శుక్రవారం, మార్చి 31, 2023

రాజకీయ రామాయణం


 

శిష్యుడు వచ్చేసరికి గురువుగారు టీవీలో సీతారామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. శిష్యుడు వచ్చి గురువుగారికి నిశ్శబ్దంగా నమస్కరించి వినయంగా కూర్చున్నాడు.

''దారా... రాములోరి పెళ్లయిపోయాక మనం రామాయణం చెప్పుకుందాం. సరేనా?'' అన్నారు గురువుగారు.

శిష్యుడు నీళ్లు నమిలి, ''ఎందుకులెండి గురూగారూ! మీరు కల్యాణం చూడండి. ఇవాల్టికి పాఠం వద్దులెండి'' అన్నాడు.

''భలేవాడివిరా! రామాయణాన్ని మించిన పాఠం ఏముంటుంది చెప్పు...''

''అవుననుకోండి. కానీ, మన రాజకీయాలకీ రామాయణానికీ పొంతన కుదర్దని...''

''వార్నీ... రామాయణమంటే వయసు మళ్లాక చదువుకునే పురాణమనుకుంటున్నావేంట్రా? జీవితంలో దేనికైనా అందులో పాఠం ఉంటుంది, పరిష్కారం కూడా ఉంటుంది...''

''ఊరుకోండి గురూగారూ! మీరు దేన్నుంచి దేనికైనా ముడి పెట్టేయగలరు కానీ...ఇప్పటి అరాచక రాజకీయాలెక్కడ? అప్పటి ఆదర్శవంతమైన రామరాజ్యమెక్కడ?''

''ఒరే... నేర్చుకోవాలనే బుద్ధి ఉండాలే కానీ, ఎందులోనైనా పోలిక కనిపిస్తుందిరా బడుద్ధాయ్...''

''ఇక మీరు వదిలేలా లేరని అర్థమైంది గురూగారూ. మరైతే మీరే చెప్పండి, ఇవాళ మన పరగణాలో జనం పడుతున్న బాధలకి రామాయణంలో ఎలాంటి పోలిక ఉందో?''

''అలాగన్నావ్బాగుంది. ఇప్పుడు నేను చెప్పడం కాదురా, నీ చేతే చెప్పిస్తాను చూడు.  సీత రాముడికి దూరమై అన్ని కష్టాలు పడడానికి కారణమేంటి?''

''ఏముందండీ... మారీచుడి మాయ వల్లండి...''

''మరదే పోలిక. మారీచుడేం చేశాడు? బంగారు లేడిలాగా కనిపించి మురిపించాడు. ఆశలు కల్పించాడు. సీత ముచ్చటపడిపోయింది. అప్పటికీ లక్ష్మణుడు హెచ్చరించాడు కూడా, బంగారు లేడి కనీ వినీ ఎరుగని వింత, ఇదంతా రాక్షస మాయ అని! సీత వినలేదు. మరి తర్వాత ఏమైంది? లంకలో బందీ అయిపోయింది. అవునా?''

''ఇదంతా నాకూ తెలుసు గురూగారూ! కానీ ఆ లంకకి, మనకి లంకె ఏంటా అని...''

''మరిక్కడ కూడా జరిగిందిదే కదరా? రాజకీయ రావణాసురుడు మారువేషంలో వచ్చాడు. బంగారు రాజ్యం తెస్తానంటూ ఆశలు చూపించాడు. బతుకులు మార్చేస్తానన్నాడు. సాధ్యం కాని హామీలు గుప్పించాడు. జనం పాపం... ముచ్చటపడ్డారు. మారీచుడి మాయ లాంటి   ఆశల వలలో చిక్కుకున్నారు. ఇప్పుడు లంకలో సీతలా విలవిలలాడుతున్నారు. అవునా?''

''నిజమేనండోయ్‌. భలే పోలిక చెప్పారు. పాపం... సీతకి అటు బంగారు లేడీ దక్కలేదు, ఇటు భర్తకీ దూరమైంది. రాక్షస మూకల మధ్య నిస్సహాయంగా కుమిలిపోయిందండి...''

''మరి మన పరగణా ప్రజల పరిస్థితి కూడా అంతే కదరా? నమ్మిన హామీలు చూస్తే హంగామా తప్ప ఏమీ లేదనిపిస్తున్నాయి. చుట్టూ చూస్తే రాకాసుల్లాంటి నేతలు, అనుచరులు, వాళ్ల అరాచకాలూను. ఊ అంటే తప్పు. కాదంటే ముప్పు. అడిగితే అగచాట్లు.  అదేమంటే అరాచకాలు. ప్రశ్నిస్తే పీచమణచడాలు. లంకలో సీతమ్మలా తల్లడిల్లిపోవడం లేదూ?''

''అవునండి బాబూ. నీకిక నేనే దిక్కని సీతమ్మని ఆ రావణాసురుడు బెదిరించినట్టే, ఈ రాజకీయ రావణాసురుడు కూడా విర్రవీగుతున్నాడండి. తననే మళ్లీ ఎన్నుకోవాలని మళ్లీ మాయమాటలు చెబుతున్నాడండి. ఆ సీత కథ రామబాణంతో  తెరిపినపడిందండి. మరి ఇప్పుడీ జనం  పరిస్థితి ఏంటండి పాపం?''

''వీళ్లని గట్టెక్కించేది కూడా రామబాణమేరా. కానీ అదిప్పుడు వీళ్ల చేతుల్లోనే ఉంది...''

''ఏంటండదీ?''

''ఓటురా. జనం చేతిలో ఓటే రామబాణంలాంటిది. దాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో ప్రయోగిస్తే సరి. రాజకీయ రావణాసురుడి చెర వదిలిపోతుంది. రాక్షస మూకల బాధ తీరిపోతుంది...''

''బాగుంది గురూగారూ. కానీ నాకో సందేహమండి. ఇంతకీ రాముడెవరండీ?''

''రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగాట్ట వెనకటికి నీలాంటోడే. సరైన నాయకుడే రాముడురా.  లంకలో సీత రాముడి కోసం తపించినట్టే, జనం కూడా అలాంటి నాయకుడు ఎవరో పోల్చుకోవాలి.  ఆడి తప్పని వాడు, ఆపదల్లో అండగా నిలిచేవాడు, ఆవేశాన్నే ఆయుధంగా మలిచేవాడు, అడుగడుగునా నేనున్నానని నిలిచేవాడు ఎవడో అతడే ఆ నాయకుడు.  మళ్లీ మాయ మాటల మారీచుడి వలలో పడకూడదు. లంకలో రావణాసురుడెలా ప్రలోభపెట్టాడో తెలుసుకదా? నా చెయ్యి పట్టుకుంటే పట్టపురాణిని చేస్తానన్నాడు. సర్వ సుఖాలూ నీవేనన్నాడు. దేవతలు సైతం తననేమీ చేయలేరన్నాడు. ఆ రాముడికి రాజ్యం కూడా లేదని ఎద్దేవా చేశాడు. దేశదిమ్మరన్నాడు. లంక దాకా రానేలేడన్నాడు. అయినా సీత విందా? లేదుకదా, అంతటి రావణుడిని కూడా గడ్డిపరకలా చూసిందా, లేదా? అదిగో అలాంటి స్థిర నిశ్చయానికి రావాలి. అప్పుడే మరి రాక్షస రాజ్యం నుంచి విముక్తి. అర్థమైందా?''

''అవునండోయ్.  దురహంకారం, దౌర్జన్యం, కక్ష, కావేషం, ధన దాహం, అరాచకం, అధికార దుర్వినియోగం, పదవీ వ్యామోహం, అన్యాయం, తెంపరితనం... ఇవన్నీ రాజకీయ రావణాసురుడి పది తలలని గ్రహించాలండి. అధికారం, మందీమార్బలం, పటాటోపం, హంగు, ఆర్భాటం, మాయ మాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలు, ప్రలోభాలు... ఇవన్నీ అరచేతిలో వైకుంఠం చూపించే రాక్షస మాయల్లాంటివని జనం తెలుసుకోవాలండి. వీటికి ఆకర్షితులు కాకుండా రామబాణాన్ని ప్రయోగించాలండి. అప్పుడిక రాబోయేదంతా రామరాజ్యమేనండి. అంతే కదండీ?''

''సెభాష్రా. రామాయణం అనగానే వెళ్లొస్తానన్నవాడివి, ఇప్పుడు చూశావా, ఎంత బాగా చెప్పావో? మొత్తానికి నీకు రాజకీయ రామాయణం అర్థమైందిరా. ఇక దాన్ని పారాయణం చేసుకో. పైకొస్తావ్‌. ఇక పోయిరా''

-సృజన

PUBLISHED ON 31.3.2023 ON JANASENA WEBSITE

గురువారం, మార్చి 23, 2023

అప్పుడు ప్రతి రోజూ... ఉగాదే!

 నాయుడు బావ హుషారుగా ఇంటికొచ్చి, ''ఓసేయ్ ఎంకీ! రాయే...ఇయ్యాల ఉగాది పండగ గందా... కాసేపు టీవీ సూద్దారి...'' అంటూ పిలిచాడు.

వంటింట్లోంచి ఎంకి వచ్చి, ''ఓలొల్లకో బావా! పండగైతే మనకేంది? పబ్బమైతే మనకేంది? మనలాటోళ్లకి ఉగాదైనా ఒకటే, సంక్రాంతైనా ఒకటే...'' అంటూ తువ్వాలందించింది.

''అదికాదేస్‌... మన తెలుగోళ్లందరికీ ఇదే తొలి పండగంట. కవులు కవితలూ, పజ్యాలు సెబుతారంట. శాస్త్రులు గోరు పంచాంగం సదువుతారంట... ''

''ఏందో నీ సంబడం. కవితలూ పజ్యాలు వింటే మన బతుకులు బాగు పడతాయా ఏమన్నానా? నాలుగేళ్ల నుంచీ నానా కట్టాలూ పడతన్నాం...  పంచాంగం వింటే మాత్రం అయ్యన్నీ తీరేవా, సచ్చేవా?''

''ఊరుకోయే. ఎప్పుడు సూసినా ఊకే నస పెడతా ఉంటావు. పండగ నాడైనా పసందుగా ఉండొద్దేంటి?''

''సర్లె...పెట్టు. వద్దంటే మాత్రం నువ్వూరుకుంటావేటి?'' అంటూ ఎంకి టీవీ ముందు చతికిల పడింది. నాయుడు బావ టీవీ స్విచ్చు నొక్కి  ఎంకి పక్కనే కూర్చుని రిమోటు నొక్కాడు.

ఓ ఛానెల్లో ఓ వ్యక్తి మెత్తగా నవ్వుతూ కనిపించాడు. మైకు పట్టుకుని చెప్పసాగాడు.

''ఓ అమ్మ ఓ అక్క ఓ చెల్లి ఓ అవ్వ

మీకు పెడతానమ్మ కడుపునిండా బువ్వ

ఓ అన్న ఓ తాత ఓ మామ ఓ బాబు

నిండుగా నింపుతా మీకున్న జేబు

నాకు ఓటేయండి నన్నెన్నుకోండి

మీ బతుకు మారేను నన్ను నమ్మండి''

నాయుడు బావ ఎంకి మొహం చూసి, ''ఏందే ఇది? కవిత్వమా?'' అన్నాడు.

