శుక్రవారం, జులై 26, 2024

తాటకగా మారిన అందమైన యక్షిణి! (పిల్లల కోసం రాముడి కథ-9)

విశ్వామిత్రుడి వెంట బయల్దేరిన రామ లక్ష్మణులు రెండో రాత్రిని అంగదేశంలోని మునుల ఆశ్రమంలో గడిపారు. ఆ మర్నాడు మళ్లీ వాళ్ల ప్రయాణం మొదలైంది. ఆ ఆశ్రమంలోని మునులు వారి కోసం ఒక నావను సిద్ధం చేశారు. ఆ నావపై గంగానది దక్షిణ తీరానికి వెళ్లసాగారు. ప్రవాహం మధ్యలోకి నావ రాగానే నది వేగం ఒక్కసారిగా పెరిగింది. అలల ఉధృతికి వచ్చే శబ్దాలు అధికమయ్యాయి. ఇది గమనించిన రాముడు కుతూహలంతో విశ్వామిత్రుడిని అడిగాడు. 

''మహాత్మా! ఉన్నట్టుండి నది వేగం ఎందుకు పెరిగింది? నీటిలోంచి వినిపిస్తున్న ఆ భయంకర శబ్దాలకు కారణమేంటి?'' అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు ఇలా వివరించాడు.

''రామా! పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద తపస్సు చేశాడు. తనకు దగ్గరలో ఒక సరస్సు ఉంటే బాగుంటుందని తలపోశాడు. వెంటనే అక్కడొక చక్కని సరస్సు ఏర్పడింది. బ్రహ్మ మనో సంకల్పం వల్ల పుట్టింది కాబట్టి దానికి 'మానస సరోవరం' అనే పేరు కలిగింది. ఆ సరోవరం నుంచి ఒక నది పుట్టింది. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి అది సరయూ నది అయింది. ఆ నది ఇక్కడ గంగానదితో కలుస్తోంది. రెండు నదీ ప్రవాహాల వల్లనే అలల వేగం, శబ్దం కూడా పెరిగాయి. పవిత్రమైన ఈ నదుల సంగమ ప్రదేశానికి నమస్కరించు'' అని చెప్పాడు. రామలక్ష్మణులు భక్తితో ఆయన చెప్పినట్టుగానే చేశారు. 

తర్వాత వాళ్లు గంగానదిని దాటి దక్షిణ తీరానికి చేరి నడవసాగారు. చుట్టూ దట్టమైన అడవి. అలా నడుస్తూ ఉండగా రాముడు ఆసక్తిగా మరో ప్రశ్నను విశ్వామిత్రుడిని అడిగాడు. 

''మహర్షీ! ఎంత దూరం నడిచినా ఎక్కడా మానవ సంచారం కనిపించడం లేదు. క్రూర మృగాలు యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇక్కడ పెరిగిన మహా వృక్షాల వల్ల సూర్యరశ్మి కూడా నేల మీద పడటం లేదు. నిర్జనమైన ఈ  అరణ్యం పేరేమిటి?'' అని వినయంగా ప్రశ్నించాడు.

విశ్వామిత్రుడు వివరించాడు.

''రామా! ఇప్పుడు దట్టమైన అడవిలా మారిన ఈ ప్రదేశంలో పూర్వం రెండు దేశాలు ఉండేవి. అవి దేవతలచే ఏర్పడినవి. అవే మలద, కరూశ దేశాలుగా పేరొందాయి. వాటిని దేవతలు ఎందుకు నిర్మించారో కూడా చెబుతాను విను. ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు, వృత్రాసురుడిని చంపాడు. ఆ కారణంగా అతడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఫలితంగా అతడిని ఆకలి పీడించసాగింది. అప్పుడు దేవతలు ఇంద్రుడిని పవిత్రమైన ఇక్కడి గంగా జలాలతో మంత్ర పూర్వకంగా  అభిషేకించారు. వెంటనే ఇంద్రుడి మాలిన్యం, పాపము కూడా తొలగిపోయాయి. అందుకు సంతోషించిన ఇంద్రుడు ఈ ప్రదేశంలో ధనధాన్యాలతో తులతూగే రెండు దేశాలు ఏర్పడతాయని, మలద కరూశ దేశాలుగా ప్రసిద్ధికెక్కుతాయని వరం ఇచ్చాడు. అలా దేవతలు నిర్మించిన ఈ దేశాలలో ప్రజలు ఎంతో వైభవంగా జీవించేవారు. అలాంటిది ఒక యక్షిణి కారణంగా ఆ రెండు దేశాలు నాశనమయ్యాయి.  ఆమె పేరు తాటక. పుడుతూనే వేయి ఏనుగుల బలం ఆమె సొంతం. ఆమెకు మారీచుడనే రాక్షసుడు పుత్రుడిగా కలిగాడు. వాడు మహాకాయుడు. ఇంద్రుండంతటి పరాక్రమశాలి. దుర్మార్గులైన ఆ తాటక, మారీచుల వల్లనే ఈ రెండు దేశాలూ ధ్వంసమయ్యాయి. ప్రజలెవరూ ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఇక్కడికి ఒకటిన్నర యోజనాల దూరంలోనే ఆమె ఉంటున్నది. తాటకవనంగా పేరొందిన ఆ దారినే మనం ముందుకు సాగాల్సి ఉంది. రెండు దేశాలను కబళించిన ఆ తాటకను నువ్వు వధించాలి. ఈ దేశాలకు ఆమె బెడదను తొలగించాలి'' అన్నాడు.

తాటక గురించి వినగానే రాముడి మనసులో మరో ప్రశ్న ఉదయించింది.

''మునీశ్వరా! సాధారణంగా యక్షులకు అంతటి పరాక్రమవంతులు ఉండవంటారు కదా? మరి అబల అయినప్పటికీ తాటకికి మాత్రం వెయ్య ఏనుగుల బలం ఎలా కలిగింది?'' 

అప్పుడు విశ్వామిత్రుడు తాటకి వృత్తాంతాన్ని విపులంగా చెప్పాడు.

