానే రామ్మోహన్ గుర్తొచ్చాడు సీతకి.

          అమ్మ పోయేముందు తరచు ఇంటికి వస్తుండేవాడు. అమ్మతో ఎంతో బాగా మాట్లాడే వాడు. ఏదో రోజు తనే మా ప్రేమ గురించి చెబుదామనుకున్నాడు. కానీ అంతలోనే అమ్మ పోయింది. అప్పుడు తనకు ఎంత ధైర్యంగా నిలిచాడు!

          ఆ దుఃఖంలో, ఆ ఒంటరి తనంలో ఎంత ఓదార్పునిచ్చాడు!

          తనే గనుక తల్చుకుంటే బోలెడంత కట్నం ఇచ్చి పిల్లనిచ్చే సంబంధాలు ఎన్ని ఉండవని! కానీ వాటన్నింటినీ కాదని, వెనకా ముందూ ఏమీ లేని తనని ఎంచుకున్నాడు.

          అత్తయ్య, మావయ్య కూడా  ఏమీ అనలేదు సరికదా, ఎంతో సంతోషించారు.

          “ఒరే… ఒక్కగానొక్క కొడుకువి. నీ ఆనందమే మా ఆనందం…” అంటూ తనని వాళ్ల జీవితాల్లోకి నిండుగా ఆహ్మానించారు.

          అలాంటిది ఇప్పుడు… రామ్మోహన్ అనుకోకుండా వెళ్లిపోయాడని… నేను మరో తోడు వెతుక్కోవాలా? ఇదేనా బంధాలకు విలువ? ఇలా సాగేవి సీత ఆలోచనలు.

          కానీ… పగలంతా ఉద్యోగం, బాధ్యతలతో గడిచిపోయినా, రాత్రి గదిలో పడుకున్న ప్పుడు ఒంటరితనం ముప్పిరిగొనేది సీతని!

          ఎలాంటి తోడు, ఎలాంటి బంధం లేని నిస్సారమైన జీవితం నిలువెత్తున నిలబడి ప్రశ్నించేది.

          ‘ఎన్నాళ్లిలా? ఇప్పుడంటే అత్తమామలు ఉన్నారు. ఆ తర్వాత? ముప్ఫై ఏళ్లు కూడా లేని తను ఇలా ఒంటిగా, మోడుగా జీవితమంతా గడపగలదా?’ ఇలాంటి భావాలు కూడా ఓ అగ్నిపరీక్షే సీతకి!

***

          నిస్సారంగా సాగిపోతున్న సీత జీవితంలో రమణ పరిచయం ఓ మలుపు. సీతకి ఆ ఊరి నుంచి బదిలీ అయింది. ఆ ఊరు దగ్గరే కాబట్టి అత్తమామల్ని కదపలేదు. వాళ్ల కోసం ఓ వంట మనిషిని కుదిర్చి తను మాత్రం వెళ్లింది. వారాంతాల్లో అత్తమామల దగ్గరకే వచ్చేసేది. ఆ కొత్త ఊళ్లో కొత్త మనుషుల మధ్య రమణ స్నేహం సీతకి ఓ వరమే.

          సీత కథంతా విన్న రమణ ఇచ్చిన భరోసా అంతా ఇంతా కాదు.

          ఆ మాటలు ఎంతో పాజిటివ్‌ గా ఉండేవి.

          “జీవితంలో ఏ దశలోనూ నిరాశను రానీయకూడదు సీతా! లోకం ఏమనుకున్నా నీ జీవితం నీది. దాన్ని నీకు కావలసినట్టు మార్చుకోవడం నీ హక్కు…” అంటూ సాగే రమణ మాటలు సీత మీద ఎంతో ప్రభావం చూపించేవి.

          వీకెండ్స్‌ లో  రమణని ఇంటికి కూడా తీసుకెళ్లేది సీత. అత్తమామలకు కూడా రమణ కలివిడితనం, ఉత్సాహం, కబుర్లు ఎంతో నచ్చేవి.

          ఆఖరికి రమణ దగ్గర కూడా అత్తమామలు తమ ఆలోచనలు చెప్పేవారు.

          “నువ్వైనా చెప్పు రమణా… సీత అలా ఉండిపోవడం మాకు మా కడుపు కోత కన్నా ఎక్కువగా బాధ పెడుతోంది. ఎలాగోలా తనకొక బంధం ఏర్పడాలనే మా కోరిక…” అనే వాళ్లు.

          “నా ప్రయత్నం కూడా అదేనండీ… కానీ పరిస్థితులు కూడా కలిసి రావాలిగా?” అంటూ రమణ ఇచ్చే భరోసా తనకి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేది.

***

          గతం జ్ఞాపకాలన్నీ ఇప్పుడు సీత కళ్ల ముందు కదలాడుతున్నాయి. డాక్టర్ వసుంధర చెప్పిన మాటలు సీత చెవుల్లో రింగురుమంటున్నాయి.

          “నీది ప్రెసైజ్ ప్రెగ్నెన్సీ సీతా! చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పోని ఆలోచనలు మనసులోకి రానివ్వకు. ఎలాంటి ఆందోళనకు చోటివ్వకు…” అంటూ డాక్టర్ చెప్పిన మాటలు తల్చుకుంది సీత.

          రేపు… ఈ సంగతి అత్యయ్యగారికి చెప్పాలి… అనుకుంటూ కడుపు మీద అపురూపం గా నిమురుకుని నిద్రలోకి జారుకుంది సీత.

          మర్నాడు అత్తయ్యగారిని తన గదిలోకి పిలిచి కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పింది సీత. అసలిదంతా ఎలా మొదలైందో వివరించడానికి ప్రయత్నించింది. ఆఖరుగా డాక్టర్ వసుంధర చెప్పిన మాటలు కూడా చెప్పింది.

          అంతా విన్న అత్తయ్య గారు నమ్మలేనట్టుగా వింది. కాసేపు మౌనంగా ఉన్నాక చెప్ప లేని ఉద్వేగానికి గురయ్యిందావిడ. తర్వాత తేరుకుని నెమ్మదిగా తమాయించుకుని, “నాకు చాలా ఆనందంగా ఉందమ్మా… ఇప్పుడు నీకంటూ ఓ బంధం ఏర్పడుతోంది. నీ జీవితం మీద మాకిక ఎలాంటి బెంగా ఉండదు…”

          ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించింది సీత.

          ఆ పై ఆవిడ మరో సంగతి కూడా గుర్తు చేసింది.

          “సీతా! ఇప్పుడు సరే… నాలుగో నెల వచ్చిన దగ్గర్నుండి అందరూ తలో మాటా అంటారు. సమాజం అలా ఉంది. మరి ఎలా ఎదుర్కొంటావో… నీకు మాత్రం మా భరోసా ఎప్పుడూ ఉంటుంది…” అందావిడ.

          నిజమే… రాబోయే రోజులే అసలైన అగ్నిపరీక్ష సీతకి!

          ఆఫీసులో గుసగుసలు మొదలయ్యాయి.

          “ఏంటిది? భర్త పోయి రెండేళ్ల తర్వాత ఎలా?”

          “ఎవరితోనైనా సహజీవనం చేస్తోందేమో?”

          “ఏకంగా పెళ్లే చేసుకోవచ్చుగా? ఈ చాటు మాటు వ్యవహారాలెందుకూ?”

          ఆ తర్వాత గుసగుసలు కాస్తా వ్యాఖ్యానాలుగా మారాయి.

          “సిగ్గు లేకపోతే సరి…”

          “ఎవరేమనుకుంటారోననే జంకు కూడా ఉండదు ఇలాంటి వాళ్లకి…”

          అడపాదడపా ఆ వ్యాఖ్యలు, విమర్శలు చెవిన పడుతూనే ఉన్నాయి సీతకి!

          అయినా అప్పటికే అగ్నిపరీక్షలకి అలవాటు పడిపోయిన సీత వేటికీ చలించలేదు.

          ఇంట్లో అత్తగారు కూడా చెప్పేవారు. చుట్టు పక్కల వాళ్లు, దూరపు బంధువుల వాళ్ల  ఆరాలు మొదలయ్యాయిట. ఎప్పుడూ రాని వాళ్లు ఇంటికి రావడం, ఎప్పుడూ పలకరిం చని వాళ్లు కూడా ఫోన్లు చెయ్యడం… చివరకి సీత మాట ఎత్తడం! అందరికీ ఆవిడ ఖరా ఖండిగానే జవాబు చెప్పారుట.

          “చూడండి… సీత జీవితం తనిష్టం. అది ఆమె వ్యక్తిగతం. మాకేమీ అభ్యంతరం లేదు. మీకిక ఈ విషయం అనవసరం…”

***

          ఇలా ప్రశ్నార్థకాలు… ఆరాలు… వ్యాఖ్యానాలు… విమర్శలు… ఆరోపణలు… ఛీత్కారాల మధ్యే తొమ్మది నెలలు గడిచిపోయాయి సీతకి. డాక్టర్ వసుంధర సలహా పై ఆసుపత్రిలో చేరింది. అత్తమామలు, రమణ తప్ప కన్నెత్తి చేసినవారు లేరు.

