ఇప్పుడంటే వాట్సాప్‌లు, జూమ్‌లు, వీడియో కాల్సూ గట్రా వచ్చేశాయి కానీ, ఓ నలభై ఏళ్ల కిందట ఉత్తరాలే కదా, కబుర్లు బట్వాడా చేసేవి? అంత పాత ముచ్చటే ఇది. నేను డిగ్రీ చేసి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న సమయం అది. కుర్రతనం వెర్రితలలు వేస్తూ ఉండేది. అప్పట్లో దాదాపు అన్ని వార పత్రికల్లోనూ కలం స్నేహం కోసం ఓ పేజీ కేటాయించేవారు. అందులో ఓ వైజాగ్ అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయికి అమ్మాయి పేరుతో ఉత్తరం రాయాలనే కొంటె ఊహ కలిగింది. ఏ పేరుతో రాయాలి? వెంటనే తట్టింది కల్పన అని. ఇది నా కల్పనే కదా? ఆ అబ్బాయిని కలం స్నేహానికి ఆహ్వానిస్తూ ఓ అందమైన ఉత్తరం రాశాను. ఉత్తరానికి అందమేమిటనుకోకండి. అందులోని భావాలు అందమైనవన్నమాట.
''కలం స్నేహం కాలమ్‌లో మీ వివరాలు చూశాను. మీ అభిరుచులు నచ్చాయి. మీతో స్నేహం చేయాలనిపించింది. నా పేరు కల్పన. ఏలూరులో ఉంటాను...'' అంటూ పరిచయ వాక్యాలతో పాటు, ఏవేవో రాసి పోస్టు చేసేశాను.
మేం ఏలూరు పవర్ పేటలో శ్రీమతి అరుంధతి రావు గారి ఇంట్లో వెనక పోర్షన్‌లో అద్దెకుండేవాళ్లం. ఉత్తరాలేమైనా వస్తే ఆవిడే అందుకునే వారు. తర్వాత ఎవరివి వారికి అందించేవారు. ఎందుకంటే వాళ్లింట్లో రెండు మూడు పోర్షన్లు ఉండేవి. అద్దెకుండే వాళ్లందరికీ ఆవిడ వీధి గదే కబుర్ల ఖజానా. అందరం ఆవిడ ల్యాండ్ లైన్ నెంబర్నే బంధువులకి ఇచ్చేవాళ్లం. వాళ్లెవరైనా ఫోన్ చేస్తే ఆవిడ స్వయంగా పిలిచేవారు. మాకే కాదు, ఆ వీధి మొత్తానికి ఆవిడ ఫోన్ నెంబరే గతి. వేరే ఇళ్ల వాళ్లకి ఫోన్ వస్తే పనిమనిషి సుందరమ్మని పంపి కబురంపేవారు. ఇలా ఎప్పుడు చూసినా ఆవిడ వీధి గది సందడిగా ఉండేది. అద్దెకుండే వాళ్లు ఎవరు బయటి నుంచి వచ్చినా ముందు ఆ హాల్లోకే వెళ్లి ఆంటీని పలకరించి నాలుగు కబుర్లు చెప్పి ఆ తర్వాతే తమ పోర్షన్‌లోకి వెళ్లేవారు. మనం సందడిగా జోక్స్ వేస్తూ లొడలొడా మాట్లడతాం కాబట్టి ఆంటీకి ప్రత్యేకమైన ఇష్టం. అదీగాక నేనప్పట్లో కాలక్షేపానికి ఓ స్థానిక సాయంకాలం పత్రికలో పనిచేస్తుండేవాడిని. ఆంటీ రాసిన కవితల్ని అందులో వేసేస్తూ ఉండేవాడిని. దాంతో పాటు వార పత్రికల్లో వచ్చే పద బంధ ప్రహేళిక (క్రాస్ వర్డ్) లాంటి పజిల్స్‌ని నేను చకచకా పూర్తి చేస్తుండేవాడిని. వాటిని ఆంటీ తన పేరుతో పంపుకుంటూ ఉండేవారు.
ఓసారి నేను వీధిలోంచి ఇంటి ఆవరణలోకి రాగానే ఆంటీ నన్ను పిలిచి ''కల్పన ఎవరు శర్మా?'' అని అడిగారు. అప్పటిదాకా నాకు కలం స్నేహానికి ఆహ్వానం పంపిన సంగతే గుర్తు లేదు. నా చిరునామా 'కల్పన, కేరాఫ్ శర్మ...' వగైరా వివరాలతో ఇచ్చానన్నమాట. నేను ఆత్రుతగా ఆ ఉత్తరం అందుకుని ఆ వైజాగ్ అబ్బాయి రాసిన ఉత్తరం చదివేశా. ఆ తర్వాత నవ్వుతూ మొత్తం సంగతి చెప్పా. ఆంటీయే కాదు, అక్కడ ఉన్న వాళ్లందరూ పగలబడి నవ్వేశారు. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని ఒకరి తర్వాత ఒకరు చదివేశారు.
ఇహ అక్కడి నుంచి కల్పనకి వచ్చే ఉత్తరాలన్నీ మాకు గొప్ప హాస్య కాలక్షేపమై పోయాయి. నేను ఠంచనుగా జవాబులు రాస్తూ ఉండేవాడిని. ఆ వైజాగ్ అబ్బాయి పాపం... కల్పన అనే అమ్మాయిని ఊహించుకుని తెగ ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఆ ఉత్తరాలను నేను నెమ్మదిగా స్నేహం స్థాయిని దాటించి, ఇష్టం దశకి చేర్చాను. నా జవాబులు, కల్పనకి వచ్చే ఉత్తరాల కోసం ఆ ఇంట్లో అందరూ ఎదురు చూసేవారు.
ఆఖరికి ఆ కుర్రాడిని కల్పనని ప్రత్యక్షంగా కలవడానికి తహతహలాడే స్థితకి తీసుకొచ్చా. నేను మాత్రం 'అమ్మో... తల్లిదండ్రుల చాటు పిల్లని. అన్నయ్య ఊరుకోడు...''లాంటి కబుర్లు చెబుతూ ఉండేవాడిని. ఆఖరికి అతడు హైదరాబాద్ వెళుతూ నన్ను మధ్యలో ఏలూరు స్టేషన్‌కి వచ్చి కలుసుకోవాలని ప్రతిపాదించాడు.
''మరి ఇప్పుడేం చేస్తావ్?'' అని అడిగారు, ఆంటీ నవ్వుతూ.
''ఏముందాంటీ? ఎర్ర చీర కట్టుకొస్తానని రాస్తా. ఆ చీర కట్టుకున్నవాళ్లందరినీ వెతుక్కుంటాడు...'' అన్నాన్నేను.
ఆ వైజాగ్ అబ్బాయి పాపం తాను ఎక్కిన రైలేంటో, బోగీ ఏంటో లాంటి వివరాలన్నీ ఏకరువు పెట్టాడు.
ఆ రోజు రానే వచ్చింది. ఆంటీ సహా అందరిలోనూ ఉత్కంఠ.
''పాపం.... ఆ కుర్రాడు డిజప్పాయింట్ అవుతాడేమో... ఇప్నుడేం చేస్తావ్?'' అని అడిగారు ఆంటీ.
''జ్వరం వచ్చి రాలేకపోయానని చెబుతానాంటీ...'' అనేశా నేను తేలిగ్గా.
అయితే విషయం అంత తేలిగ్గా వదల్లేదు.
రెండు రోజులు పోయాక ఆంటీ మా వెనక పోర్షన్ లోకి కంగారు పడుతూ వచ్చి, ''ఆ కుర్రాడు వచ్చాడు శర్మా... కల్పన ఉండేది ఇక్కడేనా అని అడిగాడు. నాకేం చెప్పాలో తెలియక హాల్లో కూర్చోబెట్టి వచ్చా.... ఇప్పుడెలా?'' అన్నారు.