ఎంకి నవ్వి, ''ఓపాలి నువ్వెట్టిన ఛానెలు సూడు. అదెవరదనుకున్నావు? నాలుగేళ్లుగా మన నెత్తికెక్కి ఏలుతున్నాడే ఆడిదే. మరాళ్ల ఛానెల్లో ఇట్టాంటి సొల్లు మాటలు  తప్ప ఇంకేటొస్తాయి? పండగ్గానీ, పబ్బంగానీ ఎట్టాగొట్టాగ పెచారం చేసుకుందారనే సూత్తారాళ్లు. మొన్నటికి మొన్న శివరేతిరికిరికి ఏంజేసేరో గుర్తునేదా? గుడి ముందట శివుడేసంలో ఉండే ఓ సిన్న పిల్లకి ఆడు పాలు పడుతున్నట్టు బొమ్మ వేయించలా? మరిది పెచారంతో పాటు వేరేవోళ్ల నమ్మకాలని కూడా ఎటకారం సేయడం కాదేటి? అక్కడకీడొక్కడే పేద పిల్లల్ని ఉద్దరించేటోడా? మరీడి పాలనలో సదూకునే పిల్లగాళ్లే కాదు, హాస్టళ్లలో ఉండే పిలకాయలు కూడా నానా కట్టాలూ పడతన్నారని నీకు తెల్దా? నాకు తెల్దా? అసలు  

అందాకా ఎందుకు బావా? అంతక్రితం ఊరి గోడల మీద సినేమా పోస్టర్లు కనిపించేవి. మరిప్పుడో? యాడ సూసినా ఆళ్ల గొప్పలూ డాబులూ రాసిన పోస్టర్లే. ఆటి నిండా నానా రాతలే. సూత్తన్నావా అసలు?''

''అవునే ఎంకీ. ఎదురింటి గోడ మీద కాగితం అంటించారు. 'కోట్లాది గుండెల్లో ఒకే ఒక్కడం'...'

''కోట్లు కొట్టేసిన ఒకే ఒక్కడేం' కాదూ? ఆళ్లు ఏం రాసినా మనం మరోలా సదువుకోవాల బావా. మరి ఈ నాలుగేళ్లలో అదేగందా జరిగింది? పగలంతా రెక్కలు  ముక్కలు సేసుకుని కట్టపడి పదో పరకో సంపాదిత్తావా? అదుచ్చుకుని తిన్నగా ఇంటికొత్తావేటి నువ్వు? అదేదో కొత్త సరుకొచ్చిందంటే ఓ సుక్క ఏసుకొచ్చేనే ఎంకీ అంటా మత్తులో వచ్చి వాగుతావు. అసలు మన రాట్రంలో ఉన్నన్ని సారా రకాలు దేశంలో మరెక్కడా లేవంట నీకు తెలుసా? మరా కొత్త కొత్త కంపెనీలన్నీ ఇక్కడ సరుకు అమ్ముకోవాలంటే దండిగా ముడుపులు ముట్టజెబుతారంట. పైగా ఇక్కడ సరుకు తయారు చేసే పర్మిట్లు కూడా ఆళ్ల వోళ్లకే ఎడాపెడా ఇచ్చేసి డబ్బులు నొక్కేశారంట, తెల్సా?  ఇలాగ ఒక్క మద్యమేనేటి? ఇసుక రేవుల యవ్వారం సూడు, గనుల యాపారం సూడు, గంజాయి సాగు సూడు, సర్కారు జాగాల దఖలు సూడు, ఓడ రేవుల పంపిణీ సూడు... ఏది సేసినా కాసులు నొక్కేయడమేనంట. వాటాలు అందుకోడమేనంట తెలుసా?''

''వాసినీ బలే సెప్పావే? ఇందాకా ఇంటికొస్తంటే పక్కింటి గోడ మీద మరో పోస్టర్చూసానేవ్‌.  'పాలకుడు కాడు సేవకుడం'. 'మా నమ్మకం నువ్వే'నంట. ఇంకేదో  'భరోసా' అంట, 'ఆసరా' అంట. ఎటు కేసి సూసినా అయ్యే... అదేటోగానీ?''

''కాదేటి మరి. అదంతా ఆళ్లకాళ్లు సేసకునే పెచారం. ఆ పోస్టర్లలో ఉన్న రాతల్ని మనం మరోలా సదువుకోవాల. 'పాలకుడు కాడు పాతకుడు' అని సదూకోవాల. 'మా అపనమ్మకం నువ్వేనంట' అని మార్చుకోవాల. ఇక భరోసా, ఆసరాలు కాదు 'ఈసురో'మని తెలుసుకోవాల. తెల్సిందా?''

నాయుడు బావ ఏదో అనేలోగా టీవీలో నేత మళ్లీ అందుకున్నాడు.

''తొమ్మిది పధకాలంట

ఉమ్మడి పంపకమంట

మీట నొక్కితే చాలు,

మీ కాతాలో కాసులంట!''

''అవునేగానీ ఎంకీ... నేరుగా డబ్బులు పడేలా సేత్తంటే మరిలా సెప్పుకుంటే తప్పేముందే?'' అన్నాడు నాయుడు బావ.

