శుక్రవారం, జనవరి 27, 2023

రాజ్యాంగ భ్రష్ట అరాచకోత్సవం!




 

అధినేత కుర్చీలో కులాసాగా కూర్చుని అధికారులు సిద్ధం చేసిన రిపబ్లిక్‌ దినోత్సవం ప్రసంగాన్నిచదువుకుంటున్నాడు. ఈలోగా సెక్రటరీ వచ్చాడు.

''ఆఫీసర్లు కిందా మీదా పడి స్పీచేదో రాసుకొచ్చారు కానీ, నాకెందుకో కాస్త వెలితిగా ఉందయ్యా...'' అన్నాడు అధినేత జనాంతికంగా.

సెక్రటరీ ఆ ప్రసంగం కాగితాన్ని తీసుకుని చూసి, ''సర్... మీ అసంతృప్తి ఏంటో చెబితే తిరగరాయిస్తానండి...'' అన్నాడు వినయంగా.

''మనం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేం చేశామో ఏకరువు పెట్టారు కానీ, ఇది చాలదయ్యా...'' అన్నాడు అధినేత ఏదో ఆలోచిస్తూ.

''చిత్తం... అక్కడికీ నేను చెప్పానండి. తమరు పవర్‌ లోకి వచ్చింతర్వాత జనానికి జరిగిందంతా  పోగు చేసి, కూసింతైనా దాన్నే మైక్రోస్కోపులో చూసిజీళ్ల పాకం పట్టి, దిమ్మిశా చేసి, సాగదీసి, విశాలం చేసి భూతద్దంలో పెద్దగా చూపించాలని, ఆ పైన టెలిస్కోపులో చూపించినట్టు హంగామా గట్రా చేయాలని సూచించానండి. పాపం... ఇంతకన్నా కుదరలేదనుకుంటానండి...'' అన్నాడు సెక్రటరీ ఉన్నదున్నట్టుగా.

''అవుననుకో. కానీ అవతల ఎన్నికలొచ్చేస్తున్నాయా, మరీ సమయంలో స్పీచ్ ఇంత చప్పగా ఉంటే ఎలాగా అని ఆలోచిస్తున్నానయ్యా. నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు...'' అన్నాడు అధినేత.

ఆ మాటకి సెక్రటరీ ఉబ్బితబ్బిబ్బయిపోయి, ''దాందేముంది సార్‌... ఉన్నదంతగా లేనప్పుడు, లేనిది ఉన్నట్టుగా, మీ పాలనలో లేనిదేదీ లేనట్టుగా, జనానికసలు సమస్యలనేవే లేనట్టుగా, తమరి హయాంలో ఎక్కడా లేని సంతోషమంతా ఉన్నట్టుగామీ పరిపాలన తీరు ప్రపంచంలో మరెక్కడా లేనట్టుగాసామాన్యుల జీవితాలు స్వర్గంలో ఉన్నట్టుగా, ఇక్కడ ఉన్న అభివృద్ధి మరెక్కడా లేనట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా, చెప్పేదేదేనా  చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకురావడం మీకలవాటేగా? అలా చెప్పేయండి సార్‌...'' అన్నాడు హుషారుగా.

''హ్హ...హ్హ...హ్హ హ్హా! బలే చెప్పావయ్యా... సర్లే, అలాగే కానిచ్చేస్తాను. ఇంతకీ ఏంటివాళ విషయాలు?''

''మరేం లేదు సార్‌... మీరు కాదనరనే ధైర్యంతో, మీ దగ్గర ఇన్నాళ్లుగా పని చేసిన చనువుతో, మీకు ముందుగా చెప్పకుండా, మీ అపాయింటుమెంటు కొందరికి ఇచ్చేశాను సార్‌... వాళ్లు బయట కూర్చుని ఉన్నారు.  తమరు కాదనకూడదు...''

''వార్నీ... అప్పాయింటుమెంటంటే ఆయింటుమెంటనుకున్నావేంటయ్యా, ఎవరికి పడితే వారికి ఇచ్చేయడానికివచ్చేదెవరో తెలియకపోతే అప్పటికప్పుడు ఏం మాట్లాడతాం? తెలిస్తే వాళ్లనెలా బుట్టలో వేయొచ్చో ఆలోచించుకుని రమ్మనచ్చు... ఇంతకీ ఎవరు వాళ్లు?''

''భలేవార్సార్‌. మీకిబ్బంది కలిగిస్తానా? వాళ్లు మీ అభిమానులండి. ఇంకా చెప్పాలంటే తమ భక్తులండి. బాగా ఆరా తీసే ఈ రహస్య సమావేశం ఏర్పాటు చేశానండి...''

''సర్లె... మరయితే వాళ్లని మన సీక్రెట్‌ ఛాంబర్ లోకి  తీసుకురా...''

అధినేత అనుమతి ఇవ్వడంతో సెక్రటరీ ఉత్సాహంగా బయటకి వెళ్లి ఓ గుంపుని వెంట తీసుకుని వచ్చాడు. వాళ్ల చేతిలో పూలదండలు, పుష్ఫగుచ్ఛాలు ఉన్నాయి.

వాళ్లలో చూడ్డానికి మొరటుగా ఉన్న ఒకతను ఓ పెద్ద దండ పట్టుకుని చకచకా ముందుకొచ్చి అధినేత మెడలో వేశాడు.