నాక్కూడా కాస్త కంగారనిపించింది. ''ఎలాగరా బాబూ... '' అనుకున్నా. వెనక పోర్షన్ లోంచి ఆంటీ వాళ్ల హాల్లోకి తొంగి చూశా. ఆ కుర్రాడెవరో తెల్లగా, నాజూగ్గా ఉన్నాడు. ఏదో పత్రిక తిరగేస్తూ కనిపించాడు.
''ఏం చెప్పమంటావో చెప్పు మరీ...'' అంటూ ఆంటీ రెట్టించారు.
ఈలోగా మా అమ్మగారు కల్పించుకుని, ''ఇలాంటివన్నీ వద్దని చెబుతూనే ఉన్నాను. వినలేదు. ఇప్పుడు నిజం తెలిస్తే అతడేం గొడవ పెడతాడో ఏంటో...'' అంటూ కంగారు పడ్డారు.
నేను కాసేపు ఆలోచించి, ''సరే ఆంటీ... నేనే మీ వీధి గదిలోకి వస్తాను. నన్ను కల్పన వాళ్ల అన్నయ్యగా పరిచయం చేయండి...'' అన్నాను. ఆవిడ సరే నని వెళ్లారు. నేను తయారై, ప్యాంటు, షర్టు వేసుకుని, మొహం వీలయినంత గంభీరంగా పెట్టుకుని సందు చుట్టూ తిరిగి ఆంటీ వీధి గదిలోకి వెళ్లాను.
ఆంటీ ఓ పక్క నవ్వు ఆపుకుంటూనే నన్ను చూసి, ''ఇతడేనండీ కల్పన వాళ్ల అన్నయ్య...'' అంటూ పరిచయం చేశారు.
ఆ కుర్రాడి మొహంలో కూడా కాస్త కంగారే.
''ఎవరండీ మీరు? మీకు కల్పన ఎలా తెలుసు?'' అని అడిగాను నేను కాస్త సీరియస్‌గా.
ఆ కుర్రాడు కాస్త తడబడి, ''నేను కల్పన ఫ్రెండ్‌నండీ... వైజాగ్‌లో ఉంటాను...'' అంటూ తడబడుతూ చెప్పాడు.
''మీ ఇద్దరికీ స్నేహం ఎలా? కల్పన మాకేమీ చెప్పలేదే?''
''అంటే... అది కలం స్నేహమండీ. ఉత్తరాలు రాసుకుంటున్నాం. తనకి జ్వరమంటేను కలవాలని వచ్చా...'' అన్నాడు.
ఓ పక్క నాకు ఏం చెప్పాలో, ఎలా దీన్ని ముగించాలో తెలియడం లేదు. అయినా మేక పోతు గాంభీర్యంతో ''కల్పన లేదండీ. ఊరెళ్లింది. అయినా కలం స్నేహం అని చెప్పి ఇంటికి వచ్చేస్తే ఎలా? ఇంట్లో పెద్ద వాళ్లకి తెలిస్తే ఊరుకుంటారునుకున్నారా?'' అంటూ కాస్త గొంతు పెంచి అడిగా.
ఆ సరికే అతడికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. చటుక్కున లేచి, ''సరేనండీ... సారీ... పని మీద ఈ ఊరికి వచ్చాను కదాని కలుద్దామని వచ్చానంతే.... ఉంటానండీ...'' అంటూ బయల్దేరాడు. ఒక్క క్షణం ఆగి నాతో, ''పాపం... కల్పనని ఏమీ అనకండీ..'' అంటూ వడివడిగా వెళ్లిపోయాడు.
అతడు వీధి గేటు దాటి వెళ్లగానే ఆంటీ పగలబడి నవ్వసాగారు. టెన్షన్‌గా ఉన్నా, నేనూ నవ్వేశాను.
''అవును శర్మా... మరి ఇప్పుడేం చేస్తావు?'' అన్నారాంటీ.
''కల్పన చేత ఉత్తరం రాయిస్తానండీ. ఇంట్లో పెద్ద వాళ్లకి తెలిసిపోయినట్టూ, తిట్టినట్టూ, ఇంటికి చెప్పకుండా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినట్టూ రాయమంటా. ఈ వంకతో ఈ కలం స్నేహానికి బైబై చెప్పిస్తా...'' అన్నాను.
ఆ తర్వాత ఆ వైజాగ్ అబ్బాయి నుంచి ఉత్తరాలు రాలేదు. కల్పన కూడా ఏమీ రాయలేదు.
గురువారం, మే 08, 2025
కలం స్నేహంలో కలవరం!
మంగళవారం, మార్చి 18, 2025
ఘంటసాల, సుశీల ప్రేమించుకున్నారా?
''ఘంటసాల, సుశీల ప్రేమించుకున్నారంట!'' అన్నాడు మా వాడు.
''అవునా?'' ఆశ్చర్యంగా అడిగాను నేను.
''అవును... వాళ్లిద్దరి డ్యూయెట్లు ఎన్ని లేవు?'' అంటూ సాక్ష్యం కూడా చూపించాడు వాడు.
ఇలాంటి కబుర్లు చెప్పే వాడు నా దృష్టిలో ఓ హీరో. నాకే కాదు నాతోటి కుర్రగ్యాంగ్‌కి కూడా.
''అరే... ఈడికి చాలా తెలుసురా!'' అనుకునేవాళ్లం మేం అప్పట్లో.
అప్పట్లో... అంటే ఎప్పట్లో తెలుసా?
ఓ అయిదు దశాబ్దాల క్రితం అన్నమాట.
ఆ అప్పట్లో నేను రెండో తరగతి. వాడు మహా అయితే మూడో, నాలుగో తరగతి. మా కుర్రగాళ్ల బ్యాచ్‌కి వాడే లీడర్.
కుతుకులూరులో హైస్కూలు ఎదురుగా ఉండే చెరువు మెట్ల మీదో, స్కూలు లేనప్పుడు ఖాళీగా ఉండే బెంచీల మీదో కూర్చుని వాడిలాంటి కోతలు చాలా కోసేవాడు.
వాడు చెప్పేదేదైనా నమ్మేయడమే. వాడూ అంత నమ్మకంగానే చెప్పేవాడు మరి.
సినిమా పాటలు వింటే మాకు ఆ నమ్మకం మరింత బలపడిపోయింది.
మరి అప్పట్లో అన్ని డ్యూయెట్లూ వాళ్లవేగా! ఏ పాట విన్నా మా వాడి మాటలే గుర్తొచ్చేవి.
'నిజమే... లేకపోతే అంత బాగా ఎలా పాడతారు?'అనుకునేవాళ్లం.
ఎంత అమాయకత్వం? ఎంత తెలియనితనం?
రేడియోలు, సినిమాలు తప్ప టీవీలు కానీ, సెల్‌ఫోన్లు కానీ మరే ఇతర వ్యాపకాలు కానీ లేని ఆ రోజుల్లో ఎవరి కబుర్లు వారివి! ఎవరి ఊహలు వారివి!
నా మటుకు నాకు మావాడి మాటలు నిజమేననిపించాక... మరి అంత మంచి వార్త ఎవరికైనా చెప్పకపోతే ఎలా? కడుపు నెప్పి రాదూ?
అందుకే తిన్నగా మా నాన్నగారి దగ్గరకి వెళ్లాను.
''నాన్నగారూ! మీకో సంగతి తెలుసా? ఘంటసాల, సుశీల ప్రేమించుకుంటున్నారంట...'' అన్నానో సెలవురోజు.
