ఆదివారం, సెప్టెంబర్ 26, 2021

గెలిచిన‌ట్టా? ఓడిన‌ట్టా?

 


గురూగారూ! నాకో సందేహం వ‌చ్చిందండి... అడ‌గ‌మంటారా?”

అడ‌గ‌రా శిష్యా! సందేహాల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌కూడ‌దు. పైగా నువ్వు అడిగే ప్ర‌శ్న‌ని బ‌ట్టే నీ స్థాయి ఏంటో కూడా తెలుస్తుంది. అడుగు..

ఏం లేదు గురూగారూ! గెలిస్తే అధికారం వ‌చ్చిన‌ట్టా? లేక అధికారం వ‌చ్చాక గెలిచిన‌ట్టా?”

వార్నీ... భ‌లే చిక్కు ప్ర‌శ్నే వేశావురా! పైకి అర్థం కాన‌ట్టు క‌నిపిస్తుంది కానీ, నీ ప్ర‌శ్న ఆవులిస్తే పేగులు లెక్క‌పెట్ట‌గ‌లిగేలా ఉందిరా. ప‌ర్వాలేదు. ఇన్నాళ్లూ నా ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు నేర్చ‌కుంటున్నందుకు కాస్తో కూస్తో ఇంగితం ఉన్న ప్న‌శ్నే వేశావు. అయితే చెబుతాను విను. గెలుపు, అధికారం ఒక‌దానితో ఒక‌టి పెన‌వేసుకుని ఉంటాయిరా. వీటిలో ఏ ఒక‌టి సాధించినా, రెండోది ద‌క్కుతుంది. ఏ ఒక‌టి దూర‌మైనా, రెండోది కూడా దూర‌మవుతుంది...

అయితే గురూగారూ! ఈ రెండింటిలో ఏది ముఖ్యమండీ? దేని కోసం ముందుగా ప్ర‌య‌త్నించాలి?”

చంద‌మామలో బేతాళ క‌థ‌లు చ‌దువుకుని చ‌క్కా వ‌చ్చావేంట్రా? ఇలా ప్ర‌శ్న మీద ప్ర‌శ్న సంధిస్తున్నావ్‌? నీ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలియాలంటే ముందు గెలుపంటే ఏంటో, అధికారం అంటే ఏంటో అర్థం కావాలిరా. ఇప్పుడు ఈ రెండింటిమీదా నీ అభిప్రాయ‌మేంటో చెప్పు. దాన్ని బ‌ట్టే నా స‌మాధానం ఉంటుంది...

స‌రే గురూగారూ! నా దృష్టిలో గెలుపంటే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మేనండి. ఇక అధికారం అంటే కుర్చీ ఎక్క‌డమేనండి..  అంతేనంటారా?”

సాధార‌ణంగా అంతేరా కానీ, ఒకోసారి గెలిచినా ఓడిపోయిన‌ట్టే... ఓడిపోయినా గెలిచిన‌ట్టే. అలాగే ఒకోసారి అధికారం చేజిక్కినా గెల‌వ‌న‌ట్టే. కుర్చీ మీదే ఉన్నా ఓడిన‌ట్టే... అర్థమైందా?”

అయ్‌బాబోయ్‌! ఇదేంటండి బాబూ, ఇలా చెబుతున్నారు? మీ మాట‌ల్లో మ‌త‌ల‌బులు నా మ‌ట్టి బుర్ర‌కు అర్థం కావండి... కాస్త మీరే వివ‌రించి పుణ్యం క‌ట్టుకోండి...

అలారా దారికి! లేక‌పోతే అడిగేవాడికి చెప్పేవాడు లోకువైన‌ట్టు అడిగితే ఎలారా? ఇంత‌కీ నీ బుర్ర‌లోకి ఈ సందేహం ఎందుకొచ్చిందో ముందు చెప్పు...

ఏం లేదు గురూగారూ! మొన్న స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి క‌దండీ? ఆ హ‌డావుడి అదీ చూస్తే అలా అడ‌గాల‌నిపించిందండి అంతే... ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో భారీగా గెలిచామంటూ అధికార ప‌క్షం జ‌బ్బ‌లు చ‌రుచుకుంటోంది క‌దండీ... మ‌రి అది గెలుపు కాదంటారా?”

ఆ సంగ‌తి కాసేపు అలా ఉంచ‌రా.  అల‌నాటి మ‌హాభార‌తంలో జూదంలో కౌర‌వులు గెలిచారు క‌దా, మ‌రి అది గెలుపు కాదంటావా? అది చెప్పు ముందు...

ఛ‌... ఛ‌... అదీ ఓ గెలుపేనండీ... మాయా జూదం కాదుటండీ? చెప్పిన‌ట్టు వినే పాచిక‌లతో మోసం చేసి గెలిస్తే దాన్ని గెలుప‌ని ఎలాగంటాం?”

అంటే దాన‌ర్థం ఏమిటి? నైతికంగా కౌర‌వులు ఓడిపోయిన‌ట్టేగా? అందుకే గెలుపు, ఓట‌మి, అధికారాల‌ను పైకి క‌నిపించే అంకెల్ని బ‌ట్టి అర్థం చేసుకోకూడ‌దురా. లోప‌లి అంత‌రార్థం ఏంటో చూడాలి. అర్థ‌మైందా?”

అయిన‌ట్టే ఉంది కానండీ, ఇంత‌కీ మ‌న ఆంధ్ర రాజ‌కీయ భారతంలో మొన్న‌టి స్థానిక ఎన్నిక‌ల‌సంగ‌తి కూడా ఇలాంటిదేనంటారా?”

నేన‌డం కాదురా శిష్యా! నామినేష‌న్ల ప్ర‌క్రియ నుంచి కౌంటింగ్ వ‌ర‌కు అత్య‌ధిక చోట్ల ఏం జ‌రిగిందో ఓ సారి గుర్తు చేసుకో.  అటు కీలుబొమ్మలుగా మారి చెప్పిన‌ట్టు వినే పోలీసు యంత్రాంగంతోను, ఇటు విర్ర‌వీగి చెల‌రేగే అనుచ‌ర గ‌ణంతోను అడుగ‌డుగునా ఎన్ని బెదిరింపులు, దాడులు, దౌర్జ‌న్యాలు జ‌రిగాయో లెక్క పెట్టుకో. స్వ‌యానా మంత్రులు కూడా రంగంలోకి దిగి, స‌ర్వ శ‌క్తులు మోహ‌రించి బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాలు ఎన్నెన్ని చోట్ల చేయించారో లిస్టు రాసుకో. ప్ర‌తిప‌క్షం నుంచి ఎవ‌రినీ నామినేష‌న్ వేయించ‌కుండా ఎక్క‌డెక్క‌డ ఎలా అడ్డుకున్నారో జ్ఞాప‌కం చేసుకో. వేరే వాళ్ల‌కి ఓటేస్తే పింఛ‌న్లు ఆపేస్తాం, రేష‌న్ క‌ట్ చేస్తాం, ఇళ్ల స్థ‌లాలు నిలిపేస్తాం అంటూ ఎలా రెచ్చిపోయి ఎక్క‌డిక‌క్క‌డ జ‌నాన్ని ఎలా హ‌డ‌లుగొట్టారో అర్థం చేసుకో. ఆ త‌ర్వాత చెప్పు అది గెలుపో, ఓట‌మో?”

ఆ... ఇప్పుడు మీరిందాకా అన్న మ‌త‌లబు మాట‌లు అర్థ‌మ‌వుతున్నాయండి. ఇలాంటి వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాక గెలిచినా ఓడిన‌ట్టేనండి. అలాగే అధికారం చేతిలో ఉంటే ఇలాంటి అడ్డ‌గోలు గెలుపులెన్నో కాతాలో వేసుకోవ‌చ్చ‌ని కూడా అర్థ‌మైందండి. అధికారం, గెలుపు ఎలా పెన‌వేసుకుని ఉంటాయో తెలిసిందండి...

మ‌రింత‌కి మించిన నీచ రాజ‌కీయ పాఠం నీకింకేముంటుందిరా? బాగా ఒంట‌బ‌ట్టించుకో...

బాగుంది గురూగారూ! అంటే అధికారమ‌నే కుర్చీ ఎక్కాక ఇక ఏం చేసినా చెల్లుతుంద‌న్న‌మాటండి... మ‌రి ఇందాకా మీరు కుర్చీ మీద ఉన్నా ఓడిన‌ట్టే అన్నారు క‌దా, అదెలాగండీ?”

అది అర్థం కావాల‌న్నా నువ్వు ఆంధ్ర రాజ‌కీయ మ‌హా భార‌తం క్షుణ్ణంగా అవ‌గ‌తం చేసుకోవాలిరా... నువ్వే గ‌మ‌నించు... భారీ అంకెల‌తో గెలిచి అధికారం చేజిక్కించుకున్నా, ఏం జ‌రుగుతోంది?  పైకి ప్ర‌జాస్వామ్యం క‌బుర్లు, చేసేది నియంత నిర్వాకం. జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల‌తో రూపాయి ఆశ చూపించి, కోట్ల‌కు కోట్లు దోచుకునే వ్య‌వ‌హారం. అడ్డ‌గోలు ప‌న్నుల‌తో ప్ర‌జ‌ల న‌డ్డి విర‌గ్గొట్టే దాష్టీకం. రాష్ట్రాన్ని దివాళా అంచుకు తీసుకుపోతున్న అవ‌క‌త‌వ‌క‌ల విధానం. ఒక్క ప‌రిశ్ర‌మ‌నైనా తీసుకురాలేని దౌర్భాగ్యం. పైగా ఉన్న ఫ్యాక్ట‌రీలు, పోర్టులు, భూములు అయిన వారికి దోచి పెట్టే తెంప‌రిత‌నం. అటు వైద్య ప‌రంగా కానీ, ఇటు చ‌ట్ట ప‌రంగా కానీ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ, భ‌ద్ర‌త క‌ల్పించ‌లేని నిర్ల‌క్ష్యం. నోరెత్తిన వాడిపై దాడులు చేసే నికృష్టం. అడిగిన వాడిపై అడ్డ‌మైన కేసులు బ‌నాయించే బ‌రితెగింపుత‌నం. స‌మ‌స్య‌ల మాటెత్తితే గూండాగిరీ చేసి నోరు మూయించాల‌ని చూసే నైచ్యం. ఇలా ఎటు చూసినా అగ‌మ్య‌గోచ‌రంగా ఉన్న పాల‌న సాగుతున్న‌ప్పుడు కుర్చీ మీద బాసింప‌ట్టు వేసుకుని కుర్చున్నా దాన్ని గెలుప‌నాలా? ఓట‌మ‌నాలా?”