''జగజ్జేతకీ జై... జగజ్జెట్టీకీ జై...'' అన్నాడు బొంగురుగొంతుతో. అతడితో పాటు వచ్చిన వాళ్లంతా పళ్లికిలిస్తూ చప్పట్లు కొట్టారు.

''ఎవరయ్యా మీరు... ఈ జేజేలు దేనికి? నేనేం సాధించాననీ?'' అన్నాడు అధినేత, లోపల ఆనందపడుతూనే, పైకి లేని వినయం చూపిస్తూ.

''అమ్మమ్మ... ఎంత మాట! తమరు అలవోకగా చేసే పనులన్నీ మాలాంటి వాళ్లకు పెదబాల శిక్షలు కదండీ... అందుకే ఓ విన్నపంతో వచ్చామండి...''

''ఏంటో మీ అభిమానం. వద్దంటే వినరు కదా. సరే... ముందు మీరెవరో, ఏంటో చెప్పండి మరి...''

''మా గురించి ఉన్నదున్నట్టు చెబుతానండి. ప్రజల భాషలో చెప్పాలంటే నేనొక దగుల్బాజీనండి. ఇదిగో వీడొట్టి వెధవండి. వీడికంటే వాడొక అరెక్కువండి. అంటే వెధవన్నర వెధవన్నమాటండి. ఇక ఆడొక పుండాకోరండి. ఆపక్కన నుంచున్నోడు తేనె పూసిన కత్తండి. ఇహ ఈయన తడి గుడ్డల్తో గొంతులు కోసే రకమండి... మొత్తానికి మేమంతా అఖిలాంధ్ర దొంగ, దుండగ, దగాకోరు, దౌర్జన్యకారుల సంఘం సభ్యులమండి. నేనే అధ్యక్షుడినండి...''

అధినేత పగలబడి నవ్వాడు. ''వహార్నీ... బాగుందయ్యా మీ ఇంట్రడక్సను. అయితే ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్నమాట. ఏ మాత్రం వెనకేశారేంటి?''

''శ్రీవారితో పోలిస్తే మేమెంతండి? గడ్డి మేసే  గాడిదలం. తమరిలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖజానాని పిండే తెలివెక్కడిదండీ?''

''సర్లె... పొగడ్తలు ఆపి, విషయంలోకి రండి. నాకవతల చాలా పనులున్నాయి...''

''అదేనండి. రిపబ్లిక్‌ దినం వస్తోంది కదండి. ప్రజలతో మీ పబ్లిక్‌ సమావేశం పూర్తయ్యాక, మేం ఏర్పాటు చేసే మరో ప్రత్యేకమైన రీపబ్లిక్‌ రాత్రోత్సవ సభకు రావాలండి...''

''ప్రత్యేకమైన రీపబ్లక్‌ రాత్రోత్సవమేంటయ్యా...?''

''మరేంలేదు సార్‌. రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాక, దాన్ని అమలు చేసుకునే రోజునే దేశమంతా రిపబ్లిక్‌ దినోత్సవం జరుపుకుంటుంది కదండీ? అదంతా పబ్లిక్‌ వ్యవహారమండి. కానీ తమరు అధికారంలోకి వచ్చాక ఆ రాజ్యాంగాన్ని తిరగరాస్తున్నారు కదండీ?   రాజ్యాంగానికే వక్రభాష్యాలు చెబుతూ, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అమలు చేస్తున్నారు కదండీ? అంచేత మేం ప్రత్యేకంగా ఈ రీపబ్లిక్‌ రాత్రోత్సవాన్ని ఏర్పాటు చేశామండి. అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేక రాత్రోత్సవమన్నమాటండి. అర్థరాత్రి మొదలవుతుందండి. తమరొచ్చి మేం ప్రత్యేకంగా తయారు చేసిన జెండాను ఆవిష్కరించి, మాలోంటోళ్లని ఉద్దేశించి ప్రసంగించాలండి.  మాకదో తృప్తండి. కాదనకూడదు....''

అధినేత ముసిముసిగా నవ్వుకుని సరేనన్నాడు.

++++++++++

రాజ్యాంగ వ్యతిరేక రాత్రోత్సవం మొదలైంది. అధినేత వస్తుంటే మైకులో పాట మొదలైంది.

''వేలెత్తి ఎదురెట్టు మొరటోడా... గతమెంతో అపకీర్తి కలవోడా!''

అక్కడ హాజరైన సంఘ సభ్యులందరూ పూలు జల్లుతుంటే అధినేత, హుందాగా జెండా కొయ్య దగ్గరకి వచ్చి అక్కడ తాడు పట్టుకుని లాగాడు. వెంటనే జెండా ఆవిష్కృతమైంది. ఎర్ర మరకులున్న జెండాపై కత్తులు, కటార్లు, కళ్లగంతలు, బేడీలు లాంటి గుర్తులు ముద్రించి ఉన్నాయి. వెంటనే సభ మొదలైంది.

అధినేతను ఆహ్వనించిన అధ్యక్షుడు తన ఉపన్యాసం మొదలు పెట్టాడు.