ఎంకి పకపకా నవ్వి, ''ఓరెర్రి బావా. నీలాంటోల్లింకా కొందరుండబట్టే, ఆడి ఆటలిలా సాగుతన్నయి. మీట నొక్కి ఆడిచ్చేదెంతో, దొడ్డిదారిలో ఆడు దోచుకునేదెంతో తెల్దు నీకు. పావలా ముష్టి విదిల్చి తిరిగి పది రూపాయలు మనకాడే లాగేసుకుంటున్న సంగతి తెల్సుకోలేవా? ఈళ్ల పాలనొచ్చాక అన్ని సరుకుల ధరలు ఎలా పెరిగాయో నీకెరికేనా? మరది మన జేబుకి సిల్లు కాదేటి? లీటరు పెట్రోలు కొంటే రోడ్లు బాగు చేయడానికంటూ ఎక్కువ దుళ్లగొడుతున్నారా? మరొకపాలి మన రోడ్లకేసి సూడు. ఎక్కడన్నా మరమ్మతులైనా సేసారా అని? మరిలా మనందరి దగ్గరా పోగు చేసిన సొమ్ము కోట్లాది కోట్లలో ఉంటదంట. ఆటికి లెక్కా జమా ఉందా అసలు? అంతెందుకు బావా... మనింట్లో పోగయ్యే చెత్త మీద కూడా పన్నేసి మన సొమ్ము లాగేత్తన్నారా లేదా? నీలాంటోళ్లు తాగే మందు అసలు ధర పది రూపాయలైతే, మీకాడ గుంజుకుంటున్నది అంతకు పదింతలంట. దానికుందా లెక్క? కేంద్ర సర్కారోళ్లు పేదోళ్ల కోసమని ఉచితంగా ఇచ్చే రేషను బియ్యాన్ని కూడా బెదిరించి, బులిపించి పోగుసేసి ఇదేశాలకి ఓడల్లో తోలేత్తన్నారంట తెలుసా? మొన్న మన్యంలో మా పిన్ని కొడుకుని ఆశపెట్టి గంజాయి సాగు సేయించి పంట పట్టుకుపోనారంట. ఆనక కేసయి ఆడు పాపం జైలుకెళితే, ఆ గంజాయి తోలిన సొమ్ముతో ఈళ్లు జల్సా సేత్తన్నారంట. ఇలా మన్యం బిడ్డలెంత మంది గగ్గోలు పెడతన్నారో ఎరికేనా నీకంట? దొంగసచ్చినోళ్లు, ఇన్నేసి దారుణాలు సేత్తా కూడా మీట నొక్కుతన్నామంటా, ఎదవ పెచారాలూ ఈల్లూను. ఆ దిక్కుమాలిన ఛానెలు మార్చు బావా...'' అంటూ విసుక్కుంది.

నాయుడు బావ చటుక్కున రిమోటు మీట నొక్కాడు.

అందులో పంచాంగ శ్రవణం జరుగుతోంది.

''ఈ సంవత్సరంలో రాజు- బుధుడు. మంత్రి- శుక్రుడు. సైన్యాధిపతి-గురుడు. నీరసాధిపతి-చంద్రుడు. నవనాయకులలో 8 అధిపత్యములు శుభులకు, ఒక ఆధిపత్యము పాపునికి వచ్చినవి... ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల విషయానికి వస్తే... '' అంటూ పండితుడు ఏదో చెబుతున్నాడు.

ఇంతలో ఎంకి చటుక్కున నాయుడుబావ చేతిలో రిమోటు లాక్కుని టీవీ కట్టేసింది.

''అదేంటే ఆయనేదో కొత్తేడాది ఫలితాలు సెబుతాంటే కట్టేసావు? పూర్తిగా వినొద్దేటీ?'' అన్నాడు నాయుడు బావ.

ఎంకి నవ్వి, ''నీకో సంగతి సెప్పనా బావా? ఆయనేం సెప్పినా మన రాట్రంలో అది జరగదు తెలుసా?'' అంది.

''ఎందుకు జరగదే? పంచాంగమా? మజాకా?''

''ఊరుకో బావా. మనసుట్టూ జరిగే పంచాంగం ఆయన భాషలో నేను సెబుతాను ఇనుకో. మన రాట్రంలో రాజు-శనిగాడు. మంత్రి-కంత్రీగాడు. సైన్యాధిపతి-రాహువు. ధనాధిపతి-కేతువు. నవనాయకుల్లో అందరూ పాపులే. ఈల్లందరినీ మతిమాలి నెత్తిన పెట్టుకున్నది మనవే. అందుకే నీరసాధిపతి-సామాన్యుడే. ఇక ఆదాయం రాజుకి అధికం. మనకి శూన్యం. వ్యయం మనకి అనంతం. ఆళ్లకి పరిమితం. నాలుగేళ్లుగా సూట్టం లేదూ, ఈళ్ల పరిపాలన బాగోతం? మనలాంటి సామాన్యులకి అసలెక్కడైనా సుకముందాని? పంట పండించే రైతన్నలు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సదువులు సక్రమంగా సాగక పిలగాళ్లు దిగాలు పడుతన్నారు. ఉద్యోగాలు లేక కుర్రాళ్లు కునారిల్లు పోతన్నారు. జీతాలు సరిగా అందక ఉద్యోగులు ఉసూరుమంటన్నారు. ఆడంగులకి రక్షణ లేదు. ధరలు, పన్నులు, సార్జీలు పెరిగిపోయి అందరూ అల్లాడుతన్నారు. నీకో సంగతెరికనా? దేశం మొత్తం మీద అప్పుల పాలైన జనం మన రాట్రంలోనే ఎక్కువంట. ఈమద్దెనే ఓ సర్వేలో ఈ సంగతి తేలిందంట. మనందరి బతుకులు ఇలా సతమతమవుతా ఉంటే ఉగాది వస్తే ఏందంట బావా?''

''వాసినీ! టీవీలో శాస్త్రులుగోరు సేప్పేదాని కంటే నవ్వు సెప్పే రాజకీయ పంచాంగమే బాగుందే. మరి మనకేటి దారి?''

''అద్గది బావా. ఇప్పుడు దార్లోకి వచ్చావ్‌. దీన్నిమార్చుకోవాలంటే అది మనసేతిలోనే ఉంది. రేప్పొద్దున ఎన్నికలొత్తన్నాయి గందా? అప్పుడు సూపించు నీ తడాఖా. ఇప్పటి పాతకులు నిన్ను ఎతుక్కుంటా వచ్చి నోటిచ్చి ఆశపెట్టారనుకో, నడ్డి మీద ఎగిరి తన్ను. మందు పోత్తామని ఊరించారనుకో, ముందు పళ్లూడగొట్టు. మాయ మాటు సెప్పారనుకో, నమ్మమాక.  ఆళ్లకి అవమానం జరిగితేనే మనకి రాజపూజ్జెం. నీ సేతిలో ఓటుంది. దాన్ని, మన కోసరం ఆలోసిస్తా, మన కోసమే పనిసేత్తా మన మద్దెనే తిరగాడుతన్న నిజమైన జన సేనా నాయకుడికే ఎయ్యి. అప్పుడు సూడు ప్రతి రోజూ ఉగాదే. ప్రతి రోజూ పండగే మరి''.