          ఆఖరికి సీత ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.

          పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

          ఆసుపత్రి నుంచి వచ్చేసే ముందు రోజు డాక్టర్ వసుంధర సూచన పై బిడ్డను ఎత్తు కుని కాన్ఫరెన్స్ హాలులోకి వచ్చింది సీత. అత్తమామలు, రమణ కూడా వచ్చి కూర్చున్నా రు.

          హాలు నిండా విలేకరులు కూర్చుని ఉన్నారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీయసాగారు. టీవీల వాళ్లు వీడియో కెమేరాలు సవరించుకున్నారు.

          ఆ హడావుడి మధ్య డాక్టర్ వసుంధర చెప్పడం మొదలు పెట్టారు.

          “ఇది చాలా అరుదైన కేసు. అందుకే మిమ్మల్నందరినీ పిలిచాను. ఈమె పేరు సీత. భర్త చనిపోయి రెండేళ్లయింది. అంతక్రితం నుంచి సీత, ఆమె భర్త రామ్మోహన్ ఇద్దరూ మా ఆసుపత్రికి వచ్చేవారు. పిల్లలు పుట్టకపోవడంతో కృత్రిమ పద్ధతిలో గర్భధారణ కోసం ప్రయత్నించాను. కానీ ఈలోగానే అనుకోకుండా రామ్మోహన్ క్యాన్సర్ సోకి అకస్మాత్తుగా మరణించారు. తర్వాత రెండేళ్లకి సీత వచ్చి తనకు సంతానం కావాలని అడిగింది. అది కూడా రామ్మోహన్ ద్వారానే అని చెప్పింది. ఎందుకంటే సంతాన సాఫల్య ప్రయత్నాల కోసం రామ్మోహన్ స్పెర్మ్‌ మా ఆసుపత్రిలో స్టోర్ చేశాం. దాని ద్వారా సంతానం పొందే వీలుందా అనేది సీత కోరిక. ఇది వైద్య శాస్త్రానికి కూడా ఓ సవాలే. ఎందుకంటే ఇంత వరకు ఇలా అడిగిన వారు ఎవరూ లేరు. ఎన్నో సార్లు ప్రయత్నించాం. కానీ వీలు కాలేదు. ఆఖరికి ఓసారి కాంజుగేషన్ అయింది. ఈ విషయంలో సీత అత్తమామల సహకారం కూడా అరుదైనదే. తమ కొడుకు మరణించాక రెండేళ్లకి తమ కోడలి ద్వారానే తమకి వారసుడు రావడం వాళ్లకి కూడా ఆనందమే కదా. కానీ ఈలోపు వాళ్లు ఎన్ని ప్రశ్నలు, సవాళ్లు ఎదుర్కొని ఉంటారో అందరూ ఊహించ గలిగిందే… అందుకనే సమాజ పరంగా కూడా ఇది అరుదైన అంశం…”

          డాక్టర్ వసుంధర చెప్పిన వివరాలు వినగానే విలేకర్ల సందడి మొదలైంది. అరుదైన హ్యూమన్ యాంగిల్ స్టోరీ కావడంతో సీత అభిప్రాయాలు అడగసాగారు. వరస పెట్టి టీవీ ఛానెళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చింది సీత.

          “ఇందులో మీరెవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా?” అంటూ అడిగాడో విలేకరి.

          “అవును… ఏం చేయాలో తోచని స్థితిలో ఇలా ప్రయత్నించవచ్చంటూ సలహాని చ్చిన నా స్నేహితురాలు రమణ సాయం మరిచిపోలేను. నిరాశలో కూరుకుపోయిన నా కోసం అనేక సార్లు ఆసుపత్రులకి తిరిగి వివరాన్నీ సేకరించి, డాక్టర్లతో మాట్లాడింది. నన్ను మానసికంగా సిద్ధం చేసింది…” చెప్పింది సీత.

          ఆ ప్రెస్మీట్, ఆ హడావుడి పూర్తయ్యాక ఒడిలో ఒద్దికగా పడుకున్న బిడ్డను ఆనందం గా చూసుకుంది సీత. ఆ ఆనందం… రాముడు మాట మీద మంటల్లో దూకి అగ్నిపునీతగా బయటకి వచ్చిన అలనాటి సీతను తలపించేదే!

PUBLISHED ON NECHELI.COM WEB MAGAZINE 4TH ANNIVERSERY SPL ISSUE IN JULY, 2023


మంగళవారం, మార్చి 14, 2023

సీతాకోక చిలుక‌లు



(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)


         

అగ్గిపుల్ల భ‌గ్గుమంది, ఆ అమ్మాయిల గుండెల్లో మంట‌లాగే!

         ఆ అగ్గిపుల్ల ఓ కొవ్వొత్తిని వెలిగించింది. ఆ కొవ్వొత్తి నుంచి ఒక‌దాని త‌ర్వాత
ఒక‌టిగా కొవ్వొత్తులు వెలిగాయి.

         ఆ కొవ్వొత్తుల జ్వాల‌ల్లో ఓ ఉద్వేగం రెప‌రెప‌లాడింది. ఓ ఆవేద‌న జ్వ‌లించింది.
అమ్మాయిలంద‌రూ అక్క‌డ పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో అక్క‌డి చిత్ర‌ప‌టం వింత‌గా ప్ర‌కాశించింది. అంద‌రూ మౌనంగా క‌ళ్లు మూసుకున్నారు. ఆ రెండు నిమిషాల మౌనం ఓ అమానుష ఘ‌ట‌న ప‌ట్ల సంఘ‌టిత‌మైన సంక‌ల్ప‌మై ఆ చిత్ర‌ప‌టంలోని అమ్మాయి క‌ళ్ల‌లో ప్ర‌తిఫ‌లించింది.

         నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ళ‌క‌ళ‌లాడుతూ త‌మ‌తో తిరిగిన ల‌లిత, ఇలా కొవ్వొత్తుల ముందు చిత్ర‌ప‌టంగా మార‌డాన్ని ఆ అమ్మాయిలు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు.
మ‌న‌సులో సుడులు తిరుగుతున్న బాధ‌, వాళ్ల క‌ళ్ల‌లో స‌న్న‌టి నీటి పొర‌గా మారింది. ఆ
రోజు క‌ళాశాల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

         ఆ మ‌ర్నాటి నుంచీ, ల‌లిత ఇంట్లో ఘ‌ణీభ‌వించిన విషాదం మిన‌హా అంతా మామూలుగా మారింది.

         “ల‌లిత క‌ళ్ల ముందు క‌దులుతోందే… రాత్రి నిద్ద‌రప‌ట్ట‌లేదు” అంది అప‌ర్ణ‌.

         “అవునే… నాకూ అంతే…” అంది శైల‌జ‌.

         ఇద్ద‌రూ మామూలుగానే బ‌స్టాపులో నుంచున్నారు. ఇంత‌లో బ‌ర్రుమంటూ ఓ బైక్ వ‌చ్చి అక్క‌డి బ‌డ్డీకొట్టు ముందు ఆగింది.

         “వాడే…” అంది శైల‌జ గుస‌గుస‌గా.

         అప‌ర్ణ జుట్టు స‌వ‌రించుకున్న‌ట్టుగా త‌ల‌తిప్పి ఓర‌గా చూసింది. వాడు బైక్ దిగి
నిర్ల‌క్ష్యంగా క్రాఫ్ స‌వ‌రించుకుంటూ బైక్ అద్దంలో చూసుకుని బ‌స్టాపులోకి రాసాగాడు.

         అప‌ర్ణ‌, శైల‌జ ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌గా జ‌రిగారు అప్ర‌య‌త్నంగా.

         ఈలోగా శాంతి, ల‌హ‌రి వ‌చ్చి క‌లిశారు. ప్ర‌కాష్ స్నేహితులు కూడా వచ్చారు.

         “ఎవ‌ర్రా… కొత్తా?” అన్నాడు ప్ర‌కాష్‌, అప‌ర్ణ‌ని ఉద్దేశించి.

         “అవును… వార‌మే అయింది చేరి…” అంటున్నాడు వ‌చ్చిన‌వాడు.

         దూరంగానే నుంచున్నా, వాళ్ల మాట‌లు వినిపిస్తూనే ఉన్నాయి అప‌ర్ణ‌కి, ఆమె
స్నేహితురాళ్ల‌కి. ఎవ‌రూ మాట్లాడ‌లేదు. బ‌స్సు రాగానే ముందు నుంచి అమ్మాయిలు, వెన‌క‌ నుంచి అబ్బాయిలు ఎక్కారు.

         “రైట్‌… రైట్‌…” అన్నాడు కండ‌క్ట‌ర్‌. కానీ అక్క‌డ జ‌రుగుతున్న‌దంతా రైట్ కాదు,
రాంగ్‌.