ఆయన కాస్త కోపంగా మొహం పెట్టి, ''ఏడిశావ్... అలా మాట్లాడకూడదు...'' అన్నారు.
''నిజమేటండీ... వాళ్లు పెళ్లి కూడా చేసుకుంటార్ట...'' అంటూ రెట్టించి మరింత మసాలా దట్టించాను నా వార్తకి!
ఈసారి ఆయన నవ్వేశారు. ''ఎవడు చెప్పాడు?'' అన్నారు.
ఆ తర్వాత కూర్చోబెట్టి సినిమాల గురించి, వాటి చిత్రీకరణ గురించి వివరించారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు కూడా నిజంగా ప్రేమించకోరనీ, అలా నటిస్తారని, వాళ్లందరికీ ఎవరి సంసారాలు వాళ్లకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్లేబ్యాక్ గురించి, పాటల రికార్డింగు, వాటిని పాడే గాయకుల గురించి చెప్పారు.
ఇన్నేళ్ల తర్వాత అప్పటి ఆ జ్ఞాపకాలని తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ, ఆ వయసులో ఆ నాటి ఎదిగీఎదగని మనసుకి అవే పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు మరి!
సోమవారం, జులై 01, 2024
గేటు దూకించిన... 'బాల భారతం'
శనివారం, మార్చి 02, 2024
చెరువులో మెట్లెన్నో తేలనేలేదు!
అబ్బో... దాదాపు 55 ఏళ్ల నాటి ముచ్చట. కోటిపల్లి జ్ఙాపకం. నా అక్షరాభ్యాసం తూర్పుగోదావరి జిల్లా చెల్లూరులో జరిగితే, నేను రెండో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా మా నాన్నగారికి కోటిపల్లి బదిలీ అయింది. ఆయన హెడ్మాస్టర్. అయితే నన్ను వెంటనే స్కూల్లో వేయలేదు. కారణం నాకు దూకుడు ఎక్కువనిట. అదంతా ఏమో కానీ మనం పిచ్చ హ్యాపీ అన్నమాట. హాయిగా ఆడుకోవడమే పని కదా. మా ఇంటి ఎదురుగా తెలుగు మాస్టారు ఉండేవారు. వాళ్లబ్బాయి విజయ్ కూడా నా ఈడు వాడే. వాడు స్కూలుకి వెళుతుండేవాడు. ఇంట్లో మనం తిన్నగా ఉండం కదా? ఒకటే అల్లరట. దాంతో అమ్మకి విసుగెత్తి, ''బాబూ విజయ్! మా వాడిని కూడా నీతో పాటు స్కూలుకి తీసుకుపో నాయనా. వీడి అల్లరి భరించలేకపోతున్నాం. కానీ... వీడు చెరువులో దిగుదాం అంటే వినకేం?'' అంటూ జాగ్రత్తలు చెప్పి పంపించింది. ఆ కొత్త ఊర్లో మనం అదే మొదటి సారి వీధి దాటడం. విజయ్‌తో కలిసి వెళ్తుంటే దారిలో సోమేశ్వరాలయం, దాని ఎదురుగానే పెద్ద చెరువు, దాంట్లోకి రాతి మెట్లు భలే నచ్చశాయి. ఆ చెరువులో పెద్ద పెద్ద తాబేళ్లు ఉండేవి. అవి మధ్యాహ్నం వేల నీటి పైకి వస్తే వాటి వీపులు కనిపిస్తూ ఉండేవి. విజయ్ బుద్ధిమంతుడిలా చెరువు వైపు కూడా నడవకుండా, రోడ్డుకి రెండో వైపు నడుస్తూ తీసుకెళ్లాడు. మధ్యాహ్నం స్కూల్లో లాంగ్ బెల్ కొట్టేశారు. విజయ్, నేను ఇంటి ముఖం పట్టాం. దార్లో సంత. అందులో ఓ చోట పీతల్ని అమ్ముతంటే చూశా. అవి డెక్కల్ని ఆడిస్తుంటే వింతగా అనిపించింది. ముట్టుకోబోతే ఆ పీతలమ్మేవాడు అరిచాడు. ''డెక్కతో నొక్కిందంటే వేలూడిపోద్ది...'' అని. ''అమ్మో...'' అని విజయ్ నా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. ఆ సంత చూస్తూ చెరువు రోడ్డు మీద గుడి దాకా వచ్చేశాం.
''అరే... విజయ్! దాహం వేస్తోంది. చెరువులో నీళ్లు తాగుదామా?'' అన్నాన్నేను.
''వద్దు. ఇంటికెళ్లి తాగుదాం...'' అన్నాడు వాడు, ఓ పక్క భయంతో, మరో పక్క ఉత్సాహంతో కూడా. అది పసిగట్టేశాం మనం.
''ఎహె... అలా వెళ్లి నీళ్లు తాగి వచ్చేద్దాం...'' అంటూ వాడి చెయ్యి విదిలించుకుని మెట్ల మీదకి చేరా. బహుశా ఓ పది మెట్లు ఉంటాయేమో. వాడు రెండో మెట్టు మీదే నిలుచుండిపోయాడు. నేను మెట్లు లెక్క పెడుతూ కిందకి వెళ్లా. ఆఖరి మెట్టు మీద నుంచి కిందకి ఒంగుని దోసిట్లో నీళ్లు తాగా.
''అరే... నీళ్లు భలే చల్లగా ఉన్నాయిరా. రా...'' అంటూ కేకేశా.
విజయ్ కూడా వచ్చాడు. వాడూ ఆఖరి మెట్టు మీంచే తాగాడు. మనకి ఉత్సాహం వచ్చి నీళ్లలో ఉన్న మొదటి మెట్టు మీదకి దిగా.
''అరే... చెరువులో కూడా మెట్లున్నాయిరా...'' అంటూ అరిచా, పెద్ద ఆర్కిమెడిస్ లాగా ఏదో కనిపెట్టినట్టు.
''అసలెన్ని మెట్లున్నాయో చూద్దామా?'' అన్నా కూడా.
''అమ్మో... వద్దు. ఇంట్లో తెలిసే కొడతారు. పోదాం, పద...'' అంటూ వాడు రెండు మూడు మెట్లెక్కేసి అక్కడి నుంచి చూడసాగాడు.
''ఇంట్లో చెప్పద్దులే...'' అంటూ నేను ఒకటి, రెండు, మూడు... అంటూ మెట్లు దిగా. మూడో మెట్టు మీద నాచుంది. అది జర్రున జారింది. మనం బుడుంగు!
విజయ్ గబగబా మెట్లెక్కేసి బిక్కమొహం వేసి చూస్తుండిపోయాడుట, ఆ సంగతి తర్వాత తెలిసింది.
చెరువులో పడిన మనకి ఏమీ గుర్తులేదు. ఇంతలో గుడి అరుగు మీద పడుకున్న పూజారికి ఏదో అనుమానం వచ్చి, గబగబా వచ్చాట్ట. విజయ్ నాకేసి చూపించాట్ట. అప్పటికి నా చొక్కా బుడగలాగా తేలుతోందిట. ఆ పూజారి ఉన్నపళంగా పరిగెత్తుకుంటూ మెట్లు దిగి ఆ చొక్కా పట్టుకుని నన్ను గుంజి పైకి లాగాడుట. ఇదేమీ మనకి తెలీదు.