-సృజన

PUBLISHED ON 22.3.2023 ON JANASENA WEBSITE

మంగళవారం, మార్చి 14, 2023

సీతాకోక చిలుక‌లు(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)


         

అగ్గిపుల్ల భ‌గ్గుమంది, ఆ అమ్మాయిల గుండెల్లో మంట‌లాగే!

         ఆ అగ్గిపుల్ల ఓ కొవ్వొత్తిని వెలిగించింది. ఆ కొవ్వొత్తి నుంచి ఒక‌దాని త‌ర్వాత
ఒక‌టిగా కొవ్వొత్తులు వెలిగాయి.

         ఆ కొవ్వొత్తుల జ్వాల‌ల్లో ఓ ఉద్వేగం రెప‌రెప‌లాడింది. ఓ ఆవేద‌న జ్వ‌లించింది.
అమ్మాయిలంద‌రూ అక్క‌డ పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో అక్క‌డి చిత్ర‌ప‌టం వింత‌గా ప్ర‌కాశించింది. అంద‌రూ మౌనంగా క‌ళ్లు మూసుకున్నారు. ఆ రెండు నిమిషాల మౌనం ఓ అమానుష ఘ‌ట‌న ప‌ట్ల సంఘ‌టిత‌మైన సంక‌ల్ప‌మై ఆ చిత్ర‌ప‌టంలోని అమ్మాయి క‌ళ్ల‌లో ప్ర‌తిఫ‌లించింది.

         నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ళ‌క‌ళ‌లాడుతూ త‌మ‌తో తిరిగిన ల‌లిత, ఇలా కొవ్వొత్తుల ముందు చిత్ర‌ప‌టంగా మార‌డాన్ని ఆ అమ్మాయిలు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు.
మ‌న‌సులో సుడులు తిరుగుతున్న బాధ‌, వాళ్ల క‌ళ్ల‌లో స‌న్న‌టి నీటి పొర‌గా మారింది. ఆ
రోజు క‌ళాశాల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

         ఆ మ‌ర్నాటి నుంచీ, ల‌లిత ఇంట్లో ఘ‌ణీభ‌వించిన విషాదం మిన‌హా అంతా మామూలుగా మారింది.

         “ల‌లిత క‌ళ్ల ముందు క‌దులుతోందే… రాత్రి నిద్ద‌రప‌ట్ట‌లేదు” అంది అప‌ర్ణ‌.

         “అవునే… నాకూ అంతే…” అంది శైల‌జ‌.

         ఇద్ద‌రూ మామూలుగానే బ‌స్టాపులో నుంచున్నారు. ఇంత‌లో బ‌ర్రుమంటూ ఓ బైక్ వ‌చ్చి అక్క‌డి బ‌డ్డీకొట్టు ముందు ఆగింది.

         “వాడే…” అంది శైల‌జ గుస‌గుస‌గా.

         అప‌ర్ణ జుట్టు స‌వ‌రించుకున్న‌ట్టుగా త‌ల‌తిప్పి ఓర‌గా చూసింది. వాడు బైక్ దిగి
నిర్ల‌క్ష్యంగా క్రాఫ్ స‌వ‌రించుకుంటూ బైక్ అద్దంలో చూసుకుని బ‌స్టాపులోకి రాసాగాడు.

         అప‌ర్ణ‌, శైల‌జ ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌గా జ‌రిగారు అప్ర‌య‌త్నంగా.

         ఈలోగా శాంతి, ల‌హ‌రి వ‌చ్చి క‌లిశారు. ప్ర‌కాష్ స్నేహితులు కూడా వచ్చారు.

         “ఎవ‌ర్రా… కొత్తా?” అన్నాడు ప్ర‌కాష్‌, అప‌ర్ణ‌ని ఉద్దేశించి.

         “అవును… వార‌మే అయింది చేరి…” అంటున్నాడు వ‌చ్చిన‌వాడు.

         దూరంగానే నుంచున్నా, వాళ్ల మాట‌లు వినిపిస్తూనే ఉన్నాయి అప‌ర్ణ‌కి, ఆమె
స్నేహితురాళ్ల‌కి. ఎవ‌రూ మాట్లాడ‌లేదు. బ‌స్సు రాగానే ముందు నుంచి అమ్మాయిలు, వెన‌క‌ నుంచి అబ్బాయిలు ఎక్కారు.

         “రైట్‌… రైట్‌…” అన్నాడు కండ‌క్ట‌ర్‌. కానీ అక్క‌డ జ‌రుగుతున్న‌దంతా రైట్ కాదు,
రాంగ్‌.

***

         ప‌ట్నంలోని కాలేజీకి వెళ్లాలంటే బ‌స్సు ఎక్క‌క త‌ప్ప‌ని అనేకానేక ఊళ్ల‌లో అదికూడా ఒక‌టి. బస్సు త‌ప్ప మ‌రో సౌక‌ర్యం కుద‌ర‌ని మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయిల్లో వాళ్లు కూడా ఒక‌ళ్లు. అమ్మాయిలు క‌నిపించ‌గానే వెకిలి వేషాలేసే అబ్బాయిలు అక్క‌డా ఉన్నారు. కానీ ఆ వెకిలిత‌నం ఆక‌తాయిత‌న‌మై, అది పోకిరిత‌నంతో జ‌ట్టుక‌ట్టి ఆపై అహంకారంతో క‌లిసి అకృత్యాల‌కు సైతం వెర‌వ‌ని తెంప‌రిత‌నమ‌వ‌డ‌మే ఆ అమ్మాయిల దౌర్భాగ్యం. వెన‌క‌ నుంచి ఎక్కినా ముందుకు వ‌చ్చి నుంచోడం, కుదుపుల్లో రాసుకున్న‌ట్టు మీద‌ప‌డ‌డం, కామెంట్లు చేయ‌డం లాంటి ద‌శ‌ల‌న్నింటినీ ఎప్పుడో దాటిపోయాయి ఆ బస్సులో ప‌రిస్థితులు. పైకి అంతా రైట్‌గానే క‌నిపిస్తుంది. కానీ జ‌రిగేదంతా రాంగే. అదే ల‌లిత మ‌న‌సును అల్ల‌క‌ల్లోలం చేసింది.