అవునండోయ్‌... అస‌లైన గెలుపంటే ఏంటో బాగా అర్థ‌మైందండి. నిజ‌మైన ఓట‌మంటే ఏంటో తెలిసిందండి. మొత్త‌మ్మీద ఇవాల్టి పాఠం భ‌లేగా ఉంది గురూగారూ!

పాఠం ఇంకా అయిపోలేదురా బ‌డుద్దాయ్‌. ఇంత‌కీ నువ్వు గెల‌వాల‌నుకుంటున్నావా? ఓడాల‌నుకుంటున్నావా? అది చెప్పు ముందు...

ప్ర‌జ‌ల మ‌న‌సులు గెల‌వాల‌నుకుంటున్నానండి... అంతేనాండీ?”

ఏడిశావ్‌... న‌వ భార‌త నీచ రాజ‌కీయాల్లో నువ్వు గెల‌వాలంటే ముందు మ‌నిషిగా ఓడిపోవాలి. అధికారం అందుకోవాలంటే నైతికంగా ప‌రాజ‌యం పొందాలి. ఆ అధికారాన్ని కొన‌సాగించుకోవాలంటే నీతిగా ఓట‌మి పాల‌వ్వాలి. నిజాయితీ ప‌రంగా ఓడిపోవాలి. ఇన్ని ర‌కాలుగా ఓడిపోయినా అదే గెలుప‌నుకోవాలి. ఆ గెలుపుతోనే విర్ర‌వీగాలి. ఇదే అస‌లు సిస‌లు పాఠం. ఇది నీకంత తేలిగ్గా అర్థం కాదులే కానీ, ఇవాల్టికి ఇంటికి పోయి ప‌డుకో

-సృజ‌న‌

 PUBLISHED ON 26.09.2021 ON JANASENA WEBSITE

బుధవారం, సెప్టెంబర్ 22, 2021

నేరం, రాజ‌కీయం... చెట్టాప‌ట్టాల్‌!


 

ఏంటో గురూగారూ! పొద్దున్నే పేప‌ర్ చ‌ద‌వ‌గానే మ‌న‌సంతా విక‌ల‌మైపోయిందండి... ఇక నాకు రాజ‌కీయ భవిష్య‌త్తు లేదేమోన‌ని దిగులేస్తోందండి... మీరేదైనా కాస్త ధైర్యం చెబుతారేమోన‌ని ఇలా వ‌చ్చానండి... అంటూ నిరాశ‌గా చ‌తికిలబ‌డ్డాడు శిష్యుడు వ‌స్తూనే.

ఏంట్రోయ్ అంత నిర్వేదం? నీకొచ్చిన క‌ష్టం ఏంటి?” అన్నారు గురువుగారు పడ‌క్కుర్చీలో కూర్చుంటూ.

ఏం చెప్ప‌మంటారండీ... నేనేదో మీ ద‌గ్గ‌ర కాసిని నీచ రాజ‌కీయ పాఠాలు నేర్చుకుని, ఓ బ‌రితెగించిన నేత‌గా ఎదిగి, ఓ నాలుగు త‌రాల పాటు కూర్చుని తిన్నా త‌ర‌గ‌నంత సంప‌ద పోగేసుకుందామ‌ని  ఓ... తెగ ఆశ ప‌డిపోయానండి ఇన్నాళ్లూనూ. కానీ ఇప్పుడు  ఏం చేయాలో అర్థం కావ‌డం లేదండి... ప్చ్‌!

ఇంత‌కీ ఏం వార్త‌లు చ‌దివావురా... అదేడు ముందు...

ఏముందండీ... ఆ సుప్రీం కోర్టు కొత్త న్యాయ‌మూర్తి ఏమ‌న్నారో తెలుసాండీ? రాజ‌కీయాల్లో నేర చ‌రితులపై కేసులు దాఖ‌లు చేయ‌డానికే ఏళ్లూ పూళ్లూ ప‌డుతోంద‌ని గుర్తించేశారండి.  పైగా అలాంటి ప‌రిస్థితులు మార్చ‌డానికి చ‌ర్య‌లు మొద‌లెట్టారండి. న్యాయ విచార‌ణ సంస్థ‌ల్లో సిబ్బంది ఖాళీలు వెంట‌నే పూరించాలన్నారండి. న్యాయ‌మూర్తులను కూడా స‌రిప‌డా నియ‌మించాల‌న్నారండి. రాజ‌కీయ నేరాల‌పై విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టులు కూడా పెట్టేస్తార‌టండి... ఆయ్‌!

పోనీలేరా... ఆయ‌న బాధేంటో ఆయ‌న‌ది. ఆయ‌న‌కు ప‌నులు ఆయ‌న్ని చేసుకోనీ. మ‌ధ్య‌లో నీకెందుకు ఉలుకు?”

అదేంటండీ అలాగంటారు? నేనింకా మీ ద‌గ్గ‌ర స‌రిగ్గా రాజ‌కీయ పాఠాలే నేర్చుకోలేదు. ఎప్పుడు ఆరితేరుతాను? ఎప్పుడు నీచ నేత‌గా ఎదుగుతాను? పోనీ ఎలాగోలా ఎదిగేస‌రికి ఇలా ప్ర‌త్యేక కోర్టులు గ‌ట్రా వ‌చ్చేస్తే నా గ‌తేంటండీ? నేనింక ఏం వెన‌కేసుకోగ‌ల‌నండీ? ఏం కుంభ‌కోణాలు చేయ‌గ‌ల‌నండీ? ఇలా గ‌తిలేక ప్ర‌జాసేవ చేయ‌డానికా చెప్పండి, నేను రాజ‌కీయాలు నేర్చుకుంటుంట‌? ఏంటోనండి బాబూ... దేశ‌మేదో బాగుప‌డిపోతున్నట్టు పీడ‌క‌ల‌లు వ‌చ్చేస్తున్నాయండి...

శిష్యుడి మాట‌ల‌కి గురువుగారు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.

వ‌హార్నీ... అద‌ట్రా నీ భ‌యం? ఒరే వాళ్లు ఇప్పుడే ఇల్లు అల‌క‌డం ప్రారంభించార్రా... అప్పుడే వాళ్ల పండ‌గ రాదులే. నువ్వు నిశ్చింత‌గా ఉండు...

ఏంటో సార్ మీ నిబ్బరం? నాకు మాత్రం నీచ నేత‌లంద‌రూ ఊచ‌లు లెక్క‌బెడుతున్న‌ట్టు భ్ర‌మ క‌లుగుతోందండి...

ఒరే... నీ భ్రమే క‌నుక నిజమైతే, నాకు తెలిసి ప్ర‌త్యేక కోర్టులు కాదురా, ప్ర‌త్యేక జైళ్లు క‌ట్టించాలి... అంత‌లా రాజ‌కీయాలు, నేరాలు జ‌ట్టాప‌ట్టాలేసుకుని చేతులు ప‌ట్టుకుని ఒప్పుల‌కుప్ప తిరిగేస్తున్నాయి...  ఏ పార్టీని తీసుకో, అందులో నేరాల‌తో సంబంధం ఉన్న నేత‌లు పుష్క‌లంగా క‌నిపిస్తారు. ఇంట్లోకి బుర‌ద కాళ్ల‌తో వ‌స్తే క‌డిగేస్తే పోతుంది. కానీ బుర‌ద‌లోనే ఇల్లు క‌ట్టుకున్నామ‌నుకో. ఇక  క‌డిగేదేముంటుంది? అయినా నువ్వు హ‌డ‌లిపోయి ఏడుస్తున్నావు కాబ‌ట్టి, నీకు ధైర్యం చెప్ప‌డానికి కొన్ని ప‌చ్చి నిజాలు చెబుతాను. చెవులు రిక్కించి విను. దేశ‌మ్మొత్తం మీద 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మేల్యేల‌పై ఆర్థిక నేరారోప‌ణ‌లు ఉన్నాయి. పైగా ఈ లెక్క‌లు ఏడెనిమిదేళ్ల క్రితంవి.  ఈ పాటికి వాళ్ల‌కి మ‌రి కొంద‌రు కూడా జ‌తప‌డి ఉండొచ్చు. అంతే కాదు వాళ్లంద‌రినీ మించి పోయి ఆర్థిక  నేరాల్ని నిర్భయంగా, నిస్సిగ్గుగా చేస్తూ కూడా నిక్షేపంగా అధికార పీఠంపై బాసింప‌ట్టు వేసుకుని క‌థ న‌డిపించేస్తున్న నేత‌లు కూడా ఉంటారు. అందుకు నీ ప‌ర‌గ‌ణా అధినేతే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. కాద‌న‌గ‌ల‌వా? అంతెందుకురా సీబీఐ కోర్టుల్లో ఎంపీ, ఎమ్మెల్యేల‌పై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉన్న కేసులే 121. వాటిలో 58 కేసులైతే జీవిత ఖైదు విధించాల్సినంత పెద్ద పెద్ద నేరాలే మ‌రి...