''సంఘ వ్యతిరేక శక్తులారా! చట్ట విరుద్ధ మిత్రులారా! నేడు మనకు సుదినం. అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని విస్మరించి, దాన్ని తిరగరాసి, చరిత్రను వక్రంగా లిఖిస్తున్న మన అధినేత ఈ సభకు విచ్చేయడం మనందరికీ ఆనందదాయకం. మనమందరం నీచమైన పనులు చేసి, దొంగతనాలు దోపిడీలు, దురాగతాలకు తలబడి చెడ్డవాళ్లమనే ముద్ర వేసుకుని తిరుగుతున్న వాళ్లమే. కానీ ఈయన? పైకి  మంచిగా కనిపిస్తూ, అందరికీ మంచి చేయడానికే అవతారమెత్తినట్టు నమ్మిస్తూ మనందరి కన్నా ఎక్కువగా దోచుకుంటున్న ఘన నేత. మనం చేసే పనులను మనం దొంగతనంగా, భయపడుతూ చేస్తున్నాం. మరి ఈయన? ప్రజల పేరు చెప్పి, అభివృద్ధి చేస్తున్నట్టు పైకి చెబుతూ, ఏ పని చేపట్టినా, లోపాయికారీగా కమీషన్ల రూపంలో కోట్లకు కోట్లు చేతులు మారే వ్యవస్థను నెలకొల్పారు. ఇసుకని కాదు, మద్యమని కాదు, నీటి ప్రాజెక్టులని కాదు, కొండలని కాదు, గనులని కాదు, భూములని కాదు, పొలాలని కాదు... అన్నింటినీ ప్రగతి పేరిట బాహాటంగా, ఎక్కడా చట్టానికి దొరక్కుండా భోంచేస్తున్నమహా రాజకీయ నేత. ఒకప్పుడు ఇల్లు తాకట్టు పెట్టే స్థితి నుంచి ఈనాడు ఇతర రాష్ట్రాల్లో సైతం విలాసవంతమైన భవంతులు నిర్మించుకునే స్థితికి వెళ్లిన నాయకుడు. అధికారం లేకుండానే ఈయన నడిపిన అవినీతి కార్యకలాపాల లోగుట్టుమట్టులు తేల్చడానికి మహా మహా కోర్టులు సైతం కిందమీదులవుతున్నాయి. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా తన అధికారానికి అనుగుణంగా సొంత రాజ్యాంగాన్ని రచించుకున్న ఈయనకు నేను ఈ సందర్భంగా 'రాజ్యాంగ భ్రష్ట' అనే బిరుదును సభా ముఖంగా సవినయంగా సమర్పించుకుంటున్నాను...'' అనగానే చప్పట్లు మార్మోగాయి.

''ఇప్పుడు ఈయన మనందరి మేలు కోరి ప్రసంగించాలని, నీచ నికృష్ట పనులను చేయడంలో నైపుణ్యాలను వివరించాలని కోరుతున్నాను. ఈయన మాటలు విని మీరంతా మరింత చెడిపోవాలని కోరుతున్నాను...'' అంటూ అధ్యక్షుడు, అధినేతను సాదరంగా మైకు ముందుకు ఆహ్వానించాడు.

అధినేత ముసిముసిగా నవ్వుతూ, ''అసలిలాంటి వినూత్నమైన రీపబ్లిక్‌ ఉత్సవాన్ని జరపాలనే ఆలోచన వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉంది. కాబట్టి నాకు తెలిసిన కొన్ని చెడ్డ మాటలు చెబుతాను. మీరంతా ముందు చూపులేని సాదా సీదా అమాయక నేరగాళ్లు. నేనలా కాదు. రానున్న కొన్నేళ్లపాటు నిరాటంకంగా, నిరంతరాయంగా, నిర్భయంగా, నిశ్చింతగా, నిబ్బరంగా కోట్లకు కోట్లు దోచుకోడానికి పథక రచన చేసిన రాజకీయ వేత్తను. అన్నింటికన్న పెద్ద సంపద ప్రజా ధనం. దాన్ని దోచుకోవాలంటే అధికారం రావాలి. అది రావాలంటే ప్రజలను నమ్మించాలి. నిజానికి అదొక కళ. ఒకసారి అధికారం అందాక అమాత్యుల నుంచి అధికారుల వరకు, అస్మదీయుల నుంచి అనుచరుల వరకు అందరికీ అవినీతిని రుచి చూపించాలి. ఒక విధంగా అవినీతిని కేంద్రీకరించాలి. వ్యవస్థీకృతం చేయాలి. అందుకుగాను రాజ్యంగ, చట్ట, న్యాయ, ప్రజాస్వామ్య వ్యవస్థలను, విధానాలను ఒకటొకటిగా భ్రష్టు పట్టించాలి. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలెదురైనా జంక కూడదు. ప్రశ్నించే వాళ్లను, మన చర్యలను నిరసించే వాళ్లను కర్కశంగా అణచివేయాలి. ఇందుకు చట్టంలో లొసుగులను వాడుకోవాలి. రాజ్యాంగంలోని లోపాలను ఉపయోగించుకోవాలి. నేను చేసిందదే. ఇన్ని పనులు చేస్తున్నా మనం అధికారంలోకి రావడానికి దోహద పడే ఓటు బ్యాంకును మాత్రం విస్మరించకూడదు. వాళ్లకి కూడా డబ్బు రుచి చూపించాలి. ప్రజలు అమాయకులు. వాళ్లకు పది రూపాయలు పడేసి, వాళ్ల కళ్ల ముందే కోట్లకు కోట్లు దోచేసుకుంటున్నా పట్టించుకోరు. నిజానికి వాళ్లకి మనం పథకాల రూపంలో పంచేది కూడా వాళ్ల డబ్బేనని తెలుసుకోలేరు. ఇప్పటికే మీలాంటి వాళ్లను నా అనుచర వర్గంగా పెట్టుకున్నాను. మిమ్మల్ని కూడా ముందు ముందు ఉపయోగించుకుంటానని మాట ఇస్తున్నాను'' అంటూ ముగించాడు.