         “ఆ ప్రకాష్ ఫోన్‌లోకి నా ఫొటో ఎలా వ‌చ్చిందో తెలీదే. పైగా అది… అది…
బ‌ట్ట‌ల్లేకుండా ఉందే. దాన్ని చూపించి బెదిరిస్తున్నాడు. దాన్ని నెట్‌లో పోస్ట్ చేస్తా నంటున్నాడు…” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది ల‌లిత‌.

         “ఏడిశాడు…ఏం కాదులే. భ‌య‌ప‌డ‌కు” అంటూ ఓదార్చింది భార్గ‌వి. ఆ త‌ర్వాత ల‌లిత రెండు రోజులు కాలేజీకి రాలేదు. మూడో రోజు ఇంట్లో గ‌దిలో ఫ్యాన్‌కు ఆమె నిస్స‌హాయ‌త వేలాడింది. ఆమె భ‌యం గుడ్లు తేలేసింది. పరువు పోతుంద‌నే ఆందోళ‌న‌, ఆమె బ‌తుకునే ఉరితీసింది.

         “ఎందుకింత ప‌ని చేసిందో నా చిట్టిత‌ల్లి…” అంటూ ఆమె త‌ల్లి గుండెలు బాదు కుంటూనే ఉంది. ఆమె సందేహం ఇప్ప‌టికీ తీర‌లేదు.

         భార్గ‌వి నుంచి అంతా విన్న అప‌ర్ణ చిగురుటాకులా వ‌ణికిపోయింది. ఆమె ఆ ఊళ్లోకి, ఆ కాలేజీలోకి వ‌చ్చి వార‌మైనా కాలేదు.

         “ఇంత జ‌రిగితే కొవ్వొత్తులు వెలిగించి మౌనం వ‌హిస్తే స‌రిపోతుందా?” అంది అప‌ర్ణ ఆవేశంగా.

         “అంత‌క‌న్నా ఏం చేస్తాం. నువ్వు జాగ్ర‌త్త‌. అస‌లే కొత్త‌గా వ‌చ్చావు” అంది భార్గ‌వి. శాంతి, ల‌హ‌రి, శైల‌జ కూడా మౌనంగానే త‌లూపారు. అప‌ర్ణ నిట్టూర్చింది.

         ఇంత‌లో బ‌స్సు వ‌చ్చింది. అంద‌రూ ఎక్కారు. “రైట్ రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         “హాయ్‌… నీ పేరు అప‌ర్ణ క‌దూ…” అనే మాట‌లు గుస‌గుస‌గా వినిపిస్తే చ‌టుక్కున
వెన‌క్కి తిరిగి చూసింది అప‌ర్ణ‌. ద‌గ్గ‌ర‌గా నుంచుని ఉన్నాడు ప్ర‌కాష్‌. అప‌ర్ణ పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఏం మాట్లాడ‌లేదు. 

         “బాగున్నావ్‌… నీ ఫొటో ఇంకా బాగుంది తెలుసా?”

         అప‌ర్ణ గుండె ఝ‌ల్లుమంది.

         “లంచ్ బ్రేక్‌లో కాలేజీ వెన‌కాల మామిడి చెట్టు ద‌గ్గ‌ర‌కి వ‌స్తే చూపిస్తా…” అంటూ నెమ్మ‌దిగా అని ఆమె భుజాన్ని రాసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు ప్ర‌కాష్‌.

         కాలేజీ స్టాప్ వ‌చ్చేసింది. అప‌ర్ణ‌తో పాటు అంద‌రూ దిగారు. 

         “రైట్‌… రైట్‌… “అన్నాడు కండ‌క్ట‌ర్‌. బ‌స్సెళ్లిపోయింది.

***

         కాలేజీ వెన‌కాల మామిడి చెట్టు.

         “చెప్ప‌గానే వ‌చ్చావు… గుడ్‌… పైకొస్తావ్‌…” అన్నాడు ప్ర‌కాష్‌. అత‌డి మాట‌ల్లో వెకిలిత‌నం ప‌ళ్లికిలించింది. 

         అప‌ర్ణ నుదిటి మీద చిరు చెమ‌ట‌లు.

         “చూడు… నీ ఫొటో ఎంత బాగుందో” అంటూ ఫోన్ చూపించాడు. ఆ ఫొటో చూసి అప‌ర్ణ ముఖం జేవురించింది. బ‌స్సులోనో, కాలేజిలోనో, బ‌స్టాప్‌లోనో ఎక్క‌డ తీశాడో. మొహం త‌న‌దే. మిగ‌తా శ‌రీరం త‌న‌ది కాదు.

         “ఛీ” అనుకుంది అప‌ర్ణ‌. కంప్యూట‌ర్ మార్ఫింగ్.

         గొంతు పెగ‌ల్చుకుని చెప్పింది… “ప్లీజ్‌… దాన్ని డిలీట్ చెయ్యి” అంది భ‌యం భ‌యంగా.

         “త‌ప్ప‌కుండా చేస్తా, నేను చెప్పిన‌ట్టు చేస్తే… లేక‌పోతే ప్ర‌పంచమంతా చూస్తుంది మ‌రి…”

         “ఏం… ఏం… చేయాలి?”

         “రేపు ఆదివారం ఊళ్లో పాత‌బ‌డిన బంగ్లా వెన‌క్కిరా. స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుందాం. ఇంట్లో సంత‌కి వెళ్తాన‌ని చెప్పులే. స‌రేనా?”