గూబ గుయ్యి మనడం మాత్రం తెలుసు. అది ఆ పూజారి కొట్టిందే. నన్ను నిలబెట్టి లాగి పెట్టి కొట్టి, ఆ తర్వాత నన్ను భుజం మీద వేసుకుని ఇంటికి బయల్దేరాడు. పూజారి దెబ్బ వల్లే కాదు, ఆ చెరువులో తాబేళ్ల భయం వల్ల కూడా నేను ఏడుపు లంకించుకున్నా. విజయ్ ముందుగా పరుగెత్తుకుంటూ వెళ్లి మన సాహసం గురించి చెప్పేశాడు. అమ్మ, ఆ చుట్టు పక్కల అమ్మలక్కలు అందరూ గుమి గూడారు. నిలువునా తడిసిపోయిన నన్ను పూజారి దింపి, జరిగింది చెప్పాడు.
''పెద్ద గండం గడిచింద''న్నాడు.
అమ్మ ఏడుస్తూనే నాకు మరో రెండు అంటించింది. ఇంతలో ఎవరు చెప్పారో ఏమో కానీ నాన్నగారు, టీచర్లు కూడా వచ్చేశారు. అందరూ కలిసి మీటింగు పెట్టుకున్నారు. చాలా సేపు నా గురించి మాట్లాడుకున్నారు. ఆ రాత్రికి నాకు జ్వరం. జ్వరంలో ''బాబోయ్... తాబేళ్లు, తాబేళ్లు...'' అంటూ పలవరింతలట. దాంతో ఇక కోటిపల్లిలో మనకి స్కూలు లేదు. ఇంట్లోనే ట్యూషన్ పెట్టేశారు. నా చెరువు సాహసం గురించి మాత్రం నేను పెద్దయ్యే వరకు అమ్మ, నాన్నగారు అందరికీ చెబుతూనే ఉండేవారు. నేను కూడా ఆసక్తిగానే వినేవాడిని. చెప్పాక అందరూ కలిసి తిట్టేవారు కూడా. నేను పైకి ఉడుక్కున్నట్టు నటించేవాడిని, లోపల సంతోషంగానే ఉన్నా.
ఆదివారం, సెప్టెంబర్ 24, 2023
చింపాంజీ చెప్పిన పాఠం!
నా చిన్నప్పటి జ్ఞాపకాలను తోడి చూసుకుంటే చెల్లూరులో అక్షరాభ్యాసం జరగడం గుర్తుంది. ఆ వేడుకకి మా నాన్నగారు నాకు నెహ్రూ కోటు కుట్టించారు. దాని రెండో బొత్తంలో గులాబీ పువ్వు కూడా గుచ్చారు. మా నాన్నగారు హెడ్మాస్టరుగా ఉండేవారు. ఆ రోజు అంతా హడావుడే. నా చేత పిల్లలకి పలకలు, బలపాలు పంచి పెట్టించారు. ఎవరెవరో వచ్చారు. అందరూ నాకు ఏవేవో బహుమతులు ఇచ్చారు. అందరూ వెళ్లాక చూసుకుంటే ఎన్ని బొమ్మలో. కీ ఇస్తే గుండ్రంగా స్కూటరు నడిపే చింపాంజీ బొమ్మ, కీ ఇస్తే పాకే పిల్లాడి బొమ్మ... ఇలా చాలా. వాటన్నింటినీ నేల మీద వరసగా పరుచుకుని ఆడుకోవడం గుర్తుంది. నా అక్షరాభ్యాసానికి మా బాబ్జీ మావయ్య కూడా వచ్చాడు. మేమిద్దరం ఆ బొమ్మలతో చాలా సేపు ఆడుకున్నాం. బాబ్జీ నా కన్నా అయిదారేళ్లే పెద్దవాడు. అంటే నేను పిలగాడినైతే, మావయ్య కుర్రగాడన్నమాట. ఇద్దరం చాలా సేపు ఆడుకున్నాక ''ఒరేయ్... ఈ చింపాంజీ బొమ్మలో ఏముందో చూద్దామా?'' అన్నాడు బాబ్జీ మావయ్య.
''ఎలా?'' అన్నాన్నేను బోలెడంత ఆశ్చర్యంతో.
''ఏముందీ? విప్పితే సరి. ఎలా తిరుగుతోందో తెలుస్తుంది'' అన్నాడు.
అప్పుడు నాకు బాబ్జీ ఓ హీరోలా కనిపించాడు. ''ఆ...'' అన్నా నేను హుషారుగా.
''అయితే ఓ చెంచా తీసుకురా'' అన్నాడు బాబ్జీ ఆ బొమ్మను చేతిలోకి తీసుకుని.
''మరి బొమ్మ పాడయిపోతుందేమో...'' మనలో బెంగ.
''ఏం కాదెహె. మళ్లీ బిగించేయొచ్చు...''
అంతే... మనం పరిగెత్తుకు వెళ్లి ఓ నాలుగు చెంచాలు తెచ్చేశాం. ఈ లోగా బాబ్జీ దాని ముఖమల్ చొక్కా విప్పేశాడు. నేను తెచ్చిన చెంచాల్లోంచి ఒకటి ఎంచుకుని దాని వెనక అంచుతో ఆ బొమ్మ స్క్రూలు విప్పాడు. లోపల ఏవేవో పళ్ల చక్రాలు. నేను కుతూహలంగా ఒంగుని చూస్తుంటే లోపల చక్రాలు, అన్నీ విప్పేశాడు.
''అదీ సంగతి...'' అన్నాడు ఏదో కనిపెట్టినట్టు.
''ఏంటీ?'' అన్నాను నేను ఉత్కంఠతో.
''ఇదిగో... మనం కీ ఇచ్చినప్పుడు లోపల ఈ స్ప్రింగు తిరుగుతుంది. కీ తీసేయగానే దానికి ఆనుకుని ఉన్న ఈ బుల్లి చక్రం తిరుగుతుంది. దీని వల్ల ఈ పెద్ద చక్రం, దాని వల్ల స్కూటరుకి ఉన్న చక్రాలు తిరుగుతాయి...'' అంటూ వివరించాడు.
''భలే భలే... ఇప్పుడు బింగించేసి చూద్దామా?'' అన్నాన్నేను.
బాబ్జీ బిగించడం మొదలెట్టాడు మనం ఆసక్తిగా చూస్తుంటే. కానీ స్ప్రింగు ఎగదన్నింది. దాన్ని చుట్ట చుట్టి లోపల పట్టించాడు. ఆ తర్వాత ఒకో స్క్రూ బిగించాడు. ఆఖరుకి చింపాంజీ ముఖమల్ చొక్కా వేసేశాడు. తర్వాత కీ హోల్‌లో కీపెట్టి తిప్పాడు. తిరగలేదు!
మనం బిక్క మొహం వేశాం. బాబ్జీ బలవంతంగా తిప్పాడు. కానీ బొమ్మ తిరగలేదు! పక్కకు పడిపోయింది!!
నేను ఏడుపు లంకించుకున్నాను. ''నా చింపాంజీ బొమ్మ పాడయిపోయిందీ...ఈ...ఈ...'' అంటూ!
నా ఏడుపు లోపల పడుకున్న అమ్మ, నాన్నలకి వినిపిస్తుందని బాబ్జీ కంగారు పడ్డాడు.
''ఏడవకు. ఇంకోటి కొనిపెడతాలే. నేను విప్పానని చెప్పకేం. తిడతారు...'' అంటూ నా నోరు నొక్కి బుజ్జగించి, బతిమాలాడు.
కాసేపయ్యాక నేను ఏడుపాపి, ''మరి నాన్నగారు ఈ బొమ్మ తిరగడం లేదేంటని అడిగితే?'' అన్నాను బెంగతోనే.
బాబ్జీ అపాయం తప్పించుకునే ఉపాయం కోసం ఆలోచనలో పడ్డాడు.