ఆ అర్థరాత్రి అక్కడ చేరిన సభ్యులందరూ ఆనందంతో చప్పట్లు మోగించారు. ఆ తర్వాత 'భారత భ్రష్ట', 'చెడ్డశ్రీ', 'నీచ విభూషణ్‌', 'నికృష్ట రత్న' లాంటి పతకాలను అధినేత ప్రదానం చేశాడు. శకటాలుగా ప్రదర్శించిన దోపిడీ ధనం, తుపాకులు, బందూకులు, బాంబులు, గ్రెనేడ్లులాంటి  పరికరాలతో కూడిన వాహనాలను ఆనందంగా తిలకించాడు. దౌర్జన్యకారుల గౌరవవందనం స్వీకరించాడు. ఈలోగా తెల్లారిపోయేసరికి ఎక్కడివారక్కడ జారుకున్నారు.

-సృజన

PUBLISHED ON 24.1.2023 ON JANASENA WEBSITE

శనివారం, జనవరి 14, 2023

జన చైతన్య సంక్రాంతి!

 


 ప్రజాకర్షక, జన వంచక విధానాల గురించి ఆలోచిస్తూ అలసిపోయి ఆదమరిచిన అధినేతకి కుర్చీలోనే కాస్తంత కునుకు పట్టిందో లేదో, సన్నాయి నాదంతో పాటు పాట వినిపించి మెలకువ వచ్చింది.

''అయ్యవారికి దణ్ణం పెట్టు...

అమ్మవారికి దండం పెట్టు...

డూ డూ డూ డూ బసవన్నా...

చూడూ చూడూ బసవన్నా...''

అంటూ గంగిరెద్దుల వాళ్లు పాట పాడుతూ రావడం కనిపించింది.

''ఏంటి బాబూ ఇదీ... ఈ పాటలేంటీ... ఇలా వచ్చారేంటీ...'' అంటూ సాగదీశాడు అధినేత.

''దండాలు బాబయ్యా... రాజ్యమేలే రాజులు తమరు... పండగ కదాని వచ్చాం బాబయ్యా... ఆపై తమ దయ...'' అన్నాడు గంగిరెద్దు మేళం పెద్ద.

''మంచిది బాబూ... మీ గురించి కూడా గంగిరెద్దు భరోసా పథకం పెడతానూ... గంగడోలు దువ్వుతానూ...'' అన్నాడు అధినేత.

''మమ్మల్ని కూడా నమ్మిస్తున్నారా బాబయ్యా... ముందు మా పాట వినండి అయ్యా....'' అన్నాడా పెద్ద నర్మగర్భంగా. ఆ తర్వాత పాట అందుకున్నాడు.

''డూ డూ డూ డూ బసవన్నా...

బంగరు గిట్టల బసవన్నా...

పైడి కొమ్ముల బసవన్నా...

నిజాలు చెప్పు బసవన్నా...

ప్రజలను వీడు బసవన్నా...

పశువుల చేసెను బసవన్నా...

అబద్దాలతో బసవన్నా...

ఆకర్షించెను బసవన్నా...

కుర్చీ ఎక్కి బసవన్నా...

అన్నీ మరిచెను బసవన్నా...

మత్తులో ముంచి బసవన్నా...

మాయ చేసెను బసవన్నా...''

అధినేత తుళ్లి పడ్డాడు. ''ఏయ్... ఏంటా పాట?'' అన్నాడు కోపంగా.

''శాంతించండి బాబయ్యా... మేం గంగిరెద్దునే ఆడిస్తాం. మీరు ప్రజల్నే గంగిరెద్దుల్ని చేసి ఆడిస్తున్నారు. అమాయక జనం మీరు చెప్పినదానికల్లా మొదట గంగిరెద్దుల్లాగే తలలూపారు. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతోంది బాబయ్యా... అందుకే మా పాట కూడా కొత్తగా సాగుతోంది...ఇక వెళ్లొస్తాం'' అన్నాడు. గంగిరెద్దు పెద్దగా రంకె వేసి కొమ్ములు విసిరి సాగిపోయింది.

అధినేతకి ఏమనాలో తోచలేదు. వీళ్లపై ఏదైనా అడ్డగోలు కేసు బనాయించాలనుకున్నాడు. లేదా గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికీ తిరగకుండా ఆంక్షలు విధిస్తూ ఏదైనా కొత్త జీవో జారీ చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలో ఉండగానే మరో పాట వినిపించింది.

''హరిలో రంగ హరీ... నిజం తెలుసుకో మరి...'' అంటూ హరిదాసు వచ్చాడు.

''నువ్వెవరు నాయనా? ఎందుకిలా వచ్చావూ? నీక్కూడా ఏదైనా పథకం కావాలా?'' అన్నాడు అధినేత.