***

         ప‌ట్నంలోని కాలేజీకి వెళ్లాలంటే బ‌స్సు ఎక్క‌క త‌ప్ప‌ని అనేకానేక ఊళ్ల‌లో అదికూడా ఒక‌టి. బస్సు త‌ప్ప మ‌రో సౌక‌ర్యం కుద‌ర‌ని మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయిల్లో వాళ్లు కూడా ఒక‌ళ్లు. అమ్మాయిలు క‌నిపించ‌గానే వెకిలి వేషాలేసే అబ్బాయిలు అక్క‌డా ఉన్నారు. కానీ ఆ వెకిలిత‌నం ఆక‌తాయిత‌న‌మై, అది పోకిరిత‌నంతో జ‌ట్టుక‌ట్టి ఆపై అహంకారంతో క‌లిసి అకృత్యాల‌కు సైతం వెర‌వ‌ని తెంప‌రిత‌నమ‌వ‌డ‌మే ఆ అమ్మాయిల దౌర్భాగ్యం. వెన‌క‌ నుంచి ఎక్కినా ముందుకు వ‌చ్చి నుంచోడం, కుదుపుల్లో రాసుకున్న‌ట్టు మీద‌ప‌డ‌డం, కామెంట్లు చేయ‌డం లాంటి ద‌శ‌ల‌న్నింటినీ ఎప్పుడో దాటిపోయాయి ఆ బస్సులో ప‌రిస్థితులు. పైకి అంతా రైట్‌గానే క‌నిపిస్తుంది. కానీ జ‌రిగేదంతా రాంగే. అదే ల‌లిత మ‌న‌సును అల్ల‌క‌ల్లోలం చేసింది.

         “ఆ ప్రకాష్ ఫోన్‌లోకి నా ఫొటో ఎలా వ‌చ్చిందో తెలీదే. పైగా అది… అది…
బ‌ట్ట‌ల్లేకుండా ఉందే. దాన్ని చూపించి బెదిరిస్తున్నాడు. దాన్ని నెట్‌లో పోస్ట్ చేస్తా నంటున్నాడు…” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది ల‌లిత‌.

         “ఏడిశాడు…ఏం కాదులే. భ‌య‌ప‌డ‌కు” అంటూ ఓదార్చింది భార్గ‌వి. ఆ త‌ర్వాత ల‌లిత రెండు రోజులు కాలేజీకి రాలేదు. మూడో రోజు ఇంట్లో గ‌దిలో ఫ్యాన్‌కు ఆమె నిస్స‌హాయ‌త వేలాడింది. ఆమె భ‌యం గుడ్లు తేలేసింది. పరువు పోతుంద‌నే ఆందోళ‌న‌, ఆమె బ‌తుకునే ఉరితీసింది.

         “ఎందుకింత ప‌ని చేసిందో నా చిట్టిత‌ల్లి…” అంటూ ఆమె త‌ల్లి గుండెలు బాదు కుంటూనే ఉంది. ఆమె సందేహం ఇప్ప‌టికీ తీర‌లేదు.

         భార్గ‌వి నుంచి అంతా విన్న అప‌ర్ణ చిగురుటాకులా వ‌ణికిపోయింది. ఆమె ఆ ఊళ్లోకి, ఆ కాలేజీలోకి వ‌చ్చి వార‌మైనా కాలేదు.

         “ఇంత జ‌రిగితే కొవ్వొత్తులు వెలిగించి మౌనం వ‌హిస్తే స‌రిపోతుందా?” అంది అప‌ర్ణ ఆవేశంగా.

         “అంత‌క‌న్నా ఏం చేస్తాం. నువ్వు జాగ్ర‌త్త‌. అస‌లే కొత్త‌గా వ‌చ్చావు” అంది భార్గ‌వి. శాంతి, ల‌హ‌రి, శైల‌జ కూడా మౌనంగానే త‌లూపారు. అప‌ర్ణ నిట్టూర్చింది.

         ఇంత‌లో బ‌స్సు వ‌చ్చింది. అంద‌రూ ఎక్కారు. “రైట్ రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         “హాయ్‌… నీ పేరు అప‌ర్ణ క‌దూ…” అనే మాట‌లు గుస‌గుస‌గా వినిపిస్తే చ‌టుక్కున
వెన‌క్కి తిరిగి చూసింది అప‌ర్ణ‌. ద‌గ్గ‌ర‌గా నుంచుని ఉన్నాడు ప్ర‌కాష్‌. అప‌ర్ణ పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఏం మాట్లాడ‌లేదు. 

         “బాగున్నావ్‌… నీ ఫొటో ఇంకా బాగుంది తెలుసా?”

         అప‌ర్ణ గుండె ఝ‌ల్లుమంది.

         “లంచ్ బ్రేక్‌లో కాలేజీ వెన‌కాల మామిడి చెట్టు ద‌గ్గ‌ర‌కి వ‌స్తే చూపిస్తా…” అంటూ నెమ్మ‌దిగా అని ఆమె భుజాన్ని రాసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు ప్ర‌కాష్‌.

         కాలేజీ స్టాప్ వ‌చ్చేసింది. అప‌ర్ణ‌తో పాటు అంద‌రూ దిగారు. 

         “రైట్‌… రైట్‌… “అన్నాడు కండ‌క్ట‌ర్‌. బ‌స్సెళ్లిపోయింది.

***

         కాలేజీ వెన‌కాల మామిడి చెట్టు.

         “చెప్ప‌గానే వ‌చ్చావు… గుడ్‌… పైకొస్తావ్‌…” అన్నాడు ప్ర‌కాష్‌. అత‌డి మాట‌ల్లో వెకిలిత‌నం ప‌ళ్లికిలించింది. 

         అప‌ర్ణ నుదిటి మీద చిరు చెమ‌ట‌లు.

         “చూడు… నీ ఫొటో ఎంత బాగుందో” అంటూ ఫోన్ చూపించాడు. ఆ ఫొటో చూసి అప‌ర్ణ ముఖం జేవురించింది. బ‌స్సులోనో, కాలేజిలోనో, బ‌స్టాప్‌లోనో ఎక్క‌డ తీశాడో. మొహం త‌న‌దే. మిగ‌తా శ‌రీరం త‌న‌ది కాదు.

         “ఛీ” అనుకుంది అప‌ర్ణ‌. కంప్యూట‌ర్ మార్ఫింగ్.

         గొంతు పెగ‌ల్చుకుని చెప్పింది… “ప్లీజ్‌… దాన్ని డిలీట్ చెయ్యి” అంది భ‌యం భ‌యంగా.

         “త‌ప్ప‌కుండా చేస్తా, నేను చెప్పిన‌ట్టు చేస్తే… లేక‌పోతే ప్ర‌పంచమంతా చూస్తుంది మ‌రి…”

         “ఏం… ఏం… చేయాలి?”

         “రేపు ఆదివారం ఊళ్లో పాత‌బ‌డిన బంగ్లా వెన‌క్కిరా. స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుందాం. ఇంట్లో సంత‌కి వెళ్తాన‌ని చెప్పులే. స‌రేనా?”

         “కానీ… నేనొక్క‌ర్తినీ రాలేను. భ‌యం…”

         “పోనీ… నీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకురా… మా వాళ్ల‌ని కూడా ర‌మ్మంటా… నీ ఫ్రెండ్స్‌ ఫొటోలు కూడా వాళ్ల ద‌గ్గ‌ర ఉన్నాయిలే. అవి కూడా చూపిస్తాం. సంత‌ అయిపోగానే వెళ్లిపోవ‌చ్చు… అన్న‌ట్టు సంచులు తెచ్చుకోండి. కూర‌లు మేం తెస్తాంలే…” అంటూ అదోలా న‌వ్వాడు ప్ర‌కాష్.

         కాలేజీ బెల్ మోగింది. ప‌రుగు ప‌రుగున వెళ్లిపోయింది అప‌ర్ణ‌. వెన‌కాల నుంచి ప్ర‌కాష్
త‌న ఫ్రెండ్స్‌తో హైఫైలు కొట్టుకోవ‌డం వినిపిస్తూనే ఉంది.

***

         బ‌స్టాప్ గుబులు గుబులుగా ఉంది. అప‌ర్ణ చెప్పిందంతా విని శాంతి, భార్గ‌వి, ల‌హ‌రి,
శైల‌జ‌ తెల్ల‌బోయారు.

         “ఇదంతా ఇంట్లో చెప్పేస్తోనో?”

         “మ‌న్నే తిడ‌తారు. పైగా కాలేజీ మానిపించేస్తారు…”

         “వాళ్లంత తెలివి త‌క్కువ వాళ్లేంటి? సిమ్ములు మార్చేస్తారు. ఫోన్లు చూసుకో మంటారు”

         “పోనీ వెళ్ల‌క‌పోతే?”

         “ఏమో… ఎవ‌రి ఫొటోలైనా ఫేస్బుక్‌లోనో, ట్విట‌ర్‌లోనో వ‌చ్చేస్తే?”

