మంగళవారం, అక్టోబర్ 26, 2021

రాజ‌కీయ తిట్ల పురాణంబెట్టిద‌నిన‌...!

 


"ఏంట్రా మొహం అలా కంద‌గ‌డ్డ‌లా ఉందేం? ఏంటి క‌త‌?" అంటూ ప‌ల‌క‌రించారు గురువుగారు, శిష్యుడు రాగానే.

"ఏం చెప్ప‌మంటారు గురూగారూ! మా అపార్ట్‌మెంట్లో పార్కింగ్ ద‌గ్గ‌ర గొడ‌వొచ్చిందండి. మా ప‌క్కింటాయ‌న నా మీద నోరు పారేసుకున్నాడండి... ఆ గొడ‌వ నుంచి నేరుగా ఇలా వ‌చ్చానండి..."

"ఏమ‌న్నాడ్రా ఆయ‌న‌తిట్టాడా?"

"ఆయ్‌... అవునండి... ద‌గుల్బాజీ, బోసిడీకే, ల‌మ్డిక్కే, జ‌ఫ్పా, లోఫ‌ర్‌, మాద‌చ్చోద్‌, బంఛ‌త్‌, బ‌డాచోర్‌, బ‌డుద్దాయ్‌... ఇలా ర‌క‌ర‌కాల మాట‌ల‌న్నాడండి..."

"ఇంత‌కీ ఆ గొడ‌వ‌కి కార‌ణం ఏంటి?"

"నిజం చెప్పాలంటే నాదే త‌ప్పండి. ఆయ‌న పార్కింగ్ ప్లేస్‌కి అడ్డంగా నా వెహికిల్ పెట్టానండి... అందుక‌నే నోరు మూసుకుని చ‌క్కా వ‌చ్చానండి... అయినా ఆ ద‌రిద్ర‌పు తిట్లేంటండీ బాబూ..."

గురువుగారా అంతావిని ప‌డ‌క్కుర్చీలో తాపీగా జార‌గిలప‌డి క‌ళ్లు అర‌మోడ్పుగా పెట్టుకుని, తాపీగా చెప్పారు, "ఒరేయ్‌... తిట్ల‌ని తిట్ట‌కురా... తిట్లు ఎంతో ప‌విత్ర‌మైన‌వివ‌రా..."

"ఊరుకోండి గురూగారూ! తిట్లు ప‌విత్ర‌మైన‌వేంటండీమీర‌న్నీ అడ్డ‌దిడ్డంగా చెబుతారు..."

"ఓరి... నా వెర్రి శిష్యా! నా ద‌గ్గ‌ర ఇన్నాళ్ల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నావు కానీ నీకు తిట్ల ప్ర‌యోజ‌నం ఏమిటో తెలియ‌కపోతే ఎలారా?"

"తిట్ల‌కి ప్ర‌యోజ‌నం ఏంటి గురూగారూనాక్కాస్త అర్థ‌మ‌య్యేలా చెప్పండి..."

గురువుగారు న‌వ్వి, "ఒరే... నీకు గానీ రాజ‌కీయ పురాణంలో తిట్ల కాండ గురించి తెలిసి ఉంటే... ఇలా మొహం కంద‌గ‌డ్డ‌లా పెట్టుకుని నా ద‌గ్గ‌ర‌కి దిగాలుగా వ‌చ్చే వాడివి కావురా... పైపెచ్చు నీ ప‌క్కింటాయ‌న్నే బెంబేలెత్తించేసే వాడివి... అర్థం అయిందా?"

"ఎలా అర్థ‌మ‌వుతుందండీ? త‌ప్పేమో నావైపు పెట్టుకుని, ఆయ‌న్ని బెంబేలెత్తించ‌డ‌మేంటండీ? అడ్డ‌గోలు వ్య‌వ‌హారం కాక‌పోతేనూ?"

