బుధవారం, ఏప్రిల్ 30, 2014

అసలైన చికిత్స!డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు ఆసుపత్రికి పంకజాక్షి ఆదరాబాదరా వచ్చింది. పక్కనే ఆమె భర్త అప్పారావు కోపంగా, చిరాగ్గా చూస్తూ నుంచుని ఉన్నాడు.

'డాక్టర్‌! ఈయన ఉదయం లేస్తూనే వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారండి. మీరే కాపాడాలి' అందామె కొంగును నోట్లో దోపుకొంటూ.

'ఛ... నోర్ముయ్‌! చమడాలు వలిచేస్తా' అన్నాడు అప్పారావు.

పంకజాక్షి గుడ్లనీరు కుక్కుకుని, 'పెళ్లయిన దగ్గర్నుంచి ఒక్కమాట అని ఎరగరండి. ఏది పెడితే అది నోరు మూసుకుని తినేవారు. పెళ్లయిన కొత్తలో ఈయనకసలు నోట్లో నాలుక ఉందో లేదోనని ఆయన నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి పరీక్షించాను కూడానండి. నోట్లో వేలుపెడితే కొరకరు సరికదా, చంటి పిల్లాడిలా చీకుతారండి. అలాంటి మనిషి ఇలా నానా తిట్లూ తిడుతున్నారండి. ఏదైనా పిచ్చి పట్టిందేమోనని భయమేస్తోందండి'

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు తలపంకించి అప్పారావుతో 'మిమ్మల్నోసారి పరీక్షించాలి. ఇలా కూర్చోండి' అన్నారు.

'నువ్వెవరు నన్ను పరీక్షించడానికి? వెళ్లి మీ నాన్నని పరీక్షించుకో, అమ్మని పరీక్షించుకో. నా జోలికొస్తే తాట తీస్తా' అన్నాడు అప్పారావు.

డాక్టర్‌ పిచ్చేశ్వరరావు పంకజాక్షికేసి తిరిగి, 'కొన్ని రోజులుగా మీవారు ఎక్కడెక్కడ తిరిగారో, ఏం చేశారో చెప్పగలవామ్మా?' అని అడిగారు.

'ఆయ్‌... ఎన్నికల కాలం కదండీ! కనిపించిన ప్రతి రాజకీయ నాయకుడి సభలకు పోయొచ్చేవారండి. ఏ నేత రోడ్‌ షో పెట్టినా ఈయన ఉండాల్సిందేనండి. ఇంట్లో టీవీలో కూడా అన్నీ ప్రచారం వార్తలే చూసి చూసి చంపేశారండి బాబూ...' అంది పంకజాక్షి.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావుకు విషయం అర్థమైంది.

'నువ్వేం కంగారుపడకమ్మా. నేను నయంచేస్తా కదా?' అన్నారు.

ఇంతలో అప్పారావు దిగ్గున లేచి, 'తోలు వలుస్తా! తొక్కలో కబుర్లు నువ్వూను. నాకే రోగం లేదని సవాలు చేస్తా, నువ్వు చేస్తావా? నీ మాట అబద్ధమైతే నీ స్టెతస్కోపు నాకిచ్చేయాలి. నిజమైతే నా మొలతాడు నీకిచ్చేస్తా. సవాలుకు సిద్ధమేనా?' అన్నాడు.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు నవ్వి, 'అలాగే అప్పారావు! మీకే రోగం లేదు. ఉన్న రోగాలన్నీ మన రాష్ట్ర ప్రజలకు, నాయకులకే ఉన్నా యి. సరేనా?' అన్నారు.

'ఏం సోయి తప్పి మాట్లాడుతున్నవా? జనానికేం రోగముంటది? ఉన్న రుగ్మతలన్నీ నాయకులకే ఉంటవి. ఆల్లంతా ఆగమాగం చేస్తంటే నువ్వేం తమాషా చూస్తన్నవా?' అని భార్య కేసి తిరిగి, 'ఈడి పేరేంటి, పిచ్చేశ్వర్రావు కదూ?' అని అడిగి, మళ్ళీ డాక్టర్‌కేసి చూస్తూ, 'నేను చిటికేస్తే వెయ్యి ముక్కలవుతావు' అన్నాడు.

ఈలోగా డాక్టర్‌ సైగ చేయడంతో నర్సు వచ్చి అప్పారావును కూర్చోబెట్టింది. అప్పారావు ఆమెను చూస్తూనే చటుక్కున ఆమె బుగ్గలు నిమిరాడు. రెండు చేతుల్తో ఆమె తలవంచి నడినెత్తిన ముద్దుపెట్టుకుని, మెత్తగా నవ్వుతూ 'నర్సులారా... అమ్మలారా... అక్కలారా... రాబోయేది స్వర్ణయుగం. నేనే సీఎం అవుతా. అప్పుడు మీకందరికీ బంగారు సిరెంజీలు ఇస్తా. వాటితో పొడవడానికి ఉచితంగా రోగుల్ని సరఫరా చేస్తా. నా మీద మా ఆవిడ, ఈ డాక్టరు కుట్ర పన్నుతున్నారు. కానీ, జనమంతా నా వెనకే ఉన్నారు. బై ది బై... నువ్వు కొత్త ఆసుపత్రి కట్టుకోవడానికి భూమినిప్పిస్తా, దాని విలువలో సగం నాకిస్తావా? పోనీ నా పది రూపాయల కంపెనీ షేర్లు మూడువేలు పెట్టి కొనుక్కుంటావా?' అన్నాడు.

ఇంతలోనే డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు అతడికి ఓ ఇంజెక్షన్‌ ఇచ్చారు. దాంతో అప్పారావు ఏదో మత్తులో ఉన్నట్టుగా, 'నీ నాలుక తెగ్గోస్తా... నా జోలికొస్తే ఖబడ్దార్‌... నువ్వొక రావణాసురుడివి... కంసుడివి... హిరణ్య కశిపుడివి... లోఫర్‌వి... డాఫర్‌వి... అనకొండవి... తోడేలువి... కుక్కవి... గాడిదవి... తోలు వలుస్తా... తీట తీసేస్తా... చర్మం వలిచేస్తా... గుడ్డలిప్పదీస్తా... చెప్పుతో కొడతా...' అంటూ గొణగసాగాడు.

పంకజాక్షి వెక్కి వెక్కి ఏడుస్తూ 'ఈయనకి ఏమైందండీ?' అంది.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు 'మరేం ఫర్వాలేదమ్మా... రకరకాల రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, తిట్లు, శాపనార్థాలు విని విని మీవారి మనసు, బుర్ర గందరగోళానికి గురయ్యాయి. నేతలు ఇంతలా దిగజారి మాట్లాడటం, సహజంగా నెమ్మదస్తుడైన మీ వారిని కలవరపరచింది. అంతే!' అన్నారు.

'మరి ఈయనకి ఏంటండీ చికిత్స?' అంది పంకజాక్షి.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు ఆమెను ఆగమంటూ సైగ చేసి, అప్పారావు దగ్గరకు వెళ్లి, 'అప్పారావుగారూ, ఇప్పుడెలా ఉంది?' అన్నారు.

'నాకు కాదండీ... అవినీతిపరులు, చిత్తశుద్ధి లేనివారు, ప్రజల్లో విద్వేషాలు పెంచేవాళ్లు, నేరారోపణలు ఉండీ జైలుకెళ్లినా బెయిలు మీద వచ్చి సిగ్గులేకుండా జనానికి మాయమాటలు చెప్పేవారు, ప్రజల ఆస్తులు దోచుకునేవారు, అక్రమంగా కోట్లకు కోట్లు దోచుకున్నవారు... వీళ్లందరికీ ఉందండీ మాయరోగం! వీళ్లా చెప్పండి మన అభ్యర్థులు? ముందువాళ్లకు చెయ్యండి వైద్యం...' అన్నాడు అప్పారావు నీరసంగా.

'నేను కాదు, ఇలాంటి నీచ రాజకీయ నేతలందరికీ మీరే చక్కని వైద్యం చేయగలరు' అన్నారు డాక్టర్‌.

ఆ మాటలకు అప్పారావు ఉత్సాహంగా లేచి కూర్చుని 'నేనా... ఎలా?' అన్నాడు.

'మీ ఓటు వేయడం ద్వారా. అవినీతిపరులైన అసుర నేతల్ని మీ ఓటు అనే వజ్రాయుధంతో శిక్షించండి. పనిచేసే నేతనే ఎన్నుకోండి. మీ చేతిలోని ఓటే సమాజంలోని అన్ని రోగాలకూ చికిత్స' అన్నారు.

'మనసులో దిగులంతా మాయం చేశారు డాక్టర్‌' అంటూ అప్పారావు లేచి కూర్చున్నాడు. పంకజాక్షి ఆనందంతో కళ్లు తుడుచుకుని డాక్టర్‌కి నమస్కరించింది.

PUBLISHED IN EENADU ON 30.04.2014

శనివారం, ఏప్రిల్ 26, 2014

అసలు నిజం గ్రహిస్తే...
సెక్రట్రీ' 
'.......' 
'సెక్రట్రీ! ఏంటయ్యా, పిలిచినా పలక్కుండా ఏదో ఆలోచిస్తున్నావ్‌?'
'స...స... సార్‌! మన్నించండి. మనసేం బాగోలేదండి'

'అరెరె, అదేంటయ్యా, ఉన్నట్టుండి ఆ కన్నీళ్లేమిటి?'

'గుండె తరుక్కుపోతోందండయ్య'

'ఎందుకయ్యా అంతలా దుఃఖపడుతున్నావు... కొంపదీసి ప్రజలుగానీ చైతన్యవంతులైపోలేదు కద?'

'అబ్బే, అదేం లేదు సార్‌! ప్రజలింకా మత్తులోనే ఉన్నట్టున్నారు. నా బాధ అందుక్కాదు సార్‌. ఎగస్పార్టీవాళ్లంతా మిమ్మల్ని ఏకేస్తున్నారు సార్‌. ఒకాయన మిమ్మల్ని అవినీతి అనకొండ అంటున్నాడండి. మరొకాయన మిమ్మల్ని పట్టుకుని దొంగలముఠాకోర్‌ అంటున్నాడండి. బయటకి వెళ్తే ఈ మాటలన్నీ వినబడి మీ సెక్రట్రీగా సిగ్గుతో చితికిపోతున్నానండయ్య'

'ఓస్‌, ఆ మాత్రం దానికేనా ఇంత బెంబేలు పడిపోతున్నావ్‌? అయినా అన్నది నన్నయితే నిన్నన్నట్టు బాధపడతావేంటి?'