పూర్వం సుకేతుడనే ఒక యక్షుడు ఉండేవాడు.  అతడు మంచి ప్రవర్తన కలిగినవాడు, పరాక్రమవంతుడు. కానీ సంతానం లేనివాడు. ఆ చింతతో అతడు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతడికి వెయ్యి ఏనుగుల బలంతో ఒక కుమార్తె పుడుతుందని వరం ఇచ్చాడు. ఆమే తాటక. ఎంతో అందచందాలతో ఎదిగింది. సుకేతుడు ఆమెను జంభాసురుడి కుమారుడైన సుందుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. వారిద్దరికి పుట్టిన వాడే మారీచుడు. ఒకసారి తాటక భర్త అయిన సుందుడు, అగస్త్య మునికి ఆగ్రహం తెప్పించి ఆయన శాపానికి గురై మరణించాడు. తన భర్త మృతికి కారణమైన అగస్త్యునిపై కోపంతో తాటక, మారీచుడితో కలిసి దాడికి సిద్ధపడింది. తనను చంపడానికి వస్తున్న ఆ ఇద్దరిని కూడా అగస్త్యుడు శాపించాడు. ఆ శాపం వల్ల మారీచుడు రాక్షసత్వాన్ని పొందాడు. తాటక తన సుందరమైన రూపాన్ని పోగొట్టుకుని వికృతమైన నరమాంస భక్షకురాలిగా మారిపోయింది. అగస్త్యుడి మీద కోపంతోనే తాటక, ఆయన సంచరించిన ఈ ప్రదేశాన్ని ధ్వంసం చేసింది. రాక్షస స్వభావంతో నిరపరాధులైన ఇక్కడి జనులను కబళిస్తోంది. 

ఇదంతా చెప్పిన విశ్వామిత్రుడు రాముడితో, ''నాయనా! లోక కంటకిగా మారిన ఆ తాటకను నువ్వు చంపు. స్త్రీని చంపడం అధర్మమని సందేహించకు. ప్రజలకు మేలు చేకూర్చడమే రాజకుమారుడి ధర్మం కదా?'' అన్నాడు. 

దానికి రాముడు వినయంగా,  ''మహర్షీ! మీరు ఏమి చెప్పినా చేయమని నా తండ్రి నన్ను ఆదేశించారు. కాబట్టి నిస్సందేహంగా తాటకను వధిస్తాను'' అన్నాడు. 

అలా అంటూనే తన కోదండాన్ని ఎక్కుపెట్టి నారి సారించి వదలడం ద్వారా ధనుష్టంకారం చేశాడు. ఆ వింటినారి నుంచి వెలువడిన మహా ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆ భయంకర శబ్దం తాటకి చెవులను సోకింది. వెంటనే తాటక ఆవేశంతో నలుదిక్కులా చూసి, ఆ ధ్వని వినిపించిన వైపు వడివడిగా వచ్చింది. అక్కడ రామలక్ష్మణులు కనిపించారు. 

వికృతమైన ముఖంతో, మిక్కిలి లావైన, ఎత్తయిన శరీరంతో కోపావేశంతో వస్తున్న తాటకను చూసి రాముడు, లక్ష్మణుడితో ''చూశావా లక్ష్మణా ఈమె ఎంత భయంకరంగా ఉందో? ఈమెను చూస్తేనే సామాన్య జనం భయంతో గుండె పగిలి చనిపోతారు. ఈమె ముక్కు చెవులు ఖండించి పారిపోయేలా చేస్తాను'' అన్నాడు. కోపంతో చేతులు పైకెత్తి దూసుకు వస్తున్న తాటకను చూసి విశ్వామిత్రుడు ''రామలక్ష్మణులకు జయమగుగాక!'' అంటూ ఆశీస్సులు అందించాడు. ఈలోగా తాటక సుడిగాలిని సృష్టించి అక్కడంతా దుమ్ము, ధూళి రేగేలా చేసింది. తన మాయాశక్తితో కనబడకుండా రాళ్ల వర్షం కురిపించింది. రాముడు ఒక బాణంతో దుమ్మంతా చెదిరిపోయేలా చేసి, మరికొన్ని బాణాలతో రాళ్లను ఛేదించాడు. తాటక రెండు చేతులను కూడా ఖండించాడు. చేతులు తెగిపోయినా మీదకు వస్తున్న తాటకను లక్ష్మణుడు చూసి ముందుకు దూకి ఆమె ముక్కు చెవులను కోసేశాడు. కామరూపిణి అయిన తాటక తన మాయతో అనేక రూపాలు పొంది వారిని భ్రమపెట్టడానికి ప్రయత్నించింది. రాళ్ల వర్షం కురిపించసాగింది. ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు, వారిని అప్రమత్తం చేశాడు. ''రామా! ఈమెపై జాలి చూపించకు. పాపాత్మురాలైన ఈమె యజ్ఞయాగాలకు అవాంతరాలు కలిగిస్తూ ఉంటుంది. చీకటి పడితే రాక్షసులు మరింత బలం పుంజుకుంటారు. వెంటనే హతమార్చు'' అన్నాడు. 

వెంటనే రాముడు శబ్దవేధి బాణాన్ని సంధించి తాటకపైకి ప్రయోగించాడు. ఆ బాణం గుండెల్లో గుచ్చుకోవడంతో తాటక అక్కడికక్కడే మరణించింది. తాటక మరణించగానే దేవతలు పుష్పవర్షం కురిపించారు. విశ్వామిత్రుడు పరమానందంతో రాముని ప్రశంసించి, ''మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. రేపు ఉదయం బయల్దేరి ఆశ్రమానికి చేరుకుందాం'' అన్నాడు. అయోధ్య నుంచి బయల్దేరాక మూడో రాత్రిని రామలక్ష్మణులు తాటక వనంలో గడిపారు. మర్నాడు వారి ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

శనివారం, జులై 06, 2024

రాముడికి అందిన అపురూప విద్యలు!

 


రాముడికి అందిన అపురూప విద్యలు!