''ఇన్ని బొమ్మల్లో ఇదేం గుర్తుంటుంది? ఓ పని చేద్దాం. ఈ చింపాంజీ బొమ్మని పాడేద్దాం. సరేనా?'' అన్నాడు బాబ్జీ.
నేను అయిష్టంగానే ''సరే...'' అన్నాను.
ఇద్దరం వీధి తలుపు తీసి బయటకి వెళ్లాం. మా ఇంటి ఎదురుగా రోడ్డుకి అవతల ఓ పెద్ద గొయ్యి ఉండేది. ఆ చుట్టు పక్కల ఇళ్ల వాళ్లు ఆ గొయ్యిలో చెత్తంతా పడేసేవాళ్లు. బాబ్జీ ఆ బొమ్మని అందులోకి గిరవాటు వేశాడు.
తిరిగి వచ్చి బొమ్మలన్నీ దాచేశాం. కాసేపటికి అమ్మా,నాన్నగారూ లేచారు.
''ఒరేయ్... ఏవీ నీకొచ్చిన బొమ్మలు తీసుకురా..'' అన్నారు నాన్నగారు.
మనం బెంగగానే బొమ్మలన్నీ తెచ్చాం. ఇంతలో అమ్మ వచ్చి ''ఒరేయ్... ఆ చింపాంజీ బొమ్మేదిరా? చాలా బాగుంది'' అంది.
''అదీ... అదీ...'' అని నేను నసుగుతుంటే, బాబ్జీ అందుకుని, ''అక్కా! దాంట్లో ఏముందో చూద్దామన్నాడే వీడు. విప్పి చూశాం. పాడయిపోయింది...'' అంటూ నెమ్మదిగా చెప్పాడు.
''అప్పుడే తగలెట్టేశారా?'' అంటూ అమ్మ కేకలేసింది.
''అందులో ఏముందో చూడ్డం ఎందుకు? హాయిగా ఆడుకోక?'' అంటూ అమ్మ నా వీపు మీద ఒకటేసి, ''అయినా వాడు విప్పమంటే విప్పేయడమేనా? ఇద్దరూ కలిసి నిక్షేపంలాంటి బొమ్మని నాశనం చేశారు. వాళ్లిచ్చి గంటయినా కాలేదు...'' అంటూ బాబ్జీని కేకలేసింది.
ఇంతలో నాన్నాగారు, ''సర్లే... పాడయితే పోనీకానీ, ఆ బొమ్మేది?'' అన్నారు.
''మరేం... బాబ్జీ దాన్ని బయటకి విసరేశాడండీ...'' అని నేను నిజం చెప్పేశా.
''ఓరి వెధవల్లారా. అదుంటే జాగ్రత్తగా బిగిద్దుం కదా?'' అన్నారు నాన్నగారు.
బాబ్జీ కుదుటపడి, ''బావగారూ! ఆ గోతిలోకే విసిరేశామండీ? పోయి తెచ్చేదా?'' అంటూ పరిగెత్తాడు.
''ఆగరా...'' అంటుండగానే వెళ్లి ఆ గోతిలోకి దిగి, చెత్తంతా వెతికి ఆఖరికి చింపాంజీని తీసుకొచ్చాడు.
నాన్నగారు దాన్ని చూసి, ''ఎలా విప్పావురా?'' అన్నారు.
''ఇదిగో... ఈ చెంచాతో...'' అన్నాడు బాబ్జీ.
''ఏడిశావ్. వెళ్లి అలమారలో టర్నస్క్రూ ఉంటుంది తే...'' అన్నారు.
బాబ్జీ వెళ్లి తెచ్చాడు.
''బాగానే ఉంది. ఇప్పడు దాన్ని బిగిస్తూ కూర్చుంటారా, చిన్నపిల్లాడిలాగ...'' అంటూ అమ్మ ఎకసెక్కం చేసింది.
నాన్నగారు ''చూద్దాం...'' అంటూ పని మొదలెట్టారు. ఈసారి నేను, బాబ్జీ కూడా కుతూహలంగా ఒంగుని చూడసాగాం. నాన్నగారు జాగ్రత్తగా దాని చొక్కా తీసి, ఆ తర్వాత దాని స్క్రూలు విప్పి, లోపల పరిశీలించారు.
''వెధవా... ఈ స్ప్రింగుని సరిగా దాని ప్లేస్ లో పెట్టలేదురా'' అంటూ సరి చేశారు. తిరిగి అన్నీ బిగించి, చొక్కా వేసి, కీ ఇచ్చారు.
మా ఇద్దరిలోనూ ఉత్కంఠ! నాన్నగారు దాన్ని నేల మీద పెట్టి వదలగానే ఆశ్చర్యం! అది గుండ్రంగా గిరిగిరా తిరిగింది! నా మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగింది. బాబ్జీ ఊపిరి పీల్చుకున్నాడు.
''ఒరేయ్... విప్పితే విప్పారు కానీ, దాన్ని పడేయాలని ఎందుకనుకున్నారు?'' అని అడిగారు. మేం చెప్పాం.
''కుతూహలం మంచిదే. కానీ... మీరు ఒక తప్పు చేసి, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. బొమ్మ పాడయితే ఆ సంగతి ధైర్యంగా చెప్పవచ్చు కదా?'' అన్నారు.
అప్పట్లో అర్థం కాకపోయినా, ఇప్పుడు ఆలోచిస్తే ఆయన మాటల్లో ఎంత మంచి పాఠముందో తెలుస్తోంది.
ఏదయినా చేతకాని పనిని వెనకా ముందూ ఆలోచించకుండా చేయకూడదు. ఒకవేళ చేసినా దాని పర్యవసానాల్ని దాచాలని ప్రయత్నించకూడదు. తప్పు చేసినా దాన్ని ధైర్యంగా చెప్పాలి కానీ, కప్పెట్టాలని చూడకూడదు.
ఇది... నాకు చింపాంజీ చెప్పిన పాఠం!
శనివారం, సెప్టెంబర్ 16, 2023
20 కోట్ల యజ్క్షాలు!
మనం అప్పటికి మూడో తరగతి చదువుతున్న కుర్రగాళ్లం. మా నాన్నగారు ఓసారి ఏదో చెబుతూ 'అనాథ ప్రేత సంస్కారం... కోటి యజ్క్షం ఫలం లభేత్' అని చెప్పారు. అంటే దిక్కూమొక్కూ లేని వాళ్లు ఎవరైనా చనిపోతే వారి మృతదేహానికి అంత్యక్రియలు జరిపితే అంత పుణ్యం అన్నమాట అంటూ వివరించారు. 'ఓహో...' అనుకున్నాం మనం.