"అదేరా మ‌రి, రాజ‌కీయ కిటుకు! నీ చుట్టూ జ‌రుగుతున్న రాజ‌కీయ త‌తంగాన్ని గ‌మ‌నించ‌కుండా ఒట్టి వెర్రిబాగులోడిలా వ‌చ్చేస్తే ఎలారా? ఇప్పుడు నీ ప‌ర‌గ‌ణాలో తిట్ల చుట్టూనే క‌ద‌రా రంజైన రాజ‌కీయం న‌డుస్తుంట‌?"

"స‌రే... సార్‌! నాకంత తెలివే ఉంటే, మీ ద‌గ్గ‌ర‌కి రాజ‌కీయ పాఠాల‌కి ఎందుకొస్తానండీ? మ‌రింత‌కీ నేనేం చేస్తే మా ప‌క్కింటాయ‌న బెంబేలెత్తిపోయేవాడో చెప్పండి..."

"ఏం చేయాలావెంట‌నే ఆయ‌న ఇంటికి వెళ్లి అద్దాలు ప‌గ‌ల‌గొట్టాలి... ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేయాలి... నానా విధ్వంసం సృష్టించాలి...  అంతే కాదు ఆయ‌న బంధువుల ఇళ్ల‌కి నీ వాళ్ల‌ని పంపించి వాళ్ల ఇళ్లపై కూడా దాడి చేయాలి... ఆపై నీ అపార్ట్‌మెంటు వాళ్లంద‌రినీ పిలిచి ఆయ‌న తిట్ల వెనుక అంద‌రూ మ‌ర్చిపోయిన అర్థాల‌ను వెతికి, అవ‌న్నీ ఏడుపు మొహం పెట్టుకుని వివ‌రించి, సానుభూతి కూడా సంపాదించాలి... అక్క‌డితో ఆగ‌కూడ‌దొరేయ్‌... ఆయ‌న మీద కేసు పెట్టి జైలుకి కూడా పంపించాలి... అర్థ‌మైందా?"

"అయ్య‌బాబోయ్... అంత ఘోర‌మా? ఆయ‌న తిట్టడం క‌రెక్ట్ కాక‌పోవ‌చ్చు సార్‌... కానీ అస‌లు త‌ప్పు నాదే కదండి? మ‌రి ఆయ‌న ఇంటిని ధ్వంసం చేస్తే అది ఇంకా నేర‌మ‌వుతుంది క‌దండీపైగా ఆయ‌న బంధువులు ఏం చేశారండీ పాపం... ఆయ‌నేదో ఆవేశంలో తిడితే, చేత‌నైతే నేనూ తిట్టాలి కానీ, ఇంత‌గా రెచ్చిపోతే అది నీచం క‌దండీపైగా నేనే నేరం చేసి కేసు పెట్ట‌డం ఏంటండీదారుణం కాక‌పోతేనూ?"

"ఓరోరి బుర్ర‌లేని శిష్యా! మ‌రి నీ రాష్ట్రంలో జ‌రిగింది అదే క‌ద‌రామీ ముఖ్య‌మంత్రిని ఎవ‌డో ఏదో అన్నాడని తెలుసు క‌దా? అప్పుడేమైంది? ఆయ‌న అనుచ‌రులంతా వీరంగం ఆడ‌లేదూఓ ప‌థకం ప్ర‌కారం ఎగ‌స్పార్టీ ఆఫీసుల‌న్నింటిపైనా దాడులు చేయ‌లేదూ? అక్క‌డితో ఆగారా? ఆ తిట్టినాయ‌న‌పై పోలీసు కేసు పెట్టి జైల్లోకి తోయ‌లేదూ? మ‌రి ఇవ‌న్నీ తిట్లతో స‌మ‌కూరిన ప్ర‌యోజ‌నాలే క‌ద‌రా? ఇదంతా మ‌ర్చిపోయి నువ్వు మొహం ఎర్ర‌గా చేసుకుని వ‌చ్చేస్తే ఎలారా? ఇలాగైతే నువ్వు రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎదుగుతావునువ్వే చెప్పు?"