         “కానీ… నేనొక్క‌ర్తినీ రాలేను. భ‌యం…”

         “పోనీ… నీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకురా… మా వాళ్ల‌ని కూడా ర‌మ్మంటా… నీ ఫ్రెండ్స్‌ ఫొటోలు కూడా వాళ్ల ద‌గ్గ‌ర ఉన్నాయిలే. అవి కూడా చూపిస్తాం. సంత‌ అయిపోగానే వెళ్లిపోవ‌చ్చు… అన్న‌ట్టు సంచులు తెచ్చుకోండి. కూర‌లు మేం తెస్తాంలే…” అంటూ అదోలా న‌వ్వాడు ప్ర‌కాష్.

         కాలేజీ బెల్ మోగింది. ప‌రుగు ప‌రుగున వెళ్లిపోయింది అప‌ర్ణ‌. వెన‌కాల నుంచి ప్ర‌కాష్
త‌న ఫ్రెండ్స్‌తో హైఫైలు కొట్టుకోవ‌డం వినిపిస్తూనే ఉంది.

***

         బ‌స్టాప్ గుబులు గుబులుగా ఉంది. అప‌ర్ణ చెప్పిందంతా విని శాంతి, భార్గ‌వి, ల‌హ‌రి,
శైల‌జ‌ తెల్ల‌బోయారు.

         “ఇదంతా ఇంట్లో చెప్పేస్తోనో?”

         “మ‌న్నే తిడ‌తారు. పైగా కాలేజీ మానిపించేస్తారు…”

         “వాళ్లంత తెలివి త‌క్కువ వాళ్లేంటి? సిమ్ములు మార్చేస్తారు. ఫోన్లు చూసుకో మంటారు”

         “పోనీ వెళ్ల‌క‌పోతే?”

         “ఏమో… ఎవ‌రి ఫొటోలైనా ఫేస్బుక్‌లోనో, ట్విట‌ర్‌లోనో వ‌చ్చేస్తే?”

         “పైగా డేటింగ్ సైట్ల‌లో కూడా అప్‌లోడ్ చేస్తార‌ట‌…”

         “అప్పుడు మ‌న ఇంట్లో వాళ్లు కూడా త‌లెత్తుకోలేరు…”

         ఆ అమ్మాయిల భ‌యాలు, సందేహాలు ఆ బస్టాప్‌లో గుస‌గుస‌లాడాయి. ఏం చేయాలో
తోచ‌క గుబులుగా మాట్లాడుకున్నాయి. ఆఖ‌ర్న అప‌ర్ణ చెప్పింది. “అందుక‌నే అంద‌రం క‌లిసి వెళ్దాం. ఒక‌రికొక‌రం తోడు. ఇంట్లో కూడా అంద‌రం క‌లిసి అడిగితే పంపిస్తారు. వెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌మ‌ని అడుగుదాం”

         “మ‌రి వాళ్లు ఏమైనా చేస్తే?”

         “మ‌నం త‌క్కువ వాళ్ల‌మా? ఆ మాత్రం ఎదుర్కోలేమా?”

         చేసేదిలేక‌… వేరే దారి లేక‌… అమ్మాయిలు అంద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.
స‌రేనంటే స‌రేన‌నుకున్నారు.

         బస్సొచ్చింది. అంద‌రూ బెదురుతున్న గుండెల్తో ఎక్కారు.

         “రైట్… రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         “రేపే సంత గుర్తుందా?” అన్నాడు ప్ర‌కాష్, అప‌ర్ణ కూర్చున్న సీటు వెన‌క రాడ్‌ పై
రెండు చేతులూ పెట్టి ముందుకు వంగి, ఆమె చెవిలో త‌న‌కు మాత్ర‌మే వినిపించేంత
మెల్ల‌గా. అప‌ర్ణ మెల్ల‌గా వెన‌క్కి తిరిగి న‌వ్వింది. బ‌స్సులో మిగ‌తా వాళ్ల‌కి స‌హ‌జంగా స్నేహితులు మాట్లాడుకున్న‌ట్టు క‌నిపించే ప్ర‌య‌త్నం అది. అలా న‌వ్వుతూనే, “కానీ మా అంద‌రి ఫొటోలు డిలీట్ చేసేయాలి మ‌రి…” అంది. ఆమె గొంతులో ఏదో క‌నిపించ‌ని భ‌యం.

         ప్ర‌కాష్‌కి ధైర్యం వ‌చ్చింది. ఏదో విజ‌యం సాధించిన‌ట్టు అత‌డి మొహం వెలిగింది.

         “త‌ప్ప‌కుండా… ప్రామిస్‌…”

         “కానీ ఒక్క ష‌ర‌తు. మేం వెంట‌నే వెళ్లిపోతాం”

         “ఓకే… జ‌స్ట్ టెన్ మినిట్స్ అంతే”

         “మ‌రేం భ‌యం లేదుగా?”

         “అస్స‌లు లేదు. మా ద‌గ్గ‌ర సేఫ్టీ మెజ‌ర్స్ అన్నీ ఉన్నాయి…” అప‌ర్ణ త‌లూపింది. ప్ర‌కాష్ త‌లెగ‌రేశాడు. ఇంత‌లో ఊరొచ్చేసింది. అంద‌రూ దిగిపోయారు.

         “రైట్‌…రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         అప‌ర్ణ‌, శాంతి, ల‌హ‌రి, శైల‌జ‌, భార్గ‌వి సంచుల‌తో న‌డుచుకుంటూ సంత‌కి బ‌య‌ల్దేరారు. సంత‌లోంచి అలా ముందుకు న‌డిచారు. కాస్త దూరంలో ఉన్న పాత‌ బంగ్లాలోకి ప్ర‌వేశించారు. ఆ ప‌క్క‌నే పొలంలో కొంత‌ మంది మ‌హిళ‌లు నాట్లు వేస్తున్నారు.