తండ్రి దశరథుడి మాట మీద రామలక్ష్మణులు మహర్షి విశ్వామిత్రుడి వెంట బయలుదేరారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న దేవతలు వారిపై పూల వర్షం కురిపించారు. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు. పదహారేళ్లయినా నిండని లేత వయసులో జులపాల జుట్టుతో ఎంతో సుకుమారంగా అందంగా ఉన్న రాముడు ధనుర్ధారియై ఆయనను అనుసరించాడు. లక్ష్మణుడు తోడుగా నడిచాడు. అమ్ముల పొదులను భుజాన కట్టుకుని, నడుముకు ఖడ్గాలు ధరించికోదండాలు పట్టుకుని ఆ అన్నదమ్ములిద్దరూ హుందాగా నడుస్తుంటే వారి శోభలు నలుదిశలా వెలుగులు చిమ్మాయి. కాలినడకన ఆ ముగ్గురూ అలా ఒకటిన్నర యోజనముల దూరం నడిచారు. ఒక యోజనం ఎనిమిది తొమ్మిది మైళ్లకు సమానం. అంటే సుమారు పన్నెండు, పదిహేను కిలోమీటర్ల దూరం. అలా ప్రయాణించి వాళ్లు సరయూ నదీ తీరానికి చేరుకున్నారు. 

అప్పుడు విశ్వామిత్రుడు ఆగి రాముడితో ఇలా అన్నాడు. 

''నాయనా! ఈ నదీ జలాలతో ఆచమనం చెయ్యి. నీకు బల, అతిబల అనే రెండు మంత్రాలను ఉపదేశిస్తాను. వీటి వల్ల నీకు అలసట కలుగదు. ఆకలిదప్పులు ఉండవు. నువ్వు నిద్రిస్తున్నా, ఏమరుపాటుతో ఉన్నా సరే, నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఈ మంత్రాల ప్రభావం వల్ల బల పరాక్రమాల్లో ముల్లోకాల్లోనూ నీకు సాటి రాగలవారు ఉండరు. ఈ విద్యలు రెండూ బ్రహ్మ దేవుడి నుంచి పుట్టినవి. వీటిని అందుకోడానికి అర్హతగల ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి'' అంటూ వివరించాడు.

రాముడు శుచియై ఆయన నుంచి ఆ రెండు విద్యలను గ్రహించి తేజస్సుతో వెలుగొందాడు. ఆ రాత్రి ఆ ముగ్గురూ సరయూ నదీ తీరంలోనే గడిపారు. రామలక్ష్మణులు వినయంగా విశ్వామిత్రుడి పాదములు ఒత్తుతూ సేవలందించారు. ఆయన విశ్రమించాక ఆ రాకుమారులిద్దరూ ఆ పక్కనే గడ్డి పరుచుకుని కటిక నేలపై పడుకున్నారు.

రాత్రి గడిచింది. తెలతెలవారుతుండగా ముందుగా విశ్వామిత్రుడు లేచాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను చూసి మృదువుగా మేల్కొలిపాడు. 

''కౌసల్యాదేవికి సుపుత్రుడవైన ఓ రామా! సూర్యోదయం కావస్తోంది. లెమ్ము. దైవికమైన సంధ్యావందనాది క్రియలను ఆచరించు''.

ఆ మేలుకొలుపే...

''కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌'' అనే సుప్రభాత శ్లోకంగా ఎంతగానో ప్రాచర్యం పొందింది. 

వెంటనే రామలక్ష్మణులిద్దరూ లేచి, స్నానం చేసి, సూర్యునకు నమస్కరించి అర్ఘ్యప్రదానం చేశారు. దేవతలకు, రుషులకు తర్పణములు ఇచ్చారు. గాయత్రిని జపించారు. అనంతరం ప్రయాణానికి సిద్ధమై విశ్వామిత్రుడికి నమస్కరించారు. 

మళ్లీ ప్రయాణం మొదలైంది. కొంత సేపు నడిచిన తర్వాత వాళ్లు ముగ్గరూ సరయూ నది, గంగానదితో కలిసే చోటుకు చేరుకున్నారు. అక్కడ  దూరంగా ఒక ఆశ్రమాన్ని చూశారు. ఆ పరిసరాలన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. 

అదంతా చూసి రాముడు కుతూహలంతో విశ్వామిత్రుడిని వినయంగా ప్రశ్నించాడు.

''మహాత్మా! పవిత్రమైన ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఈ విషయాలను తెలుసుకోవాలని ఉంది''

విశ్వామిత్రుడు చిరునవ్వుతో చెప్పసాగాడు.

''రామా! విను. పూర్వం ఈ ప్రదేశంలో పరమశివుడు తపస్సు ఆచరించాడు. ఒకసారి మన్మథుడు ఈ ప్రదేశానికి వచ్చి శివుడి తపస్సుకు భంగం కలిగించాడు. తన ధ్యానానికి అంతరాయం కలగడంతో శివుడు కళ్లు తెరిచి కోసంగా చూశాడు. దాంతో మన్మథుడి శరీరం కాలి బూడిదైపోయింది. అప్పటి నుంచి మన్మథుడు శరీరం లేనివాడయ్యాడు. అందువల్లనే మన్మథుడిని అనంగుడు కూడా అంటారు. అతడు కాలి బూడిదయ్యాడు కాబట్టి ఈ దేశానికి అంగదేశమనే పేరు స్థిరపడింది. పరమ శివుడు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కాబట్టి ఇక్కడ శివభక్తులైన మునులు ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. మనం ఈ రాత్రికి ఇక్కడే గడుపుదాం. రేపు గంగానదిని దాటుదాం'' అంటూ వివరించాడు విశ్వామిత్రుడు. 

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇలా సంభాషిస్తున్న విషయాన్ని ఆ ఆశ్రమంలోని మునీశ్వరులు దివ్యదృష్టితో చూడగలిగారు. వెంటనే వారంతా ఎంతో ఆనందంగా పులకించి పోతూ వచ్చారు. విశ్వామిత్రుడిని అర్ఘ్య పాద్యాలతో పూజించి వారిని సాదరంగా ఆశ్రమానికి ఆహ్వానించారు. అయోధ్య  కోట నుంచి బయల్దేరిన రామలక్ష్మణులకు ఇది రెండవ రాత్రి. విశ్వామిత్రుడు, ఆశ్రమ మునులు చెప్పుకున్న కథలను, విషయాలను వింటూ వారిద్దరూ విశ్రమించారు. మర్నాడు వారి మూడో రోజు ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

సోమవారం, జులై 01, 2024

గేటు దూకించిన... 'బాల భారతం'