''ధర్మప్రభువులు... అక్కర్లేదయ్యా... మమ్మల్నిలా బతకనిస్తే చాలు...'' అంటూ హరిదాసు చిడతలు వాయిస్తూ పాటందుకున్నాడు.

''హరిలో రంగ హరీ...

భ్రమలు వదులుకో మరి...

ఎన్నికలొస్తే ఈసారి...

ఆలోచించుకో ఓసారి...

వచ్చాడమ్మా కిందటి సారి...

వంచన నేర్చిన మాయలమారి...

ఆ ఉచ్చులో పడితే మరోసారి...

నీ భవితకు అదే అవుతుంది ఘోరీ...

హరిలో రంగ హరీ!''

చిడతలు వేస్తూ హరిదాసు పాడేసరికి అధినేత ఉలిక్కిపడ్డాడు.

''ఏంటయ్యా... ఏం పాడుతున్నావు?'' అంటూ గద్దించాడు.

''ఊరుకోండి బాబయ్యా... మూడున్నరేళ్ల క్రితం ఇలాగే మీరు ఊరువాడా, ఇల్లూ వాకిలీ తిరుగుతూ హరికథలెన్నో చెప్పారు. జనం అవన్నీ నిజమనుకుని నమ్మారు. అప్పట్లో జనం ఏడవకున్నా మీరు ఓదార్చారు. అదే జనం ఇప్పుడు బోరుమని ఏడుస్తున్నారు. అందుకే నా వంతుగా వాళ్లని చైతన్య పరచాలని ప్రయత్నిస్తున్నా. ఇక వస్తా...'' అంటూ వెళ్లిపోయాడు.

అధినేతకి ఏమీ అర్థం కాలేదు. ''ఏం జరుగుతోంది?'' అనుకున్నాడు.

'కొంపదీసి జనం నిద్రలోంచి మేలుకోలేదు కదా?' అని భయపడ్డాడు. తర్వాత ఆ ఊహకే బెంబేలెత్తి పోయాడు. ఇంతలో కొందరు మహిళలు  చకచకా వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేయసాగారు. మరి కొందరు ఆడవాళ్లు ఆ ముగ్గుల్లో గొబ్బిళ్లు పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటందుకున్నారు.

''గొబ్బీయలో... గొబ్బీయలో...

సంక్రాంతి పండగొచ్చె గొబ్బీయలో...

అందరినీ మేలుకొలిపె గొబ్బీయలో...

ఊరువాడ ఏకమై గొబ్బీయలో...

ఊదరగొట్టేయాల గొబ్బీయలో...

ఓటు రాజకీయాలను గొబ్బీయలో...

ఓడించి తరమాల గొబ్బీయలో...

గూడుపుఠానీగాళ్లకు గొబ్బీయలో...

గూబగుయ్యిమనాల గొబ్బీయలో...

ఆడవాళ్ల శక్తి చూపి గొబ్బీయలో...

ఆటకట్టు చేయాల గొబ్బీయలో...''

అధినేతకు ఏమనాలో తోచలేదు. ''ఏంటింది? ఏమంటున్నారు? ఓ అక్క, ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ అవ్వ... మీ కోసమే కదా ఎన్నో పథకాలు పెట్టాను? అవన్నీ మరిచారా?'' అన్నాడు.

''ఊరుకోవయ్యా... పెట్టావులే పథకాలు. ఇంటా బయటా ఆడవాళ్లకి రక్షణ లేకుండా చేశావు. మద్యాన్ని సారాని ఏరులై పారించేసరికి మా మగాళ్లంతా పూటుగా తాగి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకుంటున్నారు. నాటు మద్యం మరిగి అనారోగాల పాలవుతున్నారు. ఇక బయట మా మహిళలకు భద్రతే లేదు నీ హయాంలో. ఆడాళ్లపై అత్యాచారాల్లో మన రాష్ట్రం దేశంలోనే ఘనతకెక్కిందంటే నువ్వేంటో, నీ పాలనేంటో తెలుసుకోలేమనుకుంటున్నావా? అందుకే ఈ పండగ పేరు చెప్పి అందరినీ మేలుకొలుపుతున్నాం... తెలిసిందా?'' అంటూ గయ్యిమన్నారు. అధినేత నోరెళ్లబెట్టాడు. ఇంతలో గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు, ఆడవాళ్లు అందరూ కలసి కోలాటం ఆడసాగారు.

''హే... భగ భగ భగ భగ భోగి మంటలే...

 గణ గణ గణ గణ గంగిరెద్దులే...

కణ కణ కణ కణ కిరణ కాంతులే...

హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే...

చక చక చక చక మకర రాశిలో...

మెరిసే మురిసే సంక్రాతే...'' అంటూ కలిసికట్టుగా నాట్యం చేయసాగారు.

అధినేతకు ముచ్చెమటలు పట్టాయి. కళ్లు బైర్లు కమ్మాయి. జనం చైతన్యవంతులైపోతే ఎలా ఉంటుందో అర్థమైంది.

గొంతు తడారిపోయింది. గుండె పట్టేసింది. ఆ సరికి పీడకల నుంచి మెలకువ వచ్చింది!

-సృజన

 PUBLISHED ON 15.01.2023 ON JANASENA WE BSITE

మంగళవారం, జనవరి 10, 2023

నెంబర్ వన్‌ ఛీటర్‌!