అయ్‌బాబోయ్‌... అవునాండీ? అయితే రేపో మాపో ఇవ‌న్నీ తేలిపోయి, రుజువైపోయి, నిందితులు కాస్తా నేర‌స్థుల‌గా మారిపోతే వాళ్ల‌ని ఎంచుకున్న జనం ఏమ‌నుకుంటారండీ? ఇలాంటి నీచుల్నా మ‌నం ఎన్నుకున్నామ‌ని తెల్ల‌బోరండీ పాపం...

జ‌నానిదేముందిరా పాపం... ఇద్ద‌రి వెధ‌వ‌లో ఒక‌డిని ఎంచుకోక త‌ప్ప‌ద‌నుకున్న‌ప్పుడు ఎవ‌రో ఒక‌రికి ఓటేయ‌క త‌ప్ప‌దు క‌దా? అలాంటి ప‌రిస్థితిలో ప‌డిపోయారా వాళ్లు... అస‌లు జైలు నుంచి బెయిలు మీద వ‌స్తూనే ఊరేగింపుగా బ‌య‌ల్దేరి, దండ‌ల‌తో, డ‌ప్పుల‌తో హంగామా చేస్తూ నామినేష‌న్ వేసి, ఆ త‌ర్వాత గెలిచి మ‌రీ మీసం మెలేస్తున్న నాయ‌కులు ఎంత మంది లేరురా మ‌న  క‌ళ్ల ముందు? నీకింకో సంగ‌తి చెబుతాను వినుకో.  తాజా నాయకులో, మాజీ నేత‌లో ఎవ‌రి మీద అయితేనేం, ప్ర‌స్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులెన్నో తెలుసా? ఏకంగా 4800. వీటిలో కొన్ని కేసులైతే ఏళ్లకేళ్ల త‌ర‌బ‌డి సాగుతూనే ఉన్నాయి. ఇవ‌న్నీ తేలేదెప్పుడువాయిదాల వాయుగుండాల నుంచి తేరుకుని రుజువ‌య్యేదెప్పుడు? ఆ నేర‌నేత‌ల‌కు శిక్ష ప‌డేదెప్పుడు, నువ్వే చెప్పు?”

అవునండోయ్‌... ఈలోగా ఆ నాయ‌కులంద‌రూ ఎంచ‌క్కా రెండు మూడు ఎన్నిక‌ల‌ను చూసి గెలుపు సంబరాలు చేసుకోవ‌చ్చు కూడానూ. అయినా గురూగారూ, నాదో సందేహమండి. మ‌రి తెలిసి తెలిసి ఇలాంటి నీచ‌, నికృష్ట‌, న‌య‌వంచ‌క అభ్య‌ర్థుల‌కు టిక్కెట్లు ఎలా ఇస్తున్నాయండీ రాజ‌కీయ పార్టీలు?”

ఎందుకివ్వ‌వురా? ఈ రోజుల్లో గెల‌వాలంటే డ‌బ్బు వెద‌జ‌ల్లాలి, ఖ‌ర్చు చేయ‌గ‌లిగి ఉండాలి, కింద నుంచి పైదాకా ప్ర‌లోభ పెట్ట‌గ‌లిగి ఉండాలి. మ‌రి బ‌రిలోకి  దిగిన నేత వీధిలోకి వ‌స్తే హార‌తివ్వ‌డానికి ఓ రేటు, బొట్టు పెట్ట‌డానికి ఓ రేటు, దిష్టి తీయ‌డానికో రేటు, ఆయ‌న‌గారు మీటింగ్ పెడితే లారీల్లో త‌ర‌లి రావ‌డానికో రేటు, ఆ స‌భ‌లో చ‌ప్ప‌ట్లు కొట్ట‌డానికో రేటు, నినాదాలు చేయ‌డానికో రేటు, జేజేలు ప‌ల‌క‌డానికో రేటు... ఇలా అడుగ‌డుగునా ల‌క్ష‌లు, కోట్లు విరిజిమ్మాల్సి ఉంటే... నీతులు చెబుతూ, నిరాడంబ‌రంగా, విన‌యంగా, న‌మ‌స్కారం పెట్టి ఓట‌డిగే స్వ‌చ్ఛ‌మైన అమాయ‌క అభ్యర్థికి  ఏ పార్టీ టికెట్ ఇస్తుందిరా?”

మ‌రైతే గురూగారూ, న్యాయ వ్య‌వ‌స్థ కానీ, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కానీ ఏమీ చేయలేవాండీ? ఓ ప‌ద్ధ‌తి, ఓ నిబంధ‌న‌, ఓ రూలు ఇలాంటివేమీ లేవంటారా?”

ఎందుకుండ‌వురా అన్నీ ఉంటాయి. కానీ ప‌ట్టించుకునే నాథుడెవ‌డు చెప్పు? అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసిన రెండు రోజుల్లోగా వారి నేర చ‌రిత్ర‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలే ఉన్నాయి.  కానీ మొన్న‌టికి మొన్న జ‌రిగిన బీహార్ ఎన్నిక‌ల‌నే చూసుకో. ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా ప‌ది పార్టీలు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల్లో 469 మంది నేర చ‌రితులే. ఇక చెప్పేదేముంది? కాబ‌ట్టి నువ్వింక  నిశ్చింత‌గా ఉండు. నిబ్బ‌రంగా నీచ రాజ‌కీయ పాఠాలు నేర్చుకో. నీ ద‌శ బాగుండి, జ‌నం ఖ‌ర్మ కాలితే నేత‌గా ఎదుగుతావు...

అమ్మ‌య్య... ఇప్ప‌టికి ధైర్యం వ‌చ్చిందండి. కానీ గురూగారూ, దేశంలో ఈ ప‌రిస్థితి ఇక బాగుప‌డ‌దంటారా?”

ఎందుకంటానురా? జ‌నం చైతన్య వంతులై, జ‌న సైనికులై, నికృష్ట అభ్య‌ర్థుల‌ను నిర్ద్వందంగా తిర‌స్క‌రించే స‌త్సంక‌ల్పం చేసుకుంటే ఇక నీలాంటి వాళ్ల‌కి రూక‌లు చెల్లిన‌ట్టే.  అంత‌వ‌ర‌కు నువ్వు ఆడింది ఆట‌, పాడింది పాట‌...

చివ‌రాక‌రిగా మ‌రో సందేహం గురూగారూ! ఒక వేళ జ‌నం సైనికులై స్వ‌చ్ఛ రాజ‌కీయ స‌మ‌రానికి పూనుకున్నారనుకోండి, మ‌రి మీ గురుకులం ఏమవుతుందండీ? ఇక మీరెవ‌రికి పాఠాలు చెబుతారండీ పాపం?”

ఓరెర్రి నా శిష్యా! నేను చెప్పే నీచ రాజ‌కీయ పాఠాలు నీ లాంటి వాళ్ల‌కు ఎలా ఉండాలో చెబితే, నీతి ప‌రుల‌కు ఎలా ఉండ‌కూడ‌దో చెబుతాయి. కాబ‌ట్టి నా గురుకులానికేం ఢోకా లేదు. నువ్విక పోయిరా!

-సృజ‌న‌

PUBLISHED ON 23.9.2021 ON JANASENA WEBSITE

శనివారం, సెప్టెంబర్ 18, 2021

తితిదే ప్ర‌తిష్ఠ గోవిందా గోవింద‌!* కేవ‌లం ఒక్క క్ష‌ణం... తేరిపారి ఆ తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడి దివ్య సుంద‌ర‌ విగ్ర‌హాన్ని క‌నులారా వీక్షించుకోవాల‌ని, ఆ రూపాన్ని మ‌నసునిండా నింపుకుని త‌రించాల‌ని  సుదూర తీరాల నుంచి పిల్లాపాప‌ల‌తో, వృద్ధుల‌తో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి, ఆప‌సోపాలు ప‌డుతూ త‌ర‌లి వ‌చ్చే ల‌క్ష‌లాది మంది భ‌క్త జ‌నానికి మ‌రింత నిరీక్ష‌ణ త‌ప్ప‌ని ప‌రిస్థితి ఇప్పుడు దాపురించిన‌ట్టే!

* ఇంట్లో వెంక‌న్న ప‌టం ముందు ఏ ఇత్త‌డి చెంబులోనే హుండీ ఏర్పాటు చేసుకుని, మొక్కులు మొక్కుకున్న‌ప్పుడ‌ల్లా అందులో నోట్లు, నాణాలు వేసుకుంటూ, ఆ డ‌బ్బుల మూట‌ను భ‌క్తితో నెత్తి మీద పెట్టుకుని తిరుమ‌ల చేరుకుని ఆ సొమ్మును వెంక‌న్న హుండీలో స‌మ‌ర్పించ‌డం ద్వారా ఏటా ఏకంగా 12 వేల కోట్ల‌కు పైగా ఆదాయాన్ని అందిస్తున్న కోట్లాది మంది సామాన్య  భ‌క్త జ‌నుల‌కు ఇప్పుడు తిరుమ‌ల‌లో మ‌రిన్ని వెత‌లు, యాత‌న‌లు, కాల‌యాప‌న ఎదుర‌య్యే దుస్థితి  ఏర్ప‌డిన‌ట్టే!!

* మ‌రో ప‌క్క‌ ప్ర‌త్యేక దర్శ‌నాలు, ప్ర‌ముఖులు, విఐపీల‌కు బ్రేక్ ద‌ర్శ‌నాలు, ప్ర‌త్యేక స‌దుపాయాలు, సౌక‌ర్యాలు ఇక‌పై ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగిపోయే ప‌రిస్థితి కూడా ఇక‌పై క‌లిగిన‌ట్టే!!!