శిష్యుడు బుర్ర గోక్కున్నాడు... ఆనక వెర్రిమొహం పెట్టుకుని, "అవునండోయ్‌... మీరు చెప్పిందంతా నిజ‌మే... కానీ నాదొక సందేహ‌మండి... ఎంత రాజ‌కీయాలైనా ఉచితానుచితాలు మ‌ర్చిపోయి ఇలా తిట్ట‌డం త‌ప్పు కాదంటారా?"

"క‌చ్చితంగా త‌ప్పేరా...  నీ ప‌క్కింటాయ‌న నిన్ను తిట్టినా, నీ ముఖ్య‌మంత్రిని ఎగ‌స్పార్టీ వాడు త‌ట్టినా రెండూ త‌ప్పే. కానీ నువ్వు గ‌మ‌నించాల్సింది అది కాదురా... ఆ తిట్టుని అడ్డం పెట్టుకుని ఎంత డ్రామా జ‌రిగిందో అది చూడాలి. ఎదుటి వాడు తిడితే దాన్ని రాజ‌కీయంగా ఎంత బాగా ఉప‌యోగించుకోవ‌చ్చో గ‌మ‌నించాలి.  ఆ తిట్టుని ప‌దే ప‌దే ప‌లుకుతూ, దాని వెనుక ఉన్న అర్థాన్ని విడ‌మ‌ర్చి చెబుతూ, మొహం అమాయ‌కంగా పెట్టుక‌ని జ‌నం సానుభూతిని ఎలా పొందాలో తెలుసుకోవాలి.  అందుక‌నే తిట్లు ప‌విత్ర‌మైన‌వ‌ని నేన‌న్నాను... ఇప్ప‌టికైనా అర్థ‌మైందా?"

"అర్థ‌మైంది కానీ గురూగారూ, మీరు నన్ను మా ప‌క్కింటాయ‌న ఇల్లు, ఆయ‌న‌ బంధువుల ఇళ్లు కూడా ధ్వంసం  చేసి ఉండాల్సిందంటున్నారు క‌దా? మ‌రి అది నేరం కాదంటారా?"

"దాందేముందిరా? ఆయ‌న తిట్టిన తిట్ల‌కి నాకు బీపీ వ‌చ్చేసిందీ, ఆ బీపీ వ‌ల్ల ఏం చేస్తున్నానో తెలియ‌లేదూ అంటే స‌రి... మ‌రి మీ సీఎంగారు త‌న పార్టీ వారు చేసిన దాడుల్ని అలాగే స‌మ‌ర్థించుకోలేదూ? య‌థారాజా... త‌థాప్రజా అన్నారు క‌దా? అలాగ‌న్న‌మాట‌..."

"కానీ... రేప్పొద్దున్న ఇలా ప్ర‌జ‌లంద‌రూ మాకు బీపీ పెరిగింది కాబ‌ట్టే ఎదుటివాడిని కొట్టేశాం, వాడిల్లు కూల‌గొట్టేశామంటూ రెచ్చిపోతే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల మాటేమిటండీ?"

"ఓరే...నువ్వొక నీచ రాజ‌కీయ నేత‌గా ఎదిగాక‌, ఇక శాంతి భ‌ద్ర‌త‌ల ఊసు నీకెందుకురా?   ఈ వ్య‌వ‌హారం నుంచి నువ్వు నేర్చుకోవ‌ల‌సింది, తిట్ల కాండ‌లో తిర‌కాసు అధ్యాయం... తెలిసిందా?"

"తెలిసింది కానీండీ, ఇంత‌కీ మీరు తిట్ల‌ని స‌మ‌ర్థిస్తున్నారా?"