'వూరుకోండి సార్‌, మిమ్మల్ని అంటే- మీ దగ్గర పనిచేస్తున్న నన్ను అన్నట్టు కాదా చెప్పండి? ఇలాంటి మాటలు వింటుంటే ఛీ... వెధవ బతుకు, వెధవ బతుకు అనిపించి, గుండెలోతుల్లోంచి ఏడుపు ఎగదన్నుకుని వచ్చేస్తోందండి. మనిషన్నవాడు విని తట్టుకోగలిగే విమర్శలేనాండి అవి? ఏ మాత్రం హృదయం ఉన్నా కలుక్కుమనకుండా ఉంటుందా చెప్పండి? మనసనేది ఉంటే గింటే బతుకు మీదే అసహ్యం వేయదాండీ? ఏమాత్రం అభిమానం ఉన్నా బుర్ర భూమిలోకి కూరుకుపోదండీ? మన మీద తీవ్రమైన, సహేతుకమైన, ప్రాథమిక సాక్ష్యాధారాలతో కూడిన ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిజంకాదని నిరూపణ అయ్యేవరకూ అన్నం నోటికి సహిస్తుందా చెప్పండి? రాత్రిళ్లు సుఖంగా నిద్ర పడుతుందా? అసలు మనస్ఫూర్తిగా నవ్వెలా వస్తుందండీ? ఇంట్లోవాళ్లకే మొహం చూపించలేకపోతామే, ఇక ప్రజల ముందు ఎలా నిలబడగలమండీ? అసలిలాంటి భావాలు కలగనివాడు మనిషేనంటారా?'

'ఆపెహె... ఎదవ ఏడుపూ నువ్వూను. ప్రపంచమంతా ఓదార్చగలుగుతున్నాను కానీ, నిన్ను మాత్రం వూరుకోబెట్టలేకపోతున్నాను. కొత్తగా పన్లోకి చేరావనీ, విశ్వాసం ఉన్నవాడివనీ తెలుసుకాబట్టి తమాయించుకున్నాను. అసలింతకీ నువ్వు బాధపడుతున్నావో, లేక నన్ను నానా మాటలూ అంటున్నావో తెలీటం లేదురా బాబూ! నీ అమాయకత్వంగూలా! రాజకీయాల్లో ఇవన్నీ సహజమే కదరా?'

'రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని నాకూ తెలుసండి. కానీ, వాళ్ల ఆరోపణల్లో కొన్ని విషయాలు మాత్రం ఎంతకూ మింగుడుపడటం లేదండి. నేనంటే కొత్తగా చేరాను కానీ, ఒకప్పుడు మీ ఆస్తులకు, ఇప్పటి మీ సంపదకు ఎక్కడైనా పొంతన ఉందాండీ? ఇప్పుడు మీ వ్యవహారాలన్నీ స్వయంగా చూస్తుంటే అబ్బో... నా బాసు ఇంత మహర్జాతకుడా అని ఓ పక్క ఆనందం కలుగుతూనే మరోపక్క వాళ్లంతా అంటున్నట్టు ఇంత కొద్దికాలంలో ఇన్నేసి కోట్లు, భవంతులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఎలా సాధ్యమయ్యాయా అనే అనుమానం కలుగుతుంది కదండీ?'

'అంటే నేనేదో కిరికిరిలు చేశానని నిర్ణయానికి వచ్చేశావన్నమాట. అంతేనా?'

'అబ్బెబ్బే, నా నిర్ణయంతో పనేముందండీ? నేను మీ దగ్గర ఉద్యోగిని. కాబట్టి మీరెలాంటివారో నాకు ముందే తెలుసు కదండీ? కానీ, నా ఆలోచనలన్నీ జనానికి కూడా వస్తాయేమోనని బెంగండి. అప్పుడేంటండి తమరి గతని దిగులండి'

'వార్నీ తస్సదియ్యా! చంపుతున్నావురా, నీ అనుమానాలు, బెంగలు, ఏడుపుల్తోటి. వాళ్ల ఆరోపణలు సరే, మనం కూడా వాళ్ల మీద దుమ్మెత్తి పోస్తున్నాం కదరా, వూరుకుంటున్నామా?'

'అవుననుకోండి. కానీ, వాళ్లంతా తాజా సంగతుల మీద మాట్లాడుతుంటే మీరెప్పుడో దశాబ్దాల నాటి విషయాలు లేవనెత్తుతున్నారండి. మీ నాన్న సంగతి నాకు తెలుసులే అంటే, మీ ముత్తాత గురించి నాకూ తెలుసులే అని బూకరించినట్టుందండి మీ వ్యవహారం'

'రాజకీయాల్లో నిస్సిగ్గుగా నిలదొక్కుకోవాలంటే ఇలాంటి అడ్డగోలు, బురద జల్లుడు విద్యలన్నీ నేర్చుకోవాలి కదరా? నువ్వు తప్పు చేశావని ఎవరైనా అంటే, అడ్డుకోకపోవడం నీదే తప్పని వాదించెయ్యాలి. తెలిసిందా?'

'నిజమేనండి. కానీ బెయిలు మీద ఉన్నోడికీ, మెయిలు మీద ఉన్నోడికీ తేడా తెలియదేంటండి? పైగా దేశవిదేశాల నుంచీ తాఖీదులు వస్తుంటే ఎన్నాళ్లు కళ్లు కప్పగలమా అని బెంగండి'

'ఒరేయ్‌, నువ్వు నా సెక్రటరీవా, సీబీఐ ఏజెంటువా, ఎఫ్‌బీఐ గూఢచారివా?'

'భలేవారండి బాబూ! నాకంతటి సీనెక్కడిదండీ? మీ కాళ్ల దగ్గర పడి ఉండేవాడిని. ఈ ఆలోచనలన్నీ జనంలో ఏమాత్రం కలిగినా ఏం చేయాలో తోచక ఏడుస్తూ కూర్చున్నానండి'

'ఓరి నీ సందేహాలు దొంగలెత్తుకెళ్లా! జనం గురించి నువ్వు బెంగపడకు. నిజానికి నా మీద నాకున్న నమ్మకం కన్నా, ప్రజల అమాయకత్వం మీద ఉన్న నమ్మకమే నాకెక్కువ. మనం విందుభోజనం చేస్తున్నా, చేయి విదిలించిన మెతుకులు తిని సంబరపడే సామాన్యులు వాళ్లు. అందుకనే నాకంత దిలాసా, భరోసా, కులాసా... తెలుసా? నా చుట్టూ ఆరోపణలు, విమర్శలు, విచారణలు, రిమాండ్‌లు, కమాండ్‌లు, హైకమాండ్‌లు, కరెంటులు, వారెంటులు, జాయింటులు... అన్నీ చుట్టుముట్టున్నాయని నాకూ తెలుసు. అందుకే ఐసీయూలో రోగికి ఆక్సిజన్‌ ఎంత అవసరమో, నాకిప్పుడు అధికారం అంత అవసరం. అందుకోసమే నా తపన, నటన... అన్నీను. కాబట్టి మన జనం తెలివిమీరనంతవరకు నాకు, నా నీడన నీకు ఎలాంటి బెంగా అక్కర్లేదు. అర్థమైందా? ఇక కుదుటపడి ప్రచారం సంగతేంటో చూడు'

'ఆహా... ఇన్నేసి పన్లు చేసి కూడా ఎంత తెగింపు, ఎంత బరితెగింపు! నాకిక ఏ చింతా లేదండి'

PUBLISHED IN EENADU ON 26.04.2014

మంగళవారం, ఏప్రిల్ 22, 2014

ప్రజాధన చోరాగ్రేసరుడు


'ఎవరండీ మీరు?'
'నేనొక సంఘం అధ్యక్షుడినండి. మిమ్మల్ని ప్రత్యేకంగా కలవడానికి వచ్చా'

'ఏ సంఘం అది?'

'అఖిలాంధ్ర దొంగ, దుండగ, దుర్జన, దగుల్బాజీ, నీచ, నికృష్ట, నయవంచక, అవినీతి, అక్రమార్కుల సంఘమండి. అఖిల భారత, అఖిల ప్రపంచ శాఖలకు అనుసంధానమండి'

'అద్సరే, కానీ నన్ను కలవడం ఎందుకు?'

'భలేవారండి బాబూ! మనకో సంఘం ఉంటే దాని భావజాలంతో అత్యంత సన్నిహిత సారూప్యం ఉన్న పెద్దమనుషులను కలుస్తుంటాం కదండీ? పైగా మీకు మేమంతా ఏకలవ్య శిష్యులమండి. మా కార్యాలయాల్లోను, మా ప్రతినిధుల ఇళ్లలోను మీ ఫొటో పెట్టుకున్నామండి. రోజూ తమరి మొహం చూసి కానీ మా వెధవ పనులను మొదలుపెట్టమండి. ఎప్పటి నుంచో మిమ్మల్నోసారి కలవాలనండి. ఇదిగో, ఇవాళ కుదిరిందండి'

'ఇంతకూ నాతో మీకేం పని?'

'ఇన్నాళ్లూ మేమేదో ఒక సంఘం పెట్టుకుని సభ్యుల సంక్షేమానికి ఏదో అరకొరగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నామండి. అసలిలాంటి సంఘం ఒకటి పెట్టి కడుపుకక్కుర్తితోనో, కడుపు మంటతోనో, ఎదగలేకో, ఎదిగే దారిలేకో, అవకాశాలు కనబడకో దారితప్పిన సహచరుల సాధకబాధకాలు పట్టించుకుని, వాళ్లు మరింత రాణించే తోడ్పాటు అందించాలనే ఆలోచన వచ్చినందుకు ఇంతకాలం నాలో నేను పొంగిపోయేవాడినండి. కానీ, నేనెంత అమాయకుడినో ఇప్పుడు అర్థమైందండి. ఎలాంటి సంఘం లేకుండానే మీరు మనలాంటివాళ్లను ఉన్నపళంగా ఉద్ధరించేశారండి. అందుకే నాకు, నా సంఘానికి, మా సభ్యులకు మీ ఆశీర్వచనాలు అందిస్తారని చక్కా వచ్చానండి'

'ఓ... అదా సంగతి! మీరు చెప్పిందంతా బాగుంది కానీ, దారి తప్పిన సహచరులనడమే నాకు నచ్చలేదు. అసలిదే సరైన దారి అయినప్పుడు ఇక తప్పడమేంటి?'

'ఆహా... ఓహో... చూశారా, ఎంత చక్కని పాయింటు లాగారో? నిజానికి నా ఉద్దేశం మనవాళ్లంతా సంఘం దృష్టిలో దారితప్పినవారేనండి. మన దృష్టిలో మనమే ఘనులమండి'

'సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నాకు నచ్చారు. మరి నేనేదో ఉద్ధరించేశానని అంటున్నారు, అంత గొప్ప పనులు నేనేం చేశాను?'