         “పైగా డేటింగ్ సైట్ల‌లో కూడా అప్‌లోడ్ చేస్తార‌ట‌…”

         “అప్పుడు మ‌న ఇంట్లో వాళ్లు కూడా త‌లెత్తుకోలేరు…”

         ఆ అమ్మాయిల భ‌యాలు, సందేహాలు ఆ బస్టాప్‌లో గుస‌గుస‌లాడాయి. ఏం చేయాలో
తోచ‌క గుబులుగా మాట్లాడుకున్నాయి. ఆఖ‌ర్న అప‌ర్ణ చెప్పింది. “అందుక‌నే అంద‌రం క‌లిసి వెళ్దాం. ఒక‌రికొక‌రం తోడు. ఇంట్లో కూడా అంద‌రం క‌లిసి అడిగితే పంపిస్తారు. వెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌మ‌ని అడుగుదాం”

         “మ‌రి వాళ్లు ఏమైనా చేస్తే?”

         “మ‌నం త‌క్కువ వాళ్ల‌మా? ఆ మాత్రం ఎదుర్కోలేమా?”

         చేసేదిలేక‌… వేరే దారి లేక‌… అమ్మాయిలు అంద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.
స‌రేనంటే స‌రేన‌నుకున్నారు.

         బస్సొచ్చింది. అంద‌రూ బెదురుతున్న గుండెల్తో ఎక్కారు.

         “రైట్… రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         “రేపే సంత గుర్తుందా?” అన్నాడు ప్ర‌కాష్, అప‌ర్ణ కూర్చున్న సీటు వెన‌క రాడ్‌ పై
రెండు చేతులూ పెట్టి ముందుకు వంగి, ఆమె చెవిలో త‌న‌కు మాత్ర‌మే వినిపించేంత
మెల్ల‌గా. అప‌ర్ణ మెల్ల‌గా వెన‌క్కి తిరిగి న‌వ్వింది. బ‌స్సులో మిగ‌తా వాళ్ల‌కి స‌హ‌జంగా స్నేహితులు మాట్లాడుకున్న‌ట్టు క‌నిపించే ప్ర‌య‌త్నం అది. అలా న‌వ్వుతూనే, “కానీ మా అంద‌రి ఫొటోలు డిలీట్ చేసేయాలి మ‌రి…” అంది. ఆమె గొంతులో ఏదో క‌నిపించ‌ని భ‌యం.

         ప్ర‌కాష్‌కి ధైర్యం వ‌చ్చింది. ఏదో విజ‌యం సాధించిన‌ట్టు అత‌డి మొహం వెలిగింది.

         “త‌ప్ప‌కుండా… ప్రామిస్‌…”

         “కానీ ఒక్క ష‌ర‌తు. మేం వెంట‌నే వెళ్లిపోతాం”

         “ఓకే… జ‌స్ట్ టెన్ మినిట్స్ అంతే”

         “మ‌రేం భ‌యం లేదుగా?”

         “అస్స‌లు లేదు. మా ద‌గ్గ‌ర సేఫ్టీ మెజ‌ర్స్ అన్నీ ఉన్నాయి…” అప‌ర్ణ త‌లూపింది. ప్ర‌కాష్ త‌లెగ‌రేశాడు. ఇంత‌లో ఊరొచ్చేసింది. అంద‌రూ దిగిపోయారు.

         “రైట్‌…రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         అప‌ర్ణ‌, శాంతి, ల‌హ‌రి, శైల‌జ‌, భార్గ‌వి సంచుల‌తో న‌డుచుకుంటూ సంత‌కి బ‌య‌ల్దేరారు. సంత‌లోంచి అలా ముందుకు న‌డిచారు. కాస్త దూరంలో ఉన్న పాత‌ బంగ్లాలోకి ప్ర‌వేశించారు. ఆ ప‌క్క‌నే పొలంలో కొంత‌ మంది మ‌హిళ‌లు నాట్లు వేస్తున్నారు.

         “గుడ్ గాళ్స్‌…” అంటూ ప్ర‌కాష్ ఓ స్తంభం చాటు నుంచి ముందుకు వ‌చ్చాడు.
అమ్మాయిలు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా నుంచుని ఉన్నారు. మ‌రో ప‌క్క నుంచి ప్ర‌కాష్ ఫ్రెండ్స్ కూడా వ‌చ్చారు.

         “మ‌రి… ఫొటోలు డిలీట్ చేయండి…” అంది అప‌ర్ణ‌.

         ప్ర‌కాష్ గ‌ట్టిగా న‌వ్వాడు. “అప్పుడేనా… ఇప్పుడేగా వ‌చ్చారు. కూర‌లు కొనుక్కోవ‌ద్దూ…” అన్నాడు. 

         వాడి స్నేహితులు న‌వ్వారు.

         “ముందు ఫొటోలు చూపించండి” అంది అప‌ర్ణ‌.

         “ఇవిగో…” అంటూ స్నేహితులు ఫోన్లు తీశారు. అంద‌రి ఫోన్ల‌లోనూ వాళ్ల ఫొటోలు
ఉన్నాయి. జుగుప్సాక‌రంగా.

         త‌ర్వాత ఫోన్లు ఆఫ్ చేసి జేబుల్లో పెట్టుకున్నారు. అమ్మాయిల ద‌గ్గ‌ర‌గా వ‌చ్చారు. భుజాల మీద చేతులు వేశారు.

         అప్పుడు అప‌ర్ణ త‌న జాక‌ట్లోకి చెయ్యి పెట్టి తీసింది. అదొక విజిల్‌. వెంట‌నే నోట్లో పెట్టుకుని గ‌ట్టిగా ఊదింది. ఆ శ‌బ్దం ఆ బంగ్లా అంతా ప్ర‌తిధ్వ‌నించింది. పొలాల్లో నాట్లు వేస్తున్న మ‌హిళ‌లు ప‌రిగెత్తుకుని వ‌చ్చారు. బంగ్లా వెనుక ద్వారం నుంచి మ‌హిళా ఇన్‌స్పెక్ట‌ర్ వ‌చ్చింది. ఆమె చేతిలో రివాల్వ‌ర్‌. నాట్లు వేసే మ‌హిళ‌ల చేతుల్లో లాఠీలు. వాళ్లంతా షీటీమ్ స‌భ్యులు. ఈలోగా సంత‌లో మ‌ఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్‌తో పాటు, ఆ
అమ్మాయిల బంధువులు కూడా వ‌చ్చారు. 

         ప్ర‌కాష్ గ్యాంగ్ అంతా తెల్ల‌బోయారు. అంద‌రి ఫోన్లు క్ష‌ణాల్లో లాక్కున్నారు. ఫొటోలు చెక్ చేశారు. వెంట‌నే అరెస్ట్ చేశారు.

***

         అభినంద‌న స‌భ‌.

         షీటీమ్ ఇనస్పెక్ట‌ర్ మాట్లాడుతోంది.

         “ఈవ్‌టీజింగ్‌కి పాల్ప‌డే వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డం కోసం మేం బ‌స్సుల్లో అమ్మాయిల్లాగే తిరుగుతుంటాం. మ‌మ్మ‌ల్ని కూడా అల్ల‌రిపెట్టే ప్ర‌బుద్ధులు తార‌స‌ప‌డ‌తారు. అయితే అప‌ర్ణ‌లాంటి అమ్మాయిలు సాహ‌సంతో ముందుకు వచ్చిన‌ప్పుడే మేం పూర్తి స్థాయిలో ఇలాంటి వాళ్ల‌ని అరిక‌ట్ట‌గ‌లం. ఈ ఊర్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ల‌లిత వెన‌కాల కూడా ఈ గ్యాంగ్ ఉన్నార‌ని అనుమానం వ‌చ్చినా ఎవ‌రూ ముందుకు వ‌చ్చి ఫిర్యాదు  చేయ‌క‌ పోవ‌డంతో ఏమీ చేయ‌లేక‌పోయాం. ముందు అప‌ర్ణ మ‌మ్మ‌ల్ని ఎప్రోచ్ అయిన‌ప్పుడు, చివ‌రి దాకా నిల‌బ‌డుతుందో లేదోన‌ని సందేహించాం. కానీ త‌ను నిల‌బ‌డ్డ‌మే కాదు, వాళ్ల స్నేహితురాళ్ల‌ని కూడా క‌లుపుకుని ఊళ్లో ఈవ్‌టీజ‌ర్లంద‌ర‌నీ ఒకేసారి ప‌ట్టించింది. ఐ ఎప్రీష‌యేట్ హెర్ బ్రేవిటీ”

         ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మైక్ అందుకున్నాడు. “గూడును బ‌ద్ద‌లు కొట్టుకుని
బ‌య‌ట‌కి వ‌చ్చే సాహసం చేస్తేనే సీతాకోక చిలుక ఎగుర‌గ‌లుగుతుంది. ఈ అమ్మాయిలు
స‌హ‌జంగా భ‌య‌ప‌డే మ‌న‌స్త‌త్వాన్నుంచి బ‌య‌ట‌ప‌డి షీటీమ్‌ను క‌ల‌వ‌డం గొప్ప
విష‌యం. ఈ ఊళ్లో ఇంత జ‌రుగుతోంద‌ని నాకు తెలీదు. ఇక నుంచి ఇక్క‌డి అమ్మాయిల కోసం ప్ర‌త్యేక‌మైన బ‌స్ వేయిస్తాను. ఈ అమ్మాయిల సాహ‌సం నిజంగా అభినంద‌నీయం”

***

         ఊళ్లోకి బ‌స్సొచ్చి ఆగింది. అమ్మాయిలంతా సీతాకోక చిలుక‌ల్లాగా వ‌చ్చిబ‌స్సెక్కారు.

