మంగళవారం, జులై 11, 2023

అవగుణాలవాడు... అవకతవకల వాడు!



''పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాడు

కండువా లేనిదే గడపదాటని వాడు

పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ

గోంగూర కోసమై గుటకలేసేవాడు

ఎవడయ్య ఎవడు వాడు?

ఇంకెవడయ్య తెలుగువాడు!''

గురువుగారు మైమరిచిపోయి కవితాగానంలో ఉండగా శిష్యుడు వచ్చి నమస్కరించి మౌనంగా కూర్చున్నాడు. చదవడం అయిపోయాక కూడా కాసేపు ఆ తన్మయత్వంలో మునిగిపోయారు గురువుగారు.

ఆనక శిష్యుడి కేసి చూసి, ''ఆహా... ఏం రాశాడురా...'' అన్నారు.

''ఎవరండీ?'' అన్నాడు శిష్యుడు.

''సినారేరా... బడుద్ధాయ్‌! ఎంత బాగా చెప్పాడురా తెలుగువాడి గురించి. సినారె పేరు వినలేదా?''

''విన్నాననుకోండి. సినిమాలో పాటలూ గట్రా కూడా రాశారు కదండీ?''

''వార్నీ...  జ్ఙానపీఠ అవార్డు అందుకన్న గొప్ప సాహితీవేత్తరా ఆయన. నీ బతుక్కి ఆయన్ని పాటలు రాసేవాడిలాగానైనా గుర్తెట్టుకున్నవంతే చాలు. ఆ పాటలు కూడా మామూలువేంట్రా... రసరమ్యగీతాలనుకో...''

శిష్యుడు బుర్రగోక్కున్నాడు. ఇలా వదిలేస్తే గురువుగారు దార్లోకి రారని నేరుగా పాయింటులోకి వచ్చేశాడు.

''ఆ సినారేగారెవరైతే నాకెందుకు గురూగారూ! నేనేదో కాసిన్ని పాఠాలు నేర్చుకుని రాజకీయ పీఠం ఎక్కుదామనుకుంటుంటే మీరేమో జ్ఙానపీఠం అంటారు. ఏనాటికైనా తెలుగువారికి నేతనై రాణించాలనుకుంటుంటే మీరేమో కవిత్వాలు వల్లిస్తున్నారు...'' అంటూ గునిశాడు.

గురువుగారికి కోపం వచ్చినా తమాయించుకున్నారు.

''ఓరి దౌర్భాగ్యుడా! ఎంత సేపూ నీ నీచ లక్ష్యమే నీది కానీ, మరో ధ్యాస లేదేంట్రా? సరే... మంచి కవిత్వం చదువుతుంటే కాదన్నావు కాబట్టి, ఇవాళ పాఠాన్ని ఆ కవిత్వంతోనే ముడిపెడతాను. కాసుకో...''

''అమ్మయ్య... ఎలాగోలా పాఠం చెబుతానన్నారంతే చాలు గురూగారూ! మీరెలాగైనా చెప్పండి రాసుకుంటాను...''

''సరే అయితే. తెలుగు వారికి నేతనైపోదామనుకంటున్నావు కదా? ఇప్పుడు నేను చెప్పే కవిత్వం ఎవరి గురించో పోల్చుకో చూద్దాం...'' అంటూ గురువుగారు గొంతు సవరించుకున్నారు.

శిష్యుడు ఉత్సాహంగా పుస్తకం తెరిచి పెన్ను పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు.

''వంచన చేయుటలో ప్రపంచాన మొనగాడు

కమీషన్లేనిదే ఫైలు కదపనివాడు

ఏ చోటకేగినా ఏది తలపెట్టినా

అవినీతి వియోగమసలె సైపని వాడు

ఎవడయ్య ఎవడు వాడు?

ఇంకెవడయ్య తెలుగు రేడు!''

శిష్యుడు కళ్లు తేలేశాడు. ''అదేంటి గురూగారూ! సినారెగారు తెలుగువాడిని పొడిగితే, మీరేమో పాపం తిడుతున్నారు?'' అన్నాడు.