         “గుడ్ గాళ్స్‌…” అంటూ ప్ర‌కాష్ ఓ స్తంభం చాటు నుంచి ముందుకు వ‌చ్చాడు.
అమ్మాయిలు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా నుంచుని ఉన్నారు. మ‌రో ప‌క్క నుంచి ప్ర‌కాష్ ఫ్రెండ్స్ కూడా వ‌చ్చారు.

         “మ‌రి… ఫొటోలు డిలీట్ చేయండి…” అంది అప‌ర్ణ‌.

         ప్ర‌కాష్ గ‌ట్టిగా న‌వ్వాడు. “అప్పుడేనా… ఇప్పుడేగా వ‌చ్చారు. కూర‌లు కొనుక్కోవ‌ద్దూ…” అన్నాడు. 

         వాడి స్నేహితులు న‌వ్వారు.

         “ముందు ఫొటోలు చూపించండి” అంది అప‌ర్ణ‌.

         “ఇవిగో…” అంటూ స్నేహితులు ఫోన్లు తీశారు. అంద‌రి ఫోన్ల‌లోనూ వాళ్ల ఫొటోలు
ఉన్నాయి. జుగుప్సాక‌రంగా.

         త‌ర్వాత ఫోన్లు ఆఫ్ చేసి జేబుల్లో పెట్టుకున్నారు. అమ్మాయిల ద‌గ్గ‌ర‌గా వ‌చ్చారు. భుజాల మీద చేతులు వేశారు.

         అప్పుడు అప‌ర్ణ త‌న జాక‌ట్లోకి చెయ్యి పెట్టి తీసింది. అదొక విజిల్‌. వెంట‌నే నోట్లో పెట్టుకుని గ‌ట్టిగా ఊదింది. ఆ శ‌బ్దం ఆ బంగ్లా అంతా ప్ర‌తిధ్వ‌నించింది. పొలాల్లో నాట్లు వేస్తున్న మ‌హిళ‌లు ప‌రిగెత్తుకుని వ‌చ్చారు. బంగ్లా వెనుక ద్వారం నుంచి మ‌హిళా ఇన్‌స్పెక్ట‌ర్ వ‌చ్చింది. ఆమె చేతిలో రివాల్వ‌ర్‌. నాట్లు వేసే మ‌హిళ‌ల చేతుల్లో లాఠీలు. వాళ్లంతా షీటీమ్ స‌భ్యులు. ఈలోగా సంత‌లో మ‌ఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్‌తో పాటు, ఆ
అమ్మాయిల బంధువులు కూడా వ‌చ్చారు. 

         ప్ర‌కాష్ గ్యాంగ్ అంతా తెల్ల‌బోయారు. అంద‌రి ఫోన్లు క్ష‌ణాల్లో లాక్కున్నారు. ఫొటోలు చెక్ చేశారు. వెంట‌నే అరెస్ట్ చేశారు.

***

         అభినంద‌న స‌భ‌.

         షీటీమ్ ఇనస్పెక్ట‌ర్ మాట్లాడుతోంది.

         “ఈవ్‌టీజింగ్‌కి పాల్ప‌డే వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డం కోసం మేం బ‌స్సుల్లో అమ్మాయిల్లాగే తిరుగుతుంటాం. మ‌మ్మ‌ల్ని కూడా అల్ల‌రిపెట్టే ప్ర‌బుద్ధులు తార‌స‌ప‌డ‌తారు. అయితే అప‌ర్ణ‌లాంటి అమ్మాయిలు సాహ‌సంతో ముందుకు వచ్చిన‌ప్పుడే మేం పూర్తి స్థాయిలో ఇలాంటి వాళ్ల‌ని అరిక‌ట్ట‌గ‌లం. ఈ ఊర్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ల‌లిత వెన‌కాల కూడా ఈ గ్యాంగ్ ఉన్నార‌ని అనుమానం వ‌చ్చినా ఎవ‌రూ ముందుకు వ‌చ్చి ఫిర్యాదు  చేయ‌క‌ పోవ‌డంతో ఏమీ చేయ‌లేక‌పోయాం. ముందు అప‌ర్ణ మ‌మ్మ‌ల్ని ఎప్రోచ్ అయిన‌ప్పుడు, చివ‌రి దాకా నిల‌బ‌డుతుందో లేదోన‌ని సందేహించాం. కానీ త‌ను నిల‌బ‌డ్డ‌మే కాదు, వాళ్ల స్నేహితురాళ్ల‌ని కూడా క‌లుపుకుని ఊళ్లో ఈవ్‌టీజ‌ర్లంద‌ర‌నీ ఒకేసారి ప‌ట్టించింది. ఐ ఎప్రీష‌యేట్ హెర్ బ్రేవిటీ”

         ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మైక్ అందుకున్నాడు. “గూడును బ‌ద్ద‌లు కొట్టుకుని
బ‌య‌ట‌కి వ‌చ్చే సాహసం చేస్తేనే సీతాకోక చిలుక ఎగుర‌గ‌లుగుతుంది. ఈ అమ్మాయిలు
స‌హ‌జంగా భ‌య‌ప‌డే మ‌న‌స్త‌త్వాన్నుంచి బ‌య‌ట‌ప‌డి షీటీమ్‌ను క‌ల‌వ‌డం గొప్ప
విష‌యం. ఈ ఊళ్లో ఇంత జ‌రుగుతోంద‌ని నాకు తెలీదు. ఇక నుంచి ఇక్క‌డి అమ్మాయిల కోసం ప్ర‌త్యేక‌మైన బ‌స్ వేయిస్తాను. ఈ అమ్మాయిల సాహ‌సం నిజంగా అభినంద‌నీయం”

***

         ఊళ్లోకి బ‌స్సొచ్చి ఆగింది. అమ్మాయిలంతా సీతాకోక చిలుక‌ల్లాగా వ‌చ్చిబ‌స్సెక్కారు.

         కండ‌క్ట‌ర్ “రైట్‌…రైట్‌…” అన్నాడు ఇప్పుడు అది నిజంగా రైటే!

PUBLISHED ON 'NECHELI' WEB MAGAZINE