--- అవును! గ‌తంలో ఏ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ లేని విధంగా, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు స‌భ్యుల సంఖ్యను  ఇష్టానుసారం పెంచేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా నిర్వాకం వ‌ల్ల, ప్ర‌పంచ వ్యాప్తంగా దివ్య‌క్షేత్రంగా పేరొందిన తిరుమ‌ల యాత్ర మ‌రింత క‌ష్ట‌సాధ్యం కానుంద‌న‌డంలో అతిశ‌యోక్తి ఏమీ లేదు.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌తిష్ఠ దిగ‌జారిపోయేలా, ఆ ఏడుకొండ‌ల వాడి దివ్యథామం ప‌విత్ర‌త అణ‌గారిపోయేలా కొంద‌రు నేర‌స్థులు, నిందితులు కూడా బోర్డు స‌భ్య‌ల హోదాలో స‌క‌ల మ‌ర్యాద‌లు అందుకునే క‌నీవినీ ఎరుగ‌ని విడ్డూరం అక్క‌డ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. జ‌గ‌న్ ప్రభుత్వం తాజాగా నియామ‌కాలు చేసిన బోర్డు స‌భ్యుల్లో కొంద‌రి పూర్వాప‌రాలు ప‌రిశీలించిన‌ప్పుడు ఈ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఇప్పుడు సర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

ఒక ఛైర్మ‌న్, న‌లుగురు ఎక్స్ అఫీషియో స‌భ్యులు, 24 మంది స‌భ్య‌లు, ఇద్ద‌రు ప్ర‌త్యేక ఆహ్వానితులు... వీరు కాకుండా అద‌నంగా మ‌రో 50 మంది ప్ర‌త్యేక ఆహ్వానితులు... వెర‌శి అందరూ క‌లిస్తే మొత్తం 81 మంది! ఇదీ ఇప్పుడు తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి విరాట్ స్వ‌రూపం!

ఎవ‌రికి ప్ర‌యోజ‌నం?

గ‌తంలో ఎవ‌రి హయాంలోనూ లేనంత మంది స‌భ్యుల‌తో ఏర్ప‌డిన ఈ మండ‌లి వ‌ల్ల అటు భ‌క్తుల‌కు కానీ, ఇటు తిరుమ‌ల క్షేత్రానికి కానీ ఏం ప్ర‌యోజ‌నం ఏర్ప‌డుతుంద‌న్న‌ది అనుమాన‌మేన‌న‌డంలో సందేహం ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే గ‌త ప్రభుత్వ హ‌యాంలో బోర్డు స‌భ్య‌ల సంఖ్య కేవ‌లం 18 మంది.  జ‌గ‌నం ప్ర‌భుత్వం కొలువు తీర‌గానే ఆ సంఖ్య 37కి  పెరిగింది. ఇప్పుడు ఏకంగా 81 మందితో కిట‌కిట‌లాడుతోంది. వీరిలో 50 మంది ప్ర‌త్యేక ఆహ్వానితుల‌కు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకునే శ‌క్తి ఉండ‌దు. స‌మావేశాల్లో కూడా వీళ్లు పాల్గొన‌లేరు. అయినా స‌రే.... వీళ్లు బోర్డు స‌భ్యుల‌తో పాటు స‌మాన హోదాను అనుభ‌విస్తారు. అంటే బోర్డు స‌భ్యుల‌కు ప్రోటోకాల్ ప్ర‌కారం కేటాయించే వ‌స‌తి, వాహ‌న‌, ద‌ర్శ‌న స‌దుపాయాలు, సౌక‌ర్యాలు వీరు హాయిగా పొంద‌గ‌లుగుతారు. మ‌రి ఇలాంటి ప్ర‌త్యేక ఆహ్వానితులు ఇంత‌మంది ఎందుకు? అనేదే ఇప్పుడు భ‌క్తులను క‌ల‌వ‌ర ప‌రుస్తున్న ప్ర‌శ్న‌!

 ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే ఈ బోర్డు స‌భ్యుల పూర్వాప‌రాలు ఒక‌సారి ప‌రిశీలించాలి. అలా ప‌రిశీలించిన‌ప్పుడు వీరిలో అత్య‌ధికులకు శ్రీవారి సేవ‌తో కానీ, ఆధ్యాత్మిక నేప‌థ్యంతో కానీ సంబంధం లేక‌పోవ‌డ‌మే కాదు, వారికి ఎలాంటి ప్ర‌త్యేక  అర్హ‌త‌లు కూడా లేవ‌ని తేట‌తెల్ల‌మ‌వుతుంది. పైగా వీరిలో 70 శాతం మంది ఇత‌ర రాష్ట్రాలకు చెందిన‌వారే. అంతేకాదు, వీరిలో కొంద‌రు కొన్ని కేసుల్లో నిందితులు కూడా. ఇంకా ఘోర‌మేమిటంటే ఓ కేసులో అరెస్ట‌యిన వ్య‌క్తికి కూడా ఈ బోర్డులో స్థానం ల‌భించ‌డం! ఇంకా కొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు, అవినీతి ఆరోప‌ణ‌లకు గురైన‌వారు, సీబీఐ కేసుల్లో నిందితులుగా  ఉన్న‌వారు కూడా ఉండ‌డమే ఇప్పుడు భ‌క్త జ‌నుల మ‌నోభావాల‌ను క‌ల‌చివేస్తోంది.

ఇలాంటి వారినా నియ‌మించేది?

దేశ దేశాల్లో అత్యంత ప‌విత్ర‌మైన యాత్రా స్థ‌లంగా పేరొందిన తిరుమ‌ల క్షేత్రానికి సంబంధించిన పాల‌క మండ‌లి విష‌యంలో ప్ర‌భుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించింది? అనే ప్ర‌శ్న‌కు ఎలా చూసినా ఒకే స‌మాధానం క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అదేంటంటే... ఇది ఓ క్షేత్రం ప‌విత్ర‌త‌ను కానీ, దాని ప్రాచుర్యాన్ని కానీ, ప్రాధాన్య‌త‌ను కానీ దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు... కేవ‌లం రాజ‌కీయ కోణంలో, వ్యాపార కోణంలో స్వ‌ప్ర‌యోజ‌నాల‌న‌కు మ‌త్ర‌మే ప‌రిగ‌ణిస్తూ చేసిన నిర్వాక‌మేన‌నే విమ‌ర్శ‌లు అంత‌టా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై  ఉన్న అక్ర‌మార్జ‌న కేసుల్లో స‌హ‌నిందితుల‌కు కూడా ఇందులో చోటు ద‌క్క‌డ‌మే ఇందుకు తార్కాణ‌మ‌ని విశ్లేష‌కులు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఢంకాప‌ధంగా చెబుతున్నారు.  త‌న‌కు గ‌తంలో స‌హ‌క‌రించిన పారిశ్రామిక వేత్త‌లు, వ్యాపారులకు కూడా జ‌గ‌న్ స్థానం క‌ల్పించ‌డాన్ని ఇప్పుడు అంద‌రూ వేలెత్తి చూపుతున్నారు. ప్ర‌భుత్వంలోను, పార్టీలోను ఉన్న అసంతృప్తి వాదుల‌ను బుజ్జ‌గించ‌డానికి, మ‌రి కొంద‌రిని ప్ర‌లోభ పెట్ట‌డానికి ఇలా తిరుమ‌ల బోర్డును ఉపయోగించుకున్నార‌నే నిర‌స‌న‌లను వినిపిస్తున్నారు.

సామాన్య‌లకు వెత‌లేనా?

దేవ‌స్థానం స‌భ్య‌ల నియామ‌కాల్లో రాజ‌కీయ‌, వ్యాపార‌, ప్ర‌లోభ కార‌ణాల‌ను ప‌క్క‌న పెట్టి ఈ భారీ ప‌ద‌వుల పందేరం వ‌ల్ల  సామాన్య‌ భ‌క్తుల‌కు ఒరిగేదేంట‌ని ఆలోచిస్తే... శూన్య‌మ‌నే చెప్ప‌క‌త‌ప్ప‌దు. పైగా తిరుమ‌ల యాత్ర మ‌రింత‌గా వెత‌ల పాలు కాక త‌ప్ప‌ద‌నే విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. తిరుమ‌ల అన‌గానే ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు, బ్రేక్ ద‌ర్శ‌నాలు త‌ప్ప‌వు. కొంద‌రు ప్ర‌ముఖుల‌కు ఇలాంటి ద‌ర్శ‌నాలు ఏర్పాటు చేయ‌డంలో ఎవ‌రికీ అభ్యంత‌రాలు కూడా పెద్ద‌గా ఉండ‌వు. గ‌తంలో బ్రేక్ ద‌ర్శ‌నాల సంఖ్య 2500కి మించేది కాదు. ప్ర‌త్యేక సందర్భాల‌లో కూడా ఈ సంఖ్య‌ను మూడు వేల లోపే ఉండేలా చూసేవారు. వీరి కోసం ప్ర‌త్యేక స‌మ‌యాన్ని కేటాయించి సామాన్య భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌లుగ‌కుండా చ‌క‌చ‌కా ద‌ర్శ‌నం జ‌రిగేలా చూసేవారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఈ సంఖ్య 4000 దాటి పోయింది. వీరి ద‌ర్శ‌నానికే 4 గంట‌ల స‌మ‌యం ప‌ట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక ఇప్పుడు ఈ భారీ నియామ‌కాల వ‌ల్ల ప్ర‌త్యేక‌, బ్రేక్ ద‌ర్శ‌నాల సంఖ్య అయిదు వేల‌కు మించిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎందుకంటే... బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మితులైన  వారంద‌రికీ సిఫార్సు లేఖ‌లు జారీ చేసే అధికారం ఉండ‌డ‌మే. మామూలుగానే బోర్డు స‌భ్యులు ఒకొక్క‌రు 20 మందికి బ్రేక్ దర్శ‌నాల‌కు సిఫార్సు చేసే అవ‌కాశం ఉంటుంది. అలాగే సుప‌థం ద్వారా కూడా 20 మందికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు క‌ల్పించే వీలు ఉంది. ఇలా చూస్తే ఇప్పుడు కొలువైన 81 మంది ద్వారా వ‌చ్చే వారి కోసం దాదాపు 3200 టికెట్ల‌ను కేటాయించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని అంచ‌నా. వీరు కాక ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఇతర ప్ర‌ముఖుల ద్వ‌రా వ‌చ్చే సిఫార్సుల‌ను కూడా లెక్క‌లోకి తీసుకుంటే వీరంద‌రి ద‌ర్శ‌నాల‌కు ప‌ట్టే స‌మ‌యం మ‌రిన్ని గంట‌లు ప‌ట్ట‌క త‌ప్ప‌దు. అంటే... అంత‌సేపూ సామాన్య భ‌క్తులు క్యూలైన్ల‌లో పిల్లా పాప‌ల‌తో నిరీక్షించి చూస్తూ ఆప‌సోపాలు ప‌డ‌క త‌ప్ప‌ద‌ని ఇట్టే అర్థ‌మవుతుంది.