"అస్సలు కాదురా... కానీ నువ్వు, నీ వాళ్లు ఎప్పుడూ ఎవ‌ర్నీ తిట్ట‌లేదా? ఎవ‌ర్నీ తిట్ట‌కుండానే ఇంత వాడివైపోయావేంట్రా? మ‌ళ్లీ నీ రాష్ట్రం ద‌గ్గ‌ర‌కే వ‌ద్దాం... తాజాగా ఈ తిట్ల వ్య‌వ‌హారానికి సంబంధించిన కేసుపై హైకోర్టు ఎలాంటి ఘాటు వ్యాఖ్యానాలు చేసిందో గుర్తుకు తెచ్చుకో... గౌర‌వం, ప్ర‌తిష్ఠలు ముఖ్య‌మంత్రికే కాదు, అంద‌రికీ ఉంటాయ‌నలేదూరాజ్యాంగబ‌ద్ధ వ్య‌వ‌స్థ‌లు, న్యాయ‌మూర్తులను దూషిస్తున్నవారి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకునేందుకు ఉత్సాహం చూప‌ని పోలీసులు, ఈ విష‌యంలో  ఎందుకింత అత్యుత్సాహం చూపించార‌ని చుర‌కలేయ‌లేదూ?"

"అవునండోయ్‌... కానీ గురూగారూ, ఇంత‌కీ ఇందులో నేర్చుకోవాల్సిన రాజ‌కీయ పాఠం ఏంటండీ?"

"అలారా పాయింట్లోకి... ఇప్పుడు చెబుతాను రాసుకో, రాజ‌కీయ పురాణంలో తిట్ల కాండ ప్ర‌యోజ‌నం. నువ్వు రాజ‌కీయంగా ఎదిగే వ‌ర‌కు ఎగ‌స్పార్టీ వాడిని నోటికొచ్చిన‌ట్టు తిట్టు. ఆ తిట్ల ద్వారా ప్ర‌జ‌ల మ‌న‌సును ఏమార్చ‌డానికి ప్ర‌య‌త్నించు. నీకు అధికారం అంది కుర్చీ ఎక్కాక‌, ఎవ‌రైనా నీ మీద ప‌ల్లెత్తు మాట‌న్నా స‌హించ‌కు. విరుచుకు ప‌డు.  దాడులు చేయించు. కేసులు పెట్టు. అరెస్టులు చేయించు. దెబ్బ‌కి నిన్ను మ‌రెవ‌డైనా ఏమైనా అన‌డానికి కూడా భ‌య‌ప‌డిపోయేలా, బెంబేలెత్తిపోయేలా చెయ్యి. ఇంత చేసి కూడా ఎదుటివాడు తిట్టిన తిట్ల‌ను అడ్డం పెట్టుకుని ప్ర‌జ‌ల ముందు ఏడుపు మొహం పెట్టుకుని ఆ తిట్ల అర్థాలు వివ‌రించి మ‌రీ, సానుభూతిని పొందు. ఇలా చేస్తే నీకిక తిరుగుండ‌దు. ఓ నికార్స‌యిన నీచ నేత‌గా ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిపోతావు. బుర్ర‌కెక్కిందా?"

"ఓ... భేషుగ్గా గురూగారూ! ఇక వ‌స్తానండి... అర్జెంటుగా  తెలుగు నిఘంటువు కొనుక్కోవాలి..."

"అదెందుకురా?"

"మా ప‌క్కింటాయ‌న తిట్టిన తిట్ల‌కు అంద‌రూ మ‌ర్చిపోయిన అర్థాలు వెత‌క‌డానికండి...  వాటిని తెలుసుకుని మా అపార్ట్‌మెంట్లో మీటింగెట్టి ఊద‌ర‌గొడ‌తానండి... ఆయ్‌!"

"శెభాష్‌... పోయిరా!"

-సృజ‌న‌

 PUBLISHED ON 26.10.2021 ON JANASENA WEBSITE

శనివారం, అక్టోబర్ 09, 2021

అష్ట‌క‌ష్టాల దండ‌క‌మ్!


 

అమ్మ‌ల‌గ‌న్న‌య‌మ్మ‌... ముగురమ్మ‌ల మూట‌పుట‌మ్మ‌...

క‌రుణించు కాపాడు క‌న‌క‌దుర్గ‌మ్మ‌!

