సోమవారం, నవంబర్ 13, 2023

బాణసంచా బాతాఖానీ!


దీపావళి కదాని సామాన్యుడు బాణసంచా కొనడానికి బయల్దేరాడు. మార్కెట్ అంత దూరంలో ఉండగానే పొగలు కనిపించాయి.

''అరె... ఏమైంది? ఆ పొగలేంటి?'' అన్నాడు పక్కన కనిపించిన వాడితో.

''... అదా... అక్కడ కొంటున్న వారి నిట్టూర్పుల సెగలు'' అన్నాడతడు.

సామాన్యుడికి అర్థం కాకపోయినా ''ఊహూ...'' అని మరి కొంచెం ముందుకెళ్లాడు. ఈసారి ఏకంగా మంటలు కనిపించాయి.

''అరెరె... అగ్నిప్రమాదం ఏదైనా జరిగిందా? ఆ మంటలేంటి?'' అన్నాడు ఆదుర్దాగా.

''అవి మంటలు కాదు. బాణసంచా సరుకులు ధరలు. భగ్గుమంటున్నాయ్‌!'' అన్నాడు పక్కవాడు.

సామాన్యుడు కళ్లు పరికించి చూశాడు. మార్కెట్మామూలుగానే ఉంది.

లోపలికి వెళ్లి ధరలు తెలుసుకుందామనుకున్నాడు. తారాజువ్వల ధర అడిగేటప్పటికి జేబులో డబ్బులు 'జువ్వు...'మంటూ ఎగిరిపోయినట్టనిపించింది. వాటినొదిలేసి కాకర పువ్వొత్తులెంతని అడిగాడు. వినేటప్పటికి కాకర కాయ తిన్నట్టనిపించింది. మతాబులు సంగతడిగేసరిగి మాట పడిపోయింది. చిచ్చుబుడ్ల వెల వింటే గుండెల్లో చిచ్చు పెట్టినట్టనిపించింది. బాంబుల ధర వినగానే 'బాంబోయ్‌...' అనుకున్నాడు. భూచక్రాల గురించి అడిగేసరికి కళ్లు గిర్రున తిరగడం మొదలెట్టాయి. విష్ణుచక్రాల రేటు వినగానే విలవిలలాడిపోయాడు. ఆఖరికి సిసింద్రీలు కొందామనుకున్నా సిగ్గు ముంచుకొచ్చేసింది. వెళ్లిపోదామనుకున్నాడు కానీ, పిల్లల బెంగ ముఖాలు గుర్తొచ్చి తల తాకట్టు పెట్టి వచ్చినవేవో కొనేసి మొండెంతో ఇంటికొచ్చేసి మంచం మీద వాలిపోయాడు.

సామాన్యుడు అలా పడుకున్నాడో లేదో బాణసంచా సంచీలోంచి దీపావళి సరుకులన్నీ బయటకి వచ్చేశాయి.

''కాకర పువ్వొత్తిని నేను... కళకళలాడిస్తాను... నేను లేనిదే దీపావళి లేనేలేదనిపిస్తాను...'' అంటూ డ్యాన్స్చేయసాగింది.

''ఏడిశావ్‌...'' అనే మాట వినిపించేసరికి కాకరపువ్వొత్తు కలవర పడి చుట్టూ చూసింది. సామాన్యుడి సంచీ పకపక నవ్వసాగింది.

''నువ్వూ నీ బోడి గొప్పలు. ఈ సామాన్యుడి ఇంటిని కళకళలాడించే శక్తి నీకెక్కడిది?'' అంది సంచీ.

''ఏం? ఎందుకని?'' అంది కాకరపువ్వొత్తు కోపంగా.