వెండితెరంతా మిలమిలలాడుతున్న నక్షత్రాలు... వాటి మధ్యలో బాణాలతో కట్టిన నిచ్చెన... దానిపైకి గద పట్టుకుని ఎక్కుతున్న బాల భీముడు... నేపథ్యంలో ఘంటశాల గానం...
''మానవుడే మహనీయుడు... శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు...''
... మరిలాంటి దృశ్యం పిల్లల్ని కళ్లప్పగించి చూసేలా చేయదూ? మళ్లీ మళ్లీ చూడాలనిపించేయదూ?
సరిగ్గా... యాభై ఏళ్ల క్రితం నాదీ అదే పరిస్థితి! 
అప్పట్లో నేను పిలగాణ్ణే. బహుశా ఆరో తరగతో, ఏడో తరగతో. మా వీధి చివరే ఉండేది సినిమా హాలు. ఊరు చోడవరం. అనకాపల్లి దగ్గర. నాన్నగారు జూనియర్‌ కాలేజీలో ఇంగ్లిషు లెక్చరర్. మనం పండిత పుత్రులమన్నమాట. సరిగ్గా సాయంత్రం నాలుగుంబావు సమయానికి మ్యాట్నీలో ఆ పాట వస్తుందని నాకూ, చెల్లా శీనుగాడికీ తెలుసు. ఇద్దరికీ ఆ సినిమా తెగ నచ్చేసింది. ఆ పాట అయితే మరీనీ. మంచి సినిమా అంటే ఏదో ఓసారి తీసుకెళ్తారు పెద్దవాళ్లు. కానీ మళ్లీ మళ్లీ చూడాలినిపిస్తే ఎలా? 
''ఒరేయ్‌... గేటు దూకి చూసేద్దామేంట్రా?'' అన్నాడు చెల్లా శీనుగాడు.
''మరి పట్టుకోరూ?'' అని నా భయం.
చెల్లా శీనుగాడు నాకన్నా ఒకటో, రెండో క్లాసులు చిన్నవాడే అయినా మహా చలాకీగాడు. 
''ఎహె... ఏం కాదు రా...'' అంటూ వాడు పరుగు. వాడి వెనకే నేను.
ఇద్దరం హాల్లోకి వెళ్లాం. అక్కడ పోస్టర్లు, స్టిల్సు చూస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాం. వాటి పక్కగా ఉండేది చెక్క గేటు. మా ప్రాణానికి అది నిలువెత్తుదే. మధ్యలో ఉండే అడ్డ చెక్కలే మాకు నిచ్చెన మెట్లన్నమాట. శీనుగాడు అటూ ఇటూ చూసి గేటు సందుల్లో కాళ్లు పెట్టి చకచకా ఎక్కేశాడు. అటువైపు దిగిపోయి 'ఎక్కెయ్‌...' అన్నట్టు సైగ చేశాడు. నేనూ ఎక్కేశా. అటువైపు దిగాం. నేను దర్జాగా రిజర్వ్‌డ్‌ క్లాసు వైపు వెళుతుంటే వాడు నా చొక్కా పట్టుకుని ఆపాడు. నా చెయ్యి పట్టుకుని, స్తంభాల చాటు నుంచి నక్కుతూ నేల క్లాసు తలుపు కేసి నడిచాడు. ఆ తలుపు ఓరగా చేరవేసి ఉంది. నెమ్మదిగా తీశాడు. లోపలికి దూరిపోయాం. లోపలంతా చీకటి. తెరకేసి చూసేసరికి రంగురంగుల 'బాల భారతం' సినిమా! అప్పుడే అర్జునుడు బాణాలతో ఆకాశానికి నిచ్చెన కట్టేశాడు. బాలభీముడు గద పుచ్చుకుని ఎక్కడం మొదలు పెట్టాడు.
మేం కళ్లప్పగించేశాం. 
''మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లేదులే...
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే!''
మేం కాస్త అటూ ఇటూ చూసి ఖాళీగా ఉన్న బెంచీ చూసుకుని తెర మీంచి తల తిప్పకుండానే, తడుముకుంటూ కూర్చున్నాం. 
''గ్రహరాశులనధిగమించి...
ఘన తారల పథము నుంచి...
గగనాంతర రోదసిలో గంధర్వ గోళ తతుల దాటి...
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా 
బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే
మానవుడే మహనీయుడు!''
మేం కిమ్మనలేదు. ఆ సీను అలాంటిది! మా వయసు అలాంటిది!!
అక్కడి నుంచి సినిమా పూర్తయ్యేవరకు చూసేశాం. 
అది మొదలు. ప్రతి రోజూ అదే పని. నాలుగింటికల్లా చెల్లా శీనుగాను వచ్చేసేవాడు. నేను రెడీగా ఉండేవాణ్ణి. 
రోజులన్నీ ఒకేలా గడుస్తాయా? ఆ సంగతి ఇప్పుడు తెలుసు కానీ, అప్పటికి తెలీదుగా.
ఓసారి మామూలుగానే బయల్దేరాం. శీనుగాడు గేటు దూకేశాడు. నేను కూడా ఎక్కి దూకా. 
''ఒరేయ్‌... ఎవర్రా అది?'' అంటూ ఓ కేక వినపడింది.
నా గుండె గుభేలుమంది. హాలు పనివాడో, గేటు కీపరో ఎవరో తెలీదు కానీ వచ్చి నన్ను పట్టుకున్నాడు. బిక్కచచ్చిపోయా. అప్పటికే శీనుగాడు నేల క్లాసు తలుపు తీస్తున్నాడు. మనం వాడిని వెళ్లనిస్తామా?
''అదిగో వాడు కూడా ఉన్నాడు సార్‌...'' అంటూ చూపించేశా.
వాడు చటుక్కున వెళ్లి వాడిని కూడా రెక్క పుచ్చుకుని లాక్కొచ్చాడు. ఈలోగా మరొకడు కూడా వచ్చాడు.
ఇద్దరూ కలిసి మమ్మల్ని ఓ ఆట ఆడుకున్నారు.
''ఒరేయ్‌... చొక్కాలిప్పండ్రా...'' అన్నారు. 
మేం ఏడుపు మొహాలతో చొక్కా బొత్తాలిప్పుతూనే బతిమలాడ్డం మొదలెట్టాం.
''సార్‌... వదిలేయండి సార్‌...''
''తప్పయిపోయింది... ఇంకెప్పుడూ రాం సార్‌...''
మాలాంటి కుర్రాళ్లు దొరికితే కాసేపు కాలక్షేపం చేయకుండా ఎలా ఉంటారు?