'అమ్మమ్మ, ఏదో వినయం కొద్దీ తమరు అలా అంటున్నారు కానీ- తమంతటి వారు తమరేనండి! ఇంతకాలం మా సంఘ సభ్యులంతా ప్రజల సొమ్మును నేరుగా దోచుకుంటూ చట్టవ్యతిరేకులమనే ముద్ర వేయించుకున్నామండి. కానీ తమరు? దోచుకున్నది అదే ప్రజల సొత్తయినా, అదంతా చట్టబద్ధంగా సాగినట్టుగా భ్రమ కల్పించారండి. ఆ లెక్కన చూస్తే, మేమంతా ముసుగేసుకుని దొంగ పనులు చేస్తే, తమరు దొంగ పనులకే ముసుగేశారన్నమాటండి. నిజానికి అధికారం లేకుండానే తమరు ఇన్నేసి కోట్లను కొబ్బరి బొండంలో నీళ్లు తాగినట్టు పీల్చేశారంటే, అధికారం అంటూ మీకు అందింతే ఇంకెంతగా ఒలుచుకు తినేస్తారో, తలచుకుంటే ఒళ్లు పులకించి పోతోందండి'

'మీరు నా గురించి బాగానే తెలుసుకున్నారు కానీ, అంతా నేనొక్కడినే తిన్నట్లు చెప్పడం మాత్రం నచ్చలేదు'

'అబ్బెబ్బే, నేనింకా అక్కడి దాకా రాలేదండి. తమరెంత దయార్ద్ర హృదయులో నాకు తెలుసండి. మాలాంటివాళ్లెందరినో కోట్లకు పడగలెత్తించినవారు తమరేనండి. మీ చల్లని నీడలో చిన్నాచితకా దొంగలే కాదండి, బడాబడా చోరశిఖామణులూ పచ్చగా పచ్చనోట్లు పట్టేశారన్న నిజం దాచినా దాగనిది కాదా చెప్పండి? జాలిగుండెతో పాటు అపారమైన తెలివితేటలూ జతపడటం మీతోనే సాధ్యమైందండి'

'పొగడ్డానికి అంటున్నారా? నాకు పొగడ్తలంటే నచ్చదు. మీ మాటలకు ఆధారాలు చూపించగలరా?'

'ఇన్నేసి దగాకోరు పనులు చేసి కూడా పొగడ్తలంటే గిట్టకపోవడమనేది గొప్ప లక్షణం కాదండీ? ఇక మీ తెలివికి ఆధారాలు చూపిస్తా వినండి. ఇన్నేళ్లుగా మనరాష్ట్రంలో ఎందరెందరో అధికారం చలాయించారు. కానీ అసలిక్కడ ఇంతింతలేసి వనరులు ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకుని ఇన్నేసి కోట్లు బయటికి లాగవచ్చనే ఆలోచన ఎవరికైనా వచ్చిందాండీ? ఏళ్ల తరబడి తవ్వుకున్నా తరగని కోట్లాది టన్నుల ఖనిజాలున్న గనులు, కొండలు, ప్రాంతాలు ఉన్నాయని ఎవరు కనిపెట్టారు చెప్పండి? వాటిని అయినవారికి లీజుకిచ్చి గలీజు పనులు చేయవచ్చని, అప్పగించి అప్పనంగా ఆర్జించవచ్చని, కట్టబెట్టి కట్టలు పోగేయవచ్చని, ధారాదత్తం చేసి దోచుకోవచ్చని, ఇచ్చినట్టే ఇచ్చి పుచ్చుకోవచ్చని ఎవరికి తట్టింది చెప్పండి? అలాగే జన సంక్షేమం కోసం పథక రచన చేసి స్వజన సంక్షేమం చేసుకోవచ్చని, ప్రజల పేరు చెప్పి పనులు మొదలుపెట్టి ఆ ప్రజలు కష్టపడి కట్టే పన్నుల సొత్తును ఖజానా నుంచి ఘరానాగా దారి మళ్ళించవచ్చని ఒక్కరు... ఒక్కరంటే ఒక్కరికైనా తోచిందా చెప్పండి?'

'బాగుందండీ... ఇంతకీ నేనేం చేయాలంటారు?'

'మాకు మార్గదర్శనం చేయాలండి. మా సంఘాన్ని విస్తృతం చేయాలండి. మాకు మద్దతు ఇవ్వాలండి'

'తప్పకుండా. నిజానికి అది నా కల. అందుకే ఇప్పుడు అధికారానికి నిచ్చెనలు వేస్తున్నాను. నాతో పాటు చేతులు కలిపి కోట్లు కొట్టేసి నాకు వాటాలిచ్చిన దొంగలు, దగుల్బాజీలు, దగాకోరులను కూడా బరిలోకి దింపి అధికార పీఠానికి దారులు వేస్తున్నాను. ఎందుకంటే అవినీతికి అధికారం ఆక్సిజను లాంటిది. అది అందగానే వచ్చి కనబడండి. మీ సంఘ సభ్యులందరినీ కూడా కలుపుకొని రాష్ట్రమంతటా ఒక అవినీతి చట్రాన్ని పరుద్దాం. అక్రమాలను వ్యవస్థీకృతం చేద్దాం. అకమ్రార్జనకు రహదారులు నిర్మిద్దాం. బడుగు దొంగలందరికీ పక్కా ఇళ్లు నిర్మిద్దాం. దుండగులందరూ తలెత్తుకుని, బోర విరుచుకుని నడిచేలా చేద్దాం. మన కార్యకలాపాలని దేశానికి, ప్రపంచానికి కూడా విస్తరిద్దాం. సరేనా?'

'ఆహా... ఎంత మంచి మాట సెలవిచ్చారు? చిత్తం!

PUBLISHED IN EENADU ON 22.04.2014

శుక్రవారం, ఏప్రిల్ 18, 2014

ప్రచారంలో పదనిసలు!


'నమస్కారం సార్‌...' 
'రావయ్యా సెక్రట్రీ... రా! అరెరె, అదేంటయ్యా... వస్తూనే అలా నా ముందుకొచ్చి ఒంగున్నావేంటి?'
'తమరు పొడుగు చేతుల చొక్కా వేసుకుంటున్నారు కదండీ, నా వీపు మీద చేతులుంచి మడత పెట్టుకుంటారేమోననండయ్య'
'వార్నీ- చురుకైన వాడివేనయ్యా... పైకొస్తావు. అది సర్లేకానీ... ప్రచారం కోసం పాటలు రికార్డు చేయించమని చెప్పాను కదా, చేశావా?'
'ఓ చేశాను సార్‌. మంచి రచయితల చేత పాటలు రాయించి, గాయకుల చేత పాడించి తీసుకొచ్చానండి. వీటిని తమ ప్రచార సభల్లో మైకు సౌండ్‌ పెంచేసి వినిపిస్తేనండీ, జనం ఉబ్బితబ్బిబ్బయిపోతారంటే నమ్మండి'
'సెబాసయ్యా! కొత్తగా చేరినా దూసుకుపోతున్నావు. ఏదీ వినిపించు విందాం'
'తమరు స్వర్ణయుగం తెస్తానంటున్నారు కదండీ. దాని మీద పాటండి, వినండి...'
***
'బంగారం... బంగారం...
బతుకంతా ఇక బంగారం!
ఇచ్చారంటే నాకధికారం...
మార్చి పడేస్తా మీ గ్రహచారం!'
***
'పల్లవి బాగుందయ్యా... ఏదీ చరణం కూడా వినిపించు'
'చరణం ఇంకా బాగా కుదిరిందండి. ఇదిగో వినిపిస్తా వినండి...'
***
'బడుగు జీవుల పచ్చని పొలాలు...
బడా బాబులకు బంగారం!
మీ పేరిట చేసే పనులన్నీ...
మా కాంట్రాక్టర్లకు ఫలహారం!
ప్రజలకు చాటే పథకాలన్నీ...
నా అనుచరులకిక ఆహారం!
బంగారం... బంగారం...
బతుకంతా ఇక బంగారం!'
***
'ఆపెయ్‌ ఆపెయ్‌! ఏం సెక్రట్రీవయ్యా నువ్వు, ఇదేం పాట, నీకసలు బుద్ధుందా?'
'స...స... సార్‌! నన్ను క్షమించండయ్య. అధికారంలోకి వచ్చాక తమరేం చేస్తారో అదే చెప్పించమన్నారు కదండయ్య. అందుకే ఇలా రాయించానండయ్య. మరి ఇదే కదండీ చేసేది?'
'నీ తలకాయ్‌! అధికారంలోకి వచ్చాక మనమేం చేస్తామో కాదయ్యా... ఏం చేస్తామని ప్రజలకు చెప్పామో, అది రాయాలి'
'సార్‌... మన్నించాలి! కొత్తవాడిని కాబట్టి తెలీక అడుగుతున్నానండి. చెప్పడానికి, చేయడానికి మధ్య తేడా ఏంటండీ?'
'ఓరి వెర్రోడా! చెప్పడం వేరు, చేయడం వేరని తెలుసుకో. సర్లే, ఆ పాట పక్కన పెట్టెయ్‌... మిగతా పాటలేంటో వినిపించు చూద్దాం'
'అలాగే సార్‌, జనం తరచూ పాడుకునే ఒక కీర్తన ఆధారంగా రాయించానండి... వినండి'
***
'ఆతడొక్కడే...
మన నేత ఒక్కడే...
ఘన నేత ఒక్కడే...
మహా నేత ఒక్కడే... భళా నేత ఒక్కడే...'
'నిండార రాజు నంజుకునే భూమొకటే...
అండనే అనుచరులు ఆక్రమించు భూమొకటే...
గూండాల నేత గుంజుకునే భూమొకటే...
తొండైన పనులకు తగిలించే భూమొకటే...
ఆతడొక్కడే, మన నేత ఒక్కడే, ఘన నేత ఒక్కడే, భళా నేత ఒక్కడే...'
***
'ఆపరొరేయ్‌... ఇదేం పాటరా?'
'క్ష...క్ష... క్షమించండి సార్‌. ఏదో కీర్తన బాగుంది కదాని, వరస కట్టించానండి'
'అఘోరించావ్‌! ఇంకా నయం... నీ మీద నమ్మకంతో ఈ పాటలన్నీ ప్రచారానికి పంపించేశాను కాదు. ఇది కూడా పక్కన పడెయ్‌'
'అయ్యా, ఇవాళ లేచిన వేళేంటో బాగోలేదయ్యా. తమరి మూడ్‌ బాగోలేక నాకు మూడేలా ఉందండి. ఇక వస్తానండయ్య'
'సర్లే, కంగారుపడకు. నీ అమాయకత్వం చూస్తే జాలేస్తోందయ్యా. అందుకే క్షమించేస్తున్నాను. ఈ పాటలు బయటికి బాగోవు కానీ, మనలో మనకి కులాసాగా నవ్వుకునేలా ఉన్నాయిలే. ఇంకా ఏమున్నాయి?'
'అమ్మయ్య, ఎలాగైనా తమది జాలి గుండేనండయ్య. రాష్ట్రమంతా ఓదారుస్తూ నన్నెక్కడ ఏడిపిస్తారో అనుకున్నానండయ్య. ఈ పాట ఓ మంచి బుర్రకథండి. వినండి మరి...'
***
'వినరా ఓటరు వీరకుమారా... విజయగాథ నేడు...
తందాన తాన!
ప్రజాసేవకని పాలనకొచ్చిన పరమ నేత గాథ...
తందాన తాన!'
***
'అబ్బో... అబ్బో... చాలా బాగుందయ్యా. పూర్తిగా వినిపించు'
'అయితే వినండి మరి'
***
'పచ్చని సీమల నడిచాడా... నచ్చిన భూముల చూశాడా...
భళా మేలు భాయి తమ్మూడా... మేలు భళారో రాజానా!
గనులను చూసి మురిశాడా... గల్లా పెట్టెలు నింపాడా...
భళా మేలు భాయి తమ్మూడా... మేలు భళారో రాజానా!
ప్రాజెక్టులు మొదలెట్టాడా... పచ్చనోట్లను పట్టాడా...
కష్టాల కబుర్లు చెప్పాడా... ఖజానా కొల్లగొట్టాడా...
మత్తున ముంచీ తేల్చాడా... మహమ్మారిగా మారాడా...
నీరు పారునని పలికాడా... నిధులన్నీ మళ్లించాడా...
తరికిట తరికిట తా!'
***
'హ హ్హ హ్హా! తెగ నవ్వొస్తోందయ్యా. ఇవి జనానికి వద్దులే కానీ, నా సెల్‌ఫోన్లో వేయించు. ఇయర్‌ ఫోన్స్‌లో వినసొంపుగా ఉంటాయి!

