మంగళవారం, మార్చి 27, 2012

బాధ్యత అంటే ...


బాధ్యత అంటే ...



'బాధ్యత అంటే ఏంటి గురూగారూ?'
'ఏంట్రోయ్‌! అంత బాధ్యతాయుతమైన ప్రశ్న అడిగావ్‌? కొంపదీసి ఈమధ్య బాధ్యతగా నడుచుకోవడం లేదుకదా?'

'ఎంతమాట గురూగారూ! మీ శిష్యుడిగా అది మీకెంత అవమానమో నాకు తెలియదా? అసలా పదానికి అర్థమంటూ తెలుసుకుంటే ఎడాపెడా వాడెయ్యొచ్చని అడిగానంతే'

'పోన్లే. ఆ మాత్రం బాధ్యత తెలుసుకున్నావంతే చాలు. ఈ పదానికీ రాజకీయానికీ అస్సలు పడదురా. అసలు రాజకీయమంటేనే ఇది లేకపోవడం కద? కాబట్టి దీని గురించి ఎంత తెలుసుకుంటే అంత బాధ్యతారహితంగా మసలుకోవచ్చు మనం. అంచేత, అడగడం నీ బాధ్యత. చెప్పడం నా బాధ్యత'

'ఆహా... ఎంత బాగా చెప్పారండీ! మరి దీన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చెప్పరా?'

'ఇది అధికారానికి దగ్గర చుట్టంరా. మనం అధికారంలో ఉన్నప్పుడే బాధ్యత లేని పన్లు ఎక్కువ చేస్తాం కాబట్టి, దీన్ని ఎడాపెడా వాడేసే అవకాశాలు అప్పుడే ఎక్కువుంటాయి'

'దీన్ని ఈమధ్య కాలంలో చక్కగా ఉపయోగించుకున్న వాళ్లు ఎవరైనా ఉన్నారా గురూగారూ?'

'ఎందుకు లేర్రా? అటు ఢిల్లీకేసి దృష్టి సారిస్తే దేశానికే యువరాజులుంగారు, ఇటు రాష్ట్రంకేసి చూస్తే ఏలినవారూ కనబడరూ! యూపీ ఎన్నికల ఫలితాలు వూపిరాడకుండా చేసేసరికి ఆయనగారు బాధ్యత వహించి చేతులు దులుపుకున్నారు. ఏపీ ఉప ఎన్నికల ఫలితాలు ఉసూరుమనిపించేసరికి ఏలినవారూ బాధ్యతను అందరికీ తలా ఇంత పంచేసి అదే పని చేశారు. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేదేమంటే... పరిస్థితి చేజారిపోయినప్పుడు, చేసేదేమీ లేదని తేలిపోయినప్పుడు ఈ పదం అమోఘంగా ఉపయోగపడుతుందనేగా?'

'కానీ గురూగారూ! జరగాల్సిన నష్టమేదో జరిగిపోయాక బాధ్యత వహించాననడం వల్ల ఒరిగేమిటండీ?'

'ఓరి పిచ్చి సన్నాసీ! ఎలాగూ బాధ్యత వాళ్లదేరా. ఆ సంగతి ఎదుటివాడనేలోగా మనకు మనమే అనేసుకున్నామనుకో. ఎవరూ నోరెత్తడానికి ఉండదు. యూపీ అయినా, ఏపీ అయినా కంగుతిన్నది కాంగ్రెస్‌ పార్టీయే. ఇక ఆ పార్టీ అధినేత్రి మాత్రం ఎవరినేమనగలరు? అటు చూస్తే బాధ్యత వహించిన కొడుకు, ఇటు చూస్తే బాధ్యత అందరిదీ అంటున్న బాధ్యతగల ముఖ్యమంత్రి. ఎవరిదెంత వరకు బాధ్యతో, ఎవర్ని బాధ్యుల్ని చేయాలో తేల్చలేని స్థితి. పైగా ఇలా బాధ్యత వహించడం ఒక గొప్ప నాయకత్వ లక్షణంలాగా పైకి కనిపిస్తుంది కూడా. నిజానికి ఆ లక్షణమే ఉంటే ఫలితాలు మరోలా ఉండేవనుకో. అంటే లేని లక్షణాన్ని ఉన్నట్టుగా చూపించుకోడానికి ఇదెంత బాగా ఉపయోగపడిందో అర్థమైందా?'