''పదండ్రా... మేనేజర్‌ దగ్గరకి తీసుకెళ్దాం...'' అని బెదిరింపులు.
బిత్తరి చూపులతో, బిక్క మొహాలతో మేం. 
నాకు దొరికిపోయినందుకు కాదు బెంగ. ఆ హాలు యజమానిగారబ్బాయి ఎక్కడ చూస్తాడో అని బాధ. ఎందుకంటే... ఆ అబ్బాయి పేరు నానాజీ. ఇంటర్‌ చదివేవాడు. మా నాన్నగారి దగ్గరే రోజూ ట్యూషన్‌కి వచ్చేవాడు. మంచి సినిమా వస్తే మమ్మల్ని రమ్మనేవాడు. అమ్మా, నాన్నగారూ, నేనూ వెళితే టిక్కెట్లు తీసుకోనిచ్చేవాడు కాదు. రిజర్వ్‌డు క్లాసులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేవాడు. ఇంటర్వెల్‌ లో సమోసాలు, కూల్‌డ్రింకులు కూడా పంపేవారు. అలా దర్జాగా సినిమా చూసేవాడిని ఇలా గేటు దాటుతూ పట్టుబడితే ఎంత సిగ్గు చేటు? అదీ నా దిగులు.
ఆఖరికి కాసేపు ఏడిపించాక ఆ హాలు పనివాళ్లు మా చొక్కాలు మాకిచ్చేసి ''పొండి... '' అని వదిలేశారు.
అంతే... బతుకు జీవుడా అనుకుని వాళ్ల ముందే మళ్లీ చెక్క గేటు చకచకా ఎక్కేసి ఇటు వైపు దూకి ఇళ్లకు పరుగో పరుగు. 
మళ్లీ మేం గేటు దూకితే ఒట్టు. 
చోడవరం శ్రీనివాసా థియేటర్‌లో దాదాపు యాభై ఏళ్ల క్రితం నా చిన్ననాటి 'నాటీ' జ్క్షాపకం ఇది. అప్పట్లో మా ఇంటికి దగ్గర్లో రెండు థియేటర్లు ఉండేవి. ఒకటిదైతే మరోటి పూర్ణా థియేటర్‌. ఆ థియేటర్‌ యజమాని కొడుకు పేరు రాజాజీ. నానాజీ, రాజాజీ ఇద్దరూ మా నాన్నగారి స్టూడెంట్లే. అమ్మ ఏ ఉల్లిపాయలో తెమ్మన్నప్పుడు నేను అలా ఏ థియేటర్‌ దగ్గరకి వెళ్లి సరదాగా స్టిల్స్‌ చూస్తున్నా, నానాజీ కానీ, రాజాజీ కానీ చూస్తే... ''బాబూ! లోపలకి వెళ్లి కూర్చో...'' అని చెప్పేవాళ్లు. పైగా హాలు పనివాళ్లని పిలిచి ''ఈ బాబుని రిజర్వ్‌డ్‌ లో కూర్చోబెట్టు'' అనేవాళ్లు. నేను ఉల్లిపాయల మాట మానేసి సినిమా చూసి చక్కా వచ్చేవాడిని. 
అమ్మ తిట్టి పోసేది. ''పకోడీలు వేద్దామని ఉల్లిపాయలు తెమ్మంటే ఇంత సేపా? ఇంత సేపూ ఏం చేశావ్‌?'' అంటూ కేకలేసేది.
అలాంటిది సినిమా హాలు గేటు దూకి దొంగతనంగా సినిమా చూడాలనిపించడమేంటి... ఆకతాయితనం కాకపోతే?! 
మొత్తానికి 'బాల భారతం' సినిమా నాకో గుణపాఠం నేర్పింది. 
ఇంత చెప్పుకుని ఆ సినిమా గురించి చెప్పుకోకపోతే ఎలా? 
పౌరాణిక బ్రహ్మగా పేరొందిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తీసిన 'బాల భారతం' 1972లో వచ్చింది. అందులో నాకెంతో నచ్చిన 'మానవుడే మహనీయుడు' పాట ఆరుద్ర రాసింది. 
''దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే...
సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే...
సృష్టికి ప్రతి సృష్టి చూయు విశ్వామిత్రుడు నరుడే...
జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే''
ఎంత బాగా రాశాడు! స్వతహాగా నాస్తికుడైనా ఓ పౌరాణిక సినిమాకి మంచి సందర్భంలో పాట రాస్తూ, ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మానవుడి విజయాల గురించి ఎంత స్ఫూర్తిదాయకంగా చెప్పాడు! 
సాలూరి రాజేశ్వర రావు స్వర కల్పనలో ఘంటశాల గానంలో ఆ పాట ఎంత బాగా వచ్చిందో, వెండితెర మీద కూడా అంత అద్భుతంగానూ ఆవిష్కృతమైంది. పిల్లల్ని పాత్రధారులుగా పెట్టినా మహాభారతంలో పాండవులు, కౌరవులు పెద్దవాళ్లయ్యేంత వరకు కథని తీసుకుని, కురువంశం మూలాల నుంచి ధర్మరాజు పట్టాభిషేకం అయ్యేవరకు తీసిన ఆ సినిమా ఇప్పటికీ అందరినీ అలరించేదే. ఎస్వీరంగారావు, ధూళిపాళ, కాంతారావు, హరనాథ్‌, అంజలీదేవి, ఎస్‌. వరలక్ష్మి తదితరుల పాత్రోచితమైన అభినయాలు, ఆకట్టుకునే పాటలూ చాలా చక్కగా అమరాయి. పెద్దయ్యాక అందాల తారగా చిత్రసీమను ఏలిన శ్రీదేవి ఇందులో దుస్సలగా పెద్ద పెద్ద కళ్లతో అలవోకగా నటించేసింది. 
'నారాయణ నీ లీల నవరస భరితం... నీ ప్రేరణచే జనియించెను బాలభారతం...'
'భలె భలె భలె భలె పెద బావా... భళిర భళిర ఓ చిన బావ...'
'ఆడెనోయి నాగ కన్యకా... చూడాలోయి వీర బాలకా...'
'తారంగం తారంగం తాండవ కృష్ట తారంగం...'
'విందు భోజనం పసందు భోజనం...' 
లాంటి పాటలన్నీ చాలా బాగుంటాయి. ఇప్పటికీ ఏ టీవీలోనే ఈ సినిమా వస్తే కళ్లప్పగించి చూస్తూనే ఉంటాను. నేనే కాదు... అందరూనూ!