PUBLISHED IN EENADU ON 18.04.1014

మంగళవారం, ఏప్రిల్ 15, 2014

సవాళ్ల ఎత్తుగడ!


'ఏంట్రా, అలా మొహం వేలాడేసుకుని ఉన్నావ్‌?'
'ఏముందండీ, ఎగస్పార్టీవాళ్లంతా కట్టకట్టుకుని నా మీద పడుతున్నారండి. నేనొట్టి అవినీతి పరుడినటండి. రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని కోట్లకు కోట్లు దోచేశానటండి'

'ఓసింతేనా? ఈ మాత్రం దానికే బెంబేలు పడితే ఎట్లారా, పైగా వాళ్లు అంటున్నవన్నీ నిజాలేగా?'

'నిజమేననుకోండి! కానీ, బాహాటంగా అందరూ పదేపదే అంటుంటే అమాయక ప్రజలు ఎక్కడ నమ్మేస్తారోనని భయమండి'

'ఒరేయ్‌, నువ్వేదో ప్రచారంలో అలిసిపోయి గందరగోళానికి గురవుతున్నావు కానీ, కాస్త కుదుటపడు. నిన్నెవరైనా గబుక్కున నిజాయతీపరుడు, నికార్సయిన నేత అంటే- ఉలిక్కిపడాలి. ఎందుకంటే మనలో ఏ మూలైనా అలాంటి పనికిమాలిన మంచి గుణాలు ఉండేడిశాయేమోనని కంగారుపడాలి. వెంటనే మనల్ని మనం తరచి చూసుకుని వాటిని వదిలించుకోవాలి. అంతేకానీ తిడితే బెంగేంట్రా, గర్వపడాలి కానీ! మన నీచ చరిత్ర పత్రికల పుటల్లోకి ఎక్కిందని, చెరిపేసినా చెరిగిపోనంత చెడు చేశామన్నమాట వినీ లోలోపల సంబరపడిపోవాలి. అర్థమైందా?'

'వూరుకోండి. మీరెప్పుడూ తిరకాసుగానే మాట్లాడతారు. నన్ను చూసుకుని నేనెప్పుడూ గొప్పగానే భావిస్తానండి. నా అపారమైన తెలివితేటలవల్లనే కోట్లకు పడగలెత్తానని తెగ ముచ్చటపడిపోతానండి. అదంతా సరే కానీ, బరిలో ఉన్న తతిమ్మావాళ్లందరికీ నా వెధవ పనులే ప్రసంగాంశాలైపోతున్నాయండి. ఎన్నికలు దగ్గరపడిన ఈ సమయంలో ఎట్నుంచి ఎటొస్తుందోనని గుబులేసి మీ దగ్గరకి వచ్చానండి. పైగా ఈసారి యువ ఓట్లే కీలకమంటున్నారు కూడానూ...'

'ఇప్పుడర్థమైందిరా నీ బాధేంటో. నీకు తెలియక అడిగావని భ్రమలో పడను కానీ, అడిగావు కాబట్టి చెబుతా, గుర్తెట్టుకో! ఎదుటివాడు మన మీద బురద జల్లితే మనం కంగారుపడి అదంతా తుడుచుకునే పన్లో పడకూడదొరేయ్‌. దాని సంగతి తరవాత చూసుకోవచ్చు. ముందు వాడి మీద తారు పోసేయాలి. మన ఎదురుదాడికి వాడి దిమ్మ తిరిగిపోవాలన్నమాట. నీ అంత దిక్కుమాలిన నీచ చరిత్ర ఇంకెవరికీ ఉండదు కాబట్టి- నువ్వు ఎదుటివారిలో లోపాలు వెదకడం కాస్త కష్టమేననుకో. కానీ, ఎలాగోలా ఎప్పటెప్పటి సంగతులో ఎత్తి ఎదురెట్టెయ్యాలి. మోకాలికి, బోడిగుండుకీ ముడిపెట్టి అడ్డగోలుగా తిట్టిపోయాలి. నిజాన్ని ఎదుర్కోలేకపోయినప్పుడు మనకి తిట్లే శరణ్యమని తెలుసుకో. తెలిసిందా?'

'తెలిసింది కానీ, అక్కడే మనం కాస్త వీకండి. ఎంతలేసి నికృష్ట పనులు చేసినా, పైకి మాత్రం ఏమీ తెలియని అమాయక మొహంపెట్టి మెత్తగా నవ్వడం గట్రా అలవాటైపోయింది కదండీ? గబుక్కున తిట్లు లంకించుకుంటే ఎదురుతిరిగి జనంలో మన ఇమేజి డామేజి అవుతుందేమోనని సందేహమండి!'

'అదా నీ శంక? అవన్నీ పక్కనపెట్టెయ్యి. మహా మహా శాసనసభలోనే అమ్మ మాట తీసుకొచ్చి అందరూ సిగ్గుపడేలా మాటలు వాడేసిన మహానేతలున్నారురా మన చరిత్రలో. వాళ్లనోసారి గుర్తుకు తెచ్చుకో. మీ అమ్మకు నువ్వెందుకు పుట్టావా అని బాధ పడే రోజొస్తుందంటూ నిండుసభలో ఎగస్పార్టీ నేతను అవమానపరచినవాళ్ల అడుగుజాడలే నీకు శరణు. ఆ మాటలకు పై సంగతులేసి, నీకు భార్యనెందుకయ్యానా అని నీ భార్య బాధపడుతుందను. నీకెందుకు పుట్టానా అని నీ కొడుకు ఏడుస్తాడను. అనడానికేముందిరా? అడ్డమైనట్టు అనొచ్చు! అది నేర్చుకో. ఇక నువ్వు గిల్లితే చాలు రెచ్చిపోయే ఏ ప్రముఖుల చేతనో ఎదుటివారిని తిట్టించు. నీ కనుసన్నల్లో నడిచే పేపరో, ఛానెలో ఉంటే వాటిలో పదేపదే చూపిస్తూ మాయ చేయడానికి ప్రయత్నించు. అన్నింటికన్నా గొప్ప సంగతొకటుందిరోయ్‌... అదే సవాలు! నువ్వే నానా మాటలు, అభూత కల్పనలు, అబద్ధాలు కలగలిపేసి అడ్డగోలు వాగుడు వాగేసి... ఇవన్నీ నిజం కాదని నిరూపించగలవా అని బహిరంగ సవాలు విసిరెయ్‌. నువ్వు నిరూపిస్తే నా ఆస్తులన్నీ నీకిచ్చేస్తా, కాకపోతే నీ ఆస్తులన్నీ నాకిచ్చేస్తావా అని తొడకొట్టెయ్‌. ఎదురెట్టి వీరంగం ఆడే విద్యలో ఇదొక కొత్త అధ్యాయం'

'ఈ కొత్త నీచోపాయమేదో బాగుందండోయ్‌! కానీ, జనం నమ్ముతారంటారా?'

'నీ వెర్రి సవాళ్లకి, పిచ్చి వాగుడికి ఎదుటివాడు చలించకపోయినా అమాయక జనం మాత్రం గందరగోళంలో పడతారనీ, ఎంత ధైర్యం లేకపోతే ఇలా సవాలు చేస్తాడు, ఈడు చెప్పేదంతా నిజమే కాబోలని కాస్తో కూస్తో భ్రమలో పడాలనేగా నీ తాపత్రయం? ప్రస్తుతానికి ఇదే నీకున్న ఏకైక మార్గం. అయినా నువ్వు భయపడుతున్నట్టు చైతన్యవంతులైన జనం నమ్మలేదనుకో. నిజాలు, నైజాలు తెలుసుకున్న ప్రజలంతా ఏకమై నిన్ను ఎన్నికల్లో ఛీ కొట్టారనుకో. అహ... అనుకో. నీకు పోయేదేముందిరా? తరతరాలకు తగినంత బొక్కేశావు, చట్టం నోరు నొక్కేశావు. ఎక్కడెక్కడ ఎంతెంత ఉందో తెలియనంతగా కూడబెట్టి కోటలు కట్టేశావు. ఇంకేంటి బెంగ? కూడబెట్టిందంతా కరిగిపోయేవరకూ తింటూ కూర్చున్నా నీ ముని ముని మునిమనవల వరకు చీకూ చింతా లేదుగా? ఏమంటావ్‌? ఇంకాసేపు మాట్లాడుకుంటే పచ్చి నిజాలు బయటికి వచ్చేస్తాయి కానీ ఇక పోయిరా!'