అడుగ‌డుగునా అవ‌క‌త‌వ‌క‌లే! 

అత్యంత ప‌విత్ర క్షేత్రంగా ప్ర‌పంచవ్యాప్తంగా భ‌క్తుల‌ను ఆకర్షించే తిరుమ‌ల ప‌ట్ల  ప్ర‌భుత్వం మొద‌టి నుంచీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న‌డానికి ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్లులుగా ఉన్నాయ‌ని సామాన్య‌ల నుంచి విశ్లేష‌కుల వ‌ర‌కు అనేక  ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు. దేవ‌స్థానం ఆస్తుల వేలానికి తెగ‌బ‌డ‌డం, తిరుమ‌ల బ‌స్ టికెట్ల వెనుక అన్య‌మ‌త ప్ర‌చారం సాగ‌డం, తిరుమ‌ల అధికారిక వెబ్‌సైట్లో అన్య మ‌త గేయాలు క‌నిపించ‌డం, ఎస్వీబీసీ చైర్మన్ గా నియామ‌కుడైన వ్యక్తి రాస‌లీల‌లు వెల్ల‌డి కావ‌డం, త‌ల‌నీలాలను స్మ‌గ్లింగ్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు, దేవ‌స్థానం మాస ప‌త్రిక‌లో రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రించే వ్యాసాలు రావ‌డం, ల‌డ్డూ ప్ర‌సాదం ధ‌ర‌లు పెండ‌డం, శ్రీవారి ప్ర‌సాదాన్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పంపిణీ చేయ‌డం, తిరుమ‌ల‌లో రోడ్డు డివైడ‌ర్ల‌కు వైకాపా రంగులు వేయ‌డం, తితిదే క‌ళ్యాణ మండ‌పాల లీజు వ్య‌వ‌హారం, తిరుమ‌ల‌లో అన్య‌మ‌తస్థుల నియామ‌కాలు జ‌ర‌గ‌డం లాంటి ఎన్నో అవ‌క‌త‌వ‌ల‌క‌ల గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇవ‌న్నీ భ‌క్తుల మ‌నోభావాల‌ను తీవ్రంగా  దెబ్బ‌తీసేవే. ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను ప‌రికించి చూసినప్పుడు ఒకే విష‌యం ప్ర‌శ్నార్ధ‌క‌మవుతోంది.... అదే ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధి! 

PUBLISHED ON 18.09.2021 ON JANASENA WEBSITE

మంగళవారం, సెప్టెంబర్ 14, 2021

దీని భావ‌మేమి తిరుమ‌లేశా!


 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అతి సంప‌న్న‌మైన హిందూ ఆల‌యాల్లో ఒక‌టి...

ఏటా వేల కోట్ల ఆదాయాన్ని పొందుతున్న అతి పెద్ద దేవ‌స్థానం...

ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి కోట్లాది మంది భ‌క్తుల‌ను ఆక‌ర్షిస్తున్న ప‌విత్ర స్థ‌లం...

ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న తిరుమ‌ల తిరుప‌తి దివ్య క్షేత్రం గురించిన ఏ చిన్న అంశ‌మైనా అది దేశ‌విదేశాల్లో ఉన్న బాలాజీ భ‌క్తుల‌ను ఎంతో ప్రభావితం చేస్తుంది.

ఇంత‌టి ప్రాధాన్య‌త ఉన్న తిరుమ‌ల‌కు సంబంధించిన కొన్ని  అనాలోచిత నిర్ణ‌యాలు, అసంబ‌ద్ధ‌మైన ప్ర‌క‌ట‌న‌లు త‌ర‌చు వివాదాస్ప‌దమ‌వుతుండడం, చ‌ర్చ‌నీయాంశ‌మ‌వ‌డం, విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌డం భ‌క్తుల మ‌నోభావాల‌ను తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆందోళ‌న‌కు సైతం గురి చేస్తున్నాయి.

"ఏడు కొండ‌లూ వెంక‌టేశ్వ‌రుడివి కావు... రెండు కొండ‌లు మాత్ర‌మే ఆయ‌న‌వి..." అనే వ్యాఖ్యలు వినిపించిన వైఎస్ హ‌యాం త‌ర్వాత ఆయ‌న  త‌న‌యుడు జ‌గ‌న్ పాల‌న‌లో కూడా కొన్ని నిర్ణ‌యాలు తీవ్ర‌మైన ప్ర‌తిస్పంద‌న‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల విక్రయం, వేలం, దేశ‌వ్యాప్తంగా ఉన్న క‌ళ్యాణ మండ‌పాల లీజు  వ్య‌వ‌హారంభ‌క్తుల‌కు ఉచితంగా  కాకుండా ఓ హోట‌ల్ మాదిరిగా భోజ‌నాన్ని అమ్మాల‌నుకోవ‌డం, ఈ దేవ‌స్థానానికి సంబంధించిన పాల‌క వ‌ర్గంలో అర్హ‌త‌లు సైతం చూడ‌కుండా కొంద‌రు వివాదాస్ప‌ద వ్య‌క్తుల‌ను నియ‌మించ‌డం, ఇలాంటి స‌భ్యుల్లో కొంద‌రిపై అస‌భ్య‌మైన ఆరోప‌ణ‌లు కూడా ఎదురు కావ‌డం, దేవ‌స్థానానికి సంబంధించిన కార్య‌క‌లాపాల‌పై సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా వ్య‌క్తం చేసిన వ్య‌క్తుల‌పై బెదిరింపులు, కేసుల న‌మోదుకు కూడా తెగ‌బ‌డ‌డం.... ఇలా చూస్తే ఎన్నో అంశాలు త‌ర‌చు చ‌ర్చ‌నీయాంశం కావ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌నే అభిప్రాయాలు స‌ర్వే స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌పంచంలోనే అత్యంత కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టి.  దాదాపు ల‌క్ష కోట్ల విలువైన ఆస్తులు తిరుమ‌ల బాలాజీ పేరిట ఉన్నాయి.  బాలాజీ ద‌ర్శ‌నానికి వ‌చ్చే కోట్లాది మంది భ‌క్తుల ద్వారా ఏటా 12 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆదాయం పొందుతున్న ఈ దేవ‌స్థానం పాల‌క వ‌ర్గంలో ఎన్న‌డూ లేనంత‌గా  సుమారు 50 మంది స‌భ్యులు నియ‌మితులై ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల ప్ర‌కారం చూస్తే ఈ సంఖ్యా ఇంకా పెర‌గ‌వ‌చ్చ‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఇక ఈ దేవ‌స్థానానికి సంబంధించిన అధికార వ్య‌వ‌స్థ కూడా చాలా విస్తృతంగా, ప‌క‌డ్బందీ విధానాల‌తో కూడి ఉంటుంది. ఇంత నేప‌థ్యం ఉండి కూడా ఈమ‌ధ్య కాలంలో స‌రైన ఆలోచ‌న‌, ప్ర‌ణాళిక లేకుండా తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు, విడుద‌ల చేస్తున్న కొన్ని ప్ర‌క‌ట‌న‌లు భక్త జ‌నంలో తీవ్ర‌మైన ఆందోళ‌న‌ను రేకెత్తించేలా ఉంటున్నాయి. విమ‌ర్శ‌లు త‌లెత్తిన ప్ర‌తీసారీ దేవ‌స్థానం పాల‌క వ‌ర్గం ఉలిక్కిప‌డి కొన్ని నిర్ణ‌యాల‌ను నిలిపివేస్తు్న్న సంద‌ర్భాలు కూడా ఎదురవుతున్నాయి. ఈ వ్య‌వ‌హారాల‌ను నిశితంగా గ‌మ‌నించేవారికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌ట్ల పాల‌కుల‌కు స‌రైన శ్ర‌ద్ధ‌, బాధ్య‌త ఉన్నాయా లేవా అనే అనుమానాలు, ఇక ముందు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు వినాల్సివస్తుందోన‌నే భ‌యాందోళ‌ల‌న స‌హ‌జంగానే త‌లెత్తుతున్నాయి.

సంప్ర‌దాయ భోజ‌నం సంగ‌తేంటి?