''ఓసారి నన్ను చూడు. నా నిండా చిల్లులు కనిపిస్తాయి. పాపం... ఈ సామాన్యుడి బతుకు కూడా ఇలాగే తయారైంది. ఓ ఎదుగా? బొదుగా? ఐదేళ్ల క్రితం హుషారుగానే ఉండేవాడు. హాయిగా దొరికిన పని చేసుకుని సాయంత్రానికి జేబులో డబ్బులతో కూనిరాగాలు తీస్తూ వచ్చేవాడు. ఇల్లాలి చేతిలో ఎంతోకొంత పెట్టి, పిల్లలకి ఏదో ఒకటి కొనిపెట్టి ఇంటి ముందు దీపాలు వెలిగించుకుని సంబరంగా పండగ గడిపేవాడు. అదిగో... అప్పుడు వచ్చాడొక మాయ మాటల మరాఠీగాడు. సామాన్యుడు నవ్వుతున్నా బలవంతంగా ఓదార్చాడు. బుగ్గలు నిమిరాడు. తల రాశాడు. ముసిముసిగా నవ్వి బుగ్గలు పుణికాడు.  పెద్ద ప్రేమున్నట్టు నంగనాచి మొహం పెట్టి 'ఇదేం బతుకయ్యా నీది?' అనడిగాడు. 'నాకు ఓటేస్తే నీ ఇళ్లంతా వెలుగులతో నిండిపోదూ? నీ బతుకంతా బంగారం కాదూ?' అన్నాడు. ఈ వెర్రి సామాన్యుడు పాపం... నిజమేననుకున్నాడు. ఆ మరాఠీగాడి మాయ మాటలు నమ్మి ఓటేశాడు. అంతే! ఇక తేరుకోలేదు. నాలుగున్నరేళ్లుగా ఇదిగో... ఇలా కునారిల్లిపోతున్నాడు''

''అవునా పాపం? అప్పుడేమైంది?''

''ఏముందీ? ఆ మాయ మాటలగాడు రాజయ్యాడు. వాడి తోటి వాళ్లందరూ మంత్రులయ్యారు. అనుయాయులంతా నేతలయ్యారు. అనుచరులంతా గూండాలయ్యారు. ఆ తర్వాత మొదలైంది దిక్కుమాలిన పాలన. సామాన్యుడి దగ్గరకొచ్చి 'ఇదిగో ఈ పథకాలన్నీ నీకోసమే పెట్టామన్నారు...'. మనవాడు సంబరపడ్డాడు. ఆ పథకాల వల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు. కానీ దాని పేరు చెప్పి మాయల మరాఠీగాడి అస్మదీయులంతా డబ్బులు నొల్లుకున్నారు. సామాన్యుడి పేరు చెప్పి ఏవేవో కాంట్రాక్టులు ఎవరెవరికో ఇచ్చారు. ఆ కాంట్రాక్టులు పుచ్చుకున్నోళ్లంతా మాయల మరాఠీకి వాటాలిచ్చుకున్నారు. వాటి పేరు మీద ఖజానా సొమ్మంతా పంచుకున్నారు. మరాఠీ ఆస్తులు అంతకంతకు పెరిగాయి. వాడి అనుచరుల ఇళ్లన్నీ బంగారంతో నిండాయి. మన సామాన్యుడు మాత్రం ఇదిగో ఇలా వేలాడిపోయాడు. అర్థమైందా?'' అంచి చిల్లుల సంచీ.

కాకరపువ్వొత్తు కిమ్మనలేదు. ఇంతలో మతాబు లేచి నుంచుంది.

''ముత్యాలు రాల్చే మతాబానండీ... వెలుతురు రవ్వల వెన్నెలనండీ... వెలిగిస్తే చాలండీ.. వెలుగులన్ని మీవండి'' అంటూ పాడింది.

''ఏడిశావ్‌...'' అంది సామాన్యుడి చిల్లుల సంచీ. మతాబా తెల్లబోయింది.