''ఏడిశావ్దరిద్రుడా! నే చెబుతున్నది తెలుగు  రేడు గురించిరా. రేడు అంటే నాయకుడని కూడా తెలియదంట్రా?'' అంటూ గురువుగారు గద్దించారు.

''సరే సరే గురూగారూ! కోప్పడకండి... చెప్పండి రాసుకుంటాను...'' అంటూ శిష్యుడు బుద్దిగా తలూపాడు.

గురువుగారు కొనసాగించారు.

''ఫ్యాక్షనిస్టుల వంశాన పుట్టినవాడు

కాకలు తీరి కాసుల వేట సాగించినవాడు

పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతమ్ము

పెద్దల ఎదుట నక్కవినయమ్ము  చూపువాడు

ఎవడయ్య ఎవడు వాడు?

ఇంకెవడయ్య తెలుగు రేడు!''

గురువుగారు కాస్త ఆగగానే, ''అయిపోందాండీ?'' అన్నాడు శిష్యుడు.

''ఆగరా వెధవాయ్‌! మీ నేత లీలలు అంత తొందరగా అయిపోతాయేంట్రా. నోరు మూసుకుని రాసుకో...'' అంటూ గురువుగారు మళ్లీ గొంతు సవరించుకున్నారు.

''నేల నల్లెసల నేరాల డేరాలు నాటినవాడు

అవినీతి మూసలో అట్టె ఒదిగినవాడు

వ్యవస్థలన్నింటిని కూలదోసినవాడు

అస్తవ్యస్త విధానాల ఆరితేరినవాడు

అదేమిటని ఎవరైన ప్రశ్నించ

అన్యాయపు కేసులతో బెదరగొట్టేవాడు

వంచకులు ఎదురైన మాలలిచ్చేవాడు

రౌడీ గూండాలతో చేయి కలిపేవాడు

చిక్కులెట్టేవాడు చిత్తాన కసివాడు

ఎవడయ్య ఎవడు వాడు?

ఇంకెవడయ్య తెలుగు రేడు!''

శిష్యుడు చకచకా రాసుకున్నాడు. గురువుగారు ఆగి, ''ఏరా, ఇప్పటికైనా గుర్తు పట్టావా? ఈ కవిత్వానికి సరిగ్గా సరిపోయేవాడెవరో?''

శిష్యుడు ఓసారి పైనుంచి కిందకి చదువుకుని ''ఆహా... గుర్తు పట్టానండి. మమ్మల్నేలే మహానేత గురించి మా గొప్పగా చెప్పారండి... ఎలాగైనా మీరు పేరడీ కింగులండీ బాబూ...''

''పొగడ్తలు చాలులేకానీ, నువ్వు కూడా అంతటి వాడవ్వాలని కలలు కంటున్నావు కాబట్టి ముందు మీ నేత నీచ గుణాలన్నీ ఒంటపట్టించుకోవాలి. అందుకని ఇప్పుడు నువ్వు ఆయన గురించి చెప్పాలి. సరేనా?''

''అమ్మబాబోయ్‌! మీ అంత బాగా నేను చెప్పలేనండి. పైగా మనకి కవిత్వాలు గట్రా చేతకావండి. పైగా ఆయన గురించి చెప్పాలంటే నాలుగు ముక్కల్లో ఎక్కడవుతుందండీ? ఏకంగా పుస్తకాలకు పుస్తకాలే రాయాలండి మరి...''

''..హ్హ... హ్హా! బాగా చెప్పావురా. నిన్నూ నన్నూ ఏలుతున్న అవకతవకల వాడు, అవగుణాల వాడు అయిన ఆయన గురించి చెప్పాలంటే

నీ వల్ల కాదులే కానీ, నీకు తెలిసినంత వరకు చెప్పు. కవిత్వం రూపంలో వద్దులే... మామూలుగా ఏకరవు పెడితే చాలు, నువ్వు ఎప్పటికైనా సీఎం అయిపోయినట్టే అనుకో...''