 

తాజాగా సంప్ర‌దాయ భోజ‌నం వ్య‌వ‌హారం తిరుమ‌ల దేవ‌స్థానం అనాలోచిత నిర్ణ‌యాల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ర‌ద్దు చేయ‌డంతో పాటు "అబ్బే...ఇది ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి లేని స‌మ‌యంలో అధికారులు తీసుకున్న నిర్ణ‌యం" అంటూ దేవ‌స్థానం చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి ప్ర‌క‌టించ‌డం హాస్యాస్ప‌దంగా మారింది. ఇంత పెద్ద దేవ‌స్థానానికి సంబంధించి ఆర్భాటంగా ప్రారంభించిన ఓ కార్య‌క్ర‌మం గురించి  ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లికి తెలియ‌ద‌న‌డ‌మే వ్య‌వ‌స్థ‌లో లోపాల‌కి ద‌ర్ప‌ణం ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అస‌లు ఇంత‌కీ ఏంటీ సంప్రదాయ భోజ‌నం? అని నేప‌థ్యాన్ని ప‌రికిస్తే, నిజానికి మూడు నెల‌లుగా గోఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌తో శ్రీవారికి నైవేద్యాలు స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ వేత్త‌లు సూచ‌న‌ల‌తో ఎలాంటి కృత్రిమ‌మైన ఎరువులు వాడ‌కుండా సేంద్రీయ సేద్యం విధానంలో పండించిన బియ్యం, కూర‌లు, పప్పు దినుసుల‌ను ఉపయోగించి కొన్ని నైవేద్యాల‌ను త‌యారు చేస్తున్నారు. దీన్ని విస్త‌రించి భ‌క్తుల‌కు కూడా సంప్ర‌దాయ భోజ‌నాన్ని అందించాల‌ని నిర్ణ‌యించారు. ఆ మేర‌కు అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఆగ‌స్టు 26 నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా  ఉచిత భోజ‌నం కూడా ఏర్పాటు చేశారు. అవ‌డానికి ఇది మంచి ఆలోచ‌నే. కానీ ఈ భోజ‌నాన్ని ఇక‌పై ఉచితంగా కాకుండా రుసుము తీసుకుని అందించాల‌నే ఆలోచ‌నే అనేక విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. ఓ ప‌క్క వెంగ‌మాంబ నిత్యాన్న‌దాన ప‌థ‌కం ద్వారా ప్ర‌తి రోజూ వేలాది మంది భ‌క్తులు ఉచిత భోజ‌నం, అల్పాహారాల‌ను పొంద‌తున్నారు. గ‌త ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ నిత్యాన్న‌దానాన్ని కేవలం వెంగ‌మాంబ భ‌వ‌నంలోనే కాకుండా మెట్ల దారిలోను, తిరుమ‌ల‌లోని వేర్వేరు స్థ‌లాల ద్వారా ఎక్క‌డికక్క‌డ భ‌క్త‌ల‌కు అంద‌జేస్తూ వ‌స్తున్నారు.  ఈ విధానం ఎంతో ఆద‌ర‌ణకు సైతం నోచుకుంది. అలాంటిది దేవ‌స్థానం ఓ హోట‌ల్ మాదిరిగా, వ్యాపార‌ధోర‌ణిలో భ‌క్తుల‌కు డ‌బ్బులు తీసుకుని భోజ‌నం పెట్టాల‌నుకోవ‌డమే వివాదాస్ప‌ద‌మైంది. వంద‌లాది, వేలాది కిలోమీట‌ర్ల దూరం నుంచి వ్య‌య‌ప్ర‌యాస‌లకు ఓర్చి, ఆర్తితో తిరుమ‌ల బాలాజీ ద‌ర్శ‌నానికి వ‌స్తూ వేల కోట్ల ఆదాయాన్ని స‌మ‌కూరుస్తున్న భక్త జ‌నానికి డ‌బ్బులు తీసుకుని అన్నం పెట్ట‌డ‌మేంట‌నే విమ‌ర్శ‌లే ఈ సంప్ర‌దాయ భోజనం వ్య‌వ‌హారాన్ని ఓ ప్ర‌హ‌స‌నంగా మార్చాయి. దీనిపై కొన్ని ధార్మిక సంస్థ‌లు కూడా ధ్వ‌జ‌మెత్తాయి. పైగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి క్ర‌మం త‌ప్ప‌కుండా విరాళాలు అందించే దాత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. వారితో ఈ ఆలోచ‌న గురించి చ‌ర్చిస్తే వారంద‌రి స‌హ‌కారంతో ఇదెంతో ఉదాత్త‌మైన గొప్ప కార్య‌క్ర‌మంగా రూపుదిద్దుకుని ఉండేది.  తిరుమ‌ల‌లో ఎన్నో హోట‌ల్స్ ఉన్న‌ప్ప‌టికీ వాటిలో నాణ్య‌త మీద అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో  దేవ‌స్థానం సంప్ర‌దాయ భోజ‌నాన్ని అందిస్తే ఎంతో ప్ర‌యోజ‌న కరంగా ఉండేది. ఇవేమీ ఆలోచించ‌కుండా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించ‌డం, పైగా త‌ప్పంతా అధికారుల‌దే అన‌డం పాల‌క వ్య‌వ‌స్థలోని లొసుగుల‌కు తార్కాణంగా నిలిచింది. అయితే ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం వెనుక తిరుమ‌ల లోని హోట‌ల్ య‌జ‌మానుల ఒత్తిడి కూడా కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చ‌నే విమ‌ర్శ‌లు కూడా త‌లెత్తుతున్న నేప‌థ్యంలో భ‌క్తులు "దీని భావమేమి తిరుమ‌లేశా" అనుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు.

 

కళ్యాణ మండ‌పాల క‌థేంటి?

 

పాల‌క మండ‌లి  తీసుకున్న నిర్ణ‌యాల్లో మ‌రో వివాదాస్పద‌మైన అంశం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన నిర‌ర్ధ‌క ఆస్తుల వ్య‌వ‌హారం. దేవ‌స్థానానికి దేశ‌వ్యాప్తంగా ఎన్నో ఆస్తులు, స్థ‌లాలు, భ‌వ‌నాలు ఉన్నాయి. దాదాపు ఇవ‌న్నీ వేంక‌న్న మీద భ‌క్తితో వేర్వేరు దాత‌లు దేవ‌స్థానానికి ఇచ్చిన‌వే. వాటిలో క‌ళ్యాణ మండ‌పాలు, ఇత‌ర భ‌వ‌నాలు, స్థ‌లాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వేలం వేయాల‌నే ఆలోచ‌న కూడా తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. దాంతో ఈ నిర్ణ‌యంపై కూడా వెన‌క‌డుగు వేయ‌క త‌ప్ప‌లేదు. ఇక క‌ళ్యాణ మండ‌పాల సంగ‌తి.  దేశ‌వ్యాప్తంగా దేవ‌స్థానానికి 304 క‌ళ్యాణ మండ‌పాలు ఉన్నాయి. వాటిలో 216 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌గా, 77 తెలంగాణ‌లో ఉన్నాయి. వీటిని లీజు విధానం ద్వారా ప్రైవేటు వ్య‌క్తుల‌కు అప్ప‌జెప్పాల‌నే నిర్ణ‌యం తాజాగా ఎన్నో వాద‌ప్ర‌తివాదాల‌కు, చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. దేవ‌స్థానానికి దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక ఆస్తుల్లో చాలా మ‌టుకు నిరర్ధ‌కంగా ఉన్న‌యని, వాటి నుంచి ఆదాయం ఏమీ ఉండ‌డం లేద‌ని, పైగా వాటి నిర్వ‌హ‌ణ‌కు అద‌న‌పు ఖ‌ర్చు అవుతోంద‌నే ఆలోచ‌న లోంచే ఈ నిర్ణ‌యం పుట్టుకొచ్చింది. అయితే క‌ళ్యాణ మండ‌పాల‌ను లీజుకిస్తే కొంద‌రు ఇత‌ర మ‌తాల వారు వాటిని ద‌క్కించుకునే అవ‌కాశం ఉండ‌డం, వారు అన్య మ‌త ప్ర‌చార కార్యక్ర‌మాల‌కు వాటిని వాడుకునే వీలు ఉండ‌డం... వెంక‌న్న భ‌క్తుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రుస్తోంది. ఇది హిందూ మ‌త అభిలాషుల‌కు, అభిమానుల‌కు తీవ్ర అభ్యంత‌ర క‌రంగా తోచింది. దాంతో తిరిగి పాల‌క వ‌ర్గం స్పందించ‌క త‌ప్ప‌లేదు. అయితే ఇదేమీ కొత్త విష‌యం కాదంటూ 1990 ఏప్రిల్ 9 నాటి ఓ పాత జీవో 311ను చూపిస్తూ పాల‌క మండ‌లి త‌న‌ను తాను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది. దాంతో పాటు అన్య‌మ‌తాల వారికి లీజుకి ఇవ్వ‌కుండా  కేవలం హిందూ మ‌త ప్ర‌చారానికి, హిందూ సంప్ర‌దాయ పూర్వ‌క‌మైన వేడుకుల‌కు మాత్ర‌మే ఇచ్చేలా నిబంధ‌న‌లు రూపొందించామ‌ని ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌లేదు. అంతే కాకుండా ఇంత వ‌ర‌కు 29 క‌ళ్యాణ మండ‌పాల‌ను లీజుకిచ్చామ‌ని, ఇంత‌వ‌ర‌కు ఎలాంగి విమ‌ర్శ‌లు రాలేద‌ని చెప్పుకొచ్చింది.  అయితే ఈ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు భ‌క్తుల‌కు పూర్తి భ‌రోసాను ఇవ్వ‌లేక‌పోతున్నాయ‌నేది నిర్వివాదాంశం. ఎందుకంటే ఈ క‌ళ్యాణ మండ‌పాల‌ను చాలా మ‌టుకు దాత‌లిచ్చిన స్థ‌లాల‌లోనే నిర్మించారు. త‌మ ప్రాంతంలో తామిచ్చిన స్థ‌లంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మండ‌పాల‌ను క‌డితే, ఆ మండ‌పాల్లో జ‌రిగే శుభ‌కార్యాల ద్వారా ఓ మంచి స‌త్సంప్ర‌దాయంలో భాగ‌స్వాముల‌య్యామ‌నే తృప్తి మిగులుతుంద‌నేది ఆయా భక్తుల మ‌నోభావ‌న‌. అయితే అలాంటి దాత‌లను కానీ, వారి కుటుంబీకుల‌ను కానీ ఏమాత్రం సంప్ర‌దించ‌కుండా లీజు నిర్ణ‌యం తీసుకోవ‌డం అనేక మందికి అభ్యంత‌ర‌క‌రంగా మారింది. దాంతో ఇది మ‌రొక తొంద‌ర‌పాటు చ‌ర్య‌గా, అనాలోచిత వ్య‌వ‌హారంగా నిలిచింది. ఏది ఏమైనా  పాల‌క మండ‌లి స‌రైన ప్రణాళిక‌, ఆలోచ‌న‌, చ‌ర్చ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఏది తోస్తే అలా చేస్తోందా అనే అనుమానాలు భ‌క్తుల్లో త‌లెత్తి "ఏం జ‌రుగుతోంది తిరుమ‌లేశా" అనుకోక త‌ప్ప‌డం లేదు.