''ఈ ఇంట్లో అలుముకున్న చీకట్ల ముందు నీ వెలుగులేపాటి? మాయ మాటల మరాఠీ అరాచక పాలన వల్ల ఇక్కడ అంధకారం చిట్లం కట్టేసింది. సామాన్యుడు చూడు పాపం... ఎలా చిక్కిపోయాడో. పండగ పూటయినా పప్పన్నం తినడంలేదు. ఒళ్లు హూనం చేసుకుని పదో పరకో సంపాదించినా చెత్త పన్నుల వల్ల ఇల్లు గుల్లయిపోతోంది. 'మీట నొక్కి డబ్బులు వేస్తున్నాను కదా?' అంటున్నాడు మరాఠీగాడు. కానీ అంతకు పదింతలు పిండేసుకుంటున్నాడు. నాలుగున్నరేళ్లలో ధరలన్నీ పెరిగిపోయి ఆకాశంలో చుక్కల్లా మినుకు మినుకుమంటున్నాయి. కొందామంటే కూరగాయలు కస్సుమంటున్నాయి. నూనెలు నొసలు చిట్లిస్తున్నాయి. బియ్యం బేరుమనిపిస్తోంది. పప్పులు పకపకా నవ్వుతున్నాయి. తెలిసిందా?''

మతాబా మాట పడిపోయింది. ఈసారి తారాజువ్వ నోరు విప్పింది.

''పైపైకి నేను పాకిపోతాను... నింగి అంచుకు చేరి తొంగి చూస్తాను... వేసిన వాడికి విజయమవుతాను... వాడి పెదవుల మీద నవ్వునవుతాను...''

''ఏడిశావ్‌... '' అంది చిరుగుల సంచీ చికాగ్గా.

''ఈ రాజ్యంలో సామాన్యుడికి విజయాలు లేవు, మాయ మాటల మరాఠీగాడికి ఓటేసినప్పుడే ఈ సామాన్యుడు ఓడిపోయాడు. ఈ నాలుగేళ్ల నుంచీ  నవ్వూ లేదు, తుళ్లూ లేదు. ఏం చేస్తాడు పాపం?  ఎప్పుడెవడొచ్చి రేషను బియ్యం కూడా పట్టుకుపోతాడో, ఏ రిజిస్టేషన్పేరు చెప్పి డబ్బులు కక్కమంటాడో, వన్టైమ్సెటిల్మెంటంటూ సొమ్ములు గుంజుకుంటాడో, ఉంటున్న ఇంటికి కూడా రుసుము కట్టాలంటాడో, తాతల నాటి స్థలానికి కూడా తాఖీదులిస్తాడో అని గుబులే.  ఈ సామాన్యుడి కష్టాల కథ అర్థమైందా?''  తారాజువ్వ చతికిలపడిపోయింది.

ఈసారి బాంబొకటి బోర విరుచుకుని లేచి నిలబడింది.

''బాంబును నేను... ఢామ్మంటాను... భయపెడతాను... బెదిరిస్తాను... హహ్హహ్హా!'' అంటూ నవ్వసాగింది.

''ఏడిశావ్‌...'' అంటూ సంచీ గద్దించింది. బాంబు బిత్తరపోయింది.

''నువ్వెంత పేలినా ఈ సామాన్యడిని భయపెట్టలేవు. ఎందుకో తెలుసా? మాయ మాటల మరాఠీ అరాచక పాలనలో అడుగడుగునా భయాలే. అనుక్షణం బెదిరింపులే. అదేమని అడిగితే చాలు, అడ్డగోలు కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తే చాలు, చితగ్గొడుతున్నారు.  ఒకడొచ్చి భయపెడతాడు. మరొకడొచ్చి జులుం చేస్తాడు. 'నువ్వు మరో పార్టీ వాళ్ల సభకెళ్లావుగా? నీ సంగతి చూస్తా' అంటాడు. ఈలోగా ఇంకొకడొచ్చి  వాలంటీర్నంటాడు. నా మాట వినకపోతే నీ పేరు లిస్టులో ఉండదంటాడు. పథకాల జాబితా అయినా, ఓటర్ల జాబితా అయినా ఎప్పుడు తన పేరు మాయమవుతుందోననే భయమే. ఇన్ని భయాల మధ్య నీ మోతెంత?'' అంది.