PUBLISHED IN EENADU ON 15.04.2014

శుక్రవారం, ఏప్రిల్ 11, 2014

అనుచిత హామీలు


'గురూగారూ, నమస్కారమండి'
'ఏంట్రోయ్‌, మొహం పెట్రొమాక్స్‌ లైట్‌లా వెలిగిపోతోంది! నెత్తిమీద ఆ కాగితాల కట్టేంటి?'

'మీకు తెలియనిదేముంటుందండీ. మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నందుకు ప్రయోజనం ఉండాలని ఎన్నికల్లో నిలబడాలనుకుంటున్నా. ప్రజానీకానికి నేనేం చేయబోతున్నానో చెప్పడానికి హామీలన్నీ రాసుకొచ్చానండి'

'ఓ... బాగా ఎదిగావురా, ఎన్నికల మ్యానిఫెస్టో రాసుకొసుకొచ్చావన్నమాట!'

'అవునండి. మీరంటుంటారు కదండీ... ఏ పనైనా చేసేముందు బాగా కసరత్తు చేయాలనీ? అందుకని తెల్లారగట్ల లేచి మరీ వంద బస్కీలు, రెండొందల ఆసనాలు వేసి ఆ తరవాతే రాసుకొచ్చానండి'

'వార్నీ... నువ్వెక్కడ దొరికావురా? కసరత్తంటే అది కాదురా! కూలంకషమైన పరిశీలన. ఇతర పార్టీలకన్నా భిన్నంగా ఉండాలని అర్థం'

'నేనూ అదే చేశా గురూగారూ! మీరు ఇతర పార్టీల హామీలన్నీ చదివేసి రుబ్బేసి రమ్మన్నారు కదండీ? పొద్దున్నే బస్కీలు అవీ చేసేశాక, మొత్తం పేపర్లన్నీ చదివేసి, రుబ్బురోలులో వేసి రుబ్బేసి ముద్ద చేసేశానండి. దాన్ని నమిలి మింగేసి కాగితం తీసుకుని రాయడం మొదలెట్టానండి. ఇక చూస్కోండి గురూగారూ... కలం పరిగెత్తిందంటే నమ్మండి. ఈ కాగితాలన్నీ ఇవేనండీ!'

'చంపావురా! నీలాంటి శిష్యుణ్ని చేర్చుకున్నందుకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. సర్లే, ఏంచేస్తాం? ఏమేమి రాశావో చదివేడు. ఎలాగూ వదలవు కదా?'

'అయితే వినండి. ముందుగా విద్యా పథకమండి. మిగతా పార్టీలన్నీ ఏవేవో చెత్త రాశాయండి. నేనలా కాదండి. యువతీయువకుల పెళ్లిలోనే ఈ పథకం ప్రారంభమవుతుందండి. పిల్లలు పుట్టకుండానే కాన్వెంట్లలో సీట్లు రిజర్వ్‌ చేసి పెడతామండి. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను కొత్త దంపతులకు అందజేస్తామండి. ఆ పళంగా వాళ్లు ఓ పక్క కాపురం చేసుకుంటూనే ఈ పుస్తకాలు చదివి అక్షరాలు, గుణింతాలు, ఎక్కాలు, రైములు, పద్యాలు గట్రా బట్టీ పట్టాలని చెబుతామండి. భారతంలో అభిమన్యుడు పుట్టకముందే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు, పుట్టబోయే బిడ్డలు ఎంచక్కా సగం చదువు కడుపులోనే నేర్చేసుకుంటారన్నమాటండి. ఎలాగుందండీ?'

'కళ్లు తిరుగుతున్నాయిరా. కానీ, నువ్వెలాగూ వూరుకోవు కానీ, ఆ మిగతావి కూడా చెప్పెయ్‌'

'తరవాత వైద్యమండి. ఇది ఆరోగ్య ధీమా అనే నిర్బంధ పథకమండి. ప్రతివాళ్లు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలని ప్రచారం చేస్తామండి. జలుబొస్తే జరిమానా, జ్వరమొస్తే జైలుశిక్షని భయపెడతామండి. అప్పుడు ప్రజల్లో చైతన్యం పెల్లుబికి జాగ్రత్తగా ఉంటారండి. అందరూ రోజూ ఆసుపత్రికి వెళ్లి నాలుక, నాడీ, బీపీ గట్రా చూపించుకు తీరాలని షరతు విధిస్తామండి. దీనివల్ల ముందే జాగ్రత్త పడొచ్చండి. ఒకవేళ ఏ రోగమొచ్చినా జైళ్లలో పెట్టి జాగ్రత్తగా వైద్యంచేసి తిరిగి ఆరోగ్యవంతులవగానే వదిలేస్తామండి'

'నీ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయిరా? మిగతావి కూడా అయిపోయాక ఏకంగా డాక్టర్‌ దగ్గరకి వెళతాలే. చదివెయ్‌'

'ఇక పన్నుల విధానాన్ని పారదర్శకం చేస్తానండి. ప్రతి వస్తువు మీద విడివిడిగా పన్నులు వేయడం, ఆనక జనం గగ్గోలు పెట్టడం లేకుండా ముందే తీసేసుకుంటామండి. ఉద్యోగులైతే జీతాల్లో పన్నుల కోత ఉంటుందండి. వ్యాపారులైతే ఆదాయంలోంచి లాగేస్తామండి. అప్పుడు ఖజానా నిండిపోతుందంటే నమ్మండి'

'ఒరేయ్‌, నీర్సంగా ఉందిరా... ఇంకా అవలేదా?'

'అవుతాయవుతాయి... ఆగండి మరి! ఆడవాళ్లకు ప్రత్యేక పథకాలున్నాయండి. ఏ మహిళకైనా రొంప పడితే చీదుకోవడానికి జేబు రుమాలు పంచిపెడతానండి. ఆడాళ్లందరికీ అట్లకాడ, అప్పడాల కర్ర అందించి ఆకట్టుకుంటానండి. యువతులకైతే బొట్టుబిళ్లలు, కాటుకలు, లిప్‌స్టిక్‌లూనండి. వీధికొక ప్రభుత్వ దర్జీని పెట్టి చీరలు, జాకెట్లు చిరిగితే ఉచితంగా కుట్టించి పెడతానండి. మగవాళ్లంతా ఆదివారం ఇంట్లో వంట చేయాలని నిబంధన పెడతానండి. మహిళా ఉద్యోగులైతే వారానికి రెండుసార్లు ఆఫీసుకొస్తే చాలని చెబుతానండి'

'కడుపులో తిప్పుతోంది కానీ, తమాయించుకుంటాలే. మిగతావేంటి?'

'నేరాలు అదుపు చేయడానికో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందండి. నేరస్థులు, రౌడీలు, గూండాలందరికీ నిరాధార్‌ కార్డులు జారీ చేస్తానండి. అందరూ పేర్లు నమోదు చేసుకుంటే పట్టుకోవడం సులువు కదండీ? ఇక ఉచిత హామీలైతే ఉచితానుచితాలు మరిచి మరీ ఆలోచించానండి. కూలీలకు కంప్యూటర్లు పంచుతానండి. వాళ్లు ఎప్పటికప్పుడు కూలీ డబ్బులు ఎన్నొచ్చాయో నమోదు చేసుకోవచ్చండి. బిచ్చగాళ్లకు కూడా ఓట్లుంటాయి కదండీ. కాబట్టి, వాళ్లు అడుక్కోవడానికి కొత్త సీవెండి బొచ్చెలు పంచుతానండి. నిరుపేదలకు ఉచిత గోచీలు, వృద్ధులకు వూతకర్రలు అందిస్తానండి... ఇవన్నీ శాంపిల్‌గా కొన్నేనండి. కానీ, ఒకే ఒక్క సందేహం గురూగారూ! రేప్పొద్దున అధికారంలోకి వస్తే ఇవన్నీ నెరవేర్చగలనా అనేదే బెంగండి. ఏమంటారు?'

'నీకా బెంగ అక్కర్లేదురా! నీ దిక్కుమాలిన హామీలతో నువ్వెలాగూ అధికారంలోకి రావు. కాబట్టి నిశ్చింతగా ఉండు. అర్జంటుగా ఆంబులెన్స్‌ పిలు. నాకు స్పృహ తప్పుతోంది. అదొచ్చాక ముందు నన్ను ఆసుపత్రిలో చేర్పించి తరవాత ప్రచారానికి తగలడు!'

PUBLISHED IN EENADU ON 11.04.2014

బుధవారం, ఏప్రిల్ 09, 2014

జనమే జనమేజయులు


'డాక్టర్‌ గారూ... డాక్టర్‌ గారూ...'
'ఎవరండీ మీరు? అలా కంగారు పడుతున్నారేంటి? కుర్చీపై కాళ్లు పైకెత్తుకుని కూర్చుని చుట్టూ భయంభయంగా చూస్తున్నారేంటి?'

'ప..ప..పాములేమైనా ఉన్నాయేమోనని..'

'ఛ..వూరుకోండి. మా ఆసుపత్రిలో పాములేంటి? ఇంతకీ మీరెవరు?'

'నా పేరు పీడకలల పాపారావండి. భయంకరమైన కలలు వస్తుంటాయండి. మీరు గొప్ప వైద్యులని విని వచ్చానండి...'

'ఓ... అదా? రాత్రి కలలోకి పాములేమైనా వచ్చాయా?'

'అవునండి బాబూ.. హడలి పోయాను..ఆ దడ ఇంకా తగ్గలేదండి బాబూ..'

'సరే... కంగారు పడకుండా కలేంటో చెప్పండి..'

'ఓ రాత్రివేళ ఏదో చప్పుడైతే ఏంటాని నా మంచం పక్కన చూశానండి. ఓ నల్లత్రాచు పడగ విప్పి ఆడుతూ బుస కొడుతోందండి. వార్నాయనో.. అని ఒక్క ఉదుటన దూకేసి వీధిలోకి పరిగెత్తానండి. అక్కడండీ.. ఏం చెప్పమంటారండి బాబూ.. సినిమాల్లోలాగా... ఓ పెద్ద అనకొండ జరజరా పాకుతోందండి. నాలాగే చుట్టుపక్కల వాళ్లంతా ఇళ్లలోంచి బయటకి వచ్చేశారండి. ఎక్కడ పడితే అక్కడ పాములండి. మరి భయపడకుండా ఎలా ఉంటాను చెప్పండి?'

'అవును. మీ భయంలో అర్థం ఉంది. ఇంతకీ కల అయిపోయిందా?'