         కండ‌క్ట‌ర్ “రైట్‌…రైట్‌…” అన్నాడు ఇప్పుడు అది నిజంగా రైటే!

PUBLISHED ON 'NECHELI' WEB MAGAZINE


మంగళవారం, ఏప్రిల్ 19, 2022

అప్పారావూ... అంత‌రిక్ష సుంద‌రి!


 

డాబా మీద మ‌డ‌త మంచం వేసుకుని వెల్ల‌కిలా ప‌డుకుని, రెండు చేతులూ త‌ల‌కింద పెట్టుకుని, ఆకాశంలోని న‌క్ష‌త్రాల కేసి చూస్తూ ప‌డుకుంటే ఆ ఆనంద‌మే వేరు. అప్పారావు ఇప్పుడు అదే అనుభ‌విస్తున్నాడు. చంద‌మామ ఉండీ లేన‌ట్టుగా స‌న్న‌గా ఉన్నాడు. తార‌లు త‌ళుకు త‌ళుకుమంటున్నాయి.. ఎక్క‌డో కీచురాళ్ల చప్పుడు త‌ప్ప అంతా నిశ్శ‌బ్దం. అప్పుడ‌ప్పుడు ఆకాశం మీద నుంచి వెలుగుతూ రాలే ఉల్క‌లు. అవ‌న్నీ చూస్తుంటే అప్పారావుకి చిన్న‌ప్పుడు చ‌దువుకున్న చంద‌మామ క‌థ‌లు, తాతయ్య చెప్పిన జాన‌ప‌ద క‌థ‌లు గుర్తొస్తాయి. ‘ఏమిటో ఈ న‌క్ష‌త్రాలు!’ అనుకున్నాడు. ‘అస‌లెన్ని ఉంటాయి’ అని కూడా అనుకున్నాడు. పోనీ లెక్క‌పెడితేనో అనిపించి మొద‌లెట్టాడు కానీ ఓ ప‌దో, ప‌దిహేనో అయ్యాక ఏ చుక్క ద‌గ్గ‌ర ప్రారంభించాడో గుర్తులేక విర‌మించుకున్నాడు.

అత‌డ‌లా చూస్తుంటే ఆ న‌ల్ల‌టి ఆకాశంలో మెరుస్తున్న న‌క్ష‌త్రాల మ‌ధ్య ఓ న‌క్ష‌త్రం క‌దుతున్న‌ట్టు అనిపించింది. దాని కేసే దృష్టి పెట్టి చూశాడు. అరె... చిత్రం... అది రంగులు కూడా మారుస్తోంది!

గ‌బ‌గ‌బా త‌ల‌గ‌డ కింద త‌డుముకుని క‌ళ్ల‌జోడు పెట్టుకుని మ‌రీ చూశాడు. అవును నిజ‌మే... అది క‌ద‌ల‌డ‌మే కాదు, నెమ్మ‌దిగా పెద్ద‌ద‌వుతోంది కూడా!

వాటే... వండ‌ర్!

అప్పారావు చూస్తుండ‌గానే అది కిందికి వ‌స్తున్న‌ట్టు అనిపించింది. అరె... అది ఇంకా పెద్దద‌వుతోందే? వార్నీ... ఏంటిది చెప్మా? అనుకుంటూ చ‌టుక్కున లేచి కూర్చున్నాడు. త‌ల మాత్రం పైకే ఉంది. క‌ళ్లు పెద్ద‌వ‌య్యాయి. ఆ క‌ళ్ల‌లో వెలుగులు చిమ్ముతూ ఏదో పెద్ద ఆకారం. అది గుండ్రంగా ఉంది. దాని చుట్టూ రంగురంగుల లైట్లు వెలిగి ఆరుతున్నాయి. అది ఇంకా... ఇంకా... కిందికి వ‌చ్చింది.

అప్పారావు నోరు దానంత‌ట అదే తెరుచుకుంది.

ఇదేంటి? ఫ‌్ల‌యింగ్‌సాస‌రా? అంటే... గ్ర‌హాంత‌ర వాసులెవ‌రో వ‌చ్చారా?

చిన్న‌ప్పుడు చ‌దువుకున్న‌ది గుర్తొచ్చింది. యూఎఫ్ఓ! అంటే అన్ ఐడెంటిఫైడ్ ఫ్ల‌యింగ్ ఆబ్జెక్ట్‌. అన‌గా గుర్తు తెలియ‌ని ఎగిరే వ‌స్తువు. అప్పారావు ఆలోచ‌న‌లు శ‌రవేగంగా ప‌రిగెడుతుండ‌గానే, ఆ గుండ్ర‌ని వింత అంత‌రిక్ష వాహ‌నం అత‌డు ప‌డుకున్న డాబా మీద‌కి వ‌చ్చి ఆగింది. దాని నుంచి ఓ ఫోక‌స్ లాంటి వెలుగు  డాబా మీద గుండ్రంగా ప‌డింది. అప్పారావు ఆ వెలుగు చూడ‌లేక క‌ళ్ల‌కు చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. ఆ వెలుగులో ఆ వాహ‌నం కింద త‌లుపు తెరుచుకుంది. అందులోంచి ఓ నిచ్చెన లాంటిది కిందికి వాలింది. అప్పారావు క‌ళ్లు పెద్ద‌వి చేసుకుని, నోరు వెళ్ల‌బెట్టి చూస్తూనే ఉన్నాడు. ఆ మెట్ల మీద‌ స‌న్న‌టి జ‌ల‌తారు కుచ్చిళ్లు జీరాడాయి. ఆ కుచ్చిళ్ల లోంచి సొగ‌సైన ఓ తెల్ల‌ని పాదాలు క‌నిపించాయి. వాటిపై త‌ళుక్కుమంటున్న వెండి మువ్వ‌ల ప‌ట్టీలు. ఆ పాదాలు  మెట్ల మీద సుతారంగా దిగుతూ ఉంటే, జ‌ల‌తారు కుచ్చిళ్లు చంద్ర‌కాంతి ప‌డి వింత‌గా మెరుస్తున్నాయి.  ఆ కుచ్చిళ్లపై గాలికి ఎగురుతున్న ప‌ట్టు పావ‌డా, ఆ త‌ర్వాత పారద‌ర్శ‌కంగా ఉన్న ఓ అద్భుతమైన నీలి వ‌స్త్రం, దానిపై ధ‌గ‌ధ‌గలాడుతున్న ఆభ‌ర‌ణాలు, వాటిపై ర‌క‌ర‌కాల రంగుల‌తో మెరుస్తున్న మ‌ణిమాణిక్యాలు, వాటితో పాటు సుతారంగా క‌దులుతున్న ముత్యాల స‌రాలు, ల‌య‌బ‌ద్ధంగా క‌దులుతున్న వజ్ర‌పు లోలాకులు, వైఢూర్య‌లు పొదిగిన పాపిట‌పిందులు, ఉంగరాలు తిరిగిన న‌ల్ల‌ని ముంగురుల మీద అల‌వోక‌గా అమ‌రిన స్వ‌ర్ణ కిరీటం... వీట‌న్నిటినీ మించిన సొగ‌సుతో వెలిగిపోతున్న ఓ అంద‌మైన యువ‌తి అప్పారావు  క‌ళ్ల ముందు క‌నిక‌ట్టులాగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.

దే..వ‌..క‌..న్య‌!

అప్పారావు మ‌న‌సులో ఆశ్చ‌ర్యంగా అనుకున్నాడు.

ఏడిశావ్...  అంది అంత‌రాత్మ అంత‌లోనే.

ఏం ఎందుకు కాకూడదు? ఎన్ని సినిమాల్లో చూడ‌లేదూ? జ‌గ‌దేక వీరుడైన ఎన్టీఆర్ కోసం ఇంద్రుడి కూతురు బి. స‌రోజ దిగి రాలేదా? అంద‌గాడైన అక్కినేని కోసం సువ‌ర్ణ‌సుంద‌రి లెవెల్లో అంజ‌లీదేవి రాలేదా? అంతెందుకోయ్‌... మెగాస్టార్ చిరంజీవి కోసం అతిలోక  సుంద‌రి శ్రీదేవి వ‌చ్చి మాన‌వా... అంటూ వెంట‌ప‌డ‌లేదా? మూసుకో!” అంటూ అంత‌రాత్మ గొంతు నొక్కేశాడు అప్పారావు .

ఇలా అప్పారావు అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతుండ‌గానే ఆ అంత‌రిక్ష యువ‌తి ర్యాంపులో క్యాట్‌వాక్ చేసే అంద‌మైన మోడ‌ల్‌లాగా వ‌య్యారంగా ఆ డాబాపై న‌డుస్తూ రామారావు ద‌గ్గ‌రకి వ‌చ్చింది.