ఆ సరికి సంచీలోంచి బయటకొచ్చిన బాణసంచా సరుకులన్నింటికీ నీరసమొచ్చేసింది. అన్నీ కలిసి సంచీ చుట్టూ చేరి, ''ఇదేంటి? మేమెంతో సంతోషంగా వచ్చామే? ఈ ఇంటి ముంగిట్లో పండగ సంబరాలిద్దామని ఆశ పడ్డామే? మరి ఈ సామాన్యుడి కష్టాలేంటి, ఇంత దారుణంగా ఉన్నాయి? ఇక మేమొచ్చి ప్రయోజనం ఏమిటి?'' అన్నాయి ముక్తకంఠంతో.

''ఏడిశారు...'' అంచి సామాన్యుడి సంచి. ఆపై ఒళ్లంతా చిల్లులతో నవ్వుతూ, ''మీరేం బెంగపడకండి. ఈ సామాన్యుడి బాధలన్నీ ఇక తీరినట్టే. ఇది ప్రజాస్వామ్యం. ఐదేళ్లకోసారి ఎన్నికలొస్తాయి. మాటల మరాఠీ మాయదారి పాలన చివరి దశకొచ్చింది. మనవాడికి కూడా అంతా అర్థమైంది. ఇక ఎలాంటి హామీలు విని మోసపోయే స్థితిలో లేడు. నాలుగున్నరేళ్లలో తన బతుకు ఎలా చితికిపోయిందో అర్థం చేసుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో తన దగ్గరున్న ఓటును సరిగ్గా ఉపయోగించి నిజమైన దీపావళి పండగ చేసుకుంటాడు. అతడి దగ్గరున్న ఆ ఓటే రవ్వలు రువ్వే కాకరపువ్వొత్తు. ఆ ఓటే వెలుగులు తెచ్చే మతాబా. ఆ ఓటే తన ఆశల్ని ఆకాశానికి తీసుకెళ్లే తారాజువ్వ. ఆ ఓటే అరాచక పాలకుల గుండెల్లో ఢామ్మని పేలే బాంబు. ఆ ఓటే చైతన్యంతో విష్ణుచక్రమై అరాచక పాలకుల అంతు చూస్తుంది. ఆ ఓటే భూచక్రమై తెలివిగా నీచ పాలకులకు కాళ్లలో నిప్పులు పోసి తరిమికొడుతుంది'' అంది.

బాణసంచా సరుకులన్నీ సంబరపడ్డాయి.

ఈలోగా సామాన్యుడికి మెలకువ వచ్చింది. కలలోంచి వాస్తవంలోకి వచ్చి తెలుసుకున్నాడు.

''నిజమే నా ఓటుతో నేనే నిజమైన దీపావళి తెస్తా'' అంటూ బజారుకి బయల్దేరాడు బాణసంచా కొనడానికి!

-సృజన

PUBLISHED ON 12.11.2023

ఆదివారం, నవంబర్ 05, 2023

పొలిటికల్‌ క్రిటికల్‌ క్రికెట్‌!


''ఏరా... నిన్న రాలేదు? అప్పుడే రాజకీయాల్లో రాటుదేలిపోయాననుకున్నావా? పాఠాలు నేర్చుకునేప్పుడే ఇంత అశ్రద్ధయితే, రేప్పొద్దున్న సీఎం అయితే ఇంకేం సంపాదిస్తావ్‌?''

''అయ్యబాబోయ్‌... కోప్పడకండి గురూగారూ! ఎప్పటికైనా నన్నొక నికార్సయిన నీచ నేతగా తీర్చిదిద్దుతారనుకుంటే, ఒక్క రోజు రాకపోతేనే ఇలా తిట్టేస్తే ఎలాగండీ?''