'ఎక్కడండి బాబూ! వూరు వూరంతా గగ్గోలు పెడుతూ పోలీస్‌ స్టేషన్‌కి పరిగెత్తామండి. అక్కడ చూద్దుం కదా, కుర్చీల్లో కట్ల పాములండి. దాంతో మండలాఫీసుకి ఉరికామండి. అక్కడ రెండు తలల నాగులండి. ఇలా ఏ ఆఫీసుకెళినా పసరికలు, జెర్రిగొడ్డులు, గోధుమ త్రాచులు, కొండచిలువలు, అనకొండలూనండి. అందరం పొలో మంటూ ఎమ్మెల్యే ఆఫీసుకు వెళ్లామండి. అక్కడ అయిదు తలల పాములున్నాయండి. ఆపై ఏకంగా అసెంబ్లీకే పోయామండి. అక్కడైతేనండీ... ఏకంగా వెయ్యితలల విషసర్పాలు కనిపించాయండి. చిత్రమేంటంటే, ఈ పాములు భూమి మీద బుసకొడితే ఆ భూమి బీడువారిపోతోందండి. ఇవి కొండల్ని సైతం చుట్టచుట్టేసుకుని కాటేస్తుంటే, ఆ కొండ మాడి మసైపోతోందండి. ఇదెక్కడి దిక్కుమాలిన కలండీ బాబూ? దీనికసలు వైద్యముందంటారా?'

'అన్నింటికీ వైద్యం ఉంటుంది. కాస్త నిదానించండి. మెలకువగా ఉన్నప్పుడు మెదడుకి చేరే సమాచారానికి వూహాశక్తి తోడై రాత్రిళ్లు కలలొస్తాయి. ఇప్పుడు చెప్పండి. నిన్న మీరు ఏం విన్నారు? ఏం చూశారు?'

'ఎన్నికల కాలం కదండీ? పత్రికల్లో ఘోరమైన అవినీతి కుంభకోణాల గురించి చదివానండి. సాయంత్రం ప్రతిపక్షనేత సభకెళితే ఆయనా అవే మాట్లాడాడండి..'

'అదీ సంగతి! మీలో ఏ రోగమూ లేదు. కానీ చాలా సున్నిత మనస్కులు. పైగా సామాజిక స్పృహ కూడా ఎక్కువనుకుంటాను. అందుకే ఈ కల వచ్చింది..'

'అంటే ఈ పిచ్చికలకి కూడా ఓ అర్థం గట్రా ఉండేడిశాయంటారా?'

'లేకేం? చెబుతాను వినండి. మీకు కనిపించిన పాములు అవినీతికి ఆనవాళ్లు. ఆ అవినీతి ప్రభావం ప్రతి ఇంటినీ సోకుతోంది. అందుకనే ఇళ్లలోకి పాములు దూరినట్టు కనిపించింది. వీధుల్లో అవినీతి అనకొండలు దర్జాగా తిరుగుతున్నాయి. మొరపెట్టుకోడానికి ప్రజలంతా ఏ కార్యాలయానికి వెళ్లినా అక్కడ అవినీతి పాతుకుపోయి కనిపిస్తోంది. ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అసెంబ్లీలోనే వేయితలల అవినీతి విషసర్పాలు మాటు వేశాయి. సామాన్యులు ఎక్కడికెళ్లినా లంచం బుస కొడుతోంది. ఓ వినతి పత్రం ముందుకు కదలాలంటే లంచం.. ఓ అనుమతి కావాలంటే లంచం.. ఇలా ఎక్కడ పడితే అక్కడ అవినీతి పుట్టలు పోసింది. ప్రజలకు చెందిన ప్రభుత్వ భూముల్ని అవినీతి పరులు ఆక్రమించుకుంటున్నారు. కలలో పాములు కొండల్ని చుట్టుకోవడమంటే గనులను దోచుకోవడమన్నమాట. ఇప్పుడు అర్థమైందా పాపారావుగారూ!'

'భేషుగ్గా డాక్టర్‌గారూ! కానీ ఈ అవినీతి సర్పాలను ఏం చేయాలో కూడా నాకు కలలో వస్తే బాగుండేది..'

'వాస్తవ పరిస్థితులే కలగా మారతాయి కాబట్టి మీకు పరిష్కారం తోచదు. కలని విశ్లేషించుకుని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి..'

'మరిప్పుడు నేనేం చేయాలంటారు?'

'అవినీతి సర్పయాగం!'

'అంటే.. అప్పుడెప్పుడో జనమేజయుడు సర్పయాగం చేసినట్టా? నాకంతటి శక్తి ఎక్కడిదండీ?'

'అదిగో అలాగే అనుకోకూడదు. ఇప్పుడు జనమే జనమేజయులు. మీరు, మీలాంటి ప్రజలందరూ కలసి అవినీతి సర్పయాగం చేసే అవకాశం వచ్చింది. మిమ్మల్ని ఇన్నాళ్లూ పాలించి, అవినీతి పాముల్ని పాలు పోసి పెంచిన నేతల్ని మీ ఓటు ద్వారా గద్దె దించండి...'

'కళ్లు తెరిపించారు డాక్టర్‌గారూ! ఇక వస్తా'

PUBLISHED IN EENADU ON 09.04.2014

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

జలగానంద


జనచైతన్యానంద స్వాములవారు ఆశీనులు కాగానే ఖద్దరు టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి చకచకా వచ్చి, 'స్వామీ! నేను ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నాను. నాకు మీ మద్దతు కావాలి' అన్నాడు. స్వాముల వారు చిరునవ్వు నవ్వి, జోలె లోంచి ఏదో తీసి అతడి చేతిలో వేశారు. అది చిటికెడు విబూది! 
'స్వామీ! ఇదేమి?' అన్నాడతడు తెల్లబోయి. 
'సన్యాసుల వద్ద ఇంతకన్నా ఏముంటుంది నాయనా' అన్నారు స్వాములవారు. 
'మద్దతంటే ఇది కాదు స్వామీ! మీ మాట సాయం. మీరు గనుక ఇక్కడి ప్రజలకు నాకే ఓటు వేయమని చెబితే, నేను అధికారంలోకి రాగానే మీకో ఆశ్రమం కట్టిస్తా' అన్నాడా వ్యక్తి కొంచెం వంగి, గుసగుసగా. 
'మునుపు చేసిన పనులు.. 
మునుముందు నడిపించు.. 
మాయ చేసితివేని.. 
మర్మంబు బోధించు.. 
తపన నీకేలరా నరుడా! 
తత్వంబు గ్రహియించు గురుడా!' 
అన్నారు స్వాములవారు. ఏమీ అర్థంకాక ఆ వ్యక్తి తలగోక్కున్నాడు. 
'తీర్థం తీసుకో నాయనా' అన్నారు స్వాములవారు. 
ఆ వ్యక్తి కంగారు పడి 'వద్దు స్వామీ! నా దగ్గర మినరల్‌ వాటర్‌ ఉంది' అంటూ గబగబా వెళ్లిపోయాడు. 
అతడు వెళ్లగానే శిష్యుడు వినయంగా దగ్గరకు వచ్చి, 'స్వామీ! ఆయన్ని ఆశీర్వదించకుండా విబూది, తీర్థం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా?'
స్వాముల వారు తన జోలెలోంచి మాయాదర్పణం తీసిచ్చారు. శిష్యుడు అందులోకి చూస్తూనే, 'ఇదేంటి స్వామీ? ఎన్నో చెరువులు, నదులు కనిపిస్తున్నాయి. కానీ వాటన్నిటిలో జలగలు ఈదుతూ కనిపిస్తున్నాయి. ఆ జలగలు చూస్తుండగానే పెద్దగా మారిపోతున్నాయి. పాకుతూ నీటిలోంచి బయటకు వచ్చి ఎవరిని కనిపిస్తే వారిని కరిచి రక్తం పీల్చేస్తున్నాయి. చూడలేకపోతున్నాను. ఈ దృశ్యానికి అర్థమేమిటి స్వామీ?' అని అడిగాడు.

అతడు ఇన్నాళ్లూ ఈ ప్రాంతాన్ని ఏలిన పాలకుల ప్రతినిధి. నన్నే ప్రలోభపెట్టబోయాడు. అతడి రాజకీయ భవితవ్యానికి గుర్తుగానే నేను విబూది ఇచ్చాను. ఇక తీర్థం ఇస్తే తీసుకోకుండానే వెళ్లిపోయాడు చూశావా? అందుకు కారణం ఈ పాలకుల వల్ల ఒక ఉద్ధరిణిడు నీళ్లయినా సురక్షితమో కాదో చెప్పలేని పరిస్థితి రాజ్యమేలుతోంది. ఏ తీర్థంలో ఏ క్రిములున్నాయో అనే భయంతోనే అతడు వడివడిగా వెళ్లిపోయాడు'

'ఎంత దారుణం స్వామీ! ప్రజలకు గుక్కెడు మంచినీళ్లయినా సక్రమంగా అందించలేని పాలన ఇక్కడ నడిచిందన్నమాట..'

'అన్నమాటేమిటి నాయనా! ఉన్నమాటే. మంచినీటిలో ప్రమాదకరమైన రసాయనాలు కలిసిపోతున్నా ఈ పాలకులకు చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. మనం హిమాలయాల్లో ఉంటాం కాబట్టి మనకు తెలియదు కానీ, ఇక్కడ ఫ్లోరైడు సమస్యనే ఒక భయంకర స్థితి ఉంది.'

'హతవిధీ.. ఏమిటీ స్థితి స్వామీ! ఎంతటి నిరుపేదైనా ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్లిస్తాడే? అలాంటిది తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఆపాటి కూడా చేయలేకపోతున్నారా ఈ పాలకులు స్వామీ? నేను వూర్లోకి వెళ్లినప్పుడల్లా చూస్తూనే ఉన్నాను. వీధి కుళాయిల దగ్గర పోరాటం, నీళ్ల ట్యాంకుల దగ్గర ఆరాటం గమనించాను.. మరి ఈ నిర్లక్ష్య పాలకులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదా స్వామీ?'