మా నాన్నగారు తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు హెడ్మాస్టరు. మనం ఆ పక్క బడిలోనే చదువు వెలగబెడుతూ ఉండేవాళ్లం. ఆ తర్వాత మా నాన్నగారికి విశాఖ జిల్లా చోడవరానికి బదిలీ అయింది. సంగతి తెలియగానే మనం అందరికీ 'మేం కొత్త వెళ్లపోతున్నామోచ్...' అంటూ టాం టాం చేసుకున్నాం. ఆ తర్వాత నాన్నగారు అక్కడ ఇళ్లు చూడ్డం, సామాను ఎస్సారెమ్టీలో వేసెయ్యడం, మమ్మల్ని తీసుకెళ్లడం జరిగిపోయాయి. కొత్త ఇల్లు భలే ఉంది. ముందు చెక్కతో చేసిన గేటు. అది తీయగానే కొంత దూరం సన్నని మార్గంలో నడవాలి. ఆ మార్గంలో అటూ ఇటూ నిమ్మగడ్డి మొక్కలు. వాటి ఆకులు చిదిమితే ఘాటు వాసన వచ్చేది. ఆ మార్గంలో ఎదురుగా ఉండేది ఇంటి ఓనరు వాటా. ఆయన పేరు ఆనందరావుగారు. వాళ్ల అమ్మాయి నా కంటే వయసులో రెండేళ్లు పెద్దదనుకుంటా. పేరు బాల. ఓనరు వాటాకి ఎడమ వైపు నడిస్తే మా వాటా. ముందు చెక్క పేడులతో చేసిన కటకటాలు. అదే వీధి గది లేక వరండా అన్నమాట. లోపల ఓ పెద్ద గది. ఆ తర్వాత ఓ వంటిల్లు. మననింకా కొత్త స్కూళ్లో వేయలేదు కాబట్టి తోచిన ఆటలు ఆడుకోవడమే పని. ఆ ఇంటి పెరడంతా తిరుగుతూ చూస్తుంటే వెనక వైపు బూజులు, సాలె గూడులు, చీమల పుట్టలు గట్రా కనిపించాయి. అన్నీ చూస్తుంటే కండ చీమలు కొన్ని చచ్చి పడున్నాయి. ఇక మనకి పని పడింది. ఆ చీమలన్నింటినీ జాగ్రత్తగా పుల్లతో తీసి ఓ కాగితంలో వేశాను. ఆ తర్వాత వాటిని లెక్క పెడితే ఇరవై ఉన్నాయి. అటూ ఇటూ వెతికితే ఓ పెద్ద పుల్ల దొరికింది. దాంతో అక్కడి నేలపై ఓ గొయ్యి తీశాను. ఆ చీమలన్నింటినీ అందులో వేసి మట్టి కప్పేశాను.
సాయంత్రం నాన్నగారు వచ్చారు. రాత్రి భోజనాలు చేస్తుంటే...
''నాన్నగారూ! నేనివాళ ఇరవై కోట్ల యజ్క్షాలు చేశాను...'' అన్నాను గొప్పగా.
''అదేంట్రా? ఎలా?''
''మన ఇంటి చుట్టూ కండ చీమలు చచ్చి పడున్నాయండీ. వాటన్నింటినీ గొయ్యి తీసి కప్పెట్టా. మీరన్నారుగా? అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్క్ష ఫలం లభేత్ అని!'' అంటూ వివరించా.
ఆయన గట్టిగా నవ్వేశారు. ఆ తర్వాత ''ఏడిశావ్'' అన్నారు. ''దానర్థం అది కాదు'' అనేశారు.
నాకు మాత్రం అప్పట్లో అర్థం కాలేదు. మనుషులు చనిపోతేనే అంత్యక్రియలా? పాపం చీమలకు ఉండవా? వాటికెవరు చేస్తారు? నేను చేశానుగా? మరి నాకు పుణ్యం రాదా?
సోమవారం, జూన్ 26, 2023
ఆటెయ్... పోటెయ్... ఏడుపొస్తే ఆపెయ్!
అవి నేను రెండో తరగతి చదువుతున్న రోజులు. పడవెక్కి గోదావరి దాటడం, ఏడుస్తూ ఇంటికి రావడం గుర్తొస్తోంది.
అరవై దాటిన వయసులో అలనాటి చిన్నతనం జ్ఙాపకాలను తోడుకోవడం భలే బాగుంటుంది. ఎవరి బాల్యం వారికి తీపే. చిత్రమేమిటంటే ఇతరుల చిన్నప్పటి సంగతులు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. వాటితో తమ బాల్యాన్ని తడిమి చూసుకుంటారంతా. మేమప్పుడు కోటిపల్లిలో ఉండేవాళ్లం. నాన్నగారు అక్కడ హైస్కూల్ హెడ్మాస్టర్. మనం ఎలిమెంటరీ పిలగాడినన్నమాట. కోటిపల్లి అనగానే ఎన్ని జ్ఙాపకాలో! సంబరంలో జీళ్లు, సోమేశ్వరాలయం, ఆలయం ఎదురుగా చెరువు, ఆ చెరువులో పెద్ద పెద్ద తాబేళ్లు, నా జలగండం...అబ్బో, చాలా!
ఓసారి మా అయిదో మావయ్య మా ఇంటికొచ్చాడు. అవడానికి మావయ్యే కానీ వయసు నాకన్నా అయిదారేళ్లే ఎక్కువ. అంటే మనం పిలగాడినైతే, వాడు కుర్రగాడన్నమాట. పేరు బాబ్జీ. ఎప్పుడూ మావయ్యా అని పిలిచింది లేదు. 'ఒరేయ్ బాబ్జీ...' అనే.
బాబ్జీ మావయ్య ఇంటికొస్తే నాకెంతో సంబరం. ఎక్కడెక్కడికో తిప్పుతాడని. ఓ సాయంత్రం ఆ పనే చేశాడు.
'ఒరేయ్ గోదారొడ్డుకి వెళదాంరా...' అన్నాడు. మనం కాదనేదేముంది? ఇద్దరం కలిసి పోయాం. అక్కడ జీళ్లు కొనుక్కున్నాం. కోటిపల్లి జీళ్లకి ప్రసిద్ధి. వాటి రుచే వేరు. సాగుతున్న ఆ జీళ్లను బుగ్గన పెట్టుకుని పాకం పీల్చుకుంటూ గోదారొడ్డుకి వెళ్లాం. అక్కడ అటూ ఇటూ తిరిగే పడవలు ఉన్నాయి.
'ఒరేయ్... పడవెక్కుదామేంట్రా?' అన్నాడు మెరుస్తున్న కళ్లతో బాబ్జీ.
నాకు ఓ పక్క హుషారు, మరో పక్క భయం.
'అమ్మో... ఇంట్లో తెలిస్తే?' అన్నాన్నేను సంకోచంగా.
'ఏం కాదులే. అరగంటలో వచ్చేస్తాంగా...' అంటూ బాబ్జీ జేబులో డబ్బులు చూసుకున్నాడు.
మొత్తానికి ఎక్కేశాం. అదొక నాటు పడవ. పెద్ద తెరచాప. అందరూ దానిలో అడ్డంగా వేసిక చెక్కలపై కూర్చున్నారు. మేం కూడా ఓ చెక్కపై కూర్చున్నాం. నేను కాస్త ఒంగుని చెయ్యి చాపితే అందుతున్న గోదావరి నీళ్లు. నేను ఆ కెరటాలపై నా చిట్టి చేతులు ఆడిస్తుంటే పడవ వాడు చూశాడు.
'ఏయ్... వంగకు...' అంటూ గదమాయించాడు. తర్వాత మమ్మల్ని చెక్కల మీద నుంచి దింపేసి పడవలో కింద కూర్చోబెట్టాడు. మనం బిక్కమొహం వేశాం.
పడవ బయల్దేరింది. బహుశా కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం అనుకుంటా. ఆ వయసులో ప్రయాణం గుర్తుంటుంది కానీ, తీరాల పేర్లేం తెలుస్తాయి?
పడవ అంచు మీద నడుస్తూ ఒకడు పెద్ద గెడకర్రను నీళ్లలోకి దింపి తోశాడు. పడవ ముందుకు కదిలింది. కాపేపలా తోశాక గెడ తీసేశాడు.
'ఇక గెడ వెయ్యడు...' అన్నాడు బాబ్జీ.
'ఏం?'
'గెడకి లోతు అందదు. ఇక్కడ గోదారి ఎంత లోతుంటుందో తెలుసా?'
'ఎంత?'
'ఎంతంటే... రెండు మూడు తాటిచెట్లంత!'
'అంటే?'
'అంటే... తాటిచెట్లను ఒకదాని మీద ఒకటి పెట్టామనుకో, ఎంత ఎత్తుంటుంది? గోదారి అంత లోతుంటుందన్నమాట...'