''ఒరేయ్‌. జీవితమే చిన్నది. అందునా కుర్చీ మీద కులాసాగా కూర్చోగలిగే కాలం ఇంకా చిన్నది. పట్టుమని ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి. ఒక్క రోజు వేస్టు చేసినా వేలాది కోట్లు చేజారిపోతాయి. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందు ఈ సంగతి గుర్తెట్టుకోవాలి. అలాంటిది ఆలు లేదు సూలు లేదు స్టూడెంటు దశలోనే డుమ్మాలు కొడితే ఇంకేం ఎదుగుతావురా? ఇంతకీ నిన్నెందుకు తగలడలేదో చెప్పేడవ్వేం?''

''అబ్బే... ఏం లేదు గురూగారూ! క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి కదండీ. నిన్న ఇండియా మ్యాచ్ఉందండి. అది చూద్దామని రాలేదండి...''

''ఏడిసినట్టుంది. ఇంటర్నేషనల్క్రికెట్గేమ్కాదురా మనక్కావలసింది, పొలిటికల్క్రిటికల్గేమ్కావాలి. అందులో నువ్వు ప్రపంచ ఛాంపియన్కావాలనేది ఆ కోరిక. నువ్వు చూస్తే వన్డే మ్యాచులు చూస్తూ, పోలిటిక్స్క్యాచ్లు వదిలేసేలా ఉన్నావు. అదే నా బెంగ''

''అమ్మమ్మ... అంతమాటనకండి గురూగారూ! ఇక ఎప్పుడూ మీ క్లాసులు మానేయనండి. శాంతించి పాఠం చెప్పండి...''

''సర్లె... నిన్న నువ్వు చూసిన మ్యాచ్సంగతేంటో చెప్పు...''

''అబ్బబ్బబ్బ... ఏం మ్యాచ్గురూగారూ! మనోళ్లు అదరగొట్టేశారండి. ఏకంగా మూడొందల పరుగుల తేడాతో గెలిచారండీ బాబూ. బౌండరీలు, సిక్సర్లతో చితగ్గొట్టేశారండి. ఇక బౌలింగ్ఏం చేశారండీ బాబూ. అందర్నీ ఆలౌట్చేసేశారండి. నిజంగా చూసి తీరాల్సిన మ్యాచండి. ఆయ్‌...''

''బాగుందిరా. ఒరే ఇంతకీ నువ్వు కానీ క్రికెటరయ్యావనుకో. మంచి బౌలరవుతావా? బ్యాట్సమన్నవుతావా?''

''అబ్బే... నాకసలు సరిగ్గా క్రికెట్టే రాదండి. ఊరికే చూసి ఆనందపడ్డమేనండి...''

''ఏడిశావ్‌. క్రికెట్ సంగతలా ఉంచితే, పొలిటికల్క్రికెట్లో మాత్రం నువ్వు ఆల్రౌండర్కావాలిరా, మీ అధినేతలాగా అర్థమైందా?''

''సార్‌... అంటే అన్నానంటారు కానీ, మా అధినేతకి, ఈ క్రికెట్కి ఏంటండీ సంబంధం?''

''ఎందుకు లేదురా? రాజకీయమన్నాక అన్నాటలూ ఆడాలి మరి. అందులోనూ నీ పరగణాలో అధికారం చేపట్టి నాలుగేళ్లుగా పొలిటికల్క్రిటికల్క్రికెట్ఆడుతున్న మీ జగజ్జెంత్రీ 'జె' టీమ్ గురించి ఎంతైనా చెప్పుకోవాలి. అరాచకంలో మీవాడు ఆల్రౌండరు కదరా? ఆయనే నీకు ఆదర్శమొరేయ్‌. ఇండియన్టీమ్ఆడే వన్డే కాదురా, మీ నేత ఆడే తొండియన్ఫైవ్డే క్రిటికల్ఆటనే  నువ్వు లైవ్లో చూస్తుండాలి.   నీకు అసలు క్రికెట్వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ ఇది మాత్రం నేర్చుకోవలసిందే...''

''అర్థమైంది గురూగారూ! మాటల్లో పెట్టి మీరు పాఠం మొదలెట్టేశారండి. మరయితే చెప్పండి రాసుకుంటాను...''