'తీసుకోకేం నాయనా! కానీ అవన్నీ ప్రచారం కోసమే. తాగునీటి పథకాల పేరు చెప్పి ఐదేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు చూపించినట్టు నా దివ్యదృష్టికి గోచరిస్తోంది నాయనా! కానీ వాటిలో అధికభాగం సొమ్ములు పాలకుల అనుచరుల జేబులు నింపాయి. కారణం అవినీతి. అధికారం ఉండడం వల్ల తమకు అనుకూలమైన వారికే పనులు కట్టబెట్టారు నాయనా! అందుకే ఆ పనుల్లో సగం ప్రారంభమే కాలేదు. చాలా వరకు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మాయా దర్పణంలో నీకు కనిపించినవన్నీ అవినీతి జలగలు. నీటి పథకాల పేరు చెప్పి ప్రజల సొమ్మును స్వాహా చేసిన స్వార్థపరుల ప్రతిరూపాలు'

'స్వామీ! మీరు చెబుతుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఈ పరిస్థితి నుంచి ప్రజలను కాపాడడానికి ఏం చేయాలో సెలవీయండి'

'వూర్లోకి వెళ్లి నేను చెప్పిన విషయాలన్నీ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వివరించు నాయనా! ప్రజలను చైతన్యపరచడమే మనకు పరమావధి'

'అవశ్యం స్వామీ! తెల్లారి లేచిన దగ్గర్నుంచి మంచినీటి కోసం నానా పాట్లూ పడుతున్న మహిళలకు ఈ పాలకుల రాజకీయ స్వరూపమేంటో విశదీకరిస్తాను. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కన్నెర్ర చేస్తే చాలు, ఈ ముదనష్టపు పాలకులు ఇంటిదారి పడతారని ఎలుగెత్తి చాటుతాను. నన్ను ఆశీర్వదించండి!'

'తథాస్తు!'

PUBLISHED IN EENADU ON 08.04.2014

సోమవారం, ఏప్రిల్ 07, 2014

నిజ రాజకీయం!'నిను వీడని నీడను నేను, కలగా కదిలే కథ నేను...'
'ఎవరు నువ్వు?'

'నిజాన్ని'

'నా వెనకెందుకు పడ్డావ్‌?'

'నీ నీడను కాబట్టి'

'ఇంతకూ నువ్వు నిజానివా, నీడవా?'

'నీ నీడలో నిజాన్ని'

'ఏం కావాలి నీకు?'

'నువ్వు నిజం ఒప్పుకొంటే చాలు'

'ఇదేం తిరకాసు, నువ్వే నిజాన్నంటున్నావుగా?'

'అవుననుకో. కానీ, నీ నీడలో దాచేశావుగా?'

'ఏమిటా నిజం?'

'ఖనిజం, గనిజం, గజనిజం, విలనిజం...'

'అమ్మో... ఇన్ని నిజాలా- వీటి గురించి నాకేం తెలుసు?'

'అలా అంటావనే నీవెంట పడ్డా'

'పడితే పడు, నాకేం భయమా? నువ్వు నిజానివైతే నేను నీచ రాజకీయాన్ని. ఇంకా మాట్లాడితే అరాచకీయాన్ని. తెలుసా?'

'నిజం... రాజకీయాన్ని వణికించగలదు తెలుసా?'

'హహ్హహ్హా! పిచ్చి నిజమా! నువ్వు చెప్పేదేంటో తేలేసరికి రాజకీయం పబ్బం గడిచిపోతుంది. సమయానికి తేలని నిజం చచ్చినట్టేనని తెలుసుకో!'

'అహంకారంతో విర్రవీగకు. నిజం బయటికి పొక్కడంవల్ల ప్రభుత్వాలు తారుమారయ్యాయి. అధినేతలు కుర్చీలు దిగారు. ప్రజాచైతన్యం పెల్లుబుకుతోంది. అసలే ఇది ఎన్నికల కాలం!'

'ఎ...ఎ...ఏంటి భయపెడుతున్నావ్‌? నువ్వన్నది నిజమే కానీ, ఇప్పటికిప్పుడు ఏం తేలిందట, అంత రెచ్చిపోతున్నావ్‌?'

'కాదా మరి? ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజం, అమెరికాలో నిజం, అంతర్జాతీయ స్థాయిలో అవినీతి విలనిజం, రాష్ట్రంలో టైటానియం తవ్వుకోవడానికి కోట్లాది రూపాయల ముడుపులు అందిన ఘరానా పాలనిజం...'

'అస్తమానం నిజం... నిజం అని చిందులు తొక్కకు. నువ్వేదో బయటపడినా, నా దారులు నాకున్నాయి'

'ఏమిటో ఆ దారులు?'

'నువ్వెలాగూ నిజానివే కాబట్టి... నిజమే చెబుతాను విను. ఇదంతా కుట్రని ఎప్పటిలాగే బుకాయిస్తా. కేవలం ఆరోపణలేనని బింకం చూపిస్తా. మా ప్రజాదరణ చూడలేక కిట్టనివాళ్లు కల్పించిన కట్టుకథని కొట్టిపారేయిస్తా. గెలవలేమనే భయంతో ప్రత్యర్థులు పన్నిన పన్నాగమని మా పత్రికల్లో పేజీలకు పేజీలు అచ్చొత్తించి గగ్గోలు పెట్టిస్తా. మా ఛానళ్లలో పదేపదే ఊదరకొడతా. వీరంగం ఆడతా. ఎదుటివాళ్ల పుట్టుపూర్వోత్తరాల మీద ప్రశ్నలు గుప్పించి నిజానిజాల్ని, జనాల్ని కూడా గందరగోళపరుస్తా. తెలిసిందా?'

'పోన్లే... నీ నీడనైన నా దగ్గరైనా, నీలో నిజాన్ని నిర్భయంగా చెప్పావ్‌. కానీ, నిజం నిప్పులాంటిది కదా? దానివల్ల అభియోగాలు వచ్చి, విచారణ జరిగి, జైలుకెళ్లిన అనుభవాలు కూడా ఉన్నాయిగా?'

'ఉన్నాయి. ఉంటాయనీ తెలుసు. కానీ, జైలుకెళ్లినా దాన్ని జాలికథగా మార్చుకోగల సామర్థ్యం నాకుంది. అమాయకుడిలా నటిస్తూ, జైలుకెళ్లినా ఘనకార్యం చేసినట్టు, ప్రజలముందు సిగ్గులేకుండా మసలే నేతల్లా నేను విజృంభించగలను. ఇప్పటికే నీచరాజకీయ విశ్వరూపం చూపించాను. గమనించలేదా?'

'గమనించకేం? ఒక దశలో నిన్ను చూస్తే నాకే భయమేసింది. ఇలాంటి రాజకీయం అడుగుజాడల్లో నలిగిపోతూ ఊపిరాడక గిలగిల్లాడాల్సిందేనా అని కుమిలిపోయాను. ఇప్పుడిప్పుడే నాలో కొత్త ఆశలు చిగురించాయి'

'ఏమిటో ఆ ఆశలు?'

'ప్రజాచైతన్యంపై ఉన్న నమ్మకం. ప్రజలు అన్నీ గమనిస్తారనే భరోసా. ఒకప్పుడు ఇంటిని సైతం తాకట్టుపెట్టే స్థితిలో ఉన్న నేతలను అధికారపీఠంపై కూర్చోబెడితే- కేవలం కొన్నేళ్లలో ఎలా కోట్లకు పడగలెత్తారో... జనం తెలుసుకోలేకపోరనే ఆశావహ దృక్పథం. అధికారం అండగా పచ్చి దోపిడికి తెగబడినప్పుడు, ప్రజల ఆస్తులు ఎలా కైంకర్యమైపోయాయో సామాన్యులకు సైతం అర్థమవుతోందనే సూచన. కాబట్టి, నీలాంటి నికృష్ట రాజకీయాన్ని ఓటుహక్కుతో తోక ముడిచేలా చేస్తారనే ఆశ'

'ఓసి వెర్రి నిజమా! నువ్విలాగ ఆశలు పెంచుకుంటూ కూర్చో... నాకేం భయంలేదు. వందలు, వేల పత్రాలతో అభియోగాలు వచ్చినా- ప్రాథమిక సాక్ష్యాధారాలతో జైలుకెళ్లినా, రాజకీయ చదరంగంలో పావులు కదిపి, తెరవెనక అవగాహనతో బెయిలు ఇప్పించుకోగల శక్తిసామర్థ్యాలు నా సొంతం. ప్రజల ఆస్తులు దోచినా, వారి పేరిట ఏ అరకొర పథకాలో ప్రచారం చేసి, కాస్తోకూస్తో విదిలించి, మాయమాటలతో వారి మద్దతు పొందగలననే ధీమా నాకుంది. ఇక నువ్వేం చేయగలవు?'

'నీచ రాజకీయమా! తగ్గు తగ్గు. నువ్వు దేశాలు మార్చి, న్యాయాన్ని ఏమార్చడాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ స్పష్టంగా బయటపెట్టింది. నీ అక్రమార్జన డొంక దేశదేశాల్లోనూ కదలనుంది. నిజం కార్చిచ్చుగా మారి, నీ అరాచకాలను కాల్చి బూడిద చేయనుంది. అందుకు ప్రజల చైతన్యం తోడ్పడుతుంది. ఈ ఎన్నికలవేళ- నిజానికి ఉన్న శక్తి ముందు నీ రాజకీయం ఎంత? సుడిగాలి ముందు గడ్డిపోచ ఎంత! తోకముడిచి పరుగందుకో... ఫో!'

'...'
PUBLISHED IN EENADU ON 07.04.2014

శుక్రవారం, ఏప్రిల్ 04, 2014

పుట్టెడు రోగాల ప్రభుత్వం!


'తొమ్మిది దారుల మట్టి కోట ఇది.. 
తెలుసుకోర నరుడా! 
చుట్టుముట్టినవి గట్టి రోగములు.. 
మట్టుబెట్టరా గురుడా!' 
- జనచైతన్యానంద స్వాములవారు తత్వం పాడుతుంటే శిష్యుడు ఆదరాబాదరా వచ్చి, 'స్వామీ! బయట ఓ వ్యక్తి పిచ్చి చూపులు చూస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరొచ్చి చూడాలి..' అన్నాడు.
స్వాములవారు బయటకి వచ్చి శిష్యుడితో 'ఏమైంది నాయనా!' అన్నారు.

'నేను వూర్లోకి వెళ్లి వస్తుంటే ఓ గుడిసె దగ్గర ఇతడు జ్వరంతో వణుకుతూ కనిపించాడు స్వామీ! ఇంతలో ఇతడి భార్య వచ్చి వైద్యానికి వెళదామంది. అంతే స్వామీ... ఇతగాడు ఒక్కసారిగా ఆమె చేయి విదిల్చుకుని పరుగుతీశాడు' అంటూ శిష్యుడు వివరించాడు. ఇంతలోనే ఒకామె పరుగున వచ్చి స్వాములవారిని చూస్తూనే, 'అయ్యోరా.. తమరే నా పెనిమిటిని కాపాడాలయ్యా.. ఆసుపత్రికి రమ్మంటే భయపడిపోతున్నాడు' అంటూ కాళ్ల మీద పడింది.

జనచైతన్యానంద స్వామి ఆమెను లేవదీసి, 'ఏ ఆసుపత్రికి తల్లీ?' అని అడిగారు.