 

''ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...

కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్‌ వన్‌...

రౌడీలను పనిపెట్టే కేడీ నెంబర్‌ వన్‌...

నెంబర్‌ వన్‌ నెంబర్‌ వన్‌ నెంబర్‌ వన్‌...

ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...''

అధినేత అంతరంగం పిచ్చెత్తినట్టు గెంతుతోంది. అద్దం ముందు అధినేత మాత్రం మెత్తగా నవ్వుతూ నిలబడ్డాడు.

''ష్‌... మరీ అంత రెచ్చిపోకు. ఇది ప్రజాస్వామ్యం...'' అన్నాడు అధినేత స్వగతంగా.

''హ...హ్హ...హ్హ... హ్హ! ఎందుకు గురూ... నా దగ్గర కూడా ప్రజల ముందు మాట్లాడినట్టు నయవంచక కబుర్లు చెబుతావ్‌. నేను నీ అంతరంగాన్నే కదా? నువ్వు అధికార పీఠం మీద కూర్చున్నాక ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది చెప్పు? అహ... మనలో మన మాటలే...'' అంది అంతరంగం వికటంగా నవ్వుతూ.

''అవుననుకో. కానీ ప్రజలు గెలిపిస్తేనే గెలిచాను కదా? అది ప్రజాస్వామ్యం కాదంటావా?''

''అబ్బ...అబ్బ... ఎంత జాగ్రత్త! ఎంత అప్రమత్తత! అంతరంగం ముందు అంత నాటకాలెందుకమ్మా? ప్రజలు  పట్టం కడితేనే గెలిచావులే. కానీ ఆ ప్రజల్ని ఎంతలా నమ్మించావని? ఎంతలా వంచించావని? ఒక్కటంటే ఒక్కటైనా సాధ్యమైన హామీ ఇచ్చావా అని? అరచేతిలో స్వర్గం చూపించావు. అధికారం అందాక నరకం చూపిస్తున్నావు. నువ్విచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా అని?''

''అదే కదా రాజకీయం? నీకు తెలియనిదేముంది. కానీ నాకర్థం కాక అడుగుతానూ... ఆ పాంటేంటి? ఆ గెంతులేంటి? అవతల ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనేమైనా ఉందా?''

''ఏంటో గురూ... ఎందుకో ఆ పాట నీకు బాగా నప్పిందనిపిస్తోంది. కేడీలను కనిపెట్టి చూసుకుంటున్నావు. రౌడీలను పనిపట్టి చేరదీస్తున్నావు. నీ అనుచరులను సొంత గూండాలుగా ఉపయోగించుకుంటున్నావు. ఈ విషయంలో నిన్ను మించిన నెంబర్‌ వన్‌ ఎవరుంటారు చెప్పు?''

అధినేత ముసిముసిగా నవ్వుకున్నాడు. అద్దంలో చూసుకుంటూ చొక్కా చేతులు మడతపెట్టుకుని, ''అయితే నిజంగా నేనే నెంబర్‌ వన్‌ అంటావా?'' అన్నాడు అంతరంగం చేత మరింత వాగిద్దామని.

అంతరంగం ఇంకా రెచ్చిపోయింది.

''ఇది జనతా బస్సు... జాగ్రత జాగ్రత మనీపర్సు...

ఎవ్వరు ఎక్కడ దిగుతారో... ఎంత లగెత్తుకు పోతారో...

ఎవడికి తెలుసు?'' అంటూ చూపుడు వేలు పైకెత్తి చూపిస్తూ స్టెప్పులేయసాగింది.

అధినేత అటూ ఇటూ చూసి ''ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావ్‌...'' అన్నాడు ముద్దుగా మందలిస్తున్నట్టు.

అంతరంగం ఊరుకోలేదు.

''నువ్వూరుకో గురూ... ఆ పాటలో చెప్పినట్టు ఇది జనతా బస్సేకదూ? అందుకేగా నీ మనీ పర్సును అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అవునుగానీ... కుర్చీ ఎక్కాక ఎంతకి లగెత్తావు గురూ?'' అంది లోపాయికారీగా.

''చాల్లే సతాయిస్తున్నావ్‌... ఇంకా లెక్కలు తేలందే? అన్ని వ్యవస్థల్నీ ప్రజల పేరు చెప్పి గాడి తప్పించడానికే ఇంకా సమయం సరిపోలేదు. అయినా నా లెక్కలే అడుగుతావెందుకు? ప్రజలకు కూడా పంచిపెడుతున్ననుగా?''

''భలే చెప్పావు గురూ..'' అంటూ అంతరంగం అధినేత చుట్టూ స్టెప్పులేస్తూ పాట పాడసాగింది.

''ముద్రలు వేసే నోట్ల కట్టలు, ముడుపుగ వేసే పెద్ద మనుషులు...

ముసుగులు తీస్తే రాస్కెల్సు...

మూట విప్పితే బాటిల్సు!

ఎస్‌...నేనే నెంబర్‌ వన్‌''

అధినేత చిరుకోపం ప్రదర్శించాడు.

''అంటే ఏంటి నీ ఉద్దేశం?'' అన్నాడు.