బాబ్జీ పరజ్ఙానం నా బుల్లి మనసులో ఏదో గుబులు రేపింది.
'ఇంటికెళిపోదాం..' అన్నాన్నేను భయంగా.
'ఇప్పుడెలా? ముందు అవతలి తీరం చేరాలి. ఆ తర్వాత మళ్లీ ఇదే పడవపై తిరిగి రావాలి'
మొత్తానికి అవతలి తీరం చేరాం. అక్కడికెళ్లేసరికి సాయంత్రం అయిపోయింది. ఏవో బిస్కట్లు కొన్నాడు బాబ్జీ. నాలో బెంగ వల్ల అవి ఆనందాన్ని ఇవ్వలేదు. మళ్లీ పడవ బయల్దేరేసరికి చీకటి చిక్కనైంది. నా గుండెల్లో గుబులు పెరిగిపోయింది. పైకి చూస్తే నల్లని ఆకాశం. మినుకుమినుకుమంటున్న నక్షత్రాలు. చుట్టూ చూస్తే గోదావరి కూడా చిక్కని చీకటిలా కనిపించింది. పడవకి ఒరుసుకుంటున్న అలల సడి తప్ప ఏమీ వినిపించని నిశ్శబ్దం. పడవలో ఓ పక్క గుడ్డి లాంతరు. ఆ గంభీరమైన వాతావరణంలో మన పసి మనసు బావురుమంది.
ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాను.
'ఇంటికెళిపోదాం..ఊ...ఊ....ఊ...' వెక్కిళ్లు మొదలు.
'ఉష్... వెళుతున్నాంగా? ఏడిస్తే పడవ వాడు ఊరుకోడు...' బాబ్జీ బెదిరింపుతో కూడిన ఓదార్పు.
నా ఏడుపు విని పడవ వాడు వచ్చాడు.
'ఎందుకేడుస్తున్నావ్ బాబూ?' అన్నాడు.
'పడవ కదలడం లేదెందుకు?'
'కదుల్తోందిగా?'
'లేదు. వచ్చేప్పుడు మీరు తెడ్లు వేశారు. మరి ఇప్పుడు వేయడం లేదేం?'
మనం ఏడుస్తూ వెలిబుచ్చిన సందేహానికి పడవ వాడితో పాటు, అందులో ఉన్న మిగతావాళ్లు కూడా నవ్వేశారు.
'ఓ... అదా. వచ్చేటప్పుడు ఎదురు. ఇప్పుడు వాలు' అన్నాడు పడవవాడు.
నా కన్నీళ్లు తుడుస్తూ బాబ్జీ వివరించాడు.
'వచ్చేటప్పుడు గోదారికి ఎదురొచ్చామన్న మాట. అప్పుడు తెడ్లు వేస్తే కానీ పడవ కదలదు. ఇప్పుడు అక్కర్లే. కెరటాల వాలుకి తెరచాప సాయంతో వెళిపోతాం' అంటూ బాబ్జీతో పాటు మిగతా వాళ్లు కూడా అనునయించారు. 'ఏడుపాపెయ్...' అన్నారంతా.
నా వెక్కిళ్ల మధ్య ఎలాగైతేనేం, కోటిపల్లి వచ్చేశాం. నెమ్మదిగా పడవ దిగాం.
దూరంగా తెల్ల ప్యాంటు, తెల్ల షర్టుతో నాన్నగారు. ఆయన చేతిలో బ్యాటరీ లైటు.
నేను ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నగారిని వాటేసుకున్నా. నా వెనక బాబ్జీ మావయ్య బితుకుబితుకుమంటూ వచ్చాడు.
బాబ్జీ చేతికందేంత దగ్గరగా రాగానే నాన్నగారు టెంకిజెల్ల పీకారు. బాబ్జీ కూడా బేరుమన్నాడు. నాకూ పడ్డాయి నడ్డిమీద.
ఇక ఇంటికొచ్చాక అమ్మ, నాన్న తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకొచ్చారు. ఎక్కువగా బాబ్జీ మావయ్యకే.
వాళ్ల తిట్లలో ఇప్పుడు నాకు పెద్దవాళ్ల బెంగలూ, భయాలూ కనిపిస్తున్నాయి. వాటి వెనక కొండంత ప్రేమ, ఆప్యాయత కూడా!
ఆదివారం, జూన్ 18, 2023
జై జగదేక వీరా!
ఓ ఆదివారం మా నాన్నగారు నన్ను పిలిచి ''ఒరేయ్! జగదేక వీరుడు సినిమా బాగుంటుందిరా. పోయి చూసిరా'' అని మూడు రూపాయలు చేతిలో పెట్టారు. ఇంకేముంది? ఆనందమే ఆనందం. అప్పుడు నేను బహుశా ఆరో తరగతో, ఏడో తరగతో వెలగబెడుతున్నా. ఇది డెభ్బైల నాటి మాట. విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఉండేవారం. నాన్నగారు అక్కడి జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్. మంచి సినిమాలు వస్తే తీసుకెళ్లడమో, లేదో నన్ను పంపించడమో చేసేవారు. అప్పటికే గోడల మీద పోస్టర్లు చూశాను. ఎన్టీఆర్ రాకుమారుడిలా భలే ఉన్నాడనుకున్నా. సైకిల్ మీద పోస్టర్లు అతికించే వాడొస్తే వాడెనకాల మా పిల్లకాయలం పరిగెత్తేవాళ్లం. వాడు పోస్టర్ తీయడం, దాని వెనక్కి తిప్పి జిగురు రాయడం, దాన్ని గోడ మీద అతికించడం ఆసక్తిగా చూసేవాళ్లం. కాసేపు ఆ పోస్టర్‌ని, దాని మీద హీరో హీరోయిన్లనీ చూసి మురిసిపోతూ ఉండేవాళ్లం. 'జగదేక వీరుడు' సినిమా గురించి నాన్నగారిని అడగాలనుకుంటుంటేనే, ఆయనే లెక్కలతో కుస్తీ పడుతున్నట్లు నటిస్తున్న
నా దగ్గరకి వచ్చి మూడు రూపాయలిచ్చి సినిమాకి పోయిరా అంటే ఎలా ఉంటుందో ఊహించండి. మనసులో కెవ్వుకేక కదూ! వెంటనే మనం పుస్తకాలు పక్కకి తోసేసి పరుగో పరుగు. మా ఇంటి వీధి చివరే శ్రీనివాస్ థియేటర్. అప్పట్లో రిజర్వుడు టికెట్ మూడు రూపాయలు ఉండేది. అంటే బాల్కనీ అన్నమాట. నేల టికెట్ అర్థరూపాయి.
చోడవరంలో రెండు థియేటర్లు మా ఇంటికి బాగా దగ్గర్లో ఉండేవి. ఒకటి శ్రీనివాస్ అయితే, రెండోది పూర్ణా థియేటర్. రెండు థియేటర్ల ఓనర్ల కొడుకులు నానాజీ, రాజాజీ. ఇద్దరూ మా నాన్నగారి స్టూడెంట్లే. పొద్దున్నే మా ఇంటికి ట్యూషన్‌కి కూడా వచ్చేవాళ్లు. వాళ్లు ఇంటర్మీడియట్ అన్నమాట.
మనం ఆయాసపడుతూ థియేటర్లో టికెట్ కౌంటర్ దగ్గరకి నడుస్తుంటే, ''ఏం బాబూ? సినిమాకొచ్చావా?'' అంటూ వెనక నుంచి నానాజీ పలకరించాడు.