 

ఇంకా ఎన్నో... ఎన్నెన్నో...

 

ఇలా చూస్తే ఇంకా ఎన్నో దృష్టాంత‌రాలు క‌నిపిస్తూ అటు దేవ‌స్థానం పాల‌క మండ‌లిని, ఇటు అధికారవ్య‌వ‌స్థ‌ని, ఆపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ్య‌వహార శైలిని కూడా ప‌లుచ‌న చేస్తున్నాయి. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు దేవ‌స్థానం త‌ర‌ఫున 50 కోట్ల రూపాయ‌ల‌ను విరాళంగా ఇవ్వ‌డం, తెలంగాణా నుంచి వెళ్లే ప్ర‌ముఖుల‌ను చిన్న‌చూపు చూస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు తావివ్వడం, దేవ‌స్థానంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌నే నెపంతో 18 మందిపై కేసులు పెట్ట‌డానికి తెగ‌బ‌డ‌డం, పాల‌క మండ‌లి స‌భ్య‌ల‌ను ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెంచేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు గుర‌య్యేలా ప్ర‌వ‌ర్తించ‌డం, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌లైన కొన్ని క్ష‌ణాల్లోనే దేవ‌స్థానం అధికారిక వెబ్‌సైట్లు గంట‌ల త‌ర‌బ‌డి స్తంభించిపోవ‌డం... లాంటి ఎన్నో నిర్ణ‌యాలు, ప్ర‌క‌ట‌న‌లు, చ‌ర్య‌లు వివాదాల‌కు గుర‌వుతున్నాయి. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తున్న భ‌క్తులు కోరుకునేదొక్క‌టే. దేవ‌స్థానం పాల‌క మండ‌లి, అధికారులు, ప్ర‌భుత్వం ఎవ‌రైనా స‌రే అత్యంత ప్రాధాన్య‌మైన‌, అతి ప‌విత్ర‌మైన క్షేత్రానికి సంబంధించిన వ్య‌వ‌హారాల్లో అశ్ర‌ద్ధ‌గా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని. నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డంలో కానీ, వాటి అమ‌లులో కానీ పార‌దర్శ‌క పాటించాలని. అది జ‌ర‌గాల‌ని ఆ అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడిని వేడుకోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేని స్థితిలో బాలాజీ భ‌క్తులు ఉన్నార‌నడంలో సందేహం ఏమీ లేదు. 

శనివారం, సెప్టెంబర్ 11, 2021

వినాయ‌కుడు... వింత నాయ‌కుడు!

 


"అమ్మా... అలా భూలోకానికి వెళ్లొస్తాను..." అన్నాడు వినాయ‌కుడు కిరీటం స‌వ‌రించుకుంటూ. ఆ పాటికే సిద్ధ‌మైన మూషికుడు తోక తుడుచుకుంటూ "నేను కూడా సిద్దం స్వామీ" అంటూ ముందుకు వ‌చ్చాడు. వినాయ‌కుడు విన‌యంగా ప‌రమేశ్వ‌రుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లి "నాన్నా! ఆశీర్వ‌దించండి..." అన్నాడు.

పార్వ‌తి వినాయ‌కుడి త‌ల నిమిరి, "శుభంగా వెళ్లిరా నాన్నా... ఈ ప‌ది రోజులూ భ‌క్తుల మొరలు శ్ర‌ద్ధ‌గా విని వ‌రాలియ్యి. ఉండ్రాళ్లూ, క‌జ్జికాయ‌లు తిని వారిని దీవించి రా..." అంది మురిపెంగా.

"నారాయ‌ణ‌... నారాయ‌ణ" అంటూ అప్పుడే కైలాసంలో ప్ర‌త్య‌క్ష‌మైన నార‌దుడు, పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌రుల‌కు ప్ర‌ణామం చేసి వినాయ‌కుడి కేసి తిరిగి, "కానీ...జాగ్ర‌త్త గ‌ణ‌నాయ‌కా! భూలోకంలో ప‌రిస్థితులు మున‌ప‌టిలా లేవు మ‌రి..." అన్నాడు.

"అదేమిటి నార‌దా, అలాగంటావు. స‌క‌ల విఘ్న నివార‌కుడు, అఖిల లోక మాన్యుడు అయిన వినాయ‌కుడికా నువ్వు జాగ్ర‌త్త‌లు చెబుతున్న‌ది? అంది పార్వ‌తి.

ప‌ర‌మేశ్వ‌రుడు క‌ళ్లు విప్పి చిరున‌వ్వుతో చూస్తున్నాడు.

"మ‌రోలా భావించ‌కు త‌ల్లీ! వినాయ‌కుడి శ‌క్తి యుక్తులు నాకు తెలియ‌నివి కావు. కానీ అక్క‌డ భూలోకంలో కొంద‌రు నాయ‌కులు మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు. నేనంటున్న‌ది వారి గురించి..." అన్నాడు.

"ఇంత‌కీ నిన్ను అంత‌గా క‌ల‌వ‌ర పెడుతున్న సంగ‌తులేంటి నార‌దా?" అన్నాడు వినాయకుడు.

"ఏముంది వినాయ‌కా! ఈసారి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నీ ఉత్స‌వాల‌నే ర‌ద్దు చేశాడు అక్క‌డి నాయ‌కుడు. మ‌రే రాష్ట్రంలోనూ లేని విధంగా మితిమీరిన ఆంక్ష‌లు విధించాడు. నేన‌కక్క‌డి నుంచే వ‌స్తున్నాను. ఈసారి నీ వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను ఉత్సాహంగా చేసుకోలేక పోతున్నందుకు అక్క‌డి ప్ర‌జ‌లంతా ఉసూరుమంటున్నారు..."

"ఇంత‌కీ ఎవ‌రా నాయ‌కుడు నార‌దా?" అన్నాడు వినాయ‌కుడు.

"ఉన్నాడులే వినాయ‌కా! ఊరంతా ఒక దారి, ఉలిపిరి క‌ట్ట‌దో దారి అన్న‌ట్టుంటుంది అత‌డి వ్య‌వ‌హారం. దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ లేనంత‌గా చ‌వితి ఉత్స‌వాల మీద క‌నీవినీ ఎరుగ‌నన్ని నిబంధ‌న‌లు విధించాడు. కాబ‌ట్టి నీక‌క్క‌డ పెద్ద‌గా పండ‌గ సంబ‌రం, ఉత్సాహం, వేడుక‌లు ఇలాంటివేమీ క‌నిపించ‌క‌పోత‌చ్చు. భ‌క్త జ‌న బాంధ‌వుడ‌వైన నువ్వు ఒక‌వేళ అక్క‌డికి వెళ్లినా, కొన్ని జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవ‌డం మంచిది..."

"ఏమిటా జాగ్ర‌త్త‌లు నార‌దా?"

"ఏముంది స్వామీ! దేశంలో ఎక్కడైనా నీ మూషికం మ‌హా వేగంతో ప‌రిగెట్ట‌వ‌చ్చేమో కానీ, ఆంధ్ర‌రాష్ట్రంలో మాత్రం అలా సాధ్యం కాక‌పోవ‌చ్చ‌..."

"ఎందుక‌ని?"

"ఎందుకేమిటి స్వామీ? అక్క‌డ రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. అడుక్కో గొయ్యి, గ‌జానికో గుంత అన్న‌ట్టుంది అక్క‌డి ప‌రిస్థితి... అక్క‌డ అన్ని ప్ర‌దేశాల్లో లాగా మూషికం ప‌రుగులు పెడితే నడుం ప‌ట్టేయడం త‌థ్యం... అక్క‌డి ప్ర‌జ‌లు అక్క‌డ అనేక ప్ర‌మాదాల‌కు గుర‌వుతూ, బాధ‌ల‌కు ఓర్చుకుంటూ ప్ర‌య‌ణాలు సాగిస్తున్నారు వినాయ‌కా"

"చాలా చిత్రంగా ఉంది నార‌దా, నువ్వు చెబుతున్న‌ది. అక్క‌డి నాయ‌కుడు ప్ర‌జ‌ల బాధ‌లు ప‌ట్టించుకోడా?  ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించ‌డా?"

"ఆ మాత్రం ఇంగితం ఉంటే ఇంకే స్వామీ? అధినేత‌లో అది కాన‌రాకే జ‌నం అగ‌చాట్లు ప‌డుతున్నారు..."

"ఖ‌జానాలోని ధ‌నాన్ని వెచ్చించి ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తులు చేయించ‌డానికి ఆ నేత‌కు ఏమిటి అభ్యంత‌రం?"