''ఇంకా విడమర్చి చెప్పాలా గురూ? ప్రజల పేరు చెప్పి నువ్వు దోచుకుంటున్నదెంత? అందులోంచి పథకాల పేరు చెప్పి వాళ్లకిస్తున్నదెంత? నీకు తెలియదా? నాకు తెలియదా చెప్పు? అసలు నాకు తెలియక అడుగుతానూ... కనీసం ఓ అరశాతమైనా ఉంటుందా బాసూ?  నీ ముసుగు తీస్తే నువ్వు ఎవరివో ప్రజలు పోల్చుకోలేనంత వరకు నీకి ఢోకా ఎక్కడుంటుంది? మరి నువ్వు కాక ఇంకెవరు నెంబర్‌ వన్‌?''

అద్దంలో అధినేత మొహం వెలిగిపోయింది.

''ఈ లోకం గాంబ్లింగ్‌ హౌస్‌... ఆడేవాళ్లు బ్లడీఫూల్స్‌...

ముక్కలు మార్చే వాడెవడో, లెక్కగ కొట్టే వాడెవడో...

ఎవడికి తెలుసు?

రాజూ రాణీ జోకర్లు... కలిసొస్తేనే లాకియర్లు...

రంగురంగుల టోపీలు... రకరకాలుగా దోపిళ్లు...''

అంతరంగం వెర్రెత్తిపోతూ డ్యాన్స్‌ చేయసాగింది.

ఆసరికి అధినేతకి కూడా హుషారొచ్చింది. ఎవరూ లేని ఆ ఏకాంత సమయంలో అధినేత కూడా అంతరంగంతో గొంతు కలిపి గెంతసాగాడు.

''ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...

కేడీలను తలదన్నే రౌడీ నెంబర్‌ వన్‌...

రౌడీలను మరిపించే కేడీ నెంబర్‌ వన్‌...

ప్రజలందరినీ ఏమార్చే నేతా నెంబర్‌ వన్‌...

ప్రకృతి వనరులు కొల్లగొట్టే నీచా నెంబర్‌ వన్‌...

రాష్ట్రాన్ని దోచుకునే త్రాష్ట నెంబర్‌ వన్‌...

జనం జెల్లకొట్టి జోకొట్టే జగజ్జేతా నెంబర్‌ వన్‌...

వోటర్లకు ఎరలేసే లోఫర్‌ నెంబర్‌ వన్‌...

అధికారంతో ఆడుకునే తొండీ నెంబర్‌ వన్‌...

ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌!''

అధినేత, అతడి అంతరంగం కలిసి ఉప్పులకుప్ప, చెమ్మచెక్క, కోలాటం లాంటి నాట్యవిన్యాసాలతో గోలగోలగా పాడుతూ స్టెప్పులు వేయసాగారు.

ఇంతలో... ''స్టాపిట్‌! నాన్సెస్‌!!'' అనే కేకలు గట్టిగా వినబడ్డాయి. అంతరంగం గబుక్కున అధినేతలోకి దూరిపోయింది. అధినేత అటూ ఇటూ చూసేసరికి, అద్దం వెనక నుంచి తనలాంటిదే మరో రూపం బయటకి వచ్చింది.

''ఎవరు నువ్వు? సీబీఐ ఆఫీసర్‌ వా? నిఘా సంస్థ ప్రతినిధివా? దర్యాప్తు సంస్థ అధికారివా? సుప్రీం కోర్టు అబ్సర్వర్‌ వా? ప్రతిపక్ష నాయకుడివా?'' అంటూ అధినేత ప్రశ్నల వర్షం కురిపించాడు.

''ఆఖరికి నన్నే గుర్తు పట్టలేకపోయావన్నమాట. నేను నీ అంతరాత్మను'' అందా రూపం.

''అంతరాత్మా? అది ఉన్నట్టే నాకు తెలియదే?'' అన్నాడు అధినేత.

''అవునులే.  నా నోరునొక్కి, అడ్డమైన పనులు చెప్పే అంతరంగంతో చేతులు కలిపి అడ్డగోలుగా ఎదిగిన వాడివి. నీకు నేనెందుకు గుర్తుంటాను?'' అంది అంతరాత్మ.

''అడ్డగోలుగా ఎదిగానా? అడ్డమైన పనులు చేశానా? ఏంటి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావ్‌? నేనెవరో తెలుసా? రాజకీయంలో నెంబర్‌ వన్‌. అరాచకీయంలో నెంబర్‌ వన్‌. ప్రజలు ఏరికోరి ఎన్నుకున్న అధినేతా నెంబర్‌ వన్‌...'' అంటూ అధినేత జేగురించిన మొహంతో అరిచాడు.

అంతరాత్మ పగలబడి నవ్వింది. అధినేత చూస్తుండగానే ఎత్తుకు ఎదిగింది.