హాయ్... అప్పారావ్‌! ఎలా ఉన్నావ్‌?” అంది చిరున‌వ్వులు ఒలికిస్తూ.

అవి... న‌వ్వులా? కాదు...న‌వ పారిజాతాలు!

ర‌వ్వంత స‌డిలేని ర‌స‌ర‌మ్య గీతాలు! అనుకున్నాడు అప్పారావు.

సిగ్గులేక‌పోతే స‌రి... అది సినారే పాట‌... దాన్నే వాడుకోవాలా ఇక్క‌డ‌?’ అంది అప్పారావు అంత‌రాత్మ‌.

ష‌ట‌ప్‌... అంత గొప్ప పాట కాక‌పోతే ఈ సంద‌ర్భంలో మ‌రోటి ఎలా గుర్తొస్తుంది? నేనేమైనా గీత ర‌చ‌యిత‌నా? కొత్త‌గా అనుకోడానికి. పైగా ఇప్పుడు కాగితం, క‌లం తీసుకుని రాస్తూ కూర్చుంటే ఈ దేవ‌క‌న్య చూస్తూ ఉంటుందేంటి? ఫ్ల‌యింగ్ సాస‌ర్ ఎక్కేసి జంప్ జిలానీ అయిపోతుంది. కాబ‌ట్టి ఆట్టే వాక్కు!’ అంటూ మ‌న‌సులోనే నోరు నొక్కేశాడు.

నా... నా... పేరు నీకెలా తెలుసు?” అన్నాడు ఎలాగోలా గొంతు పెగ‌ల్చుకుని.

ఆ యువ‌తి జిగేల్మని మ‌రోసారి న‌వ్వేసి, “దిగంతాల నుంచి వ‌చ్చి నీ డాబా మీద దిగిన‌దాన్ని. నీ పేరు తెలీకుండా ఉంటుందా?” అంది.

ఇంత‌కీ నువ్వెవ‌రు? జ‌యంతివా? సువ‌ర్ణ సుంద‌రివా? అతిలోక సుంద‌రివా? బి. స‌రోజ‌వా? అంజ‌లీదేవివా? శ్రీదేవివా?” అనేశాడు అప్పారావు గ‌బ‌గ‌బా.

వాళ్లంతా ఎవ‌రు?” అంది ఆ అందాల అంత‌రిక్ష యువ‌తి చ‌నువుగా మ‌డ‌త మంచం మీద  కూర్చుని త‌ల‌గ‌డ ఒళ్లో పెట్టుకుంటూ.

వాళ్లు... వాళ్లు... మా ఊహా సుంద‌రీమ‌ణులు...వెండితెర వేలుపులు... “ అన్నాడు అప్పారావు, కాస్త‌కుదుట ప‌డి.

స‌రేలే... ఇంత‌కీ మ‌రి మీ ఊహా సుంద‌రీ మ‌ణులు బావున్నారా? నేను బావున్నానా?” అంది చుబుకం కింద చెయ్యి పెట్టుకుని.

ఆహా... ఏమందమెంత సౌంద‌ర్యమెంత సొగ‌సెంత వ‌య్య‌ర‌మెంత వ‌గ‌లు?’ అనుకున్నాడు అప్పారావు మ‌న‌సులో.

ఎద‌వ క‌విత్వం క‌ట్టిపెట్టి ఆవిడ అడిగిన కొళ్చ‌నుకి యాన్స‌రియ్యి...’ అంది అంత‌రాత్మ విసుగ్గా.

ఛ‌స్‌...నువ్ నోర్ముయ్యి...’ అంటూ దాన్ని క‌సిరి, ఆ యువ‌తిని అబ్బురంగా చూస్తూ అప్పారావు జ‌వాబు చెప్పాడు, “వాళ్లెవ‌రూ నీ కాలి గోటికి కూడా స‌రిపోరు...” అన్నాడు త‌మ‌కంగా.

ఓ...నువ్వు నా కాలిగోరెప్పుడు చూశావు?” అంది ఆ యువ‌తి అప్పారావు చేయి ప‌ట్టుకుని మ‌డ‌త మంచం మీద త‌న ప‌క్క‌నే కూర్చోబెట్టుకుంటూ.

అబ్బ‌... ఏమి స్ప‌ర్శ‌? ఏమి మేని సొగ‌సు?... త‌నువా? ఊహు... హ‌రిచంద‌న‌మే! ప‌లుకా? ఊహూ... అది మ‌క‌రంద‌మే! కుసుమాలు తాక‌గ‌నే న‌లిగేను కాదా ఈ మేను?’ అనుకుంటూ ఏదో మైకంలో ఉండిపోయాడు అప్పారావు .

ఓరి స‌న్నాసీ...ముందు నోరు విప్ప‌రా... ద‌రిద్రుడా...’ అంటూ గ‌య్యిమంది అంత‌రాత్మ‌.

దాన్ని ప‌ట్టించుకోకుండా అప్పారావు మ‌త్తుగా చెప్పాడు, “ఇందాకా... నువ్వు దిగుతున్న‌ప్పుడు చూశాను. దాన్ని వ‌ర్ణించ‌డానికి మా శృంగార క‌వుల ప్ర‌బంధాలు కూడా స‌రిపోవు...” అన్నాడు.

అమ్యయ్య‌... పోన్లే... మ‌రి నేను నీకు న‌చ్చానా?” అంది ఆ యువ‌తి రామారావు క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూస్తూ.

ఆహా...ఏమి క‌ళ్లు? ఒక్క క్ష‌ణం... ఒక్క క్ష‌ణం... ఆ రెప్ప‌లు వాల్చ‌కు... అటూ ఇటూ క‌ద‌ల‌కు... ఒక్క క్ష‌ణం... మోయ‌లేని ఈ హాయిని మోయ‌నీ...’ అనుకున్నాడు అప్పారావు .

ఒరే...దిక్కుమాలినోడా! ఆ పిల్ల ఏంటో అడుగుతోంది... ముంద‌ది చెప్ప‌రా?’ అంది అంత‌రాత్మ దాని త‌ల అది ప‌ట్టుకుని.

అప్పారావు తేరుకుని, “అస‌లు ఆ అడ‌గ‌డ‌మేంటి? ఎందుకు? ఆకాశం మీద నుంచి రావ‌డ‌మేంటి? నా డాబా మీద దిగ‌డ‌మేంటి? న‌చ్చానా అని అడ‌గ‌డ‌మేంటి?” అంటూ ప్ర‌శ్న‌లు కురిపించాడు.

ఆ యువ‌తి హాయిగా న‌వ్వేసింది. ఆ త‌ర్వాత చెప్పింది, “అది కాదు అప్పారావ్‌... నువ్విక్క‌డ డాబా మీద చేతులు త‌ల కింద పెట్టుకుని ఆకాశం కేసి చూస్తున్నావా? స‌రిగ్గా అదే స‌మ‌యానికి నేను మా మందిరం మీద లేటెస్ట్ వెర్ష‌న్ టెలిస్కోపు ఓపెన్‌చేసి ఫోక‌ల్ లెంగ్త్ సెట్ చేసి ఇటు కేసి చూశాను. మీ పాలపుంత క‌నిపించింది. మ‌రింత ఫోక‌స్ చేస్తే మీ భూమి క‌నిపించింది. దాన్ని క్లోజ‌ప్ చేసే స‌రికి నువ్వు సీన్‌లోకి వ‌చ్చావు. చూడ‌గానే న‌చ్చావు. వెంట‌నే మా నాన్న నా బ‌ర్త్‌డేకి ఇచ్చిన స్పేస్ వెహికిల్ ఎక్కేసి చ‌క్కా వ‌చ్చేశా...” అంది అది చాలా తేలికైన విష‌య‌మ‌న్న‌ట్టు.

అప్పారావు కేమీ అర్థం కాలేదు. ఆ యువ‌తి చెబుతున్న‌ది అసంభ‌వం అనిపిస్తోంది.  ఆమె చెప్పిన దాని ప్ర‌కారం ఆమె మ‌న సూర్య‌కుటుంబం ఉండే మిల్కీవే పాల‌పుంతకి అవ‌త‌ల ఎక్క‌డో మ‌రో గెలాక్సీలో ఏదో న‌క్ష‌త్రం చుట్టూ తిరుగుతున్న ఒకానొక ఎక్సోప్లానెట్‌కి చెందిన‌దై ఉంటుంది. అక్క‌డి నుంచి ఇన్ని కాంతి సంవత్స‌రాల దూరం దాటి క్లోజ‌ప్‌లో చూడ‌గ‌లిగే టెలిస్కోపులు ఉండడం ఊహ‌కి అంద‌ని విష‌యం. పైగా ఉన్నాయే అనుకున్నా, కొన్ని క్ష‌ణాల్లోనే ఇన్నేసి కోటానుకోట్ల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించే స్పేస్ వెహికిల్స్ ఉండ‌డం మ‌రింత అసాధ్యం... కాంతిని మించి ఎన్నో రెట్లు వేగంగా వ‌స్తే కూడా ఇది జ‌ర‌గ‌దు... అనుకున్నాడు అప్పారావు .