ఆంధ్ర రాష్ట్రాన అల్లాడుచున్న‌ట్టి సామాన్య జ‌నుల‌ను కాన‌వ‌మ్మ‌!

అష్ట‌క‌ష్టాల కార్చిచ్చులో చిక్కి అణగారుతున్న‌ట్టి ప్ర‌జ‌ల‌మ‌మ్మ‌!

న‌మ్ముకున్న‌ట్టి మా పాల‌కులు మ‌మ్ముల‌ను న‌ట్టేట‌లో ముంచి న‌వ్వుతున్నార‌మ్మ‌!

ఓటేసి గెలిపించి అంద‌లాలెక్కించి ఆశ‌పడిన మ‌మ్ము వెక్కిరించార‌మ్మ‌!

పాద‌యాత్ర‌లు చేసి పాకులాడార‌మ్మ‌...

ఊరూరు తిరుగుతూ ఊరించినార‌మ్మ‌...

ఏడ‌వ‌క‌పోయినా ఓదార్చినార‌మ్మ‌...

త‌లలు నిమిరి మ‌మ్ము ముద్దాడినారమ్మ‌...

బుగ్గ‌ల‌ను త‌డుముతూ బులిపించినార‌మ్మ‌...

మెత్త‌గా న‌వ్వుతూ మోసగించార‌మ్మ‌...

ఒక్క ఛాన్స్ ఇమ్మంటు వేడుకున్నార‌మ్మ‌...

గెలిపించితే చాలు స్వ‌ర్ణ‌యుగ‌మును తెచ్చి న‌ట్టింట‌ నిలుపుదుమ‌ని న‌మ్మించినారమ్మ‌!

ఆ మాట‌ల‌ను న‌మ్మి అధికార‌మందించి నిలువునా న‌ట్టేట మునిగిపోయితిమమ్మ‌!

ఎక్క‌డికి పోదుము, ఏమి చేయుద‌మ‌మ్మ‌... ఇక్క‌ట్ల ఊబిలో చిక్కుకున్నామ‌మ్మ‌!

ఎటు చూసినా బ‌తుకు బ‌స్టాండుగా మారి... బితుకు బితుకుమంటు మిగిలినామ‌మ్మ‌!

పింఛ‌న్ల‌లో కోత‌... జీతాల‌కే వాత‌... ఎవ్వ‌రిని చూసినా న‌వ్వు లేద‌మ్మ‌!

చెప్పుకుందామంటె దిక్కులేద‌మ్మ‌...నోరెత్తితే చాలు దాడి చేస్తార‌మ్మ‌!

గూండాలు, రౌడీలు పెచ్చరిల్లార‌మ్మ‌!

కండ‌బ‌ల‌మును చూపి క‌సురుతున్నార‌మ్మ‌!

స‌ర్కారు కొలువుల‌ని బిడ్డ‌ల‌ను ఊరించి... ఉత్త చేతులు చూపి ఊరుకున్నార‌మ్మ‌!

ఫ్యాక్ట‌రీల‌ను తెచ్చి ప్ర‌గ‌తి తెచ్చెద‌మంటు కోత‌లెన్నో కోసి ఆశ‌పెట్టార‌మ్మ‌!

వాస్త‌వానికి చూడ ఉట్టి మాట‌ల‌మ్మ‌... ఉన్న‌వన్నీ కూడ ఊడిపోయాయమ్మ‌!

అభివృద్ధి బాట‌ల‌ను అడుగునా ప‌రిచి అద‌ర‌గొడ‌తామంటు ఊరించినార‌మ్మ‌...

క‌ళ్లు తెరిచి చూడ ఉన్న దారులు కూడ గోతుల‌మ‌య‌మై గొల్లుమ‌న్నాయ‌మ్మ‌!

అడుగుపెడితే చాలు క‌స్సుమ‌ని గాయాలు... వాహ‌నాల‌ను న‌డ‌ప వీలులేద‌మ్మ‌!

రోడ్ల దుస్థితి చూసి బాగుచేయాలంటు అడిగినా చాల‌మ్మ‌... అగ‌చాట్లు మొద‌ల‌మ్మ‌!