''ఏముందిరా నిన్న నువ్వు చూసిన ఆటలో మన వాళ్లందరూ టీమ్స్పిరిట్చూపించారు కదా? మరి మన 'జె' టీమ్లో మాత్రం ఇది తక్కువా చెప్పు? కెప్టెన్గ్యాలరీలోంచి సైగ చేస్తే చాలు, దాన్నందుకుని మంత్రులు, నేతలు అల్లుకుపోవడం లేదూ? ఎవడైనా ఏదైనా సమస్య గురించి ప్రస్తావించగానే మీ వాడు ముసిముసిగా ఓ నవ్వు నవ్వుతాడు. దాంతో ఆయన అనుచరులందరూ ఆ ప్రశ్నించిన వాడిని ఆడిపోసుకుంటూ ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెట్టి తిట్ల పురాణం అందుకుంటున్నారా లేదా? మరందంతా ఫాస్ట్బౌలింగ్లాంటిదే కదా? ఎవరినైనా నోరెత్తనిస్తున్నారా అని. ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్న ఆ సమస్యనో, ఆరోపణనో పరిశీలించి పరిష్కరిద్దామని ఎక్కడైనా ఉందా? అందులో నిజాల్ని మరుగున పెట్టేసి, అబద్ధపు అంకెల ప్రచారంతో జనాన్ని గందరగోళం చేయడం లేదూ? మరి దీన్ని మించిన 'రివర్స్స్వింగ్‌' ఫాల్స్బౌలింగ్ఎక్కడుంటుంది? పాపం ఎగస్పార్టీ బ్యాట్స్మన్ఆడడానికి నుంచున్నాడనుకో, మీ నేతలు బౌలింగ్ పద్ధతి ప్రకారం చేస్తున్నారా అని? బౌలర్పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాట్స్మన్ని తోసేసి, అక్కడున్న వికెట్లు బంతితో కొట్టేసి, 'నువ్వు ఔటయిపోయావ్‌... పో' అంటున్నారు. వెళ్లకపోతే బరబరా ఈడ్చుకుపోయి గ్రౌండు బయటకి నెట్టేస్తున్నారు. మామూలు క్రికెట్లో ఒకసారి ఒకడే బౌలింగ్చేస్తాడు. మరి మీ వాడి పాలనలో మంత్రులు, అనుచరులు, నేతలు అందరూ ఒకేసారి బౌలింగ్చేసేస్తున్నారు కదా? 'జె' టీమ్తొండాటలో అడుగడుగునా కనిపించే ఈ టీమ్స్పిరిట్ను నువ్వు చూసి నేర్చుకోవాలి. రేప్పొద్దున నువ్వు సీఎం అయ్యావనుకో, మీ టీమ్అందరికీ ఇలాంటి ఆటే నేర్పాలి మరి. అర్థమైందా?''

''అర్థమైంది కానీ గురూగారూ! మీరు బొత్తిగా ఇండియన్క్రికెట్ టీమ్ని ఈ అరాచక పొలిటికల్టీమ్తో పోల్చడం నాకు నచ్చలేదండి...''

''ఓరెర్రోడా! నేను నీకంటే ఎక్కువగా ఇండియన్క్రికెట్టీమ్అభిమానినిరా. కానీ రాజకీయ పాఠం నేర్చుకునేప్పుడు నిజమైన ఆట గురించి చెప్పుకుంటే ఎలారా? అందులోంచి మనం నీచమైన టీమ్స్పిరిట్టే తీసుకోవాలి. మధ్యలో అడ్డొస్తావేంట్రా బడుద్ధాయ్‌...''

''బుద్ధొచ్చింది చెప్పండి సార్‌. మరయితే బ్యాటింగ్గురించి కూడా చెప్పండి మరి...''