శనివారం, మే 04, 2024

వికృత మేధ!


సెక్రటరీ పరుగెత్తుకుంటూ అధినేత దగ్గరకి వచ్చి ఆయాసపడుతూ నుంచున్నాడు.

''ఏందయ్యా సెక్రట్రీ! ఆదరాబాదరా వచ్చావ్‌. నీ మొహమేంటి పెట్రమాక్స్లైటులా వెలిగిపోతోంది?''

''అదే సర్‌... కొత్త టెక్నాలజీ వచ్చిందండి. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్గురించి వినే  ఉంటారు కదండీ? కృత్రిమ మేధంటారండి. దాంతో పని చేస్తుందండి. మన సిద్ధం సభల్లో పని చేస్తుందటండి.  సంగతి తమరికి స్వయంగా చెప్పడానికి ఉరుక్కుంటూ వచ్చానండి...''

''సర్లేగానీ... ఇయ్యన్నీ ఎందుకయ్యా మనకి? అపారమైన మేధ మనకుండగా ఇక  కృత్రిమ మేధతో పనేముందయ్యా?''

''అమ్మమ్మా... అంతలా తీసిపారేయకండి మరి. మీ మేధ మీకుందిలెండి, కానీ ప్రజలకి లేదు కదండీ? వాళ్లు ఎంతసేపూ మీ పాలనలో ఏం జరిగిందనే చూసుకుంటారు. మరి మన హయాంలో ప్రగతి లేనప్పుడు ప్రచారమే కదండీ దిక్కు. ఇదందుకే ఉపయోగపడుతుందటండి...''

''బాగుందయ్యా... సరిగ్గా నా చిక్కంతా అదే. అప్పట్లో ఏదో ఊరూ వాడా తిరుగుతూ వెర్రిజనాల్ని నమ్మించడానికి నోటికొచ్చిందంతా వాగేశాం. అసలవన్నీ చేయడానికి సాధ్యమా కాదా అని కూడా ఆలోచించలేదయ్యా. ఒక్కసారి ఛాన్సిస్తే కుర్చీ ఎక్కాలనే ఉబలాటమే తప్ప ఇంకేం ఆనలేదనుకో. పాపం... వెర్రిబాగులోళ్లు అయ్యన్నీ నిజమని నమ్మేసి బంపర్ఆఫరిచ్చేశారు. రాక రాక అధికారం వచ్చాక దిక్కుమాలిన ప్రజా సేవ చేస్తూ కూర్చుంటామా చెప్పు? అసలే మంది ప్రజాస్వామ్యం. వెధవది ఐదేళ్లు గిర్రుమని తిరిగిపోవూ? మరి  కూసింత సమయంలోనే నాకూ, నన్ను నమ్ముకున్నోళ్లకూ  పది తరాల వరకు సరిపడా వెనకేసుకోద్దూ? దానికే సరిపోయిందయ్యా టైమంతానూ. ఆఖరికి రోడ్లేయడానికి కూడా వీలు చిక్కలేనుకో. మరయితే ఇప్పుడు నువ్వు తెచ్చిన పరికరం జనాన్ని మళ్లీ మాయ చేయడానికి ఉపయోగపడుతుందంటావా? అసలది ఎలా పని చేస్తుందో చెప్పు?''

సెక్రటరీ ఉత్సాహంగా జేబులోంచి మైక్రోఫోన్లాంటి  చిన్న పరికరం తీశాడు. దాని గురించి వివరించడం మొదలెట్టాడు.

''దీన్ని ఏఐ మెంటల్డిటెక్టర్స్పీచ్ఎకో అంటారండి. సిద్ధం సభల్లో మీరు ఎంత హైరానా పడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాను కదండీ? చెప్పిందే చెబుతున్నారు. వాగిందే వాగుతున్నారు. అన్నవే అంటున్నారు. తిట్టినవే తిడుతున్నారు. అవే హామీలు తిప్పి తిప్పి ఇస్తున్నారు. అవే పథకాలు, అవే వాగ్దానాలు. వాటితోనే జనాన్ని నమ్మించడానికి కిందా మీదా పడుతున్నారు. అందుకే దీన్ని ఆర్డరిచ్చి తెప్పించానన్నమాటండి. దీన్ని  సభలోనైనా సరే మైక్కి బిగిస్తే చాలండి. దీన్లోని సెన్సర్లు మీ మనసులోని విషయాల్ని పసిగట్టి మీ గొంతులోనే చెప్పేస్తాయండి. ఇక మీరు మైకు ముందు నుంచుని కేవలం హావభావాలిస్తే చాలండి...''

''ఇదేదో బాగుందయ్యా... సిద్ధం సిద్ధం అంటూ సభలంటూ పేట్టేశాం కానీ, చెప్పడానికేముంటది? అందుకే చెప్పిన విషయం చెప్పిన చోట చెప్పకుండా చెప్పలేకపోతున్నాను. ఇంతకీ మనం ఆళ్లకి చేసింది మాత్రం ఏముంది కనక? ఇక మనకి మనం చేసుకున్నదంటావా, పైకి చెప్పలేం. ఏమంటావ్‌? మరింతకీ దీనికి నా గొంతు ఎలా తెలుస్తుందంటావ్‌?''