''ఆహా... ఎంత తీయని మాటన్నారండీ. అయితే నాకు తెలిసినంత వరకు చెబుతాను మరి. వినుకోండి...'' అంటూ శిష్యుడు ఆవేశంగా మొదలు పెట్టాడు.

''అరచేతిలో స్వర్గాన్ని చూపించిన వాడు

అందరినీ నమ్మించి అందలమెక్కినవాడు

అధికారం అందాక వాగ్దానాలను మరచి

కక్ష రాజకీయాలతో కాలం గడుపుతున్నవాడు

శవానికి కుట్లు వేయించి గుండెపోటని నమ్మించగలిగిన వాడు

దేశంలోనే పేరొందిన సీబీఐ విచారణని

అడుగు కదపకుండా ఆపగలిగినవాడు

కండిషనల్బెయిల్మీద ఉండి కూడా

ఉత్తి పత్తిత్తులా మాటలాడేవాడు

న్యాయ వ్యవస్థలను ముందుకు సాగనీయని వాడు

న్యాయమూర్తులపై కూడా నిందమోపేవాడు

అమలు శక్యం కాని హామీలు గుప్పించి

నమ్మించి నట్టేట ముంచుతున్నవాడు

కులాల కుంపట్లను రాజేయగలవాడు

మతాల చిచ్చుతో మాయ చేసేవాడు

తిరుమల ఆలయంలోకి చెప్పులతో వెళ్లగలిగేవాడు

ఆలయ విధ్వంసకుల అండనుండేవాడు

పోలీసులను బెదిరించి భయపెట్టి

అడుగులకు మడుగులొత్తించుకునేవాడు

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టగలిగేవాడు

మద్యాన్ని ఏరులై పారించగలవాడు

భూములను బ్రేక్ఫాస్ట్చేయగలిగేవాడు

గనులను లంచ్లో లాగించగలవాడు

మీట నొక్కెదనంటు మాయమాటలు చెప్పి

పన్నులెన్నో పెంచి దండుకోగలవాడు

కేంద్రం మెడలు వంచుతానని పలికి

ప్రత్యేకహోదాకు నీళ్లు వదిలిన వాడు

రాజధాని లేకుండ రాజ్యమేలేవాడు

రాజకీయాలలో రాచపుండు వాడు!''

ఇంతవరకు ఏకబికిన చెప్పి ఆయాసపడుతూ ఆగాడు శిష్యుడు.

గురువుగారు పొంగిపోయారు.

''శెభాష్రా శిష్యా! నీచ నేతగా ఎదగాలంటే ముందుగా అలాంటి నేతల అడుగుజాడలు పసిగట్టాలి. నువ్వు నీ ఏలిక నిజ స్వరూపాన్ని బాగానే పసిగట్టావు. ఇక నువ్వు ఆ అవగుణాలపై పట్టు పెంచుకుని వాటిని అలవరచుకుని ముందుకు సాగిపోవడమే తరువాయి...''

శిష్యుడు తెగ సంబరపడిపోయాడు.

''కానీ గురువుగారూ! తెలుగు రేడు గురించి అంతగా చెప్పారు. కానీ తెలుగువాడు ఆ మాత్రం పసిగట్టలేడంటారా?''

''అమ్మమ్మ... ఎంత మాట. తెలుగువాడి తెగువ, తెలివి నీకు తెలియవురా.

తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు...

చిక్కు నేతల తుక్కు రేగ్గొట్ట గలవాడు...

ఎవడయ్య ఎవడు వాడు?

ఇంకెవడయ్య తెలుగువాడు!

కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగువాడి దమ్మేంటో, పవరేంటో ప్రత్యక్షంగా చూద్దువుగాని కానీ, ప్రస్తుతానికి వెళ్లిరా''

-సృజన

PUBLISHED ON 11.07.2023 ON JANASENA WEBSITE