''అందులో కూడా మీ నేత తక్కువవాడేం కాదురోయ్‌. అధికారం అందుకుంటూనే అడ్డదిడ్డమైన బ్యాటింగ్మొదలెట్టాడు. ప్రతిపక్షాలు బౌల్చేయడానికి వీల్లేకుండా వికెట్లకి అడ్డంగా నుంచున్నాడు. ఏదైనా బాలొస్తే చాలు అటు కాళ్లతోను, ఇటు బ్యాటుతోను కొట్టేస్తున్నాడు. అలా ఆడకూడదంటే వింటున్నాడా? నా ఆట నా ఇష్టం అంటున్నాడు. మేం అధికారంలోకి వస్తే చాలా బాగా ఆడి చూపిస్తామంటే ఆశపడి అవకాశమిచ్చి ఆశతో గ్యాలరీలోకి వచ్చి కూర్చున్న అఖిలాంధ్ర ప్రేక్షకులంతా బిత్తరపోయేలా ఇష్టమొచ్చినట్టు ఆడేస్తున్నాడు. వస్తూనే ఆట  నిబంధనలన్నీ మార్చేశాడు.  ఎదుటి వాడు బంతేయడానికి వస్తుంటేనే ఎదురెళ్లి వాడి చేతిలో బంతి లాక్కుని బ్యాటుతో బాదేసి బౌండరీ వచ్చేసిందంటున్నాడు. లేదా ఆ బంతిని పట్టుకుని తానే పరుగెత్తికెళ్లి బౌండరీ లైన్అవతలకి విసిరేసి సిక్సర్అని అరుస్తున్నాడు.  ఒకోసారి బ్యాటుతో బౌలర్తల బద్దలు కొట్టేస్తున్నాడు. వీళ్లు ఆడే ఆటకి ఎంపైర్లు కూడా ఏమీ చేయలేక పోతున్నారు. ఎందుకంటే మీ వాడు ముందరగానే వాళ్లని బెదిరించి మచ్చిక చేసేసుకున్నాడు మరి. అసలు మీ వాడు ఆడే పొలిటికల్క్రిటికల్క్రికెట్లో ఓ రూలూ లేదు, పాడూ లేదు. ప్రతిపక్షం టీమ్వాళ్లు గ్రౌండులో ఫీల్డింగుకి పొజిషన్స్లో నిలబడితే వాళ్ల మీద అడ్డమైన కేసులు బనాయించి తరిమి తరిమి కొడుతున్నాడు. మీ వాడు ఆడుతుంటే అసలు మైదానంలో ఫీల్డర్లు అంటూ ఎవరూ ఉండకూడదన్నంత దౌర్జన్యంగా బ్యాటింగ్చేస్తున్నాడు.  ఎవరైనా థర్డ్ఎంపైర్నిర్ణయం కోసం క్లెయిమ్చేస్తే డెసిషన్తీసుకునే లోగానే అక్కుడున్న స్క్రీన్లు బద్దలు కొట్టేస్తున్నాడు. అక్రమ కేసులు, కోర్టుల నిర్ణయాలపై కూడా ధ్వజమెత్తడాలు ఇలాంటివే కదరా? రాజకీయాలు నేర్చుకోవాలనుకుంటున్న నువ్వు చూడాల్సింది ఈ కిరికీల కిరికెట్టుని రా సన్నాసీ! తెలిసిందా?''

''వార్నాయినో! ఎలాంటి క్రికెట్చూపించారండీ బాబూ. దిమ్మతిరిగిపోతోంది. అయినా నాకు తెలియక అడుగుతాను గురూగారూ, చూస్తూ చూస్తూ అసలు ఆట రాని ఇలాంటి వాళ్లని ఎలా గ్రౌండులోకి రానిచ్చారండీ జనం? ఇప్పుడు వీళ్ల అడ్డదిడ్డమైన ఆట చూడలేక గ్యాలరీలోంచి ఎన్ని కేకలేస్తే మాత్రం ఏం లాభమండీ?''