''మూర్ఖుడా! ఆఖరికి ఇంతలా దిగజారావన్నమాట. నీలో ఉండే నన్నే గుర్తించలేక పోతున్నావ్‌. పైగా నన్నే బెదిరించాలని చూస్తున్నావ్‌. నీకు నువ్వే నెంబర్‌ వన్‌ అనుకుంటున్నావ్‌. అందుకే ఎవరు ప్రశ్నించినా సహించలేకపోతున్నావ్‌. ఎవరు నీ లోపాలను చెప్పినా, వాటిని సరిదిద్దుకోకపోగా, వారి గొంతునే నులిమేయాలని చూస్తున్నావ్‌. అందుకే ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకోవాలని చూస్తున్నావ్‌. అందుకోసం జీవో నెంబర్‌ వన్‌ రూపొందించావ్‌. ఇది ప్రజాస్వామ్యమనే సంగతినే విస్మరించావ్‌. అంతా నీ ఇష్టారాజ్యమనుకుంటున్నావ్‌. ఇప్పుడు ఎవరైనా నీ అసలు స్వరూపాన్ని బయటపెడతారేమోనని బెదిరిపోతున్నావ్‌. అందుకనే అడ్డమైన ఆంక్షలు పెడుతున్నావ్‌. లేనిపోని నిబంధనలు విధిస్తున్నావ్‌. కానీ ఒక్క సంగతి విస్మరిస్తున్నావ్‌. ప్రజలు నిన్ను, నీ అంతరంగాన్ని కనిపెడుతూనే ఉన్నారనే సంగతిని గుర్తించలేకపోతున్నావ్‌. ఒకప్పుడు సొంత ఇల్లయినా లేని నువ్వు కొన్నేళ్లలోనే ఇతర రాష్ట్రాల్లో సైతం పెద్ద పెద్ద భవంతులు ఎలా నిర్మించగలిగేవో ప్రజలు గ్రహించలేరనుకుంటున్నావా? ఒకప్పుడు కేవలం చిన్న కంపెనీతో కాలక్షేపం చేసే నువ్వు కొన్నేళ్లలోనే కోట్లకు కోట్లు ఎలా సంపాదించావో జనం కానుకోలేరనుకుంటున్నావా? ఒకనాడు కేవలం మూడు లక్షల లోపు ఆదాయపు పన్ను కట్టిన నువ్వు అనతి కాలంలోనే కోట్లకు కోట్లు పన్ను కట్టగలిగే స్థాయికి ఎలా ఎగబాకావో సామాన్యులు గమనించలేరనుకుంటున్నావా? కళ్ల ముందు నువ్వు, నీ అనుచరులు  కలిసి సాగించే ఇసుక మాఫియా ఎంతలా వేళ్లూనుకుని పోయిందో బడుగులు అంచనా వేయలేరనుకుంటున్నావా? రేషన్‌ బియ్యాన్ని సైతం అడ్డగోలుగా సేకరించి మరపట్టించి విదేశాలకు సైతం తరలిస్తున్న బియ్యం మాఫియా జాడల్ని పేదలు పసిగట్టలేరనుకుంటున్నావా? మద్యం వ్యాపారాన్ని అయినవాళ్లకి అప్పజెప్పి ముడుపులెలా పుచ్చుకుంటున్నావో ప్రజలు ఆకళింపు చేసుకోలేరనుకుంటున్నావా? ప్రజల పేరు చెప్పి, అభివృద్ధి ఆశలు చూపించి ప్రజల ఆస్థి అయిన భూముల్ని, గనుల్ని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేసి వాళ్ల నుంచి ఎలా వాటాలు అందుకుంటున్నావో నువ్వు అమాయకులనుకుంటున్న జనం ఊహించలేరనుకుంటున్నావా? కళ్ల ముందు కోటానుకోట్లు దోపిడీ చేస్తూ కాసిన్ని డబ్బులు కాతాల్లో వేసేసినంత మాత్రాన వోటర్లు నిజాలేంటో నిగ్గుతేల్చుకోలేరనుకుంటున్నావా? అడిగినా, ప్రశ్నించినా, నిరసన వ్యక్తం చేసినా, అసమ్మతి చూపించినా లేనిపోని కేసుల్లో ఇరికించి ఎలా వేధిస్తున్నావో ప్రజలు తెలుసుకోలేరనుకుంటున్నావా? నీ హయాంలో ఏ రంగం అభివృద్ధి చెందిందని ఇలా విర్రవీగుతున్నావ్‌?  విద్యా వ్యవస్థ ఎలా గతి తప్పిందో తల్లిదండ్రులకు తెలియదా? వ్యవసాయం ఎలా కునారిల్లిందో రైతులకు తెలియదా? అధికార రంగం ఎలా చతికిల పడిందో ఉద్యోగులకు తెలియదా? రాష్ట్రం ఎంతలా అప్పుల పాలైందో ఆర్థికవేత్తలకు తెలియదా? పరిశ్రమలు ఎందుకు రావడం లేదో నిరుద్యోగులకు తెలియదా? నీ పాలనలో ఇన్ని లోపాలు పెట్టుకుని నువ్వు, నీ అంతరంగం కలిసి నేనే నెంబర్‌ వన్‌ అనుకుని గెంతులు వేస్తే సరిపోతుందనుకుంటున్నావా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నువ్వొక నెంబర్‌ వన్‌ నీచుడివి. నెంబర్‌ వన్‌ నికృష్టుడివి. నెంబర్‌ వన్‌ ఛీటర్‌ వి. నెంబర్‌ వన్‌ ఫూల్‌ వి. నెంబర్‌ వన్‌ భ్రష్టుడివి. ఇక ఇప్పుడు పాడుకో ఎలా పాడుకుంటావో''.

అంతరాత్మ ఒకో ప్రశ్న వేస్తూ ఆకాశమంత ఎదిగిపోయేసరికి అధినేత అంతకంతకు చిన్నవాడై బిక్క మొహం వేశాడు.

-సృజన

PUBLISHED ON 10.01.2023 ON JANASENA WEBSITE