''అవును''
''పోయి కూర్చో. టికెట్ అక్కర్లేదులే''
''మా నాన్నగారు డబ్బులిచ్చారు''. మనం కొంచెం టెక్కు చూపించామన్నమాట. నానాజీ నవ్వి అక్కడున్న ఓ థియేటర్ పనోడిని పిలిచి, ''ఇదిగో. ఈ కుర్రాడిని రిజర్వ్‌డులో కూర్చోబెట్టు'' అన్నాడు. వాడు నన్ను తీసుకుని అంత పనీ చేశాడు.
ఎప్పుడైనా నాన్నగారు, అమ్మ, నేను ఈ రెండు థియేటర్లలో దేనికైనా వెళితే నానాజీ, రాజాజీ ఆ సమయానికి అక్కడ లేకపోయినా, థియేటర్ ఓనర్లు కానీ, మేనేజర్లు కానీ చూస్తే గుర్తు పట్టి టికెట్ తీయనిచ్చే వాళ్లు కాదు. ఒకవేళ ఎవరూ గమనించనప్పుడు నాన్నగారు టికెట్లు కొన్నా మేం థియేటర్లో కూర్చున్న కాసేపటికి ఏ మేనేజరో వచ్చి నాన్నగారికి టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేసే వాడు. అంతే కాదు, ఇంటర్లెల్లో కూల్‌డ్రింకులు, సమోసాలు వచ్చేసేవి. అదంతా నాకెంతో గొప్పగా ఉండేదన్నమాట.
నేను వెళ్లి రిజర్వ్‌డ్ క్లాసులో కూర్చున్న కాసేపటికి సినిమా మొదలైంది. ఇక మనం ఆ జానపద కథా లోకంలోకి వెళ్లిపోయాం. చిలిపి దెయ్యాలు, అప్సరసలు, జలకాలాటలు, ఎన్టీఆర్ సాహసాలు... ఏమని చెప్పాలి? ఓ అద్భుత ప్రభావం. 'హళా... వారుణీ', 'హళా... సఖీ' అనే పిలుపులకి, ఆ మాటలకి మనం ఫ్లాట్. ఆ వయసుకి నాకు హీరోయిన్ల పేర్లు తెలియవు. దేవకన్యలంతే. అందులో రాజనాల అన్నట్టు... 'నా తెలివి పనిచేయడం మానేసింద'న్నమాట. 'ఒసే.. ఏమే... ఏమిటే...' అంటూ పలికే ఇంద్రకుమారి ముద్దు మాటలకి ముచ్చట పడిపోయా. నాగకుమారి నృత్యానికి మైమరచిపోయా. 'ఓం ఏకోనేకోహమస్మి' మంత్రం ఆ తర్వాత చాలా కాలం నన్ను వదలనే లేదు.
ఇక పాటలు?
'అయినదేమో అయినది ఇక గానమేలే ప్రేయసీ...'
'ఇది మోహన రాగమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే...'
'ఓ చెలీ ఓ సఖీ ఒహో మదీయ మోహినీ...'
ఆ పాటలు చూస్తూ ఆ నటీనటుల భావాలతో మమేకమైపోయా.
'రారా కనరారా... కరుణ మానినారా... ప్రియతమలారా...' అంటూ ఎన్నీఆర్ పాడుతుంటే మన గుండె కూడా బరువెక్కిపోయింది.
ఒకడు ఐదుగురై, ఏక కాలంలో వాయిద్యాలన్నీ వాయిస్తూ ఎన్టీఆర్ పాడే 'శివశంకరీ... శివానంద లహరి...' పాటకి పులకించిపోయా.
మొత్తానికి సినిమా అయిపోయినా ఆ మత్తులోనే తేలియాడుతూ, కాళ్లీడ్చుకుంటూ చెల్లా శీనుగాడి ఇంటి అరుగు మీద కూలబడ్డా.
ఫ్రెండ్స్ చేరారు. మనం మొదలెట్టాం. ''ఒరేయ్. జగదేకవీరుడు మ్యాట్నీకెళ్లారా. సినిమా ఉందిరా...'' అంటూ కబుర్లు మొదలు.
''భలే వెళ్లావురా, మొదటి రోజే' అంటూ వాళ్లు చుట్టూ మూగారు.
అప్పుడే... మనకొక ఐడియా తళుక్కుమంది.
''ఒరేయ్. ఫస్ట్ షోకి పోదామా'' అన్నా హుషారుగా.
''ఎలారా. డబ్బుల్లేవుగా'' అన్నారు వాళ్లు దిగులాగా.
''నా దగ్గర ఉన్నాయిగా'' అంటూ జేబులోంచి మూడు రూపాయలు చూపించా. నాన్నగారు డబ్బులివ్వడం, నానాజీ లోపలికి పంపిచేయడం అంతా చెప్పా. చుట్టూ జట్టుగాళ్లు నాతో కలిపి ఆరుగురు.
''ఒరేయ్. నేలకి పోదాంరా'' అంటూ నేను మళ్లీ పరుగు. నా వెనకాలే వాళ్లూనూ. అందరం కలిసి అర్థరూపాయి వంతున ఆరు టిక్కెట్లు కొనుక్కుని నేలలోకి దూరిపోయాం. అంటే నేను ఒకే రోజు మ్యాట్నీ, ఫస్ట్ షో చూసేశానన్నమాట.
రాత్రి తొమ్మిదిన్నరకి ఇంటికి చేరేసరికి, ''ఏరా, మ్యాట్నీ అయిదున్నరకే అయిపోతుందిగా? ఇంత సేపు ఏం చేశావ్?'' అనడిగితే,
''ఆడుకొని వచ్చా'' అని చెప్పేశా! ఆ తర్వాత ఆ సినిమా వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ టీవీల్లో వస్తే చూడడమే.
బుధవారం, జూన్ 14, 2023
సునసూయలు అంటే?
ఓసారి నేను నాన్నగారి దగ్గరకి వెళ్లి, ''సునసూయలు అంటే ఏంటండీ?' అని అడిగాను.
ఏదో పని చేసుకుంటున్న ఆయన ప్రశ్నార్థకంగా మొహం పెట్టి, ''సునసూయలు ఏంట్రా?'' అని అడిగారు.
''అవును నాన్నగారూ, పాటలో కూడా ఉంది'' అన్నాన్నేను.
''ఏదీ ఆ పాటేంటో చెప్పు?'' అన్నారాయన.
నేను హుషారుగా పాడాను కూడా. ''బృందావనమిది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే. ఎందుకె రాధా ఈ సునసూయలు? అందములందరి ఆనందములే...'' అని నేను పాడగానే ఆయన నవ్వేశారు.
''అది ఈ సునసూయలు కాదురా, ఈసునసూయలు...'' అన్నారు.
నాకేమీ అర్థం కాలేదు, నేను చెప్పిందే చెబుతారేంటని.
అప్పుడు వివరించారు, ''ఈసు అంటే ఈర్ష్య. అసూయ అంటే తెలుసుగా? రెండింటినీ కలిపి 'ఈసునసూయలు' అని పాడారు. నువ్వేమో ఆ పదాన్ని విడదీసి, 'ఈ... సునసూయలు' అంటే నాకే అర్థం కాలేదు. రాముడి తోక పివరుండు ఇట్లనియే... లాగా...'' అన్నారు తేలిగ్గా నవ్వేస్తూ.
అన్నట్టు 'రాముడి తోక పివరుండు ఇట్లనియే' తెలుసుగా?
'రాముడితో కపివరుండు ఇట్లనియే...' అని చదువుకోవాలన్నమాట.
మీ చిన్నప్పుడు కూడా ఇలాటి అర్థంకాని... అర్థం లేని సందేహాలు కలిగి ఉంటే సరదాగా కామెంట్ రూపంలో పంచుకోండి. సరేనా?







