శనివారం, ఫిబ్రవరి 22, 2014

మహా మాయగాళ్లు!


'అర్భక భద్ర' అవార్డుల ప్రదానోత్సవం...
ఓ హాలు ముందు పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ప్రచారపత్రం చూసి సామాన్యుడికి ఆసక్తి కలిగింది. ఉత్సాహంగా లోపలికి వెళ్లి కూర్చున్నాడు. వేదిక మీద ఒకాయన నల్లకోటు, నల్లటోపీ పెట్టుకుని అప్పుడే ఉపన్యాసం మొదలుపెట్టాడు.

'అందరికీ నమస్కారం. వీధుల్లో గారడీలు చేసేవారి నుంచి వేదికలపై మ్యాజిక్కులు చేసేవారి వరకు మా ఇంద్రజాలికులకు ఉన్న ప్రజాదరణ అందరికీ తెలిసిందే. రేపు ఇంద్రజాలికుల (మెజీషియన్ల) దినోత్సవం. మమ్మల్ని మించిన ఇంద్రజాల మహేంద్రజాలికులను సత్కరించుకోవాలనే సంకల్పం కలిగింది. వారు గారడీ, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార, ట్రిక్కుటెక్కుటెక్నిక్కుల హైటెక్కు విద్యల్లో ఆరితేరినవారు. వాళ్లందరికీ ఉచిత రీతిన బిరుదులిచ్చి గౌరవించాలనే ఈ సభ పెట్టాం...'

సామాన్యుడు తన పక్కనున్న వ్యక్తిని గోకి, 'ఇంతకూ ఎవరువాళ్లు?' అన్నాడు ఉత్కంఠతో.

'ఇంకెవరు, మన రాజకీయ నాయకులు' అన్నాడాయన.

'అదేంటి, వాళ్లు మ్యాజిక్కులు చేయడం ఏంటి?'

'భలేవాడివే. ప్రజల మనశ్శాంతిని, భద్రతలను, నిశ్చింతను, భవిష్యత్తుపై భరోసాను, ధీమాను, ధైర్యాన్ని ఉన్నపళంగా మాయం చేయడంలే? వాళ్లను మించిన మెజీషియన్లు ఎవరుంటారు?'

'నిజమే. మరి అర్భక భద్ర ఏంటి?'

'వీరి పాలనలో అర్భకుడు ఎప్పుడూ ఎదుగూబొదుగూ లేకుండా భద్రంగా ఉంటాడని...'

సామాన్యుడు సంబరంగా వేదికపైకి చూశాడు. అక్కడ ఉపన్యాసం కొనసాగుతోంది. '...నిత్య రాజకీయ సమస్యలతో సతమతమవుతున్న సామాన్యులకు ఒకింత వినోదం కలిగించడానికే ఈ ప్రయత్నం. మేం రాజకీయ నేతల స్వరూపాలను సూచనాత్మకంగా తెలిపే దృశ్యాలను ఇక్కడి తెరపై ఆవిష్కరిస్తాం. వాటినిబట్టి ఎవరికి ఏ బిరుదు ఇవ్వాలో సభికులే సూచించాలని కోరుతున్నాం' అన్నాడు.

అందరూ చప్పట్లు కొట్టారు. వేదికపై మెజీషియన్‌ 'అబ్రకదబ్ర' అనగానే తెరపై దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి.

ముందుగా ఓ పెద్ద చెయ్యి కనిపించింది. దాని వేళ్లకు దారాలు కట్టి ఉన్నాయి. ఆ దారాలకు ఒక బొమ్మ వేలాడుతోంది. తలపాగాతో, తెల్లటి గెడ్డంతో ఉన్న ఆ బొమ్మ, ఆ చెయ్యి ఆడించినట్టల్లా ఆడుతోంది. నేపథ్యంలో 'నోట మాట రాదు... నొసలు ముడుచుకోదు... చిరునవ్వు మాయదు... చిటపటలాడదు... చేష్టలుడిగిన బొమ్మ... చేతలుండని బొమ్మ... చెవిలోన పువ్వులు పెట్టునమ్మ...' అనే పాట వినిపించింది.