ఓరి నీ సైన్స్ గోల త‌గ‌ల‌డా? ఓ అంద‌మైన అమ్మాయి వ‌చ్చి నీ మ‌డ‌త మంచం మీద కూర్చుని నువ్వు నచ్చి వచ్చాన్రా నాయ‌నా అంటుంటే... వెంట‌నే ప్రొసీడైపోక...  గెలాక్సీలు, కాంతి సంవ‌త్సరాలు, దూరాలు, వేగాలంటావేంట్రా ద‌గుల్బాజీ...’ అంటూ అంత‌రాత్మ కోపంతో చిందులు తొక్క‌సాగింది.

అప్పారావు మొద‌టి సారిగా అంత‌రాత్మ‌తో ఏకీభ‌వించాడు.

నిజ‌మే... నేను ద‌రిద్రుడినే, ద‌గుల్బాజీనే, దిక్కుమాలినోడినే, స‌న్నాసినే... కాసేపు న‌న్ను క‌న్‌ఫ్యూజ్ చేయ‌కు. నువ్వు చెప్పిన‌ట్టే ప్రొసీడైపోతాన్లే...’ అనుకున్నాడు.

ఆ త‌ర్వాత దేవానంద్‌లాగా త‌లెగ‌రేశాడు. రాజేష్‌ఖ‌న్నాలాగా క‌న్నింగ్‌గా న‌వ్వాడు. ష‌మీ క‌పూర్‌లాగా వంక‌ర‌గా మొహం పెట్టి చూశాడు. రాజ్‌క‌పూర్‌లాగా రొమాంటిక్‌గా ఫీలింగ్ ఇచ్చాడు. చిరంజీవిలా స్టైల్‌గా ఆమె చెయ్యి ప‌ట్టుకున్నాడు. మ‌హేష్‌బాబులాగా లుక్కిచ్చాడు. ఆఖ‌రికి దేవ‌ర‌కొండ‌లాగా ధైర్యంగా, యూత్‌ఫుల్‌గా ఫేస్ పెట్టి, “ఇంత‌కీ నాలో ఏం చూసి మెచ్చావు? ఏం న‌చ్చి ఇంత దూరం వ‌చ్చావు?” అన్నాడు పెద్ద హీరోలా ఫోజ్ పెట్టి.

అంత‌రాత్మ ప‌క‌ప‌కా న‌వ్వింది. ‘ఒరే... ఇందాకా నువ్వు అనుకున్న‌వ‌న్నీ కాదురా అసాధ్యాలు... ఈమెకు నువ్వు న‌చ్చ‌డ‌మే అసాధ్యాల్లోకెల్లా అసాధ్యం...’ అంది.

మంచి మూడ్‌లో ఉన్న అప్పారావు , దాన్ని ప‌ట్టించుకోలేదు.

ఏదో ఒక‌టి చూశాన్లే అప్పారావూ? నువ్వు నాతో రావూ?” అంది ఆ అంత‌రిక్ష సుంద‌రి అత‌డి చెయ్యి ప‌ట్టుకుని లాగుతూ.

ఎ... ఎక్క‌డికి?” అన్నాడు అప్పారావు ఆశ్చ‌ర్యంగా.

అలా మా లోకానికి పోదాం ప‌ద‌వయ్యా అంటుంటే, అలా మాలోకంలా చూస్తావేంట‌య్యా.. అంటూ ఆ అంత‌రిక్ష సుంద‌రి అత‌డి చేయి పుచ్చుకుని దాదాపు బ‌ర‌బ‌రా లాక్కుపోయి ఆ వింత వాహ‌నం ఎక్కించేసింది.

అప్పారావుకి ఇక నోరెత్తే అవ‌కాశం రాలేదు. ఆ అంత‌రిక్ష నౌక‌లో ఆమె లాంటి వాళ్లే ఓ అర‌డ‌జ‌ను సుంద‌రీమ‌ణులు ఉన్నారు. వాళ్లంతా న‌వ్వుతూ చేతులూపుతుంటే లుంగీ, టీష‌ర్టుతో ఉన్న అప్పారావు, చేసేదేంలేక... అది ఆనంద‌మో, భ‌య‌మో, మైమ‌ర‌పో, అయోమ‌య‌మో, ఆశ్చ‌ర్య‌మో, ప‌ర‌శ‌వ‌మో తెలియ‌ని ఒకానొక వింత, విచిత్ర, విభిన్న‌, వినూత్న, అనూహ్య‌, అవ్య‌క్త భావానికి లోన‌య్యాడు. అత‌డే కాదు, అత‌డి అంత‌రాత్మ కూడా మూగ‌బోయింది.

ఆ అంత‌రిక్ష నౌక రివ్వుమంటూ ఆకాశంలోకి లేచింది. కిటికీలోంచి చూసిన అప్పారావుకి అత‌డి మ‌డ‌త‌మంచం, డాబా, ఊరు అన్నీ చూస్తుండ‌గానే చిన్న‌వైపోయి, ఆపై గూగుల్ ఎర్త్ లో లాగా నీలి రంగులో భూగోళం క‌నిపించి, అంత‌లోనే అది కూడా చుక్కైపోయి, న‌క్ష‌త్రాల గుంపులోంచి దూసుకుపోతున్న అనుభూతి క‌లిగింది.

అప్పారావు క‌ళ్లు విప్పార్చి కిటికీలోంచి త‌ల‌తిప్పి త‌న‌కేసి చూసుకునేస‌రికి... ఆశ్చ‌ర్యం!

త‌న దుస్తుల‌న్నీ మారిపోయి ఉన్నాయి. జ‌గ‌దేక‌వీరుడు సినిమాలో ఎన్టీఆర్ క‌ట్టుకున్న ధ‌గ‌ధ‌గ‌లాడే వ‌స్త్రాల‌వి. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కి న‌లుగురే. త‌న‌కి మాత్రం ఎంత‌మందో!

అప్పారావుకి లోప‌లి నుంచి ఉత్సాహం త‌న్నుకొచ్చింది. అది నోట్లోంచి ఈల పాట‌లా బ‌య‌ట‌కొచ్చింది.

ఆకాశంలో హంస‌ల‌మై... హాయిగ ఎగిరే గువ్వ‌ల‌పై... అలా అలా కులాసాల తేలిపోదామా?” అనే పాట అది.

ఒరే... ఇది ఈల వేసే సంద‌ర్భంరా... వీళ్లెవ‌రో, నిన్నెక్క‌డి లాక్కుపోతున్నారో, అక్క‌డ‌కి వెళ్లాక  ఏం చేస్తారో అని నేను హ‌డ‌లి చ‌స్తుంటే నీకు కులాసాగా ఉందా?’ అంటూ అంత‌రాత్మ తిట్టిపోసింది.

నిజ‌మే... ఎర‌క్క‌పోయి డాబా మీద ప‌డుకున్నాను. అప్ప‌టికీ పంక‌జం చెబుతూనే ఉంది, ఒక్క‌రూ ప‌డుకోలేరండీ ద‌డుసుకుంటార‌ని... అనుకున్నాడు అప్పారావు. భార్య‌ను త‌ల్చుకోగానే అప్పారావుకి జాలేసింది. రేప్పొద్దున్న నేను క‌న‌బ‌డ‌క‌పోతే ఏం కంగారు ప‌డుతుందో?’ అనుకున్నాడు.

ఆవిడ సంగ‌తి కాదురా... ముందు నీ సంగ‌తి ఆలోచించు... అంది అంత‌రాత్మ‌.

ఈలోగా ఏదో కుదుపు. అంత‌రిక్ష నౌక ఆగింద‌న్న‌మాట‌. అప్పారావు కిటికీలోంచి చూసేస‌రికి అద్భుత లోకం! వింత విచిత్ర భ‌వంతులు. పెద్ద పెద్ద మందిరాలు!

రా... సుంద‌రా... అంది అంత‌రిక్ష సుంద‌రి.

అప్పారావు వెన‌క్కి చూశాడు త‌న వెన‌క ఎవ‌రైనా ఉన్న‌రేమోన‌ని.

నిన్నే అప్పారావ్...ప‌ద అంది ఆ సుంద‌రి.

అప్పారావు ఛాతీ పోలీస్  ఉద్యోగానికి వెళ్లిన అభ్య‌ర్థి ఛాతీలాగా ఉబ్బెత్తున్న పొంగిపోయింది. ఆ సుంద‌రి అప్పారావుని ఓ అందాల సౌధంలోకి తీసుకెళ్లింది. అక్క‌డెవ‌రూ లేరు, త‌ను...ఆ సుంద‌రి... అంతే! ప‌క్క‌నే అద్భుత‌మైన హంస‌తూలికా త‌ల్పం!

ఇదేం గ్ర‌హ‌మో... ఇదేం లోక‌మో అనుకున్నాడు అప్పారావు.

ఇదెక్క‌డి గ్ర‌హ‌చారంరా నాయ‌నా... ఇంత మంచి అవ‌కాశం నీ ఎదుట ఉంటే, ఇదే గ్ర‌హ‌మైతే నీకెందుకురా... ఆ సుంద‌రి చేయి ప‌ట్టుకుని ప్రొసీడైపో అంటూ విసుక్కుంది అంత‌రాత్మ‌.