'అవునండోయ్‌! మొత్తానికి రాజకీయ అధ్యయనంలో ఇదొక బాధ్యతాయుతమైన అధ్యాయంలాగే కనిపిస్తోంది. అయినవారి నుంచి కానీ, అవతలి వారి నుంచి కానీ విమర్శలు రాకుండా ముందే తూనాబొడ్డూ అని అడ్డేసుకోడమన్నమాట. అంతేనాండీ?'

'చురుకైన వాడివేరా పైకొస్తావు. దీన్ని రాజభక్తిని చాటుకోడానికి కూడా ఎంచక్కా వాడేసుకోవచ్చురా. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత తనదేనని యువరాజులుంగారు అనగానే ఆ పార్టీనేతలు ఏమన్నారో గుర్తుందిగా? అబ్బెబ్బెబ్బెబ్బే... బాధ్యత తమదేమిటండీ పాపం... మీరేం చేశారు, అలా వచ్చి ఇలా చేతులూపారంతే, మీ అంతటి వారిని ఓ రాష్ట్రానికి పరిమితం చేయగలమా, అసలు బాధ్యతంతా మాదే సుమండీ... అంటూ సాగిలపడలేదూ? రేపోమాపో వాళ్ల బాధ్యతగల ప్రవర్తనకు గుర్తింపు రాకుండా ఉంటుందా చెప్పు?'

'అబ్బో! ఈ పదాన్ని ఇలా కూడా వాడుకోవచ్చన్నమాట. ఇంకే సందర్భాలూ ఉండవాండీ?'

'ఎందుకుండవురా? అసంతృప్తిని వెళ్లగక్కడానికి కూడా దీన్ని వాడేసుకోవచ్చు. రాష్ట్ర కాంగ్రెస్‌లో సెగలు చూస్తున్నావుగా? సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎంత బాధ్యతాయుతంగా అధినేతను మొత్తం బాధ్యత వహించమని విమర్శిస్తున్నారో! పనిలో పనిగా ఆయన్ని సమర్థించేవాళ్లు కూడా అంతే బాధ్యతగా ప్రకటనలు గుప్పిస్తున్నారు'

'ఇంతకీ గురువుగారూ! ఒకే పార్టీలో జరుగుతున్న ఈ వ్యవహరమంతా బాధ్యతాయుతమా? బాధ్యతారాహిత్యమా?'

'అది చెప్పడం కష్టంరా! ఎందుకంటే ఈ రెండు పదాల మధ్య అర్థాలు, వాటి వెనుక ఉండే పరమార్థాలను బట్టి, అంతరార్థాలను బట్టి, ప్రయోజనాలను బట్టి మారిపోతుంటాయి. అర్థమైందా?'

'అర్థమైంది కానండీ, ఇప్పటికైనా ఎవరిదెంత వరకూ బాధ్యతో ఆ పార్టీ అధినేత్రి తేలుస్తారంటారా?'

'పాపం... ఆవిడ బాధ్యతలు వేరే ఉన్నాయిరా! ఓ పక్క కొడుకును కుర్చీ ఎక్కించే బాధ్యతా? మరో పక్క సంకీర్ణ భాగస్వామ్య పార్టీలను బుజ్జగించే బాధ్యతా? పార్టీలో లుకలుకలను చక్కదిద్దే బాధ్యతా? దేశంలో రోజుకొకటిగా బయటపడుతున్న కుంభకోణాలకు ఎవర్ని బాధ్యుల్ని చేయాలో తేల్చే బాధ్యతా? అబ్బో... ఇలా చాలా ఉన్నాయనుకో!'

'అన్నట్టు గురూగారూ! ఒకదాన్ని మించి మరొకటిగా బయటపడుతున్న ఈ కుంభకోణాలకు ఎవరిదండీ బాధ్యత?'

'వాటికి పాల్పడే వారికి బాధ్యత లేకపోవడమేరా! అదే ఉంటే గబుక్కున బయటపడిపోయేలా చేస్తారా చెప్పు?'

'అవున్లెండి! మొత్తానికి ఇటు దేశం పరిస్థితి, అటు పార్టీ పరిస్థితీ ఇలా డీలా పడ్డంలో అధినేత్రి బాధ్యతేమీ లేదంటారా?'

'అమ్మో... అది తేల్చే బాధ్యత మనది కాదురా'

'మరెవరిదండీ?'

'ఓటర్లదిరా! వాళ్లెప్పుడూ తమ బాధ్యతను తాము మర్చిపోరులే కానీ, నువ్వు మాత్రం నేను చెప్పిన పాఠాల్ని బాధ్యతగా ఒంటపట్టించుకో.'

PUBLISHED IN EENADU ON 27.3.2012