''అదాండీ... ఏం లేదండి. ముందుగా దీన్ని పట్టుకుని మీరు ప్రసంగించేయాలండి. ఒక్కసారి గానీ, ఇది విందంటే చటుక్కున పట్టేస్తుందండి. కృత్రిమ మేధ కదండీ? మహా చురుకన్నమాటండి. అలా ఎక్కించేశాక, ఇక చూస్కోండి... మీ మాట, మీ విరుపు, మీ తీరు, మీ వైఖరి, మీ తెంపరితనం, మీ బరితెగింపు, మీ నయవంచన, మీ నక్క వినయం, మీ మోసకరితనం, మీ మేకపోతు గాంభీర్యం... ఇలా అన్నీ ఇట్టే పట్టేస్తదండి.  తర్వాత ప్రతి సభలోనూ ముందుగా మీరు మైకు పుచ్చుకుని వంకరగా చేతులు పైకెత్తి మైకు మూతి మీద దబ్‌... దబ్‌... దబ్దబ్దబ్మంటూ కొడతారు చూడండి, అలా కొడుతూ  పరికరం మీట నొక్కితే చాలండి. ఆపై ఇది మీరు చెప్పదలుచుకున్నది, చెప్పాలనుకుంటున్నది, చెప్పలేకపోతున్నది, చెప్పకతప్పనిది, చెప్పబోయేది అన్నీ గ్రహించేసి మీ మనసంతా చదివేసి, అచ్చం మీలాగే చెప్పుకుంటూ పోతుందండి. అలా మీకిక ఆయాసం లేకుండా జనానికి ఆవేశం తెప్పించేస్తదన్నమాటండి. మీరు కేవలం వెకిలి నవ్వులు నవ్వుతూ అటూ ఇటూ చూస్తూ ఉంటే చాలన్నమాటండి. జనానికి మాత్రం అంతా మీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందండి. కాబట్టి ఒక్కసారి మీ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పండి, దీంట్లోకి ఎక్కించేద్దాం...''

అంతా విన్నాక అధినేతకి హుషారొచ్చింది.  పరికరం అతికించిన మైకు పుచ్చుకుని ప్రచార సభల్లో వాగుతున్నదంతా టేపు రికార్డర్లాగా వాగడం మొదలు పెట్టాడు.

''నా వెంట నడిచే నా ప్రతి అన్నకూ, నా ప్రతి తమ్ముడికీ, నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకీ, నా ప్రతి అవ్వకూ, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికీ... మీ బిడ్డ ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉత్సాహంగా చేరిన జన సమూహాన్ని చూస్తుంటే... తమ ప్రతి ఇంటా జరిగిన అభివృద్ధిని తిరిగి కాపాడుకోడానికి గర్జిస్తున్న సింహాల్లా కనిపిస్తా ఉన్నారు.  మూల నుంచి  మూల వరకు  జిల్లాలో చూసినా అడుగడుగునా జనసముద్రం. దారి పొడవునా జన సునామీని చూస్తుంటే... 25 కి 25 పార్లమెంటు స్థానాలూ, 175 కి 175 అసెంబ్లీ స్థానాలు గెలిపించి డబుల్సెంచరీ కొట్టించడానికి... మీరంతా సిద్ధమేనని అనిపిస్తోంది. మీ కళ్ల ముందు జరిగిన అభివృద్ధినీ, మీ ముందుకు వచ్చిన పథకాలనీ కొనసాగించాలా, వద్దా అని తేల్చే ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. నాకు ఓటేస్తేనే మీకు ప్రగతి. లేకపోతే అధోగతి. ప్రతి ఒక్క ఓటరూ కూడా  విషయాలు గమనించాలని కోరతా ఉన్నా. పేదల్ని గెలిపించాలని నేను తపిస్తుంటే, నన్ను ఓడించాలని వాళ్లు కోరుకుంటున్నారు. మన అభ్యర్థుల్ని చూడండి. ఒక్కొక్కళ్లూ నిరు పేదలు. ఒక్కొక్కళ్లూ అమాయకులు. చాలా మంచి వాళ్లు. నోట్లో వేలు పెట్టినా చీకుతారే తప్ప కొరకలేరు. వీరందర్నీ గెలిపించి మరో చారిత్రక విజయాన్ని అందించడానికి మీరంతా... మీరంతా... సిద్ధమేనా? ప్రజలకు ఎలాంటి మంచీ చేయని  మూడు పార్టీల వారికీ చెంప చెళ్లుమని సమాధానం చెప్పడానికి మీరంతా... మీరంతా... సిద్ధమేనా? నా వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపించడానికి మీరంతా సిద్ధమే కదా.....'' అంటూ అధినేత మొదలు పెట్టి, ఎక్కడికెళ్లినా,  వేదికెక్కినా చెప్పే సోదంతా సుదీర్ఘంగా  చెప్పుకుంటూ పోయాడు.

సెక్రట్రీ ఉప్పొంగిపోయాడు. ''చాలు సార్చాలు! ఇక రేపు సభలో చూస్కోండి.  కృత్రిమ మేధ పరికరం ఎంత బాగా పనిచేస్తుందో చూద్దురు గాని. మరి రాబోయే మీ పాలనలో నన్ను ఏదైనా మంచి కార్పొరేషన్కి చైర్మన్ని చేసేయాలండి మరి...'' అన్నాడు.

అధినేత ముసిముసి నవ్వులు నవ్వుతూ తలూపాడు.

+++++++++++

మర్నాడు అధినేత ప్రచార సభ మొదలైంది. అధినేత రెండు చంకలూ పైకి లేపి చేతులు కలిపి నమస్కారం చేస్తూ, రాని నవ్వును మొహాన పులుముకుంటూ వేదిక పైకి వచ్చాడు. సెక్రటరీ వినయంగా మైక్అందిస్తూ 'ఏఐ మెంటల్డిటెక్టర్స్పీచ్ఎకో' పరికరాన్ని అనుసంధానించి ఇచ్చాడు. అధినేత మైక్అందుకుని దాని మూతి మీద అలవాటుగా దబ్‌.. దబ్... దబ్ దబ్దబ్అని కొట్టాడు. అలా కొడుతూ పరికరాన్ని ఆన్చేశాడు. ఆపై  పరికరం లోంచి అచ్చం అధినేత మాట్లాడుతున్నట్టుగానే మాటలు జాలువారాయి ఇలా...