"అభ్యంత‌రం కాదు స్వామీ. గత్యంత‌రం లేక‌. ఆ అధినేత పాల‌న‌లో ప్ర‌స్తుతం ఉద్యోగుల‌కు జీతాలు, పింఛ‌న్లు ఇవ్వ‌డానికి కూడా స‌రైన నిధులు లేవు. ప్ర‌తి నెల క‌ట‌క‌ట లాడాల్సిందే. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంత ఘోరంగా త‌యారైంది..."

"అట్ల‌యిన‌... ఏ కుబేరునిలాంటి వాడినో చూసుకుని కొంత పైక‌ము రుణ‌ము తెచ్చి ముందు ప్రజా స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌వ‌చ్చును క‌దా?"

నార‌దుడు ప‌క‌ప‌కా న‌వ్వి, "అయ్యో స్వామీ, ఏమ‌ని చెప్పాలి అక్క‌డి ప‌రిస్థితి?  అవ‌డానికి ప్ర‌భుత్వ‌మే అయిన‌నూ అక్క‌డ ఎక్క‌డా అప్పు పుట్ట‌ని దుస్థితిలో ఆ రాష్ట్రం ప‌డిపోయింది స్వామీ! ఎందుకంటే ఆ నేత త‌న స్వీయ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఆర్థికంగా ఆచ‌ర‌ణ‌కు క‌ష్టసాధ్య‌మైన ఏవేవో ప‌థ‌కాల‌ను ర‌చించి, వాటిని అమ‌లు ప‌రిచి రాష్ట్రాన్ని స్వ‌ర్ణ‌యుగంలోకి నడిపిస్తానంటూ ప్ర‌జ‌ల్ని ఊరించి, బులిపించి, న‌మ్మించి అధికారంలోకి వ‌చ్చినాడు. వ‌చ్చిన త‌ర్వాత ఆ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డానికి అప్ప‌నంగా ప్ర‌జాధ‌నాన్నే వెన‌కాముందూ చూడ‌కుండా వెచ్చిస్తున్నాడు. ఇప్ప‌టికే అందిన సంస్థ‌ల నుంచి అప్పుల మీద అప్పులు చేసినాడు. ఆ అప్పుల‌కు వ‌డ్డీలే వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టినాడు. ఆఖ‌రికి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే నిధులను కూడా దారి మ‌ళ్లించి వేరే ప‌ద్దుల‌కు వాడుతున్నాడు. ఆఖ‌రికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌నులు చేసే కాంట్రాక్ట‌ర్ల‌కు సైతం కోట్ల కొద్దీ ధ‌న‌మును బకాయి ప‌డినాడు.  ఇక‌పై ఏ ప‌నులు చేయ‌డానికి సైతం కాంట్రాక్ట‌ర్లు ముందుకు రాని ఘోర‌మైన ప‌రిస్థితి ఎదుర‌వుతున్న‌ద‌క్క‌డ‌. దాంతో ఇప్పటికిప్పుడు ప్ర‌భుత్వం ర‌హ‌దారులు నిర్మించాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ ఆ ప‌నులు ఎప్ప‌టికి జ‌రిగేనో ఆ ప‌రమేశ్వ‌రునికే ఎరుక‌. కాబ‌ట్టి అక్క‌డ నీ మూషికాన్ని జాగ్ర‌త్త‌గా గోతులు, గుంత‌లు చూసుకుని న‌డవ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు..." అంటూ వివ‌రించాడు.

"ఎంత‌టి ఘోర‌మెంత‌టి నిర్లక్ష్య‌మెంత‌టి ఉదాసీన‌మెంత‌టి అహంకార‌మెంత‌టి తెంప‌రిత‌న‌మా అధినేత‌కు? ఆత‌డికి త‌ప్ప‌క బుద్ధి చెప్ప‌వ‌ల‌సిందే" అన్నాడు వినాయ‌కుడు కోపంగా.

"అమ్మమ్మ‌... అంతటి ప్ర‌య‌త్నాలేవీ చేయ‌కు స్వామీ! నువ్వు వినాయ‌కుడివైతే, ఆయ‌న వింత నాయ‌కుడు. నీవు ఆ రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఇళ్ల‌లో నివేదించిన కుడుములు తిని, వాళ్ల‌ను ఆశీర్వ‌దించి గుట్టు చ‌ప్పుడు కాకుండా వ‌చ్చేయ‌డ‌మే మంచిది. ఏల అన ఆ అధినేత అత్యంత అస‌హ‌నశీలి. త‌న పాల‌న‌లో క‌నిపించే ఏ చిన్న స‌మ‌స్య గురించి ఎవ‌డు ప్ర‌స్తావించినా, ప్ర‌శ్నించినా ఆఖ‌రికి ప్రాధేయ‌ప‌డినా ఆతండు స‌హించ‌లేడు. అద్దానిని ధిక్కారుముగానెంచి త‌న గులాములుగా మారిన ర‌క్ష‌క భ‌టుల‌ను ఉసిగొల్పి అర్థంలేని సెక్ష‌న్ల‌తో ర‌క‌ర‌కాల కేసులు పెట్టించ‌గ‌ల‌డు. త‌న పార్టీ అనుచ‌రుల‌తో దాడులు చేయించ‌గ‌ల‌డు. మొన్న‌టికి మొన్న అదే జ‌రిగింది స్వామీ. ర‌హ‌దారులు బాగా లేవ‌ని విన‌తి ప‌త్రాలు ఇవ్వాల‌ని త‌ల‌పెట్టిన ప్ర‌జల‌ను పోలీసుల స‌మ‌క్షంలోనే త‌న గూండాల‌తో చిత‌గ్గొంటించినాడు. అదీ అక్క‌డి ప్ర‌జ‌ల దుస్థితి..."

"హ‌త‌విధీ... అంత‌టి దుర్భ‌ర స్థితిలో ఉంటిరా ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు అట్ల‌యిన‌, దీనికి నివార‌ణోపాయ‌మేంటో నా తండ్రి గ‌ర‌ళ‌కంఠునినే అద‌గ‌వ‌లె... " అంటూ వినాయ‌కుడు ప‌ర‌మేశ్వ‌రుడి కేసి తిరిగి విన‌మ్రంగా న‌మస్క‌రించాడు.

పార్వ‌తి కూడా ఆస‌క్తిగా శివుడికేసి దృష్టి సారించింది.

ప‌ర‌మేశ్వ‌రుడు చిద్విలాసంగా న‌వ్వి, "దేనికైనా స‌మ‌యం రావాలి వినాయకా. లోగ‌డ ప్ర‌జా కంట‌కులైన ఎంద‌రో నాయకులు ఇలాగే అనాలోచిత ప‌నుల‌తో, అహంకారంతో, అస‌హ‌నంతో, అవ‌క‌త‌వ‌క ప‌నుల‌తో విర్ర‌వీగి తుద‌కు మాయ‌మైన క‌థ‌లు నీకు తెలిసిన‌వే క‌ద‌..." అన్నాడు.

"ఓహో... అట్ల‌యిన ఆ వింత నాయకుని ఆగ‌డాలు మితిమీరిన పిమ్మ‌ట‌, స్వ‌యంగా మీరో, లేక ఆ వైకుంఠ‌వాసుడో మ‌రో అవ‌తారం ఎత్తుదురా తండ్రీ?" అన్నాడు వినాయ‌కుడు.

ప‌ర‌మ‌శివుడు చిద్విలాసం చేశాడు.  "ఇది క‌లియుగం వినాయ‌కా! ఇప్పుడు దేవుళ్లు కొత్త‌గా అవ‌తారాలు ఎత్తాల్సిన అవ‌సరం లేదు. అంత‌టి శక్తి యుక్తులు క‌లిగిన దేవుళ్లు అక్క‌డే ఆ ప్రాంతంలోనే ఉన్నారు నాయ‌నా!" అన్నాడు.

ఆ మాట‌ల‌కు పార్వ‌తి, వినాయ‌కుడు, నార‌దుడు స‌హా కైలాస‌వాసులంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

"ఎవ‌రు స్వామీ, ఆ దేవుళ్లు?" అని అడిగారు ముక్త కంఠంతో.

"ఓటరు దేవుళ్లు! అంటే ఆ ప్రాంత‌లోని ప్ర‌జ‌లే! వాళ్ల‌లో చైతన్యం పెరిగి, ఒక్క‌క్క‌రూ ఒకొక్క జ‌న‌సైనికుడై  క‌ద‌లిన నాడు ఆ వింత నాయ‌కుడు ఎలా అధికార పీఠంపైకి ఎక్క గ‌లిగాడో అలానే ఆ పీఠాన్ని అవ‌రోహించ‌గ‌ల‌డు. అంత‌వ‌ర‌కు అంద‌రూ నిరీక్షించక త‌ప్ప‌దు. కాబ‌ట్టి నీవు ఈ రాజ‌కీయ విష‌యాలేవీ ప‌ట్టించుకోకుండా భూలోకానికి వెళ్లి, భ‌క్తులు నివేదించిన కుడుములు ఆర‌గించి వ‌రాలు ప్ర‌సాదించి ర‌మ్ము. అన్న‌ట్టు... నార‌దుడు చెప్పిన జాగ్ర‌త్త‌లు మాత్రం త‌ప్ప‌క తీసుకో" అంటూ ప‌ర‌మశివుడు ధ్యాన‌మగ్నుడ‌య్యాడు. 

 

"అవ‌శ్యం తండ్రీ!" అంటూ వినాయ‌కుడు మూషిక వాహ‌నం ఎక్కి భూలోకానికి బ‌య‌ల్దేరాడు.

-సృజ‌న‌

PUBLISHED ON 8.9.21 ON JANASENA WEBSITE