'పేదోల్లం.. ఇంకే ఆసుపత్రికి ఎల్తామయ్యా.. సర్కారు దవాఖానాకే రమ్మన్నానంతే..' అందామె.

స్వాముల వారు తలపంకించి, కమండలంలోంచి నీళ్లు అతడి మొహం మీద కొట్టి మంచినీళ్లు తాగించారు. అతడు తేరుకున్నాక ఏవో గుళికలు ఇచ్చి వాళ్లని పంపించారు. వెంటనే శిష్యుడు 'ఈ వూర్లో ఇదేమి వింత స్వామీ? రోగం వచ్చాక చికిత్స వద్దంటే ఎలా?' అని అడిగాడు.

స్వాముల వారు తన జోలెలోంచి మాయాదర్పణం తీసిచ్చారు. శిష్యుడు అందులోని దృశ్యం చెప్పసాగాడు.

'ఏవేవో పాడుపడిన భవనాలు కనిపిస్తున్నాయి. వాటిలో తేళ్లు, పాములు పాకుతున్నాయి. వాటిని చూస్తూనే సామాన్యులు పారిపోతున్నారు. ఇదేమి స్వామీ?' అన్నాడు.

జనచైతన్యానంద స్వాముల వారు నిట్టూర్చి చెప్పారు, 'అదే నాయనా ఈ రాజ్యంలోని దౌర్భాగ్యం. నీకు కనిపించిన వన్నీ ప్రభుత్వ వైద్యశాలలే. వాటిలో సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేవు. పేదల ఆరోగ్యం పట్ల ఇక్కడి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నది. అందుకు సంకేతాలే విషకీటకాలు'

'ఎంత దారుణం స్వామీ? ప్రజల కష్టాలు పాలకులకు పట్టవా?'

'సింహాసనం ఎక్కేవరకే సామాన్యుడు కనిపిస్తాడు నాయనా! ఆ తర్వాత వారి దృష్టి ప్రచారం పైనా, దోచుకోవడం పైనే. ఈ రాజ్యంలోని ప్రజల సంఖ్యను బట్టి చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 84 వేల మంది వైద్య సిబ్బంది ఉండాలి. కానీ పట్టుమని పదివేల మందే ఉన్నారు. ప్రజలకు సరిపడినన్ని వైద్యశాలలూ కరవే'

'అంటే ఇక్కడి ప్రభుత్వ ఖజానా నిండుకున్నదేమో?'

'కాదు నాయనా! తమ వార్షిక లావాదేవీల పరిమాణం లక్షన్నర కోట్ల రూపాయలకు మించి పోయిందని పాలకులే జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ ఖజానా ఆదాయంలో అధికభాగం అక్రమ మార్గాన తమ అనుచరవర్గానికే కట్టబెడుతున్న లోపాలు నా దివ్యదృష్టికి గోచరిస్తున్నాయి నాయనా!'

'ఎంత ఘోరం స్వామీ! ఈ దురహంకార పాలకుల నుంచి ఇక్కడి అమాయక ప్రజలను కాపాడాలంటే ఏం చేయాలి?'

'జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పి చైతన్యవంతుల్ని చేయడమే మన కర్తవ్యం. ఆపై వాళ్లే తమ ఓటు హక్కు ద్వారా అక్రమ పాలకులను ఇంటిదారి పట్టిస్తారు'

'అవశ్యం స్వామీ!'
PUBLISHED IN EENADU ON 03.04.2014

బుధవారం, ఏప్రిల్ 02, 2014

గూడు వెనుక గూడుపుఠాణి!'గూడు గూడనియేవు... 
గూడు నాదనియేవు... 
నీ గూడు ఏదిరా గురుడా! 
బొమ్మ లోపలి గాలి... 
తుస్సుమన్నాదంటే... 
మిగిలేది బొమికలే నరుడా!' 
- జనచైతన్యానంద స్వాముల వారు తత్వం పాడుతుంటే శిష్యుడు మౌనంగా వచ్చి కూర్చున్నాడు. పాట పూర్తవగానే 'సామాన్యుడి జీవిత లక్ష్యం ఓ గూడు ఏర్పాటు చేసుకోవడమే కదా స్వామీ! మరి మీ తత్వం వారికి బోధపడుతుందంటారా?' అని అడిగాడు.
'నేనీ తత్వాన్ని అందుకున్నది సామాన్యుల కోసం కాదు నాయనా! వారి ఆశల్ని ఆసరా చేసుకుని అడ్డంగా దోచుకుంటున్న అవినీతి నేతల్ని ఉద్దేశించి. సామాన్యుడి అవసరం, నాయకుల స్వార్థానికి బలవుతున్నప్పుడు మనలాంటి వాళ్లం ఒట్టి తత్వాలు పాడకూడదు నాయనా! వారిని చైతన్యవంతుల్ని చేయాలి. మన దేశాటన పరమార్థం అదే కదా?' అన్నారు స్వాములవారు.

'అర్థమైంది స్వామీ! ఇందాకా వూళ్లోకి వెళ్లినప్పుడు ఓ చిత్రమైన సంగతిని గమనించాను. అది చెబుదామనుకుని వచ్చి మీ తత్వంలో పడిపోయాను..'

'చెప్పు నాయనా!'

'అదేంటో స్వామీ ఈ వూరిలో చాలా చోట్ల మొండి గోడలతో మిగిలిపోయిన ఇళ్లు కనిపించాయి. వాటిలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాపం.. ఈ వూరిలో చాలామంది సామాన్యులు ఓ గట్టి గూడు కట్టుకుందామని ఆశపడి, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆపేసినట్టున్నారు. ఆ సంసారుల తాపత్రయం చూస్తే బాధ కలిగింది స్వామీ!'

'ఇలాంటి ఇళ్లు ఈ రాజ్యంలో చాలా ఉన్నాయి నాయనా! కానీ అవి అలా ఆగిపోడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు కావు. పాలకుల నిర్లక్ష్యాదౌర్భాగ్యాలు! వారి నీచ రాజకీయాలు!'

'ఎంత దారుణం! ప్రజల గోడు పట్టని ఆ పాలకులు ఎవరు స్వామీ?'

జనచైతన్యానంద స్వాముల వారు తన జోలె లోంచి మాయాదర్పణం తీసి, శిష్యుడికిచ్చి చూడమన్నారు. శిష్యుడు చూస్తూ చెప్పసాగాడు..

'ఆశ్చర్యం స్వామీ! ఎవరో ఇళ్లు కడతామంటూ సభల్లో వూదరగొడుతున్నాడు. సామాన్యులు కాసులు గుమ్మరిస్తున్నారు. కానీ ఆ కాసుల్ని కొందరు నాయకులు కుంచాలతో కొలిచి తమ వారికి పంచుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు నిర్వేదంతో చూస్తున్నారు. మరి కొన్ని చోట్ల సామాన్యులను ఇళ్లలోంచి గెంటేసి ఎవరెవరో వాటిని ఆక్రమించుకుంటున్నారు. ఇదేమి అరాచకం స్వామీ?'

'ఈ రాజ్యంలో ఇంతవరకు యథేచ్ఛగా సాగిన నీచ రాజకీయం నాయనా! ఏవేవో స్వగృహ పథకాల పేరు చెప్పి కనీస ధరలకే ఇళ్లు కట్టించి ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు నేతలు. ఆ మాటలు నమ్మి కోట్లాది రూపాయల్ని ప్రజలు చెల్లించారు. పాలకుల నిర్లక్ష్యం, పేరుకుపోయిన అవినీతి వల్ల ఆ సొమ్ములు స్వాహా అయిపోయాయి. కట్టిన ఇళ్లు నాసిరకంగా మిగిలాయి. ఇలా కేవలం ఒక పథకం వల్లనే దాదాపు 365 కోట్ల ప్రజాధనం అతీగతీ లేకుండా వ్యర్థమైందని నా దివ్యదృష్టికి గోచరిస్తోంది. ఇక బడుగులకు ఉచితంగా ఇళ్లిస్తామని వూరించి, ఆ వంకతో అధికంగా అయినవారికి కేటాయించుకున్నారు..'

'అయ్యయ్యో స్వామీ! ఈ అరాచక ప్రభుత్వ అకృత్యాలను అడిగేవారే లేరా?'

'అడిగినా ప్రయోజనం ఏముంటుంది నాయనా! అధికార మదంతో కళ్లు మూసుకుపోయిన ఓ అమాత్యవర్యుడు ఏమన్నాడో తెలుసా? ప్రభుత్వం తమది కాబట్టి ఇళ్లను తమ ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకుంటామంటూ సాక్షాత్తూ రాజసభలోనే అహంకరించాడు..'

'ఔరా! ఇక ఈ ప్రజలు తమంత తాము తంటాలు పడాల్సిందేనా స్వామీ?'

'అందుకుగల అవకాశాలను అంతకంతకు భారం చేసింది నాయనా ఈ అరాచక ప్రభుత్వం. భూముల ధరలు, నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రి ధరలు ఇవన్నీ ఈ నేతల నిర్వాకం వల్ల నాలుగు రెట్లు పెరిగిపోయాయి..'

'హతవిధీ! ఇంత చేసిన ఈ నేతలు ఇంకేం బాగు పడతారులెండి స్వామీ?'

'పిచ్చివాడా! నీ బుద్ధి హిమాలయాల్లో చలికి గడ్డకట్టుకుపోయినట్టుంది నాయనా! ఇలాంటి అయోమయ, అవకతవకల పాలనను అందించిన ఈ రాజ్యపు రాజావారి కుటుంబం మాత్రం కోట్లకు పడగలెత్తింది నాయనా! ఆ రాజుగారి కొడుకు వందేసి గదుల భవంతులను కట్టుకున్నాడు. పొరుగు రాజ్యానా కోటలు నిర్మించుకున్నాడు. రాజుగారి బంధుకోటి.. ఒకోటీ.. ఇంకోటీ.. మరింకోటీ.. అంటూ కోట్లు కొల్లగొట్టుకున్నారు నాయనా!'

'ఇప్పుడర్థమైంది స్వామీ! మీరు మొదట్లో ఆ తత్వం ఎవరిని ఉద్దేశించి పాడారో! నేను వెంటనే వూర్లోకి వెళ్లి సామాన్యులను కలసి ఈ రాజ్యంలో జరిగిన అక్రమాలను తెలియజేసి వారిని చైతన్యవంతుల్ని చేస్తాను. ఆశీర్వదించండి స్వామీ!'

'ప్రజాదరణ ప్రాప్తిరస్తు!'

PUBLISHED IN EENADU ON 02/04/2014