ఇక అప్పారావు ఆగ‌లేదు. ఒక్క ఉదుట‌న ఆ సుంద‌రి చేయి ప‌ట్టుకుని త‌న మీద‌కి లాక్కున్నాడు.

పైగా నీవేనా న‌ను వ‌ల‌చిన‌ది? నీవేనా న‌ను పిలిచిన‌ది? నీవేనా నా డాబాకొచ్చి న‌న్నిక్క‌డికి లాక్కొచ్చిన‌ది?” అంటూ పాటందుకున్నాడు మొహం సాధ్య‌మైనంత రొమాంటిక్‌గా పెట్టాన‌నుకుని!

నేను కాదు... అంది ఆ అంత‌రిక్ష సుంద‌రి అప్పారావు చెయ్యి విడిపించుకుని.

తెల్ల‌బోయిన  అప్పారావుతో చెప్పింది, “నేను కాదు అప్పారావ్. నిన్నిక్క‌డికి తీసుకురావ‌డానికి అలా చెప్పానంతే. నిన్ను చూసింది, వ‌ల‌చింది మా యువ‌రాణి! నేను ఆమె చెలిక‌త్తెని. ఆమె ఆజ్ఙ మేర‌కే నేనిలా చేశాను. అదిగో మా యువ‌రాణి నీకోసం ఎదురు చూస్తోంది. వెళ్లిరా. అమ‌ర సుఖాలు అనుభ‌వించు.. అంటూ ఆ అంత‌రిక్ష సుంద‌రి వ‌డివ‌డిగా వెళ్లిపోయింది.

అప్పారావు మ‌ళ్లీ ఇందాక‌టి అవ్య‌క్త భావానికి లోన‌య్యాడు.

ఈమె... కేవ‌లం చెలిక‌త్తా? చెలిక‌త్తే ఇంత మ‌నోహ‌రంగా  ఉంటే... ఆ యువ‌రాణి ఇంకెంత బావుంటుందో? అనుకున్నాడు అప్పారావు.

ఆహా...అప్పారావ్‌! మొద‌టి సారి నిన్ను చూస్తే ఈర్ష్య క‌లుగుతోందిరా. వెళ్లు ఆ యువ‌రాణిని మురిపించి, బులిపించి, మైమ‌ర‌పించు... అంటూ అంత‌రాత్మ తొంద‌ర‌పెట్టింది. 

ఇక అప్పారావు ఆగ‌లేదు. ఆ అంతఃపురంలో జ‌ల‌తారు ప‌ర‌దాల‌ను తొల‌గించుకుని ముందుకు న‌డిచాడు.

అక్క‌డ‌... ఆకాశంలో బంగారు రంగులో వెలిగిపోతున్న‌పెద్ద చంద‌మామ కురిపిస్తున్న ప‌సిడి వెన్నెల కాంతిలో వెన‌క్కి తిరిగి ఒయ్యారంగా నిల‌బ‌డి ఉంది అంత‌రిక్ష యువ‌రాణి!

అప్పారావులో భావ‌కుడు నిద్రలేచి పాటందుకున్నాడు.

రంభా ఊర్వ‌శి త‌ల‌ద‌న్నే ర‌మ‌ణీ ల‌లామ ఎవ‌రీమె? న‌న్నే వెద‌కుచు ఇట ర‌ప్పంచిన క‌న్యక ర‌తియే కాబోలు... అన్నాడు ఘంట‌సాల‌లా పాడుతున్నాన‌నుకుని.

ఆ అంత‌రిక్ష యువ‌రాణి కూడా ఆగ‌లేదు...

రారా... నా అంద‌గాడ‌! రాతిరంత జాత‌రేరా... అహా రాతిరంత జాత‌రేరా... అంటూ వెన‌క్కి తిరిగింది. అలా తిర‌గ‌డంలో ఆమె మేలి ముసుగు చిరుగాలికి జారువాలి తొల‌గిపోయింది.

అప్పారావు చూశాడు. అత‌డి క‌ళ్లు విప్పారాయి. నోరు త‌నంత‌ట తానే తెరుచుకుంది.

ఆ అంత‌రిక్ష యువ‌రాణి పూర్తి స్వ‌రూపం కంట‌బ‌డింది.

ఆమె నెత్తిమీద ... రెండు యాంటెన్నాల్లాంటి అవ‌య‌వాలు!

ఆమె క‌ళ్లు...ఆకుప‌చ్చ రంగులో వెలుగుతున్న పెద్ద పెద్ద గుంట‌లు!

ఆమె ముక్కు... లేదు స‌రిక‌దా, దాని స్థానంలో రెండు రంధ్రాలు!

ఆమె పెద‌వులు... ఎగుడుదిగుడు కోర‌ల‌తో మూసుకున్న నోరు!

ఆమె భుజాల నుంచి... వంక‌ర‌గా పీల‌గా వేలాడుతున్న రెండు చేతులు!

వెన‌క్కి తిరుగుతూనే ఆ యువ‌రాణి పాటందుకుంది...

సుంద‌రాంగా... అందుకోరా... సౌంద‌ర్య మాధుర్య మందార‌ము...

అంద‌లేని... పొంద‌లేని... ఆనంద లోకాలు చూపింతురా... అంటూ ముందుకు రాసాగింది.

కెవ్వు... కెవ్వు... కెవ్వుమంటూ అప్పారావు నోట్లోంచి అప్ర‌య‌త్నంగా అరుపులు వెలువ‌డ్డాయ్‌!

మోసం... ద‌గా... కుట్ర‌... అని అరుస్తూ అప్పారావు వెన‌క్కి తిరిగి ప‌రుగందుకున్నాడు.

మార్స్ ఎటాక్‌, ‘ద ఎన్‌కౌంట‌ర్స్ ఆఫ్ ద థ‌ర్డ్‌కైండ్ లాంటి హాలీవుడ్ సినిమాల్లోలాగా వికృతంగా ఉన్న ఆ వింత‌లోక ర‌క్ష‌క భ‌టులు గోల‌గోల‌గా అరుస్తూ అప్పారావు వెంట‌ప‌డ్డారు. బ‌య‌ట‌కొచ్చిన అప్పారావుకి త‌న‌ను తీసుకొచ్చిన అంత‌రిక్ష నౌక  క‌నిపించింది. చ‌టుక్కున దాంట్లోకి ఎక్కేశాడు. అక్క‌డ క‌నిపించిన ఏవేవో మీట‌లు నొక్కేశాడు.

అదృష్టం... ఆ నౌక రివ్వుమంటూ పైకి లేచింది. చూస్తుండ‌గానే దూరంగా భూమి, త‌న రాష్ట్రం, త‌న ఊరు, త‌న డాబా, త‌న మ‌డ‌త మంచం క‌నిపించాయి. ఈలోగా ఆ అంత‌రిక్ష నౌకలో ఓ బ‌ట‌న్ ఎర్ర‌గా వెలిగి ఆర‌డం మొద‌లెట్టింది.

మైగాడ్‌... ఫ్యూయ‌ల్ అయిపోయింద‌న్న‌మాట‌. వెన‌కా ముందూ ఆలోచించ‌కుండా అప్పారావు చ‌టుక్కున ఆ నౌక త‌లుపు తీసి కింద‌కి దూకేశాడు!

అంతే... ఆ అంత‌రిక్ష నౌక పేలిపోయింది!

అప్పారావు మాత్రం వ‌చ్చి వ‌చ్చి మ‌డ‌త‌మంచం మీద ధ‌ఢేళ్‌...మ‌ని ప‌డ్డాడు!

ఆపై మంచం మీద నుంచి కింద‌కి ప‌డ్డాడు.

అప్పుడు మెల‌కువ వ‌చ్చింది అప్పారావుకి! అత‌డి గుండె చ‌ప్పుడు అత‌డికే వినిపిస్తోంది!

వార్నీ... ఇదంతా క‌లా?’ అనుకున్నాడు అప్పారావు.

అవును... అంద‌మైన పీడ‌క‌ల‌! అంది అంత‌రాత్మ‌.

అప్ప‌టికే ఎండ చుర్రుమంటోంది. తెల్లారిపోయింద‌న్న‌మాట అనుకున్నాడు అప్పారావు.

గ‌బ‌గ‌బా దుప్ప‌టి మ‌డ‌త పెట్టేసి, మంచం ఎత్తేశాడు.

అప్పుడు క‌నిపించింది, మంచం కింద‌! మెరుస్తున్న వెండి మువ్వ‌ల ప‌ట్టీ!

వార్నాయ‌నో...అనుకున్నాడు అప్పారావు. దాన్ని తీసుకుని బ‌లంగా ఎటో విసిరేశాడు.

ఆరోజు నుంచి అప్పారావు డాబా మీద ప‌డుకుంటే ఒట్టు!!

GOT PRIZE IN 'UGADI KATHALA POTI' CONDUCTED BY "SANCHIKA" WEB-MAGAZINE ON 17.4.2022