రౌడీల‌తో కొట్టి, గూండాల‌తో బాది... అక్ర‌మంగా కేసులు అంట‌గ‌డ‌తార‌మ్మ‌!!

ఏవేవొ ప‌థ‌కాలు ర‌చియించి వంచించి... అడ్డదారిన దుడ్లు దుళ్ల‌గొట్టార‌మ్మ‌...

ఇచ్చినట్టే ఇచ్చి ప‌న్నులెన్నో పెంచి... జేబులో డ‌బ్బుల‌ను గుంజుతున్నార‌మ్మ‌!!

అప్పులెన్నో చేసి ప‌ద్దుల‌ను మ‌ళ్ళించి... రాష్ట్రాన్ని దివాళా తీయించినార‌మ్మ‌!

అగ‌చాట్ల సాగులో అన్న‌దాతలు చూడ‌... అణ‌గారి దిగ‌జారి జావ‌గారార‌మ్మ‌...

కోట్లాది సొమ్ముల‌ను బ‌కాయి పడిపోయి... రైత‌న్న‌ల‌కు మొండి చెయ్యి చూపార‌మ్మ‌!

ప్ర‌త్యేక హోదాను ప‌ట్టి తెచ్చెద‌మంటు... ప్ర‌గల్భాల‌నెన్నొ ప‌లికినార‌మ్మ‌...

చీటికిని మాటికిని దిల్లీకి వెళ్లొచ్చి... వ‌ట్టి చేతులు చూపి వెక్కిరించార‌మ్మ‌!

రాజ‌ధానిని మార్చి రాజిల్లుతామంటు... మూడు ముక్క‌ల ఆట‌ ఆడుతున్నార‌మ్మ‌...

భూములిచ్చిన రైతు సోద‌రుల‌ను వంచించి... మొండిచెయ్యిని చూపి ముంచినారమ్మ‌!

పాల‌కుల‌ను చూడ ఆడింది ఆట‌గా పాడింది పాట‌గా గ‌డుపుతున్నార‌మ్మ‌...

అయిన‌వారికి ఆస్తిపాస్తుల‌ను అందించి... అవినీతి మ‌డుగులో ఈదుతున్నార‌మ్మ‌!

భూముల‌ను సెజ్‌ల‌ను బ‌డాబాబుల‌కు పంచుతూ... వ్యాపార వాటాలు మ‌రిగినార‌మ్మ‌!

మాఫియా గ్యాంగుతో మాటు చాటున చేరి... మ‌త్తులో యువ‌త‌ను ముంచుతున్నార‌మ్మ‌!

ఓ త‌ల్లి మా త‌ల్లి మా క‌ల్ప‌వ‌ల్లి... మా అగ‌చాట్ల జాబితా అంతుప‌ట్ట‌నిద‌మ్మ‌...

మా కష్టాల లిస్టంత మొర‌పెట్ట‌లేమ‌మ్మ‌... మ‌ముగాచి మా బాధ తీర్చు పెద్ద‌మ్మ‌!

మన‌సున్న‌ నేత‌ల‌ను గుర్తించి ఎన్నుకొను ఇంగిత‌ము మాకిచ్చి ఈడేర్చుమ‌మ్మ‌!

ఒక్కొక్క ఓట‌రూ జ‌న‌సైనికుల రీతిలో చెల‌రేగు జాగృతిని అందీయ‌వ‌మ్మ‌!

అవినీతి పాల‌కుల మ‌హిషారులను త‌రుము... ధైర్యమ్ము మాకిచ్చి కావుమ‌మ్మ‌!

అప్పుడే నిజ‌మైన విజ‌య‌ద‌శ‌మి క‌ద‌మ్మ‌... ఆనాడు ద‌స‌రాను జ‌రుపుకుంటామ‌మ్మ‌!!

 

-సృజ‌న‌

PUBLISHED ON 09.10.2021 ON JANASENA WEBSITE