''అదేరా నువ్వు నేర్చుకోవలసింది. అసలు తనకు ఆట రాదని సంగతి తెలియనీకుండా... 'ఒక్కసారి ఛాన్సిచ్చి చూడండి. కనీవినీ ఎరుగని ఆట ఆడి చూపిస్తా' అంటే... పాపం నిజమనుకుని నమ్మార్రా వెర్రిజనం. వాళ్లనలా మభ్యపెట్టి, మాయ చేసే టక్కుటమార మాటల గారడీ విద్య నేర్చుకోవాలిరా ముందు నువ్వు. అప్పుడే పవర్పోలిటిక్స్గేమ్లోకి ఎంటరవగాలవు. ఒకసారి జనాన్ని నమ్మించి అధికారమనే మైదానంలోకి రాగలిగావా, ఇదిగో ఇలాంటి నీచ నికృష్ట నిబంధనలు పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. పైకి ప్రజల కోసమే ఆటాడుతున్నట్టు ప్రచారం చేసుకుంటూ, టికెట్ డబ్బులన్నీ దోచుకోవచ్చు. ఆపై గ్యాలరీ తలుపులు మూసేసి నీకు ఎదురాడే టీమ్అనేదే లేకుండా చేసి, వాళ్లని చితకబాదుతూ అధికార అరాచక అఘాయిత్య అక్రమ క్రీడా విన్యాసాలతో చెలరేగిపోవచ్చు. ఆపై నువ్వు బ్యాట్పట్టుకుంటే బౌండరీలు, సిక్సర్లు నీవే. ఇక నువ్వు బంతి పట్టుకుంటే ఎదుటివాడిని ఎల్బీడబ్ల్యూ అంటావో, రనౌట్అంటావో, డకౌట్అంటావో, స్టంప్స్ఎగరగొడతావో నీ చిత్తం. అడిగేవాడెవడు? అడ్డుకునే వాడెవడు? ఆంధ్రా పొలిటికల్క్రిటికల్క్రికెట్గేమ్లో ఆరితేరాలంటే నువ్వు కూడా ఇలాంటి కిరికెట్కిటుకులే నేర్చుకోవాలి. బుర్రకెక్కిందా?''

''బుర్ర గిర్రున తిరుగుతోందండీ బాబూ. కానీ చివరాఖరిగా నాదొక సందేహమండి. మరీ ఇంత చెత్తగా, చెడ్డగా, చెండాలంగా ఆడితే ఎంత కాలం సాగుతుందండీ? ప్రజలు గమనించలేరంటారా?''

''మంచి ప్రశ్న వేశావురా. ఒక్కటి మాత్రం తెలుసుకో. గ్యాలరీలోకి వచ్చి ఆట చూస్తున్న జనమంతా అమాయకులనుకోకు. వాళ్లు నీ నేతని  మించిన ఫాస్టు బౌలర్లు. నీ నాయకుడిని మించిన బ్యాటింగ్నిపుణులు. వాళ్ల చేతిలో ఓటు అనే కార్క్బాల్ఉంది. దాన్ని సరిగా స్పిన్చేశారంటే నిన్నేలుతున్న నీచ నేతల వికెట్లు అన్నీ విరిగి అవతల పడతాయి. ప్రజలనే పేస్బౌలర్ల ముందు నువ్వెంత, నీ నేత ఆటెంత? ఇక జనం గనుక నీ నేత నిజస్వరూపం తెలుసుకుని ఓటింగనే బ్యాటింగ్చేశారనుకో. నెత్తికెక్కి తైతక్కలాడుతున్న నేతలందరూ బౌండరీలు దాటి పరుగులు పెట్టాల్సిందే. ఏకంగా ఎగిరి గ్రౌండ్కి అవతల పడాల్సిందే. ప్రజాస్వామ్యమనే ఆ అసలైన క్రికెట్ఆట త్వరలోనే మొదలవుతుంది. అప్పుడు చూద్దువుగాని అసలైన లైవ్ఆట! అరాచక నేతల ఆటకట్టించే నిజమైన నికార్సయిన 'ఇంటర్నల్విన్డే డెమొక్రటికల్క్రికెట్ఆట!!''

-సృజన

PUBLISHED ON 5.11.2023 ON JANASENA WEBSITE