సభలోంచి ఒక వ్యక్తి నుంచుని, 'దేశంలోని అత్యున్నత పీఠంపై కూర్చుని మౌనంగా మహేంద్రజాలం చూపించిన నేత ఈయన. రిమోట్‌ కంట్రోలుతో నడిచే రోబో లాంటివాడు. ఈయన హయాములో జరిగిన కుంభకోణాల వల్ల వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం మాయమైపోయింది. ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండే ఈయనకు 'మహానత్త మాయక' అనే బిరుదు నప్పుతుంది' అన్నాడు. సభికులంతా అంగీకార సూచకంగా కరతాళధ్వనులు చేశారు.

వేదికపై మళ్ళీ 'అబ్రకదబ్ర' అనగానే తెరపై దృశ్యం మారింది. పచ్చగా కళకళలాడే ప్రాంతం కనువిందు చేస్తుండగానే ఉన్నట్టుండి అందులోని పంటపొలాలు మాయమయ్యాయి. భూములు, కొండలు 'హాం... ఫట్‌' అయిపోయాయి. నేపథ్యంలో 'ఎదురులేని కొడుకు... ఎన్నదగిన కొడుకు... నాన్న కుర్చీ కింద నంజుకున్న కొడుకు... కోట్లు కొల్లగొట్టి కులుకుతున్న కొడుకు... జైలుకెళ్లి జెల్లకొట్టిన కొడుకు...' అనే పాట వచ్చింది.

సభికుల్లోంచి ఒకతను లేచి, 'ఈయన సామాన్యుడా? గాలి, నీరు, భూమి, నింగి, నిప్పులను కూడా మటుమాయం చేసిన ఘనుడు. ఇతడికి 'పంచభూత వంచక మాంత్రిక' అనే బిరుదే సరైనది' అన్నాడు. అందరూ ఈలలు వేశారు.

వేదికపై దృశ్యం మారింది. ఓ యువకుడు ఏవేవో కాగితాలు చింపేస్తున్నాడు. ఉన్నట్టుండి 'నాన్సెస్‌' అని అరుస్తున్నాడు. ఓసారి గెడ్డంమాసి, మరోసారి దాన్ని నున్నగా గీసి అటూ ఇటూ నడిచేస్తున్నాడు. నేపథ్యంలో 'అందాల బుజ్జి బాలుడితడు... అమ్మ కొంగున వూయలూగునితడు... వారసత్వపు పాలపీకనెప్పుడూ నోట కరుచుకుని పీల్చుచుండునితడు...' అంటూ వినిపించింది.

సభికుడొకడు లేచి, 'ఇప్పుడిప్పుడే మేజిక్కులు నేర్చుకుంటున్నాడు. కానీ, ఏదీ సరిగా చేయలేకపోతున్నాడు. భవిష్యత్తులో గొప్ప ఇంద్రజాలికుడు కావాలనుకుంటున్నాడు. కాబట్టి, ఇతడికి 'నిరర్థక బాల మాయావి' బిరుదు ఇద్దాం' అన్నాడు.

ఇంతలో వేదిక మీదనుంచి భయంకర శబ్దాలతో దృశ్యం ప్రత్యక్షమైంది. తెరపై అంతా శూన్యం. ఆ శూన్యంలో ఉన్నట్టుండి పేలుళ్లు. ఎవరూ కనిపించకుండా మంత్రదండం తిరుగుతోంది. వెనక నుంచి, 'అధికారం మాయమమ్మా... న్యాయం ధర్మం మాయమమ్మా... సుఖం శాంతి మాయమమ్మా... దేశమంతా గందరగోళమమ్మా... సామాన్యుడు అతలాకుతలమమ్మా... అంతా నీ చలవమ్మా' అనే పాట కోరస్‌లో వినిపించింది.

ఇక ఉండబట్టలేని సామాన్యుడు లేచి నుంచున్నాడు. 'ఈమె సామాన్యురాలు కాదు. విదేశం నుంచి వచ్చిన ఈమె మ్యాజిక్కులు ఎవరికీ సాధ్యం కావు. కాబట్టి 'ప్రచ్ఛన్న పరిపాల భయంకర ఇంద్రజాలిక' అందాం' అన్నాడు. సభికులంతా లేచి నుంచుని మరీ కేరింతలు కొట్టారు!

PUBLISHED IN EENADU ON 22.02.2014