''నా వెంట నడిచే ప్రతి గొర్రెకూ, ప్రతి మేకకూ, ప్రతి వెర్రిబాగుల అన్నకు, ప్రతి అమాయక అక్కకు, ప్రతి తెలివితక్కువ చెల్లెమ్మకి,  ఆలోచించలేని ప్రతి తమ్ముడికి, బుర్రలేని ప్రతి ఓటరుకీ... మీ బిడ్డ చేతులెత్తి మస్కా కొడతా ఉన్నాడు. ఇక్కడ నిరుత్సాహంగా చేరి వెర్రిమొగాలేసుకుని, రాక తప్పక నా అనుచరులకు భయపడుతూ వచ్చిన జనాన్నిచూస్తుంటే... మీ ప్రతి ఇంటా జరిగిన నష్టాన్ని, మీ చుట్టూ జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటూ బేరుమంటున్న పిల్లుల్లా కనిపిస్తా ఉన్నారు.  మూల నుంచి  మూల వరకు  మూలకి వెళ్లినా నేను కనిపిస్తే చాలు పారిపోతున్న జనం, నేను మాట్లాడుతుండగానే ఆవులిస్తున్న జనం, లేచి వెళ్లిపోతున్న జనం, భోజనాలు ఉన్నాయని పిలుస్తున్నా దులుపుకుని చక్కా పోతున్న జన సునామీని చూస్తుంటే... 25 పార్లమెంటు స్థానాల్లో, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒకటో, రెండో అయినా వస్తాయో లేదోననే భయం ఆవరిస్తా ఉంది. మీరంతా కలిసి నన్ను, నా అభ్యర్థుల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని గుబులు కలుగుతోంది. మీ కళ్ల ముందు జరిగిన అరాచకాన్ని, మిమ్మల్ని దిగజార్చిన బోగస్పథకాలని తిప్పి కొట్టడానికి వీలు కలిగించే ఎన్నికలు రాబోతున్నాయి. నాకు ఓటేస్తే ఇక మీకు అధోగతే. నాకు మాత్రమే ప్రగతి.  విషయాన్ని ప్రతి ఒక్క ఓటరూ ఏమాత్రం గ్రహించకుండా ఉండాలని కోరుతున్నా. మిమ్మల్ని వంచించి గెలవాలని నేను చూస్తుంటే, మిమ్మల్ని నా పాలన నుంచి రక్షించి కాపాడాలని వాళ్లు చూస్తున్నారు. నా అభ్యర్థుల్ని చూడండి. ఒక్కొక్కళ్లూ పేదల రక్తం తాగే జలగలు. ఒక్కొక్కళ్లూ నయవంచకులు. గూండాలు. ముష్కరులు. కర్కశులు. మీ చుట్టూ ఉన్న కొండలు, కోనలు, గనులు, వనరులు దోచుకున్న దుండగులు. ఒక్కొక్కళ్లూ మీ డబ్బుని దండుకుని కోట్లకు పడగలెత్తిన మహా మాయగాళ్లు. నా వెర్రి గొర్రెల్లారా... నేను మీటలు నొక్కి దాదాపు మూడు లక్షల కోట్లు మీ కాతాల్లోకి వేశానని చెబుతున్నాను. కానీ ఏకంగా 13 లక్షల కోట్లు  అప్పుల్లో మిమ్మల్ని ముంచేసిన విషయం గ్రహించకండి. అలా మీ ప్రతి ఒక్కరి తల మీద ఇప్పుడు మూడు లక్షల రూపాయల భారం పడేలా చేసిన సంగతి తెలుసుకోకండి. ధరలు, పన్నులు, ఛార్జీలు ఇష్టం వచ్చినట్టు పెంచేసి మీలో ప్రతి ఒక్కరి కుటుంబంపైనా పది లక్షల భారాన్ని మోపానని అర్థం చేసుకోకండి. రాష్ట్రాన్ని గంజాయి, మాదక ద్రవ్యాల కేంద్రంగా మార్చిన విషయాన్ని గుర్తించకండి. భూములు, ఎర్రచందనం, రేషన్బియ్యం రూపంలో లక్షల కోట్లు కొట్టేసినట్టు పసిగట్టకండి. సొంత చెల్లెలి పుట్టుకపైనే నిందలేసి, తల్లి వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచిన విలువల్లేని వ్యక్తిగా నన్ను పోల్చుకోకండి. ఏకంగా 14 లక్షల ఎకరాల ఎసైన్డ్భూముల్ని కబ్జా చేసిన నా పాలనను ఓటేసేటప్పుడు తల్చుకోకండి. ఇసుక ధర నాలుగు రెట్లు పెంచేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన విషయాలు పట్టించుకోకండి. అంతక్రితం మీకు మేలు చేసిన వంద పథకాలను రద్దు చేసిన సంగతిని మర్చిపొండి. మద్య నిషేధం చేశాకే ఓట్లడుగుతానన్న నా నయవంచక మాటల్ని జ్ఞాపకం చేసుకోకండి. అమ్మ ఒడి పేరుతో ముష్టి పదమూడు వేలు పడేసి, నాన్న మందు బుడ్డి ద్వారా లక్షలాది రూపాయలు మీ దగ్గరి నుంచే లాగేసి మీ కుటుంబాల్ని అణగార్చి వేసిన నిజాన్ని మర్చిపొండి. పైకి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూనే మీలో ఆరు వందల మందిని హత్య చేయించిన నా పాలన తీరును లెక్కచేయకండి. రాబోయే ఎన్నికల్లో నన్ను మరోసారి నమ్మి మోసపోవడానికి మీరంతా... మీరంతా... మీరంతా... సిద్ధమేనా? సిద్ధమేనా?....''

అధినేత మైకు పుచ్చుకోగానే లేచి వెళ్లిపోతున్న జనాలందరూ లౌడ్స్పీకర్లో వినిపిస్తున్న మాటలకి వెనక్కి వచ్చి మరీ నవ్వసాగారు. కేరింతలు కొట్టసాగారు. చప్పట్లు కొట్టసాగారు.

+++++++

అధినేత ముఖం జేవురించి ఉంది.

''ఏంటిది సెక్రట్రీ! ఇలా జరిగిందేంటి?'' అన్నాడు కోపంగా.

''అయ్యా నేను ముందే చెప్పానండి. అది మీ మనసులో మాటల్ని సెన్సర్ల ద్వారా గ్రహించి మీ మాటల్లా పలికేస్తుందని. మరి మీరు పైకి చెప్పేదొకటి, మనసులో అనుకునేదొకటని నాకేం తెలుస్తుందండీ?''

''మరేదో కృత్రిమ మేధన్నావ్?''

''అది కృత్రిమ మేధ కాబట్టే మీ వికృత మేధని గ్రహించేసిందండి...''

అధినేత నోట మాట లేదు!!!

-సృజన

PUBLISHED ON 1.5.2024 ON JANASENA WEB SITE